Month: October 2022

6 6 – యాదొంకి బారాత్ +++++వారాల ఆనంద్

Posted on

ప్రవాహం పయనమయి సముద్రాన్ని చేరుతుంది

అవును, పరుగులెత్తడం తెలిసిన ప్రవాహం

నేల తల్లిని ఆర్తిగా తడుముతూ

గమ్యం వైపు సాగిపోతుంది

సాగిపోతున్న ప్రవాహానికి ఆద్యంతం

తీరం అంటి పెట్టుకునే వుంటుంది

నదికి ప్రవాహం ఊపిరి అయితే తీరం దేహమవుతుంది

తీరం దేహానికి ప్రవాహపు అంతర్లయ

ఉచ్వాస నిశ్వాసమవుతుంది

****

అట్లా ఉచ్వాస నిశ్వాసాల నడుమ సాగుతున్న జీవితంలో అనేక సాహితీ సాంస్కృతిక అంశాల్లో పనిచేసినప్పుడు ఎంతో ఇష్టంగానే చేసాను. మిత్రుల పుస్తకాల విషయంలో కానీ, రాతల విషయంలో కానీ, సభలూ సమావేశాలు నిర్వహించడంలో కానీ దాదాపుగా అన్నింటా ఎంతో అభిమానంతో మమేకత్వంతోనే నిర్వహించాను. ఎవరెట్లా తీసుకున్నా ఎవరు గుర్తించినా లేకున్నా, మరిచిపోయినట్టు నటించినా ఏదీ నాకు పట్టింపు లేదు. ఎందుకంటే నేనా పనుల్లో నా సంతోషం కోసమే నా సంతృప్తి మేరకే మేమేకం అయ్యాను. NO REGRETS.

అగ్రహారం డిగ్రీ కాలేజీలో ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతూ ఉండగానే ప్రిన్సిపాల్ నరసింగ రావు గారికి కరీంనగర్ బదిలీ అయింది. తర్వాత కే. శ్రీనివాసరావు గారు ప్రిన్సిపాల్ గా వచ్చారు. ఆతర్వాతే ఆకాలేజీకి యుజీసీ గుర్హింపు వచ్చింది. శ్రీనివాస రావుగారు ప్రిన్సిపాల్ గా చేరిన తర్వాత కరీంనగర్ నుంచి పలువురం కామర్స్ లెక్చరర్ కే.రాజమౌళి గారి అంబాసడర్ కారులో కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఒక రోజు దీపావళి తెల్లవారి అనుకుంటాను రేలకు కొంత జ్వరంగా ఉండింది. నేను బయలుదేరుతూ వుంటే ఇవ్వాళ కాలేజీకి పోవద్దు నాన్నా ఇంట్లో వుండు అంది. నేనట్లా తన మాటకు ఉండిపోయాను. సెలవు పెట్టచ్చులే అనుకున్నాను. కానే చిత్రంగా ఆ రోజు వెంకట్రావుపల్లి గ్రామం వద్ద మా వాళ్ళ కారుకు ఆక్సిడెంట్ అయింది. పీడీ గణేష్ కు, లెక్చరర్ లింగారెడ్డి గారికి గాయాలయ్యాయి. రేల వుండుమనడం ఎంత మంచిదయిందో చూడు అంది ఇందిర. ఏమో నేను వెళ్లి వుంటే అసలు ప్రమాదమే జరిగి వుండేది కాదేమో అన్నాన్నేను. అంతా నవ్వుకున్నాం. అదొక అనుభవం.

ఇక అప్పటిదాకా అనామక ప్రభుత్వ కాలేజీగా వున్న దానికి యుజీసీ గుర్తింపు రావడంతో నిధులు రావడం మొదలయింది. సరిగ్గా అప్పుడే కాలేజీకి సొంత విశాలమయిన భవనం కూడా వచ్చింది. ఇక ఏముంది బుక్స్, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవసరమయింది. నిధులు వచ్చాయి. యుజీసీకి ప్రిన్సిపాల్ నన్ను ఇంచార్జ్ చేసారు. నాకెందుకు సార్. ఎంతో మంది సీనియర్స్ వున్నారు కదా అంటే నీకు తెలీదు సమయం ఇచ్చేవాళ్ళు కావాలి నిక్కచ్చిగా వుండేవాళ్ళు కావాలి అన్నారాయన. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారు డబ్బుల విషయంలో నిప్పులాంటి మనిషి. పైగా ఆయన స్థితిమంతుడు. అందుకే నేను ఆయనకు తోడుగా నిల్చాను. ఇద్దరమూ హైదరాబాద్ కరీంనగర్ వెళ్లి బుక్స్, రాక్స్, ఫోటోస్టాట్, స్టూడెంట్ ఫర్నిచర్ ఇట్లా ఒకటేమిటి అన్నీ పద్ధతి ప్రకారం కొనుగోలు చేసాం. కాలేజీ కొంతమేరకు స్వయం సమృద్ధి అయింది. విద్యార్థులు కూడా క్రమంగా రావడం మొదలయింది. ఆక్రమంలో నాకు హైదరాబాద్ లో రెండు బుక్ స్టాల్స్ యజమానులతో స్నేహం ఏర్పడింది. ఒకటి ‘బుక్ సెలెక్షన్ సెంటర్’. దాంట్లో దీపక్ మంచి పుస్తకాల ఎంపికలో సాయపద్డాడు. ఎందుకంటే అగ్రహారం కాలేజీలో ఓనమాల నుంచి ప్రారంభించాల్సిన లైబ్రరీ మరి. ఇక కాచిగూడా లోని నవోదయ బుక్ హౌజ్ రాంమోహన్ రావు, కోటేశ్వర్ రావులు సాహిత్య పుస్తకాలు ఎంపిక చేయడంలో ఓపిగ్గా నాకెంతో సాయపడ్డారు. ఈ రెండు బుక్ స్టాల్స్ ఆతర్వాతి సంవత్సరాలల్లో ఎస్.ఆర్ .ఆర్. కాలేజీ విషయమలో కూడా ఎంతో స్నేహంగా స్వచ్చంగా సహకరించారు. అలాంటి మిత్రుల సహకారాలతో ఆ రెండు కాలేజీల్లో లైబ్రరీలని పరిపుష్టం చేయడానికి వీలయింది. అగ్రహారం కాలేజీ లో మిగతా సహా అధ్యాపకులు సైతం ఎంతగానో సహకరించారు.ముఖ్యంగా వి.శ్రీరాములు, కే.లింగా రెడ్డి, ఎం.సుధాకర్ రెడ్డి, అల్తాఫ్ లాంటి వాళ్ళ స్నేహ సహకారాలు ఎనలేనివి. ఇట్లా అందరి సహకారాలతో పాతికేళ్ళ క్రితమే అగ్రహారం డిగ్రీ కాలేజీలో ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేసే అవకాశం నాకు కలిగంది. శ్రీనివాస రావుగారు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రిన్సిపాల్గా వచ్చిన శ్రీమతి రమాదేవి గారు కాలేజీని అకాడమిక్ గా ఎంతో మెరుగు పరిచారు. తను వేములవాడలో నివాసముండేవారు. అటుపక్క ఇటుపక్క వున్న సిరిసిల్లా, వేములవాడ లతో పాటు చుట్టూ వున్న గ్రామాల్లో ఎన్ని రాజకీయాలున్నా కాలేజీ చాలా వరకు ప్రశాంతంగా వుండేది. అకాడెమిక్ గా క్రమంగా మంచి పేరు తెచ్చుకుంది.

కాలేజీ విషయాలు అట్లా వుంటే ఇంట్లో రేల, అన్వేష్ లు ఇద్దరూ వివేకానంద స్కూలులో ఉత్సాహంగానే చదువుతున్నారు. ఇద్దరికీ ఈత నేర్పించాలనిపించింది. ఎందుకంటే నాకు ఈత రాదు. చిన్నప్పుడు నేర్చుకునే అవకాశం రాలేదు. అప్పటికి కరీంనగర్ లో కేవలం ఆఫీసర్స్ క్లబ్ గా పిలిచే కరీంనగర్ క్లబ్ లో మాత్రమే స్విమ్మింగ్ పూల్ వుండేది. అందుకే పిల్లలకు నేర్పించాలని జ్యోతినగర్ లో వున్న ప్రైవేట్ పూల్ కు తీసుకెళ్ళాం. రోజూ నేనూ ఇందిరా వెళ్ళే వాళ్ళం. పిల్లలు ఇద్దరూ ఉత్సాహంగానే నేర్చుకున్నారు. మంకమ్మతోట నుండి నాన్న కూడా ఒక సారి వచ్చి చూసి ఆనందపడ్డాడు.

++++

మౌనం మనిషికిఒక మహత్తరమయిన ఆచ్చాదన

మౌనంగా ఉండడమంటే మాటలు రాకపోవడమూ కాదు

మౌనంగా ఉండడమంటే మాటలు లేకపోవడమూ కాదు

మౌనంగా ఉండడమంటే మాటలు చేత కాకపోవడమూ కాదు

మౌనంగా ఉండడమంటే లక్ష భావాల్ని మన పెదాల నడుమ దాచుకోవడం కోటి అనుభూతుల్ని మనకనురెప్పల కింద నిక్షిప్తం చేసుకోవడం, అనంత వేదనల్ని, ఆలోచన్లనీ, అనురాగాన్నీ మనసు పొరలకింద ప్రవహించుకోవడం, అవును, వినగలిగితే మనలో కోటి గొంతుల రావాన్ని పెదాలు వినిపిస్తాయి. చూడగలిగితే మౌనంలో మనిషి మంచులా కరిగిపోవడం తెలుస్తుంది. నిప్పులా రాజు కోవడమూ తెలుస్తుంది..

ఇట్లా ‘మానేర్ టైమ్స్’ పత్రికలో ఫీచర్ గా రాసిన ‘మానేరు తీరం’ రచనల్ని ఒక పుస్తకంగా తేవాలని ఆ పత్రిక ఎడిటర్ పొన్నం రవిచంద్ర మొదట్లో కొంత ఆసక్తి చూపాడు. కానీ ఎందుకో అది వాస్తవ రూపం దాల్చలేదు. నేనూ పెద్దగా చొరవ తీసుకోలేదు. కానీ ఎప్పుడయితే ఈనాడు, సుప్రభాతంలలో రాయడం ఆపెసానో ఇక నేను నా స్వీయ వ్యక్తీకరనలపైన దృష్టి పెట్టాల్సిన సమయమొచ్చింది అనుకున్నాను. మరో వైపు సహచరి ఇందిర కూడా వొత్తిడి చేయడం మొదలు పెట్టింది. వార్తలు వ్యాఖ్యానాలు వదిలేసి పుస్తకాల మీద ద్రుష్టిపెట్టమని.

అప్పటికే ‘జీవగడ్డ’ దిన పత్రికలో రాసిన వారానందం పుస్తకం గా వేయలేక పోయాను ఇక ఇప్పుడయినా ‘మానేరుతీరం’ వేయాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అప్పుడే ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య బదిలీ పైన వరంగల్ నుంచి కరీంనగర్ ఆంధ్రాబాంక్ కు వచ్చారు. అంతకు ముందే కొన్ని సార్లు వరంగల్ లో తనని కలిసి ఉన్నాను. ఆయన్ని రెగ్యులర్ కలుసుకోవడంతో నాలో ఉత్సాహం పెరిగింది. దానికి తోడు శ్రీ నలిమెల భాస్కర్ కూడా నాతో వున్నారు. అప్పుడే చిన్న తమ్ముడు అమర్ ని హైదరాబాద్ కు పంపించి సోదరి కళాశ్రీ వద్ద డీ.టీ.పీ. నేర్పించాను. కరీంనగర్ వచ్చి కస్తూరి గ్రాఫిక్స్ లోనూ సత్యనారాయణ ప్రెస్ లోనూ ఆపరేటర్ గా చేరాడు. తనతో కంపోజ్ చేయించాను. ఇక శిష్య మిత్రుడు కల్యాణం శ్రీనివాస్ మంచి చిత్రకారుడు. తనకు చెబితే భావస్పోరకమయిన చిత్రాల్ని వేసాడు. సిరిసిల్ల ఆత్మీయ మిత్రుడు టీ.వీ.నారాయణ సహకారంతో అప్పుడు అక్కడ పనిచేస్తున్న ప్రసిద్ద ఫోటోగ్రాఫర్ విశ్వెందర్ రెడ్డి గారి వద్ద నుండి కవర్ కోసం ఫోటో తీసుకున్నాం. ఖైరతబాద్ లోని ధరణి ప్రెస్ లో ప్రింటింగ్ కు ఇచ్చాను. ఇదంతా తెలిసి ఆత్మీయ మిత్రుడు కవి వ్యాఖ్యాత శ్రీ కే.ఎస్.అనంతాచార్య చొరవతో తమ సంస్థ ‘సమైఖ్య సాహితీ’ వెలుగున ఆవిష్కరణ సభ పెడతామన్నాడు. శ్రీ మాడిశెట్టి గోపాల్ కూడా అంతే ఉత్సాహం చూపించాడు. మిత్రుడు కే. చుక్కా రెడ్డి గారి అరుణా ప్రెస్ సహకరిస్తామన్నారు. నేనే మొదట వద్దన్నాను. ఒక పూట బాంక్ లో వున్నప్పుడు భాస్కర్ నేనూ దర్భశయనం మాట్లాడుతూ వుండగా సభ ప్రస్తావన వచ్చింది. ఆనంద్ వద్దు అంటున్నాడు అని భాస్కర్ ఫిర్యాదుగా అన్నాడు. వద్దు సార్ సభలో పొగుడుతారు బాగుండదు అన్నాను.. కానీ దర్భశయనం ‘అవునండి బాగుంటే పొగుడుతారు ఖచ్చితంగా బాగుందంటారు..సభ పెట్టాల్సిందే’ అని దబాయించాడు. ఇక చేసేదేముంది. నెహృ యువ కేంద్ర హాలులో సభ. భాస్కర్ అధ్యక్షుడు దర్భశయనం ప్రధాన వక్త. హాలు నిండి పోయింది. నారదాసు, జీవగడ్డ విజయ్ కుమార్, దామోదర్ రెడ్డి, డాక్టర్ గండ్ర లక్ష్మన్ రావు, డాక్టర్ గోపు లింగా రెడ్డి, చలనాచారి, చంద్ర ప్రభాకర్ ఒకరేమిటి చాలా మంది వచ్చారు. నాకిప్పటికీ జ్ఞాపకం సభ ముగిసిన్తర్వాత అనంత చారి హాలు సరిపోలేదు సార్ అంటే.. ‘మీరు ఆనంద్ ను తక్కువ అంచనా వేసారు’ అంటూ విజయకుమార్ వెళ్ళిపోయాడు. అదేం లేదన్నా అని నేనంటున్నా వినకుండా వెళ్ళాడు. సభలో దర్భశయనం మాట్లాడుతూ ఆనంద్ ఇదంతా ఫీచర్ అంటున్నాడు, కానీ అంతా కవిత్వమే అన్నాడు. భావస్పోరకమయిన రచనలే అన్నాడు. భాస్కర్ కూడా బాగా అనలిటికల్గా మాట్లాడాడు.

నిజానికి ‘మానేరు తీరం’ 90 ల నాటి నా మానసిక స్థితికి దర్పణం. కవిత్వమా, వ్యాసాలా ఏమి రాస్తున్నానో అన్న ఆలోచనే లేకుండానే ఆనాటి ఉద్వేగ వాతావరణాన్ని వారం వారం రాస్తూ పోయాను. సముద్రుడి మరణం నుండి అనేకానేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. వాటిల్లో దుఖం వుంది కోపం వుంది ఏమీ చేయలేని చేతగాని తనమూ వుంది. ఒంటరితనం, మౌనం, మాట, సమూహం, ఉదాసీనత, విశ్వాస రాహిత్యం ఇట్లా నేక శీర్షికలతో రాసాను. సమీక్షలకు పంపితే బాగానే రాసారు.

ఆ విధంగా 1998 లో మానేరు తీరం వెలుగు చూసింది. సహకరించిన మిత్రులందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే..

అదే ఊపులో సమాంతర సినిమా దర్శకులపై నేను రాసిన వ్యాస్ సంపుటి 99 లో వచ్చింది ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను

***********

ప్రవాహం

ప్రవాహం పయనమయి సముద్రాన్ని చేరుతుంది

అవును, పరుగులెత్తడం తెలిసిన ప్రవాహం

నేల తల్లిని ఆర్తిగా తడుముతూ

గమ్యం వైపు సాగిపోతుంది

సాగిపోతున్న ప్రవాహానికి ఆద్యంతం

తీరం అంటి పెట్టుకునే వుంటుంది

నదికి ప్రవాహం ఊపిరి అయితే తీరం దేహమవుతుంది

తీరం దేహానికి ప్రవాహపు అంతర్లయ

ఉచ్వాస నిశ్వాసమవుతుంది

గల గల పారే నది మొత్తంగా సజీవ రూపమయితే

నదికి మమతానురాగాలుంటాయి

ఆవేశ కావేశాలూ వుంటాయి

బతుకు పోరాటాలూ వుంటాయి

అవును నదిలాగే జీవితమూ ప్రవాహమే

అనుక్షణం ఓ ఆరాటమే

గమ్యం కోసం పోరాటమే

కాని

మన బతుక్కి ప్రవాహమే తప్ప తీరం లేదు

గుండెల్లో లయ ఊపిరి కోసం వెతలుపడుతుంది

చుట్టూ బందించ బడ్డ గాలి మనది కాదు

అయినా ప్రాణం కోసం శ్వాస సాగుతూనే వుంటుంది

బతుకు ప్రవాహం నడుస్తూనే వుంటుంది

గుండెల్లో ఆర్తి తడిగా తడుముతూనే వుంటుంది

ఆలోచన ఆర్ద్రంగా కడుల్తూనే వుంటుంది

గమ్యం పై మమకారం పెరుగుతూనే వుంటుంది

హ్రుద్యధ్వని పెదాల్లో ప్రతి ధ్వనిస్తూ నే వుంటుంది

గుండె గమనం సాగుతూనే వుంటుంది

అయితే

ప్రవాహం తెలీని బతుకుల్లో మాటలు కోటలు దాటుతాయి

చేతలు సాగిల బడుతాయి గమ్యం గాభరా పడుతుంది

గుండె తడి ఆరిపోయాక పెదాలేమిటి మాట లేమిటి

జీవన గమ్యాలేమిటి

అవును

నేను బతుకు భావాల్ని గురించి ప్రస్తావిస్తున్నాను

గుండె గోడు వినిపిస్తున్నాను

పోరాటాల్ని గురించి మాట్లాడుతున్నాను

కళ్ళు తెరిచింది మొదలు

కుహనా విలువల కౌగిల్లల్లో వెంప ర్లాడుతూ

పెదవి కదిపింది మొదలు ఫార్మాలిటీ పలకరింపుల మధ్య

ప్రేస్తేజీ డాంబికాల మధ్య పెదాల పై వేలాడేసుకున్న

మిధ్యావాదాల మధ్య అరువు తెచ్చుకున్న ఆరాధనల మధ్య

ఊగిసలాడుతూ

తమది కూడా కదలికే నని

జీవన ప్రవాహం లో తమవంతూ వుందని డాంబికం

ప్రకటించే వారిగురించే మాట్లాడుతున్నాను

బంచించ బడ్డ గాలి ఆ వైపు బేడీలు తెంపు కుంటోంది

చూడమంటున్నాను

నదీ ప్రవాహం సముద్ర గమ్యం వైపు పరుగులు తీస్తోంది

పరిశేలించ మంటు న్నాను

తీరం ప్రవాహంతో కాలు కదిపింది

అవలోకించమంటు న్నాను

జీవితగమ్యం మరింత స్పష్టమవుంతుంది

కళ్ళు తెరిచి చూడమంటు న్నాను

మూగ వాడా ! మాటలు నేర్చుకోమంటున్నాను

స్థద్బుడా ! చలనాన్ని శ్వాసించమంటున్నాను

మానవుడా! సమాజాన్ని అర్థం చేసుకోమంటున్నాను

===== వారాల ఆనంద్

30 అక్టోబర్ 2022

See Insights and Ads

Boost post

Like

Comment

Share

65 = యాదొంకి బారాత్ ++ వారాల ఆనంద్

Posted on

 

ఒకటా రెండా

తల నిండా జ్ణాపకాల ఉప్పెన

సముద్రంలో నీటి  బిందువుల్లా

ఉవ్వెత్తున ఎగిసి

అంతలోనే వెనక్కి పోతాయి

ఇసుక రేణువుల్లా

కుప్పలు కుప్పలే తప్ప

లెక్కకు అందవు

ఒంటరిగా వుంటే చాలు

డప్పోని ఎనుక కొమ్మోడు పోయినట్టు

వరుసకట్టి

మనసు మోత మొగిస్తాయి

******

ఆ మోతను దించుకునే యత్నమే ఇది. అయినా దించుకున్న కొద్దీ మరింత భారమై… ఎట్లా వదిలించు కుంటావో  చూస్తానంటున్నాయి. ఏం చేద్దాం మన ప్ర్రయత్నం మనది. జ్ఞాపకాల శక్తి జ్ఞాపకాలది. సుఖమయినా దుఖమయినా ‘బతుకు బారాత్’ అయితే నడుస్తూనే వుండాలి. ఆ క్రమంలో స్నేహితులూ, సాహిత్యం, పుస్తకాలూ, సినిమాలూ అన్నీ నా జీవితంలో భాగమయి పోయాయి. 1996 లో అనుకుంటాను మిత్రులు జూకంటి జగన్నాధం, నలిమెల భాస్కర్ తమ రెండవ పుస్తకాల ఏర్పాట్లు శురూ చేసారు. ఆ రెండు పుస్తకాలు ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’, ‘అద్దంలో గాంధారి’. నేనప్పటికి అగ్రహారం కాలేజీలోనే వున్నాను. సిరిసిల్ల ప్రయాణాలు సాగుతూనే వున్నాయి. అందుకే ఆ రెండు పుస్తకాల ముద్రణ విషయంలో కూడా  నేను పాలు పంచుకున్నాను. మళ్ళీ హైదరాబాద్ ఓంసాయి ప్రెస్. నారాయణ గూడా తాజ్ హోటల్ ఎదురుగా లాడ్జ్ అన్నీ మామూలే. హైదరాబాద్ వెళ్ళిన రెండవ రోజు ఉదయం తాజ్ లో ముగ్గురం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. ఇంతలో నిజాం వెంకటేశం అక్కడికి వచ్చాడు. ఆయన ఎక్కడికయినా రావడమంటే తుఫాన్ వచ్చినట్టే. ఇతరులకు మాట్లాడే అవకాశం ఉండదు. ఆయన నోటికి తప్ప ఇతరుల నోళ్లకు పనే వుండదు. కేవలం చెవులకే పని. అట్లా రాగానే ఇదో డబ్బు అదో ప్రింటింగ్ అన్నాడు.

