అందుకున్నాను

చిన్నోడి ముక్తకాలు బాల వ్యాకరణ పాఠాలు

Posted on

చిన్నోడి ముక్తకాలు బాల వ్యాకరణ పాఠాలు
***********
వారాల ఆనంద్ సాహితీ లోకంలో పరిచయం అక్కరలేని కలం. చేవున్న కవితలతో నడుస్తున్న గొప్పకవి.అంతేకాదు వార్తా ప్రపంచంలో ఓ మానవీయ వ్యక్తి. మరింక లోతుగా చూస్తే సమాంతర సినిమా శోధకుడు, బోధకుడు కూడానూ. నిన్న సొంత ఊరు సొదలను మన ఎద ఎదల్లో నింపి
ఇప్పుడు చిన్నోడి ముక్తకాలను మన ముందు పరిచారు.ఇక్కడ తాత మనమడు సేఫ్.పాఠకులకు మాత్రం నల్లేరు నడక కాదిది.ఒక బాల్యంలోకి పరకాయ ప్రవేశం చేసి తన బాల్యాన్ని నాస్టాల్జియాలోకి ఒంపుకొని బాల ముక్తకాలను మరో ఆముక్తమాల్యదగా కవిత్వాన్ని అందించారు.ఇటీవలే ఈ కలం గుల్జార్ “గ్రీన్ పోయెమ్స్” తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నది.చిన్నోడి ముక్తకాలు 108 రకాల భావోద్వేగాల రాగమాల. కవిత్వం సినిమాటిక్ గా,డ్రామాటిక్ గా ఉండాలి. కానీ పాథెటిక్ గా కాదు. సీరియస్ గా ఉండి సెన్సషనల్ గా మానసిక ఉల్లాసం వైపు నడవడం స్టాటిక్ నుండి డైనమిక్స్ చేరుకోవడమే కవిత్వం అసలు ఉద్దేశ్యం లక్షమూ కూడా. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ధారాళంగా వారాల ఆనంద్ చిన్నోడి ముక్తకాలు అందుకున్నాయి. బతుకులో ముఖ్యమైన దశ బాల్యమే కదా. ఎందుకంటే బాల్యంలేని బతుకు ఉండదు మనిషికి. తన బాల్యాన్ని కవి తన మనుమడి లో చూసుకోవడం గొప్ప నాస్టాల్జియానే. ఇక పేజీలు అలల్లా కదులుతున్నాయి నా చేతి వేళ్లను తాకుతూ. ఇది నాకు గొప్ప అనుభూతినీ ఆనందాన్నీ ఇచ్చింది. కవి అంటాడూ ఒక ముక్తకంలో ఇలా … “వాడితో ఆడుకుంటున్నా, /కాదు వాడే నన్నాడిస్తున్నాడు/ ఇరవై ఏళ్ళ క్రితం పోగొట్టుకున్నదేదో తిరిగిస్తున్నాడు/”. తన బాల్యాన్ని వారాల ఆనంద్ యాదోంకీ బారాత్ గా ఆవిష్కరించుకుంటూ తన మనుమని బాల్యంలోకి అన్వయ కవిత్వం రాస్తున్నారు. ఇద్దరూ ఆడుకోవం ప్రధానమైన అనుభూతి . ఈ ఇద్దరూ కలిసి పాఠకులను ఆడించం గొప్ప అనుభవమే మరి. బాల్యం చేయని పని లేదుగదా. మరో పోయెమ్ లో “ఈ నడుమ వాకింగ్ కు వస్తలేవేంది… /వాకింగేంది భయ్యా చిన్నోడితో /రన్నింగే అవుతుంటే”/ ప్రతి ఒక్కరికీ బాల్యంలో ఆట ఉరుకులూ, పరుగులూ, దుముకుడూ, పడి లేవడాలూ ఉత్సుకతనూ భయాన్నీ పరిచయం చేసేవే . అయితే వీటి డిగ్రీ ఒకేలా ఉండదు కూడా. దీనిలో తాతను మనమడు ఆడించడమే సజీవ కవిత్వమూ, కవిత్వవంశమూ కూడా. వ్యక్తావ్యక్త బాల్యాన్ని ఆవిష్కరించుకోవడం కవికి గొప్ప వరం. అంతేకాదు వారాల ఆనంద్ కు కొత్త జీవన సారం కూడా. మరో ముక్తకంలో “కవిత్వం చదివాను కనుక నాకు ఉనికి /కవిత్వం రాసాను కనుక నాకు ఊపిరి”/కవికి చిరునామా కవిత్వం బతుకూ కవిత్వమైనప్పుడు ఉనికీ ఊపిరీ కవిత్వమే . మన పనీ పనితనమూ మనలో ప్రవహించడమంటే ఇదే మరి. “చిన్నోడికి నాలుగు అడుగులు వేయడం వచ్చింది /మెష్ డోర్ తీస్తే చాలు /’కవిత్వం ‘/ నడక కొత్తదిగదా పరుగో పరుగు అంటుంది. చిన్నోడి చేష్టలు ఆపడం కష్టమే మరి. ఇది ప్రతి తాత అమ్మమ్మమ్మ జీవితానుభవ సారమే. ఇక్కడ కవిత్వం చెంగో బిళ్ళ మాటలో పొడుగుకుంది. ఎంత గొప్ప మాండలిక నుడికారం. అంతే అస్తిత్వ ప్రతీక కూడా.ఇంకా “మెట్లు ఎక్కుతాడట,/ గోడలు దాటుతాడట,/ గోడలు దూకకుండా చూస్కో అంటున్నాడో మిత్రుడు”/మనిషి ఎదుగుదలలో పెరుగుదలలో మంచీ చెడూ సంగమిస్తాయి . కవి హెచ్చరికగా గోడలు దూకకుండా చూస్కో అని మరో గోతులోంచి పలికించాడు కవి ఆనంద్. ఇదే కవిత్వం చెమక్కు. అలతి అలతి మాటలు, రోజూ మన వాడే భాషలో కవిత్వాన్ని అల్లడం నేర్పూ ఓర్పుకు పరీక్షే మరి. లోగడ ముక్తకాలు కవిత్వం వెలువరించిన కాలానికీ కవికీ ఇది సమస్య కాకపోవచ్చు. అయినా మన రోజూవారీ మాటలను మనం కవిత్వంలోకి ప్రతిక్షేపించడం ఒకింత సాహసం. అంతే స్వాభిమానం కూడా. మరో ముక్తకంలో “వాడికి తెలిసిందల్లా నవ్వులూ కేరింతలూ కవ్వింతలే “/ అంటాడు కవి. చిన్నతనంలో పిల్లల ఆస్తి అదేకదా. కల్మషం మాయామర్మం లేని తెల్ల కాగితం కదా బాల్యమంటే. అది సజావుగా నడిచేలా చూడడమే తాతల పని. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు.సామజిక దృక్పథంలో కవి రచనకు మచ్చుగా చెప్పొచ్చు కూడా. మరో కవితలో “సతాయింపు ఇసుమంత /ఆనందం ‘ఆకాశమంత’/ఆనంద్ కు ఉచితంగానే ఆనందం దొరికింది.ఆనందం ఔషధం. దీనితో మనసూ దేహం మరింత ఆరోగ్యాన్ని తప్పకుండా పొందుతుంది.ఇక్కడ మునుమడు తాతకు మంచి టానిక్.కవికి ఆప్టిమిస్టిక్ ఆప్టిక్.ఆనంద్ కవిత్వం నడక తీరును తన లయ కవితం నుండి నుండి మానేరు తీరం, మనిషి లోపల, అక్షరాల చెలిమె, ముక్తకాలు,సొంత ఊరు కవిత్వం చదివిన తెలుస్తుంది. అందులో చతుర చాతుర్యం, హాస్యం, సామజిక నేపథ్యం, బంధాలూ సంబంధాలూ వాలి విలువలు తెలిపే మెళుకువలున్నాయి. ఇది చూడండి. “ఇంట్లో కర్ఫ్యూ పెట్టినట్టుంది/ చిన్నోడిప్పుడే నిద్ర పోయాడు/”ఎంత సునిశిత భావుకత. ఎంత గొప్ప అభివ్యకి. మమకారం, ప్రేమా రక్తంలా ప్రవహిస్తేనే ఇలాంటి కవిత్వం కవిలో పుట్టుకొస్తుంది నిస్సందేహంగా. కవి స్వయంగా సినీ వాలి. అందువల్ల అనుకోకుండానే సినీ మాటలు, సినీమా ఆటలు సినిమాటిక్ గా వచ్చి వాళ్ళయిక్కడ. కదలడు -వదలడు, చిక్కడు దొరకడు , మోసగాళ్లకు మోసగాడు సాగర సంగమం,ఛాలెంజ్ వంటివి కొన్ని సందర్భం ఔచిత్యం తొణికిసలాడేలా కవితమయమైనవి. ఇది అనుభవం నేర్పిన విద్య. ఇక చివరగా మనుమని విన్యాసం కవి రాతలో ” క్షణంలో గులక రాయి / నోట్లో ఎరగనట్టు/ నవ్వేస్తాడు,’మోసగాళ్లకు మోసగాడు’ /
తాత కవిత్వమంతా మనుమనిపైన ఎలా అల్లుకొని గుండెను అలుముకొందో చెప్పొచ్చు. చిన్నతనం మనను ఎలా నమ్మిస్తుందో చెప్పడం కవి ఉద్దేశ్యంగా నాకు తోచింది. మనుమనిలో తన బాల్యాన్ని చూసుకుంటూ మనకు మంచి బాలల కవిత్వాన్ని అందించిన ఆనంద్ సర్వదా బహుధా ప్రశంశనీయుడు.వారి కలం సేద్యం శ్లాఘనీయం కూడా.

డా.టి.రాధాకృష్ణమాచార్యులు
9849305871.
https://epaper.dishadaily.com/c/72719329

ప్రియురాలు

Posted on

+++++

ప్రియురాలు

+++++

ప్రేమ

నాలుగక్షరాల పదమే అయితే

చిరునవ్వు అంటే ఓ ముఖమే

ప్రియురాలు అని ఎవరినయితే అంటామో

ఆమె స్త్రీయే అయి వుండాలి

ఈ శవ పేటికలో

నిద్రిస్తున్నది

ఆ ప్రియురాలేనేమో

…….

సింహళ మూలం: లియనాగ్ అమర కీర్తి

ఇంగ్లీష్: ఉదాని పెరేరా

తెలుగు: వారాల ఆనంద్

కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్

Posted on

కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్

++++++++ వారాల ఆనంద్

“నేను ప్రకృతిని అనుసరించను..నేనే ప్రకృతిని”  నంటారు కున్వర్ నారాయణ్.

అంతేకాదు మనం రెండు ప్రపంచాల్లో బతుకుతాం..ఒకటి తాను సృష్టించిన ప్రపంచం.. మరోటి ఇతరులు సృష్టించింది..

నా ప్రపంచం మన ప్రపంచానికి భిన్నమయింది కావచ్చు కాకపోనూ వచ్చు.. అంటాడు 

***********

Pl click the link for video

********

వర్తమాన హిందీ సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని గొప్పగా ప్రభావితం చేసారు కున్వర్ నారాయణ్.

    హిందీ సాహిత్య ప్రపంచంలో తనదయిన సృజనాత్మక నైపుణ్యాన్ని సాధించాడు. ఆయన సృజనాత్మక వ్యక్తీకరణలో సరళత, పదునయిన తాదాత్మ్యత కనిపిస్తాయి. మొత్తంగా సమతావాద దృక్పధం లో ఆయన రచనలన్నీ సాగాయి. 

కున్వర్ నారాయణ్ రచనల్లో   ‘జీవితం..కవిత్వం తో రూపొందింది’అన్న BORGES మాటల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

కున్వర్ నారాయణ్ ఒక చోట  ఇట్లా అంటాడు

‘నేను జీవితాన్నుంచి 
తప్పించుకోవాలుకోవడం లేదు 
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను’… 

హిందీ నవ్య కవిత్యోద్యమం తో మమేకమయిన కున్వర్ నారాయణ్ తన సరళమయిన భాష వ్యక్తీకరణలతో హిందీ సాహిత్యం లో ప్రత్యేక ముద్ర వేసాడు.

