Month: July 2023

100= యాదోంకీ బారాత్ +++ వారాల ఆనంద్

Posted on

100= యాదోంకీ బారాత్

+++++++ వారాల ఆనంద్

“వెన్నెల వెళిపోతున్నదని రోదిస్తూ కూర్చుంటే

ప్రభాతాన్నీ కోల్పోతావు“.

నేను చాలా సార్లు ‘ఒక్కన్నే నడుస్తున్నా.. చుట్టూరా వేల ఆలోచనలు’ చుట్టుకునేవి. దాంతో ‘వెళ్తూ వెళ్తూ ఓ విత్తు నాటు- వెనకాల వచ్చేవారికి అది పువ్వో ఫలమో ఇస్తుంది’ అని విశ్వసిస్తూ ముందుకు నడిచాను.. నడుస్తూనే వున్నాను. సరిగ్గా అది నా ఫిల్మ్ సొసైటీ కార్యక్రమాల విషయంలోనూ పాటించాను. ఫలితంగా ఆ రోజుల్లో పలు కాలేజీల్లో ఫిల్మ్ క్లబ్స్ ఏర్పాటుతో పాటు ఆయా కాలేజీలు యూనివర్సిటీల్లో సెమినార్ల నిర్వహణ ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. అది ఆనాటి విద్యార్థుల్లో అధ్యాపకుల్లో మంచి సిన్మా పట్ల ఒక అవగాహన ఆసక్తిరావడానికి తోడ్పడింది. నిజానికి అప్పటి వరకూ 30 ఏళ్లపాటు నేను ఇన్వాల్వ్ అయి కొంత నడిచి, నడిపించిన ఫిల్మ్ సొసైటీ ఉద్యమం 2010 తర్వాత క్రమంగా స్తబ్దతకు లోనవడం మొదలయింది.

    సమాంతర కళాత్మక సినిమాలకు వేదికలయి దశాబ్దాలకు పైగా ఒక తరాన్ని ప్రభావితం చేసిన ఫిల్మ్ క్లబ్బుల (సొసైటీలు) కార్యక్రమాలు క్రమంగా మందగించి వాటి ఉనికి ప్రశ్నార్థక మైన పరిస్థితి ఏర్పడింది. నిజానికి వాటి ఆవశ్యకత లేదని, అసలు వాటి relevance లేదనే వాదన మొదలయింది. దాదాపుగా అన్నీ సినిమాలు ఇంటర్నెట్లో లభిస్తున్నప్పుడు ప్రత్యేక ఫిల్మ్ క్లబ్బుల అవసరం ఏముందని కూడా అన్నారు.

       ‘ ఫిల్మ్ క్లబ్ లో చేరండి ప్రపంచాన్ని చూడండి .  ఇది ఎనభయవ దశకంలో మంచి సినిమాలు ఇష్టపడే వాళ్ళు అర్థవంతమయిన సినిమాల్ని చూసేవాళ్ళు ఆసక్తిగా చెప్పు కున్న స్లోగన్. ఆ కాలం లో సత్యజిత్ రాయ్, సినిమాలు గాని, కురుసోవా సినిమాలు గాని మరింకే విఖ్యాత దర్శకుల సినిమాలు గానీ చూడడానికి ఖచ్చితంగా ఫిలిమ్ క్లబ్ లే అధారంగా వుండేవి. అంతే కాదు భాగల్పూర్ బ్లైండింగ్స్పైన  తపపన్ బోస్ తీసినదయినా, రాకేశ్ శర్మ తీసిన బాంబే హమారా షెహర్ లాంటి మరింకే మంచి డాకుమెంటరీ చూడాలని వున్నా ఫిల్మ్ క్లబ్బులే అవకాశం కల్పించేవి. అందుకే అవి 1970 నుండి మూడు నాలుగు దశాబ్దాల పాటు ఒక ప్రగతిశీల,ఉత్తమ సినిమాలకు వేదిక గా నిలిచాయి. అందుకే దేశ వ్యాప్తంగా ఏర్పాటయిన వాటితో సహా హైదరబాద్,కరీంనగర్,వరంగల్ లాంటి నగరాలతో పాటు, వేములవాడ,ఎల్లారెడ్డి పేట్. లాంటి మామూలు గ్రామాల్లో కూడా ఫిలిమ్ క్లబ్బులు ఏర్పాటయ్యాయి. కానీ ఎప్పుడయితే కలర్ టీవీలు క్రమంగా నట్టింట్లోకి చేరాయో అప్పుడే సభ్యుల సంఖ్య తగ్గడంతో ఫిలిమ్ క్లబ్బులు క్రమంగా తమ కార్యక్రమాల్ని తగ్గించుకోవడం ఆరంభమయింది. 1970-1990ల దాకా విస్తృత మయిన కార్యక్రమాల్ని నిర్వహించి జాతీయ అంతర్జాతీయ సినిమాల్ని, బాలల సినిమాల్ని ప్రజలకు పరిచయం చేసిన ఫిల్మ్ క్లబ్బులు అనంతర కాలంలో మందగించాయి. నిజానికి ప్రధాన స్రవంతి సినిమాకి సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయ పంపిణీ వ్యవస్థగా ఫిలిమ్ క్లబ్బులను రూపొందించాలని అప్పటి కార్యకర్తలు భావించారు. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది.

     ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేసినప్పుడు సత్యజిత్ రాయ్ అధ్యక్షుడిగా వుండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా డిల్లీ చాప్టర్ కి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంట్లోనే రోజంతా సినిమాలు, సినిమా ఆధారిత కార్యక్రమాలతో టీవి ప్రజల్ని ఎంగేజ్ చేయడంతో ఆదివారం ఉదయం 8 గంటలకు జరిగే ప్రదర్శనలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అప్పటికే దేశంలో  ప్రాధాన్యతను సంతరించుకుంటున్న ప్రపంచీకరణ నేపధ్యంలో మంచి కళాత్మక వాస్తవిక సినిమాలకు స్థానం లేకుండా పోయింది. దాంతో ఫిలిమ్ క్లబ్బుల నిర్వహణ కష్టతరమయిపోయింది. దాంతో పాటు ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడం మరోకారణం అయింది.

ఆ అనుభవం నాక్కూడా ఎదురయింది. కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో సినిమాల ప్రదర్శనలకు సభ్యుల హాజరీ తగ్గడం నేను గమనించాను. ఫెస్టివల్స్ లాంటివి నిర్వహిస్తే తప్ప హాజరు పెరిగీ స్థితి కనిపించలేదు. అప్పటికే కఫిసో ఫిల్మ్ భవనంలో నాలుగు జాతీయ స్థాయి షార్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్స్,ఫిల్మ్ తెలంగాణా, వాటర్ ఫెస్టివల్ లాంటి అనేక ఉత్సవాల్ని నిర్వహించాము. కానీ క్రమంగా కార్యవర్గంలో ఇతర ఆసక్తులు పెరగడం కూడా గమనించాను. నేను కూడా ఆ సంస్థకు అనేక ఏళ్లుగా భాధ్యుడిగా వుండడం, నా కున్న ఆసక్తి అభినివేశం అన్నీ నేనే అయి కార్యక్రమాల ఆలోచననుంచి అమలు వరకు ఇతర సభ్యులతో కలిసి నిర్వహించడం కొందరికి ఇబ్బంది కలిగించింది. ఇక సంస్థకులభిచిన పేరు గౌరవాలతో తాము ప్రధాన బాధ్యులం కావాలన్న ఆలోచనలు పెరిగాయి. వాటికి మా సలహాదారు మిత్రుడు కూడా వత్తాసు పలికాడు. నేనూ అలిసి పోయి వున్నాను. బాధ్యతల్ని అప్పగించేశాను. నేను చేయడానికి బయట చాలా పనులున్నాయి అనుకున్నాను. ఫెస్టివల్ డైరెక్టర్గా వుంది ఉత్సవాల్ని నిర్వహించమని కోరారు. కానీ నేను అంగీకరించలేదు. ఎనఫ్ ఈస్ ఎనఫ్ అన్నాను.

