Month: June 2018

VOICE OF VARALA ANAND on SVR

Posted on Updated on

Advertisements

మబ్బు తునక (poem)

Posted on Updated on

మబ్బు తునక

——————– వారాల ఆనంద్

  వేడి గాడ్పుల్ని వెంటేసుకొని 

వెచ్చటి నిట్టూర్పులతో

వేసవి నా ముంగిట నిలిచింది

 

మంద్రస్వరంతో మాటల్ని

గుస గుసగా ధ్వనిస్తున్నది

 

నేనే పలకరిద్దామని

చేతులు సాచి బయటకు చూసాను

 

తడిలేని పొడి పొడి ‘వెల్తురు’ నిండా

అనంతమయిన దాహం కనిపించింది

 

ఎన్ని కడవలతో ఎన్ని కన్నీళ్ళతో

ఎట్లా తీర్చను

ఆ దాహాన్ని

 

గదిలోపల

నా మదిలోపల

నేనే తీరని దాహంతో

తీరం లేని సముద్రాన్నై వున్నానే

 

ఆకాశం కేసి చూస్తూ కూర్చున్నా

ఓ మబ్బు తునకయినా

కనిపించక పోతుందా అని

1530103913444_01

సాంత్వన (POEM)

Posted on Updated on

సాంత్వన

 మసకబట్టి మౌనం దాల్చిన  ‘మనసు’ను తేలిక చేద్దామని

తోటలో నాలుగు అడుగులు నడిచాను             

 కొమ్మ కొమ్మకూ విచ్చుకున్న పూలు

హరివిల్లులా హాయి గొల్పుతున్నాయి

 పరిమళాల భారానికి పూలేమో

తలలు వంచి నేల చూపులు చూస్తున్నాయి 

 దారిపొడుగూతా మట్టి రేణువులు

పూల ప్రేమతో పునీతమై పరవశిస్తున్నాయి

 పూల రెమ్మలకూ మట్టిపొత్తిల్లకూ నడుమ సాగుతున్న

రహస్య సంభాషణ నా మనసుకు పెద్ద ఊరట

 నడిచి వచ్చిన దారికి ప్రణమిల్లుతూ

నిలుచుండిపోయాను

 గొప్ప సాంత్వన

మనసుపై మసకలన్నీ మాయమయ్యాయి

                 – వారాల ఆనంద్swaanthana poem copy

ఆయన చరణాలు ఎక్కుపెట్టిన ఆయుధాలు

Posted on Updated on

రావికంటి రామయ్య 

                మన రాష్ట్రం, మన భాష, మన సాహిత్యం అన్న నినాదంతో  తెలంగాణ సాహితీ వేత్తలకు పెద్ద పీట వేసి తెలుగు సాహితీ క్షేత్రం లో తెలంగాణ సాహితీ వేత్తల ప్రతిభా విశేషాలు తెరపైకి  వచ్చిన సందర్భమిది.   ఆ క్రమంలో మరుగున పడ్డ కవులూ రచయితలూ వెలుగులోకి వచ్చి తెలుగు సాహిత్యంలో తెలంగాణ పాలు ఎంత?    తెలుగు సాహిత్య అభివృధ్ధికి తెలంగాణ సాహిత్యం  చేసిన దోహదం ఎంత అన్నది నిర్ధారించుకుంటున్న  సమయమిది.  ఈ నేపధ్యంలో తెలుగు  సాహిత్యానికి కరీంనగర్  జిల్లా అందించిన సాహిత్యం, aa ప్రాంత  సాహిత్యకారులు అందించిన సాహిత్యం తక్కువేమీ కాదు. అటు ప్రాచీన సాహిత్య ఒరవడిలో సాగిన పద్య సాహిత్య సృజనలో నయినా ఇటు ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో నయినా కరీంనగర్ జిల్లా పాత్ర గణనీయమయింది.  అందులో మంథని ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యం విశిష్టమయిన డి గా చెప్పుకోవచ్చు. సనాతన బ్రాహ్మణ కుటుంబాల నేపధ్యం వున్న ప్రాంతమయిన మంథని గోదావరి నదీ తీరం కావడం ఆ ప్రాంతానికి బలం. శాస్త్రీయ సంగీతానికీ సాహిత్యానికి కూడా మంథని వేదికగా నిలిచింది.

