FILM SOCIETIES

FILM SOCIETY MOVEMENT

Posted on

 

సత్యజిత్ రే పూనికతో నిమాయ్ ఘోష్,ఋత్విక్ ఘటక్ లాంటి వారి చొరవతో మన దేశంలో ప్రారంభమయిన ఫిల్మ్ సొసైటి ఉద్యమం క్రమంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలకు చేరింది. దాని ప్రభావంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైదరబాద్, విజయవాడ, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, ఖమ్మం,కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఫిల్మ్ సొసైటి లు 70వద్శకమ్ నుండి, 90ల దాకా ఉద్యమంలాగా నడిచాయి. ఉత్తమ సినిమాలకు గొప్ప వేదికగా నిలిచాయి.

         అలాంటి కృషి కరీంనగర్ లో పుంజుకొని స్వంత ఆడిటోరియం నిర్మించుకునే దాకా ఎదిగింది.. ఆ నేపధ్యంలో ఆకాశవాణి హైదరబాద్ కార్యక్రమ నిర్వాహకులు సి.ఎస్.రాంబాబు గారు  ఇంటర్వ్యూ చేశారు. అది ఇటీవల ప్రసారమయింది… వీలయితే వినండి…. రాంబాబు గారికి ధన్యవాదాలు  

Advertisements

ONE DAY FILM MAKING WORKSHOP

Posted on

ONE DAY FILM MAKING WORKSHOP @KARIMNAGAR FILMBHAVAN, INAUGURAL SPEECH

 

కొత్త తరం దర్శకులు సరికొత్త తరం సినిమా

Posted on

 కొత్త తరం దర్శకులు సరికొత్త తరం సినిమా

     1990ల తర్వాత ఎప్పుడయితే దేశంలో సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ (LPG) అమలులోకి వచ్చిందో అప్పటినుంచి భారతీయ సినిమా రంగంలో ఊహించని రీతిలో మార్పులు మొదలయ్యాయి. దానికి తోడు వివిధ దేశాల ఉపగ్రహ చానళ్ళ ప్రసారాలు మొదలు కావడం, ఉప్పెనలా డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం, హై స్పీడ్ ఇంటర్నెట్ చేరువకావడం తదితర కారణాలతో అప్పటిదాకా వున్న సినిమా నిర్మాణ రీతులు పూర్తిగా మార్పునకు లోనయ్యాయి. మరోపక్క కుటుంబాలు సమిష్టి తనాన్ని కోల్పోయి ఉపగ్రహ కుటుంబ వ్యవస్థ రావడం చకచకా జరిగిపోయాయి. ఇట్లా మొత్తంగా గత రెండున్నర మూడు దశాబ్దాలుగా మొత్తం భారతీయ సామాజిక స్థితి మారిపోయింది. దాని ప్రభావం సమస్త మానవ సృజనాలపై, ముఖ్యంగా  సినిమాపైన అమితంగా పడింది. ఈ నేపధ్యంలో మలయాళీ సినిమాను పరిశీలిస్తే ఇప్పుడు కొత్త తరం దర్శకులు, సరికొత్త సినిమా రూపొందడాన్ని చూడవచ్చు. ఆ మార్పు నిర్మాణ నైపుణ్యాల విషయాలతో పాటు ఇతివృత్తాల పరంగా కూడాజరుగుతున్నది. కేరళలో సినిమా పెద్ద మార్పునే చెందింది. అల్ఫోంస్ పుత్రేన్ దర్శకత్వం లో రూపొందిన “ప్రేమమ్ ” మలయాళీ సినిమా రంగంలో విజయమవంతమయి కొత్త తరం సినిమాకు పాదులు వేసింది. ఈ ప్రేమ కథాత్మమయిన నవీన్ పాళీ, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ లు నటించిన ఈ సినిమా నిర్మాణ పరంగా కూడా నూతన ఒరవడిని ప్రారంభించింది.  సినిమా కేరళ, తమిళనాడు లతో సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయాన్ని సాధించింది. 4కోట్ల బడ్జెట్ తో నిర్మానమయి 60కోట్లకు పైగా వసూలుచేసింది. లిజిన్ జోస్ తీసిన “ ఫ్రైడే “ ఒక రోజు అనేక కథలు అన్న నిర్మాణ ఒరవడిని చేపట్టిన థ్రిల్లర్ డ్రామా.  ఫాహద్ ఫాసిల్. ఆన్ ఆగస్టిన్లు  ప్రధాన భూమికలు పోషించిన ఫ్రైడే విలక్షణ మయిన సినిమా నరేటివ్ ను కలిగి వుంది. తర్వాత అల్ఫోంస్ పుత్రేన్ తీసిన “నీరమ్  “ బ్లాక్ కామెడీ థ్రిల్లర్. తమిళ మలయాళీ భాషల్లో ఏక కాలం లో నిర్మించ బడిన ఈ సినిమా తర్వాత తెలుగులో రన్ గా అనువాదమయింది. ఇక లిజో జోస్ పెళ్లిసేరి తీసిన “సిటీ ఆఫ్ గాడ్ “, “డబుల్ బారెల్ ” లు కూడా మంచి  స్టై లైజ్డ్ సినిమాలుగా కొత్త తరం సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో ఆధునికతను సంతరించుకున్న స్త్రీ పాత్రలు, ప్రేమ గురించి సెక్స్ గురించి మాట్లాడడానికి మొహమాటాల్లేని తనం అంతా ఓపెన్ నేస్స్ అన్నట్టుగా కనిపించే విధానం చూస్తాం. అయితే స్త్రీ పాత్రల విషయంలో వారి వ్యక్తిత్వ ఆవిష్కరణ  కంటే అత్యానుధికత  వీటిల్లో ముఖ్యమయిపోయి కొత్త తరం సినిమాలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఇంకా సుదేవన్(సీ.ఆర్.నంబర్ 89), సమీర్ తహిర్(చాప్పా ఖురీష్) , లాల్ జోష్(డైమండ్ నెక్లెస్), అన్వర్ రశీ( ఉస్తాద్ హోటల్), . వి.కె.ప్రకాష్(బ్యూటీఫుల్ ), రాజేశ్ పిళ్ళై ( ట్రాఫిక్)  లాంటి దర్శకులు చర్చనీయాంశమయిన సినిమాలు తీశారు. ఇక జీతూ జోసెఫ్ రూపొందించిన  “ దృశ్యం ”లాంటి సినిమాలు దేశ వ్యాప్తంగా తెలుగుతో సహా తమిళ,హింది భాష ల్లోకి రేమేక్ అయ్యి విజయం సాధించింది.

