Month: March 2016

విశ్వ సినిమా పండుగలకు తెలంగాణ వేదిక కావాలి

Posted on Updated on

విశ్వ సినిమా పండుగలకు తెలంగాణ వేదిక కావాలి  

  DSC_0092              అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ప్రతిష్టాత్మక నిర్వహణ ఆ నగరానికి, ఆ దేశానికి, రాష్ట్రానికి విశేషమైన గౌరవాన్ని ప్రతిష్టని తీసుకు వస్తాయి. కాన్స్, బర్లిన్, కార్లోవివారి ఇలా చూస్తే ప్రపంచం లో జరిగే ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలు ఆ నగరాలకు దేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పేరు తెచ్చాయో మనకు తెలుసు. తెలంగాణా రాష్ట్రమ్ సాకారం అయింతర్వాత  మన హైదరాబాద్ కూడా అలాంటి  అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు వేదిక అయి విశ్వ వ్యాప్త గుర్తింపుని సాధించాలని మంచి సినిమాల ప్రేమికులు ఆశించారు . సరిగ్గా ఆ అవకాశం నవంబర్ లో జరుగ నున్న బాలల అంతర్జా తీయ చలన చిత్రోత్శ్వమ్ ద్వారా కొంత మేర తీరుతుందని ఆశించాలి. అయితే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు బాలల ఉత్సవాలు రెండూ కొంత భిన్న మైనవనే చెప్పుకోవాలి. రెంటి గురించీ వేర్వేరుగా చర్చించు కుంటె బాలల చిత్రోత్సవాలు పిల్లల కోసం ప్రత్యేకించ బడినవి. ఈ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లో వున్న చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటి ఆఫ్ ఇండియా ప్రతి రెండు ఏళ్ల కోసారి నిర్వహిస్తుంది.   చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటి ఆఫ్ ఇండియా ఆనాటి భారత ప్రధాని నెహ్రూ ఆలోచనల మేరకు నియమించ బడిన ఎస్.కె.పాటిల్ కమిటీ సూచనల ప్రకారం 1955 లో ఏర్పాటయింది.

బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, ప్రతి రెండేళ్ల కొకసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే దేశం లోని వివిధ నగరాల్లో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. 1995 లో మొదటి సారిగా మన హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించారు తర్వాత 1999 లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు ఒక శాశ్వత వేదిక వుండాలనే పాలసీ తో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు హైదరబాద్ ని పెర్మనెంట్ వేదికగా ప్రతిపాదించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. అంతే కాదు రాష్ట్రం లో నిర్మించే బాలల చిత్రాలకి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే గొప్ప నగదు  బహుమతులు ఇస్తామని ప్రకటించింది. అంతే కాదు చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటి కి భూమి ఇస్తామని అందులో శాశ్వత కార్యాలయం, ప్రత్యేక థియేటర్లు నిర్మించి కోవాలని సూచిస్తూ ఆర్భాటంగా ప్రకటించింది కానీ సమైక్య పాలనలో అవేవీ సాకారం కాలేదు. భూమి ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఆధీనం చేయలేదు. ఇంతలో కేసులు వగైరా లతో అది మూల బడింది. ఇప్పటికీ శాశ్వత వేదికకు ఎలాంటి ప్రయ త్నాలూ జరగ లేదు. దాంతో శాశ్వత వేదిక అన్న ఆలోచన నించి బాలల చిత్రా సమితి పునరాలోచనలో పడ్డట్టు వార్తలొచ్చాయి. ఇప్పటికీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు టూరింగ్ ఫెస్టివల్ గానే మిగిలి పోయింది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటి అధికారులు రెండేళ్ల కోసారి హైదారాబాద్ వచ్చి ఏదో అంతర్జాతీయ చలన చిత్రోత్స వం నిర్వహించాము  అనిపించి అది అయిపోగానే పెట్టె బేడా  సర్దుకుని వెళ్ళి పోతారు. సమైక్య రాష్ట్ర పాలకులు అంతర్జాతీయ వేదిక పైన ఉపన్యాసాలు దంచి చేతులు కడుక్కుని వెళ్లిపోవడం జరిగేది. మళ్ళీ రెండేళ్ల దాకా బాలలు వారి సినిమాల గురించిన ఊసే వుండదు. రెండేళ్ల కోసారి హడావుడి  చేయడమే మిగు ల్తుంది. పిల్లలంటే ఏ పాలకులకు మాత్రం ఎందుకు ఆసక్తి వుంటుంది వాళ్లకేమైనా వోట్లున్నాయా పాడా.

నిజానికి పిల్లల మనో వికాసానికి సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. చదువు మేధస్సు ను, క్రీడలు శారీరక ఎదుగుదలకు తోడ్పడితే

సాంస్కృతిక విషయాలు వారి వ్యక్తిత్వ ఎదుగుదలకి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఇస్తాయి. కల్టరల్ విషయాల్లో దృశ్య మాధ్యమాలు పిల్లల పైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే సినిమాని పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించి వారికి అందించాల్సిన అవసరం వుంది. దానికి ఇరాన్ లాంటి దేశాల పిల్లల చిత్రాల్ని ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రో త్సవాలు కేవలం మహా నగరాలకు పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెల్లో వుండే బాలలకూ ప్రదర్శించ గలిగితే గొప్పగా వుంటుంది. దానికి జిల్లాల స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసి కేవలం ఎప్పుడో రెండేళ్ళకోసారి కాకుండా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాల్ని అందించ గలిగితే బాలలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ రష్యా ల నుంచి వచ్చిన పిల్లల సినిమాలు అధ్బుతంగా నూభావస్పోరకంగానూ వుంటాయి.  మొత్తం ప్రపంచాన్ని కట్టి  పడే శాయి. ఇరాన్ సినిమాలకున్న నేపథ్యం మన తెలంగాణకూ వుంది కావలసిందల్లా ఇరాన్ లో లాగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సి వుంది. మన దర్శకులు కూడా రొద్ద కొట్టుడు నీతి భోధల సినిమాలు కాకుండా భిన్నంగా బాలల మనసుల్ని గెలుచుకునే సినిమాలు నిర్మించ గలిగితే తెలంగాణ గొప్ప బాలల చిత్రాలకు వేదిక అయ్యే అవకాశం వుంది. విలక్షణ మైన కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణా ప్రభుత్వం ఈ దిశలో ఆలోచించాల్సి వుంది. మన పిల్లల కోసం కేజీ తో పీజీ విద్యతో తో పాటు ఉత్తమ వినోదాన్ని కూడా అందించాల్సి వుంది.

పిల్లల సినిమాలకోసం ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన చర్యలు కొన్ని వున్నాయి.1) బాలల చిత్ర సమితికి స్థలం కేటాయించి శాశ్వత కార్యాలయం, ప్రదర్శన వసతులు కల్పించడం . 2) బాలల సినినిమాలకు టాక్స్ మినహాయింపులు 3) తెలంగాణాలో నిర్మించే బాలల సినిమాల కు ఆర్థిక సహకారం తో పాటు ఏటా అవార్డులు ప్రోత్సాహకాలు,4) పిల్లల సినిమాల కోసం రాస్త్రం లోని థియేటర్లల్లో ప్రత్యేక మైన సమయం కేటాయింఛాలి ,5) జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పల్లెటూరి పిల్లలకు కూడా ప్రపంచ స్థాయి పిల్లల సినిమాల్ని ప్రదర్శింఛాలి.6) వీలయితే రాష్ట స్థాయిలో చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటి ఆఫ్ తెలంగాణ ను ఏర్పాటు చేసుకోవాలి..

