POETRY

‘NADAKA’ POEM

Posted on

‘నడక’

—– వారాల ఆనంద్

నేనట్లా అలసటను వెంటేసుకొని

అడుగు తీసి అడుగేస్తూ

నడుస్తూనే వున్నా  

కాలం నన్ను ముందుకు తోసి

వెనకకు వెళ్తూనే వుంది

నడక దేముంది

శరీర కదలిక

గులక రాళ్లూ ఇసుక తిన్నెలూ

చిక్కటి అడవీ కటిక చీకటీ

అనుభవాలు పాద ముద్రల్లో

భద్రమవుతున్నాయి

యధాలాపంగానో

కావాలనో నన్ను అడగకు

ప్రయాణం ఎక్కడిదాకా అని

ఏమని చెప్పను ‘గమ్యం’

నాకు తెలిస్తే కదా

నడకేమో

కనిపించే వెతుకులాట

మనసెమో

వినిపించని పలవరరింత

నడక సాగుతూనే వున్నది

మనసు తెరుకునేవున్నది

ఇక

తెలియన్ది తెలుసుకోవడమే

తెలిసింది పంచుకోవడమే

================== 

Advertisements

VISUAL BOOK:Varala Anand poetry-2018

Posted on

నేనూ నువ్వూ (POEM )

Posted on Updated on

నేనూ నువ్వూ

==========

నేనేమో

చిటికెడు వెలుగును కోరుకున్నాను

నువ్వేమో

పిడికెడు చల్లని వెన్నెలను మోసుకొచ్చావు

నేనేమో

దాహం తీరేందుకు దోసెడు నీళ్ళడిగాను

నువ్వేమో

వానా కాలాన్నే వెంటేసు కొచ్చావు

నేనేమో

భూమిలో నాటడానికో విత్తనాన్ని ఆశించాను

నువ్వేమో

ఏకంగా పంటనే పరిచేసావు

నేనేమో

చిన్న గెలుపు కోసం తపన పడ్డాను

నువ్వేమో

వాకిట్లో విజయ తోరణమే కట్టావు

ఇంతకూ

నేనెవరు నువ్వెవరు

నేనేమో చిన్ని ఆశను

నువ్వేమో కొండంత ఆత్మవిశ్వాసానివి

-వారాల ఆనంద్

SIRIAN POEM

Posted on Updated on

ఇరుగు పొరుగు (అనువాద కవిత్వం)
ప్రతి శుక్రవారం
———
సిరియన్ కవిత

సంభాషణ
——-

నా ప్రేమను 
చేతి ఉంగరమనో 
ముంజేతి ఆభరణమనో అనకు

ధైర్యమూ 
తలబిరుసుతనమూ వున్న 
నాప్రేమ 
ఒక ముట్టడి

అది మరణం నుండి 
బయటపడే మార్గాన్ని వెతుకుతుంది

నా ప్రేమను 
చందమామ అనికూడా అనకు

నా ప్రేమ పగిలిన 
ఓ నిప్పురవ్వ 
—— 
సిరియన్ మూలం: నిజార్ ఖబ్బాని 
తెలుగు అనువాదం: వారాల ఆనంద్

—––—————
నిజార్ ఖబ్బాని సిరియన్ కవి 21 మార్చ్ 1923 పుట్టారు, 30 ఏప్రిల్ 1998 న మరణించారు. 100 love letters, poems against law, లాంటి రచనలతో ప్రపంచ ప్రసిద్ధుడు. 30 కి పైగా కవితా సంకలనాలు వెలువడ్డాయి

Posted on Updated on

‘ఇరుగు- పొరుగు ( అనువాద కవిత్వం)
ప్రతి శుక్రవారం 
====

నేను రాసేటప్పుడు 
============
మలయాళ కవిత : కె.సచ్చిదానందన్ 
===========

నేను దుఖంతో రాస్తాను.

నదులేమైనా పొంగి పొర్లుతాయా ?

లేదు, నా చెక్కిళ్ళు

తడుస్తాయంతే.

నేను ద్వేషం తో రాస్తాను.

భూమేమైనా వణుకుతుందా, కంపిస్తుందా ?

లేదు, నా దంతాలు విరుగుతాయంతే.

నేను కోపంతో రాస్తాను.

అగ్నిపర్వతాలేమైనా బద్దలవుతాయా?

లేదు, నా కళ్ళు ఎరుపెక్కుతాయంతే.

నేను వ్యంగ్యంగా రాస్తాను.

ఆకాశాన రాలుతోన్న ఉల్కలేమైనా తళుక్కుమంటాయా ?

లేదు,నా పెదాలపై

విరుపు కన్పిస్తుందంతే

నేను ప్రేమతో రాస్తాను

నా భుజాలపై పక్షులు గూళ్లు కట్టేస్తాయి

పూలూ పళ్లతో చెట్లు వంగిపోతాయి

పొట్లాడుకుంటున్న మనుషులు పరస్పరం

ఆలింగనం చేసుకుంటారు

స్పటికమంతటి స్వచ్ఛ ప్రవాహంలా

భాష తనెంత లోతైనదో వెల్లడిస్తుంది

నా దుఃఖం, ద్వేషం, కోపం, వ్యంగ్యం —

సమస్తం అర్థాన్ని సంతరించుకుంటాయి

నేనేమో

కెవ్వుమంటాను

సిలువ పై నుండి
—————————————
ఇంగ్లిష్: కె. సచ్చిదానందన్

తెలుగు: వారాల ఆనంద్