Month: August 2018

ఎంత బాగుంటుంది (POEM)

Posted on

ఎంత బాగుంటుంది

——- వారాల ఆనంద్

ఒకర్ని ఒకరు పలకరించుకోవడం

ఎంత బాగుంటుంది

లేత కిరణాలు ఆకుల్నీ పువ్వుల్నీ

పల్కరించినట్టు

 

చూపులతో నయినా

రెండు మాటలతో నయినా

. . .

ఒకర్ని ఒకరు తెలుసుకోవడం

ఎంత బాగుంటుంది

సుఖం లోనూ దుఃఖం లోనూ

విజయం లోనూ ఓటమిలోనూ

ఇసుక తిన్నెలపైన

నీటి దారాలు అల్లినట్టు

. . .

ఒకర్ని ఒకరు ప్రేమించుకోవడం

ఎంత బాగుంటుంది

నిద్దర్లోనూ మెలకువలోనూ

కలల్లోనూ అన్ని కాలాల్లోనూ

 

కెరటాలు ఉప్పొంగి

ఆర్తిగా తీరాన్ని తాకినట్టు

. . .

ఒకరికోసం ఒకరు ఎదురుచూడ్డం

ఎంత బాగుంటుంది

చీకట్లోనూ వెల్తురు లోనూ

స్నేహం లోనూ మొహం లోనూ

 

సాయంకాలం

సూర్యుడు చంద్రుడి కోసం

ఉదయం

చంద్రుడు సూర్యునికోసమూ

ఎదురు చూసినట్టు

. . .

ఒకర్ని ఒకరు ఒదార్చుకోవడం

ఎంత ధీమాగా వుంటుంది

ఒంటరయినప్పుడూ ఓడిపోయినప్పుడూ

నిలబడలేనప్పుడూ కూలిపోయినప్పుడూ

ఎండిన గుండెల్లో

తడి తడి వాన కురిసినట్టు

entha baaguntundi FINAL

VOICE OF VARALA ANAND HRISHIKESH MUKHARJEE

Posted on Updated on

VOICE OF VARALA ANAND HRISHIKESH MUKHARJEE , A great film maker in Hindi cinema, who dealt Human relations, family bonding, humor and social values in his films

మానవ సంబంధాల ఆవిష్కర్త ‘హృషికేష్ ముఖర్జీ’

Posted on

ఆయనో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు, ఆయన పెరిగింది కూడా మధ్యతరగతి కుటుంబాలూ, స్నేహితుల మధ్యే అందుకే ఆయన రూపొందించిన సినిమాల్లో మధ్య తరగతి మండహాసాలూ, కోపాలూ, సున్నిత అనుబంధాలూ వెల్లివిరుస్తాయి. సున్నితమయిన హాస్యం తో సరళ మయిన చిత్రీకరనలతో ఆయన సినిమాలు ఒక తరాన్ని అలరించాయి. అతంత సాధారణ మయిన సినిమాలుగా కనిపించే ఆయన సినిమాలలో ఆయన మానవ సంబంధాల్ని  హృ ద్యంగానూ ఆవిష్కరించారు.1957 నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు హిందీ సినిమాల్లో తనదయిన ప్రత్యేక ముద్రను చాటిన హృదయ దర్శకుడు  హృషికేష్ ముఖర్జీ, అతి తక్కువ నిర్మాణ వ్యయంతో కుటుంబ జీవనం మనుషుల మనస్తత్వాలు వారి నడుమ నెలకొనే సంబంధాల ఆధారంగా ఆయన సినిమాలు రూపొందాయి. అవి ఒక కల్ట్ సినిమాలుగా నిలిచిపోయాయి. ఒక వైపు వ్యాపార సినిమాలు మరోవైపు కళాత్మక ఆర్ట్ సిన్మాలు వస్తున్న కాలంలో  హృషికేష్ ముఖర్జీ మధ్యేవాద సినిమాలుగా అర్థవంతమయిన సినిమాల్ని నిర్మించి ఒక ఒరవడిని ఏర్పరిచారు.సినిమా రంగంలో అందరిచేతా  హృశీదా  గా ఆప్యాయంగా పిలువబడ్డ ఆయన ఎక్కడా సినిమాకు సంబంధించిన శిక్షణ పొందలేదు. అసలు సినిమాలకు రావాలనే కోరికా వున్నవాడు కాదు. తను మొదట గణితం, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా తన జీవితం ఆరంభించారు. కాని మనసులో ఎక్కడో కేమరామన్ కావాలనే కోరిక వుండేది. మొదట లాబ్ లో సహాయకుడిగా పనిచేయమంటే చేరిపోయాడు. అయితే పువ్వు ఎక్కడున్నా పరిమలిస్తుందన్నట్టు హృషికేష్ ముఖర్జీ సినిమా ఎడిటింగ్ లో ఆసక్తి కనబరుస్తూ ఎడిటర్కి సహకరించడం మొదలుపెట్టాడు. హృషికేష్ ముఖర్జీ చూపే ఉత్సాహం, ఇచ్చే సలహాలు చూసిన సుప్రసిద్ధ దర్శకుడు నీకు చేయగలననే విశ్వాసం వుంటే తన సినిమాను ఎడిట్  చేయమన్నాడు. న్యూధిఏటర్స్ బి.ఎన్.సర్కార్ వద్ద అనుమతి తీసుకొని హృషికేష్ ముఖర్జీ తన ఎడిటర్ కారీర్ ను ఆరంభించాడు. అట్లా ఆయన మొదటి సినిమా ‘తథాపి’ ఆర్థికంగా విజయవంతమయింది. కాని హృషికేష్ ముఖర్జీ చదువు కొనసాగించడానికి తిరిగి వెళ్ళాడు. కాని బిమల్ రాయ్ బాంబే వెళ్తూ ఉండడంతో బిమల్ దా వెంట హృషికేష్ ముఖర్జీ కూడా బాంబే తరలి వెళ్ళాడు. 195 3 లో ‘దో భిగా జామీన్’. 195 5 లో దేవదాస్ సినిమాకు బిమల్ రాయ్ సినిమాలకు సహాయ దర్శకుడిగా, ఎడిటర్గా పని చేసాడు. అట్లా బిమల్ రాయ్ సినిమాలకు మధుమతి దాకా పనిచేసాడు హృషికేష్ ముఖర్జీ. మధుమతి లో హీరో గా పనిచేసిన దిలీప్ కుమార్ హృషికేష్ ముఖర్జీ లోని ప్రతిభ ను గమనించి స్వంతంగా సినిమా డైరక్ట్ చేయమని సూచించాడు. ఒప్పించాడు కూడా. మనిషి పుట్టుక, పెళ్లి, మరణం లను సబ్జెక్ట్ గా తీసుకొని సినిమా తీయాలని దిలీప్ కుమార్ ప్రతిపాదించడం తో అది నడవదని మొదట హృషికేష్ ముఖర్జీ అభిపాయ పడ్డారు. నువ్వు స్క్రిప్ట్ రాసి దర్శకత్వం వహిస్తే తాను హీరో గా చేస్తానని అనడంతో ‘ ముసాఫిర్’ సినిమా రూపొందింది. మూడు కథల సమాహారంగా రూపొందిన ముసాఫిర్ జాతీయ అవార్డును అందుకుంది. దిలీప్ కుమార్ తో మొదలయిన హృషికేష్ ముఖర్జీ దర్శకత్వ కారీర్ లో ఆనాటి స్టార్లు అనేకమంది తో అలవోకగా సినిమాలు తీసాడు. ఆహ్సోక్ కుమార్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, బలరాజ్ సహానీ, సునీల్ దత్, రాజేష్ ఖన్నా, అమితాబ్  బచ్చన్, ధర్మేంద్ర. అమోల్ పాలేకర్ లాంటి వాళ్ళతో ఆయన సినిమాలు రూపొందాయి. సెట్ మీద హృషికేష్ ముఖర్జీ చాలా ఖత్తిన్గా ఉండేవాడు. నటులకు సెట్స్ మీదికి వచ్చేంతవరకు సీన్ ఏమిటో చెప్పేవాడు కాదు. కథా కథనాలు ముందే తెలిస్తే నటుల్లో స్పాంటేనిటీ పోతుందని ఆయన అభిప్రాయ పడేవారు. తన ఆలోచనల్లో ఒక పాత్ర రూపొందిన తర్వాత నటులను వాటికి అనుగుణంగా మలుచుకోవడం నా పద్దతి అనేవారయాన. అంతే కాదు తన పద్ధతి తో అప్పటికి హిందీ సినిమాల్లో హీరో అంటే ఇట్లా ఉండాలన్న సూత్రాల్ని మార్చి తిరగ రాసాడు హృషికేష్ ముఖర్జీ. సరికొత్త లక్షణాలతో హిందీ హీరో ను రూపొందించిన దర్శకుడు హృషికేష్ ముఖర్జీ.

