FEDERATION OF FILM SOCIETIES OF INDIA

“డియర్ జిందగీ”

Posted on

మానసిక సంఘర్షనాత్మక సినిమా

వర్తమాన సంక్షోభ, సంక్లిష్ట సమాజంలో అదీ మహానగర సమాజంలో వుత్పన్నమవుతున్న మానసిక వేదనలనూ , ఆందోళనలనూ వాటి పర్యవసానాలనూ ఆవిష్కరించిన సినిమా ‘డియర్ జిందగీ’. ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమా తో మంచి పెరునూ గౌరవాన్నీ  పొందిన గౌరి షిండే రూపొందించిన  రెనడవ చిత్రం డియర్ జిందగీ. ఇదికూడా స్త్రీ పాత్ర ముఖ్యాభినేతగా రూపొందించిందే. ముంబై లాంటి మహానగరంలో వర్తమాన

సినిమాటోగ్రాఫర్గా ఎదగాలనుకుంటున్న కైరా తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక వొత్తిడితో  పడ్డ సంగర్షణ , ఫలితంగా రూపొందిన ఆమె వ్యక్తిత్వం ఈ సినిమాలో ప్రధాన అంశం. చిన్న సినిమాలు ఆడ్ ఫిల్ములూ షూట్ చేస్తూ పూర్తి నిడివిగల సినిమా అవకాశం  కోసం ఎదురుచూస్తున్న కైరా తన అస్థిరమయిన మానసిక స్థితి, ఫీలవుతున్న అభద్రత ఆమె ను ఒక చోట వుండనీయవు. అపనమ్మకం ఆమెను నీడల వెంటాడుతూ వుంటుంది. ఆ స్థితిలో అనేక మండది  బాయ్ ఫ్రెండ్స్, ఒకరినుంచి ఒకరికి షిఫ్ట్ అవడం ఆధునిక నగర వాతావరణంలోని సమస్త స్థితినీ  ఆమె ఎదుర్కొంటూ వుంటుంది. ఆ స్థితినుండీ మామూలు స్థితికి వచ్చే క్రమమే ఈ సినిమా. ఇందులో కైరా గా ఆలియా భట్ చాలా సహజమయిన నటనను ప్రదర్శించింది. ఇప్పటి నటీమణుల్లో అలియా భట్ డి విశిష్ట స్థానమని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. ఇక దిమాఖ్ డాక్టరుగా షా రూఖ్ ఖాన్ లో ప్రొఫైల్ లో ఆయన ఇమేజ్ కు భిన్నంగా హుందాగా నటించాడు.

సామాజిక సంఘర్షణలే  కాకుండా చిన్న నాడు ఆమె తల్లిదండ్రులు ఆమె పట్ల ప్రవర్తించిన తీయు కూడా కైరా జీవితం పై పడుతుంది. అన్నీ వొత్తిడులనుండీ బయటపడి సంపూర్ణ వ్యక్తిగా మరే క్రమమే ఈ సినిమా.

కథ విషయానికి వస్తే కైరా సినిమాటోగ్రాఫర్ గా ఎదగాలనీ ఎప్పటికయినా తనను తాను నిరూపించుకోవాలని కళలు కంటూ కష్టపడే యువతి. చిన్న ఆడ్స్ తీస్తూ నిలదొక్కుకునే క్రమంలో వుంటుంది. అనేక మండి మిత్రులౌ తారస పడతారు. రెస్టారెంట్ ఓనర్ సిద్ తో స్నేహం కుదురుతుంది. తర్వాత షూటింగులో భాగంగా రఘువేంద్ర తో పరిచయం చాలా దూరం పోతుంది. రఘువేంద్ర కు అమెరికాలో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఆ సినిమాకు కైరా పూర్హ్తి స్థాయి సినిమాటోగ్రాఫర్ గా వుంటుదని హామీ ఇస్తాడు. ఆమె ఆథన్నుంచు జీవితాని కోరుకుంటుంది కానీ రఘువేంద్రకు మరొకరితో ఎంగేజ్మెంట్ అవుతుంది. అది తెలిసి కైరా తీవ్ర నిరాశకు గురవుతుంది. రఘువేంద్ర తో అఫైర్ తెలిసి సిద్ ఆమెనుంచు పక్కకు జరుగుతాడు. ఇంతలో ముంబై లో ఇంటిఔనర్ ఇల్లు ఖాళీ చేయమంతాడు. గోవాలో వున్న తల్లిదంరులు అక్కడికి రమ్మంతారు తప్పని స్థితిలో ఆమె గోవాకు షిఫ్ట్ అవుతుంది. సిద్, రఘువేంద్ర ల విషయం తో ఆమె లో అస్థిరత మరింత పెరుగుతుంది. ఆమెకు మాన్సిక సాంత్వన కలిగేందుకు సైకాలజిస్ట్- దిమాఖ్ డా డాక్టర్ ను కలవమని మిత్రులు చెబుతారు. అలాంటి థెరపిస్ట్ వుంటాడా అని ఆమె ఆశ్చర్యపోతుంది. గోవాలో తల్లిదండ్రులు పెళ్లి సంభాదులు చూద్దాం మొదలు పెడతారు. కానీ కైరా దిమాఖ్ కా డాక్టర్ జహాంగీర్(షారూఖ్ ఖాన్) ను కలుస్తుంది. ఇక అక్కడినుండి ఆ  ఇద్దరి నడుమా కొనసాగే అనేక థెరపీ సిట్టింగులు ఆమె అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ పోతాయి.