               ఆ క్రమంలో మంథని నుంచి  స్మరించుకోవాల్సిన కవి రావికంటి రామయ్య. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ ఎలాంటి గుర్తింపునకూ నోచుకోని  రావికంటి రామయ్య రచనని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలో మూడవ పాఠం లో పొందుపరిచారు. మంథని కవికి అందిన అపురూప గౌరవమది.

              తెలంగాణలో ఓ మారు మూల గోదావరి నది వుడ్డున వున్న గ్రామం మంథని. అదే గ్రామానికి మంత్రకూటమి ఆన్న పెరూ వున్నది. మంథని సనాతన సంస్కృతికి, సాహితీ సాంస్కృతిక  అంశాలకు ప్రసిద్ది. అలాంటి గ్రామంలో ప్రగతి శీలతకు, ఆధునిక భావాలకు ప్రతినిధి గా నిలిచిన విస్మృత కవి రావికంటి రామయ్య.    శతకాలు, గేయాలు, గొల్ల సుద్దులు, ఏకాంకికలు, బుర్రకథలు ఇలా ఒకటేమిటి అనేక సాహితి ప్రక్రియల్లో రచనలు చేసిన విశిష్ట మయిన కవి ఆయన.  నిత్యం సమాజం లో జరుగుతున్న అనేక విషయాలపయిన స్పందించి, ఆందోళన చెంది, ఎంతో ఆవేదనతో సూటిగా నిర్మొహమాటంగా  వాస్తవాల్ని ఆవిష్కరిస్తూ రచనలు చేశారు.

 ‘ కల్ల గాదు రావికంటి మాట’ అన్న మకుటం తో ఆయన రాసిన రచనలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. 

  ‘బాధ జెంద గోవు పాలనే ఇచ్చు

ముక్కలయిన చెరుకు చెక్కరిచ్చు

అట్టి గుణము నరుల కలవడే డెప్పుడో

కల్ల గాదు రావికంటి మాట

 అంటూ వర్తమాన సమాజంలో మనుషుల్లో స్వార్థం, అవినీతి లాంటి లక్షణాలు పెరిగిపోతున్న వాస్తవాన్ని రావికంటి రామయ్య తన పద్యం లో చెప్పాడు. నలిగి పోతూ కూడా గోవు, చేరకు పాలనూ తీపి నీ  ఇస్తాయి అలాంటి సద్గుణం మనిషికి ఎప్పుడు కలుగుతుందో అనే ఆయన ఆవేదన చెందుతాడు.

‘విలువలు మరిచిపోయి విహరించుటెన్నాళ్లు,

కల్తీ రహిత జగము కంపించుటెన్నడో

దైవమయిన నేడు డబ్బుకు దాసుడే

మనుషుల్లో మానవీయ విలువలు మృగ్యమయి పోతున్నాయని, వస్తువుల్లోనూ మనుషుల మనసుల్లోనూ కల్తీ పెరిగి పోతున్నదని, చివరికి దేవుడు కూడా డబ్బుకు దాసోహమయి పోతున్నాడని ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని కవితల్లో రాశాడు. ఆయన రాసిన అనేక చరణాలు సూటిగా ఎక్కు పెట్టిన ఆయుధాల్లా మన ముందు నిలబడతాయి.

      తెలుగు సాహితీ రంగంలో శతకాలు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రక్రియ, ఇవ్వాళ కూడా తెలంగాణ లోని ప్రతి గ్రామంలోనూ శతకాలు రాసిన కవులు మనకు కనిపిస్తారు. వాటిల్లో అధిక శాతం ఆధునిక సామాజిక అంశాల్ని తీసుకుని రాసినవి కనిపించడం తెలంగాణ కవుల చైతన్యానికి ప్రతీకగా చెప్పు కోవచ్చు. అట్లా ఉత్తమ భావాలతో సామాజిక అంశాలతో  