బాలల చిత్రోత్సవాలే కాకుండా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల విషయానికి వస్తే శాశ్వత వేదిక గా గోవాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే  భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం తో పాటు కోల్ కత్తా,ట్రివేండ్రం, బెంగళూరు, ముంబాయి, చెన్నై, డిల్లీ, పూనా నగరాల్లో ప్రతి ఏడాది అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. మన హైదారాబాద్ లో కూడా ఇంటర్నెషల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తే హైదరా బాద్ కు తెలంగాణ కు ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చే అవకాశం వుంది.

Advertisements

VIEW-LEARN-MAKE FILMS

Posted on

varala emblem

వీక్షించు- నేర్చుకో- నిర్మించు

    ఇవాళ యువతీ యువకుల్లో ముఖ్యంగా విధ్యార్థుల్లో ‘షార్ట్ ఫిలిమ్’ ఒక బజ్ వర్డ్. ఇంజినీరింగ్ మెడికల్ కాలేజీల్లో  విస్తృతంగా ఈ షార్ట్ ఫిలిమ్స్ తయారవుతున్నాయి. తెలంగాణా యువతలో వున్న సృజన,మాధ్యమం పట్ల వున్న గ్లామర్, తమని తాము   నిరూపించుకునే క్రమంలో షార్ట్ ఫిలిమ్ ల ఉధృతి రాష్ట వ్యాప్తంగా కనిపిస్తున్నది. సామాజిక మాధ్యమాలు వారికి తోడుగా నిలుస్తున్నాయి. ప్రత్యేక మయిన పంపిణీ వ్యవస్థ అవసరం లేకుండా సెల్ఫ్ డిస్ట్రిబ్యూషన్/ సెల్ఫ్ రిలీజ్  చేసుకునే అవకాశాన్ని సామాజిక మాధ్యమాలు కల్పిస్తున్నాయి. ఆ షార్ట్ ఫిలిమ్ ల రీచ్ కూడా పెరుగు తున్నది.

         దృశ్య మాధ్యమం యొక్క ప్రభావాన్ని ప్రతిభని ఇవ్వాళ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మొత్తం మానవ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. దృశ్యాల్నిఅనేక రకాలుగా ఉపయోగిస్తున్నప్పటికి మూవింగ్ ఇమేజెస్ ( కదులుతున్నబొమ్మల) కు మొదటి రూపమైన సినిమా ప్రభావం ఎనలేనిది. ఎన్నదగింది.

 తెలుగు ప్రధాన స్రవంతి సినిమా రంగం లో  తెలంగాణ స్థానం ఏమిటో దానికి కారణాలు ఏమిటో అందరికీ తెలిసినవే. ప్రస్తుత మైతే కేవలం కొన్ని కుటుంబాల పిడికిట్లో తెలుగు సినిమా బంధీ అయివున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ స్థితినుంచి మార్పు వచ్చి తెలంగాణ కూడా చలన చిత్రరంగం లో అద్భుత మైన రీజినల్ సినిమా గా ఎదగాల్సివుంది. బెంగాల్, కేరళ, మరాఠీ లాంటి భాషా చిత్రాలు మన ముందు గొప్ప రీజినల్ సినిమా గా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించడం మనకు తెలుసు. ఆస్థితి తెలంగాణ సినిమాకి రావాలంటే కొత్త తరం ఈ రంగం లోకి రావాల్సి వుంది. కొత్త అలోచనలతో కొత్త భావాలతో కెమెరా చేత బట్టి యువత ముందుకు రావాల్సి వుంది.

     ఈ ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అనేక మంది యువకులు షార్ట్ ఫిలిమ్ లతో తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని షార్ట్ ఫిలిమ్ లయితే అద్భుతంగా వుండి తెలంగాణ జీవితము,సంస్కృతి, కళలు వీటన్నింటినీ దృశ్యమానం చేస్తున్నాయి. గొప్ప ఆశావాహ స్థితిని కల్పిస్తున్నాయి. యువతీ యువకుల్లో ముఖ్యంగా విధ్యార్థుల్లో షార్ట్ ఫిలిమ్ ఇవ్వాళ ఒక వేవ్ సృష్టిస్తూ వుంది. అంది వచ్చిన సాంకేతిక ప్రగతిని ఉపయోగించుకుని విస్తృతంగా షార్ట్ ఫిలిమ్స్ వైపు   కృషి చేస్తున్నారు. గతంలో కరీంనగర్ ఫిలిమ్ సొసైటి అయిదేళ్ళ పాటు నిర్వహించిన జాతీయ స్థాయి షార్ట్ అండ్ డాకుమెంటరీ ఫిలిమ్ ఫెస్టివల్ లో తెలంగాణా నుంచి విశేషమైన ప్రాతినిధ్యం కనిపించింది. ఒక ఫెస్టివల్ ముగింపు సమావేశానికి కె.చంద్ర శేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తర్వాత ఫిలిమ్ తెలంగాణ నిర్వహించిన పోటీల్లో ఆశా వాహ స్థితి కనిపించింది. ఇక ఇటీవలే బతుకమ్మ సందర్భంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్బహించిన బతుకమ్మ ఫిల్మోత్సవ్ లో పాత వాళ్ళకే కాకుండా అనేక మంది  కొత్త వాళ్ళకి అవకాశం కల్పించింది.అనేక షార్ట్ ఫిలిమ్లు ఈ ఉత్సవం లో మొదటి సారి ప్రదర్శనకుకు నోచు కోవడం ముదావహం.

  కానీ ఇక్కడ కొన్నింటిని మినహాయిస్తే, అనేక షార్ట్ ఫిలింల విషయంలో ఒక అసంతృప్తి కనిపిస్తున్నది. కథా  కథనమే మూలమైన ఈ మాధ్యమం లో అపరి పక్వత కొంత నిరాశను కలిగిస్తున్నది. దీనికి వీటిని నిర్మిస్తున్న యువదర్శకుల్ని తప్పు పట్టాల్సిన పని లేదు.ఎందుకంటే సినిమా నిర్మాణం మనకి కొత్త. మెళకువలు కూడా అంతంత మాత్రమే. నిజానికి తెలంగాణ లో

సృజన కి కొదువ లేదు. కథలకీ కమిట్మెంట్ కి తెలంగాణా పెట్టింది పేరు. కానీ దృశ్య మాధ్యమం విషయానికి వస్తే అక్కడ కళ తో పాటు టెక్నాలజీ కూడా ఇమిడి వుంటుంది.

నిజానికి సినిమాలో కథ చెప్పం చూపిస్తాం, చెప్పడంలో చూపించడంలో వున్న తేడా ని మన షార్ట్ ఫిలిమ్ మేకర్స్ గుర్తించాల్సి వుంది. అది తెలియాలంటే కథ తో పాటు టెక్నాలజీ కూడా తెలియాలి. కేవలం కెమెరా తో షూట్ చేసినంత మాత్రాన అది ఫిలిమ్ అయిపోదు.

