Month: January 2022

Posted on

అమృతం

+++++

సప్త సముద్రాలూ

ప్రపంచం నిండా

సుధలను పొంగించనీ

ఆకాశం నుంచి

చంద్రుడు

మకరందాన్ని కురిపించనీ

మాతృమూర్తి స్థనాన్నుండి

జీవనామృతం పారనీ

మనిషి మంచితనం నుండీ     

మానవత్వం నుండీ

అమృతం ఉద్భవించనీ

కవి రాసే

సున్నితమయిన మాటల్నుండి 

అమృతమే

బొట్లు బొట్లుగా రాలనీ 

……

కాశ్మీరీ మూలం & ఆంగ్లానువాదం : బ్రిజ్ నాథ్ బెతాబ్

స్వేచ్చానువాదం: వారాల ఆనంద్  

Posted on

నీడ

+++++

నా నీడ

నా కంటే పొడువయింది

అయినా నాకంటూ

ఓ కొలతుందా

నన్ను నేను ప్రశ్నించుకున్నాను

అసలు ‘వలస’ వచ్చిన వాడికి

ఏదయినా

ఓ కొలతంటూ ఉంటుందా

నా కనుమానమేసింది

***

కాశ్మీరీ మూలం & ఆంగ్లానువాదం : బ్రిజ్ నాథ్ బెతాబ్

స్వేచ్చానువాదం: వారాల ఆనంద్

++++++++++++++

Posted on

అద్దె ఇల్లు

++++++++

అతను ఒక గదిలో

కూర్చుని చదువుకుంటాడు

మరో గదిలో

భోజనం చేస్తాడు

ఇంకో గదిలో

పాట పాడతాడు

నాలుగో గదిలో

నిద్ర పోతాడు

అతను నా హృదయం లోని

నాలుగు గదుల్నీ

అద్దెకు తీసుకున్నాడు

అతను మరెవరో కాదు

“దుఃఖం”    

******

అస్సామీ మూలం : నీలం కుమార్

ఇంగ్లీష్ : స్వప్నార్ రేల్గారి

తెలుగు : వారాల ఆనంద్

Posted on

యాదోంకీ బారాత్-2

++++++++++++++++++

ఉస్మానియా- ప్రవేశం- వ్యక్తిత్వపరిణామం

**********

జీవనగమనంలో ప్రయాణాలు చిత్రంగా సాగుతాయి. అన్నీ అనుకున్నట్టుగా సాగవు. మలుపులూ వెరపులూ సాధారణం. ఊహించినవేవీ జరగక పోవచ్చు. అనూహ్యమయినవి అనేకం మన ముందుకు రావచ్చు. అయినా ప్రవాహం ఆగదు. ఒక్కోసారి ఈదుకుంటూ ఒడ్డుకు చేరతాం. ఇంకోసారి కొట్టుకుపోతాం. నా విషయంలో సరిగ్గా అట్లే జరిగింది. చిన్నప్పటి మెడికల్ కల ముగిసిన తర్వాత ఉస్మానియాలో చేరాలని, చదవాలన్నది కోరికే కాదు ఒక రకంగా లక్ష్యం కూడా. ప్రవేశం సరే కానీ  ఊహించని విధంగా లైబ్రరీ సైన్స్ లో చేరడం పెద్ద మలుపు. అప్పటికి పేరే తెలీని కోర్సు. అందులో ఏముంటుందో తెలీదు. ఏమి జరగబోతున్నదో తెలీదు. కేవలం మిత్రుడు మదన్ సలహా.. యునివర్సిటీలో చేరాలన్న కోరిక… ఎంట్రన్స్ లో దొరికిన సీటు అంతే. అట్లా కాంపస్ లో వచ్చి పడ్డాను. కరీంనగర్ లాంటి చిన్న కాలువ లోంచి  మహాసముద్రంలో పడ్డట్టు అయింది. కోర్సులో ప్రవేశం అయితే దొరికింది కానీ. హాస్టల్ లో గది లేదు. భోజనం వుంది కాని నీడ లేదు. పేరుకు ఆర్ట్స్ కాలేజీ. కానీ క్లాసులు ‘డి’ హాస్టల్ గదుల్లో. అంతా ఆగమ్య గోచరం.