సరిగ్గా అప్పుడే కాలేజీలూ స్కూళ్ళల్లో కాంపస్ ఫిలిమ్ క్లబ్బుల ఏర్పాటు ప్రక్రియ ఆలోచన  ప్రారంభ మయింది. ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్ పలు యూనివర్సిటీ ఉపకులపతులకు లేఖలు రాశారు. దాన్ని ఆధారం చేసుకుని నేను అప్పడు రాష్ట్ర ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మనజింగ్ డైరెక్టర్ సి.పార్థసారధి గారిని సాయం కోరాను. ఏ కొత్త ఆలోచననయినా సమర్థించి సహకరించే ఆయన నా లేఖను ఆధారం చేసుకుని ఆయన కాలేజీ,మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమీషనర్ల కి తానే అధికారికంగా లేఖలు రాశారు. అప్పుడు కాలేజీయేట్ కమీషనర్ గా వున్న శ్రీ ఆధర్ సిన్హా కూడా అంతే స్పందించారు. అప్పుడు సీసీఈ అకాడెమిక్ సెల్ లో వున్న మిత్రుడు శ్రీ వి.జగదీశ్వర్ చొరవచూపాడు. దాంతో కరీంనగర్, వరంగల్, కర్నూల్, బేగమ్ పేట్, ఒంగోల్, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం తదితర కాలేజీల్లో ప్రయోగాత్మకంగా క్యాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ప్రారంభించమని అధికారికంగా ఆదేశాలిచ్చారు. నన్ను సంప్రదించమని కూడా ఆ లేఖలో సూచించారు. ఇంకేముంది నాకు చేతినిండా పని. నన్ను వెళ్ళి ఆయా కాలేజీల్లో క్లబ్స్ ప్రారంభించమన్నారు. సరిగ్గా అదేసమయంలో FFSI (WR), AFF లు ముందుకొచ్చి కాలేజీల్లో ఫిల్మ్ వర్క్ శాప్స్ (ONE DAY FILM WORKSHOP) నిర్వహించమని పిలుపునిచ్చాయి. సుధీర్ నంద్ గావ్ కర్, హెచ్.ఎన్.నరహరి రావు, ప్రకాష్ రెడ్డి లు నన్ను బాధ్యత తీసుకోమన్నారు. నేను కాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ని వన్డే సెమినార్స్ ని జత చేశాను. అట్లా మొట్టమొదటి ఫిల్మ్ క్లబ్ మా ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో మొదలు పెట్టాను. అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్, అధ్యాపక మిత్రులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ మనోహర చారి, డాక్టర్ కోట మురళి, తోట రమేశ్, డాక్టర్ దామోదర స్వామి తదితర మిత్రులు సహకరించారు. నేను పనిచేస్తున్న నా కాలేజీ కావడంతో సత్యజిత్ రే ఫిల్మ్ క్లబ్ పేర ఏర్పాటు చేసిన ఆ క్లబ్ విజయవంతమయింది. ఆ రోజు నేను వర్స్క్ షాప్ లో భాగంగా ‘ORIGIN AND EVOLUTION OF CINEMA” పేర పవర్ పాయింట్ ప్రేసెంటేషన్ తో కూడిన లెక్చర్ ఇచ్చాను. అది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందులో లూమియర్ బ్రదర్స్ నిర్మించిన మొట్ట మొదటి సినిమాల క్లిప్పింగ్స్ తో పాటు ఆధునిక సినిమాల క్లిప్స్ తో కలిపి చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. నాలో గొప్ప ధైర్యం పెరిగింది.  ఒక్కో కాలేజీ లో ఒక్కో అనుభవం. కరీంనగర్ తర్వాత కాకినాడ పీ.ఆర్. కాలేజీకి వెళ్ళాను. అక్కడి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సత్యనారాయణ ఎంతగానో ఉత్సాహం చూపించారు. ప్రతిష్టాత్మకమయిన కాలేజీలో క్లబ్, సెమినార్ల పట్ల విద్యార్థులు అధ్యాపకులు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. సెమినార్ కేవలం ఉపన్యాసంగా కాకుండా ఫీడ్ బాక్ సెషన్ తో ఉత్సాహంగా జరిగింది. చివరన ఫెడరేషన్ అందించిన ఫిల్మ్ డీవీడలను ప్రిన్సిపాల్ స్వీకరించారు. తర్వాత రాత్రి తిరుగు ప్రయాణానికి బయలుదేరుతుండగా కాకినాడలో పనిచేస్తున్న మా ఇందిర కజిన్ బ్రదర్ శ్రీ శ్రీనివాస్ స్టేషన్ కు వచ్చాడు. కాకినాడ స్వీట్స్ తో. అట్లా ఆ ప్రయాణం, క్లబ్ ప్రయత్నం ఉత్సాహంగా గడిచింది. తర్వాత నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయం లో క్లబ్ ఏర్పాటు సెమినార్ జరిగాయి. మేనేజిమెంట్ ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ డాక్టర్ అపర్ణ ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ అపర్ణ గారు నాకు ఉస్మానియా యూనివర్సిటీ లో రెఫ్రెషర్ కోర్సులో సహ పార్టీసిపెంట్. తనతో పాటు తెలుగు ఆచార్యులు డాక్టర్ త్రివేణి తదితరులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరందరికి  తోడు నిజామాబాద్ సినీ క్లబ్ భాధ్యుడు శ్రీ రామస్వామి గారు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత డాక్టర్ పొన్నా శ్రీనివాస్ చొరవతో వరంగల్ జిల్లా వడ్డేపల్లి పింగిల్ విమెన్స్ కాలేజీలో క్లబ్ ఏర్పాటయింది. ప్రిన్సిపాల్ ప్రసాద్ రావు, అధ్యాపకులు విజయ కుమార్, సంధ్య, రేవతి లతో పాటు వరంగల్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి శ్రీ నాగభూషణం కూడా హాజరయ్యారు.అర్థవంతమయిన సినిమా గురించి మంచి చర్చ జరిగింది. ముఖ్యంగా విద్యార్థినులు బాగా స్పందించారు. తర్వాత కర్నూల్ కేవీయార్ డిగ్రీ కాలేజీలో ఫిలిం క్లబ్ తో పాటు పర్యావరణం మీద కూడా సభ ఏర్పాటు చేశారు. ప్రముఖ రచయిత దర్శకుడు శ్రీ అక్కినేని కుటుంబ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లబ్ కార్యదర్శి నారా విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ వినీల కుమారి పాల్గొన్నారు. మంచి సినిమాలు మంచి పర్యావరణం సమాజానికి ఎంత అవసరమో కుటుంబరావుగారు విస్తృత ఉపన్యాసం చేశారు. నేను నా ప్రేసెంటేషన్ ఇచ్చాను. ఆడంబరంగా జరిగింది. ఇక హైదరబాద్ బేగంపేట్ మహిళా డిగ్రీ కాలేజీలో మా చిన్ననాటి మిత్రుడు లైబ్రెరియన్ శ్రీ ఎడ్ల రాజేందర్ చొరవ చూపారు. ప్రిన్సిపాల్ శ్రే వెంకన్న అధ్యక్ష్తత వహించారు. సెమినార్ తర్వాత శ్రీబి.నరసింగ రావు రూపొందించిన మావూరి, సిటీ,ఆకృతి డాక్యుమెంటరీ సినిమాల్ని ప్రదర్శించాము. మావూరు సంగీతం దృశ్యాలు విద్యార్థుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

తర్వాత మేదక్ జిల్లా సిద్దిపేటలో క్లబ్ ఏర్పాటయిది. ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కాలేజీలో సాహిత్య కార్యక్రమాలతో పాటు సినిమా కార్యక్రమాలూ జరగాలన్నారు. ప్రిన్సిపాల్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాలేజీలో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం లో ఏర్పాటయిన సృజన ఫిల్మ్ క్లబ్ లో విజాగ్ ఫిల్మ్ సొసైటీ మిత్రులు నారవ ప్రకాష్ రావు, రమణ లతో పాటు ప్రిన్సిపాల్ డాక్టర్ మూర్తి గారు మాట్లాడారు. ఇక ఖమ్మం లో ఎస్.ఆర్.బీజీ ఎన్ ఆర్ కాలేజీలో మా పూర్వ సహచరుడు డాక్టర్ ఎస్. మాధవ రావు గారు ఎంతో చొరవ చూపారు. గతంలో ఖమ్మం ఫిల్మ్ క్లబ్ బాధ్యుడిగా వున్న శ్రే సతీష్ క్లబ్ నిర్వహణ తీసుకున్నారు. సెమినార్ తర్వాత తనికెళ్ళ భరణి గారి బ్లూ క్రాస్’, అబ్బాస్ ఖైరోస్తమి వేర్ ఇస్ ద ఫ్రెండ్స్ హోంసినిమాల్ని ప్రదర్శించాం.తర్వాత ఒంగోల్ కు వెళ్ళాను అక్కడ ప్రిన్సిపాల్ మొదట వేసిన ప్రశ్న కమీషనేరేట్ వాళ్ళకు ఒంగోల్ లో కాలేజీ వుందని గుర్తుందా అన్నారు. నేకేమీ అర్థం కాలేదు. ఫిల్మ్ క్లబ్ కు ముందు పిల్లలకు సాహిత్యం మీద ఒక లెక్చర్ ఇవ్వమన్నారు. సరే నన్నాను. తర్వాత ఫిల్మ్ క్లబ్ లో నా ప్రేసెంటేషన్ లు నిర్వహించాను.

