GULZAR POEMS

GULZAR ARTICLE NAVA TELANGANA

Posted on

కవిత్వం సినిమాలు ఆయనకు రెండు కళ్ళు

++++++++++++++++++ వారాల ఆనంద్

‘మొర గోరా రంగ్ లైలే..’ అంటూ మొట్టమొదటిసారిగా బిమల్ రాయ్ సినిమాకు రాసినా..

‘మైనే తెరెలియే హి సాత్ రంగ్ కె సప్నే చునే’  అంటూ ఆనంద్ లో ప్రేమకి జ్ఞాపకానికీ లంకె వేసినా..

‘ముసాఫిర్ హో…యారో .. నా ఘర్ హై నా టిఖానా … ‘

అంటూ పరిచయ్ లో మనమంతా యాత్రికులమే పయనించే దారిని యాత్రని ఆనందించాల్సిందే అన్న్తాడుగుల్జార్.  

‘దిల్ హూం హూం కరే ఘబ్ రాయే.’ అని రుడాలి లో వేదన పడ్డా

‘మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా  హై..’ అంటూ ఇజాజత్ లో ప్రేమ విఫలమైన ప్రేమికురాలి దుఖం వేదన ఒంటరితనం అన్నింటిని కలగలిపి ఇజాజత్ లో రాసినా

వాటిల్లో వాడిన ఆ భాష ఆ భావసాంధ్రత గుల్జార్ కే చెల్లింది. ఇట్లా సినిమా పాటల గురించి  రాస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నోపాటలు ఆయన కలం నుండి వెలువడ్డాయి.పాఠకుడి మనసుని తత్తెస్థాయి.  

ఇక సంభాషణల విషయానికి వస్తే

‘బాబూమొషై జిందగీ బడీ హోనీ చాహీయే, లంబీ నహి ‘ ,

 ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’

‘మౌత్ తో ఏక్ పల్ హయ్,

(జీవతం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే)

ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ఆనంద్ సినిమాలో గుల్జార్ రాశారు.అట్లా ఆయన పాటలు సంభాషణలే కాదు గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు. గుల్జార్ రచనలు, సినిమాలు, గజల్స్  అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని సరళత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్ అనువాదంలో కూడా ఉన్నతమయిన కృషి చేసాడు చేస్తున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడతాడు. ‘మన మెదడు అన్టన్నే(antenne) ను తెరిచి వుంచాలి అప్పుడే ఇతర ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్.  అట్లా భాషల్లో, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుల్జార్ ఒక లివింగ్ లెజెండ్. దర్శకుడిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు గుల్జార్. సినిమా రంగంలో విశేషమయిన్ కృషి చేసిన ఆయనకు ఆ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు సత్కారాలు లభిచాయి. ఆస్కార్, గ్రామీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, అనేక జాతీయ పురస్కారాలు వచ్చాయి. బహుశా ఆయన అందుకోని అవార్డు లేదు. కానీ సాహిత్యం లో ఆయనకు వచ్చిన ‘జ్ఞానపీఠ పురస్కారం ప్రత్యేకమయింది. ఎందుకంటే ఆయనే అనేక చోట్ల చెప్పుకున్నట్టు సాహిత్యమే తన నిజమయిన వ్యక్తీకరణ రూపం. సినిమా కూడా సృజనాత్మక కళ నే. కానీ అది రచయిత, దర్శకుడు, నటుల సమిష్టి కృషి. సాహిత్యం విషయానికి వచ్చినప్పుడు అది వ్యక్తిగతమయిన వ్యక్తీకరణ. అందులో ఇతరుల ప్రమేయం వుండదు. కవీ రచయిత తన భావాలకు తానే రూపం కల్పిస్తాడు. అందుకే సాహిత్య సృజనలో స్వేచ్చ వుంటుంది. అందుకే సాహిత్యంలో తనకు వచ్చిన ‘జ్ఞానపీఠ్’ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారాయన. 

‘ఎక్కువ మంది నేను సినిమాల్లోనూ సినిమాల కోసమూ రాసిన వాటిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు,అభిమానిస్తారు. కానీ నేను మనిషి పడే బాధ, సంఘర్షణ, దేశాన్ని ప్రేమించడం లాంటి అనేక విషయాల్నీ అభిమానిస్తాను. అంతేకాదు అందరూ జీవితంతో అనుబంధం పెట్టుకోవాలని  అందరికీ  చెబుతాను అప్పుడే ఆనందంగా వుంటారనీ చెబుతాను’ అంటాడు గుల్జార్.   

అంతే కాదు కవిత్వం ఎట్లా రాస్తారు అని అడిగితే ‘సాహిత్య సృజన చేయడానికి నువ్వు ‘గుహ’లో నివసించాలి, ఆ గుహ మరేదో కాదు అది నువ్వే’ అంటాడాయన.  

కవిత నిడివి గురించి అడిగితే ‘నువ్వు అధికంగా మాట్లాడ్డం ప్రారంభించగానే జనం నిన్ను వినడం మానేస్తారు. అధికంగా చెప్పిన ఏదయినా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. క్లుప్తంగా రాసిన కొన్నిమాటలే ఎక్కువ శక్తివంతమయినవి, ఎంతో ప్రభావ వంతమయినవి. నేనయితే నా కవిత్వంలో ముఖ్యమయిన విషయాల్ని అతి తక్కువ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటాడు గుల్జార్.

    గుల్జార్ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఆగస్ట్ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటినుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ ల కచేరీలకు వెళ్ళేవాడు.  గుల్జార్ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్సర్ కి వలస వచ్చింది.అప్పుడు ఆయన చూసిన హింస, దౌర్జణ్యాలు, పడ్డ వేదన దుఖం ఆయన కవిత్వంలో అంతర్లయగా ధ్వనిస్తూనే వుంటుంది. ఏం.హెచ్.సత్యు ‘ఘరమ్ హవా’ లాంటి సినిమాలు తెస్తే గుల్జార్ కవిత్వమూ కథలూ రాశాడు.

  ఇక తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్ షాప్లో పనిచేయడంతో గుల్జార్ జీవితం ఆరంభమయింది. ప్రమాదంలో సొట్టలు పడ్డ కార్లకు కలర్ మాచ్ చేసే పని చేసేవాడు. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్ తమకి దగ్గరలో ఓ కాందిశీకుడు నిర్వహించే పుస్తకాలు కిరాయికిచ్చే షాప్ నుండి అపరధ పరిశోదక నవలలు, మాజిక్ ఫాంటసీ రచనల్ని లాంతరు ముందు చదవడం ఆరంభించాడు. వారానికి పావలా రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుస్తకాలు చదవడం చేసేవాడు గుల్జార్. ఒక నాటికి షాప్ లోని దాదాపు పుస్తకాలు అయిపోవడంతో షాపతను ఇట్లా ఒక్క పావలాకు ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆది టాగోర్ రాసిన ‘ గార్డనర్’. అది చదివింతర్వాత గుల్జార్లో చదివే దృక్పథమే మారిపోయింది. ఆ తర్వాత ప్రేంచంద్ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ప్రగతిశీల రచయితలు, కళాకారులతో పరిచయం కలగడం PWA కార్యక్రమాలల్లో పాల్గొనడం మొదలయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. అదే సమయంలో బిమల్ రాయ్ ‘బందిని’ సినిమా తీయడం మొదలు పెట్టాడు ఇంతలో కవి శైలందర్ కు, సంగీత దర్శకుడు ఎస్,డి,బర్మన్ కు నడుమ ఎవో  పొరపొచ్చాలు రావడంతో ఆ ఇద్దరూ కలిసి పని చేసే స్థితి లేకపోయింది. దాంతో శైలేంద్ర గుల్జార్ ని తక్షణమే వెళ్ళి బిమల్దాను కలవమని సూచించాడు. మిత్రుడు ఆసీత్ సేన్ తోకలిసి వెళ్ళి కలిశాడు. ‘ఇతను విషయాన్ని అర్థం చేసుకుని పాట రాయగలడా అని సేన్ ను బెంగాలీలో అడిగాడు’ అప్పుడు సేన్ దాదా తనకు బెంగాలీ రాయడం చదవడం వచ్చు అనేసరికి  కంగారుపడ్డ బిమల్ రాయ్ సర్దుకుని పాట రాయమని ప్రోత్సాహించాడు. గుల్జార్ తన మొట్ట మొదటి సినిమా పాట ‘మేర గోరా అంగ లయిలే..” తో  ఆరంభమయింది. అయితే బిమల్ దా  గుల్జార్ తో మాటాడుతూ సినిమాలకు పనిచేయడం నీకిష్టం లేదని తెలుసు కానీ నువ్వు నా దగ్గర ఆసిస్టంట్ గా చేరు. అంతే కానీ ఇక ముందు తన మెకానిక్ షాప్ కు వెళ్ళకు. రచనల పైన దృష్టి పెట్టాలని సూచించాడు. దాంతో గుల్జార్ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించాడు. బిమల్ దా కి పూర్తి స్థాయి సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హ్రిషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్ లాంటి దర్శకుల సినిమాలకు రచనలు చేయడం ఆరంభించాడు. అట్లా గుల్జార్ ఆనంద్(1970 ), గుడ్డీ(1971), బావర్చి(197 2 ), నమక్ హరం(1973 ), హ్రిషికేశ్ ముఖర్జీకి, దో దూని చార్ (1968), ఖామోషి(1969) , సఫర్(1970) అసిత్ సేన్ కు సంభాషణలు రాసాడు.