రెండు పుస్తకాల ప్రింటింగ్ కు అవసరమయిన డబ్బు ఇచ్చేసి మాట్లాడుతూ మాట్లాడుతూనే వచ్చినంత వేగంగా వెళ్లి పోయాడు. ఆ రెండు పుస్తకాలూ అట్లా వెలుగు చూసాయి.

….

“పోయినోల్లందరూ మంచోళ్ళు” అన్న స్కీము కింద మనం చాలా మంది గురించి వాస్తవాల్ని వదిలేయాలి. నిజాల్ని మాట్లాడితే గొడవలయిపోతాయి. అది బంధువులయినా, మిత్రులయినా, సాహిత్య పోషకులయినా సరే. ఎవరయితే ఏముంది. ప్రజలని కొల్లగొట్టి కోట్లు దోచేసి ‘సిరి’ సంపదలు కూడ గట్టి దేవుడి హుండీలో ఒక నోట్ల కట్ట వేసేస్తే చాలు గొప్ప భక్తుడయి పోయినట్టే. అంతా ఆయన భక్తి గురించీ ఉదాత్తత గురించే మాట్లాడుతారు. గొప్పగా  రాస్తారు. ఇది నిత్యం జరుగుతున్న తంతే కదా. అదట్లా వదిలేద్దాం.    

కరీంనగర్ టు అగ్రహారం, ఇల్లు టు నౌకరీ ల మధ్య హాబీగా చేస్తున్న ఈనాడు సాంస్కృతిక విలేఖరి తనం వదిలేసాను. అప్పటికి క్రమం తప్పకుండా చదువుతున్న ఇండియా టుడే, అవుట్లుక్, వీక్ లాంటి పత్రికల ప్రభావం నా మీద అమితంగా వుండేది. వాటికి తోడు అప్పటికే  ‘ILLUSTRATED WEEKLY’ లాంటి పత్రికలలో వచ్చే వ్యాసాలూ వాటి లేఔట్ అమితంగా నచ్చేది. ఆ పత్రికల్లో వార్తలు,  వ్యాసాలు, సినిమాల ప్రేసేంటేషన్ చూసి గొప్ప వ్యామోహం కలిగేది. అప్పుడే తెలుగులో ‘సుప్రభాతం’ పత్రిక రావడం మొదలయింది. కొంత కాలం ఏబీకే సంపాదకులుగా వున్నారు. విజ్ఞాన్ రత్తయ్య పబ్లిషర్. అక్కడ ఏవో మార్పులు జరిగి రీజినల్ రిపోర్టర్స్ కోసం ప్రకటన వెలువడింది. మాగజైన్స్ పట్ల నాకున్న ఆసక్తి మేరకు అప్ప్లై చేసాను. టెస్ట్ ఇంటర్వ్యులకు పిలిచారు. శ్రీ కే.వాసుదేవ రావు గారు ఎడిటర్. ఉత్తర తెలంగాణాకు పని చేయమన్నారు. అప్పటికే అక్కడ కాసుల ప్రతాప రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, నాగసుందరి తదితరులు పని చేస్తున్నారు. రాజకీయాల కంటే హ్యూమన్ ఇంటరెస్టేడ్ స్టోరీస్ రాయొచ్చన్నది నా ఆలోచన. కానీ ఒక సారి మగజైన్ లో చేరిన తర్వాత రోజు వారీ వార్తలకంటే భిన్నంగా భిన్న కోణం లో రాయాల్సి వుంటుంది. అలాంటివి ఇంగ్లీషు మాగజైన్స్ చదివే నాకు క్షున్నంగా తెలుసు. అందుకే సుప్రభాతం కు పనిచేసిన రెండు మూడేళ్ళు కరీంనగర్ జిల్లా తో పాటు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు విస్తృతంగా తిరిగాను. పలుసార్లు కవర్ స్టోరీలు రాసాను. ఎడిటర్ కే.వాసుదేవరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడు నాపై ఏ నియంత్రణా పెట్ట్లలేదు. చాలా అనురాగంతో వున్నారు. బాబూఖాన్ ఎస్టేట్లో వున్న సుప్రభాతం ఆఫీసుకు వెళ్తే స్నేహితుడి లాగా మాట్లాడేవాడు. EXPEDITE YOUR STORY అంటూ ఎంత ఖచ్చితంగా టెలిగ్రాములు పంపెవాడో అంతకంటే ఆత్మీయంగా వుండే వాడాయన. చాలా ఇన్ఫార్మల్ గా ఉండేవాడు.

ఆయన చాంబర్లో ఆయన చాయ్ తాగుతూ ఎదుట వున్న నన్నయినా ఎవరినయినా మీరు తాగుతారా అనే వాడు కాదు. అది చూసి చాలాసార్లు నవ్వుకునేవాన్ని.

     ఇక సుప్రభాతం లో రాస్తున్నన్ని రోజులూ కరీంనగర్ లో ఈనాడు జిల్లా విలేఖరిగా  వున్న క్రాంతి నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. ఆయనతో కలిసి అనేక  మీటింగ్స్ కి, ఎన్కౌంటర్ స్థలాలకు వెళ్లాను. అత్యంత వేదనాభరితమయిన దృశ్యాలనూ చూసాను. కోపం ఆవేశం ముప్పిరిగొనేవి. కానీ ఎం చేయగలం..

ఇక మాగజైన్ కి ఫోటోలు ఆయువు పట్టు. కరీంనగర్ లో ఫోటోగ్రాఫర్లు మంత్రి శంకర్, ఠాకూర్ రాజేందర్ సింగ్ నాకు ప్రధానంగా సహకరించారు. అనేక సందర్భాల్లో నా వెంటే వున్నారు. డబ్బుల విషయం ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. నేనయినా వాళ్ళయినా. అది ఆకాలపు నిబద్దత. 

     అదంతా అట్లా వుంటే రిపోర్టింగ్ విషయానిక్ వచ్చినప్పుడు సుప్రభాతం లో రాసిన రెండు మూడు కవర్ స్టోరీ లు ప్రదానంగా గుర్తున్నాయి. ఒకట వరంగల్ వెళ్లి రాసిన “పురుగు మందులే పెరుగన్నాలు’ . మేకలు మేసినట్టు గొర్రెల మంద చేలోపడ్డట్టు పత్తి చేలన్నీ లద్ది పురుగు బారిన పది నాశనమయిపోతున్నాయి. ‘కొంగు బంగారమని కోటి ఆశలు పెంచుకున్న రైతాంగాన్ని నిలువునా కాల్చేస్తుంది’ అంటూ రాసిన ఆ ఆర్టికల్కు మంచి స్పందనే వచ్చింది. నాకు గుర్హున్న మరో కవర్ స్టోరీ ఎం. లక్ష్మయ్య, నేనూ, నాగసుందరి కలిసి రాసింది. ‘గడీల గుండెల్లో పేదవాని ఫిరంగులు ఆ రెండు గ్రామాలు’.  ఆ రెండు గ్రామాలు మద్దునూరు, నిమ్మపల్లి. ఆ రెండు గ్రామాలకు వెళ్లి రాసిన స్టొరీ అది. నిమ్మపల్లి వెళ్ళినప్పుడు మాతో జూకంటి, పవన్, నాగభూషణం, టీ.వీ.నారాయణ లు కూడా వెంట వచ్చారు. ఆ స్టొరీ పబ్లిష్ అయిన తర్వాత దాని స్పందన నాకు స్పష్టంగా ఎదురయింది. కరీంనగర్ లో మా మేన మామ చనిపోయినప్పుడు నిమ్మపల్లికి చెందిన భూస్వామి సోదరుడు ఒకరు వచ్చారు. నా గురించి వివరాలు అడిగాడు. అదంతా నాకు తెలుస్తూనే వుంది. నవ్వుకున్నాను. ఎం.లక్ష్మయ్య చాలా ఇన్వాల్వ్ అయి రాసిన మంచి కథనం అది. ఫోటోలను మంత్రి శంకర్ తీసాడు. సుప్రభాతం లో ప్రతి సంచికలో ఎదో ఒకటి రాస్తూ వచ్చినప్పటికీ నాకు గుర్తున్న నేను గుర్తుంచుకున్న కొన్నింటి జ్ఞాపకాల్ని పంచుకుంటాను.

      నేనూ శంకర్ చాలా కష్టపడి రాసిన స్టోరీ “ సిరోంచా సింహనాదం”. అప్పటి మహారాష్ట్ర లోని గడ్చిరోలీ జిల్లా సిరోంచా ప్రాంత ప్రజలు తమ తాలూకాను అప్పటి ఆంద్ర లో కలపాలని భారీ ఎత్తున ఉద్యమం సాగించారు. దానిపై నేను సిరోన్చా వెళ్లి రాసిన కథనం అది. ఒక రోజు ఉదయమే నాలుగు గంటలకు కరీంనగర్ లో బయలు దేరి బస్సులో కాళేశ్వరం వెళ్లాం. గోదావరి నదికి ఈ పక్క కాళేశ్వరం మరో ఒడ్డుకు సిరోంచా. గోదావరి ప్రాణహితల సంగమాన్ని దాటడానికి డోంగాలే ఆధారం. నేనూ శంకర్ ఇద్దరమూ ఆ చెక్క  డోంగా లు ఎక్కి ఆవలి తీరం చేరాం. అక్కడ ఉద్యమ కారులని కలిసి తిరుగు ముఖం పట్టాము. చీకటి పడే వేళ. మళ్ళీ డోంగా ఎక్కాము.

సరిగ్గా అదే సమయానికి ఊరుములు మెరుపులతో పెద్ద వర్షం అందుకుంది. డోంగా నీళ్ళల్లో అటూ ఇటూ కదుల్తూ వుంటే గజగాజా వణికి పోయాం. శంకర్ అయితే మన పని ఖతం సర్, నా కెమెరా కూడా అంతే అని దాదాపు ఏడ్చినంత పని చేసాడు. డోంగా వాడు భయపడొద్దు సర్ అంటాడు. గుండెలు బిగబట్టుకుని కూర్చున్నాం. ఎట్టకేలకు పూర్తిగా తడిసిన బట్టలతో కాళేశ్వరం చేరి అక్కడే గుడిసె హోటల్ లో కూర్చుండి  మెల్లగా బయల్దేరి ఏ రాత్రికో కరీంనగర్ చేరుకున్నాం. ఇంట్లో చెబితే ఇందిర అరుస్తుందని ఇప్పటికీ చెప్పలేదు.

  ఇక నేను రాసిన మరో స్టోరీ ఫైనాన్స్ కంపనీల మీద రాసింది. సుధా, కోరుట్ల, సిరి, నవ జ్యోతి ఇట్లా కరీంనగర్ జిల్లాలో లక్షలాది జనానికి టోపీలు పెట్టిన ఫైనాన్స్ కంపనీల బాగోతాన్ని ప్రపంచానికి చెప్పిన న్యూస్ స్టోరి అది. చట్ట వ్యతిరేకంగా డ్రా లు తీస్తూ మోసం చేస్తున్న కంపనీల వివారాలు ఫోటోలతో రాసిన వార్త ఎంతో మందికి సాయపడింది అనే చెప్పాలి.

    ఇక ‘ఉత్తర తెలంగాణలో ఉద్రిక్తత’, ‘పోలీసు టాణాల తరలింపు’,’రక్షకులే భక్షకులైన వేళ’, ‘కోవర్ట్ ఆపరేషణ్ తో కకావికలు’ లాంటి వాటితో పాటు ప్రధాన స్రవంతి రాజకీయాల స్టోరీలు రాసిన జ్ఞాపకం వుంది. ‘అంపశయ్యపై ఐదో కృష్ణుడు’, ‘ఆరోపణల బోనులో చేర్మెన్’ అంటూ చాలానే రాసాను. వరంగల్ కు సంబంధించి రెండు మూడు సభలు మాత్రం బాగా గుర్తున్నాయి ఒకటి ‘కోటి గొంతుల నినాదం తెలంగాణా’ అని అఖిల భారత ప్రతిఘటన వేదిక వారి రెండు రోజుల సభల రిపోర్టు, మరోటి కాకతీయ విశ్వ విద్యాలయం వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు డాక్టరేట్లు ఇచ్చినప్పటి కవరేజ్. వారిలో ఎబీకే ప్రసాద్, ఎస్.వెంకట్ నారాయణ,దాశరధి రంగాచార్య, కోదాటి నారాయణ రావు తదితరులు వున్నారు. అయితే ఆర్టిస్టు లక్ష్మా గౌడ్ ఈ డాక్టరేట్ ను ముందే తిరస్కరించారు.

ఇక ప్రోఫైల్స్ ఇంటర్వ్యుల సంగతికి వస్తే బులెట్ గాయంతో నిమ్స్ లో చేరిన గద్దర్ ను కలిసి కవరేజీ ఇవ్వడం, హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవాల సందర్భంగా  నేను కాళోజీ ని ఇంటర్వ్యు చేయడాన్ని మర్చిపోలేను. ఆనాడు కాళోజీ ‘ పతాకం మారింది, కానీ పద్ధతి మారలేదు’అంటూ చెప్పిన సంగతులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.  ఇక మానవీయ కోణంలో హ్యూమన్ ఇంటరెస్ట్ లో రాసిన వాటిలో ‘ఆత్మవిశ్వాసమే అతని రివార్డు’ అని ముద్దసాని రామి రెడ్డి పై రాసిన వ్యాసం ( తర్వాత ఆయన మీద నేనో డాక్యుమెంటరీ కూడా తీసాను ఆ వివరాలు మళ్ళీ రాస్తాను), ‘క్రీడలో పెద్ద బతుకులో పేద’ అంటూ బాల్ బాడ్మింటన్ పిచ్చయ్య గురించ రాసిన ఆర్టికల్, దాంతో పాటు వరంగల్ లో లెక్చరర్ శ్రీనివాస రావు గారు ఇష్టంగా పెంచుతున్న కాక్టస్ మొక్కల పైన ‘ఎడారి మొక్కల్లో ఎనలేని అందాలు’, కరీంనగర్ లో డాక్టర్ నాగభూషణం గారు సేకరించిన మామూలు కర్ర ముక్కల్లోని కళా కృతులలోని అపురూప అందాల్ని ‘కర్రముక్కల్లో కవితా స్పర్శ’ అంటూ రాసిన ఆర్టికల్ నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇట్లా సుప్రభాతం మూడు నాలుగేళ్ల పాటు నాకో పెద్ద వ్యాపకమయి పోయింది.

    ఇక్కడ నాకింకో విషయం గుర్తొస్తున్నది. అదే సమయంలో వరంగల్ జిల్లాలో డాక్టర్ నారాయణ హత్యకు గురయ్యారు. నక్సలైట్లకు సహకరిస్తున్నాడన్నది ఆయన పైన ఆరోపణ. దానికోసం నేను శంకర్ వరంగల్ వెళ్లాం. అప్పటి ఎస్పీ ని కూడా కలిసి ఆర్టికల్ పంపించాను. అదేవారం హైదరాబాద్ వెళ్ళాల్సిన పని పడింది. వాసుదేవరావు గారి చాంబర్లో ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల వున్నారు. తను కూడా అప్పుడు సుప్రభాతం లో రాస్తున్నారు. నారాయణ స్టోరి చూసి ఆమె నన్నడిగారు.. ‘ మీరు ఎప్పుడయినా కవిత్వం ట్రై చేసారా అని’ నేను నవ్వి ఊరుకున్నాను. తనకి గుర్హుందో లేదు తెలీదు.    

 అట్లా సుప్రభాతం లో ఫ్రీలాన్సర్ గా పని చేయడం ఒక గొప్ప అనుభవం. ఏబీకే కు, వాసు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.

తర్వాత ఏబీకే వాసు గార్లు “మా భూమి” లో చేరారు. నన్నూ రాయమన్నారు.. కొన్ని వారాలు రాసాను.. ఆ వివరాలు మళ్ళీ వారం.

జ్ఞాపకాలు

పయికి కనిపించవు కానీ

పిలవని పేరంటం లాగా

వచ్చి వాళ్తాయి తిర్లేసి మర్లేసి

పాత కథల్నే  వల్లే  వేస్తాయి 

జ్ణాపకాలు వట్టి పిరికివి

బయట ధ్వని వినిపిస్తే చాలు

ముడుచుకు పోతాయి

జ్నాపకాల దీపాల్ని ఆర్పలేము

కొడిగట్టినట్టే వుంటాయి

కొసప్రాణంతో నయినా వుంటాయి

గడిచిన కాలపు

నలుపు తెలుపుల్ని

వెంటేసుకు తిరుగుతాయి

ఏది ఎట్లా పోయినా

జ్ణాపకాలు మన వెంటే

ఊపిరి తో పాటు……. 

