literary criticism

ఆయన చరణాలు ఎక్కుపెట్టిన ఆయుధాలు

Posted on Updated on

రావికంటి రామయ్య 

                మన రాష్ట్రం, మన భాష, మన సాహిత్యం అన్న నినాదంతో  తెలంగాణ సాహితీ వేత్తలకు పెద్ద పీట వేసి తెలుగు సాహితీ క్షేత్రం లో తెలంగాణ సాహితీ వేత్తల ప్రతిభా విశేషాలు తెరపైకి  వచ్చిన సందర్భమిది.   ఆ క్రమంలో మరుగున పడ్డ కవులూ రచయితలూ వెలుగులోకి వచ్చి తెలుగు సాహిత్యంలో తెలంగాణ పాలు ఎంత?    తెలుగు సాహిత్య అభివృధ్ధికి తెలంగాణ సాహిత్యం  చేసిన దోహదం ఎంత అన్నది నిర్ధారించుకుంటున్న  సమయమిది.  ఈ నేపధ్యంలో తెలుగు  సాహిత్యానికి కరీంనగర్  జిల్లా అందించిన సాహిత్యం, aa ప్రాంత  సాహిత్యకారులు అందించిన సాహిత్యం తక్కువేమీ కాదు. అటు ప్రాచీన సాహిత్య ఒరవడిలో సాగిన పద్య సాహిత్య సృజనలో నయినా ఇటు ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో నయినా కరీంనగర్ జిల్లా పాత్ర గణనీయమయింది.  అందులో మంథని ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యం విశిష్టమయిన డి గా చెప్పుకోవచ్చు. సనాతన బ్రాహ్మణ కుటుంబాల నేపధ్యం వున్న ప్రాంతమయిన మంథని గోదావరి నదీ తీరం కావడం ఆ ప్రాంతానికి బలం. శాస్త్రీయ సంగీతానికీ సాహిత్యానికి కూడా మంథని వేదికగా నిలిచింది.

               ఆ క్రమంలో మంథని నుంచి  స్మరించుకోవాల్సిన కవి రావికంటి రామయ్య. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ ఎలాంటి గుర్తింపునకూ నోచుకోని  రావికంటి రామయ్య రచనని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలో మూడవ పాఠం లో పొందుపరిచారు. మంథని కవికి అందిన అపురూప గౌరవమది.

              తెలంగాణలో ఓ మారు మూల గోదావరి నది వుడ్డున వున్న గ్రామం మంథని. అదే గ్రామానికి మంత్రకూటమి ఆన్న పెరూ వున్నది. మంథని సనాతన సంస్కృతికి, సాహితీ సాంస్కృతిక  అంశాలకు ప్రసిద్ది. అలాంటి గ్రామంలో ప్రగతి శీలతకు, ఆధునిక భావాలకు ప్రతినిధి గా నిలిచిన విస్మృత కవి రావికంటి రామయ్య.    శతకాలు, గేయాలు, గొల్ల సుద్దులు, ఏకాంకికలు, బుర్రకథలు ఇలా ఒకటేమిటి అనేక సాహితి ప్రక్రియల్లో రచనలు చేసిన విశిష్ట మయిన కవి ఆయన.  నిత్యం సమాజం లో జరుగుతున్న అనేక విషయాలపయిన స్పందించి, ఆందోళన చెంది, ఎంతో ఆవేదనతో సూటిగా నిర్మొహమాటంగా  వాస్తవాల్ని ఆవిష్కరిస్తూ రచనలు చేశారు.

 ‘ కల్ల గాదు రావికంటి మాట’ అన్న మకుటం తో ఆయన రాసిన రచనలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. 

  ‘బాధ జెంద గోవు పాలనే ఇచ్చు

ముక్కలయిన చెరుకు చెక్కరిచ్చు

అట్టి గుణము నరుల కలవడే డెప్పుడో

కల్ల గాదు రావికంటి మాట

 అంటూ వర్తమాన సమాజంలో మనుషుల్లో స్వార్థం, అవినీతి లాంటి లక్షణాలు పెరిగిపోతున్న వాస్తవాన్ని రావికంటి రామయ్య తన పద్యం లో చెప్పాడు. నలిగి పోతూ కూడా గోవు, చేరకు పాలనూ తీపి నీ  ఇస్తాయి అలాంటి సద్గుణం మనిషికి ఎప్పుడు కలుగుతుందో అనే ఆయన ఆవేదన చెందుతాడు.

‘విలువలు మరిచిపోయి విహరించుటెన్నాళ్లు,

కల్తీ రహిత జగము కంపించుటెన్నడో

దైవమయిన నేడు డబ్బుకు దాసుడే

మనుషుల్లో మానవీయ విలువలు మృగ్యమయి పోతున్నాయని, వస్తువుల్లోనూ మనుషుల మనసుల్లోనూ కల్తీ పెరిగి పోతున్నదని, చివరికి దేవుడు కూడా డబ్బుకు దాసోహమయి పోతున్నాడని ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని కవితల్లో రాశాడు. ఆయన రాసిన అనేక చరణాలు సూటిగా ఎక్కు పెట్టిన ఆయుధాల్లా మన ముందు నిలబడతాయి.