          ఇక తర్వాత 1971 లో ‘మేరె అప్నే) సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు గుల్జార్. జీతెంద్ర ప్రధాన పాత్రధారిగా 1972లో ‘పరిచై’ తీసాడు. 1972లో అయన రచించి దర్శకత్వం వహించిన ‘కోషిష్’ అత్యంత సున్నితమయిన మానవీయ దృక్పధంతో తీసిన సినిమాగా మిగిలి పోయింది.  సంజీవ్ కుమార్, జయాభాధురి ప్రధాన భూమికల్ని పోషించిన కోషిష్ లో ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ జీవితం దాంట్లో వారు ఎదుర్కొన్న అవస్థలు హృద్యగంగా చూపిస్తాడు గుల్జార్. అందులో సంజీవ్ కుమార్, జయబాధురి లు అత్యంత సహజంగా నటించారు. అట్లా సంజీవ్ కుమార్ తో మొదదలయిన సహచర్యం అనేక సినిమాల నిర్మాణానికి దోహదపడింది. వారి కయికలో వచ్చిన ‘ ఆంధీ’, మౌసం, అంగూర్ , నమ్కీన్ సినిమాలు ఒక కల్ట్ సినిమాలుగా మిగిలిపోయాయి. సంజీవ్ కుమార్ నట జీవితంలో అత్యంత సహజ నటుడిగా పేరు తెచ్చిన సినిమాలివి. ఇక గుల్జార్  జీతేంద్ర తో పరిచై, ఖుష్బూ,కినారా, వినోద్ ఖన్నా తో అచానక్, మీరా, లేకిన్, హేమామాలిని తో ఖుష్బూ, కినారా, మీరా  లాంటి మంచి సినిమాలు రూపొందించాడు. ఇంకా దర్శకుడిగా గుల్జార్ కితాబ్, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్, సునేయే,ఆల్కా,ఇజాజత్,లిబాస్,మాచిస్,హు టు టు లాంటి సినిమాలు రూపొందించాడు.

    టెలివిజన్ రంగంలో ఆయన రూపొందించిన సీరియల్స్ గొప్పగా విజయవంతమయి కల్ట్ గా మిగిలిపోయాయి. రచయితగా, దర్శకుడిగా ఆయనలోని సున్నితత్వం ప్రతిభ విశేషంగా పేరు గడించింది. ఆయన రూపొందించిన ‘ మిర్జా గాలిబ్’ సీరియల్ ఆ మహాకవి కవిత్వాన్ని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అందులో గాలిబ్ గా  నసీరుద్దిన్ షా, గాయకుడిగా జగ్ జీత్ సింగ్ తమ అద్భుత ప్రదర్శనను అందించారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్ భావుకత, నిబద్దత ప్రధాన భూమికను పోషించాయి.

ఇక గేయ రచయితగా గుల్జార్ 100 పైగా సినిమాలకు పాటలు రాసాడు. అలనాటి బందిని తో మొదలయిన ఆయన ప్రస్తానం సలిల్ చౌదరి, ఎస్. డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, మదన్మోహన్, విశాల్ భరద్వాజ్, ఎ.ఆర్. రెహమాన్ లాంటి ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్ ‘కజరారే..’ ( బంటీ ఆర్ బబ్లూ), చయ్య చయ్య చయ్యా….(దిల్ సే ) లాంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఇవ్వాళ మెలొడీకి స్థానం లేదని బీట్ కె ప్రధాన పాత్ర అని ఆయన అంటారు. కాలానుగుణంగా సినిమాలు రచనలు వస్తాయని ఆయన అభిప్రాయ పడతారు. ఏ.ఆర్.రెహమాన్ తో కలిసి ‘జై హో..  ‘ పాటకు గుల్జార్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అంతే కాదు ఈ జంట గ్రామ్మీ అవార్డును కూడా అందుకుంది.

గుల్జార్ కవిత్వం, వచనం మనసుకు హత్తుకునేలా రాశారు. ఆయన రాసిన ‘GREEN POEMS’ ని నేను ఆకుపచ్చ కవితలు పేర తెలుగులోకి అనువదించాను, వర వర రావు గారు ‘SUSPECTED POEMS’ ని అనుమానిత కవితలు గా అనువదించారు.

గుల్జార్ కూడా అనేక అనువాదాలు చేశారు.‘ ఏ పోయేమ్ ఏ డే’ పేర భారీ సంకలనాన్ని తెచ్చారు. అందులో 34 భారతీయ భాషల్లోని 279 కవుల 365 కవితల్ని అనువదించి ప్రచురించారు. వాటిల్లో వర్తమాన కవుల కవితల్నిచేర్చారు. పాఠశాల కళాశాల పాఠ్యపుస్తకాల్లో చదివే కవుల కవితలు కాకుండా ఇప్పుడు వర్తమాన సామాజిక స్థితిలో ఆధునిక కవులు రాస్తున్న కవితల్ని చేర్చారు.‘ఇరుగు పొరుగు’ భాషల్లో కవులు ఏమి రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అన్న విషయం అర్థం కావడానికి ఈ సంకలనం ఎంతో దోహద పడుతుంది.

అయన 1973 లో ప్రముఖ నటి రాఖీ ని వివాహం చేసుకున్నారు తర్వాత కొంత కాలానికి వేరై వేరుగా వుంటున్నారు వారి కూతురు మేఘన గుల్జార్. ఆమె దర్శకురాలిగా ఫిల్ హాల్, జస్ట్ మారీడ్, దస్  కహానియా, తల్వార్, రాజీ, చాపాక్, సామ్ బహదూర్ సినిమాలు రూపొందించారు. అంతేకాదు తన తండ్రి పైన ‘ బికాస్ హి ఈస్ ‘ పుస్తకం రాసారు.

  గుల్జ్జార్ బహుముఖీన ప్రతిభ లో ఆయన రాసిన రచనలు భారతీయ హిందీ ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి ఆయన రవీంద్రనాథ్ రచనల్ని అనేకం అనువాదం చేసారు. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టే డ్ పోయెమ్స్, జిందగీ నామా, హాఫ్ ఎ రూపీ, సేలేక్తేడ్ పోయెమ్స్, 100 లిరిక్స్, మేరా కుచ్ సమ్మాన్, సైలేన్సేస్, టూ లాంటి ఎన్నో రచనలు విశేష ప్రశంశాల్ని అందుకున్నాయి.

