Month: June 2020

Image Posted on

రాత్రి కవితలు– వారాల ఆనంద్

Posted on

రాత్రి కవితలు

———— వారాల ఆనంద్

1)

రాత్రి

ఇటు పొర్లీ అటు పొర్లీ

విసుగొచ్చింది

రాని నిద్రకై

ఎదురు చూడడం ఎందుకని

నా లోపల నేను

తవ్వుకోవడం మొదలు పెట్టాను

అట్లా తవ్వుతూ తవ్వుతూ

వుండగానే

తెల్లారిపోయింది

చూద్దును కదా

రెండు కవితా పంక్తులు

నాలుగు కన్నీటి బొట్లూ

బయటపడ్డాయి

వాటిని దోసిట్లోకి తీసుకొన్నాను

కన్నీళ్లను నేనుంచుకుని

కవిత్వాన్ని పంచేసాను

—————————————-

2)

రెప్పలు మూసి

అర్ధరాత్రి దాకా అట్లా

పడుకునే వున్నా

రావాల్సిన నిద్ర

ఎక్కడో దారి తప్పి కాట గల్సింది

ఎప్పటెప్పటివో జ్ఞాపకాలు

తరుము కొచ్చాయి

కొన్ని గెలుపులు

మరికొన్ని ఓటములు

ఏవి ఎక్కువో ఏవి తక్కువో

లెక్క పెట్టడం మొదలు పెట్టా

ఏదీ తేలక ముందే

తెల్లారి పోయింది

లెక్కను మూసేసి

పక్కను సర్దేసా

———————————————–

3)

కాళ్ళూ రెక్కలూ ముడుచుకుని

అట్లా పడుకున్నా

డోకేబాజీ నిద్ర

ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది

మూసుకున్న కళ్ళల్లో

చిటికెడు నిద్ర పిడికెడు మెలకువ

రెంటి నడుమా ఊగుతూనే వున్నా

ఏం చేయను

ఏదీ తెల్లగోలు కాకముందే

ఇట్లా

తెల్లారిపోయింది

==================

4)

అలసిన కళ్ళకు కొంత

విశ్రాంతినిస్తూ

రెప్పలు మూసుకు

పడుకున్నా

టికె టిక్ టిక్

కాలం నడిచి పోతూనేవుంది

కునుకు పట్టదు

నిద్ర రాదు

వాకిలి దాకా వచ్చి

గడపలో నిలబడిపోయిన

నిద్రను రా రమ్మని ఎవరు పిలవాలి

రాత్రా..చీకటా..

నడిచీ నడిచీ డస్సి పోయి వున్నా

రెప్పలు తెరిచే ఓపిక లేదు

చేతులు చాచే ఓరిమి లేదు

శిలలా పడుండి పోయా

చీకటీ రాత్రీ

నా రెండు వైపులా

తోడుగా నిలబడ్డాయి

ఉపశమనంగా

నాలోపల రక్తం ప్రవహిస్తూనే ఉంది

శ్వాస సాగుతూనే ఉంది

ఏదీ ఎవరి కోసమూ

నిలబడదు

నడక సాగాల్సిందే

ఘడియ ముందో వెనకో

తెల్లారక మానదు

====================

‘నడక’ కవితలు- వారాల ఆనంద్

Posted on

నడక- 1

========= వారాల ఆనంద్

ఏమిటో ఇవ్వాళ నడక మైదానమంతా
పొడి పొడి

చెట్లూ కొమ్మలూ ఆకులూ
ఆత్మీయ మిత్రుడెవరో పరాయి వాడయి పోయినట్టు
దిగులు ముఖాలేసుకు నిలబడ్డాయి బేలగా

నేనేమో
నడుస్తున్నానన్న మాటే గాని
సహచరుడు సమయానికి రానట్టు
ఏదో వెలితి వెలితి

తియ్యటి మంచు కత్తి కరిగిపోయింది
చలేమో చెప్పకుండానే
సెలవు తీసుకుంది

నిన్న మబ్బు చాటేసిన
చలి
ఇవ్వాళ ముఖం చాటేసింది

నిన్నమొన్నటి దాకా
‘ఇంత చలిలో వాకింగ్ ఏమిటి’ అన్నారెవరో

దేహమయినా మనసయినా
ముడుచుకుని పడుకుంటే ఏముంది
విచ్చుకున్నప్పుడు కదా
అందమయినా అర్థమయినా…

