LIC

 VILLAGE ROCKSTARS

Posted on Updated on

 విలేజ్ రాక్ స్టార్స్ –మంచి అస్సామీ బాలల సినిమా

      ప్రకృతి సిద్దమయి నదీ  నదాలూ, పర్వతాలతో స్వచ్చమయిన వాతావరణంతో తుల తూగే ఈశాన్య భారతంలో ప్రధాన రాష్ట్రం అస్సాం. అక్కడినుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమామొదలు అన్నీ కళలూ అత్యంత ప్రాంతీయమై  అనుకరణ కాని ఆసలయిన కళారూపాలుగా వుంటాయి.

     అస్సామీ సినిమా జాలీ వుడ్ (JOLLYWOOD) గా పిలవబడుతున్నది. 1935లో జ్యోతి ప్రసాద్ అగర్వాల నిర్మించిన  “” జోయ్ మతి  “” సినిమాతో అసామీ సినిమా ప్రారంభమయింది. కానీ అనేక కారణాల రీత్యా అక్కడ సినిమా విస్తారంగా ఎదగలేదు. చాలా కాలం కలకత్తా కేంద్రంగానే అస్సామీ సినిమాల నిర్మాణం జరిగింది. కానీ వచ్చిన సినిమాలు మాత్రం చాలా వరకు మంచి సినిమాలుగా పేరుతెచ్చుకున్నాయి. అట్లా ఇటీవల దర్శకురాలు రీమాదాస్ రచించి, దర్శకత్వం వహించిన సినిమా   విలేజ్ రాక్ స్టార్స్   ఇటీవల హైదరబాద్ లో జరిగిన  అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం లో ఆసియా విభాగంలో దర్శకత్వ అవార్డు తో పాటు మరో రెండు అవార్డులు కూడా గెలుచుకుంది.

  విలేజ్ రాక్ స్టార్స్   సహజంగానూ, గ్రామీణ వాతావరణ నేపథ్యంలోనూ చిత్రించబడి ఆసామ్ జనజీవన సజీవ దృశ్యం లా సాగుతుంది. ఈ సినిమాను దర్శకురాలు తమ గ్రామం చాహాయి గాంవ్ కు అంకితం చేస్తుంది.

మహిళల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో స్వంత కాళ్ళ పై నిలబడడం, వ్యక్తిత్వ నిర్మాణం రూపొందించుకోవడం, తన కలల్ని సాకారం చేసుకోవడం అనే అంశాలపై ఈ సినిమా సాగుతుంది. విజువల్ గా చాలా అద్భుతంగా వుండి అబ్బురపరుస్తుంది.

     సినిమా కథా కథనానికి వస్తే ఓ మారు మూల గ్రామంలో ధును అనే ఓ పదేళ్ళ అమ్మాయి విధవరాలయిన తన తల్లి, బద్దకస్థుడు అయిన అన్న తో కలిసి జీవిస్తుంటుంది. తల్లి చేసిన తినుబండారాల్ని అమ్ముకు రావడానికి జాతరకు వెళ్ళిన ధును అక్కడ ఒక బాండ్ ప్రదర్శన చూసి అబ్బురపడుతుంది. అంతే కాదు ఒక కార్టూన్ పుస్తకం చూసి ప్రభావితమయి తానూ ఒక గిటారిస్ట్ కావాలని, తానూ ఒక బాండ్ ను రూపొందించుకోవాలని కలలుకంటుంది.  ఒక పాత పేపర్లో పాజిటివ్ గా వుండడం వల్ల కలలు సాకారమవుతాయని దాంతో దేన్నయినా సాధించుకోవచ్చు నని అర్థం చేసుకుంటుంది. కానీ తమ పేదరికం అసహాయత అడ్డు పడుతుండగా మొక్క వోని దీక్షతో ఒక్కో రూపాయి కూడా బెట్టడం ఆరంభిస్తుంది. అప్పుడే ధును రజస్వల  అవుతుంది. మొత్తం ఆచారాల ప్రకారం తంతు నిర్వహిస్తారు. అప్పటినుంచి ఆమె పైన ఆంక్షలు ఆరంభ మవుతాయి. చీరె కట్టాలని, మగపిల్లలతో కలిసి తిరగొద్దని కట్టుబాట్లు చెబుతారు. కానీ ధును తల్లి అందుకు భిన్నంగా తన బిడ్డకు పూర్తి స్వాంతత్రాన్ని ఇస్తుంది.

వరదలు ప్రకృతి భీభత్శాలకు వాళ్ళకున్న కొద్ది భూమిలో పంట కూడా కొట్టుకు పోతుంది. ప్రతి ఏటా వరదలకు కొట్టుకుపోయే ఈ వ్యవసాయం ఎందుకు చేయాలని ధును తల్లిని అడుగుతుంది. తమకు తెలిసిన వృత్తీ యాగం ఇదే అని తల్లి బదులిస్తుంది. మునిగి పోతుందని ఏమీ చేయకుండా వుండలేము కదా అంటుంది. రూపాయి రూపాయి కూడబెట్టి ధును తన గిటార్ కలను నెరవేర్చుకుంటుంది.

ఇక్కడ గిటార్ సాధించడం కేవలం ఒక సింబాలిక్ మాత్రమే, మొత్తం సినిమాలో ధును తన ఉత్సాహం, సొంతంగా సాధించాలనే తత్వం చాలా సహజంగా చూపిస్తుంది దర్శకురాలు.

    వర్తమాన కాలంలో ఆడపిల్లలకు మగపిల్లలకు నడుమ వుండే ఒక ప్రధాన మయిన తేడాను  విలేజ్ రాక్ స్టార్స్  వివరిస్తుంది. ధును అత్యంత ఉత్సాహవంతురాలిగా భాధ్యత కలిగిన అమ్మాయిలా వుంటే ఆమె అన్న బద్దకంగానూ చిన్న అవకాశం దొరికితే చాలు బడి ఎగ్గొట్టే రకంగానూ వుంటాడు. ఇక ధును తండ్రి ఈత నేర్చుకోవానికి భయపడి నీలల్లో మునిగి చనిపోతాడు. ఇట్లా ఆడపిల్లల స్వావలంభనను ఆవిష్కరిస్తూ  విలేజ్ రాక్ స్టార్స్   కొన సాగుతుంది. ఇందులో నీలోత్పల్ బోరా సంగీతం అదనపు మూడ్ ను కలిగిస్తుంది. కెమెరా భాధ్యతల్ని కూడా రీమా దాస్ నిర్వహించారు.

     పిల్లల్ని చైతన్య వంతులను చేసే దిశలో సాగే ఈ సినిమాకు ధును పాత్ర ధారి భనితా దాస్ సహజ నటన ప్రధాన ఆకర్షణ. పేదరికానికి,ప్రకృతివైపరీతలకూ ఎదురోడ్డి తన కలల్ని సాకారం చేసుకునే పాత్రలో భనిత, ఆమె తల్లి పాత్రలో బసన్తీ దాస్ తో పాటు ఎవరు కూడా వృత్తి కళాకారులు కాదు అందరూ గ్రామంలోంచి ఎన్నుకోబడ్డావారే కావడం గమనార్హం. విలేజ్ రాక్ స్టార్స్   ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బహుమతులు గెలుచుకుంటూనే వుంది.

