Education

యాదోంకి బారాత్ -18= కరీంనగర్- 1974- మూల మలుపు

Posted on

యాదోంకి బారాత్ -18 

++++++++++

===============  

మనిషి బతుకు దారిలో ఎత్తు పల్లాలూ, తిన్నని దారులూ, మలుపులూ మూల మలుపులూ అత్యంత సహజం. అన్నింటినీ దాటుకుంటూ పడుతూ లేస్తూ సాగే ప్రయాణంలో గెలుపోటముల ఉద్విగ్నత ఉన్నప్పటికీ బతికామనే భావన వుంటుంది. BORN WITH SILVER SPOON లో మజా ఏముంటుంది.

అందరిలాగే నా జీవితపు గతుకుల రోడ్డులోనూ అనేక మలుపులున్నాయి. అందులో 1974 ప్రధాన మూల మలుపు. అప్పటిదాక వున్న మిఠాయి దుకాణపు ఇంట్లోనూ, చదువులో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ కాలేజీలో చేరడమూ రెండూ పెద్ద కుదుపులే.   

మా నాన్న పుట్టిందీ పెరిగిందీ ఆయన పెళ్ళీ, పిల్లలూ, అప్పటిదాకా గడిపిన జీవితం అంతా మిఠాయి దుకాణపు ఇంట్లోనే. ఆయనెప్పుడూ అది తన ఇల్లు కాకుండా పోతుందని తాను పరాయి వాడిని అవుతానని ఊహించను కూడా లేదు. నేను కూడా పుట్టిందీ ఇంటర్ దాకా సాగిందీ అక్కడే. ప్రేమలూ అవమానాలూ  అనుభవించిందీ ఆ ఇంట్లోనే. మా పెద్ద నానమ్మ ఆ ఇంటి మూలస్థంభం మిఠాయి సత్యమ్మ మరణం తర్వాత అక్కడ అనేక కొత్త పరిణామాలు జరగడం మొదలెట్టాయి. మా పెద్దనాన్న ఒకరు నాన్నను మమ్మల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తిట్టడం మొదలెట్టాడు. మా నాన్నను ఎప్పుడో చిన్నప్పడు వేములవాడ వాళ్ళ చిన్నాయన స్వామి పెంపకం తీసుకున్నాడని ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆయన వాదన. విపరీతంగా తాగి అంతకు మించి విపరీతంగా గొడవ చేసాడు. మాటల్ని తిట్లనీ ఇక భరించరాని స్థితిలో మా అమ్మనూ  అయిదుగురు పిల్లల్నీ తీసుకుని నాన్న మిఠాయి దుకాణపు ఇల్లు ఖాళీ చేసాడు. దశాబ్దాల పాటు అల్లుకున్న గూడును వదిలేసి పెట్టె బేడా సర్దుకుని వెళ్ళడంలో ఆయన పడ్డ వేదన నేనెరుగుదును. శ్రీనివాస్ జీపులోనూ రిక్షాలోనూ సామానంతా సర్ది ఆగస్ట్ 1974లో మంకమ్మ తోటలోని ఓ మూల నున్న ఇంట్లోకి కిరాయికి మారిపోయాం. ఇంటి ఓనర్  సాయన్నకుటుంబం మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది. మెయిన్ రోడ్డు మీద ఇంద్రభవన్ ముందు ఓ సలూన్ షాప్ వాళ్ళది.

ప్రతి రోజూ బావి లోంచి నీళ్ళు తోడుకుంటూ సాయన్న పాడే ‘నాస్తిక్’ సినిమాలో పాట “ దేఖ్ తేరి సంసార్ కి హాలత్ క్యా హోగయి భగవాన్…. కిత్నా బాదల్ గయా ఇన్సాన్’ నా కిప్పటికీ గుర్తే.

………….

కిరాయి ఇంట్లోకి మారింతర్వాత ‘మామూలుగా వెళ్ళమని చెబితే పోయేదానికి తిట్లూ శాప నార్తాలూ అని’ మా అమ్మ పడ్డ బాధ నా కిప్పటికీ యాది కొస్తే కోపం తారస్థాయికి చేరుతుంది. అప్పటినుంచి తీవ్రమయిన కోపంతో నేను 10-15 సంవత్సరాల పాటు మిఠాయి దుకాణము కాదు కదా క్లాక్ టవర్ చుట్టూ తిరిగాను కాని తూర్పు వైపు దారి కూడా తొక్కలేదు.

మంకమ్మ తోటలో మూడు గదుల కొత్త ఇల్లు. ముందు రెండు గదులు నడుమ ఖాళీ స్థలం తర్వాత వంటిల్లు. వంటింట్లో ఫ్లోరింగ్ లేక అలుక్కోవడం. బావినుంచి నీళ్ళు తోడుకొని రావడం అంతా కొత్త అనుభవం.. నౌకర్లూ చాకర్లూ వున్న పెద్ద ఇంట్లోంచి వచ్చిన అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మేము అయిదుగురం పిల్లలం, చదువుకోవడానికి అక్క దగ్గరికి వచ్చిన మా మేనమామ మంగారి రాజేందర్ అమ్మా నాన్న అందరమూ ఆ చిన్న ఇంట్లోనే.. ఎట్లా సర్డుకున్నామో ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మా అమ్మకు తన పిల్లలకంటే తమ్ముడి మీదే ప్రేమ ఎక్కువగా వుండేది. వసతి ఆహార పానీయాల విషయంలో మొగ్గు ఎక్కువగా వుండేది. తర్వాత కొద్ది రోజులే అయినా మా పెద్ద మేనమామ కొడుకు శివ ప్రసాద్ కూడా అమ్మ దగ్గరే వుండి చదువుకున్నాడు. ఇక తర్వాతి కాలంలో మా కిష్టాపూర్ సుమిత్ర పెద్దమ్మ కొడుకు నోముల రాజ్ కుమార్ ఆతని చెల్లెలు రాజ్య లక్ష్మి కూడా తమ తమ చదువుల్ని మా అమ్మ దగ్గరే వుండి పూర్తి చేసుకున్నారు. అందరినీ మా అమ్మ ‘అమ్మ’ లాగే చూస్కుంది. పెద్దమ్మ ఇంటినుంచి బియ్యమో పప్పులో, వడియాలో వచ్చేవి.

