Month: January 2021

రోజట్లా మొదలవుతుంది

Posted on

రోజట్లా మొదలవుతుంది

———-

రాత్రంతా నన్ను తన కౌగిట్లో కప్పెట్టిన

నిద్ర

తటాలున లేచి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతుంది

అయిష్టంగానో అనివార్యంగానో

కళ్ళు నులుముకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ  

లేచి నిలబడాల్సిందే

ఆరోగ్యం కోసమో ఆహ్లాదం కోసమో

మైదానంలోనో మట్టిరోడ్డు మీదో

కాళ్ళు కదపాల్సిందే

మన్నాడే నో, జగ్జిత్ సింగ్ నో  

చెవులకు తగిలించుకుని

‘ మై జిందగీక సాత్ నిభాతా చాలా గయా…’

అంటూ వాకింగ్ ట్రాక్ ఎక్కాల్సిందే

అక్కడ వాడి మమ్మీకి తోడొచ్చిన ఓ మూడేళ్ళ పిల్లాడు

పరుగెడుతూ అందంగా నా వైపు చెయ్యూపుతాడు

వాడి కళ్ళల్లోని మెరుపులూ

కాళ్ళలోని అశ్వనీ నాచప్పలూ

నవ్వుల్లో విచ్చుకున్న అమాయకత్వపు నజరానాలూ

నాలోకి బదిలీ అవుతాయి

పట్నంలో వున్న మనుమడు గుర్తొస్తాడు

‘ఓ కాగజ్ కి కత్లీ బారిష్ క పానీ … అంటూ చెవుల్లో

జగ్జిత్ సింగ్ బాల్యం గురించి పడుతూ ఉంటాడు

తూర్పున పొద్దు పొడుస్తూ వుంటుంది

నా రోజట్లా మొదలవుతుంది

================= 29-1-2021

ఇరుగు పొరుగు

Posted on Updated on

కాలం ఎగిరిపోదు 
———————
ఎగిరిపోయేది కాలం కాదు 
మనుషులు సమస్త జీవజాలమే ఎగిరిపోతుంది

నల్లటి కోటు తొడుక్కున్న మేఘం 
రూప చిత్రం లా కూర్చున్న నాన్నకు
వీడ్కోలు చెబుతూ ఎగిరిపోతుంది

నాన్న తల ఇంటి ముందున్న 
వరండా గోడను అసరాచేసుకుంటుంది 
మరుసటి రోజు 
ఆయన వెనుతిరిగి 
అస్తమిస్తున్న సూర్యునితో పాటు 
ఎగిరిపోయి క్షితిజం లో చేరిపోయాడు

రోదిస్తున్న వృక్షానికి వీడ్కోలు చెబుతూ 
ఆకులు రాలిపోతాయి

కట్టెలు కొట్టేవాడొచ్చి 
చెట్టును నరికేస్తాడు 
తాను పుట్టి పెరిగి నిలబడ్డ నేలకు 
వీడ్కోలు చెబుతూ చెట్టు నెలకు ఒరుగుతుంది

అకస్మాత్తుగా 
ఇల్లూ, నదులూ,అడవులూ, పొలాలూ, చిత్తడి నెలలూ 
బంధువులూ 
కాలం చిత్రించిన అనంతమయిన చిత్రాలూ 
నిశీధిలోకి కదిలిపోవడం చూస్తాం 
——————– 
ఒరియా మూలం ఇంగ్లిష్ అనువాదం: సీతాకాంత్ మహాపాత్ర 
తెలుగు: వారాల ఆనంద్

https://telugu.asianetnews.com/literature/irugu-porugu-seethakantn-mahapatra-oria-poem-in-telugu-qnmzz6

అందుకున్నాను “సమ్మెట ఉమా దేవి కథలు”, జమ్మి పూలు’

Posted on

కొన్ని వారాల క్రితం మిత్రులు రచయిత్రి సమ్మెట ఉమా దేవి గారి నుండి ఓ సందేశం వచ్చింది. మీ పోస్టల్ అడ్రస్ పంపండి అని. వాట్స్ అప్ లో ఎందుకని ఎస్ ఎం ఎస్ చేసాను. కొన్ని రోజులకు మళ్ళీ ‘మిమ్మల్ని చిరునామా అడిగాను పంపలేదు’ అని నిష్టూరంగా మరో ఆదేశం. పంపానండి అంటూ వాట్స్ అప్ లో మళ్ళీ పంపాను. రెండు మూడు రోజుల్లో ‘సమ్మెట ఉమా దేవి కథలు’, జమ్మి పూలు’ రెండు పుస్తకాలు వచ్చాయి చాలా సంతోషం కలిగింది. ఉమా దేవి గారు మంఛి ఉపాధ్యాయులు,రచయిత్రి. నా చిరకాల మిత్రులు నా కవితల అనువాదకురాలు బొడ్ల అనురాధ కు తను అత్యంత ఆత్మీయులు. ఎంతగా అంటే ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మా ఉమ అంటా రావిడ. కానీ ఆవిడకే కాదు తెలుగు కథలు సాహిత్యం తెలిసిన వారందరికీ సమ్మెట ఉమాదేవిగారు ‘మా ఉమ’ నే. ఆమె రాసిన రెండు కథల పుస్తకాలు ఒకేసారి అందుకుని చదివే అవకాశం రావడం సంతోషం కలిగించింది. తనకు ధన్యవాదాలు. తను రెండు కాపీలు పంపితే ఒక సెట్ను రచయిత మంచి చదువరి శ్రీ పుల్లూరి జగదీశ్వర్ రావుకు అందజేశాను.============================ అనగనగా ఒక రాజు, పున్యకోటి ఆవు కథ, చందమామ కథలు, అమ్మో అమ్మమ్మో, నానమ్మో చెప్పిన కథలు వినకుండా బహుశా ఎవరి బాల్యమూ గడవదేమో.. అంటే మనిషి జీవితంలో కథలు అంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి, అంతే కాదు ఒరేయ్ కథలు చెప్పకు లాంటి మాటలు సదా వింటూనే వుంటాం.. కథలు చెప్పడం వినడం జీవితంలో అంతర్భాగం. చదివే వాళ్లకు రాసేవాల్లకే కాదు మనుషులు అందరికీ కూడా. సమ్మెట ఉమాదేవి గారి పుస్తకాలు చదువుతూ వుంటే ఎప్పుడో 1976-77 ప్రాంతంలో పురాణం రామచంద్ర గారి ‘చిత్రిక’ లో నేను రాసిన మొదటి కథ తర్వాత ప్రభలో, జ్యోతి లో,విపుల లో రాసిన అనేక కథలు గుర్తొచ్చాయి. అదో మంచి మెమరీ. అంతేకాదు కథ అనగానే వల్లంపాటి గారి కథా శిల్పం, అనేక మంది గొప్ప కథకులు రాసిన కథలు మదిలో మెదుల్తూ వున్నాయి. అవట్లా వుంచి సమ్మెట ఉమా దేవి కథల విషయానికి వస్తాను.———————– సమ్మెట ఉమా దేవి గారు టీచర్ గా తన ఉద్యోగకాలమంతా పట్టణాలకు దూరంగా కొండ కోనల్లో, తండాల్లో పనిచేసారు స్వచ్చమయిన అమాయకపు పిల్లల మధ్య గడిపారు. అడవులు, పూలు రెమ్మలు, పిల్లలు ఆమెను రచయిత్రిగా సజీవంగా వుంచాయి. DOWN TO EARTH గా నిలిపాయి. ఆమె చూసిన జీవితాలు, వూర్లు ఆమెకు కథా వస్తువులయ్యాయి. అందుకే ఆమె కథల్లో మనుషులు కనిపిస్తారు, వారి సామాజిక సంఘర్షణ కనిపిస్తుంది. మానవత్వం తొంగి చూస్తుంది. వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు సమ్మెట ఉమా దేవి జమ్మిపూలు కథల్ని తెలంగాణా కథలు, తెలంగాణా తెలుగు మాండలికాలు, యాసా పలికిన కథలు అన్నారు. కాని ఈ కథలు ఒక ప్రాంతపు మనుషుల భాషలో పలికినా అవన్నీ ఆత్మగల మనుషుల వెతలు, కథలు. “ఏ కళారూపమయినా ఎంతగా ప్రాంతీయ మయితే అంత స్వచ్చంగా ఉంటుందాని” నేనకుంటాను, అందుకే ఉమా దేవి కథలు స్వచ్చంగానూ విశ్వజనీనంగానూ వున్నాయి. నెల్లుట్ల ఉమా దేవి గారన్నట్టు సమ్మెట ఉమా దేవి కథలు గుండెను తాకి పట్టేసి ఊపిరాడ నీయకుండా చేస్తాయి. ఆలోచింప జేస్తాయి. ఆమె కథల్లో వర్ణన ప్రధానంగా కనిపిస్తుంది. కథనం వ్యవహారికంలో నడిచినప్పటికీ పాత్రలు మాత్రం తమ సొంత భాషలో సొంత గొంతులో మాట్లాడడంతో కథల నిండా జీవం కనిపిస్తుంది, ధ్వనిస్తుంది. సమ్మెట ఉమా దేవి గారి ‘కథలు’ సంకలనం లో ‘తడి’ నుంచి ‘ప్రవాహం’ దాక 14 కథలు, జమ్మి పూలు సంకలం లో ‘ద్యాలి’,’గంసీ’,’దశ్మీ’,లాంటి 15 కథలున్నాయి. సమ్మెట ఉమాదేవి ఇవే కాకుండా రేల పూలు, అమ్మ కథలు రాసారు. ఇంకా పిల్లల సాహిత్యంలో భాగంగా మా పిల్లల ముచ్చట్లు, పిల్లల దండు, అల్లరి కావ్య, పిల్లల ముసుగు, నిజాయితీ లాంటి రచనలు వెలువరించారు. ————————- ఇట్లా మంచి వచనం, కథనం, పాత్ర చిత్రణ కలిగిన కథలు రాసిన సమ్మెట ఉమా దేవి మంచి స్వరం కలిగిన రేడియో ప్రయోక్త కూడా. నిరంతరం పిల్లలు, రచనలతో గడిపే సమ్మెట ఉమా దేవి కథలు రెండు సంకలనాలుగా ఒకే సారి చదివే అవకాశం కలిగినందుకు ఆనందంగా వుంది. ఆ అవకాశం కలిగించిన తనకు కృతజ్ఞతలు. ఇప్పటికే తన కథలకు ఎన్నో అవార్డులు అందుకున్న ‘మా ఉమ’ మరిన్ని మంచి కథలు రాయాలని మనసారా కోరుకుంటున్నాను. -ఆనంద్ వారాల