————–

‘నడక’ – 2
—– వారాల ఆనంద్

నేనట్లా అలసటను వెంటేసుకొని
అడుగు తీసి అడుగేస్తూ
నడుస్తూనే వున్నా

కాలం నన్ను ముందుకు తోసి
వెనకకు వెళ్తూనే వుంది

నడక దేముంది
శరీర కదలిక

గులక రాళ్లూ ఇసుక తిన్నెలూ
చిక్కటి అడవీ కటిక చీకటీ

అనుభవాలు పాద ముద్రల్లో
భద్రమవుతున్నాయి

యధాలాపంగానో కావాలనో

నన్ను అడగకు
ప్రయాణం ఎక్కడిదాకా అని

ఏమని చెప్పను ‘గమ్యం’
నాకు తెలిస్తే కదా

నడకేమో
కనిపించే వెతుకులాట
మనసెమో
వినిపించని పలవరరింత

నడక సాగుతూనే వున్నది
మనసు తెరుకునేవున్నది

ఇక
తెలియన్ది తెలుసుకోవడమే
తెలిసింది పంచుకోవడమే

————————–

నడక 3
============ వారాల ఆనంద్

అక్టోబర్ లో కురిసిన
వర్షపు జల్లులో

కాలం
తన ముఖమూ కాల్రెక్కలూ కడుక్కుని మరీ
నడకను కొనసాగించింది

ఇంతలో
నవంబర్ నెల చివరి వారం
రానే వచ్చింది

నేనేమో ఒంటిమీది బద్దకాన్ని విదిలించి
వులెన్ దుస్తులేసుకుని
రొడ్డును కప్పెసిన
పొగమంచులో తడుస్తూ ఈదుతూ
ఉదయాన్నే నడకకు బయలుదేరా

నా నడక
ఒకసారి నెమ్మదిగా
ఇంకోసారి వేగంగా
మరోసారి ముడుచుకొని
మూగగా సాగుతూ వుంది

కానీ అన్నీ కాలాల్లోనూ
కాలానిది
ఒకే నడక ఒకే వేగం
అదే
గతి తప్పని వాస్తవం

మనకే
ఈ బద్దకాలూ ఉత్సాహాలూ
ఆటు పొట్లూ
అలకలూ ఆవేశాలూనూ
నెపం మాత్రం
‘కాలం’ మీదకు తోసేస్తాం

====================

నడక 4
============ వారాల ఆనంద్

ముసిముసి మబ్బుల్నే
మైదానం లో నడుస్తూ నడుస్తూ
ఆకాశం కేసి చూసా

నెలవంక అందంగా నవ్వుతోంది

పాపం రాత్రంతా వాకింగ్
చేసి చేసి అలిసిపోయిందేమో

నీరసంగా కనిపిస్తున్నప్పటికీ
ముఖంలో మెరుపు తగ్గలేదు

నెలవంకను చూస్తూ చూస్తూ
నా నడక
ఉత్సాహంగా సాగుతూనే వుంది
. . .
తూర్పున భానుడు
ఎరుపు పరదాల్ని తొలగించుకుంటూ
ప్రేమతో నెలవంకను

కావలించుకుందామని కాబోలు
వేగంగా ఎగిసి వస్తున్నాడు

ఇక్కడేమో వాకింగ్ ట్రాక్ మీద
వ్యాపారాల గురించి చర్చించుకుంటూ కొందరు
రాజకీయాల గురించి వాదించుకుంటూ ఇంకొందరు
వ్యాయామం చేస్తూ మరికొందరు
బిజీ బిజీ గా వున్నారు

నేనేమో
ఆకాశపు తెర పై
నెలవంకనీ సూర్యున్నీ
మార్చి మార్చి చూస్తూనే

ఏకాంతం తోడుగా
నా లోపలికీ బయటికీ
మౌనంగా నడకను
కొనసాగిస్తూనే వున్నా

———————————

నడక 5
———— వారాల ఆనంద్
పొద్దున్నే మైదానంలో
నాలుగు అడుగులు నడిచి
ఎప్పటిలాగే చెట్టుకిందికి చేరా
రోజూ చూసే చెట్టే
దశాబ్దాల అనుభవాన్ని
తన కాండం ముడుల్లో దాచుకుని
దయతో మునిలా నిలబడింది

రాత్రంతా కురిసిన మంచులో తేలియాడి
ఆకుల్లోంచి తేమను అలలు అలలుగా కురిపిస్తోంది

నేనేమో అందులో తడుస్తూ
కళ్ళు మూసుకుని కాళ్ళు బార్లా జాపుకుని
ఏకాంతంలోకి చేరుకున్నా
. . .


