VARALA AANAND POETRY

‘GREEN POEMS’ఆకుపచ్చ కవితలు

Posted on

Gulzar’s ‘GREEN POEMS’ (ఆకుపచ్చ కవితలు)
Chat and Recitation of poems for AIR Hyderabad. Recorded today will be in air soon…Thank you C.S.Rambabu garu

41733915_10157747868509377_7358177704249655296_n

Advertisements

ఆకుపచ్చ కవితలు

Image Posted on Updated on

c72143fd-65fe-4e77-aab4-1e95fb4a4263

ఎంత బాగుంటుంది (POEM)

Posted on

ఎంత బాగుంటుంది

——- వారాల ఆనంద్

ఒకర్ని ఒకరు పలకరించుకోవడం

ఎంత బాగుంటుంది

లేత కిరణాలు ఆకుల్నీ పువ్వుల్నీ

పల్కరించినట్టు

 

చూపులతో నయినా

రెండు మాటలతో నయినా

. . .

ఒకర్ని ఒకరు తెలుసుకోవడం

ఎంత బాగుంటుంది

సుఖం లోనూ దుఃఖం లోనూ

విజయం లోనూ ఓటమిలోనూ

ఇసుక తిన్నెలపైన

నీటి దారాలు అల్లినట్టు

. . .

ఒకర్ని ఒకరు ప్రేమించుకోవడం

ఎంత బాగుంటుంది

నిద్దర్లోనూ మెలకువలోనూ

కలల్లోనూ అన్ని కాలాల్లోనూ

 

కెరటాలు ఉప్పొంగి

ఆర్తిగా తీరాన్ని తాకినట్టు

. . .

ఒకరికోసం ఒకరు ఎదురుచూడ్డం

ఎంత బాగుంటుంది

చీకట్లోనూ వెల్తురు లోనూ

స్నేహం లోనూ మొహం లోనూ

 

సాయంకాలం

సూర్యుడు చంద్రుడి కోసం

ఉదయం

చంద్రుడు సూర్యునికోసమూ

ఎదురు చూసినట్టు

. . .