     నిజానికి సినిమా నిర్మాణం ఒక సమిష్టి కృషి. సినిమాని అర్థం చేసుకోవడానికి యువతీ యువకులు ముఖ్యంగా మూడు అంశాల్ని పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. లూమియర్ సోదరులు ప్రారంభించిన నాటి నుంచి సినిమా రంగం లోని  కథల్లోనూ టెక్నాలజీ లోనూ వచ్చిన మార్పులు తెలుసుకోవాలి. సినిమా చరిత్ర గతిలో వచ్చిన గొప్ప సినిమాలు ఎందుకు గొప్పవి అయ్యాయో అర్థం చేసుకోవాలి. అంటే అలనాటి నుంచి నేటి వరకు వచ్చిన లాండ్ మార్క్ సినిమాల్ని శ్రద్దగా వీక్షించాలి. సినిమా అంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలే అనే  భ్రమ నుంచి బయట పది యూరోపేయన్ సినిమాల్ని కూడా వీక్షించి వాటిల్లోని ప్రయోగాల్ని గొప్పతనాన్ని తెలుసు కోగలగాలి. అప్పుడే మనం సినిమాలు ఎట్లా తీయాలో కంటే ఎట్లా తీయకూడదో తెలుస్తుంది. గతంలో గొప్ప సినిమాల్ని చూసేందుకు కేవలం ఫిలిమ్ సొసైటీ లు వేదికగా వుండేవి. కానీ ఈరోజు ఇంటర్నెట్ వేదికగా అనేక గొప్ప సినిమాలు వీక్షించే అవకాశం నేటి తరానికి అందుబాటులో వుంది.అందుకే షార్ట్ ఫిలిమ్ మేకర్స్ గొప్ప సినిమాల్ని వీక్షించడం అలవాటు చేసుకోవాలి.

       అంతర్జాతీయంగా వెలుగొందిన గొప్ప సినిమాల్ని చూడడంతో పాటు ఆయా దర్శకులు అవి తీసిన విధానాల్ని అవగతం చేసుకోవాలి. స్క్రీన్ ప్లే, షాట్ డివిషన్ లాంటి అనేక విషయాల్లో గొప్ప సినిమాలు కథని ఎట్లా  నిర్వహించాయో నేర్చుకోవాలి దాంతోపాటు ఆధునికంగా వస్తున్న టెక్నాలజీ మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అంటే గొప్ప సినిమాల్ని చూస్తూనే వాటికి సంభందించిన లిటరేచర్ ని కూడా చదవాలి. అప్పుడే సినిమాల నిర్మాణానికి చెందిన అనేక విషయాలు అవగతం అవుతాయి. దీనికి సినిమాల పైన నిర్మాణం పైన ఆసక్తి వున్న యువతీయువకులంతా వీక్షించడం నేర్చుకోవడం పైన దృష్టి పెట్టాలి. వీక్షించి,నేర్చుకుని, నిర్మించడం చేయాలి. నిజానికి ఇదీ క్రమం కానీ ప్రస్తుతం యువత ఏదో ఒక రకంగా షార్ట్ ఫిలిమ్ తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు వారి చిత్రాల్ని చూస్తే తెలుస్తుంది. నిర్మించడం పైననే దృష్టి పెడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ గొప్ప సినిమాల్ని వీక్షించడం, నేర్చుకోవడం,నిర్మించడం సమాంతరంగా చేసినప్పుడే మనదైన సినిమా,మంచి షార్ట్ సినిమా తయారవుతుంది.

     ఇందులో రాష్ట్ర ప్రభుత్వ భాద్యత కూడా వుంది. ఫిలిమ్ స్కూల్స్ పెట్టడం,ఇప్పుడున్న యూనివర్సిటీల్లో మాస్ మీడియా కోర్సులు పెట్టడం చేయాలి. గొప్ప సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తూ ప్రధాన జిల్లా కేంద్రాల్లో చిన్న చిన్న థియేటర్లు నిర్మించాల్సి వుంది. ఇలా ప్రభుత్వం కొంత తోడ్పడితే తెలంగాణా నుంచి  మంచి షార్ట్ ఫిలింలు భవిష్యత్తు లో పూర్తి నిడివి చిత్రాలు వచ్చి తెలంగాణ జెండాని ప్రపంచ వ్యాప్తంగా రేప రేప లాడించే అవకాశం వుంటుంది.

Water Water(Tr. ANU BODLA)

Posted on Updated on

CSC_0357

Water Water

Thirst thirst

The burning sky

The dried up wells

Parching tongue

Paining hearts

Holding the feeble breath

With pots on waist

We walk miles together

Anyone, please give us water..

 

Struggle for work

Struggle for food

Walk miles and miles

Wrestle with vessels

clash with own crowds

For just a pot of water

….

It is said

Body has three fourth of water

But, not even half of it in the eyes

Year long drought in the huts

Murky or muddy

Time has come to search for water

Time has come to purchase water

Not just  for food and land

The time has come

To quarrel for water

Like the cracked earth

We are waiting eagerly

For a drop of water

We are dying

Either you lay pipelines

Or you bring from underworld

Anyone, please give us water..

(For the women who walk miles and miles to get a pot of water)

(Translated on 22nd March ‘World Water Day’)

 

తన్నీర్ తన్నీర్

దాహం దాహం

అగ్గి మండుతున్న ఆకాశం

దరి తేలిన బావులూ

నాలుక పిడుచ కట్టుక పోగా

గుండెలు ఆవిసిపోతుంటే

కింద మీదవుతున్న ప్రాణాల్ని బిగ పట్టుకుని

కుండలు చంకన బెట్టుకుని

దూర భారాల నడక

ఎవరయినా మంచి

నీళ్ళి వ్వండయ్యా …

 

పని కోసం తండ్లాట

తిండి కోసం తిప్పలు

కుండ మంచి నీళ్ళకోసం

కోసెడు కోసెడు దూరం

కుండలతో కొట్లాట

తన వాళ్లతోనే తగవు

శరీరంలో బారాణా మందం నీళ్లంటారు

కళ్ళల్లో ఆఠాణా మందం నీళ్లయినా లేవు

గుడిసెల్లో సోలానా కరువే

మురికివయినా ముక్కివయినా

మంచి  నీళ్ళకు వెతుక్కునే కాలమొచ్చింది

మంచి  నీళ్ళను కొనుక్కునే కాలమొచ్చింది

తిండి కోసం నీడ కోసం

భూమి కోసమే కాదు

నీళ్ళ కోసమూ కొట్లాడాల్సిన రోజులొచ్చాయి

నెర్రెలు వడ్డ భూమిలాగా

గుక్కెడు మంచి నీళ్ళ కోసం

చుక్కలు లెక్కెడుతున్నాం

పానాలు పోతున్నాయి

పైపులే ఏస్తరో

పాతాళం నుంచి తెస్తరో

ఎవడన్నా మంచి నీళ్ళివండ్రా

 

 

(నీళ్ళ కోసం మైళ్ళు నడిచే అక్కలకూ అమ్మలకూ)

 

 

CINEMA- crowd funding

Posted on Updated on

తెలంగాణా సినిమాకు క్రౌడ్ ఫండింగ్

(సామూహిక పెట్టుబడి)

