POETRY

వారాల ఆనంద్ = చిన్న కవితలు

Posted on

వారాల ఆనంద్
చిన్న కవితలు
++++++++++++

1)
కళా సృష్టి అనేది
మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి

ప్రతిమను రూపొందించడం లాంటిది

2)
అహంకారం ఒకసారి ఎక్కడం మొదలయితే
శరీరమూ మెదడూ సరిపోదు

మనసూ మునిగి పోతుంది

౩)
గొప్పలు చెప్పుకోవడం మొదలయ్యాక
మెప్పులు మాత్రమే రుచిస్తాయి

నిజాలు చేదవుతాయి

4)
కిరీటాలూ బుజకీర్తులూ
కఠోర శబ్దాలు చేస్తాయి తప్ప

శ్రావ్య సంగీతాన్ని వినిపించవు

5)
అర్హతను ముంచి లభించిన ప్రతిదీ
అల్పత్వాన్నే ప్రోది చేస్తుంది

హుందా తనాన్నివ్వదు

6)
అవసరమయినప్పుడు ఆసరా తీసుకుని
తీరం చేరి తక్కువ చూసే

కృతఘ్నత ఎప్పటికీ ‘దారి’ చూపదు

7)
అసూయా పరుడు తనను తాను పొగుడుకుంటాడు
క్రమంగా తననే పోగొట్టుకుంటాడు

ఎండిన ఆకు గల గలమని గాలిలో కలిసిపోతుంది

8)
చీకటింకా తెమలలేదు, మబ్బులు ఒళ్ళు విరుచుకోలేదు
పక్షులు నిశ్శబ్దంగా తమ రెక్కల మీద

తూర్పు వెలుగులు మోసుకొస్తున్నాయి

9)
చీకటి ఎప్పటికయినా ముగుస్తుంది
వెలుగు ఎన్నటికయినా మెరుస్తుంది

మనమే సుఖ దుఖాల నడుమ వూగిసలాడతాం

10)
ఉదయపు ఆకాశంలో పక్షులు బారులు బారులుగా
తొలి కిరణాలకు దారి చూపుతున్నాయి

పక్కకు తొలగుతున్న మబ్బులకు, కింద నడుస్తున్న నాకూ తెలీదు

11)
ఒంటరితనంలో ఉద్వేగం, మాటలు లేవు
సాటి మనుషులూ లేరు

ఎలాంటి భావం లేకుండా ‘కాలం’ గడుస్తూనే వుంది

12)
తెలియకుండానే మనసు పొరల్లో కొన్ని మరుగున పడతాయి
కానిగిరి పాఠాలూ, కన్న కలలూ, తొలి ప్రేమలూ

కాల గమనంలో అట్లా కలిసిపోతాయి, మనమిట్లా మిగిలిపోతాం

Posted on Updated on

అందుకున్నాను-20

ఇప్పుడొక పాట కావాలి- బిల్ల మహేందర్ కవిత్వం

++++++++++++++

‘వస్తూవున్నప్పుడు

పిడికెడు మట్టిని తెండి

మొలకెత్తడం నేర్చుకుందాం….’ అంటూ బిల్ల మహేందర్ పంపిన “ఇప్పుడొక పాట కావాలి” కవితా సంకలనం అందుకున్నాను.

‘దుఖం ఇవ్వాల్టిది కాదు

యేండ్లతరబడి మోస్తూనే వున్నాను

వెనుక పేజీ తిరగేసిన

కన్నీళ్ళతో తడిసి బరువెక్కుతుంటాయి…’ అన్నాడు మహేందర్..అవును ‘ఇప్పుడొక పాట కావాలి’ చదివింతర్వాత గుండె బరువెక్కింది. మంచి కవిత్వం చదివిన అనుభవంతో పాటు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆస్వాదించిన అనుభూతి కూడా మిగిలింది

…….

‘ఇది ఆకాంక్షల్ని రక్తగతం చేసుకుని, అక్షరాల్ని జీవితంగా మలుచుకుని కాలం నిర్దేశించిన దారిలో విచ్చుకుంటూ సాగిపోతున్న బిళ్ళ మహేందర్ నాలుగేళ్ళుగా సాగిన ప్రయాణాన్ని, రాసిన కవిత్వాన్ని ఒక చోట ప్రకటించిన సంపుటి ఈ ‘ఇప్పుడొక పాట కావాలి’ అని అన్నారు  డాక్టర్ నందిని సిద్దారెడ్డి తన ముందు మాటలో.