కున్వర్ నారాయణ్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాహితీ రంగంలో వున్నారు.

ఆయన వివిధ సాహిత్య ప్రక్రియల్లో రాసారు. కవిత్వం, కథలు,ఎపిక్, విమర్శ, వ్యాసాలూ, అనువాదాలు చేసారు. వాటితో పాటు సినిమా,సంగీతం, కళలు, మ్యూజింగ్స్ కూడా రాసారు.

++++

19 సెప్టెంబర్ 1927న జన్మించిన కున్వర్ నారాయణ్ తన బాల్యాన్ని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య-ఫైజాబాద్ నగరాల్లో గడిపారు. ఆ కాలంలో ఆయన కుటుంబాన్ని టీబీ తీవ్రంగా కలిచివేసింది. అనేక మంది మృత్యు వాత పడ్డారు. చివరికి తనకు అత్యంత ప్రియతములయిన  తల్లి, సోదరి కూడా టీబీ వ్యాధికి బలయ్యారు.   

అనంతరం కున్వర్ పెద్దన్నయ్యతో కలిసి లక్నో నగరానికి చేరుకున్నాడు. అప్పుడు దేశమంతా గాంధీగారి ప్రభావం పెల్లుబుకుతున్న సమయం. లక్నో లో వాళ్ళిల్లు అనేక మంది రాజకీయ నాయకుఅకు వేదిక గా వుండేది. ఆక్రమం లోనే  కున్వర్ నారాయణ్  జీవితంలో తొలి రోజుల్ని, ఆలోచనల్ని ఆచార్య నరేంద్ర దేవ్, ఆచార్య కృపలానీ తీవ్రంగా ప్రభావితంచేసారు. ఒక సంవత్సరం బాంబే లో నరేంద్ర దేవ్ తో వున్న కున్వర్ తర్వాత

ఆచార్య కృపలానీ తో ‘విజిల్’ పత్రికలో పని చేసాడు. ఆ అనుభవం తన ఆలోచననీ దృష్టి కోణాన్నీ విస్తారం చేసింది. 

కున్వర్ నారాయణ్ లక్నో విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో ఎం.ఎ. పూర్తి చేసారు. అప్పుడే ‘లేఖ్ సంఘ్’ అన్న సంస్థ తో మమేకమయి పని చేసారు. తర్వాత విదేశాలకు వెళ్ళిన కున్వర్ కవిత్వం పైన పాబ్లో నెరుడా, నాజిమ్ హిక్మాట్ లాంటి అనేక విదేశీ సృజనకారుల ప్రభావం పడింది. పోలాండ్, జెకోస్లోవేకియా, చైనా, రష్యా లాంటి దేశాల పర్యటన కున్వర్ ఆలోచనా పరిధిని విస్తృతం చేసాయి.  1956 లో విదేశాలనుంచి తిరిగి రాగానే కున్వర్ నారాయణ్ తొలి కవితా సంకలనం ‘చక్రవ్యూహ్’  వెలువడింది. ఆ  కాలంలోనే ఆయన ‘యుగ చేతన’ అన్న పత్రిక కు సహా సంపాదకుడిగా పని చేసారు. తర్వాతి కాలంలో ‘నయా పత్రిక్’, ‘చాయానాత్’ అన్న పత్రికలకు కూడా సహసంపాదక బాధ్యతల్ని నిర్వహించారు. ఎ పనిలో వున్నా ఎక్కడున్నా ఆయన తన రచనా వ్యాసంగాన్ని వదులుకోలేదు. తన సృజనని నిరంతరం నిలుపుకున్నారు. కవిత్వంతో పాటు అనేక కథల్నీ రాసారు కున్వర్.  తర్వాత వెలువడింది ‘తీస్రా సప్తక్’. ప్రసిద్ధ కవి ఆగ్గేయ సంపాదకత్వం లో వెలువడిన ఆ సంకలనం లో వున్న ఏడుగురు కవుల్లో కున్వర్ నారాయణ్ ఒకరు.

తర్వాత కున్వర్ కవితా సంకలనం ‘పర్వేష్-హం తుమ్’

ఆ తర్వాత వచ్చిన “ ఆత్మజాయి” ఉపనిషత్తులలో వున్న నచికేతుని పాత్ర ఆధారంగా రాసిన రచన అది. అందులో జీవితము,మరణమూ, సంఘర్షణ లని మూలన్గాతీసుకుని చేసిన ఈ రచన తాత్వికంగా వుంటుంది. అందులో తమ కుటుంబ సభుల మరణాలూ వాటి ప్రభావాలూ అంతర్లీనంగా కనిపిస్తాయి.

70 వ దశకం వచ్చేసరికి కున్వర్ నారాయణ్ పై సినిమా, సంగీతం, నాటకం, చిత్రకళా ప్రభావాలు అధికమయ్యాయి. ఆ కాలంలోనే ‘నయా ప్రతీక్’, ‘చాయానాత్’ పత్రికలకు సహా సంపాదకత్వం వహించాడు. కొన్ని సాహితీ సంస్థల నిర్వహణ బాధ్యతా స్వీకరించాడు. 71 లో ఆయన వెలువరించిన ‘ఆమ్నే సామ్నే’ అన్న కథల పుస్తకం ఆనాటి సామాజిక రాజకీయాల పైన సంధించిన వ్యంగ్యాత్మక రచన గా వినుతికెక్కింది 

     అయితే ఆయనకు గొప్ప పేరుని అనేక అవార్డుల్నీ ఇచ్చిన పుస్తకం 1979 లోవచ్చిన “ కోయి దూస్రా నహీ’లో జీవితానుభవాల విస్తృతి కనిపిస్తుంది. 1999 కున్వర్ నారాయణ్ ‘ఆజ్ అవుర్ ఆజ్ సే పహలే’ అన్న సాహిత్య విమర్శ పుస్తకం వెలువరించారు. తర్వాత తన ఇంటర్వ్యూ ల తో కూడిన ‘మేరె సాక్షాత్కర్’ వచ్చింది. కున్వ నారాయణ్ అనేక సంవత్సరాల పాటు సినిమా, శాస్త్రీయ సంగీతాలను విశ్లేషిస్తూ విరివిగా రాసారు. పలు అనువాదాలు కూడా చేసారు. 

2002లో ఆయన ‘ఇన్ దినో’ అన్న కవితా సంకలనం వెలువరించారు. తర్వాత ‘వాజస్రావాకే బహానే’ అన్న ఒతిహాసిక గ్రంధం ప్రచురించారు.       

హిందీ సాహిత్య ప్రపంచంలో విలక్షణ కవిగా పేరుగడించిన కున్వర్ నారాయణ్ సృజనాత్మక ప్రభావం మొత్తం హిందీ బెల్ట్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఆయనకు సాహిత్యంలో అనేక జాతీయ అంతర్జాతీయ విశిష్ట అవార్డులు లభించాయి. అందులో కెనడా హాహిత్య అకాడెమీ అవార్డు, జ్ఞానాపీఠ్ పురస్కారం, కబీర్ సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, లోహియ సమ్మాన్, సలఖ్ సమ్మాన్, వార్శా విశ్యవిద్యాలయ గోల్డ్ మెడల్, ఇటలీ ప్రెమియో ఫెరోనియా లు కొన్ని మాత్రమే.

++++++

ఇట్లా హిందీ సాహితీ ప్రపంచంలో తనదయిన గొప్ప స్థానాన్ని పొందిన కున్వర్ నారాయణ్ ఎంపిక చేసిన కవితల్ని ఆయన కుమారుడు అపూర్వ నారాయణ్ ఇంగ్లీష్ లోకి ప్రతిభావంతంగా అనువదించారు. మూల రచనని యధాతతదంగా కాకుండా, భావం చెడకుండా చాలా గొప్పగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. అనువాదంలో అనేక మంది లాగా అకాడెమిక్ ఇంగ్లీష్ భాషను కాకుండా సృజనాత్మక ఆంగ్ల భాషను ఉపయోగించి ఈస్తేటిక్ ఫీల్ ని చివరంటా కొనసాగించారు. అది అనువాదకుని ప్రతిభకు నిదర్శనం. ఈ సంకలనంలో అనువాదకుడు అపూర్వ మూల కవిత్వాన్ని “ EARLY MEDITATIONS, ROUGH ROADS OF HISTORY, JOURNEYS,THE RIVER DOES NOT GROW OLD, TREES, MITTORS AND SHADOWS,REMEMBERANCES, HUMANESQUE” విభాగాలుగా ఎంపిక చేసి కూర్చారు. చాలా గొప్ప కూర్పు.

1927లో జన్మించిన కున్వర్ నారాయణ్ తన 90 ఎల్ల వయసులో 15 నవంబర్ 2017 న పరమపదించారు.

ఆయన కవిత్వం అందరూ ముఖ్యంగా కవులూ సాహిత్యకారులూ తప్పకుండ చదవాలని నేను అభిలషిస్తున్నాను. ఈ సందర్భంగా కున్వర్ నారాయణ్ స్మృతికి నివాళులు అర్పించుకుంటూ, అనువాదాన్ని అందించిన అపూర్వ నారాయణ్ కి ధన్యవాదాలు 

….. మీకోసం నేను చేసిన కున్వర్ నారాయణ్ కవిత్వ అనువాదాలు కొన్ని…… 

1) కొత్త మార్గం 
———————— 
నేను జీవితాన్నుంచి 
తప్పించుకోవాలుకోవడం లేదు 
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను

జీవితపు ఊహాత్మక ఇరుసుపైన 
కవిత్వానికి 
అనుమానాస్పదంగా వున్న 
స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి

అందుకు మొదట 
జీవితపు శక్తి మూలాల్ని 
క్రియాశీలం చేయాలి

తర్వాత ఆ శక్తిని 
బతుకు కక్షకున్న ఇరుసుకు 
జత చేయాలి

అప్పుడు 
గతంలో లాగా
యాంత్రికత’ లేని 
మానవత్వం’ వైపు మరలిన

కొత్త మార్గం ఆరంభమవుతుంది.
——————————– 
ఓ వింతయిన రోజు 
————— 
నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను 
ఎలాంటి ప్రమాదమూ సంభవించ లేదు

అనేకమంది మనుషుల్ని కలిసాను 
ఎక్కడా అవమానం ఎదురుకాలేదు

నేను రోజంతా సత్యమే మాట్లాడాను 
ఎవరూ తప్పుగా స్వీకరించలేదు

నేనివాళ అందరినీ విశ్వసించాను 
ఎక్కడా మోసగింప బడలేదు

అద్భుతమయిన విషయమేమిటంటే

నేను ఇంటికి చేరుకోగానే 
తిరిగొచ్చింది ఇంకెవరో కాదు 
నేనే అని కనుగొన్నాను 
================ 
ఎనిమిదవ అంతస్తు పైన

+++++++++

నేను ఎనిమిదవ  అంతస్తులోని

ఓ చిన్న ఫ్లాట్ లో

ఒంటరిగా నివసిస్తున్నాను

ఆ ఫ్లాట్ కు బయటకు తెరుచుకునే

రెండు కిటికీ లున్నాయి

అవి నన్ను తీవ్రంగా భయపెడతాయి

కిటికీలకు బందోబస్తుగా

గట్టి  గ్రిల్స్ బిగించాను

బయటనుంచి ఏదో ఉపద్రవం

ముంచు కొస్తుందని కాదు

ఇంత ఎత్తులోకి చొచ్చుకొచ్చే

ధైర్యం ఎవడు మాత్రం చేస్తాడు

ప్రమాదమల్లా నా లోపలే వుంది

చుట్టూ ఈ ఒంటరితనం ఈ విసుగూ

భయ భ్రాంతులని చేసే ఆ  అంశాలు

ఏదో ఒక రోజు నన్ను

ఈ కిటికీల్లోంచి బయటకు దూకే

ఒత్తిడి చేస్తాయేమో

====

56= యాదొంకీ బారాత్

Posted on Updated on

****లెటర్స్ అండ్ లిటరేచర్– అక్షర ఉజ్వల, సాహితీ గౌతమి *****

 ఓటమి ఊపిరి కాదు, అలవాటు కాదు, దిన చర్యా కాదు

అది చీకటిలా ఎదురొస్తుంది, చిటికేస్తే పరుగెడుతుంది

అట్లా చిటికేస్తూ కాలం గడపడం 1990ల్లో ఆరంభమయింది.

