LITERATURE

పైడి జయ రాజ్

Posted on

 

1b

 

వ్యాపారం లోనూ, వ్యవహారంలోనూ అందె వేసిన తెలుగు సినిమా రంగం ఆర్థిక మయిన విజయాల్ని మాత్రమే పరిగణన లోనికి తీసుకునే ఆ రంగం కళాత్మకతను అర్థవంతమయిన ధోరణిని ఎప్పుడో మర్చిపోయింది. అంతే కాదు ఒక ప్రాంతం నుండి ఎదిగి వచ్చిన వారిని నిర్లక్ష్యం చేయడం విస్మరించడంతెలుగు సినిమాకు పరిపాటిగా మారింది. అలా ఇప్పటికీ తెలుగు సినిమా రంగం స్మరించుకోని తెలంగాణా సినీ తేజం పైడి జైరాజ్. హిందీ సినిమా రంగం భూమికగా ఎదిగి దేశవ్యాప్తంగా పేరు గడించి 70ఏళ్ల పాటు సినిమా రంగంలో వెలుగొందిన గొప్ప నటుడాయన. 1931 ఆలం ఆరా తో భారతీయ సినిమా రంగం మాటలు నేర్వకముందే మూకీ యుగంలోనే భారతీయ సినిమా రంగంలో తన ముద్రను నిలిపిన పైడి జై రాజ్ తెలంగాణ వాడు కావడంతో నేటికీ తెలుగు సినిమా రంగం ఆయనను అంగీకరించడానికి ఆమోదించడానికీ సిద్దంగా లేక పోవడం తెలుగు సినిమా లోకంలోని డొల్ల తనాన్ని తెలియజేస్తున్నది. అత్యంత ప్రతిష్టాకరమయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను 1980 లోనే అందుకొని టవరింగ్ పర్సనాలిటీగా నిలిచిన జైరాజ్ నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమా రంగంలో కృషి చేసాడు. జైరాజ్ 11 మూకీ సినిమాల్లో, 156 టాకీ సినిమాల్లో హెరోగానూ ఇంకా అనేక సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టు గానూ నటించారు. దర్శకుడిగా 1945లో ప్రతిమ, 1951 లో సాగర్, 1959లో రాజ్ ఘర్ సినిమాలకు దర్శకత్వ భాద్యతలు కూడా నిర్వహించాడు.  నిర్మాతగా పి.జె.ఫిల్మ్ యూనిట్ బానర్ మీద నర్గీస్ కథానాయికగా సాగర్ సినిమాని నిర్మించాడు. హిందీ,ఉర్దు, గుజరాతీ,మరాఠీ భాషల్లో నటించిన జైరాజ్ ఉత్తర భారత దేశంలో ప్రసిద్ది పొందిన నటుడు. కేవలం సినిమానే కాకుండా ఆయన 1990 లో ‘ఖూన్ భారీ మాంగ్’  టీ వీ సీరియల్ లోకూడా నటించాడు.

తెలుగులో సుప్రసిద్ద నటుడు చిత్తోరు నాగయ్య తో కలిసి ఒక తెలుగు సినిమాను నిర్మించడానికి ప్రణాళికలు వేసుకున్న పైడి జైరాజ్ నాగయ్య మరణంతో ఆ ప్రాజెక్ట్ ను చేయలేక పోయానని చెపుకున్నారు.

ఏడు దశాబ్దాలపాటు సినీ రంగంలో వుంది మూడు తరాల నటీ నటుల్తోనూ మూకీ,టాకీ సినిమాలతో పాటు టీవీ ల్లో కూడా నటించి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన తెలంగాణ బిడ్డను తెలుగు సినిమా రంగం ఏనాడూ కనీసం స్మరించను కూడా లేదు. దానికి వాళ్ళు జైరాజ్ తెలుగు లో నటించలేదు కదా, బాంబే వెళ్లిపోయాడు కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. వాత్సవానికి ప్రముఖ తెలుగు నటుడు,నిర్మాత,దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ కూడా తన సినీ ప్రస్థానాన్ని బాంబేలోనే ప్రారంభించాడు మరి.