      తెలుగు సాహితీ రంగంలో శతకాలు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రక్రియ, ఇవ్వాళ కూడా తెలంగాణ లోని ప్రతి గ్రామంలోనూ శతకాలు రాసిన కవులు మనకు కనిపిస్తారు. వాటిల్లో అధిక శాతం ఆధునిక సామాజిక అంశాల్ని తీసుకుని రాసినవి కనిపించడం తెలంగాణ కవుల చైతన్యానికి ప్రతీకగా చెప్పు కోవచ్చు. అట్లా ఉత్తమ భావాలతో సామాజిక అంశాలతో  

శతక రచన చేసిన గొప్ప కవి రావికంటి రామయ్య. ఆయన రచనల్లో నగ్న సత్యాలు, గీతామృతం, వరద గోదావరి, వాసవి గీత, శ్రీ గౌతమేశ్వరా శతకం , నల్లాల భాగోతం, రామ గుండం రాత్రిగండం , గొల్లసుద్దులు లాంటివి ప్రముఖ మయినవి.  రామయ్య గారి ‘నగ్న సత్యాలు” శతకం వర్తమాన సామాజిక దర్పణం. ఈ శతకం లోని పద్యాలు వేటికవే సమగ్రమయినవి , అందమయినవి, ఆకట్టుకునేవి. సమాజంలోని లోపాల్ని ఎత్తి చూపి వాటిపై కవి కొరడా జలిపించిన తీరు గొప్పగా వుంటుంది.  ఇందులో విద్యార్థులు, పాఠశాలలు, బస్సులు, రైళ్లు, క్యూలు, ఓట్లు వంటి అనెక అంశాల్ని నిశితంగా పరిశీలిస్తూ వాటిల్లోని వాస్తవాల్ని మన కళ్ళముందుంచుతాడు రామయ్య.

        ‘ కల్ల  గాదు  రావికంటి మాట’ అన్న మకుటంతో రాసిన నగ్న సత్యాలు రచన లో 108 పద్యాలతో పాటు ‘ సారా శూర సంహారం’ కూడా చేర్చారు. ఆటవెలదిలో సాగిన ఈ పద్యాలల్లో ఆలతి ఆలతి మాటలే కనిపిస్తాయి. పదాడంబరం మచ్చుకయినా కనిపించదు.  ఆయన రాసిన గౌతమేశ్వర శతకం గోదావరి ఒడ్డున మంథని లోని గౌతమేశ్వరును గురించి రాసింది కాగా ‘నల్లాల భాగోతం’, ‘ రామ గుండం రాత్రి గండం ‘ లాంటి రచనలు సామాజికాంశాల పైన రాసినవే.

       అవే కాకుండా ఆ యా సందర్భాలల్లో రామయ్య రాసిన కవితలు తెలంగాణ ఉనికిని తెలంగాణాకు సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాల్నీ వివరిస్తూనే వలస వాదుల దాష్టీకాన్ని ఎండగట్టాడు.

    2003లో గోదావరికి పుష్కరాలు వచ్చినప్పుడు

‘ఒక్క రాజమండ్రి కేన పుష్కరాలు

తక్కిన క్షేత్రాలన్నీ నిష్ఫలాలా ?

ధర్మపురి ,మంథెన్న, కాళేశ్వరం

పంచవటి పర్ణశాల భద్రాచలం,

ఎన్నో క్షేత్రాలున్నవి ఎంలాభం

అడ్డు కొనేటి  వాడేడి అడిగేటి  వాడేడి ?’

లాంటి తన రచనల ద్వారా నిలదీసిన కవి రావికంటి రామయ్య. ఆయనకు  ‘మంత్రకూట వేమన’ అన్న బిరుదూ  వుంది. అంతే కాదు కవిరత్న, ఆర్.ఎం.పి.9 రెడీ మేడ్ పోయేట్) అన్న బిరుదులూ వున్నాయి.

                 1936 లో జూన్ 17 న జన్మించి నలభయి ఏండ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన రావికంటి రామయ్య జీవితంలో అధ్యాపకత్వం సాహిత్యం అంతఃర్ భాగ మయి పోయాయి.  మంథని నుండి సాహిత్యంలో ఎదిగిన అనేక మంది కవులకూ రచయితలకూ ఆయన స్పూర్తి నిచ్చిన వాడు. ఎప్పుడు ఎక్కడ కవిసమ్మేళన మయినా రావికంటి రామయ్య పఠనం లేకుండా ముగిసేది కాదు. అత్యంత సీదా సాద  జీవితాన్ని గడిపిన రావికంటి రామయ్య ఆలతి ఆలతి పదాల్లో రాసిన రచనలు సామాన్యుడికి కూడా అర్థంయి మనస్సుకు హత్తుకునే విధంగా వుంటాయి. తెలుగుతో పాటు ఉర్దూలో కూడా మంచి ప్రవేశమున్న ఆయన పిల్లల్లో పిల్లవాడిగా, కవుల్లో కవిగా సులభంగా కలిసి పోయి  అందరితో ఆత్మీయంగా మెలిగే వాడు. ఆయన 30-3-2009 లో పరమ పదించారు.