నేను ఒకేసారి రెండు మూడు రంగాల్లో పనిచేయడం దాదాపుగా అప్పుడే మొదలయింది. జర్నలిజం, రైటింగ్ ఆన్ ఫిలిమ్స్ అండ్ ఫిలిం సొసైటీ ఉద్యమం, జూనియర్ కాలేజీలో ఉద్యోగం, స్కూలు నిర్వహణ, సాహిత్య అధ్యయనం, పలు సంస్థలు ఇట్లా అనేక రంగాలు ముడివేసుకు పోయాయి. బయట అదట్లా వుంటే వ్యక్తిగత జీవితంలో అనేక ఒత్తిడులు ఒడిదొడుకులు. సహచరి  ఇందిరకు అబార్షన్లు కొంచెం అనారోగ్యం.. అన్నీ ముప్పిరిగొన్నాయి. అయినా తాను ఎంతో ధైర్యంగా ఒంటి చేత్తో ఆన్నింటినీ దాటేసుకుంటూ నన్ను వాటి నుంచి దాటిస్తూ వచ్చింది.

ఆ ఏడు జనవరి మొదట్లోనే నేనూ, హైదరాబాద్ ఫిలిం క్లబ్ ప్రకాష్ రెడ్డి గారూ కలకత్తా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లాం. ఆ ఫెస్టివల్ లో  పనోరమా విభాగానికి శ్రీ బి.నరసింగ రావు గారి జాతీయ అవార్డును అందుకున్న ‘దాసి’ ఎంపికయింది. దాసి అప్పుడు జాతీయ స్థాయిలో అయిదు అవార్డులు అందుకుంది. “దాసి దోసిట కీర్తి రాసులు” అని దేవిప్రియ అప్పుడు దిన పత్రికలో అనుకుంటాను ప్రధాన వార్తగా రాసారు. దూరదర్షన్ కోసం తీసిన ఆ సినిమా ఒక క్లాసిక్. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని విభాగాల్లో ఉత్తమ శైలిని ఆవిష్కరించింది. దర్శకుడిగా బి.నరసింగ రావు, ప్రధాన భూమిక పోషించిన అర్చన, కెమెరా వర్క్ చేసిన ఏ.కే.బీర్ లు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఇక ఫిలిం ఫెస్టివల్ ప్రారంభ సమావేశంలో మొట్టమొదటిసారిగా సత్యజిత్ రే ను దగ్గరగా చూసే అవకాశం కల్గింది. మాట్లాడే వీలు కాలేదు. అది నాకు జీవితం లో పెద్ద వెలితి. అప్పుడు ఈనాడు కు రాస్తున్నాను కనుక కలకత్తా వెళ్ళేటప్పుడు న్యూస్ టుడే ఎండీ రమేష్ బాబు ను కలిసి ఇట్లా వెళ్తున్నాను అని చెప్పాను. అక్కడి నుంచి ఏమయినా రాయనా అన్నాను. తప్పకుండా రాయండి అన్నాడు. కానీ అక్కడి నుండి రాస్తే వాటిని ‘సితార’ కు ట్రాన్స్ఫర్ చేసారు. వాళ్ళు వాళ్ళకున్న పరిధి దృష్ట్యా వాడలేదు. అట్లా కలకత్తా ఫెస్టివల్కు సంబంధించి రాయడం విషయంలో సైలెంట్ గా వుండి  పోయాను. కాని ఆ ఫెస్టివల్ లో దేవిప్రియ, వోల్గా, అక్కినేని కుటుంబ రావు, కే.ఎన్.టీ.శాస్త్రి, ఆంద్రజ్యోతి జగన్ లాంటి అనేక మంది దగ్గరయ్యారు. తర్వాతి కాలంలో ఫిలిం సొసైటీ విషయంలో నాకు ఎంతో సహకరించారు. కరీంనగర్ వచ్చి కఫిసో సభల్లో పాల్గొని నాతో పయనించారు. షాజీ కరున్  ‘పిరవి’, రే ‘ఘన శత్రు’, మృణాల్ సేన్ ‘ఏక్ దిన అచానక్’, అపర్ణాసేన్ ‘సతి’, సయీద్ అఖ్తర్ మీర్జా ‘సలీం లంగ్దేపే మత్ రో’ లాంటి మంచి సినిమాలు చూసే అవకాశం కలిగింది.

  కలకత్తా నుంచి తిరిగి వచ్చాక ఇందిర కన్సీవ్ అయింది. అప్పటికే పలు అబార్శన్స్ తో చాలా గందరగోలంగా ఉండింది పరిస్థితి. ఆ సమయంలో గోదావరిఖని లో సహా ఉద్యోగి ఆత్మీయ మిత్రుడు రమేష్ బాబుకు బంధువు అయిన డాక్టర్ హైమవతి ఎంతగా సహకరిచిందో మాటల్లో చెప్పలేను. ఒక సారయితే రాత్రి పదిగంటల సమయం.ఇందిర తీవ్రమయిన కడుపునొప్పి తో విలవిలలాడ సాగింది. వెంటనే హైమవతి గారి ఇంటికి వెళ్లాం. ‘మేడం, సారు, పిల్లలతో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్ళారని’ ఆయా చెప్పింది. ఎట్లా ఏం చేయడం. ఏ సినిమా అని అడిగాను. బాలకృష్ణ టాకీసుకు అన్నది ఆమె. ఇందిరను అక్కడే వాల్లింట్లో కూర్చో బెట్టి నేను టాకీసుకు వెళ్లాను. సినిమా రన్ అవుతున్నది. నేను గెట్ కీపర్ కు చెప్పి వెళ్లి బాల్కనీ లో నిలబడ్డాను. చీకట్లో డాక్టర్ గారిని ఎట్లా గుర్తుపట్టడం. కానీ ఎట్లా చూసిందో తాను లేచి వచ్చి ఏమిటి ఆనంద్ ఇట్లా వచ్చారు అంది. నేను విషయం చెప్పాను. మీరు వెళ్లి పిల్లల దగ్గర కూర్చోండి. నేనూ మా ఆయన వెళ్లి ఇందిరను చూసి వస్తాం అన్నారు. నేను చేతులు ఎత్తి మొక్కాను. నొ నొ అదేమిటి అంటూ స్కూటర్ మీద ఇద్దరూ వెళ్లి వచ్చారు. ఏమీ లేదు ఆనంద్ ఇంజెక్షన్ ఇచ్చాను రాత్రికి మా ఇంట్లోనే కింది ఫ్లోర్ లో వుండండి పొద్దున్నే వెళ్ళండి అంది. థాంక్స్ చెప్పి వచ్చాను. అంతలా ఆత్మీయుల్లా చూసిన డాక్టర్ తను.. ఎంతగానో రుణపడి  వున్నాం. ఆ తర్వాత సర్క్యులేజ్ చేసారావిడ. డెలివరీకి వరంగల్ వెళ్తారు కనుక జాగ్రత్తలెన్నో చెప్పింది.

ఇక మరో వైపు ఫిలిం సొసైటీ లో ఆ ఏడు కూడా చాలా సినిమాలే వేసాము. ఎన్నో ఫారిన్ సినిమాలకు తోడు హిందీ సినిమాల విషయానికి వస్తే ‘దో ఆన్ఖే బారా హాత్’, ’పరిచయ్’, ‘కొట్నిస్ కి అమర్ కహానీ’ లాంటి సినిమాలు వేసినట్టు గుర్తు.

మరో పక్క ఈనాడు కోసం బీ.ఎస్.నారాయణ, నేరెళ్ళ వేణు మాధవ్, చిత్రకారుడు పీటీ రెడ్డి తదితరుల ఎందరి గురించో ప్రోఫైల్స్ రాసాను, ఇంటర్వ్యు లు చేసాను. అప్పుడే శ్రీమతి గునోత్తమ గారు పరిచయం అయ్యారు. వారి కూతురు విష్ణువందన అప్పుడప్పుడే నాట్యం నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇచ్చేది. అట్లా ఒక కొత్త కళాత్మక కుటుంబంతో కలిగిన పరిచయం ఇప్పటికీ కొనసాగుతున్నది.

అప్పుడే జిల్లా కలెక్టర్ గా వున్న శ్రీ ఐ.వీ.సుబ్బారావు చొరవతో జిల్లాలో అనేక కార్యక్రమాలు  జరిగాయి. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల తాను ఎంతో చొరవ చూపించే వారు. వారి శ్రీమతి కూడా. ఐ.వీ.సుబ్బారావు కరీంనగర్ లో ప్రధానంగా త్యాగరాజ లలిత కళా పరిషత్, కరీంనగర్ ఫిలిం సొసైటీ లాంటి పలు సంస్థలకు ఎంతగానో ప్రోత్సాహాన్నిచ్చారు.

1988 సంవత్సరానికి గాను కరీంనగర్ జిల్లాకు చెందిన గొప్ప కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి భారత ప్రభుత్వం ‘జ్ఞానపీఠ పురస్కారం’ ప్రకటించింది. జిల్లాకు చెందిన కవికి అంత గొప్ప గొరవం లభించడంతో జిల్లా అంతా పండుగ వాతావరణం ఏర్పడింది. అంతకు ముందు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసిన విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అదొక జ్ఞాపకంగా వున్న జిల్లాకు ఏకంగా జిల్లా వాసి డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికే అత్యన్నత పురస్కారం రావడంతో పులకించి పోయింది. జిల్లాకు చెందిన అనేక మంది సాహితీ వేత్తలు, తెలుగు అధ్యాపకులు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి డైరక్ట్ స్టూడెంట్స్ వున్నారు. దాంతో ఆ సందర్భంగా డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి ఘనంగా సన్మానం చేయాలని తలపోశారు. అందరం కలిసి కలెక్టర్ ను కలవాలని నిశ్చయించుకున్నాం. ఆ టీములో నేను, ఎన్.శ్రీనివాస్, డాక్టర్ గోపు లింగా రెడ్డి, డాక్టర్ బి.దామోదర్ రావు, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు తదితరులం వున్నాం. వెళ్లి కలిసి విషయం చెప్పాం. సుబ్బారావు గారు అత్యంత వేగంగా సకారాత్మకంగా స్పందించారు. అయితే కేవలం ఘన సత్కారం వల్ల ఎమీ జరగదు. ఆ ఒక్క రోజు ఉత్సవంతో పెద్ద ఉపయోగం లేదు. ఏదయినా శాశ్వతంగా వుండేది చేయాలి… ఆలోచించండి అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏదయినా పురస్కారం పెడితే ఎట్లా వుంటుంది అనగానే చాలా బాగుంటుంది. దాని కోసం ఒక సంస్థ కొంత శాశ్వత నిధి పోగు చేయండి నా వంతు సహకరిస్తానన్నారు. ఇంకేముంది ‘సాహితీ గౌతమి’ పేర సంస్థ ఏర్పాటయింది. అది కేవలం సంస్థలాగా కాకుండా జిల్లా లోని అన్ని (దాదాపు 30)సంస్థల సమాఖ్యగా వుండాలి అనుకున్నాం. పురస్కార నిర్వహణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. శాసన మండలి సభ్యులు గీట్లజనార్దన రెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారు. నిధులు సమకూర్చేందుకు కరీంనగర్ కు చెందిన ప్రముఖ న్యాయవాదులు లక్ష్మా రెడ్డి, ఎడవల్లి జగ్గారెడ్డి, మానసిక వైద్యులు డాక్టర్ భాగ్యా రెడ్డి, డాక్టర్ బాలస్వామి, ఇట్లా మరెందరో ముందుండి నిధుల్ని సమీకరించారు. నాకు తెల్సి ఆ రోజుల్లో సుమారు 60 వెల పైచిలుకు నిధి సమీకరించారు. నిర్దేశించుకున్న లక్ష సమకూర లేదు. కానీ అవార్డును ఇవ్వాలని ప్రకటించారు. మొదటి అవార్డు కోసం డాక్టర్ ఎన్.గోపి రాసిన “చిత్రదీపాలు” ఎంపిక అయింది. అవార్డు కార్యకమం ఘనంగా జరిగింది. అప్పుడు సాహితీ గౌతమి లో ప్రధాన భూమికల్ని డాక్టర్ గోపు లింగారెడ్డి, డాక్టర్ బి.దామోదర్ రావు లు నిర్వహించారు. నేనూ, శ్రీనివాస్ సంస్థలోనూ, సంస్థకు తోడుగానూ వున్నాం. ఇక రెండవ సంవత్సరం వచ్చేసరికి కలెక్టర్ సుబ్బారావుకు బదిలీ అయింది. ఆయన స్థానంలో శ్రీ భన్వర్ లాల్ కలెక్టర్ గా వచ్చారు. తెలుగు వాడు కాకున్నా బాగా మాట్లాడేవాడు. సాహితీ సంస్కృతుల పట్లా ఎంతో ఆసక్తి  కలిగిన వాడు. ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉండగానే సాహితీ గౌతమి రెండవ సినారె కవితా పురస్కారాన్ని దేవిప్రియ ‘నీటి పుట్ట’ కు ప్రధానం చేసారు. ఆ అవార్డు కార్యక్రమంలోనే ‘దుమారం’ పేర ఒక కరపత్రం వెలువడింది. ఈ అవార్డులు వాటి ఎంపిక తీరును విమర్శిస్తూ వచ్చిన ఆ కరపత్రం చారిత్రాత్మక మయింది. అయితే చాల చిత్రంగా ఆ తర్వాత దాన్ని ఎవరూ తామే వేశామని ప్రకటించు కోలేదు. అయినా అంతా బహిరంగ రహస్యమే. ఇవ్వాళ నేను పేర్లు చెబితే వివాదం అవుతుంది. అందుకే నేనూ చెప్పడం లేదు. అది రాసిన వాడికి ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వచ్చింది అది అసలు ఐరనీ.