‘మేధావి అంటే అన్నీ ప్రశ్నలకూ సమాధానాలు  తెలిసినవాడు  కాదు, జవాబు వరకు చేరే ఓపిక వున్నవాడు’  అని డాక్టర్ జహాంగీర్ కైరా కు చెబుతాడు. ఓపికగా నీ మనసులోని అన్నీ విషయాలూ బయటపెట్టు అవే నీకు సమాధానాలు చెబుతాయి అంటాడు. అంతే కాదు ఒక నాటి సిట్టింగులో సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లి తన చిన్నప్పుడు తరుచుగా తండ్రి  సముద్రం తో కబడ్డీ ఆడటానికి  ఇక్కడకు తీసుకొచ్చేవాడని చెబుతాడు. ముందుకొస్తున్న అలల తో కబడ్డీ ఆడడం కైరాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.

ఇక మరో సారి సైకిల్ రెపైర్ చేస్తున్న జహాంగీర్ ను చూసి ఏమిటి మీరు రెపైర్ కూడా చేస్తారా అంటుంది సైరా. రెపైర్ కాకుంటే సైకిల్ ను రీసైకిల్ చేస్తానంతాడు జహాంగీర్. కిలకిలా నవ్విన కైరా నా దిమాఖ్ కూడా రెపైర్ కాకుంటే దాన్ని కూడా రీసైకిల్ చేస్తారా అంటుంది. ఇట్లా అంకె సందర్భాల్లో కొటేషన్ల లాంటి డైలాగ్ లతో సినిమా ముందుకు సాగుతుంది. కైరా లో ఆందోళనలకూ అస్థిరత్వనికీ ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తాత దగ్గర వదిలేసి అమెరికా వెళ్లిపోవడం, ఆమెను సరిగ్గా పట్టించుకొక పోవడం లాంటి సంఘటనలు ఆమె మనస్సు పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం జహాంగీర్ తెలుసుకొని వివరిస్తాడు. ఆమె క్రమంగా తనలోపలి భయాలు అందరూ దూరమవుతారనే ఆందోళననుంచి క్రమంగా బయటపడుతుంది. తల్లిదండ్రులను ప్రేమించడంతో పాటు ఇతరుల పట్ల వుండే సాహానుభూతే మనిషికి స్వాంతన అని తెలుసుకుంటుంది.

డాక్టర్ జహాంగీర్ పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది కైరా కానీ తనకూ కైరాకూ మధ్య వున్నది కేవలం థెరపిస్ట్ సంభండమే తప్ప మరెడీ లేదని. సున్నితంగా తిరస్కరించి అధ్భూతమయిన భవిష్యత్తులోకి పయనిచమంటాడు జహాంగీర్. గొప్ప ఆశాహమయిన నోట్ తో సినిమా ముగుస్తుంది. అలియా భట్ షా రూఖ్ ఖాన్ లు వారి సంభాషణ ఆకట్టుకుంటాయి. ఇద్దరూ పరిపక్వమయిన నటనను ప్రదర్శించారు.

అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించబడి మంచి విజయాన్ని సాధించిన “ డియర్ జిందగీ’ మహిళా సినిమానే కాకుండా మానసిక సంఘర్షణ లాంటి అనేక సమస్యల్ని చర్చిస్తుంది. సంగీతం, ఫోటోగ్రఫి బాగుంటాయి.