           సులభ శైలి లో రాసి  మన్ననలు పొందిన రావికంటి రామయ్య రచన లు ఇన్నేళ్లకు స్వతంత్ర తెలంగాణలో వెలుగు చూడడం పాఠ్య పుస్తకాల్లో  చోటు లభించడం గొప్ప గౌరవంగా భావించాలి.

        అంతేకాదు కవుల్ని గౌరవించుకునే పద్దతిలో కరీంనగర్ ప్రాంతానికి ఒక విశిష్టత వుంది. ఇక్కడ కవుల్ని కేవలం సభలతో అవార్డులతో మాత్రమే గుర్హుంచు కోకుండా పలువురు కవులకు విగ్రహాలు నెలకొల్పి చిరస్థాయిగా వారిని స్మరించుకునే సాంప్రదాయం వుంది. aa క్రమంలో జగిత్యాల లో అలిశేట్టి ప్రభాకర్ విగ్రహం, గుండారెడ్డిపల్లె లో వరకవి సిద్దప్ప విగ్రహం, కరీంనగర్లో ముద్దసాని రాం రెడ్డి విగ్రహం, జగిత్యాల రాఘవపట్టణం లో రామసింహ కవి విగ్రహం ఏర్పాటు చేసారు. ఇట్లా కవులకు సాహితీకారులకు విగ్రహాలు పెట్టిన సంస్కృతి అతి కొద్దిప్రాంతాల్లో చూస్తాం. అదే క్రమంలో మంథని వాసులు రావికంటి రామయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమయిన కూడలిలో ఆయన స్మృతిగా ఏర్పాటవుతున్న విగ్రహం ఓ గొప్ప కవికి అందుతున్న విశిష్టమయిన గౌరవంగా చెప్పుకోవాలి.

       మన కవుల్ని కళాకారుల్ని మనం గౌరవించుకునే సంస్కృతిని కొనసాగిస్తున్న మంథని వాసుల్ని విగ్రహ ప్రతిష్ట కమిటీని హృదయపూర్వకంగా అభినందించాలి.

     మంత్రకూట వేమనగా ప్రసిద్దిచెందిన రావికంటి రామయ్య గారి సృజనకు, స్మృతికి తల వంచి నివాళి అర్పిస్తున్నాను.  

-వారాల ఆనంద్  

Layout 1Layout 1Layout 1

Advertisements

నవలా మణి యద్దనపూడి సులోచనా రాణి

Posted on Updated on

పాపులర్ నవలా మణి యద్దనపూడి సులోచనా రాణి

ప్రముఖ నవలా రచయిత్రి అయిదు దశాబ్దాలకు పైగా తెలుగు పాఠకలోకాన్ని ఆకట్టుకొని ఒక స్థాయిలో ఉర్రూతలూగించిన యాదంపూడి సులోచనా రాణి మరణం ఆమె అభిమానుల్ని తీవ్రమయిన దుఖానికి గురుచేసింది.ఆమె నిష్క్రమణంతో తెలుగు ప్రధానస్రవంతి నవలా ప్రపంచం ఒక ప్రతిభామూర్తిని కోల్పోయింది. నిజానికి పాపులర్ నవలా సాహిత్యానికి ఇకానిక్ చిహ్నం లాంటి రచయిత్రిని తెలుగు పాపులర్ సాహిత్యం కోల్పోయిందనే చెప్పుకోవచ్చు.