    మలయాళంలో కొత్తతరంసినిమాల్తో పాటు కొత్త తరం నటీనటులు కూడా వెలుగు చూస్తున్నారు. ఫహద్ ఫజిల్, నివిన్ పాలీ, జయసూర్య, దుల్ఖర్ సల్మాన్, పృథ్వీరాజ్ లాంటి నటులు ముందుకు వచ్చారు. ఇట్లా కొత్త తరం నిర్మిస్తున్న new gen సినిమాలతో మలయాళీ సినిమా కొత్త పుంతలు తొక్కుతున్నది.

  ఇలాంటి కొత్త తరం సినిమాలు మలయాళీ సినిమా రంగం లో ఆదినుంచీ వున్న విలక్షణతను ఆవిష్కరిస్తున్నాయనే చెప్పాలి.

        నిజానికి  ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర కోట్ల మందిమాట్లాడే మలయాళీ భాష వారి కళాత్మక సృజన విలక్షమయింది.అది సాహిత్యమయినా, సినిమా అయినా వాస్తవికత ఒక వైపూ వ్యాపారాత్మకత మరో వైపూ సమాంతరంగా సాగుతూ వుంటాయి. అన్ని భారతీయ రాష్ట్రాలోకెల్లా కేరళ సృజన విషయంలో తన విలక్షణతను చాటుకుంటూనే వుంది. సినిమా విషయానికి వస్తే తూర్పున వున్న బెంగాల్ కు  సమాంతరంగా అర్థవంతమయిన ఆవిష్కరణలతో అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది కేరళ.