   అట్లా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర రాయలసీమల్లోని పలు కాలేజీల్లో క్యాంపస్ ఫిల్మ్ క్లాబ్స్ ఏర్పాటు చేశాను. చాలా కాలేజీలు కొన్ని ఏళ్ల పాటు క్లాబ్స్ ని విజయవంతంగా నిర్వహించాయి. తర్వాత నాకు కొంత అనారోగ్యం కావడంతో వాటిని మానిటర్ చేయలేకపోయాను… కేవలం ఇవే కాకుండా పలు చోట్ల పూర్తి స్థాయి ఫిల్మ్ వర్క్ శాప్స్, సెమినార్స్ నిరహించాను. అంతేకాకుండా మాకాలేజీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా నిర్వహించాను… ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను..

సెలవ్.

-వారాల ఆనంద్             

30 July 2023   

100= యాదోంకీ బారాత్
++ వారాల ఆనంద్

భారతీయ సినిమాల్లో మహిళా రచయిత్రులు

Posted on

భారతీయ సినిమాల్లో మహిళా రచయిత్రులు

-వారాల ఆనంద్

బహుశా భారత రాజకీయాల్లోనూ, భారతీయ సినిమా రంగంలోనూ వున్నన్ని మూఢ నమ్మకాలూ, సెంటి మెంట్లూ మరే ఇతర రంగాల్లో కనిపించవు. ఒక రాజ కీయ పార్టీ రైతులగురించి మాట్లాడి విజయం సాధిస్తే మొత్తం పార్టీలన్నీ అదే మాట మాట్లాడతాయి, అట్లాగే సినిమా రంగంలో ఒక ఒరవడిలో సినిమా ఆర్థికంగా విజయం సాధిస్తే ఇక కొంత కాలం అదే మూసలో సినిమాలు నిర్మాణం కావడం ఎస్‌ఏ‌ఆర్‌వి‌ఏ సాధారణం. వాటిమీద జనానికి మొహం మొత్తి అలాంటి ఒకటి రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాతే మరో మూస ఫార్ములా కోసం పాకులాడడం మనం చూస్తూనే వున్నాం, 1980వ దశకం లో ‘మాభూమి’ విజయం తర్వాత ‘ఎర్రమల్లెలు’, ఆ తర్వాత అవే ఎర్ర సినిమాలు ఎన్ని వచ్చాయో మనం చూసాం. అదేవిధంగా బాలకృష్ణ నటించిన ఒక రాయల సీమ ఫ్యాక్షన్ సినిమా విజయం సాధించిన తర్వాత అదే ఫార్ములా తో ఎన్ని తెలుగు సినిమాలు విడుదల అయ్యాయో చూసాం. ఇవి మచ్చుకు కొన్నే. అంతే కాదు ఈ పరిస్థితి కేవలం తెలుగు ప్రాధాన స్రవంతి సినిమాలకే కాదు భారతీయ అన్ని భాషల్లోని ప్రధాన స్రవంతి సినిమాల్లోనూ వుంది. హిందీ సినిమా రంగం కూడా అందుకు ఏమీ మినహాయింపు లేదు. మూడు ఫైట్లు ఆరు పాటలూ అన్న చందంగా అనేక రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు హిందీ లో కూడా అనేకం. అట్లే భారతీయ అన్ని సినిమాల్లో హీరో డైరెక్టర్, హీరో హీరోయిన్ ల కాంబినేషన్ అన్న ఫార్ములా కూడా వుంది. ఇట్లా పలు చిత్ర విచిత్ర మయిన అంధ విశ్వాసాలతో హిందీ సినిమా కూడా కునారిల్లుతూనే వుంది. అయితే హిందీ సినిమా విస్తృతి పెద్దది కనుక ఆ ఫార్ములా ఒరవడిలో అది కొట్టుకుపోతున్నా అప్పుడప్పుడూ కొంత భిన్న మయిన సినిమాలు హిందీలో వస్తూనే వున్నాయి. ఆర్ట్ సినిమాలూ, వాస్తవిక సినిమాలూ కనుమరుగయినప్పటికీ సబ్జెక్ట్స్ లోనూ, మేకింగ్ లోనూ కొంత భిన్నమయిన సినిమాలు హిందీ లో అప్పుడప్పుడూ కనిపిస్తూనే వున్నాయి. అందుకే హిందీ సినిమా రంగంలో ఇట్లా వచ్చి విడుదలై కోట్లు కొల్లగొట్టి అట్లా ప్రేక్షకుల మనసుల్లోంచి మాయమయి పోయే సినిమాలకు సమాంతరంగా నాలుగు కాలాలపాటు చూపరులకు గుర్తుండే కొన్ని మంచి సినిమాలు కూడా తయారవుతూనే వున్నాయి. విజయవంతమవుతూనే వున్నాయి. మంచి సినిమా చూసామన్న అనుభూతిని ప్రేక్షకుల్లో మిగులుస్తున్నాయి. సామాజిక మానసిక అంశాల్ని కూడా ఇలాంటి ‘అవుట్ ఆఫ్ బాక్స్’ సినిమాలు తడుముతూనే వున్నాయి. అలాంటి కనీస అర్థవంతమయిన సినిమాలు హిందీ టి‌హెచ్‌ఓ సహా పలు ఇతర భారతీయ భాషా సినిమా రంగాల్లో వస్తూనే వున్నాయి.

ఇలాంటి అవుట్ ఆఫ్ బాక్స్ సినిమాలు రావడానికి ప్రధానంగా భిన్నమయిన కథ, వినూత్నమయిన స్క్రీన్ ప్లే, అవుట్ ఆఫ్ ది ట్రాక్ ఫిలిం మేకింగ్ లు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇలా భారతీయ సినిమా విలక్షణతను సంతరించుకుని దాని ముఖ చిత్రం మారుతూ వుండడం మనం గమనించ వచ్చు. ఆ స్థితికి ప్రధానంగా కొంత మంది విలక్షణ మహిళా రచయిత్రులు స్క్రీన్ రైటర్లు రంగంలోకి రావడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాలుగా పలువురు మహిళా రచయితలు పలు విజయవంతమయిన అర్థవంతమయిన సినిమాల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. అలా ఏ‌ఏ మధ్య వచ్చిన

‘మంటో’, ‘మన్ మర్జియా’, గల్లీ బాయ్ లాంటి సినిమాల రచయిత్రులు దర్శకుల గురించి ఒకసారి మాట్లాతుకుందాం.

కనికా ధిల్లాన్:

అమృత్సర్ లో పుట్టిన కనికా మంచి రచయిత్రిగా ఎదిగింది. బాంబే డక్ ఈస్ అ ఫిష్, శివ అండ్ ద రైస్ ఆఫ్ షాడోస్, ద డాన్స్ ఆఫ్ ద దుర్గా (Bombay Duck is a Fish, Shiva and the Rise of the Shadows,The Dance of Durga, లాంటి నవలలు రాసారు. అమె మొదట రెడ్ చిల్లీ లో పని చేస్తూ ‘ఓం శాంతి ఓం’ కి సహాయ దర్శకురాలిగా పని చేసింది, తర్వాత రావన్, సైజ్ జీరో, మాన్ మర్జియా లకు స్క్రిప్ట్ రచన చేసింది.ఇటీవల కేదార్ నాధ్ , మెంటల్ హై క్యా లకు కథ స్క్రీన్ప్లే సంభాషణలు రాసింది. విజయవంతమయిన రచయిత్రిగా నిలద దొక్కుకుంది.