ఆయన అభిప్రాయ పడ్డట్టుగానే గొప్ప అనుభవం, మంచి అనుభూతి, ఆర్ద్రత లతో పాటు మంచి వ్యక్తీకరణ కూడా కలిగిన కవి మహేందర్. ఈ సంపుటి నిండా సాంద్రమయిన కవిత్వం తో పాటు వస్తు వైవిధ్యమూ మనకు కనిపిస్తుంది.

“అప్పుడప్పుడు

తను నువ్వు నేను కలిసి

మొలిచిన మాటల్ని కుప్పలుగా పోసి

దారి పొడువునా మాటల పందిరిని నిండుగా పరచాలి” అన్నాడు మహేందర్ తన ‘నాలుగు’ కవితలో… అట్లా ఆయన కుప్పపోసిన మాటల వెంట నడుస్తూ నడుస్తూ ఈ సంపుటి చదువుతున్నంత సేపూ మంచి కవిత్వాన్ని అస్వాదిస్తాం.

+++++++

‘ఉత్తిగనే రాస్తూ కూర్చుండలేను  

నడువాల్సిన తొవ్వెంబడి నడవక పోతే

కాళ్ళు గుంజుతుంటయి

ఎత్తాల్సినకాడ పిడికిలి ఎత్తకపోతే

చేతులు బరువేక్కుతాయి’ అన్న మహేందర్ వరంగల్ జిల్లా వేలేరు గ్రామంలో పుట్టాడు. మలిదశ తెలంగాణా ఉద్యమ ఉధృతిలో ముందుకు సాగిన తను ఇప్పటికి ఆరు పుస్తకాలు వెలువరించారు. దివ్యాంగ అనాధ విద్యార్హ్తుల విద్యాభివృద్ధికి తోడ్పడే అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ కేవలం రాయడమే కాకుండా చైతన్యవంతమయిన కర్యశీలత తో కృషి చేస్తున్నాడు.

“బిళ్ళ మహేందర్ కవిత్వం చదువుతుంటే ప్రతి కవితలోనూ ప్రతి పంక్తిలోనూ ప్రతి పదం లోనూ నాకు కనబడినదీ వినబడినదీ హోరేత్తినదీ సార్ద్ర సంభాషణే. ఈకవిత్వమంతటినీ మాధ్యమంగా పెట్టుకుని మహేందర్ సమకాలీన సమాజంతో, నిత్య సన్నివేశాలతో నిరంతర సంభాషణ జరిపాడు” అని ఎన్.వేణుగోపాల్ అన్నాడు.

నిజమే మహేందర్ అట్లా సంభాషిస్తూనే ‘నేను మాట్లాడుతున్నాను’ అన్నాడు ఓ కవితలో అందులో

‘మౌనంగా ఉండడమంటే మాట్లాడలేకపోవడం కాదు

మనస్సు పొరల్ని బందించి జీవచ్చవంలా బతకడం

మనిషి తనాన్ని పూర్తిగా కోల్పోవడం’ అని అన్నాడు మహేందర్ . అనడమే కాదు వ్యక్తిగా మనిషితనాన్ని పూర్తిగా నిలుపుకుంటూ సాటి మనిషి పట్ల బాధ్యత తో నిలబడుతున్నాడు.

‘చివరికి

చీకట్లో కలసిపోయిన మీ అడుగుల్ని నిలబెట్టేందుకు

నేను ప్రతీ రాత్రి అడవిలో సింధూరమై మొలకేత్తుతాను’ అనీ అంటున్నాడు మహేందర్.

….

‘అది ఒక యుద్ధ క్షేత్రం

ఓ ఆత్మ గౌరవ పతాకం’ అని ధర్నాచౌక్ గురించి కవిత్వం చెప్పిన మహేందర్

“రాజ్యమేలేటోడు

వస్తూనే ఉంటడు పోతూనే వుంటడు                

చివరిదాకా నిలిచేవాడే వీరుడు’ అని కూడా స్పష్టంగా అంటాడు.