  • వారాల ఆనంద్
  • 23 అక్టోబర్ 2022                         

“డోగ్రీ” భాషకు పట్టం -కవయిత్రి పద్మా సచ్ దేవ్

Posted on

++++++++ వారాల ఆనంద్

‘Mother of modern DOGRI LANGUAGE ’ గా పేరెన్నికగన్న కవయిత్రి పద్మా సచ్ దేవ్. అంతేకాదు హిందీ సాహిత్యానికి మహాదేవి వర్మ, పంజాబీ సాహిత్యానికి అమృతా ప్రీతంలు ఎంతటి వారో డోగ్రీ భాషకు పద్మా సచ్ దేవ్ అంతే ముఖ్యమయిన సాహితీ వేత్త. జమ్మూ పర్వత సానువుల్లో ధ్వనించే మధురమయిన మాండలిక భాష డోగ్రీ. జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు వాడే రెండవ ప్రధాన భాష. ఇంకా డోగ్రీ ఉత్తర పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తదితార ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడతారు.డోగ్రి మాట్లాడే ప్రజల్ని డోగ్రాస్ అనీ, డోగ్రీ భాశా ప్రాంతాల్ని డుగ్గర్ అనీ పిలుస్తారు.డోగ్రీ భాషకు సంబంధించిన మొదటి సూచన అమీర్ ఖుస్రో కాలం నాడే కనిపిస్తుంది. ఖుస్రో రాసిన ‘నుహ్ సిఫిర్ ‘ అన్న మస్నావీ లో డోగ్రీ ప్రస్తావన కనిపిస్తుంది. డోగ్రీ ఉత్తర పహారీ గ్రూపునకు చెందిన భాష.. తొలి రోజుల్లో టాక్రీ లిపిలో రాసినప్పటికీ క్రమంగా దేవనాగరి లిపిలో రాయడం ఆరంభించారు.డోగ్రీ భాషా సాహిత్యం లో ప్రముఖంగా నిలిచే వారు డాక్టర్ కరణ్ సింగ్.ఆయన అనేక నవలలు, యాత్రా చరిత్రలు, తాత్విక విషయాలూ డోగ్రీ లో రాసారు. అంతే కాదు పలు డోగ్రీ గీతాల్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. డోగ్రీ సాహిత్యం లో ఆధునిక కవిత్వ విభాగం లో సుప్రసిద్ధమయిన పేరు పద్మా సచ్ దేవ్.
డోగ్రీ భాషలో రాసి మెప్పించి 1971 లోనే కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డును అందుకున్నారు పద్మ సచ్ దేవ్. ‘మేరీ కవితా మేరీ గీత్’ అన్న తన కవితా సంకలనానికి సాహిత్య అకాడెమి అవార్డును అందుకున్నారామె. తర్వాత ఆమె తన జీవిత చరిత్ర ‘బూంద్ బావరీ’ కి 2015లో ‘సరస్వతీ సమ్మాన్’ పొందారు. ఇంకా ‘సోవియట్ లాండ్’ పురస్కారం, జమ్మూ కాశ్మీర్ సాహిత్య అకాడెమి అవార్డు ను అందుకున్నారామె. పద్మా సచ్ దేవ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని “ ఎ డ్రాప్ ఇన్ ది ఓషియన్’ పేరుతో ఉమా వాసుదేవ్ ఇంగ్లీష్ లోకి అనువదించారు. పద్మా సచ్ దేవ్ 2019లో సాహిత్య అకాడెమీ ఫెల్లోషిప్ కూడా పొందారు. అంతే కాదు ఆమె పద్మశ్రీ లాంటి అనేక అవార్డులు అందుకున్నారు.
అవార్డుల సంగతి అట్లా వుంటే తాను ప్రేమించి రాసి అభిమానించిన తమదయిన డోగ్రి భాషకు రాజ్యాంగ గుర్తింపు రావాలని ఆమె అవిరళ కృషి చేసారు..ఎంతగానో పోరాడారు. ప్రధాన మంత్రిగా వున్నప్పుడు తన సాటి కవే అయినా అటల్ బిహారీ వాజపేయీ కూడా డోగ్రీ భాష గురించి అడుగుతుందేమోనని తనను తప్పించుకునే వాడని ఆమె ఒక చోట అన్నారు. అంతలా ఉద్యమ రూపంలో డోగ్రీ కోసం పద్మా సచ్ దేవ్ కృషి చేసారు. ఎట్టకేలకు 2003లో డోగ్రీ కి రాజ్యాంగ హోదా దక్కినప్పుడు ఆమె ఎంతగా సంతోష పడ్డారంటే డోగ్రీ కేవలం ఒక మాండలికం కాదని అది సంపూర్ణ స్వతంత్ర భాష అని అన్నారు. ఆ విషయాన్ని రాజ్యాంగం అంగీకరించడం ఎంతో ఆనందంగానూ గర్వంగానూ వుందన్నారామె.
****
పద్మా సచ్ దేవ్ ఆజన్మాంతం డోగ్రీ, కాశ్మీరీ,పంజాబీ సంస్కృతుల్ని తన జీవితంలోనూ సాహిత్యం లోనూ ప్రతిబింబించారు. ఆమె తరంలో డోగ్రీ భాషా కవుల్లో ఆమె అందరికంటే ముందున్నారు. రచయిత్రిగా ఆమె పైన డోగ్రీ భాష, అక్కడి జానపదం, జానపద గాధల ప్రభావం ఎంతగానో వుంది. ఆమె రాసిన మొట్టమొదటి కవిత 1955లో ఒక స్థానిక పత్రికలో అచ్చయింది. అమె కేవలం డోగ్రీ లోనే కాదు హిందీ, సంస్కృత భాషల్లో కూడా మంచి అభినివేశం వున్నవారు. తాను హిందీలో కవితలు,కథలు, నవలలు కూడా రాసారు. అంతేకాదు ఉర్దూ, ఒరియా, మరాఠీ భాషల్లోంచి హిందీ, డోగ్రీ భాషల్లోకి అనేక అనువాదాలు కూడా చేసారు పద్మా సచ్ దేవ్.
పద్మా సచ్ దేవ్ 1940 ఏప్రిల్ 17న జమ్మూ లోని పుర్మండల్ లో జన్మించారు. ఖత్రి కుటుంబానికి చెందిన ఆమె తండ్రి జై దేవ్ బదు గొప్ప సంస్కృత పండితుడు. ఆ రోజుల్లోనే ఆయన డబుల్ ఎం.ఏ., ఎల్.ఎల్.బి. చదివిన విద్యాధికుడు. తండ్రి సాహిత్య ప్రభావం ఆమె మీద చిన్నప్పుడే అమితంగా పడింది. ఆమె తల్లి శకుంతల దేవి.
పద్మ కు చిన్ననాడే శ్వాసతో పాటే ‘డోగ్రీ’ భాషా సంస్కృతులు అబ్బాయి. తొలి రోజుల్లో ఆమె ఉర్దూను ప్రేమించింది, హిందీని ఇష్టపడింది అంతేకాదు ఎక్కువగా సంస్కృతం, ఫార్సీ ప్రభావం లేని హిందుస్తానీని అభిమానించింది. పద్మా సచ్ దేవ్ డిగ్రీ కాలేజీలో చదువుతూ ఉండగా మొదటి సంవత్సరంలోనే మొట్టమొదటి డోగ్రీ కవయిత్రిగా పేరొచ్చింది. తర్వాత ఆమె రచనల్లో పర్వత సానువుల్లోని ప్రజల జీవితం, భాష, సంస్కృతి ప్రధానంగా ప్రతిఫలించాయి. అంతేకాదు ఆ ప్రాంతం స్త్రీల యొక్క మనోభావాలూ, జీవన వ్యధలూ ఆమె రచనల్లో ఎంతగానో ప్రతిధ్వనించాయి. క్రమంగా ఎదిగినకొద్దీ ఇట్లా ఉర్దూలో రాస్తూ పోతే మరి డోగ్రీ సంగతేమిటనే వూహ రాగానే పద్మ ఉర్దూలో రాయడం ఆపేసి డోగ్రీ నే తన వ్యక్తీకరణ మాధ్యమంగా ఎంచుకుని ముందుకు సాగింది. 1945లో డోగ్రీ కోసం ఓ సంస్థ ఏర్పాటయింది. ఆచార్య రామ్నాథ్ శాష్త్రి దానికి మూల పురుషుడు. మిగతా అనేక మంది ఆయన వెంట వున్నారు.అట్లా డోగ్రీ భాష ఒక పెద్ద ఉద్యమ రూపంలో ముందుకు వచ్చింది. స్వతంత్ర భాషగా రాజ్యాంగ గుర్తింపు కోసం తపన పడింది.
అయితే దేశ విభజన కాలంలో జరిగిన హింసా సంఘటనల్లో జైదేవ్ హత్యకు గురయ్యారు.అప్పుడు ఆమెకు ఏడేళ్ళ వయసు. ‘నవ్వడమూ ఒంటరిగానే.. ఏడవడమూ ఒంటరిగానే’ అని ఆమె విలపించారు. పద్మ మొదట వేద్ పాల్ దీప్ ను పెళ్ళాడింది. కాని ఆ వివాహం ఎక్కువ కాలం నిలబడలేదు.తనకు చిన్నప్పటినుండే ఆకాశవాణికి వెళ్ళడం, పిల్లల కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు. దాని కొనసాగింపుగా ఆమెకు డోగ్రీ జానపద గీతాలపైనా ఆసక్తి పెరిగింది. వాటి ప్రభావంతో పద్మ డోలక్ బాగా వాయించేది. దాంతో ‘వొహ్ డోల్కీ లడ్కీ’ అన్న ఆమెకు పేరూ వచ్చింది.
ఆమె 1961లో జమ్మూ లోని ఆకాశవాణి కేంద్రంలో ప్రయోక్తగా పని చేసారు. ఆ కాలంలోనే ఆమె వ్యక్తిగతంగా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అప్పుడు జమ్మూ ఆకాశవాణి కేంద్ర అధికారిగా వున్న సురీందర్ సింగ్ ఆమెను ధిల్లీ కి బదిలీ చేయించుకొమ్మని సూచించాడు. ఇక్కడ జమ్మూలోనే ఇంత కష్టంగా వుంటే అక్కడ దిల్లీలో ఎట్లా అని ఆమె సందిగ్ద పడితే మొదట నువ్వు అక్కడ చేరు. తర్వాత నేను కూడా బదిలీ చేయించు కుంటాను అన్నాడు సురీందర్. ఆయన అప్పటికే హిందుస్తానీ సంగీతకారుడిగా పేరు గడించాడు. అప్పుడు తన మనసులోని మాట చెప్పని సురీందర్ తర్వాత పద్మ ను పెళ్ళాడటానికి ముందుకు వచ్చాడు. వారిది దిల్లీలో విచ్చుకున్న ప్రేమ వివాహం. ధిల్లీ తర్వాత ఆ జంట బాంబే చేరింది.
ఆమె రచనల్లో మధువన్, రాజ దియా మండియా, తావి ది చంహళ్ లు మంచి గుర్తింపును అందుకున్నరచనలు. తర్వాత ఆమె సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ మీద రాసిన ‘ఐసా కహా సే లావూన్’ గొప్ప పేరు తెచ్చింది. తర్వాత డోగ్రీ భాషలో లతా పాటలు పాడి మొదటిసారిగా ఆభాషకు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించింది. ఆ పాటలకు పద్మా సచ్ దేవ్ తానే స్వయంగా స్వరకల్పన చేసారు.
1969లో పద్మా సచ్ దేవ్ మొట్ట మొదటి సంకలనం ’మేరీ కవితా మేరె గీత్’ అచ్చు అయింది. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ ఆనాటి సుప్రసిద్ధ కవి రాం దారీ సింగ్ దినకర్ ‘పద్మ కవిత్వం చదివాక నేను నా కలాన్ని విసిరేస్తాను..పద్మ ఎంత గొప్ప కవిత్వం రాసింది. అదే అసలయిన కవిత్వం’ అన్నారాయన.ఆ సంకలనం ఆమెకు విపరీతమయిన గుర్తింపును ఎంతోమంది అభిమానుల్నీ సంపాదించి పెట్టింది. అనంతరం దానికి సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. ఆమె డోగ్రీ ఉర్దూ లతో పాటు హిందీ లో కూడా పలు రచనలు చేసారు. కవితలు,కథలు నవలలు రాసారు. పలు భాషలనుంచి అనువాదాలు కూడా చేసారు. ఆమె కొన్ని హిందీ సినిమాలకు పాటలు కూడా రాసారు. వాటిల్లో ముఖ్యమయినవి ‘ప్రేమ పార్వత్’, ఆన్ఖీ దెఖీ’ లాంటివి ముఖ్యమయినవి.
ఆమె డోగ్రీ భాషకోసం ఎంతగా తపించారో అంతగానూ కవిత్వాన్ని ప్రేమించారు. అంతేకాదు వ్యక్తిగా ఆమె తన చుట్టూవున్న అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూ వాతావరణాన్ని తేలిక పరిచేది. డోగ్రీ భాషకు రాజ్యాంగ గుర్తింపును సాధించడంలోనే కాదు ఆ భాషా ప్రాముఖ్యతను సాధించడంలో పద్మా సచ్ దేవ్ ఎంతగానో కృషిచేసారు. డోగ్రీ భాషలో తొలి ఆధునిక కవయిత్రిగా పయోనీర్ గా పేరుగడించిన పద్మా సచ్ దేవ్ 4 ఆగస్ట్ 2021 రోజున మరణించారు. ఆమె సృజనాత్మకతకు పోరాటశీలతకు హృదయ పూర్వకనివాళులు.
ఆమె రాసిన కవితల్లో చాలా ప్రాచుర్యం పొందిన వాటిల్లో ‘మాతృభాష’ కవిత ప్రధాన మయింది. తన డోగ్రీ భాషా స్పృహలో ఆమె ఈ కవిత రాసారు.

ఆ కవితకు నేను చేసిన స్వేచ్చానువాదం-
“ మాతృభాష”

ఓ రెల్లు తీగపై ఊగుతున్న
ఓ కొమ్మ దగ్గరికి చేరి
ఓ ‘ఈక’ ను ఇవ్వమని అడిగాను
మొన్ననే ఒకటిచ్చాను ఇచ్చింది కొత్తదే
మరి దాన్నేం చేసావు కొమ్మ అసహనంతో అంది

ప్రతి రోజూ ఓ కొత్త పెన్ను అవసరం అయ్యేందుకు
ఏ యజమాని దగ్గరో
నువ్వేమయినా ఖాతాలు రాసే గణకుడివా

నేను ఏ యజమాని దగ్గరా పని చేయను
దయగల డబ్బున్న యజమానురాలి
దగ్గర పనిచేస్తాను
ఆమె వద్ద నాలాగే అనేకమంది సేవకులున్నారు

వారంతా ఆమెకు సేవలు చేసేందుకు
ఎప్పుడూ సిద్ధంగా వుంటారు

ఆ యజమానురాలు నా మాతృభాష
‘డోగ్రీ’

త్వరగా నాకో ఈకను ఇవ్వు
బహుశా ఆమె నాకోసం ఎదురుచూస్తూ వుంటుంది

రెల్లు తీగ తన చేయిని తుంచి నాకిచ్చి
తీసుకో నేను కూడా ఆమె సేవకున్నే అంది.
*****************
ఈ కవితలో పద్మా సచ్ దేవ్ ప్రధానంగా ఒక ప్రాంతీయ భాష ఎదుర్కొంటున్న ప్రతికూలతల్ని వివరిస్తుంది. నిజానికి డోగ్రి స్క్రిప్టు ‘శరడే’. అయితే డోగ్రీ భాషపైన పర్షియన్ దేవనాగరి స్క్రిప్ట్ లు ఎంతగా ప్రభావం చూపిస్తాయో ప్రతీకాత్మకంగా చెబుతుంది. అట్లాగే గణకుడు (అకౌంటెంట్) అన్నమాట పెట్టుబడిదారీ తత్వానికి సూచన. నిజానికి సృజనాత్మకత కు లెక్కలకు వున్నా వైరుధ్యాన్ని కూడా ఇక్కడ కవయిత్రి సూచిస్తుంది. కానీ భాష కోసం ఈకలు (పెన్నులు) ఎంత అవసరమో కూడా ఈ కవిత బల్లగుద్ది చెబుతుంది. చివరికి రెల్లు తీగ తన చేయిని తుంచి తానుకూడా భాషా సేవకురాలినే అంటుంది. అట్లా పద్మా సచ్ దేవ్ ‘డోగ్రీ’ భాష ప్రాముఖ్యాన్ని అవసరాన్నీ ఈ చిన్న సంభాషణా రూప కవితలో ఆవిష్కరిస్తుంది.
******

తాత్కాలిక శిబిరం
————– పద్మా సచ్ దేవ్
నేను
ఇంట్లోనో స్టూడియో లోనో
ఒంటరిగా వున్నప్పుడు

నా ‘గమ్యం’
నా పక్కన నిలబడి
సున్నితంగానూ ఒకింత కపటంగానూ
సైగ చేస్తూ
నా ఒంటరితనపు భారాన్ని తగ్గిస్తుంది

దానికి నివాసం లేదు
అయినా నేను అత్యాశతో
దాన్ని అనుసరిస్తూ వెంట వెళ్ళాలనుకుంటాను

నా కోరిక
నా బంధాల్ని తుంచడం ఆరంభిస్తుంది

నేనొకప్పుడు
తాత్కాలిక శిబిరమనుకున్న
ఇక్కడే
ఓ పిరికి రక్షణా భావం
నన్ను వెనక్కి లాగుతుంది
@@@

జీవితం
—— పద్మా సచ్ దేవ్

నాకు అవసరం లేనిది
నా వద్ద వున్నప్పుడు
జీవితం
ఎంతో నిండుగానూ నిర్మలంగానూ వుండేది

ఓ దారేదో
అర్దాంతరంగా ముగిసినట్టు

ఒకప్పుడు
ఓ వంతేనేదో కలిపినట్టు
+++

“బాధ”
——— పద్మా సచ్ దేవ్
ఈ తల
ఓ బాధల పెట్టె
పిల్లాడి గిలక్కాయలా గిర గిరా తిరుగుతూ
మళ్ళీ మళ్ళీ టక టాకా శబ్దం చేస్తుంది

ఒకటికాదు ఎన్నో రకాల బాధలు నొప్పులు
గతం జ్ఞాపకాల బాధ
వృధాగా దాచి ఉంచిన రహస్యాల బాద
ఇవ్వలిటి బాధ
రేపటి బాధ

కానీ ఒక బాధ మాత్రం
కొత్తగా పుట్టదు
అదట్లా వుంటుంది వుంటూనే వుంటుంది
ఆ బాధ “నేను”

ఆ బాధ
నేనివ్వాళ గానం చేయలేని
దుఖం నుండి పుడుతుంది.
************************

64= యాదొంకీ బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

బతుకంటేనే అంత …

ఒకింత శబ్దమూ      

మరొకింత నిశబ్దమూ

కళ్ళు తెరిచి చూస్తానా 

వెల్తురులో శబ్దం నౄత్యం  చెస్తుంది 

కళ్ళు మూసుకుంటానా 

లోపల చీకట్లొ 

నిశబ్దం తాండవం చేస్తుంది 

**** అట్లా శబ్ద నిశబ్దాల నడుమ సాగుతూ వచ్చిన కాలంలో సాహిత్యం, పుస్తకాలూ మరో పక్క సినిమాలూ.. వీటన్నింటి నడుమా స్నేహాలూ వుండనేవున్నాయి. అగ్రహారం కాలేజీలో ఏర్పడ్డ స్నేహాలు కేవలం హాయ్ హాయ్ వి కాదు. మనసుకు హత్తుకున్నవి. వాటి కి  తోడు అదే సమయంలో సిరిసిల్లాలోని స్నేహాలు  ముందుకంటే మరింత దగ్గరయి సృజనాత్మకంగా ముందుకు సాగాయి.

అవన్నీ ఇప్పుడు జ్ఞాపకమొస్తున్న కొద్దీ సంతోషమూ మరోవైపు దూరమయిన వాళ్ళ స్మృతులతో వేదనా కలుగుతున్నాయి. వాటన్నింటినీ తేదీలవారీగా కాకుండా కొంత అటూ ఇటుగా గుర్హున్నంత మేర రాసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సిరిసిల్లా వేములవాడల నడుమ వున్న ఆ కాలేజీలో సుఖం అనుభవించాం..రోజూ బస్సో, జీపో, లారీనో ఎక్కి ఇబ్బందులూ పడ్డాం. ఇదిట్లా వుండగా..