———   

కుటుంబ వాతావరణంలో మలుపులు ఇట్లా వుంటే చదువు విషయంలో మరో మలుపు డిగ్రీ లో చేరడం. ఇంటర్ చదువు ఖార్ఖాన గడ్డ కాలేజీలో పూర్తి అయింది.దాదాపు అంతా పాసయ్యాం రక రకాల క్లాసుల్లో నాకు సెకండ్ క్లాస్ వచ్చింది. నెక్స్ట్ అందరి దృష్టీ మెడిసిన్ పైనే. అప్పటికి డి.బోస్ గైడ్ ఒక్కటే దిక్కు. దామోదర్ నేనూ వెంకట్, రాధాకృష్ణ అందరమూ దరఖాస్తు చేసాం. నాకు 16 ఏళ్ళు పూర్తిగా నిండలేదని వయసు సరిపోదని రిజెక్ట్ చేసారు. డీలా పడిపోయాను. తర్వాత ఎవరో మహానుభావుడు కోర్టును ఆశ్రయిస్తే పరీక్ష చివరి క్షణాల్లో కోర్టు అనుమతినిచ్చింది. ఏముంది ఆఘమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి అప్పటికే ఈసామియాబాజార్ లో ‘రాతిభవన్’లో టిఖానా ఉంటున్న వేములవాడ మిత్రులు ఎడ్ల రాజేందర్ రవి ల గదికి వెళ్లి మర్నాడు పరీక్షకు వెళ్లాను. కోటీలో కిషోర్ కేఫ్ లో చాయ్ తాగి చాంతాడు పొడవున్న లైన్ లో నిలబడి పరీక్ష రాసాను. గొప్పగా కాదు గాని బాగానే రాసాను అనిపించింది. కానీ ఫలితం చూస్తె ప్రభుత్వ కాలేజీలో అంటే ఒస్మానియా, గాంధి లలో సీటు రాలేదు. మాలో ఒక్క రాధాకృష్ణ మాత్రం సాధించాడు. వరంగల్ లో వున్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ అప్పుడు ఏడు వేల అయిదువందలు డొనేషన్ కట్టాలి. ఆర్ధిక స్థితి అంత లేదు. వేములవాడ మేనమామ డాక్టర్ రఘుపతి రావు కడదామని ముందుకు వచ్చాడు. అప్పుగా నయినా సరే నన్నాడు కానీ నాన్న అంగీకరించలేదు. మళ్ళీ ఏడూ రాస్తాడు మెరిట్ లో వస్తుందిలే అన్నాడు. దాంతో మెడిసిన్ తప్పి పోయింది తర్వాత  ఏడు  రాసినా రాలేదు. ఎస్.ఆర్ ఆర్. లో డిగ్రీ లోస్ సెటిల్ అయిపోయాను.

ఎస్.ఆర్ ఆర్. డిగ్రీ కాలేజీలో చెరేనాటికే కొంత సాహిత్య స్పృహ చదవడం పెరిగింది. అప్పటికి కేవలం వ్యాపార నవలలు,డిటెక్టివ్ నవలలే పరిచయం ఉండేది. కాని క్రమంగా చదివే తీరు మారింది. చదివే పుస్తకాలూ మారాయి. ఆ సమయంలోనే మాతోనే వుండే మా అమ్మ తమ్ముడు మంగారి రాజేందర్ సహచర్యం, వేములవాడ నటరాజకళానికేతన్ కార్యక్రమాలూ నా సాహిత్య జీవితంపై ప్రభావం చూప సాగాయి. క్రమంగా శ్రీ శ్రీ కవిత్వం, నవలల్లో అల్పజీవి, అసమర్థుడి జీవయాత్ర, చివరకు మిగిలేది, కాలాతీత వ్యక్తులు, అంపశయ్య, చలం సాహిత్యం చదవడం ఒక పెద్ద మలుపు. కాలేజీలోనే ఎకనామిక్స్ విభాగంలో అంపశయ్య నవీన్ లెక్చరర్ గా వుండడం,మాకో ప్రేరణ. ఆయన ఇల్లు కూడా మంకమ్మ తోటలోనే వుండడంతో అప్పుడప్పుడూ ఆయన ఇంటికి వెళ్ళే వాళ్ళం రాజేందర్ అప్పటికి స్వాతి పేరుతో కథలు రాయడం ఆరంభించాడు. దాంతో నవీన్ ఆయన్ని ఏం స్వాతి అని పిలిచేవాడు. నాకున్న స్టామర్ సమస్య వాళ్ళ ఎక్కువా వినడమే తప్ప మాట్లేది తక్కువగా వుండేది. ఇంట్లో సైన్స్ పుస్తకాల తో పాటు సాహిత్యం కూడా కనిపించడం ఆరంభించింది. అయితే నాన్న కానీ అమ్మ కానీ ఎపుడూ అభ్యంతర పెట్టలేదు.

అట్లని డిగ్రీ చదువు మీద అలక్ష్యం కూడా ఎప్పుడూ లేదు. అయితే అ కాలంలో డిగ్రీలో ప్రతి   ఏటా పరీక్షలు కాకుండా ద్వితీయ సంవత్సరం తర్వాత పార్ట్ 1 అని ఇంగ్లీష్, హిందీ/తెలుగు పరీక్షలు ఉండేవి. తృతీయ సంవత్సరం చివర మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు. దాంతో పారేక్షలు అనే భయమే వుండేది కాదు. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ అటు చదువు విషయంలోనే కాదు మిగతా అన్ని సామాజిక సాంస్కృతిక విషయాల్లో నాకో ఐ ఓపెనర్.