అందుకున్నాను SINGING IN THE DARK

Posted on

అందుకున్నాను

==================

మిత్రులారా ,

రెండు వారాల క్రితం నాకిష్టమయిన కవి సచ్చిదానందన్ సహసంపాదకుడుగా వున్న SINGING IN THE DARK   ‘చీకటి కాలం లో గానం’  సంకలన వివరాలు ఆన్ లైన్ లో చూసి ఆర్డర్ చేసాను. ఆ గ్లోబల్ సంకలనాన్ని అందుకోగానే ప్రపంచం లో కవులు రచయితలూ అంతా దుఃఖ కాలంలో దాదాపుగా ఒకే గొంతుకతో ఎట్లా స్పందిస్తారో చూసి మనసంతా తడి తడి అయిపోయింది. కొందరి అనుభవాలు  వ్యక్తిగతమయినవి, మరి కొందరివి విన్నవి, చూసినవీ కావచ్చు కాని స్పందన మాత్రమే ఒకే స్థాయిలో వుండడం ఇంకా మనుషుల్లో కదిలే గుణం బతికే వుంది అనిపించింది. కే. సచ్చిదానందన్, నిశి చావ్లా ల సంయుక్త సంపాదకత్వంలో వచ్చిన ఈ 360 పేజీల సంకలనం కవిత్వపరంగా ఎంత గాఢంగా వుందో ప్రచురించిన తీరు కూడా అంత ఈస్తేతిక్ గా వుంది. అతి తక్కువ సమయంలో అనేక దేశాల కవుల కరోనా కాలపు కవితల్ని సేకరించి  కూర్చిన సంపాదకుల్ని మనసారా అభినందించాల్సిందే.

+++

ఏమి కాలమిది…

భయం పరిణామం చెంది

దుఖం గా రూపుదాల్చుతోంది

బతుకు వేదనై  రోదనై

స్మశానం వైపు చూస్తున్నది …

ఎన్నడూ ఊహించని అలాంటి కాలంలో ఎలాంటి అనుభవాల్ని చూసాం. లాక్ డౌన్, సాంఘిక దూరం, మాస్క్, సానిటైసర్ లాంటి అనేక కొత్త మాటల్ని విన్నాం. ఇంట్లో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. ఆప్తుల్ని,ఆత్మీయుల్నీ, తెలిసినవాల్లనీ, మంగలేష్ డబ్రాల్ లాంటి కవుల్నీ, బాలసుబ్రహ్మణ్యం లాంటి కళాకారుల్నీ కోల్పోయాం. పోగొట్టుకున్న వాళ్ళ చివరి చూపునకూ దూరంయ్యాం…కార్మికుల వందలాది మైళ్ళ కాలి నడకల్నీ చూసాం..ఎంత ఘోరమయిన కాలాన్ని అనుభవించామో చెప్పలేము.  

    ఈ నాణేనికి మరో వైపు గంగానది పరిశుభ్రమయిందనీ, ఢిల్లీలో  వెన్నెల ప్రకాశ వంతమయిందనీ, రోడ్లమ్మట జంతువులు స్వేచ్చగా సంచరించగలుగుతున్నాయనీ విన్నాం.

వీటన్నింటి నేపధ్యం లో సామాజిక దూరం ఇప్పటికే దూరమవుతున్న మనల్ని మరింత దూరం చేసింది. ఇలాంటి స్థితిలో గ్లోబల్ స్థాయిలో కవుల కవితలతో కూడిన ఈ SINGING IN THE DARK లో వివిధ దేశాలకు చెందిన 112 మంది కవుల కవితలున్నాయి. కొందరు కవులు దుఖం తో రాస్తే, కొందరు కోపం తోనూ మరికొందరు ధైర్యాన్ని ప్రోది చేస్తూనూ రాసారు. తప్పకుండా చదవాల్సిన సంకలనమిది.  

+++

ఈ సంకలనం లోంచి ఒకటి రెండు కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదం చదవండి….

రైలు –కే. సచ్చిదానందన్

రైలు మా వూరికి వెళ్తోంది

నేనందులో లేను కానీ

రైలు పట్టాలు నాలోపలున్నాయి

రైలు చక్రాలు నా చాతీపై నున్నాయి

రైలు కూత నా అరుపు

నన్ను తీసుకెళ్ళడానికి రైలు తిరిగి వచ్చినప్పుడు

నేనక్కడ ఉండను కానీ

నా శవాన్ని కాపలా కాస్తూ నా శ్వాస

రైలుపై కప్పు మీద ప్రయాణం చేస్తుంది

మా వూళ్ళో రైలు ఆగగానే

నా ప్రాణం నా దేహంలోకి చేరుతుంది

అక్కడ వేచి చూస్తున్న నా సైకిలెక్కి

తెలిసిన దారులెంత చక్కర్లు కొడుతుంది

సైకిలు గంట విని నా పిల్లలు

నాన్నొచ్చాడు నాన్నొచ్చాడు

అంటూ పరుగెత్తు కొస్తారు

తిరిగొచ్చింది నా మృత దేహమని

వాళ్లకి నేనే భాషలో చెప్పను

వచ్చింది స్వర్గం నుంచా నరకం నుంచా

నేనెక్కడో ఆరెంటి మధ్యా వున్నాను

బావినో కుంటనొ మాట్లాడ నివ్వండి

ఒక వేళ నీళ్ళు మాట్లాడానికి నిరాక రిస్తే

నా ప్రాణం ఇంటి ప్రాంగణం లోని

మునగ చెట్టు మీది కాకిలా  మారి

వాళ్లకు నిజం చెప్పేస్తుంది

=====

ఈ కాలం –కీ .శే. మంగలేష్ డబ్రాల్

కంటి చూపు కరువైన వాళ్ళు

తమ దారిని ఏర్పరుచు కోలేరు

అంగ వికల్యం వున్న వాళ్ళు

ఎక్కడికీ చేరుకోలేరు

బధిరులు

జీవితపు ప్రతిధ్వనుల్ని వినలేరు

ఇల్లు లేని వాళ్ళు

తమ ఇంటిని నిర్మించుకోలేరు

పిచ్చి వాళ్ళు

తమకేం కావాలో తెల్సుకోలేరు

ఇవ్వాల్టి కాలంలో

ఎవరయినా గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు,  

చెవిటి వాళ్ళు, ఇల్లులేని వాళ్ళుగా

మారి పోవచ్చు

=======

చివరిగా ఓ హైకూ

The invisible crown

Makes everything

Vacant

  • BAN’YA NATSUISHI (JAPANESE POET)

ఈ అనువాదాలు కేవలం మచ్చుకు మాత్రమే ఎన్నో దేశాల నుండి ఎంతో మంది రాసిన ఎంతో మంచి కవితలు ఈ సంకలనం నిండా వున్నాయి. తప్పకుండా చదివి భధ్రపరుచుకోవాల్సిన సంకలనమిది. సంపాదకులకు మరోసారి  ధన్యవాదాలు.

========================

తెలుగులో కూడా కరోనా నేపధ్యం లో అనేక మంది కవులు వీటికి దీటయిన గొప్ప కవితలు రాసారు. కాని ఇంగ్లీషులోకి, ఇతర భాషలలోకి  వెళ్ళక పోవడంతో ఆ కవితల రీచ్ పరిమితమయి పోయింది. నిజానికి అది గొప్ప విషాదమే.  

  • వారాల ఆనంద్

==============================================

 అయితే ఇక్కడ నేను రాసిన రెండు కవితల్ని మీతో షేర్ చేసుకోవాలనే temptation  ఆపుకోలేక ఇస్తున్నాను