      1928లో జేసీ డేనియల్ నిర్మించిన మొట్టమొదటి మూకీ సినిమా

“ విగతకుమారన్” తో మొదలయిన మలయాళీ సినిమా ప్రస్థానం 1938లో  ఎస్.  నొటాని  నిర్మించిన “ బాలన్” తో టాకీ సినిమా యుగం మొదలయింది. బాలన్ నిర్మాతలు కేరలేతరులు కాగా కేరళ వాసి నిర్మించిన మొదటి సినిమా గా “ ప్రహ్లాద” ను చెప్పుకోవచ్చు. నిజానికి అన్నీ దక్షిణ భారతీయ సినిమా రంగాల్లాగే మద్రాస్ కేంద్రంగానే మలయాళీ సినిమా కూడా మొదలయింది.  పి.సుబ్రమణ్యం త్రివేంద్రంలో స్థాపించిన మెర్రీలాండ్ స్టూడియో తో మలయాళీ సినిమా రంగం గొప్ప మలుపు తిరిగింది. ఆ తర్వాత క్రమంగా కేరళ లో చిత్రసీమ ఎదుగుదల మొదలయింది. అక్కడ మొదటినుంచీ వాస్తవ వాద సినిమాలు ఒక  వైపూ పూర్తి ప్రధాన స్రవంతి సినిమాలోక వైపూ నిర్మాణమవుతూ వచ్చాయి. రామూ కరియత్ “ చేమ్మీన్ ” లాంటి సినిమాలతో జాతీయ స్థాయి గుర్తిపును సాధిస్తే ప్రేమ్ నజీర్ లాంటి స్టార్ లు వ్యాపార సినిమా రంగాన్ని ఏలారు. మరోపక్క “ ఆమె మధురరాత్రులు ” లాంటి సినిమాలు కూడా వచ్చాయి. 1960ల్లో అనేక  సాహితీ విలువలున్న కథలు, నవలలూ కేరళలో మంచి సినిమాలుగా వచ్చాయి. తకజ్హి శివశంకర పిళ్ళై , ఎండి బషీర్,పరప్పురమ్, ఏంటీ వాసుదేవన్ నాయర్ లాంటి వాళ్ళు రాసిన రచనలు ఎన్నో సినిమాలుగా రూపాంతరీకరణ చెందాయి. 1965లో రామూ కరియత్ తన చేమ్మీన్ తో 1965లో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకొని మలయాళీ సినిమాకు కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టారు. తర్వాత భాస్కరన్  “ఇరుతింటే ఆత్మవు ”, విన్సెంట్ “ తులాభారం “ సినిమాలు జాతీయ గుర్తింపును అందుకున్నాయి. 1972లో అదూర్ గోపాలకృష్ణన్ శకం మొదలయింది. చిత్రలేఖ ఫిల్మ్ కొ ఆపరేటివ్ ను స్థాపించి అదూర్ తీసిన “స్వయంవరం” మొత్తం దేశంలోనే నూ తన ఒరవడిని ఆరంభించింది. తర్వాత ప్రఖ్యాత రచయిత ఏంటీ వాసుదేవన్ నాయర్ తన “ నిర్మాల్యం “ దానికి తోడయింది. అట్లా కేరళలో వాస్తవిక  పాంతీయ,సృజనాత్మక సినిమాకు పాదులు పడ్డాయి. ఆ ఒరవడి అరవిందన్, కె.జి.జార్జ్ , మోహనన్, పద్మరాజన్, భారతన్ తదితరుల సినిమాలతో ముందుకు సాగింది. అరవిందన్ కాంచన సీత, చిదంబరం, ఎస్తప్పన్, అదూర్ ఎలిపత్తాయమ్,  ముఖాముఖం, షాజీ కరుణ్  “ పిరవి  “ తదితర అనేక సినిమాలు అర్థవంతమయిన కళాత్మక సినిమా ప్రపంచంలో గొప్ప సినిమాలుగా నిలిచాయి. మరోవైపు ఒడెస్సా సినిమా ఉద్యమంతో జాన్ అబ్రహం తన మిత్రులతో కలిసి ఊరూరూతిరిగి మంచి సినిమాలు ప్రదర్శించి ప్రేక్షకులు ఇచ్చిన చందాలతో  “అమ్మా అరియన్ “ లాంటి గొప్ప సినిమాలు తీశాడు.