అంతకు ముందు మా కాలేజీ ప్రిన్సిపాల్లుగా విశ్వనాధ సత్యనారాయణ, ఐ.వీ.చలపతి రావు లాంటి అనేక మంది గొప్పవాళ్ళు పనిచేసారు. ఇక నేను ఆ కాలేజీ లో చేరేనాటికి సాహితీ వేత్తలు శ్రీ వెల్చాల కొండల రావు ప్రిన్సిపాల్గావున్నారు. తర్వాత కే.వై.ఎల్.నరసింహా రావు వచ్చారు. మంచి వాతావరణం వుండేది.

     ఇంటర్ తెలుగులో సరయిన మార్కులు రాలేదని డిగ్రీ తెలుగు మీడియంలో చేరాను. మిగతా ఇంటర్ మిత్రులు అనేక మంది ఇంగ్లిష్ మీడియం లో చేరారు. దామోదర్ హైదరాబాద్ కు వెళ్ళాడు. ఖాజా లాంటి మిత్రులు సైన్స్ వదిలేసి బి.కాం, లో చేరాడు. బి.ఎస్సీ.లో మాది బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులు. సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు కూడా బాగాచేప్పేవాళ్ళు. 

బాటనీ వరకువచ్చేసరికి బాగా గుర్తున్న మేడం రఫియా సుల్తానా. చాలా అందంగా చలాకీగా వుండేది. బాగా చెప్పేది. హిందీ పాటలన్నా సినిమాలన్న తనకిష్టం. మనకది కామన్ ఇంటరెస్ట్ కదా అందుకే తను బాగా కనెక్ట్ అయింది. ఒకటి రెండు సార్లు ఆదివారాలలో తన ఇంట్లో మా చెన్న రెడ్డి ప్రసాద్ లాంటి వాళ్ళ గాన కచేరీ వుండేది. ఇక మరొకరు జనార్ధన చారి బ్లాక్ బోర్డ్ పై ఆయన వేసే బొమ్మలు అద్భుతంగా ఉండేవి. పోతే జువాలజీ లో ముగ్గురు సార్లు బాగా చెప్పారు. ఒకరు మా క్లాస్మేట్ రవీందర్ వాళ్ళ నాన్న మధుసూదన్ రావు గారు, మరొకరు జోసెఫ్ భాస్కర్, ఇంకొకరు నాంపెల్లి మధుబాబు. మంచి టీచర్ కావడంతో పాటు మంచి స్టేజీ నటుడు. వేములవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ కుటుంబంనుంచి వచ్చారాయన. త్యాగారాయ లలిత కళా పరిషత్ తదితర సంస్థలతో ఆయన కరీంనగర్ కళాభారతిలో మంచె సత్యనారాయణ, రంగాచారి తదితరులతో కల్సి ఎన్నో నాటకాలు వేసారాయన.

ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే ఎం.వీ.నరసింగ రావు, జీవీజీ, కృష్ణమోహన్, ఆనందం, ఖురేషీ తదితరులు బాగా చెప్పేవాళ్ళు. ద్వితీయ భాష హిందీ లో బంకట్ లాల్ అగర్వాల్ గుర్తున్నారు తర్వాత ఆయన ప్రిన్సిపాల్కూడా అయ్యారు.

అట్లా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ సబ్జెక్టుల విషయంలో ఎంతగా ప్రభావం చూపిందో ఆ ‘కాలం’ సాహిత్య రంగం విషయంలో కూడా అంతే ప్రభావం కలిగించింది… ఆ వివరాలు మళ్ళీ వారం…

-వారాల ఆనంద్

Posted on

పుస్తకమే ఒక జ్ఞాననిధి

Thu,January 25, 2018 01:19 AM

హైదరాబాద్ బుక్‌ఫేర్ తన బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయం. ఇలాంటి ప్రదర్శన అన్నీజిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రం పుస్తకాల తెలంగాణగా, చదువరుల తెలంగాణగా మారిపోతుంది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. పుస్తక పఠనంతో బాధ్యత గల పౌరులు తయారవుతారు.ఉత్తమ విలువల సమాజం ఏర్పడుతుంది.

పుస్తకం ఒక జ్ఞాననిధి. అనుభవాల గది, అనుభూతుల సారధి. భాషకు, భావానికి, వ్యక్తీకరణకు అది ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది పుస్తకం. అంతటి విలువగల పుస్తకాన్ని, దాని అవసరాన్ని, చదివే సంస్కృతిని పెంపొందించేందుకు గాను పుస్తక ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర గొప్పది. ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాల ను, ఉద్యమాలను, ఉద్వేగాలను ఒకటేమిటి మనిషి సమస్త మార్పులను పుస్తకం తనలో నిబిడీకృతం చేసుకొని సాక్షీభూతంగా నిలబడింది. అలాం టి పుస్తకాలు అనేకమందికి చేరడం, విస్తృతంగా చదువడం అవసరం. ఆ అవసరాన్ని హైదరాబాద్ బుక్ ఫేర్ పూర్తిచేస్తున్నది. లక్షలాదిమంది పుస్తక ప్రదర్శనకు రావడమే కాకుండా పుస్తకాల అమ్మకాల పరిస్థితి చూస్తుంటే పుస్తకాల భవిష్యత్తు మీద చదివే అలవాటు మీద గొప్ప ఆశలు ముప్పిరిగొంటున్నాయి. ఎంతో ఆశావహమైన స్థితి కనిపిస్తున్నది. పుస్త కాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిదన్నట్టు ఇండ్లల్లోకి పుస్తకాలు చేరి తే చదువడం తప్పకుండా అలవాటవుతుంది. పుస్తక విక్రేతలు చెబుతున్నదాని ప్రకారం ఊహించనివిధంగా లక్షలాది రూపాయల పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. సందర్శకుల సంఖ్య పెరుగుతున్నది. అంటే జనం లో చదివేవాళ్లు ఉన్నారు కానీ, వారికి వాటిని అందించడంలోనే వైఫల్యాలున్నాయన్నది ఇప్పుడు రుజువవుతున్నది.
భారతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఆచార్య రంగనాథన్ చెప్పినట్టు పుస్తకాలు ఉపయోగపడాలి. ప్రతి పుస్తకం తన చదువరిని చేరాలి, ప్రతి చదువరీ తన పుస్తకాన్ని చేరాలి అట్లా పుస్తకాల పరిధి విస్తృతమై అందరిని చేరగలిగినప్పుడు అవి సార్థకమవుతాయి. వాటి లక్ష్యమూ నెరవేరుతుంది. ఆ పనిని ముఖ్యంగా పౌర గ్రంథాలయాలు, విద్యాసంస్థ ల్లో ఉండే గ్రంథాలయాలూ నెరవేర్చాలి. కానీ పెరిగిన సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు పుస్తకాలను పూర్వపక్షం చేస్తున్నాయి. పుస్తక పఠనం తగ్గిపోవటం మంచి పరిణామం కాదన్నది నిజం.