30 సెప్టెంబర్ 1922 న కలకత్తా లో జన్మించిన హృషికేష్ ముఖర్జీ  తన సినీ కారీర్ మొత్తం మీద నవ్య సినిమా ఉద్యమానికి గొప్ప సానుకూలతను ప్రకటించారు. సంఘీభావంతో వున్నారు. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్ సిన్మాలంటే అమితంగా ఇష్టపడ్డ హృషికేష్ ముఖర్జీ కి పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్ తో మంచి సంబంధాలుండేవి. బసు చటర్జీ, మని కౌల్ లాంటి దర్శకులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారాయన. మధుమతి లాంటి సినిమాల్లో రిత్విక్ ఘటక్ తో కలిసి పని చేయడం తో పాటు ఘటక్ రూపొందించిన ‘ జుక్తీ తక్కో అవుర్ తప్పో’, మని కౌల్ తీసిన ‘ సతాసే ఉడతా ఆద్మీ’, సాయీద్ మీర్జా తెసిన ‘ అరవింద్ దేశాయ్ కి అజీబ్ దాస్తాన్’ లాంటి సినిమాలకు ఆర్ధిక సాహయం అందించడంలో హృషికేష్ ముఖర్జీ పాత్ర గొప్పది. హృషికేష్ ముఖర్జీ జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డ్ చైర్మన్ గానూ, ఫిలిం డెవెలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా కూడా పని చేసారు. ముసాఫిర్ (1957), మొదలు (1998)   దాకా ఆయన 7 జాతీయ అవార్డులు, 1999 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2001 పద్మ విభూషణ్, ఎన్ టి ఆర్ జాతీయ అవార్డును అనుడ్కున్నారు. ఆయన తీసిన అనురాధ బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి నామినేట్ అయింది. అంతే కాదు హం హిందుస్తానీ, తలాష్, దూప్ చావున్, రిష్తే , ఉజాలాకి ఓర, అగర ఐసా హోతే లాంటి టీవీ సీరియల్స్ కూడా రూపొందించారు.

హృషికేష్ ముఖర్జీ ఆగస్ట్ 27, 2006 లో తీవ్రమయిన అనారోగ్యం తో ముంబై లీలావతి హాస్పిటల్ లో మరణించారు. కలకత్తా నుంచి బాంబే వచ్చి తన దయిన ఒక ఒరవడిని ఏర్పరచి పెద్ద వ్యాపార హీరో లతో సున్నితమయిన సాదారణమయిన పాత్రలను ధరింప చేసి hindi హీరో లక్షణాలను తిరగ రాసిన మంచి దర్శకుడు హృషికేష్ ముఖర్జీ .

హృషికేష్ ముఖర్జీ కొన్ని గొప్ప సినిమాలు:

‘ఆనంద్’ :  ‘మరణం ఒక క్షణం’ నా తీవ్రమయిన వ్యాధి తో ఎప్పుడో ఆర్నెల్లకు వచ్చే aa క్షణం గురించి వ్యాకుల పదే కంటే మరి ఈ ఆర్నెల్లలో జీవించనున్న వేలాది లక్షలాది క్షణాల సంగతేమిటి. ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ ‘

అంటూ జీవితాన్ని ఆనందంగా జీవించడమే ముఖ్యం అంతే కాదు తన చుట్టూ వున్న వాతావరణాన్ని సంతోషంగా ఉండడమే అసలయిన జీవితం అన్న అంశాన్ని గొప్ప గా ఆవిశాకరించిన సినిమా ఆనంద్. బడ బడ మాట్లాడుతూ సాగే ఆనంద్ ఒక పక్క, అంతర్ముఖుడయిన డాక్టర్ భాస్కర్ మరోపక్క ఇద్దరినడుమా సాగే కథే ఆనంద్. తీవ్రమయిన అనారోగ్యం తో వున్న ఆనంద్ సరదాగా బతుకును గడపడానికి ఇష్టపడతాడు. గంభీరంగా వుండే భాస్కర్ ఆనంద్ ను నియంత్రించే పయత్నం చేస్తూ విఫలం చెందుతూ ఉంటాడు. రాజేష్ ఖన్నా పోషించిన ఆనంద్ పాత్ర హిందీ సినిమాల్లో ఎన్న దగిన గొప్ప పాత్ర. ఈ సినిమా నిర్మించాలని తన దగ్గరి మిత్రుడు రాజ్ కపూర్ అనారోగ్యం పాలయినప్పుడు తట్టు కోలేక రూపొందిందని దర్శకుడు హృషికేష్ ముఖర్జీ చెప్పుకున్నాడు.

