SAHITYA AKADEMI AWARD

POEM PUBLISHED TODAY సార్థకత

Posted on Updated on

‘POEM PUBLISHED TODAY’
in Asianet Telugu
Thanks to the Editor
https://telugu.asianetnews.com/literature/varala-anand-poem-bsb-s6xg2d

‘సార్థకత’

బతుకు 
ఆరంభానికీ ముగింపునకూ నడుమ 
అలసటెరుగని సుదీర్ఘ ప్రయాణం 

లోకం రహదారి మీద 
నడకో, పరుగో 
విసుగో విరామమో 
జనమో నిర్జనమో 
ఎడారో మహా సముద్రమో 
మనుగడ అనివార్యం 
పయనం నిరంతరం 
… 
రాయడానికి కూర్చున్న 
కవితలో 
అక్షరాలూ అర్థాలూ 
కామాలూ విరామాలూ 

మాటకూ మాటకూ మధ్య 
పారదర్శక భావాలు 
వ్యక్థావ్యక్తాలూ అదృశ్యరూపాలూ 
ఏదో ఒక భాషలో రాత అనివార్యం 
ఏదో ఒక రూపంలో కవిత అవశ్యం 
… 
ఏది ఎట్లున్నా 
రాయాల్సిన కవిత 
ఎక్కడో ఒక చోట 
ముగియనే ముగుస్తుంది 

కాలం గడపాల్సిన మనిషి ఊపిరి 
ఏదో ఓ క్షణం నిలుస్తుంది 

కవితయినా మనిషయినా 
అర్థవంతం కావడంలోనే 
సార్థకత

అరుణాచల్ ప్రదేశ్ సాహిత్యం – మమంగ్ దాయి

Posted on Updated on

+++++++++ వారాల ఆనంద్
ఇవ్వాళ మన దేశం మొత్తం మీద గొప్ప కవిత్వమేకాదు మొత్తంగా గొప్ప సాహిత్యం ఈశాన్య రాష్ట్రాలనుంచే వస్తున్నది. అక్కడి ప్రజల సంఘర్షణ ఆ సాహిత్యంలో సజీవంగా వికసిస్తున్నది. 7 సిస్టర్స్ గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాల్లో హిమాలయాల ఒడిలో నెలకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ భారత దేశపు ఊయయించే సూర్యుడు. అక్కడి డాంగ్ గ్రామమే దేశం మొత్తం మీద తొలి సూర్యోదయాన్ని చూస్తుంది. ఆ రాష్ట్రానికే దేశమ్మోత్తం మీద అతి ధీర్ఘమయిన అంతర్జాతీయ సరిహద్దు వుంది. అక్కడి ప్రజలు ‘ఆది’, ‘ఆక’, ‘అప్తాని’ లాంటి 90 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు ఆ రాష్ట్రంలో 26 ప్రధాన తెగలు మరియు వందల ఉప తెగలు ఉన్నాయి. కానీ ఈ బహుళత్వం మధ్య, అన్ని సంఘాలలో ఒక సాధారణ లక్షణం ఉంది, వారు గొప్ప కథకులు.

వారి స్వంత అధీకృత స్క్రిప్ట్ లేకుండా, వారు వారి జ్ఞాపకాలలో వారి కాలపు కథలను భద్రపరిచారు. మౌఖికంగా వారు ఆయా భాషల్ని వ్యాప్తి చేశారు. తరువాతి తరాలకు అందించారు. అక్కడి ప్రజలు కీర్తనలల్ని బాగా ప్రదర్శిస్తారు. తమ కుటుంబ సామాజిక మావేశాలలోకథల్ని కథలు చెప్పడాన్ని బాగా బాగా ఇష్టపడతారు.
అరుణాచల ప్రదేశ్ సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు కేవలం మౌఖికమే కాకుండా లిఖిత సాహిత్యాన్ని కూడా చర్చించాలి.
మౌఖిక సాహిత్యం ప్రధానంగా జానపద సాహిత్యం యొక్క అభివ్యక్తి. అందులో ప్రధానంగా పురాణాల కథలు, వాటిలోని సూక్తులు, కథనాలు. కథలు ప్రధాన అంశాలుగా వుంటాయి. వాటితో పాటు జంతువులు, విశ్వం మరియు మానవ నమ్మకాలు, ఆచారాల కథలు కూడా మనకు కనిపిస్తాయి. లిఖిత సాహిత్యంలో కవిత్వం, నాటకం, చిన్న కథలు ప్రధాన పాత్ర పోషిస్తాయి మౌఖిక సాహిత్యంతో సృజనాత్మకత ప్రధానమయింది. కాగా మౌఖిక లిఖిత సాహిత్యాల నడుమ విడదీయరాని మౌళిక సంబంధం ఉంది.
ఇరవయ్యవ శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్‌కు లిఖిత సాహిత్యం మొదలయిందని చెప్పాలి. మారుతున్న సామాజిక ఆర్థ్క స్థితులు అంతేకాకుండా ఆధునిక విద్య అందుబాటులోకి రావడం వల్ల అక్కడి వాళ్ళల్లో సరికొత్త భావనాత్మకత తో పాటు నవ్య సృజనాత్మకత ఆరంభమైంది. ముఖ్యంగా ఆంగ్ల, విద్య విదేశీ సంస్కృతుల ప్రభావం వల్ల కళాత్మక సృజన పెరిగిందనే చెప్పాలి. 1947 తర్వాత తగాంగ్ టాకీ, లుమ్మర్ దాయి, YD థోంగ్చి, రించిన్ నోర్బు మొయిబా, సమురు లుంచాంగ్ మరియు కెన్సమ్ కెంగ్లాం వంటి రచయితల రచనలు వెలువడ్డాయి. అరుణాచలానికి చెందిన మొదటి తరం సాహిత్య ప్రముఖులు వీరే. లుమ్మర్ దాయ్ యొక్క తొలి నవల ఫారోర్ క్సీలే క్సీలే (1961) బహుశా ఒక అరుణాచలి రాసిన అరుణాచల్ ప్రదేశ్ యొక్క మొదటి నవలగా పరిగణించబడుతుంది. తమదయిన
స్క్రిప్ట్ లేకపోవడంతో, ఆ కాలంలోని రచయితలు తమ భావాలను వ్యక్తీకరించడంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో, పాఠశాలల్లో అస్సామీ బోధనా మాధ్యమం కావడం తో చాలామంది అస్సామీని తమ రచనా భాషగా ఎంచుకున్నారు. స్వీయ భాషాపరమైన అడ్డంకిని దాటి, ఈ మొదటి తరం రచయితలు, వారి బహుముఖ మరియు విశిష్టమైన కథలతో, అరుణాచల్ ప్రదేశ్‌లో సాహిత్యంలో ముఖ్యమైన భాగం పంచుకున్నారు. సరికొత్త పాదులు వేశారు.
అప్పటి వారి రచనలు సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలు. వారు తరచుగా తమ రచనలకు జానపద సాహిత్యాన్ని మూలంగా చూసేవారు. వారు వక్తృత్వం, పురాణం, జానపద నమ్మకం మరియు ఆచారాల నుండి ప్రత్యేకమైన ప్రేరణను పొందారు. ఇది వారి రచనలలో వ్యక్తీకరణలో స్పష్టంగా కనిపిస్తుంది. థోంగ్చి, సోనమ్‌లో, బ్రోక్పాతమ రచనల్లో సమాజంలోని సంప్రదాయాల్ని ఆచారాలను అన్వేషిస్తారు. మమంగ్ డై తన నవలలు పహరోర్ క్సీలే జిలే, మోన్ అరు మోన్, పృథివీర్ హన్హిలో ఆది జానపద జీవితానికి సంబంధించిన నైతికతను చాటుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లో పాఠశాలల్లో క్రమంగా ఇంగ్లీషు, హిందీ భాషలను ప్రవేశపెట్టారు. అస్సామీ స్థానంలో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పెరిగారు. ప్రధాన మాధ్యమంగా ఇంగ్లీషు, హిందీ భాషా భాషలు స్థానం పొందాయి. తత్ఫలితంగా అస్సామీలో వ్రాసే వారు పాఠకులతో డిస్‌కనెక్ట్‌గా భావించడం ప్రారంభించారు. అస్సామీ రాయడం తగ్గిపోయింది
తర్వాత చదువు పెరగడం తో ప్రజలు వారి చరిత్రను సంస్కృతిని గురించి మరింత ఉత్సుకతతో చ్ఫూపించడం ఆరంభమయింది. 1978లో అరుణాచల్ ప్రదేశ్ లో మత స్వేచ్ఛ చట్టం ఆమోదించబడింది. దేశీయ సంస్కృతి విశ్వాసాల పరిరక్షణ, ప్రచారం పట్ల ఆసక్తి పెరిగింది. కృషీ ఆరంభమైంది. ఫలితంగా రచనల్లో అక్కడి సమస్యల్ని రాయడం మొదలయింది. అక్కడి రచయితలలో తుంపక్ ఈటే, ఒసాంగ్ ఎరింగ్, బని డాగ్గెన్, ఎన్. ఎన్. ఒసిక్, ఎల్ ఖిమ్‌హర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అరుణాచల్‌లో ఇంగ్లీషు మరియు హిందీ భాషలను ప్రవేశపెట్టినప్పటి నుండి కొత్త తరం రచయితలు ఆవిర్భవించారు. జుమ్సీ సిరామ్ రాసిన ఏ-అలుక్ (1993) అన్న నవల ఈ రాష్ట్రానికి చెందిన ఒక స్వదేశీ రచయిత హిందీలో రాసిన మొదటి నవలగా వినుతికెక్కింది. యుమ్లామ్ తానా యొక్క ది మ్యాన్ అండ్ ది టైగర్ (1999) మరియు మమంగ్ దాయి యొక్క ‘ది లెజెండ్ ఆఫ్ పెన్సమ్ (2006)’ ఇంగ్లీష్ హిందీ సాహిత్య ప్రపంచంలో అరుణాచల రచయితల స్థానాన్నినిలబెట్టాయి. వీరి రచనలు రాష్ట్ర సరిహద్దులు దాటి అరుణాచలి రచనలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఎంతగానో సహాయపడ్డాయి.
మమంగ్ దై ‘ది లెజెండ్స్ ఆఫ్ పెన్సామ్ అండ్ బ్లాక్ హిల్స్‌’ లో అరుణాచల్ ప్రదేశ్ యొక్క పూర్వ-చారిత్రక గతాన్ని తిరిగి సృష్టించింది.
ఇప్పుడు అక్కడి సమకాలీన సమాజం కూడా ప్రపంచీకరణ ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది, దాంతో సంస్కృతి, సంప్రదాయాలు వాటిలోని అన్ని అంశాలు నాటకీయ మార్పులకు గురయ్యాయి. ఒక రకమైన కొత్త సాంస్కృతిక వాతావరణం ఏర్పడింది. కవులూ రచయితలూ సామాజిక అసమానతల్ని ప్రశ్నించడం ప్రారంభించారు, పురాతన ఆచారాల్ని, సంప్రదాయాలను విడిచిపెట్టడం ప్రారంభించారు. ప్రపంచీకరణ ప్రభావం అరుణాచల్ ప్రదేశ్ యొక్క సాహిత్య సృజనల్లో మార్పును తెచ్చింది. అరుణాచల్ క్రమంగా మౌఖిక సాహిత్యం మరచిపోయే స్థితికి చేరుకోవడం ప్రారంభించింది. ఉదృతమవుతున్న ప్రపంచీకరణ ప్రభావానికీ అక్కడి సంప్రదాయానికి నడుమ వున్న ఘర్షణ సమకాలీన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గుర్తింపు సంక్షోభం identity crisis, నోస్టాల్జియా nostalgia సామాజిక సమస్యల యొక్క ఘర్షణ వారి రచనల ఇతివృత్తాలలో ప్రతిబింబిస్తుంది.
“ఈ వేసవి”లో మమంగ్ దై
‘విలపిస్తున్నాను
మా వేటలో మేము నాశనం చేసిన అందం
జీవితం కోసం మా వేటలో.
… సీతాకోక చిలుకలను క్షమించమని వేడుకుంటున్నాను’, అంటుంది