21వ శతాబ్దంలో ఆధునిక తరం చదివే సంస్కృతి నుంచి వెరైపోతూ చూసే సంస్కృతికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్దకాలం నుం చి ఒక్క చదివే అలవాటు మినహా అన్ని అలవాట్లు పెరిగాయి. అంతా చూడటమే. టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు. స్మార్ట్ ఫోన్ మాట్లాడానికంటే బొమ్మలు వీడియోలు చూడటానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒకటేమిటి అన్ని చూడటమే. దీనికి చిన్న పిల్లల నుంచి మొదలు అందరూ ఇలా చూసేందుకు అలవాటు పడిపోతున్నారు. అక్షరాలు రాయడానికి, చదువడానికి కూడా ఇమేజ్‌లనే వాడే సం స్కృతి వచ్చింది. ఒక మంచి పుస్తకం చదువుతూ గుండెల మీద ఉంచుకొని నిద్రపోయినప్పటి ఆనందం నేటి తరానికి తెలియకపోవడం ఒకింత విచారకరమే.

సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు.. పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందనో, పుస్తకం ఇచ్చిపుచ్చుకునే నెపం మీదో మాటలు కలిపి, ఏర్పరుచుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో. ఆధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని చూస్తూ కవి పడ్డ బాధ అది. పుస్తకం హస్తభూషణం అన్న స్థితి నుంచి నేడు పుస్తకం పురావస్తువు అయిపోయే స్థితి కనిపిస్తున్నది. ఇవ్వాళ పుస్తకం చదువడం అంటే విద్యాలయాల్లో మార్కులు ర్యాం కులు సాధించడానికి పరిమితమైపోతుండగా, పౌర గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల కోసం చదువడమే మనకు కనిపిస్తున్నది. ఫలితంగా మానవీయ విలువల ప్రాధాన్యం, సామాజిక రంగంలో వేళ్లూనుకుంటున్న సం క్లిష్టతలను, మానసిక సంక్షోభాలను ఆవిష్కరించిన పుస్తకాలను చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోతున్నది. ఫలితంగా వ్యక్తిగత సామాజిక సంక్లిష్టతలు అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలకూ అవకాశం కలుగుతున్నది.

ఈ స్థితికి సాంకేతికత, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలూ కారణమనే వాదన వినిపిస్తూ ఉంటుంది. నేటి సాంకేతికత కూడా తాత్కాలికం గా పుస్తకాన్ని మరుగునపరిచినట్టు కనిపించినా దాన్ని సరైనదిశలో విని యోగించగలిగితే భౌతికంగా సాంకేతికత పుస్తక రూపాన్ని మింగేయవ చ్చు. కాని భాషను, భావాలను మింగేయలేదు. చదువడం అనే ప్రక్రియ కు సంబంధించి పాఠకుల అలవాటు పేజ్ రీడింగ్ నుంచి స్క్రీన్ రీడింగ్‌కు మారింది. కానీ ఆ స్థితిని ఎట్లా సరైన దిశలో మార్చుకోవాలో ఆలోచించాల్సి ఉన్నది.

సాంకేతికత దాని పర్యవసానాలను పక్కనబెట్టి చదివే అలవాటును ఎట్లా పెంచాల్నో ఆలోచించి అమలుచేయాల్సి ఉన్నది. పుస్తకాలు చదు వడం వల్ల ఒనగూడే వ్యక్తిగత పరిణామమూ, పెరిగే అవగాహననూ అర్థం చేయించాలి. ఒక మంచి పుస్తకాన్ని చదివి జీర్ణించుకొని, మనసు లోపల ఇమిడించుకోవడంలో ఉన్న ఆనందాన్ని అర్థం చేయించా లి. అది ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్ల్లో జరుగాలి. లైబ్రరీల ను ఈ గ్రంథాలయాలు, డిజిటల్ గ్రంథాలయాలు అంటూ ఆధునిక వసతులు కల్పిస్తూనే విద్యార్థు ల్లో, యువకుల్లో చదివే అలవాటును పెంపొందించే కార్యక్రమాలు జరుగాలి. చదివే సంస్కృతిని పెంపొందించాలి. దానికి ప్రధానంగా తరగతి గదులు, గ్రంథాలయాలు వేదిక కావాలి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికే కాకుండా ఆలోచనల్లో విశాలత్వం పెంచుకోవడానికి, సామాజిక బాధ్యతను గుర్తెరుగడానికి పాఠ్య పుస్తకాలే కాకుండా సాహిత్యం, చరిత్ర లాంటి అనేక అంశాల పుస్తకాలు చదువాలని టీచర్లు చెప్పాలి. అప్పుడు విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది. పుస్తకాల మీద ప్రేమ కలుగుతుంది.
anand
గ్రంథాలయాల సేవలు ఎప్పటికప్పుడు విస్తరించాలి. గ్రంథాలయం ఒక సాంస్కృతిక కేంద్రం కావాలి. పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలిపే పుస్తక పరిచయ సభలు, ముఖాముఖి కార్యక్రమాలు, రీడ్ అండ్ రివ్యూ కింద పుస్తక సమీక్ష సభలు, పోటీలు ఏర్పాటుకావాలి. అలాగే దృశ్య మాధ్యమాన్ని కూడా ఒక ప్రధానాంశంగా తీసుకొని ప్రేరణ కలిగించే జీవిత చరిత్రల డాక్యుమెంటరీలు, సుప్రసిద్ధ రచనల దృశ్యరూపాల ప్రదర్శనలు ఏర్పాటుచేయాలి. సాక్షరతా మిషన్ లాగా లైబ్రరీ మిషన్, రీడర్‌షిప్ మిష న్ చేపట్టాలి. ఆ క్రమంలో హైదరాబాద్ బుక్‌ఫేర్ తన బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయం. ఇలాంటి ప్రదర్శన అన్నీ జిల్లా కేంద్రాల్లో ఏర్పా టు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రం పుస్తకాల తెలంగాణగా, చదువరుల తెలంగాణగా మారిపోతుంది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. పుస్తక పఠనంతో బాధ్యత గల పౌరులు తయారవుతారు. ఉత్తమ విలువ ల సమాజం ఏర్పడుతుందిeef8fe05-6f05-4f94-bcbb-7d40eb5443f9.jpg