‘సత్యకాం’: దేశ విభజన తర్వాత కాలం నాటి కథ ఇది. నిజాయితీ పరుడయిన సత్యప్రియ ఆచార్య జీవిత చిత్రమిది. అవినీతికి వ్యతిరేకంగా నిలబడ్డ సత్యప్రియ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలూ, తక్కువ కులం అమ్మాయిని పెల్లదినందుకు ఎవరూ అంగీకరించని స్థితి, అతని  అకాల మరణం మొత్తం సినిమా స్వాతంత్రానంతర భారత్ ను అద్దంలో చూపిస్తుంది. హీరో ధర్మేంద్ర చలన చిత్ర జీవితంలో గొప్ప సినిమా గా నిలిచింది. జాతీయ అవార్డును అందుకుంది.

‘అనారి’ : చిత్రమయిన పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన ఒక అమాయకుడి కథ ఇది. ప్రధాన పాత్రధారి రాజ్ కపూర్ లో కనిపించే అమాయకత్వం తో పాటు ఆయనకీ నూతన్ కూ నడుమ కుదిరిన కెమిస్ట్రీ గొప్పగా వుంటుంది.

‘అనురాధ’ : గాయకురాలు కావాలని కళలు గానే ఒక అందమయిన అమ్మాయి సేవా  తత్పరుదయినా ఒక డాక్టర్ ను పెళ్ళాడి ఆయనతో పాటు సేవలో నిమగ్నమవుతుంది. కాని తాను తన భవిష్యత్తును నిర్ణయించుకునే స్థితి మరోసారి వస్తుంది. ఆ సంక్షోభమే ఈ సినిమా. బలరాజ్ సహానీ, లీలా నాయుడు ల గొప్ప నటన తో అనురాధ అజరమరమయింది.

‘ఖూబ్ సూరత్’: అందమయిన రేఖ అభినయం, గుల్జార్ అందమయిన సంభాషణలు మంచి హాస్యం తో కూడిన ఖూబ్సూరత్ లో సున్నిత హాస్యం గొప్పగా పండి ఆద్యంతం అలరిస్తుంది. కథ సాగిన రీతి కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

‘అభిమాన్ ‘ : గాయకులయిన ఒక జంట చుట్టూ సాగే ఈ సినిమా మనిషుల్లో వుండే  ప్రతిభ, దాని పర్యవసానంగా పెల్లుబికే ఈర్షా అసూయ ఫలితంగా ధ్వంసం అయ్యే అనుబంధాలూ మంచి సంగీత నేపధ్యంలో ఆవిష్క్రుతమవుతాయి. గాయకుదయినా సుదీర్ ఓ పల్లెలో పాటలు పాడే అమ్మాయిని పెళ్ళాడి పట్నం తీసుకు వస్తాడు. ఆమె పాడడం మొదలు పెట్టింతర్వాత ఆమె ప్రతిభకు విశేష ఆద్ద్రణ లభించడం తో సుదీర్లో అసూయ అస్థిరత పెరిగి వారి దాంపత్య ఈవితానికే విఘ్నం కులుగుతుంది. ఫలితంగా ఆమె మానసిక స్థిరత్వం కోలోతుంది. ఆద్యంతం టచ్చింగ్ గా సాగే అభిమాన మంచి పాటలు మాటలతో గొప్ప గా సాగుతుంది. అమితాబ్, జయ భాడురి ప్రధాన పాత్రధారులు.

‘గోల్ మాల్’ : నేటికి కూడా hindi సినిమా రంగంలో వచ్చిన అద్భుతమయిన కామెడి స్క్రీన్ ప్లే కలిగిన సినిమాగా పేరు తెచ్చుకుంది. కామికల్ క్లాసిక్ గా చెప్పుకోవచ్చు.

‘చుప్కే చుప్కే’ : హిందీ సినిమాల్లో కుటుంబ హాస్య చిత్రాల ఒరవడికి పాదులు వేసిన సినిమా ఇది. ఆద్యంతం రెఫ్రెషింగ్ గా వుండి అలరిస్తుంది. చిర కాలం గుర్తుందడి  పోతుంది.

ఇంకా మిలి, గుడ్డీ. నమక్ హరం, అనుపమ లాంటి సినిమాలు దర్శకుడు హృషికేష్ ముఖర్జీ భావుకతకు చలన చిత్ర ప్రతిభకు నిదర్శనంగా నిలిచిపోతాయి

hrishi 1hrishi 2

 