      మరో వైపు ఇల్లూ కుటుంబమూ బాధ్యతలూ ఉండనే వున్నాయి. మంకమ్మతోట ఇల్లు విడిచి వచ్చింతర్వాత కిరాయి ఇండ్లల్లో… ఏముంది మనకిష్టం వున్నా లేకున్నా, ఇంటివాల్ల ఇష్టా ఇష్టాల ఫలితంగా మనం మరో ఇల్లు చూసుకోవాల్సిందే. ఆ క్రమంలో 1993–94 నాటికి రెండు ఇండ్లు మారి నాలుగో ఇంటికి మారాం. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ముందు ఫస్ట్ ఫ్లోర్ ఇంట్లో ఉండగానే చొప్పదండి నుండి అగ్రహారం పదోన్నతి పై బదిలీ జరిగింది. అప్పుడే ఒక రోజు అనుకోకుండా చిన్ననాటి మిత్రుడు చింతకింది వేణుగోపాల్ ఇంటికొచ్చాడు. ఆ మాటా ఈ మాటా అయింతర్వాత ఒరేయి కమల్ సెలెక్షన్స్ వాడు ఆస్తులు అమ్మేసి వెళ్ళిపోతున్నాడు గణేష్నగర్ లో వాడికి వున్న ప్లాట్లు కూడా అమ్మేస్తున్నాడు నువ్వు ఒకటి కొనేస్తే బాగుంటుంది అన్నాడు. ‘ పోరా నా దగ్గర పైసలెక్కడున్నాయి.. కాని పోని పని పెట్టకు’ అన్నాను. అది కాదురా మంచి అవకాశం తీసుకో అన్నాడు. ఈ మాటలు విన్న ఇందిర తాను కూడా వేణునే సపోర్ట్ చేయసాగింది. కపిల్ లో వేసిన చిట్ ద్వారా వచ్చిన డబ్బు డిపాజిట్ ఉందికదా.. అంది ఆమె. ఇంకేముంది వేణు ఇక ఒక పట్టాన వదిలిపెట్టలేదు. అప్పటి దాకా ఎలాంటి ఆలోచనాలేని నాకు కూడా అది మంచి ఆలోచనే అనిపించింది. కానీ వున్న డబ్బుకు ఏమోస్తుందో చూద్దాం అని ప్రయత్నం మొదలు పెట్టాను. శిల్పా ఫైనాన్స్ వాళ్ళు నా డిపాజిట్ నాకే ఇవ్వడానికి ఏవో కారణాల వాళ్ళ మొదట అంగీకరించలేదు. మిత్రుడు కే.చుక్కా రెడ్డి చొరవతో ఆ సమస్య తెమిలింది. దూరం నుంచే ప్లాట్ చూడడం సరే అనుకోవడం జరిగిపోయింది. అక్కడ మూడు ప్లాట్స్ వున్నాయి. కనీసం రెండు కలిపితే బాగుంటుంది అంటారంతా. డబ్బు సరిపోదు ఎట్లా.. ఇందిర తన నాన్నని నేను మా నాన్నని కొంత సాయం అడిగాము. అట్లా సమకూరిన సొమ్ముతో రెండు ప్లాట్స్ కలిపి కొనేసాం. మిత్రుడు ఎడమ నారాయణరెడ్డి కూడా ఎంతో చొరవతో మాతో నిలబడ్డాడు. అట్లా ఒక స్థలం ఏర్పాటు అయింది. అందులో నా చొరవ తక్కువ ఇందిరా వేణుల ప్రోత్సాహం ఎక్కువ. గెస్ట్ హౌస్ ముందు ఇల్లు ఇబ్బందిగా వుండి దామోదర్ చూపించిన  గణేష్ నగర్లో మరో ఇంటికి మారాం. అక్కడి నుంచే అగ్రహారం వెళ్ళడం రావడం, అక్కడ ఉండగానే ఎం.ఎల్.ఐ.ఎస్సీ, ఎం.ఏ.(తెలుగు),పూర్తి చేసాను. వాటి కోసం తరచుగా హైదరాబాద్ తిరగడం అంతా సజావుగానే జరిగింది. ఇంతలో 20 నవంబర్ 1994 రోజున రేలకు తమ్ముడు అన్వేష్ రానే వచ్చాడు. అప్పటిదాకా ఒంటరిగా ఫీలవుతూ వచ్చిన రేలకు మంచి కంపనీ దొరికింది. ఆడుకోవడానికి ఎత్తుకోవడానికి మంచి తమ్ముడు దొరికాడు. ఇద్దరినీ చూడ్డం  ఇందిరకు కొంత కష్టమే అయినా ఇష్టంగానే ఇద్దరినీ చూసుకుంది. నేనెట్లాగూ ఉండనే వున్నాను. గణేష్ నగర్ వచ్చిన మొదటి రోజుల్లో ప్లాట్ అక్కడే కదా ఇల్లు ప్రయత్నం చేద్దామని ఇందిరకు కోరికగా వుండేది. నేనేమో డబ్బులెక్కడ అంటూ ఇప్పుడప్పుడే కాదు అంటూ వచ్చాను. అన్వేష్ నామకరణం చేయలేదు కాబట్టి పుట్టిన రోజు బాగా చేయాలి అన్న ఇందిర సూచనతో 20 నవంబర్ 1995 రోజున మంచి ఏర్పాట్లే చేసాం. కరీంనగర్, వరంగల్ చుట్టాల్ని మిత్రుల్నీ ఆహ్వానించాం. పండగ లాగా జరిగింది.

ఇంతలో రేల వివేకానంద స్కూలు లో చేరడం. స్కూలుకు దగ్గరలో వుండాలి అన్న భావన రావడంతో తిరిగి వావిలాలపల్లి పక్కన బాంక్ కాలనీకి మారాము. ఈ మొత్తం ఇండ్ల మార్పిడిలో ఇందిర తమ్ముళ్ళు బాలరాజు, శ్రీనివాస్ లు ఒక సారి, మరోసారి మా తమ్ముడు అమర్ తదితరులు ఎంతో సహకరించారు. 

***

     సరిగ్గా అదే సమయంలో అప్పటిదాకా వున్న స్నేహితులు కొందరు అల్విదా చెప్పేసి ఎన్నో ఖాళీలని వదిలేస్తూ ఈ  లోకాన్ని వదిలేసారు.. అట్లా వెళ్ళిన వాళ్ళల్లో 93 లో అలిశెట్టి ప్రభాకర్ మొదటి వాడయితే ఆతని స్మృతిలో పుట్టిన అలిశెట్టి మెమోరియల్  ట్రస్ట్ పక్షాన మరో సంస్మరణ సభ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ సభ ప్రజా కవి సాహు కోసం. కరీంనగర్ నెహ్రు యువ కేంద్ర హాలు లో ఏర్పాటు చేసిన ఆ సభలో ప్రముఖ రచయితలు  తాడిగిరి పోతరాజు, బీ.ఎస్. రాములు, జీవగడ్డ దిన పత్రిక సంపాదకులు బి.విజయ కుమార్, ఘంటా చక్రపాణి పాల్గొన్నారు. నరేడ్ల శ్రీనివాస్, నారదాసు ఇంకా అనేక మంది మిత్రులు సాహుని ఆయన కథల్ని, ‘కొమురంభీం’ నవలని గుర్తు చేసుకున్నాం. అంతే కాదు సాహు స్నేహాన్ని కూడా అందరమూ మననం చేసుకున్నాం.  ఈ సందర్భంగా తాడిగిరి పోత రాజు సార్  గుర్తొస్తున్నారు. గంభీరమయిన గొంతు తో ఆయన మాట్లాడే తీరు, ప్రేమగా పలకరించే పద్దతీ నేనయితే ఇప్పటికీ మర్చిపోలేను. ఆయనతో నాకు వయసులో వున్న తేడా కారణంగానో మరేమో తెలీదు కానీ అత్యంత సాన్నిహిత్యం ఏర్పడలేదు. తాను ఆర్ట్స్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్ గా వున్నప్పుడూ లేదా బయట కలిసినప్పుడూ  కూడా  ఆప్యాయంగా మాట్లాడుకోవడమే కానీ ఆయనకు శ్రీనివాస్ దగ్గరయినంత  నేను కాలేక పోయాను. ఆయన కథలూ ఆయన జీవన శైలీ నాకెంతో నచ్చేవి. ఆనాటి సాహు సంస్మరణ సభ చాలా ఆర్ద్రంగా జరిగింది. తర్వాతి కాలంలో అలిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ లేదా అలిశెట్టి మిత్రులు బానర్ తో అనేక సాహితీ సభలు నిర్వహించాం.

   దాదాపు కొంచెం అటూ ఇటుగా  వేదనాభరిత జీవన ‘వాస్తవా’న్ని, దాని తాలూకూ పెనుగులాటని పదిహేను కథల సమాహారంగా అందించిన ‘శ్వేతరాత్రులు’  అచ్చుకు వచ్చింది. రచయితలు అల్లం రాజ్య, తుమ్మేటి రఘోత్తం రెడ్డి లు ఇద్దరూ ఆ పదిహేను కథల్ని ఎంపిక చేసి, అయిదు చాప్టర్లుగా ఏర్చి కూర్చారు. అప్పటికి పుస్తకాల  అచ్చు విషయం లో హైదరాబాద్ లో ఆఫ్సెట్ ప్రెస్ కు సంబందించిన కొంత అనుభవం వుండడం వలన ‘శ్వేతరాత్రులు’ అచ్చు బాధ్యత నాకు అప్పగించారు. అప్పటికే జూకంటి, నలిమెల భాస్కర్ పుస్తకాల ముద్రణల అనుభవం ‘శ్వేతరాత్రులు’ కూ పని కొచ్చింది. అంటే ఏదయినా ఒక మంచి అనుభవం మరో మంచి పనికి ఉపయుక్తమవుతుందన్న మాట నాకు అవగతమయింది. ఆ కథల్ని అన్నింటినీ స్క్రిప్టు స్థాయి నుంచి ప్రూఫ్ దాకా చదువుతూ నేనూ ఇందిర ఎన్ని సార్లు బోరున ఏడిచామో.. ‘శ్వేతరాత్రులు’  పుస్తకాన్ని రావి శాస్త్రి గారికి అంకితం చేసారు. ‘స్వప్న నేత్రులు’ పేర వీ.వీ., ‘బాధ్యత’ పేర కాళీపట్నం రామారావు ముందు మాటలు రాసారు. ‘ శ్వేతరాత్రులు’తో నా స్వల్పకాల ప్రయాణం జీవితంలో ఎంతో వెలుగును తెచ్చింది. అందుకు అల్లం రాజయ్య ,తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గార్లకు ఎంతగానో రుణపడి వున్నాను.

    ఆ సమయంలోనే నేనూ అల్లం రాజయ్య ,తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కలిసి వెళ్లి హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఉంటున్న ప్రముఖ కవి కే.శివారెడ్డి గారిని, బేగంపేటలో వున్న ఉషాకిరణ్ మోవీస్  ఆఫీసులో వోల్గా గారిని, అక్కినేని కుటుంబ రావు గారినీ కలుసుకున్నాం. ఆర్టిస్టు చంద్రనీ తదితరుల్నీ అప్పుడే కలిసాం. అదొక అనుభవం. సినిమాలూ, ఫిలిం సొసైటీ కార్యక్రమాల సందర్భంగా వాళ్ళందరినీ అంత క్రితమే నేను కలిసి ఉన్నప్పటికీ ఇద్దరు గొప్ప రచయితలతో కల్సి వెళ్ళడం వేరే..    

++++++

 ఆ సమయంలో ఈనాడు కరీంనగర్ జిల్లా ఎడిషన్లో  సాహితీ సాంస్కృతిక అంశాలు రాస్తూనే అదేసమయంలో కొన్ని అనువాదాలూ మరికొన్ని వ్యాసాలూరాసిన గుర్తున్నది. కొన్ని అనువాద కథలు ‘విపుల’ లో చలసాని ప్రసాద్ రావు గారు వేసారు. ఆయన్ని అప్పుడప్పుడూ కలిసేవాన్ని. ఆయన జీవితమూ, కృషీ ఎంతో స్పూర్తిదాయకమయినవి. అప్పుడే ప్రఖ్యాత రచయిత ఎ.ఎస్.మాధవన్ కథను తెలుగులోకి చేస్తే ఆంధ్రజ్యోతి ఆదివారం లో అచ్చయింది. మాధవన్ ధిల్లీ లో అధికారిగా పని చస్తున్నారని తెలిసి సంప్రదించే ప్రయత్నం చేసాను కానీ సాధ్యం కాలేదు. ఆ కథ పేరు ‘దిద్దుబాటు’. మంచి కథ. ఇక 1995 ఆగస్ట్ లో ఆంద్రజ్యోతి దిన పత్రిక  సోమవారం ‘సాహిత్య వేదిక’ సంచికలో ‘కల్లోల జిల్లాలో ఎగిసిన వచన కెరటాలు’ అన్న వ్యాసం రాసాను. ఎమర్జెన్సీ కాలం నుంచి రెండుదశాబ్దాల కాలం లో కరీంనగర్ జిల్లాలో ఎగిసి వచ్చిన వచన రచయితల రచనల గురించి, రచయితల గురించి రాసిన వ్యాసం అది. ఆ పేజీ ని అప్పుడు పొనుగోటి కృష్ణారెడ్డి గారు చూస్తూ వుండేవారు. సంక్షోభ పడుతున్న సమాజాన్ని, సంఘర్షణ పడుతున్న మానవుల్ని పట్టించుకుంటూ అనేక కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతూ సమాధానాల్ని అన్వేషిస్తూ ముందుకు సాగిన ఆనాటి వచన సాహిత్యాన్ని స్థూలంగా తడిమే ప్రయత్నమే ఆ వ్యాసం.

        ఆ వ్యాసం ఎందరికి నచ్చిందో తెలియదు కానీ వందలాది కథలు రాసిన ఓ ప్రముఖ రచయిత ‘మీరు ఎవర్ని పొగిడారో ఎందుకు పొగిడారో నాకు తెలుసు, నేను ఇన్ని వందల కథలు రాసాను అంటూ ఆక్షేపణలతో’ నాకు పెద్ద లేఖ రాసారు. మరొకరు ఆ ఏముంది ఈనాడు ఆర్టికల్లాగే  వుంది అని కామెంట్ చేసాడు. నేను నవ్వుకున్నాను. అంతకు మించి ఏమీ చేయలేం కదా…

   ఇంతలో నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రిఫ్రెషర్ కోర్స్ వచ్చింది. నాలుగయిదు వారాలపాటు యునివర్సిటీ అతిథి గృహంలో వుండి కోర్సు పూర్తి చేసాను. ఆచార్య ఎన్.లక్ష్మణ్ రావు గారి ఆధ్వర్యం లో బాగా జరిగింది. అప్పుడే కంప్యుటర్ ఇంటర్నెట్ తదితర అనేక విషయాలు అవగతమయ్యాయి. వాటిని లైబ్రరీ కి ఉపయోగించే విషయాలూ కొన్ని నేర్చుకున్నాను. అప్పుడు ఈనాడు వాళ్లకు అందుబాటులో లేని కారణంగా వారి నుంచి  కొంత అసంతృప్తి కనిపించింది, ఎందుకు నేనే మానేస్తాను.. వేరే వాళ్ళను చూసుకోండి అని చెప్పేసాను..అట్లా ఈనాడు తో నా అనుబంధం తెగిపోయింది..

…..      

“జీవనయానం లో

సంకోచ వ్యాకోచాలు తప్పవు 

హృదయ లోలకం 

ముందుకొ వెనక్కో 

వూగకా తప్పదు 

బతుకంటే నే అంత 

తోడు నడవాలి 

తోడు తెచ్చు కోవాలి 

కలిసి నడవాలి 

అడుగుల్లో అడుగు లేసి నడిపించాలి

అయినా అప్పుడప్పుడూ 

సన్న గాలికో 

చిన్న వాలుకో 

దీపం గజ గజ వణికి పోతుంది 

తెరచాపలా వణికేది దీపమే అయినా 

నీడలు అలల్లాడుతాయి 

బతుకు విలవిల్లాడుతుంది

అవును 

బతుకంటెనే అంత 

****

తర్వాత సుప్రభాతం, మాభూమి లాంటి పత్రికల్లో ఫ్రీలాన్స్ చేసాను ఆ విషయాలతో మళ్ళీ వరం కలుస్తాను

. వారాల ఆనంద్

16 అక్టోబర్ 2022  

===========

మంచి సినిమాకు కోట్లు కాదు ఊతం కావాలి

Posted on

++++ వారాల ఆనంద్

        ఒక్క తెలుగు సినిమానే కాదు మొత్తం భారతీయ సినిమా రంగంలో ‘ట్రెండ్’ అన్న మాట చాలా పాపులర్. ట్రెండ్, ట్రెండ్ సెట్టింగ్, ట్రెండ్ సెట్టర్ లాంటి మాటల్ని సినిమా వాళ్ళు తరుచుగా వాడుతూ వుంటారు. ట్రెండ్ అంటే ఒక తరహా సినిమా వచ్చి గెలిచిందంటే చాలు అదే ఒరవడిలో పలు సినిమాలు రావడం. ఆ తరహాని సినిమా వాళ్ళు ఈ ట్రెండ్ అనే మాట తో తరుచుగా వాడుతూ వుంటారు. ఆ మాట సినిమాకు హైప్ తీసురావడానికి కూడా విస్తృతంగా వాడతారు. అయితే ఇవ్వాల్టి వాతావరణంలో ఈ ట్రెండ్ అన్నమాట భిన్న సందర్భంలో, భిన్న ధోరణిలో వాడుతున్నారు. గతంలో హీరోను లేదా ఒక జానర్ సినిమాను ఈ ట్రెండ్ మాటతో ఊదర గొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నడుస్తున్నది “బడ్జెట్ ట్రెండ్”. అంటే పాపులర్ హీరో పేరు కంటే కూడా వంద కోట్ల సినిమా రెండొందల కోట్ల సినిమా అంటూ సినిమా నిర్మాణ సమయంలోనే ప్రచారం చేయడం ఇవ్వాల్టి ఒరవడి, సందడి కూడా. ఇక విడుదల అయిం తర్వాత రోజు రోజుకీ ఇన్ని కోట్ల వసూళ్ళ క్లబ్ లో చేరిందదనేది ఇంకో ప్రచారాస్త్రం. ఇదంతా ఇవ్వాల్టి ట్రెండ్. నిజానికి వ్యాపార సినిమా అంటేనే డబ్బు మాయ.. ప్రచారం ఒక ట్రెండ్. దాంట్లో ఏది నిజమో ఏది ఉత్తుత్తి ప్రచారమో ఎవరికీ తెలీదు. ఇన్ కం టాక్స్, ఎంటర్తైన్మెంట్ టాక్స్ లాంటి వాళ్లకు కూడా అర్థం కాని బ్రహ్మ పదార్ధం ఈ సినిమాల పెట్టుబడీ, వసూళ్ళ వ్యవహారం. అదంతా మనకవసరం లేదు కానీ సినిమా బాగుందా అర్థవంతంగా వుందా లేదా అన్నది మనకు ముఖ్యాం. అంతే కాదు వీక్షకులకు కనీస వినోదం అందించినదా లేదా అన్నదీ అంతకంటే ప్రధానం కదా.

సినిమా నిర్మాణానికి సంబంధించి సాంకేతిక అంశాల్లో అనేక మార్పులు వచ్చాయి. 8 ఎం.ఎం.- 16 ఎం.ఎం., 35 ఎం.ఎం., సినిమా స్కోప్, 70 ఎం.ఎం., బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, స్టీరియో ఫోనిక్, దాల్బీ నుంచి అనేకాకానేక మార్పులకు లోనయింది. FILM VIEWING EXPERIENCE చాలా ప్రగతిశీలయిన మార్పులు వచ్చాయి.  ఆధునిక సాంకేతికత ఎంతగా పెరుగుతూ వచ్చిందో పెట్టుబడీ అంతే పెరుగుహ్తూ వచ్చింది. అంది కాదు సాంకేతిక పరికరాల తో పాటు ఇతర ఇన్ఫ్రా స్ట్రక్చర్  విషయంలో అంతే మార్పులు సంభవించాయి. ఫలితంగా సినిమాలకు పెట్టుబడీ పెరిగింది. అందులో కార్పోరేట్ సంస్థలూ వచ్చి చేరాయి. దాంతో సినిమా రంగంలో నిర్మాతలుగా స్టూడియోలు పోయాయి, సంస్థలూ, వ్యక్తిగత నిర్మాతలూ వెనకడుగు వేసారు. ఇప్పుడంతా కంపనే వ్యవహారం. నిర్మాణం నుంచి మొదలు పంపిణీ, ప్రదర్శన రంగాల దాకా కార్పోరేట్ రంగమే. దాంతో కళ కళాత్మకత అన్న మాటలకు అర్థం పోయి అంతా “అర్థమే” అయిపొయింది. ఫలితంగా సామాన్యుడికి సినిమాకు వున్న కనెక్టివిటీ పోయింది. సినిమా పరాయిదయి పోయింది. వ్యాపార సినిమాకు పెద్ద పోషకుడు అయిన సామాన్యుడు దూరం కావడం తో కలెక్షన్లు ప్రభావితమయి పోయి అనేక సినిమాలు తిరుగు టపాలో వెనుతిరుగుతున్నాయనే చెప్పాలి. అదంతా ఒక వలయం.

ఇక కేవలం సినిమా నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాలనే పరిశీలించుకుంటే సినిమా తొలి రోజుల్లో వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో లేదా అప్పటికి వున్నా చిన్న మధ్య తరగతి పరిశ్రమల్లోనో విజయాలుసాధించిన వాళ్ళు అధిక శాతం నిర్మాతలుగా ఫిలిమ్స్ లోకి వచ్చారు. ఆయా రంగాల్లో లభించిన మిగులును తెచ్చి స్టూడియోలు కట్టి నిర్మాతలుగా మారారు. అక్కడా పెరుతున్న లాభాలూ మరొక వైపు సినిమాలకు పెరుతున్న గ్లామర్ కూడా కొంత మందిని నిర్మాతలుగా చేసిందనే చెప్పాలి. ఇందులో వాటాదార్ల వ్యవస్థ కూడా వచ్చింది. తర్వాత చాలా కాలానికి ప్రపంచీకరణ ఫలితంగా కార్పొరేట్లు సినిమాల్లోక్ వచ్చారు. అది వేరే కథ. ఇదంతా ఇట్లా ఉండగానే సహకారరంగం లో లాగా అనేక మంది సామాన్య సభ్యులు కలిసి సినిమాలు నిర్మించే ప్రయత్నాలూ, సామాన్యులు ఇచ్చిన చందాలతో సినిమాలు నిర్మించిన ప్రయత్నాలూ మన దేశంలో వివిధ భాషా సినిమాలలో జరిగాయి. వాటి ఫలితంగా కొన్ని అర్థవంతమయిన సినిమాల నిర్మాణం జరిగింది. కానీ ఆ ఒరవడి పది కాలాల పాటు నిలబడక పోవడమే విషాదం. ఇటీవల క్రౌడ్ ఫండింగ్ అనే భావన గురించి పలువురు మాట్లాడుతున్నారు కానీ ఆ పేరు మీద కాదు కానీ అలాంటి ప్రయత్నాలు మన దేశంలో చాలానే జరిగాయి. ఆవిధంగా సహకార వ్యవస్థ రూపంలో దేశంలో జరిగిన మొట్టమొదటి ప్రయత్నం కేరళ లో జరిగింది. సుప్రసిధ్హ దర్శకుడు అదూర్ గోపాల కృష్ణన్ పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్ లో తన కోర్సు పూర్తి చేసుకున్నతర్వాత త్రివేండ్రం లో తన మిత్రులతో కలిసి ‘చిత్రలేఖ ఫిలిం సొసైటీ’ తో పాటు ‘చలచిత్ర సహకార సంఘం’ ఏర్పాటు చేసాడు. చిత్రలేఖ ఫిలిం సొసైటీ’ తో దేశ విదేశాల గోప్పసినిమాల్ని ప్రదర్శించడం, ‘చలచిత్ర సహకార సంఘం’ తో సినిమా నిర్మాణం చేయాలని సంకల్పించాడు. సహకార సంఘ సభ్యులు సమకూర్చిన సభ్యత్వంతో తన మొట్ట మొదటి సినిమా “స్వయంవరం” రూపొందించాడు. కేవలం రెండున్నర లక్షల పెట్టుబడి తో నిర్మితమయిన ఆ సినిమాలో ప్రధాన పాత్రల్ని శారద, మధు పోషించారు. ఆ సినిమా ఆ సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమనటి, ఉత్తమసినిమాతోగ్రఫర్ అవార్డుల్ని  అందుకుని కొత్త ఒరవడిని మొదలు పెట్టింది. ఆ సినిమా తోనే మన శారదకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. అట్లా నిర్మాణ రంగం లో సహకార వ్యవస్థలో కేవలం సభ్యులు పెట్టిన పెట్టుబడితో నిర్మించబడి విజయవంతమిన సినిమా గా నిలబడింది.