అంతేకాదు

నిజంగా ఒట్టేసి చెబుతున్న

ఒక్క సారి మీ సాయంకాలాన్ని కాసేపు నాకివ్వండి

ఇక ప్రతి సాయంకాలం

మీకు అందమయినదిగా సంతకం చేసిస్తాను’ అని కూడా హామీ అస్తున్నాడు.

….

 ఒక్కోసారి  మహేందర్ కవిత్వం నిండా ఒక విషాద జీర ధ్వనిస్తూ వుంది.

“ఇప్పుడు కాళ్ళు రెక్కలు తెగి

చక్రాల మీదికి నెట్టి వేయబడిన నా జీవితానికి

మిగిలిన ఒకే ఒక తోడు ఈ కిటికీనే

ఎన్ని చేకట్లు కాటేసినా ఎన్ని వెలుగులు విరబూసినా

ఎ మాత్రం కదలలేని నా మొండి దేహానికి

ప్రత్యక్ష సాక్షి ఈ కిటికీనే

అప్పుడప్పుడూ

రెక్కలు కట్టుకుని ఊరేగుదామనుకున్న ప్రతిసారీ

ఎగరలేని నా నిస్సహాయతను చూసి

జాలిపడే ఆప్త మిత్రుడు ఈ కిటికీనే”  కానీ ఆ విషాద స్పందన దగ్గర మహేందర్ నిలబడి పోడు.

ఆయన కవిత్వంలో ఆ విషాద ధ్వని కి ప్రతిధ్వనిగా గొప్ప ఆత్మ విశ్వాసం కూడుకున్న ఆశావాదం కూడా వినిపిస్తుంది. తనకి జాలి అవసరం లేదని..

‘రాళ్లో ముళ్లో పూలదారినో

బతుకు తొవ్వ సాగిపోవాలంటే

అడుగుల్ని ముందుకు కదిలించాల్సిందే

చివరివరకూ నడుస్తూపోవాల్సిందే’ అంటూ ముందుకు సాగుతాడు.

అట్లా గొప్ప ఆశావాద దృక్పధం తో కవిత్వం రాయడమే కాదు జీవితమూ అంతే ఆశావాహకంగా గడుపుతున్న మహేందర్ ను మనస్పూర్తిగా అభినదిస్తున్నాను.

కవిగానూ మనసున్న ఆత్మవిశ్వాసం వున్న మనిషి గా మరింత విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను

-వారాల ఆనంద్  


నిద్ర రాని రాత్రి

Posted on

నిద్ర రాని రాత్రినిద్ర రాని రాత్రి

================ వారాల ఆనంద్

కాలం నడక సాగుతూ సాగుతూ

పగలు గడిచి

సాయంత్రమయింది

చీకటి విస్తరించి

రాత్రి కమ్ముకొచ్చింది

కాలం అడుగులేస్తూనే వుంది

నిద్ర రాదు

నేరం చీకటిదా 

కలలు పలకరించవు

దోషం నిద్రదా

మూసిన రెప్పల మాటున

చూపులు మేలుకునే వుంటాయి

చేతనా చేతన స్థితిలో

నేను శిలను కాను

ప్రవాహాన్నీ కాను

నడిచే కాలానికి తీరిక లేదన్నారెవరో

కాని

అసలు తీరిక లేనిది

మనస్సుకు కదా

“మానేరు తీరం” ఒక జ్ఞాపకం

Posted on

1981 లో నేను మిత్రులు జింబో,వఝల శివకుమార్, అలిశెట్టి ప్రభాకర్, పి.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ’ కవితా సంకలనం వెలువడింది. తర్వాత 1998లో అంటే ఇప్పటికి దాదాపు 23 ఏళ్ళ క్రితం నా మొదటి పుస్తకం ‘మానేరు తీరం’ వెలువడింది. ఆ పుస్తక పరిచయ సభలో శ్రీయుతులు దర్భశయనం శ్రీనివాసాచార్య, నలిమెల భాస్కర్ లు మాట్లాడారు. సమైఖ్య సాహితీ సాహితీ సంస్థ పక్షాన శ్రీ కే.ఎస్.అనంతాచార్య, మదిశెట్టి గోపాల్ లు సభ నిర్వహించారు. పాత ఫైళ్ళు తిరగేస్తున్నప్పుడు అప్పుడు ‘మానేరు తీరం’కు  వచ్చిన స్పందన కనిపినిచింది. ఒక సారి మళ్ళీ మిత్రులందరితో పంచుకుందామని షేర్ చేస్తున్నాను.. చూడండి… వీడియో కూడా జత చేసాను…pl watch.. వారాల ఆనంద్