POEMS & ARTICLE

Posted on Updated on

గుల్జార్‌ ఆకుపచ్చ కవితలు
Aug 13, 2018,
Gulzar Poetry By Varala Anand – Sakshi
ప్రతిధ్వనించే పుస్తకం
—————
ముసాఫిర్‌ హూన్‌ యారో
నా ఘర్‌ హయ్‌ నా టిఖానా
నాలుగు దశాబ్దాల క్రితం నాటి ‘పరిచయ్‌’ సినిమాలోని పాటతో గుల్జార్‌తో కవిగా దర్శకుడిగా తొలి కరచాలనం. నేను ఇంటర్‌ చదువుతున్న రోజులవి. బినాకా గీత్‌ మాల వింటూ గడుపుతున్న రోజులు. చదువులూ పరీక్షలూ అన్నీ వెన్నంటే ఉన్నప్పటికీ ఎక్కడో ఒంటరితనం లోపల వెంటాడేది. ఆ ఒంటరితనమే మొదట హిందీ పాటల వైపునకు లాగింది. అప్పుడే వచ్చిన ‘ఆనంద్‌’ సినిమా నా జీవితంపై గొప్ప ప్రభావం చూపించింది.
‘బాబూమొషై జిందగీ బడీ హోని చాహీయే, లంబీ నహీ’
‘జబ్‌ తక్‌ జిందా హూ తబ్‌ తక్‌ మరా నహీ, జబ్‌ మర్‌ గయా సాలా మై హీ నహీ’
‘మౌత్‌ తో ఏక్‌ పల్‌ హై’
లాంటి గుల్జార్‌ మాటలు ఇప్పటికీ హాంట్‌ చేస్తూనే వుంటాయి. (జీవితం ఉన్నతమైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు; బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను; మరణం ఒక క్షణమే).
అట్లా గుల్జార్‌తో మొదలయిన ప్రయాణం కోషిశ్, ఆంధీ, ఖుష్బూ, ఇజాజత్‌… ఇలా అనేక సినిమాలతో సాగుతూ వచ్చింది. అది సినిమాలతో ఆగలేదు, ఆయన కవిత్వం వైపు మరలింది.
‘కొంచెం నవ్వించి మరికొంచెం ఏడిపించి ఈ ‘క్షణం’ కూడా వెళ్ళిపోతుంది’
‘తూఫాను వెళ్ళిపోవడం కోసం ఎదురు చూడ్డం కాదు జీవితమంటే వర్షంలో నృత్యం చేయడాన్ని నేర్చుకోవడమే జీవితం’
ఇట్లా ఇన్నో పంక్తులు ఎవరినయినా పట్టేస్తాయి. ఆయన గజల్స్, కవితల అనువాదాలు ఫాలో అవుతూ వచ్చాను. అట్లా ‘గ్రీన్‌ పొయెమ్స్‌’తో థ్రిల్‌ అయ్యాను. గుల్జార్‌ కవిత్వంలో సహజంగా వున్న సున్నితత్వమూ, సరళత్వమూ, సూటితనమూ ఈ కవితల్లో నిండుగా వున్నాయి. ప్రకృతి, నదులు, అడవులు, పర్వతాలు, మంచు, వర్షం, మబ్బులు, ఆకాశం, భూమి, అంతరిక్షం అన్నీ కవితా వస్తువులై నిలిచాయి. అందులోని కవితల్ని మన వాళ్ళతో పంచుకోవాలనిపించింది. మెల్లిగా అనువాదం చేయడం ఆరంభించాను. అనువాదం చేస్తున్నాను, పుస్తకం వేయడానికి అనుమతిస్తారా అని గుల్జా్జర్‌కి మెయిల్‌ రాశాను. వెంటనే జవాబు వచ్చింది, మీ పరిచయం మీ రచనల వివరాలు పంపండి అని. నా పుస్తకాలు కొన్ని పంపించాను. మూడో రోజుకు మళ్ళీ జవాబు వచ్చింది. అనువాదం చేయండి కాని నాకు ఒక కాపీ పంపండి అని. దాంతో మరింత ఉత్సాహంగా అనువాదం పూర్తయింది.
గ్రీన్‌ పొయెమ్స్‌ మూలం హిందీ. ఆ కవితల్ని పవన్‌ వర్మ ఇంగ్లిష్‌లోకి చేశారు. పవన్‌ వర్మ మౌలికంగా కవి. ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారి అయిన ఈయన రాజ్యసభ సభ్యుడు కూడా. గుల్జార్‌ మూలం హిందీ నుంచి తెలుగులోకి తేవడంలో ఈ ఇంగ్లిష్‌ అనువాదం ఎంతో తోడ్పడింది.
-వారాల ఆనంద్‌
==========================
యమ యాతన
Yathana-nijam
( POEM PUBLISHED IN NAMASTHE TELANGANA today)
ప్రతి ముగింపూ ఒక ఆరంభమే
ప్రతి ఆరంభమూ ఒక ముగింపే
ఏది ముందు ఏది వెనుక
ఎవరు తేల్చాలి, ఎట్లా తేలుతుంది
జీవన యానంలో
ఉదయాస్తమయాలతో సూర్యచంద్రుల్లాగా
వెలుగూ చీకట్లతో రాత్రీ పగళ్ళ లాగా
మొదలు-చివరా-మొదలూ
నిరంతర వృత్త గమనం
ఏది మొదలు పెట్టినా
అది ముగింపునకే దారి
ఏది ముగిసిందనుకున్నా
అది పునఃఆరంభానికే నాంది
కళ్ళు తెరవడమూ మూయడమూ
సరళ రేఖ కాదు
అదీ వృత్తమే
జీవన చక్రంలో
మొదలేదో చివరేదో కాని
రెంటి నడుమా పరుగు నిజం, తపన నిజం పోరు నిజం
యాతన మరింత నిజం
– వారాల ఆనంద్,
=========================================
భ్రమ
(POEM PUBLISHED TODAY IN MANA TELANGANA)
=====
అనంతమయిన శూన్యం
కేంద్రీకృతమయి
గొడుగులా కమ్మేసింది
కళ్ళున్నాయి
తెరవడానికి లేదు
మూయడానికీ లేదు
చూపునకు దారీ లేదు
క్రోధం లేదు, కన్నీరూ లేదు
అదట్లా నిశ్చలంగా పోయింది
చెవులు నిశబ్దాన్ని వింటున్నాయి
శబ్దమేమో గుండె లబ్ డబ్ లతో
అతలాకుతలమవుతున్నది
కలాలను ఉరితాళ్ళకు కట్టి
చేతులు
తల పట్టుకు కూర్చున్నాయి
భూమిలో దిగబడిపోయి
కాళ్లేమో
చౌరాస్తాలో దిక్కులు చూస్తున్నాయి
ఉత్త శరీరాలే కాదు
మనసులూ గడ్డకట్టుకు పోయాయి
ఆవరించిన శూన్యానికి తోడు
నిద్రను వెంటేసుకుని
మౌనమూ వచ్చి చేరింది
భ్రమ ఇట్లాగే ఉంటుందేమో
. . .
– వారాల ఆనంద్sakshi-gulzarnamaste telanganamana telangana

భావోద్వేగమయిన సినిమా ‘హిచ్ కీ’

Posted on Updated on

భావోద్వేగమయిన సినిమా ‘హిచ్ కీ’