వీలయితే చదవండి—–

‘కరోనా’ భయానికో విజ్ఞప్తి

========= వారాల ఆనంద్

ఇంతకుముందు

భయమేస్తే

నలుగురం ఒక చోట చేరేవాళ్ళం

ఒంటరిగా లేమన్న ‘థీమా’ కోసం

నలుగురమున్నామన్న భరోసాకోసం

సామూహిక ‘బృందగానం’ తో

భయాన్ని బద్దలు కొట్టేవాళ్ళం

ఇదేమిటీ కొత్త భయం

కొత్త పేరు

గుండెలనే  కాదు

సమాజాన్నీ బద్దలు కొడుతోంది

అందరూ ఎవరికి వారు

ఇళ్ళల్లో గోడలక్కొట్టిన శిలక్కొయ్యలకు

వేలాడుతున్నారు

నిజమే కొత్త భయం దెబ్బకు 

‘ప్రపంచమంతా మా గుప్పిట్లో ‘

అన్న మాటలన్నీ ఆవిరై

ఇంటి కప్పే రక్షా కవచమంటున్నారు

నాలుగు గోడలే ప్రపంచమంటున్నారు

‘వసుధైవ కుటుంభం’ అన్న మాట పోయి

కుటుంబమే ప్రపంచమయి పోయింది   

అత్తా మామ, కొడుకూ కోడలూ అన్నా చెల్లీ 

అక్కా తమ్ముడూ అంతా

కోపాల్నీ, తాపాల్నీ

అలకల్నీ ఆవేశాల్నీ

చుట్ట చుట్టి కట్ట కట్టి

పాత సామాన్ల గదిలో పడేసారు   

వెలిగించుకున్న చిరునవ్వుల వెలుగులో

భయాన్ని ఇంటిబయటి వాకిట్లో నిలబెడుతున్నారు

సరే సరే

సమాజంలోనూ

మనుషుల నడుమా ఉన్న దూరాలని

చెరిపేస్తున్న భయమా

నీకు సెహబాష్

అయితే భయమా

ప్లీజ్ మరింత పెరిగి 

మనుషుల్లోని మనసుల మధ్య

దూరాల్నీ చేరిపేయవూ

మేమంతా మనసుల్ని విచ్చుకుని

చేతుల్ని కలుపుకొని

ప్రపంచాన్ని చుట్టు ముట్టేస్తాం

రౌండ్ అప్ చేసి

భూగోళానికి బారికేడ్లు కడతాం

భయాన్ని బద్దలు కొడతాం

ఆకాశంలో పాతరేస్తాం

=========================================

ఇంట్లోనే  వుందాం

———— వారాల ఆనంద్

బయటమో కనిపించని క్రిమి

కత్తులు నూరుతోంది

దాని ఊపిరి దాహానికి అంతే లేదు

దాని చూపు ఊపు

ముందర  

రాజు పేదా తేడా లేదు  

+++++++++++++

మనం మన ముఖాలమీంచి

కళ్ళద్దాలని తీసేద్దాం

జనం కళ్ళల్లోని

దుఖపు లోతుల్ని చూద్దాం

భయం పరిణామం చెంది

దుఖం గా రూపుదాల్చుతోంది

బతుకు వేదనై  రోదనై

స్మశానం వైపు చూస్తున్నది

+++++++++

ఇవ్వాళ చేయీ చేయీ కలిపి

దిగంతాలకు కాదు గదా

వీదుల్లోకే  వెల్లలేము

బాగున్నారా అని

నాలుగు అడుగుల దూరం నుంచే

కుశలమడిగే  దుస్థితి

++++++++++++

అందుకే

భయాన్ని బంధించి

దుఖాన్ని పొట్లం కట్టి 

ఇంట్లోనే ఉందాం

కాసేపు

అద్దం ముందు కూర్చుందాం

మనల్ని మనం తెలుసుకుందాం

కాసేపు

మన లోనికి చూసుకుందాం

మన బలమేమిటో బలహీనతేమిటో

అర్థం చేసుకుందాం

++++++++ 

ఇంట్లోనే వుండి 

భావిష్యత్తు పవనాలకు

ద్వారాలు తెరుద్దాం

కొత్త లోకాన్ని కలగందాం

======================

ఓ అయిదు చిన్న కవితలు

Posted on

ఓ అయిదు చిన్న కవితలు

– వారాల ఆనంద్

1)

చీకటింకా తెమలలేదు, మబ్బులు ఒళ్ళు విరుచుకోలేదు

పక్షులు నిశ్శబ్దంగా తమ రెక్కల మీద

తూర్పు వెలుగులు మోసుకొస్తున్నాయి

——————–

2)

చీకటి ఎప్పటికయినా ముగుస్తుంది

వెలుగు ఎన్నటికయినా మెరుస్తుంది

మనమే సుఖ దుఖాల నడుమ వూగిసలాడతాం

—————————

౩)

ఉదయపు ఆకాశంలో పక్షులు బారులు బారులుగా

తొలి కిరణాలకు దారి చూపుతున్నాయి

పక్కకు తొలగుతున్న మబ్బులకు, కింద నడుస్తున్న నాకూ తెలీదు

——————————–

4)

ఒంటరితనంలో ఉద్వేగం, మాటలు లేవు

సాటి మనుషులూ లేరు

ఎలాంటి భావం లేకుండా ‘కాలం’ గడుస్తూనే వుంది

———————

5)

తెలియకుండానే మనసు పొరల్లో కొన్ని మరుగున పడతాయి

కానిగిరి పాఠాలూ, కన్న కలలూ, తొలి ప్రేమలూ

కాల గమనంలో అట్లా కలిసిపోతాయి, మనమిట్లా మిగిలిపోతాం

====================================    

ఓ అయిదు చిన్న కవితలు O Aidu Chinna Kavitalu (sanchika.com)

సాయంకాలం ———— దోరైన్ లాక్స్ (అమెరికన్ కవి)

Posted on

సాయంకాలం 
————
దోరైన్ లాక్స్ (అమెరికన్ కవి)
చెట్లకింద 
ఎంతమంది గతించారనే 
పట్టింపయినా లేకుండా 
దయలేని వెన్నెల 
నిర్విరామంగా కురుస్తూనే వుంది

నది ప్రవహిస్తూనే వుంది

ఇంటిపక్క గులకరాళ్ళపై ఎవరో 
ముంజేతులు ఆనించి విలపిస్తున్నారనే 
పట్టింపయినా లేకుండా 
ఇక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది

బాధ దుఖమూ 
అన్నీ ముగుస్తాయి

హంస 
మెల్లగా నడుస్తూనే వుంది

కఠినమయిన చీకటి నడుమ 
ఈకలతో కూడిన తన తలబరువును 
రెల్లు మోస్తూనే వుంది 
గులకరాళ్ళూ అరిగిపోతాయి

సంచుల్నీ బరువుల్నీ బహుమతుల్నీ మోస్తూ 
మనం దూర దూరాలకు 
నడుస్తూనే వుంటాం

మాకు తెలుసు 
సముద్రం కింది భూమి కనుమరుగవుతున్నదని 
పురాకాలపు చేపల్లాగా 
ద్వీపాల్ని మింగేస్తున్నాయని

మాకు తెలుసు 
మేం విఫలులం,దౌర్భాగ్యులమని 
ఇప్పటికీ చంద్రుడు మానుంచి దాగివున్నాడని 
చుక్కలు సుదూరంగా వున్నాయని

అయినా వెలుగు మమ్మల్ని చేరుతుంది 
మా భుజాలపై కురుస్తుంది 
———- 
ఇంగ్లిష్: దోరైన్ లాక్స్ (అమెరికన్ కవి)
తెలుగు: వారాల ఆనంద్

https://telugu.asianetnews.com/literature/irugu-porugu-varala-anand-trnaslates-americam-poet-dorain-locks-into-telugu-qna5oz

SMALL POEMS by VARALA ANAND 2020==చిన్న కవితలు (హైకూలు) 2020 -వారాల ఆనంద్

Posted on

1)

పువ్వునీ పరిమళాన్నీ మనసారా ప్రేమించా

కాలం పువ్వుని లాక్కెళ్ళింది

పరిమళం నాతో ఉండిపోయింది

========================

2)

చెట్టు మొద ట్లో కూర్చుని

ఎదిగిన కొమ్మల్ని చూస్తున్నా

అవేమో దయతో పూల వర్షం కురిపించాయి

=====================

3)

ఆకాశంలో నది పైన హరివిల్లు విరిసింది

నీటిలోంచి ఎదిగిందా నింగి లోంచి దిగిందా

ప్రేమ ఎక్కడ పుట్టిందో ఎవరు చెప్పగలరు

====================

4)

నా గురించి నీకంతా తెలుసు

మనసు తప్ప

నీ గురించి నాకేమీ తెలీదు

మనసు తప్ప

==================

5)

నేను నిన్ను ఇష్ట పడ్డానో

నువ్వు నన్ను ఇష్టపడ్డావో

ఇష్టపడటమే గొప్ప ఇష్టంగా వుంది

===================

6)

అలుపెరుగ కుండా గాలి నన్ను చుట్టేస్తుంది

వస్తూ వస్తూ పత్రహరితం నుండి

ప్రాణాన్ని మోసుకొస్తోంది

===================

7)

ఎవరో తలుపు తట్టిన చప్పుడు

ఇంటి తలుపా

గుండె తలుపా

======================

8)

ఆకాశం లో

బారులు తీరిన పక్షులు

కుంచె గీసిన గీతాలు

లేత కిరణాల ఊసులు

==================

9)

మానేరు కట్టపై నావీ నీవీ

అడుగుల సవ్వడి

నీటి అలలు ప్రతిధ్వనిస్తున్నాయి

==================

10)

చాలా దూరం నడిచాక

తెలిసింది అందులో

గొప్ప ఒంటరితనం వుందని

==============

11)

వానాకాలం ఉదయం

ఆకులు తేట గా వున్నాయి

తలలు వంచవు

=================

12)

ఆకాశం మబ్బులతో నిండిపోయింది

నిండు మనసుతో నది

చిరు నవ్వుతో ఆకులు పిలుస్తున్నాయి

====================

13)

వాకిట్లో చినుకులు

గదిలో కునుకులు

===============

14)

వానా కాలమే

పాపం ముసుర్లకు

కాలం చెల్లింది

================

15)

ఉదయం చినుకులు

రోడ్డు పక్క చెట్లు

ఒళ్ళు   విరుచుకుంటున్నాయి

====================

16)

నిండిన సరస్సు

కదులుతున్న అలలు

ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి

=================

17)

గాలి నిండా

మట్టి పరిమళం

ఇంతకు ముందే నాలుగు చినుకులు పడ్డాయి

===================

18) 

ఎవరో పాడుతున్నారు

నిద్ర ముంచుకొస్తోంది

జోల పాటో ప్రేమ పాటో

——————-

19)

నీటి పైన రాయి పడింది  

క్షణం అలలు సుళ్ళు తిరిగాయి

తర్వాత అంతా నిశ్శబ్దం

———————

20)

మోసపోవడం విసుగనిపిస్తోంది

జీవితంలో

ఎన్ని సార్లని ఎన్ని తీర్లని

—————————

21)

పశ్చిమాన సూర్యుడు కుంగుతున్నాడు

 నీడలు

తూర్పున పరుచుకున్నాయి

—————

22)

వారం రోజులుగా

ఒకటే వర్షం

ముసురు మళ్ళీ ఊపిరి పోసుకుంది

—————

23)