ఒకర్ని ఒకరు ఒదార్చుకోవడం

ఎంత ధీమాగా వుంటుంది

ఒంటరయినప్పుడూ ఓడిపోయినప్పుడూ

నిలబడలేనప్పుడూ కూలిపోయినప్పుడూ

ఎండిన గుండెల్లో

తడి తడి వాన కురిసినట్టు

entha baaguntundi FINAL

POEMS & ARTICLE

Posted on Updated on

గుల్జార్‌ ఆకుపచ్చ కవితలు
Aug 13, 2018,
Gulzar Poetry By Varala Anand – Sakshi
ప్రతిధ్వనించే పుస్తకం
—————
ముసాఫిర్‌ హూన్‌ యారో
నా ఘర్‌ హయ్‌ నా టిఖానా
నాలుగు దశాబ్దాల క్రితం నాటి ‘పరిచయ్‌’ సినిమాలోని పాటతో గుల్జార్‌తో కవిగా దర్శకుడిగా తొలి కరచాలనం. నేను ఇంటర్‌ చదువుతున్న రోజులవి. బినాకా గీత్‌ మాల వింటూ గడుపుతున్న రోజులు. చదువులూ పరీక్షలూ అన్నీ వెన్నంటే ఉన్నప్పటికీ ఎక్కడో ఒంటరితనం లోపల వెంటాడేది. ఆ ఒంటరితనమే మొదట హిందీ పాటల వైపునకు లాగింది. అప్పుడే వచ్చిన ‘ఆనంద్‌’ సినిమా నా జీవితంపై గొప్ప ప్రభావం చూపించింది.
‘బాబూమొషై జిందగీ బడీ హోని చాహీయే, లంబీ నహీ’
‘జబ్‌ తక్‌ జిందా హూ తబ్‌ తక్‌ మరా నహీ, జబ్‌ మర్‌ గయా సాలా మై హీ నహీ’
‘మౌత్‌ తో ఏక్‌ పల్‌ హై’
లాంటి గుల్జార్‌ మాటలు ఇప్పటికీ హాంట్‌ చేస్తూనే వుంటాయి. (జీవితం ఉన్నతమైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు; బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను; మరణం ఒక క్షణమే).
అట్లా గుల్జార్‌తో మొదలయిన ప్రయాణం కోషిశ్, ఆంధీ, ఖుష్బూ, ఇజాజత్‌… ఇలా అనేక సినిమాలతో సాగుతూ వచ్చింది. అది సినిమాలతో ఆగలేదు, ఆయన కవిత్వం వైపు మరలింది.
‘కొంచెం నవ్వించి మరికొంచెం ఏడిపించి ఈ ‘క్షణం’ కూడా వెళ్ళిపోతుంది’
‘తూఫాను వెళ్ళిపోవడం కోసం ఎదురు చూడ్డం కాదు జీవితమంటే వర్షంలో నృత్యం చేయడాన్ని నేర్చుకోవడమే జీవితం’
ఇట్లా ఇన్నో పంక్తులు ఎవరినయినా పట్టేస్తాయి. ఆయన గజల్స్, కవితల అనువాదాలు ఫాలో అవుతూ వచ్చాను. అట్లా ‘గ్రీన్‌ పొయెమ్స్‌’తో థ్రిల్‌ అయ్యాను. గుల్జార్‌ కవిత్వంలో సహజంగా వున్న సున్నితత్వమూ, సరళత్వమూ, సూటితనమూ ఈ కవితల్లో నిండుగా వున్నాయి. ప్రకృతి, నదులు, అడవులు, పర్వతాలు, మంచు, వర్షం, మబ్బులు, ఆకాశం, భూమి, అంతరిక్షం అన్నీ కవితా వస్తువులై నిలిచాయి. అందులోని కవితల్ని మన వాళ్ళతో పంచుకోవాలనిపించింది. మెల్లిగా అనువాదం చేయడం ఆరంభించాను. అనువాదం చేస్తున్నాను, పుస్తకం వేయడానికి అనుమతిస్తారా అని గుల్జా్జర్‌కి మెయిల్‌ రాశాను. వెంటనే జవాబు వచ్చింది, మీ పరిచయం మీ రచనల వివరాలు పంపండి అని. నా పుస్తకాలు కొన్ని పంపించాను. మూడో రోజుకు మళ్ళీ జవాబు వచ్చింది. అనువాదం చేయండి కాని నాకు ఒక కాపీ పంపండి అని. దాంతో మరింత ఉత్సాహంగా అనువాదం పూర్తయింది.
గ్రీన్‌ పొయెమ్స్‌ మూలం హిందీ. ఆ కవితల్ని పవన్‌ వర్మ ఇంగ్లిష్‌లోకి చేశారు. పవన్‌ వర్మ మౌలికంగా కవి. ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారి అయిన ఈయన రాజ్యసభ సభ్యుడు కూడా. గుల్జార్‌ మూలం హిందీ నుంచి తెలుగులోకి తేవడంలో ఈ ఇంగ్లిష్‌ అనువాదం ఎంతో తోడ్పడింది.
-వారాల ఆనంద్‌
==========================
యమ యాతన
Yathana-nijam
( POEM PUBLISHED IN NAMASTHE TELANGANA today)
ప్రతి ముగింపూ ఒక ఆరంభమే
ప్రతి ఆరంభమూ ఒక ముగింపే
ఏది ముందు ఏది వెనుక
ఎవరు తేల్చాలి, ఎట్లా తేలుతుంది
జీవన యానంలో
ఉదయాస్తమయాలతో సూర్యచంద్రుల్లాగా
వెలుగూ చీకట్లతో రాత్రీ పగళ్ళ లాగా
మొదలు-చివరా-మొదలూ
నిరంతర వృత్త గమనం
ఏది మొదలు పెట్టినా
అది ముగింపునకే దారి
ఏది ముగిసిందనుకున్నా
అది పునఃఆరంభానికే నాంది
కళ్ళు తెరవడమూ మూయడమూ
సరళ రేఖ కాదు
అదీ వృత్తమే
జీవన చక్రంలో
మొదలేదో చివరేదో కాని
రెంటి నడుమా పరుగు నిజం, తపన నిజం పోరు నిజం
యాతన మరింత నిజం
– వారాల ఆనంద్,
=========================================
భ్రమ
(POEM PUBLISHED TODAY IN MANA TELANGANA)
=====
అనంతమయిన శూన్యం
కేంద్రీకృతమయి
గొడుగులా కమ్మేసింది
కళ్ళున్నాయి
తెరవడానికి లేదు
మూయడానికీ లేదు
చూపునకు దారీ లేదు
క్రోధం లేదు, కన్నీరూ లేదు
అదట్లా నిశ్చలంగా పోయింది
చెవులు నిశబ్దాన్ని వింటున్నాయి
శబ్దమేమో గుండె లబ్ డబ్ లతో
అతలాకుతలమవుతున్నది
కలాలను ఉరితాళ్ళకు కట్టి
చేతులు
తల పట్టుకు కూర్చున్నాయి
భూమిలో దిగబడిపోయి
కాళ్లేమో
చౌరాస్తాలో దిక్కులు చూస్తున్నాయి
ఉత్త శరీరాలే కాదు
మనసులూ గడ్డకట్టుకు పోయాయి
ఆవరించిన శూన్యానికి తోడు
నిద్రను వెంటేసుకుని
మౌనమూ వచ్చి చేరింది
భ్రమ ఇట్లాగే ఉంటుందేమో
. . .
– వారాల ఆనంద్sakshi-gulzarnamaste telanganamana telangana