    అట్లా సమాంతర సినిమా తో పాటు కేరళలో ప్రధాన స్రవంతి సినిమా కూడా సుప్రసిద్ద నటులు మమ్ముట్టీ, మోహన్ లాల్ లాంటి నటులతో స్టార్ డమ్ కూడా కొనసాగింది. అయితే కేరళ లో ప్రత్యేకత ఏమంటే మోహన్ లాల్, మమ్ముట్టీ లు కూడా సమాంతర సినిమాలల్లో విరివిగా నటించి ఎన్నో జాతీయ అవార్డులు ప్రశంశలు అందుకున్నారు.  ఇట్లా విభిన్న నిర్మాణ రీతులు, భిన్న ఇతివృత్తాలతో కళాత్మకత ఒక వైపూ కాసుల సినిమా మరోవైపూ కేరళ లో విలసిల్లుతున్నది. ఏదేట్లా వున్నా భారతీయ సినిమా రంగంలో మలయాళీ సినిమా ప్రాంతీయమయి విలక్షణతను చాటుకున్నది. ఆధునిక newgen కాలంలో కొత్త రకం సినిమాకూ వేదిక అవుతున్నది.

0f0d06d9-e5c8-4edc-8ba1-2a3e24046fc4 (1)

అవరోధాల్ని అధిగమిస్తున్న మణిపుర్ సినిమా

Posted on

అవరోధాల్ని అధిగమిస్తున్న మణిపుర్ సినిమా

       ఈశాన్య భారతం లోని మణిపూర్ రాష్ట్రం విలక్షణమయిన సాంస్కృతిక వారసత్వానికి నెలవు. ఆ రాష్ట్రంలో నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, క్రీడలతో పాటు యుధ్ధ కళలు విలక్షణమయినవి. అక్కడ జానపద సంస్కృతి సజీవంగా ఆలరారుతుంది.  మణిపూర్ కళాత్మక సృజాన వైపు ప్రపంచమంతా చూస్త్తుంది.

     సినిమాల విషయానికి వస్తే మణిపుర్ లో మూడు భాషా సినిమాలు నిర్మాణ మవుతాయి. ఇండో ఆర్యన్, ద్రావిడియన్, టిబెటో  బర్మన్ భాషా చిత్రాలు అక్కడ రూపొందుతాయి.  నిజానికి మూకీ సినిమాల కాలంలోనే మణిపుర్ లో టూరింగ్ టాకీసులు టెంట్, సినిమాలతో మూవింగ్ ఇమేజెస్ ప్రదర్శించాయి. మణిపుర్ కు సంబంధించి మహారాజ కుమార్ ప్రియబ్రతా 1936లోనే డాకుమెంటరీ సినిమాల్ని తీశాడు. తన 8 ఎం.ఎం. కెమెరాతో మణిపుర్లో జరిగిన ముఖ్యమయిన సందర్భాల్ని షూట్ చేసి పెట్టాడు. తర్వాత 1960-70 ల మధ్య ఇబోహల్ శర్మ  కొన్ని ఫీచర్     ఫిల్మ్స్, మరి కొన్ని నాన్ ఫీచర్ ఫిల్మ్స్ నిర్మించాడు.

     మానివుడ్ గా పిలవబడే మణిపూర్ సినిమా చరిత్ర లో మొట్టమొదటి సినిమాగా దేబ్ కుమార్ బోస్ రూపొందించిన మాతంగి మణిపుర్  ను చెప్పుకోవచ్చు. ఆ సినిమా  మూడు సినిమా హాళ్లలో 3 ఏప్రిల్ 1972 న విడుదల అయింది. కానీ మణిపుర్ సినిమాకు అర్థవంతమయిన కోణాన్ని ఇచ్చినవాడు ఎస్.ఎన్.చాంద్. మణిపుర్ ఫిల్మ్ సొసైటి ముఖ్య బాధ్యు డయిన ఆయన  తాన ఉద్యోగాన్ని వదిలి ఆస్తినంతా అమ్మేసి సినిమా ప్రయత్నం చేశాడు. ఆర్థిక కారణాల వల్ల నిర్మాణం ఆలస్యంఅయింది.  బ్రో జెన్ డ్రాగి లుహోంబా ‘1973లో విడుదల అయింది.  తర్వాత కూడా ఎస్,ఎన్, చాంద్ మరికొన్ని ప్రయత్నాలు చేశాడు. నిజానికి మణిపుర్ సినిమాకు ఊపిరి పోసింది అక్కడి ఫిల్మ్ సొసైటి ఉద్యమమే. మణిపుర్ ఫిల్మ్ సొసైటి , తర్వాత ఇంఫాల్ సినీ క్లబ్ లు మొత్తంగా ఆ రాష్ట్రంలో గొప్ప సినీ చైతన్యాన్ని తెచ్చిందనే చెప్పుకోవాలి.

