Month: August 2018

వంటింట్లోనూ పరాయి భాష!(ARTICLE)

Posted on Updated on

వంటింట్లోనూ పరాయి భాష!

Mana Telangana : Aug 02, 2018

      మానవ జీవన యానంలో మాతృ దేశం, మాతృ మూర్తి, మాతృభాష లు అంత్యంత మౌలికమయిన అంశాలు. మనిషి ఉనికికే మూలాధారాలు. కాని ఆధునిక సమాజం కేవలం ఆర్ధిక సమాజమయిపోయి అన్నిటికీ సాంకేతికత మాత్రమే ఆలంబన అయి కూర్చున్న నేపధ్యం లో మౌలికమయిన అంశాలన్నీ మరుగునపడిపోయి ఏక ధ్రువ గమ్యం వైపునకు మనిషి పరుగులు పెడుతున్న కాలం ఇది. ఈ కాలంలో మౌలిక అంశాల్లోని మాతృ భాష గురించి మాట్లాడుకుంటే కొడిగడుతున్న దీపం మాత్రమే కనిపిస్తుంది. అంతరించిపోతున్న మాటలు, ఆత్మీయ సంభాషణ కరువై మనస్సు కలుక్కు మంటుంది. మాతృభాష పరిరక్షణ గురించి ఎన్ని మాటలు చెప్పుకొని ఎంతగా దుఃఖ పడినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించదు. భవిష్యత్తు అంత ఆశా జనకంగా కనిపించదం లేదనే చెప్పుకోవాలి.
భాష భావ వ్యక్తీకరణ కోసం కాకుండా కేవలం ఉద్యోగ ఉపాధి కల్పనకోసం అనే భావన పెరిగిపోయిన నేపధ్యంలో మాతృభాష కుండే ప్రాధాన్యత నానాటికీ కుంచించుకు పోతున్నది. మాతృభాష వినియోగం దీన స్థితికి చేరుకుంటున్నది. 2011 జనాభాలెక్కల ప్రకారం మన దేశంలోని అధికారిక భాషలూ మాండలికాలూ మొత్తం కలిపి 19,569 గా ఇటీవల తేల్చారు.వాటిలో 22 అధికారిక భాషలూ, 99 భాష హోదాను పొందినవి. పదివేలమంది జనాభా మాట్లాడితే దానిని భాష గా గుర్తించడం లాంటి గణాంకాల వివరాలెట్లా ఉన్నప్పటికీ నిజానికి భాష అనేది ఎక్కడుంది, వ్యవహర్త లెవరు, మాతృభాష వినియోగం ఎక్కడి నుండి మొదలవుతుంది ఎక్కడ అది సజీవంగా ఉంటుందన్న విషయాలను గమనించాలి. ఆ క్రమంలో సమాజమూ, విద్యాలయాలు, ఉద్యోగ స్థలాలూ, ప్రసార మాధ్యమాలూ ప్రధానంగా కనిపిస్తాయి. వీటి అన్నిటి కంటే మాతృ భాష వినియోగంలో ఇల్లు, ఇంట్లో మనుషులూ ముఖ్య భూమికను పోషిస్తారు. మాతృభాషను తరాన్నుంచి తరానికి అందించడంలోకూడా ఇంటి పాత్ర ప్రధానమయింది.
మనిషి పుట్టిన తర్వాత మాటలు నేర్చుకొనే క్రమంలో అమ్మా, అత్తలాంటి మాటలు నేర్చుకోవడం ఇంట్లోనే మొదలవుతుంది. పిల్లాడో, పిల్లో తొలుత తమ అమ్మ మాటల్ని కదలికల్నీ అనుకరించడం ద్వారానే మాట్లాడ్డం నేర్చుకుంటారు. తొలి రోజుల్లో మాటల్ని వినడం, మాట్లాడడం అంతా ఇంట్లోనే జరుగుతుంది. భాష చదవడం రాయడం మొదలయ్యే సమయానికి విద్యాలయాల పాత్ర ఆరంభమవుతుంది. అంటే మనిషి భాషను మొట్టమొదట ఇంట్లోనే నేర్చుకోవడం మొదలు పెడతాడు. అందులోనూ అమ్మతోపాటు ఆహారమూ, వంటిల్లూ భాష నేర్చుకునే క్రమంలో ముఖ్య భూమికను పోషిస్తా యి. కాని ఇవ్వాళ ఇంట్లో, ముఖ్యంగా వంటింట్లో భాష సంకరమయి పోతూవుంది. వంటింటి మీద ఇతర భాషా సంస్కృతుల ప్రభావం చెప్పలేనంతగా పెరిగిపోయి కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా మన మాతృ భాష తెలుగు అంతరించిపోయే ప్రమాదం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది.