రాష్ట్ర స్థాయి బాలల చలన చిత్రోత్సవం

Posted on Updated on

రాష్ట్ర స్థాయి బాలల చలన చిత్రోత్సవం నిర్వహించాలి

varala emblem

         తెలంగాణ సంస్కృతీ, కళాకారులూ తదితర అనేక అంశాల పాయిన దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం బాలాల గురించీ వారికి విద్యాతోపాటు వినోదాన్నీ మానసిక వికాసాన్నీ అందించే క్రమంలో ఆలోచించాల్సిన అవసరం వుంది. ప్రభుత్వమేమో విద్యా పట్ల రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు పట్ల ఆలోచిస్తున్నది.

దానితోపాటు బాలల మానసిక వికాసానికి అవసరమయిన సృజనాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి వుంది. అందులో భాగంగా నవంబర్ 14 బాలల దినోత్శ్వమ్ సందర్భంగా రాష్ట్రస్థాయి బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించాల్సిన ఆవరమ్ వుంది. ఈ ఏడు జాతీయ బాల చలన చిత్రోత్సవం జైపూర్ లో జరుగు తున్నది.తెలంగాణ లో రాష్ట్ర స్థాయి చలన చొత్రోత్సవం నిర్వహించాల్సిన అవసరం వుంది.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ప్రతిష్టాత్మక నిర్వహణ ఆ నగరానికి, ఆ రాష్ర్టానికి, దేశానికి విశేషమైన ప్రతిష్టని తీసుకు వస్తాయి. కేన్స్, బెర్లిన్, కార్లోవివారి చిత్రోత్సవాలు ఆ నగరాలకు దేశాలకు ఎంతటి పేరు తెచ్చాయో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత మన హైదరాబాద్ కూడా అలాం టి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు వేదికై విశ్వ వ్యాప్త గుర్తింపును సాధించాలని మంచి సినిమాల ప్రేమికులు ఆశించారు .

సరిగ్గా ఆ అవకాశం నవంబర్ లో జరిగే బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ద్వారా కొంతమేర తీరుతుందని ఆశించాలి. అయితే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు బాలల ఉత్సవాలు రెండూ కొంత భిన్నమైనవి. బాలల చిత్రోత్సవాలు పిల్లల కోసం ప్రత్యేకించ బడినవి. ఈ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లో వున్న చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా రెండేండ్లకోసారి నిర్వహిస్తుంది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రథమ భారత ప్రధాని నెహ్రూ ఆలోచనల మేరకు నియమించబడి న ఎస్.కె.పాటిల్ కమిటీ సూచనల ప్రకారం 1955లో ఏర్పాటయింది.

బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, రెండేండ్లకోసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే దేశంలోని వివిధ నగరాల్లో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. 1995 లో మొదటి సారిగా మన హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించారు. తర్వాత 1999 లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు ఒక శాశ్వత వేదిక వుండాలని హైదరాబాద్‌ని ప్రతిపాదించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. అంతే కాదు రాష్ట్రం లో నిర్మించే బాలల చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే గొప్ప నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది.

చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీకి భూమి ఇస్తామని అందులో శాశ్వత కార్యాలయం, ప్రత్యేక థియేటర్లు నిర్మించుకోవాలని సూచించింది. అయితే ఇదంతా ఆర్భాటమే తప్ప సీమాంధ్ర పాలనలో అవేవీ సాకారంకాలేదు. భూమి ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఆధీనం చేయలేదు. ఇంతలో కేసులు వగైరాలతో అది మూల బడింది. ఇప్పటికీ శాశ్వత వేదికకు ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. దాంతో శాశ్వత వేదిక విషయమై పునరాలోచనలో పడ్డట్టు వార్తలొచ్చాయి. ఇప్పటికీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం టూరింగ్ ఫెస్టివల్ గానే మిగిలిపోయింది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ అధికారులు రెండేం డ్లకోసారి హైదారాబాద్ వచ్చి ఏదో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహించాము అనిపించి అది అయిపోగానే పెట్టె బేడా సర్దుకుని వెళ్ళిపోతారు. నాటి సీమాంధ్ర పాలకులు అం తర్జాతీయ వేదిక పైన ఉపన్యాసాలు దంచి చేతులు కడుక్కుని వెళ్లిపోవడం జరిగేది. మళ్ళీ రెండేళ్ల దాకా బాలలు, వారి సినిమాల గురించిన ఊసే వుండదు. రెండేండ్లకోసారి హడావు డి చేయడమే మిగులుతుంది.

