Month: May 2018

నవలా మణి యద్దనపూడి సులోచనా రాణి

Posted on Updated on

పాపులర్ నవలా మణి యద్దనపూడి సులోచనా రాణి

ప్రముఖ నవలా రచయిత్రి అయిదు దశాబ్దాలకు పైగా తెలుగు పాఠకలోకాన్ని ఆకట్టుకొని ఒక స్థాయిలో ఉర్రూతలూగించిన యాదంపూడి సులోచనా రాణి మరణం ఆమె అభిమానుల్ని తీవ్రమయిన దుఖానికి గురుచేసింది.ఆమె నిష్క్రమణంతో తెలుగు ప్రధానస్రవంతి నవలా ప్రపంచం ఒక ప్రతిభామూర్తిని కోల్పోయింది. నిజానికి పాపులర్ నవలా సాహిత్యానికి ఇకానిక్ చిహ్నం లాంటి రచయిత్రిని తెలుగు పాపులర్ సాహిత్యం కోల్పోయిందనే చెప్పుకోవచ్చు.

సాహిత్య సృజన ఎప్పుడుకూడా రెండు ప్రధాన పాయలుగా సాగుతుంది. ఒకటి సాహితీ విలువలతో సామాజిక అంశాల్ని సంక్షోభాల్ని, వ్యక్తిగత జీవితాల్లోని సంక్లిష్టతలని, రాజకీయ ఆర్ధిక సామాజిక అంశాల్ని స్పృశిస్తూ సీరియస్ సాహిత్యంగా వెలువడుతుంది. అది సమాజంలో పొరలు పొరలుగా వున్న అనేక అంశాల్ని పట్టించుకకొని సమాజానికి, వ్యక్తులకు దిశా నిర్దేశం చేసే రీతిలో సాగుతుంది.  మరో పాయగా సాగే సాహిత్యం  సాధారణ ఉపరితల అంశాల్ని స్పృశిస్తూ చదువరుల్ని సమ్మోహన పరిచి ప్రాచుర్యం పొందుతుంది. aa రచనలు అధిక సంఖ్యలో అమ్ముడయి విజయవంతమయిన రచనలుగా పేరుతె చ్చుకుంటాయి ఆ సాహిత్యాన్ని  ప్రధాన స్రవంతి సాహిత్యం గా చెప్పుకోవచ్చు. ఈ నేపధ్యం లో చూసినప్పుడు యద్దనపూడి సులోచనారాణి రచనలన్నీ ప్రధాన స్రవంతికి చెందిన పాపులర్ నవలలుగానే చెప్పుకోవాలి. తెలుగు పాపులర్ నవలల్లో శిఖరాయమానమయిన నవలల్ని ఆమె రాసారు. సెక్రెటరీ, జీవనతరంగాలు, మీనా లాంటివి ఆ  కోవలోకి వస్తాయి.

యద్దనపూడి పాపులర్ సాహిత్యమే రాసినప్పటికీ రచయిత్రిగా ఆమె తెలుగు సాహిత్యం మీదా తెలుగు పాఠకులమీదా అమితప్రభావాన్ని చూపించింది. ఆమె ప్రధానంగా ప్రేమ, కుటుంబ సంబంధాలనే తన కథాంశాలుగా తీసుకున్నట్టు కనిపించినప్పటికీ స్త్రీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసారు. స్త్రీ పాత్రలకు తమదయిన ఒక సజీవ లక్షణాన్ని కల్పించే కృషి చేసారు. ఆమె ప్రత్యేక స్త్రీ వాదిగా కాకుండా, వైద్యవృత్తిలో ఫిజీషియన్ గా అన్నింశాల్నీ స్పృశించే యత్నం చేసారు. ఇంపాలా కారుండి ఆరడుగుల అందగాడయిన కథానాయకుడు, పొగరుగా కనిపించే  కథానాయికల కథల్ని చెబుతూనే వ్యక్తిత్వమున్న కథానాయిక పాత్రలనూ ఆమె ఆవిష్కరించారు.