కను రెప్పలు మూయగానే

మనసు రెక్కలు విచ్చుకుంది

బయట చీకటి లోన వెల్తురు

—————-

24)

గడియారం చౌరాస్తాలో గంట మోగింది  

మా వూరి ముఖచిత్రం

నా ముఖం మీద బాల్యపు చిరునవ్వు

——————

25)

జాతరా గ్రౌండు నిండా

ఇంద్రధనుస్సు వర్ణాలు

పొంగుతున్న పడుచు పర్వాలు

——————

26)

రాలుతున్న పండు టాకులు

దట్టమయిన కొమ్మల మధ్య

దుఃఖ ధ్వని

——————-

27)

ఏక ధారగా వాన

వారం రోజులుగా గడప దాటలేదు

నేనూ సూర్యుడూ

—————–

28)

వాన తడిసిన ఉదయం

నింగీ నేలా పదన పదన 

మనసింకా ఆరలేదు

—————-

29)

నడిరాత్రి దీపం వెలుగులో

అక్షరాలు వణికాయి

కాగితం తెల్ల బోయింది

—————————-

30)

వాకిట్లో అందమయిన ముగ్గుల్ని  

వాన తుడిచేసింది

ఆమె కళ్ళల్లో తడి చేరింది

——————–

31)

వాగు పొంగింది

చెరువు నిడింది

నింగిలో పక్షుల గుంపు కువ కువ

—————–

32)

ఉదయం చినుకుల మధ్య

గాలి తిరుగుతున్నది

టీ కప్పులో ఇరానీ చాయ్ ఘుమ ఘుమ

——————-

33)

ఆమె కంటి నిండా ఎదురు చూపులు

పోస్ట్ మాన్ కోసమో

ప్రేమ లేఖ కోసమో

———————-

34)మూడుగంటల రాత్రి

   ఎవరో పిలిచినట్టయ్యింది

   హరి వెళ్లి పోయాడు

=======================

35) ఉదయాన్నే ఆకాశంలో

    పక్షులు వలస

     ఆతీయులు కదిలిపోతున్నారు

=========================

 36)  కళ్ళ ముందు

      ఎన్నెన్నో ముఖ చిత్రాలు  

      గుండెల్లో ఒకటో రెండో మిగిలి పోతున్నాయి

=====================

37)   హరి వెళ్తూ వెళ్తూ

      సంచీలో పంచాంగాన్నీ

      చీకటిలో నన్నూ వదిలేసాడు

=======================

38)  రాలి పోతున్న వృద్ధులు

     జన సాంద్రత మధ్య

     మోగుతున్న మరణ మృదంగం

==================

39) వికసించె పూల నడుమ

    చిన్నూగాడి గుస గుస

    తనలో తానే

===================

40) పెద్దగా అలిసి పోలేదు

     త్వరగా నిద్రపోవాలి

     కలలకు స్వాగతం చెప్పాలి

================

41) మచ్చా మారకా లేని

     తెల్ల కాగితం దర్జాగా

     విశాలంగా పరుచుకుని వుంది

=====================

42) రాతంతా ఒకటే వాన

    ప్రభాత వేళ

   మనసంత స్వచ్చబడింది

——————————–

43) గాలంతా పొగమంచు

    మసక మసక నిద్రలో

    పసివాడి చిరునవ్వు

—————————————–

44) నిండు పున్నమి

    ఆకాశంలో తారలు వెల వెల

     నెల మీద ముఖాలు మిల మిల 

————————————-

45) విసురుగా వీస్తున్న గాలి

     నదిలో అలల గల గల

     గట్టు మీద జనం గోల గోల

——————————————-

46) సంధ్యవేళ మైదానంలో

    నడుస్తున్న పాదాలు

     గతి తప్పుతున్నాయి

 ——————————

48) వానలు వెనక్కి పట్టాయి

     చలి మొదలు ఉన్ని గుడ్డలు

     దండానికి వేలాడుతున్నాయి

—————————————–

  49) నాలుగు అడుగులు పడ్డాయి

      నలభై కాళ్ళు కలిసాయి

       పచ్చని చెట్లు సలాం చేసాయి  

————————————————

50) ఒక గొంతు పిలిచింది  

    గాలి నిండా ప్రతిధ్వనులు

     వాతావరణం వేడెక్కింది

——————————————–   

చిన్న కవితలు (హైకూలు) 2020

-వారాల ఆనంద్

‘MUKTHAKALU’ by VARALA ANAND 2020 ‘ముక్తకాలు’-వారాల ఆనంద్ 2020

Posted on

———————

నిద్దట్లోని కల లు నిజమవుతాయేమోనని సూర్యోదయానికి మేల్కొంటాం

పోద్దూకి చీకటి కాగానే ముసుగు తన్నేస్తాం నిరాశతో

——————–

చంద్రబింబం లాంటి ముఖం నచ్చుతుంది

    ఆర్తిగల మనసు హత్తుకుంటుంది

———————————–

గతం అనుభవం, భవిష్యత్తు ఆశ

   వర్తమానమే శ్వాస

—————————-

చూపు మౌనాన్ని ప్రకటిస్తే మనసు నిశబ్దాన్ని స్వీకరిస్తుంది

   రెంటికీ తేడా లేదు, పెద్ద పోలికా లేదు

———————————

రాత్రికి ముందు మాట సాయంత్రం,

  చీకటికి ముగింపు వాక్యం ఉదయం  

———————————

రాత్రంతా చంద్రుడు భూమిని చదును చేసాడు

  ఉదయాన్నే సూర్యుడు వెల్తురు విత్తులు నాటుతున్నాడు

—————————–

సాయంత్రం సూర్యుడు దిగిపోతే చంద్రుడు మేల్కొంటున్నాడు

   నేనేమో ఇద్దరినీ చూస్తూ సకులం ముకులం వేసుక్కూర్చున్నాను

————————————————

ఎన్ని అడుగులు వేసినా ఎవరూ వెంట రాకుంటే

    ఇంకో దారి లేదు ఒంటరిగా నడవడమే

——————————————–

చినుకులు కురిసీ కురిసీ అలసిపోయాయి

   నేలా మనసూ తడిసి పోయాయి, ఇప్పటికిది చాలు

—————————————

నడిచే దారికి బహుముఖాలు,

    మన ముఖాన్ని సరిచేసుకొని ఇష్టదారిలో నడవడమే

—————————————————— 

దేహ గాయాలకు మందులున్నాయి మాకులున్నాయి

    మనసు గాయానికే మలాముల్లేవు

————————————————

చుట్టూరా పరిచితులూ అపరిచితులూ

    మాట కలపడం కోసం చేయి సాచి నిలుచున్నాను

————————————–

పొలం గట్ల మీద నడుస్తున్నా పాటలు వినిపించడం లేదు

     అక్కడ ట్రాక్టర్లు దున్నుతున్నాయి

=============================

పెరట్లో మొక్కలు వాడి పోతున్నాయినేల తడిపాలి  

      మట్టి వాసనతో విచ్చుకుంటాయి

==============================

మొక్కలన్నీ తల వంచుకు నిలబడ్డాయి

ఊపిరులూదినట్టు నాలుగు చినుకులు కురవాలి  ========================================

రోడ్డు మీద ఒకటే గొడవ, తన్నుకుంటున్నట్టున్నారు

      దయతో ఓ వర్షం కురిస్తే బాగుండు

=======================================

పక్కింట్లో కొత్త జంట ఎడమొఖం పెడ మొఖం

     ఇద్దరినడుమా ఓ సుగంధపు ఆగరొత్తీ వెలిగించాలి

======================================

టేబుల్ కు ఆపక్కా ఈ పక్కా ఫ్రేమికుల జంట, నడుమ మౌనం

       బేరర్ ఓ కూల్ డ్రింకూ రెండు స్ట్రాలూ తే

=======================================

నేలంటే నాకెంతిష్టమో,

నా కళ్ళూ కన్నీళ్ళూ ఎగిసి అందులోనే ఇంకుతాయి

=====================

పూలూ ముళ్ళూ కుప్పబోసినట్టు ఎన్ని అనుభవాలో

     నేనేమో ఒక్కో పువ్వునూ ఏరుకొని దాచుకుంటాను

————————

భూమ్మీద నేను, ఆకాశంలో చంద్రుడూ

నడుస్తూనే వున్నాం, అలసట తెలుస్తలేదు

============================

పనెంతో చేస్తూనే వున్నా

చేయాల్సింది మిగిలే వుంటోంది

=======================

నీళ్ళను నిండుగా చూస్తే హాయి

కన్నీళ్ళకు మినహాయింపు

===========================

సాయంకాలం వ్యాహ్యాళికి బయల్దేరా

చల్ల గాలీ జతగూడింది

===================

నిరంతరం చదువుతూనే వున్నా

మంచి కవిత్వం నాలో ఇంకిపోయింది

===============================

తోటలో మొక్కలు చిగుర్లు వేస్తున్నాయి

భూమ్మీద మనసులే ముడుచుకు పోతున్నాయి

===========================

ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులు

మనుషులే  చెట్టుకొకరు పుట్టకొకరు

——————————–

 తలచుకుంటే చాలు స్నేహ పరిమళం

ఇప్పటికిది చాలు

===============

చంద్రుడు సూర్యుని కోసం చూస్తున్నాడు

నేనేమో వెన్నెలలో తడిసి వున్నాను

====================

పాత డైరీలు కుప్పగా పెర్చివున్నాయి

  కొన్నిటి కవర్లే విప్పలేదు

===================

అడుగులు పడీ పడీ బాట బండబారింది

   నా పాదాలు కొత్త దారి వెతుకుతున్నాయి

========================

చలి కోసేస్తున్నది

చంద్రుడు వెన్నెల గుడారం కప్పాడు

——————————————–

ఉదయాన్నే చదును నేల పై పడుకున్నాను

   మనసే పరి పరి విధాల పోతున్నది

=======================

కొమ్మలను బార్లా జాపి నిలబడ్డాయి చెట్లు

చెట్టు నీడన చలి కాచుకుంటున్నాను

====================

మెరుపు కళ్ళతో విన్నప్పుడు చుట్టూ వున్న కవులు

నే రాయడం మొదలెట్టగానే పక్కకు తప్పుకున్నారు

=====================

మరణం అంచులు కనిపించాయి

వాడిన మొక్కకు ఆమె నీళ్ళు పోసింది

===================

ఎక్కడినుంచి వచ్చిందో ఎండ కమ్మేసింది

చెట్టు నీడ గొంగడిలా దేహాన్ని కప్పేసింది

=================

పుస్తకాలు గదిలో వుంచి, ప్లకార్డులు పట్టుకున్నారు

సమాజమే తరగతి గది

=================

ఇది కోపం లేని తరమనుకున్నా

వేర్లు భూములోనే వున్నాయి

==========================

ఆన్ని దిక్కులా అందరూ ఒకటే పరుగు

పందెం ఎవరు పెట్టారో

====================

కాళ్ళూ రెక్కలూ లేని తరం మొలిచిందని కలతపడ్డా
కన్నీటి పొరలు ఒక్కొక్కటీ ఆవిరవుతున్నాయి
=========================