           వైకల్యాలు విజయాలకు ఆటంకం కాదని,శారీరక మయిన వాయినా, మానసిక మయిన వైనా ధృడ చిత్తం తో  వైకల్యాల్ని అధిగమించి ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చునని,  సామాజికంగా విలక్షనతను  సాధించవచ్చునని నిరూపించే కథాంశంతో రూపొందిన సినిమా ‘ హిచ్ కీ’. తారేజమీన్ పర్ లాంటి అనేక సినిమాల్లో పిల్లలు వైకల్యంతో వున్నప్పుడు మంచి టీచర్ వారికి దిశా నిర్దేశం చేసి వారిలోని ప్రతిభల్ని వెలికి తెచ్చి విజయవంతమయిన సినిమాలుగా పెరుతేచ్చుకున్నాయి. దానికి భిన్నంగా టీచర్ కు వైకల్యం వున్నప్పుడు ఎదుర్కొనే సమస్యలు, అవమానాలు, వాటికి ఎదురొడ్డి ఆమె ఎట్లా విజయం సాధించిందో చెప్పే సినిమా “హిచ్ కీ’, అయితే ఈ సినిమాను కేవలం క్లాస్ రూమ్ కు పరిమితమయిన సినిమా గా కాకుండా వైకల్యం వున్న ఒక అమ్మాయి దానిని అంగీకరిస్తూ  హాస్యంగానూ, ఆత్మధైర్యంతోనూ చెప్పుకొని దాన్ని తనకనుకూలంగా మలుచుకొని జేవితంలో విజయం సాధించాకామే హిచ్ కీ.

       కథాంశానికి వస్తే నైనా మాథుర్ టౌరేట్ సిండ్రోం అన్న నరాలకు సంబందించిన వైకల్యం తో వుంటుంది. దాని వల్ల ఆమెకు వుందడి వుండి ఎక్కిళ్ల లాగా శభ్దాలురావడం, పదే పదే గడవను కొట్టుకోవడం జరుగుతూ వుంటుంది. నైనాకు అసంకిల్పితంగా జరిగే ఈ చర్యల వల్ల అనేక అవమానాలు ఎదురవుతాయి. కాని నైనా తాను టీచర్ గా పని చేయాలని అందులోనే తన విజయం దాగి వుందని భావిస్తుంది. అనేక చోట్ల తన వైకల్యమే అడ్డుగా వుండి వుద్యోగం రాదు. చివరగా తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో తాత్కాలిక టీచర్ ఉద్యోగం వస్తుంది.అదికూడా 9F క్లాస్ కోసం నియమిస్తాడు ప్రిన్సిపాల్.  aa క్లాసులోని పిల్లలు విద్యా హక్కు చట్టం వల్ల ఇంత పెద్ద స్కూల్లో చేరతారు కాని మిగతా విద్యార్థులు టీచర్ల చిన్న చూపు నిరాదరణ ల వల్ల మొండిగా  తయారయి చిల్లర మల్లరగా తయారవుతారు. అలాంటి తరగతికి నైనా టీచర్గా వెళుతుంది. ఆమెను ఆమెకున్న వైకల్యాన్ని పిల్లలు గేలి చేస్తారు. అందరు టీచర్ల లాగే ఆమెను అవమాన పరుస్తారు. కాని నైనా తన చక్ చక్, వా వా అన్న శబ్దాలు చేస్తూనే తన వినూత్నమయిన బోధనా పద్దతులతో క్రమంగా వారి మనసుల్ని దోచుకుంటుంది. ఫైనల్ పరీక్షల్లో తన విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధిస్తారని చాలెంజ్ చేస్తుంది. విద్యార్థుల్లో నిబిదీక్రుతమాయి వున్న ప్రతిభాల్ని వెలికి తీసి విజయులుగా నిలుపుతుంది స్థూలంగా ఇది కథ . కాని దర్శకుడు సిద్దార్థ్ మల్హోత్రా కథకు మించి తన ప్రతిభతో గొప్ప సినిమా గా రూపొందించాడు. ఇక సినిమా మొత్తం నైనా మాథుర్ పాత్ర దారి రాణీ ముఖర్జీ దే. ఆమె నటన నైనా పాత్రలో ఇమిడి పోయిన పద్ధతి రాణీ ముఖర్జీ ని గొప్ప నటిగా నిలబెడుతుంది. చక్ చక్, వా వా అంటూ తన గదవను కొట్టుకునే పద్ధతి సినిమా ఆద్యంతం నైనా పాత్రకు విలక్షణతను, వైవిధ్యాన్ని సంతరింప చేస్తుంది. వర్తమాన హిందీ కతానాయికల్లో రాణీ ముఖర్జీ కి నటిగా హిచ్ కీ ఉన్నత మయిన స్థానాన్ని ఇస్తుంది. ఇక 9F  క్లాసు పిల్లల నటన కూడా అత్యంత సహజంగా వుండి సినిమాకు బలాన్నిస్తారు. అందులో ముఖ్యంగా వాళ్ళ నాయకుదు ఆతిష్ గా హర్ష మాయర్ అందరినీ ఆకట్టుకుంటాడు. ఇంకా నైనా పట్ల విముఖంగా ఉంటూ మార్కులు రాంకులూ అంటూ మాట్లాడే సైన్స్ టీచర్ వాడియా పాత్రలో నీరజ్ కబీ కూడా ఆకట్టుకుంటాడు. చివరగా వాడియా చేసే ప్రసంగం సినిమాకు తల మానికంగా వుంటుంది. మంచి టీచర్ కావడానికి సబ్జెక్ట్ ఒకటే చాలదని పిల్లల స్థాయికి చేరి వ్యవహార జీవితంలోంచి బోధన జరిగితే గొప్ప ఫలితాలు వస్తాయని నైనా నిరూపించింది అంటాడు. అంతేకాదు మంచి టీచర్ కావడం సులువే కాని మంచి విద్యార్ధి కావడం అంత సులువు కాదంటాడు.

        మొత్తం మీద నైనా మాథుర్ సహజంగా తనకు సంక్రమించిన వైకల్యానికి లొంగి పోకుండా ఆత్మ స్థైర్యంతో నిలబడి సృజనాత్మకంగా కృసి చేసి సాధించిన విజయం గొప్ప స్ఫూర్తిదాయక మయింది. వైకల్యానికి కుంగిపోకుండా వున్న నైనా పాత్ర అనుసరనీయమయింది. రాణీ ముఖర్జీని దర్శకుడ్ని మనసారా అభినందించాలి.