‘మిత్రమా.. ‘ ఎవరో పిలిచినట్టయింది

మూసిన కళ్ళతోనే చుట్టూ చూసా
మూయని చెవులను రిక్కించి విన్నా
సంభ్రమం, చెట్టు మాట్లాడుతోంది

బాగా అలిసి పోయినట్టున్నావ్
అందుకే నీ ఒడిలోకి చేరా

ఏమి సాధించావ్
ఆరు దశాబ్దాల వయసుని

ఏమి పోగొట్టుకున్నావ్
నాలుగు కన్నీళ్లని

ఏమి మిగుల్చుకున్నావ్
శూన్యాన్ని

ఏమి కోరుకుంటున్నావ్
చిటికెడు సంతోషాన్ని
. . .
ఇంకా గడపాల్సిన కాలమూ
నడవాల్సిన దూరమూ
చాలా వుంది అంటూ లేచి బయల్దేరా
. . .
అవునూ ఇప్పటిదాకా
మాట్లాడింది చెట్టేనా
నా లోపలి మరో నేనా…
ఏమో …


========================

నడక 6
————– వారాల ఆనంద్
మైదానం మీద
ఒంటరి నడక
ఆకాశంలో చీకటి వెలుగుల
దోబూచులాట

ఈ నడక
యౌవనాన్ని తిరిగివ్వదు
బాల్యాన్ని ‘బదలు’ కూడా ఇవ్వదు

మరి
నడకేమిస్తుంది


ఏకాంతాన్నిస్తుంది
లోనికి దారిస్తుంది
లోన పేరుకున్న చెత్తను
తవ్వి పారబోసే సమయాన్నిస్తుంది

అరె ఇటు చూడు
ఈ మట్టి
నా పాదాల్లోంచి
నా లోకి ఎదో
విద్యుత్తును ప్రసరిస్తున్నది
——————————–

నడక-7
———- వారాల ఆనంద్

నిద్ర దుప్పటి తొలగి
పాదాలు నేలను తాకగానే
కాళ్ళకు జీవమొస్తుంది

మైదానంలో
కళ్ళు ఆకాశం కేసి చూడగానే
చూపునకు రెక్కలు మొలుస్తాయి


అడుగులు వాడి వడిగా కదుల్తాయి

చలికి వెరవక
నాకంటే ముందే మేల్కొని
ఆకాశ మైదానంలోకి వ్యాహ్యాళికి వచ్చిన
‘చుక్కల రాజు’ చిరునవ్వులు రువ్వుతున్నాడు

బద్దకాన్ని విదిలించుకుని
నేనట్లా నడుస్తూ నడుస్తూ
ఓ క్షణం నిలబడిపోయా

ఆకాశపు దారులంట వెన్నెల
మాటలేవో వినిపించాయి…


‘మిత్రమా … రాత్రంతా నిద్రపోక
నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురుచూస్తున్నా ‘
…….


ఎవరో ఎదురు చూస్తున్నారనే భావన
ఎంతో హాయి

ప్రేమతోనూ స్నేహంతోనూ
ఎదురయ్యే వాళ్ళుంటేనే
బతుకంతా మధురం
ఎంతో అర్థవంతం

===================

నడక-8
వెలుగులు విచ్చుకునే వేళ యింది
ముప్పిరిగొన్న చలిని చీల్చుకుంటూ
నడక సందడి మొదలయింది

రాత్రంతా కురిసిన మంచుని మింగేసిన
కాలమేమో ఆయాసంతో
కదలక మెదలక నిలబడింది

ముంచుకొచ్చిన చలి
వెన్నెపూసల్లాంటి ఈనెల్లోకి పాకిందేమో
ఆకులింకా ముడుచుకునే వున్నాయి

చెట్లన్నీ కదలిక కరువై
నిటారుగా నిలబడ్డాయి

అందరూ తూర్పు ఆకాశం కేసి చూస్తున్నారు

చలికి
మబ్బుల రగ్గుల్ని కప్పుకున్న
భానుడింకా కళ్ళు తెరవలేదు

నడక సాగుతూనే వుంది
చలీ చీకటీ అడ్డుగోడలు కావు


వాటికి శాశ్వతత్వమూ లేదు

ఓటమీ దుఃఖమూ అంతే

======

pic by ANVESH VARALA