నిజానికి పిల్లల మనో వికాసానికి సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. చదువు మేధస్సు ఎదుగుదలకు, క్రీడలు శారీరక ఎదుగుదలకు తోడ్పడితే సాంస్కృతిక విషయాలు వారి వ్యక్తిత్వ ఎదుగుదలకి దోహదపడి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఇస్తాయి. సాంస్కృతిక విషయాల్లో దృశ్య మాధ్యమాలు పిల్లల పైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే సినిమాను పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించి వారికి అందించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇరాన్ లాంటి దేశాల పిల్లల చిత్రాల్ని ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలు మహా నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెల్లో వుండే బాలలకూ ప్రదర్శించగలిగితే గొప్పగా వుంటుంది. దానికి జిల్లాల స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసి, ఎప్పుడో రెండేండ్లకోసారి కాకుండా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాల్ని అందించగలిగితే బాలలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, రష్యాల నుంచి వచ్చిన పిల్లల సినిమాలు అద్భుతంగానూ, భావస్పోరకంగానూ వుంటాయి. అవి మొత్తం ప్రపంచాన్ని కట్టి పడే శాయి. ఇరాన్ సినిమాలకున్న నేపథ్యం మన తెలంగాణకూ ఉన్నది. కావలసిందల్లా ఇరాన్‌లో లాగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సి ఉన్నది. మన దర్శకులు కూడా రొడ్డకొట్టుడు నీతి బోధల సినిమాలు కాకుండా భిన్నంగా బాలల మనసుల్ని గెలుచుకునే సినిమాలు నిర్మించ గలిగితే తెలంగాణ గొప్ప బాలల చిత్రాలకు వేదికయ్యే అవకాశం ఉన్నది. విలక్షణమైన కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశలో అడుగులు వేస్తుందనే ఆశ ఉన్నది. మన పిల్లల కోసం కేజీ టు పీజీ విద్యతోపాటు ఉత్తమ వినోదాన్ని కూడా అందించాల్సి ఉన్నది.

పిల్లల సినిమాల కోసం ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన చర్యలు కొన్ని వున్నాయి.1)బాలల చిత్ర సమితికి స్థలం కేటాయించి శాశ్వత కార్యాలయం, ప్రదర్శన వసతులు కల్పించడం. 2) బాలల సినినిమాలకు టాక్స్ మినహాయింపులు 3) తెలంగాణలో నిర్మించే బాలల సినిమాల కు ఆర్థిక సహకారం తో పాటు ఏటా అవార్డులు, ప్రోత్సాహకాలు,4) పిల్లల సినిమాల కోసం రాష్ట్రం లోని థియేటర్లల్లో ప్రత్యేక సమయం కేటాయించాలి. 5) జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పల్లెటూరి పిల్లలకు కూడా ప్రపంచ స్థాయి పిల్లల సినిమాల్ని ప్రదర్శించాలి.6) వీలయితే రాష్ట్ర స్థాయిలో చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటి ఆఫ్ తెలంగాణ ను ఏర్పాటు చేసుకోవాలి.

బాలల చిత్రోత్సవాలే కాకుండా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల విషయానికి వస్తే శాశ్వత వేదికగా గోవాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంతో పాటు కోల్‌కత్తా, త్రివేండ్రం, బెంగళూరు, ముంబాయి, చెన్నై, ఢిల్లీ, పూనా నగరాల్లో ప్రతి ఏడాది అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. మన హైదారాబాద్‌లో కూడా ఇంటర్నేషల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తే హైదరాబాద్ కు తెలంగాణకు ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నది.

-వారాల ఆనంద్

తెలంగాణా లో ‘డిగ్రీ విద్య’ రూపు రేఖలు మారాలి

Posted on Updated on

     dsc_0038

తెలంగాణ ఇవ్వాళ నీళ్ళు నియామకాలు, విద్య వైద్యం ముఖ్యంగా ఈ నాలుగు పాదాల్ని సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నది. అంటే ప్రజలకు అవసరమయిన అత్యంత ప్రధానమైన అంశాల్ని తన ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలుగా ప్రభుత్వం చేపట్టింది.  పాలసీ లు రూపొందించుకుంటూ అవసరమయిన చోట సవరించుకుంటూ ముందుకు సాగుతున్నది. ఈ నాలుగూ ప్రాథమిక మయినవే అయినప్పటికీ విద్య విషయంలో దేశ వ్యాప్తంగానూ, ఇటు సమైఖ్య పాలనాలోనూ అనేక కమిటీలూ వేశారు, ప్రయోగాలూ జరిగాయి కానీ విచిత్రంగా విద్య కు సంభందించి  మౌలికమయిన సమస్యలూ, సంక్షోభాలూ అట్లానే వున్నాయి. ముఖ్యంగా 1990 ల తర్వాత విద్య అన్నీ స్థాయిల్లో ప్రైవేటు పరం అయిపోయిన క్రమంలో ప్రభుత్వ విద్య ఒకరకంగా అనామకంగానే మారిపోయింది. దాన్ని సమూలంగా శాస్త్రీయంగా మార్చుకుంటే తప్ప ఫలితాలు ఆశించినంతగా లభించే అవకాశం లేదు. కేజీ టు పీజీ లాంటి ఆలోచనలూ సరయిన ఫలితాల్నిఇచ్చే అవకాశం లేదు. విద్య లో ప్రాథమిక విద్య పట్ల అనేక ప్రయత్నాలూ ప్రయోగాలు జరిగాయి జరుగుతున్నాయి, ఆ స్థాయిలో విధ్యార్థుల సమగ్ర సంపూర్ణ అభివృధ్ధికి పాదులు వేయాల్సి వుంటుంది. ముఖ్యంగా నేర్చుకోవాలనే స్పృహని విద్యార్థుల్లో పెంచాల్సి వుంటుంది. అంటే ప్రాథమిక మయిన అంశాల పైన సరయిన దశ-దిశాల్ని చూపించాల్సి వుంటుంది.

