Month: April 2017

ఇల్లు (POEM)

Posted on Updated on

house

ఇల్లు

తరాలుగా

ప్రేమల్లో తడిసి

మంచంలో నులకలా

అల్లుకు పోయిన ఆప్యాయతలన్నీ ఆవిరై

పతంగులన్నీ ఎగిరిపోతే

 ఉన్న ఫలంగా ఖాళీ అయిన

ఆ ఇల్లు బోసిపోతుంది

గోడలు దిగాలు పడతాయి

కిటికీలు కన్నీరు కారుస్తాయి

 

అక్కడ మనుషులు నడిచిన

నేలంతా తడి తడిగా అవుతుంది

అందులో వాళ్ళ పాదముద్రలు

ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి

 

ఇల్లు కేవలం గూడు కాదు

అనుబంధాల అల్లిక

అనుభవాల కలబోత

 

పండుగలూ పబ్బాలూ

కేరింతలూ కోపతాపాలూ

కలిసి వుండడమే

ఇంటికి పునాది

 

ఇల్లెప్పుడూ ఇరుకు కాదు

మహా వృక్షం లా నీడ నిస్తుంది

కంటి నిండా నిద్రనిస్తుంది

ఓ చిరునామా నిస్తుంది

 

ఇంటి చుట్టూ

సమిష్టి  భావనతో

గాలి సయ్యాట లాడుతుంది

 

 

ఇంటి ముందటి వేపచెట్టు

వెనకాల బాదం చెట్టు

నీడనే కాదు

నిమ్మళాన్ని ఇస్తాయి

 

కదిలి పోయిన కాళ్ళకి

ఒత్తిగిలిన మనసుకీ

తనను తాను తెలుసుకోవడానికి

తమలోకి తాము చూసు కోవడానికి

 

ఇల్లే  నెలవు

అది మట్టిదయినా

గూన పెంకుల దయినా  

-వారాల ఆనంద్

9440501281

 

Advertisements

TELANGANA TODAY DAILY

Image Posted on

telangana today

COPY RIGHT FOR ARTISTS కళాకారులకూ కాపీ రైట్

Posted on

7f5d4bba-be3a-4594-b85d-5f4957a0368f

కళాకారులకూ కాపీరైట్

=====================================================================

భారతీయ పర్ఫార్మింగ్ రైట్స్ ఆర్గనైజేషన్ నిధుల విషయంలోను, నియంత్రణ విషయంలోనూ అనేక అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలతో అటు అంతర్జాతీయ కాన్ఫెడరేషన్, ఇటు కేంద్రం తప్పుబట్టాయి. 2015లో దాని లైసెన్స్ రద్దుచేశాయి. ఈ పరిస్థితిలో కేవలం ఇళయరాజానే కాదు మరే ఇతర సంగీత సృజనకారుడు తక్షణం ఏమీ చేయలేని స్థితి.

=====================================================================
సంగీత దర్శకుడు ఇళయరాజా, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య చెలరేగిన కాపీ రైట్ వివాదం ఆ ఇద్దరికి మాత్రమే సంబంధించింది కాదు. దాదాపుగా అందరూ సంగీత దర్శకులు, మ్యూజిక్ కంపెనీలకూ, గాయకులకూ సంబంధించింది. సమస్త సృజనకారులకూ చెందినదీ. సగీత దర్శకుడు ఇళయ రాజా తాను సంగీత దర్శకత్వం వహించిన పాటలను టికెట్ పెట్టి నిర్వహించే కార్యక్రమాల్లో తన అనుమతి లేకుండా పాడటానికి వీల్లేదని, పాడితే కాపీ రైట్ చట్టం కింద తనకు పారితోషికం చెల్లించాలని, అట్లాకాకుండా తన పాటలను ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలుంటాయని బాల సుబ్రమణ్యంతో పాటు చిత్రా తదితరులకు లీగల్ నోటీసులు ఇచ్చారు. దానికి ప్రతిస్పందిస్తూ అలాంటి చట్టం ఉందని తనకు తెలీదని ఇకముం దు రాజా పాటలు పాడబోమని బాలు బహిరంగంగా అన్నారు.
సినిమా నిర్మాణంలో 24 లేదా అంతకుమించిన కళాకారులు ఇమిడి ఉంటారు. సినిమాకు దర్శకుడు అతని సృజనాత్మకతే ప్రధానమైనప్పటి కీ, కథ, ఎడిటింగ్ తదితర రంగాలకు కూడా సృజన హక్కులున్నాయి. అట్లే సినిమా పాటకు సృజనకర్త సంగీత దర్శకుడే.