శతక రచన చేసిన గొప్ప కవి రావికంటి రామయ్య. ఆయన రచనల్లో నగ్న సత్యాలు, గీతామృతం, వరద గోదావరి, వాసవి గీత, శ్రీ గౌతమేశ్వరా శతకం , నల్లాల భాగోతం, రామ గుండం రాత్రిగండం , గొల్లసుద్దులు లాంటివి ప్రముఖ మయినవి.  రామయ్య గారి ‘నగ్న సత్యాలు” శతకం వర్తమాన సామాజిక దర్పణం. ఈ శతకం లోని పద్యాలు వేటికవే సమగ్రమయినవి , అందమయినవి, ఆకట్టుకునేవి. సమాజంలోని లోపాల్ని ఎత్తి చూపి వాటిపై కవి కొరడా జలిపించిన తీరు గొప్పగా వుంటుంది.  ఇందులో విద్యార్థులు, పాఠశాలలు, బస్సులు, రైళ్లు, క్యూలు, ఓట్లు వంటి అనెక అంశాల్ని నిశితంగా పరిశీలిస్తూ వాటిల్లోని వాస్తవాల్ని మన కళ్ళముందుంచుతాడు రామయ్య.

        ‘ కల్ల  గాదు  రావికంటి మాట’ అన్న మకుటంతో రాసిన నగ్న సత్యాలు రచన లో 108 పద్యాలతో పాటు ‘ సారా శూర సంహారం’ కూడా చేర్చారు. ఆటవెలదిలో సాగిన ఈ పద్యాలల్లో ఆలతి ఆలతి మాటలే కనిపిస్తాయి. పదాడంబరం మచ్చుకయినా కనిపించదు.  ఆయన రాసిన గౌతమేశ్వర శతకం గోదావరి ఒడ్డున మంథని లోని గౌతమేశ్వరును గురించి రాసింది కాగా ‘నల్లాల భాగోతం’, ‘ రామ గుండం రాత్రి గండం ‘ లాంటి రచనలు సామాజికాంశాల పైన రాసినవే.

       అవే కాకుండా ఆ యా సందర్భాలల్లో రామయ్య రాసిన కవితలు తెలంగాణ ఉనికిని తెలంగాణాకు సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాల్నీ వివరిస్తూనే వలస వాదుల దాష్టీకాన్ని ఎండగట్టాడు.

    2003లో గోదావరికి పుష్కరాలు వచ్చినప్పుడు

‘ఒక్క రాజమండ్రి కేన పుష్కరాలు

తక్కిన క్షేత్రాలన్నీ నిష్ఫలాలా ?

ధర్మపురి ,మంథెన్న, కాళేశ్వరం

పంచవటి పర్ణశాల భద్రాచలం,

ఎన్నో క్షేత్రాలున్నవి ఎంలాభం

అడ్డు కొనేటి  వాడేడి అడిగేటి  వాడేడి ?’

లాంటి తన రచనల ద్వారా నిలదీసిన కవి రావికంటి రామయ్య. ఆయనకు  ‘మంత్రకూట వేమన’ అన్న బిరుదూ  వుంది. అంతే కాదు కవిరత్న, ఆర్.ఎం.పి.9 రెడీ మేడ్ పోయేట్) అన్న బిరుదులూ వున్నాయి.

                 1936 లో జూన్ 17 న జన్మించి నలభయి ఏండ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన రావికంటి రామయ్య జీవితంలో అధ్యాపకత్వం సాహిత్యం అంతఃర్ భాగ మయి పోయాయి.  మంథని నుండి సాహిత్యంలో ఎదిగిన అనేక మంది కవులకూ రచయితలకూ ఆయన స్పూర్తి నిచ్చిన వాడు. ఎప్పుడు ఎక్కడ కవిసమ్మేళన మయినా రావికంటి రామయ్య పఠనం లేకుండా ముగిసేది కాదు. అత్యంత సీదా సాద  జీవితాన్ని గడిపిన రావికంటి రామయ్య ఆలతి ఆలతి పదాల్లో రాసిన రచనలు సామాన్యుడికి కూడా అర్థంయి మనస్సుకు హత్తుకునే విధంగా వుంటాయి. తెలుగుతో పాటు ఉర్దూలో కూడా మంచి ప్రవేశమున్న ఆయన పిల్లల్లో పిల్లవాడిగా, కవుల్లో కవిగా సులభంగా కలిసి పోయి  అందరితో ఆత్మీయంగా మెలిగే వాడు. ఆయన 30-3-2009 లో పరమ పదించారు.