జుహీ చతుర్వేది:

1975లో లక్నోలో జన్మించిన జుహీ లక్నో లోనే డిగ్రీ పూర్తి చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా లో చేరింది. తర్వాత 1996 లో ధిల్లీ లో అడ్వర్టైస్ మెంట్ కంపనీలో చేరింది. తర్వాత అక్కడే తన మొదటి సినిమా ‘విక్కీ డోనార్’ సినిమా స్క్రిప్ట్ రాయడం ఆరంభించింది. విక్కీ డోనార్ కు రచయిత్రి గా, ‘మద్రాస్ కెఫే’ కు సంభాషణలు, ‘పీకూ’, ‘అక్టోబర్’,’స్కై ఈస్ పింక్’ సినిమాలకు రచయిత్రిగా పని చేసి అద్భుతమయిన సినిమాల్ని అందించింది.ఆమె విక్కీ డోనార్ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు ను అందుకుంది.

కొంకణ సేన్ శర్మ:

ప్రముఖ బెంగాలి నటి అపర్ణ సేన్ కూతురు అయిన కొంకణ మొదట మంచి నటి గా గుర్తింపు పొందింది. రెండు జాతీయ అవార్డులు, నాలుగ్ ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. ఇక రచయిత్రిగా దర్శకురాలిగా కొంకణ ‘ ఎ డెత్ ఇన్ ద గంజ్’ తో ఆమె ప్రతిభను నిరూపించింది.

అలంకృతా శ్రీవాస్తవ :

ధిల్లీ లో జన్మించిన అలంకృత ప్రకాష్ ఝా తీసిన ‘గంగా జల్’, ఖోయా ఖోయా చాంద్, ‘రాజనీతి’ లాంటి సినిమాలకు సహాయ దర్శకురాలిగా పని చేసి తన మొదటి సినిమా ఆమె ‘టర్నింగ్ 30’ రూపొందించింది. తర్వాత ఆమె తీసిన’ లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ ఎంత చర్చనీయాంశ మయిన సినిమాగా నిలబడిందో చూసాం. తర్వాత ఆమె ‘దోలి కిట్టీ అవుర్ చమక్తే సితారే’, ‘మెర్ ఇన్ హెవెన్’ సినిమాలు రూపొందించి ఆమె ఈ సినిమాలకు రచయిత్రి దర్శకురాలిగా పనిచేసారు.

గౌరీ షిండే:

పూనే లో పుట్టి పెరిగిన గౌరీ షిండే ముంబై లి సిద్దార్థ్ ఖక్ దగ్గర సహాయ దర్శకురాలిగా పని చేసింది. తను తన మొట్ట మొదటి సినిమా గా ‘ ఇంగ్లీష్ వింగ్లిష్’ రూపొందించింది. కథా రచన,స్క్రీన్ప్లే, దర్శకత్వ భాధ్యతల్ని తానే నిర్వహించింది. ఆ సినిమా శ్రీదేవి చలనచిత్ర కారీర్ కు పునర్ ఆరంభం పలికింది. తర్వాత షారుఖ్ ఖాన్, అలియ భట్ నటించిన ‘డియర్ జిందగీ’ సినిమాకు కూడా ఆమె కథా రచన,స్క్రీన్ప్లే, దర్శకత్వ భాధ్యతల్ని నిర్వహించింది. ఆ రెండు సినిమాల్ కథలు విలక్షనతను సంతరించుకున్నాయి.రచయిత్రి గానూ దర్శకురాలిగాను షిండే ఇవ్వాళ హిందీ రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందింది.

జోయా అక్తర్ :

జావేద్ అక్తర్, హనీ ఇరానీ ల కూతురయిన జోయా న్యూ యార్క్ లో చదువుకున్నారు.మీరా నాయర్ లాంటి వాళ్ళ దగ్గర సహాయకురాలిగా పని చేసారు.’లక్ బై చాన్స్’, ‘జిందగీ న మిలేగి దోబారా’, ‘బాంబే టాకీస్’, ‘గల్లీ బాయ్’ లాంటి సినిమాలు భిన్నంగా రూపొంది జోయా కు మంఛి పేరు తెచ్చాయి.‘దిల్ దడఖ్ నే దో’, ‘లాస్ట్ స్టోరీస్’ లాంటి సినిమాలు కూడా జోయా రూపొందించి ప్రతిభ కల దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. తను దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు జోయా రచన భాధ్యతలు కూడా నిర్వహించారు.

నందితా దాస్:

1969 లో పుట్టిన నందితా దాస్ 40 కి పైగా సినిమాల్లో నటించారు.దాదాపు అన్ని భారతీయ భాషల్లో నటించిన నందిత దర్శకురాలిగా మొట్ట మొదట 1988 లో ‘ఫిరాఖ్’ తో ఆరంభించింది.ఫిరాఖ్ గుజరాత్ హింసాకాండ గురించి నిజాయితీగా తీసిన సినిమా గా నిలిచింది. అనేక వాస్తవ కథల్ని 24 గంటల సమయంలో పరస్పర సమన్వయంతో నిర్మించారీ సినిమాను. గత ఏడాది నందిత ‘మంటో’ సినిమా రూపొందించింది. సుప్రసిద్ధ రచయిత బియోపిక్ గా రూపొందిన మనతో దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది.

జీనత్ లఖాని:

జీనత్ లఖాని దర్శకురాలిగా మొట్టమదటి సినిమా షాదీ కే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ .విద్యా బాలన్, ఫర్హాన్ అక్ష్టార్ లు ప్రధాన భూమికల్ని పోషించారు. 2017 లో జీనత్ లఖాని రచన బాధ్యతల్ని నిర్వహించిన సినిమా ‘హిందీ మీడియం’, ఇర్ఫాన్ ఖాన్, సబా ఖమర్ లు ప్రధాన పాత్రల్ని పోషించారు. సామాజిక కోణం లోంచి వర్తమాన విద్యా వ్యవస్థను తూర్పార పట్టిన సినిమా గా హిందీ మీడియం నిలుస్తుంది.

అన్వితా దత్ గుప్తన్:

అన్విత ప్రధానంగా సంభాషణలు, పాటల రచయిత్రిగా పేరెన్నిక గన్నది.రచయిత్రిగా ఆమె రాసిన సినిమాలు ‘శాందార్’, ‘ఫైల్లౌరీ’ లు రోడ్ద కొట్టుడు సినిమాలకు భిన్నమయిన సినిమాలుగా నిలిచాయి.

కామ్నా చంద్ర:

కామ్నా చంద్ర గతంలో పలు మంచి ప్రేమకథా చిత్రాలకు రచనలు చేసారు. ‘1942-లవ్ స్టొరీ’ లాంటి సినిమాలకు ఆమె రచన చేసారు. ఇటీవలి కాలంలో ఆమె రచన చేసిన సినిమా ‘ఖరీబ్ ఖరీబ్ సింగల్’

ఇట్లా అనేక మంది మహిళా రచయిత్రులు భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తున్నారు. కొత్త దానాన్ని అద్ది సరికొత్త సినీ భాష్యాన్ని లిఖిస్తున్నారు. వారి కృషిలో నిర్మాణ మయిన సినిమాల్ని చూస్తె భారతీయ సినిమాకు ఇంకా సొంత గొంతుకతో పాటు సొంత స్టైల్ కూడా వుందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మహిళా రచయిత్రులు, దర్శకుల్లో అధిక శాతం మంది 1970 లలో జన్మించిన వల్లే కావడం గమనించ దగ్గ అంశం అంటే కొత్త తరం కొత్తగా ఆలోచిస్తుందని,సరికొత్త ఆవిష్కరణలకు దారులు వేస్తుందని అవుటాఫ్ ద బాక్శ్ సినిమాల్ని రూపొందిస్తారని విదితమవుతుంది.

భారతీయ సినిమాల్లో మహిళా రచయిత్రులు

జావేద్ అఖ్తర్- కవిత్వం లో ఓ లౌకిక స్వరం

Posted on

జావేద్ అఖ్తర్- కవిత్వం లో ఓ లౌకిక స్వరం

++++++ వారాల ఆనంద్

జావేద్ అఖ్తర్ ప్రతిభావంతమయిన కవి. వక్త, స్క్రీన్ ప్లే రచయిత.

సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్నసామాజిక గొంతుక ఆయనది.

ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమయిన స్వతంత్ర లౌకిక స్వరం జావేద్ అఖ్తర్.

భావుకుడూ, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించాడు. జావేద్ తండ్రి జాన్ నిసార్ అక్తర్ ప్రముఖ ఉర్దూ కవి సినీ గీత రచయిత. జావేద్ అఖ్తర్ తాత ముజఫర్ ఖరబాది కవిత్వం ఉర్దూ సాహిత్య ప్రపంచంలో మైలురాయి లాంటిదని భావిస్తారు. ఇంకా జావేద్ మేనమామ మజాజ్ కవిత్వం కూడా ఉర్దూ లో ప్రముఖ మయిందే. జావేద్ అక్తర్ తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకూ వ్యతిరేకంగా రాసాడు. జాతీయ సమక్యత, స్త్రీల హక్కులకోసం మాట్లాడాడు రాసాడు. తప్పు దోవ పట్టిన యువతనుద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995 లో కేండ్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది.

జావేద్ అఖ్తర్ 1980లో సీరియస్ గా కవిత్వం రాయడం ఆరంభించాడు. ఆయన 1995 లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘టార్ఖాష్’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమానుల్నుంచి విమర్శకులనుంచి ప్రశంసల్ని అందుకుంది.ఇప్పటికే అది హిందీలో 10, ఉర్దూలో అయిదు ముద్రణలు పొందింది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్ గా కూడా ప్రాచుర్యం పొందింది.

గ్వాలియర్ లో పుట్టిన జావేద్ లక్నో అలిఘర్, భూపాల్ లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిది బాగా విస్తారమయింది. చిన్నప్పుడు ఆయన జీవితం చాలా చిత్రంగా గడిచింది. తండ్రి బాంబే లో ఉండేవాడు. తల్లి అప్పటికే మరణించింది. జావేద్ తన అమ్మమ్మ తాతయ్యల దగ్గర లక్నోలో పెరిగాడు. నెలకు 15 రూపాయల జీతం మీద చదువు చెప్పే ట్యూషన్ మాస్టర్ వద్ద చదువు నేర్చుకోవడం మొదలు పెట్టాడు. తనకు రోజూ ఉదయం ఆఠాణ, సాయంత్రం ఒక అణా ఇచ్చేవారని వాటితో ఉదయమే రాంజీ లాల్ షాపులో రంగుల మిఠాఈలు సాయంత్రం భగవతీ షాపులో చాట్ తినేవాన్నని జావేద్ ఒక చోట రాసుకున్నాడు. కనీసం మెట్రిక్ అన్నా పూర్తిచేయి పోస్ట్ ఆఫీసులో చిన్న ఉద్యోగామయినా దొరుకుతుంది అనేవాడు జావేద్ తాత. తర్వాత జావేద్ ను ఆయన అత్తగారి వూరయిన అలిఘర్ పంపించారు. ‘ వీడిని జాగ్రత్తగా చూడండి..వీడికి చదువుకంటే సినిమా పాటలంటే ఎక్కువ ఇష్టం’ అక్కడ స్కూల్లో చేర్పిస్తూ మామ టీచర్ తో అన్నాడంట. ఎందుకంటే అప్పటికే జావే కి ‘ఉరన్కా ఠోళా’, ‘శ్రీ 420’ లాంటి సినిమాల పాటలతో పాటు అనేక పాటలు నోటికి వచ్చేవంట. తర్వాత కొంత కాలం భూపాల్ లో తన సవతి తల్లి ఇంట్లో వున్నాడు. కాని అక్కడ ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేక మిత్రులతో కలిసి ఉంటూ కాలేజీ చదువుని పూర్తి చేసాడు. అప్పుడే మిత్రుడు ముస్తాక్ ద్వారా దేశ విభజన గురించీ అప్పుడు జరిగిన అరాచకాల గురించీ విన్నాడు.

తర్వాత అక్టోబర్ 1964 బాంబే చేరుకుని తండ్రి వద్ద వున్నాడు. కానీ కేవలం వారం తిరగ కుండానే ఇల్లు వదలాల్సి వచ్చింది. జేబులో 25 పైసలున్నాయి రెండేళ్ళ పాటు అష్ట కస్తాలు పడ్డాడు ఒక చిన్న సినిమాకు మాటలు రాసి వంద రూపాయలు సంపాదించాడు. అనేక సార్లు పలువురికి సహాయకుడిగానూ, ఘోస్ట్ రచయితగానూ పనిచేసాడు. సంవత్సరానికి పైగా కమల్ స్టూడియో లో వున్నాడు జావేద్. అందులో ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు. అప్పుడే అంధేరీ లో వున్న ఒక సెకండ్ హాండ్ బుక్ స్టాల్ వాడి పరిచయం తో జావేద్ చదివెందుకు పుస్తకాలకు కొదువ లేకుండా పోయింది.తర్వాత కొంతకాలం మిత్రుడు జగదీష్ తో కలిసి బాంద్రాలో మహాకాళి కేవ్స్ లో వున్నాడు. అప్పుడే తన విజయవంతమయిన పార్టనర్ సలీం ఖాన్ తో స్నేహం ఏర్పడింది. ప్రధాన స్రవంతి హిందీ సినిమాలకు ఒక సరికొత్త దారి చూపిన వాడు జావేద్. ఆయన తన మిత్రుడు సలీం ఖాన్ తో కలిసి రాసిన స్క్రీన్ ప్లే లు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయవంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది.దాన్నే సినిమా భాషలో ‘బ్రేక్ ‘ అంటారు. ఆ జంట రాసిన మొట్ట మొదటి సినిమా ‘హాతీ మేరె సాథీ’. ఒక రోజు రాజేష్ ఖన్నా వారి దగ్గరికి వెళ్లి దక్షినాది సినీ నిర్మాత అయిన దేవన్ ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు..మంచి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.. దాంతో నేను హీరో రాజ్ కుమార్ కు చెందిన బిల్డింగ్ అమ్మకానికి వస్తే అడ్వాన్స్ ఇచ్చేసాను.. కానీ స్క్రిప్ట్ చూస్తే ఘోరంగా వుంది.. అది చేస్తే ఇక దాంతో నా ఫిలిం కారీర్ అంతే సంగతులు..అందుకే దాన్ని సరిచేయండి.. ఇంటికిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వరు. ఎట్లాగయినా చేసి ఈ స్క్రిప్ట్ ను మెరుగు పరచండి లేదా తిరగ రాయండి అని కోరుకున్నాడు. వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తీసిన ‘హాతీ మేరె సాథీ’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సలీం జావేద్ ల జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్ గా మారింది.

ఆ తర్వాత సీతా అవుర్ గేత సమయంలో జావేద్ అఖ్తర్ కి హనీ ఇరానీ తో పరిచయం కావడం అది పెళ్లిదాకా వెళ్ళింది. ఇద్దరు ఒకటయ్యారు. వారిద్దరికీ జోయా, ఫర్హాన్ లు జన్మించారు.

జావేద్ అఖ్తర్ తండ్రి జాన్ నిసార్ 18 ఆగస్ట్ 1976న మరణించాడు. చనిపోతూ తన చివరి పుస్తకాన్ని జావేద్ కి ఇస్తూ దాని పై ఇట్లా రాసాడు’నేను వెళ్లి పోయిన తర్వాత నన్ను గుర్తు చేసుకుంటావు..

’అప్పటిదాకా తండ్రి పట్ల సానుకూలంగా లేని జావేద్ కన్నీటి పర్యంతం అయ్యాడు.1979 తన మొదటి కవిత రాసాడు.అప్పుడే జావేద్ కి షబానా ఆజ్మీ తో పరిచయం ఏర్పడింది. కైఫీ ఆజ్మీ కూతురు అయిన షబానా కు కూడా అప్పుడే జీవితం పట్ల అనేక ప్రశ్నలు, అనుమానాలూ వస్తున్న సమయం అది. అప్పుడే వారిద్దరి నడుమా సాన్నిహిత్యం పెరిగింది. 1983లో హనీ ఇరానీ, జావేద్ లు విడిపోయారు. కానీ స్నేహంగానే వున్నారు పిల్లలు ఇద్దరు కూడా తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెంచుకోలేదు. జావేద్ షబానా ల జీవితం సాఫీగానే సాగుతున్నది.