గుల్జార్ ఇప్పటికే పద్మభూషణ్, సాహిత్య అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు అందుకున్నారు. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం అందుకోవడంతో ఆయన కవిత్వం మరింతగా పాఠకులకు చేరుతుంది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు.

++++++++++++++++++++++++++

వారాల ఆనంద్

కవి, రచయిత,

GULZAR

Posted on

మిత్రులారా! గుల్జార్ మీద ప్రేమతో, అభిమానంతో రెండు వ్యాసాలు రాసాను. ఈరోజు ‘నవతెలంగాణ’, ‘ఆంధ్రప్రభ’ సాహిత్య పేజీల్లో వచ్చాయి. ఆనందచారి గారికి, వసంత గారికి ధన్యవాదాలు
-వారాల ఆనంద్,
26 ఫిబ్రవరి 2024

ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు

Posted on Updated on

మిత్రులారా! ‘ ఆకుపచ్చ కవితలు’ పైన ‘దిశ’ దినపత్రికలో సమీక్ష వచ్చింది. సంపాదకులకు, సమీక్షకులు  శ్రీ అరవింద్ రెడ్డి గారికి ధన్యవాదాలు –ఆనంద్             

+++++++++

ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు

బలమైన కవిత పుట్టాలంటే కవికి తీవ్రస్థాయిలో కోపం రావాలి. లేదంటే పట్టలేని సంతోషం కలగాలి. ఏ భావోద్వేగమైనా సరే.. ఉచ్ఛస్థాయిలో ఉండాలి. అప్పుడే ఓ మంచి కవిత పుడుతుంది. మనసును ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తోంది. తెలుగునాట ప్రభావం చూపిన కవిత్వమంతా అటువంటిదే. మనం ఈ నేల మీద పుట్టాము కాబట్టి.. మన మాతృభాష తెలుగు కాబట్టి.. మనకు తెలుగులో రాసిన కవిత్వం మాత్రమే చదువుకొనే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో గొప్ప కవిత్వం పుడుతుంది. బహు భాషాపండితులు ఆ కవిత్వాన్ని చదివి ఆస్వాదించగలుగుతారు. కానీ సామాన్యులకు సాధ్యం కాదు. అందుకోసం పుట్టుకొచ్చిన ప్రక్రియే అనువాదం.. ప్రపంచ సాహిత్యంలో, లేదంటే మనదేశంలోని ఇతర భాషల్లో ఆలోచింపజేసే సాహిత్యాన్ని ఎందరో అనువాదకులు తెలుగుకు పరిచయం చేశారు.

కానీ దురదృష్టవశాత్తు అనువాద సాహిత్యం చాలా సార్లు కృతకంగా ఉంటుంది. మూలం చెడకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా అనువాదకులు కాస్త కఠినమైన భాషలో రాస్తుంటారు. కథా రచన, నవలా రచన అనువదించినప్పుడే ఆ భాష సామాన్యులకు ఓ పట్టాన అంతు చిక్కదు. అటువంటిది కవిత్వమైతే ఇంకా కష్టం. తెలుగులో గొప్ప అనువాద రచనలు లేవని కాదు.. మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసం కూడా అనువాద ప్రక్రియలో వచ్చిందే. అప్పటి కవులు స్వేచ్ఛను కూడా తీసుకొని.. తమదైన శైలిలో మూలం చెడకుండా భారతాన్ని రాశారు.

అయితే ప్రపంచ సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనలను తెలుగులో ఎందరో కవులు మనకందించారు. ఆ చిట్టా ఇప్పుడు అనవసరం కానీ..

గుల్జార్ రాసిన గ్రీన్ పోయెమ్స్ ను ఆకుపచ్చ కవితలు పేరిట వారాల ఆనంద్ తెలుగులో అనువదించారు. ఈ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆకుపచ్చ కవితలు పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకంలో ఉన్న కవితలు చదువుతుంటే మనకు అచ్చం తెలుగు కవిత్వం చదువుతున్న ఫీల్ కలుగుతుంది. ఎక్కడా అనువాదం అనే భావం కలగదు. హిందీ కవితను కూడా పక్కనే చేర్చారు కాబట్టి.. హిందీ తెలిసిన వారు మూల కవితను పోల్చి చూసుకొనే అవకాశం ఉంది.

మొదటి కవిత నది..

తనలో తాను గుసగుసలాడుతూ

నది ప్రవహిస్తున్నది

చిన్న చిన్న కోరికలు తన హృదయంలో

కదలాడుతున్నాయి

జీవితాంతం ఇసుక తీరాలపై జారుతూ కదిలిన నది

వంతెన మీద నుంచి ప్రవహించాలనుకుంటోంది.

ఇది మొదటి కవిత.. రచయితకు ప్రకృతి మీద ఎంత ప్రేముందో ఈ కవితతో మనకు అర్థమవుతుంది. ఓ నది పడే ఆవేదనను అద్భుతంగా అక్షరీకరించింది ఈ కవిత. ఇందులోని పంక్తులు చదువుతుంటే అచ్చం ఓ తెలుగు కవితను చదువుతున్నట్టే ఉంటుంది తప్ప.. అనువాదమనిపించదు.

గుల్జార్ ప్రకృతి కవి.. నది మీద, మబ్బుల మీద, శిశిరంలో రాలే ఆకుల మీదే ఆయన దృష్టంతా ఉంది. ఆ ఆకుపచ్చ కవితలన్నీ నిజంగానే నదికి మనసుంటే.. మబ్బులకు గొంతు ఉంటే అవి ఇలాగే పలవరిస్తాయేమో అనిపిస్తుంది. శిశిరంలో రాలే ఆకులు .. కొమ్మలకు ఏం చెబుతాయన్నది అచ్చంగా మానవ సంబంధాలను తలపిస్తాయి. చెట్టు మీద కొమ్మ మీద రాలే ఆకు మీద కవికి ఉన్న దృష్టికి నిజంగా అబ్బుర పడతాం..

వీధి మలుపులో వృక్షం అన్న కవిత నిజంగా గుండెలను బరువెక్కిస్తుంది. చెట్టుకు మనిషికి విడదీయలేని సంబంధం ఉంటుంది. తనకు ఎంతో అనుబంధం ఉన్న ఓ భారీ వృక్షాన్ని మున్సిపల్ అధికారులు తన కండ్ల ముందే కూలదోస్తుంటే.. ఏ మనిషికైనా హృదయం బరువెక్కకుండా ఉంటుందా? ఇక కవి అయితే ఆ బాధను అక్షరీకరించకుండా ఉంటాడా.. అలా పుట్టిందే ఈ కవిత..

సూర్యుడితో ఓ చెట్టు చెప్పుకొనే వేదనే సూర్యుడి వేళ్లు కవిత. మనుషులు ఎంత కఠినంగా ఉంటారో.. చెట్ల మీద తమ పేర్లను ఎలా చెక్కుతారో ఓ చెట్టు పడే ఆవేదన ఈ కవిత..

‘మూసేస్తున్న బావి’  ఈ కవిత పల్లెల్లో జరుగుతోన్న విధ్వంసానికి అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా పల్లె టూర్లలో చేదుడు బావులు, ఊట బావులు ప్రజల దాహార్తి తీర్చాయి. అవసరాలు కూడా. కానీ నేటి వాటి ఉనికి లేదు. బావుల జాడ కనిపించడం లేదు. కొన్నివిధ్వంసమయ్యాయి. మరెన్నో కనిపించకుండా పోయాయి. ఆ మూత పడ్డ బావులపై కవి వేదన ఎంతో అర్థవంతంగా ఉంది. ఆలోచనాత్మకండా కూడా..