SINGING IN THE DARK   ‘చీకటి కాలం లో గానం’ 

Posted on Updated on

https://telugu.asianetnews.com/literature/varala-anand-reciews-singing-in-the-dark-edited-by-sachidanand-qwuhqf

PUBLISHED IN ASIANET NEWS.COM

అందుకున్నాను

==================

మిత్రులారా ,

కొన్ని రోజుల క్రితం  నాకిష్టమయిన కవి సచ్చిదానందన్ సహసంపాదకుడుగా వున్న SINGING IN THE DARK   ‘చీకటి కాలం లో గానం’  సంకలన వివరాలు ఆన్ లైన్ లో చూసి ఆర్డర్ చేసాను. ఆ గ్లోబల్ సంకలనాన్ని అందుకోగానే ప్రపంచం లో కవులు రచయితలూ అంతా దుఃఖ కాలంలో దాదాపుగా ఒకే గొంతుకతో ఎట్లా స్పందిస్తారో చూసి మనసంతా తడి తడి అయిపోయింది. కొందరి అనుభవాలు  వ్యక్తిగతమయినవి, మరి కొందరివి విన్నవి, చూసినవీ కావచ్చు కాని స్పందన మాత్రమే ఒకే స్థాయిలో వుండడం ఇంకా మనుషుల్లో కదిలే గుణం బతికే వుంది అనిపించింది. కే. సచ్చిదానందన్, నిశి చావ్లా ల సంయుక్త సంపాదకత్వంలో వచ్చిన ఈ 360 పేజీల సంకలనం కవిత్వపరంగా ఎంత గాఢంగా వుందో ప్రచురించిన తీరు కూడా అంత ఈస్తేతిక్ గా వుంది. అతి తక్కువ సమయంలో అనేక దేశాల కవుల కరోనా కాలపు కవితల్ని సేకరించి  కూర్చిన సంపాదకుల్ని మనసారా అభినందించాల్సిందే.

+++

ఏమి కాలమిది…

భయం పరిణామం చెంది

దుఖం గా రూపుదాల్చుతోంది

బతుకు వేదనై  రోదనై

స్మశానం వైపు చూస్తున్నది …

ఎన్నడూ ఊహించని అలాంటి కాలంలో ఎలాంటి అనుభవాల్ని చూసాం. లాక్ డౌన్, సాంఘిక దూరం, మాస్క్, సానిటైసర్ లాంటి అనేక కొత్త మాటల్ని విన్నాం. ఇంట్లో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. ఆప్తుల్ని,ఆత్మీయుల్నీ, తెలిసినవాల్లనీ, మంగలేష్ డబ్రాల్ లాంటి కవుల్నీ, బాలసుబ్రహ్మణ్యం లాంటి కళాకారుల్నీ కోల్పోయాం. పోగొట్టుకున్న వాళ్ళ చివరి చూపునకూ దూరంయ్యాం…కార్మికుల వందలాది మైళ్ళ కాలి నడకల్నీ చూసాం..ఎంత ఘోరమయిన కాలాన్ని అనుభవించామో చెప్పలేము. 

    ఈ నాణేనికి మరో వైపు గంగానది పరిశుభ్రమయిందనీ, ఢిల్లీలో  వెన్నెల ప్రకాశ వంతమయిందనీ, రోడ్లమ్మట జంతువులు స్వేచ్చగా సంచరించగలుగుతున్నాయనీ విన్నాం.