       ఇక ఇంటర్మీడియట్ స్థాయిలో గత రెండు మూడు దశాబ్దాలుగా ఒక పోటీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఇంజనీర్ లేదా డాక్టర్ కోర్సుల్లో చేరితే తప్ప భవిష్యత్తు లేదని ఆ ర్రెండు కోర్సులు మాత్రమే లక్ష్యాలుగా విద్యార్థుల్ని మాయ చేశారు. అందు కోసం ప్రపంచంలో ఎక్కడా లేని భట్టీ పట్టే ఒక విద్యా విధానాన్ని అమలులో పెట్టారు. అటు తల్లిదండ్రులూ అదే ఒరవడిలో కొట్టుకు పోయారు. ఇంటర్ లో ఆర్ట్స్ కోర్సులు అసలు పనికిరానట్టుగా వ్యవహరించారు.  అప్పటి సమైఖ్య పాలకులు ప్రైవేటు కాలేజీలతో కలిసిపోయారు లేదా కోట్లు సంపాదించే ఆ వ్యవస్థలో భాగ స్వాములయి పోయారు. ఫలితంగా ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళగా మిగతా వారు తాము ఎందుకూ పనికి రాణి వాళ్లమనే స్థాయిలోకి నెట్టి  వేయబడ్డారు.  సమాజం తల్లిదండ్రులు కూడా విధ్యార్థుల డిగ్రీ చదువుల పట్ల ఉదాసీనంగానే వుండిపోయారు. అనేక దశాబ్దాలపాటు ప్రభుత్వాలు కూడా డిగ్రీ విద్యని నిర్లక్ష్యం చేసి అవి మనుగడలో  వున్నట్టు కూడా పరిగణనలోకి తీస్కోలేదు. అంతే కాకుండా తమ రాజకీయ అవసరాల కోసం మండలాల స్థాయిల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలని ఏర్పాటు చేసి వదిలేశాయి. ఆ కాలేజీల్లో వసతుల గురించి కానీ కనీసం అధ్యాపకుల నియామకాలు, క్వాలిటీ విద్య గురించి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా రాష్ట్రం లో డిగ్రీ విద్య అత్యంత అనాకమయిన వ్యవస్థగా మారిపోయింది.

       డిగ్రీ కాలేజీల స్టేక్ హోల్డర్ లయిన విధ్యార్థుల్లో కూడా అనేక దశాబ్దాల పాటు ఎలాంటి ఉద్యోగ అవకాశాలూ లేక డిగ్రీ తర్వాత ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానాలు లేక ఒక ఉదాసీనత లోకి జారి  పోయారు.   కుప్పలు తెప్పలుగా వెలిసిన ఇంజినీరింగ్ కాలేజీల ఫలితంగా క్వాలిటీ వున్నా లేకున్నా కూడా వాటిల్లో విధ్యార్థులు చేరిపోవడంతో డిగ్రీ కాలేజీలు విధ్యార్థుల ఇన్ పుట్ స్థాయి కూడా చాలా దిగజారి పోయింది. దానికి తోడు సరిగ్గా ఇదే సమయంలో ఫీ రి ఇంబర్స్మెంట్ పథకం రావడంతో పరిస్తితి ఇంకా మారిపోయింది.

తెలంగాణా రాష్ట్రంలో వున్న 1500-1600 కాలేజీల్లో ప్రభుత్వ కాలేజీల్నే తీసుకుంటే అక్కడ ఉత్తమ క్వాలిఫికేషన్లు వున్న అధ్యాపకులు వున్న చోట కూడా ఫలితాలు అంతా ఆశాజనకంగా లేకపోవడం  అత్యంత విషాదకరం. నిజానికి డిగ్రీ కాలేజీల వ్యవస్థ చాలా చిత్రంగా వుంటుంది. కాలేజీల నిర్వహన,అధ్యాపకుల ఎంపిక వసతుల ఏర్పాటు అన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటే అడ్మిషన్లు, సెలబస్, పరీక్షలు లాంటి విద్యా విషయాలన్నీ ఆయా విశ్వవిద్యాలయాల నిర్వహణలో వున్నాయి. అధ్యాపకుల ఎంపిక, భోదన పట్ల వారి సంసిద్దత, వారికి అవసరమయిన శిక్షణ తదిర విషయాల పైన యూనివర్సిటీ లకు  సంబందం లేదు. ఇక ఏ యూనివర్సిటీలో ఏ సెలబస్ వుందో ఏ ప్రమాణాలు పాటిస్తున్నారో

ప్రభుత్వ నియంత్రణ లేదు. ఇలా రెండు నిర్వహణా కేంద్రాలు వుండడంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు రెంటినీ సమన్వయం చేయలేక అత్యంత ఉదాసీనగా మారి పోయాయి.

ఇక యూనివర్సిటీలు తమ కున్న స్వతంత్ర ప్రతి పత్తి వల్ల సెలబస్ విషయం లో కానీ,  పరీక్షలు,ఫలితాల విషయంలో కానీ అన్నింటి లో ఏక సూత్రత లేకపోవడం వల్ల ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పద్దతినీ అవలంబించడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఒక సారూప్యత కరువయి పోతోంది.  సెలబస్ విషయంలో యూనివర్శిటీల మధ్య సమన్వయం లేక పోవడంతో పరిస్తితి మరింత దిగజారిపోయింది. గత రెండు దశాబ్దాల డిగ్రీ సిలబస్, అందులో జరిగిన మార్పుల్ని పరిశీలిస్తే విషయం ఎంత దారుణంగా వుందో తెలుస్తుంది.  ఒక కామర్స్ విశయమే తీసుకుంటే ఒక ఏడాది వ్యాపార-నిర్వహణ వుంటే మరోసారి పారిశ్ర్తామిక-నిర్వహన కోర్సులో వుంటుంది. ఇక వ్యాపార గణాంక శాస్త్రం ఒక ఏడాది సెకండ్ ఇయర్ లో వుంటే మరో ఏడాది ఫైనల్ కి మారుస్తారు. ఇలా అన్ని  కోర్సుల స్థితీ దాదాపుగా ఇట్లాగే వుంటుంది.  ఇక పరీక్షల నిర్వహణ, ప్రశ్న పత్రాల దిద్దే విధానం కూడా సరిగ్గా లేని పరిస్తితి కనిపిస్తుంది. స్పాట్ నిర్వహణ ఒక పెద్ద సర్కస్ లా వుంటుయింది. ఈ స్థితిలో క్వాలిటీ గురించి ఆశించే స్థితి కనిపించదు  

         ఇక అధ్యాపకుల విషయం లో ఎప్పటి కప్పుడు ఆధునిక సబ్జెక్టుల విషయం లో అప్ డేట్ కావాల్సి వుంటుంది కానీ యూ.జీ.సి. నియంత్రణమేరకు నిర్వహించే రెఫ్రెషర్ లేదా ఓరి యెంటేషన్ తరగతులు మినహా పెద్దగా శిక్షన ఇచ్చిన సందర్భాలు తక్కువే ఆ మేరకు

అధ్యాపకుల్లో ఉత్సాహమూ తక్కువే.