   సరే రాజు మామ (జింబో) వాళ్ళ ‘ఈ’ హాస్టల్ లోని తన రూము 28 లో అతిథిగా ఉండిపోయాను. తనేమో యునివర్సిటీ లో చేరగానే చాలా ఆక్టివ్ అయిపోయాడు. విజయ్ లాంటి మిత్రుల ప్రోత్సాహంతో ఎన్నికలు అవీ బిజీ అయ్యాడు. నాకేమో హాస్టలు, క్లాసులు అంతా కొత్త. అట్లా మొదలయింది నా యునివర్సిటీ ప్రయాణం.

నిజానికి చదువుల్లో మొదటినుంచీ నేను ఫర్వాలేదు. కానీ టెన్త్ వరకు కంపోజిట్ మాత్స్, ఇంటర్ లో మెడికల్ కలలతో జీవశాస్త్రం, డిగ్రీ కొచ్చేసరికి పీజీ కెమిస్ట్రీ కోసం ఫిజికల్ సైన్స్..అట్లా భిన్నమయిన సబ్జెక్ట్స్ తో  ‘ఘర్ కా న ఘాట్ కా’ అయింది మన చదువు. వాటి తో పాటు సాహిత్యం పట్ల ఏర్పడ్డ ఇష్టం అనుబంధం. చదవడం రాయడం మరో మలుపు. ఇక లైబ్రరీ సైన్స్ కొచ్చేసరికి అంతా కొత్త. కన్ఫ్యూజన్. ప్రొఫెసర్ రాజు వచ్చి ఎస్. ఆర్. రంగనాథన్ అంటూ క్లాసిఫికేషన్ చెప్పేవాడు. కోలన్ క్లాసిఫికేషన్ సబ్జెక్టులను లైబ్రరీ కోసం ఎట్లా విభాజించాలో చెప్పేవాడు. పాస్చులెట్స్ నుంచి మొదలు అనేక కొత్త కొత్త పదాలు, సూత్రాలతో వివరిస్తుంటే తెలిసినట్టు అనిపిస్తూనే ఏమీ తెలీకపోయేది. వామ్మో వామ్మో.. ఇంగ్లీషులో ఎక్కడి ఎక్కడి పదాలో వచ్చేవి. గణిత శాస్త్ర ఆచార్యుడు ఎస్. ఆర్. రంగనాథన్ రూపొందించిన ఆ సూత్రాలు మా దుంప తెంచేవి. ఇక రాజు గారే డేవీ డెసిమల్ క్లాసిఫికేషన్ చెప్పేవాడు. ఇక మరో వైపు కాటలాగింగ్ దాంట్లో మళ్ళీ ఎస్. ఆర్. రంగనాథన్.. క్లాసిఫైడ్ కాటలాగ్, దాంతో పాటు ఎ.ఎ.సి.ఆర్. మరి వైపు బిబిలియోగ్రఫీ అంటూ వేణుగోపాల్ సర్.. మరోవైపు మేనేజిమెంటు ఇంకా ఎన్నో. థియరీతో పాటు ప్రాక్టికల్స్. యునివర్సిటీ చదువులా వుండేది కాదు. ప్రైమరీ స్కూలులాగా వుండేది. ఊపిరాడని క్లాసులు. ‘డి’ హాస్టల్ లో క్లాసులు జరిగినన్ని రోజులు అంతా ఎక్కడో ఎడారిలో వున్నా ఫీలింగ్. ఒకసారి ప్రతిష్టాత్మక ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి మారింతర్వాత జనం కనిపించడం మొదలు పెట్టారు. కలర్స్ కనిపించడంతో మౌనంగానే అయినా పరిస్థితి ఎంతో కొంత ఉత్సాహంగా మారింది. అమ్మయ్య యునివర్సిటీ కి వచ్చాం అని అందరమూ ఊపిరి పీల్చుకున్నాం. బయట అది మంచి కోర్సు వెంటనే ఉద్యోగం  దొరుకుతుంది అని పేరు. ఏంటో అంతా కన్ఫ్యూజన్ లోనే కోర్సు ముగిసింది. యునివర్సిటీ విద్యార్థి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ వాటిల్లో ఉత్సాహంగా పాల్గొనే చొరవ చూపలేదు. అట్లా ఆ విద్యా సంవత్సరం ముగిసింది. సంపత్ కుమార్, గోపాల్ రెడ్డి, సీతారాములు, ఉమాశంకర్, రవీంద్ర చారి, నర్సింగ్ రావు, మనోహర్ ఇట్లా కొంతమంది క్లాస్మేట్స్ తో క్లోజ్ గా వుండేవాన్ని. మిత్రులంతా నాకున్న సాహిత్య అభిలాష పట్ల అభిమానంగా చూసేవారు. మొత్తం మీద లైబ్రరీ సైన్స్ ప్రధమ ద్వితీయ సెమిస్టర్ పరీక్షలు అయ్యాయనిపించాను. పరీక్షలు రాసి కరీంనగర్ కు వచ్చేసాను. ఏంచేయాలో అని ఆలోచిస్తున్న రోజులు. మళ్ళీ కరీంనగర్ ఫ్రెండ్స్ నా కంపనీ. వెంకటేష్, కృష్ణ, సుధాకర స్వామి, ప్రసాద్, మోహన స్వామి లతో కాలం గడుస్తున్న వేళ ఒక రోజు హైదరాబాద్లో కాంపస్ లో వున్న జింబో నుంచి ఇన్లాండ్ లెటర్ వచ్చింది. తెరిచిచూస్తే ఒకే వాక్యం ఫస్ట్ క్లాస్ కి అభినందనలు. అంతే ఉత్సాహంగా అనిపించింది. అమ్మయ్య చాలా చిత్రంగా అప్పటిదాకా అకాడెమిక్ పరీక్షల్లో నాకున్న 60% గెట్టును లైబ్రరీ సైన్స్లో దాటేసాను.  అప్పుడు నాన్న ధనగర్వాడి హై స్కూలు లో పని చేస్తున్నారు, వెళ్లి చెప్పాను. ఉత్తరం చూపించాను. అంతే నా ఇంకేమీ రాయలేదా పర్సంటేజీ అదీ అని అడిగాడు. నవ్వుకున్నాం. మేక్ మెర్రి అన్నాడు.