యుమ్లాం తమ గుర్తింపు సంక్షోభం సమస్యను ఈ విధంగా ప్రస్తావిస్తుంది:
‘ఈ భౌగోళిక పటం
మా భూములు,
అటవీ హక్కుల గురించి ఏమీ మాట్లాడలేదు..’ అంటారు
ఇటీవలి సంవత్సరాలలో అనేకమంది యువకులు, విద్యావంతులైన రచయితలు సాహిత్యరంగంలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. వారు తమదయిన కొత్త శైలి,, కళా ప్రక్రియలతో ప్రయోగాలు చేస్తున్నారు. అది గత తరం రచయితలకు భిన్నమయిన ధోరణి. వారి రిఫ్రెష్ కథలు వారి ప్రత్యేకమైన స్వభావాలతో, వారు ప్రపంచ సాహిత్య రంగంలో తమను తాము నిలబెట్టుకుంటున్నారు.
తాయ్ టాగుంగ్ తన డ్రామా, లాపియాలో ఉద్దేశపూర్వకంగానే అరుణాచలి హిందీని ఉపయోగించాడు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో మాట్లాడే హిందీపై భాషావేత్తల దృష్టిని తీసుకువచ్చింది. గుమ్లాట్ మైయో యొక్క త్రయం వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కాలేజీ క్యాంపస్ నవల. డై యొక్క స్టుపిడ్ మన్మథుడిని చిక్ లైట్ అని వర్ణించవచ్చు.
ఇటీవలి కాలంలో ఇక్కడి సాహిత్యంలో వున్న కొన్ని ముఖ్యమైన పేర్లు Takop Zirdo, Tony Koyu మరియు Yabin Zirdo.
అరుణాచల్ ప్రదేశ్‌లో హిందీ సాహిత్య పురోగతికి గణనీయమైన కృషి చేసిన వారిలో తారో సింధిక్, జమునా బిని మరియు జోరామ్ యాలం వంటి అనేకమంది వున్నారు.
మునుపటి తరం నుండి వచ్చిన వారైనా, లేదా ఇటీవలి వారైనా, అరుణాచల్‌లో వెలువడే సృజనాత్మక రచనల్లో పౌరాణిక జానపద కథల యొక్క ప్రభావం, దాని కొనసాగింపు కనిపిస్తుంది. మమంగ్ దాయి యొక్క సంకలనం ది బామ్ ఆఫ్ టైమ్, రివర్ పోయమ్స్, తానాస్ మ్యాన్ అండ్ ది టైగర్ అండ్ విండ్ కూడా సింగ్స్ మరియు LW బాపు యొక్క ఖండూమాస్ కర్స్ సాంప్రదాయ సాహిత్యం మరియు సృజనాత్మకత యొక్క సమ్మేళనంగా చూడొచ్చు.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆధునిక సృజనాత్మక సాహిత్యం 20వ శతాబ్దం మధ్యలోనే మొదలయిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొంతమంది ప్రతిభావంతులయిన రచయితలతో ఇది వేయి రేకులుగా విచ్చుకుంటోంది.
… మమంగ్ దాయి…
గత 13 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టాటా లిటరేచర్ లైవ్ ఈనెల 25 నుంచి తన 14 వ సంచికను నిర్వహిస్తున్నది. అందులో ఈశాన్య రాస్త్రమయిన అరుంచల్ ప్రదేశ్ కు చెందిన గొప్ప కవి రచయిత్రి మామంగ్ దాయిని ప్రధానంగా ఈ యేటి ఆస్థాన కవిగా ఎంపిక చేసి గౌరవిస్తున్నారు. మామంగ్ దాయి ఎంపిక సమంజసమయిందే కాదు, అభినందనీయమయింది.
మమంగ్ దై కవి మరియు నవలా రచయిత. ఆమె ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో నివసిస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఒక కవితా సంకలనం, ‘నది కవితలు’వెలువరించారు. ఆమె తర్వాతి రచన, మిడ్‌సమ్మర్-సర్వైవల్ లిరిక్స్, ఆమె ఆది భాషలోనూ ఆంగ్లంలోనూ రాస్తుంది.తాను మొదట ఐ.ఏ.ఎస్.కు ఎంపికయి జర్నలిస్టు గానూ, రచయిత్రిగానూ వుండడానికీష్టపడి ఐ ఏ ఎస్ ను వదిలేసింది.
మామంగ్ దాయి ది టెలిగ్రాఫ్, హిందుస్థాన్ టైమ్స్ మరియు ది సెంటినెల్‌తో సహా వివిధ వార్తాపత్రికలకు కరస్పాండెంట్‌గా ఉన్నారు. టెలివిజన్ మరియు రేడియోలకు కూడా విరివిగా రాశారు. రెండు నవలలతో పాటు, యువ పాఠకుల కోసం ఆమె వచన కవితలు కథలు రాసింది. ఆమె నాన్-ఫిక్షన్ రచన, అరుణాచల్ ప్రదేశ్: ది హిడెన్ ల్యాండ్, 2003లో స్టేట్ వెరియర్ ఎల్విన్ అవార్డును అందుకుంది. ఆమె ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లిటరరీ సొసైటీకి జనరల్ సెక్రటరీగా, నార్త్ ఈస్ట్ రైటర్స్ ఫోరమ్ సభ్యురాలు మామంగ్ డయి యొక్క కవితా ప్రపంచం నది, అడవి మరియు పర్వతాలలో ఒకటి, ఆమె తన మూలాల్ని తాని నివసించిన స్వస్థలాన్ని తన రచనల్లో ప్రతిబింబింపజేసి వాటిని సృజనాత్మకంగా సజీవం చేశారు. ఇక్కడ ప్రకృతి రహస్యమైనది, పురాణాలతో పచ్చగా ఉంటుంది, పవిత్రమైన జ్ఞాపకశక్తితో దట్టమైనది. ప్రతిచోటా మాయాజాలం ఉంది:
లిల్లీస్ “హృదయ స్పందనలో నావిగేట్ చేసే విధంగా . . . “చల్లని వెదురు,/ సూర్యకాంతిలో పునరుద్ధరించబడిన” నిశ్శబ్దంగా, పర్వతాల యొక్క “మాటలు లేని ఉత్సాహం”లో, కత్తి చేపలా పైకి దూసుకుపోతున్నాయి. “నదికి ఆత్మ ఉంది” అంటారామె.
ఆమె కవిత్వంచాలా సరళంగా వుంటుంది.