    పిల్లలు ప్రాధానంగా చూడాల్సిన ఆసలయిన ప్రకృతి సిద్దమయిన మంచి సినిమా  విలేజ్ రాక్ స్టార్స్   

వారాల ఆనంద్

rockstars 1

UMRIKA (FILM)

Posted on Updated on

Published in ‘KARMIKA VAHINI’ LIC union journal

కలల వలసల గోస- “ అమ్రిక “ (హింది)2015   

 తమ మూలాల్ని తెగ్గొసుకొని ఆశల ఎడారుల వెంట పరుగెత్తే సగటు జీవుల కథా కథనం “ అమ్రిక “. మంచి సౌకర్యవంతమయిన జీవితం కోసం పెద్ద సంపాదన కోసం వూరూ వాడా వదిలేసి అమెరికా వైపునకు చూడడం 70,80ల్లోనే మన దేశం లో ప్రారంభమయింది. అలా వలస వెళ్లాలనే తపన తో తన నెలకు తన వాళ్ళకు దూరంగా చేసే ప్రయాణం లో ఎదుర్కొనే కష్టాలూ, మోసాలూ, ద్రోహాలూ అందులో ఇమిడి వున్న నేర ప్రపంచం తదితర అంశాల క్రోడీకరణమే హింది సినిమా “ అమ్రిక “ . ప్రశాంత్ నాయర్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015లో సండెన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఆడియెన్స్ అవార్ద్ను గెలుచుకోంది. లైఫ్ ఆఫ్ పై సినిమాలో నటించిన సూరజ్ శర్మ ప్రధాన భూమిక ను పోషించాడు. మధ్యప్రదేశ్ లోని సత్పురా గ్రామం. చాలా అందంగానూ, గ్రామీణుల నడుమ మంచి అనుభన్దాలూ వున్న వూరు. కానీ ఆ వూళ్ళో అందరికీ అమెరికా వెళ్లాలన్నది ఒక కల. అమెరికాచాలా గొప్పగా వుంటుందని అది ఒక భూతల స్వర్గమని భావిస్తారు. ఆక్రమంలో ఆ గ్రామంలోని ఉదయ్ అన్న యువకుడు అమెరికా వెళ్ళేందుకు సిద్దపడుతాడు. వూరో వూరంతా మేలా తాలాలతో ఊరేగింపుగా అతన్ని సాగనంపుతుంది. ఉదయ్ తల్లి కల తన కొడుకు అమెరికా వెళ్ళి గొప్ప వాడు కావాలని అనుకుంటూ వుంటుంది ఫలితంగానే ఉదయ్ బాంబే చేరతాడు. జత్వపూర్ లో తల్లి తో సహా అందరూ విజయ్ సమాచారం కోసం ఎదురుచూడ్డం మొదలు పెడతారు. క్రమంగా ఉదయ్ నుండి ఉత్తరాలు రావడం మొదలవుతుంది. తల్లికి పట్టరాణి ఆనందం. ఉత్తరాల్లో అమెరికా ఫోటోలతో పాటు అనేక విషయాలు రాస్తూవుంటాడు ఉదయ్. ఇంతలో ఏళ్ళు గడిచిపోతాయి. ఉదయ్ తమ్ముడు రమాకాంత్ పెద్ద వాడవుతాడు. అన్న నుంచి వస్తున్న ఉత్తరాల్లో ఏదో మతలబు వుందని రమాకాంత్ శంకిస్తాడు. ఇంతలో తండ్రి కరెంటు షాక్ కొట్టి అకాల మరణం పాలవుతాడు. కుటుంబం ఇబ్బందుల్లో పది పోతుంది. తల్లి తీవ్ర మయిన నిరాశకు గురవుతుంది. తండ్రి చిటికి నిప్పు పెట్టాల్సింది పెద్దవాడు రా అని రమాకాంత్ ను పట్టుకొని ఏడుస్తుంది. ఇంతలో పోస్ట్ మాన్ ను నిలదీసి ఉత్తరాలు అన్న ఉదయ్ రాస్తున్నవి కావని తన తండ్రి పోస్ట్ మాన్ కలిసి తల్లి కి మన శ్శాంతి కలిగించేందుకు ఆడిన నాటకమని తెలుసుకొంటాడు. ఉదయ్ కి ఏదో జరిగిందని తాలిచి తానూ అమెరికా వెళ్తానని బయలుదేరతాడు. బాంబే లో తమ వూరివాడయిన ఉదయ్ మిత్రుడి వద్ద  వుంటాడు. ఉదయ్ కి ఏమి జరిగిందని నిలదీస్తాడు. ఇదంతా నీకు మంచిది కాదు తిరిగి వెళ్లిపొమ్మంటాడు. పటేల్ అనే బ్రోకర్ గురించి నీకు తెలీదు అంతా మార్చి పోయి తల్లిని చూసుకో పొమ్మంతాడు. కానీ రమాకాంత్ ఎట్టి పరిస్థితుల్లో అన్న గురించి తెలుసుకోకుండా వెల్లనంతాడు. తాను కూడా అమెరికా వెళ్తానంతాడు. పటేల్ నేర ప్రపంచం గురించి క్రమంగా తెలుసుకొంటాడు. ఇంతలో వూర్లోని రమాకాంత్ మిత్రుడు లాలూ కూడా బాంబే వద్స్తాడు. ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తారు. ఇంతలో ఒక నాడు ఉదయ్ బాంబే లోనే ఒక మంగలి షాప్ లో పని చేస్తున్నాడని తెలుసుకొని రమాకాంత్ ఖిన్నుడవుతాడు. ఈ మాత్రం దానికి ఇక్కడిదాకా ఎందుకు వచ్చవని
నిలదీస్తాడు. కోపగించుకుంటాడు, ఆవేదన చెందుతాడు. అప్పటికే పెళ్లి కూడా చేసుకొని వుంటాడు కానీ ఆవిషయం తమ్మిడికి చెప్పడు. ఇంతలో రమాకాంత్ లాలూ లు ఇద్దరూ పటేల్ ను కల్సుకోని తమకు అమెరికా వెళ్లాలని వుంది సహకరించ మంటారు. తలా రెండు లక్షలు తెస్తే ఏర్పాటు చేస్తానంతాడు పటేల్. లాలూ తన వల్ల కాదని చేతు లేత్తెస్తాడు. రమాకాంత్ రెండు లక్షలు తెచ్చి పటేల్ ముందు పోస్తాడు. నౌకలో కంటేనర్లో రమాకాంత్ ను అమెరికా రవాణా చేస్తాడు. అప్పుడు ఒడ్డున వున్న పటేల్ ఉదయ్ ని అడుగుతాడు ఆఫీసునుంచి రెండు లక్షలు అప్పు తీసుకున్నావంట అది చెల్లించడానికి చాలా కాలం పని చేయయాల్సి వుంటుందంతాడు. తెలుసు సార్ అంటాడు ఉదయ్. నౌక సముద్రంలోకి రమాకాంత్ లాంటి అనేక మండి కలల్ని మోసుకొని అమెరికా వైపునకు పయనమవుతుంది.
అలా ఒక మామూలు పల్లె సత్పురా నుంచి బయలుదేరి వలస దారి పట్టిన బడుగు జీవుల జీవితాల్ని కథావస్తువుగా తీసుకొని ప్రశాంత్ నాయిర్ తీసిన అమ్రికా అటు పూర్తి ప్రధాన స్రవంతి సినిమాలా కాకుండా మరో వైపు సమాంతర ఆర్ట్ సినిమాలా కాకుండా మధ్యే మార్గంగా తీశాడీ సినిమాని. చక్కని హాస్యం అమ్రికా సినిమా కు మంచి బలాన్నిచ్చింది.  రమాకాంత్ పాత్రలో సూరజ్ శర్మ నటన అతని మిత్రుడు లాలూ పాత్రలో టోని రెవలూరి బాగా ఆకత్తుంతారు.
మొత్తం మీద సత్పూరా గ్రామ వాతావరణ దృశ్యాలూ బాంబే నగర దృశ్యాలూ చిత్రానికి బలం చేకూర్చాయి.
-వారాల ఆనంద్
============================
అమ్రికా (umrika)
రాచన దర్శకత్వం: ప్రశాంత్ నాయర్.
నిర్మాత: స్వాతి శెట్టి, మనిష్ ముంజ్రా
నటీ నటులు: సూరజ్ శర్మ, టోని రేవలూరి, ప్రతీక్ బబ్బర్, స్మితా తంబే
సంగీతం: దస్టిన్ ఓ హాల్లోరిన్