అట్లా లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ ప్రస్తానం ముగిసింది. అప్పటికి ఉస్మానియాలో పీజీ లేదు. ఎట్లయినా కాంపస్ లో వుండాలి ఒక సారి కాంపస్ అలవాటు అయిన తర్వాత విడిచి వెళ్ళడం అంత ఈజీ కాదు. అప్పటికే నాకున్న ఎంతోమంది మిత్రులు ఒకటి తర్వాత మరోటి కోర్సులు చేస్తూ అక్కడే వున్నారు. ఇంకో కారణం ఆ కాలంలో వున్నతీవ్ర నిరుద్యోగం. బయటకు వెళ్తే ఏం చేయాలన్నది ప్రధాన ప్రశ్న. కాంపస్ లో ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్.  లైబ్రరీ సైన్స్ ఫలితాల తర్వాత కాంపస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేర్లు నమోదు చేసుకున్నాం మా బాచ్ అందరం. ఉద్యోగం అంత తొందరగా వస్తుందన్న విశ్వాసం వుండేది కాదు. ఏదయినా పీజీ కోర్సులో చేరాలి. ఇంగ్లీష్ అంతగా రాదు. తెలుగులో చేరాలి కానీ నాది ఇంటర్ నుండి హిందీ సెకండ్ లాంగ్వేజ్. మాతృ భాష తెలుగు అదే వస్తుంది హిందీలో చేరితే మరో భాష నేర్చుకోవచ్చు నన్నది అప్పటి నా ఫిలాసఫీ. హిందీ సినిమాలు,హిందీ పాటలు మరో కారణం. వెరసి అప్పటికి రెండు భాషల్లోనూ అంతగా ప్రవీణ్యం ఎమీ రాలేదు కాని ఎం.ఏ. తెలుగుకు అర్హత లేకుండా పోయింది. ఎంత సాహిత్యం చదివితే, తెలిస్తే మాత్రం ఏముంది. రూల్స్ కదా ముఖ్యం. సో నేను ఎం.ఏ.ఫిలాసఫీ లో చేరాను.