వంటింటి భాష పై దాడి మొదట మనకే సొంత మయిన ఆహారపు అలవాట్ల పైన మొదలయింది. వివిధ దేశాల లేదా ప్రాంతాల ఆహారపు అలవాట్లను మన పైన రుద్దడంతో అది ఆరంభమయింది. ఎప్పుడయితే ప్రపంచీకరణ వేగం పుంజుకోవడంతోనే బయటి ఆహారపు అలవాట్లను రుద్దే ప్రక్రియ ఆరంభమయింది. ఆ పని విజయవంతంగా చేయగలిగితే అది పెద్ద ఆదాయ వనరు అవుతుందని భావించిన బహుళ వ్యాపార సంస్థలు తమ దృష్టిని మన వంటిళ్ల పైన కేంద్రీకరించడం మొదలు పెట్టాయి. వందేళ్ళ క్రితం మన దేశ ప్రజలకు తేనీరు (చాయ్) అలవాటు చేసే క్రమంలో లిప్టన్ సంస్థ కొంత కాలం నగరాలలోని నాలుగు కూడళ్ళలో ప్రజలకు తేనీరు ఉచితంగా పోసింది. అట్లా క్రమంగా అలవాటు చేసి జనం అలవాటు పడిన తర్వాత డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు.
దాని తర్వాత టీ మన జీవితాల్లో అంతర్భాగమయి పోయింది. క్రమంగా మన అన్ని ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసే ప్రక్రియను బహుళ జాతి సంస్థలు మొదలు పెట్టాయి. కాని ఈ సారి ఉచిత సరఫరా ప్రయోగంతో కాకుండా మాధ్యమాల ద్వారా తమ పని కానిచ్చే పనికి పూనుకున్నారు. ఇప్పటికే దశాబ్దాల కాలంగా ఇంటింటికీ, నట్టింటికీ చేరిన టివిలు, క్రమంగా చేరుకుంటున్న ఇంటర్నెట్ సేవల్నీ ఉపయోగించుకొని విదేశీ వంటల దాడి మొదలుపెట్టాయి. ఇవాళ సమాజమంతా ప్రసారమాధ్యమాల ప్రభావిత సమాజం కనుక ఇల్లు వంటిల్లూ కూడా అందుకు మినహాయింపు కాలేదు.
పర్యవసానంగా వంటింటి భాష తీవ్రమయిన ఒత్తిడికి గురయి తన మౌలిక రూపాన్ని మార్చుకునే స్థితికి వచ్చింది. కంచం పోయి ప్లేట్, గిన్నె పోయి బౌల్, వడ్డించడం పోయి సర్వ్ చేసుకోవడం జరుగుతున్నది. ఫలితంగా ఇంట్లో ఆధునికులయిన పెద్ద వాళ్ళ భాషే కాదు పిల్లల భాష కూడా మార్పుకి గురవుతున్నది. దాని ప్రభావం మొత్తం భాషా వ్యవహారం పైనే కనిపిస్తున్నది. ఇక టివి చానళ్ళు ఒకదానికొకటి పోటీలు పడి మరీ వంటల కార్యక్రమాలు ప్రసారం చేస్తూ మాతృభాష హననానికి తమ వంతు దోహదం చేస్తున్నాయి. తెలుగు వెలుగుల్ని పోషిస్తున్నామంటున్న వారు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
వంటల కార్యక్రమాల్లో భాషను పరిశీలిస్తే దిమ్మ తిరిగి పోతుంది. వాళ్ళు ఉపయోగించే మాటల్నికొన్నింటిని పరిశీలిద్దాం: గ్యాస్ స్టవ్‌ను ఆన్ చేసి నాన్ స్టిక్ పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి అది బాయిల్ అయ్యేంతవరకూ వెయిట్ చేయాలి. దాంట్లో ఆనియన్, చిల్లీ వేసి అవి ఫ్రై అయింతర్వాత టర్మెరిక్, చిల్లీ, వేసుకోవాలి. ఏమాత్రం లేట్ చేయకుండా కట్ చేసుకుని రెడీ గా పెట్టుకున్న వెజిటేబుల్స్ అందులో వేసుకోవాలి. దానికి కొంచెం వాటర్ అప్లై చేయాలి. పైన లిడ్ పెట్టి టెన్ మినట్స్ వైట్ చేయాలి.