అరుణాచల్ ప్రదేశ్ సాహిత్యం – మమంగ్ దాయి

ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు

Posted on Updated on

మిత్రులారా! ‘ ఆకుపచ్చ కవితలు’ పైన ‘దిశ’ దినపత్రికలో సమీక్ష వచ్చింది. సంపాదకులకు, సమీక్షకులు  శ్రీ అరవింద్ రెడ్డి గారికి ధన్యవాదాలు –ఆనంద్             

+++++++++

ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు

బలమైన కవిత పుట్టాలంటే కవికి తీవ్రస్థాయిలో కోపం రావాలి. లేదంటే పట్టలేని సంతోషం కలగాలి. ఏ భావోద్వేగమైనా సరే.. ఉచ్ఛస్థాయిలో ఉండాలి. అప్పుడే ఓ మంచి కవిత పుడుతుంది. మనసును ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తోంది. తెలుగునాట ప్రభావం చూపిన కవిత్వమంతా అటువంటిదే. మనం ఈ నేల మీద పుట్టాము కాబట్టి.. మన మాతృభాష తెలుగు కాబట్టి.. మనకు తెలుగులో రాసిన కవిత్వం మాత్రమే చదువుకొనే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో గొప్ప కవిత్వం పుడుతుంది. బహు భాషాపండితులు ఆ కవిత్వాన్ని చదివి ఆస్వాదించగలుగుతారు. కానీ సామాన్యులకు సాధ్యం కాదు. అందుకోసం పుట్టుకొచ్చిన ప్రక్రియే అనువాదం.. ప్రపంచ సాహిత్యంలో, లేదంటే మనదేశంలోని ఇతర భాషల్లో ఆలోచింపజేసే సాహిత్యాన్ని ఎందరో అనువాదకులు తెలుగుకు పరిచయం చేశారు.

కానీ దురదృష్టవశాత్తు అనువాద సాహిత్యం చాలా సార్లు కృతకంగా ఉంటుంది. మూలం చెడకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా అనువాదకులు కాస్త కఠినమైన భాషలో రాస్తుంటారు. కథా రచన, నవలా రచన అనువదించినప్పుడే ఆ భాష సామాన్యులకు ఓ పట్టాన అంతు చిక్కదు. అటువంటిది కవిత్వమైతే ఇంకా కష్టం. తెలుగులో గొప్ప అనువాద రచనలు లేవని కాదు.. మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసం కూడా అనువాద ప్రక్రియలో వచ్చిందే. అప్పటి కవులు స్వేచ్ఛను కూడా తీసుకొని.. తమదైన శైలిలో మూలం చెడకుండా భారతాన్ని రాశారు.

అయితే ప్రపంచ సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనలను తెలుగులో ఎందరో కవులు మనకందించారు. ఆ చిట్టా ఇప్పుడు అనవసరం కానీ..

గుల్జార్ రాసిన గ్రీన్ పోయెమ్స్ ను ఆకుపచ్చ కవితలు పేరిట వారాల ఆనంద్ తెలుగులో అనువదించారు. ఈ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆకుపచ్చ కవితలు పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకంలో ఉన్న కవితలు చదువుతుంటే మనకు అచ్చం తెలుగు కవిత్వం చదువుతున్న ఫీల్ కలుగుతుంది. ఎక్కడా అనువాదం అనే భావం కలగదు. హిందీ కవితను కూడా పక్కనే చేర్చారు కాబట్టి.. హిందీ తెలిసిన వారు మూల కవితను పోల్చి చూసుకొనే అవకాశం ఉంది.

మొదటి కవిత నది..

తనలో తాను గుసగుసలాడుతూ

నది ప్రవహిస్తున్నది

చిన్న చిన్న కోరికలు తన హృదయంలో

కదలాడుతున్నాయి

జీవితాంతం ఇసుక తీరాలపై జారుతూ కదిలిన నది

వంతెన మీద నుంచి ప్రవహించాలనుకుంటోంది.

ఇది మొదటి కవిత.. రచయితకు ప్రకృతి మీద ఎంత ప్రేముందో ఈ కవితతో మనకు అర్థమవుతుంది. ఓ నది పడే ఆవేదనను అద్భుతంగా అక్షరీకరించింది ఈ కవిత. ఇందులోని పంక్తులు చదువుతుంటే అచ్చం ఓ తెలుగు కవితను చదువుతున్నట్టే ఉంటుంది తప్ప.. అనువాదమనిపించదు.

గుల్జార్ ప్రకృతి కవి.. నది మీద, మబ్బుల మీద, శిశిరంలో రాలే ఆకుల మీదే ఆయన దృష్టంతా ఉంది. ఆ ఆకుపచ్చ కవితలన్నీ నిజంగానే నదికి మనసుంటే.. మబ్బులకు గొంతు ఉంటే అవి ఇలాగే పలవరిస్తాయేమో అనిపిస్తుంది. శిశిరంలో రాలే ఆకులు .. కొమ్మలకు ఏం చెబుతాయన్నది అచ్చంగా మానవ సంబంధాలను తలపిస్తాయి. చెట్టు మీద కొమ్మ మీద రాలే ఆకు మీద కవికి ఉన్న దృష్టికి నిజంగా అబ్బుర పడతాం..

వీధి మలుపులో వృక్షం అన్న కవిత నిజంగా గుండెలను బరువెక్కిస్తుంది. చెట్టుకు మనిషికి విడదీయలేని సంబంధం ఉంటుంది. తనకు ఎంతో అనుబంధం ఉన్న ఓ భారీ వృక్షాన్ని మున్సిపల్ అధికారులు తన కండ్ల ముందే కూలదోస్తుంటే.. ఏ మనిషికైనా హృదయం బరువెక్కకుండా ఉంటుందా? ఇక కవి అయితే ఆ బాధను అక్షరీకరించకుండా ఉంటాడా.. అలా పుట్టిందే ఈ కవిత..

సూర్యుడితో ఓ చెట్టు చెప్పుకొనే వేదనే సూర్యుడి వేళ్లు కవిత. మనుషులు ఎంత కఠినంగా ఉంటారో.. చెట్ల మీద తమ పేర్లను ఎలా చెక్కుతారో ఓ చెట్టు పడే ఆవేదన ఈ కవిత..

‘మూసేస్తున్న బావి’  ఈ కవిత పల్లెల్లో జరుగుతోన్న విధ్వంసానికి అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా పల్లె టూర్లలో చేదుడు బావులు, ఊట బావులు ప్రజల దాహార్తి తీర్చాయి. అవసరాలు కూడా. కానీ నేటి వాటి ఉనికి లేదు. బావుల జాడ కనిపించడం లేదు. కొన్నివిధ్వంసమయ్యాయి. మరెన్నో కనిపించకుండా పోయాయి. ఆ మూత పడ్డ బావులపై కవి వేదన ఎంతో అర్థవంతంగా ఉంది. ఆలోచనాత్మకండా కూడా..

మొత్తంగా అన్ని కవితలు కదిలించేవే. చెట్టు, పుట్ట, నది, మబ్బు, వర్షం, ఆకాశం ఇలా పుస్తకమంతా ప్రకృతి పలవరింతే.. ప్రకృతి మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తుంటే.. మనిషి మాత్రం దాన్ని మరిచిపోయి పగబట్టినట్టు ప్రకృతిని చెరబడుతున్నాడు. చెట్లను ధ్వంసం చేస్తున్నాడు. నదులను చెరబడుతున్నాడు. వాటి ఉనికి ధ్వంసం చేస్తున్నాడు. రచయిత ఇదే ఆవేదనను వ్యక్తం చేశాడు. రచయిత భావాలను  అనువాదకులు వారాల ఆనంద్ అద్భుతంగా అక్షరీకరించారు. 155 పేజీలున్న ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే.

ప్రతులకు సంప్రదించండి

9440501281

– అరవింద్ రెడ్డి మర్యాద, 8179389805

మూల రచయిత ప్రభావం అనువాదంలో పాఠకుని పై వుంటుంది

Posted on

మిత్రులారా, తంగేడు తెలుగు సాహిత్య పత్రికలో 16-31 మార్చ్ 2023 సంచికలో అచ్చయిన నా ఇంటర్వ్యు. వీలు చేసుకుని చదవండి. ఇంటర్వ్యు చేసిన డి.విజయ్ ప్రకాష్, అసిస్టంట్ ప్రొఫెస్సర్ ఇంగ్లిష్,
శాతవాహన విశ్వవిద్యాలయం గారికి, సంపాదకులు శ్రీ కాంచనపల్లి గారికి ధన్యవాదాలు -వారాల ఆనంద్
+++++++++++++++

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి, తెలంగాణ ముద్దు బిడ్డ శ్రీ వారాల ఆనంద్ ను కలవాలనే తలంపులతో ఇంటి తలుపు తట్టిన “తంగేడు”…
ప్రముఖ ఉర్దూ కవి, రచయిత, పద్మ భూషణ్ గుల్జార్ రాసిన “గ్రీన్ పోయెమ్స్” (2014) ను “ఆకుపచ్చ కవితలు” (2019) గా తెలుగులో అనువదించినందుకు 2022 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినందుకు అభినందనలు దీనిపై మీ అభిప్రాయం…

ఆనంద్: చాలా ఆనందంగా ఉంది. అవార్డు వచ్చినందుకు ఒకంత ఆశ్చర్యంగానూ ఉంది. నా మనసుతో మమేకమై ఈ అనువాధానికి పూనుకున్నాను. అవార్డు వస్తుందని ఊహించలేదు. నేను మొదటిసారి గుల్జారు రాసిన గ్రీన్ పోయెమ్స్ చదివినప్పుడు ఆయన అనుభూతులను తెలుగు వారితో పంచుకోవాలని ప్రయత్నించాను, దాని ప్రతిఫలమే ఈ పురస్కారం.

Q: మీరు రచయితగా, కవిగా మారటానికి నేపథ్యం?