…….

ఇదిట్లా వుంటే కాంపస్ లో వున్న కాలంలో పలుసార్లు ఖైరతాబాద్ లోవున్న మా మేనత్త కాశమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాణ్ని. అక్కడ నలుగురు మేన బావలు. జగద దాస్, శ్రీనివాస్, బాబురావు, శ్యాం సుందర్. ముగ్గురు వదినలు తారక్క, విజయ, బేబి. ఇల్లంతా గోల గోల గా వుండేది. మా కరీంనగర్ మిఠాయి దుకాణం ఇల్లులాగా వుండేది. అందులో బాబురావు బావ తో కలిసి సిన్మాలకు పోయెవాణ్ని. దాదాపు నా ఏజ్  గ్రూప్ అయిన బేబి కొంత ఫ్రీగా వుండేది. ఇక శ్రీనివాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బి.నర్సింగ్ రావు, వైకుంఠం, చంద్ర తదితరులతో కలిసి చదివాడు. తనకే మా పెదనాన్న జగన్నాధం గారి బిడ్డ శోభక్కను ఇచ్చి పెళ్లి చేసారు. తర్వాతి కాలంలో మా చెల్లెలు మంజులను కూడా ఆ ఇంటికే శ్యాం బావకిచ్చి పెళ్లి చేసారు. ఖైరతాబాద్ లో ఇంకో విషయం ప్రముఖ కవి కే.శివారెడ్డి వాళ్ళ ఇల్లు పక్కనే వుండేది. అప్పుడప్పుడూ కలిసే వాణ్ని. ఒకటి రెండు సార్లు ద్వారకాకు కూడా పోయిన గుర్తు.

ఇక కాంపస్ లో వుండగా లాలపేట్ లో వున్నా రాం టాకీసులోనూ, చిలకలగూడలో వున్న శ్రీదేవి లోనూ సినిమాలు చూసిన గుర్తు. ఇక యునివర్సిటీ లోని ‘టాగోర్’ ఆడిటోరియం లో కూడా ఒకటో రెండో ఆర్ట్ సినిమాలు చూసాను.

…………….

ఎం.ఏ. ఫిలసఫి లో చేరాక మర్రి విజయ రావు నా క్లాస్మేట్ అయ్యాడు. అప్పటికే తాను తెలుగు పూర్తి చేసాడు. ఇద్దరమూ ‘డి’ హాస్టల్ లో చేరాం. అప్పటికే విజయ రావు అనేక మంది కవులు, రచయితలతో అనుబంధం కలిగి వున్నవాడు. ఇక మా ఇద్దరితో పాటు జింబో, నందిగం కృష్ణా రావులు కూడా మా రూములో చేరారు. మంచి సాహిత్య వాతావరణం  వుండేది.

అప్పుడే ’ ఆంధ్ర జ్యోతి వార పత్రికలో నా కవిత వచ్చింది..

