ఇల్లు

Posted on Updated on

1244

 

ఇల్లు

తరాలుగా
ప్రేమల్లో తడిసి
మంచంలో నులకలా
అల్లుకు పోయిన ఆప్యాయతలన్నీ ఆవిరై
పతంగులన్నీ ఎగిరిపోతే
ఉన్న ఫలంగా ఖాళీ అయిన
ఆ ఇల్లు బోసిపోతుంది

గోడలు దిగాలు పడతాయి
కిటికీలు కన్నీరు కారుస్తాయి

అక్కడ మనుషులు నడిచిన
నేలంతా తడి తడిగా అవుతుంది
అందులో వాళ్ళ పాదముద్రలు
ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి

ఇల్లు కేవలం గూడు కాదు
అనుబంధాల అల్లిక
అనుభవాల కలబోత

పండుగలూ పబ్బాలూ
కేరింతలూ కోపతాపాలూ
కలిసి వుండడమే
ఇంటికి పునాది

ఇల్లెప్పుడూ ఇరుకు కాదు
మహా వృక్షం లా నీడ నిస్తుంది
కంటి నిండా నిద్రనిస్తుంది
ఓ చిరునామా నిస్తుంది

ఇంటి చుట్టూ
సమిష్టి భావనతో
గాలి సయ్యాట లాడుతుంది

ఇంటి ముందటి వేపచెట్టు
వెనకాల బాదం చెట్టు
నీడనే కాదు
నిమ్మళాన్ని ఇస్తాయి

కదిలి పోయిన కాళ్ళకి
ఒత్తిగిలిన మనసుకీ
తనను తాను తెలుసుకోవడానికి
తమలోకి తాము చూసు కోవడానికి

ఇల్లే నెలవు
అది మట్టిదయినా
గూన పెంకుల దయినా
-వారాల ఆనంద్

-వారాల ఆనంద్

Leave a comment