యద్దనపూడి రచనల్లో ప్రధానమయిన లక్షణం ఆమె రచనా శైలి. సరళమయిన వాక్యాలూ, మంచి సంభాషణా శైలి ఆమె సొంతం. యద్దనపూడి తమ నవలల్లో వర్ణనల కంటే ప్రధానంగా సంభాషనలకే అధిక ప్రాధాన్యత నివ్వడంతో ఆమె రచనల్లో చదివించే గుణం హెచ్చుగా వుండి ఆమె నవలలు పాఠకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా తెలుగు పాఠకుల సంఖ్య అమితంగా పెరగడానికి ఆమె రచనలు ఎంతగానో దోహదపడ్డాయి. అప్పటికి తెలుగు సమాజానికి రాగోర్,శరత్, ప్రేమ చంద్ లాంటి ఇతర భాషా రచయితల రచనల పరిచయం మాత్రమే అధికంగా ఉండింది. తెలుగులో చలం, నోరి, విశ్వనాథ లాంటి వారి నవలలు మాత్రమే తెలుసు. కాని అవి కేవలం కొద్ది మంది ఉన్నత వర్గాలవారికి మాత్రమే అందుబాటులో ఉండేయి. సరిగ్గా అదే కాలంలో పారిశ్రామిక అభివృద్ది ఉద్యోగకల్పన పెరిగి పోవడంతో అధిక శాతం కుటుంబాలు ఉద్యోగరీత్యా పట్టణాలకు, నగరాలకు చేరుకోవడం ఆరంభించాయి. సమాజంలో అప్పుడప్పుడే స్త్రీల చదువు పట్ల అవగాహన పెరగడం మొదలయింది. దాంతో మధ్యతరగతి మహిళల్లో చదువుకున్న వారి  సంఖ్య పెరగుతూ వచ్చింది. స్త్రీలు తమ పెళ్ళిళ్ళ తర్వాత  భర్తలు ఉద్యోగ  ఉపాధి రంగాల్లో ఉండిపోవడం స్త్రీలు అధికంగా ఇంటికే ముఖ్యంగా వంటింటికే పరిమితమయి పోయి ఉండడంతో వారి జీవితాల్లో ఒక వ్యాక్యూం ఏర్పడింది. వారి ఆ  ఖాళీ సమయాల్ని పాపు లర్ నవలలు ఆక్రమించాయి. సరిగ్గా అప్పుడే ఆంగ్ల సాహిత్య ప్రభావం, పత్రికల ప్రచురణ పెరగడం తో కొత్త రచనలకు సీరియళ్ళకు స్పేస్ దొరకడం ఆరంభమయింది. అట్లా మధ్యతరగతి ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలల్లో చదివే ఆసక్తి పెరగడం మొదలయింది. అప్పటికి వారికి  వినోద కాలక్షేపాలకు కేవలం వున్న కొద్దిపాటి సినిమా మాత్రమే అందుబాటులో వుండేది. అది మధ్యతరగతి పూర్తి ఖాళీ సమయాన్ని ఆక్రమించ లేకపోయింది. ఆ స్పేస్ ని పాపులర్ నవలలు ఆక్రమించాయి. దాంతో కొత్త పాఠకుల సంఖ్య వేపరీతంగా పెరిగింది. అట్లా పెరగడానికి కారణమయిన రచనల్లో యద్దనపూడి రచనలు ప్రధాన పాత్రను  పోషించయనే చెప్పుకోవచ్చు. ఆమె రచనలు మధ్యతరగతి స్త్రీలల్లో చదివే ఆసక్తిని పెంచడంతో పాటు వారు తమలో తామే ముడుచుకొని వుండిపోకుండా కలల్నికనే  ఒక అవకాశాన్ని ఆమె నవలలు కల్పించాయి. దాంతో మధ్య తరగతి ప్రజాజీవితంలో పాపులర్ నవలలు ప్రధాన మయిన భాగం అయిపోయాయి. ఇక పత్రికలు సీరియల్స్ ఒరవడిని మొదలు పెట్టి వారం వారం పాఠకుల్లో ఆసక్తిని ఉత్కంఠతని పెంచిపోశించాయి. దాంతో ఆ  తరంలో పాఠకులు వారపత్రికల్లోంచి సిరియల్ పేజీలని చింపుకొని బైండింగ్ చేసుకొని రాకుల్లో బధ్రపరుచుకొనే అలవాటునూ చేసింది. అట్లా పాపులర్ నవలలు సాధారణ మధ్యతరగతి జన జీవితాల్లోకి చేరుకున్నాయి. ఈ మొత్తం క్రమంలో యద్దనపూడి సులోచనా రాణి నవలలు ప్రధాన భూమికను పోషించాయి. మొదట కథా రచయిత్రిగానే ఆరంభమయిన యద్దనపూడి ‘జ్యోతి’ పత్రిక ఆరంభించినప్పుడు బాపు రమణల ప్రోత్సాహంతో పెద్ద కథగా మొదలుపెట్టిన ‘సెక్రెటరీ’ నవల రూపొందింది. అది గొప్ప విజయం సాధించడంతో ఆమె నవలా రచననే కొనసాగించారు.

యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలం లోని కాజ గ్రామములో జన్మించారు. ఆమె తొలి కథ 1956 లో ఆంధ్రపత్రికలో అచ్చయింది. తర్వాత ‘సెక్రెటరీ’ నవల తో ఆరంభమయిన ఆమె నవలా రచన దశాబ్దాలపాటు కొన సాగింది. 196౦-70 దశకాల్లో ఆమె నవలారచయిత్రిగా ఆర్జించిన పేరు సంపాదించుకొన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. మధ్యతరగతి స్త్రీ జీవితాల్లో ఆమె ఒక ఐకానిక్ రచయిత్రిగా మిగిలిపోయారు. ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్ రాసే సంభాషణల శైలి తన కిష్టమని చెప్పుకున్న ఆమె తనకు అల్ఫ్రెడ్ హిచకాక్ సస్పెన్స్ సినిమాలన్న అభిమానమని చెప్పుకున్నారు. ఆమె జీవిత కాలమంతా ఎక్కడా స్వోత్కర్షకు, పర నిందకూ పాల్పడినట్టు కనిపించదు. తనకు వచ్చిన పేరు ప్రతిష్టల వెనుక తమ కుటుంబము, ప్రచురనకర్తలూ, చివరికి అక్షరాల్ని కంపోస్ చేసిన కార్మికుల కృషీ వుందని ఆమె ఒక ఇంటర్వ్యు లో చెప్పుకున్నారు.

ఇక యద్దనపూడి రచనా శైలిలో ఇంకో ప్రధానమయిన లక్షణం దృశ్యీకరణ. ఆమె రచనల్లో ప్రదానగా సినిమాలకు పనికొచ్చే స్క్రిప్టింగ్ స్టైల్ కనిపిస్తుంది. ఎపిసోడ్ లు ఎపిసోడ్ లుగా ఆమె రచనలు సినిమాల సీన్లకు సరిగ్గా సరిపోయేట్టుగా వుంటాయి దాంతో ఆమె నవలలు సినిమాలుగా రూపాంతరీకరణ చేసేందుకు సరిగ్గా సరిపోయాయి. ఫలితంగా ఆమె నవలల్లో ౧౭కు పైగా నవలలు సినిమాలుగా నిర్మాణ మయ్యాయి. అప్పటి సినిమాల కథానాయకులు అక్కినేని నాగేశ్వర్ రావు, శోభన్ బాబు లాంటి ఎంతో మంది కి ఆమె రచనలు గొప్ప విజయాల్ని సాదించి పెట్టాయి.  మీనా , జీవన రంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్రబంధం, జై జవాన్, ఆత్మ గౌరవం లాంటివి తెలుగు సినిమా లు గా రూపొందాయి.