    జిల్లా కలెక్టర్ గా భన్వర్ లాల్ గారు చేరిన తర్వాత జిలాలో అనేక కార్యక్రమాలు చెపట్టారు. ‘స్కౌట్స్ జంబోరే’ అత్యంత ఘనంగా నిర్వహించారు. దానికి ఆనాటి రాష్ట్రముఖ్య మంత్రి శ్రీ ఎన్.జనార్ధన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పీకర్ శ్రీపాదరావు అధ్యక్షత వహించారు. నేనూ ముఖ్యమయిన బాధ్యతనే స్వీకరించాను. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసల్నీ అందుకున్నాను. తరవాత జిల్లాలో  జిల్లాకలెక్టర్ భాన్వర్ లాల్  నేతృత్వంలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం చేపట్టారు. ‘అక్షర ఉజ్వల’  అని పేరు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారిగా ఎంతో కృషి జరిగింది. ‘అక్షర ఉజ్వల’ పేర పత్రిక తెచ్చాం. దాని సంపాదక వర్గంలో నేనూ ముఖ్య పాత్రనే పోషించాను.

మిగతా వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.  

-వారాల ఆనంద్

28 ఆగస్ట్ 2022               

ఎదనిండా ‘తడి’ ++వారాల ఆనంద్

Posted on Updated on

ఎదనిండా ‘తడి’
++++++++++++++++ వారాల ఆనంద్

తెలంగాణా మాటంటే ఎంత పావురం
వింటే చెవులల్ల అమృతం బోసినట్టుంటది

పలకరిస్తే ప్రేమ ఒలక బోసినట్టుంటది
పిలిస్తే మత్తడి దుమికినట్టుంటది

ఎంత ఆత్మగల్లదీ భాష

అవ్వ అంటే తొవ్వ జూపిస్తది
అయ్య అంటే వేలుబట్టుకు నడిపిస్తది

వాకిట్లోంచి ఎవరయినా కేకేస్తే
కిటికీ రెక్కలు బార్లా దెరిచి
చల్ల గాలి లోనికొచ్చి ప్రేమతో
పెయ్యంతా తడిమినట్టయితది

పాణంగా ముచ్చట బెడితే
పండగ జేసినట్టుంటది

కష్టాల్ని దల్సుకుంట ఎక్కిళ్ళు పడితే
కడుపులోంచి దుఖం తన్నుకొస్తది

ఏమి భాషిది
మనసుకు అద్దం పడుతది
మనుషుల నడుమ వంతెన కడుతది

దీంట్ల దొరగాడి రాజసముంది
కూలోడి చెమట చుక్కల మెరుపుంది

ఏ బస్సులోనో రైలులోనో గాలి మోటర్లోనో
ఏ ముఖం తెలీని వాడి నోటయినా
తెలంగాణా మాట వింటే చాలు
మావాడనిపిస్తది మావూరోడనిపిస్తది

కానీ ఉద్యమంలో ఆధిపత్యాన్ని వూడ్చేసిన
మా చీపుర్లు
ఇవ్వాళ మూలకు కూలబడ్డాయి
మీన మేషాలు లెక్కబెడుతున్నాయి
నీళ్ళలాంటి మాటల్ని రసాయన ద్రవాల్లో మరగబెడుతున్నాయి
పాత రాగంతో కొత్త గానం అందుకుంటున్నాయి

అయినా
నాకెందుకో ఈ భాషంటే
ఎద నిండా తడి
అది రాసే వాళ్ళంటే
ఎంతో చెప్పలెంత ‘ఇది’
*************

51= యాదొంకీ బారాత్

Posted on

51= యాదొంకీ బారాత్

***************

ముగింపులేని ముసురుండదు-తెరిపి దొరకని కష్టముండదు

++++++++++++++++++++++++++++++++

“అలలు అలలుగా

దశలు దశలుగా

సాగుతున్న బతుకులో

ఏ కాలపు సౌందర్యం ఆ కాలానిదే

ఎప్పటి అవసరం అప్పటిదే..”

అందుకే బతుకులో ఒక కాలం మంచిది మరొకటి చెడ్డది అంటూ వుండదు. కాలం ప్రవాహంలా సాగుతూనే వుంటుంది. మనమే ఓ క్షణం నిలబడతాం, మరో క్షణం పరుగెడుతాం.. ఇంకోసారి కూలబడతాం. తిరిగి లేస్తాం. జీవితమంటే ఇంతే మరి. ఆ దిశలో 1986 సంవత్సరం నాకు సంతోషాన్నీ వేదననీ కలగలిపి ఇచ్చింది. రోజూ గోదావరిఖనికి కాలేజీకి వెళ్లి వస్తూ వుండేవాన్ని. అక్కడి స్నేహాలు సహోద్యోగులూ ఒక భాగం. ఇటు కరీంనగర్ లో కరీంనగర్ ఫిలిం సొసైటీ సినిమాలూ కార్యక్రమాలూ. ఇంట్లో చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ, అమ్మ అనారోగ్యం అన్నీ అంతా వొత్తిడి గా తీరిక లేకుండా వుండేది.

కఫిసో లో ఆ సంవత్సరం చాలా సినిమాలే చూసాను. ముఖ్యంగా ఉమ్రావో జాన్, ప్యాసా, నవరంగ్ లాంటి క్లాసిక్స్ చూసాం. ఇంకా గోధూళి, సామ్నా, అందీగలీ లాంటి అనేక సినిమాల్నీ చూసాం. ఒక రకంగా గురుదత్ బాగా పట్టేసాడు. దామోదర్, నేనూ శ్రీనివాస్, సంతోష్, నారదాసు లాంటి మిత్రులం గురుదత్ తీసుకున్న కథాంశాలూ, చిత్రీకరణ పద్దతుల పై ఎన్నో సార్లు ఎంతో మాట్లాడుకున్నాం. ‘అందీగలీ’ మాకో పెద్ద చర్చనీయాంశ మయిన సినిమా అయిపొయింది. అప్పుడు ఎవరి వాదన ఎట్లా సాగిందో ఇప్పుడు చెప్పలేను కానీ ఆ సినిమాలు గొప్ప మేలుకొలుపు. అదే సంవత్సరం చాప్లిన్ ద గ్రేట్ డిక్టేటర్, సిటీ లైట్స్ కూడా చూసాం. లాంగ్ షాట్ లో హాస్యం- క్లోసప్ లో అంతులేని దుఖం. చాప్లిన్ లోని ఆత్మను ఆర్థం చేసుకున్న సందర్భం. వార్షికోత్సవాల్లో ప్రఖ్యాత రచయిత రావూరి భరద్వాజ చేసిన భావోద్వేగ ప్రసంగం చాలా కాలం పాటు చెవుల్లో గింగురు మంటూనే వుంది. ఆయన గంభీర స్వరం అనితర సాద్యం. అప్పటికే నేను ‘పాకుడు రాళ్ళు’ చదివి వున్నాను. తర్వాతి కాలంలో ఆయన ‘నాలోని నీవు’ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది.

సినిమాలు చూడడం కొనసాగుతూ ఉండగానే కవిత్వం కథలూ నవలలూ చదవడం కూడా జీవన గమనం లో భాగమయి పోయాయి. ఎందుకంటే సినిమాలూ సాహిత్యమూ వేర్వేరు కాదన్నది నాకు అప్పటికీ ఇప్పటికీ వున్న ధృడమయిన అభిప్రాయం. సీరియస్ సినిమాతో పాటు సీరియస్ సాహిత్యమూ అత్యంత ప్రభావవంతమయినదన్నది కూడా నాకున్న విశ్వాసం. సాహిత్యం రాయడం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా మంది చేస్తున్నారు, ఇక మంచి సమాంతర సినిమాల్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాల్సిన అవసరం వుందని అనుకున్నాను. ఆ బాధ్యతను తీసుకోవాలని కూడా అప్పుడే నిర్ణయించుకున్నాను. ఫలితంగానే ఫిలిం సొసైటీ ఉద్యమంలో పనిచేయాలని ముందుకు సాగాను. గొప్ప అర్థవంత మయిన సినిమాల్ని మనం చూడడమే కాకుండా ఎక్కువ మంది చూసి ఆలోచించే పని చేయాలన్నదే తపన. అంతే కాకుండా ముఖ్యంగా బాలలను చెత్త సినిమాల నుండి దూరం చేయాలని కూడా అనుకున్నాను. నాతో పాటు మిత్రులుకూడా. ‘బాలల చలన చిత్రోత్సవాలు’ నిర్వహించడం కూడా ఫిలిం సొసైటీ ఆక్టివిటీ లో ముఖ్యాంశం గా చేసుకున్నాం. ప్రతి నవంబర్ నెలలో కరీంనగర్ పట్టణంలోనే కాకుండా జిల్లాలోని పలు గ్రామాల్లో పిల్లల కోసం సినిమాలు వేశాము.

అదట్లా వుంటే సాహిత్యాధ్యయనంలో భాగంగా ‘స్వాతి’ మాస పత్రికలో నెల నెలా అనుబంధంగా వెలువడ్డ అనేక నవలల్ని చదవేవాణ్ని. ఆంపశయ్య నవీన్ రాసిన అనేక నవలలు స్వాతి లోనే చదివాం. ఇక 1986 మే నెలలో వెలువడ్డ ‘మరపురాని పాప’ నవల నాపైనా మా మిత్రుల పైనా గొప్ప ప్రభావాన్ని చూపించింది. సుజాత-నటరాజ్ లు రాసిన ఈ నవల వారి పాప సృజన వాహిని నైటింగేల్ జీవిత కథ. మృత్యువు చాలా క్రూరంగా ఆ పాప పసిడి మొగ్గలా ఉన్నప్పుడే కాటేసింది. విరిసీ విరియక ముందే ఆ పాపను నలిపెసింది. ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరించిన ఆ పాప అకాల మృత్యువు పాలవడంతో ఆ తల్లి దండ్రులు తల్లడిల్లి పోయారు. జీవితం శూన్యమయినంతగా దుఖపడ్డారు. కానీ అంతటితో ఆగకుండా ఆ పాప గురించి ఎలాంటి అతిశయోక్తులూ లేకుండా ఆర్ద్రంగా రాసిన నవల ఇది. ఆ నవల చదివి మేమంతా కదిలిపోయాం. కరిగిపోయాం. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో స్టేనోగ్రాఫ్రర్ గా పని చేసిన నటరాజ్, సుజాతలు తర్వాత ఏమయినా రాసారో లేదో తెలీదు. కానీ ‘మరపురాని పాప’ గొప్ప నవలగా మిగిలి పోయింది. ఇప్పటికీ ఆ నవల నా మదిలో స్థిరంగా ఉండిపోయింది.