 

september k vahini material.pmd

“డియర్ జిందగీ”

Posted on

మానసిక సంఘర్షనాత్మక సినిమా

వర్తమాన సంక్షోభ, సంక్లిష్ట సమాజంలో అదీ మహానగర సమాజంలో వుత్పన్నమవుతున్న మానసిక వేదనలనూ , ఆందోళనలనూ వాటి పర్యవసానాలనూ ఆవిష్కరించిన సినిమా ‘డియర్ జిందగీ’. ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమా తో మంచి పెరునూ గౌరవాన్నీ  పొందిన గౌరి షిండే రూపొందించిన  రెనడవ చిత్రం డియర్ జిందగీ. ఇదికూడా స్త్రీ పాత్ర ముఖ్యాభినేతగా రూపొందించిందే. ముంబై లాంటి మహానగరంలో వర్తమాన

సినిమాటోగ్రాఫర్గా ఎదగాలనుకుంటున్న కైరా తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక వొత్తిడితో  పడ్డ సంగర్షణ , ఫలితంగా రూపొందిన ఆమె వ్యక్తిత్వం ఈ సినిమాలో ప్రధాన అంశం. చిన్న సినిమాలు ఆడ్ ఫిల్ములూ షూట్ చేస్తూ పూర్తి నిడివిగల సినిమా అవకాశం  కోసం ఎదురుచూస్తున్న కైరా తన అస్థిరమయిన మానసిక స్థితి, ఫీలవుతున్న అభద్రత ఆమె ను ఒక చోట వుండనీయవు. అపనమ్మకం ఆమెను నీడల వెంటాడుతూ వుంటుంది. ఆ స్థితిలో అనేక మండది  బాయ్ ఫ్రెండ్స్, ఒకరినుంచి ఒకరికి షిఫ్ట్ అవడం ఆధునిక నగర వాతావరణంలోని సమస్త స్థితినీ  ఆమె ఎదుర్కొంటూ వుంటుంది. ఆ స్థితినుండీ మామూలు స్థితికి వచ్చే క్రమమే ఈ సినిమా. ఇందులో కైరా గా ఆలియా భట్ చాలా సహజమయిన నటనను ప్రదర్శించింది. ఇప్పటి నటీమణుల్లో అలియా భట్ డి విశిష్ట స్థానమని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. ఇక దిమాఖ్ డాక్టరుగా షా రూఖ్ ఖాన్ లో ప్రొఫైల్ లో ఆయన ఇమేజ్ కు భిన్నంగా హుందాగా నటించాడు.

సామాజిక సంఘర్షణలే  కాకుండా చిన్న నాడు ఆమె తల్లిదండ్రులు ఆమె పట్ల ప్రవర్తించిన తీయు కూడా కైరా జీవితం పై పడుతుంది. అన్నీ వొత్తిడులనుండీ బయటపడి సంపూర్ణ వ్యక్తిగా మరే క్రమమే ఈ సినిమా.

కథ విషయానికి వస్తే కైరా సినిమాటోగ్రాఫర్ గా ఎదగాలనీ ఎప్పటికయినా తనను తాను నిరూపించుకోవాలని కళలు కంటూ కష్టపడే యువతి. చిన్న ఆడ్స్ తీస్తూ నిలదొక్కుకునే క్రమంలో వుంటుంది. అనేక మండి మిత్రులౌ తారస పడతారు. రెస్టారెంట్ ఓనర్ సిద్ తో స్నేహం కుదురుతుంది. తర్వాత షూటింగులో భాగంగా రఘువేంద్ర తో పరిచయం చాలా దూరం పోతుంది. రఘువేంద్ర కు అమెరికాలో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఆ సినిమాకు కైరా పూర్హ్తి స్థాయి సినిమాటోగ్రాఫర్ గా వుంటుదని హామీ ఇస్తాడు. ఆమె ఆథన్నుంచు జీవితాని కోరుకుంటుంది కానీ రఘువేంద్రకు మరొకరితో ఎంగేజ్మెంట్ అవుతుంది. అది తెలిసి కైరా తీవ్ర నిరాశకు గురవుతుంది. రఘువేంద్ర తో అఫైర్ తెలిసి సిద్ ఆమెనుంచు పక్కకు జరుగుతాడు. ఇంతలో ముంబై లో ఇంటిఔనర్ ఇల్లు ఖాళీ చేయమంతాడు. గోవాలో వున్న తల్లిదంరులు అక్కడికి రమ్మంతారు తప్పని స్థితిలో ఆమె గోవాకు షిఫ్ట్ అవుతుంది. సిద్, రఘువేంద్ర ల విషయం తో ఆమె లో అస్థిరత మరింత పెరుగుతుంది. ఆమెకు మాన్సిక సాంత్వన కలిగేందుకు సైకాలజిస్ట్- దిమాఖ్ డా డాక్టర్ ను కలవమని మిత్రులు చెబుతారు. అలాంటి థెరపిస్ట్ వుంటాడా అని ఆమె ఆశ్చర్యపోతుంది. గోవాలో తల్లిదండ్రులు పెళ్లి సంభాదులు చూద్దాం మొదలు పెడతారు. కానీ కైరా దిమాఖ్ కా డాక్టర్ జహాంగీర్(షారూఖ్ ఖాన్) ను కలుస్తుంది. ఇక అక్కడినుండి ఆ  ఇద్దరి నడుమా కొనసాగే అనేక థెరపీ సిట్టింగులు ఆమె అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ పోతాయి.

‘మేధావి అంటే అన్నీ ప్రశ్నలకూ సమాధానాలు  తెలిసినవాడు  కాదు, జవాబు వరకు చేరే ఓపిక వున్నవాడు’  అని డాక్టర్ జహాంగీర్ కైరా కు చెబుతాడు. ఓపికగా నీ మనసులోని అన్నీ విషయాలూ బయటపెట్టు అవే నీకు సమాధానాలు చెబుతాయి అంటాడు. అంతే కాదు ఒక నాటి సిట్టింగులో సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లి తన చిన్నప్పుడు తరుచుగా తండ్రి  సముద్రం తో కబడ్డీ ఆడటానికి  ఇక్కడకు తీసుకొచ్చేవాడని చెబుతాడు. ముందుకొస్తున్న అలల తో కబడ్డీ ఆడడం కైరాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.

ఇక మరో సారి సైకిల్ రెపైర్ చేస్తున్న జహాంగీర్ ను చూసి ఏమిటి మీరు రెపైర్ కూడా చేస్తారా అంటుంది సైరా. రెపైర్ కాకుంటే సైకిల్ ను రీసైకిల్ చేస్తానంతాడు జహాంగీర్. కిలకిలా నవ్విన కైరా నా దిమాఖ్ కూడా రెపైర్ కాకుంటే దాన్ని కూడా రీసైకిల్ చేస్తారా అంటుంది. ఇట్లా అంకె సందర్భాల్లో కొటేషన్ల లాంటి డైలాగ్ లతో సినిమా ముందుకు సాగుతుంది. కైరా లో ఆందోళనలకూ అస్థిరత్వనికీ ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తాత దగ్గర వదిలేసి అమెరికా వెళ్లిపోవడం, ఆమెను సరిగ్గా పట్టించుకొక పోవడం లాంటి సంఘటనలు ఆమె మనస్సు పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం జహాంగీర్ తెలుసుకొని వివరిస్తాడు. ఆమె క్రమంగా తనలోపలి భయాలు అందరూ దూరమవుతారనే ఆందోళననుంచి క్రమంగా బయటపడుతుంది. తల్లిదండ్రులను ప్రేమించడంతో పాటు ఇతరుల పట్ల వుండే సాహానుభూతే మనిషికి స్వాంతన అని తెలుసుకుంటుంది.

