Month: May 2022

గడియ ముందో వెనకో…

Posted on

++++ వారాల ఆనంద్

https://telugu.asianetnews.com/…/varala-anand-poem-rc8noi

POEM PUBLISHED TODAY IN TELUGU ASIANET NEWS THANKS TO THE EDITOR

*******

గడియ ముందో వెనకో…

++++++++++ వారాల ఆనంద్

అలసిన కళ్ళకు కొంత

ఉపశమనమిస్తూ రెప్పలు మూసుకు

పడుకున్నా

టిక్ టిక్ టిక్

కాలం నడిచి పోతూనేవుంది

కునుకు పట్టదు

నిద్ర రాదు

వాకిలి దాకా వచ్చి

గడపలో నిలబడిపోయిన

నిద్రను రా రమ్మని ఎవరు పిలవాలి

రాత్రా..చీకటా..

నడిచీ నడిచీ డస్సి పోయి వున్నా

రెప్పలు తెరిచే ఓపిక లేదు

చేతులు చాచే ఓరిమి లేదు

శిలలా పడుండి పోయా

చీకటీ రాత్రీ

నా రెండు వైపులా

తోడుగా నిలబడ్డాయి ఉపశమనంగా

నాలోపల రక్తం ప్రవహిస్తూనే ఉంది

శ్వాస సాగుతూనే ఉంది

ఏదీ ఎవరి కోసమూ

నిలబడదు

నడక సాగాల్సిందే

గడియ ముందో వెనకో

తెల్లారక మానదు

****

Posted on Updated on

42 – యాదొంకి బారాత్   

++++++++++++

కొన్నిసార్లు వంచన గెలుస్తుంది

అవమానం కోరడాలా తగుల్తుంది

కానీ

“కాలం” డస్టర్ లా వాటిని తుడిచేసి

ముందుకు సాగుతుంది.   

***********

జ్ఞాపకాల వెల్లువలో ఎన్నో ఎన్నెన్నో…

నడిచి వచ్చిన దారి..

గడిపి వచ్చిన కాలం..

వుండి వచ్చిన వూరూ

ఎన్నో సంఘటనలనీ సందర్భాలనీ వాటిని మించి ఎందరొ మనుషుల్నీ గుర్తు చేస్తుంది. మరెందరినో చిత్రంగా మరుగున పడేస్తుంది. కవులూ,రచయితలూ, కళాకారులూ, ప్రముఖులూ ఎందరో గుర్తొస్తారు. వాళ్ళని మరీ మరీ గుర్తుచేసుకుంటాం మంచిదే కానీ మనతో కలిసి నాలుగు అడుగులు వేసి మన వెన్ను తట్టి నిలబెట్టిన వాళ్ళూ వుంటారు వాళ్ళని మర్చిపోతాం లేదా జ్ఞాపకాల పొరల్లో వాళ్ళంతా అట్లావుండి పోతారు. అట్లా నా వేములవాడ జీవిత కాలం నాటి జ్ఞాపకాలలో వున్న కొంతమంది మిత్రుల గురించి ఇవ్వాల గుర్తుచేసు కుంటున్నాను. వాళ్ళు కవులో కళాకారులో కాదు. కానీ గొప్ప మనుషులు, గొప్ప స్నేహితులు. మంచిని అభిమానించిన వాళ్ళు. నా యాదొంకి బారాత్ లో నాతో పాటు నడవ వలసిన వాళ్ళు. ఇక్కడ కూడా నా పరిమితులు నాకు తెలుసు. ఈ ప్రవాహంలో కొందరు నా స్మృతి పథం లోంచి వెళ్లి పోయి వుంటారు. నాదీ అతి పరిమితమయిన జ్ఞాపకమే కదా.

   మీకు ఆసక్తిగా వుంటుందో లేదో తెలీదు కానీ వెలుగులోకి రాని కొందరు వేములవాడ మిత్రుల గురించి నాలుగు మాటలు.