ఇక రొట్టె తయారు చేసుకునే విధం ఇట్లా వుంటుంది. వీట్ ఫ్లోర్ కి వాటర్ అప్ప్లై చేసి లేయర్స్ గానూ, రౌండ్ రౌండ్ గానూ చేసుకొని ప్రెస్, లేదా క్రష్ చేయాలి, తర్వాత స్ప్రెడ్ చేయాలి. ఇంకో స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ కానీ బట్టర్ కాని అప్లై చేసి కాల్చుకోవాలి.
అంతకు ముందు స్టవ్ పైన పెట్టిన కర్రీ ని డీప్ ఫ్రై లేదా షాలో ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా వంటలకు సంబంధించిన మాటలు చూస్తే తల తిరిగి పోతుంది. ఫైన్లీ చోప్ద్, హాఫ్ బాయిల్, క్రిస్పీ, గార్నిష్, స్టఫ్ఫింగ్ , క్రంచీ, స్మూతీస్, జ్యుసీ, యమ్మీ, ఫ్లేవర్, స్నాక్స్,కాంబినేషన్, మాష్ చేయడం,స్పైసీ మీడియం స్పైసీ, బ్లెండింగ్, బైండింగ్, టాంగీ ఫ్లేవర్, టెస్ట్ సూపర్ గా ఎన్ హాన్స్ అవడం, బ్లాంట్ టెస్ట్, మాష్ చేసి ఆడ్ చేయడం , చివరగా స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బౌల్ లో తీసుకొని, తర్వాత సర్వింగ్ ప్లేట్లో గార్నిష్ చేయాలి. ఇట్లా లెక్కలేనన్ని వంటలు లెక్క తెలీని మాటలు మన వంటిల్లలోకి దిగి పోతున్నాయి. అట్లా మన ప్రమేయం లేకుండానే వంటింట్లోకి వ్యవహారంలోకి తోసుకోచ్చిన ఆంగ్ల మాటలు అలవాటయిపోయి వంటంటే అదే వంటింటి భాష అంటే ఆదే అనే స్థితిలోకి మన ఇండ్లు చేరుకుంటున్నాయి. ఆ భాషే పిల్లలకూ పెద్దలకూ అలవాటయి పోయి మాతృభాష ఉనికే ప్రశ్నార్ధక మయి పోతున్నది.
నిజానికి మాతృ భాష వినియోగం, పరిరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మిగతా వారికంటే అనేక ఉపయుక్తమయిన కార్యక్రమాలనే చేపట్టింది. విద్యారంగంలో తెలుగును తప్పనిసరి చేయడం, తెలుగు మాధ్యమాన్ని ప్రోత్సహించడం, తెలుగుకు వైభవం కల్పించే దిశలో ప్రపంచ మహాసభలు నిర్వహించడం లాంటి కార్యక్రామాలు చేపట్టినప్పటికీ, ఇంట్లోనూ వంటింట్లోనూ మారిపోతున్న మాతృ భాషా వినియోగం పైన దృష్టి సారించక పోతే భాషా వినియోగంలో పెద్ద మార్పు ఉండదు. ్ల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం వరకే తెలుగు భాషను నేర్చుకొని మర్చిపోయే అవకాశం వుంది.
మాతృ భాష పరిరక్షణ లో భాగంగా వంటింటి భాష పైన మొత్తంగా ఇంటి భాష పైన జరుగుతున్న దాడిని ఆపాలి. టీవీ మాధ్యమాలు కూడా స్వీయ నియంత్రణను అలవర్చుకోవాలి. భిన్న మయిన ఆహారాల్ని పరిచయం చేస్తే ఫరవాలేదు కాని భిన్న మయిన భాషని వాడి మాతృభాషను ఖూనీ చేయకూడదు. భావితరాల్ని సొంత భాష నుండి దూరం చేయకూడదు.

వారాల ఆనంద్
9440501281

 bhasha-mana

Advertisements