         DSCN0194       ఏదయినా పని మొదలు పెట్టాలంటే మాట్లాడటం బంద్ చేసి పని చేయడం మొదలు పెట్టాలి. అంతే కాదు మన కలలు నిజం కావాలంటే నాటిని వాస్తవ రూపంలోకి తెచ్చే ధైర్యమూ కృషీ వుండాలి. అందుకే ఇప్పుడు తెలంగాణా సినిమా గురించి కలవరించడం పలవరించడం మానేసి వాస్తవ నిర్మాణ కార్యక్రమం లోనికి దిగాల్సిన అవసరం వుంది. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఒక ప్రధానమైన ఎలిమెంట్. అది లేకుండా ముందుకు సాగడం సాధ్యం కాదు. మొదటి  నుంచీ తెలుగు సినిమా రంగంలో ఆంధ్రా ప్రాంత ఆధిపత్యం కొనసాగడానికి అక్కడి పెట్టుబడి మద్రాస్ కి వెళ్ళి సినిమాల్లో కి ప్రవహించడం ఒక ప్రధాన కారణం. కోస్తా ఆంధ్రాలో వ్యవసాయంలో వచ్చిన అదనపు లాభం సినిమాల్లోకి పయనమైంది. మరి తెలంగాణలో ఇన్నేళ్లూ ఆ పరిసస్థితి లేదు. కాని ఇవ్వాళ తెలంగాణా సినిమాని రూపొందించు కోవాల్సిన అవసరం వుంది. దానికి గాను తెలంగాణలో గతంలో సినిమాలు తీసిన వాళ్ళతో సహా అందరూ ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ని విభజించి తెలంగాణా సినిమాని ఆర్థికంగా  ప్రోత్సహించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని మన సినిమాకి ఊపిరి పోయాలని కోరుతున్నారు. విజ్ఞాపనలు వినతి పత్రాలతో కృషి చేస్తున్నారు.

     కానీ చలన చిత్రకారులు మొత్తంగా ప్రభుత్వం పైననే ఆధార పడి ముందుకు నడవకుండా ప్రత్యామ్నాయాల పైనా దృష్టి పెట్టాల్సి వుంది. సినిమా నిర్మాణమూ, ప్రదర్శనా రంగాల్లో వచ్చిన ఆధునిక మార్పుల్లాగే సినిమాల పెట్టుబడి విషయం లో కూడా సరికొత్త ఆలోచనలు సాగుతున్నాయి. దాన్ని అంది పుచ్చుకోవాల్సి వుంది.  కొత్త ఆలోచన, ఉత్తమ ప్రణాళిక, మంచి ప్రజెంటేషన్ వుంటే పెట్టుబడుల్ని ఆహ్వానించడానికి సరికొత్త వేదికలున్నాయి. దానికి కొంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చలనశీలత వుంటే అది సాధ్య మవుతుంది. దాన్నే  క్రౌడ్ ఫండింగ్ (సామూహిక పెట్టుబడి ) లేదా క్రౌడ్ సోర్సింగ్ అంటున్నాం. ఇది ఒక విలక్షణ మైన వినూత్న మయిన పెట్టుబడి సమకూర్చుకునే విధానం. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్ని విస్తృతంగా వినియోగించుకోగలిగితే  క్రౌడ్ ఫండింగ్ విజయ వంత మైన వనరులు సేకరించే విధానం. మనమెప్పుడూ సనాతనమయిన పెట్టుబడి విధానాల్నే కాకుండా క్రౌడ్ ఫండింగ్ లాంటి దారుల్ని వినియోగించుకోవాల్సి వుంది. క్రౌడ్ ఫండింగ్ అంటే అనేక మంది నుంచి స్వల్ప మొత్తాల్లో నిధుల్ని సేకరించడమే. తెలంగాణా సినిమా కోసం కొత్తగా ఆలోచించే యువకులు క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని వినియోగించ గలిగితే విజయాలు సాధించవచ్చు. దానికి స్పష్టమైన ప్రాజెక్ట్ ను ప్రతిపాదించగలిగితే క్రౌడ్ ఫండింగ్ ని ఆకర్షించగలం.

        క్రౌడ్ ఫండింగ్ ముఖ్యంగా మూడు విధాలుగా వచ్చే అవకాశం వుంది. ఒకటి డొనేషన్(చందా) విధానం ఆర్థికంగా లాభాల్ని ఆశించకుండా ఒక లక్ష్యం  కోసం అనేక మంది చందా రూపం లో పెట్టే పెట్టుబడి. ఇందులో సామాజిక కోణం ప్రధానమయి వుంటుంది. ఇక రెండవది అప్పు మోడల్ అంటే మన ప్రాజెక్ట్ నచ్చి గొప్ప వడ్డీని లాభాల్ని ఆశించకుండా అసలు వస్తే చాలని పెట్టే  పెట్టుబడి. ఇక మూడవది ఈక్విటీ మాడల్  దీంట్లో ఎక్కువ మంది చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే పద్దతి. దీంట్లో లాభాల కంటే చిన్న గౌరవ ప్రతి ఫలాల్ని ఆశించడం వుంటుంది. ఇలా పలు కోణాల్లో పెట్టుబడుల్ని సాధించవచ్చు. సిన్సియర్ గా ప్రాజెక్ట్ ని ప్రెజెంట్ చేసి పూర్తి చేయగలిగితే గుడ్ విల్ బాగా పెరుగుతుంది.

      ఈ  క్రౌడ్ ఫండింగ్ లో సహకారం అందించేందుకు అనేక వెబ్ సైట్లు అందుబాటులో వున్నాయి లేదా మనమే ఫేస్ బుక్, వాట్స్ అప్, ట్విట్టర్ లాంటి  సామాజిక మాధ్యమాల్ని వినియోగించవచ్చు, ‘ఈ మెయిల్స్ ‘ గ్రూపులుగా చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని మన ప్రపోజల్స్ తో చేరుకోవచ్చు. ఆకర్షించవచ్చు.

       ఈ క్రౌడ్ ఫండింగ్ ఆలోచన మొదలవక ముందే మన దేశంలో ఇలాంటి సామూహిక పెట్టుబడి తో సినిమాల్ని నిర్మించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయాలు గౌరవాలూ అందుకున్న సందర్భాలున్నాయి. అవి నిజంగా గొప్ప ప్రయత్నాలు.

       వాటిల్లో మొదటగా చెప్పు కోవాల్సింది అదూర్ గోపాలకృష్ణన్ మొట్ట మొదటి సినిమా ‘స్వయంవరం’. ఇది కేరళలో ఏర్పాటయిన చిత్ర లేఖ ఫిలిమ్ కొ ఆపరేటివ్ సొసైటి నిర్మించిన చిత్రం. ఆ సొసైటి సభ్యుల పెట్టుబడి తో స్వయంవరం నిర్మితమయింది. 1972 నిర్మాణ మయిన ఈ సినిమాకు 1973 లో జాతీయ స్థాయి లో ఉత్తమ చిత్రం అవార్డ్, అదూర్  గోపాలకృష్ణంకు ఉత్తమ దర్శకుని అవార్డు, మన తెలుగు శారదకు జాతీయ ఉత్తమ నటి అవార్డ్ వచ్చాయి.  అనంతరం అదూర్ సినీ ప్రస్థానం మనకు తెలిసిందే.