“ ఈ సమాజం

అచ్చుతప్పులున్న

ఓ గొప్ప పుస్తకం

ఇప్పుడు కావాల్సింది

తప్పొప్పుల పట్టిక తయారుచేయడం కాదు

ఆ పుస్తకం

పునర్ముద్రణ జరగాలి”  ఆ కవిత పలువురి దృష్టిని ఆకర్షించింది.

అప్పుడు జింబో రాసిన కవిత

‘ నే చచ్చి పోతాననే

కదూ నీ బాధ

పిచ్చివాడా

ఈ లోకంలో

మనం బతికింది

తొమ్మిది మాసాలే’

అప్పుడు చాలా హిట్టయిన కవిత ఇది.

కవితలు రాస్తూ పత్రికల్లో వస్తూవుండడం పెద్ద ఊపుగా వుండేది.     

   ‘ఏ’ హాస్టల్ కు వెళ్లి వచ్చేవాళ్ళం. అక్కడ నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారయణరెడ్డి, గుడిహాళం రఘునాధం, అంబటి సురేందర్ రాజు మొదలయిన ఎంతో మంది కవులు వుండేవాళ్ళు క్రమంగా వాళ్ళతో స్నేహం కుదిరింది. అంతా ఒకే సాహితీ గూటికి చెందిన వాళ్ళం కదా. నందిని సిధారెడ్డి అప్పటికే కవిత్వం రాయడంతో పాటు మంచి ఆర్గనైజర్ గా ఉండేవాడు. సుంకిరెడ్డి కి సాహిత్యంతో పాటు ప్రేమ కథ ఎదో వుండేది. సురేందర్ రాజు బాగా చదువుకున్న వాడని అనేవాళ్ళు. నీషే గురించి ఇంకా పలువురు తత్వవేత్తల గురించి బాగా చదివాడని విజయ రావు చెప్పేవాడు. కేవలం చదువుకుంటే ఏం లాభం భై ఏదయినా రాయాలి చెప్పాలి కదా అని నెను అనేవాడిని. అందరమూ క్లోజ్ గానే వుండేవాళ్ళం. ఎందుకోగాని రఘునాధం నాకు కొంచెం ఎక్కువ నచ్చేవాడు. ఈ క్రమంలోనే ఉస్మానియా లో ఒక సాహిత్య సంస్థ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అంతా ఆర్ట్స్ కాలేజీ ముందు పలుసార్లు కూర్చున్నాం. చర్చించాం. పేరేమి పెట్టాలనే చర్చ వచ్చింది. ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ అన్న పేరు చర్చకు వచ్చింది. అయితే అది ఝరి పోయెట్రీ సర్కిల్ లాగా వుంది అన్న అభ్యంతరం చెప్పారు. నేనయితే ‘ఉస్మానియా రైటర్స్ సర్కిల్’ నే సమర్థించాను. అదే ఖాయమయింది. కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసారు. నిర్వహించారు.