జావేద్ అందుకున్న అవార్డులకు లెక్కేలేదు. ఆయన సినిమా పాటలకు అయిదు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. నాలుగు సార్లు ఫిలిం ఫేర్, జీ,ఐఫా అవార్డులు లభించాయి. జాతీయస్థాయిలో పద్మభూషణ్,అవధ రత్న, జాతీయ సమగ్రత లో ఇందిరా గాంధీ అవార్డు లభించాయి.ఆయన హార్వార్డ్, కొలంబియా,బర్కిలీ, మేరీ లాండ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్, జే.ఎన్.యు., అలీ ఘర్, విశ్వభారతి లాంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించారు.

అట్లా జావేద్ కారీర్ కవిగానూ, సినిమా పాటల రచయితగానూ, స్క్రిప్ట్ రైటర్ గానూ ఎదుగుతూ వచ్చింది.

ఫలితంగా సలీం-జావేద్ లు జంట గా అందాజ్, సీతా అవుర్ గీతా, యాదోన్కీ బారాత్, జంజీర్,దీవార్, షోలే..డాన్, త్రిశూల్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు హిందీ సినిమాలకు ‘ఆంగ్రీ యంగ్ మాన్’ అన్న పాత్రను అందించింది. అప్పటి ఆ విజయాల మీద అంగ్రీ యంగ్ మాన్ కారెక్టర్ మీద పరిశోదనలు కూడా జరిగాయి. వాళ్ళు రాసిన 24 సినిమా స్క్రిప్తుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆజంట విడిపోయింది. 1981 సలీం జావేద్ ల జంట విడిపోయాక జావేద్ అఖ్తర్ చాలా సినిమాలకు స్క్రిప్ట్ రచన చేసాడు.వాటిల్లో సాగర్, మిస్టర్ ఇండియా, బెతాబ్, లక్ష్య లాంటి విజయవంతమయిన సినిమాలకు రాసాడు.

తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం లిరిక్స్ వైపు కదిలాడు.ఆయన రాసిన సినీ గీతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే కైఫీ ఆజ్మీ ఒక చోట ఇట్లా అంటాడు.. ’మొదట సమాధి తవ్వి తర్వాత దానికి సరిపడే శరీరాన్ని వెతకడం సినీ గేయ రచయితల పని’ అయితే జావేద్ అఖ్తర్ తనసినీ గీతాలతో అద్భుతమయిన రూపాల్ని చిత్రించాడు.సినీ గీత రచయితగానే కాకుండా జావేద్ అఖ్తర్ గొప్ప కవి. ఆయనరాసిన కవితలు గజల్ సూటిగా స్పష్టంగా మనసుకు హత్తుకుంటాయి. ఆయన కవితా సంకలనాలు ‘టర్కష్’ 1995 లో వచ్చింది, తర్వాత ‘లావా’ 2012 లో వెలువడింది. లావా కు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్ ఆదర్ వర్డ్స్’

అందులో ఆయన కాలాన్ని గురించి..

కాలమంటే ఏమిటి,

అలుపూ విరామమూ లేకుండా

సాగిపోతున్నది

అడట్లా ప్రయానిన్చాకుండా వుంది వుంటే

అదేక్కడుండేది

ఎక్కడో ఒక చోట వుండేది కదా… అంటూ గొప్ప తాత్వికత తో రాస్తాడు.

…..

ఇట్లా ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మనుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల్నుండి పెల్లుబుకుతుంది.

ఈ సంకలనం నిండా వర్తమాన అవ్యవస్థ గురింఛి తనకోపమూ, తన తాత్వికత, వేదన దుఖం, ప్రశ్న జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించాడు జావేద్ అఖ్తర్. తన కవిత్వం నిండా వర్తమాన మత చాందస వాదం గురించీ ఖండిస్తూ రాసాడు. మాట్లాడాడు. ప్రశించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించాడు జావేద్.

ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి,కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించాడు.

*********

సశేషం +++ వారాల ఆనంద్

Posted on

సశేషం

+++ వారాల ఆనంద్

దూరం తరగదు

కాలం నిలవదు

చీకటి ముగియదు

వెలుతురు తెమలదు

గాయం మానదు

భారం తొలగదు

నడక ఆగదు

అలసట తెలియదు

పరదా దిగదు

నాటకం ముగియదు

ఏది ఎక్కడ నిలుస్తుందో

ఎప్పుడు ముగుస్తుందో

ఇప్పటికిది

సశేషం

********

సశేషం +++ వారాల ఆనంద్

అనువాదం గొప్ప అనుసృజన

Posted on

అనువాదం గొప్ప అనుసృజన
++++
భాషా సంస్కృతులు తమదయిన శూన్యంలో పుట్టవు, పెరగవు.
కవులూ రచయితలూ అంతే.
తమదయిన స్వీయ సృజనతో పాటు ఇతర భాషలను చదవడం నేర్చుకోవడం, ఆయా భాషల్లో సాహిత్యాల్లో వస్తున్న సృజనాత్మక మార్పుల్ని గమనించడం అనివార్యమయిన అధ్యయనం. దానితోటే భాషాభివృధ్ధి తో పాటు సాహిత్యాభివృధ్ధీ సాధ్యమవుతుంది. కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేసి చూస్తేనే కొత్త భాష వినిపించే మన దేశంలో భాషా సాహిత్యాల మధ్య ‘ఆదాన్ ప్రదాన్’ అత్యంత ముఖ్యమయినది. అది సాధ్యం కావడానికి ఆయా భాషల నడుమ అనుబంధం వాటి మధ్య అనువాదం అత్యంత అవసరమయిన ప్రక్రియ. అట్లని అనువాదం కేవలం భాషానువాదం కాదు. అది మొత్తంగా ఆ ప్రాంత జనజీవన సాంస్కృతిక ప్రతిబింబమయి వుండాలి. అందుకే అనువాదం అన్నది గొప్ప అనుసృజన.
రెండు భాషలకూ, రెండు వ్యక్తీకరణలకూ, రెండు సంస్కృతులకూ నడుమ ‘అనువాదం’ ఓ అక్షరాల వారధి
అది ఓ గొప్ప భావానుబంధం. సమస్త మానవాళి జీవితాల్నీ, జీవనానుభవాల్నీ ఏకం చేసే ఓ సాంస్కృతిక వేదిక. అందుకే సాహిత్య చరిత్ర లో అనువాదకుడి పాత్ర విలక్షణమయింది, విశిష్టమయిందీ కూడా.