1981లో వేములవాడలో ఫిలిం సోసైటీ పెట్టాలని ఆలోచన కలిగినప్పుడు కలిసిన మిత్రులు అనేక మంది. అప్పటిదాకా సాహిత్యం,సంగీతం,నాటక రంగ కార్యక్రమాలు మాత్రమే తెలిసిన వూరికి మంచి సినిమాని, ఆర్ట్ సినిమాని పరిచయం చేయడం నా పని. ఏ పనీ ఒక్కడితో కాదు. కొంత మంది కలవాలి. ఒక సమూహం ఏర్పడాలి. ఒకే ఆలోచనతో సాగాలి. నాకేమో కరీంనగర్ ఫిలిం సొసైటీ తో కొంచెం పరిచయం వుంది. మంచి సినిమాల పైన వచ్చిన సాహిత్యం కొంత చదివాను. అప్పటికి వేములవాడ ఒక పెద్ద గ్రామం మాత్రమె. అక్కడికి గొప్ప సినిమాలు తేవడం చూపించడం వాటిపైన చర్చలు అవీ పెట్టడం కొంత సాహసమే. నేను మొట్టమొదట ఈ ప్రస్తావనను తెచ్చింది మిత్రుడు ఇట్టేడు కిరణ్ కుమార్ తో. ఎగిరి గంతేశాడు. చలో అన్నాడు. అంత ఈజీనా. సభ్యులు కావాలి సినిమా హాలు మాట్లాడాలి అన్నాను. అన్నీ చూద్దాం నేనున్నాను కదా అన్నాడు. ఇద్దరం కలిసిన రెండవ వ్యక్తి పీ.ఎస్.రవీంద్ర.అప్పటికే కవిత్వం ఫోటోగ్రఫ్ఫీల్లో వున్న పీఎస్ ఎంతో ఉత్సాహం చూపించాడు. ఇంకేముంది నేను కరీంనగర్ నరెడ్ల శ్రీనివాస్ దగ్గరి నుండి బై లాస్ తెచ్చేశాను. ఇక సంస్థ కార్యవర్గాన్ని రూపొందించడం. అధ్యక్షుడు ఎవరయితే బాగుంటుంది. నగుబోతు ప్రభాకర్ అన్నారు. కలుద్దాం అన్నాను. తనని తన ఇంజనీరింగ్ షాపులో కలవగానే క్షణం కూడా ఆలోచించకుండా పదండి ముందుకు అన్నాడు. నగుబోతు ప్రభాకర్ అప్పటికే ఇంజినీరింగ్ పూర్తి చేసి తండ్రి సూచనల మేరకు వ్యాపారం లో స్థిరపడ్డాడు. నిజానికి ఇంజనీరుగా ఉద్యోగంలో చేరివుంటే ఏ  చీఫ్ ఇంజనీరుగానొ పదవీ విరమణ చేసి ఉండేవాడు.ఎంతో ఆత్మీయుడు, నిగర్వి. నవ్వడం తప్ప ఆయన కోపం నేనెప్పుడూ చూడలేదు. ఆయన అధ్యక్షుడు కావడం ఫిలిం సొసైటీకి గొప్ప ఆలంబన లభించినట్టు అయింది. ఇక ఉపాధ్యక్షుడు ఎవరు అనుకుంటూ కొమురవెల్లి నారాయణ బంగ్లాలో వున్న నల్ల ప్రభాకర్ గుర్తొచ్చాడు. మాది ఆలస్యం చేసేరకం కాదు. పద వెళ్దాం అనుకున్నాం. ప్రదీప్ ఎలెక్ట్రికల్స్ కు వెళ్లాం. ఏముంది మొదట టీ అన్నాడు. విషయం చెప్పాం. మీరంతా వున్నంక నాదేముంది అంటూ ఇంకా ఎవరెవరు సహకరిస్తారో కొన్ని పేర్లు చెప్పాడు. తప్పును తప్పు ఒప్పును ఒప్పు అనే లక్షణం నల్ల ప్రభాకర్ ది. ఒక సంఘటన గుర్తొస్తున్నది. కరీంనగర్ జిల్లా ఫిలిం సొసైటీల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఉదయం గోకుల్ టాకీసు కార్యక్రమంలో నగుబోతు ప్రభాకర్ సభకు అధ్యక్షత వహించాడు. మధ్యాహ్నం గ్రామపంచాయతి ఆఫీసులో జరిగిన సమావేశానికి కార్యదర్శిగా నేను అధ్యక్షత వహించాను. సభ బాగా జరిగింది. అందరం హాపీ. తెల్లారి నల్ల ప్రభాకర్ నేరుగా నన్నే అడిగాడు “నిన్న మధ్యాహ్నం కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడిగా నగుబోతు ప్రభాకర్ ను వేదిక మీదికి పిలవాల్సింది తప్పు చేసారు ఆనంద్” నేను అవాక్కు అయ్యాను నిజమే నాకు తోచలేదు. ఉదయం సభలో తానున్నాడు కదా అనుకున్నాం. సారీ అన్నాను. అంతటి సూటి మనిషి నల్ల ప్రభాకర్.