సాహిత్య సృజన ఎప్పుడుకూడా రెండు ప్రధాన పాయలుగా సాగుతుంది. ఒకటి సాహితీ విలువలతో సామాజిక అంశాల్ని సంక్షోభాల్ని, వ్యక్తిగత జీవితాల్లోని సంక్లిష్టతలని, రాజకీయ ఆర్ధిక సామాజిక అంశాల్ని స్పృశిస్తూ సీరియస్ సాహిత్యంగా వెలువడుతుంది. అది సమాజంలో పొరలు పొరలుగా వున్న అనేక అంశాల్ని పట్టించుకకొని సమాజానికి, వ్యక్తులకు దిశా నిర్దేశం చేసే రీతిలో సాగుతుంది.  మరో పాయగా సాగే సాహిత్యం  సాధారణ ఉపరితల అంశాల్ని స్పృశిస్తూ చదువరుల్ని సమ్మోహన పరిచి ప్రాచుర్యం పొందుతుంది. aa రచనలు అధిక సంఖ్యలో అమ్ముడయి విజయవంతమయిన రచనలుగా పేరుతె చ్చుకుంటాయి ఆ సాహిత్యాన్ని  ప్రధాన స్రవంతి సాహిత్యం గా చెప్పుకోవచ్చు. ఈ నేపధ్యం లో చూసినప్పుడు యద్దనపూడి సులోచనారాణి రచనలన్నీ ప్రధాన స్రవంతికి చెందిన పాపులర్ నవలలుగానే చెప్పుకోవాలి. తెలుగు పాపులర్ నవలల్లో శిఖరాయమానమయిన నవలల్ని ఆమె రాసారు. సెక్రెటరీ, జీవనతరంగాలు, మీనా లాంటివి ఆ  కోవలోకి వస్తాయి.

యద్దనపూడి పాపులర్ సాహిత్యమే రాసినప్పటికీ రచయిత్రిగా ఆమె తెలుగు సాహిత్యం మీదా తెలుగు పాఠకులమీదా అమితప్రభావాన్ని చూపించింది. ఆమె ప్రధానంగా ప్రేమ, కుటుంబ సంబంధాలనే తన కథాంశాలుగా తీసుకున్నట్టు కనిపించినప్పటికీ స్త్రీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసారు. స్త్రీ పాత్రలకు తమదయిన ఒక సజీవ లక్షణాన్ని కల్పించే కృషి చేసారు. ఆమె ప్రత్యేక స్త్రీ వాదిగా కాకుండా, వైద్యవృత్తిలో ఫిజీషియన్ గా అన్నింశాల్నీ స్పృశించే యత్నం చేసారు. ఇంపాలా కారుండి ఆరడుగుల అందగాడయిన కథానాయకుడు, పొగరుగా కనిపించే  కథానాయికల కథల్ని చెబుతూనే వ్యక్తిత్వమున్న కథానాయిక పాత్రలనూ ఆమె ఆవిష్కరించారు.

యద్దనపూడి రచనల్లో ప్రధానమయిన లక్షణం ఆమె రచనా శైలి. సరళమయిన వాక్యాలూ, మంచి సంభాషణా శైలి ఆమె సొంతం. యద్దనపూడి తమ నవలల్లో వర్ణనల కంటే ప్రధానంగా సంభాషనలకే అధిక ప్రాధాన్యత నివ్వడంతో ఆమె రచనల్లో చదివించే గుణం హెచ్చుగా వుండి ఆమె నవలలు పాఠకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా తెలుగు పాఠకుల సంఖ్య అమితంగా పెరగడానికి ఆమె రచనలు ఎంతగానో దోహదపడ్డాయి. అప్పటికి తెలుగు సమాజానికి రాగోర్,శరత్, ప్రేమ చంద్ లాంటి ఇతర భాషా రచయితల రచనల పరిచయం మాత్రమే అధికంగా ఉండింది. తెలుగులో చలం, నోరి, విశ్వనాథ లాంటి వారి నవలలు మాత్రమే తెలుసు. కాని అవి కేవలం కొద్ది మంది ఉన్నత వర్గాలవారికి మాత్రమే అందుబాటులో ఉండేయి. సరిగ్గా అదే కాలంలో పారిశ్రామిక అభివృద్ది ఉద్యోగకల్పన పెరిగి పోవడంతో అధిక శాతం కుటుంబాలు ఉద్యోగరీత్యా పట్టణాలకు, నగరాలకు చేరుకోవడం ఆరంభించాయి. సమాజంలో అప్పుడప్పుడే స్త్రీల చదువు పట్ల అవగాహన పెరగడం మొదలయింది. దాంతో మధ్యతరగతి మహిళల్లో చదువుకున్న వారి  సంఖ్య పెరగుతూ వచ్చింది. స్త్రీలు తమ పెళ్ళిళ్ళ తర్వాత  భర్తలు ఉద్యోగ  ఉపాధి రంగాల్లో ఉండిపోవడం స్త్రీలు అధికంగా ఇంటికే ముఖ్యంగా వంటింటికే పరిమితమయి పోయి ఉండడంతో వారి జీవితాల్లో ఒక వ్యాక్యూం ఏర్పడింది. వారి ఆ  ఖాళీ సమయాల్ని పాపు లర్ నవలలు ఆక్రమించాయి. సరిగ్గా అప్పుడే ఆంగ్ల సాహిత్య ప్రభావం, పత్రికల ప్రచురణ పెరగడం తో కొత్త రచనలకు సీరియళ్ళకు స్పేస్ దొరకడం ఆరంభమయింది. అట్లా మధ్యతరగతి ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలల్లో చదివే ఆసక్తి పెరగడం మొదలయింది. అప్పటికి వారికి  వినోద కాలక్షేపాలకు కేవలం వున్న కొద్దిపాటి సినిమా మాత్రమే అందుబాటులో వుండేది. అది మధ్యతరగతి పూర్తి ఖాళీ సమయాన్ని ఆక్రమించ లేకపోయింది. ఆ స్పేస్ ని పాపులర్ నవలలు ఆక్రమించాయి. దాంతో కొత్త పాఠకుల సంఖ్య వేపరీతంగా పెరిగింది. అట్లా పెరగడానికి కారణమయిన రచనల్లో యద్దనపూడి రచనలు ప్రధాన పాత్రను  పోషించయనే చెప్పుకోవచ్చు. ఆమె రచనలు మధ్యతరగతి స్త్రీలల్లో చదివే ఆసక్తిని పెంచడంతో పాటు వారు తమలో తామే ముడుచుకొని వుండిపోకుండా కలల్నికనే  ఒక అవకాశాన్ని ఆమె నవలలు కల్పించాయి. దాంతో మధ్య తరగతి ప్రజాజీవితంలో పాపులర్ నవలలు ప్రధాన మయిన భాగం అయిపోయాయి. ఇక పత్రికలు సీరియల్స్ ఒరవడిని మొదలు పెట్టి వారం వారం పాఠకుల్లో ఆసక్తిని ఉత్కంఠతని పెంచిపోశించాయి. దాంతో ఆ  తరంలో పాఠకులు వారపత్రికల్లోంచి సిరియల్ పేజీలని చింపుకొని బైండింగ్ చేసుకొని రాకుల్లో బధ్రపరుచుకొనే అలవాటునూ చేసింది. అట్లా పాపులర్ నవలలు సాధారణ మధ్యతరగతి జన జీవితాల్లోకి చేరుకున్నాయి. ఈ మొత్తం క్రమంలో యద్దనపూడి సులోచనా రాణి నవలలు ప్రధాన భూమికను పోషించాయి. మొదట కథా రచయిత్రిగానే ఆరంభమయిన యద్దనపూడి ‘జ్యోతి’ పత్రిక ఆరంభించినప్పుడు బాపు రమణల ప్రోత్సాహంతో పెద్ద కథగా మొదలుపెట్టిన ‘సెక్రెటరీ’ నవల రూపొందింది. అది గొప్ప విజయం సాధించడంతో ఆమె నవలా రచననే కొనసాగించారు.

యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలం లోని కాజ గ్రామములో జన్మించారు. ఆమె తొలి కథ 1956 లో ఆంధ్రపత్రికలో అచ్చయింది. తర్వాత ‘సెక్రెటరీ’ నవల తో ఆరంభమయిన ఆమె నవలా రచన దశాబ్దాలపాటు కొన సాగింది. 196౦-70 దశకాల్లో ఆమె నవలారచయిత్రిగా ఆర్జించిన పేరు సంపాదించుకొన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. మధ్యతరగతి స్త్రీ జీవితాల్లో ఆమె ఒక ఐకానిక్ రచయిత్రిగా మిగిలిపోయారు. ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్ రాసే సంభాషణల శైలి తన కిష్టమని చెప్పుకున్న ఆమె తనకు అల్ఫ్రెడ్ హిచకాక్ సస్పెన్స్ సినిమాలన్న అభిమానమని చెప్పుకున్నారు. ఆమె జీవిత కాలమంతా ఎక్కడా స్వోత్కర్షకు, పర నిందకూ పాల్పడినట్టు కనిపించదు. తనకు వచ్చిన పేరు ప్రతిష్టల వెనుక తమ కుటుంబము, ప్రచురనకర్తలూ, చివరికి అక్షరాల్ని కంపోస్ చేసిన కార్మికుల కృషీ వుందని ఆమె ఒక ఇంటర్వ్యు లో చెప్పుకున్నారు.

ఇక యద్దనపూడి రచనా శైలిలో ఇంకో ప్రధానమయిన లక్షణం దృశ్యీకరణ. ఆమె రచనల్లో ప్రదానగా సినిమాలకు పనికొచ్చే స్క్రిప్టింగ్ స్టైల్ కనిపిస్తుంది. ఎపిసోడ్ లు ఎపిసోడ్ లుగా ఆమె రచనలు సినిమాల సీన్లకు సరిగ్గా సరిపోయేట్టుగా వుంటాయి దాంతో ఆమె నవలలు సినిమాలుగా రూపాంతరీకరణ చేసేందుకు సరిగ్గా సరిపోయాయి. ఫలితంగా ఆమె నవలల్లో ౧౭కు పైగా నవలలు సినిమాలుగా నిర్మాణ మయ్యాయి. అప్పటి సినిమాల కథానాయకులు అక్కినేని నాగేశ్వర్ రావు, శోభన్ బాబు లాంటి ఎంతో మంది కి ఆమె రచనలు గొప్ప విజయాల్ని సాదించి పెట్టాయి.  మీనా , జీవన రంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్రబంధం, జై జవాన్, ఆత్మ గౌరవం లాంటివి తెలుగు సినిమా లు గా రూపొందాయి.