       ఇక మన హైదరాబాద్ వాడు అంకుర్, నిశాంత్, సుస్మన్ లాంటి సినిమాలతో తెలంగాణ సినిమాకు పాదులు వేసిన శ్యామ్ బెనెగల్ చేసిన అద్భుత ప్రయత్నం అనేక మంది నుంచి స్వల్ప మొత్తాల్లో నిధుల్ని సేకరించడం. అలా తీసిన సినిమా ‘మంథన్ ‘ ఇది గుజరాత్ లోని ఆనంద్ లో వున్న మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సభ్యుల నుండి సేకరించిన నిధులతో మంథన్ నిర్మించబడిండ్. ఫెడరేషన్ లో వున్న 5 లక్షల మంది సభ్యులు తలా రెండు (2) రూపాయలు పెట్టుబడి తో సమకూరిన రెండున్నర లక్షల డబ్బుతో మంథన్  తీశారు. చిత్రం విడుదల అయ్యాక ఫెడరేషన్ సభ్యులు లారీల కొద్ది వచ్చి తమ సినిమాని చూసి అది ఆర్థికంగా విజయవంతమయ్యేందుకు తోడ్పడ్డారు. మంథన్  కి ఆ యేడు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డ్ తో పాటు విజయ్ టెండూల్కర్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డ్ కూడా వచ్చింది. అంతేకాదు ఆస్కార్ కి భారత దేశ ఎంట్రీ గా  కూడా వెళ్లింది.

ఇక మూడో ప్రయత్నం కేరళకే  చెందిన  జాన్  అబ్రహం తీసిన ‘అమ్మా అరియన్’. జాన్ అబ్రహం తన మిత్రులతో కలిసి ఒడిస్సీ అన్న సంస్థను స్థాపించి కేరళలో వూరూరా తిరుగుతూ అర్థవంతమైన సినిమాల్ని పల్లెల్లో వుచితంగా ప్రదర్శించాడు. ప్రదర్శన తర్వాత మిత్రులంతా జోలె పట్టి గ్రామస్తుల్ని చందా అర్థించేవారు. అలా సమకూర్చిన డబ్బు తో జాన్ ‘అమ్మా అరియన్’ తీశాడు. ఆ సినిమా ప్రగతి శీల  సినిమా గా వినుతి కెక్కింది. బ్రిటిష్ ఫిలిమ్ ఇనిస్టి ట్యూట్ వారు ప్రకటించిన ఉత్తమ పది భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.  తెలంగాణాలోని  కరీంనగర్లో కూడా ఇలాంటి విఫల ప్రయత్నం ‘కరీంనగర్ క్రెయటర్స్’ పేరిట 1986-87 లో జరిగింది. ఇలా అనేక మంది నుంచి స్వల్ప మొత్తాల్లో నిధుల్ని సేకరించడమనే రీతిలో మన దేశం లో ప్రయత్నాలు జరిగినాయి. విజయవంతం కూడా అయినాయి.

     ఇవ్వాళ పెరిగిన సాంకేతిక ప్పరిజ్ఞాన వాతావరణం లో  అదే క్రౌడ్ ఫండింగ్ (సామూహిక పెట్టుబడి ) లేదా క్రౌడ్ సోర్సింగ్ సాధ్యమే. తెలంగాణా లో వున్న చైతన్యం ఇందుకు ఖచ్చితంగా దోహద పడుతుంది. చేయవల్సిందల్లా సరయిన కథ కథనాలతో కూడిన ప్రయత్నం, మన ప్రాజెక్ట్ ని అనేక మందికి చెర వేసి.మెప్పించి ఫలితాల్ని రాబట్టుకోవడమే. మంచి గుడ్ విల్ తో ప్రయత్నించాల్సిన భాద్యత తెలంగాణా చలన చిత్రకారులదే.

 

CINEMA- art/technique/business

Posted on Updated on

DSC_0447

కళా,సాంకేతికమా, వ్యాపారమా

      రవీంద్రనాథ్ టాగోర్ ఒక చోట అంటాడు ” కళ అందంగా వుండాలి కానీ అంతకంటే ముందు అది వాస్తవికంగా  వుండాలి” అని. ఈ మాట అన్నీ కళలకూ వర్తిస్తుంది సినిమాకు కూడా. అందమైయిన సినిమాను అందరమూ ఇష్టపడతాము. బాపు, విశ్వనాథ్ సినిమాల్లాగా కానీ అవి వాస్తవికంగా వుంటే కలకాలం గుర్తుంచుకుంటాము సత్యజిత్ రాయ్ పథేర్ పాంచాలి లాగా. 

        నిజానికి ఇవ్వాళ తెలంగాణ సినిమా దుక్కి దున్ని నాట్లు వేసుకుని మొలకెత్తి తల ఎగిరేయాల్సిన స్థితిలో వుంది. అయితే మొదట్లోనే స్పష్టతనూ ఖచ్చితమయిన దారిని వెతుక్కుంటేనే భవిష్యత్తులో ఫలితాలు గొప్పగా వుంటాయి. కళా,సాంకేతికమా, వ్యాపారమా

అనే దారుల్ని ఎంచుకుని ముందుకు సాగాల్సి వుంది. ఏ సినిమా నిర్మాణం లోనయినా ఈ మూడింటిని కాదనలేము కాని వాటి సమన్వయమూ అన్వయమూ సమపాళ్లలో వుంటేనే సినిమా మిగుళ్తుంది.  శతాబ్దం  క్రితం లూమియర్ సోదరులు కదిలే బొమ్మల్ని ఆవిష్కరించినప్పుడు  సాంకేతిక ఆవిష్కరణగానూ , దాదా సాహెబ్ ఫాల్కె రాజా హరిశ్చంద్ర నిర్మించినప్పుడు భారతీయ ఎపిక్స్ ని దృశ్యమానం చేయాలనే దృష్టితోనే చేశారు. సరే ఆ ప్రయత్నాలు విజయ వంత మయి వ్యాపార పరంగా కూడా నిలబడ్డాయి. భక్త ప్రహ్లాద తో మొదలయిన తెలుగు సినిమా అనంతర కాలం లో అనేక మలుపులు తిరిగి అమీబా లాగా 

ఎటుపడితే అటు పెరిగి సాంకేతికను అందిపుచ్చుకుని వ్యాపారమే లక్ష్యంగా ఎదుగుతూ

సినిమా మౌలిక స్వరూపం నుండి దారి తప్పి పోయిందనే చెప్పుకోవాలి. ప్రేక్షకుల సెన్సెస్ ఇంద్రీయాల్ని ప్రేరేపిస్తూ వ్యాపార చట్రంలో లో ఇమిడి పోయింది. బాహుబలి లో గ్రాఫిక్స్ గొప్పగా వున్నాయి,మరో చిత్రం లో పంచ్ డైలాగులు బాగున్నాయి, ఇంకో దాంట్లో సంగీతం బాగుంది అని చెప్పుకునే స్థితికి వచ్చి మొత్తం సినిమా బాగుంది పది  కాలాల పాటు గుర్తుండే టట్టు వుంది హృదయాల పైన  అత్యంత ప్రభావాన్ని కలిగించిన సినిమా అని చెప్పుకునే స్థితిని  ఎప్పుడో పోయింది.

      సరిగ్గా ఇలాంటి సమయంలో తెలంగాణ సినిమా వునికి ఆలోచనా మొదలయ్యాయి. అందుకే ఇప్పుడే తెలంగాణా సినిమా తన దిశను నిర్దేశించుకోవాల్సిన అవసరం వుంది. తనకు ఎవరు రోల్ మాడల్ గా వుండాలి అన్నది తేల్చుకోవాలి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్నే లక్ష్యంగా చేసుకుంటే తెలంగాణ సినిమా కూడా మట్టిలో తన వేళ్ళని విడిచి గాలిలో తెలియాడుతూ వంద సినిమాలూ వాటి లో పది ఆర్థిక విజయాలూ తొంబై వైఫల్యాలుగా మిగిలి పోవాల్సి వుంటుంది.