      కానీ మణిపుర్ సినిమాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిని కల్పించి అర్థవంతమయిన సినిమాకు పాదులు వేసిన దర్శకుడు అరిభమ్ శ్యామ్ శర్మ. ఆయన ఇంఫాల్ లో 1939లో జన్మించాడు. విశ్వభారతి విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం శాస్త్రీయ సంగీతం చదివాడు. చదువు తర్వాత మణిపుర్ చేరుకున్న అరిభం మొదట నాటక రంగంలో విశేష కృషి చేశాడు. 1974నుండి తన దృష్టి సినిమా వైపునకు మరల్చాడు. 1976లో ఆయన రూపొందించిన  సనబీ  మంచి గుర్తింపును తెచ్చుకుంది. తర్వాతి చిత్రం  ఇషణో  మాయిబీ సంస్కృతీ విశ్వాసాల్ని తెరకెక్కించాడు. మణిపుర్ ప్రాంతంలోని సనాతన సంస్కృతిని నిజాయితీగానూ, వాస్తవికంగానూ చూపించి జాతీయ అవార్డుతో పాటు కేన్స్ చిత్రోత్సవంలోకూడా ప్రదర్శించబడింది ఇంకా  ఇమాగి నిన్గ్థమ్ తో మణిపుర్ సినిమా స్థాయిని  మరింత ఎత్తునకు తీసుకెళ్ళాడు. ఇంకా ఆయన పలు డాకుమెంటరీ లు కూడా రూపొందించాడు. మొదటి మూడు దశాబ్దాలల్లో మణిపుర్లో 54 ఫీచర్ ఫిల్మ్స్, 35 డాకుమెంటరి ఫిల్మ్స్ రూపొందాయి. కోటానుకోట్లు వెచ్చించి నిర్మించే హిందీ సినిమాలాతో పోల్చినప్పుడు మణిపుర్ సినిమా కేవలం 10-20లక్షల బడ్జెట్ తో సినిమాలు నిర్మించేవారు. అట్లని అవి ప్రాంతీయ వనరులతో, స్థానీయ కోణంతో నిర్మించబడడంతో స్వచ్ఛంగానూ గొప్పగానూ వున్నాయి.

     కానీ అసలు సమస్య 2000 సంవత్సరం చివరి రోజుల్లో మొదలయింది. అప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన రాజకీయ విభాగం మణిపుర్ లో హిందీ సినిమాలతో పాటు మణిపూరేతర సినిమాల ప్రదర్శనల పైన నిషేధం విధించింది. దాంతో అక్కడ మొత్తం సినిమా రంగం తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేయబడింది. దాంతో అనేక సినిమా హాల్లు మూతబడ్డాయి. డిస్ట్రిబ్యూటర్లు సినిమా రంగాన్ని వదిలేసి ఇతర వ్యాపారాల్లోకి మారిపోయారు. మరికొంత మంది చిన్న చిన్న వీడియో ప్రదర్శన హాల్లుగా మార్చుకొని వీడియో సినిమాల్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు. దాంతో కొంత మంది దర్శకులు వీడియో సినిమాల్ని తీయడం మొదలుపెట్టారు. అట్లా మొదత రూపొందిన సినిమా లమ్మీ అది ఫ్రెండ్స్ టాకీసులో మార్చ్ 2001లో ఎల్.సి.డి ప్రొజెక్టర్తో ప్రదర్శించారు అది విజయవంతమయింది దాంతో సినిమా హాళ్ళల్లో వీడియో సినిమాల ప్రదర్శనకు అధికారుల అనుమతిని తీసుకున్నారు. ఇప్పు అనే దర్శకుడు దర్శకత్వం వహించిన  లల్లాసీ పాల్  సినిమా 2002లో విడుదల అయి మణిపుర్ డిజిటల్ సినిమాకు పాదులు వేసింది.  ఈలోగా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుల ఎంపిక కోసం 2010 నించి వీడియో ఫార్మాట్ ను కూడా అర్హమయినవిగా ప్రకటించడంతో మణిపుర్ సినిమాకు వూపిరి పోసినట్టయింది. అప్పటినుంచి ఏటా 40-50 వీడియో సినిమాలు రూపొందడం మొదలయ్యాయి. ఓయినమ్ గౌతమ్ రూపొందించిన   ఫిజిగీ మణీ   చిత్రం 2011 సంవత్సరంలో ఉత్తమ ప్రాంతీయ సినిమా అవార్డును గెలుచుకొంది.   

      ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం తన ఫిల్మ్ పాలసీ ని ప్రకటించింది. దాని ప్రకారం నిర్మాతలకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సహాయం అందించడం మొదలు పెట్టింది. ఇంకా ఫిల్మ్ లాబ్, స్టూడియో, అవార్డుల ప్రకటన, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణ మొదలయిన కార్యక్రమాల్ని మొదలు పెట్టింది. ఇంకా ఫిల్మ్ సొసైటి లను ప్రోత్సహించడం మొదలు పెట్టింది.

  కానీ ఇప్పటికీ ఇంకా మణిపూర్లో పూర్తి స్థాయి నిర్మాణ ప్రదర్శనా వసతులు ఏర్పడక పోవడంతో వాటి కోసం నిర్మాతా దర్శకులు కోల్ కట్టా, చెన్నై, ముంబై వెళ్ల వలసి రావడంతో నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం నిర్మాతలకు ఇబ్బందిగానే వుందని చెప్పుకోవచ్చు. ఇన్ని అవాంతరాల నడుమ కూడా అరిభమ్ శ్యామ్ శర్మా 2012లో “” లీపాఖీ 2013లో మోంగ్ సభా  నంగా కప్పా పఖ్చాడే   , 2014లో సువాస్  నాంగ్ మతాంగ్ “, 2014లోనే కున్దోఘ్ భం పల్లె ఫామ్ “, 2017లో పబ్బన్ కుమార్  లోక్టక్ లాయిరెంబీ  లాంటి సినిమాలు తీసి పలు అంతర్జాతీయ అవార్డులు గుర్తింపులూ సాధించారు.

  ఇట్లా అనేక రాజకీయ ఆర్థిక కారణాల వల్ల ఆటంకాలక గురయింది ఆ రాష్ట్ర సినిమా రంగం.  మరో వైపు ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం అందక మణిపుర్ సినిమా అష్టకష్టాలు ఎదుర్కొంటున్నది. అయినా మనుగడ సాగీస్తూనే వున్నది. ప్రభుత్వాలనుంచి ఇతోధిక ప్రోత్సాహం తో పాటు స్థానిక నిర్మాతల ప్రోత్సాహం కూడా తోడయితే మణిపుర్ సినిమా తన రాష్ట్ర సాంస్కృతిక నేపథ్యం లోంచి మరెంతో ఎదిగేందుకు అవకాశం వుందని చెప్పుకోవచ్చు. అక్కడ సినిమా ఎదగడంతో పాటు మణిపూర్ టూరిజం పెరుగుతుంది. యువతకు, కళాకారులకు పేరూ  గుర్తింపుతోపాటు జీవన భృతి అవకాశాలూ పెరుగుతాయి.

     మణిపూర్ సినిమా శతాబ్ది సంవత్సరమయిన 2020 వరకయినా పరిస్తితి మెరుగు పడుతుందని ఆశించ వచ్చు.

-వారాల ఆనంద్

7753942f-3cf9-449b-a969-be18a856405e

64036023-673a-409a-afab-3acbc14e2cf1

” జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం “

Posted on

” జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం “

      ఎలాంటి మొహమాటాలూ ఆటంకాలూ లేని స్వచ్చమయిన చిరునవ్వుతో అమాయకత్వంనిండిన బాలలతో రెండు గంటలు కలిసే అవకాశం నిజంగా ఆరోజుకే కాదు కొన్నాళ్లపాటు గొప్ప టానిక్. అదికూడా వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడిస్తూ బాలల్లోని సృజనాత్మకతను ఆస్వాదిస్తూ గడపడం గొప్ప అనుభూతి. అలాంటి స్థితికి ఇవ్వాళ లోనయ్యాను. ప్రిమరీ స్థాయి బాలల కోసం ఒక స్కూల్లో ఫిలిమ్ క్లబ్ ఏర్పాటు కావడం దాన్ని ప్రారంభించే అవకాశం కలగడం నాకయితే గొప్ప అవకాశమే కాదు గొప్ప గౌరవం కూడా.

     కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం లోని బూరుగుపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల కోసం వారి సృజనాత్మకతను పెంపొందించే కృషిలో భాగంగా ఫిల్మ్ క్లబ్ ఏర్పాటయింది. ఆ సందర్భంగా పిల్లలతో మాట్లాడుతూ వుంటే వాళ్ళ పరిశీలనా శక్తి, ఊహా లోకం, నిర్మలంగా వ్యక్తీకరించే తత్వం చూస్తే అసలయిన మనిషితనం వాళ్ళల్లో వుందనిపించింది.  బాలల రామాయణం సినిమాలో అబద్దాలు ఆడని రాముడు నచ్చాడని, బాహుబలిలో ఎప్పుడయినా  హింసపెట్టేవాడు హింసకె బలవుతాడనేది అర్థమయింది అని వాళ్ళన్నప్పుడు  మల్లెపువ్వుల్లాంటి మనసులున్న పిల్లలు మంచిని ఎంత అద్భుతంగా స్వీకరిస్తారో కదా అనిపించింది. పెద్దవాళ్ళమే తెల్లని ఆ పలకలమీద పిచ్చిగీతలు గీస్తున్నామని మరోసారి అర్థమయింది.

     ఆ పాఠశాల ప్రారంభమయి 60ఏళ్ళు నిండిన తరుణంలో పిల్లలకోసం మంచి సినిమాలు చూపించాలనే కృషిని మొదలు పెట్టిన అధ్యాపకులను అభినందించాలి. వారికి ప్రోత్సాహంగా ముందు నిలిచిన ప్రధానోపాధ్యాయుడు వి. లక్ష్మణ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించాలి. సినిమా చూపించడమే కాకుండా “వ్యూ-రివ్యూ “ పేర సినిమాల పైన వారి భావాల్నివాళ్ళ భాషలోనే రాయించి వ్యక్తీకరించే శక్తిని పెంపోదించాలని సూచించాను.

  అదే దారిలో మరిన్ని స్కూళ్ళు ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను. నావంతుగా పిల్లలకోసం   మంచి సినిమాల్ని సూచించడమే కాదు కొన్నింటిని అందజేస్తాను కూడా

IMG_20180109_150457 (1)IMG_20180109_150553IMG-20180109-WA0014

‘తెలంగాణ సినిమా దశ దిశ’ ఆవిష్కరణ

Posted on

వారాల ఆనంద్ రచించిన ‘తెలంగాణ సినిమా దశ దిశ’ ఆవిష్కరణ

– ఆవిష్కరించిన మంత్రి కె.టి.ఆర్.

 123452920F71-DCFD-4E16-9C0A-A3519015F4C8            సినిమా అద్బుతమయిన మాధ్యమం, ప్రభావంతమయిన మాధ్యమం ఆ మధ్యమంపైన సాంకేతికపరంగానూ యువత ఎంతో కృషి చేయాల్సిన అవసరం వుందని రాష్ట్ర ఐ.టి మరియు పట్టణాభివృధ్ధి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు అన్నారు. శుక్రవారం రోజున ప్రముఖ కవి, సినీ విమర్హ్శకుడు వారాల ఆనంద్ రచించిన తెలంగాణ సినిమా దశ దిశ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన సినిమా రంగం విశ్లేషణా రంగం లో వారాల ఆనంద్ చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమమలో శాసన మండలి సభ్యుడు సినీ నిర్మాత నారదాసు లక్ష్మణ్ రావు, ప్రముఖ కవి వఝల శివకుమార్, జి.వి. రామకృష్ణ రావు, వుప్పుల బాల రాజు, వారాల అన్వేష్, ఫోక్ ఆర్ట్స్ అకాడెమీ కృపాదానం, జెడ్.పి.టీసీ సిద్దం వేణు తదితరులు పాల్గొన్నారు