అతని సృజన మేరకే గాయకులు పాడుతారు. సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న కళాకారులందరికి ఒప్పందం మేరకు నిర్మాత డబ్బులు చెల్లించి సినిమాను నిర్మిస్తాడు. కాబట్టి ఆ సినిమాకు చెందిన సర్వహక్కులూ నిర్మాతకు చెందుతాయనడంలో వివాదం లేదు. కానీ సినిమా కోసం మాత్రమే ఆ హక్కులు నిర్మాతకు వర్తిస్తాయి. ఆ సినిమాను ఎన్నిసార్లు విడుదల చేసుకున్నా హక్కులు నిర్మాతవే. సినిమా కోసం వాడుకున్న సృజనను సినిమా బయ ట ఇతరత్రా వినియోగించుకున్నప్పుడు ఈ కాపీరైట్ హక్కు చర్చకు వస్తుంది. నిజానికి చానళ్లలోనూ, బయట సభా వేదికలనూ వినియోగించుకున్నప్పుడు, ప్రత్యేకించి వ్యాపారాత్మకంగా వాడుకున్నప్పుడు ఆయా సుజనకారుల హక్కుని కాపాడాల్సిందే. అతనికి సముచిత పారితోషికం అందించాల్సిందే.

సినిమా విషయంలో హక్కులపరంగా రచయితలు, సంగీత దర్శకులు అమితంగా నష్టపోతున్నారు. మ్యూజిక్ కంపనీలూ, దేశవిదేశీ చానళ్లు సైతం వీరిని మోసం చేస్తున్నాయి. వీళ్ల రచనలను, సంగీత సృజనాల్నీ ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తున్నప్పుడు వారికి న్యాయంగా చట్ట బద్ధంగా రావాల్సిన వాటా రావాల్సిందే. బాలసుబ్రమణ్యం ప్రపంచ వ్యా ప్తంగా టికెట్లు పెట్టి ప్రదర్శనలిస్తూ డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇళయరా జా తన హక్కుమేరకు పారితోషికం అడుగడం చట్టబద్ధం.

ఈ కాపీ రైట్ చట్టం 1957లో వచ్చింది. ఆ చట్టంలోని లోటుపాట్లు అమలులో లొసుగులను గమనించిన కేంద్ర ప్రభుత్వం 1992 జూలైలో సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. 1992 మే 10వ తేదీ నుంచి సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రచనాత్మక, కళాత్మక సృజనకు సంబంధించి ఆ సృజనకారులకు హక్కులుంటాయి. వాటిని కాపీ రైట్ చట్టం పరిరక్షిస్తుంది. ఇక 1991 అంతర్జాతీయ కాపీ రైట్ ఉత్తర్వుల ప్రకారం మన దేశంలోని విదేశీయులకు, విదేశాల్లో ఉన్న మన వారికీ కాపీ రైట్ చట్టాన్ని వర్తింపజేశారు. బెర్న్ యూనివర్సల్ కాపీ రైట్ కాన్ఫరెన్స్ (1886)లో సభ్యత్వం ఉన్న దేశంగా మన దేశం ఈ చట్టానికి ప్రాధాన్యం ఇస్తుంది. కానీ చాలా చట్టాల వలె దీన్ని కూడా అటకెక్కించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సినిమా పాటల రచయితలకు, సంగీతకారులకూ మ్యూజిక్ సంస్థలు ఇతర వ్యాపార సంస్థలు, దేశవిదేశీ టీవీ చానెళ్లు ఎలాంటి పారితోషికాలు ఇవ్వకుండా వారి సృజనను సొమ్ముచేసుకోవడం మొదలుపె ట్టాయి. ఎంతోమంది సుప్రసిద్ధ సంగీత దర్శకులు, రచయితలు ఆర్థికంగా చితికిపోయి అనామకంగా జీవిస్తుంటే కంపెనీలు విపరీతంగా లాభపడ్డా యి.

ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ కవి, సినీ రచయిత పార్లమెంట్ సభ్యుడు జావేద్ అఖ్తర్, నటి జయాబచ్చన్‌లు ముందు పడి కాపీ రైట్ చట్ట సవర ణ కోసం విపరీతంగా కృషిచేశారు. ఫలితంగా 2012లో చట్టం మరోసారి సవరణ పొందింది. దాని ప్రకారం సృజనకారులు వారి హక్కులకు చెంది న చాలా విషయాలపై నిర్దిష్టమైన నిర్వచనాలు చేసింది. సినిమాకు సంబంధించి కాకుండా ఇతరత్రా పాటల్ని ఉపయోగిస్తే పాట రచయితకూ, సంగీత దర్శకుడికీ కలిపి 25 శాతం పారితోషికం చెల్లించే ఏర్పాటు చేసింది. ఆ చట్టసవర ణ మేరకే ఇళయరాజా బాలు కు నోటీసులు ఇచ్చారనుకోవచ్చు.