A: నా చిన్నప్పటినుండి రేడియోలో పాటలు వినడం, పుస్తకాలు చదవడం జీవితంలో ఒక భాగమయిపోయింది. కరీంనగర్ లో బాల్యంలో మిత్రులతో, ఉర్దూ భాషతో మమేకమైనప్పుడు నాలో సాహిత్య సృజన మొదలయింది. ఆ తర్వాత పై చదువుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించినప్పుడు నందిని సిద్ధారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ మొదలైన వారి పరిచయం ఈ సృజనను ఇంకా పెంచింది. ఏదో చదవాలనే తలంపు పెరుగుతూ వచ్చింది, వివిధ రచనల మీద ఆసక్తి,అవగాహన పెరిగింది.

Q: సైన్స్ విద్యార్థి నుండి సృజనాత్మక రచయితగా మార్పు చెందడానికి కారణం?
A: మొదటి కారణం సామాజిక మార్పు, రెండోది నేను చాలా అంతర్ముకుడిని, నాలో నేనే సంభాషించుకునే వాడిని. పాత సినిమా పాటలు, సాహిత్యం, గొప్ప, గొప్ప రచనలు నాలోని కళాత్మక హృదయాన్ని, భావాలని బహిర్గతం చేయడానికి ప్రేరేపించాయి. దానిలో భాగంగా మొదటి సంకలనం “మినీ పోయెట్రీ”తో (1978 -80) మధ్య ప్రారంభించాను.

Q: కవిగా మీ సాహితీ ప్రస్థానం?
A: నా సాహిత్య మిత్రులు అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివ కుమార్, పీ.ఎస్.రవీంద్ర, జింబోలతో కలిసి “లయ” పేరుతో పుస్తకాన్ని ముద్రించాము. అది నాలోని కవి యొక్క పరినితిని పెంచింది. ఇప్పటివరకు దాదాపు నాలుగు కవిత్వ సంకలనాలూ వెలువరించాను, సుమారు 400కు పైగా కవితలు రాశాను.

Q: కవిత్వం నుండి అనువాదంలోకి రావడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

A: చదవడం ప్రారంభించిన తర్వాత ఎన్నో పుస్తకాలు ఉస్మానియాలో చదవడం, వాటిని ఆకళింపు చేసుకొని ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాను. అంతేకాకుండా,తెలుసుకోవడం అన్నది నా జీవిత స్వభావం కూడా. అంతే కాకుండా నాకు తెలిసింది అందరితో పంచుకోవడం అన్నది కూడా నేను ఆచరించే జీవన విధానం, ఈ స్వభావమే నన్ను అనువాదకునిగా మార్చింది. దానిలో భాగంగా “ఇరుగు-పొరుగు” అని శీర్షికతో వివిధ భాషల సాహిత్యాన్ని తెలుగులో అనువదించడం మొదలుపెట్టాను. ఇప్పడి వరకు దాదాపు 17 భారతీయ భాషలలోని అనేక మంది కవితల్ని తెలుగులోకి అనువదించాను. అట్లా అనువదించిన కవితలు వందకు పైగా వున్నాయి. అట్లా అనువదించడం వాళ్ళ నా పరిధి చాలా విస్తరించింది. విషయాల్లోనూ వ్యక్తీకరనల్లోనూ ఎంతో ఉపయుక్తమయిందనే అనుకుంటున్నాను. గతం లో విపుల లాంటి పత్రికలు నాలోని అనువాదకున్ని ప్రోత్సహించి నిలబెట్టాయి.

Q: మీ దృష్టిలో చక్కని అనువాదం అంటే ఏమిటి? దానిలోని కీలకమైన అంశాలు తెలియచేయగలరు.

A: అనువాదం యొక్క ప్రాథమిక లక్షణాలు రచయిత భావాలను పాఠకుని మనస్సుకు చేరవేయడం. అనువాదకుడు మూల రచయిత యొక్క కవితాత్మను, ఆయా కవితల రూపాన్ని, మూల కవి అభిప్రాయాలను, జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తే పాఠకుని దృష్టిలో అది మంచి అనువాదం. మూల రచయిత చెప్పాలనుకున్న సారాంశాన్ని అనువాదకుడు పాటకునికి అందించాలి. స్వంత భావాల్ని చొప్పించ కూడదు అని నేననుకుంటారు.

Q: సాధారణంగా అనువాదం అనేది ద్వితీయ శ్రేణి రంగానికి చెందినదంటారు సాహిత్యంలో, దీనిపై మీ అభిప్రాయం.
A: నా అభిప్రాయంలో అనువాదం లేకుంటే మానవ జీవితంలో పురోగతి కానీ అభివృద్ధి కానీ లేదు. ప్రాచీన గ్రీక్, రోమన్ సాహిత్యాలతో ప్రారంభిస్తే అనేక భాషా సాహిత్యాలూ, తాత్వికరచనలు అనువాదం వల్లనే మనకు లభ్యమవుతున్నాయి. ఫ్రెంచి, రష్యా మరియు పాశ్చాత్య సాహిత్యాలు మన జీవన విధానంలో చాలా మార్పులను తీసుకొచ్చాయి. అంతెందుకు, మన ప్రస్తుత రామాయణ, మహాభారత, భాగవతాలు కూడా అనువాదాలే. ఇకపోతే ఈమధ్య అనువాదాలు యాంత్రికంగా తయారవుతున్నాయి. అందువల్ల అనువాదం ద్వితీయ శ్రేణి అనే భావం కలగవచ్చేమో కానీ మూల రచయితకి పాఠకుడికి మధ్య సమన్వయ వారదే ఈ అనువాదకుడు. ఈ హెచ్చుతగ్గులు తగ్గాలంటే విశ్వవిద్యాలయాలు, పరిశోధన అధ్యయన కేంద్రాలు కొన్ని కార్యశాలలను మరియు అనువాద అవశ్యకతలపై, వాటి సమస్యలపై చర్చ-గోస్టులను నిర్వహిస్తే అనువాదంపై ఉన్న అపోహలను తొలగించకోవచ్చు.

Q: అనువాద రచనకు గుల్జార్ యొక్క ‘గ్రీన్ పోయెమ్స్’ ని ఎంచుకోవడానికి కారణం?

A: నా చిన్నతనం నుండి గుల్జార్ రచనల యొక్క ప్రభావం నాపై అపారంగా ఉంది. ఆయన పాటలు, మాటలు నన్ను ఎంతో మార్చాయి. డిగ్రీ వరకు నా ద్వితీయ భాష హిందీ కావడంతో ఈ ‘గ్రీన్ పోయమ్స్’ ని ఎంచుకున్నాను. నేను ఎం.ఏ. లో అభ్యసించిన తత్వశాస్త్రం, గుల్జార్ లోని తాత్విక వేత్త, పర్యావరణ ఆవశ్యకత గురించి ఆయన స్పందించిన తీరు, మానవ మరియు ప్రకృతి సంబంధాల గురించి శృషించిన శైలి నన్ను ఆకట్టుకుంది.
పువ్వు రాలిపోతూ కొమ్ముతో ఏమంటుంది/ చెట్టు కూలిపోతూ భూమితో ఏం చెబుతుంది /భూమి మళ్ళీ వస్తావు నేను బతికుంటే….

Q: మూల రచనకు/ రచయితకు అనువాదకుడు విశ్వాసపాత్రకుడుగా ఉండగలుగుతాడా?

A: అనువాదకుని పరిధి, బాధ్యత, రచయిత యొక్క భావాలను పాటకునికి చేరవేయడమే. రచయిత మూలభావాలను అనుసృజనగా మార్చి పాటకునికి చేరవేసే మహోన్నత బాధ్యత అనువాదకుల భుజస్కందాలపై ఉంది.

Q: మీరు ఆనందం కోసం పుస్తకాలు చదువుతారా లేక అనువాదం కోసం చదువుతారా? ఈ రెండిట్లో ఏమైనా బేధాలు ఉన్నాయా?

A: కవిత్వాన్ని చదవడం నా నీవితం లో ఒక అంతర్భాగమయి పోయింది. కవిత్వాన్ని ఎందుకు చదువుతారు అంటే చదవకుండా ఉండలేను కాబట్టి చదువుతాను. అధ్యయనం ఆనందం కూడా ఇస్తుంది. ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా అనువాదం కోసం చదవను.చదివే క్రమంలో నాకు బాగా నచ్చి నేను కదిలిపోయిన కవితల్ని అనువదిస్తాను. ఇష్టంగా చదివి అనుసృజన చేస్తే థాదాత్మీక ఆనందంతోపాటు సృజనాత్మక జ్ఞానాన్ని అందరికీ పంచడం జరుగుతుంది. దానిలో స్వల్ప భేదాలున్నప్పటికీ సాహిత్య తృష్ణ వాటిని మార్చి వేస్తుంది. భాషామార్పుతో అనేక ప్రయోగాలకు నాంది పలకడంతో పాఠకుడు సంతృప్తి చెందుతారు. నా వరకు అనువాదంతో కూడా అపరిమితమైన ఆనందం వస్తుంది.

Q: పాఠకులు, గుల్జార్ యొక్క సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడం సులభమేనా?