ఇక ఆ తర్వాత కేరళ లోనే జాన్ అబ్రహం తన మొట్ట మొదటి సినిమా ‘అగ్రహారిత్తుల్ కజుతై’ తర్వాత సామాన్య ప్రజలు ఇచ్చిన చందాలతో ‘అమ్మా అరియన్’ సినిమా తీసాడు. జాన్ అబ్రహం తన మిత్రులతో కలిసి  ‘ఒడిస్సీ’ ఉద్యమం పేర ఉత్తమ సినిమాల్ని పల్లెల్లో ప్రదర్శించే ఒక కార్యక్రమం చేపట్టాడు. అందులో భాగంగా ఊరూరా తిరుగుతూ 16 ఎం.ఎం లో ప్రదర్శనల్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ప్రతి ప్రదర్శన తర్వాత జాన్ తన మిత్రులతో కలిసి జోలె పట్టి జనం వద్ద చందా అడిగే వాడు. అట్లా జనం ఇచ్చిన సొమ్ముతో ఆయన అద్భుతమయిన ’అమ్మా అరియన్’ అన్న సినిమా తీసాడు. ఆ సినిమా కూడా జాతీయస్థాయిలో అవార్డులతో పాటు విలక్షణమయిన సినిమా నిలబడింది. అంటే ఆ సినిమాకు ఇర్మాతలు ప్రజలే..

ఇదిట్లా వుంటే లక్షలాది మంది కలిసి నిర్మించిన సినిమా ‘మంథన్’. ఆ సినిమాకు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించాడు. పాల ఉత్పత్హి పెంచడంలో అనేక విజయాలు సాధించి శ్వేత విప్లవ పితా మహుడిగా పేరొందిన వర్గీస్ కురియన్ జేవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చింది. దాంతో ఆ ఫెదేరషణ్ లో వున్నా 5 లక్షల మంది సభ్యులు తలా రెండు రూపాయల చొప్పున ఈ సినిమా నిర్మాణానికి ఇచ్చారు. దాంతో వాళ్ళంతా నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. అంటే దేశంలో అత్యధిక మంది CROWD FUNDING చేసి నిర్మించిన సినిమా గా మంతన్ మిగిలి పోయింది. గిరీష్ కర్నాడ్, నసీరుద్దిన్ షా, స్మితా పాటిల్, అమ్రీష్ పూరి తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించిన ఈ మంతన్ విశిష్టమయిన సినిమాగా పలు అవార్డుల్ని అందుకుంది.

ఈప్రయత్నాల ప్రేరణ తో కరీంనగర్ లోకూడా ‘కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్’ పేరాక విఫల యథానంజరిగింది. కరీంనగర్ ఫిలిం సొసైటీ ఉదృతంగా కార్యక్రమాల్ని నిర్వహిస్తూనే నిర్మాణ రంగంలోకి వెళ్లాలని చేసిన ప్రయత్నమే ఇది. అప్పటికే నారదాసు లక్ష్మన రావు ఇతర మిత్రులతో కలిసి ‘విముక్తి కోసం’ నిర్మించి వున్నాడు. దాంతో జాన్ అబ్రహం చేసిన అమ్మ అరియన్ ప్రేరణ తో ‘కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్’ ఆలోచన ముందుకు వచ్చింది. హరిపురుశోత్తమ రావు లాంటి వాళ్ళతో సభలు చర్చలు కూడా చేసాం. దాంట్లో ప్రధానంగా డి.నరసింహారావు, నరేడ్ల శ్రీనివాస్, వారాల ఆనంద్, గోపు లింగా రెడ్డిలు ముందున్నారు. నారదాసు పైన పూర్తి నిర్మాణ బాధ్యతల్ని పెట్టాలని నిర్ణయించాం. ఆయనా గొప్ప ఉత్సాహం తో ముందుకువచ్చాడు. సంస్థ రూపొందడడం నాలుగు అడుగులు ముందుకు పాడడం కూడా జరిగింది. కానీ అనేక ఇతర కార్యక్రమాల వత్తిడి తో సమష్ట ముందుకు సాగలేదు. ఒక చారిత్రాత్మక సినిమా నిర్మాణం నిలిఛి పోయింది. అది పెద్ద వైఫల్యంగనే భావిస్తాను. ఇట్లా CROWD FUNDING తో తెలుగులో కూడా కొన్ని యత్నాలు జరిగాయి. వాటిలో ముఖ్యమయంది. ఫణీంద్ర దర్శకత్వం వహించిన సినిమా ‘మను’. అట్లా మరిన్ని మంచి సినిమాలు CROWD FUNDING లో రాగలిగితే నిర్మాణ వ్యయం విషయంలో పోటాపోటీ తగ్గుతుందని మంచి అర్థవంతమయిన సినిమాలు వచ్చే వీలు ఉంటుందని భావిస్తాను.

-వారాల ఆనంద్               

సాహిర్ ‘ఎ లిటరరీ పోర్ట్రేయిట్*+++++ వారాల ఆనంద్

Posted on

సాహిర్ ‘ఎ లిటరరీ పోర్ట్రేయిట్*
+++++ వారాల ఆనంద్

“మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ, పల్ దో పల్ మెరీ కహానీ హై
పల్ దో పల్ మేరీ హస్తీ హై, పల్ దో పల్ మెరీ జవానీ హై
ముఝ్‌సె పహ్‌లే కిత్నే షాయర్ ఆయే ఔర్ ఆకర్ చలే గయే,
కుఛ్ ఆహేఁ భర్‌కర్ లౌట్ గయే, కుఛ్ నగ్‌మే గా కర్ చలే గయే
వో భీ ఎక్ పల్ కా కిస్సా థే, మైఁ భీ ఎక్ పల్ కా కిస్సా హూఁ
కల్ తుమ్ సె జుదా హో జావూఁగా, జో ఆజ్ తుమ్‌హారా హిస్సా హూఁ ”
ఎంత గొప్ప కవిత. ఒక కవి అంతరంగం ఎంత అద్భుతంగా ఆవిష్కరించాడు సాహిర్.
ఆ కవితే తర్వాత ‘కభీ కభీ’ సినిమాలో పాటగా అమితాబ్ నోట పలికించారు. ఇందులో
కవి ఇట్లా అంటున్నాడు “
ఓ క్షణమో రెండు క్షణాలో నేను కవిని,
నా గొప్పతనమూ, యవ్వనమూ అంతే
..
గతం లో నా కంటే ముందు ఎంతో మంది మహా కవులు వచ్చారు గొప్ప కవిత్వాన్ని అందించి వెళ్ళిపోయారు..
వాళ్ళదీ ఓ క్షణపు కథే,
నేనూ అంతే ఒక క్షణపు చరిత్రను..
ఇవ్వాళ మీలో అంతర్భాగమయిన నేను రేపు మిమ్మల్ని విడిచి వెళ్లి పోతాను
ముందు రోజుల్లో నాకంటే గొప్ప కవులు వస్తారు..
మీకంటే మంచి శ్రోతలూ వస్తారు” ఎంత వాస్తవిక మానసిక ఆవిష్కరణ.
అది సాహిర్ కే చెల్లింది. ఉత్తర భారతం లోని లుధ్యానా లో అబ్దుల్ హై గా పుట్టిన వాడు క్రమంగా సాహిర్ గానూ తర్వాత సాహిర్ లుధ్యాన్వీ గానూ ప్రపంచ ప్రసిద్ధుడు అయ్యాడు. సాహిర్ గొప్ప ప్రకృతి ప్రేమికుడు. గొప్ప భావుకుడు. మనిషి పట్ల ప్రేమా, ఆతని వేదన పట్ల, దుఖం పట్ల సానుభూతి సంఘీభావం వున్నవాడు.
అంతే కాదు మనిషి భవిష్యత్తు పట్ల గొప్ప ఆశాభావం కలిగి వున్నవాడు. ఆయన రచనలు, కవితలు, ఈనాటి సమస్యలకూ అద్దం పడుతాయి. నాటి నుంచి నేటి దాకా దేశంలో ప్రగతి శీల ఉద్యమాలకు ఆయన కవితలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
సాహిర్ మొట్ట మొదటి కవితా సంకలనం ‘తల్ఖియాన్’ ఆనాడే ఉర్దూ సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది..సాహిత్యకారులని ఉప్పెనలా కమ్మేసింది. ఆ తర్వాతి కాలం లో ఆ సంకలనం లోని కవితలన్నింటినీ సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఖయ్యాం స్వర పరిచాడు. అంతలా లయబద్దమయిన కవితలవి.
సాహిర్ లుధియానా లో 8 మార్చ్ 1921 రోజున జన్మించాడు. ఆయన తండ్రి ఫజల్ మహమ్మద్ పెద్ద జాగీర్దార్. గొప్ప అట్టహాసమయిన జీవితం ఫజల్ మహమ్మద్ ది. ఆయనకు అనేక మంది భార్యలు ఉండేవాళ్ళు.. సాహిర్ తల్లి సర్దార్ బేగం అందులో ఒకరు. కానీ మొదటి నుండీ ఆ భార్యా భర్తలకు కుదిరేది కాదు. ఎప్పుడూ చిటపటలాడే జంట వాళ్ళది. ఫజల్ ఎప్పుడూ సాహిర్ ని తన కొడుకుగా చూడలేదు. భర్త నుంచి విముక్తి కోరుతూ సర్దార్ బేగం కోర్యు కెక్కింది. సాహిర్ చిన్నప్పుడే తండ్రికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాడు. అప్పుడు అయిన ఖర్చులకోసం గాను సర్దార్ బేగం తన ఇంటిని కూడా అమ్మాల్సి వచ్చింది.
సాహిర్ చిన్నప్పుడు ఖాల్సా హైస్కూలు లో చదువుకున్నాడు. తర్వాత లుధ్యానా లోని రాభుత్వ కాలేజీలో చేరాడు. అక్కడే సాహిర్ కవిత్వం, పాటలు రాయడం ఆరంభించాడు. తన పైన ఆ కాలేజీ ప్రభావం ఎంతో వుందని తర్వాతి కాలంలో సాహిర్ రాసుకున్నాడు.ఆ కాలేజీ కూడా సాహిర్ కు అంతే గౌరవం ఇచ్చింది. ఆయన పేర ఇప్పటికీ కాలేజీ ఆడిటోరియం కు సాహిర్ పేరు పెట్టడమే కాకుండా హాలు ముందు ఆయన ఫోటో తో పాటు ఆయన రాసిన
‘ అల్లా తేరో నాం, ఈశ్వర్ తేరో నాం..
సబ్ కో సన్మతి దే భగవాన్..” అన్న పాటను రాసి ఉంచారు.
ఆ తర్వాత సాహిర్ తన తల్లి తో కలిసి 43 లో జీవిక కోసం లాహోర్ వెళ్ళాడు. అక్కడే జీవితంలోని అత్యంత కష్ట కాలాన్ని చవిచూసాడు. రోజంతా కష్టపడి ఎదో ఒక పని చేయడం, రాత్రి తన కవిత్వ రచన కొనసాగించడం చేసేవాడు. అక్కడే సాహిర్ కవిగా నిలదొక్కుకున్నాడు, ఆయన మొదటి సంకలనం ‘తల్ఖియాన్’ అప్పుడే విడుదల అయింది. ఆ తర్వాత సాహిర్ ‘పర్చాయియాన్’ అన్న సంకలనం వెలువరించాడు. అందులోని ఆయన కవితలు ఆనాటి ప్రగతిశీల కవుల్ని, పాతకుల్ని, సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. సాహిర్ ప్రగతిశీల రచయితల సంఘం లో ప్రముఖుడు అయిపోయాడు. ఎక్కడ ముషాయిరా జరిగినా సాహిర్ కవిత్వం చదవాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయాడు. ‘అప్పుడే ‘ఆదబ్ ఏ లతీఫ్’, ‘శః కార్’, పీత్ లారి, సవేరా లాంటి సంకలనాలకు సాహిర్ సంపాదకత్వం వహించారు.
అదట్లా ఉండగానే దేశానికి స్వాతంత్రం వచ్చింది. దానితో పాటు దేశ విభజన ఖడ్గం కూడా దేశాన్ని కకావికలు చేసింది. సాహిర్ తల్లి తోపాటు పాకిస్తాన్ లోనే వుండి పోయాడు. ప్రగతిశీల భావాలతో వున్న ఆయన ”ఎన్నాళ్లని ఆదరి గొంతుని నొక్కేస్తారు – మేము చూస్తాం – ఎన్నాళ్లని రగులుతున్న ఉద్వేగాలను ఆపగల్గుతారు – మేము చూస్తాం.” అంటూ సాహిర్ రాసిన కవిత పాకిస్తాన్ పాలక వర్గాలకు ఆగ్రహం కలిగించింది. అక్కడి ప్రభుత్వం 1949 లో ఆయన పై వారంట్ జారీ చేసింది. ఇక అక్కడ ఉండలేక సాహిర్ తల్లి తో కల్సి డిల్లీ చేరుకున్నాడు.
ఇండియా వచ్చిం తర్వాత సాహిర్ అభ్యదయ రచయితల సంఘంలో చురుకుగా వుండేవాడు. ఫైజ్, ప్రేమ్చంద్,అలీ సర్దార్ జాఫ్రీ లాంటి మహామహులతో పనిచేసాడు. ఆయన పేదలు, కార్మిక వర్గం సమస్యల పట్ల స్పందిస్తూ చాలా కవిత్వం రాసారు.
కొన్ని నెలలపాటు డిల్లీలో వున్న ఆయనకు డిల్లీ వాతావరణం నచ్చలేదు. అంతే కాకుండా తాను హిందీ సినిమాలకు పాటలు రాయాలనే కోరిక తో మాయానగరం బాంబే చేరుకున్నాడు.
బాంబే రావడం తోటే ‘ఆజాదీ కే రాహ్ పర్’ సినిమాకు మొట్ట మొదటి పాట రాసే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. దాంతో సాహిర్ కు పాటల రచయితగా నిలదొక్కుకోవడానికి రెండేళ్ళు పట్టింది. రెండేళ్ళ తర్వాత వచ్చిన ‘నౌజవాన్’ లో ఆయన రాసిన ‘ తండీ హవా యెన్..’ లాంటి పాటలతో అందరినీ ఆకర్షించాడు. ఆ సినిమాకు సంగీత దర్శకత్వం ఎస్డీ బర్మన్.
తర్వాత సాహిర్ కు గొప్ప విజయాన్నీ చిరస్తాయినీ కల్పించిన సినిమా గురుదత్ ‘ప్యాసా’, దానికి కూడా ఎస్డీ దే సంగీతం.
ఏ మహాలోంకి ఏ తక్తోంకి, తాజోంకి దునియా
ఏ ఇన్సాన్ కే దుష్మన్ సమాజోంకి దునియా
ఏ దౌలత్ కే భూకే రివాజోంకి దునియా
ఏ దునియా అగర్ మిల్భి జాయేతో క్యాహై ..’
లాంటి అద్భుతమయిన లిరిక్స్ రాసిన సాహిర్ కు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు.
రోజు రోజుకీ హిందీ చలనచిత్ర సీమలో సాహిర్ ప్రభ వెలిగి పోసాగింది.
మరో పక్క హిందీ సినిమా రంగంలో ప్రగతి వాదుల సంఖ్యా పెరిగింది. సమాజాన్ని మార్చేయాలనే తపన ఆర్తి తో సినిమాలు నిర్మించే వాళ్ళ సంఖ్యా పెరగ సాగింది. ఆ స్థితిలో అలాంటి సినిమాలు అన్నింటికీ పాటలు రాసేందుకు సాహిర్ నే పిలిచేవారు. 1958 లో రమేష్ సైగల్ ‘ఫిర్ సుభా హోగీ’ సినిమా నిర్మాణానికి పూనుకున్నాడు. రాజ్ కపూర్ హీరో. ఆ సినిమాకు దాస్తోవిస్కి రాసిన ‘క్రయిం అండ్ పరినిష్మేంట్’ ఆధారం. పాటల కోసం సాహిర్ ను పిలిచారు. అప్పుడు సాహిర్ అన్నాడు ‘క్రయిం అండ్ పరినిష్మేంట్’ చదివి అర్థం చేసుకున్నవాడు సంగీత దర్శకుడు అయితే బాగుంటుంది అన్నాడు. అట్లా ఎవరున్నారు అనగానే ఖయ్యాం అన్నాడు సాహిర్. కాని రాజ్ కపూర్ చాయిస్ ఎప్పుడూ శంకర్ జైకిషన్. ఆయన్ని ఒప్పించగలిగితే సరే లేదంటే మనకు వేరే అవకాశం లేదు అన్నాడు సైగల్. చలో అని ఖయ్యాం సాహిర్ లు పాటలను స్వర పరిచి రాజ్ కపూర్ కు వినిపించారు. ఒక్క మాటతో అవుట్ స్టాండింగ్ అన్నాడంట రాజ్. అట్లా ఆ సినిమాకు ఖయ్యాం సంగీత దర్శకుడు అయ్యాడు. అట్లా ఆకాలంలో సాహిర్ ఒక సినిమాకు ఎవరు సంగీతం ఇవ్వాలో కూడా నిర్ణయించేవాడు. ఆ సినిమా అణచివేతకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన సామాన్యుడి సినిమా గా వినుతికెక్కింది.
ఆ రోజుల్లో సినిమా రంగంలో రచయితలకు కవులకు అంత ప్రాధాన్యత వుండేది కాదు. దానికోసం సాహిర్ పట్టు బట్టి సంగీత దర్శకుడి కన్నా ఒక రూపాయి ఎక్కువ పారితోషికం తీసుకునేవాడు. టైటిల్స్ లో పేరూ అంతే.
ఇదంతా ఇట్లా వుంటే సాహిర్ కు జీవితంలో అంతా తన తల్లే. తల్లి చుట్టే ఆయన లోకం.
సాహిర్ కు పాకిస్తాన్ లో ఉండగానే అమృతా ప్రీతం తో పరిచయం స్నేహం కలిసాయి. అమృతా ప్రీతం సాహిర్ని అమితంగా ప్రేమించింది. వాళ్ళిద్దరూ కలుసుకునే వాళ్ళు ఉత్తరాలు రాసుకునే వాళ్ళు. కానీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అమృత జీవిత కథ ‘రాసీదీ టికెట్’ లో వీరద్దరి అనుబంధాన్ని “ఖామోషీ కా హసీన్ రిస్తా” అని రాసింది. సాహిర్ కూడా
“ చలో ఏక బార్ ఫిరసే అజ్నబీ బంజాయే హం దోనో.. అని రాసాడు.
మధ్యలో సాహిర్ కు సుధామల్హోత్రా తో కొంత అనుబంధం ఏర్పడింది అంటారు కాని వాళ్ళిద్దరూ కూడా పెళ్లాడలేదు. సాహిర్ చివరంటా ఒంటరిగానే వుండి పోయాడు.
సాహిర్ తన సినిమా యాత్రలో ప్రేమ గీతాలతో పాటు, విరహం, ఉద్వేగం, దేశ భక్తి, ప్రగతిశీల భావాలతో పాటలు రాసాడు. సినిమా పాటల కోసం కాకుండా ఆయన రాసిన కవితల్లోంచి అనేకం సినిమాల్లోకి పాటలుగా రూపాంతరం చెందాయి. ఇంకా అయన అనేక భజన్స్, ఖవ్వాలీలు రాసారు..సినిమాల్లో దాదాపుగా ఆయన రాయని జానర్ లేదనే చెప్పాలి.
సినిమా కవిగా సాహిర్ ఎంత పాపులరో విలక్షణ మయిన కవిగా అంతే ప్రసిద్ధుడు. తల్కియాన్, పర్చాయియాన్ లాంటి కవిత్వ సంకలనాలతో ఉర్దూ కవిత్వం లో తనదయిన ఒక ముద్రను లిఖించాడు.
నేనిక్కడ నాగురించి ఒక మాట చెప్పాలి చిన్నప్పటినుంచీ నేనో సినిమా పిచ్చోన్ని. అంతకంటే నాకు సినిమా పాటలు అందులోనూ హిందీ పాటలంటే మహా పిచ్చి. ఇట్లా ఎన్ని పాటలు… దశాబ్దాలుగా వింటూ మైమరిచి పోయాను. గున్ గునాయిస్తూ ఊగి పోయాను. నేను పాటల పిచ్చోన్ని అని చెప్పాను కదా 70 ల్లోనే సిలోన్ రేడియో లో వచ్చే ‘బినాకా గీత్ మాలా’ అంటే ప్రాణం పెట్టేవాన్ని. ప్రతి బుధవారం రాత్రి 8 అయిందంటే చాలు రేడియో ముందుకు చేరాల్సిందే. అంటే కాదు ప్రతి రోజూ ఉదయం 7.30 కి ప్రసారమయ్యే ‘పురానీ ఫిల్మొంకా గీత్ వినాల్సిందే. అట్లా పాటలంటే ప్రాణం పెట్టె నేను క్రమంగా ఆ పాటల గాయకులే కాకుండా సంగీత దర్శకుల పేర్లు రాసిన కవుల పేర్లూ తెలుసుకోవడం మొదలు పెట్టాను. అందులో నాకు కవిగానూ సినీ గీత రచయిత గానూ మదిలో నిలిచిపోయిన వాడు సాహిర్.
అట్లా కవిత్వమూ పాటలూ రాసి మెప్పించిన సాహిర్ పుట్టి నూరేళ్ళు పూర్తయినాయి.