‘హిచ్ కీ’ సినిమా అమెజాన్ ప్రైం వీడియో లో అందుబాటులో వుంది టీచర్లు, ప్రగతి శీల వాదులు చూడాల్సిన సినిమా.

‘హిచ్ కీ’ , దర్శకుడు: సిద్దార్థ మల్హోత్ర; నిర్మాత:మనీష్ శర్మ; నటీనటులు: రాణీ ముఖర్జీ, నీరజ్ కాబి, హర్ష మాతుర్ ..

-VARALA ANAND

HITCHKI FILM REVIEW

ప్రయోగాత్మక దర్శకుడు ‘జాన్ శంకరమంగళం’

Posted on Updated on

నివాళి

ప్రయోగాత్మక దర్శకుడు ‘జాన్ శంకరమంగళం’

-వారాల ఆనంద్

(MANAM DAILY 02-08-2018)

నాలుగు దశాబ్దాల  క్రితం యోగ గురువు బి.కె.ఎస్. అయ్యంగార్ పైన నిర్మించబడిన 22 నిముషాల డాక్యుమెంటరీ సినిమా ‘సమాధి’ ప్రయోగాత్మక మైన సినిమాగా జాతీయ స్థాయిలో రజత కమలం అవార్డును అందుకుంది. ఆ అవార్డును ప్రకటిస్తూ న్యాయ నిర్ణేతలు ఈ చిత్రం యోగ యొక్క ఆత్మను, తాత్వికతను అత్యంత మధురంగా సంలీనం చేసిందని ప్రకటించారు. ప్రయోగాత్మక సినిమా గా దానికి విశేష గుర్తింపు లభించింది. తర్వాత సమాధికి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. ఆ  చిత్రానికి దర్శకత్వం వహించిన వాడు జాన్ శంకరమంగళం. ఆయన ఆగస్ట్ ౩౦న కేరళ లోని తిరువెల్ల లో మరణించారు.

ఫిలిం జీనియస్ గా పేరొందిన  జాన్ శంకరమంగళం తన 84 వ ఏట ఆగస్ట్ ముప్పైన కేరళ లోని తిరువెల్ల లో తనువు చాలించారు. నిజానికి అయ్యంగార్ పైన డాక్యుమెంటరీ తీయడానికి ఫిలిమ్స్  డివిజన్  ప్రయత్నం చేసినప్పటికీ అయ్యంగార్ అసలు ఒప్పుకోలేదు. షూటింగ్ అదీ అంటే తనకు తన ఏకాగ్రతకు భంగం కలుగుతుందని అంగీకరించలేదు. కాని జాన్ శంకరమంగళం పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్ కి సంచాలకుడిగా వచ్చాక అనేక సార్లు అయ్యంగార్ ను కలిసి అసలు మీ జోలికి రాకుండానే పక్కక నుండి షూట్ చేసుకుంటామని అంగీకరింప చేసారు. సరిగ్గా అప్పుడే బంగ్లాదేశ్ కు చెందిన ఒక ప్రతిభావంతుడయిన సినిమాటోగ్రఫీ విద్యార్థి తన డిప్లమా పూర్తిచేయక్కుండానే వెల్లిపోతూవుంటే అతని తో షూట్ చేయించారు, ఇక నేపధ్య సంగీతాన్ని భాస్కర్ చంద్రావర్కర్ అందించాడు. నిజంగా ఆ డాక్యుమెంటరీ సంగీతమూ, కెమరా వర్క్ తో ఒక మూడ్ ను తీసుకొచ్చింది. అట్లాంటి గొప్ప డాక్యుమెంటరీ తో దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకున్న జాన్ శంకరమంగళం 1966 లో జయశ్రీ, 1967 జన్మభూమి , 1985 సమాంతరం తీసాడు. సమాంతరం 1986 హైదరాబాద్ ఫిల్మోత్సవ్ లో ప్రదర్శించ బడినప్పుడు చాలా ఇష్ట పడ్డాం. అందులో సూర్య, బాబూ నంబూద్రి, సాయిదాస, బాలన్ ప్రధాన భూమికల్ని పోషించారు. ప్రేముకల్యిన ఇద్దరు భార్యాభర్తల నడుమ కాలక్రమంలో చెలరేగిన కలహాలు ప్రధాన కథాంశం అయినప్పటికీ సమాతరం లో దర్శకుడు కేరళ రాజకీయ పరిస్థతి, మనుషుల చిత్త ప్రవృత్తులని చర్చకు పెడతాడు. వ్యక్తుల మధ్య సంఘర్శనల్ని,వ్యక్తిత్వాల మధ్య వైరుధ్యాల్ని సమాంతరం దృశ్య రూపంలో ఆవిష్కరిస్తుంది.

జాన్ శంకరమంగళం మొదట మద్రాస్ క్రిస్టియన్ కాలేజి లో  అధ్యాపకుడిగా పని చేసారు. తర్వాత తనకున్న సినిమా ఆసక్తి తో పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్ లో చేరాడు తరవాత అక్కడే అధ్యాపకుడిగా చేరాడు.తర్వాత క్రమంగా  ఏ సంస్థ  నుంచి అయితే స్క్రీన్ ప్లే, దర్శకత్వ శాఖల్లో అత్యుత్తమ విద్యార్థిగా నిలిచి అనంతరం అదే సంస్థ పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్ కి డైరెక్టర్ గా పని చేసాడు.

తరువాత జాన్ శంకరమంగళం కేరళ చలచిత్ర అకాడెమి కి వైస్ చైర్మన్ గా వుంది కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ నిర్వహణలో ముఖ్యమయిన పాత్రను పోషించాడు. ఆయన మరణం భారతీయ సినిమా రంగానికి ముఖ్యంగా కేరళ చిత్రసీమకు తీరని లోటు.

-వారాల ఆనంద్

9 4 4 0 5 0 1 2 8 1

manam

వంటింట్లోనూ పరాయి భాష!(ARTICLE)

Posted on Updated on

వంటింట్లోనూ పరాయి భాష!