A: పాఠకుడు రచయిత మనసుతో మమేకం కావాలి. గుల్జార్ రచనలు అలతి అలతి మాటల్లో సాధారణంగా ఉండి ఉదాత్తమైన ఆలోచనలు కలిగిస్తాయి. ఆయన రచనలలోకి తొంగి చూస్తే వాటి యొక్క స్పర్శ మనల్ని తట్టి లేపుతుంది. ఠాగూర్ రాసిన “భాగ్ బన్” ను ఆయన అనువదించిన తీరు అద్భుతం. తనలోని భావుకతను అర్థం చేసుకుంటే మనకు దృశ్య కావ్యాలు ఆవిష్కృతమవుతాయి. ఆయన రాసిన “కలెక్టెడ్ పోయెమ్స్”, “నెగ్లెక్టెడ్ పోయెమ్స్”, “సస్పెక్టెడ్ పోయెమ్స్” మనల్ని వేరొక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

Q: స్వేచ్చానువాదాల వల్ల పాఠకులపై మూల రచయిత ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
A: సంకేతము మరియు వాటి తరంగాలు సమానమైతేనే మూల రచయిత ప్రభావం పాటకుడిపై బలంగా ఉంటుంది. ఇందులో స్వేచ్చానువాదాల పాత్ర కూడా తక్కువేమీ కాదు. అనువాదకుని ప్రతిభ, అతని యొక్క భాషా దర్శనం, పదాలు, పదజాలం మరియు పదబంధాలు పాఠకుని మనస్సులోకి చేరితేనే, పాటకుడు అనువాదకుని ద్వారా మూల రచయిత (కవి) యొక్క ప్రయాణంలో భాగమవుతాడు.
ఉ. దా:
కాలం నన్ను లాలిస్తుంది మురిపిస్తుంది/
పోతూ పోతూ కదిలిస్తుంది
కలల్ని నాటుకుంటూ నడిచిపోతుంది
నేనే నీళ్లు పోసి సాకాలి.

Q: కవితలనే మీరు అనువదిస్తారా? లేక నవలలు కూడానా?
A: కవిత్వం ఒక భావవేశంతో పుడుతుంది. దాని లక్ష్యం సమాజ మార్పు. అదే నవల యొక్క స్వభావము, పరిధి చాలా విస్తృతంగా ఉండటం వల్ల నా ప్రాధాన్యం కవిత్వానికి ఇచ్చాను. కొన్ని కథలు కూడా అనువదించాను. ప్రస్తుతానికి నవలలు అనువదించే ఆలోచన ఉన్నా, సమయానుకూలంగా ప్రయత్నించాలి. కవిత్వంలో ఉన్న గొంతుకు ప్రభావం ఎక్కువ. అది నూతన పోకడలకు నాంది పలుకుతుంది. సమాజ పరిణామ క్రమంలో కవిత్వం పాత్ర ఎక్కువని నా అభిప్రాయం.

Q: మీ దృష్టిలో అనువాదం అంటే అర్ధాన్ని అనువదించడమా? లేక భావాన్ని సమాచారం చేయటమా?
A: సాంకేతికంగా లేక ప్రయోగాత్మకంగా చూస్తే అర్ధాన్ని అనువదించి పాటకునికి చేరవేయడమే అనువాదం. కానీ సాహిత్య విలువల పరంగా చూస్తే కవితలు, పదాలు-పదజాలం కాదు, రచయిత యొక్క భావాల ప్రతిబింబాలు. ఆ భావాలు సమాజంలోని మార్పులకు సోఫానం కావడమే ముఖ్యం. అలాంటి అనువాద సాహిత్యాన్ని చదివాక కలిగే అనుభూతి చాలా ప్రత్యేకమైయినది.

“దుఃఖము చీకటి రెండూ ఒకటే/
దుఃఖంలో చీకటికమ్ముకు వస్తుంది/
చీకటిలో దుఃఖం రెట్టింపు అవుతుంది.

Q: మిమ్మల్ని మీరు ఎలా గుర్తిస్తారు? ఒక అభ్యాసకుడా, (వ్యాఖ్యాత) లేక అనువాదకుడిగాన?

A: కవిత్వంతో నా ప్రయాణం, నన్ను, నా లక్ష్యాలకు సమాంతరంగా తీసుకు పోతోంది. కొన్నిసార్లు అభ్యాసకునిగా, రచయిత భావాలకు వ్యాఖ్యాతగా మరియు అనువాదకునిగా కాలంతో పరిగెడుతూఉన్నాను. మొత్తానికి ఒక శ్రామికుడిగా, రైతుగా, సాహిత్య వ్యవసాయం చేస్తున్నానని గుర్తించవచ్చు. నా రచనలు ‘మనిషి లోపల’, ‘అక్షరాల చెలిమే’, “ముక్తకాలు” మరియు “సిగ్నేచర్ ఆఫ్ లవ్” నా గురించి పరిచయం చేస్థాయి.

Q : మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

A: ప్రస్తుతం జావిద్ అక్తర్ పోయెట్రీని మరియు మలయాళ కవి కే.సచ్చిదానందం కవిత్వాన్ని అనువదిస్తున్నాను. మిగతా భారతీయ భాషా కవుల కవిత్వాన్ని అనువదించే పని రోజూ కొనసాగుతూనే వుంది.

Q: మీ అనువాదాలకు ప్రేరణ లేక తోడ్పాటు ఎవరైనా ఉన్నారా?

A: నా అనువాదాలకు లేదా కవిత్వ రచనలకు తోడ్పాటు నా జీవిత సహచరి ‘ ఇందిర’. 2014లో నేను రాసిన “మనిషి లోపల” పుస్తకం తనకు అంకితం ఇచ్చాను. ఇట్లా రాసాను.. ‘కలిసి బతుకుదామని వచ్చి, నాకు జీవితాన్నే ఇచ్చిన ఇందిరకు’ అని

తను లేనిది నేను లేను. తనే నా అంతరంగం.

పొద్దస్తమానం అద్దంలోకి చూస్తూనే ఉంటాం/
అందం కోసమో… అలంకరణ కోసమో../
మన లోపలికి చూసుకోవడానికి తీరికే లేదు.

Q: భవిష్యత్ అనువాదకులకు మీ సందేశం

A: అనువాదకులకు భాష పై పట్టు, రచయిత మనసులోని భావము, అతని ఆలోచనల ప్రభావంపై స్పష్టత ఉండాలి. అప్పుడే అనువాదకుని బాధ్యత పూర్తవుతుంది. ఉదాహరణకి వేదన, బాధ, దుఃఖం లలో మూడు ఒకే రకమైన పదాలు కానీ వాటి భావాలు, అర్థం, పరిస్థితి, ప్రభావాలు వేరు, అనువాధకుడు వాటిని సమన్వయంగా సద్వినియోగం చేసుకోవాలి.

Q: “ఆకుపచ్చ కవిత్వం” పై మీ అభిప్రాయం…?
A: గుల్జార్ “గ్రీన్ పోయెమ్స్” ఒక కవిత సంకలనం, అది మనిషికి మరియు పర్యావరణానికి మధ్య ఉన్న అనుబంధాల గురించి, మనిషి వల్ల ప్రకృతిలో జరిగే మార్పులపై రాయబడ్డ మనోహరమైన కావ్యాల సమాహారం. మానవజాతి పర్యావరణంతో విడిపోతూ ఒంటరిగా చేస్తున్న ప్రయాణానికి అడ్డుకట్ట వేస్తూ ప్రకృతి ప్రాముఖ్యత గూర్చి మానవ మేధస్సులో నాటే సువిశాల మర్రి విత్తనమే ఈ గ్రీన్ పోయెమ్స్. ఇందులోని ప్రతి కవితా తంగేడు చెట్టులా మనిషి జీవన వికాసములో భాగమయ్యే తంత్రులుగా అభివర్ణించవచ్చు.

Q : వారాల ఆనంద్ పేరు సినిమాలతో, డాక్యుమెంటరీలతో, ఫిలిం క్లబ్లతో మమేకమైనదని కొందరంటారు. దీనిపై మీ వ్యాఖ్య:

A: భాషలో ప్రకృతి మరియు వికృతి లాగా, నాణేనికి బొమ్మ మరియు బొరుసు లాగ, మనిషికి జన్మ మరియు పునర్జన్మ ఉంటుందని భావిస్తాను. నాలోని బహిర్ముఖుడు -ఒక ఛాయాగ్రహకుడు, ఒక సినీ విశ్లేషకుడు, ఫిలిం క్లబ్ లతో మమేకమైన స్వాప్నికుడు అది ఒక పార్శ్వం …అదే నా జన్మ… మరియు అంతర్ముఖుడు రచయతగా, కవిగా, అనువాదకుడుగా సాహిత్య సాగు చేస్తున్నాడు. ఇది మరో పార్శ్వం, అది… నా పునర్జన్మ….కవిత్వం సినిమా నాకు రెండు కళ్ళు

సృష్టిలో రహస్యం ఏమిటి?/ పుట్టుక, చావు … /బతుకులో సారమేమిటి…. ఓటమీ… గెలుపూ….

ఇంటర్వ్యు – డి.విజయ్ ప్రకాష్, అసిస్టంట్ ప్రొఫెస్సర్ ఇంగ్లిష్,
శాతవాహన విశ్వవిద్యాలయం, Mobile:9885778585,

కళ ఎంత ప్రాంతీయ మయితే అంత అసలుదవుతుంది– నీలమణి ఫూకన్

Posted on

++++ వారాల ఆనంద్  

“సాహితీ స్రవంతి”

కళ ఎంత ప్రాంతీయ మయితే అంత అసలుదవుతుంది– నీలమణి ఫూకన్

++++ వారాల ఆనంద్  

వ్యక్తీకరణ ఎంత అంతర్ముఖీనమయితే అంతగా స్వచ్ఛమవుతుంది (ముక్తకం)

ఇది సరిగ్గా ఈశాన్య భారత రాష్ట్రాల సాహిత్యానికీ, సినిమాకూ, సంగీతానికీ అన్ని కాళాత్మక రూపాలకూ వర్తిస్తుంది. అక్కడింకా ఇప్పటికీ సహజ సిద్దమయిన నదీ నదాలూ పర్వతాలతో పాటు మనుషుల అనుభవాలూ, వ్యక్తీకరణాలూ మిగిలి వున్నాయి. అందుకే అక్కడి సాహిత్యం గొప్ప భావ స్పోరకంగా వుంటున్నది. సంగీతమూ సినిమాకూడా అంతే గొప్పగా కొనసాగుతున్నది.  అట్లా ప్రకృతి సిద్దమయిన చెట్లూ,  అడవులూ, ఆకుపచ్చదనమూ పర్వతాలూ  కలుషితం కాని వాతావరణంతో తుల తూగే ఈశాన్య భారతంలో ప్రధాన రాష్ట్రం అస్సాం. అక్కడినుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమామొదలు అన్ని కళలూ అత్యంత ప్రాంతీయమై, భావస్పోరకమై ఎలాంటి అనుకరణలు లేకుండా చాలా వరకు ఆసలయిన కళారూపాలుగా వుంటున్నాయి. 