శ్వాసకు శరతుల్లేవు, కాని 

ప్రేమకు స్నేహానికి ఊపిరాడడం లేదు
==================

గుడారం నిలపడుతుందో గాలికి ఎగిరి పోతుందో

సృజన లోకంలో నేనో బంజారా
–——–

నిద్రపోదామని గదిలో దీపాలు ఆర్పేసా

చుక్కలు మెరుస్తూ కిటికీ అద్దాలపై వాలాయి

========================

నదులూ చెరువులూ నిండాయి

ఇక రైతుల కడుపులు నిండాలి

===================

కళ కళ లాడుతున్న నది ఉపరితలం మెరుస్తున్నది

నాకేమో ఈత రాదు

===============

మబ్బుల ఆకారాలు చూసి చంద్రుడు నవ్వుతున్నాడు

మేఘం బహురూపి

====================

మట్టిలో పుట్టి లత ఆకాశం వైపు పాకుతోంది

వెన్నెలేమో నెలకు దిగుతోంది

=========================

సున్నితంగా తలుపు తట్టి వెనుదిరిగా

ప్రేమనుంచీ చావునుంచీ

===================

కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దామని కూర్చున్నా
మనసొచ్చి కవిత్వం లోకి ఎగరేసుకు పోయింది
——————– 

పెద్దలుపీఠలేసి పిలిస్తే హుందాగా వచ్చేవాళ్ళు
ఏంచేయను మా ఇంట్లో స్టోర్ రూమ్ ఖాళీ అయింది
—————- 

అందమయిన గుట్టలు చూస్తుండగానే తరిగి పోయాయి

ఊర్లో కొందరేమో వికృతంగా పెరిగిపోయారు

——————–

సృజన లోకం లో నేనో బంజారా

గుడారం నిలబడుతుందో గాలికి ఎగిరి పోతుందో

=================

ఒక్కన్నే నడుస్తున్నా

చుట్టూరా వేల ఆలోచనలు

—————

ఉదయపు గాలి ఆకుల్ని  ఆర్తిగా పలకరిస్తోంది

ఆకులేమో నన్ను రమ్మని పిలుస్తున్నాయి

————–

నడుస్తూ నడుస్తూ చేయి వదిలేస్తే బంధాలు తెగుతాయి

అనుబంధాలు మిగిలే వుంటాయి

————————

కళ్ళు మూసుకుని కూర్చున్నా

ఏకాగ్రతకు చాలా సమయమే పట్టింది

——————————

సాయంత్రం కంట్లో తడి, దిగులొద్దు 

ఇక్కడ అస్తమించిన వెలుగు మరో దిక్కు ఉదయిస్తుంది

———————

వినతులూ విద్రోహాలవుతాయి, పైకెత్తిన చూపులకు బేడీలు పడతాయి

ఇలాంటి కాలాలు వస్తాయి పోతాయి

———————–

శిఖరాలూ లోయలూ నిలబడ్డం పడిపోవడం

త్వరపడాలి, పెద్దగా సమయం లేదు

మంచి మనిషిని చేరాలి

సరైన దారే దొరక లేదింకా

————————

‘చీకటి’ వేల్తురుకోసం వెతుకుతున్నది

అందులో నన్ను నేనే సవరించుకుంటున్నా

——————

వెలుగుల వాడకేసి నా అడుగులు కదుల్తున్నాయి

నా చుట్టూ లెక్కలేనన్ని పాదాలు

————————-

వాడి అలుగుడూ అల్లరీ పెరిగి పోతున్నది

గదిలో మదిలో నిశ్శబ్దం పారిపోతున్నది

—————————–

 కునుకు చిన్నదే చిరుగాలిలా చుట్టేస్తుంది

చిత్తు చేస్తుంది

———————–

గతుకుల దారి సాగుతూనేవున్నది

నేనూ నా లాంటి నలుగు  సరి చేసే పనిలో వున్నారు

———————-

గుడిలోదయినా మదిలో దయినా

గంట మోగించడానికి మనసుండాలి  మమత ఉండాలి

—————————-

నువ్వూ నేనూ వాడి వాడిగానే విడిపోవచ్చు  

మనసు  తొందర లేదు  

———————————

పెరట్లో మొక్కలకు నీళ్ళు పోయాలి

ప్రేమకు కొంత త్యాగం పోయాలి //ఒకె

———————-  

వెన్నెల

నే కోల్పోయిన కలల్ని కురుస్తోంది  

——————–

ఆకాశంలో మబ్బులు ఒకటొకటిగా

తొలగిపోతున్నాయి, మనసులో చీకట్లు కూడా/// ఒకే

——————–

ఎత్తుపల్లాల జీవితం ఇంకెంత కాలం

సూర్యోదయానికింకా సమయం రాలేదు

——————-

కాలం గాని కాలం చినుకులు పడుతున్నాయి

చలికి మళ్ళీ ప్రాణమొచ్చింది

——————————-

ఆకాశంలో మబ్బులు చుక్కల్ని కమ్మేసాయి

నా లోపల మనసుని దుఖం కమ్మేసినట్టు

————————-

మంచు కురుస్తోంది

కంటి కోసల పైనా మనసు అంచుల పైనా

————————

మేఘాలు చినుకుల్నే కాదు మెరుపుల్నీ కురుస్తున్నాయి

చిగురించడానికీ మురిపించడానికీ

———————–

తప్పేమిటి ఒప్పేమిటి ఈ కాకి లెక్కలేమిటి

చూడాల్సింది అనుబంధపు లోతుల్ని కదా

================

ఇష్టపడినాము. దగ్గరయ్యాము. దూరమయ్యాము  

దూరంలోనే ప్రేమ ఇనుమడిస్తున్నది

———————————–

నీటి అలల మీది గాలి పక్షి గానమే

దుఖమే నా మదిలో ప్రతిధ్వనిస్తున్నది

——————–

మనిషిలో నిరాశ విచ్చిన్నానికి

మనసులో దుఖానికి సహచరి

——————————

సోఫామీంచి నేలపైన పడ్డా , నిద్రేమో కాని

నేల ఆత్మీయ సంగీతం వినిపిస్తోంది

———————————-

తెర పై విరామం పడి చాలా సేపయింది

శుభం కార్డు ఏ క్షణమయినా పడొచ్చు

———————————

మంచు కాలం ముగిసింది, వియోగం భరించలేక

ఉన్ని దుస్తులు అటకెక్కాయి

———————————-

వెన్నెల కురిపించీ కురిపించీ చంద్రుడు సేద దీరుతున్నాడు

చీకటి తన ప్రతాప మనుకుంటోంది

=======

పెరట్లో మొక్కలకు నీళ్ళు

ప్రేమకు కొంత త్యాగం పోయాలి

================

గమ్యం తెలియకుండానే  ప్రయాణం మొదలవుతుంది  
సాగుతూ ఉంటే దారులు అవే తెరుచుకుంటాయి
————-
నేను నీకూ నువ్వు నాకూ ఏమివ్వగలం
   ఓ చిరునవ్వూ రెండు కన్నీటి చుక్కలు
——————-
 చల్లటి హాయి గొల్పే గాలే కాదు, వేడి గాలి లోనూ
    చిరునామా చిరునవ్వే అవ్వాలి


సముద్రం గంభీరమే కాదు గడుసయింది కూడా
    ఓడా నువ్వే లంగారూ నువ్వే
————–

 మెలకువపై రాత్రి కలేదో సంతకం చేసిపోయింది 
రోజంతాదాన్ని డికోడ్ చేస్తున్నది
————————–

ఎన్నో  శిఖరాలూ లోయలూ కొంచెం త్వరపడాలి
పెద్దగా సమయం లేదు
———————————

 జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచడం ఎంత కష్టం,
గతం లేని భవిష్యత్తు లేదు
—————————–

గాలి లోన ప్రవహించే దాకా వేణువు నిశ్శబ్దమే
    గాలి వెళ్ళింతర్వాతా నిశ్శబ్దమే
———————————-

తెలుసుకోవడానికే వచ్చాం,తెలిసో తెలియకో వెళ్లిపోతాం, తెలుయజెప్పాడానికి వచ్చామంటేనే కష్టం