“డియర్ జిందగీ “ రచనా దర్శకత్వం: గౌరీ షిండే, రెడ్ చిల్లీస్ నిర్మాణం.

(PUBLISHED IN “KAARMIKA VAAHINI, LIC MAGAZINE, JULY 2017)

FILM AWARDS A CONTRAVERSY

Posted on Updated on

వివాదాస్పదమవుతున్న జాతీయ ఫిల్మ్ అవార్డులు

64th-national-film-awards-winners

అవార్డు ఒక గుర్తింపు. సాహితీ సాంస్కృతిక సామాజిక రంగాల్లో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ చేసిన విశ్టిష్ట మయిన కృషికి గుర్తింపుగా ఇచ్చే ప్రశంశ. అది హార్దికంగానూ లేదా ఆర్థిక ప్రోత్సాహకంగానూ వుండొచ్చు. లేదా బిరుదులాంటిది కూడా కావొచ్చు.  ప్రపంచ వాప్తంగా పలు సంస్థలూ, వ్యక్తులూ, ప్రభుత్వాలూ అనేక అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అవార్డులు స్వీకర్తల కృషికి గుర్తింపునూ, మునుముందు మరింత కృషి చేసేందుకు దోహదం చేస్తాయి.

కానీ ఈ అవార్డుల ఎంపిక, ప్రదానం పారదర్శకంగా లేనప్పుడు వివాదాలు తలెత్తుతాయి. ఫలితంగా ఆ అవార్డుల లక్ష్యము విఫలమౌవుతుంది. వాటి విలువా తగ్గిపోతుంది. స్వీకర్తలకు అవార్డు గెలుచుకున్నామన్న సంతృప్తీ మిగలదు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన పెద్ద వివాదానికే గురయింది. జాతీయ ఉత్తమ నటుడిగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ఎంపిక వివాదానికి కేంద్ర బిందువయింది. ‘అలీఘర్’ సినిమాలో  మనోజ్ బాజ్ పాయ్, దంగల్ లో ఆమీర్ ఖాన్ ల నటనను పరిగణనలోకి తీసుకోకుండా ‘రుస్తుం’ లో అక్షయ్ నటనకు ఉత్తమ నటుడి అవార్డ్ ప్రకటించడం ఈ వివాదానికి ముఖ్య కారణం.

దీనికి తోడు ఈ సారి అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్ దర్శకుడు ప్రియదర్శన్ చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మొత్తం అవార్డుల ప్రక్రియనే మరింత వివాదం లోకి నేట్టింది. “ రమేశ్ సిప్పి చైర్మన్ గా  వున్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు,  ప్రకాష్ ఝా చైర్మన్ గా  వున్నప్పుడు అజయ్ దేవ్ గన్ గెలుచుకున్నాడు అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. మరిప్పుడు ఎందుకు వివాదం చేస్తున్నారన్నది’ ప్రియదర్శన్ వాదన. అంటే రమేశ్ సిప్పి కి అమితాబ్ దగ్గరివాడు, అజయ్ దేవ్ గన్ ప్రకాష్ ఝా కు దగ్గరివాడు కనుక వాళ్ళకి అవార్డులు వచ్చాయి ఇప్పుడు అక్షయ్ ప్రియదర్శన్ కు సన్నిహితుడు కనుక అవార్డు వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పినట్టయింది. ఇదంతా చూస్తే జాతీయ ఫిల్మ్ అవార్డు ఎంపికలెవీ కూడా పక్షపాత రహితంగా, ప్రతిభ ఆధారంగా జరగడం లేదని బహిరంగంగా ఒప్పేసుకున్నట్టయింది.