       సినిమాల నిర్మాణం లో సాంకేతికాంశం ఆర్థికాంశం తప్పకుండా ఇమిడి వుంటాయి. సినిమా పుట్టుకలోనే సైన్స్ సాంకేతికత కలగలిసి వున్నాయి. ఆనాడు అబ్బురపరిచిన కదిలే బొమ్మలు ప్రజల్ని విశేషంగా ఆకర్శించి దానికి వ్యాపారాంశాన్ని జోడించాయి. దాంతో సినిమా ఒక కళ అన్న  విషయం మరుగున పడి  పోయింది. లెనిన్ లాంటి మహాశయుడు అన్నట్టు సినిమా ఒక శక్తి వంతమయిన మాధ్యమం. సామాజిక మార్పు గమనం లో అది ప్రధాన భూమికను పోషిస్తుంది అనే విషయాన్ని వర్తమాన ప్రధాన స్రవంతి సినిమా తుంగలో తోక్కెసింది. ఆ ట్రాక్ నుండి విడివడి తెలంగాణ సినిమా అర్థవంతమయిన దారిని రూపొందించుకోవాల్సి వుంది. ఎలాంటి రంగూ రుచి వాసనా లేని వంటకాల్లాగా ఎలాంటి ప్రాంతీయతా, స్థానికతా, ప్రాసంగికతా లేని కథలూ పాత్రలూ కథనాలూ కలగలిపి కిచిడీ లాంటి చిత్రాలు  తీసి  తెలంగాణ సినిమా కూడా మరో అర్థం పర్థం లేని సినిమాలకు వేదిక కాకూడదు. తెలంగాణ బతుకులోనూ ప్రేమా ధుఖం ఆవేశం కరుణా కుటుంబం మానవ సంభందాలూ అన్నీ సజీవంగా వున్నాయి. అంతే కాదు తెలంగాణ బతుకు పోరాటం లో గొప్ప మెలోడ్రామా కూడా వుంది. వీటన్నింటినీ సూదిలో దారంగా అంతర్లీనంగా కలుపుతూ సాగే కథలూ వున్నాయి. సినిమాకి కావాల్సిన అన్నీ ఎమోషన్స్ ని పండించే చరిత్రా వుంది కావాల్సిందల్లా వాటిని అంది పుచ్చుకోవడమే. ఎంత వాస్తవికంగా, ఆసక్తిగా, కళాత్మకంగా

సినిమాల్ని రూపొందిస్తామా అన్నదే  తెలంగాణా సినిమా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది.

       సినిమాల్లో సాంకేతికాంశం విషయానికి వస్తే మారుతున్న టెక్నాలజీ దృశ్య మాధ్యమం యొక్క నిర్మాణ సరళినీ , శైలినీ స్వరూపాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నది. సాంకేతికత లేకుండా సినిమా ఉనికి లేదన్నది నిర్వివాదాశం. డిజిటల్ టెక్నాలజీ అనేక విధాలుగా సినిమాల నిర్మాణం, ప్రదర్శనల్ని ప్రభావితం చేసింది. ఫిలిమ్ రీళ్లూ , ఎడిటింగ్ తదితర అనేక విషయాల్లో గతం లో దర్శకులు సాంకేతిక నిపుణులూ పడ్డ కష్టాల నుంచి బయట పడేసిందనే చెప్పుకోవాలి. మళ్ళీ మళ్ళీ సరిచూసుకునే అవకాశాన్ని కొత్త టెక్నాలజీ అందిస్తున్నది. ఈ స్థితిని ఖచ్చితంగా అంది పుచ్చుకోవాల్సిందే. దాంతో ఒక స్థాయిలో సినిమాల నిర్మాణ వ్యయం తగ్గుతుందనే అందరూ భావించారు కానీ ఇప్పుడు ప్రధాన స్రవంతి సినిమా రంగం అదే టెక్నాలజీని వాడుకుని వ్యాపారాన్ని విస్తృతం చేస్తున్నారే తప్ప అర్థవంతంగా వినియోగించడం లేదు.  తెలంగాణ సినిమా ఆధునిక టెక్నాలజీని మరింత అర్థవంతంగా వినియోగించాల్సి వుంది. నిలదొక్కు కునేందుకు ఎట్లైతే భిన్నంగా ఆలోచించాలో అట్లే టెక్నాలజీ  విషయంలో కూడా సరిగ్గా అదే చేయాలి. తెలంగాణాలో ఫిలిమ్ టెక్నాలజీలో శిక్షణా వసతులు ఏర్పాటు చేసుకుని యువతని ఎప్పటికప్పుడు అప్ డేట్  చేయగలిగితే తెలంగాణ సినిమాల్లో సాంకేతికత మంచి వాహకంగా నిలుస్తుంది.

       ఇక వ్యాపారం విషయానికి వస్తే సీమాల్లో అది అంతర్భాగం పెట్టుబడి లాభ నష్టాలు అన్న అంశాలు లేకుండా సినిమాల్ని వూహించలేం. కానీ ఎప్పుడయితే సినిమా పరిశ్రమగా మారినదో అప్పటి నుండి సినిమా ఒక కళాకారుడి రంగం కాకుండా పోయి  మేనేజిమెంట్ రంగం అయిపోయింది. తెరపయిన దృశ్య లయ, భావ వ్యక్తీకరణ అన్న అంశాలు మరుగున పడిపోయి భారీ తనమూ పెట్టుబడి ప్రదర్శన లు పెరిగి పోయి. నిర్మాత అన్న వాడి ఉనికి ప్రశ్నార్థకం అయిపోయింది. దానితో వర్తమాన తెలుగు సినిమా కొంతమంది చేతుల్లోకి పోయింది. తెలంగాణ సినిమా ఈ ఛట్రం  నుండి బయట పడి   మా నిర్మాత ఖర్చుకు వెనకాడ లేదు అనే ప్రకటనలకు భిన్నంగా నిర్మాణానికే పెట్టుబడి తప్ప ధన ప్రదర్శనకి కాదు అన్న జ్ఞానం పెంచుకోగలిగితే తెలంగాణలో పెట్టుబడి సాధ్యమే. నిజానికి తెలుగు సినిమాకు నైజాం ఏరియా పెద్ద లాభాల్ని అందించేదిగా పేరుంది. పెద్ద కమర్షియల్ హీరోలు నైజాం ఏరియా హక్కుల్నే తమ పారితోషకాలుగా తీసుకుంటారనే ప్రచారమూ వుంది. ఆస్థితిలో మంచి అర్థవంతమైన సినిమాల్ని తీయగలిగితే తెలంగాణ సినిమా గొప్పగా నిలబడ్డంతో పాటు ఆర్థికంగా కూడా నిలబడుతుంది.

మొత్తం మీద నవ్య తెలంగాణ సినిమా నూతన దారులెంట వినూత్న దృశ్య మాధ్యమంగా నిలబడితే జాతీయ అంతర్ జాతీయ స్థాయిలో మరో గొప్ప సినిమా రంగంగా నిలబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్థికంగా వసతుల పరంగా చేయి అందించి నిలబెడితే భవిష్యత్తులో బంగారు సినిమా రూపొందే అవకాశం ఎంతయినా వుంది.