డాక్టర్ జహాంగీర్ పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది కైరా కానీ తనకూ కైరాకూ మధ్య వున్నది కేవలం థెరపిస్ట్ సంభండమే తప్ప మరెడీ లేదని. సున్నితంగా తిరస్కరించి అధ్భూతమయిన భవిష్యత్తులోకి పయనిచమంటాడు జహాంగీర్. గొప్ప ఆశాహమయిన నోట్ తో సినిమా ముగుస్తుంది. అలియా భట్ షా రూఖ్ ఖాన్ లు వారి సంభాషణ ఆకట్టుకుంటాయి. ఇద్దరూ పరిపక్వమయిన నటనను ప్రదర్శించారు.

అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించబడి మంచి విజయాన్ని సాధించిన “ డియర్ జిందగీ’ మహిళా సినిమానే కాకుండా మానసిక సంఘర్షణ లాంటి అనేక సమస్యల్ని చర్చిస్తుంది. సంగీతం, ఫోటోగ్రఫి బాగుంటాయి.

“డియర్ జిందగీ “ రచనా దర్శకత్వం: గౌరీ షిండే, రెడ్ చిల్లీస్ నిర్మాణం.

(PUBLISHED IN “KAARMIKA VAAHINI, LIC MAGAZINE, JULY 2017)

‘Moonlight’

Posted on

కళాత్మక సజీవ చిత్రణ ‘మూన్ లైట్ ‘- ఆస్కార్ విజేత

-వారాల ఆనంద్

‘చంద్రుడి కాంతిలో నల్ల జాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు’ అన్న కవితాత్మక వాక్యం ‘మూన్ లైట్’ సినిమాకి ఊపిరి. వర్తమాన సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక శారీరక ఉద్వేగభరిత స్థితికి ఈ సినిమా అద్దం పడుతుంది. యువత అంటే అదీ అమెరికాలోని నల్ల జాతి యువత ఎదుర్కొంటున్న శారీరక, లింగత్వ సమస్యలూ, స్వలింగ సమస్యలూ, ఒంటరితనాలూ అవమానాలూ అన్నీ మూన్ లైట్ లో చాలా గొప్ప గా చిత్రీకరించారు. ఈ సినిమా ఇటీవలే ఉత్తమ సినిమాగా ఆస్కార్ అవార్ద్ అందుకుంది. ఆస్కార్ చరిత్ర లో మొత్తం నల్ల జాతి నటీనటులు నటించిన చిత్రం ఉత్తమ చిత్రం అవార్డు అందుకోవడం ఇది మొదటిసారి. అంతే కాదు మొదటి స్వలింగ సంపర్గ ఇతివృత్తంగా తీసుకుని అతి తక్కువ బాక్స్ ఆఫీస్ వసూళ్లు సాధించి కూడా ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు ను అందుకుని మూన్ లైట్ చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా ఎడిటింగ్ లో అవార్డ్ గెలుచుకుని జోయ్ మాక్ మిల్లన్ మొదటి నల్ల జాతి కళాకారుడిగానూ, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అవార్డును అందుకుని అలీ మొదటి ముస్లిం గా చరిత్ర కెక్కారు. అవార్డుల సంగతి ఎలా వున్నా మూన్ లైట్ సినిమా ఇతివృత్త స్వీకరణ లోనూ,చిత్రీకరణలోనూ, నటీ నటుల నటన పరంగానూ అద్భుతమయిన స్థాయిని అందుకుని గొప్ప సినిమా గా నిలిచింది. ఈ సినిమా నిండా జ్ఞాపకాలూ, వాస్తవాలూ, ఒక దాని వెంట ఒకటి ముప్పిరి గొని ప్రేక్షకుల్ని చిత్ర మయిన స్థితికి త్తీసుకెళ్తాయి.

టారేల్ ఆల్విన్ మాక్ కాన్రే రాసిన ఆత్మకథ ను దర్శకుడు బ్యారి జెంకిన్స్ అనుసరించి మూన్ లైట్ నిర్మించాడు. ఆ ఆత్మ కథ పేరే ‘చంద్రుడి కాంతిలో నల్ల జాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు’. ఆ ఇతివృఃతాన్ని మోడు విభాగాలుగా చిత్రంలో చూపిస్తాడు దర్శకుడు. లిటిల్,చిరాన్, బ్లాక్ లు మూడూ ఒక దానికొకటి విడిగానూ, కలిసిపోయినట్టుగానూ,  కొన సాగింపుగానూ కనిపిస్తాయి. లిటిల్ బాల్యాన్ని చూపిస్తే, చిరాన్ టీన్ ఏజ్ స్థితిని, బ్లాక్ ఎదిగిన స్థితినీ చూపిస్తాయి. ఈ మూడు స్థాయిల్లో నల్ల జాతీయుడి గానూ, గే గానూ ఆ యువకుడు ఎదుర్కొన్న సంఘటనల్నీ, సమస్యల్నీ అత్యంత వాస్తవంగానూ హృద్యంగానూ దర్శకుడు చిత్రీకరించాడు. మూడు స్థాయిల్లో ముగ్గురు నటులతో నటింపజేసి వాటి మధ్య ఒక సంలీనత సాధించారు.

చిత్ర కథ విషయానికి వస్తే లిటిల్ మియామిలో డ్రగ్ డీలర్ జువాన్కు చిరాన్ దొరుకుతాడు. జువాన్ భార్య తో కాకుండా తన ప్రియురాలితో వుంటాడు. చిరాన్ ని తన తోనే వుండమంటాడు. చిరాన్ తల్లి పవులా డ్రగ్ కు బానిస్ అవుతుంది. తన తల్లి పావులాను చిరాన్ ఏవగించుకుంటాడు.చిరాన్ కు రక రకాల కల లు వస్తాయి. ఇంతలో మిత్రులతో గొడవ పడతాడు. వాళ్ళు బ్లాక్ అనే నిక్ నేమ్ పెడతారు. ఇంతలో తనలో కలుగుతున్న మార్పులు గమనిస్తాడు. ఒక రోజు మిత్రుడు కెవిన్ సముద్రపు ఒడ్డున అతన్ని సంతృప్తి పరుస్తాడు. ఇలా పలు సంఘటనల తర్వాత కిరాన్ ఒక రోజు తన పయిన శారీరకంగా దాడి చేసిన వాడిని కోపంతో కుర్చీ తో బాదేస్తాడు. పోలీసులొచ్చి అరెస్ట్ చేసి జైల్ కు పంపిస్తారు. జైలు జీవితం గడిపిన చిరాన్ శారీరకంగా ఎదిగి మంచి ధృఢమయిన శరీరా కృతి తో బ్లాక్ గా బయటకు వస్తాడు. డ్రగ్స్ కు బానిస అయిన తల్లి అనేక టెలిఫోన్ కాల్స్ చేసింతర్వాత కలవడానికి వెళ్తాడు. తల్లి పశ్చ్తాపాన్ని చూసి ఆమెను క్షమిస్తాడు.

మియామి కి చేరుకున్న బ్లాక్ తన పాత మిత్రుడు కెవిన్ ను కలుస్తాడు. కుక్ గాను, బేరర్ గాను పనిచేస్తున్న కెవిన్ తనకు పెళ్ళయి ఒక కొడుకున్నాడని కానీ భార్య తో పొసగ  లేదని చెబుతాడు. తాను కోరుకున్నట్టుగా జీవితం కొన సాగకున్నా సంతోషంగానే వున్నట్టు చెబుతాడు.