….

ఇక ఇంట్లో ఇందిర తో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. 10 డిసెంబర్ న వరంగల్ లో పెళ్లి. మా అమ్మా నాన్నల కోరిక మేరకు సంప్రదాయకమయిన పెళ్లి. పెళ్లి పత్రికలూ అవీ ముద్రించ డానికి నేనే చొరవ తీసుకున్నాను. అప్పటికే హైదరాబాద్ చేరుకున్న అలిశెట్టి ప్రభాకర్ చిక్కడపల్లి లో ఉండేవాడు. ఆయన్ని కలిసాను. ప్రముఖ ఆర్టిస్ట్ గోపి తో పెళ్లి పత్రిక రాయించి ప్రింటింగ్ బ్లాక్ చేయించాను. కరీంనగర్ లో అప్పటికి ఆ వసతి లేదు. హాండ్ మెడ్ పేపర్ మీద ముద్రించడం కూడా గుర్తు. కొందరు మిత్రులు బాగుందన్నారు. మరికొందరు మౌనంగా వున్నారు. వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రికి దగ్గరలో జరిగిన పెళ్ళికి అనేకమంది బంధు మిత్రులు హాజరయ్యారు. ఫిలిం సొసైటీ నుంచి దాదాపు అంతా పాల్గొన్నారు. వరంగల్ లో వున్న సాహితీ మిత్రులు, లైబ్రరీ సైన్స్ మిత్రులు సంపత్ కుమార్, ఉమాశంకర్ లతో పాటు పీడీ మధు తదితరులు అనేక మంది సహోద్యోగులూ హాజరయ్యారు. ముఖ్యంగా వరంగల్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా వున్న అంపశయ్య నవీన్, కఫిసో అధ్యక్షుడు డీ.నరసింహా రావులు హాజరయ్యారు. వాళ్ళు మాకు కాలేజీలో అధ్యాపకులు కూడా. తర్వాత డీ.నరసింహా రావు గురించి మాట్లాడుతూ ఒకసారి నవీన్ చెప్పారు. తను నా పెళ్లికి వచ్చినప్పుడు ‘కరీంనగర్ లో ఇదే సమయానికి ఒక ప్రముఖుడి ఇంట్లో పెళ్లి వుంది కదా అక్కడే ఉండకుండా వరంగల్ వచ్చావెం అని అడిగితే గొప్పవాళ్ళు పెద్ద వాళ్ళు అని కాదు మనలను కావాలనుకునే వాళ్ళ దగ్గరికి రావడం నాకిష్టం అన్నాడని. అదీ సార్ పెద్ద మనసు.

పెళ్లి విందు, అప్పగింతలూ అన్నీ ముగించుకున్నాక కరీంనగర్ కు వచ్చేసాం. తర్వాతి రోజు పెళ్లి రిసెప్షన్. మంకమ్మతోట ఇంట్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయమే నేను లేచి టీ తాగుతున్నాను. దామోదర్ వచ్చాడు. రా చాయ్ తాగుదాం అని పిలిచాను. లేదు నువ్వే బయటకురా అని పిలిచాడు. నా కర్థం కాలేదు. ఓ పక్కకు తీసుకెళ్ళాడు. మెల్లిగా గుస గుసగా చెప్పాడు. ‘రాత్రి నరసింహా రావు సార్ చనిపోయాడు’ అన్నాడు. నాకు పెద్ద షాక్.. నేనేమీ అడక్కుండానే రాత్రి సెయింట్ జాన్ స్కూలు వద్ద స్కూటర్ ప్రమాదంలో అక్కడికక్కడే పోయాడు. అందరమూ అక్కడికి వెళ్తున్నాం. అన్నాడు. నేనూ వస్తానన్నాను. నువ్వెట్లా వస్తావు. పెళ్లి బట్టలే ఇంకా తీయలేదు అన్నాడు. ఇంతలో నాన్న వచ్చి ఏమి జరిగింది అన్నాడు. దామోదర్ విషయం చెప్పి ఆనంద్ వస్తానంటున్నాడు నేను వద్దంటున్నాను అన్నాడు. ఇంట్లో అంతా కూడదన్నారు. ఏమీ చేయలేక కుమిలిపోయాను.

ఆ సాయంతం రిసెప్షన్ లో దాదాపు మామూలుగానే వుండే ప్రయతం చేసాను. కష్టంగా నవ్వుతూనే గడిపాను. పెళ్ళికి వచ్చిన వాళ్ళు రాలేక పోయిన వాళ్ళూ చాలా మంది వచ్చారు. సిరిసిల్ల నుండి రుద్ర రవి, ఫసి తదితర మిత్రులు, ఎం.లక్ష్మన్ రావు, నర్సయ్య బి.నారాయనరెడ్డి తదితరులు, గోదావరిఖని నుండి తిరుమంగల రావు లాంటి అనేక మంది హాజరయ్యారు. కఫిసో సభ్య్లులు చిన్ననాటి మిత్రులు అనేకమంది వచ్చారు. జీవగడ్డ విజయ కుమార్ వచ్చి అన్నా ఎవరికీ పూర్తి మూడ్ లేదన్నా అందరమూ అక్కడికి పోయి వస్తున్నాం అన్నాడు. ఒక్కసారిగా దుఖం పెల్లుబికింది. పక్కనే వున్నఇందిరకు కూడా తెలీకుండా జాగ్రత్త పడ్డాను. బంధు మిత్రుల మధ్య మా పెళ్లి రిసెప్షన్ బాగానే జరిగింది. ఆ పెళ్ళికి మా మిత్రబృందం దామోదర్, నారదాసు, పెండ్యాల సంతోష్, జే.మనోహర్ రావు తదితరులు కలిసి నాకో గోడ గడియారం బహుమతిగా ఇచ్చారు. మనోహర్ దాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్లో కొనుక్కుచ్చాడు.35 ఏళ్ల ఆతర్వాత ఇప్పటికీ కూడా మా ఇంటి హాల్లో గోడకు వేలాడుతూ నాకు సమయాన్ని సూచిస్తూనే వుంది.

తర్వాత 13 డిసెంబర్ రోజనుకుంటాను నాకు అంత్యంత ఇష్టమయిన సినీ నటి స్మితా పాటిల్ మరణించారు. భారతీయ నవ్య సినిమా ’భూమిక’గా నిలిచిన ఆమె మరణం నాకు వ్యక్తిగతంగా ఎదో కోల్పోయిన బావం మిగిల్చింది. వార్త విన్న ఇందిర చాలా బాధ పడింది. పెళ్లి అవగానే సార్ పోయారు ఇప్పుడు మీకిష్టమయిన స్మితాపాటిల్.. అంటూ తను బాధ పడుతూ వుంటే జీవితం అంటే ఇదే అన్నాను.

‘సహచరులు కొందరు

ఇష్టమయిన వారు

తొందరపడి సెలవు తీసుకుంటారు’ తప్పదు మరి అన్నాను.

స్మితాపాటిల్ భారతీయ నవ్య సినిమాకు పర్యాయపదంలా కనిపిస్తుంది. తన పాత్ర పోషణ లో అండర్ ప్లే కానీ ఓవర్ ప్లే కానీ చేయలేదామె. ఆమె మృతి సమాంతర సినిమాకు ఆ సిన్మాల అభిమానులకూ తీరని లోటు గానే మిగిలిపోయింది.

ఇక డీ.నరసింహా రావు గారి దశ దిన కర్మ రోజు నాటికి ‘జీవగడ్డ’ దిన పత్రికలో “ మమ్మల్ని క్షమించు డీ ఎన్” అని ఒక నివాళి వ్యాసం రాసాను. పెళ్లి బట్టలతో వుండి నేనూ గుజరాత్ లో వుంది ఎన్.శ్రీనివాస్, వూర్లో లేని గోపు లింగారెడ్డిలము మీ చివరి చూపునకూ నోచుకోలేదని రాసాను. చాలా వివరంగా రాసానుఆ వ్యాసం. కానీ జీవగడ్డ విజయ్ కుమార్ పేరు మిస్ అయింది. తనకు బాగా కోపం వచ్చింది. ఇదేమిటి ఇట్లా చేసావు అని నిలదీశాడు. నేను నిన్న పత్రిక అచ్చయ్యే సమయానికి లేను లేకుంటే వ్యాసం ఆపే వాడిని అని చిరు కోపంగానూ నవ్వుతూనే అన్నాడు. సారీ చెబితే పోనీలే అన్నాడు.

……

అట్లా నా పెళ్లితో కలిగిన సంతోషం ఒక వైపు, దగ్గరి వాళ్ళను కోల్పోయిన బాధ మరో వైపు వుండగా వైవాహిక జీవితం మొదలయింది. మధ్యతరగతి కుటుంబం.కొత్తగా పెళ్ళయి వచ్చిన అమ్మాయి. అప్పటికే ఇంటి పరిస్థితులకు అలవాటు పడ్డ తమ్ముళ్ళు చెల్లెళ్ళు. మరో వైపు అమ్మ అనారోగ్యం. చిత్ర విచిత్రంగా జీవితం శురూ అయింది.

“ఎప్పటికయినా

బయలు బయలుగాని మబ్బులుండవు

ముగింపులేని ముసురుండదు

తెరిపి దొరకని కష్టముండదు”

జీవితమంటే అంతే కదా.. కానీ అనేక సంఘటనలు.. సందర్భాలు కమ్ము కొచ్చాయి

మరిన్ని వివరాలతో మిగతా వచ్చేవారం కలుస్తాను..

-వారాల ఆనంద్

24 జూలై 2022

54= యాదోంకి బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

54= యాదోంకి బారాత్

++++++++++++++ వారాల ఆనంద్

నాకూ మీకూ

గాయాలకేం కొరత,

కనిపించేవి మానిపోతాయి

మనసు లోపలివి కొనసాగుతాయి తడి తడిగా

గాయాల్ని గేయాలుగా గున్ గునాయిస్తూ

తలెత్తుకు నడిస్తేనే

బతుకు ఢంకా బజాయిస్తుంది

******

ఎనభయవ దశకం చివరి మూడు నాలుగేళ్ళూ నేను కాళ్ళకూ మనసుకూ చక్రాలేసుకు తిరిగాను. పెళ్లి, అమ్మ అస్తమయం, ఇల్లు మారడం, మరో పక్క స్కూలు వీటి నడుమ పిల్లల కథలు రాయడం, మరో పక్క నా ప్రధాన ఇష్టమయిన ఫిలిమ్స్ అండ్ ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ. అంతా బిజీ బిజీ.

సినిమాల విషయానికి వస్తే హైదరాబాద్ లో 1986లో జరిగిన ఫిల్మోత్సవ్ నాలో గొప్ప ప్రేరణ కలిగించింది. మొత్తం ఫెస్టివల్లో పాల్గొని అన్ని సినిమాల్నీ చూడలేదు కానీ. చూసిన సినిమాలూ పాల్గొన్న మేరకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందా ఫెస్టివల్. అప్పుడు ఎన్.టీ.రామారావు గారు ముఖ్యమంత్రి. హైదరాబాద్లో తోలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కనుక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం 90 రోజుల్లో ‘తెలుగు లలిత కళా తోరణం’ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ప్రారంభోత్సవం అక్కడే చేసారు. అప్పుడు అదొక గొప్ప సందర్భం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డైరక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ వాళ్ళు ఈ అంతర్జాతీయ ఫెస్టివల్స్ రెండు రకాలుగా చేసే వారు. ఒక ఏడు INTERNATIONAL FILM FESTIVAL ని కాంపిటీటివ్ ఫెస్టివల్ గానూ, మరుసటి రోజు FILMOTSAV నాన్- కాంపిటీటివ్ ఫెస్టివల్ గా నిర్వహించేవారు.