 

CINEMA- dasha-disha

Posted on Updated on

 తెలంగాణ సినిమా దశ-దిశDSC_0432

      ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటయి విజయవంతంగంగా మొదటి ఎడాది పూర్తి చేసుకున్నాం. అనేక విజయాలు. వివిధ కోణాల లోంచి ఎన్నో ఆటంకాలూ ఎదురవుతున్నా తెలంగాణా తన దారిలో తాను ముందుకు సాగుతూనే వుంది.

    ఈ నేపథ్యం లో భిన్నమయిన అంశాల తో పాటు తెలంగాణ సాంస్కృతిక రంగం వైపు కూడా కృషి జరుగుతున్నది ఇంకా సాగవలసి వుంది. సాంస్కృతిక రంగం అభివృద్ది చెందకుండా ఏ అభివృద్దీ అసంపూర్ణమే అవుతుంది. అందుకే చైనా లో మావో సాంస్కృతిక విప్లవం అన్నాడు. సంస్కృతి లో కానీ   సాంస్కృతిక రంగం లో కానీ తెలంగాణాది విలక్షణ  మయిన వొరవడి. సాంస్కృ తిక  రంగం లో మిగతా వాటికంటే సినిమా ది ప్రత్యేక మయిన స్థానం. అది అత్యంత ప్రభావ వంత మయింది. సామాన్య ప్రజల్లో విస్తృతంగా ఆదరణ పొందింది. అందుకే తెలంగాణ సినిమా గురించి దాని ‘దశ- దిశ’ గురించి చర్చ జరగాల్సి వుంది.

        ఈ సంవత్సర కాలం లో తెలంగాణా లో సినిమా కు సంబందించి రెండు ఎకరాల్లో ఫిలిమ్ సిటి అన్న ప్రభుత్వ ప్రకటన చాలా ఆశావాహమయిన అడుగు. ఇప్పుడున్న తెలుగు సినిమా రంగం హైదరబాద్ లో వుంటుందా వైజాగ్ తరలి పోతుందా అన్న ప్రచారం బాగా జరుగుతున్న వేళ ఫిలిమ్ సిటీ ప్రకటన, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇతర ప్రోత్సాహక ప్రకటనలు, దాదాపుగా అదే సమయం లో వైజాగ్ లో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ లాంటి సంఘటనలు తెలుగు ఫిలిం పరిశ్రమ ని పునరాలోచనలో పడేసాయి.

          ఈ నేపథ్యం లో తెలంగాణ సినిమా ఉనికి, ఎదుగుదలగురించి చర్చ తో పాటు ప్రభుత్వ పరంగా, ఫిలిమ్ మేకర్స్ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించాలి.

         “తెలంగాణ సినిమా  దశ-దిశ” ను నిర్దేశించు కోవాల్సి వుంది. తెలంగాణ సినిమాను వెండి తెర వేదిక పైకి తీసుకు రావడానికి తెలుగు సినిమాల్లో తెలంగాణా, తెలంగాణాగడ్డ మీద సినిమా రంగం, తెలంగాణా సినిమా ఇలా మూడు అంశాల్ని పరిశీలించాల్సి వుంది

            తెలుగు సినిమాల్లో తెలంగాణా కి గత ఎనిమిది దశాబ్దాల్లో ఏనాడూ అందవలసిన స్థానం గాని గుర్తింపు కానీ రాలేదు. ఎక్కడయినా వచ్చినా అది హాస్యానికో  ఎగతాళి కో తప్ప సరయిన స్థానం ఇవ్వలేదు. వర్తమాన తెలుగు సినిమా రంగం ఈరోజు కేవలం టెక్నాలజీ పైన ఆధార పడి వ్యాపారం కోసమే మనుగడ సాగిస్తున్నది. సినిమా ఒక కళ దానికో సామాజిక కోణం వుందన్న సంగతి ఎప్పుడో మర్చిపోయింది. అట్లని ఆర్థి కంగా ఎంత మేర బాగుందన్నది వేరే చర్చ. పెట్టుబడి తిరిగి రాణి సినిమాలు, విజయాల్లేక అల్లాడుతున్న హీరోలు  అల్లల్లాడుతున్నారు. కేవలం పది శాతం మాత్రమే ఆర్థిక విజయాలు అందుకుంటున్నాయన్న విషయం ఫిలిమ్ వర్గాలే చెబుతున్నాయి. ఇక తెలుగు సిన్మా క్వాలిటీ పరంగానూ  జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పరంగా నూ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతా మంచిది. ఇన్నేళ్ళలో జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాని గాని నటున్ని గాని అందించ లేక పోయిన తెలుగు సినిమాకి ఉత్తమ నటి అవార్డులు అందుకున్న శారద, అర్చనలు నటించిన సినిమాలు తెలంగాణా వాళ్లయిన బి.ఎస్.నారాయణ, బి నర్సింగా రావు లే దర్శకులు కావడం యాదృచ్చికం కాదు అది తెలంగాణ సృజనకి మచ్చు తునక.

         అట్లని తెలుగు సినిమా ప్రభుత్వం తో అనేక రాయితీల్ని వెసులు బాటునీ అనుభవించి వ్యాపారంగానూ , ఒక ఇండస్త్రి గానూ నిలదొక్కుకున్న విషయాన్ని కాదనలేము. మిగతా పరిశ్రమల్లాగే తెలుగు సినిమా కూడా హైదరబాద్ లో వుండాలనే కోరుకుందాం. తెలుగు సినిమా సాంకేతికంగానూ ఆర్థికంగాను  రాష్ట్రానికి  ఒకరకంగా అవసరమే. అది గమనించే రాష్ట్ర ప్రభుత్వం ఫిలిమ్ సిటీ ప్రకటించింది.

      ఇక తెలంగాణ గడ్డ మీద సినిమా సంగతి ఆలోచించించినప్పుడు ముంబై తర్వాత అధికంగా చిత్రాల నిర్మాణం జరుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ కు పేరుంది. లెక్కలు తీసుకుంటే ఒక సందర్భంలో ఇక్కడే అధిక సంఖ్య లో నిర్మాణాలు జరుతున్నాయనియని చెప్పుకోవచ్చు.కేవలం తెలుగు మాత్రమే కాకుండా హింది తో సహా అనేక భారతీయ భాషా చిత్రాలు కొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా ఇక్కడ నిర్మాణమవుతుండడం గొప్ప విషయమే. అంతలా ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఇక్కడ సమకూరింది. ఆర్థికంగా అది తెలంగాణకు బలమే. ఫిలిమ్ సిటి దీని కి  మరింత దోహదం చేసే అవకాశం వుంది.