………

ఇంతలో నాకు జూనియర్ కాలేజీలలో లైబ్రరియన్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యు కు కాల్ లెటర్ వచ్చింది. కొంచెం ఆశ్చర్యం వేసిందని అంత తొందరలో కాల్ వస్తుందని అనుకోలేదు. కానీ ఏంచేద్దాం వెళ్ళాల్సిందే. అందరేమో ఉద్యోగం వచ్చేసినట్టే నని అని అభినందించారు. ఇంటర్వ్యు కోసం పెద్దగా ఏమీ తయారు కాలేదు. ఖైరతాబాద్ లోని హయ్యర్ ఎడుకేషన్ ఆఫీసుకి వెళ్లాను. బోర్డులో ఒక జాయింట్ డైరెక్టర్ మరెవరో వున్నారు. ఆయన కీచుగొంతు సుబ్బారాజు గారని పెద్ద పేరున్న అధికారి. ఏవో ప్రశ్నలడిగారు. నేన్వో చెప్పాను. ఒకే అన్నారు. నిరాసక్తంగానే బయటకు వచ్చాను. అక్కడెవరో చెప్పారు. ఈ ఉద్యోగాలు ఎక్కువున్నాయి. అభ్యర్థులు తక్కువ అని. తిరిగి కాంపస్ కు వచ్చేసాను. ఒక వేళ ఉద్యోగం వస్తే నా ఎం.ఏ. ఎట్లా అన్న ఆలోచన వచ్చింది. అప్పుడే ఎక్స్ టర్నల్ పరీక్షల కోసం యునివర్సిటీ ప్రకటన వచ్చింది. ఇంకేముంది.. జింబో నేను ఇంకా కొంత మంది మిత్రులం కట్టేశాం. నేను కరీంనగర్ కు వచ్చేసాను. ఒక రోజు నేను వెంకటేష్ తదితర మిత్రులం ఫయిర్ స్టేషన్ దగ్గరలో ఒక షాపులో వుండగా పోస్ట్ మాన్ నన్ను చూసి సార్ మీకు ఒక రిజిస్టర్ లెటర్ అన్నాడు. ఇంకేముంది   అనుకునట్టుగానే అపాయింట్ మెంట్ లెటర్. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో లైబ్రేరియన్ గా నియమించారు. అంతా అభినందించారు కానీ నాకే లోపల ఎదో ఒక మీమాంస ఈ నౌకరీలో చేరడమా…. ఇంకా చదువుకోవడమా.. ‘అందరూ ఉద్యోగాలు రాక ఏడిస్తే నువ్వేమిట్రా’ అన్నారు మిత్రులు… వెంటనే జైన్ కాలేదు. మూడు-నాలుగు రోజుల తర్వాత 18 జనవరి 1980 రోజున మంథని కాలేజీలో జాయిన్ అయ్యాను…

వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.

-వారాల ఆనంద్                                      

Posted on Updated on

24 అందుకున్నాను 

+++++++++++++

‘తహ్జీబ్ కా బాద్ షాహ్ దిలీప్ కుమార్’ ( సినిమాలు సమగ్ర పరిచయం), రచన: పి.జ్యోతి

*****************

కస్తూరి మురళీ కృష్ణ గారి సంపాదకత్వం లో వస్తున్న ‘సంచిక’ ఆలైన్ పత్రికలో పి.జ్యోతి గారు రాసిన దిలీప్ కుమార్ వ్యాసాలు అప్పుడప్పుడూ చదువుతూ వచ్చాను. ఇంతలో ఒకరోజు మిత్రుడు నిజాం వెంకటేశం గారు కాల్ చేసి నీ అడ్రస్ కావాలి పి.జ్యోతి రాసిన  ‘తహ్జీబ్  కా బాద్ షాహ్ దిలీప్ కుమార్’ ( సినిమాలు సమగ్ర పరిచయం) పుస్తకం పంపపించే ఏర్పాటు చేస్తాను అన్నారు. అట్లే ఇంకా బి.నరసింగ రావు తదితరుల చిరునామాలూ అడిగారు. వారం లోపే జ్యోతి గారి దగ్గరి నుండి పుస్తకాన్ని అందుకున్నాను. 380 పేజీలతో, బొమ్మలు మంచి బైండింగ్తో సావనీర్ లావుంది పుస్తకం. వంశీ ఆర్ట్ థియేటర్ వాళ్ళు ప్రచురించారు. భారీగా దిలీప్ కుమార్ లానే వుంది. చాలా మంచి ప్రయత్నం. మొదట జ్యోతి గారికి అభినందనలు.