Mana Telangana : Aug 02, 2018

      మానవ జీవన యానంలో మాతృ దేశం, మాతృ మూర్తి, మాతృభాష లు అంత్యంత మౌలికమయిన అంశాలు. మనిషి ఉనికికే మూలాధారాలు. కాని ఆధునిక సమాజం కేవలం ఆర్ధిక సమాజమయిపోయి అన్నిటికీ సాంకేతికత మాత్రమే ఆలంబన అయి కూర్చున్న నేపధ్యం లో మౌలికమయిన అంశాలన్నీ మరుగునపడిపోయి ఏక ధ్రువ గమ్యం వైపునకు మనిషి పరుగులు పెడుతున్న కాలం ఇది. ఈ కాలంలో మౌలిక అంశాల్లోని మాతృ భాష గురించి మాట్లాడుకుంటే కొడిగడుతున్న దీపం మాత్రమే కనిపిస్తుంది. అంతరించిపోతున్న మాటలు, ఆత్మీయ సంభాషణ కరువై మనస్సు కలుక్కు మంటుంది. మాతృభాష పరిరక్షణ గురించి ఎన్ని మాటలు చెప్పుకొని ఎంతగా దుఃఖ పడినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించదు. భవిష్యత్తు అంత ఆశా జనకంగా కనిపించదం లేదనే చెప్పుకోవాలి.
భాష భావ వ్యక్తీకరణ కోసం కాకుండా కేవలం ఉద్యోగ ఉపాధి కల్పనకోసం అనే భావన పెరిగిపోయిన నేపధ్యంలో మాతృభాష కుండే ప్రాధాన్యత నానాటికీ కుంచించుకు పోతున్నది. మాతృభాష వినియోగం దీన స్థితికి చేరుకుంటున్నది. 2011 జనాభాలెక్కల ప్రకారం మన దేశంలోని అధికారిక భాషలూ మాండలికాలూ మొత్తం కలిపి 19,569 గా ఇటీవల తేల్చారు.వాటిలో 22 అధికారిక భాషలూ, 99 భాష హోదాను పొందినవి. పదివేలమంది జనాభా మాట్లాడితే దానిని భాష గా గుర్తించడం లాంటి గణాంకాల వివరాలెట్లా ఉన్నప్పటికీ నిజానికి భాష అనేది ఎక్కడుంది, వ్యవహర్త లెవరు, మాతృభాష వినియోగం ఎక్కడి నుండి మొదలవుతుంది ఎక్కడ అది సజీవంగా ఉంటుందన్న విషయాలను గమనించాలి. ఆ క్రమంలో సమాజమూ, విద్యాలయాలు, ఉద్యోగ స్థలాలూ, ప్రసార మాధ్యమాలూ ప్రధానంగా కనిపిస్తాయి. వీటి అన్నిటి కంటే మాతృ భాష వినియోగంలో ఇల్లు, ఇంట్లో మనుషులూ ముఖ్య భూమికను పోషిస్తారు. మాతృభాషను తరాన్నుంచి తరానికి అందించడంలోకూడా ఇంటి పాత్ర ప్రధానమయింది.
మనిషి పుట్టిన తర్వాత మాటలు నేర్చుకొనే క్రమంలో అమ్మా, అత్తలాంటి మాటలు నేర్చుకోవడం ఇంట్లోనే మొదలవుతుంది. పిల్లాడో, పిల్లో తొలుత తమ అమ్మ మాటల్ని కదలికల్నీ అనుకరించడం ద్వారానే మాట్లాడ్డం నేర్చుకుంటారు. తొలి రోజుల్లో మాటల్ని వినడం, మాట్లాడడం అంతా ఇంట్లోనే జరుగుతుంది. భాష చదవడం రాయడం మొదలయ్యే సమయానికి విద్యాలయాల పాత్ర ఆరంభమవుతుంది. అంటే మనిషి భాషను మొట్టమొదట ఇంట్లోనే నేర్చుకోవడం మొదలు పెడతాడు. అందులోనూ అమ్మతోపాటు ఆహారమూ, వంటిల్లూ భాష నేర్చుకునే క్రమంలో ముఖ్య భూమికను పోషిస్తా యి. కాని ఇవ్వాళ ఇంట్లో, ముఖ్యంగా వంటింట్లో భాష సంకరమయి పోతూవుంది. వంటింటి మీద ఇతర భాషా సంస్కృతుల ప్రభావం చెప్పలేనంతగా పెరిగిపోయి కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా మన మాతృ భాష తెలుగు అంతరించిపోయే ప్రమాదం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది.
వంటింటి భాష పై దాడి మొదట మనకే సొంత మయిన ఆహారపు అలవాట్ల పైన మొదలయింది. వివిధ దేశాల లేదా ప్రాంతాల ఆహారపు అలవాట్లను మన పైన రుద్దడంతో అది ఆరంభమయింది. ఎప్పుడయితే ప్రపంచీకరణ వేగం పుంజుకోవడంతోనే బయటి ఆహారపు అలవాట్లను రుద్దే ప్రక్రియ ఆరంభమయింది. ఆ పని విజయవంతంగా చేయగలిగితే అది పెద్ద ఆదాయ వనరు అవుతుందని భావించిన బహుళ వ్యాపార సంస్థలు తమ దృష్టిని మన వంటిళ్ల పైన కేంద్రీకరించడం మొదలు పెట్టాయి. వందేళ్ళ క్రితం మన దేశ ప్రజలకు తేనీరు (చాయ్) అలవాటు చేసే క్రమంలో లిప్టన్ సంస్థ కొంత కాలం నగరాలలోని నాలుగు కూడళ్ళలో ప్రజలకు తేనీరు ఉచితంగా పోసింది. అట్లా క్రమంగా అలవాటు చేసి జనం అలవాటు పడిన తర్వాత డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు.
దాని తర్వాత టీ మన జీవితాల్లో అంతర్భాగమయి పోయింది. క్రమంగా మన అన్ని ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసే ప్రక్రియను బహుళ జాతి సంస్థలు మొదలు పెట్టాయి. కాని ఈ సారి ఉచిత సరఫరా ప్రయోగంతో కాకుండా మాధ్యమాల ద్వారా తమ పని కానిచ్చే పనికి పూనుకున్నారు. ఇప్పటికే దశాబ్దాల కాలంగా ఇంటింటికీ, నట్టింటికీ చేరిన టివిలు, క్రమంగా చేరుకుంటున్న ఇంటర్నెట్ సేవల్నీ ఉపయోగించుకొని విదేశీ వంటల దాడి మొదలుపెట్టాయి. ఇవాళ సమాజమంతా ప్రసారమాధ్యమాల ప్రభావిత సమాజం కనుక ఇల్లు వంటిల్లూ కూడా అందుకు మినహాయింపు కాలేదు.