కవిత్వమన్నాకూడా అంతేకదా అందుకే ఇటీవల సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్ (SAHIR A LITERARY PORTRAIT by SURINDER DEOL ) పుస్తకాన్ని చదివాను. సాహిర్ లుధ్యాన్వీ సాహిత్యాన్నీ జీవితాన్నీ సురేందర్ దేవల్ చాలా బాగా రాసారు. ఈ ‘సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్’ లో సాహిర్ రాసిన 90 కి పైగా రచనల ఆంగ్లానువావాదాలున్నాయి. వాటిల్లో కవితలు, గజల్లు, భజనలు వాటి తో పాటు ‘PARCHAAIYAAN’ (నీడలు) లాంటి దీర్ఘ కవితలూ వున్నాయి.
ఇందులో రచయిత ముఖ్యంగా కవిగా సాహిర్ లోని నాలుగు ప్రధాన లక్షణాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. సాహిర్ ను ఆయన సాహిత్య జీవితాన్ని కళ్ళముందుకు తెచ్చిన పుస్తకంగా ఇది నాకు బాగా నచ్చింది. ఈ పుస్తకంలో సాహిర్ చిన్నప్పటి జీవితం నుంచి మొదలు 40 లలో వచ్చిన తన మొదటి కవిత్వ సంకలనం “తల్కియాన్” వరకు మొదటి భాగంలోనూ, తర్వాతి కవితా పుస్తకం“ పర్చాయియాన్” 2 వ భాగం లోనూ, ౩,4 భాగాలలో సాహిర్ రాసిన గజల్స్, భజన్స్ గురించి రాసారు. ఇక చివరి భాగంలో ముగింపు భావనలున్నాయి. సాహిర్ లుధ్యాన్వీ రాసిన అద్భుత కవిత్వాన్ని ఆవిష్కరించిన పుస్తకంగా సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్* మిగిలిపోతుంది.
చివరగా ఈ సాహిర్ కవితను మననం చేసుకుంటాను…
”మానా కి ఇస్‌ జమీ కో న గుల్జార్‌ కర్‌ సకె – కుచ్‌ ఖార్‌ కం తో కర్‌ గయే గుజ్రే జిధర్‌ సె హం”
(అవును ఈ ప్రపంచాన్ని నందనవనంగా మార్చ లేకపోయాం – కానీ మనం నడిచిన దారిలో కొన్ని ముళ్ల నైనా తీసివేయగలిగాం )
కవిత్వంతో పాటు సినిమా పాటల రచనల్లో తన బాణీని ఏర్పరిచాడు. తన ముద్రను మిగిల్చాడు
సాహిర్ 1980 అక్టోబర్ 25 న ఈ లోకంవిడిచి వెళ్ళిపోయాడు.
****
‘యుద్దం వాయిదా వెస్తేనే మంచిది’
– సాహిర్ లుధ్యాన్వి
(తెలుగు: వారాల ఆనంద్)
యుద్దం వాయిదా వేస్తేనే మంచిది
భూమి నీదయినా నాదయినా
దీపాలు వెలుగుతూవుంటేనే మంచిది

రక్తం నీదయినా విదేశీయునిదయినా
‘మెట్టుకు’ అది ఆదాము రక్తం కదా
యుద్దం తూర్పునయినా పశ్చిమానయినా
అది ‘ప్రపంచ శాంతి’ హత్య కదా

యుద్దం ఓ పెద్ద ‘తెగులు’
ఏ బాధ కయినా అది ఉపశమనం ఎట్లా అవుతుంది
రక్తం, నిప్పు ఈరోజు దయ చూపొచ్చు
రేపది అత్యంత హీనమయింది, దేనికీ సరిపోనీది

నీ ఆధిపత్య ప్రదర్శన కోసం
రక్తప్రవాహం అవసరమా
నీ ఇంట్లో చీకటిని తరిమికొట్టడానికి
ఇంకొకరి ఈ నగరాన్ని బూడిద చెయాలా

బాంబులు ఇండ్ల పైనో సరిహద్దు పైనో కురువొచ్చు
అవి భవనాల ఆత్మల్ని ధ్వంసం చేస్తాయి
మండుతున్న భూమి నీదయినా విదేశీయునిదైనా
నీరుపపేద బతుకులే బాధతో మెలికలు తిరుగుతాయి

యుద్ద టాంకులు దాడి చేయొచ్చు లేదా వెనుతిరగొచ్చు
‘నేలగర్భం’ నిస్సార మవుతుంది
విజయంతో విర్రవీగొచ్చు
ఓటమితో దుఖపడొచ్చు
ఏదయినా బతుకు నిష్పలమై
విషాదంలో కొరుకు పోతుంది

ఓ మచ్చ లేని మానవుడా
దీనంగా ఆర్థిస్తున్నా
యుద్దాన్ని వాయిదా వేయండి

నేల నాదయినా నీదయినా
దీపాలు వెలుగుతూ వుంటేనే మంచిది
————————————
( పశ్చిమ ఆసియాలో యుద్ద మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో సుప్రసిద్ధ ఉర్దూ కవి, సినీ గీత రచయిత సాహిర్ లుధ్యాన్వీ దశాబ్దాల క్రితం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఈ కవిత ఇప్పటికీ రెలెవెంట్ )

సాహిర్ 'ఎ లిటరరీ పోర్ట్రేయిట్*
+++++ వారాల ఆనంద్

ఖరీదుగా మారిన వినోదం – వారాల ఆనంద్

Posted on

24 MY WEEKLY COLUMN IN ‘DISHA’ DAILY

ఖరీదుగా మారిన వినోదం

++++++++++++ వారాల ఆనంద్

  మన దేశంలో ‘సినిమా’నే సామాన్య ప్రేక్షకుడికి వినోదం. తెరపై బొమ్మలు కదలడం, మాట్లాడడం, పాడడం, నాట్యం చేయడం మొదలయ్యాక సినిమా సామాన్యుడి జీవితంలో అంతర్భాగమయిపోయింది. పడగొచ్చినా పబ్బమొచ్చినా, దోస్తులు కలిసినా చుట్టాలొచ్చినా అంతా కలిసి సినిమాకు వెళ్ళడం భారతీయులకు సాధారణం కాలక్షేపం. అంతేకాదు వాళ్లకు  ‘కదిలే బొమ్మల కబుర్లు’ చెప్పుకోవడం, వాటి గురించి మాట్లాడుకోవడం ఎంతో సరదా అయిన వ్యాపకం. సినిమా కనిపెట్టబడిన ఈ శతాబ్దకాలంలో ముంబై లాంటి మహానగరాలనుంచి మారు మూల పల్లెల దాకా సినిమా ప్రజల్లోకి చొచ్చుకు పోయింది. అంతకు ముందు వీధి నాటకాలూ, హరికథలూ, బుర్రకథలూ,ఒగ్గు కథలూ లాంటి కళా రూపాల్లో రామాయణ, భారత కథల్ని చూసి ఆనందింఛి వినోదాన్ని చూసిన సామాన్య ప్రజానీకానికి సినిమా అద్భుతమయిన కాలక్షేప వినోద వ్యాపకంలా మారిపోయింది. అవి వారికి అందుబాటు ధరలో వినోదాన్ని పంచాయి. రోజంతా కాయకష్టం చేసిన సామన్యునికి సినిమా పెద్ద వేదిక అయిపొయింది. కానీ ప్రదర్శనా రంగంలో ఇవ్వాళ  ‘మల్టీ ప్లెక్ష్’ సినిమా హాళ్ళ సంస్కృతి వచ్చి సామాన్యున్ని సినిమాలకు దూరం చేసింది.

    గతంలో నా ఎరుకలోనే 35 పైసలకు నేల టికెట్ మీద సినిమా చూసిన జ్ఞాపకం వుంది. అప్పుడు బెంచి 75 పైసలు, కుర్చీ రూ.1.25 గా వుండేది. అది కాలక్రమంగా కొంచెం పెరిగినా సామాన్యుడికి భారం కాని స్థాయిలోనే వుండేది. సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళల్లో 800–1000 సీట్లదాకా ఉండేవి. వాటిల్లో లోయర్ క్లాస్ ఎక్కువగా వుండి హయ్యర్ క్లాస్ టికెట్స్ సీట్లు తక్కువగా ఉండేవి. అప్పుడు సామాన్యుడికి సినిమా అత్యంత చవకయిన వినోదం. ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్ళగలిగే వాళ్ళు. అంతే కాదు ఒకే సినిమాను పలుసార్లు రిపీట్ ఆడియన్స్ గా చూసేవాళ్ళు. ఈలలు కొట్టి గోల చేసేవాళ్ళు. సినిమాల్ని పలు కేంద్రాల్లో వంద రోజులు, సిల్వర్ జూబిలీ. గోల్డెన్ జుబ్లీ లు చేసేవాళ్ళు. సామాన్య ప్రేక్షకుల్లోనే హీరోలకు అభిమాన సంఘాలు ఉండేవి. టాకీసుల ముందు బానర్లు కట్టి పూలదండలు వేసి పండగ చేసుకునే వాళ్ళు. అంటే కేవలం వినోదం పేర సినిమాలకు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇవ్వాళ ఈ దృశ్యాలు మనకు కనిపించవు.ఈ రోజుల్లో సినిమా వాళ్ళే విపరీతంగా డబ్బులు పెట్టి ప్రచారం చేసుకుని డబ్బా కొట్టుకునే స్థితి మనకు కనిపిస్తుంది. దాంతో సామాన్యుడికి సినిమాకు వున్న కనెక్టివిటీ పోయింది. సినిమా పరాయిదయి పోయింది. 

     ఇవ్వాళ మల్టీ ప్లెక్ష్ సినిమా హాల్లల్లో ఒక కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్ళాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ రోజు సినిమా ఒక ఖరీదయిన వినోదంగా మారిపోయింది. సరసమయిన ధరలకు దొరికే వినోదం కాస్తా ఖరీదయినదిగా మారడంతో సామాన్య ప్రేక్షకులు సినిమాలకు, సినిమా హాళ్ళకు దూరం అయిపోయారు. అంతే కాదు ఓ నెలనొ రెండు నెలలో ఆగితే ఓ టీ టీ లలో చూడొచ్చులే  అనే భావన ప్రక్షకుల్లో క్రమంగా నెలకొంటున్నది. పర్యవసానంగా సినిమా హాళ్ళకు వచ్చే జనం తగ్గిపోయి అవి బోసి పోతున్నాయి. జనం సినిమాలకు రావడం లేదు మొర్రో అని సినిమా వాళ్ళు గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. ప్రేక్షకుల్ని టాకీసుల్దాకా రాబట్టడానికి ఎన్నెన్నో కొత్త ఎత్తులు వేయడం పాన్ ఇండియా అని కబుర్లు చెప్పడం శురూ చేసారు. “ ప్రేక్షక దేవుళ్ళు అనే మాట మరిచిపోయి ప్రేక్షకుల్ని వినియోగదారులుగా, కస్టమర్స్” గా చూడ్డం  ఆరంభించారు. ఫలితంగా వాళ్ళు సినిమా నిర్మాణం నుండి విడుదల దాకా అష్ట కష్టాలు పడాల్సి వస్తున్నది. తీరా ఎదో ఒకరకంగా సినిమా ను టాకీసుల్దాకా తెస్తే అవి ఆర్థికంగా ఏమవుతాయో తెలీని స్థితి ఏర్పడింది. అంటే సామాన్యుడి వినోదాన్ని హంగుల పేర వాళ్లకు దూరం చేసి తిరిగి వాళ్ళనే దోషులుగా మాట్లాడ్డం సినిమా వాళ్లకు అలవాటయిపోయింది.

అసలీ సినిమా రంగంలో ఈ మార్పు ఈ రోజు కాదు 90 లలోనే మొదలయింది. దానీ ప్రధానంగా అప్పుడు  దేశంలో అమల్లోకి వచ్చిన ఎల్.పీ.జీ, ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అంటే గోబలైజేషణ్ ప్రభావం సినిమా రంగం పైన పెద్ద ఎత్తున పడింది. అప్పుడే సినిమాకు పరిశ్రమ హోదా ఇచ్చారు. దాంతో చిన్న నిర్మాతల స్థానం లో పెద్ద కార్పోరేట్స్ నిర్మాణ, పంపిణీ, ప్రదర్శనా రంగాల్లోకి వచ్చాయి, చిన్న, వ్యక్తిగత నిర్మాతలు క్రమంగా రంగం నుండి తప్పుకున్నారు. పెద్ద పెట్టుబడులు చేరాయి. క్రమంగా పాశ్చాత్య సంస్కృతి పెచ్చరిల్లింది. వాటికి తోడు ఆధునిక సాంకేతికత ఆవిర్భావంతో సినిమా సీన్ మొత్తం మారిపోయింది. తొలుత సినిమా హాళ్ళల్లో కింది టికెట్ల సీట్లు,సంఖ్య తగ్గించేసారు. క్రమంగా పెద్ద రెట్ల టికెట్స్ సీట్లు పెంచారు. అక్కడే మొత్తం ప్రహసనం మొదలయింది. దాంతోనే ఆగకుండా అసలు ఈ సింగిల్ స్క్రీన్ హాళ్ళు అనవసరం అన్నారు. వర్క్ ఆవుట్ కాదన్నారు. వాటి స్థానంలో చిన్న మల్టీ పర్పస్ సినిమా కామ్ప్లెక్ష్ ల ఆలోచన మొదలయింది. దాని పర్యవసానమే ఇవ్వాల్టి  మల్టీ ప్లెక్ష్ లు. సినిమా ప్రదర్శనలకు హాల్లల్లో కేవలం 200 సీట్లకు పరిమితం చేసి మొత్తం ఓ వ్యాపార కూటమిగా అవి ఏర్పడడం మొదలయ్యాయి. 1990 ల్లో ముంబైలో మొట్ట మొదటి పీ.వీ.ఆర్ ఆమపమ మల్టిపుల్ సినిమా హాలు మొదలయింది. తర్వాత 2002 లో ముంబై లో ‘ఫేం సినిమా’ మొట్ట మొదటి మల్టీ ప్లెక్ష్ గా పేరొందింది. వాటిల్లో షాపింగ్ కాంప్లెక్స్, కాఫీ హౌజ్ , పాప్ కార్న్ టబ్స్, గేమింగ్ మొదలయిన వన్నీ సమకూర్చడం మొదలు పెట్టారు. రెండు మూడు వందల్లో సినిమా టికెట్ రెట్లు, ఇతర షాపింగ్ కూడా ఖరీదయింది కావడం తో ప్రేక్షకుల పైన భారం విపరీతంగా పెరిగింది. ఇప్పటికి దేశంలో మహానగరాల నుంచి మామూలు పట్టణాల వరకు మల్టీ ప్లెక్ష్ సంస్కృతి పెరిగి పోయింది. దేశమంతా పీ.వీ.ఆర్.,ఐనొక్ష్, బిగ్ సినిమా ఎస్క్వేర్, సినిపోలిస్, ముక్తా లాంటి  కార్పోరేట్స్ మల్టీ ప్లెక్ష్ రంగాన్ని శాశిస్తున్నాయి అనడం లో అతిశయోక్తి లేదు.

ఈ స్థితిలో సామాన్యుడు సినిమా హాలుకు రావడం గగనం అయిపోయిందనే చెప్పాలి. వ్యాపార సినిమాకు పెద్ద పోషకుడు అయిన సామాన్యుడు దూరం కావడం తో కలెక్షన్లు కూలి పోయి సినిమాలు తిరుగు టపాలో వేనుతిరుగుతున్నాయనే చెప్పాలి.

అయితే ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే సినిమా వాళ్ళు గమనిస్తున్న దాఖలా కనిపిస్తున్నది.

ఉదాహరణకు చెప్పుకుంటే “బచ్చన్ బ్యాక్ టుది బిగినింగ్’ గురించి చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కి 80 ఏళ్ళు నిండిన సందర్భంగా పీ.వీ.ఆర్.సినిమాస్ , ఫిలిం హీరిటేజ్ ఫౌండేషన్ సంయుక్తంగా 4 రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. దేశంలోని 17 నగరాలలోని 22 సినిమా హాల్లల్లో ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే ఈ సినిమాలు ప్రదర్శించే ఈ నాలుగురోజులకు గాను కేవలం రూ. 400/ మాత్రమే చార్జ్ చేస్తారు. అంటే మల్టీ ప్లెక్ష్ రెట్లు కాకుండా ముంబై, డిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాలతో పాటు సూరత్ బరోడా లాంటి నగరాల్లో కూడా ఈ సినిమాలు ప్రదర్శిస్తారు. వీటిలో డాన్, కభీ కభీ, నమక్ హలాల్, అభిమాన్, కాలా పత్తర్, దీవార్, మిలీ లాంటి సినిమాల్ని ఇందులో ఈ పాకేజీలో ప్రదర్శిస్తారు. అంటే మల్టీ ప్లెక్ష్ ప్రదర్శనలు సామాన్యుడికి అందుబాటులోకి ఇచ్చే ప్రయత్నం ఇది. ఇది ఘనంగా విజయవంతమయితే భవిష్యత్తులో మల్టీ ప్లెక్ష్ ఆలోచన మారే అవకాశం వుంది. ఆ క్రమంలో తెలుగు సినిమా రంగం కూడా ఆలోచించాల్సి రావచ్చు. అట్లా జరగాలని మళ్ళీ సినిమా వినోదం సామాన్యుడికి అందుబాటులోకి రావాలని ఆశిస్తాను.

  • వారాల ఆనంద్                              

విశ్వకవి రవీంద్రునికి అక్షరాంజలి— వారాల ఆనంద్

Posted on

విశ్వకవి రవీంద్రునికి అక్షరాంజలి
— వారాల ఆనంద్
విశ్వ కవి రవీంద్ర నాథ్ టాగోర్ .. టాగొర్ అనగానే గొప్ప సంతోషం. మరెంతో ఉద్వేగం. ఆయన సృజన, సృజనాత్మక జీవితం గొప్ప భావస్పోరకమయింది. ఆయన రచనలు ఇంతకు ముందు ఎన్నోసార్లు చదివినవే అయినా ఎవరికయినా వాటిని మళ్ళీ చదవడం గొప్ప అనుభవమే. “REVISITING ALWAYS REJUVANATES “. ఒక కవిని, కవితని రచయితని రచనని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్పురిస్తాయి. ఆ కవి, రచయిత సరికొత్తగా దర్శనమిస్తాడు. Between the lines వాళ్ళు మనతో సరికొత్తగా మాట్లాడతారు. ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగానూ ఆ సృజన కారులు మనముందు ఆవిష్కృత మవుతారు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తారు. రవీంద్రనాథ్ టాగోర్ని మళ్ళీ మళ్ళీ చదవడం, ఆయన్ని గుర్తు చేసుకోవడం సరి కొత్త అనుభవమే.