“ ఇన్నేళ్లుగా కళాత్మక సినిమా, కవిత్వమూ అంటూ తిరిగిన నిన్ను ఈ అనువాదం ఎట్లా ఆకర్షించింది, ఏందీ కథ” అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. తాను అట్లా అడిగే సరికి అవును కదా అని నేనూ ఆలోచనలో పడ్డాను. నా మాతృభాషకూ ఇతర భాషలకూ ఎట్లా కుదిరింది ఎక్కడ మొదలయింది అని నా గతంలోకి వెళ్ళాను. నా చిన్నప్పుడు చుట్టూ అందరూ వున్నా తీవ్రమయిన ఒంటరితనంతో మా అమ్మా నాన్నే లోకంలా గడిపాను. మా ఇంటికి ఎదురుగా వున్న విజయలక్ష్మి హోటల్లో ఒక రేడియో వుండేది. అందులో ఎక్కువగా హిందీ పాటలే పెట్టేవాళ్లు. మానాన్న వాళ్ళ మిత్రులు అక్కడ ఆ పాటల్ని వింటూ పాడుతూ వుండేవాళ్లు. నేను కొంచెం ఎదిగే సమయానికి నాకు గుర్తున్న మేరకు మా నాన్న వారాల ఆంజయ్య వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే అయినప్పటికి హిందీ పాటలన్నా, ఉర్దు పుస్తకాలన్నా బాగా ఇష్టంగా వుండేవాడు. తాను స్వయంగా గొంతెత్తి పాటలు పాడేవాడు. తలత్ మహమూద్ అన్నా నటుడు దిలీప్ కుమార్ అన్నా ఆయనకి బాగా ఇష్టంగా వుండేది. ఒక రోజు ‘ఏ హవా ఏ రాత్ ఏ చాందినీ, తేరీ అదాపే నిసార్ హై’ అంటూ నాన్న పాడటం విని అట్లా అంటే ఏంది నాన్నా అర్థం ఏంది అని అడిగాను. ఆయన నవ్వి ఒక్కో పదానికి తెలుగులో అర్థం చెప్పడం మొదలు పెట్టాడు. నాకు కొంచెం అర్థం అయ్యీ కొంచెం కాలేదు. అవి హిందీ లోంచి నా మాతృభాష తెలుగులోకి నేను నేర్చుకున్న మొదటి మాటలు, పాఠాలు. ఇవన్నీ అర్థం కావాలంటే హిందీ బాగా చదవాలిరా అన్నాడు నాన్న. అప్పటికి భాషల గురించి నాకు వేరే ఏమీ తెలీదు. కానీ వేరే ఒక భాష లోని మాటల్ని అర్థం చేసుకోవడానికి వాటిని మన మాతృభాషలోకి మార్చుకోవాలని అనిపించింది. బహుశా నేనే కాదు అందరూ వేరే ఇతర భాషను అర్థం చేసుకోవడానికయినా తప్పకుండా తమ మాతృభాషలోకి మార్చుకోవాల్సిందే. ఖుషీ అనగానే సంతోషం అనీ, సాడ్ అనగానే దుఖం అనీ తెలిసిపోతుంది. అదంతా లోపల మనకు తెలియకుండానే అప్రయత్నంగానే జరిగిపోతుంది. కొత్త భాషను అర్థంచేసుకునే క్రమంలో జరిగే మేధోపరమయిన సమన్వయం అది. అదంతా అప్పుడు తెలీదు. కానీ మా యింట్లో రేడియోలో ‘శ్యామే ఘంకీ కసమ్’, ‘తు కహే అగర్’, ‘సుహానా సఫర్’ ఇట్లా అనేక పాటలు వచ్చేవి. నాన్న పాడుతూ వుండేవాడు. వాటితో పాటు ప్రతి బుధవారం బినాకా గీత్ మాల, ప్రతి రోజూ వచ్చే పురానీ ఫిల్మోకా గీత్….అట్లా అన్నీ హిందీ పాటలే. దాంతో నేను హిందీ నేర్చుకోవడానికి స్కూల్లోనూ కాలేజీలోనూ సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. అకాడెమిక్ ప్రోగ్రామ్ లో భాగంగా కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. అట్లా స్కూలు ముగిసే సరికి మూడు భాషల పరిచయం కలిగింది. తర్వాత సైన్స్ చదువుకోవడం ఉద్యోగం లో చేరడం అన్నీ జరిగి పోయాయి. సాహిత్యంతో పరిచయం వున్నప్పటికి ఎపుడయితే ఆర్ట్ సినిమా వైపు ఆసక్తి పెరిగిందో అపుడు ఈ అనువాదం నాకు తెలీకుండానే వచ్చేసింది.‘పథేర్ పాంచాలి’ చూడాలంటే బెంగాలీ రాదు సబ్ టైటిల్స్ పైన ఆధారపడాల్సిందే. అంటే బెంగాలీ మాటల్ని ఇంగ్లీష్ లో చదివి తెలుగులో అర్థం చేసుకోవాలి. బెంగాలీ మాత్రమే కాదు కన్నడ, మరాఠీ, తమిళ్, మలయాళం ఏ ఇతర భాషా సినిమా చూడాలన్నా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పై ఆధారపడ్డమే. అట్లా భాషానువాదం జీవితంలో భాగమయి పోయింది.
2014 తర్వాత సంస్థలు సభలు నిర్వహణ కార్యక్రమాలు మానేశాక సాహిత్యమే జీవితమయి పోయింది. ఆ క్రమంలో తెలుగు కవిత్వమే కాకుండా వివిధ భాషల సాహిత్యం ముఖ్యంగా కవిత్వం చదవడం అలవాటయింది.INDIAN LITERATURE లాంటి పత్రికల్ని పదేళ్లుగా క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తూ వస్తున్నాను. దాంతో పాటు నాకు దశాబ్దాలుగా ఇష్టమయిన గుల్జార్ ను ఫాలో అవడం మొదలు పెట్టాను. జావేద్ అఖ్తర్, సచ్చిదానందన్, జయంత్ మహా పాత్ర, గిరీష్ కర్నాడ్ ఇట్లా అనేక మంది రచనల్ని చదువుతూ వచ్చాను. ‘తెలియంది తెలుసుకోవడం, తెలిసింది పంచుకోవడం మొదటినించీ నాకున్న అలవాటు’ నేను చదివిన కవితల్లోంచి నాకు నచ్చిన వాటిని తెలుగులో రాసుకోవడం మొదలు పెట్టాను. ముఖ్యంగా ఏదయినా ఒక కవిత చదివినప్పుడు అరె ఎంతబాగా రాశారు ఇది నేను రాసి వుంటే ఎంత బాగుండేది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని అనువదించే ప్రయత్నం చేశాను. అప్పుడు గుల్జార్ కవిత్వాన్ని ఆకుపచ్చ కవితలు పేర తీసుకొచ్చాను. అదే క్రమంలో మన తెలుగు వాళ్ళకి ఇరుగు పొరుగు భాషల్లో కవిత్వం ఎట్లా వస్తున్నది. అక్కడి కవులు ఏమి రాస్తున్నారు, ముఖ్యంగా వర్తమాన కవుల రచనలు ఎట్లా వున్నాయి వాటిని పరిచయం చేయాలనుకున్నాను. రూపంలో సారంలో ఆయా భాషల్లో కవిత్వం ప్రత్యేకతలు ఏమిటి? అవన్నీ తెలియయాలంటే వాటిని తెలుగులోకి అనువాదం చేసి అందించడమే అనుకున్నాను. ఆ క్రమంలో గుల్జార్ చేసిన ‘ ఎ పోయెం ఎ డే’ నా కంట పడింది. అది నాకు పెద్ద ప్రేరణ. ఆ క్రమంలోనే కె.సచ్చిదానందన్ సంపాదకత్వం లో వచ్చిన అనేక సంకలనాల్ని తెప్పించుకుని చదివాను. వాటితో పాటు కాశ్మీర్ కు చెందిన అఘా షాహిద్ అలీ, కెనడాలో వుంటున్న రూపి కౌర్, జయంత మహాపాత్ర, అస్సామ్ కు చెందిన నీలీం కుమార్ ఇట్లా వివిధ భారతీయ భాషలకు చెందిన కవుల సంకలనాల్ని చదివాను.
కొన్ని కవితలు అనువాదం చేసి ‘ఇరుగు పొరుగు’ పేర అనువాదాలు చేస్తున్నాను మిత్రమా అనగానే శ్రీ కాసుల ప్రతాప్ రెడ్డి ఆసియ నెట్ లో వారం వారం వేద్దాం అన్నాడు. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ఎంతో సహకరించారు. దాదాపు రెండేళ్లకు పైగా అది కొనసాగింది. తర్వాత వివిధ పత్రికల్లో, ఆన్లైన్ మగజైన్స్ లో, సోషల్ మీడియాలో నేను చేసిన అనువాద కవితల్ని ప్రచురిస్తూనే వున్నాను.
ఇప్పటికి భారత రాజ్యాంగం తన 8వ షెడ్యూల్ లో అధికార భాషలుగా 22 భాషల్ని ఆమోదించింది. కాని మన దేశంలో లిఖిత మౌఖిక భాషలు ఎన్నో వున్నాయి. నేను ఇప్పటికీ 29 భారతీయ భాషల నుంచి 90 మందికి పైగా కవులు రాసిన కవితల్లోంచి 150కి పైగా కవితల్ని అనువదించి ఈ సంకలనంలో చేర్చాను.
ఈ ‘ఇరుగు పొరుగు’ లో వున్న కవితలన్నీ నేను చదివినవి, నాకు నచ్చినవి, నేను అందరితో పంచుకోవాలుకున్నవి మాత్రమే. ఈ ‘ఇరుగు పొరుగు’ నా నిరంతర అనుసృజనా ప్రక్రియ. ఆ క్రమంలో ఇది ఇరుగుపొరుగు మొదటి సంపుటి. నా స్వీయ కవితా రచనతో పాటు అనువాదం కూడా కొనసాగుతుంది.