           సులభ శైలి లో రాసి  మన్ననలు పొందిన రావికంటి రామయ్య రచన లు ఇన్నేళ్లకు స్వతంత్ర తెలంగాణలో వెలుగు చూడడం పాఠ్య పుస్తకాల్లో  చోటు లభించడం గొప్ప గౌరవంగా భావించాలి.

        అంతేకాదు కవుల్ని గౌరవించుకునే పద్దతిలో కరీంనగర్ ప్రాంతానికి ఒక విశిష్టత వుంది. ఇక్కడ కవుల్ని కేవలం సభలతో అవార్డులతో మాత్రమే గుర్హుంచు కోకుండా పలువురు కవులకు విగ్రహాలు నెలకొల్పి చిరస్థాయిగా వారిని స్మరించుకునే సాంప్రదాయం వుంది. aa క్రమంలో జగిత్యాల లో అలిశేట్టి ప్రభాకర్ విగ్రహం, గుండారెడ్డిపల్లె లో వరకవి సిద్దప్ప విగ్రహం, కరీంనగర్లో ముద్దసాని రాం రెడ్డి విగ్రహం, జగిత్యాల రాఘవపట్టణం లో రామసింహ కవి విగ్రహం ఏర్పాటు చేసారు. ఇట్లా కవులకు సాహితీకారులకు విగ్రహాలు పెట్టిన సంస్కృతి అతి కొద్దిప్రాంతాల్లో చూస్తాం. అదే క్రమంలో మంథని వాసులు రావికంటి రామయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమయిన కూడలిలో ఆయన స్మృతిగా ఏర్పాటవుతున్న విగ్రహం ఓ గొప్ప కవికి అందుతున్న విశిష్టమయిన గౌరవంగా చెప్పుకోవాలి.

       మన కవుల్ని కళాకారుల్ని మనం గౌరవించుకునే సంస్కృతిని కొనసాగిస్తున్న మంథని వాసుల్ని విగ్రహ ప్రతిష్ట కమిటీని హృదయపూర్వకంగా అభినందించాలి.

     మంత్రకూట వేమనగా ప్రసిద్దిచెందిన రావికంటి రామయ్య గారి సృజనకు, స్మృతికి తల వంచి నివాళి అర్పిస్తున్నాను.  

-వారాల ఆనంద్  

Layout 1Layout 1Layout 1

POEM by Varala Anand

Posted on Updated on

  ‘పడవ ప్రయాణం’

—————-

 ఈ యాత్ర చాలా కాలం సాగేట్టుంది

కాగితప్పడవ మీద ప్రయాణం కదా          

                                                                                  

అక్షరాల తెరచాప ఆసరాతో

నడుస్తున్న నడక

చేరాల్సిన గమ్యం  దూరమే

మార్గమూ కఠినమే

 

ఆత్మను అరచేతిలో పొదువుకుని

ఒంటరి లోకాన్ని దాటుకుంటూ

క్లిష్టమయిన మబ్బుల్నీ సరళమయిన వెన్నెలనీ

సన్నిహితంగా పొదువుకుని

 

నడక సాగుతున్నది

 

మూతలు పడుతున్న కళ్ళతో

కన్నీటి ధారల్ని వెంటేసుకుని

అనేకానేక గ్రహాల్ని దాటుకుంటూ

నక్షత్ర తీరం వైపు సాగుతున్న ఈ యాత్ర అనంతమేమో

భావాల అలల మీద కాలం నిలుస్తుందా

పడవ తీరం చేరుతుందా

 ఇది నా ఒక్కడి ప్రయాణమేనా ఏమో..

  —————– వారాల ఆనంద్

 ‘పడవ ప్రయాణం_ 1

 

.