కాపీ రైట్ చట్టానికి ఎన్ని సవరణలు తెచ్చినా అమలుచే సే యంత్రాంగం ఉండాలి. కానీ అది సరిగా లేదు. ప్రతీ దేశంలో పర్ఫార్మింగ్ రైట్స్ ఆర్గనైజేషన్లు ఉంటాయి అవి దాదాపుగా 19వ శతాబ్దంలో ఏర్పాటయ్యాయి. అన్నీ రేడియోలకు, టీవీలకు, స్టేజి ప్రదర్శనలకు పాట ల రచయితలు, సంగీత దర్శకులు ప్రతిసారీ అనుమతివ్వడం, అగ్రిమెంట్ చేసుకోవడం లాంటిది కష్టసాధ్యమైంది కాబట్టి ఈ పర్ఫార్మింగ్ రైట్స్ ఆర్గనైజేషన్లు ఏర్పాటయ్యాయి. పాటల రచయితలు, సంగీత దర్శకులు తమ అన్ని పాటలను ఆయా దేశాల్లోని పర్ఫార్మింగ్ రైట్స్ ఆర్గనైజేషన్లల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక దేశంలోని హక్కుదారులు అన్నిదేశాల్లో రిజిష్టర్ చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అన్ని పర్ఫార్మింగ్ రైట్స్ ఆర్గనైజేషన్లకు అంతర్జాతీయస్థాయిలో కాన్ఫెడరేషన్ ఏర్పాటైంది. అంటే ప్రపంచవ్యాప్తంగా పాటలు సంగీతానికి చెందిన రాయల్టీలను ఈ కాన్ఫెడరేషన్ నియంత్రిస్తుంది.

కానీ భారతీయ పర్ఫార్మింగ్ రైట్స్ ఆర్గనైజేషన్ నిధుల విషయంలో ను నియంత్రణ విషయంలోనూ అనేక అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలతో అటు అంతర్జాతీయ కాన్ఫెడరేషన్, ఇటు కేంద్రం తప్పుబట్టాయి. 2015లో దాని లైసెన్స్ రద్దు చేశాయి. ఈ పరిస్థితిలో కేవలం ఇళయరాజానే కాదు మరే ఇతర సంగీత సృజనకారుడు తక్షణం ఏమీ చేయలేని స్థితి. అంటే ఇప్పుడు సమస్య మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వద్దకే చేరింది. ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ ఆర్గనైజేషన్‌ను ప్రక్షాళన చేసి సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉన్నది.

NAMASTHE TELANGANA PUBLISHED: SAT,APRIL 1, 2017 01:03 AM

 

FILM TOURISM IN TELANGANA

Posted on Updated on

 

film tourism

తెలంగాణలో ‘ ఫిల్మ్ టూరిజం’

-వారాల ఆనంద్

    సినిమా,  టూరిజం లు ఇవ్వాళ ఆసక్తికరమయిన అంశాలు. ఇటు  ప్రజలకు  అటు ప్రభుత్వాలకూ కూడా. అవి రెండూ ప్రజలకు వినోదాన్ని ఇస్తే ప్రభుత్వాలకు ఆదాయాన్నిస్తున్నాయి. అందుకే ప్రపంచమంతా ఈరోజు ఈ రెండింటి పట్లా ఆసక్తి ని చూపుతున్నాయి. సినిమా టూరిజం రెంటినీ కలిపి సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లగలిగితే ఫిల్మ్ టూరిజం అన్న కొత్త దారి ఏర్పడి ఆయా ప్రాంతాలకు ప్రాముఖ్యాన్ని మంచి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం వుంది. ఫిల్మ్ టూరిజం కల్చరల్  టూరిజం లో ఒక భాగమే.సినిమాల్లో చూపించే వివిధ లొకేషన్ల పట్ల ప్రజలకు ఆసక్తి కలిగించడం ఆయా ప్రాంతాల్ని దర్శించాలనే కోరిక కలిగించడం వల్ల టూరిజం కూడా విస్తరిస్తుంది. ఈ ఫిల్మ్ టూరిజం ని ప్రధానంగా ఫిల్మ్ ప్రమోషన్ టూరిజం, ట్రావెల్ ఫిల్మ్ టూరిజం, సినిమా ప్రేరిత టూరిజం అన్న మూడు భాగాలుగా చూడొచ్చును.