కాంపిటీటివ్ ఫెస్టివల్ ను డిల్లీ లోనూ నాన్- కాంపిటీటివ్ ఫెస్టివల్ ను ఇతర నగరాల్లోనూ నిర్వహించేవారు. అట్లా 1986 లో హైదరాబాద్ లో ఫిల్మోత్సవ్ ఏర్పాటయింది. అదొక పెద్ద అంతర్జాతీయ సినిమా ఉత్సవం. ఈ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో 1978 నుంచి అనేక దేశాల ఉత్తమ చిత్రాలతో పాటు భారతీయ సినిమాల్లోంచి ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాల్ని కూడా ‘ఇండియన్ పానోరమా’ గా ప్రదర్శించడం ప్రారంభించారు. హైదరాబాద్ ఫిల్మోత్సవ్ సందర్భంగా సత్యజిత్ రే చాలా గొప్పగా చెప్పారు. This year filmotsav is being held in Hyderabad, which is the worthy venue being, I understand, a very film conscious city… అన్నారాయన. చాలా సంతోషం వేసింది. ఆ ఫెస్టివల్లో నాకు గుర్తున్నంతవరకు తెలుగులోంచి సింగీతం శ్రీనివాస రావు గారి ‘మయూరి’, మన్ మోహన్ దత్ తీసిన డాక్యుమెంటరీ ఫిలిం ‘కలంకారీ’ ప్రదర్శించారు. ఇక హైదరబాద్ లో తొలి ఫిలిం ఫెస్టివల్ కనుక తెలుగు పత్రికలూ బాగా హంగామా చేసాయి. సినిమా వాళ్ళ ఇంటర్వ్యు లు, కవరేజ్ బాగా ఇచ్చారు. దేవులపల్లి అమర్ లాంటి వాళ్ళు కూడా ఆక్టివ్ గా సినిమా రిపోర్టింగ్ చేసారు. అది నాకయితే గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. కరీంనగర్నుంచి నేనూ, నారదాసు లక్ష్మన్ రావు,నరేడ్ల శ్రీనివాస్ లము పాల్గొన్నట్టు గుర్తు. ఎవరికయినా ఒక ఉత్సవం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. విషయం మీద ఆసక్తి వుంటే వ్యక్తిగతంగా ముందుకు వెళ్లేందుకు తోడ్పడుతుంది. అది ఫిలిం ఫెస్టివల్ అయినా సాహితీ ఉత్సవమయినా కూడా. నా విషయంలో అదే జరిగింది. అప్పటికే ఫిలిం సొసైటీలు ఏర్పాటు చేయడం మంచి సినిమాల గురించి చదవడం చూడడం ఆసక్తిగా వున్న వాణ్ని హైదరాబాద్ ఫిల్మోత్సవ్ నాకు ఎంతో ఊపునిచ్చింది.

*******

అప్పటిదాకా స్క్రీన్ వెనకాల వున్న వాణ్ని 1988లో కఫిసో కార్యదర్శి బాధ్యతల్నితీసుకున్నాను. రేణికుంట రాములు అధ్యక్షుడు. కార్యవర్గం అంతా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అప్పుడు మా గౌరవాధ్యక్షుడు కలెక్టర్ శ్రీ టీ.ఎస్.అప్పారావు. కఫిసో అప్పటి దాకా ప్రతి సంవత్సరం నవంబర్లో బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా చేస్తూ వస్తున్నది. అప్పుడు ప్రతి నవంబర్ కరీంనగర్ లో బాలల సినిమా పండగ. అయితే నేను కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నంక ఒక ఆలోచన వచ్చింది. పల్లెల్లోని పిల్లల కోసం సినిమాలు చూపిస్తే ఎట్లా వుంటుంది అని. రాములు గారు ఉత్సాహం చూపించారు. నేను వెళ్లి కలెక్టర్ టీ.ఎస్.అప్పారావుని కలిసాను. నా ఆలోచన చెప్పాను. ఆయన ఎంతో ఉత్సాహం చూపించాడు. మరి నేనేం చేయాలి అన్నారు. CHLDREN FILM SOCIETY OF INDIA నుంచి 16mm prints తెప్పిస్తాను. పౌర సంబంధాల శాఖ నుంచి projector, operator లు కావాలి అన్నాను. సరే మరి మీ ప్రయాణాలు అన్నారాయన ఏముంది బస్ లో వెళ్తాం అన్నాను.. నొ నొ వాన్ అరేంజ్ చేస్తానన్నారు. నేను ఎగిరి గంతేసినట్టు ఫీలయ్యాను. మీరు ప్లాన్ చేసుకోండి. ఒక అప్లికేషన్ ఇవ్వండి అన్నారు. అప్పటికే దగ్గరున్న దరఖాస్తు ఆయనకిచ్చాను. ఇంకేముంది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా. అన్నీ ఏర్పాటు చేసారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి రండి సార్ అని అడిగాను. టీ.ఎస్.అప్పారావు గారు నవ్వి చూడండి ఆనంద్ ప్రతి సారి మేము ఉండాలని అనుకోవద్దు. మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మేమున్నట్టే అనుకోవాలి. పని జరగడం ప్రధానం కదా అన్నారు. చాలా సపోర్టివ్. ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే.

గ్రామీణ బాలల చలన చిత్ర్రోత్సవం ఫిలిం స్క్రీనింగ్ షెడ్యుల్ వెసాము. మొట్టమొదటి స్క్రీనింగ్ చొప్పదండి జవహర్ నవోదయ స్కూల్లో. అప్పుడక్కడ జనార్ధన రెడ్డి గారు ప్రిన్సిపాల్. గార్లపాటి తిరుపతి రెడ్డి, డీ.పీ.ఆర్.వొ. నరసింహా చారి, గోపు లింగా రెడ్డి, రాములు గారు నేనూ వెళ్లాం. ఫిలిం స్క్రీనింగ్ తర్వాత పిల్లలు ఊహించనంతగా స్పందించారు. సభ తర్వాత పిల్లలు మాట్లాడ్డం, భోజనాలూ అదొక అనుభవం. ఇంకేముంది ఆ రోజునుంచి ప్రతి సాయంత్రం డీపీఆర్వో వాన్, ప్రొజెక్టర్, ఆపరేటర్ శ్రీనివాస్, ఫిలింబాక్స్ నేనూ, రాములు సార్, కరీంనగర్ లో బయలు దేరేవాళ్ళం. ఏపీ ఆర్ వొ కృష్ణమూర్తి మాతో ఉండేవాడు. వారం పాటు సాగిందా ఫెస్టివల్. రెండవ రోజు మల్యాల దగ్గరి తాటిపల్లి. అక్కడ స్కూలు ప్రిన్సిపాల్ గా ఇంటర్ లో మా లెక్చరర్ శ్రీ పార్థసారధి గారు. ఇంకేముంది. నిబద్దత కలిగిన గొప్ప టీచర్. అట్లే మిగతా రోజుల్లో మల్లాపూర్, కొండాపూర్, పెంబట్ల లాంటి అనేక చోట్ల గ్రామీణ బాలల చిత్రోత్సవాలు జరిపాం. పిల్లల సంతోషం, పార్టిసిపేషన్ మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. అప్పటివరకు నా మొత్తం ఫిలిం సొసైటీ కారీర్ లో సంతోషాన్నీ తృప్తినీ ఇచ్చిన ఉత్సవం అది.

దాదాపుగా అదే సమయానికి అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ లో తన స్టూడియో శిల్పి ని తీసేసి హైదరాబాద్ వెళ్ళాడు. విద్యానగర్ లో స్టూడియో చిత్రలేఖ ప్రారంభించాడు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా తన దగ్గరకు వెళ్ళేది. ఆ క్రమంలో నువ్వు కవిత్వం రాయడం లేదు గదా మరి సినిమాల మీద రాయొచ్చు కదా అన్నాడు. డైరెక్టర్స్ పైన రాయాలి అన్నాను. పద పల్లకి ఆఫెస్సుకు వెళ్దాం అన్నాడు. అప్పటికే ‘పల్లకి’, ‘స్రవంతి’ వార పత్రికలు వస్తున్నాయి. ప్రభాకర్ వాటిల్లో కవిత్వం రాస్తున్నాడు. విక్రం సంపాదకుడు.

రాజ్భవన్ రోడ్డు లో వున్న పత్రికాఫీసుకు వెళ్లాం. విక్రం కి నన్ను వివరంగా పరిచయం చేసాడు ప్రభాకర్. నేను సమాంతర సినిమా డైరెక్టర్ల మీద వారం వారం రాస్తానన్నాను. విక్రం గారే “డైరెక్టర్స్ డైరీ” అని శీర్షికకు పేరు పెట్టారు. ఇంకేముంది సత్యజిత్ రే నుంచి మొదలు పెట్టి వారం వారం రాసాను. అదేకాలంలో హైదరాబాద్ ఫిలిం క్లబ్ కార్యదర్శి శ్రీ బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి గారితో సన్నిహితత్వం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా ఎదిగి దశాబ్దాలుగా పెరుగుతూనే వచ్చింది. తను దాదాపుగా జీవితాన్ని ఫిలిం క్లబ్ కార్యక్రామలకు, సమాంతర సినిమాలకు అంకితం చేసారు. అకుంటిత దీక్షతో పనులు చేస్తాడు. నిరంతర ఫిలిం సొసైటీ శ్రామికుడు అనొచ్చు ఆయన్ని. కరేస్పాన్దేన్స్ చేయడంలో కానీ క్లబ్ నిర్వహణలో కానీ ఆయన చూపే చొరవ వెచ్చించే సమయం నిజంగా అబ్బురపరుస్తుంది. తర్వాత ఫెడెరేషన్ లో కూడా అన్ని బాధ్యతల్నీ నిర్వహిస్తున్నాడు.

తనే ఆ ఏడు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ డిల్లీ లో జరుగనుంది వస్తారా అన్నాడు. నేనూ ఉత్సాహం చూపించాను. ప్రెస్ అక్రేడిటేశన్ తీసుకొండి అన్నాడు. నేను పల్లకి విక్రం గారిని అడిగాను. ఫారం నింపి పంపాము డిసెంబర్లో లెటర్ వచ్చింది రమ్మని పిలిచాడు విక్రం. నేను వెళ్లి కలెక్ట్ చేసుకుని. డిల్లీ ప్రయాణపు ఏర్పాట్లల్లో పడిపోయాను. ఈ లోగా ఒక రోజు నేనూ నందిగం కృష్ణా రావు మరో మిత్రుడూ ఉదయం ఆఫీసుకు వెళ్లాం. పతంజలి గారిని కలిసాం. అప్పటికే నేను పతంజలి భాష్యం చదివిన ఊపులో వున్నాను. నేను డిల్లీ ఫెస్టివల్ కు వెళ్తున్నాను అని చెప్పగానే మాకేమయినా రాయకూడదూ అన్నారు పతంజలి. అంతేకాదు మా ఆఫీసు నుంచి అల్లాని శ్రీధర్, ఫోటోగ్రాఫర్ రమేష్ వస్తారు అని చెప్పాడు. వాళ్ళది వాళ్ళు రాస్తారు మీది మీరు రాయండి. మాకు ఫాక్ష్ చేయండి అన్నారు పతంజలి. డిల్లీ బయలు దేరాను. సహచరి ఇందిర వరంగల్ లో వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో వుంటానంది. ఇందిర వాల్లక్కయ్య ఉష డిల్లీనుంచి తమకు కుర్చీలు తెమ్మంది. ఇంకా ఏవో డిమాండ్స్. నాకేమో కేవలం ఫెస్టివల్ సినిమాలు అంతే, డిల్లీలో జే.ఎన్ యు లో వున్న మిత్రుడు జే.మనోహర్ రావు దగ్గర వుండాలని ఆలోచన. బయలుదేరాక రైల్లో మంథనికి చెందిన రాకేశ్ పరిచయమయ్యాడు. మర్నాడు రాత్రికల్లా యునివర్సిటీ హాస్టల్కు చేరాను. నన్నుచూడగానే సంతోష పడ్డ మనోహర్ బట్టలు ఏమి తెచ్చుకున్నావు అన్నాడు ఎందుకు అన్నాను డిల్లీ జనవరి చలిలో ఈ మామూలు బట్టలతో ఉంటావా అని నవ్వి తన స్వెట్టర్ ఇచ్చాడు. ఉదయమే బయలుదేరి సిరిఫోర్ట్ చేరాను. అక్కడొక చిత్రం జరిగింది. నేను కౌంటర్ దగ్గరికి వెళ్లి లెటర్ చూపించి కార్ద్ ఇవ్వమని అడిగాను. కౌంటర్లో ఉన్న క్లర్క్ లెటర్ చూసి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని వుంది కదా అన్నాడు. అప్పుడు చూసాను పూర్తి లేఖను. తల తిరిగి పోయింది. నేను విక్రం అంతా చూసాం కానీ ఉత్సాహంలో గమనించలేదు. ఏం చేయడం. ప్రకాశ్ రెడ్డి ముందుకొచ్చాడు. ఎఫ్ ఎఫ్ ఎస్ ఐ నార్త్ రీజియన్ కార్యదర్శి యు.రాధాకృష్ణన్ ను కలిసి విషయం చెప్పాం. తాను డెలిగేట్ కార్డ్ అరేంజ్ చేసాడు. హమ్మయ్య అనుకున్నాం.