నిజానికి జాతీయ చలనచిత్ర అవార్డులు ఇటీవలి సంవత్సరాలల్లో తమ మౌలిక   లక్ష్యాన్నీ, లక్షణాన్నీ కోల్పోతున్నాయి, ఈ అవార్డుల్ని నెలకొల్పినప్పుడు సినిమాల్లో ఆవిష్కృతమయిన సున్నితత్వమూ, కళాత్మకత, మానవీయ లక్షణాల్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక జరగాలని నిర్ణయించారు. ఉత్తమ నటుల్ని ఎంపిక చేసేటప్పుడు డ్రామాకు కాకుండా వాస్తవిక దృక్పథంతో నటించిన నటుల్ని ఎంపిక చేసేవారు. ఆయా పాత్రల్లో నటులు కాకుండా ఆపాత్రలే కనిపించడాన్ని ప్రాతిపదికగా తీసుకునే వారు. ఫలితంగా సమాంతర సినిమాలకు ఈ అవార్డుల్లో పెద్దపీట లభించేది. కానీ కాల క్రమేణా మారిన రాజకీయ దృక్పథం, పెరిగిన వ్యాపారాత్మకతలు ఈ అవార్డుల్లోనూ చేయి చేసుకోవడం మొదలు పెట్టాయి. పర్యవసానంగా జాతీయ స్థాయిలో ఇచ్చే ఈ అవార్ద్దుల్లో వినోదాత్మక సినిమాలకు, కుటుంబ కథా చిత్రాలకూ ప్రత్యేక  అవార్డులు ప్రవేశ పెట్టారు. అలా ఏర్పాటయిన ప్రత్యేక విభాగాలతో సంతృప్తి చెందని వర్గాలు అవార్డుల ఎంపికను ప్రభావితం చేయడం ఆరంభించారు. అవార్డుల మూల లక్ష్యాల్ని తుంగలో తొక్కుతూ కేవలం వినోదమూ వ్యాపారమూ ప్రధానంగా వున్న చిత్రాలకూ నటులకూ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు. వాస్తవికతను పక్కన పెట్టడం మొదలు పెట్టారు. గత ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా’ బాహుబలి’ ని ఎంపిక చేసినప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. సాంకేతికంగా స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ పరంగా గొప్పగా తీసినప్పటికీ బాహుబలి లో ఏ మానవీయ విలువల ఆవిష్కరణ జరిగిందని అదూర్ గోపాల కృష్ణన్, గిరీష్ కసరవెల్లి లాంటి దర్శకులు  కూడా ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన రాజకీయ మార్పే కారణం అని కూడా పలువరు మాట్లాడారు. ఇలాంటి కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇవ్వడానికి ఫిల్మ్ ఫేర్,  ఐఫా, జీ సినీమా, స్క్రీన్ అవార్డుల్లాంటివి వుండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్ని కూడా వ్యాపారమయం, ఆశ్రిత పక్ష పాత మయం చేయడం అభిలశనీయం కాదు.

గతంలో కొంతకాలం జాతీయ అవార్డులకోసం మరో పద్దతిని అవలంబించారు. ప్రాంతీయ స్థాయిలో ఎంపిక కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళు ప్రాంతీయ స్థాయిలో ఎంపిక చేసిన సినిమాల్ని జాతీయ స్థాయి ఎంపిక చేసేవారు. ఆ పద్దతిలో మంచి సినిమాలు వేర్వేరు కారణాలతో ప్రాంతీయ స్థాయిలోనే నిలిచిపోతున్నాయని, రెండు స్థాయిల్లో ఎంపిక సరయింది కాదనే వాదన రావాడంతో తిరిగి జాతీయ స్థాయి ఎంపిక ప్రారంబించారు.

ఈ స్థితికి రెండు కారణాలు తోస్తాయి. ఒకటి ప్రభుత్వమూ, పాలకుల రాజకీయ దృక్పథాలు ఈ అవార్డుల్లో  ప్రతి ఫలిస్తున్నాయను కోవాలి. ఫిల్మ్  ఇన్ స్టి ట్యూట్, ఫిల్మ్ సెన్సార్ లల్లో జరుగుతున్న వ్యవహారాలు కనిపిస్తూనే వున్నాయి. మరోకారణం అవార్డుల జ్యూరీ కోసం నియమించబడ్డ సభ్యుల వ్యక్తిత్వమూ,సాధికారికత.

జ్యూరీ ఎంపికలోనే వారి కళాత్మక దృక్పథమూ, సామాజిక అవగాహన ను పరిగణనలోకి తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా వుండి  అవార్డులు వివాద రహిత మవుతాయి. వాటికి విలువా పెరుగుతుంది.

అయితే ఈ సారి ఉత్తమ చిత్రం అవార్డ్  కోసం మరాఠీ సినిమా ‘కాసవ్’ ఎంపిక కావడం మాత్రం సర్వామోదం పొందింది. ప్రాంతీయ సినిమాలకు సముచిత స్థానం రావడం మంచి పరిణామమే.

-వారాల ఆనంద్