ఆ రోజు సముద్ర తీరం లో కెవిన్ తో తప్ప తాను ఇంతవరకు మరెవరితోనూ ఇంటిమేట్ గా వుండలేదంటాడు బ్లాక్. కెవిన్ బ్లాక్ ని ఓదారుస్తాడు. సముద్ర తీరంలో  తన చిన్న తనాన్ని గుర్తు చేసుకుంటూ బ్లాక్ కెమెరాకు అభిముఖంగా తిరిగి చూస్తుండగా సినిమా ముగుస్తుంది. టూకీగా కథ ఇట్లున్నప్పటికీ లిటిల్,చిరాన్, బ్లాక్ మూడు వయసుల్లో భిన్న స్థాయిలో అతడు ఎదుర్కొన్న మానసిక, శారీరక సంఘర్షణ అతలా కుతలం చేస్తుంది. మానవీయ ఉద్వేగాలకీ, అనుభవాలకూ, సంఘర్షణలకూ దృశ్య రూపమిస్తుందీ సినిమా.

జేమ్స్ లాక్శ్టన్ james laxton కెమెరా పనితనం ఆద్యంతం కట్టి పడేస్తుంది.

‘ నేను ఎన్నో సార్లు ఏడిశాను, మరెన్నో సార్లు కన్నీటి చుక్కలయి రాలాను’  లాంటి సంభాషణలతో కొన్ని చోట్ల మాటలు ఉద్వేగానికి గురిచేస్తాయి.

ఎలాంటి స్టార్ వాల్యూ, గ్రాఫిక్స్, మిరుమిట్లు గొలిపే దృశ్యాలు ఏవీ లేని మూన్ లైట్ కేవలం ఒక జాతి యువకుడు బాల్యం నుంచీ ఎదుర్కొన్న ఒంటరితనాన్నీ, అణచివేతనీ, దుఖాన్నీ అత్యంత వాస్తవికంగా, కళాత్మకంగా ఆయా స్థల కాలాల నేపథ్యంలో దర్శకుడు తీసి నిలబెట్టాడు. కనుకే అందరూ నల్ల వాళ్లయినా, నల్ల వాళ్ళ కథ అయినప్పటికీ విషయానికి విశ్వజనీనత, చిత్రీకరణకి కళాత్మకత, నటులకు సాధికారకత వున్నప్పుడు ఆస్కార్ కు నామినేట్ అవడమే కాదు అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ బార్రి జెంకిన్స్

“మూన్ లైట్”

దర్శకుడు: బార్రి జెంకిన్స్ ,

-వారాల ఆనంద్

 

‘నీల్ బత్తే సన్నాట’ తమిళ్ ‘అమ్మా కరక్కు’

Posted on Updated on

‘నీల్ బత్తే సన్నాట’ తమిళ్ ‘అమ్మా కరక్కు’ 

నిల్ డివైడెడ్ బి సైలెన్స్  అంటే శూన్యాన్ని నిశాబ్దం తో భాగించడం. అంతే కాదు ఉత్తర్ ప్రదేశ్ లో ఎందుకూ పనికిరాని అనే అర్థం కూడా వుంది.

నిజానికి ఈ సినిమా మొదట హిందీలో ఆతర్వాత తమిళం లో నిర్మించబడింది. రెండు చోట్లా విమర్శకుల చేత ప్రశంశల్నీ ఆర్థికంగా విజయాన్నీ అందుకుంది. హిందీలో చూసి తమిళ స్టార్ ధనుష్ ఈ సినిమాని తమిళ్ లో నిర్మించాడు. ఆమిర్ ఖాన్, ధనుష్, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖ స్టార్ లు ముందుకు వచ్చి అనేక మంచి చిత్రాల్ని నిర్మించడం తో పాటు కొన్నిటిని విడుదలయ్యేందుకు తోడ్పడుతున్నారు ఇది చాలా మంచి పరిణామం. ఆ జ్ఞానం మన తెలుగు వాళ్ళకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

కలల్ని కనాలి వాటిని నిజాంచేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలి అన్న అబ్దుల్ కలాం మాటల ప్రేరణ తో నిర్మించినట్టుగా నీల్ బత్తే సన్నాట సినిమా కనిపిస్తుంది. తన కూతురు భవిష్యత్తు గొప్పగా వుండాలని కలలుగన్న ఒక తల్లి ఆ కలని సాకారం చేసుకునేందుకు పడే తపన పడ్డ కష్టం ఈ సినిమాకు మూల కథ . ఈ కలని దృశ్యీకరిస్తూనే తల్లీ కూతుర్ల మధ్య వున్న ప్రేమ అనుభందం అంతర్లయగా కనిపిస్తుంది. సినిమా మొత్తం సాఫీగా సాగిపోయి ఫీల్ గుడ్ ఫిల్మ్ గా ముగుస్తుంది.

అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా సమాజం లో ఎన్ని ప్రతిభంధకాలు వున్నప్పటికి ఎదగడానికి లక్ష్య నిర్దేశం, అకుంటిత దీక్ష  కావాలని అవి వున్నప్పడు విజయం దాసోహమంటుందని ఈ సినిమా చెపుతుంది.

చాలా అతి సాధారణంగా చిత్రీకరించబడి ఎలాంటి ఆడంబరాలూ లేకుండా అశ్వినీ అయ్యర్ తేసిన ఈ సినిమా పిల్లలు తల్లిదండ్రులూ తప్పకుండా చూడాల్సిన సినిమా.

కథ విషయానికి వస్తే  చందా తన కూతురు ఆపేక్ష(అప్పు) తో వొంటరిగా జీవిస్తూ వుంటుంది. డాక్టర్ దివాన్ ఇంట్లో పని చేయడం తో పాటు పలు అదనపు పనులుకూడా చేస్తుంది. అన్నీ ఆశలూ కూతురు పైననే పెట్టుకున్న చందా కూతురు గొప్పగా చదువుకోవాలని, పెద్ద వుద్యోగం సంపాదించుకుని సంఘంలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ వుంటుంది అందుకోసం ఎంతయినా కష్టపడేందుకు సిద్దంగా వుంటుంది. డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటుంది. స్కూల్ చదువును అర్ధాంతరంగా మానేసిన చందా ఏమి చదివితే గొప్పవాళ్లవుతారని ఆలోచిస్తూ తాను పని చేసే డాక్టర్ దివాన్ ని అడుగుతుంది. కానీ కూతురు అప్పు ఇలాంటి ఆలోచనలేవీ లేకుండా సరదా వుండాలని టీవి చూడాలని పెద్దయింతర్వాత మహా అంటే మరో ఇంట్లో పనిమనిషిగా చేరాలని తలపోస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తూ వుంటుంది. తల్లి మనసును అర్థం చేసుకోదు.

కూతురు ప్రవర్తన చూసి చందా దిగులుపడుతుంది తన వేదననంతా డాక్టర్ దగ్గర వెల్ల బోసుకుంటుంది. ఆప్పుడు దివాన్ ఆలోచించి నువ్వు కూడా స్కూళ్ళో చేరమని సలహా ఇస్తుంది. మొదట సంశయించినా డాక్టర్ సూచన మేరకు చేరడానికి అంగీకరిస్తుంది. దివాన్ పలుకుబడి తో అన్నీ రూల్స్ నుంచి మినహాయించి చందా  పాటశాల లో చేర్చుకుంటాడు హెడ్ మాస్టర్. ఇక అక్కడినుంచి మొదలవుతుంది కథలో వేగం. తల్లి స్కూల్లో చేరడం అప్పుకు ఇష్టం వుండదు. గొడవ చేస్తుంది. తల్లిని  స్కూల్ మానేయమనుటుంది. చందా వినిపించుకోదు. క్లాసులో అప్పు తన కూతురు  అన్న విషయం ఎవ్వరికీ తెలియనట్టు ప్రవర్తిస్తుంది. తోటి విద్యార్థి సహకారం తో లెక్కలు సైన్స్ అంటిన్నీ క్రమంగా నేర్చుకుంటుంది. మంచి మార్కులు రాని అప్పు ఇంట్లో తల్లి తో గొడవ పడుతుంది. ఇద్దరూ ఒప్పందం చేసుకుంటారు. కూతురు పరీక్షల్లో తన కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే తాను బడి మానేస్తానంటుంది. అప్పు బాగా కష్టపడి మంచి మార్కులు సాధించుకుంటుంది. కానీ తల్లి స్కూలు మానడానికే తాను కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నానని అనడంతో తల్లి నిర్ఘాంతపోతుంది. దాంతో తల్లి స్కూలు మనడానికి ఇష్టపడదు.