    ఈశాన్య భారతం అత్యంత ప్రాచీనమయిన సంస్కృతికి పతిరూపం . 200కు పై చిలుకు జాతుల సమాహారమయి దాదాపు ప్రతి జాతీ తమదయిన విశిష్ట భాషా సంస్కృతుల్ని కలిగి వుంది. అందులోనూ ఉమ్మడి అస్సామ్ రాష్ట్రంగా వున్నప్పటినుండీ అస్సాం భాషా సాహిత్య, సినిమా రంగాల్లో జాతీయ అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షించింది. భూపేన్ హజారికా, బబెంద్రనాథ్ సైకియా లాంటి అనేక మంది సంగీతకారులూ, నీలమణి ఫూకన్, హేమ బారువా, అమూల్య బారువా, మహేశ్వర్ నియోగి లాంటి అనేక మంది కవులు వెలుగొందారు. రచయితలూ తమ తమ సృజనాత్మక రంగాలతో పాటు అస్సామీ సినిమా రంగంలో కూడా విశేషంగా కృషి చేసి అస్సామీ సినిమాను నిలబెట్టారు.     

అట్లా అస్సాం నుండి ఎదిగి వచ్చి అఖిల భారత స్థాయిలో తనదయిన ముద్రను వేసిన కవి నీలమణి ఫూకన్.

“మానవుడు ఎదుర్కొన్న అన్ని సంక్షోభ కాలాల్లో కవిత్వం బతికే వుంది వుంటుంది కూడా”

అంటాడు సుప్రసిద్ధ ఆస్సామీ కవి నీలమణి ఫూకన్. భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ‘జ్ఞానపీఠ్’, సాహిత్య అకాడెమి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు, విశిష్ట సత్కారాలూ అందుకున్న ఆయన “నాకు వచ్చిన అవార్డులూ, రివార్డులూ చూసి నేనేదో సాధించానని అనుకోను.. ప్రపంచ వ్యాప్తంగా వెలువడ్డ లక్షలాది కవితల్లోకి నేనూ కొన్నింటి చేర్చాను” అంతే అంటాడు. అట్లా అత్యంత వినమ్రంగా ప్రకటించుకున్నా ఆయన ఇటీవలే జనవరి 19 న గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మృతి చెందారు. 1933 సంవత్సరంలో సెప్టెంబర్ 10 నా జన్మించిన ఆయన ప్రకృతి ప్రేమికుడు. జోర్హాట్ పట్టణానికి చేరువలో వున్న దేర్గావ్ లో జన్మించాడు. సహజ సిద్ధమయిన అందమయిన వాతావరణాన్ని సంతరించుకున్న ఆ ప్రాంతమది. అంతే కాదు తేయాకు తోటలతోనూ చుట్టూరా పర్వత సానువులతోనూ నిండి వున్న అక్కడి వాతావరణం నీలమణి ఫూకన్ పైన చిన్ననాడే గొప్ప ప్రభావాన్ని చూపింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన పైన చిన్నప్పటినుండీ తన తల్లిప్రభావం తో పాటు అప్పటికే సాహిత్య జర్నలిస్టు రంగాల్లో ప్రసిద్దుదయినా తన చిన్నాన్న ప్రభావం అమితంగా వుంది. చుట్టూ వున్నా వాతావరణంతో పాటు భాషా సంస్కృతుల ప్రభావం వల్ల నీలమణి కి జానపద సాహిత్యం పాటలు, గిరిజన జనజీవితం పైన అభిమానం మక్కువ పెరిగాయి. అవన్నీ తన సృజనాత్మక జీవితమం లో ప్రతిబించాయనే చెప్పాలి. కవిగానే కాకుండా గిరిజన జానపద కళల విమర్శకుడిగా కూడా ఆయన ఎదగడానికి చిన్ననాటి ఆ ప్రభావాలు ఎంతగానో దోహదపడ్డాయి. అందుకే ఒక చోట ఆయనంటాడు “నేను కనుక ఈ అస్సాం లోని సుతిమెత్తని ఆకుపచ్చ వాతావరణం లో పుట్టి ఉండకపోయి వుంటే..ఈ గ్రామీణుల భాష సంస్కృతి, ఆటా పాటలతో మమేకం అయివుండక పోయివుంటే.. ప్రాచీన, వర్తమాన కవుల రచనల సాంగత్యమే నాకు దొరకక పోయివుంటే నేనసలు కవినే అయివుండేవాన్ని కాదు. నేను యాభై ఏళ్లకు పైగా పట్టణాల్లో నివసించినప్పటికీ ఇప్పటికీ నాకు పల్లె స్మృతులు, కలలు,సుఖమూ దుఖమూ,, ఇంకా పల్లెల వాసన, రుచీ, రంగూ ఇంకా నన్ను చుట్టుకునే వుంది. ఎప్పటికప్పుడు నన్ను కదిలిస్తూనే వుంది”

1950 లలోనే కవిత్వం రాయడం ఆరంభించిన నీలమణి ఫూకన్ అప్పరికే అస్సాం సాహిత్య ప్రపంచంలో తమదయిన ప్రభావాన్ని రచిస్తున్న గొప్ప కవులు హేమ బారువా, అమూల్య బారువా, మహేశ్వర్ నేయోగ్ లాంటి కవుల ప్రభావంలో తన రచనలు ఆరంభించాడు. వాళ్ళు అప్పటికే ఆరంభించిన ఆధునిక కవితా ఒరవడిలో తాను తన రచనలు చేయడం ఆరంభించాడు. నీలమణి తో పాటు ఆ కాలంలో రచనలు చేసిన కవులు నవకాంత బారువా, అజిత్ బారువా లు కూడా అదే రీతిలో కవిత్వ రచనలు చేసారు. నీలమణి ఫూకన్ కు రుషి లాంటి కవి అన్న పేరు కూడా వుంది. ఎందుకంటే ఆయన తాను ఎన్నుకున్న విస్థారమయిన కాన్వాస్, ఎంచుకున్న భాష రాసిన తీరు ఆయన్ని అట్లా పిలవడానికి దోహద పడింది. ఆయనతనకవిత్వం లో చెట్లు, పర్వతాలూ,మైదానాలూ, నీళ్ళూ నిప్పూ, గ్రహాలూ, నక్షత్రాలూ, అడవులూ ఎడారులూ అన్నీ ఆయన్ని ఒక రుషి లాంటి కవి అనిపించాయి. ఆయన కవిత్వం లో అధికంగా సాధారణ విషయాల్ని చేబుతున్నట్టు అనిపించినప్పటికీ అయన అనేక అంశాల్ని మనిసి కేంద్రీక్రుతంగా నే చెప్పారు. “మరణానికి అర్థాన్ని, జీవితంలోని ఖాళీలని” గురించీ రాసాడు. అట్లా విస్త్రుత అధ్యయనం విస్తారమయిన రచనల ద్వారా నీలమణి ఫూకన్ అస్సాం సాహిత్యం లో సుస్థిర మయిన స్థానాన్ని పొందడం తో పాటు భవిష్యత్తరాలకు మార్గానిర్దేశంచేసే రచనలు చేసాడు. ఆయన సృజనలో  ఫ్రెంచ్ ప్రతీకవాద ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఆరు కవితా సంపుటాలు వెలువరించిన నీలమణి ఫూకన్ జపనీస్, చైనీస్ కవితానువాదాలు రెండు, కొన్ని స్పానిష్ కవి గార్సియా లోర్కా కవితానువాదాలూ చేసాడు. ఆయనకు దృశ్య కళ లలో విపరీత ఆసక్తి వుండేది. ముఖ్యంగా పెయింటింగ్స్ లో నీలమణి కి ఆసక్తే కాకుండా గొప్ప పెయింటింగ్స్ పైన ఆయన చాలా రాసాడు.