మొత్తంగా అన్ని కవితలు కదిలించేవే. చెట్టు, పుట్ట, నది, మబ్బు, వర్షం, ఆకాశం ఇలా పుస్తకమంతా ప్రకృతి పలవరింతే.. ప్రకృతి మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తుంటే.. మనిషి మాత్రం దాన్ని మరిచిపోయి పగబట్టినట్టు ప్రకృతిని చెరబడుతున్నాడు. చెట్లను ధ్వంసం చేస్తున్నాడు. నదులను చెరబడుతున్నాడు. వాటి ఉనికి ధ్వంసం చేస్తున్నాడు. రచయిత ఇదే ఆవేదనను వ్యక్తం చేశాడు. రచయిత భావాలను  అనువాదకులు వారాల ఆనంద్ అద్భుతంగా అక్షరీకరించారు. 155 పేజీలున్న ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే.

ప్రతులకు సంప్రదించండి

9440501281

– అరవింద్ రెడ్డి మర్యాద, 8179389805

“ఇరుగు-పొరుగు” లను చూడకుండా మనం ఎదగ లేము

Posted on Updated on

వారాల ఆనంద్ తో ముఖాముఖి

1) అనువాదం అంటే ఏమిటి, అనువాదాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు

జవాబు-       ‘ఇచ్చి పుచ్చు కోవడం’ అన్న భావనే మనిషి మనుగడకు  మూలాదారం.  అంతే కాదు ‘ తెలియంది తెలుసుకోవడం తెలిసింది పంచుకోవడం’ అన్నది  మానవ సంస్కృతిలో అంతర్భాగమయిన జీవనమార్గం. ప్రపంచ వ్యాప్తంగా  వేలాది లక్షలాది సంవత్సరాలుగా భిన్న  భాషలు సంస్క్రుతులతో కొనసాగుతున్న మానవాళి ఈ భాషా,సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, అభివృద్ది రంగాల్లో కొనసాగుతున్న ఈ ‘ఆదాన్ ప్రాధాన్’ భావనతోనే ముందుకు సాగుతున్నది. మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి కాలక్రమంలో భాషను గొప్ప మాధ్యమంగా రూపుదిద్దుకున్నాడు. అయితే ఆ భాష అన్నిప్రాంతాలకూ ఏక రూపకంగా కాకుండా భిన్న రూపాల్లో వ్యక్తమయి ఎదుగుతూ వచ్చింది. కేవలం మన  దేశవిషయం చూసినా భారత  రాజ్యాగం మొదట 14 భాషల్ని అధికార భాషలుగా గుర్తించి తర్వాత ఆ సంఖ్యను 23 వరకు పెంచింది. కానీ నిజానికి మన  దేశంలోనే  ఇంకా ఎన్నో లెక్క లేనన్ని భాషలున్నాయి. వాటిల్లో లిపి ఉన్నవీ లిపి లేనివీ కూడా  వున్నాయి.మరయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్ని భాషలున్నాయో. చెప్పడం కష్టం. 

 ఆ స్థితిలో ఒక ప్రాంతంలో ఒక భాషలో జరిగిన  విషయాలు, విజయాలూ,, సృజనాత్మక విషయాలూ ఇతర ప్రాంతాలకు చేరడానికి వాటిని ఒక భాష నుంచి మరో భాషలోకి చేరవేయడానికి తర్జుమా అవసరమయింది.దాన్నే అనువాదం అన్నారు

 2) అనువాదకునికి ఉండాల్సిన ప్రాధాన అవగాహన, అర్హతలు ఏమిటి?

అనువాదం చేయడానికి అర్హతలు అంటూ ఏమీ ఉండవు. ఫలానా వాళ్ళు మాత్రమే అనువాదం చేయాలని ఏమీ వుండదు అయితే ఏ భాష లోంచి అయితే అనువాదం చేయాలను కుంటామో దాన్ని మూల భాష అనీ, ఎందులోకి  చేయాలనుకుంటామో దాన్ని లక్ష్య భాష అనీ అంటున్నాం. అనువాదం చేయాలనుకున్న అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్  సింటాక్స్ తెలిసి వుండాలి. అంటే అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి. కేవలం భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం వుండి  తీరాలి. అప్పుడే మూల భాష తో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతంగా అనువదించబడుతుంది.

౩) మీకు సాహిత్యం మీద ఆసక్తి పెరగడానికి ప్రేరణ ఎవరు?

జవాబు- నిజానికి నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. ముఖ్యంగా వ్యాపార నేపధ్యం వున్న కుటుంబం. కానీ మా చిన్నప్పుడు మానాన్న ఉర్దూ లో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి  దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ బుక్స్ నుంచి ఇతర పుస్తకాలు చదివే అలవాటు అయింది. తర్వాత అరికేపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలు చదివాను. డిగ్రీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, అమీనా, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ. అదీ మినీ కవిత్వంతో మొదలయింది.  

2. సృజనాత్మక సాహిత్యానికి అనువాద సాహిత్యానికి మధ్య తారతమ్యం ఏంటీ?

జ- సృజనాత్మక సాహిత్యం లో సృజనకారుడు స్వీయ భావాల్ని, అనుభవాల్ని తన సొంత శైలిలో తనదయిన ఒరవడిలో సృష్టిస్తాడు. ఆ రచన ఆ భాష అంతా తన స్వంతం. ఆ రచన ప్రభావం, ఫలితం మొత్తంగా తనదే. కానీ అనువాదం లో అనువాదకుడు వేరొక సృజకారుడు మరో భాషలో రాసిన వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థంతో పాటు మూల రచయిత సాంస్కృతిక నేపధ్యం కూడా తెలుసుకోవాలి. అనువాదకుడు కేవలం భాషానువాదం చేస్తే న్యాయం జరగదు. అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్  సింటాక్స్ తెలిసి వుండాలి. అంటే అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి. కేవలం భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం వుండి  తీరాలి. అప్పుడే మూల భాష తో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతంగా అనువదించబడుతుంది. అప్పుడే అది మంచి అనువాదమవుతుంది.     

3. అనువాద సాహిత్యాన్ని ఎంచుకోవడానికి కారణం?

జ- సాహిత్యం-సినిమా నాకు రెండు కండ్లలాంటివి. సాహిత్యంలో కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు రాసాను. సినిమాల విషయం వస్తే అర్థవంతమయిన మంఛి సినిమాల గురించీ, ఆయా దర్శకులపైనా, సినిమాల పైనా, బాలల సినిమాల పైనా అనేకంగా రాసాను. తెలంగాణా సాహితీ మూర్తులు పేర ముద్దసాని రామిరెడ్డి, సామల సదాశివ ల పైన డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీసాను. అదే క్రమంలో అనువాదాలు కూడా చాలా ఏళ్ళ క్రితమే మొదలు పెట్టాను. విపుల, ఆంధ్రజ్యోతి పత్రికల్లో 90 లలోనే పలు అనువాద కథల్ని రాసాను. తర్వాత స్వీయకవిత్వం తో పాటు కవిత్వానువాదాలు చేయడం ఆరంభించాను. విస్తృతంగా చదవడం ఒక అలవాటుగా  మారిన తర్వాత వివిద భాషల్లో నాకు నచ్చిన కవితల్ని తెలుగు లోకి అనువదించడం ఆరంభించాను. అట్లా ఓ ‘సాంసృతిక బంజారా’ లాగా అనేక సృజనాత్మక రంగాల్లో క్రుషిచేసాను. అనువాదంలో సచ్చిదానందన్, జావేద్ అక్తర్, గుల్జార్ తదితరుల కవితల్ని అనువదించాను. అట్లా అనువాదం నా సృజన జీవితంలో ముఖ్యమయిన అంశం అయిపొయింది.   