ఇక టాగోర్ రాసిన కవితల అనువాదం GULZAR translates TAGORE… THE GARDENER” ( బాగ్ బాన్).
ఈ పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది అంతేకాదు మ్యూజిక్ ఆల్బం గా కూడా చాలా ప్రాచుర్యం పొందింది. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత జరిగిన దేశ విభజన వేలాది కుటుంబాలను ప్రభావితం చేసినట్టుగానే గుల్జార్ కుటుంబాన్నీ ప్రభావితం చేసింది. వారి కుటుంబం ధిల్లీ కి చేరుకొని అక్కడ నివసించ సాగారు. ఆ చిన్నతనంలో గుల్జార్ ని తమ గారేజ్ లో పడుకోమని ఇంట్లో పెద్దలు ఆదేశించడంతో రోజూ రాత్రిళ్ళు గారేజే తన నివాసం గా చేసుకున్నాడు గుల్జార్. అప్పుడు తను కాలక్షేపం కోసం దగ్గరలో వున్న పుస్తకాలు కిరాయికి ఇచ్చే దుకాణంలో వారానికి ఒక అణాకి రోజుకో పుస్తకం తెచ్చి చదువుతూ ఉండేవాడు. మామూలు అపరాధక పరిశోదన పుస్తకాలు చదువుతూ రోజుకో పుస్తకం అడుగుతూ వుండడంతో ఆ పుస్తకాల షాపతను ఒక అణాకు ఎన్ని పుస్తకాలు చదువుతావు ఇదో ఇది తీసుకెళ్ళు అని అటక మీది నుంచి ఓ పుస్తకం తీసి దుమ్ము దులుపి ఇచ్చాడంట, ఆ రాత్రి ఆ పుస్తకం చదవడంతో తన జీవితమే మారిపోయింది అంటాడు గుల్జార్. ఆ పుస్తకమే టాగోర్ ‘గార్డెనర్’. అది జరిగిన అనేక దశాబ్దాల తర్వాత గుల్జార్ టాగోర్ ని అనువదించి అందించిన పుస్తకమే నేనిప్పుడు అంటున్న ‘ GULZAR translates TAGORE… THE GARDENER” ( బాగ్ బాన్).
సంజీవ్ గోయెన్కా ముందుమాట తో మొదలయ్యే ఈ పుస్తకం కోసం బెంగాలీ తెలిసిన వాడు కనుక గుల్జార్ టాగోర్ మౌలిక రచనల్ని సేకరించి హిందీ లోకి అనువదించాడు. అందుకోసం సంచారి ముఖర్జీ సహకరించారు. సంచారి పరిచయ వాక్యాలూ రాసారు. మొత్తంగా పుస్తకం టాగోర్ రాసిన బెంగాలీ మూల కవితలు, టాగోర్ స్వయంగా ఇంగ్లీష్ లోకి చేసిన అనువాదాలు, గుల్జార్ చేసిన హిందీ అనువాదాలతో కలిపి త్రి భాషా సంగమంగా వెలువడింది.
నాకు బెంగాలీ రాదు కాని టాగోర్ ని ఇంగ్లీష్ లో చదివి,తిరిగి హిందీలో గుల్జార్ ద్వారా చదవడంతో మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం ఇట్లా అనేక కోణాల్లో అటు టాగోర్ ని, గుల్జార్ ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. నన్ను నేను, నాలోకి నేను తరచి, తరచి చూసుకునే అవకాశం లభించిది. REALLY IT’S A GREAT EXPERIENCE. టాగోర్ ని తిరిగి దర్శించడం అదీ గుల్జార్ అనే ప్రకాశవంతమయిన టార్చ్ లైట్ వెలుగులో చూడడం గొప్ప అనుభవం. టాగోర్ ప్రేమికులు గుల్జార్ అభిమానులు మొత్తంగా కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళంతా చదవాల్సిన పుస్తకమిది. టాగోర్ తన కవిత్వంలో చిత్రమయిన సూతయిన ప్రశ్నలు వేస్తాడు.. మనిషి జీవితంలో ఏదయినా దాని శక్తికి మించి లాగితే కుదరదని అది అంతరిస్తుందని చెబుతాడు టాగోర్ అందుకో ఉదాహరణ ఇస్తాను ..
అత్యాశ
=====రవీంద్ర నాథ్ టాగోర్ – అనువాదం గుల్జార్
దీపం ఎందుకు ఆరి పోయింది
రెండు చేతులూ అడ్డుపెట్టి
వీచే గాలినుంచి రక్షించేదుకు
కొంచెం ఎక్కువే యత్నించా
అందుకే దీపం ఆరిపోయింది

పువ్వెందుకు వాడి పోయింది
ప్రేమతో ఆత్రంగా నా గుండెలకు
గట్టిగా హత్తుకున్నాను
అందుకే పువ్వు వాడిపోయింది

నది ఎందుకు ఎండి పోయింది
ఎప్పటికీ సొంతం చేసుకునేందుకు
ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట వేసాను
అందుకే నది ఎండిపోయింది

వీణ తీగ ఎందుకు తెగి పోయింది
నేనే శృతి కోసం దాని శక్తికి మించి
లాగానేమో
అందుకే తీగ తెగి పోయింది
(స్వేచ్చానువాదం: వారాల ఆనంద్)

టాగోర్ మనిషిని ప్రేమించాడు. మానవత్వాన్ని ఆరాధించాడు. బాలల సంపూర్ణ వికాసాన్ని ఆకాంక్షించాడు అందుకు విశేషంగా కృషిచేసాడు. టాగోర్ ప్రకృతితో ఎంతగా మమేకంయ్యాడో మనిషి పతనం పట్ల, హింసా ప్రవృత్తి పట్ల అంతే వేదనపడ్డాడు. స్పందించాడు. టాగోర్ తన 80వ జయంతి సందర్భంగా రాసిన నాగరికతలో సంక్షోభం( CRISIS IN CIVILIZATION) ఆయన వేదనకు దర్పణం. అది ఇవ్వాల్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో స్వార్థపరయుద్దోన్మాద ప్రపంచానికి సంభందించి నట్టుగానే వుంటుంది. అందులో “ఇన్నేళ్ళుగా యూరోప్ నుంచే మానవ నాగరికత వికసిస్తుంది అని విశ్వసించాను కాని ఇటీవలి అనాగరిక యుద్దాలు, హింస ఆ విశ్వాసాన్ని తుత్తునియలు చేసింది.ఇక భవిష్యత్తులో తూర్పు దేశాల నుండే,ఎక్కడయితే సూర్యుడు ఉదయిస్తాడో అక్కడినుండే నవ్య నాగరికత ఉధ్వవించాలి. నా ఈ అంతిమ ఘడియల్లో మనిషి పైన మానవత్వం పైనా విశ్వాసం సన్నగిల్లు తున్నది. అయినా మనిషి పైన అవిశ్వాసం ప్రకటించలేను అన్నాడు టాగోర్.
జలియన్ వాలా బాగ్ దమనకాండ జరిగిన నేపధ్యంలో కూడా టాగోర్ తీవ్రంగా కలత చెందాడు. దాన్ని తీవ్రంగా నిరసించాడు. గతంలో బ్రిరీష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన నైట్ హుడ్ టైటిల్ ని తిరిగి ఇచ్చేసాడు. తన సృజనాత్మక జీవితంలో ఎంతగానో ప్రేమని పంచిన టాగోర్ నిరసనని వ్యక్తం చేయడంలో అసలు ఎప్పుడూ సంకోచించలేదు.
+++++++
భారత దేశానికి,బంగ్లాదేశ్ కి రెండు దేశాలకూ జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ శ్రీలంక జాతీయగీతానికి ప్రేరణగా నిలిచాడు.
రవీంద్ర నాథ్ టాగోర్ మే ఏడు న 1861లో ఓ గొప్ప బెంగాలీ కుటుంబంలో పుట్టాడు. దేబేంద్రనాథ్ టాగోర్, శారదా దేవిల పద్నాలుగవ సంతానం ఆయన. తండ్రి దేబేంద్రనాథ్ గొప్ప ఆలోచనాపరుడు. బ్రహ్మో మతాన్ని ప్రభోదించిన వాడు. తాత ద్వారకనాథ్ ప్రముఖ వ్యాపారవేత్త. టాగోర్ సోదరుల్లో కవులు, సంగీతకారులు, పండితులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు ఇట్లా ఎంతోమంది వున్నారు. టాగోర్ విద్యాభ్యాసం కోసం పాఠశాలకు వెళ్ళలేదు.ఇంటిలోనే ఆయన చదువు సాగింది. తన తండ్రితో కలిసి చేసే ప్రయాణాలతో విశేషంగా నేర్చుకున్నాడు ఎనిమిదేళ్ళకే కవిత్వం రాసి కలం పేరుతో వెలువరించారు, తర్వాత పదహారేళ్ళు వచ్చేసరికి మొదటి పుస్తకమూ, కొన్ని కథలూ, నాటకాలూ రాసి రచయితగా ఎదుగుతూ వచ్చాడు.
ఆయన ప్రదానంగా కవిత్వం రాసాడు.ఆయన ‘గీతాంజలి’ విశ్వ ఖ్యాతిని అందుకుంది. రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి టాగోర్. గీతాంజలి అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. తెలుగులో కూడా అనేక అనువాదాలు వచ్చాయి.సుప్రసిద్ధ నటుడు కొంగర జగ్గయ్యతో సహా పలువురు అనువదించారు అంతేకాదు టాగోర్ కథ నవల, వ్యాసం, పిల్లల కోసం కథలు నవలలు, నాటకాలూ రాసాడు. సంగీతం, పెయింటింగ్ రంగాల్లో కూడా విశేషంగా సృజన చేసాడు. టాగోర్ సంగీతం రవీంద్ర సంగీత్ గా ప్రసిద్ధమయింది. ఇంకా ఆయన ఆత్మకథగా ఆయన రాసుకున్నవి రెండు – జీవన స్మృతి (My reminiscences), చేలేబేలా (Childhood Days). ఆయన ఉత్తరాల ద్వారా, వ్యాసాల ద్వారా ఆవిష్కరింపబడ్డ ఆత్మకథ “my life in my words”.

టాగోర్ కవిత్వం ఇష్టపడ్డ ప్రముఖుల్లో సీ.ఎఫ్.ఆండ్రూస్, యీట్స్, ఎజ్రా పౌండ్, థామస్ మూర్ వంటి ప్రముఖులున్నారు. టాగోర్ కలిసిన ఆ నాటి ప్రముఖుల్లో ఐన్‌స్టీన్ మొదలుకుని ముస్సోలిని దాకా ఎంతో మంది ఉన్నారు.
రవీంద్రుడు కేవలం రచయితగానే కాకుండా బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన గురుకులాల తరహాలో శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. పొద్దున్నే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు.1919లొ కళాభవన్ ను ఆయన స్తాపించారు. ఇక్కడ విద్యార్ఢులు విభిన్న కళలను నెర్చుకునెవారు. అక్కడ నందలాల్ బోస్ లాంటి అనేక మంది సుప్రసిద్ధ చిత్రకారులు పనిచేసారు.
ఇట్లా టాగోర్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే వుంటుంది.

Where the mind is without fear
“ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి వెలువడుతాయో ,
ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని అంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
ఎక్కడ మనస్సు తలపులో పనిలో నిత్యం విశాలమయిన దారుల వైపు పయనిస్తుందో
-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ!
నా దేశాన్ని మేల్కొనేటట్టు అనుగ్రహించు”
+++++++++
కొన్ని టాగోర్ కొటేషన్స్

అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.

జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు,వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.

నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.

కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.

ప్రేమించే వ్యక్తికీ దండించే అధికారం కూడా ఉంటుంది.
ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.

భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.

సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు
.
మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.

మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.

ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే ‘కళ’.

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.

వెలిగే దీపం లాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.

+++++++++++++++++++++

జీవితంలో ప్రతిరోజూ..
క్రితం రోజు కన్నా..
కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు
నేర్చుకోవాలి.

చెడుగా ఆలోచించే గుణమే
సగం సమస్యలకు కారణం

నువ్వు ధైర్యంగా
ఒక అడుగు ముందుకు వేస్తే..
విజయం పది అడుగులు
ముందుకు వస్తుంది.

ప్రయత్నం చేసి ఓడిపో..
కానీ ప్రయత్నం చెయ్యడంలో
మాత్రం ఓడిపోవద్దు.

మంచిని పెంచుతానంటూ
పరుగులు తీసే వ్యక్తికి
తాను మంచివాడుగా ఉండేందుకు
తీరిక దొరకదు.

కోపం మాటల్లో ఉండాలి.
మనసులో కాదు.
ప్రేమ మాటల్లోనే కాదు.
మనసులో కూడా ఉండాలి.

కళ్లకి రెప్పలు ఉన్నట్లే..
పనికి విశ్రాంతి ఉండాలి.

భయంతో ఉన్నవాళ్లు ఏదీ సాధించలేరు.

ప్రేమించే వ్యక్తికి..
దండించే అధికారం కూడా ఉంటుంది.

మనది కాని వ్యస్తువుపై
వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం.

ప్రేమ గుణం బాగా పెరిగి
లభించే సంపద ‘పవిత్రత’.

జీవితంలో వైఫల్యాలు
భారమని గ్రహించేవారు..

వాటి గుణపాఠాలు
నేర్చుకోవచ్చు.

నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు
మాత్రమే చక్కటి విద్యార్థులను తయారు చేయగలడు.

నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు..
అది పాపం, ఆత్మహత్య కంటే ఘోరం!

విశ్వకవి రవీంద్రునికి అక్షరాంజలి
--- వారాల ఆనంద్

62= యాదొంకీ బారాత్  ** వారాల ఆనంద్

Posted on

62= యాదొంకీ బారాత్ 

********** వారాల ఆనంద్

కాలం తోసుకెల్తుంది

తీరం ఆహ్వానిస్తుంది

అలలు సుఖ దుఃఖాల్లా పరామర్శిస్థాయి  +++++

బాట కొంత సవ్యమూ

మరికొంత అపసవ్యమూ

సమన్వయము చేయడమే విజ్ఞత

+++++++

జూనియర్ కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత ఉద్యోగవేతనంలోనూ, బాధ్యతల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. వాటితో పాటు విద్యాఅర్హతలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాకు అప్పటికి లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ ,ఎం.ఏ (ఫిలాసఫీ)లున్నాయి. కానీ యుజీసీ నిబంధనల ప్రకారం పీజీలో క్లాసు, లైబ్రరీ సైన్స్ లో పీజీ కావాలన్నారు. ఇక ఏముంది దశాబ్దాల తర్వాత అకాడెమిక్ చదువులు శురూ. అప్పటికి తెలుగు సాహిత్యం విపరీతంగా చదివిన చదువుతున్న అనుభవం. ఎం.ఏ తెలుగు External చేయాలని నిర్ణయం చేసుకున్నాను. కాలేజీకి సెలవులు పెట్టకుండా ఉంటుందని సలహా ఇచ్చారు. కానీ ఇక్కడో ప్రతిబంధకం. నేను హైస్కూలు చదువుల వరకు మాత్రమే తెలుగు భాష చదివాను. ఇంటర్, డిగ్రీలలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ. దాంతో తెలుగులో పీజీ చేసే అవకాశం నాకు లేదు. ఇట్లా ఆలోచిస్తూ వుండగా ఎవరో చెప్పారు. ఉస్మానియాలో ఒక పీజీ చేసిన తర్వాత దాని ఆధారంగా ఏ సబ్జెక్ట్ అయినా చేయొచ్చని. అమ్మయ్య అనుకుని తెలుగు పేజీ ఎక్స టర్నల్ కు కట్టాను. తెలుగులో రెండేళ్లకు కలిపి ఎనిమిది పేపర్లు. 1972 తర్వాత తెలుగు భాషా సాహిత్య పరీక్ష..భలే అనిపించింది. అప్పుడు మేము కరీంనగర్ లో గణేష్ నగర్ లో పట్వారీ శ్రీనివాస రెడ్డి ఇంట్లో కిరాయికి వున్నాం. అప్పుడక్కడే పీజీ ప్రిపరేషన్. ఆ సిలబస్ లో వున్న అనేక సాహిత్య అంశాలు అప్పటికి చదివే వున్నాను. ఉస్మానియా వాళ్ళు స్టడీ బుక్స్ ఇచ్చారు. అలా చదివే క్రమంలో మిత్రుడు పీ.ఎస్.రవీంద్ర అనేక సార్లు వేములవాడ నుంచి వచ్చేవాడు. అనేకానేక అంశాలు చర్చించే వాళ్ళం.

   పరీక్ష తేదీలు రానే వచ్చాయి. సికింద్రాబాద్ ఆనంద్ టాకీసు ముందు కాలేజీలో సెంటర్. ఎనిమిది రోజులు వరుసగా ఒక రోజు ఫస్ట్ ఇయర్, రెండో రోజు సెకండ్ ఇయర్ పరీక్ష. నేను వెళ్లి ప్రశాంత్ టాకీసు పక్కన వున్న ధిల్లీ లాడ్జ్ లో దిగాను. రోజూ ఉదయం నాలుగింటికి లేవడం కిందికి దిగి పక్క ఇరానీ హోటల్లో వేడి టీ తాగి వెళ్లి ఎనిమిదింటి వరకు చదవడం. మరో సారి టీ తాగి 10 వరకు తిరిగి చదువు. అప్పుడు రెడీ అయి మంజు టాకీసు పక్కనే వున్న మేస్ లో భోజనం చేసివచ్చి తిరిగి చదువు. 12 తర్వాత రెడీ అయి 2 గంటలవరకు సెంటర్ కు వెళ్ళడం. అయిదుకు పరీక్ష అయిపోగానే లాడ్జ్ కు వచ్చి చదువు.. తర్వాత భోజనం. తెల్లారి మళ్ళీ అదే షెడ్యుల్. పరీక్షలు సాగుతూ ఉండగానే ఒక రోజు సాయంత్రం అనుకోకుండా కొడం పవన్ లాడ్జ్ ఎదురు బస్ స్టాప్ లో నిలబడి కనిపించాడు. వచ్చి నాతో కొంతసేపు వుండి పోయాడు. మరో రెండు రోజులు కలిసాం. ఆ విధంగా ఎదో ఒక పరీక్ష తప్ప అన్నీ బాగా రాసాను. మరోసారి విద్యార్థిని అయిపోయాను. సంతోషంగా ఇంటికి వచ్చేసాను.

  రెండు నెలలకు హైదరాబాద్ సిటి ఎడిషన్స్ లో రిజల్ట్స్ ప్రకటించారు. పవన్ కు పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడుతను వార్త లోపని చేస్తున్నట్టు గుర్తు. సెకండ్ క్లాస్ ఇచ్చారని చెప్పాడు. కొంత నిరాశకు గురయ్యాను. కానే 58 శాతం రావడంతో యుజీసీ కి అర్హున్ని అయ్యాను. అలా ముగిసింది నా తెలుగు పీజీ ప్రహసనం.

***

వీటన్నింటి మధ్య రేల పుట్టిన రోజు. మొదటి పుట్టిన రోజు గెస్ట్ హౌజ్ కు ముందు సత్యం వాళ్ళ ఇంట్లో కిరాయికి వున్నప్పుడు చేసాం.  సత్యం మా కజిన్ నోముల రాజ్ కుమార్ క్లాస్మేట్. తర్వాతిది గణేష్నగర్ లో. పెద్ద గా ఫంక్షన్ కాదు గానీ దగ్గరి వాళ్ళను పిలిచాం. అప్పుడు కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్స్ గా వున్న ఎస్.కే.జాకీర్, కే.ఎన్.చారి, అంకం రవి, ప్రిన్సిపాల్ శ్రీ నర్సింగ్ రావు, లెక్చరర్లు నర్సింగ్ రెడ్డి, శ్రీ రాములు, లక్ష్మి రాజం, షర్ఫోద్దీన్, అల్తాఫ్ ఇట్లా చాలా మంది మిత్రులు వచ్చారు. ఇంకా మా బంధువుల్లోంచి ఇందిర చెల్లెలు శ్రీదేవి, కజిన్ పప్పీ, మేనమామ కూతురు నవిత, మా తమ్ముడు అర్జున్ బావ వెంకటేశ్వర్ తదితరులు వచ్చి రేలకు శుభాకాన్శాలుచేప్పారు. భోజనాలు, స్నాక్స్ తదితరాలతో ఆ పార్టీ ముగించాం.