   అయితే ఇక్కడ డిగ్రీ చదివుతున్న విద్యార్థుల సామాజిక ఆర్థిక స్థితి గతుల్ని కూడా పరిగణ లోకి తీసుకోవాల్సి వుంది. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుని రోజు వారి కూలికి వెళ్ళే విధ్యార్థులు కూడా వున్నారంటే అతిశ యోక్తి కాదు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యా ర్థుల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే కావడం వారి లో అధికశాతం మంది ఎర్న్ వైల్ లర్న్ ( చదువుకుంటూనే  సంపాదించుకో)

స్థితిలో వున్న వారే. కూలీలుగానే కాదు కాటరింగుల్లో, పార్ట్ టైమ్ జాబుల్లోనూ కనిపిస్తూనే వుంటారు.

     ఈ స్థితిలో వున్న డిగ్రీ కాలేజీల్ని మెరుగు పరిచేందుకు కొన్ని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ ప్రవేశాలు, సెమిస్టర్ విధానం, బయోమెట్రిక్ అటెండెన్స్ లాంటి ఏర్పాట్లకు శ్రీకారం చూడుతున్నారు.  వీటి వల్ల నిర్వహణ  క్రమబద్దీకరించ బడే అవకాశం వుంది. విధ్యార్థులు అధ్యాపకులు క్రమం తప్పకుండా కాలేజీలకు వచ్చే అవకాశం వుంది. కానీ విధ్యార్థుల సిలబస్, భోదన, విధ్యార్థుల స్కిల్స్ (నైపుణ్యతల్ని ) ని పెంపొందించకుండా ఫలితాల్ని ఆశించలేం. 

      నిజానికి డిగ్రీ విద్య అన్నీ పోటీ పరీక్షలకు కనీసార్హత. సివిల్స్, గ్రూప్స్ ఇలా అన్నీ పరీక్షలకూ డిగ్రీ స్థాయిప్రాథమికమయిన క్వాలిఫికేషన్ అంతే కాదు మానేజ్మెంట్ తదితర అనేక వుద్యోగాలకు డిగ్రీ స్థాయి ప్రామాణికం. అందుకే తరగతి గదుల్లో విద్యార్థులకిచ్చే ఇంపుట్స్  శాస్త్రీయంగాను ఆధునికంగానూ వుండాల్సిన అవసరం వుంది.  సనాతనంగా వున్న భోదన ఆధునకతను సంతరించు కోవాల్సి వుంది. అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యాపకులు వుపయోగించాల్సి వుంది. అధ్యాపకులు కేవలం డాక్టరేట్లమనో ,నెట్ స్లెట్ పాసయ్యామనో భావిస్తే సరిపోదు. కాలేజీల్లో ని విధ్యార్థుల స్థాయిని అంచనా  వేసి వారిని బయటి ప్రపంచలో నెగ్గుకు వచ్చే విధంగా తయారు చేయాల్సి వుంది, అందుకు అధ్యాపకుల నిబధ్ద్ధత ఎంతో అవసరం. ప్రభుత్వమూ విశ్విద్యాలయాలూ వారిని అందుకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాల్సి వుంటుంది. డిగ్రీ స్థాయిలో కూడా గైడ్ లు చదవకుండా టెక్స్ట్ బుక్స్ తో పాటు రెఫరెన్స్ కూడా చదివే అలవాటు అటు అధ్యాపకులూ,ఇటు విధ్యార్థులూ  అలవర్చు కోవాల్సి వుంది.

      డిగ్రీ కాలేజీల విషయంలో ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాల్సి వుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరింత ప్రొ ఆక్టివ్ పాత్ర పోషించాల్సి వుంది. సిలబస్ , అధ్యాపకుల శిక్షణ మోటివషన్ విషయంలో విస్తృతమయిన చర్యలు చేపట్టాల్సి వుంది. సిలబస్ లల్లో ఆధునికతో పాటు వర్తమాన ఆధునిక సమాజంలో పెరుగుతున్న వత్తిడి పర్యవసానంగా కలుగుతున్న మానసిక సంక్షోభాల్ని తట్టుకునే విధంగా విధ్యార్థుల్లో  మానసిక పరిపక్వతని,ధైర్యాన్ని పెంపొందించే ప్రయత్నాలు జరగాలి. కనుమరుగవుతున్న విలువల పట్ల, సమాజం పట్ల వాస్తవ అవగాహన పెరిగే కొత్త అధ్యయన రీతుల్ని ప్రారంభించాల్సి వుంది.

      ఇంటర్ విద్యను దాటి అప్పుడప్పుడే మానసిక పరిపక్వత వైపు ఎద్కుగుతున్న డిగ్రీ స్థాయి విద్యార్థుల సమగ్రాభివృద్దికి కృషి చేయడ మంటే  మనసున్న ఆధునిక పౌరున్నీ తయారు చేయడమే. ఉత్తమ పౌరులు ఉత్తమ సమాజానికి దారులు తీస్తారు. ఆ క్రమంలో తాత్వికంగా కూడా ఆలోచించాల్సి వుంది. కొత్త ఆలోచనలకు  ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం సానుకూలంగా వున్నప్పుడు అంది పుచ్చుకోవాల్సింది అధ్యాపకులూ,మేధావులే.

-వారాల ఆనంద్