4. ఇప్పటివరకు ఎన్నిభాషలను తెలుగులోకి అనువదించారు?

జ- ‘ఇరుగు-పొరుగు’ శీర్షికన ఇప్పటివరకు 17 భారతీయ భాషల నుంచి 70 కవితల దాకా అనువదించాను. ఆసియా నెట్ ఆన్లైన్ పత్రికతో సహా పలు సామాజిక వేదికల్లో ప్రచురించాను.

5. అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అవార్డు రావడం పట్ల మీ అనుభూతి?

జ- కేంద్ర సాహిత్య అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ‘నచ్చిన కవిత్వాన్ని వచ్చిన రీతిలో’ అనువదించాలి అనుకున్నాను. నాకు నచ్చినవి అందరితో పంచుకోవాలనుకున్నాను.  కేంద్ర సాహిత్య అవార్డు రావడం గొప్ప ఆనందమే. మనసులో ఆనందం తో పాటు తలపైన భారం కూడా పెరిగినట్టే. ‘ఆకుపచ్చకవితలు’ పుస్తకాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరికి, అకాడెమీ భాధ్యుఅలకు ధన్యవాదాలు.

6. ఆకుపచ్చ కవితల నేపథ్యం ఏమిటి?

జ- ఆకుపచ్చ కవిత్వం మూల రచయిత గుల్జార్ అంటే నాకు నా కాలేజీ రోజుల నుంచీ అభిమానం. ఆయన్ను మొట్టమొదట ఇష్టపడింది ‘పరిచయ్’ సినిమాలో ఆయన రాసిన ముసాఫిర్ హూన్ యారో.. పాటతో. ఆతర్వాత రాజేష్ ఖన్నా “ఆనంద్’ సినిమాకు గుల్జార్ రాసిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. తర్వాత ఆయన ఖోశిష్ లాంటి సినిమాల్లో కనిపించిన సున్నితత్వం ఆయనకీ నన్ను మరింత దగ్గర చేసింది. తర్వాత గుల్జార్ కవిత్వం పై దృష్టి పడింది. గ్రీన్ పోయెమ్స్, సస్పేక్టేడ్ పోయెమ్స్, నెగ్లేక్తేడ్ పోయెమ్స్, గ్రీన్ పోయెమ్స్ ఇట్లా అనేక సంకలనాలు చదివాను. అంతేకాదు ఆయన చేసిన టాగోర్ ‘భాగ్బాన్’ అనువాదం కూడా చదివాను. వాటిల్లో గ్రీన్ పోయెమ్స్ బాగా నచ్చింది, అందులో ఆయన స్పృశించిన పర్యావరాణ అంశం బాగా హత్తుకుంది. చెట్లు, మబ్బులు, నదులు, పర్వతాలు ఇట్లా అనేక అంశాలూ వాటికీ మనిషి వున్న అనుబందం అన్నింటినీ ఇందులో గుల్జార్ సున్నితంగా ఆవిష్కరించాడు దాంతో ఆ పుస్తకాన్ని అనువాదం చేయాలనుకున్నాను.       

7. వాటిని అనువదిస్తున్నపుడు మీరు అవార్డు వస్తుందని అనుకున్నారా?

లేదు అలాంటి ఆలోచన రాలేదు.

8) గుల్జార్‌ సాహిత్యంలోని ప్రత్యేకత ఏమిటి?

జ- గుల్జార్ సాహిత్యం లో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్ వుంటుంది. ఆయన బొప్ప భావుకుడు. అయినా ఆయన రచనల్లో మనిషి, మానవత్వం, ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆయన భాష, శైలి చాలా సున్నితంగా హృదయానికి హత్తుకునేలా వుంటుంది. ఇక ఆయన కవిత్వంలో ఇమేజెస్ అద్భుతంగా వుంటాయి. అన్నీ దాదాపుగా మనం రోజూ చూసే అనుభూతించే అంశాల్లానే అనిపిస్తాయి. కానీ వాటిల్లో ఒక టచ్ నెస్ మనల్ని కదిలిస్తుంది.

9) గుల్జార్‌ సాహిత్యాన్ని అనువాదానికి ఎంచుకోవడానికి కారణం?

జ- ‘గగన సీమలో ఆకాశ

అతుకులు అతుకులుగా విడిపోతున్నది,

ఎన్నిప్రాంతాల్నుంచి

ఈ గుడారం విడి పోతున్నదో

నా కవిత్వంతో

రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ

మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఎంచు కోకుండా ఉండలేక పోయాను.

ఇంకో కవితలో

‘భయపడకు నేనున్నాను / భయపడకు నేనున్నాను

ఆ ఒంటరి ఆకు/ చెట్టుకు ధైర్యాన్నిస్తూ/ చెబుతూనే వుంది’ లాంటివి చదివాక  అనువదించాలి అనుకున్నాను.

12. తెలుగు సాహిత్యంలో సాధించాల్సిన పురోగతి ఏమన్న ఉందంటారా?

జ- తెలుగు సాహిత్యం ముఖ్యంగా తెలుగు కవిత్వం ప్రపచంలోని మరే భాషకూ స్థాయీ పరంగా తీసిపోదు. విషయపరంగా వ్యక్తీకరణ పరంగా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తూనే వుంది. అయితే నూతనంగా రాయడం ఆరంభించిన కవులు రచయితలు చుట్టూ వున్న సమాజాన్నీ,మనుషుల్నీ లోతుగా అర్థం చేసుకోవాలి.విశ్లేసించుకోవాలి. అట్లే వివిధ భాషలలో వస్తున్న కవిత్వాన్ని అధ్యయనం చేయాలి,  అప్పుడే మరింత గొప్ప కవిత్వం వచ్చే అవకాశం వుంది. ఇరుగుపొరుగు లను చూడకుండా మనం ఎదగ లేము.   

‘సాహిత్య బంజారా’లా తిరుగుతున్నాను’’

Posted on Updated on

వారాల ఆనంద్‌ :పలకరింపు

++++

గుల్జార్‌ కవిత్వ అనువాదానికి 2022 కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకుంటున్న సందర్భంగా అభినందనలు..

‘నచ్చిన కవిత్వాన్ని వచ్చిన రీతిలో’ అనువదించాలి అనుకున్నాను అంతే. కేంద్ర సాహిత్య అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవార్డు రావడం గొప్ప ఆనందమే. మనసులో ఆనందంతో పాటు తలపైన భారం కూడా పెరిగినట్టే. గుల్జార్‌ ‘గ్రీన్‌ పోయెమ్స్‌’ సంకలనానికి నా అనువాదం ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరికి, అకాడెమీ భాధ్యులకు ధన్యవాదాలు.

**గుల్జార్‌ కవి మాత్రమేగాక హిందీ సినిమా రచయిత కూడా కదా. సినీ గీతాల ద్వారా ఆయనవైపు మొదట ఆకర్షితులు అయ్యారా, లేక ఆయన కవిత్వం మొదట చదివారా?

గుల్జార్‌ అంటే నాకు నా కాలేజీ రోజుల నుంచీ అభిమానం. ఆయన్ను మొట్టమొదట ఇష్టపడింది ‘పరిచయ్‌’ సినిమాలో ఆయన రాసిన ‘ముసాఫిర్‌ హూన్‌ యారో..’ అన్న పాటతో.