ఇక ఆమె రాసిన నవలల్లో -ఆగమనం.ఆరాధన.ఆత్మీయులు.అభిజాత.అభిశాపం.అగ్నిపూలు.ఆహుతి.అమర హృదయం.అమృతధార.అనురాగ గంగ.అనురాగతోరణం,అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, ఋతువులు నవ్వాయి, కలలకౌగిలి, కీర్తికిరీటాలు, కృష్ణలోహిత,గిరిజా కళ్యాణం, చీకటిలో చిరుదీపం, జీవన సౌరభం,జాహ్నవి, దాంపత్యవనం, నిశాంత, ప్రేమ,ప్రేమదీపిక,ప్రేమపీఠం,బహుమతి,బందీ,బంగారు కలలు,మనోభిరామం,మౌనతరంగాలు,మౌన పోరాటం,మౌనభాష్యం,మోహిత, వెన్నెల్లో మల్లిక,విజేత,శ్వేత గులాబి,సెక్రటరీ,సౌగంధి,సుకుమారి తదితరాలున్నాయి. ఇంకా యద్దనపూడి రచనలు టీవీల్లో కూడా సీరియళ్లుగా వచ్చాయి.

ఇక తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు భర్త అనారోగ్యం తర్వాత ఆయన మృతి యద్దనపూడి జీవితం పైన తీవ్రమయిన ప్రభావాన్ని చూపించాయి. తన రచనా జీవితం నుండి ఎడం అయేందుకు దోహదం చేసాయి. కాని ఆమె క్రమంగా తన జీవితాన్ని కొత్త కోణం వైపునకు మరల్చుకున్నాయి. తనకు పేరు ప్రతిష్టలు గౌరవాలు సుఖాలు, గౌరవాలూ పొందిన నేను పేదవారికి ఏమయినా చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె విమెన్ in నీద అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. గొప్ప సేవ చేసారు కాని అందులో ఆమె ఓటమినే చవిచూశారు. కాని యద్దనపూడి సులోచనా రాణి దశాబ్దం క్రితం ఒక పత్రిక కిచ్చిన ఇంటర్వ్యులో ఇట్లా చెప్పుకున్నారు

‘ సేవ విషయంలో నేను తప్పు చేశాను. అది ప్రారంభించే ముందు, నా శక్తి ఎంత… నాలాంటి భావసారూప్యత గల వారు నాకు తోడుగా ఉన్నారా లేదా… అని ఆలోచన చేయలేదు- అది నా ఫెయిల్యూర్‌! ఒకటి మాత్రం నాలో బలీయంగా ఉంది. నేనెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో డబ్బు పోగొట్టుకుంటే, కుంగిపోతూ కూర్చోను. ‘‘అది నేను సంపాయించలేదు. అది నాది కాదు’’ అని మానసికంగా చేతులు దులిపేసుకుంటాను. ఉన్నదాంతో ఆనందంగా, సంతృప్తిగా బతకటం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు కాబట్టి ఆ ఇబ్బందులేవీ నన్ను ఎక్కువసేపు బాధ పెట్టలేవు. వాటికి ఎదురు తిరుగుతాను. జీవితంలో ఎక్కడైనా, ఏ విషయంలోనైనా, ఒక కోణం మూసుకుపోతే మీరు దిశ మార్చుకోండి! ఇంకో కొత్త కోణం జీవితంలో మీ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది. అన్నింటికంటే, మన జీవితం మనకి ముఖ్యమైనది. మన జీవితాన్ని మనం ప్రేమించాలి. అప్పుడు జీవితం కూడా తప్పక మనకి ప్రేమని పంచుతుంది. నిరాశ, నిస్పృహలతో కళ్లు మూసేసుకుని, మోకాళ్ల మధ్య తల దూర్చేసుకుని, కుంగిపోయి కూర్చుంటే చీకటి తప్ప ఇంకేం కన్పించదు. జీవితంలో మీ దగ్గరకి వచ్చే ఆనందాలు రావు. అవి నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లిపోతాయి.”

అంత స్పష్టమయిన అభిప్రాయాలతో ధీరవనితగా నిల దొక్కుకున్న ఆమె తన జీవిత కాలంలో telugu పాపులర్ నవలా సాహిత్యానికి అందించిన నవలలు గొప్ప ప్రజాదరణను పొందడమే కాకుండా ఎంతో మంది మహిళల్ని రచన రంగం వైపునకు ప్రోత్సహించాయి. ఆమె జీవన గమనం కూడా సేవా రంగంలో విశేషమయింది.

-వారాల ఆనంద్

ghgh