వీటన్నింటి నేపధ్యం లో సామాజిక దూరం ఇప్పటికే దూరమవుతున్న మనల్ని మరింత దూరం చేసింది. ఇలాంటి స్థితిలో గ్లోబల్ స్థాయిలో కవుల కవితలతో కూడిన ఈ SINGING IN THE DARK లో వివిధ దేశాలకు చెందిన 112 మంది కవుల కవితలున్నాయి. కొందరు కవులు దుఖం తో రాస్తే, కొందరు కోపం తోనూ మరికొందరు ధైర్యాన్ని ప్రోది చేస్తూనూ రాసారు. తప్పకుండా చదవాల్సిన సంకలనమిది.  

+++

ఈ సంకలనం లోంచి ఒకటి రెండు కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదం చదవండి….

రైలు –కే. సచ్చిదానందన్

రైలు మా వూరికి వెళ్తోంది

నేనందులో లేను కానీ

రైలు పట్టాలు నాలోపలున్నాయి

రైలు చక్రాలు నా చాతీపై నున్నాయి

రైలు కూత నా అరుపు

నన్ను తీసుకెళ్ళడానికి రైలు తిరిగి వచ్చినప్పుడు

నేనక్కడ ఉండను కానీ

నా శవాన్ని కాపలా కాస్తూ నా శ్వాస

రైలుపై కప్పు మీద ప్రయాణం చేస్తుంది

మా వూళ్ళో రైలు ఆగగానే

నా ప్రాణం నా దేహంలోకి చేరుతుంది

అక్కడ వేచి చూస్తున్న నా సైకిలెక్కి

తెలిసిన దారులెంత చక్కర్లు కొడుతుంది

సైకిలు గంట విని నా పిల్లలు

నాన్నొచ్చాడు నాన్నొచ్చాడు

అంటూ పరుగెత్తు కొస్తారు

తిరిగొచ్చింది నా మృత దేహమని

వాళ్లకి నేనే భాషలో చెప్పను

వచ్చింది స్వర్గం నుంచా నరకం నుంచా

నేనెక్కడో ఆరెంటి మధ్యా వున్నాను

బావినో కుంటనొ మాట్లాడ నివ్వండి

ఒక వేళ నీళ్ళు మాట్లాడానికి నిరాక రిస్తే

నా ప్రాణం ఇంటి ప్రాంగణం లోని

మునగ చెట్టు మీది కాకిలా  మారి

వాళ్లకు నిజం చెప్పేస్తుంది

=====

ఈ కాలం –కీ .శే. మంగలేష్ డబ్రాల్

కంటి చూపు కరువైన వాళ్ళు

తమ దారిని ఏర్పరుచు కోలేరు

అంగ వికల్యం వున్న వాళ్ళు

ఎక్కడికీ చేరుకోలేరు

బధిరులు

జీవితపు ప్రతిధ్వనుల్ని వినలేరు

ఇల్లు లేని వాళ్ళు

తమ ఇంటిని నిర్మించుకోలేరు

పిచ్చి వాళ్ళు

తమకేం కావాలో తెల్సుకోలేరు

ఇవ్వాల్టి కాలంలో

ఎవరయినా గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, 

చెవిటి వాళ్ళు, ఇల్లులేని వాళ్ళుగా

మారి పోవచ్చు

=======

చివరిగా ఓ హైకూ

The invisible crown

Makes everything

Vacant

  • BAN’YA NATSUISHI (JAPANESE POET)

ఈ అనువాదాలు కేవలం మచ్చుకు మాత్రమే ఎన్నో దేశాల నుండి ఎంతో మంది రాసిన ఎంతో మంచి కవితలు ఈ సంకలనం నిండా వున్నాయి. తప్పకుండా చదివి భధ్రపరుచుకోవాల్సిన సంకలనమిది. సంపాదకులకు మరోసారి  ధన్యవాదాలు.

========================

తెలుగులో కూడా కరోనా నేపధ్యం లో అనేక మంది కవులు వీటికి దీటయిన గొప్ప కవితలు రాసారు. కాని ఇంగ్లీషులోకి, ఇతర భాషలలోకి  వెళ్ళక పోవడంతో ఆ కవితల రీచ్ పరిమితమయి పోయింది. నిజానికి అది గొప్ప విషాదమే. 

  • వారాల ఆనంద్

==============================================