+++++++++

దిలీప్ కుమార్ అనగానే నాకయితే తలత్ మహమూద్, మధుబాల లు కూడా గుర్తొస్తారు. చిత్రంగా చిన్నప్పుడే నేను దిలీప్ కుమార్ ను వింటూ ఎదిగాను. అప్పుడు కరీంనగర్ లో మూడే సినిమా హాళ్ళు ఉండేవి. హిందీ సినిమాలు తక్కువ. అందులో దిలీప్ సినిమాలు ఎప్పుడో వచ్చేవి. నాకేమో నెలకి ఒకే సినిమాకు అనుమతి వుండేది అందుకే దిలీప్ ని వింటూ ఎదిగాను. తర్వాతి కాలంలో చాలా చూసాను. నాన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా చూసేవాడు. ఆ రోజుల్లో మా నాన్నబాగా పాటలు పాడేవారు. తనకు దిలీప్ అన్నా తలత్ మహమూద్ అన్నా ప్రాణం. ఇంట్లో గొంతెత్తి నాన్న పాడుతూ వుంటే అర్థం తెలిసేది కాదు కానీ ఆ పాటల్లో వున్న మాధుర్యం, వేదన ఎంతో ఆకర్శించేది. క్రమంగా నాన్నను అడిగి కొంచెం కొంచం అర్థాలు తెలుసుకోవడం ఆరంభించాను. నాకు బాగా గుర్తు ఒక సారి నాన్నను అడిగాను నేనీ పాటలు పాడాలంటే అన్ని అర్థాలు తెలవాల్నా అని దానికి ఆయన నవ్వి ‘ భాష తెలీకుండా భావం ఎట్లా పలుకుతుందిరా పిచ్చోడా’… అన్నాడు. అందుకే నేను సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ తీసుకున్నాను. అంతగా ప్రభావం చూపావా పాటలు.

“ శ్యామే ఘం కీ కసం…

దిల్ పరేషాన్ హై

రాత్ వీరాన్ హై “… అంటూ సాగే ‘ఫుట్ పాత్’ పాట ఇప్పటికీ మనసును బరువెక్కిస్తుంది.

అంతే కాదు “దాగ్” లో

‘హం దర్ద్ కా మారోంకా…’  కానీ

‘ఏ మేరె దిల్ కహీ ఔర్ చల్ …” వింటూ ఉంటే తర్వాతి కాలంలో దిలీప్ ని చూస్తూ వుంటే ఎంత గొప్పగావుండేది.

‘బాబుల్’ లో  

“మిల్ తే హీ ఆంఖే…

.. అఫ్సానా మేరా బన్ గయా

..అఫ్సానా కిసీకా…” వింటూనో చూస్తూనో వుంటే ఎంత ప్రేమాత్మకంగా వుంటుందో…రెండు హృదయాల ప్రేమ ఎంత హృద్యంగా వుంటుందో ఈ పాటలో దిలీప్ శంషాద్ బేగంలు  ఆవిష్కరించారు.

అంతెందుకు “ సంగే దిల్” లోని

“యె హవా యె రాత్ యె రాత్ యె చాందినీ

తేరి ఎక్ అదా పే నిసార్ హై.. “  ఇట్లా ఎన్ని పాటలు ఎన్ని సినిమాలు. ఒక్క తలత్ మహామూద్ మాత్రమే కాదు ముకేష్ తో సహా ఎంతో మంది గాయకుల పాటలకు దిలీప్ అందించిన హావ భావాలు ప్రత్యేక మయినవి, విలక్షణ మయినవి.

******

దిలిప్ కుమార్ నటన గురించి మాట్లాడుకుంటే ఆ కాలంలో దిలీప్ కు సమాంతరంగా గ్రెగరీ పేక్ దారిలో వుండే దేవ్ ఆనంద్, చార్లీ చాప్లిన్ ను కొంత అనుసరించిన రాజ్ కపూర్ లు విజయ పరంపరలను కొనసాగిస్తూ వుండేవారు. కానీ దిలీప్ ఎవరినీ అనుకరించకుండా చివరికి యూసుఫ్ ఖాన్ అంటే తనని తాను కూడా అనుకరించకుండా ఒక ప్రత్యేక ఒరవడిని ఏర్పరిచే ప్రయత్నం చేసి విజయం సాధించాడు. ముఖ్యంగా విషాద పాత్ర ల్లో దిలీప్ ది  ఒక ముద్ర. ఎంతగా అంటే ‘బాబీ’ సినిమా రూపొందిస్తున్నప్పుడు కొడుకు రిషి కపూర్ విషాదం ప్రకటించ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు రాజ్ కపూర్ “ పోరా పోయి యూసుఫ్(దిలీప్) సినిమాలు చూసి రాపో.. విషాదం ఎట్లా ప్రకటించాలో తెలుస్తుంది” అన్నాడంట. అదీ దిలీప్ నటన. అట్లని కేవలం విషాదానికే పరిమితం కాకుండా హాస్య పాత్రలతో సహా వివిధ పాత్రలూ చేసాడు.