————–

వెలుగున్నంత సేపు  నీడ వదలదు
   
ఊపిరి ఉన్నంత వరకు వేదనా  తప్పదు

—————————————
నీకూ దుఃఖానికీ దూరం పెరిగితే
   
గూడు చెదిరిన పక్షివవుతావు 

=======================

వేరే దారి లేదు

    నాలా నేను బతికేస్తున్నా

——————

నీటి అలలపై వెన్నెల పాద ముద్రలు

    మనసంతా నిండి  పోయింది

——————

తోవ ఇట్లా సాగుతున్నది

ఏకాంతానికీ  ఒంటరితనానికి నడుమ

——————

మేఘాలు కొండల్ని చుట్టూ ముట్టాయి

     చెట్లు మరింత పచ్చగయ్యాయి

———————-

కనుచూపు మేర కనిపించేది కల కాదు

    మనసు తెరపై వెలిగేది అబద్దం కాదు

—————————

కన్ను మూస్తాం తెరుస్తాం

    నడిచేదీ నిలిచేదీ హృదయధ్వని ఒక్కటే

===================

వెన్నెల వెళిపోతున్నదని రోదిస్తూ కూర్చుంటే

    ప్రభాతాన్నీ కోల్పోతావు

——————————–

ప్రేమ నీల మీద తిరుగాడాలి

      కొండెక్కితే  ఎట్లా

——————–

తోటలో మొక్కల గుసగుసలు, పక్షుల కిలకిలలు

       నేను ధ్యానం లో వున్నా

—————————

ప్రేమించిన వాణ్ని, నేనే అధిపతిని

       బానిసని

———————————–

బెంగపడకు నువ్వు కనుకోనుకుల్లో వుంటే

       నేను ఆకాశంలో వున్నా

—————————–

ఉషోదయపు లేత దనాన్ని   చూసి

       మబ్బులు మురిసి పోతున్నాయి

——————-

గడిచిన జీవితంలో అనేక ఖాళీలు

   ఇప్పుడు పూడ్చే సమయం లేదు, శక్తీ చాలదు

—————————

గదిలో దీపం ఆర్పాను

   తారల ప్రకాశం ద్విగునీకృతం అయింది

————————–

చుట్టూరా అసంబద్ద అసందర్భ మాటల గోల

       హృదయాన్ని మౌనంలో కడి గేసుకున్నా

————————–

ప్రాణధారల్నిపంచె వేర్లు

       మాట్లాడవు ప్రశంసల్నీ కోరవు

======== ——————-

మంచిని చూసే మనసుండాలి

      గులాబీని వదిలేసి ముళ్ళను చూస్తావేమిటి

————————————–

కాలగమనం స్నేహాల్నీ ప్రేమల్నీ  దూ రం చేసింది

       నా హృదయం లో పాద ముద్రలు మిగిలాయి

————————————

చుట్టూరా పొగమంచులా భయం

      ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకుని ఎన్నాళ్ళయిందో

——————————-

చేసిన నేరాల్ని మూసేసి ఇంట్లో కూర్చుంటే

       నిజాలు చల్లారవు 

——————————

అలల మీది పడవలా, హృదయం మీద

      ప్రాణం ఓలలాడుతోంది  

———————————

ప్రకృతిని భయపెట్టి దోచేసిన మనిషి

       తన బాకీ తీర్చాల్సిన సమయ మొచ్చింది

————————————–

’కరోనా’ రాత్రి వెన్నెలంతా చిన్నబోయింది

      బయట జనమేవరూ కనిపిస్తలేరని

———————–

ఉదయపు ‘గాలి’కి, సాయంత్రం దాకా ఊపిరాడ్డం లేదు

      బయటంతా ‘లాక్ డవున్’

————————————–

పొరలు పొరలుగా అనుమానం, అలలు అలలుగా భయం

     అంతా తుఫాను ముందు ప్రశాంతం

———————–

ప్రపంచమంతా కరోనా వణుకు

       ప్రజలంతా ఇళ్ళల్లో చలి కాచు కుంటున్నారు

———————————

జాతరల్లేవు వారాంతపు అంగల్లు లేవు

పొలం కోతకోచ్చినట్టు ఇళ్ళన్నీ నిండుగా…

—————————————————

క్షమించండి, ఇంట్లోకి ఆహ్వానించ లేను   

       నేనే ఒంటరితనంలో వున్నా

——————————————

విషయం, పుటుక తర్వాత మనకు తెలిస్తే

      మరణం తర్వాత లోకానికి తెలుస్తుంది

———————————–

అనామకుడిగా వస్తాం, అనామకుడి గానే వెళ్తాం

       రాక పోకల మధ్యే అసలు రహస్యం

———————————-

కోపతాపాలు క్షణానికో యుగానికో తీరుతాయి

      ప్రేమే…. అనంత కాలం నిలిచివుంటుంది

———————- 

చీకట్లో అందరూ అంతా సమానమే      

       వెల్తురులోనే హెచ్చులూ తగ్గులూ

———————— ——————–

మిత్రమా నీలాంటి నలుగురు కలిస్తేనే నేను’