    ఇక వయసులోనూ అనుభవంలోనూ మాకంటే చాలా పెద్దాయన నగుబోతు చంద్రమౌళిగారు. ఆయన కవీ రచయితా కాదు, నటుడు కాదు. సంగీతం తెలిసిన వాడు, కానీ కళ లంటే ప్రాణం. కవిత్వమన్నా,కవులన్నా ప్రేమ. అన్ని సాహితీ సాంస్కృతిక సంస్థలతో గొప్ప ఆత్మీయ సన్నిహిత సంబంధం ఆయనది. ఫిలిం సొసైటీ కోశాదికారి స్థానానికి మాకు ఆయన్ను మించిన వ్యక్తి లేడు. తన దగ్గర ప్రస్తావన తేగానే. మంచి కళాత్మక సినిమాలు చూడడమే కాదు మనవాళ్ళకు చూపించే పనికదా పదండి పోదాం అన్నారాయన. పెద్దవాడుగా అయన అందించిన ప్రోత్సాహం ఉత్సాహం మరువలేనిది. ఆయన సున్నితత్వాన్ని మంచితనాన్ని గురించి ఒక సంఘటన చెప్పాలనిపిస్తున్నది. శంకరాభరణం సినిమా వచ్చిన సమయమది.రాష్ట్రంలో ఆ సినిమా ఒక ఊపు కదా. సినిమా చూసిన చద్రమౌళి గారికి జే.వి.సోమయాజులు మీద గొప్ప అభిమానం కలిగింది. ఒక రకంగా అరాధనీయ భావం కూడా. అదే సమయంలో ఎదో కార్యక్రమంలో పాల్గొనడానికి సోమయాజలు వేములవాడకు వచ్చారు. గెస్ట్ హౌసులో వున్నఆయన్ని కలవడా నికి నగుబోతు చంద్రమౌళి వెళ్ళారు. సోమయాజులు ఆర్టిస్టు కదా. గదిలో మందేసుకుంటూ వున్నాడు. ఆ స్థితిలో ఆయన్ని చూసిన నగుబోతు చంద్రమౌళి గారి తల తిరిగిపోయి ఛీ అనుకుంటూ వచ్చేసాడు. బయట కొచ్చి ఎంతగా బాధ పడ్డాడో..మాతో చెబుతూ అంత గొప్ప పాత్ర చేసిన వాణ్ని ఆ స్థితిలో చూడ్డంతో మొత్తం నటుల మీదే అభిమానం పోయింది అన్నాడు.అట్లా కాదని చెప్పినా ఆయన అభిప్రాయం మార లేదు. తన విశ్వాసాల మీద అంతటి నిబద్దత ఆయనది. ఇక మరో మిత్రుడు సన్నిహితుడు శ్రీ యాద కిషన్. ఉద్యోగం లోనూ జీవితంలోనూ నేను స్థిరపడడంలో నా వెన్నంటే వున్న అత్యంత ఆత్మీయుడాయాన. సిరిసిల్లా ఉద్యోగ కాలం నుండి కలిసి జరిపిన ప్రయాణం  మాది. ఆయన కవో కళాకారుడో కాదు. మంచి మనసున్న దగ్గరి మిత్రుడు శ్రేయోభిలాషి. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ పీజీ కాలేజీలో చేరింతర్వాత..అనేక సందర్భాల్లో నా ఆవేశానికి అడ్డుకట్టగా నిలిచి నన్ను నిలదొక్కుకునేలా చేసాడు. సినిమాలు,కవిత్వమూ సరే ఇల్లు వుండాలి అంటూ వెంటబడ్డాడు.డబ్బులు ఎక్కడివి సార్ అంటే నువ్వు మొదలు పెట్టు ఎక్కడినుంచో వస్తాయి మొదలయితే శురూ చేయి అనేవాడు. నేను ఎంతకూ కదలక పోయేసరికి ఇంటికి వచ్చి నా సహచరి ఇందిరతో ఏమమ్మా మీ సారుతో ఇల్లు కట్టించవా.. అన్నాడు ఇంకేముంది ఇందిర నా వెంటబడడం… మిత్రుల సాయంతో కరీంనగర్ లో ఓ గూడు ఏర్పడింది. అంతే కాదు ఇప్పటికీ అన్ని విషయాల్లో ప్రాక్టికల్ సలహాలు ఇస్తూ నన్ను నేలమీద నిల బెట్టాడు కిషన్ సర్.

ఆయన తమ్ములు మురళి, అశోక్, ప్రసాద్ లు కూడా స్నేహంగానే వుండేవాళ్ళు. అట్లా స్నేహంగా వున్న మరి కుటుంబం బొడ్ల వారి కుటుంబం. వారిలో గట్టయ్య మాకంటే చాల పెద్దవాడు. బంగారం వ్యాపారంలో ఉండేవాడు. రెండవవాడు బొడ్ల హరిబాబు ఎన్నో వ్యాపారాలు చేసాడు, ఎంతో ఆత్మీయంగా వున్నవాడు. ఇక మూడవ వాడు అశోక్ అంజనీ మెడికల్ హాల్. చివరివాడు బొడ్ల చక్రపాణి. మా తోటి వాడు. మా పీ.ఎస్. వాళ్ళ క్లాస్ మెట్. వ్యాపారవేత్త. తనకు కరీంనగర్ లోని ఎస్.వీ.టీ.సి. కాలేజీ వ్యవస్థాపకుడు శ్రీ నాగభూషణం గారి అమ్మాయి అనురాధ తో పెళ్లి అయింది. ఇద్దరు సంతానం. బొడ్ల అనురాధ గారు డిగ్రీ పీజీ పూర్తి చేసి గొప్ప అధ్యాపకురాలయ్యారు. తానే నా కవిత్వాన్ని ‘SIGNATURE OF LOVE” పేర ఇంగ్లిష్ లోకి అనువదించారు.( ఆ వివరాలన్నీ మరో సారి విపులంగా రాస్తాను).

ఇక ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన నాయకుడు శ్రీ ప్రతాప చంద్రమౌళి. అదే సమయంలో డైరెక్ట్ ఎన్నికల్లో గ్రామపంచాయతి సర్పంచ్ గా ఎన్నికయిన వాడాయన. ఎలాంటి స్వార్థ రాజకీయాలు అంటని వాడు. మా ఫిలిం సొసైటీకి సలహాదారుగా వుండి ఆయన అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. ఏ మీటింగ్ కయినా పంచాయతీ హాలును వాడుకోండి అని అనుమతిచ్చానిచ్చాడు.