కూతురు తో పోటీగా మరింత కష్టపడి ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తుంది దాంతో తనకున్న చిన్న వుద్యోగం పోగొట్టుకుంటుంది. డాక్టర్ దివాన్ వూరు మారతారు. చందా హతాశురాలవుతుంది.

ఒక రోజు కారు కింద పడ బోతుంది. కిందికి దిగిన డ్రైవర్ ఆమెను మందలిస్తే కార్లోని వ్యక్తి దిగి డ్రైవరును కోప్పడతాడు. అతన్ని చూసి కలెక్టర్ అని తెలుసుకుని అతని ఇంటికి వెళ్తుంది. బయట గోర్ఖాలు లోపలికి అనుమతించరు. కానీ క్రమం తప్పకుండా ప్రయత్నించి కలెక్టర్ లోనికి పిలవడంతో లోనికి వెళ్తుంది. ఎం సహాయం కావాలని కలెక్టర్ అడిగితే ఏమి లేదు కలెక్టర్ కావడానికి ఏం చదవాలి, ఏ కాలేజీలో చేరాలని అడుగుతుంది. యూపీఎస్సీ పరీక్ష్ రాయాలని చెబుతాడు.  ఇక తన కూతురు తప్పకుండా కలెక్టర్ కావాలని కోరుకుంటుంది. దాంతో చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభిస్తుంది. తన చదువుకోసం జమ చేసిన డబ్బును అప్పు తానే  రహస్యంగా తీసుకుని తన స్నేహితులతో విందు వినోదాలకు ఖర్చు చేస్తుంది. అది తెలుసుకున్న తల్లి కూతురును నిలదీస్తే నువ్వు ఏ పని చేస్తున్నావో తెలుసు ఎట్లా సంపాదిస్తున్నావో తెలుసు అని వాదనకు దిగుతుంది దాంతో తల్లి ఖిన్ను రాలవుతుంది. విషయం తెలుసుకున్న స్కూలు క్లాస్ మెట్ అప్పు ను తీసుకెళ్లి ఆమె తల్లి ఎట్లా కష్టపడుందో చూపిస్తాడు. ఆమె అప్పు తల్లి అన్న విషయం తామందరికీ తెలుసునని చెబుతాడు. కేవలం అప్పు మంచి కోసం ఆమెను గొప్పగా చదివించడం కోసమే తల్లి కష్టపడుతోందని తెలుసుకుని అప్పు లో పశ్చాత్తాపం కలుగుతుంది. తన తప్పు తెలుసుకుంటుంది. కష్టపడేందుకు బాగా చదివేందుకు నిర్ణయించుకుంటుంది. తల్లి తో ప్రేరణ పొందిన అప్పు ఎదిగి యూపీఎస్సీ పరీక్షలకు అటండ్ అవడంతో సినిమా ప్రతీకాత్మకంగా ముగుస్తుంది.

ఇందులో చందా పాత్రలో తెలుగమ్మాయి స్వర భాస్కర్ అద్భుతంగా నటించింది. అపుగా రియా, ప్రిన్సిపాల్ గా పంకజ్ త్రిపాటి నటన సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సరళంగా సాగిన స్క్రీన్ ప్లే, హృద్యంగా జరిగిన చిత్రీకరణ సినిమాను నిల బెట్టాయి.

బిడ్డ కోసం తల్లి కన్న కల దానిని సాకారం చేసుకునేందుకు ఆమె చేసిన కృషి అద్భుతంగా ఆవిష్కృతమయిందీ సినిమాలో.

తల్లిదండ్రులూ పిల్లలూ తప్పకుండా చూడాల్సిన సినిమా .

హిందీ లో ‘నీల్ బత్తే సన్నాట’ తమిళంలో ‘అమ్మా కరక్కు ‘

నీల్ బత్తే సన్నాట’

దర్శకత్వం: అశ్వినీ అయ్యర్ తివారీ, నటీ నటులు: స్వరభాస్కర్, రియా శుక్లా, రత్నా పాఠక్,పంకజ్ తివారీ.

 

 

-వారాల ఆనంద్

“ మసాన్” ( హింది చిత్రం) MASAAN

Posted on

masaan-movie-image-1lic-nov16

అయిదు వేల  సంవత్సరాల చరిత్ర సంస్కృతి కలిగిన వారణాసి నగర  నేపథ్యం లో నిర్మించబడ్డ ‘మసాన్’ సినిమా ఒక కళాత్మక వ్యక్తీకరణ. దాన్ని కొత్త తరం నుంచి వచ్చిన సమాంతర సినిమాల ప్రతినిధిగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా మెగా ఫోన్ పట్టుకున్న దర్శకుడి ప్రతిభకు మసాన్ తార్కాణంగా నిలుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో fipresci అవార్డ్ ను అందుకుని అందరి దృష్టినీ ఆకట్టుకుంది. కథ, స్క్రీన్ ప్లే , చిత్రీకరణ తదితర అన్నీ అంశాల్లో విలక్షనతను చాటుకుందీ  సినిమా. వారణాసి ఒక నగరమే కాదు  ఈ సినిమాలో అది ఒక ప్రధాన పాత్రదారి. వారణాసి నిజానికి పుట్టుకకు, చావుకూ, కుల పట్టింపులకు,అవినీతికీ నిలయమయింది. సజీవంగా సాగే గంగా నది ఒడ్డున వెలసిన ఆసలయిన మానవ జీవిత దర్పణంగా వుంటుంది. అలాంటి నగరం చుట్టూరా అల్లిన కథా చిత్రనే మసాన్. చిత్రం ఫ్రెష్ గాను, రిఫ్రెషింగ్ గాను వుంటుంది. దర్శకుడు నీరజ్ ఘెవాన్, రచయిత వరుణ్ గ్రోవర్ ల సృజన రీతికి ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది. స్క్రీన్ ప్లే మల్టీపుల్ నరేషన్  లో సాగుతుంది. సినిమాలో ఎక్కడా వారణాసి ని అందంగా చూపించాలనే ప్రయత్నం గాని నగర ప్రాధాన్యతను పలికించే ప్రయత్నం గాని చేయరు, కానీ సినిమా ముగిసేసరికి వారణాసి కథలో అంతర్భాగమయి వీక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచి పోతుంది. అక్కడే సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కనిపిస్తుంది.