*******

అంత విలక్షణమయిన విజయవంతమయిన నటుడి సినిమాలసమగ్ర పరిచయం చేసే పనికి పూనుకోనడమే పెద్ద విషయం. దాదాపు దిలిప్ అన్ని సినిమాల కథలు వివరంగా చెబుతూనే కొంత విశ్లేషణ చేసారు జ్యోతి. తను ఎంచుకున్న పద్దతిలో భాగంగా ఫిలిం ఫేర్ అవార్డులుండుకున్న సినిమాలు, నామినేషన్ పొందినవి, సుఖాంతమయిన ప్రేమ కథలు, అవార్డులకు నోచుకోని ట్రాజేడీలు ఇట్లా విభజించి చెబుతూ చివరగా ‘మొఘల్ ఎ ఆజం’ గురించి వివరించారు.   

పుస్తకంలో ఆయా సినిమాల స్టిల్స్ వేయడం సమంజసం గా వుంది. పుస్తకం లో మొదట భారత దేశపు మొదటి మెథడ్ ఆక్టర్ దిలీప్ కుమార్ అని ఆయన నటన పట్ల కొంత విశ్లేషణ చేసారు. నటులు ‘ART OF EXPRESSION’ ఎంత కష్టపడాలో సూచన ప్రాయంగా ఉటంకించారు. నా అభిప్రాయంలో నటులు కేవలం శారీరక హావ బావాలే కాకుండా మానసికంగా ఆయా పాత్రలని ఆవాహన చేసుకుని నటించే విధానాన్ని దిలీప్ గొప్పగా అనుసరించారు.

+++++++++

‘తఃజీబ్ కా బాద్ షాహ్ దిలీప్ కుమార్’ ( సినిమాలు సమగ్ర పరిచయం) పుస్తకంలో రచయిత్రి పి.జ్యోతి దిలీప్ పైన ఎంతో ప్రేమాభిమానాలతో రాసారు. ఆయన సినిమాల కథలు చెబుతూనే మామూలు సినిమా జర్నలిస్టులకు భిన్నంగా రాసారు. అన్ని సినిమాలూ గొప్పవి అనకుండా విశ్లేషణ చేసారు. అందుకు తనని అభినందించాలి. కానీ అవార్డులూ నామినేషన్ లూ అన్న వరుసలో కాకుండా కాలక్రమంలో దిలీప్ నటనను జీవితాన్ని పరిచయం చేసుంటే బాగుండేది అని నాకనిపించింది. మొత్తం మీద జ్యోతి గారి దిలీప్ పుస్తకం ఆయనకు తెలుగులో ఇచ్చిన  గొప్ప నివాళి గా భావించాలి.

ఇక ‘స్టార్లు ఎక్కువయ్యారు, నటులు లేకుండా పోయారు’ అన్నారు జ్యితి కానీ నసీరుద్దిన్ షా , ఓం పూరి, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దికి లాంటి గొప్ప నటులూ మనకున్నారు.

జ్యోతి గారికి ధన్యవాదాలు అభినందనలు.

-వారాల ఆనంద్   

https://telugu.asianetnews.com/literature/varala-anand-on-tefzeeb-ka-badshah-dillep-kumar-r5uidf