++++

ఇంతలో నా యుజీసీ అవసరానికి తగ్గట్టు నా కోసమే అన్నట్టుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లో లైబ్రరీ సైన్స్ లో ఎం.ఎల్.ఐ.ఎస్సీ కోర్సును సమ్మర్ కోర్సుగా ఆరంభించారు. రెండు ఎండాకాలాల్లో క్లాసులు వుంటాయి. పరీక్షలు వుంటాయి. పీజీ అయిపోతుంది. శలవులు పెట్టాల్సిన అవసరం లేదు. నాలాంటి ఇన్ సర్విస్ వాళ్లకు ఎంతో ఉపయోగకరం. ఆ డిపార్ట్మెంట్ మాదే. గతం లో నేను చదివిన లైబ్రరి సైన్స్ డిగ్రీ అక్కడే చేసాను. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో క్లాసులు. డిగ్రీ లో మాకు ఫాకల్టీ గా వున్న ఆచార్యులే వున్నారు. ప్రొఫెసర్ ఏ.ఏ.ఎన్.రాజు,  ప్రొఫెసర్ వేణుగోపాల్, ప్రొఫెసర్ ఎన్.లక్ష్మన్ రావు ల తో పాటు ప్రొఫెసర్ విశ్వమోహన్ కూడా వున్నారు. అడ్మిషన్స్ తర్వాత క్లాసులు శురూ. ఇందిర రేల లు వరంగల్ లో అత్తయ్య వాళ్ళింట్లో వున్నారు. నేనేమో హైదరాబాద్ లో ఖైరతాబాద్ లో వున్నమా చెల్లెలు మంజుల వాళ్ళింట్లో మకాం. ఖైరతాబాద్లో వున్న మా మేనత్త కాశమ్మ చిన్నబ్బాయి శ్యాంసుందర్ మా బావ గారు. వాళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. అన్నదమ్ములలో పెద్దాయన జగద్దాస్ ఏదో కంపనీ లో పనిచేసేవాడు. రెండో బావ శ్రీనివాస్. హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో పెయింటింగ్ కోర్స్ చేసాడు. తను ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్ రావు, ప్రఖ్యాత చిత్రకారుడు తోట వైకుంఠం ల సహాధ్యాయి. మూడో అతను బాబూ రావు పాలీ టెక్నిక్ చదివి ఉద్యోగం లో వున్నాడు. అయితే అప్పటికి ఎవరి కుటుంబాలు వాళ్ళవి. ఎవరి జీవితాలు వాళ్ళవి. తారాబాయి, విజయ, బేబీలు కాశమ్మత్త కూతుర్లు. ఆ ఇంట్లో నేను మొదటి సారి నాలుగు వారాలు ఉండాలి. అయితే ప్రతి వారం చివర కాలేజీనుంచి అట్నుంచి ఆటే చలో వరంగల్. అక్కడ ఇందిర తమ్ముడు బాలరాజు, కజిన్ తూము శ్రీనివాస్ లు ఎంతగానో కంపనీ ఇచ్చేవాళ్ళు. కే.పి రెడ్డి ఐస్ క్రీం  అప్పుడు ఫేమస్. ఇక ఇందిర కజిన్ కూతురు కాలేజీ చదువుతున్న మాధవి కూడా బాబాయి అంటూ వచ్చేది. చాలా క్లోజ్ గా వుంటుంది,ఇప్పటికి కూడా. సోమవారం మబ్బులనే అత్తయ్య, ఇందిరలు కల్సి ఎదో ఫుడ్ రెడీ చేసేవాళ్ళు. దాన్ని తీసుకుని బస్ లో బయలుదేరే వాణ్ని. తార్నాకా లో దిగి క్లాసులు అటెండ్ చేసి సాయంత్రానికి ఖైరతాబాద్. అదీ ప్రోగ్రాం. క్లాసులు రెగ్యులర్ గా ఎలాంటి గాప్ లేకుండా నిర్వహించే వాళ్ళు. క్లాసులో అగ్రహారం పాలీ టెక్నిక్ కాలేజీ లైబ్రేరియన్ స్వామీ, మా చిన్ననాటి మిత్రుడు ఎడ్ల రాజేందర్, మా బి.ఎల్.ఐ.ఎస్సీ క్లాస్మేట్స్ శ్రీకృష్ణ, హన్నా సునీత, రవీంద్ర చారి, సంపత్ కుమార్ లతో సహా ఎస్బీ ఐ కి చెందిన సురేష్ బాబు ఇలా అనేక మంది వున్నారు. దాంతో సరదాగా గడిచింది. క్లాస్సిఫికేషన్, కాటలాగింగ్, రేఫెరెన్స్ సర్విస్, ఆటోమేషన్ ల తోపాటు అనేక అడ్వాన్స్ డ్ సబ్జెక్ట్స్ చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు క్లాసులు. ఆ ఏజ్ లో కొంచెం కష్టం గానే వుండేది. ఇంకా నాలాంటి సాహిత్యం ఆర్ట్ సినిమాలు ఆసక్తి వున్న వాడికి డ్రై సబ్జెక్టులు కొంచం ఇబ్బందిగానే వుండేది. కానీ చదువరులం కదా నడిచిపోయేది. సరిగ్గా అప్పుడే హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు అమీర్ పేట్ లో ‘సత్యజిత్ రే ఫిలిం ఫెస్టివల్’ నిర్వహించారు. బి.నరసింగ్ రావు, బి.హెచ్.ఎస్.ఎస్. ప్రకాష్ రెడ్డి లు ప్రధాన బాధ్యులు. గుర్తున్నంత వరకు ప్రజయ్ ఇంజినీర్స్ వాళ్ళు స్పాన్సర్ చేసారు. ఇక ఏముంది మనకు పండగే పండగ. ‘రోజంతా కాటలాగింగ్, క్లాసిఫికేషన్ సాయంత్రానికి క్లాసిక్ సినిమాలు’. మొత్తం రే సినిమాల్ని ఏక బిగిన అప్పుడే చూసాను. దానికి బి.నరసింగ్ రావు, బి.హెచ్.ఎస్.ఎస్. ప్రకాష్ రెడ్డి లకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అంతే కాకుండా ఆ ఫెస్టివల్ కు వచ్చిన వాళ్ళల్లో అనేక మంది రచయితలు, సినిమావాళ్ళు జర్నలిస్టులతో సాన్నిహిత్యం పెరిగింది.  అట్లా నా ఎం.ఎల్.ఐ.ఎస్సీ కోర్సు రెండు ఎండాకాలాలు ఆడుతూ పాడుతూ సినిమాలు చూస్తూ పూర్తి అయింది. స్వామి క్లాస్ ఫాస్ట్, ఎడ్ల రాజేందర్ సెకండ్ ప్లేస్. నాకు హయ్యర్ ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. దాంతో నా యుజీసీ  అర్హతలు పూర్తి అయ్యాయి అమ్మయ్య అనుకున్నాను.

***

ఇంతలో ఇందిర మరోసారి కన్సీవ్ అయింది. కానీ అప్పుడు కూడా డాక్టర్ బెడ్ రెస్ట్ సూచించారు. దాంతో తను చాలా కష్టపడింది. ఓ పక్క నాలుగేళ్ల రేల మరో పక్క బెడ్ రెస్ట్ మందులు ఎట్లా మానేజ్ చేసిందో. నేను ఎంతగా సర్విస్ చేసినా, తనని ఎంగేజ్ చేసినా బాధ అనుభవం తనది కదా.. 20 నవంబర్ 1994 రోజున అన్వేశ్ పుట్టాడు. వరంగల్ ఆసుపత్రి లోనే. తెల్లగా ముడితే మాసిపోయేలా వున్న వాడిని చూసి అంతా బాగా సంతోషించారు. అంతేకాదు ఇందిర శిరీష అయితే అక్కా వీడు నీ కొడుకు కాడే ఎక్కడినుంచో తెచ్చావ్ అని ఆట పట్టించేది. 21 రోజులకే ఇందిర పిల్లల్ని తీసుకుని కరీంనగర్ వచ్చేసాం. గణేష్ నగర్లో నివాసం. రోజూ అగ్రహారం కాలేజీ కి వెళ్లి రావడం. ఈ మొత్తం లో కాలేజీ ప్రిన్సిపాల్స్ తో పాటు సహచరులు ఎంతగానో సహకరించారు. అందుకే నేనెప్పుడూ అనుకుంటాను అంటాను స్నేహితులే జీవితంలో నన్ను నిలబెట్టారు నాతో వున్నారు.      

మిగతా మళ్ళీ వారం….

-వారాల ఆనంద్

2 అక్టోబర్ 2022

అన్ని దారులూ గుజరాత్ వైపే = వారాల ఆనంద్

Posted on

24 ఫ్రేమ్స్ – MY WEKKLY COLUMN IN ‘DISHA’DAILY

Clipping of Disha Daily Telugu Newspaper – Telangana Main

అన్ని దారులూ గుజరాత్ వైపే

========= వారాల ఆనంద్

 ఇటీవలి కాలం వరకు ‘గుజరాత్’ అనగానే మహాత్మా గాంధీ స్పురణ లోకి వచ్చేవాడు. కానీ ఇప్పుడు గుజరాత్ అంటే ప్రధాని మోడీ గుర్తుకొస్తాడు.. అంతే కాదు అంబానీ అదానీ లు కూడా మతిలోకి వస్తారు. ప్రధాని స్థాయికి వచ్చిన ఒక వ్యక్తి తన ప్రాంతం పైన మక్కువ చూపడాన్ని అర్థం చేసుకోవచ్చు.  అభివృద్ది చేస్తే అభినందించవచ్చు. కానీ అన్ని దారుల్ని ఒకే వైపునకు నడపడం అంత సమంజసం కాదు. అభిలషనీయమూ కాదు. కానీ ఇవ్వాళ దేశంలో అన్ని అభివృద్ది కళా సాంస్కృతిక క్రీడా రంగాలూ గుజరాత్ వైపునకే దారి తీయడం యాదృచ్చికం అంటే ఎందుకో నమ్మాలనిపించదు. కాని అదే జరుగుతున్నది. ముఖ్యంగా ఇవ్వాళ సినిమా రంగానికి సంబంధించిన అంశాల్ని చూస్తే రెండు విషయాలు చర్చగా నిలుస్తున్నాయి. వాటిలో ఒకటి ఇటీవలే ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం. గుజరాత్ కు చెందిన సీనియర్ హీరోయిన్ ఆశా పరేఖ్ కు ఈ అవార్డును ప్రకటించారు. ఆమె గతంలో అటల్ బిహారీ వాజపేయీ కాలంలో ఫిలిం సెన్సార్ బోర్డ్ చైర్ పర్సన్ గా పనిచేసారు. ఇక మరో సినిమా విషయం ఏమిటంటే ఇటీవలే ఎఫ్ ఎఫ్ ఐ ఆస్కార్ పోటీలకు ‘చెల్లో షో’ సినిమాను ఎంపిక చేసారు. అదీ గుజరాతీ సినిమా సినిమానే. ఆ సినిమా ప్రపంచ ప్రసిద్ది చెందిన ‘సినిమా పారడిజో’ అన్న సినిమాకు కాపీ అనొ అనుసరణ అనో  అన్న వాదన దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో చెలరేగింది. సినీ విమర్శకులు కూడా అనేక మంది స్పందించారు.

ఇక్కడొక మాట అంగీకరించాలి. ప్రతి అవార్డు విషయంలో ఎదో ఒక చర్చ లేవడం సహజమే కానీ ఆశాపరేఖ్ కానీ, ‘చెల్లో షో’ కానీ అర్హులా కాదా అన్నదాని కంటే గుజరాత్ వాదనే అధికంగా చర్చల్లోకి వచ్చింది,

సరే ఈ వివాదం సంగతి అట్లావుంచి వారి గురించి నాలుగు మాటలు చెబుతాను..           

 ‘హిట్ గర్ల్ ‘ కి దాదా సాహెబ్ పురస్కారం

 ‘అచ్చా తో  హం చల్తే హై .. ఫిర్  కబ్  మిలోగే.. జబ్ తుమ్కా హోంగే.. జుమ్మే రాత్ కో..’  లాంటి అనేక హిట్ పాటల్లో అబినయించి అనాటి యువత మనసుల్ని దోచుకున్న నటి ఆశా పరేఖ్.  1960 –70 దశకాల్లో అనేక విజయవంతమయిన హిందీ  సినిమాల్లో కథానాయిక గా నటించిన ‘హిట్ గర్ల్ ‘ కు కేంద్ర ప్రభుత్వం ఈ ఏటి దాదా సాహెబ్ ఆల్కె అవార్డును ప్రకటించింది.’ హిట్ గర్ల్’ అన్నది ఆమెకు ఉన్న పేరే కాదు ఆమె తన జీవిత చరిత్రను ఆ పేరు మీదనే రాసారు . ఆశా పరేఖ్ ఆ రోజుల్లో యువకుల కలల రాణి. ‘ ఏ జో  మోహోబ్బత్ హై,, ఏ ఉన్కా హై కామ్.. మహేబూబ్ కా జో లేతే హువే నామ్.. అంటూ ‘కటీ పతంగ్’ లాంటి సినిమాల్లో రాజేష్ ఖన్నా అభినయిస్తూ వుంటే ఆశా పరేఖ్ మౌన గంభీర నటన ఎంతో ఆకట్టుకుంటుంది. హిందీ సినిమా రంగంలో నేటికీ అత్యంత పేరు ప్రఖ్యాతులున్న నటిగా ఆమెకు  గౌరవాభిమానాలున్నాయి.

ఆషా పరేఖ్ తొలుత బాల నటిగా గొప్ప దర్శకుడు బిమల్ రాయ్ 195 2 లో  తీసిన ‘మా’ తో  సినిమా రంగ ప్రవేశం చేసారు. తర్వాత ఆమె ‘బాప్ బేటీ’ల్ కూడా నటించారు.  1959 లో  నాసిర్ హుసైన్ దర్శ కత్వం వహించిన ‘దిల్ దేఖే దేఖో’ తో కథానాయికగా ఆమె తన కారీర్ ఆరంభించింది.అందులో ఆనాటి బిగ్ స్టార్ శమ్మీకపూర్ హీరో. తర్వాత ఆ ఇద్దరి కాంబినేషన్ లో ఆనేక సినిమాలు వచ్చాయి. ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’, ‘ ఫిర్ వొహీ దిల్ లాయా హూన్’ , ‘తీస్రీ మంజిల్’, ‘బహారోన్కే సప్నే’, ‘ప్యార్ కా మోసం’, ‘కార్వాన్’ లాంటివి అప్పుడు విశేష ప్రజాదరణ పొందిన సినిమాలు. ఆ రోజుల్లో  ఆమె హిందీ సినిమాల్లో అధిక పారితోశికం తీసుకున్న నటిగా కూడా పేరు తెచ్చుకున్నారు.తర్వాత  రాజ్ ఖోస్లా తీసిన ‘దో బదన్’, ‘చిరాగ్’,’ మై తులసీ తేరే అంగన్ మె’ లాంటి సినిమాలు హిట్ గా నిలిచాయి. అయితే అప్పటిదాకా కేవలం గ్లామర్ హీరోయిన్ గా నిలిచిన ఆశా పరేఖ్ శక్తిసామంతా తీసిన ‘కటీ పతంగ్’  తో సీరియస్ నటి గా, ప్రతిభగల నటి గా నిలబడింది. ఆమె హిందీ సినిమాలతో పాటు గుజరాతీ, పంజాబీ, కన్నడ సినిమాల్లో  కూడా నటించారు.

డాక్టర్ కావాలనుకున్న ఆశా పరేఖ్ ఒక  రోజు స్కూలుకు వెళ్తూ వుండగా దారిలో ఒక ప్రమాదాన్ని, రక్త మోడుతున్న వారిని చూసి కలత చెంది డాక్టర్ కావాలనుకున్న కోరికను వదిలేసుకుందట. అయినా తర్వాత బాంబే లో ఒక హాస్పిటల్ కట్టించారు. కథానాయిక పాత్రల తర్వాత ఆమె కారెక్టర్ పాత్రల్నీ వేసారు.’కాలియా’ లాంటి అమితాబ్ సినిమాలల్లో  ఆమె నటించారు. అవివాహిత గా వుండి పోయిన ఆమె నాసిర్ హుసైన్ ని ప్రేమించారు.ఈ విషయాన్ని తన జీవిత చరిత్రల విపులనా రాసుకున్నారు.

తర్వాత ఫిలిం సెన్సార్ చైర్మన్ గా శేఖర్ కపూర్ ‘ఎలిజబెత్’ సినిమాకు సెన్సార్ అనుమతిని ఇవ్వడానికి నిరాకరించి వివాదాస్పదమయ్యారు.                   

  నటిగా ఆశా పరేఖ్ కు ‘కటీ పతంగ్’ సినిమాకు ఫిలిం ఫేర్ ‘ఉత్తమనటి’ అవార్డు లభించింది. తర్వాత లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు త్ పాటు ‘పద్మ శ్రీ’ అవార్డు కూడా లభించింది.

‘చెల్లో షో’

గుజరాత్ కు చెందిన దర్శకుడు పాన్ నలిన్ రూపొందించిన ‘చెల్లో షో’ (చివరి సినిమా ప్రదర్శన) త్వరలో జరుగనున్న ఆస్కార్ పోటీలకు భారతియ ఎంట్రీ గా వెళ్లనుంది. ఈ మేరకు ఎఫ్.ఎఫ్.ఐ ఎంపిక చేసింది.

భారతీయ సినిమా రంగం నుంచి ఆస్కార్ కు 1957లో  ‘మదర్ ఇండియా’, 1988లో మీరానాయర్ ‘సలాం బాంబే’, తర్వాత 2002 లో అశుతోష్ గవరీకర్ ‘లగాన్’ అధికారిక ఎంట్రీ లుగా ఎంపికయ్యాయి. ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘చెల్లో షో’ వెళ్తున్నది. అయితే ఈ సినిమా గురించి పెద్ద చర్చ జరుగుతున్నది. చెల్లో షో’ కథ స్టిల్స్ చూసి ఇది ప్రపంచ ఖ్యాతి గాంచిన ‘సినిమా పారడిజో’ చిత్రానికి కాపీ అయినా కావాలి లేదా కనీసం అనుసరణ అయినా అయి వుండాలి. అట్లా అయినప్పుడు ఎఫ్.ఎఫ్.ఐ. దాన్ని ఆస్కార్ కి ఎంపిక చేయడం సమంజసం కాదన్నది ఆ వాదన. అయితే ఆ సినిమా రూపకర్త అయిన పాన్ నలిన్ మాత్రం తమ సినిమా కేవలం తన పాక్షిక జీవితమని అంటున్నారు. తాను తాను నివసించిన కతైవారి ప్రాంత సినిమా అంటున్నారు. తాను ఎక్కడయితే తన బాల్యాన్ని గడిపానో ఎక్కడయితే తనకు సినిమా పట్ల దాని ప్రదర్శన పట్ల  ఆసక్తి కలిగిందో అది మాత్రమే ఈ సినిమా అంటున్నాడాయన. తనకు ‘సినిమా పారడిజో’ ఎంతో నచ్చిన సినిమా అని కూడా అంటున్నాడు  పాన్ నలిన్. అయితే ఈ సినిమా మన దేశంలో ప్రైవేట్ ప్రదర్శనలు మాత్రమే జరిగాయి. టాకీసుల్లో  ఇంకా విడుదల కావాల్సి వుంది. ఇదిట్లా వుంటే  ‘చెల్లో షో’ పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంది.  బయటి దేశాల్లో అర్థవంతమయిన సినిమా అనే పేరు తెచ్చుకుంది  ఇదిట్లా వుంటే ‘చెల్లో షో’ ఎంపిక ప్రకటన వెలువడిన వెంటనే దేశ వ్యాప్తంగా కమర్షియల్ ఫిలిం సర్కిల్స్ లో పెద్ద చర్చ వెల్లువెత్తింది  ఆర్.ఆర్.ఆర్.’  ‘కాశ్మీర్ ఫైల్స్’  లాంటి సినిమాలుండగా ‘చెల్లో షో’ ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వెలువడ్డాయి. ఆ మిమర్షల మాట  ఎలా వున్నా మన వ్యాపార రంగ సినిమా వాళ్లకు అంతర్జాతీయంగా జరిగే సినిమా ఉత్సవాల్లో కేవలం ఆస్కార్ మాత్రమె ఆనుతుంది. దాన్ని మాత్రమె పరిగణనలోకి తీసుకుంటారు. కానీ ప్రతిష్టాత్మకంగా వుండే కేన్స్, బెర్లిన్ లాంటి అనేక ఫెస్టివల్స్ పట్ల వీళ్ళకు సోయి తక్కువ. ఎందుకంటే ఆ ఉత్సవాల్లో కళాత్మకత, మానవీయత ఆర్ద్రత లాంటివి పరిగణిస్తారు. అవేవీ కనిపించని వ్యాపార రంగ సినిమా ఆస్కార్ ను  మించి ఆలోచించలేదు మరి.  

== వారాల ఆనంద్