ఇక ఆమె రాసిన నవలల్లో -ఆగమనం.ఆరాధన.ఆత్మీయులు.అభిజాత.అభిశాపం.అగ్నిపూలు.ఆహుతి.అమర హృదయం.అమృతధార.అనురాగ గంగ.అనురాగతోరణం,అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, ఋతువులు నవ్వాయి, కలలకౌగిలి, కీర్తికిరీటాలు, కృష్ణలోహిత,గిరిజా కళ్యాణం, చీకటిలో చిరుదీపం, జీవన సౌరభం,జాహ్నవి, దాంపత్యవనం, నిశాంత, ప్రేమ,ప్రేమదీపిక,ప్రేమపీఠం,బహుమతి,బందీ,బంగారు కలలు,మనోభిరామం,మౌనతరంగాలు,మౌన పోరాటం,మౌనభాష్యం,మోహిత, వెన్నెల్లో మల్లిక,విజేత,శ్వేత గులాబి,సెక్రటరీ,సౌగంధి,సుకుమారి తదితరాలున్నాయి. ఇంకా యద్దనపూడి రచనలు టీవీల్లో కూడా సీరియళ్లుగా వచ్చాయి.

ఇక తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు భర్త అనారోగ్యం తర్వాత ఆయన మృతి యద్దనపూడి జీవితం పైన తీవ్రమయిన ప్రభావాన్ని చూపించాయి. తన రచనా జీవితం నుండి ఎడం అయేందుకు దోహదం చేసాయి. కాని ఆమె క్రమంగా తన జీవితాన్ని కొత్త కోణం వైపునకు మరల్చుకున్నాయి. తనకు పేరు ప్రతిష్టలు గౌరవాలు సుఖాలు, గౌరవాలూ పొందిన నేను పేదవారికి ఏమయినా చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె విమెన్ in నీద అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. గొప్ప సేవ చేసారు కాని అందులో ఆమె ఓటమినే చవిచూశారు. కాని యద్దనపూడి సులోచనా రాణి దశాబ్దం క్రితం ఒక పత్రిక కిచ్చిన ఇంటర్వ్యులో ఇట్లా చెప్పుకున్నారు

‘ సేవ విషయంలో నేను తప్పు చేశాను. అది ప్రారంభించే ముందు, నా శక్తి ఎంత… నాలాంటి భావసారూప్యత గల వారు నాకు తోడుగా ఉన్నారా లేదా… అని ఆలోచన చేయలేదు- అది నా ఫెయిల్యూర్‌! ఒకటి మాత్రం నాలో బలీయంగా ఉంది. నేనెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో డబ్బు పోగొట్టుకుంటే, కుంగిపోతూ కూర్చోను. ‘‘అది నేను సంపాయించలేదు. అది నాది కాదు’’ అని మానసికంగా చేతులు దులిపేసుకుంటాను. ఉన్నదాంతో ఆనందంగా, సంతృప్తిగా బతకటం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు కాబట్టి ఆ ఇబ్బందులేవీ నన్ను ఎక్కువసేపు బాధ పెట్టలేవు. వాటికి ఎదురు తిరుగుతాను. జీవితంలో ఎక్కడైనా, ఏ విషయంలోనైనా, ఒక కోణం మూసుకుపోతే మీరు దిశ మార్చుకోండి! ఇంకో కొత్త కోణం జీవితంలో మీ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది. అన్నింటికంటే, మన జీవితం మనకి ముఖ్యమైనది. మన జీవితాన్ని మనం ప్రేమించాలి. అప్పుడు జీవితం కూడా తప్పక మనకి ప్రేమని పంచుతుంది. నిరాశ, నిస్పృహలతో కళ్లు మూసేసుకుని, మోకాళ్ల మధ్య తల దూర్చేసుకుని, కుంగిపోయి కూర్చుంటే చీకటి తప్ప ఇంకేం కన్పించదు. జీవితంలో మీ దగ్గరకి వచ్చే ఆనందాలు రావు. అవి నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లిపోతాయి.”

అంత స్పష్టమయిన అభిప్రాయాలతో ధీరవనితగా నిల దొక్కుకున్న ఆమె తన జీవిత కాలంలో telugu పాపులర్ నవలా సాహిత్యానికి అందించిన నవలలు గొప్ప ప్రజాదరణను పొందడమే కాకుండా ఎంతో మంది మహిళల్ని రచన రంగం వైపునకు ప్రోత్సహించాయి. ఆమె జీవన గమనం కూడా సేవా రంగంలో విశేషమయింది.