ఆ తర్వాత రాజేష్‌ ఖన్నా ‘ఆనంద్‌’ సినిమాకు గుల్జార్‌ రాసిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన తీసిన ‘ఖోషిష్‌’ లాంటి సినిమాల్లో కనిపించిన సున్నితత్వం ఆయనకు నన్ను మరింత దగ్గర చేసింది. తర్వాత గుల్జార్‌ కవిత్వం పై దృష్టి పడింది. గ్రీన్‌ పోయెమ్స్‌, సస్పెక్టెడ్‌ పోయెమ్స్‌, నెగ్లెక్టెడ్‌ పోయెమ్స్‌, సెలెక్టెడ్‌ పోయెమ్స్‌, జీరోలైన్‌ ఇట్లా ఆయన రాసిన అనేక సంకలనాలు చదివాను. అంతేకాదు ఆయన చేసిన టాగోర్‌ ‘బాగ్బాన్‌’ అనువాదం కూడా చదివాను. వీటిల్లో ‘గ్రీన్‌ పోయెమ్స్‌’ బాగా నచ్చింది. అందులో ఆయన స్పృశించిన పర్యావరాణ అంశం బాగా హత్తుకుంది. పర్యావరణం అన్న మాట ఎక్కడా అనకుండా చెట్లు, మబ్బులు, నదులు, పర్వతాలు ఇట్లా అనేక అంశాలనూ, వాటికీ మనిషికీ వున్న అనుబంధాన్నీ ఇందులో గుల్జార్‌ సున్నితంగా ఆవిష్కరించాడు. అందుకే ఈ పుస్తకాన్ని ‘ఆకుపచ్చ కవితలు’ పేరిట అనువాదం చేయాలనుకున్నాను.

**‘లయ’ కవితా సంకలనం నుండి నేటి వరకు గత నాలుగు దశాబ్దాల మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పండి?

చిన్నప్పుడు నేను పెద్ద అంతర్ముఖుడ్ని. మాట్లాడడం సరిగ్గా వచ్చీ రాక చాలా పెద్ద కుటుంబంలో ఒంటరిగా గడిపేవాన్ని. కరీంనగర్‌లో నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. మా చిన్నప్పుడు మా నాన్న ఉర్దూలో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్‌ స్టాల్‌ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్‌ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్‌ట్‌ పుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు చదివే అలవాటయింది. తర్వాత యద్దనపూడి, అరికెపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలు చదివాను. డిగ్రీ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, మైదానం, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ అయింది. ఆ కోరికతో మినీ కవిత్వం, చిన్న కథలు రాయడం ఆరంభించాను. అట్లా మొదటి ప్రయత్నంగా అలిశెట్టి ప్రభాకర్‌, వజ్జల శివకుమార్‌, జింబో, పీ.ఎస్‌.రవీంద్ర లతో కలిసి ‘లయ’ మినీ కవితా సంకలం తెచ్చాం. తర్వాత కరీంనగర్‌ ఫిలిం సొసైటీ లో చేరాను. అర్థవంతమయిన సమాంతర సినిమాల వైపు నా దృష్టి మరలింది. సినిమా చాలా ప్రభావ వంతమయిన మాధ్యమమని గొప్ప సినిమాల్ని సామాన్య ప్రజలకు, విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చూపించాలని ఫిలిం సొసైటీ ఉద్యమంలో ప్రధాన బాధ్యతను తీసుకున్నాను. కానీ సాహిత్య అధ్యయనం మాత్రం నిరంతరం కొనసాగింది. కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు, సినిమాలు, డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌ తీయడం, విమర్శ, అనువాదాలు, కొంతకాలం జర్నలిజం ఇట్లా ‘సాహిత్య బంజారా’లా తిరుగుతున్నాను. ఏదో తెలుసుకోవాలననీ, తెలుసుకున్నది తెలియజెప్పాలన్న నా ఈ చిన్న యాత్ర కొనసాగుతూ వున్నది.

** అభ్యుదయం నుండి అనేక వాదాలు చెలరేగినా అన్ని వాదాలు దాటుకుంటూ కవితా వాదాన్ని మాత్రమే నిలబెడుతూ సాగడం లోని మీ నిష్ఠ-నిశ్చయం?

ఆయాకాలాల్లో పెళ్ళుబికిన సామాజిక సంఘర్షణ, సామాజిక మార్పు ప్రతి సృజనకారుడి పైనా వుంటుంది. ప్రతిస్పందన మాత్రం ఆ సృజనకారుడి మానసిక స్థితి, స్వీకరించి ప్రతిస్పందించే లక్షణం మీద ఆధారపడి వుంటుంది. నేను అన్ని వాదాలనీ దగ్గరి నుంచి చూసాను. కలిసి నడిచాను. నేనెప్పుడో రాసుకున్నట్టు ‘‘ఈ సమాజం అచ్చుతప్పులున్న గొప్ప పుస్తకం, ఇప్పుడు కావలసింది తప్పొప్పుల పట్టిక తయారు చేయడం కాదు, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలి’’ అన్న భావనలోనే వున్నాను.

** ‘ఆకుపచ్చ కవితలు’ అనగానే పర్యావరణకవిత్వం అనుకుంటారు ప్రకృతి పర్యావరణమా.. మానవ మనః ప్రకృతి పర్యావరణమా..?

‘ఆకుపచ్చ కవితలు’తో సహా గుల్జార్‌ సాహిత్యంలో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్‌ వుంటుంది. ఆయన గొప్ప భావుకుడు. ఆయన రచనల్లో మనిషి, మానవత్వం, ప్రధానంగా కనిపిస్తాయి. ఇక ఆయన భాష, శైలి చాలా సున్నితంగావుండి హృదయానికి హత్తుకునేలా వుంటాయి. ఆయన కవిత్వంలో ఇమేజెస్‌ అద్భుతంగా వుంటాయి. అన్నీ దాదాపుగా మనం రోజూ చూసే, అనుభూతించే అంశాల్లానే అనిపిస్తాయి. కానీ వాటిల్లో ఒక ఫ్రెష్‌నెస్‌ మనల్ని కదిలిస్తుంది. మనసు కదిలిపోతుంది.

‘గగన సీమలో ఆకాశం/ అతుకులు అతుకులుగా విడిపోతున్నది, / ఎన్ని ప్రాంతాల్నుంచి/ ఈ గుడారం విడిపోతున్నదో/ నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ/ మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఆయన కవిత్వం నాపై గొప్ప ప్రభావాన్ని కలిగించింది. ఇంకో కవిత:

‘భయపడకు నేనున్నాను

భయపడకు నేనున్నాను

ఆ ఒంటరి ఆకు

చెట్టుకు ధైర్యాన్నిస్తూ

చెబుతూనే వుంది’

ఇలాంటి కవితలు చదివాక అనువదించాలి అనుకున్నాను.

** మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి?

చివరంటా చదువుతూ రాస్తూ వుండాలి. దాంతో పాటు ‘గో టు కాలేజెస్‌’ అంటూ కొత్త తరాన్ని చేరాలన్నది నా కోరిక. సాహిత్యం సినిమాలు కేవలం కొన్ని సర్కిల్స్‌ కే పరిమితం కాకుండా కాంపస్‌ల్లోకి వెళ్ళాలన్నది నా ఆశ. గతంలో చాలా కాలేజీల్లో కాంపస్‌ ఫిలిం క్లబ్స్‌ పెట్టాను. అట్లే కవిత్వం క్లబ్స్‌ కూడా రావాలి. ఈ దిశగా కవులు రచయితలూ అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను

ఇంటర్వ్యూ: గండ్ర లక్ష్మణ రావు

విశ్వకవి రవీంద్రునికి అక్షరాంజలి— వారాల ఆనంద్

Posted on

విశ్వకవి రవీంద్రునికి అక్షరాంజలి
— వారాల ఆనంద్
విశ్వ కవి రవీంద్ర నాథ్ టాగోర్ .. టాగొర్ అనగానే గొప్ప సంతోషం. మరెంతో ఉద్వేగం. ఆయన సృజన, సృజనాత్మక జీవితం గొప్ప భావస్పోరకమయింది. ఆయన రచనలు ఇంతకు ముందు ఎన్నోసార్లు చదివినవే అయినా ఎవరికయినా వాటిని మళ్ళీ చదవడం గొప్ప అనుభవమే. “REVISITING ALWAYS REJUVANATES “. ఒక కవిని, కవితని రచయితని రచనని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్పురిస్తాయి. ఆ కవి, రచయిత సరికొత్తగా దర్శనమిస్తాడు. Between the lines వాళ్ళు మనతో సరికొత్తగా మాట్లాడతారు. ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగానూ ఆ సృజన కారులు మనముందు ఆవిష్కృత మవుతారు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తారు. రవీంద్రనాథ్ టాగోర్ని మళ్ళీ మళ్ళీ చదవడం, ఆయన్ని గుర్తు చేసుకోవడం సరి కొత్త అనుభవమే.