‘దీప స్వగతం’ (Poem)

Posted on Updated on

దీప స్వగతం

———-

వెలుగును ఆర్పేసుకొని

నేను ‘కాలంచేసే’ సమయం

ఆసన్నమయింది

 

కాలం తీరినంక

ఎవరు మాత్రం ఏం చేస్తారు

తలవంచుకు నమస్కరించి

తరిలి పోవాల్సిందే

 

దుఃఖం లాంటి చీకటి

మిమ్మల్ని  కమ్మెసినప్పుడు

దాన్ని నా పాదాల కిందికి లాక్కున్నాను

 

ఎన్నో కాలాలపాటు

అనేకానేక కలల్ని మోసుకొచ్చి

మీముందు వెలుతురు భూముల్ని పరిచాను

 

దుక్కులు దున్నారో నాట్లే వేశారో

బీళ్లే మిగిల్చుకున్నారో

 

నేనేమిచ్చానో మేరేమి తీసుకున్నారో

అవసరానికే పంచానో

అవసరమయిందే  ఇచ్చానో

 

నామట్టుకు  నేనయితే

అవసరానికి మించే తీసుకున్నాను

భూమి పోరల్లోంచి

వెళ్ళు పీల్చేసినట్టు

 

నేను తిరిగివ్వగలిగిన దానికంటే

ఎక్కువే తీసుకున్నాను

 

తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేందుకే

కాలిపోయాను

 

ఇచ్చిందీ పుచ్చుకున్నదీ

జమా లెక్క లేవరు కట్టాలి

 

పిలుపొచ్చింది మిత్రులారా

నాకిక సెలవియ్యండి

 

మీరేమో

మరో వెలుగు తీరం వైపు

కదిలి పొండి

dweepa swagatham- manam

‘MORNING WALK’ poem

Posted on Updated on

‘ఉదయపు నడక’

—————–వారాల ఆనంద్

ఉదయాన్నే

‘నిద్ర ‘,‘బద్ధకం’

కవలల్ని వదిలించుకుని

లేచి కూర్చున్నా 

 

నాలుగు నీటి చుక్కలు

ముఖాన చిలకరించుకొని

నడకకు బయలుదేరా

 

అప్పటిదాకా మంచు తో

సహజీవనం చేస్తున్న చీకటి

మెల్లి మెల్లిగా పలుచబడుతున్నది

 

లోకం మేల్కొందో లేదో చూడ్డానికన్నట్టు

లేత కిరణాలు తూర్పు శిఖరం నుంచి తొంగి చూస్తున్నాయి

 చెట్ల మీది పిట్టలేమో కళ్ళు నులుముకుంటూ

గుంపులు గుంపులుగా

ఆకాశపు దారి పట్టాయి

 

నా అడుగులు పడుతూనే వున్నాయి

 

మనసేమో తియ్యటి గాలిలో తెలుతున్నట్టు

చల్లటి నీటిలో ఈదుతున్నట్టు

 

అవును మరి ప్రతిరోజూ

ఉదయపు మెలకువ

ఓ  ‘కొత్తజన్మ’

 

నడకేమో చైతన్యాన్నిచ్చే

‘సహచరి ‘