ఇంకేముంది సాయంత్రం ఫెస్టివల్ ప్రారంభోత్సవం. మంత్రి హెచ్.కే.ఎల్.భగత్ ముఖ్య అతిథి. షబానా అజ్మీ తదితరులు అతిథులు. లాంచనంగా ఫెస్టివల్ ప్రారంభం కాగానే షబానా మైకు దగ్గరికి వెళ్లి ‘సఫ్దర్ హాష్మి’ హత్యకు నిరసన తెలుపుతూ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదిక మీద నిరసన తెలిపేసరికి మొత్తం కలకలం రేగింది. మర్నాడు అన్ని పత్రికల్లో అదే ప్రధానాంశం. ఇక నేను సినిమాలు చూడడంలో మునిగి పోయాను. ప్రకాశ్ రెడ్డి గారు చెప్పారు ఇండియన్ పనోరమా సినిమాలు తర్వాత ఎప్పుడయినా చూడొచ్చు ఫారిన్ సినిమాల మీద దృష్టి పెట్టండి అన్నాడు. అట్లాగే చేసాను. ఆ ఏడూ కంట్రీ ఫోకస్ లో ‘చైనా’ సినిమాల్ని ఒక పాకేజీ గా వేసారు. ‘రెడ్ సోర్ఘం’ మొదలు దాదాపు అన్ని సినిమాలూ చూసాను.”సినిమా కోణం లోంచి చైనా” అన్న ఆర్టికల్ పంపిస్తే ఉదయం లో పతంజలి గారు చాలా వివరంగా ఫోటోలతో వేసారు. ఫెస్టివల్ అన్ని రోజులూ దర్శకులు ఎవరు కనిపిస్తే వాళ్ళతో పరిచయం చేసుకోవడం ఇంటర్వ్యు లాగా మాట్లాడ్డం దాన్ని ఉదయం కు ఫాక్ష్ చేయడం. సినిమాల గురించీ రాయడం. ఆ క్రమంలో అదూర్ గోపాల కృష్ణన్, అస్సాంకు చెందిన జానూ బరువా, సయీద్ అక్తర్ మీర్జా, బుద్దదేవ్ దాస్ గుప్తా లతో సహా ఎందరినో పలకరించాను. మాట్లాడాను. రాసాను. గరంహవా లాంటి సినిమాలు తీసిన ఎం.ఎస్.సత్యు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనతో మాట్లాడినప్పుడు విజయవాడ ఫిలిం సొసైటీ కిషోర్ కూడా నాతో వున్నాడు. ఇక ‘తాయీ సాయిబా’ సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న గిరీష్ కాసరవెల్లి తో సుదీర్ఘమయిన సంభాషణ చేసాను. దాన్ని కరీంనగర్ తిరిగి వచ్చిన తర్వాత ఆంద్రప్రభ కు పంపాను. అంజనేయ శాస్త్రి గారు ప్రత్యేకంగా ప్రచురించారు. డిల్లీలో ఇంకా ఇక్బాల్ మసూద్, సయీద్ అక్తర్ మీర్జా లను కూడా కలిసాను. ఇప్పుడన్నీ గుర్తు లేవు గానీ ఎంత గొప్ప అనుభవమో అది. ఈ విషయం లో ప్రకాష్ రెడ్డి గారికే ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

ఫెస్టివల్ జరుగుతున్న రోజుల్లో ఒక రాత్రి మనోహర్ అన్నాడు. ఏమిటి సినిమాలు రాతలు ఇవే పనులా రేపు సిరిఫోర్ట్ కు వేళ్ళకు. నీకు డిల్లీ చూపిస్తానన్నాడు. సరేనన్నాను. మర్నాడు రెడ్ ఫోర్ట్ మొదలు అన్నీ దగ్గరుండి చూపించాడు మనోహర్. అదొక మంచి జ్ఞాపకం. థాంక్ యు మనోహర్.

ఫెస్టివల్ ముగిసిన తర్వాత కుర్చీలు అవీ ఏవో షాపింగ్ చేసి గొప్ప ఆనందం తో బయలుదేరాను. కాజీపేట్ స్టేషన్లో దిగగానే టీ.సి.పట్టుకున్నాడు. ఓవర్ లగేజ్. ఫైన్ కట్టమంటాడు. నాకేమో జీబులు ఖాళీ. ఏం చేయాలి. బతిలాడాను. వాడు కొన్ని డబ్బులు ఇస్తే వదిలేస్తానన్నాడు. అట్లా నాకు దొరికాడు. అప్పుడే అటుగా వచ్చిన రైల్వే సీనియర్ అధికారిని కలిసి నేను పత్రికా రచయితను నన్ను డబ్బులు అడుగుతున్నాడు అన్నాను. ఉదయం లో వచ్చిన బై లైన్ ఆర్టికల్ చూపించాను. ఏముంది హల్ చల్ ఆఫీసర్ వాడిని తిట్టడం నన్ను మీరు వెళ్ళండి సార్ అనడం జరిగిపోయింది. హమ్మయ్య అనుకుంటూ నేను వరంగల్ కు ఆటోలో బయలుదేరాను. అట్లా ముగిసింది నా డిల్లీ ప్రయాణం.

డిల్లీ ఫిలిం ఫెస్టివల్ సినిమాకు సంబంధించి నాకు పెద్ద ఐ ఓపెనర్.

మిగతా వివరాలతో మళ్ళీ వారం..

-వారాల ఆనంద్

14-08-2022

14Ilaiah Jeeguru, Vedantasury Tirunagari and 12 others

53= యాదొంకి బారాత్

Posted on

++++++++ వారాల ఆనంద్

53= యాదొంకి బారాత్

++++++++ వారాల ఆనంద్

“జీవనరాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం”

*************

“బిందువు లాంటి ఈ ప్రపంచం

నిజానికి ఓ కన్నీటి బిందువు

నేనేమో సముద్రాన్ని కలగంటున్నాను” ఇదీ 1988 నాటి నా పరిస్థితి. అప్పటిదే కాదు ఇప్పటిదీ అదే పరిస్థితి. బహుశా నావొక్కడిదే కాదు చాలా మందిదీ అంతే అనుకుంటాను.

అంతే కాదు ఇవాళ

“చల్ల చిలికినట్టు బతుకును చిలుకుతూ వుంటే

శకలాలు శకలాలుగా అనుభవాలు తేలుతున్నాయి

ఘనీభవిస్తున్న ‘వెన్న’ గొప్ప తాత్వికతను సూచిస్తున్నది”

=======

అదంతా అట్లా ఉంచితే ఆ రోజులు నా జీవితంలో చిత్రమయిన దినాలు. ఒక వైపు స్వంత ఇల్లు వదిలి వావిలాలపల్లి లో కిరాయి ఇంట్లోకి మారాను. అదొక తీవ్రమయిన వేదన. కొత్త కాపురం. నిలదొక్కుకోవాలి. చుట్టాలెవరూ కన్నెత్తి చూసే స్థితి లేదు. నాన్నను దత్త తీసుకున్న నానమ్మ లక్ష్మమ్మ మాత్రం వచ్చి చూసి వెళ్ళింది. ఇక అంతా మిత్రబృందమే. సరిగ్గా అప్పుడే కరీంనగర్ ఫిలిం సొసైటీ సెక్రెటరీ గా బాధ్యతలు తీసుకున్నాను. మంచి సినిమాలు చూడడం, చూపించడం తో పాటు మరోవైపు నిరంతర సాహిత్య అధ్యయనం. అప్పటికే కొంత మంది మిత్రులం కలిసి ఏదయినా మంచి స్కూలు పెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టాం. అంతకు ముందు కరీంనగర్ మంకమ్మతోట లో నవోదయ పేర ఒక స్కూలును గోపు లింగారెడ్డి తదితరులు నిర్వహిస్తున్నారు. దానికంటే ఇంకా విస్త్రుత స్థాయిలో ఏదయినా మంచి విలువలతో కూడిన స్కూలు పెట్టాలని ఆలోచన. దానికి గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అని పేరు పెట్టాం. డాక్టర్ కే.సత్యసాగర్ రావు(MBBS) ని అధ్యక్షుడిగా, నారదాసు లక్ష్మణ రావు(MA,LLB)ను కార్యదర్శిగా, కోమటిరెడ్డి దామోదర్ రెడ్డి(BA)ని కొశాధికారిగానూ ఎన్నుకున్నాం, గోపు లింగా రెడ్డి(MA, M.Phil, Ph.D),డాక్టర్ పి.రాజన్న(B.V.Sc), ఉప్పల రామేశం(B.Com), ఎన్.అనూప్ రెడ్డి(B.Sc.,LLB), నేనూ సభ్యులుగా వున్నాం. కరీంనగర్ రెసిడెన్షియల్ స్కూల్ అని పేరు పెట్టాం.

స్కూలు అనుకున్నప్పుడు నేను రాసిన వాక్యం “జీవనరాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం”. అందుకే పిల్లలకు బాల్యం లోనే విద్యతో పాటు వారిలో కళాత్మక దృష్టి అలవర్చాలని, వారిలోని సృజనాత్మక ప్రతిభను వెలికి తీయాలని అన్నాను. నేనే కాదు అందరమూ అనుకున్నాం. ఆదే దిశలో స్కూలు నడపాలనీ తీర్మానించుకున్నాం. అదే దిశలో కొంత కాలం కొనసాగించాము కూడా.

మా అందరికీ ‘బాల్యమే మనిషికి తండ్రి లాంటిది అనే విశ్వాసం’ కూడా ఉండింది. గోదావరిఖని జూనియర్ కాలేజీ లో పని చేస్తున్న నేను అదే జీతం ఇక్కడ ఇస్తే బాధ్యతల్ని నిర్వహిస్తానని అన్నాను. అంతా సరే నన్నారు. నేను సెలవు పెట్టేసాను. పిల్లలు,విద్య సృజనాత్మకత విషయాల్లో అప్పుడు నన్ను మూడు పుస్తకాలు తీవ్రంగా ప్రభావితం చేసాయి.

ముఖ్యమయినది మొదటిది గిజుభాయ్ రాసిన ‘పగటి కల’.

ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమె. దానివల్ల తమకి జీతం వస్తుంది అనే పరిమిత స్థాయిలో ఆలోచించే ఉపాధ్యాయుల కళ్ళు తెరిపించే పుస్తకమది. ఎంతో ఆదర్శంగా, గొప్ప ప్రేరణనిచ్చే పుస్తకమది. టీచర్ అనేవాడు సంపూర్ణ వ్యక్తిత్వంతో దైర్యంతో, ఒక ప్రధాన ఆశయం కోసం జీవించాలనే తపనను పెంచే పుస్తకం ఈ ‘పగటి కల’. అంతేకాదు భవిషత్తు తరాలయిన బాలబాలికల్లో మనో వికాసాన్ని సృజనాత్మకతని ఎట్లా ప్రోది చేయవచ్చో చెప్పే పుస్తకమిది. దాన్ని నేను చదవడమే కాకుండా దామోదర్, గోపు లింగారెడ్డి లాంటి అందరు మిత్రుల చేతా చదివించాను అందరూ అంతే ప్రభావితం అయ్యారు. ఇక రెండో పుస్తకం “రైలుబడి” టెట్సుకో కురొయనాగి రాసారు. రైలు బడి ప్రపంచంలోని ప్రముఖ భాషలన్నింటిలోకి అనువదించబడిన టెట్సుకొ కురొయనాగి అద్భుత రచన. దాన్ని తెలుగులోకి ఈశ్వరి, ఎన్.వేణుగోపాల్ చేసారు. టోమో అనే బడి గురించి, దాన్ని స్థాపించి, నడిపిన సొసాకు కొబయాషి అనే వ్యక్తి గురించి ఈ పుస్తకం చెబుతుంది. రచయిత చిన్నప్పుడు అదే బడిలో చదువుకున్నాడు. ఎలాంటి కల్పిత సంఘటనలు లేకుండా నిజంగా జరిగిన వాటినే క్రోడీకరించి రాసారు. ఎంతో ప్రేరణాత్మకమయిన పుస్తకమిది. నన్ను ప్రభావితం చేసిన మూడవ పుస్తకం వి. సుహోమ్మీన్స్ స్కీ రాసిన “ పిల్లలకే నా హృదయం అంకితం”. అందులోని వాక్యాలు కొన్ని ఇప్పటికీ నా మదిలో నిలిచి పోయాయి. సరిగ్గా ఇవే వాక్యాలు కావు కానీ భావం ఇదే, “స్కూలు, ముఖ్యంగా ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడి సృజనాత్మక ప్రతిభకు, కృషికి దాఖలా”. విద్యార్థి భావి అభివృద్ధికి ప్రాథమిక స్కూలే ఆధారమనీ అని చెప్పిన పుస్తకమిది.