ఇక టాగోర్ రాసిన కవితల అనువాదం GULZAR translates TAGORE… THE GARDENER” ( బాగ్ బాన్).
ఈ పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది అంతేకాదు మ్యూజిక్ ఆల్బం గా కూడా చాలా ప్రాచుర్యం పొందింది. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత జరిగిన దేశ విభజన వేలాది కుటుంబాలను ప్రభావితం చేసినట్టుగానే గుల్జార్ కుటుంబాన్నీ ప్రభావితం చేసింది. వారి కుటుంబం ధిల్లీ కి చేరుకొని అక్కడ నివసించ సాగారు. ఆ చిన్నతనంలో గుల్జార్ ని తమ గారేజ్ లో పడుకోమని ఇంట్లో పెద్దలు ఆదేశించడంతో రోజూ రాత్రిళ్ళు గారేజే తన నివాసం గా చేసుకున్నాడు గుల్జార్. అప్పుడు తను కాలక్షేపం కోసం దగ్గరలో వున్న పుస్తకాలు కిరాయికి ఇచ్చే దుకాణంలో వారానికి ఒక అణాకి రోజుకో పుస్తకం తెచ్చి చదువుతూ ఉండేవాడు. మామూలు అపరాధక పరిశోదన పుస్తకాలు చదువుతూ రోజుకో పుస్తకం అడుగుతూ వుండడంతో ఆ పుస్తకాల షాపతను ఒక అణాకు ఎన్ని పుస్తకాలు చదువుతావు ఇదో ఇది తీసుకెళ్ళు అని అటక మీది నుంచి ఓ పుస్తకం తీసి దుమ్ము దులుపి ఇచ్చాడంట, ఆ రాత్రి ఆ పుస్తకం చదవడంతో తన జీవితమే మారిపోయింది అంటాడు గుల్జార్. ఆ పుస్తకమే టాగోర్ ‘గార్డెనర్’. అది జరిగిన అనేక దశాబ్దాల తర్వాత గుల్జార్ టాగోర్ ని అనువదించి అందించిన పుస్తకమే నేనిప్పుడు అంటున్న ‘ GULZAR translates TAGORE… THE GARDENER” ( బాగ్ బాన్).
సంజీవ్ గోయెన్కా ముందుమాట తో మొదలయ్యే ఈ పుస్తకం కోసం బెంగాలీ తెలిసిన వాడు కనుక గుల్జార్ టాగోర్ మౌలిక రచనల్ని సేకరించి హిందీ లోకి అనువదించాడు. అందుకోసం సంచారి ముఖర్జీ సహకరించారు. సంచారి పరిచయ వాక్యాలూ రాసారు. మొత్తంగా పుస్తకం టాగోర్ రాసిన బెంగాలీ మూల కవితలు, టాగోర్ స్వయంగా ఇంగ్లీష్ లోకి చేసిన అనువాదాలు, గుల్జార్ చేసిన హిందీ అనువాదాలతో కలిపి త్రి భాషా సంగమంగా వెలువడింది.
నాకు బెంగాలీ రాదు కాని టాగోర్ ని ఇంగ్లీష్ లో చదివి,తిరిగి హిందీలో గుల్జార్ ద్వారా చదవడంతో మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం ఇట్లా అనేక కోణాల్లో అటు టాగోర్ ని, గుల్జార్ ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. నన్ను నేను, నాలోకి నేను తరచి, తరచి చూసుకునే అవకాశం లభించిది. REALLY IT’S A GREAT EXPERIENCE. టాగోర్ ని తిరిగి దర్శించడం అదీ గుల్జార్ అనే ప్రకాశవంతమయిన టార్చ్ లైట్ వెలుగులో చూడడం గొప్ప అనుభవం. టాగోర్ ప్రేమికులు గుల్జార్ అభిమానులు మొత్తంగా కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళంతా చదవాల్సిన పుస్తకమిది. టాగోర్ తన కవిత్వంలో చిత్రమయిన సూతయిన ప్రశ్నలు వేస్తాడు.. మనిషి జీవితంలో ఏదయినా దాని శక్తికి మించి లాగితే కుదరదని అది అంతరిస్తుందని చెబుతాడు టాగోర్ అందుకో ఉదాహరణ ఇస్తాను ..
అత్యాశ
=====రవీంద్ర నాథ్ టాగోర్ – అనువాదం గుల్జార్
దీపం ఎందుకు ఆరి పోయింది
రెండు చేతులూ అడ్డుపెట్టి
వీచే గాలినుంచి రక్షించేదుకు
కొంచెం ఎక్కువే యత్నించా
అందుకే దీపం ఆరిపోయింది

పువ్వెందుకు వాడి పోయింది
ప్రేమతో ఆత్రంగా నా గుండెలకు
గట్టిగా హత్తుకున్నాను
అందుకే పువ్వు వాడిపోయింది

నది ఎందుకు ఎండి పోయింది
ఎప్పటికీ సొంతం చేసుకునేందుకు
ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట వేసాను
అందుకే నది ఎండిపోయింది

వీణ తీగ ఎందుకు తెగి పోయింది
నేనే శృతి కోసం దాని శక్తికి మించి
లాగానేమో
అందుకే తీగ తెగి పోయింది
(స్వేచ్చానువాదం: వారాల ఆనంద్)