నీలమణి ఫూకన్ మొట్ట మొదటి కవితా సంకలనం “సూర్య హెనో నామి ఆహే నడి ఏడి”( నది ఒడ్డున సూర్యోదయం) 1963 లో వెలువడింది. అయితే నీలమణి తన అనంతర ప్రచురణల్లో మొదటి ప్రచురణ నుండి కొన్ని కవితల్ని మినహాయించాడు. అంటే ఆయన ఎప్పరికప్పుడు తన రచనల్ని పునర్ మూల్యాన్ఖనం చేసుకునేవాడన్నమాట. తనరెండవ కవితా సంకలనం “ నిర్జనతర్ శబ్ద” ( నిశబ్ద ధ్వని) 1965 లో వెలువడింది. తర్వాత 1968 నీలమణి తన మూడవ సంకలనం “ఆరు కిను శబ్ద( నిశబ్దం అంటే ఏమిటి) వెలువరించారు. తన తొలి రచనలే అయినప్పటికీ అవన్నీ అస్సామీ ఆధునిక కవితా ధోరణులకు అద్దం పట్టాయనే చెప్పాలి. అయితే నీలమణి కవిత్వం లో ముఖ్యమయిన మలుపు తిరిగిన కవిత్వం 972 లో ఆయన వెలువరించిన “ఫులి తోక సూర్యముఖి ఫుల్తోర్ పాలే ( వికసించే పొద్దు తిరుగుడు పువ్వు కోసం). ఇందులో ఆయన సిరీస్ గా రాసిన కవితలు అస్సామీ ఆధునిక కవిత్వం మీదా తీవ్ర ప్రభావాన్ని కలిగించాయి. విషయ పరంగా సాహసోపేత మయిన అంశాల్ని తీసుకోవడంతో పాటు కవితా నిర్మాణ విషయం లో కూడా ఆయన అనేక ప్రయోగాల్ని చేసాడు. అయన ఈ కవితల్లో మరణానికి సంభందించి, ఒంటరితనానికి సంబదించి ప్రతీకలని మళ్ళీ మళ్ళీ వాడడంతో పాటు,కవి తన ఒంటరితనాన్ని, సంక్లిష్టమయిన తన ఉనికిని కూడా విరివిగా రాసాడు. అట్లా రాసిన కవితల్ని చదివినప్పుడు పాఠకుడు తమ మనస్సుల్లోకి అంతరంగాల్లోకి వెళ్లి పోయే స్థితి కూడా కలుగుతుంది. ఈ అకవితల్లో నీలమణి ప్రతీకాత్మక వాదాన్ని స్ఫుటంగా వాడాడు. అనేక ప్రతీకలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదివించి ఆలోచనల్లో పడేస్తాయి. అంతేకాదు ఫూకన్ తన కవితల్లో జానపద ప్రతీకలని వాడతాడు. దాంతో ఒక స్థానీయత కనిపిస్తుంది. ఆయా సందర్భాల్లో ఆయా మాటలకు కొత్త అర్థాల్ని సంతరింప చేయడం నీలమణి ఫూకన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అనేక దశాబ్దాల పాటు సాగిన ఆయన కవితా రచన ఆయనలోని విక్షనతని చాటుతుంది. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ లోతయిన, విస్తారమయిన సున్నితత్వాన్ని ఆవిష్కరిస్తుంది.

నీలమణి ఫూకన్ 1961 లో గౌహతి విశ్వవిద్యాలయం నుండి చరిత్ర లో ఎం.ఏ. చేసాడు. 1964 నుండి గౌహతి లోని ఆర్య విద్యాపీఠ్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసాడు. ఆయనకు 1981 తన కవిత సంకలనానికి సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. 1997లో అస్సాం వాలీ లిటరరీ అవార్డు అందుకున్నారు, 1990 ఆయనకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించింది. 2021లో ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది.                

‘కవిత్వం మనిషి లో  సున్నితత్వాన్ని పెంచుతుంది, మానవీయతను సంతరింప చేస్తుంది, సోయిని పెంచుతుంది,సృజనాత్మకతను పెంచి మంచేదో చెడేదో వాటి మధ్య ఉన్న రేఖా మాత్ర తేడాను తెలుసుకునేలా చేస్తుంది, స్పందించే గుణాన్ని విస్తరింపచేసి ప్రకృతిలోకి చూసేలా చేస్తుంది,అందుకే మనుషులు అంతా కవులూ, ప్రేమికులూ, లేదా తిరుగుబాటుదారులయినా  కావాలి. అంటాడు నీలమణి ఫూకన్.

.

*************     

ఎవరయితే చదవరో వారికోసమే

‘కవిత్వం’

…..

ఓ కవి అన్నాడు

‘ఎవరయితే చదవరో వారి కోసమే కవిత్వం’

హృదయాల్లోని గాయాల కోసం

ముళ్ళుదిగి ముడుచుకు పోయిన చేతి వేళ్ళ 

వేదన కోసం సంతోషం కోసం

బతుకుతున్న వారి కోసం చనిపోయిన వారి కోసం

రాత్రీ పగలూ రోడ్లమీద కేకలు వేస్తూ దొర్లే వారికోసం

ఎడారి సూర్యుడి కోసం

చావు అర్థం తెలుసుకోవడం కోసం

బతుకులోని అర్థాలు తెలియడం కోసం

కోమలమయిన పెదాల నడుమ

కనిపించే ఎరుపు వర్ణం కోసం

ముళ్ళ కంచెపై రెక్కలు విచ్చుకున్న పసుపు రంగు

సీతాకోక చిలుక కోసం

కీటకాల కోసం, నత్తల కోసం, నాచు కోసం

మిట్ట మధ్యాహ్నం నిప్పూ నీడల ఉద్వేగంలో

ఆకాశం నుంచి ఒంటరిగా దిగి వచ్చే పక్షి కోసం

రోగాలూ ఆకలితో అలమటిస్తున్న

అయిదు కోట్ల మంది పిల్లల తల్లుల కోసం

ఎరుపుగా మారిపోతానన్న భయంతోవున్న చంద్రుడి కోసం

ప్రతి స్థబ్ద క్షణం కోసం

ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతున్న ప్రపంచం కోసం

మట్టిలో పుట్టి మట్టిలో కలిసి పోయే

ఆ మనిషి కోసం

ఆ పాత సూక్తి

+++

ఆస్సామీ మూలం: నీలమణి ఫూకన్

ఇంగ్లిష్: ప్రదీప్ ఆచార్య

తెలుగు వారాల ఆనంద్

(ARTICLE PUBLISHED IN NETI NIJAM 2 FEB 2023)

కళ ఎంత ప్రాంతీయ మయితే అంత అసలుదవుతుంది-- నీలమణి ఫూకన్

++++ వారాల ఆనంద్

“ఇరుగు-పొరుగు” లను చూడకుండా మనం ఎదగ లేము

Posted on Updated on

వారాల ఆనంద్ తో ముఖాముఖి

1) అనువాదం అంటే ఏమిటి, అనువాదాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు

జవాబు-       ‘ఇచ్చి పుచ్చు కోవడం’ అన్న భావనే మనిషి మనుగడకు  మూలాదారం.  అంతే కాదు ‘ తెలియంది తెలుసుకోవడం తెలిసింది పంచుకోవడం’ అన్నది  మానవ సంస్కృతిలో అంతర్భాగమయిన జీవనమార్గం. ప్రపంచ వ్యాప్తంగా  వేలాది లక్షలాది సంవత్సరాలుగా భిన్న  భాషలు సంస్క్రుతులతో కొనసాగుతున్న మానవాళి ఈ భాషా,సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, అభివృద్ది రంగాల్లో కొనసాగుతున్న ఈ ‘ఆదాన్ ప్రాధాన్’ భావనతోనే ముందుకు సాగుతున్నది. మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి కాలక్రమంలో భాషను గొప్ప మాధ్యమంగా రూపుదిద్దుకున్నాడు. అయితే ఆ భాష అన్నిప్రాంతాలకూ ఏక రూపకంగా కాకుండా భిన్న రూపాల్లో వ్యక్తమయి ఎదుగుతూ వచ్చింది. కేవలం మన  దేశవిషయం చూసినా భారత  రాజ్యాగం మొదట 14 భాషల్ని అధికార భాషలుగా గుర్తించి తర్వాత ఆ సంఖ్యను 23 వరకు పెంచింది. కానీ నిజానికి మన  దేశంలోనే  ఇంకా ఎన్నో లెక్క లేనన్ని భాషలున్నాయి. వాటిల్లో లిపి ఉన్నవీ లిపి లేనివీ కూడా  వున్నాయి.మరయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్ని భాషలున్నాయో. చెప్పడం కష్టం. 

 ఆ స్థితిలో ఒక ప్రాంతంలో ఒక భాషలో జరిగిన  విషయాలు, విజయాలూ,, సృజనాత్మక విషయాలూ ఇతర ప్రాంతాలకు చేరడానికి వాటిని ఒక భాష నుంచి మరో భాషలోకి చేరవేయడానికి తర్జుమా అవసరమయింది.దాన్నే అనువాదం అన్నారు

 2) అనువాదకునికి ఉండాల్సిన ప్రాధాన అవగాహన, అర్హతలు ఏమిటి?

అనువాదం చేయడానికి అర్హతలు అంటూ ఏమీ ఉండవు. ఫలానా వాళ్ళు మాత్రమే అనువాదం చేయాలని ఏమీ వుండదు అయితే ఏ భాష లోంచి అయితే అనువాదం చేయాలను కుంటామో దాన్ని మూల భాష అనీ, ఎందులోకి  చేయాలనుకుంటామో దాన్ని లక్ష్య భాష అనీ అంటున్నాం. అనువాదం చేయాలనుకున్న అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్  సింటాక్స్ తెలిసి వుండాలి. అంటే అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి. కేవలం భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం వుండి  తీరాలి. అప్పుడే మూల భాష తో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతంగా అనువదించబడుతుంది.

౩) మీకు సాహిత్యం మీద ఆసక్తి పెరగడానికి ప్రేరణ ఎవరు?

జవాబు- నిజానికి నానమ్మ తాతలది మిఠాయి దుకాణం. ముఖ్యంగా వ్యాపార నేపధ్యం వున్న కుటుంబం. కానీ మా చిన్నప్పుడు మానాన్న ఉర్దూ లో అనేక పుస్తకాలు చదివేవారు. మా ఇంటి  దగ్గరలో పుస్తకాలు అద్దెకు ఇచ్చే శ్రీ కృష్ణా బుక్ స్టాల్ అనే ఓ షాపు వుండేది. చిన్నప్పటినుంచే అందులోంచి డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని చదవడంతో నాకు టెక్స్ట్ బుక్స్ నుంచి ఇతర పుస్తకాలు చదివే అలవాటు అయింది. తర్వాత అరికేపూడి, మాదిరెడ్డి లాంటి మహిళా రచయిత్రుల నవలలు చదివాను. డిగ్రీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత నా చదివే ఒరవడి మారింది. శ్రీశ్రీ కవిత్వం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవ యాత్ర, అమీనా, అంపశయ్య లాంటి నవలలు చదవడం మొదలయింది. రాయాలనే కోరికా శురూ. అదీ మినీ కవిత్వంతో మొదలయింది.  