        నిండు సరస్సు ఒంటరి బిందువుతో అంటోంది  

——————————————–

ఉదయాన్నే పచ్చదనం పలకరింత

       హృదయం క్షణకాలం నిలబడిపోయింది

———————–

నిద్ర రాని వాడికి తెలుస్తుంది  సూర్యుడు ఉదయించడానికి

       ఎన్ని యుగాలు పడుతుందో

==============

చూడగలిగితే ప్రతి కొత్తలో పాత దాగి వుంది

       నిన్నటి కొనసాగింపే నేడు కదా

——————————————

ఇవ్వాళ హృదయం ముడుచుకు కూర్చుంది

      పొద్దెక్కినంక  మెలకువొచ్చిందని

———————————-

లోపలి దీపం వెలుగుతూ హసిస్తోంది

       ప్రేమ స్నేహం రెండు చేతులై ఆరనివ్వడం లేదు

————————–

పచ్చని తోటలో సంతోషం తో ఎగిరే పక్షిలా

       కవితావరణంలో తిరుగుతూ వున్నాను

———————–

లోకానికి ప్రాణం పోసే పచ్చదనం

      పొడిబారితే మిగిలేది బూడిదే

——————————-

కలవలేని కాలమొచ్చిందని ఏడిస్తే ఎట్లా

                మాటల్ని కలుపుతూ సాగాలి సదా

—————–

ఆస్తులు సంపాదన లేక్కబెట్టేవాళ్ళు ఇవ్వాళ

    రోజులు లెక్కబెడుతున్నారు

———————————–

ఆత్మీయిలు దూరమున్నారని దిగు లెందుకో

       వాళ్ళుండేది మనస్సులో కదా

———————————-

కలిసినప్పటి కంటే కలవలేకపోతున్నామన్న భావనలోనే

         ప్రేమ ఎక్కువగా ధ్వనిస్తోంది

——————

కష్టమో నష్టమో ప్రేమికుల్ని వదిలి వేయవచ్చు

      ప్రేమని వదిలేస్తే ఎట్లా

——————

మిత్రులారా ఇంటిలోనే వుండండి

      మీ ఇల్లు నా మనసుకు నాకు దగ్గరే…

——————————–

నేస్తమా నువ్వంటే నాకెంత ఇష్ట మో

             అంతకంటే నీ క్షేమం చాలా ఇష్టం

—————————————–

చేయడానికేం చాలా పనులు చేస్తాం

      కానీ విజయాలనే గుర్తుంచుకుంటాం

————————-

బతుకు బాట నిండా ఆరాటాలూ పోరాటాలూ

       ఓటముల్నీ లిఖించాలి నేస్తమా, అవి పాఠాలు కదా

————————-

నేస్తమా, స్నేహం పెదాలపై పలికితే

       ప్రేమ హృదయం లో పరుచుకుని వుంది 30

—————————

ఈ రోజుదయపు చల్ల గాలి చలాకీ గా వుంది

       రాత్రేదో మంచి కలోచ్చినట్టుంది

—————————–

నేస్తమా వికసిస్తున్న పువ్వును చూసావా,

      నిన్ను తొలిసారి చూసినప్పటి నా మనసు గుర్తొచ్చింది 

——————————–

ఎప్పటిదో పాత కాలపు మనసు నాది

ఇప్పటి ప్రేమలు అర్థం కావు 

———————————

అంతా ఇళ్ళల్లోనే వున్నారు, నేస్తమా

       మరి నువ్వెట్లా వచ్చావు నా మనసు లోకి  29

 ————————–

నేలంటే నాకెంతిష్టమో, కలలూ కన్నీళ్ళూ

       అందులోంచే ఎగిసి అందులోనే ఇంకుతాయి

 పూలూ ముళ్ళూ కుప్పబోసినట్టు  ఎన్ని అనుభవాలో

          నేనేమో ఒక్కో పువ్వునూ ఏరుకొని దాచుకుంటాను

———————————–  

బాణంలా మాట విసిరి నువ్వు బాగానే ఉంటావు

      మనసుకు తగుల్తుంది కదా, నాకే సలుపుతూ వుంటుంది  

———————–

ఆలోచన మనిషికి  సహజం

  ఇవ్వాళ మనసుతో ఆలోచిస్తేనే కష్టం

————————————

ప్రేమని చాయ్ ని మానేద్దామనుకుంటాను, చాలా సార్లు

  మానేసాను కూడా ఏం చేయను, ఆదత్  బురీ హై

————————————-

ఉదయాన్నే  మొగ్గ రెక్కలు విచ్చుకుంటోంది

     స్వేచ్చగా ఎగరాలనో. మంచు బిందువు తనలో ఇమడాలానో

—————————–

కలల్లోనూ, కళల్లోనూ   

      ఎప్పటికీ నేను బంజారానే

———————-

రాత్రి చీకటి బరువును మోసిన దేహం 

తెల్లారి వెల్తురు ప్రవాహంలో తెలికవుతున్నది

————————————

ఈ దేహం తో ఈ లోకం లో ఇమడ లేకున్నాను

      నేస్తమా నీ హృదయం లో ఇసుమంత చోటున్నదా

——————– 

నువ్వు శబ్దానికి ప్రతినిథివి, నేను నిశబ్దానికి

ఒకరు లేకుండా మరొకరి లేరు

———————

మౌనంగా ఎప్పుడూ ఉండలేను

నా గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తప్ప

—————————————–

నా మాటలో ఓ నిశబ్దం వుంది

నా మౌనం లో ఓ శబ్దమూ దాగి వుంది

——————————

వేదనలో ఆనందపు ఆర్తి జనిస్తున్నది

సంతోషంలో ఎదో తెలీని దుఖపు జీర ధ్వనిస్తున్నది  

——————–

గమ్యం చేరడం గొప్పే కానీ

గమ్య నిర్ణయమే పెద్ద గగనం

———————–

సత్యాన్ని పిడికిట్లో దాచేస్తే

అసత్యం దేహమంతా చేరుతుంది విషంలా

——————————

ఏ జీవితాలూ వ్యర్థం కావు

కొన్ని పునాదుల్లో వుంటాయి అంతే

——————–

మాట తాత్కాలికం కాదు

ఎప్పుడో జనించి ఎక్కడికో పయనిస్తుంది

——————-

నువ్వు మాట్లాడే మాటలు వినే వాడికంటే

నీ లోపలి నిశబ్దాన్ని వినేవాడే గొప్ప శ్రోత

————————-

చినుకులు చిరునవ్వుతో కురవనీ
నేల మందహాసంతో మురవనీ
———————-
రాత్రి దీపాలు ఆరితేగాని తెలీలేదు
చీకటికి నేనంటే ఎంత ప్రేమో
———–
కమ్ముకున్న మబ్బులు కురుస్తాయో లేదో కానీ
వెండి అంచు విరబూసింది
————– 
కలయికలో ముఖం వెలిగి పోతుంది 
వియోగంలో అదే వాడిపోతుంది
—————- 
ఎట్లున్నావు, బాగున్నాను,ఇన్నాళ్లూ 
నాకు అబద్ధం ఆడడం రాదనుకున్నాను 
————– 
మబ్బులా అందంగా ఉంటాను, గర్జిస్తాను
కన్నీరై  ప్రవహిస్తాను 
——– 
నేస్తమా కలల్లో నీకై ఎదురు చూసీ చూసీ
నిజంలో కనబడ్డా గుర్తించలేకున్నాను
———– 

బతుకు యాత్రలో మనం కలిసాం, విడిపోయాం
ఖాళీ అట్లా మిగిలిపోయింది
—————— 
కవిత్వమూ, దుఖమూ నా వెంట ఉన్నాయి 
ఒంటరితనం ఎక్కడుండి సచ్చింది
———– 
అట్లా చీకట్లోకి నడిచా, నా నీడ 
నీలమీంచి నాలోకి పాకింది
———- 
అధికార పాదాశ్రితులకు పొందిన సుఖాలు తెలుస్తాయి
పోగొట్టుకున్న సంతోషాలు తెలీవు 
———- 
ఎంతసేపూ నేనందరికీ తెలవాలనే యాతనే
నన్ను నేను తెలుసుకునేదెన్నడు
—————— 
నా లోతు నాకు తెలిసినప్పుడు కదా 
ఎదుటి ఉన్నతి తెలిసేది
—————- 
గెలుపును గర్వం తోనూ 
ఓటమిని దిగులుతోనూ స్వీకరిస్తాం, ప్చ్
——————- 
ఎక్కడ మొదలయ్యామో అక్కడికే చేరాం 
భూమిలా బతుకూ గుండ్రమే 
——– 

గడచిన కాలం ఎంత వగచినా తిరిగిరాదు 
ప్రేమ ఎంత దాచినా మరుగున పడదు

—–———————————–

ప్రకృతి లోంచి  ప్రకృతి లోకి

చేసే ప్రయాణమే కవిత్వం

———————–

మనసంతరాల్లోంచి ఎగిసి దుముకిన కన్నీళ్లు

దయామయ దోసిల్లలోనే సేద దీరుతాయి

—————————-

ప్రియా నా హృదయానికి శిలువ వేయబడ్డావు

ఆ కలయికే కవిత్వమై పారుతున్నది

——————————–

చిరునవ్వుల సమయాన్ని యిట్టె మరచిపోగలం

దుఖపు తడిని విడిచి పోలేము  

—————————————–

మూసివున్న నాహృదయ గవాక్షం వెనుక

కలలో కన్నీళ్ళో నీకెట్లా తెలిసేది

—————————–

ఎందులోనయినా అతిశయం అనర్థమే

అది సహజత్వాన్ని పాతరేస్తుంది

——————————

గురువనే భావనే అమిత భారమయింది

గురువుకయినా శిష్యుడి కయినా

————————

ఎదుటివారితో మాట్లాడిన దానికంటే

నాతో నేను మాట్లాకునేదే ఎక్కువ

———————-

ఏమిటి దోసిట్లో…కన్నీళ్లు
ఎక్కణ్ణుంచి వస్తున్నావ్…మనసు లోంచి
————
ఏమిటిమోస్తున్నావ్….జ్ఞాపకాల్ని
ఎక్కడికెళ్తున్నావ్…..రేపటి లోకి
—-–———
నాలో బలాలూ బలహీనతలూ ఉన్నాయి
అవి నా సొంతమే
——————
మంచి చెడుల విభజన రేఖ పైన
నిలబడ్డప్పుడు కదా నువ్వేమిటో తెలుసేది
—-–————-

చూపు నీటి అలలపై కదులుతున్నది
మనసు గాలి పొరలపై వూగుతున్నది

———————————–

కాళ్ళూ  చేతులూ ముడుచుకుని కూర్చుండడం కన్నా

   ఏ కొంచెమయినా ఆడించడం మేలు

———————-

 సృజన గాలి లోంచి జనించదు

    హృదయం లోంచే వికసిస్తుంది

——————————————–

 హృదయం లోంచి ప్రకృతిలోకి

    ప్రకృతి లోంచి హృదయంలోకి పయనించడమే సృజన

———————————

 ఆనందాలు విషాదాలు ముందో వెనకో

     వస్తాయి పోతాయి  మనమే స్థిరంగా నిలబడాలి 

—————————-

 ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం

     అవసరాన్ని మించి తీసుకోవడం రెండూ సరికాదు

——————————————

 నా గురించయినా ఇతరుల గురించయినా

     తెలుసుకోవడమే సజీవ లక్షణం

—————————————–

 విజయం లోని గర్వం కంటే

   ఓటమిలోని దుః  ఖమే మేలు చేస్తుంది

—————————————-

  సత్యాన్ని అతిశయంగా చెబితే

     అసత్యమనుకునే ప్రమాదం వుంది

————————————————–

 మనసులో ద్వేషాన్ని కలిగి  పెదాల పై నవ్వునీ

     ప్రకటించే వాడు  శత్రువునకన్నా ప్రమాదం

—————————————-

 ముక్కలైన మనసే

   ప్రేమ లోతుని గ్రహిస్తుంది  

====================

 ‘ముక్తకాలు’

-వారాల ఆనంద్

9440501281

                                                                      