మాటలు కూడా కవితాత్మకంగా వుండి సినిమా ముగిసిన చాలా సేపటిదాకా హంట్ చేస్తాయి. ‘ తు కిసీ రైల్ సే గుజర్తే హై, మీ ఫుల్ సా తర్తరాతా హూన్’. యహాన్ 28 రైల్ రుక్ తీ హై, 68 రైల్ నాహీ రుక్ తీ ఇస్కా మత్లబ్ యహాన్ ఆనా ఆసాన్ హై, పర్ యహా సే జానా ముస్కిల్’

కథాంశానికి వస్తే మసాన్ అంటే శ్మశానం. కాశీలో గంగా వొడ్డుకు శవాల దహనం ఘాట్ ల నిర్వహణ సాధారణ విషయం. ఆ నేపథ్యం లో కథ నడుస్తుంది. దేవి ఓ అందమయిన యువతి. ఆమె తండ్రి విద్యాధర్ పాఠక్ పూజా సామాగ్రి అమ్మే దుకాణం నడుపుతూ వుంటాడు. అంతకు ముందు ఆయన ఓ సంస్కృత టీచర్. ఒక రోజు దేవి తన కంప్యూటర్ లో బూతు సినిమాలు చూస్తూ వుండగా చిత్రం మొదదలవుతుంది. తర్వాత ఆమె తన సల్వార్ కమీజ్ విప్పేసి పబ్లిక్ టాయ్లెట్ లో చీర మార్చుకుని బయలిదేరుతుంది. తన బోయ్ ఫ్రెండ్ పీయూష్ ను కలుసుకుని ఒక చిన్న హోటల్ కు చేరుతుంది. ఇద్దరూ గదిలోకి వెళ్ళి దగ్గరవుతారు. క్రమంగా బెడ్పైకి చేరతారు. ఇంతలు పోలీసులు వచ్చి తలుపుకొట్టి వాళ్ళను పట్టుకుంటారు. పెళ్ళికి ముందు కలయికను అభ్యంతరపెట్టి కేసు పెడతామంటారు. హోటల్ రూమ్ కు ఎందుకు వెళ్ళావాని ఇన్స్పెక్టర్ అడిగితే జిజ్ఞాస తో అంటుంది దేవి.ఇంతలో పీయూష్ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. దేవి తండ్రి మిశ్రా అవమానాన్ని భరించలేక పోతాడు. ఇన్స్పెక్టర్ మూడు లక్షలు ఇస్తే కేసు లేకుండా దేవిని తప్పిస్తానని బేరం పెడతాడు. మిశ్రా బతిమిలాడుకుంటాడు. చివరికి రెండు లక్షలు బేరం కుదురుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏంజరిగిందని దేవిని అడుగుతాడు ఏమీ జరగలేదంటుంది దేవి. ఇద్దరి మధ్యా వాదం జరుగుతుంది. నీతో మాట్లాడడం ఇష్టం లేదంటుంది దేవి. మా అమ్మనీ కారణంగానే చనిపోయింది అంటుంది.

ఇదిలా ఉండగా సినిమాలో మరో వైపు హరిశ్చంద్ర ఘాట్ లో వుండే డోమ్ రాజ కూంబానికి చెందిన దీపక్ పాలిటెక్నిక్ ఫైనల్ చదువుతూ వుంటాడు. గంగా వొడ్డుకు శవాల్ని దహనం చేయడం, ఆతర్వాత శుభ్రం చేయడం వారి వృత్తి. దీపక్ కూడా కాలేజీ తర్వాత  ఆ పని చేస్తుంటాడు. ఫెస్బుక్ లో పరిచయం చేసుకుని శాలు గుప్తా అనే  అమ్మాయికి దగ్గ రావుతాడు  దీపక్. కవిత్వం, సంగీతం ల తోడుగా ఇద్దరి మధ్యా దగ్గరితనం పెరుగుతుంది. దీపక్ డోమ్ రాజా కుటుంబానికి చెందిన వాడు గా తెలుసుకుని తమ ఇంటి వాళ్ళు ఒప్పుకోరంటుది శాలు. ఇంట్లో అందరం యాత్రలకు వెళ్తున్నామని  చెబుతుంది శాలు.

అక్కడ దేవి తన వుద్యోగం వదిలివేస్తుంది. ఇన్స్పెక్టర్ వొత్తిడి  పెరుగుతుంది.మిశ్రా కూతురుకు  తన శిష్యుడి కాలేజీలో  రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇప్పిస్తాడు.  అక్కడ వాతావరణం నచ్చక వదిలేస్తుంది దేవి. రైల్వే లో ఉద్యోగం సంపాదిస్తుంది. అలహా బాద్ లో   పోస్టింగ్ వస్తుంది. తండ్రిని వదిలి వెళ్లిపోతుంది.

యాత్రలకు వెళ్ళిన వాహనానికి పెద్ద ప్రమాదం జరిగి అంతా చనిపోతారు. శవదహనం చేస్తూ దీపక్ శాలూ శవాన్ని  చూసి ఖిన్నుడవుతాడు. ఆమె చేతి వుంగరాన్ని తీసుకుని పిచ్చివాడిలా మారిపోతాడు. మెత్రులు ఎంత చెప్పినా మారని దీపక్ మంచి వుద్యోగం సంపాదించమని శాలు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని ఆమె జ్ఞాపకంగా వుంచుకున్న ఉంగరాన్ని గంగాలోకి విసిరేసి వుద్యోగ ప్రయత్నంలో పడతాడు. మంచి  ఉద్యోగం అల్హాబాద్ లో వస్తుంది.  వెళ్ళి జాయిన్ అవుతాడు. అక్కడే గంగా తీరం లో  దేవి,దీపక్ కలుస్తారు. సంగమానికి పడవ ఎక్కుతారు. సంగం రావడం ఇది మొదటి సారా అని దీపక్ దేవిని అడుగుతాడు అవును అంటుంది. నేనిది రెండోసారి అంటాడు ఎందుకంటుంది దేవి.  ఎప్పుడయినా సంగమానికి రెండు సార్లు రావాలంటాడు దీపక్ పడవ నడుస్తూ వుండగా సినిమా ముగుస్తుంది.

ఎక్కడా ఆడంబరమూ, మోత మోగించే సంగీతమూ, కృత్రిమత్వమూ లేకుండా సహజ సిద్దమయిన కథనంతో పాటు దేవి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ సినిమా ముగుస్తుంది.

ఇవ్వల్టి  ఫక్తు వ్యాపార సినిమా యుగం లో వాటికి సమాంతరంగా మంచి సినిమా గా మసాన్ నిలిచి పోతుంది.

కథ, కథనాత్మకథా అన్నీ సమపాళ్ళల్లో సమకూరిన సినిమా ‘మసాన్’

నటీనటులు : రిచా చద్దా(దేవి), విక్కీ కౌశల్(దీపక్), శ్వేత త్రిపాటి(శాలు గుప్తా), సంజయ్ మిశ్రా(పాఠక్)

దర్శకత్వం:నీరజ్ ఘెవాన్, రచన: వరుణ్ గ్రోవర్

##వీక్షణం ##

Posted on

 

yavanika-ok-12pinkfilmreview

PUBLISHED IN ‘KARMIKA VAAHINI’ LIC MAGAZINE OCT.2016

‘ పింక్ ‘

నిన్ను వెతుక్కుంటూ బయలు దేరు

ఎందుకు నిరాశ తో కూర్చుండి పోతావు,

నీ ఉనికి కోసం బయలుదేరు, కాలం కూడా శోధిస్తోంది,

నిన్ను భందించినవి బేడీలు అనుకోకు

వాటిని అస్త్రాలుగా మలచుకో

నీ చూన్నీని ఎగరేసి జెండాగా ఎగరేయి

ఆకాశం కూడా వణికి పోతుంది

నీ చూన్నీ పడిపోతే భూకంపమే వస్తుంది

అందుకే

నిన్ను వెతుక్కుంటూ నువ్వు బయలు దేరు

ఎందుకు నిరాశ తో కూర్చుండి పోతావు,

నీ ఉనికి కోసం బయలుదేరు, కాలం కూడా శోధిస్తోంది

ఇట్లా మన సమాజం లో మహిళలకు ఆత్మ స్స్థైర్యాన్ని నిలిచి పోరాడే శక్తిని ఇస్తూ సాగిన మంచి సినిమా పింక్.