          ఇప్పుడు  మనదయిన “తెలంగాణ సినిమా” కు పాదులు వేయడం అది ఎదిగేలా చూడడానికి  చర్యలు ప్రారంభం కావాల్సి వుంది. ఇప్పటివరకు శ్యామ్ బెనెగల్ (అంకుర్,నిశాంత్,మండి, సుస్మన్ మొ!!), గౌతం ఘోష్ (మా భూమి), బి.నరసింగ రావు (దాసి) లాంటి దర్శకులు తెలంగాణ సినిమాకి పాదులు వేశారు, ఆతర్వాత  ఆ ఒరవడిని కొన సాగించిన వాళ్ళు తక్కువ, శంకర్, అల్లాణి శ్రీధర్ లాంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు. కేవలం వేళ్ళ మీద లెక్కించే సంఖ్యలో వచ్చిన ఆసలయిన తెలంగాణ సినిమా ల ఉనికి ఇవ్వాళ సంఖ్యా పరంగా గాని స్థాయి పరంగా గాని గొప్పగా ఏమి లేదు. తెలంగాణ సినిమా పరుగు సంగతి అటుంచి నడక కూడా నేర్చుకోవాల్సిన స్థితిలో వుంది.

అంటే స్టూడియోలు మన గడ్డ మీదే వుంటాయి కానీ మనకు ప్రవేశం లేదు నటులు సాంకేతిక రంగం లో నయితే మన ఉనికే ప్రశ్నా ర్థ కం. సృజన భావుకత మన సొంతం కనుక పాటల్లో మన వాళ్ళకు మంచి స్థానం వుంది.

          నిజానికి తెలంగాణాలో గొప్ప కథలున్నాయి, సంగీతం వుంది, భాషా సంస్కృతులున్నాయి. ఎట్లాగయితే బెంగాల్లో, కేరళ లో రీజినల్ సినిమా ఎదిగిందో అట్లాగే తెలంగాణా సినిమా కి  కూడా విస్తృతంగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కు కునే శక్తి సామ ర్థ్యాలున్నాయి.  అయితే తెలంగాణ సినిమా తన దయిన ప్రాంతీయ లక్షణాల్ని పుణికి పుచ్చుకోవాల్సి వుంది. వర్త మాన తెలంగాణ నిర్మాతలు దర్శకులూ మళ్ళీ మరొక మూస కట్టు తెలుగు సినిమా తీయదానికి ముందుకు రావడం లో ఫలితం లేదు అవసరమూ లేదు. అలాంటి సినిమాలు తీయడానికి ఇప్పటికే చాలా మంది వేచి వున్నారు ఆమాత్రం మహాభాగ్యానికి తెలంగాణా వాళ్ళేందుకు. ఆలోచించాలి.

            కథల పరంగాను కళాత్మకంగాను తెలంగాణ ముందున్న ప్పటికి సినిమా సాంకేతిక తోడయిన కళ గనుక తెలంగాణ యువత ఫిలిమ్ టెక్నాలజీ లో ఉన్నత స్థాయి శిక్షణ పొందాల్సి వుంది. అప్పుడే తెలంగాణ సినిమా ఎల్లలు దాటి ముందుకు వెళ్లగలుగుతుంది. అట్లాగే కొత్త ఆలోచనలకు కొత్త భావాలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం వుంది. వ్యాపార సినిమాకి వున్న మూసకట్టు సూత్రాలకు భిన్నంగా తెలంగాణ చలన  చిత్రకారులు ఆలోచించాల్సి వుంది.

      ఇక నూతనంగా ఏర్పాటయిన తెలంగాణ ప్రభుత్వం తొలుత వ్యాపార తెలుగు సినిమాకి భరోసా ఇచ్చే చర్యలు చేపట్టింది. ప్రత్యేక మంత్రిని ఇచ్చి హామీ కల్పించింది. ఇప్పుడిక తెలంగాణ సినిమా వైపునకు దృస్తి సారించాల్సి వుంది. సినిమా రంగం లో తెలంగాణ విత్తనాల్ని నాటి వాటి ఎదుగుదలకు శాస్త్రీయమయిన ప్రణాళికా  బద్దమయిన చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమయింది. ప్రపంచ సినిమా యవనిక పయిన తెలంగాణ జెండాను ఎగుర వేయడానికి అవసర మయిన చర్యలు తీసు కోవాల్సి వుంది. తెలంగాణ సినిమా వర్త మాన దశ నుంచి దిశని మార్చాల్సిన అవసరం ఎంతయినా వుంది

      ప్రభుత్వం తెలంగాణ ఫిలిమ్ సిటీ ప్రకటన తెలంగాణా వారికి  కూడా ఎంతో ఆశావాహంగా కనిపించింది. ఇప్పుడే స్పష్టత లేకుంటే ఇందులో కూడా తెలుగు సినిమా బడా బాబులే ముందుండి వసతుల్ని  తన్నుకు పోయే అవకాశం వుంది. ఇప్పటికే సమైక్య పాలనలో విస్తారంగా లబ్ది పొందిన వాళ్ళు మళ్ళీ ముందు వరసలోకి వచ్చే  అవకాశం వుంది. అందుకే ఫిలిమ్ సిటీ నిర్మాణం తెలంగాణ దృక్పధం లోనే జరగాలి. స్థలాల కేటాయింపు ప్రోత్సాహాల విషయంలో తెలంగాణ కి ఖచ్చితంగా కోటా వుండాల్సిందే. ఇక కార్మికుల విషయంలో ఇళ్ల నిర్మాణం లాంటి చర్యలూ వుండాల్సిన అవసరం వుంది. ప్రభుత్వ పరంగా నిర్మించాల్సిన అనేక ఫిలిమ్ సంస్థల నిర్మాణానికి ఫిలింసిటీ ఉత్తమ వేదిక కావాలి.

          వసతులు సాంకేతిక విషయాలు అట్లా వుంటే తక్షణమే  కొత్త తెలంగాణా సినిమా తరాన్ని తయారు చేసుకోవాల్సి వుంది. దానికోసం ఎన్నో కాలేజీలూ జిల్లాకో యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒక తెలంగాణా ఫిలిమ్ అకాడెమీ స్థాపించి- ఫిలిమ్  ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేసి తెలంగాణ యువత  సాంకేతికంగా  ఎదిగేందుకు తోడ్పడాలి. ఫిలిమ్ ఆర్చివ్స్ లాంటి ప్రతిష్టాత్మా సంస్థ ను, తెలంగాణా యువకులకి ప్రపంచాన్ని చూపేలా

తెలంగాణ/  హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ని నిర్వహించాల్సి వుంది

          తక్షణమే ఫిలిమ్ డెవలప్ మెంట్ కమిషన్  ను విభజించి ఇన్నేళ్ళు గా

సీమాంధ్ర ఆధిపత్యం లో వున్న  సంస్థను తెలంగాణా పరం చేయాలి. ఇంతకాలం సబ్సిడీలా పేర గ్రాంట్ల పేర సీమాంధ్ర సినిమా రంగం చేసిన దోపిడిని అరికట్టాలి. అట్లాగే ఆర్కైవ్స్ నిర్మాణం,జిల్లాల్లో ఫిలిమ్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టాల్సి వుంది.

      అనేక రకాలుగా వినూత్నంగాను విలక్షణంగాను ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సినిమా దశ-దిశ ను మార్చాల్సిన అవసరం వుంది. తెలంగాణాలో బంగారు సినిమా రూపొంద డానికి తక్షణమే నడుం బిగించాల్సిన తరుణం ఆసన్న మయింది.

 

 

 

 

POETRY (Tr. ANU BODLA)

Posted on

వారాల ఆనంద్ కవిత్వం

Poetry I lighted a candle The darkness in the room Bowed her head and walked out silently   Through the windows and ventilators she began to peep in now and again In a whil…

Source: POETRY (Tr. ANU BODLA)