కానీ పైడి జైరాజ్ బాంబే వెళ్లడానికి గల నేపథ్యాన్ని తెలుగు సినిమా రంగం ఎప్పుడూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. తాను పుట్టిన కరీంనగర్, పెరిగిన హైదరబాద్ నిజాం రాజ్యం కావడం ఫలితంగా హిందీ ఉర్దూల్లో జైరాజ్ కు మంచి ప్రావీణ్యం, ప్రతిభ వుండడం ఆయన బొంబే వెళ్లడానికి ప్రధాన కారణం. అప్పటికి నైజాం ప్రాంతంలో బాంబే  సినిమాల ప్రభావం అమితంగా  వుండడం కూడా మరొక ప్రధాన  కారణంగా కనిపిస్తాయి. అంతేకాదు 1928లో తన 19వ ఏట జైరాజ్ బొంబే చేరుకున్నాడు. అప్పటికి తెలుగు సినిమా ఊపిరి తీసుకోలేదు. మూకీ సినిమాలకు మద్రాస్ కేంద్రంగా కనిపిస్తున్నప్పటికీ భక్తప్రహ్లాద వచ్చింతర్వాతగాని తెలుగు సినిమాకు ఉనికి గుర్తింపు కలుగలేదు.   మూకీ సినిమాల కాలంలో మొదట తమిళ్, తెలుగు, మలయాళం లల్లో దాదాపు సమాంతరంగా సినిమాలు వెలువడ్డాయి కానీ పైడి జైరాజ్కు అప్పటికే 1929లో మావరెర్కర్ అనే నిర్మాత తన సినిమాలో అవకాశం కలిగించాడు. అలా మొదలయిన జైరాజ్ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. 11 మూకీ సినిమాల్లో నటించిన జైరాజ్ మంచ్ శారీరక సౌష్టవం గంబీరమయిన మాట సరళి తో తొలి రోజుల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతీయ సినిమా రంగంలో మొట్టమొదటి సారి గుర్రం పై స్వారీ చేసి నటించిన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికి బాంబే లో పృథ్వీ రాజ్ కపూర్ లాంటి నటుల హవా వున్నప్పటికీ తెలంగాణ నుంచి వెళ్ళి తన స్థానాన్ని పదిల పర్చుకోవడమే కాకుండా అప్పటికె లబ్ద ప్రతిష్తులయిన అనేక మంది  నటీమణులతో హీరో గా నటించి నిలదొక్కుకున్నాడు జైరాజ్.   

        1931లో టాకీలు మొదలయిన కాలంలో నటీనటులు తమ పాటల్ని తామే పాడుకునే పద్దతి వుండేది కానీ జైరాజ్  స్వయంగా పాట పడుకోలేక పోవడం తో చాలా మంది మూకీ కాలపు నటులతో పాటు తొలుత కొంత ఇబందుల్ని ఎదుర్కొన్నాడు కానీ క్రమంగా నిలదొక్కుకున్నాడు. దానికి ఆయన స్పురద్రూపం, డయలాగ్ పలకడంలోని ప్రౌడత్వం ఉపయోగ పడ్డాయి.

       సుప్రసిద్ద కవి భారత కోకిల సరోజినీ నాయుడు భర్త గోవిందరాజులు నాయిడు కు మేనల్లుడు అవుతారు.జయ రాజ్ కు ఇద్దరు అన్నలు. ఒకరు సుందర్ రాజ్ నాయుడు, దీన్ దయాళ్ నాయుడు. సెప్టెంబర్ 28 1909 లో కరీంనగర్లో జన్మించిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1928 లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా ” స్పార్క్లింగ్ యూత్ ” అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో ” ట్రయంఫ్ ఆఫ్ లవ్ ” అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన ” షికారి ” ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి వాళ్ళు హీరోలుగా వెలుగుతున్న కాలంలో తాను కూడా పెద్ద హీరోగానే  పేరు తెచ్చుకున్నారు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణిమీనాకుమారి లాంటి హీరోయిన్ ల సరసన నటించారు.

    ‘మూకీ’ సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 ‘టాకీ’ సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హీరో పాత్రలతో పాటు అనేక వైవిధ్యమయిన పాత్రలు పోషించిన జైరాజ్ తాను మాత్రం దేశ నాయకుల పాత్రలు, చారిత్రక పాత్రలు ఎంతో ఉత్సాహాన్నీ సంతృప్తిని కలిగించాయని చెప్పుకున్నారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్పృథ్వీరాజ్ చౌహాన్రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. షాహిద్ ఏ ఆజమ్ లో ఆయన పోషించిన చంద్రశేఖర్ ఆజాద్ పాత్ర విలక్షణమయింది.

అలా భారతీయ సినీ రంగంలో కరీంనగర్ కు తెలంగాణకు విశిష్టమయిన స్థానాన్ని గుర్తింపును తెచ్చిన పైడి జై రాజ్ భార్య సావిత్రి పంజాబీ. వారి పెళ్లి ని పృథ్వీ రాజ్ కపూర్ తండ్రి జరిపించాడని చెబుతారు ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్ళు.

2000 సంవత్సరం ఆగస్ట్ 11న ఆయన పరమ పాడించారు. తెలంగాణ రాష్ట్రం తన నెల తల్లి బిడ్డ అయిన పైడి జైరాజ్ ను స్మరించుకుంటున్నది. ప్రభుత్వం కూడా ఆయన పేర జాతీయ స్థాయిలో అవార్డును నెలకొల్పేందుకు పూనుకున్నట్టు తెలిసి తెలంగాణా వాదులు తెలంగాణలో సినిమా అభివృధ్ధిని కాంక్షిస్తున్న వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.   

ఆగస్ట్ 11 ఆయన వర్ధంతి