-వారాల ఆనంద్

ghgh

 

 

 

‘అక్షరాల చెలిమె’

Posted on

మిత్రులారా, నేటి మనతెలంగాణ దినపత్రిక ‘హరివిల్లు’ లో ‘అక్షరాల చెలిమె’ సమీక్ష. డాక్టర్ పల్లేరు గారికి కృతజ్ఞతలు

ee8d3347-5a71-471a-ac6c-c5388a02904b

“వెర్రి మానవుడు”

Posted on

ప్రతిభావంతమయిన అనువాదం “వెర్రి మానవుడు”

కవిగా తాత్వికునిగా ఖలీల్ జీబ్రాన్ పాఠకుల రక్త నాళాల్లో ప్రవహించి హృదయపు పొరల్లోకి దిగిపోతాడు. కనిపించని వినిపించని ఒక దుఖ పొరను కప్పెస్తాడు. జీబ్రాన్ను చదవడమే మనసులోపల్నుంచీ ఒక కదిలిక. ఆలతి ఆలతి మాటల్తో జీవన సూత్రాల్ని ఆవిష్కరించిన జీబ్రాన్ మనిషి గురించి ప్రేమ గురించి స్నేహం గురించి సమస్త జీవన అనుభవాల గురించి ప్రస్తావిస్తాడు. మనుషుల మధ్యన వుండే అనుభందాల్ని స్వాభావిక లక్షణాల్ని ఆవిష్కరిస్తాడు. మనిషికీ మనసుకీ మనిషికీ లోకానికీ వున్న అంతర్లయని ఆలవోకగా పలికిస్తాడు. జీబ్రాన్ రచనల నిండా విస్తరించి సాగే తాత్వికత పాఠకుల్ని అనుభూతింప జేస్తూ ఆలోచింప చేస్తుంది. తమని తాము అద్దంలో చూసుకునేట్టుగా చేస్తుంది. జీబ్రాన్ రాసిన పంక్తుల్లో అలలు అలలుగా సాగే కవిత్వం ఆయన్ని విశ్వ కవిని చేసింది. ఆయనలో సాగే కవితా ధార, ఉప్పొంగే వూహల ప్రపంచం ఎంతో ఉన్నత మయింది. ఖలీల్ భావాల సవ్వడి హృదయ తరంగాలకు సొగసులు అబ్బుతుంది.జీబ్రాన్ భావావిష్కర్ణ చేసిన భాష ఎంతో అందంయింది. ఆయన భాష మోసిన భావ లయ ఉన్నతమయింది.

ఖలీల్ జీబ్రాన్ రచనల్లో లభిస్తున్న వాటిలో ప్రవక్త (ద ప్రాఫెట్) అత్యంత ప్రసిద్దమయింది. ప్రపంచ భాషల్లోకి అనేక సార్లు అనువాదమయి అత్యంత ప్రభావ వంత మయిన కవితాత్మక వ్యాస సంపుటిగా నిలిచింది. ప్రజా కవి కాళోజీ తో సహా పలువురు ప్రవక్త ను తెలుగులోకి అనువదించారు. పెళ్లి పిల్లలు, సుఖ దుఖాలు, కాలమూ, మంచీ చేడూ, అందమూ, శృంగార సౌఖ్యమూ, మతమూ, మృత్యువూ ఇలా అనేక మానవానుభూతుల తాత్విక లోతుల్ని స్పృశించిన ప్రవక్త లో జీబ్రాన్ వీడ్కోలు అంకం లో ఇట్లా అంటాడు…

“కొద్దిగా ఆగండి

గాలి ఊయల మీద కొద్దిగా విశ్రమించ నీయండి

మరో స్త్రీ గర్భంలో నేను ఉదయిస్తాను‘’

కానీ ఇప్పటికీ జీబ్రాన్ పాఠకుల హృదయాల్లో ఉదయించే వున్నాడు.

ఖలీల్ జీబ్రాన్ తన తొలి సృజన కాలంలో రాసిన కవితలు, కథలు, కవితాత్మక కవితలు 1918 లో మొట్టమొదటిసారిగా ‘” MADMAN “ పేర వెలువడింది. అందులో చిన్నవీ పెద్దవీ 35 రచన లున్నాయి. అవి ఈబుక్ లో చదివీ చదవంగానే కవీ పండితుడూ, గొప్ప వక్త, నాకు అత్యంత ఆత్మీయుడయిన డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు తెలుగులో అనుస్ర్రుజనకు పూనుకుని “వెర్రి మానవుడు “” పేర చక చక పూర్తి చేసి చదవండి అని ఇచ్చారు. ఏకబిగిన చదివాను. త్రిల్ గా ఫీలయ్యాను. అప్పటికే Madman మరో అనువాదాన్ని చదివున్నప్పటికీ లక్షమన్ రావు గారి అనువాద సరళి అందులో కనిపించిన ప్రవాహ లక్షణమూ అమితంగా ఆకర్షించాయి. “”Madman“” ను లక్ష్మణ్ రావు గారు వెర్రిమానవుడు అనడంలోనే గొప్పతాత్వికత వుంది.