ఈ సమయంలో నా మదిలో గుర్తోస్తున్నమరి  మిత్రుడు శ్రీ మ్యాన వెంగయ్య. రాజ్ ఫోటో స్టూడియో అధినేత. వేములవాడలో వున్నన్ని రోజులు మేమాయనతో సన్నిహిత సంబంధం వున్నవాళ్ళం. ఎంతో ఆత్మీయంగా వున్న స్నేహం మాది. ఒక్క వేములవాడ జాతర సమయంలో తప్ప కలువని రోజంటూ వుండేది కాదు. ఆయన దగ్గరే మొట్ట మొదటి సారి డార్క్ రూమ్ చూసాను. ఫిలిం రీల్ డెవలప్ చేసే పద్ధతి, ప్రింట్ వేసే తీరు చూసాను. It’s a great experience, thanks to Vengaiah. ఆయనేమో తాను తీసిన నా ఫోటో ఒకటి పెద్ద సైజు చేసి స్టూడియో లో పెట్టాడు. దిష్టి కోసమా అని నవ్వుతూ నేనంటే ఫోటో చూడు ఎంత బాగుందో.. అన్నాడు.

ఇక ఇక్కడ ఒక హోటల్ గురించి దాని యజమాని గురించీ తప్పక చెప్పుకోవాలి. హోటల్ పేరు నటరాజ్ హోటల్. యజమాని శ్రీ నర్సయ్య, మాకు దూరపు బంధువు తాత వరుస. ఇంకేముంది హోటల్ కు వెళ్లి నప్పుడల్లా సరదా మాటలు జోకులూ నవ్వులాటలూ పండేవి. ఫిలిం సొసైటీ ప్రదర్శనల్లో రే ‘షత్రంజ్ కే ఖిలారీ’ వెశాం. సినిమా అయిపోయిన తర్వాత వచ్చి నటరాజ్ హోటల్ లో కూర్చుని టీ తాగుతూ సినిమా గురించి చర్చించుకుంటూ వున్నాం. ఇంతలో నర్సయ్య తాత వచ్చాడు. తానూ సభ్యుడే కనుక సినిమా ఎట్లుంది అని అడిగాం. ఏముంది సినిమా చూసి వచ్చి నా పని నేను చేసుకుంటున్నా అన్నాడు. మా కర్థం కాలేదు..అది అర్థం అయిన ఆయన సోమరితనం పనికి రాదనీ, వ్యసనం అసలే కూడదని తెలుసుకుని వచ్చినా పని నేను చేసుకున్తున్నానోయీ మంచి సినిమా చూపించారు అని అభినందించారు. ఒక సినిమాకు అంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది. అంతే కాదు అదే హోటల్ లో రంగులకల టీం వచ్చినప్పుడు కూడా ఆర్టిస్ట్ వైకుంఠం, సుదర్శన్ తదితరులం టీలు తాగి ఎన్నో ముచ్చట్లు పెట్టుకున్నాం.  

ఇంకా ఆ రోజుల్లో సిరిసిల్లాకు కానీ దగ్గరి ఏ ఇతర ప్రాంతాలకు కానీ సినీ సాహితీ ప్రముఖులు ఎవరు వచ్చినా వేములవాడ రాజన్న దగ్గరికి రావడం తప్పనిసరిగా జరిగేది. లేదా మేమన్నా తీసుకోచ్చేవాళ్ళం అట్లా ఒక సారి దేవదాస్ కనకాల,వి.మధుసూదన్ రావు లు సిరిసిల్లాకు వస్తే వేములవాడకు పిలిచి ఫిలిం సొసైటీ మిత్రులందరమూ వారిని సత్కరించాం.

ఇంకా ఆరోజుల్లో పత్రికా విలేఖరులుగా వున్న సంకేపల్లి నాగేంద్ర శర్మ,మామిడిపల్లి కృష్ణమూర్తి లు కూడా ఎంతో స్నేహంగానూ, ప్రోత్సాహంగానూ వుండేవాళ్ళు. 

ఇట్లా ఎన్నో అనుభవాల్ని అందించిన మిత్రులందరినీ గుర్తు చేసుకుంటూ.. ఈ వారం సెలవు.. మళ్ళీ వారంకలుస్తాను

మీ

-వారాల ఆనంద్ 

22 MAY 2022                   

Posted on

మిత్రులారా, క్లిక్ చేసి వీక్షించండి ‘అక్షరాల తెర’. డాక్టర్ నందిని సిధారెడ్డి గారితో కరచాలనం..ఆయన అనేక విషయాలు చర్చించారు

– వారాల ఆనంద్