వార్త మాన సమాజంల మహిళలల పట్ల వారి స్వేచ్ఛ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో, వారి వ్యక్తిత్వాన్ని ఎట్లా హననం చేస్తుందో, అన్ని నిభందనలు మహిళలకే ఎట్లా అమలు చేస్తారో ప్రతిభావంతంగా చిత్రించారు. ఈ వ్యవస్థ మహిళలను ఎట్లా టెక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటుందో వివరిస్తుంది. వ్యక్తులు ,కుటుంబము, చొట్టుపక్కల వాళ్ళు మొత్తంగా సమాజం మహిళలపట్ల ఎట్లా వివక్షతతో ప్రవర్తిస్తుందో ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది.

పింక్ లో సేనియర్ న్యాయ వాది దీపక్ సెహెగల్ చేత కోర్టులో వాదన సమయంలో పలికించిన మాటలు అందరూ ఆలోచించాల్సినవి. మొత్తం సమాజాన్ని స్కాన్ చేసినట్టుగా వున్న ఆమాటలు అందరినీ ఆలోచింప చేస్తాయి. ఎవరికి వారు అంతర్మధనానికి గురయ్యి తీరుతారు.

ఇక్కడ బండి తాలపు చెవులు స్త్రీ గుణాన్ని నిర్ధారిస్తాయి, ఒక అమ్మాయి రాక్ షో కు వెళ్తే ఆమె సూచన ఇచ్చినట్టు,గుడికి పోతే కాదు అంటే గుణాన్ని స్థలం నిర్ణయిస్తుంది, ఇక్కడ ఎవరయినా ఒక యువతి ఒక యువకుడితో వెళ్లినంత మాత్రాన ఆతడికి అన్ని రకాల స్వేచ్చా  ఇచ్చినట్టు అయిపోతుంది, ఇక్కడ తాగడం చెడిపోయిన లక్షణం స్త్రీలకు, మగవారికి కాదు, అవును మరి మన వ్యవస్థ బలహీనుల్నే హింశిస్తుంది….ఇలా ఎన్నో మాటలు వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాల్ని, స్వభావాన్ని ఈ సినిమా సూటిగా ప్రశ్నిస్తుంది.

కోర్టులో చివరగా ఒక మాట చెబుతాడు దీపక్ సెహెగల్

‘ కాదు అంటే కాదనే, ఆ మాట కేవలం ఒక పదం కాదు అది పూర్తి వాక్యమే. దానికి అర్థాలు వివరణాలూ అవసరం లేదు లేదు అంటే లేదనే.

అమితాబ్ బచ్చన్, తాప్సీ,కీర్తి, ఆండ్రియా లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అనిరుద్ద రాయ్ చౌధురి దర్శకత్వం  వహించారు. మీనాల్, ఫలక్, ఆండ్రియా లు ముగ్గురూ దక్షిణ డిల్లీ లోని ఒక అపార్టమెంట్ లో కలిసి వుంటారు. ముగ్గురూ తలా ఒక జాబ్ చేసుకుంటూ హాయిగా వుంటారు. ఒక రోజు రాక్ షో తర్వాత మినాల్ కు  పరచయం వున్న రజ్వీర్ ఈ ముగ్గురినీ సూరజకుంద్ లోని ఒక రెసార్టకి డిన్నర్ కి  ఆహ్వానిస్తాడు.  రజ్వీర్ ఆతని ఇద్దరు మిత్రులు మత్తుగా తాగి ముగ్గురు అమ్మాయిని విడదీసి తలా ఓ పక్కకు తీసుకెళ్తారు. రజ్వీర్ మినాల్ ని బలవంతం చేసే ప్రయత్నం చేస్తాడు. నో నో అంటుంది మీనాల్.  రిజ్వీ వినిపించుకోక పోవడంతో పక్కనే వున్న సీసాతో ఆతని నుదుటి మీద బాదుతుంది దాంతో రిజ్వీ కంటికి తీవ్ర గాయమవతుంది. రిజ్వీ కి దగ్గరి బందువయిన రాజకీయనాయకుడు పోలీసుల్ని అలర్ట్  చేస్తాడు. మినాల్ ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు నమోదు చేయరు, ఇంతలో రిజ్వీ మినాల్ పయిన హత్యా ప్రయత్నం చేసిందని కేసు పెడతాడు పోలీసులు మీనాల్ ని అరెస్టు చేస్తారు. కేసు  పెద్దద  వుతుంది. అమ్మాయిలు వుంటున్న అపార్ట్మెంట్స్ లోనే వుంటున్న రిటైర్డ్ వకీలు దీపక్ సెహెగాల్ మీనాల్ కేసుని వాదించడానికి ముందుకు వస్తాడు. రిజ్వీ తరఫున వాదించిన వకీలు మినాల్ ఆమె మిత్రులు చెడిపోయిన వారని రిజ్వీ అతని మిత్రుల్ని డబ్బుకోసం రొంపిలోకి దించే ప్రయత్నం చేశారని అన్ని భూటకపు ఆధారాలు చూపిస్తారు. అప్పుడు దీపక్ సెహెగాల్ చేసిన వాదం మొత్తం సమాజాన్ని దాని మౌలిక స్వభావాన్ని స్వరూపాన్ని నీల దీస్తుంది. అద్భుతమైన వాదన తో నిలదీస్తాడు. పార్టీకి వచ్చినంత మాత్రాన, మీతో కలిసి కొంత మందు కొట్టినంత మాత్రాన అన్నింటికీ అంగీకరించినట్టు కాదని ‘నో’

అంటే నో అనే అర్థమని అంటాడు.  ఒక అమ్మాయి లేదా స్త్రీ అంగీకారం లేనిదే గర్ల్ ఫ్రెండ్ అయినా, భార్య అయినా చివరికి సెక్స్ వర్కర్ అయినా నో అన్నప్పుడు అది నో అనే లేదంటే అది అత్యాచారం కిందికే వస్తుందని వాదిస్తాడు.

మౌలిక ప్రశ్నలను లేవదీస్తూ సాగిన వాదనను అంగీకరిస్తూ కోర్టు కేస్ కొట్టి వేస్తుంది.

కోపామూ,భయమూ, నిర్లిప్తత తో వుండి  పోయిన మీనాల్ ని ఆమె మిత్రుల్ని ఉద్దేశించి భావ స్ఫోరకమయిన కవిత తో చిత్రం ముగుస్తుంది.

పింక్ దేశ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంశలు అందుకోవడం తో పాటు ఆర్థికంగా కూడా 4కోట్ల పెట్టుబడికి మొదటి పది రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది. సినిమాలో అమితాబ్ నటన  చాలా గొప్పగానూ హుందాగానూ సాగుతుంది. ఇక తాప్సీ కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితమయిన ఆమె నటన పింక్ లో ఊహానందనంత స్థాయి కి చేరింది. జ్వరంతో కూడా ఆమె చేసిన కోర్ట్ దృశ్యాలు మరింత ప్రభావంతంగా సాగాయి. 2016 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున షూటింగ్ ప్రారాభించిన ఈసీనిమా ఈ ఏటి ఊతమ చిత్రాల్లో నిలుస్తుంది. ఆన్ లైన్ లో అందు బాటు లో వుంది.

———————————-

‘పింక్’ (హింది చిత్రం)   ముఖ్య నటీనటులు: అమితాబ్ బచ్చన్, తాప్సీ, అంగద్ బేడి మొ..

దర్శకత్వం:అనిరుధ్ధ రాయ్ చౌధురి.నిర్మాణం: రశ్మి శర్మా, శూజీ సర్కార్. రచన: అనిరుధ్,సూజిత్,రితేశ్ శా

-వారాల ఆనంద్

9440501281