పర్యవసానంగా వంటింటి భాష తీవ్రమయిన ఒత్తిడికి గురయి తన మౌలిక రూపాన్ని మార్చుకునే స్థితికి వచ్చింది. కంచం పోయి ప్లేట్, గిన్నె పోయి బౌల్, వడ్డించడం పోయి సర్వ్ చేసుకోవడం జరుగుతున్నది. ఫలితంగా ఇంట్లో ఆధునికులయిన పెద్ద వాళ్ళ భాషే కాదు పిల్లల భాష కూడా మార్పుకి గురవుతున్నది. దాని ప్రభావం మొత్తం భాషా వ్యవహారం పైనే కనిపిస్తున్నది. ఇక టివి చానళ్ళు ఒకదానికొకటి పోటీలు పడి మరీ వంటల కార్యక్రమాలు ప్రసారం చేస్తూ మాతృభాష హననానికి తమ వంతు దోహదం చేస్తున్నాయి. తెలుగు వెలుగుల్ని పోషిస్తున్నామంటున్న వారు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
వంటల కార్యక్రమాల్లో భాషను పరిశీలిస్తే దిమ్మ తిరిగి పోతుంది. వాళ్ళు ఉపయోగించే మాటల్నికొన్నింటిని పరిశీలిద్దాం: గ్యాస్ స్టవ్‌ను ఆన్ చేసి నాన్ స్టిక్ పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి అది బాయిల్ అయ్యేంతవరకూ వెయిట్ చేయాలి. దాంట్లో ఆనియన్, చిల్లీ వేసి అవి ఫ్రై అయింతర్వాత టర్మెరిక్, చిల్లీ, వేసుకోవాలి. ఏమాత్రం లేట్ చేయకుండా కట్ చేసుకుని రెడీ గా పెట్టుకున్న వెజిటేబుల్స్ అందులో వేసుకోవాలి. దానికి కొంచెం వాటర్ అప్లై చేయాలి. పైన లిడ్ పెట్టి టెన్ మినట్స్ వైట్ చేయాలి.
ఇక రొట్టె తయారు చేసుకునే విధం ఇట్లా వుంటుంది. వీట్ ఫ్లోర్ కి వాటర్ అప్ప్లై చేసి లేయర్స్ గానూ, రౌండ్ రౌండ్ గానూ చేసుకొని ప్రెస్, లేదా క్రష్ చేయాలి, తర్వాత స్ప్రెడ్ చేయాలి. ఇంకో స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ కానీ బట్టర్ కాని అప్లై చేసి కాల్చుకోవాలి.
అంతకు ముందు స్టవ్ పైన పెట్టిన కర్రీ ని డీప్ ఫ్రై లేదా షాలో ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా వంటలకు సంబంధించిన మాటలు చూస్తే తల తిరిగి పోతుంది. ఫైన్లీ చోప్ద్, హాఫ్ బాయిల్, క్రిస్పీ, గార్నిష్, స్టఫ్ఫింగ్ , క్రంచీ, స్మూతీస్, జ్యుసీ, యమ్మీ, ఫ్లేవర్, స్నాక్స్,కాంబినేషన్, మాష్ చేయడం,స్పైసీ మీడియం స్పైసీ, బ్లెండింగ్, బైండింగ్, టాంగీ ఫ్లేవర్, టెస్ట్ సూపర్ గా ఎన్ హాన్స్ అవడం, బ్లాంట్ టెస్ట్, మాష్ చేసి ఆడ్ చేయడం , చివరగా స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బౌల్ లో తీసుకొని, తర్వాత సర్వింగ్ ప్లేట్లో గార్నిష్ చేయాలి. ఇట్లా లెక్కలేనన్ని వంటలు లెక్క తెలీని మాటలు మన వంటిల్లలోకి దిగి పోతున్నాయి. అట్లా మన ప్రమేయం లేకుండానే వంటింట్లోకి వ్యవహారంలోకి తోసుకోచ్చిన ఆంగ్ల మాటలు అలవాటయిపోయి వంటంటే అదే వంటింటి భాష అంటే ఆదే అనే స్థితిలోకి మన ఇండ్లు చేరుకుంటున్నాయి. ఆ భాషే పిల్లలకూ పెద్దలకూ అలవాటయి పోయి మాతృభాష ఉనికే ప్రశ్నార్ధక మయి పోతున్నది.
నిజానికి మాతృ భాష వినియోగం, పరిరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మిగతా వారికంటే అనేక ఉపయుక్తమయిన కార్యక్రమాలనే చేపట్టింది. విద్యారంగంలో తెలుగును తప్పనిసరి చేయడం, తెలుగు మాధ్యమాన్ని ప్రోత్సహించడం, తెలుగుకు వైభవం కల్పించే దిశలో ప్రపంచ మహాసభలు నిర్వహించడం లాంటి కార్యక్రామాలు చేపట్టినప్పటికీ, ఇంట్లోనూ వంటింట్లోనూ మారిపోతున్న మాతృ భాషా వినియోగం పైన దృష్టి సారించక పోతే భాషా వినియోగంలో పెద్ద మార్పు ఉండదు. ్ల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం వరకే తెలుగు భాషను నేర్చుకొని మర్చిపోయే అవకాశం వుంది.
మాతృ భాష పరిరక్షణ లో భాగంగా వంటింటి భాష పైన మొత్తంగా ఇంటి భాష పైన జరుగుతున్న దాడిని ఆపాలి. టీవీ మాధ్యమాలు కూడా స్వీయ నియంత్రణను అలవర్చుకోవాలి. భిన్న మయిన ఆహారాల్ని పరిచయం చేస్తే ఫరవాలేదు కాని భిన్న మయిన భాషని వాడి మాతృభాషను ఖూనీ చేయకూడదు. భావితరాల్ని సొంత భాష నుండి దూరం చేయకూడదు.

వారాల ఆనంద్
9440501281

 bhasha-mana