POEMS of VARALA ANAND 2020 part II

Posted on Updated on

అక్షారాల మడి

—— ——————– వారాల ఆనంద్

 లోనేక్కడో

కన్నీటి కవాతు నడుస్తున్నది

ఊట ఎక్కడుందో తెలీదు కానీ

ప్రవాహం దేహమంతా

పరుగులు తెస్తూనే వుంది

కన్నీటి రూపాన్ని

బయటకు చూపలేక కళ్ళు   

రెప్పల్ని మూస్తూ తెరుస్తూ తంటాలు పడుతున్నాయి

కన్నీటి ప్రవాహ హోరును

ధ్వనించలేక పెదాలు

చిరు నవ్వుల్ని అరువు తెచ్చుకుంటున్నాయి

పూర్తిగా

 నేను కన్నీటి లోనో

కన్నీరు నాలోనో నిండి పోతే ఎట్లా

పుట్టి ఇట్లా మునిగి పోతే ఎట్లా

ఆనకట్ట తెగాల్సిందే

నిశబ్దం బద్దలవాల్సిందే

మాటో పాటో  పెగాలాల్సిందే

అక్షరాల మడి తడవాల్సిందే

================ 9440501281

======

బాధ

——————- వారాల ఆనంద్

బాధ 

ఎగిసిన ఉప్పెన

వినిపించదు

నిండా ముంచెత్తుతుంది

బాధ

ఉప్పొంగిన కెరటం

ఎగిసి దూసుకొస్తుంది

అలిసి విరమిస్తుంది

బాధ

ఎలుగెత్తిన మౌన రాగం

పెదాలు కదలవు గొంతు పెగలదు

లోన తీగలు తెగుతాయి

బాధ

మాయదారి మోసకారి

దానిది బహుదారి

నిశబ్ద రహదారి

బాధకు

భాష తెలీదు మౌనాన్ని కప్పుకుని

మాటల్ని మనసు కడలి లో దాచేసి

చదలు పట్టినట్టు తొలిచేస్తుంది

 ================== 9440501281

కొత్త దారులు

———————- వారాల ఆనంద్

ఆకాశపు వైశాల్యం చూసి

రెక్కలు విచ్చుకుని ఎగిరే పక్షి

భయపడి దిగులు చెందదు

 -అధిరోహించడమే

భూమి సాంద్రతను చూసి

పగిలి మొలకెత్తడానికి

విత్తు కలవరపడదు కలత చెందదు

-చీల్చుకుని చిగురించడమే 

లోయలూ పర్వతాలూ చూసి

మబ్బులోంచి రాలే చినుకు

వికలం చెందదు విఫలం కాదు

-తడిపి తరించడమే

ఉవ్వెత్తుతున్న అలల్ని చూసి

సాగరాన్ని చేరేనది

కంగారుపడదు వెనుదిరగదు

-ప్రవహించి సంద్రమవడమే

అడుగు తీసి అడుగు వేయడానికి  నీకే  

ఎన్ని దీర్ఘాలూ ఎన్ని చుట్టూ కొలతలు

ముందూ వెనుకా

-లాభ నష్టాల గణాంకం

వీరుడనే వాడే

పక్షవుతాడు చినుకవుతాడు

చిగురిస్తాడు ప్రవాహమై పరుగులు తీస్తాడు

కొత్తదారులు వేస్తాడు

=========================

మరణం

_______________ వారాల ఆనంద్

మరణం అంటే

మాటలుడిగి

మౌనం మిగలడం

గుండెల్లో ధ్వని ముగిసి

నిశ్శబ్దం ఆవరించడం

పాదముద్రలు కదిలిపోయి

జ్ఞాపకాల్లో మిగలడం

********

మరణం అంటే

పచ్చని ఆకులు రాలి

బికారీ కొమ్మ మిగలడం

రాగం తాళం తిర్లేసి మర్లేసి

దీనంగా ఏకగతిలో రోదించడం

ఆకాశం రెక్కలు తెగి

కిటికీలోంచి తొంగి చూడడం

*******

మరణం అంటే

చదివిన చదువూ చెప్పిన మాటా

ఇచ్చిన హామీ లను

తుండు గుడ్డతో తుడిచేయడం  

మడి బట్టల్ని విసిరేసి

తల విదిలించి వెళ్ళిపోవడం

***

మిత్రమా

నువ్విచ్చిన ధీమా

చూపిన దారీ

నాతోనే వున్నాయి

నీ మరణం

వాటిని వెంటేసుకు పోలేదు

మరి

——————————

(సృజకారుడూ సంస్కృత పండితుడూ,  ఆత్మీయుడు

నమిలకొండ హరిప్రసాద్ యాది లో)

===========================

స్థబ్దమయ కాలం

=========  వారాల ఆనంద్

స్థబ్దమయిన కాలంలో

నిశ్శబ్దాన్ని మోస్తున్నాను

తలుపులు కిటికీల గుండా

దుఖం ప్రవహిస్తున్నది

పై కప్పూ చుట్టూ గోడలూ

ఒత్తిడిలో వణికి పోతున్నాయి

ఇంట్లోనూ గుండెల్లోనూ 

గదిలన్నింటా చీకటి అలుముకుంది

మౌనం విశ్వ రూపాన్ని చూపిస్తోంది

అన్ని దారుల్లోనూ

ముళ్ళను పరిచారు

అన్ని మూలల్లోనూ

నిఘాల్ని నాటారు

వెన్నెల కాంతి లో వ్యాకులత

సూర్యుని వెలుగులో వేదన

కవి రచయితా కళాకారుడూ

ఎవరిని మీటినా

ఘనీభవిస్తున్న కలలు కనిపిస్తున్నాయి

కన్నీటి రాగాలు వినిపిస్తున్నాయి

కానీ

రుతువులు మారతాయి

కాలం ఒకేలా వుండదు

నిశ్శబ్దమే

కొత్త రాగానికి

నేపధ్య సంగీతమవుతుంది

మౌనమే

గుండె బద్దలవడానికి

నాంది పలుకుతుంది

====================

వినోదమా విషాదమా

——————

అక్కడేమో

పొలాల గట్లు తెగాయి

మొలకలు మౌనంగా రోదిస్తున్నాయి

మట్టి తొక్కిన కాళ్ళు

మౌనంగా వేదనగా రోదనగా

మహానగరం కేసి బారులు తీరుతున్నాయి

ఒక కంటిలో నదులనీ

మరో కంటిలో నిప్పులనీ నింపుకుని

నీటి తుపాకుల్ని ఢీకొంటున్నాయి

దేశపు ‘ఆహారగిన్నె’

అల్లకల్లోలం గున్నది

ఇక్కడేమో

నగరం నాలా ల్లో మురికి పులుముకుని

‘పిట్టల దొరలు’  పెడుతున్న ముచ్చట్లు వింటున్నాం

ఇది చావో బతుకో అన్నట్టు

మహాన’గరం గరం’ గా చేస్తున్న

దోమ్మరిగడ్డల విన్యాసాల్ని చూస్తున్నాం  

ఇది

వినోదమా విషాదమా

—————–

ఒడవని దుఖం గడవని రాత్రి

——————- వారాల ఆనంద్

‘చిక్కటి’ రాత్రి

ఎంత సౌకర్యం

నేరాల్ని కప్పెట్టేయవచ్చు    

సత్యాల్ని సమాధి చేయవచ్చు

‘కటిక’ చీకటి

ఎంత వెసులుబాటు

చితులు పేర్చవచ్చు

ఉలుకూ పలుకూ లేని

దేహాల్ని కాల్చేయవచ్చు

నిమ్మళంగా చేతులు కడుక్కోవచ్చు

మగదేహాల మోహ దాడిలో

వణికి చితికి పోయిన

చిగురు టాకుల్ని ఒదార్చేదెవరు

కాలిపోతున్న అమాయకపు

చితుల్ని ఆర్పేదెవరు

రాలుతున్న కన్నీటి చుక్కల్ని

లెక్కబెట్టేదెవరు

ఆరిపోతున్న ఊపిరి దీపాలకు

రెండు చేతులు అడ్డు పెట్టి ఆపేదెవరు

ఫిడేలు వాయిద్య నేపధ్యంలో

ఈ రాత్రి ముగియదు

ఈ చీకటి తెమలదు

ఈ దుఖం ఒడపదు

=======================

నడుస్తున్న కాల ముద్ర  

—————– వారాల ఆనంద్

తెల్లవారుతోంది పొద్దు గుంకుతోంది

కాలాన్ని నేనసలు దర్శించలేదు

పెద్దగా గమనించలేదు  గణించనేలేదు

కాలం నన్ను తోసుకు వెళ్లిపోతున్నదన్న

సోయే లేదు

నిద్రలో ముడుచుకుని

మెలకువలో నడిచి అంతా యదాలాపమే

దాటేసుకు పోతున్న

కాలాన్ని పిడికిట్లో ఎట్లా బంధించను

కానీ ఈ గడుసు కాలం

విచ్చుకోవడం ఒక్క చోట కనిపిస్తున్నది

ఉయ్యాలలో ముసి ముసి నవ్వులు నవ్వినవాడు

ముచ్చట్లు పెడుతున్నాడు

తాతా మాస్క్ అంటున్నాడు

బిడ్డ కొడుకును రారా పోరా అనొద్దు అన్నది

మా అమ్మమ్మ చూపిన బాట

చిన్నోడు  ప్రద్యుమ్న

పెద్దోడవుతున్నాడు

ఇవ్వాళ రెండు దాటి

మూడింట అడుగు పెడుతున్నాడు

నడుస్తున్న కాల ముద్ర

తన ముఖం మీద మెరుస్తూ కనిపిస్తున్నది

=================================

తెల్లారింది

————- వారాల ఆనంద్ ——————————— 9440501281

ఎవరో రాత్రంతా కూర్చుని

మబ్బులకు రంగులదినట్టున్నారు

అన్ని రంగుల్నీ కలగలిపి

కాన్వాస్ పై చిలకరించినట్టు

మబ్బులు చిత్ర చిత్రంగా మెరిసిపోతున్నాయి

సూర్యుడింకా మేల్కొనలేదు

నేను నది ఒడ్డున నడుస్తున్నాను

నీటి అలలపై

రంగుల మబ్బులు అందంగా గమ్మత్తుగా

ప్రతిబింబిస్తున్నాయి

అలల కదలికల్లో ఊయల లూగుతున్నాయి

నేనట్లా నీటి కేసీ మబ్బులకేసీ

మార్చి మార్చి చూస్తుండగానే

ఎవరో మబ్బుల్ని లాక్కెళ్ళారు

మబ్బుల వియోగానికి

నది తెల్లముఖం వేసింది

దానిపై దుఖపు నీడ ఆవరించింది

సూర్యోదయం ఆసన్నమయింది

భళ్ళున తెల్లారింది

వెలుగును కుమ్మరించింది

నా పైనా నది పైనా    

=========

నిశ్శబ్దం

————– వారాల ఆనంద్

నిశ్శబ్దం లో

ఒక ఓటమి

సంకేతం వుంది

నిశ్శబ్దం లో

ఓ గెలుపు

సందేశం వుంది

నిశ్శబ్దం

నా లోంచి నీలోకీ

నీలోంచి లోకంలోకి విస్తరిస్తుంది

అన్ని వేళలా

అన్ని కాలాల్లో

మన ముందు నిటారుగా

నిలబడుతుంది

మనలో నిలువెల్లా కరిగిపోతుంది  

నిశ్శబ్దం

శబ్దానికి వ్యతిరేక రూపమే కాదు

శబ్దానికీ శబ్దానికీ నడుమ

ప్రవహించే సెలయేరు

మాటకీ మాటకీ మధ్య

ఓ పారదర్శక ప్రవాహం

అయినా ఎన్ని శబ్దాలు కలిస్తే మటుకు

ఓ క్షణపు నిశ్శబ్దానికి దీటుగా నిలుస్తాయి

ఎన్ని మాటలు పలికితే మటుకు

నిశ్శబ్దం  పలవరించే భావానికి సమంగా మెరుస్తాయి

==================

నేనింకా మరణించ లేదు

——————— వారాల ఆనంద్  

ఒంటరితనం

గుండెల్లో స్థిరపడుతోంది

చేతులేమో

మీ సహచర్యాన్ని

మీ కరస్పర్శనీ

అభిలశిస్తున్నాయి

ఒంటరితనం క్రమంగా

గుండెల్లోంచి

దేహమంతా విస్తరిస్తోంది

జనంలో సమూహంలో

నన్నిట్లా ఒంటరిగా

వదిలేసిన వాళ్ళంతా

కుర్చీల్లో కుదురుకున్నారు

వందిమాగదుల కీర్తనలలో

పరవశిస్తున్నారు

అధికార ఛత్రచాయాల్లో

ఒరిగి పోయారు

బహుశ

ఇక్కడ జీవం లేనివారే

చెలామణి అవుతారేమో

నేనింకా

మరణించ లేదు 

——————– 9440501281