ఈ విషయాలన్నింటిని నమ్మి మేము స్కూలును తెలుగు మీడియంలో ఆరంభించాం. పూజ్యులు శ్రీ గార్లపాటి తిరుపతి రెడ్డి గారు ఉపాధ్యాయుల ఎంపిక లో వారిని చైతన్య పరచడం లో మాకు అండగా వున్నారు. ఇక స్కూలు ఆరంభానికి ముందే మేమంతా గుంటూరు విజయవాడల్లోని కొన్ని స్కూళ్ళు చూడాలనుకున్నాం. బయలు దేరి వెళ్లాం. మా స్కూలును ప్రారంభించడానికి ‘రవి కళాశాల’ సి.వి.ఎన్.ధన్ గారిని ఆహ్వానించాము. ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పేరెంట్స్ బాగానే స్పందించారు. కానీ తెలుగు మీడియం అనేసరికి కొంత వెనుకంజ. అడ్మిషన్లను ఫరవాలేదు అనిపించాయి. నేను విద్యావిషయాలు, సృజనాత్మక విషయాలు చూస్తే దామోదర్, లక్ష్మన్ రావు లు ఆర్థిక అంశాలు, బయటి కొనుగోళ్ళు పర్యవేక్షించారు. రామారావు అనే టీచర్ అధికారిక ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. దానికి కొంత ముందు మిత్రుడు జూకంటి జగన్నాథం కథ ‘వలస” కు ఆంద్ర జ్యోతి వార పత్రికలో బహుమతి వచ్చింది. చాలా గొప్ప కథ. సిరిసిల్లానుంచి భీవండి తదితర ప్రాంతాలకు వలస వెళ్ళే చేనేత కార్మికుల జీవితాలను ఆధారంచేసుకుని మొత్తం ప్రపంచీకరణ ప్రభావాల్ని ఆవిష్కరించిన కథ. ఆ కథ చదివి కరీంనగర్ నుండి బి.పద్మజ జూకంటికి ఉత్తరం రాసింది. జూకంటి ఆ విషయం నాకు చెప్పి వీలయితే ఒకసారి కలవాలి అన్నాడు. జ్యోతినగర్ లో వున్న వాళ్ళింటికి వెళ్లాం. పద్మజ విద్యాసాగర్ లు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. అట్లా నాకు ఆకుటుంబం తో స్నేహం కుదిరింది. స్కూలు ఆరంభించాక పద్మజ క్లాస్ మెట్ అయిన ఎం.సరస్వతిని టీచర్ ఉద్యోగానికి ఇంటర్వ్యు కి తీసుకొచ్చింది. ప్రతిభావంతురాలయిన సరస్వతి ఎంపికయి చేరింది. మొదట్లో మా స్కూలులో పి.ఎస్.కిషన్, చంద్రశేకర్లు పని చేసారు. తర్వాతి బాచ్ లో వొడ్నాల చంద్రమౌళి, పుల్లూరి జగదీశ్వర్ రావు, బెజ్జారపు రవీందర్, బెజ్జారపు వినోద్ కుమార్, ఆర్టిస్ట్ చారి, లేడీ ఉపాధ్యాయుల్లో నాకు గుర్తున్నంత వరకు అరుణ,జలజ, సునీత, ఇట్లా చాలానే వర్క్ చేసారు. ఎంతో బాధ్యతతో పనిచేసారు.

కరీంనగర్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యా విషయక సిలబస్ కు అదనంగా పిల్లలు రచనలు చేయడం పెయింటింగ్లు వేయడం, వేదికనెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం లాంటి వాటి పైన ఎక్కువ దృష్టి పెట్టాం. అందుకోసం ‘బాలసభ’ పేర ప్రతి వారం పిల్లలకోసం ఒక సభ నిర్వహించాం. దానికి అనేక మంది కవులు సాహితీవేత్తల్ని అతిథులుగా ఆహ్వానించాం. వారి సమక్షంలో పిల్లలు తమ రచనలు చదవడం ఉపన్యాసాలివ్వడం జరిగేది. అతిథులు ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇచ్చారు. కథలు కవిత్వం సృజనాత్మకథ పట్ల ఆసక్తి వున్న టీచర్ సరస్వతి మరియు వోడ్నాల చంద్రమౌళి ‘బాలసభ’ బాధ్యతల్ని నిర్వహించారు. ఇక పిల్లలు రాసిన రచనల్ని, వేసిన బొమ్మల్ని కలిపి ఒక గోడ పత్రిక నిర్వహించాలనుకున్నాను. ప్రముఖ కవి మిత్రుడు శ్రీ వఝల శివకుమార్ ఆ గోడ పత్రికకు “తొలకరి” అని పేరు పెట్టమని సూచించాడు. గొప్పగా అనిపించింది. మేమంతా పిల్లల్లో పిల్లలమయి, ఆట పాటల్లో కలిసి తిరిగాక ఓ రూపానికి వచ్చింది. 2 జనవరి 1988 శ్రీ శ్రీ జయంతి రోజున మొదటి గోడ పత్రికను మా అధ్యక్షుడు డాక్టర్ కే.సత్యసాగర్ రావు ఆవిష్కరించారు. మొదట కవితలు కథలు రాయాలి అనగానే పిల్లలంతా వెర్రి ముఖాలేసారు. చందమామ కథలు చదవడం తెలుసు కానీ రాయడం ఎట్లా అన్నారు పిల్లలు. కానీ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కొద్ది రోజుల్లోనే ఎంకి పాటలు పాడడం, శ్రీ శ్రీ కవితలు చదవడం వేమన పద్యాల్ని ఆలవోకగా అప్పగించడం చేస్తూ తమకు తోచింది రాయడం మొదలు పెట్టారు. వారిని నిరుత్సాహ పరచకుండా ప్రోత్సహిస్తూ వచ్చాం. పిల్లల రచనల్ని వారి దస్తూరి తోనూ, వారు గీసిన బొమ్మల్ని యధాతతంగానూ కలిపి తొలకరి రూపొందించాము. ఈ కృషిలో చారి, చంద్రమౌళి తదితరుల సహకారం మరువలేనిది. తొలకరి మొదటి సంచిక నుంచి బాలల్లో భావావేశాన్ని కలిగించామే తప్ప వారి రాతల్లో ఎప్పుడూ చేయి చేసుకోలేదు.“తొలకరి” గోడ పత్రికగా మొత్తం 27 సంచికలు వెలువరించాం. అందులోంచి ఎంపిక చేసిన రచనలతో కరీంనగర్ రెసిడెన్షియల్ స్కూల్ పక్షాన ‘తొలకరి” సంకలనంగా అచ్చులో తెచ్చాం. దానికి మంచి స్పందన వచ్చింది. ఆంద్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ ఎస్.కే.జాకీర్ గొప్ప అభిప్రాయం ఇట్లా రాసారు— అక్కడ బాల్యం చిరుగాలి సితారా సంగీతాన్ని విన్పిస్తోంది. ఏమీ ఎరుగని పూవులు సాహితీ సౌరభాల్ని వెదజల్లుతున్నాయి.అయిదారేడులు అక్షరాల మంటల్ని పుట్టిస్తున్నాయి.. అంటూ రాసాడు. ప్రతి పక్షం కురుస్తున్న ‘తొలకరి’లో చిగురించి పుష్పించి పరిమలిస్తున్న సాహితీ సుమాలివి అని కూడా అభినందనగా రాసారు. అట్లా పిల్లలు రాసిన రచనలతో ‘తొలకరి’ ఎంతో తృప్తిని ఇచ్చింది.

ఇంకా పిల్లల్ని తీసుకుని డిగ్రీ కాలేజీ ఆవరణ లో సృజనాత్మక పిక్ నిక్స్ ఏర్పాటు చేసాం. ఆ సమయం లోనే నేను అయిదారు బాలల కథలు రాసాను.’అనగనగ రాగ మతిశయిల్లుచుండు’, ‘ఎప్పటి పని అప్పుడే’, ‘కష్టే ఫలి’, ‘మనిషి చేసిన బొమ్మ’ తదితర కథలు ‘ఆంద్ర ప్రభ’ వార పత్రికలో అచ్చయ్యాయి. పిల్లల సృజనతో పాటు నా రచనలూ సాగాయి.

ఇదంతా జరుగుతుండగానే నాకు గోదావరికహని నుండి కరీంనగర్ కు పక్కనే వున్నా చొప్పదండి కాలేజీకి బదిలీ అయింది. మధ్యాహ్నం కాలేజీ కావడంతో ఉదయం స్కూలు పగలు కాలేజీ చూడసాగాను. ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ పెరిగాయి. సరిగ్గా అప్పుడే ఈనాడు వాళ్ళు సాంస్కృతిక అంశాలు రాయమన్నారు. నేను కొంచెం బిజీ అయ్యాను. ఇంతలో స్కూలు లాభనష్టాల విషయం చర్చకు వచ్చింది. ఒక ఉదాత్త లక్ష్యంతో నడుపుతున్నప్పుడు లాభాలు అంత త్వరగా రావు. రాలేదు కూడా. గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ లో బాగా చర్చలు జరిగాయి. స్కూలును బాగా మానేజ్ చేయగలిగాను కానీ సభ్యుల్ని చేయలేక పోయాను. తర్వాత నేను నిర్వహణ నుంచే కాకుండా మొత్తంగా అన్నీ మానేశాను. అట్లా ఆ చాప్టర్ ముగిసింది.

….

కానీ ఆ స్కూలులో నాతో పనిచేసిన టీచర్లు చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. అది నాకెంతో ఆనందం. వోడ్నాల చంద్రమౌళి జర్నలిస్టుగా ఈనాడు,టీ.వీ.9 లలలో పని చేసిఇప్పుడు v6 లో రాష్ట్ర స్థాయిలో సీనియర్ జర్నలిస్టుగా వున్నాడు. ఇక బెజ్జారపు రవీందర్ రచయితగానూ, జిల్లా స్థాయి అధికారిగావున్నాడు, పుల్లూరి జగదీశ్వర్ రావు పిల్లల కథా రచయితగానూ రెవెన్యు అధికారిగానూ పనిచేస్తున్నారు, ఎం.సరస్వతి మహిలాశిశు సంక్షేమ శాఖలో పీవో గా వున్నారు, పి.ఎస్.కిషన్ తూనికల శాఖ లో జిల్లా స్థాయి అధికారిగానూ చంద్ర శేకర్ ఎక్షైజ్ అధికారిగా పనిచేసారు. ఇక అప్పుడు నాదగ్గర చదివిన పిల్లలు చాలా మంది విదేశాలకు వెళ్ళారు, ఇంకెంతో మంది మంచివ్యాపారాల్లో స్థిరపడ్డారు.

….

ఇదంతా ఇట్లా ఉండగానే ఫిలిం సొసైటీ కార్యక్రమాల్లో నా కృషి కొనసాగుతూనేవచ్చింది. అదే సంవత్సరం వారం రోజులు గ్రామీణ బాలల చలన చిత్రోత్సవంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించాం.

మిగతా అన్ని వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

-వారాల ఆనంద్

7 ఆగస్ట్ 2022