టాగోర్ మనిషిని ప్రేమించాడు. మానవత్వాన్ని ఆరాధించాడు. బాలల సంపూర్ణ వికాసాన్ని ఆకాంక్షించాడు అందుకు విశేషంగా కృషిచేసాడు. టాగోర్ ప్రకృతితో ఎంతగా మమేకంయ్యాడో మనిషి పతనం పట్ల, హింసా ప్రవృత్తి పట్ల అంతే వేదనపడ్డాడు. స్పందించాడు. టాగోర్ తన 80వ జయంతి సందర్భంగా రాసిన నాగరికతలో సంక్షోభం( CRISIS IN CIVILIZATION) ఆయన వేదనకు దర్పణం. అది ఇవ్వాల్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో స్వార్థపరయుద్దోన్మాద ప్రపంచానికి సంభందించి నట్టుగానే వుంటుంది. అందులో “ఇన్నేళ్ళుగా యూరోప్ నుంచే మానవ నాగరికత వికసిస్తుంది అని విశ్వసించాను కాని ఇటీవలి అనాగరిక యుద్దాలు, హింస ఆ విశ్వాసాన్ని తుత్తునియలు చేసింది.ఇక భవిష్యత్తులో తూర్పు దేశాల నుండే,ఎక్కడయితే సూర్యుడు ఉదయిస్తాడో అక్కడినుండే నవ్య నాగరికత ఉధ్వవించాలి. నా ఈ అంతిమ ఘడియల్లో మనిషి పైన మానవత్వం పైనా విశ్వాసం సన్నగిల్లు తున్నది. అయినా మనిషి పైన అవిశ్వాసం ప్రకటించలేను అన్నాడు టాగోర్.
జలియన్ వాలా బాగ్ దమనకాండ జరిగిన నేపధ్యంలో కూడా టాగోర్ తీవ్రంగా కలత చెందాడు. దాన్ని తీవ్రంగా నిరసించాడు. గతంలో బ్రిరీష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన నైట్ హుడ్ టైటిల్ ని తిరిగి ఇచ్చేసాడు. తన సృజనాత్మక జీవితంలో ఎంతగానో ప్రేమని పంచిన టాగోర్ నిరసనని వ్యక్తం చేయడంలో అసలు ఎప్పుడూ సంకోచించలేదు.
+++++++
భారత దేశానికి,బంగ్లాదేశ్ కి రెండు దేశాలకూ జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ శ్రీలంక జాతీయగీతానికి ప్రేరణగా నిలిచాడు.
రవీంద్ర నాథ్ టాగోర్ మే ఏడు న 1861లో ఓ గొప్ప బెంగాలీ కుటుంబంలో పుట్టాడు. దేబేంద్రనాథ్ టాగోర్, శారదా దేవిల పద్నాలుగవ సంతానం ఆయన. తండ్రి దేబేంద్రనాథ్ గొప్ప ఆలోచనాపరుడు. బ్రహ్మో మతాన్ని ప్రభోదించిన వాడు. తాత ద్వారకనాథ్ ప్రముఖ వ్యాపారవేత్త. టాగోర్ సోదరుల్లో కవులు, సంగీతకారులు, పండితులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు ఇట్లా ఎంతోమంది వున్నారు. టాగోర్ విద్యాభ్యాసం కోసం పాఠశాలకు వెళ్ళలేదు.ఇంటిలోనే ఆయన చదువు సాగింది. తన తండ్రితో కలిసి చేసే ప్రయాణాలతో విశేషంగా నేర్చుకున్నాడు ఎనిమిదేళ్ళకే కవిత్వం రాసి కలం పేరుతో వెలువరించారు, తర్వాత పదహారేళ్ళు వచ్చేసరికి మొదటి పుస్తకమూ, కొన్ని కథలూ, నాటకాలూ రాసి రచయితగా ఎదుగుతూ వచ్చాడు.
ఆయన ప్రదానంగా కవిత్వం రాసాడు.ఆయన ‘గీతాంజలి’ విశ్వ ఖ్యాతిని అందుకుంది. రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి టాగోర్. గీతాంజలి అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. తెలుగులో కూడా అనేక అనువాదాలు వచ్చాయి.సుప్రసిద్ధ నటుడు కొంగర జగ్గయ్యతో సహా పలువురు అనువదించారు అంతేకాదు టాగోర్ కథ నవల, వ్యాసం, పిల్లల కోసం కథలు నవలలు, నాటకాలూ రాసాడు. సంగీతం, పెయింటింగ్ రంగాల్లో కూడా విశేషంగా సృజన చేసాడు. టాగోర్ సంగీతం రవీంద్ర సంగీత్ గా ప్రసిద్ధమయింది. ఇంకా ఆయన ఆత్మకథగా ఆయన రాసుకున్నవి రెండు – జీవన స్మృతి (My reminiscences), చేలేబేలా (Childhood Days). ఆయన ఉత్తరాల ద్వారా, వ్యాసాల ద్వారా ఆవిష్కరింపబడ్డ ఆత్మకథ “my life in my words”.

టాగోర్ కవిత్వం ఇష్టపడ్డ ప్రముఖుల్లో సీ.ఎఫ్.ఆండ్రూస్, యీట్స్, ఎజ్రా పౌండ్, థామస్ మూర్ వంటి ప్రముఖులున్నారు. టాగోర్ కలిసిన ఆ నాటి ప్రముఖుల్లో ఐన్‌స్టీన్ మొదలుకుని ముస్సోలిని దాకా ఎంతో మంది ఉన్నారు.
రవీంద్రుడు కేవలం రచయితగానే కాకుండా బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన గురుకులాల తరహాలో శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. పొద్దున్నే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు.1919లొ కళాభవన్ ను ఆయన స్తాపించారు. ఇక్కడ విద్యార్ఢులు విభిన్న కళలను నెర్చుకునెవారు. అక్కడ నందలాల్ బోస్ లాంటి అనేక మంది సుప్రసిద్ధ చిత్రకారులు పనిచేసారు.
ఇట్లా టాగోర్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే వుంటుంది.

Where the mind is without fear
“ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి వెలువడుతాయో ,
ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని అంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
ఎక్కడ మనస్సు తలపులో పనిలో నిత్యం విశాలమయిన దారుల వైపు పయనిస్తుందో
-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ!
నా దేశాన్ని మేల్కొనేటట్టు అనుగ్రహించు”
+++++++++
కొన్ని టాగోర్ కొటేషన్స్

అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.

జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు,వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.

నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.

కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.

ప్రేమించే వ్యక్తికీ దండించే అధికారం కూడా ఉంటుంది.
ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.

భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.

సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు
.
మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.

మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.

ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే ‘కళ’.

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.

వెలిగే దీపం లాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.

+++++++++++++++++++++

జీవితంలో ప్రతిరోజూ..
క్రితం రోజు కన్నా..
కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు
నేర్చుకోవాలి.

చెడుగా ఆలోచించే గుణమే
సగం సమస్యలకు కారణం

నువ్వు ధైర్యంగా
ఒక అడుగు ముందుకు వేస్తే..
విజయం పది అడుగులు
ముందుకు వస్తుంది.

ప్రయత్నం చేసి ఓడిపో..
కానీ ప్రయత్నం చెయ్యడంలో
మాత్రం ఓడిపోవద్దు.

మంచిని పెంచుతానంటూ
పరుగులు తీసే వ్యక్తికి
తాను మంచివాడుగా ఉండేందుకు
తీరిక దొరకదు.

కోపం మాటల్లో ఉండాలి.
మనసులో కాదు.
ప్రేమ మాటల్లోనే కాదు.
మనసులో కూడా ఉండాలి.

కళ్లకి రెప్పలు ఉన్నట్లే..
పనికి విశ్రాంతి ఉండాలి.

భయంతో ఉన్నవాళ్లు ఏదీ సాధించలేరు.

ప్రేమించే వ్యక్తికి..
దండించే అధికారం కూడా ఉంటుంది.

మనది కాని వ్యస్తువుపై
వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం.

ప్రేమ గుణం బాగా పెరిగి
లభించే సంపద ‘పవిత్రత’.

జీవితంలో వైఫల్యాలు
భారమని గ్రహించేవారు..

వాటి గుణపాఠాలు
నేర్చుకోవచ్చు.

నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు
మాత్రమే చక్కటి విద్యార్థులను తయారు చేయగలడు.

నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు..
అది పాపం, ఆత్మహత్య కంటే ఘోరం!

విశ్వకవి రవీంద్రునికి అక్షరాంజలి
--- వారాల ఆనంద్

Posted on

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

           ————————– గుల్జార్

           —– అనువాదం: వారాల ఆనంద్

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు

‘రాత్రులు’

దాడి చేయడానికి సిద్ధపడ్డాయి

అది ఓ సాలెగూడు

చీకటిని కొంతమంది పెంచి పోషిస్తున్నారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మనుషులూ వాళ్ళ విశ్వాసాలూ

అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి

అగ్నికోరలు గర్జించినప్పుడు- భయమేస్తుంది  

అవి ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు

మరింత భయంతో వణుకొస్తుంది  

‘జాతి’

కొందరి పదఘట్టనల క్రింద

నలిగిపోతున్నది

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మరోసారి మెడలు వంచబడ్డాయి

తలలు తెగి రాలిపడ్డాయి

ప్రజలూ వాళ్ళ దేవుళ్ళు కూడా

విభజించబడ్డారు  

ఎవరయినా పేరేమిటని అడిగితే.. భయమేస్తుంది

ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తున్నది

కొందరు చాలాసార్లు  నన్ను

మంచెకు వేలాడదీసారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు