Month: September 2023

యాదోంకీ బారాత్=102..పెనవేసుకున్న పత్రికలు

Posted on

యాదోంకీ బారాత్=102

++++++ వారాల ఆనంద్

పెనవేసుకున్న పత్రికలు

*****************

     జ్ణాపకాల పోరాల్లోకి వెళ్లినప్పుడు విజయాలూ ఓటములూ, ఆసక్తులూ అనాసక్తులూ అన్నీ కళ్ల ముందు సినిమాలా కదలాడతాయి. నిజానికి జీవితం మరే నవలకన్నా కథ కన్నా సినిమా కన్నా కూడా గొప్ప నాటకీయతతో నడుస్తుంది. కానయితే జీవితంలో నడక లేదా పరుగు దాదాపుగా మన ప్రమేయం అంతగా లేకుండానే సాగుతుంది. అన్నీ మనం అనుకున్నట్టు సాగవు. చిత్రంగా జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. కొన్ని చోట్ల నిలబడి పోతుంది. కొన్ని చోట్ల సాగిపోతుంది. ఒక గమ్యాన్ని అనుకుని బయలుదేరిన ప్రయాణం నడుమ నడుమ అనేక మజిలీల్లో మన ప్రమేయం వుండీ మరోసారి లేకుండానే నిలబడిపోవాల్సి వస్తుంది. అందుకే ఒక కవినో రచయితనో చూసి అరె ఇంతకుముందు ఈయన ఇట్లా లేడే. ఇంత సుజనాత్మకత ఎట్లా వచ్చింది అని అనుకుంటాం ఆశ్చర్యపోతామ్. ఆ సృజనాత్మక గొప్పదనాన్ని అంగీకరించడానికి చాలా మందికి మనసొప్పదు.  ఇది సహజం.

++++

ఇక నా జీవితంలో అనేక దిన వార మాస పత్రికలు పెనవేసుకూని వున్నాయి. మొదటినుంచీ ఆయా పత్రికల్లో వచ్చిన కాలమ్స్ నన్ను బాగా ఆకర్షించేవి. డిగ్రీ చదువుతున్నప్పుడే కరీంనగర్ లో అనంత స్వామి, మొయిజ్, శ్రీ కృష్ణా బుక్ స్టాల్ లాంటివి డైలీస్, మగజైన్స్ అమ్మేవి. నాకు అప్పుడే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, కార్వాన్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి జాతీయ పత్రికలు, దిన పత్రికల ఆదివారం సంచికలూ, తెలుగులో వచ్చేఆదివారం అనుబంధాలూ ఎంతగానో ఇష్టంగా చదివే వాడిని. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లో వుండే పేజ్ మేకప్ పేయింటింగ్స్ లా వుండేది. ఆ పేజీల్ని చదవడం కాదు చూడ్డమే గొప్ప ఆనందాన్నిచ్చేది. మళ్ళీ అలాంటి పత్రికను, పేజ్ నేషన్ ను నేనయితే చూడలేదు. ఆపుడు అన్నీ పత్రికల్లో కథలు వ్యాసాలూ కొన్నింట్లో కవితలు చదివే వాణ్ని కానీ క్రమం తప్పకుండా వార మాస పత్రికల్లో కొందరు రాసే  కాలమ్స్ నన్ను బాగా ఆకర్షించేవి. క్రమంతప్పకుండా చదివే ప్రయత్నం చేసేవాన్ని. బహుశా అదే ఆసక్తి నేను సినిమాల మీద సాహిత్యంలో కాలమ్స్ రాసేందుకు దోహదం చేసిందనుకుంటాను. మా కరీంనగర్ జిల్లా స్థాయి పత్రికల్లోనే అయినా కొన్ని కాలమ్స్ నా రచనా జీవితంలో గొప్ప సంతోషాన్నిచ్చాయి. సినిమాల విషయం లో రాష్ట్ర స్థాయి పత్రికాలు నాకు అవకాశాల్నిచ్చాయి.ఇట్లా గొప్ప అందమయిన తీగల్లగా నన్ను పెనవేసుకున్న పత్రికల ప్రపంచం లో మొట్టమొదటి పత్రిక ‘చిత్రిక’, అది కరీమంగర్ నుంచి శ్రీ పురాణం రామచంద్ర సంపాదకత్వం లో వచ్చిన వార పత్రిక.అందులో నా జీవితం లో రాసిన మొట్ట మొదటి కథ అచ్చవడం తో పాటు పత్రిక నిర్వహణ తదితరాల్ని దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ఇక అందరమూ విజ్జన్న అని పిలుచుకునే బి.విజయకుమార్ సంపాదకుడిగా వెలువడిన గొప్ప సంచలనాత్మక ప్రగతిశీల సాయంకాలం దిన పత్రిక “జీవగడ్డ”.  అందులో నేను మిత్రుడు కె.ఎన్ చారి సూచన ప్రోత్సాహాలతో ‘వారానందం’ కాలం మొట్టమొదటిసారిగా రాశాను. కొంచెం హాస్యం వ్యంగం మేళవించి ఆనాటి సామాజిక అనుభవాల్ని ప్రతివారం ఆదివారం రోజున రాసిన కాలం అది.అప్పుడు చారి ‘న్యాయవాదం’, నరెడ్ల శ్రీనివాస్ ‘పెన్నుపోటు’, అల్లం నారాయణ ‘ఎన్నెల కోనల్లో’, గోపులింగా రెడ్డి ‘జానపదం’, తదితర కాలమ్స్ రాసేవాళ్లం. నిజానికి జీవగడ్డ ఆనాటి ఉత్తర తెలంగాణ సామాజిక,రాజకీయ,ఆర్టిక, విప్లవ పోరాటాలకు నిజాయితీగా అద్దం పట్టిన పత్రిక. విజయ కుమార్ ఎన్నిరకాల ఒత్తిడులు వచ్చినప్పటికీ చివరంటా తన బాటను విడిచిపెట్టలేదు.అసలా పత్రిక సంచికల్ని బధ్రపరిచి డిజిటలైజ్ చేయాల్సి వుండింది. కాకుంటే మాతో కూడా పోరబాట్లు జరిగాయి. అల్లం నారాయణ కాలం , నా కాలం పుస్తకంగా తెద్దామనుకున్నాం కానీ ఎందుకో అది అప్పుడు కార్యరూపం ధరించలేదు. అప్పుడు చారి ని కొందరు అడిగే వారు ఆనంద్ అంటే ఎందుకు ప్రత్యేక అభిమానం అని..దానికి ఆయన నవ్వుతూ ఆనంద్ పనిచేసి వచ్చిన ఉస్మానియా రైటర్స్ సర్కిల్ లో నేనూ పని చేశాను.  అదీ ప్రత్యేక అభిమానం అనేవాడు. అట్లా జీవగడ్డ నా మొదటి ‘కాలం’ రచన మొదలయింది. జీవగడ్డ ఆఫీసుకు క్రమం తప్పకుండా వెళ్ళే వాళ్ళల్లో ఆత్మీయ మిత్రులు నారదాసు లక్ష్మణరావు, దామోదర్ రెడ్డి,పెండ్యాల సంతోష్,కుమార్ ముఖ్యులు.

జీవగడ్డలో రాసినప్పటికీ ఆ పత్రిక నిర్వహణలో నా ప్రమేయం అంతగా లేదు. కానీ 90ల్లో పొన్నం రవిచంద్ర సంపాదకుడిగా కరీంనగర్ నుంచి వెలువరించిన ‘మానేర్ టైమ్స్’ పత్రికలో నా ప్రమేయం కొంచెం ఎక్కువగానే వుంది. నేనప్పుడు వావిలాలపల్లి లో కిరాయి ఇంట్లో వుండేవాడిని. రవిచంద్ర పత్రిక గురించి అనుకుని తన హైదరబాద్ మిత్రులతో చర్చించి పత్రిక తీరు, దానిలో వేయాల్సిన కొన్ని కాలమ్స్ అనుకుని నా వద్దకు వచ్చాడు. అప్పటికి ఊర్వశి కళాస్రవంతి లాంటి సంస్థాలను నిర్వహించినవాడుగా నాకు మిత్రుడు. ఇద్దరం చర్చించుకుని సాహిత్య పేజీ వుండాలనీ కూడా అనుకున్నాం. నేను నా లోపలేక్కడో వున్న కాలం ఆలోచన గురించి చర్చించాము.’మానేరు తీరం’ పేర రాయాలని నిర్ణయించుకున్నాం. సాహిత్య పేజీకి దర్భశయనం శ్రీనివాసాచార్య,నందిని సిధారెడ్డి లాంటి అనేక మంది కవుల కవితలతో మానేర్ టైమ్స్ రూపుదిద్దుకుంది.రాష్ట్ర  స్థాయిలో ఆ పత్రికకు మంచి పేరు వచ్చింది. కాలం రాయడం తో పాటు రాజకీయ వేత్తలు సుద్దాల దేవయ్య, రాజేశాం గౌడ్ లాంటి రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు తీసుకోవడంలో కూడా నేను సహకరించినట్టు గుర్తు. అట్లా మానర్ టైమ్స్ లో రాసిన కాలం రచనలన్నింటి కలిపి “మానేరు తీరం” పేర 1998 లో పుస్తకం గా తెచ్చాను. ఆ పుస్తకం నా సాహిత్య జీవితంలో ప్రధాన మజిలీ. నాతో ఆ కాలం రాయించిన మనర్ టైమ్స్ పత్రికకు సంపాదకుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక సినిమా కాలమ్స్ విషయానికి వస్తే అలిశెట్టి ప్రభాకర్ నేను కలిసి ‘పల్లకి’ వార పత్రికకు వెళ్ళాం.  అప్పుడు సంపాదకుడు శ్రీ విక్రమ్ ప్రోత్సాహం తో ‘డైరెక్టర్స్ డైరీ’ కాలంగా రాశాను అందులో భారతీయ సమాంతర సినిమా వైతాళికుల గురించి వారం వారం రాశాను. అప్పటికి తెలుగులో సమాంతర సినిమా దర్శకుల పైన వచ్చిన మొట్టమొదటి వ్యాసాలవే. వాటన్నింటి కలిపి 1999 లో ‘నవ్య చిత్రా వైతాళికులు’ పేర పుస్తకం తెచ్చాను. దానికి ముందుమాట దర్శకులు శ్రీ బి.నరసింగ రావు రాశారు. ఆదొక మజిలీ. తర్వాత కాలం విషయానికి వస్తే ఆంధ్రభూమిలో వచ్చే వెన్నెల పేజీలో శ్రీ చల్లా శ్రీనివాస్ వున్నప్పుడు ‘సినీ సుమాలు’ పేర స్త్రీ పాత్రలు ముఖ్యాభినేతలుగా వున్న సినిమాల పైన రాశాను. వాటినీ ఆ తర్వాత అదే పేరుతో పుస్తకం తెచ్చాను. ఇవన్నీ ఇట్లా జరుగుతూ వుండగానే ఫిల్మ్ సొసైటీ ఉద్యమాన్ని నా ప్రధాన వ్యక్తీకరణ గా తీసుకుని అర్థవంతమయిన సినిమాల్ని అందరికీ చూపించాలనే లక్ష్యంతో కాలాన్నంతా వెచ్చించాను. అయితే సాహిత్యంతో నా అనుబంధం తెగిపోలేదు. సినిమా సాహిత్యాల రూపాలే వేరు తప్ప సృజనాత్మకంగా అవి రెండూ వేరు కాదని విశ్వసించిన వాణ్ని. అవి రెండూ పరస్పర ఆధారితాలూ ప్రభావితాలే తప్ప భిన్నమయినవి కాదు అన్నది నా నిశ్చితాభిప్రాయం. అయితే ప్రధాన స్రవంతి సినిమాల్లో వ్యాపారమే ప్రధానమయిపోయింది. సమాంతర అర్థవంతమయిన సినిమాల్లో కూడా డబ్బు ప్రమేయం వున్నప్పటికీ అవి వ్యక్తులూ, సమాజమూ, రెంటిలో వుండే సంఘర్షణ దాని ప్రతిఫలనాల్ని ప్రతిబింబించాయి.అయితే సినిమా సాహిత్యాల నడుమ వున్న ట్రాస్పరెంట్ విభజన తెరని అర్థం చేసుకోవాలి.

ఇదంతా ఇట్లా వుంటే 2005-06 ప్రాంతాల్లో అనుకుంటాను ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక కరీంనగర్ జిల్లా ఎడిషన్ లో ఒక సాహిత్య పేజీ నిర్వహించాలని తలపోశారు. ఎడిటర్ కె.శ్రీనివాస్, కరీంనగర్ బ్యూరో చీఫ్ శ్రీ నగునూరి శేఖర్ ఆ భాధ్యతని నాకు అప్పగించారు. ‘విద్యుల్లత’ పేర సాగిన ఆ పేజీ నిర్వహణ దాదాపు రెండేళ్లపాటు సాగింది. ఆ క్రమంలో మిత్రుడు శేఖర్ అందించిన ప్రోత్సాహాం అనితర సాధ్యమయింది. ఆ పేజీలో కవిత్వం, సాహిత్య వ్యాసాలతో పాటు నేనూ ఒక కాలం రాశాను. దాని పేరు ‘మానేరు గలగల’ దాంట్లో వున్నవన్నీ కరీంనగర్ జిల్లా సాహిత్యా కారుల ప్రొఫైల్ ఆర్టికల్స్. ఆవన్నీ మా కరీంనగర్ ప్రతిభామూర్తుల పైన రాసిన వ్యాసాలు. మానేరు గల గల వారి కళావిష్కరణ. వాటిల్లో పీవీ నుంచి అలిశెట్టి ప్రభాకర్ దాకా అన్నివాదాల రచయితల్ని గురించీ రాశాను. వాటన్నింటినీ కలిపి ఆదే “మానేరు గలగల” పేరుతో పుస్తకం తెచ్చాను. అట్లా మా మానేరు నది నా సాహిత్య జీవితంలో ప్రధాన ప్రేరణ అయింది.  మరో రకంగా చెప్పుకుంటే అంతర్భాగమయింది. చిన్నప్పుడు హోళీ అడిన తర్వాత పెయ్యికి బట్టలకు అంటుకున్న రంగులు కడుక్కోవడానికి కొన్ని సార్లు మానేరుకు వెళ్ళే వాళ్లం. ఆనాటి నుండి మానరు నాకు ప్రేరణ నా భూమిక.

దాని తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల పరిధిలో అంటే కరీంనగర్ ఆదిలాబాద్, వరంగల్,నిజామాబాద్ జిల్లాలకోసం జిల్లా ఎడిషన్ లో రెండు పేజీల స్ప్రెడ్ ఓవర్ నిర్వహించాలని సంపాదకుడు శ్రీ ఎం.వి.ఆర్..శాస్త్రి నిర్ణయించారు. హైదరాబాద్ లో జింబో సూచనల మేరకు నన్ను సంప్రదించారు. ఆయన ఒక రోజు ఆచార్య జయధీర్ తిరుమల రావు తో కలిసి కరీంనగర్ వచ్చారు. మా ఫిల్మ్ భవన్ లో అందుబాటులోవున్న కవులు రచయితలతో సమావేశం ఏర్పాటు చేసాము. ఆ సమావేశంలో మెరుపు వివరాల్ని ప్రకటించారు. సృజనకారులంతా సహకరించాలని సూచించారు. ఇంకేముంది మా ఎస్.ఆర్.ఆర్.కాలేజీ ఎదుటే వున్న ఆంధ్రభూమి ఆఫీసుకి వారం వారం పోవడం ‘మెరుపు’ పీజీకి అవసరమున్న కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు పలువురితో రాయించి ఇవ్వడం మొదలయింది. నాలుగు జిల్లాల్లో వున్న అనేకమంది కవులు రచయితలు ఎంతగానో సహకరించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భం. నేను వారం వారం ఒక రచయిత లేదా కవి తో ముఖాముఖీ నిర్వహించడం మొదలు పెట్టాను. అందులో జింబో. పెద్దింటి అశోక్ కుమార్, దర్భశయానం, నలిమెల భాస్కర్, వఝల శివకుమార్, చొప్పకట్ల చంద్రమౌళి, కోవెల సుప్రసన్న, అంపశయ్య నవీన్, కాత్యాయిని విద్మహే, బన్న ఆయిలయ్య, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి,లాంటి అనేక మందిని ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలతో పాటు  మరిన్ని పుస్తక సమీక్షల్ని కలిపి “మెరుపు” పుస్తకం తెచ్చాను. దాన్ని సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఆత్మీయుడు శ్రీ సి.పార్థసారధి ఆవిష్కరించారు.

నాకు పత్రికలతో వున్న అనుబంధం గురించి కనుక ఈనాడు, సుప్రభాతం, మాభూమి లాంటి వాటికి పని చేయడం ఒక వైపు, ఇంకోవైపు కాలమ్స్ రాయడం నా సృజనాత్మక జీవితం పత్రికలతో పెనవేసుకునే వుంది.

వాటికి సమాంతరంగా పలు సాహితీ సాంస్కృతిక సంస్థలతో కూడా పని చేశాను ఆ వివరాలు మళ్ళీ రాస్తాను..ఇప్పటికీ సెలవు.

-వారాల ఆనంద్               

24 అక్టోబర్ 2023

యాదోంకీ బారాత్=102

మళ్ళీ ఒక చెట్టు

Posted on

మళ్ళీ ఒక చెట్టు

+++++++

ఇప్పుడు పుడక వున్న చోటే

గతంలో ఓ చెట్టు ఉండేది

          దాని శిఖరం మీద

           పిడుగు పడిందేమో  

అక్కడో పక్షి గూడుండేది

ఇప్పుడక్కడ బూడిద మిగిలింది

          అడవిలో నాలుగు దిక్కులా

          వెళ్తురు నిండి వుండేది

అక్కడో కల వుండేది  

ఇప్పుడక్కడ శాంతి నెలకొంది

           ఇప్పుడెక్కడయితే శాంతి వుందో

           అక్కడో మొగ్గ తొడిగింది

                  మళ్ళీ ఒక చెట్టు

                  మళ్ళీ ఒక అడవి

                  మళ్ళీ ఒక కల

                  అదే పుడక లోంచి

********

హిందీ మూలం : కున్వర్ నారాయణ్

ఇంగ్లీష్ : అపూర్వ నారాయణ్

తెలుగు : వారాల ఆనంద్

మళ్ళీ ఒక చెట్టు

నిలకడలేని కాలం

Posted on

+++ వారాల ఆనంద్

నిలకడలేని కాలం

+++ వారాల ఆనంద్

తల పైకెత్తి విశాలమయిన ఆకాశాన్ని

ఆశగా అందుకోవాలనుకున్నాను

కానీ

నా చేతులు చాలా చిన్నవి

తల వంచి నేల వైపు చూసి

ఉత్సాహంగా భూప్రదక్షణ చేద్దామనుకున్నాను

కానీ

నా పాదాలు చాలా చిన్నవి

ప్రపంచ సాహిత్యాన్నంతా

ఆసక్తిగా చదివేద్దామనుకున్నాను

కానీ వయసుడిగిన చూపులు మందగించాయి

వెధవది మనిషిలాగే నిలకడలేని కాలం

ఎవరో తరుముతున్నట్టు

ఒకటే పరుగు

నిలకడలేని కాలం

+++ వారాల ఆనంద్

‘మనుషులు’ మిగిలిపోతారు

Posted on

++++++ వారాల ఆనంద్

‘మనుషులు’ మిగిలిపోతారు

++++++ వారాల ఆనంద్

కరచాలనం

చేసిన చేతుల్ని వదిలేసినంత మాత్రాన

కలిసిన

చూపుల్ని తిప్పేసినంత మాత్రాన

నవ్విన

మూతుల్ని ముడిచేసినంత మాత్రాన

బంధాలు తెగిపోతాయా

అనుబంధాలు చేదవుతాయా

శతృత్వాలు చిగురిస్తాయా

ముఖాల్ని తిప్పేసిన చెడు వాతావరణంలో కూడా

నాలుగు మంచి మాటలు పలకొచ్చు

వైరానికి అర్థాన్ని మార్చొచ్చు

ఒక్క క్షణం పాదాల్ని భూమ్మీద

నిలకడగా వుంచి

తల విదిల్చి తరచి చూస్తే

ముసుగులు తొలిగిపోతాయి

మనసులు విచ్చుకుంటాయి

‘మనుషులు’ మిగిలిపోతారు

********

‘మనుషులు’ మిగిలిపోతారు

++++++ వారాల ఆనంద్

మానకాలపు మహాకవి “జయంత్ మహాపాత్ర”

Posted on

****** వారాల ఆనంద్

మానకాలపు మహాకవి “జయంత్ మహాపాత్ర”

****** వారాల ఆనంద్

బెంగాల్ లో ఒక టాగోర్ లా, కర్ణాటకలో ఒక ఏ.కే.రానుజన్ లా, మలయాళంలో ఫణిక్కర్ లా తనదయిన ఒక ప్రత్యేకమయిన స్వరంతో ప్రకృతితో మమేకమయి గొప్ప కవిత్వం రాసిన మానకాలపు మహాకవి జయంత్ మహాపాత్ర. తనని పాబ్లో నెరూడాతో ఒకసారి ఎవరో పోలిస్తే నవ్వేసి నెరూడాలాగా ఒక కవిత రాస్తే చాలు’ అన్నాడు. ఆయన అంత నిగర్వి సాధారణ మయినవాడాయన. మీరు ఇంత పెద్ద కవి కదా ఈ మామూలు పట్టణం కటక్ లో ఎందుకు నివసిస్తారని ఆయన్ని అడిగితే ‘ ఈ ఇంట్లో ఏది ఎక్కడ వుందో నాకు తెలుసు. నా ఇంటి చుట్టూ వున్న చెట్టూ చేమా రోజూ నాతో మాట్లాడతాయి. వీధి తలుపు తీసుకుని బయటకు వెళ్తే ఎంతో మంది చేతులూపి పలకరిస్తారు.. ఇంతకంటే నాకేం కావాలి’ అన్నాడాయన. అదీ జయంత్ మహాపాత్ర.

2 అక్టోబర్ 1928 కటక్ లో జన్మించిన జయంత్ మహాపాత్ర కింది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. తన ప్రాథమిక విద్య కటక్ లోని స్టీవర్ట్ స్కూలు లో జరిగింది. చిన్నప్పటినుండీ ఆంగ్ల మాధ్యంలో చదువుకున్న ఆయన సైన్స్ బాగా ఉత్సాహంగా ఆసక్తిగా చదువుకున్నాడు. భౌతిక శాస్త్రం లో పీజీ ప్రథమ శ్రేణిలో పాసయి, శాస్త్రవేత్తగా శిక్షణ పొందాడు. కాలేజీ టీచర్ గా తన వృత్తి జీవితం ప్రారంభించాడు. ఒదిశా లోని పలు కాలేజీల్లో ముప్పయి ఆరేళ్ళ పాటు భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పని చేసాడు. గంగాధర్ మెహర్ కాలేజ్ సంబల్ పూర్, బి.జే.బి కాలేజి, భువనేశ్వర్,ఫకీర్ మోహన్ కాలేజి బాలాసోర్, రావెన్ షా కాలేజ్,కటక్ లాంటి అనేక కాలేజీల్లో పని చేసాడు. చిన్నప్పటినుండీ ఎప్పుడూ కవిత్వం రాయాలని, కవి ని కావాలని ఆయన అనుకోలేదు. చాలా మంది కవుల కంటే భిన్నంగా జయంత్ మహాపాత్ర తన 38 వ ఏట కవిత్వం రాయం మొదలు పెట్టాడు. ఆయన ఇంగ్లీష్, ఒడియా రెండు భాషల్లో విరివిగా రాసాడు. భారతీయ ఆంగ్ల కవిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించాడు.

ఆయన మొట్టమొదటి పుస్తకం “CLOSE THE SKY , TEN BY TEN” 1970 లో అచ్చు అయింది. అప్పటిదాకా భౌతిక శాస్త్రం భోదిస్తూ ఉన్నప్పటికీ, ఆయనకు నవలలు కథలు బాగా ఇష్టంగా ఉండేవి. అందులోనూ ఇంగ్లీష్ వచనం బాగా చదివాడు. కానీ ఎప్పుడూ కవి అవుతానని అనుకోలేదు. కాని కవిత్వం లోకి గుడ్డిగా వచ్చేసాడు.. ఎటు పోతున్నాడో తెలీని స్థితి.. కవిత్వ తొలి రోజుల్లో ఆయన కవిత్వం నిండా స్వీయ స్పృహ అధికంగా కనిపిస్తుంది. అయితే ‘కవిగా మొదటి రోజుల్లో పడిపోయాను, లేచాను, ఎదిగాను’ అంటాడు మహాపాత్ర. బహుశా అప్పటిదాకా ఆయనలోనో నిబిడీకృత మయివున్న కవితాంశ, భావావేశం, సృజనాత్కత పెల్లుబికి కవిత్వంగా రూపుదిద్దుకుందేమో అనిపిస్తుంది. ఆయన రాయకుండా, తన భావాల్ని చెప్పకుండా ఉండలేని స్థితికి గురయి విస్తృతంగా రాసాడు. రెండు భాషల్లో రెండు చేతులతో రాసాడనే చెప్పాలి. ఆయన విస్తృతంగా చదివాడు. అట్లా చదవడం వల్లనే తనకు భాష వొంటబట్టింది. ఆ భాషను కవిత్వం లో వాడాడు. చిన్నప్పటి నుండీ మిషనరీ స్కూల్స్ లో చదవడం వాళ్ళ ఆయనకు ఇంగ్లీష్ స్వభావ సిద్దంగానే వచ్చింది. ఒడియానే తనకు సెకండ్ లాంగ్వేజ్ గా నిలిచింది. అయినా ఆయన చుట్టూ వున్నది ఒడియా భాష అక్కడి ప్రజలు. వారితో మమేకం అయివుండడంతో ఆయన రచనల్లో ఆ జీవితం ఆ భాష ప్రభావం అమితంగా వుంది. తాను నివసించిన ఒడిశా ప్రాంత చరిత్ర సంస్కృతి ఆయన్ని తీవ్రంగా ప్రభావితం చేసాయి. మహాపాత్ర ఇంగ్లీషు కవిత్వంలో ధ్వనించే లయ మిగతా బయటి దేశాల ఇంగ్లీష్ భాషా కవులకంటే భిన్నంగా వుంటుంది. దానికి ప్రదానంగా ఆయన పైన వున్న ఒడిశా లోని మౌఖిక సాహిత్యం, జానపద గీతాలు అనే చెప్పాలి.

జయంత్ మహాపాత్ర కవితా సంకలనం ‘ఏ రెయిన్ ఆఫ్ లైఫ్’ కవితలన్నీ బ్రిటన్ లోని క్రిటికల్ క్వార్టర్లీ, టి.ఎల్.ఎస్.లాంటి వాటిల్లోనూ, చికాగో రివ్యు లాంటి పత్రికల్లోనూ అచ్చయ్యాయి. అంతేకాదు అమెరికా, ఆస్ట్రేలియాలలోని సాహిత్య పత్రికల్లో కూడా వచ్చాయి. దాంతో ఆ పుస్తకానికి జాకోబ్ గ్లాట్ స్టైన్ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.

జయంత్ మహాపాత్ర 30 కి పైగా కవితా సంకలనాలు వెలువరించారు. అందులో అధికంగా ఇంగ్లీష్ లోనూ మిగతావి ఒరియాలోనూ రాసారు.

జయంత్ మహాపాత్ర ప్రధానంగా కవిత్వం రాసినప్పటికీ వచనం కూడా రాసారు. దొర్ ఆఫ్ పేపర్స్ కథా సంకలనం, అనేక వ్యాసాలూ, తన జ్ఞాపకాలూ రాసారు.అంతేకాదు జయంత్ మహాపాత్ర అనేక ఒడియా కవితల్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అనువాదకుడిగా కూడా ఆయనకు గొప్ప గౌరవముంది.

ఆయన కవితా సంకలనం ‘రిలేషన్ షిప్స్’ కి 1981 లో సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. దాంతో ఆయన మొట్టమొదటి భారతీయ ఆంగ్ల కవిగా ఆ అవార్డును అందుకున్నాడు. చికాగో పోయెట్రీ మాగజైన్ నుండి జాకోబ్ గ్లాట్ స్టయిన్ పురస్కారం, అల్లెన్ టా టే అవార్డును ద సేవానీ రివ్యు నుండి, సార్క్ లిటరరీ అవార్డు, టాటా లిటరేచర్ జీవన సాఫల్య పురస్కారంఅందుకున్నారు. ఇంకా 2009 లో పద్మశ్రీ పురస్కారం, ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, సాహిత్య అకాడెమీ ఫెల్లో షిప్ కూడా అందుకున్నారు. ఫెల్లోషిప్ ను అందుకున్న మొట్ట మొదటి భారతీయ ఆంగ్ల కవి కూడా జయంత్ మహాపాత్ర నే. అంతే కాదు అనేక జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కవిత్వ పఠనాల్లో పాల్గొన్నారు.

‘కవి తనకు తాను వేసుకునే అనేక ప్రశ్నలకు, తాను రాసే కవిత్వం సమాధానాలు చెబుతుంది’ అంటాడు జయంత్ మహాపాత్ర.

అందుకే ఆయన కవిత్వం ఆయనకు తన అంతర్ బహిర్ సంఘర్షణలకు వేదికగా నిల్చింది. ఆయన రాసిన కవిత్వం ఆయనకే కాదు చదువరులు తాము ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు కూడా వెతికితే సమాధానాలు లభిస్తాయి.

ఆయన్ని చదివిన తర్వాత నా అనుభవం చెబుతున్న సత్యమిది.

ఎవరికయినా చదవడం రాయడం ఒక మంత్రం లా పని చేస్తుంది. అది ఆ పాఠకుడిలో వున్న అనేకానేక బాధలకు, సంక్షోభాలకు తెరిపినిస్తుంది. అందులో ముఖ్యంగా రాయడం వలన కవిలో పెల్లుబికిన ఉద్వేగం కాగితం మీదికి ఒలికి అతను అతని మనసు నిమ్మలమవుతుంది. జయంత్ మహాపాత్ర కవిత్వం కూడా అంతే ఆయన కూడా అంతే.. రాస్తూ తాను ఎంతో ఉపశమనం పొందుతానని అంటాడు.

‘కవి తాను స్వేచ్చగా రాయాలి, తన ఆవగాహనకు స్థాయికి అనుగుణంగా రాయాలి. ప్రేమ కవి, కమర్షియల్ కవి అంటూ కాకుండా కవి అనేవాడు తప్పకుండా తనను తాను ఆవిష్కరించుకోవాలి.. ఎలాంటి భేషజాలు, లేకుండా తాను భావించిన విషయాలు, తాను అనుకున్న సత్యాలు తాను చూసిన లేదా అనుభవించిన వాటిని తన కవిత్వంలో నిజయితీగా ప్రతిఫలింప జేయాలి’ అంటాడు జయంత్.

‘కవి అనేవాడు తన కవిత్వం తో నీతివంతమయిన ప్రవర్తనకు సంరక్షకుడిగా వుండాలి. కవిత్వం అలాంటి స్థితి సృష్టించ లేనప్పుడు ప్రపంచ మనుగడే ప్రశ్నార్థక మవుతుంది’ అంటాడు జయంత్ మహాపాత్ర.

కవి ఒంటరిగా ఒంటరితనంలో కూర్చుని రాయలేడు, అట్లా చేస్తే స్తబ్దత, ఎడారితనం కవిని చుట్టుముడుతాయి.అందుకే తన చుట్టూ జరుగుతున్న విషయాల్ని పతిన్చుకోకుండా ఉండలేడు. కవి తన వేదనని భావోద్వేగాన్ని గూర్చే రాస్తాడు. కవిత్వం కవి అంతర్ బహిర్ సంభాషణ నుంచే పుడుతుంది అంటాడు. అంతేకాదు కవిత్వం వర్తమాన కాలపు సంక్షోభాన్నీ, దుఖాన్ని ప్రతిబించాలంటాడు.

“నేను ఒడిశా లో పుట్టాను, ఇక్కడే బతికాను బతుకుతున్నాను, ఇక్కడి చరిత్ర నాది, కోణార్క్ నాది, కోణార్క్ వైశాల్యం నాది, వైభవం నాది, దాని ఒంటరితనం నాది.. అంతే కాదు ఇక్కడి ఆకలి.. ఇక్కడి కరువు కాటకాలు నావి.. ఎవరయినా వాటిని దాటి నా నుంచి మరే రచనల్ని ఆశిస్తారు.. నేను అదే రాసాను.. రాస్తున్నాను..చెట్టు మీద మామిడి ఎట్లా పండి పోతుందో నేనూ అట్లే మరణం వైపు పరి పక్వం చెందుతున్నాను” అన్నాడు జయంత్ మహాపాత్ర.

ఆయన కవిత్వంలో కాలం ముఖ్య భూమికను పోషిస్తుంది. ఆయన కాలంతో పాటు సమాంతరంగా సాగాడు. కాలం ఆయన కవిత్వం లో ముందుకు వెనక్కు కదుల్తూ వుంటుంది.

ఆయన కవిత్వం నిండా నాస్టాల్జియా కనిపిస్తుంది.

‘రాస్తున్నప్పుడు నిన్ను నువ్వు కోల్పోతావు … ఒక్కోసారి కవిత్వం గతాన్ని స్తుతిస్తుంది’ అని కూడా ఆయనంటాడు.

ఇట్లా భౌతిక శాస్త్రం చదువుకుని బోధించి కవితా ప్రపంచంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ స్పష్టమయిన అభిప్రాయాలతో అందమయిన స్థానీయమయిన ప్రతీకలతో గొప్ప కవిత్వాన్ని రాసి ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన జయంత్ మహాపాత్ర ఈ కాలపు మహా కవిగా మన్ననల్ని అందుకున్నాడు. ఒక కవి అలుపెరుగ కుండా సీరియస్ గా కవిత్వం రాస్తూ వుంటే అవార్డులు రివార్డులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి అదే క్రమంలో జయంత్ మహాపాత్రకు అనేక అవార్డులు మన్ననలు వచ్చాయి.

జయంత్ మహాపాత్ర కటక్ కీ, మహానదీ తీరానికీ, ఒడియా నేలకీ జీవితమంతా అంటిపెట్టుకుపోయాడు. ఆ విషయంలో రామానుజన్ కన్నా, పార్థసారథికన్నా దిలీప్ చిత్రేకన్నా తనెంతో అదృష్టవంతుణ్ణని చెప్పుకుంటాడు. ఇప్పుడు తన ఆత్మకథ మాత్రం ఒడియాలో రాస్తున్నాడు. కవిత్వం జీవన సారాంశాన్ని చెప్పాలి. కవి అనేవాడు తన కవిత్వం లో తన శక్తిమేరకు జీవన గమనాన్ని నిజాయితీగానూ కళాత్మకంగానూ చెప్పగలగాలి. మొత్తంగా జయంత్ మహాపాత్ర కవిత్వం గాఢమైన జీవితానుభవంలాగా చాలా సాంద్రంగా సాగుతుంది.

ఆయనలేని లోటు భారతీయ ఆంగ్ల కవిత్వానికే కాదు మొత్తంగా కవిత్వ ప్రపంచానికే పూడ్చలేని లోటు.

======= 9440501281

మానకాలపు మహాకవి “జయంత్ మహాపాత్ర”

****** వారాల ఆనంద్

నువ్వే….+++++ వారాల ఆనంద్

Posted on

నువ్వే….
++++++++++++++ వారాల ఆనంద్

కారణమేదయినప్పటికీ
కారణమేదీ లేకున్నప్పటికీ
ఆ క్షణానికి
ఆ క్షణమే కాదు ప్రతి క్షణానికీ
నువ్వు నా వెంట ఉండాలనుకుంటాను
నీడలా నా పక్కనే నిలబడాలనుకుంటాను

నేను నిలబడ్డప్పుడూ
నేల జారినప్పుడూ
పరుగెత్తినప్పుడూ
పోట్రాయి తగిలి బొక్క బోర్లా పడిపోయినప్పుడూ

గెలిచి కాలరెగరేసినప్పుడూ
ఓడి ముఖం వేలాడేసినప్పుడూ

సుఖంలో మురిసినప్పుడూ
దుఃఖం లో నలిగినప్పుడూ

ఎప్పుడయినా ఏ క్షణమయినా
నువ్వు నా వెంటే వుండాలనుకుంటాను

తొలకరి చినుక్కి మురిసి పువ్వు వికసించినప్పుడూ
శరత్తులో ఎండిన ఆకు గలగలమని సవ్వడి చేసినప్పుడూ
నువ్వు నాపక్కనే వుండాలనుకుంటాను

అయినా నా అమాయకత్వం కానీ
నిద్దట్లోనూ మెలకువలోనూ
నాతో సదా వున్నది

నువ్వో నీ జ్ఞాపకామో కదా

*********************** 2 sept 2023

నువ్వే....
+++++++వారాల ఆనంద్

‘స్మశానాలు’

Posted on Updated on

++++ వారాల ఆనంద్

Friends, pl read my poem published in KOUMUDI online magazine, Thank you Editor Sri Kiran Peabha garu – Varala Anand

‘స్మశానాలు’

++++ వారాల ఆనంద్

గుట్టలు తమలో తాము

గుస గుస లాడుకుంటున్నాయి

మనల్ని మందు పాతరల్తో పేల్చి

రంపాలతో కోసి చదునుచేసి

ఈ మనుషులు భవంతులు కడుతున్నారు

మెరుపులు దిద్దుకుంటున్నారు

పాపం ఆ తవ్వేసిన రాళ్ళకింద

ఏర్పడ్డ గోతుల్లో

తమ ‘స్మశానాల్ని’ తామే

సిధ్ధం చేసుకుంటున్నామని

తెలుసుకోలేక పోతున్నారు

గుట్టలు తమలో తాము

గుస గుస లాడుకుంటున్నాయి

************************ 9440501281
https://www.koumudi.net/Monthly/2023/september/index.html