2. సృజనాత్మక సాహిత్యానికి అనువాద సాహిత్యానికి మధ్య తారతమ్యం ఏంటీ?

జ- సృజనాత్మక సాహిత్యం లో సృజనకారుడు స్వీయ భావాల్ని, అనుభవాల్ని తన సొంత శైలిలో తనదయిన ఒరవడిలో సృష్టిస్తాడు. ఆ రచన ఆ భాష అంతా తన స్వంతం. ఆ రచన ప్రభావం, ఫలితం మొత్తంగా తనదే. కానీ అనువాదం లో అనువాదకుడు వేరొక సృజకారుడు మరో భాషలో రాసిన వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థంతో పాటు మూల రచయిత సాంస్కృతిక నేపధ్యం కూడా తెలుసుకోవాలి. అనువాదకుడు కేవలం భాషానువాదం చేస్తే న్యాయం జరగదు. అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం వుండాలి. ఆయా భాషల గ్రామర్  సింటాక్స్ తెలిసి వుండాలి. అంటే అనువాదకుడు ద్విభాషా పరిజ్ఞానం కలిగి వుండాలి. కేవలం భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విషయ పరిజ్ఞానం వుండి  తీరాలి. అప్పుడే మూల భాష తో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్య భాషలోకి సమర్థవంతంగా అనువదించబడుతుంది. అప్పుడే అది మంచి అనువాదమవుతుంది.     

3. అనువాద సాహిత్యాన్ని ఎంచుకోవడానికి కారణం?

జ- సాహిత్యం-సినిమా నాకు రెండు కండ్లలాంటివి. సాహిత్యంలో కవిత్వం, కథలు, పిల్లలకోసం కథలు రాసాను. సినిమాల విషయం వస్తే అర్థవంతమయిన మంఛి సినిమాల గురించీ, ఆయా దర్శకులపైనా, సినిమాల పైనా, బాలల సినిమాల పైనా అనేకంగా రాసాను. తెలంగాణా సాహితీ మూర్తులు పేర ముద్దసాని రామిరెడ్డి, సామల సదాశివ ల పైన డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీసాను. అదే క్రమంలో అనువాదాలు కూడా చాలా ఏళ్ళ క్రితమే మొదలు పెట్టాను. విపుల, ఆంధ్రజ్యోతి పత్రికల్లో 90 లలోనే పలు అనువాద కథల్ని రాసాను. తర్వాత స్వీయకవిత్వం తో పాటు కవిత్వానువాదాలు చేయడం ఆరంభించాను. విస్తృతంగా చదవడం ఒక అలవాటుగా  మారిన తర్వాత వివిద భాషల్లో నాకు నచ్చిన కవితల్ని తెలుగు లోకి అనువదించడం ఆరంభించాను. అట్లా ఓ ‘సాంసృతిక బంజారా’ లాగా అనేక సృజనాత్మక రంగాల్లో క్రుషిచేసాను. అనువాదంలో సచ్చిదానందన్, జావేద్ అక్తర్, గుల్జార్ తదితరుల కవితల్ని అనువదించాను. అట్లా అనువాదం నా సృజన జీవితంలో ముఖ్యమయిన అంశం అయిపొయింది.   

4. ఇప్పటివరకు ఎన్నిభాషలను తెలుగులోకి అనువదించారు?

జ- ‘ఇరుగు-పొరుగు’ శీర్షికన ఇప్పటివరకు 17 భారతీయ భాషల నుంచి 70 కవితల దాకా అనువదించాను. ఆసియా నెట్ ఆన్లైన్ పత్రికతో సహా పలు సామాజిక వేదికల్లో ప్రచురించాను.

5. అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అవార్డు రావడం పట్ల మీ అనుభూతి?

జ- కేంద్ర సాహిత్య అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ‘నచ్చిన కవిత్వాన్ని వచ్చిన రీతిలో’ అనువదించాలి అనుకున్నాను. నాకు నచ్చినవి అందరితో పంచుకోవాలనుకున్నాను.  కేంద్ర సాహిత్య అవార్డు రావడం గొప్ప ఆనందమే. మనసులో ఆనందం తో పాటు తలపైన భారం కూడా పెరిగినట్టే. ‘ఆకుపచ్చకవితలు’ పుస్తకాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరికి, అకాడెమీ భాధ్యుఅలకు ధన్యవాదాలు.

6. ఆకుపచ్చ కవితల నేపథ్యం ఏమిటి?

జ- ఆకుపచ్చ కవిత్వం మూల రచయిత గుల్జార్ అంటే నాకు నా కాలేజీ రోజుల నుంచీ అభిమానం. ఆయన్ను మొట్టమొదట ఇష్టపడింది ‘పరిచయ్’ సినిమాలో ఆయన రాసిన ముసాఫిర్ హూన్ యారో.. పాటతో. ఆతర్వాత రాజేష్ ఖన్నా “ఆనంద్’ సినిమాకు గుల్జార్ రాసిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. తర్వాత ఆయన ఖోశిష్ లాంటి సినిమాల్లో కనిపించిన సున్నితత్వం ఆయనకీ నన్ను మరింత దగ్గర చేసింది. తర్వాత గుల్జార్ కవిత్వం పై దృష్టి పడింది. గ్రీన్ పోయెమ్స్, సస్పేక్టేడ్ పోయెమ్స్, నెగ్లేక్తేడ్ పోయెమ్స్, గ్రీన్ పోయెమ్స్ ఇట్లా అనేక సంకలనాలు చదివాను. అంతేకాదు ఆయన చేసిన టాగోర్ ‘భాగ్బాన్’ అనువాదం కూడా చదివాను. వాటిల్లో గ్రీన్ పోయెమ్స్ బాగా నచ్చింది, అందులో ఆయన స్పృశించిన పర్యావరాణ అంశం బాగా హత్తుకుంది. చెట్లు, మబ్బులు, నదులు, పర్వతాలు ఇట్లా అనేక అంశాలూ వాటికీ మనిషి వున్న అనుబందం అన్నింటినీ ఇందులో గుల్జార్ సున్నితంగా ఆవిష్కరించాడు దాంతో ఆ పుస్తకాన్ని అనువాదం చేయాలనుకున్నాను.       

7. వాటిని అనువదిస్తున్నపుడు మీరు అవార్డు వస్తుందని అనుకున్నారా?

లేదు అలాంటి ఆలోచన రాలేదు.

8) గుల్జార్‌ సాహిత్యంలోని ప్రత్యేకత ఏమిటి?

జ- గుల్జార్ సాహిత్యం లో అంతర్లీనంగా ఒక సామాజిక కామెంట్ వుంటుంది. ఆయన బొప్ప భావుకుడు. అయినా ఆయన రచనల్లో మనిషి, మానవత్వం, ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆయన భాష, శైలి చాలా సున్నితంగా హృదయానికి హత్తుకునేలా వుంటుంది. ఇక ఆయన కవిత్వంలో ఇమేజెస్ అద్భుతంగా వుంటాయి. అన్నీ దాదాపుగా మనం రోజూ చూసే అనుభూతించే అంశాల్లానే అనిపిస్తాయి. కానీ వాటిల్లో ఒక టచ్ నెస్ మనల్ని కదిలిస్తుంది.

9) గుల్జార్‌ సాహిత్యాన్ని అనువాదానికి ఎంచుకోవడానికి కారణం?

జ- ‘గగన సీమలో ఆకాశ

అతుకులు అతుకులుగా విడిపోతున్నది,

ఎన్నిప్రాంతాల్నుంచి

ఈ గుడారం విడి పోతున్నదో

నా కవిత్వంతో

రోజంతా ఒక్కో కుట్టూ కుడుతూ

మెలికల కుట్లేస్తున్నా’ లాంటి సున్నితమయిన భావాల్ని చదివిన తర్వాత ఎంచు కోకుండా ఉండలేక పోయాను.

ఇంకో కవితలో

‘భయపడకు నేనున్నాను / భయపడకు నేనున్నాను

ఆ ఒంటరి ఆకు/ చెట్టుకు ధైర్యాన్నిస్తూ/ చెబుతూనే వుంది’ లాంటివి చదివాక  అనువదించాలి అనుకున్నాను.

12. తెలుగు సాహిత్యంలో సాధించాల్సిన పురోగతి ఏమన్న ఉందంటారా?

జ- తెలుగు సాహిత్యం ముఖ్యంగా తెలుగు కవిత్వం ప్రపచంలోని మరే భాషకూ స్థాయీ పరంగా తీసిపోదు. విషయపరంగా వ్యక్తీకరణ పరంగా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తూనే వుంది. అయితే నూతనంగా రాయడం ఆరంభించిన కవులు రచయితలు చుట్టూ వున్న సమాజాన్నీ,మనుషుల్నీ లోతుగా అర్థం చేసుకోవాలి.విశ్లేసించుకోవాలి. అట్లే వివిధ భాషలలో వస్తున్న కవిత్వాన్ని అధ్యయనం చేయాలి,  అప్పుడే మరింత గొప్ప కవిత్వం వచ్చే అవకాశం వుంది. ఇరుగుపొరుగు లను చూడకుండా మనం ఎదగ లేము.