   అయితే నూతనంగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం లో సినిమా టూరిజం లు రెండూ బాల్య దశలోనే వున్నాయి. దశాబ్దాల వలస పాలనలో సినిమా వాళ్ళు తెలంగాణా ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగానే పర్యాటక రంగం లో కూడా తమ వంతు సవతి తల్లి ప్రేమను ఆచరిస్తూనే వచ్చారు.

   అదట్లా వుంచితే నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అనేక మయిన అంశాల్లో నూతన వొరవడిని ప్రారంభించు కుంటున్నట్టుగానే  ఫిల్మ్ టూరిజం లో కూడా విలక్షణతను వినూత్నతను ప్రారంభించాల్సిన అవసరం వుంది. స్లమ్ డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాల తర్వాత ప్రపంచం లోని వివిద దేశాల సినిమా రంగాలు తమ చిత్రా నిర్మాణాలకోసం  భారత దేశం వైపు చూస్తున్న పరిస్థితి వుంది. అదే రకంగా తెలంగాణ కూడా సినిమాని టూరిజాన్ని జత పరిచి ప్రోత్సహించ గలిగితే రాష్ట్రానికి పేరు ఆదాయమూ పెరిగే అవకాశం ఎంతయినా వుంది. ఇటీవలికాలంలో రుద్రమదేవి సినిమా తర్వాత వరంగల్ గురించి , గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత కోటిలింగాల గురించి వివిధ ప్రాంతాల వాళ్ళు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రత్యేకంగా ఆ ప్రాంతాల గురించి దేశం లోని వివిధ ప్రాంతాల మిత్రులు వివ్రాల కోసం అడగడం ఆసక్తి కలిగించింది. కోటిలింగాల రెండువేళ్ళ ఏళ్లనాటి శతవాహనుల మొట్ట మొదటి రాజధానిగానూ, వరంగల్ కాకతీయ సామ్రాజ్య కేంద్రంగానూ ఇప్పటికే వినుతికెక్కినప్పటికీ సినిమాల ( అవి ఎంత అసహజంగా వున్నప్పటికీ) వల్ల పలువురి దృష్టిని ఆకర్షించడం గమనించాల్సిన అంశమే.

  ఈ క్రమంలో ఫిల్మ్ టూరిజం రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పలు కార్యక్రమాల్ని చేపడుతున్నది. మొట్టమొదటగా కేంద్ర పర్యాటక శాఖ ఫిల్మ్ టూరిజం ను ప్రోత్సహించేందుకు గాను రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించే ‘ మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్’ పథకానికి మౌలిక సూత్రాల్ని ప్రతిపాదించింది. వివిధ ప్రాంతాల నుంచి సినిమా షూటింగుల కోసం వచ్చే వారికి సహాయ కారిగా వుండేందుకు రాష్ట్రాలు నోడల్ అధికారుల్ని నియమించాల్సిందిగా కేంద్రం కోరింది. 2012 లోనే   కేంద్ర పర్యాటక శాఖ సమాచార ప్రసార శాఖ లు రెండూ ఇంక్రెడిబుల్ ఇండియా కింద ఒక అవగాహన కుదుర్చుకున్నాయి. దాని కింద జాతీయ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించుకునేందుకు ముందుకు వచ్చాయి. అంతే కాదు ఇటీవలే సమాచార ప్రసార శాఖ ఫిల్మ్ షూటింగులకు సులభతర అనుమతులు ఇచ్చేందుకు  ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ ను ప్రారంభించింది. వివిధ అనుమతులు, టాక్స్ వెసులుబాట్లు తదితరమయిన విషయాల గురించి వివరించేదుకు ఇండియా ఫిల్మ్ కమీషన్ పేర ఒక వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం సినిమా రంగాన్ని, ఫిల్మ్ టూరిజం ను ప్రోత్సహించే పని మొదలు పెట్టింది.