మూలం నుంచి స్వేచ్ఛగా సరళంగా ఆయన చేసిన అనువాదం జీబ్రాన్ భావ పరంపరను గొప్పగా అక్షరీకరించింది.

ఖలీల్ జీబ్రాన్ భూమిక తాత్వికత, బలం ఆయన లోని కవితాత్మకత. ఆయన్ను చదువుతుంటే ప్రతి సృజన శీలికీ జీబ్రాన్ని తన మాతృ భాషలోకి తర్జుమా చేయాలనీ తన వాళ్ళకు అందించాలనే వూహ కలగడం అత్యంత సహజం. భాషాను వాదమూ సరలమే కానీ ఖలీల్ జీబ్రాన్ తాత్విక భావ పరంపరను అనువాదంలోకి తేవడం సులభం కాదు అందుకు అనువాదకునికి తాదాత్మ్యకత, సాధన కావాలి అవన్నీ పుష్కలంగా వున్న గండ్ర లక్ష్మణ్ రావు గారికి ఇది సులభ సాధ్యమే అయింది.

వెర్రిమానవుడు లో జిబాన్ ఇట్లా అంటాడు

‘నేను వెర్రివాడనయ్యాను ఇప్పుడు ఏకాంతం దొరికింది’

స్వేచ్చతో కూడిన ఏకాంతం దొరికిందని అర్థమయ్యింది, నాలోనే ఉన్న ఎవరి బంధం నుండో బానిసత్వం నుండో నేను విముక్తుడి నయ్యాని అనిపించింది””

నిజమే మానవుడికి వెర్రితనం లోనే తమ కాంక్షలు స్వేచ్చ తన కవసరమయిన రక్షణా లభిస్తాయేమో. ఇది నాటి జీబ్రాన్ కాలం నుండి నేటి వర్తమానం దాకా వర్తిస్తుంది. వెర్రి మానవుడులో దేవుడు, నామిత్రుడు, నిద్ర లో నడిచే వాడు, గుడి మెట్ల మీద …. అట్లా సాగి దుఖం, సంతోషం లతో ముగుస్తుంది.

వాటిల్లో జీబ్రాన్ ఇలా అంటాడు

నేనిప్పుడు చని పోయిన ధూఖం తో పాటు, చని పోయిన సంతోషాన్ని కూడా నెమరు వేసుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే నా జ్ఞాపకం గాలికి ఊయల లూగి ఆగి పోయిన గడ్డిపరక వంటిది మాత్రమే.

ఈ సరళి లో గండ్ర లక్స్మన్ రావు గారి అనువాదం హృద్యంగా సాగుతుంది. ముందే చెప్పుకున్నట్టు గండ్ర లక్స్మన్ రావు గారు కవీ పండితుడూ, విశ్వనాథ సత్యనారాయణ

వేయిపడగల మీద సాధికారిక పరిశోధన చేసినవాడు. మూడు దశాబ్దాలకు పైగా జూనియర్ డిగ్రీ విద్యార్హ్తులతో మమేక మయి ఎంతో మందిలో సాహితీ తృష్ణనూ సృజననూ మేల్కొల్పిన వారు. ఇక ప్రాచీన సాహిత్యం మీద ఎంత పట్టు గల వారంటే అలవోకగా ఎలాంటి రెఫరెన్స్ లేకుండానే వందలాది పద్యాలు సంధర్భ సహితంగా వివరించగల దిట్ట ఆయన. గండ్ర లక్స్మన్ రావు గారు పద్యం చదువుతుంటే లయాత్మకగానూ భావనాత్మకంగానూ వుంటుంది. పద్యం రాసినా వచనం రాసినా ఆయనది సొంత గొంతుక. ఇక సాహితీ సంస్థల ఏర్పాటు నిర్వహణ విషయం లో ఆయన అనేక మందికి ప్రేరణ. సమతా సాహితి అయినా సాహితీ గౌతమి అయినా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రెండున్నర దశాబ్దాలుగా సినారె పురస్కారం ఇవ్వడంలో ఆయనది ముఖ్య భూమిక. ఇట్లా బహుముఖీన ప్రతిభ గల గండ్ర లక్స్మన్ రావు గారి “వెర్రి మానవుడు“
ఉత్తమ అనువాదంగా నిలుస్తుంది.

నాకంటే వయసులో పెద్ద వాడయినప్పటికీ ఆత్మీయ మిత్రుడిగా కలగలిసిపోయే గండ్ర లక్స్మన్ రావు గారి “”వెర్రి మానవుడును “” మనసారా ఆహ్వానిస్తున్నాను. ఆయన కృషిని అభినందిస్తున్నాను.

– వారాల ఆనంద్

gandra 1