   దేశ వ్యాప్త గణాంకాలు చూస్తే దేశం లో 1200 వందలకు పైగా సినిమాల నిర్మాణమవుతున్నాయి. 600కు పైగా టీవి చానల్స్ వున్నాయి. 100 మిలియన్లకు పైగా పే ఛానళ్ళు చూసే కుటుంబాలున్నాయి. దేశ వ్యాప్తంగా సంవత్సరానికి మూడు బిలియన్ల సినిమా టికెట్లు అమ్ముడవుతున్నాయి. అదే క్రమంలో సర్వే చేస్తే తెలంగాణలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమా/ టీవి ప్రేక్షకులున్నారని తేలుతుంది. తెలుగుతో సహా హింది,ఇంగ్లిష్ తదితర భాషా సినిమాలు కూడా తెలంగాణాలో ప్రేక్షకాదరణ

పొందుతూనే వున్నాయి. సినిమా షూటింగుల విషయానికి వస్తే రామోజీ, సారధి, అన్నపూర్ణ, రామానాయిడు లాంటి ఫిల్మ్ స్టూడియోలు అందుబాటులో వున్నాయి. అట్లే తెలంగాణ లో లెక్కలేనన్ని చారిత్రక కేంద్రాలూ, దర్శనీయ స్థలాలూ వున్నాయి. అంటే తెలంగాణాలో వివిధ భాషా సినిమాల షూటింగులకు అనుకూలమయిన వసతులున్నాయి,  మరింత అనుకూలమయిన వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగితే రాష్ట్రం లో ఫిల్మ్ టూరిజం ఎంతో అభివృద్ది చెందే అవకాశం వుంది.

   అంతే కాదు ఔట్ డోర్ షూటింగులకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక షూటింగ్ స్పాట్లు వున్నాయి.  బౌద్ధ జైన దర్శనీయ స్థలాలను చెప్పుకుంటే ధూళికట్ట, నెలకొండపల్లి, ఫణిగిరి, కొలనుపాక తదితర ప్రాంతాలున్నాయి. ప్రాచీన చారిత్రక విషయాలకొస్తే కోటిలింగాల, వరంగల్ కోట, వెయ్యిస్థంబాలగుడి, రామప్ప, నాగునూరు గుళ్ళు ఇలా ఎన్నో ప్రాంతాలున్నాయి ఇక దేవాలయాల విషయానికి వస్తే వేములవాడ, యదాద్రి, బాసర లాంటి ప్రాంతాలున్నాయి. కోటల విషయానికి వస్తే గోలకొండ తో పాటు తెలంగాణ యావత్తు పదుల సంఖ్యలో వున్నాయి. మేదక్ చర్చి, పాత బస్తి మక్కా మస్జిద్ లాంటి స్థలాలూ వున్నాయి. ఇంకా అధ్యయనం చేస్తే పలు కేంద్రాలు పర్యాటకం తో పాటు సినిమాల షూటింగులకూ ఉపయుక్తమయినవి వున్నాయి. ఇక హైదరాబాద్ సంగతి చెప్పనే అవసరం లేదు. 2015 లో ట్రావెల్లర్ మగజైన్ ప్రపంచంలో రెండవ గొప్ప నగరంగా గుర్తించింది. అనేక చారిత్రక స్థలాలతో పాటు సిటీ ఆఫ్ పెరల్స్ గా వినుతికెక్కింది.

 ఇలా ఎన్నో అవకాశాలున్న తెలంగాణలో ఫిల్మ్ టూరిజం అమితంగా పెరిగే అవకాశం వుంది. అయితే అందుకు అటు ప్రభుత్వమూ ఇటు సినిమా పరిశ్రమ పలు చర్యలు చేపట్టాల్సి వుంది. ముఖ్యంగా హైదరాబాద్తో సహా రాష్ట్రం లోని వరానగల్ కరీమంగర్ లాంటి ప్రాంతాల్లో ఫిల్మ్ పార్క్ లు ఏర్పాటు చేసుకోవాల్సి వుంది. హైదరబాద్ కు 150కిలో మీటర్ల దూరంలోని నగరాల్లో ఫిల్మ్ స్టూడియో ల ఏర్పాటుకు వసతులు అనుమతులు, సబ్సిడీలగురించి పరిశీలించాలి. ఇక సినిమాల షూటింగులకు అనువయిన ప్రాంతాల్లో టూరిజం శాఖ అన్నీ వసతులు సులభ అనుమతులూ ఇవ్వగలగాలి.  సరయిన వసతులు ఉండి రాష్ట్రంలో షూటింగులకు సబ్సిడీలూ ఇవ్వగలిగితే రాష్ట్రంలో సినిమా నిర్మాణాలు పెరిగి ఫిల్మ్ టూరిజం అభివృధ్ధి చెందుతుంది. దాంతో పాటు తెలంగాణ సినిమా ఆభివృధ్ధి గురించి కూడా కృషి చేయాల్సి వుంది. సాంకేతికంగానూ వసతుల పరంగానూ చొరవ తీసుకుంటే తెలంగాణ లో ‘ఫిల్మ్ టూరిజం’ కొత్త దారులు తొక్కుతుంది.

 

-వారాల ఆనంద్

9440501281