వారాల ఆనంద్
9440501281
****************

100=యాదోంకీ బారాత్++++ వారాల ఆనంద్

Posted on

100=యాదోంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

“నిన్ను తక్కువ చేసి చూసేవాడూ 

కించపరిచేవాడూ ఉన్నంత కాలం

ఎదుగుదలకు ఎరువు , పరుగుకు వేగం కొరత వుండదు…”.

నా బాల్యంలో మాటలు సరిగ్గా పలుకలేని స్థితిలో ఉమ్మడి కుటుంబంలో ఎదుర్కొన్న అవమానాలూ వెక్కిరింతలూ ఎంతో తీవ్రమయి ఒంటరితనానికి గురిచేశాయి. ఎంతగా అంటే ఏది మాట్లాడాలన్నా ఏది కావాలన్నా అమ్మా, నాన్నే. వారితోడిదే లోకంగా బతికాను. ఇక స్కూల్లో కూడా దామోదర్, వెంకటేశ్వర్ రావు, అయ్యగారి వెంకన్న, చింతకింది వేణు లాంటి ఏ ఒక్కరిద్దరో తప్ప దగ్గరి స్నేహాలు తక్కువే. అయితే చదువులో కొంత మెరుగ్గా వుండడంతో మరి కొంత మంది స్నేహంగా వుండేవాళ్లు. అదే స్థితి కాలేజీ దాకా సాగింది. సెలవుల్లో వేములవాడ వెళ్లినప్పుడు అక్కడి  మిత్రులు నాకెంతో అండగా తోడుగా వున్నారు. ఇక పోతే ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రిన్సిపాల్ శ్రీ కె.వై.ఎల్. నరసింహా రావు గారి హయాంలో జరిగిన కవిసమ్మేళనాలు వంటివి నాకు గొప్ప వూరటనిచ్చాయి. అప్పుడు నాకు సీనియర్ మా అమ్మ తమ్ముడు మేనమామ మంగారి రాజేందర్ సాహచర్యం అప్పుడు వెయ్యేనుగుల బలం. ఇదంతా ఇట్లా వుండగానే నాలో పెరుగుతున్న గుర్తింపు సంక్షోభం (ఐడెంటిటీ క్రైసిస్) లోంచి బయట పడేందుకు నాకు కథలు, కవిత్వంతో పాటు జర్నలిజం కూడా ఎంతో సాయపడింది. అంటే పత్రికలు వాటిల్లో కాలమ్స్ రాయడం, రచనలు చేయడంతో పాటు వార్తలు ప్రత్యేక కథనాలు రాయడం ఇవన్నీ నన్ను నా బలహీనతల్లోంచి ఒడ్డున పడేసాయి.

   అట్లా నాజీవితంలోకి వచ్చిన మొట్టమొదటి పత్రిక “చిత్రిక”. వేములవాడకు చెందిన శ్రీ పురాణం రామచంద్ర ఆ పత్రికను కరీంనగర్ లో ప్రారాభించాడు. అంతకు ముందు తాను ఈనాడుకు రిపోర్టర్ గా చేశాడు. వార పత్రికగా ప్రారంభమయిన ‘చిత్రిక’ కరీంనగర్ లో శాస్త్రీ రోడ్డులోని నాగభూషణం గారి ప్రింటింగ్ ప్రెస్ లో అచ్చయ్యేది. నా మూలాలు కూడా వేములవాడ కనుక పురాణం తో కనెక్ట్ అయ్యాను. నా మొట్టమొదటి కథను ఆయనే  చిత్రికలో వేశాడు. తర్వాత కొన్ని వ్యాసాలు అవీ రాశాను. దాదాపు అప్పుడే వేములవాడలో నటరాజ కళానికేతన్ ఏర్పాటు దాని ఆధ్వర్యంలో ‘నవత’ పత్రిక అలా పత్రికల్తో నాకు సాహచర్యం సన్నిహితత్వం పెరిగింది. సినిమాలు సాహిత్యం కొనసాగుతూనే వుండగానే లైబ్రరీ సైన్స్ చదివి సిరిసిల్లా కాలేజీలో లైబ్రెరియన్ గా ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగం మరీ నిరాదరణ కలిగింది. అప్పుడు కాలేజీల్లో లెక్చరర్లదే హవా. లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్స్ అంటే ఒకింత తక్కువ చూపే వుండేది. జీతాలూ అధ్యాపకులకంటే తక్కువే. దాంతో కాలేజీల్లో ద్వితీయ పౌరసత్వమే ఇచ్చేవాళ్లు. అక్కడా నాకు పోరాటమే. నా రచనలు, సినిమాలు, ఫిల్మ్ సొసైటీ కార్యక్రమాలూ నన్ను నిలబెట్టాయి. ఎంతయినా సృజనకున్న గౌరవం గొప్పది కదా. అదంతా అట్లా సాగుతూ వుండగానే కరీంనగర్ లో శ్రీ బి.విజయకుమార్ నేతృత్వంలో “జీవగడ్డ” సాయంకాలం దిన పత్రిక ఆరంభమయింది. Birds of a feather flock together అన్నట్టు ఒకే ఆలోచనలున్న వాళ్ళం అందరం జీవగడ్డ గూటికి చేరాం. పత్రికలో పనిచేస్తున్న కె.ఎన్.చారి, అల్లం నారాయణ లకు తోడు నేనూ, గోపు లింగా రెడ్డి, నరెడ్ల శ్రీనివాస్ పత్రికలో భాగం పంచుకున్నాం. అందరం వారానికి ఒకరోజు కాలం రాయడం ఆరంభించాం. నేనట్లా రాసిందే ‘మానేరు తీరం’. అక్కడికి నారదాసు లక్ష్మణ రావు, పెండ్యాల సంతోష్, ఎడమ నారాయణ రెడ్డి, కోమటిరెడ్డి దామోదర్ రెడ్డి లతో పాటు ఫిల్మ్ సొసైటీ మిత్రులు సాహితీ మిత్రులంతా క్రమం తప్పకుండా వచ్చేవాళ్లు. అట్లా జర్నలిజంలో జీవగడ్డ నాకు ముఖ్యవేదిక అయింది. దానికి తోడు మా  కఫిసో ‘ఉత్తమచిత్ర’ ప్రచురణ కూడా జర్నలిజంలో భాగంగానే చూశాను.

ఇంతలో ‘ఈనాడు’ దినపత్రికలో జిల్లా స్థాయిలో కల్చరల్ కంట్రీబ్యూటర్ అంటూ సాహితీ సాంస్కృతిక అంశాల్ని కవర్ చేసేందుకు ప్రత్యేకంగా విలేఖరులను తీసుకున్నారు. అప్పుడు శ్రీ ఏ.ఎన్.రాజు జిల్లా విలేఖరి, హైదరబాద్  డెస్క్ లో డాక్టర్ రామకృష్ణ లు వున్నారు. నన్ను రాయమన్నారు. వీలు కాదేమోనన్నాకూడా రాజు గారు ఏముంది సార్ ఖాళీ సమయంలో రాయండి అన్నారు. మనమేదీ దేన్నీ ఆషామాషీగా చూడం, తీసుకోం కదా. అందుకే సీరియస్ గానే రాశాను. అనేక అంశాలు రాశాను. డెస్క్ కూడా సంపూర్ణ సహకారం ఇచ్చింది. డెస్క్ లో సుబ్బారావు లాంటి వాళ్ళు అప్పుడు కరీంనగర్ స్టాఫర్ గా వున్న శ్రీ డి.ఎన్.ప్రసాద్ (ఇప్పుడు ఈనాడు తెలంగాణ సంపాదకులు) ఎంతో స్నేహంగా వున్నారు. దాదాపు 4-5 సంవత్సరాలు రిపోర్టింగ్ చేశాను. ఆ క్రమంలో జిల్లా సాహితీ సాంస్కృతిక రంగంలోని వాళ్లందరి స్నేహం, క్రిటికల్ గా రాసినప్పుడు విమర్శలూ ఎదుర్కొన్నాను. ఒకసారి బెంగళూరు లో జరిగిన తెలుగు మహాసభలకు ప్రత్యేక విలేఖరిగా ఈనాడు నన్ను పంపించింది. ప్రారంభోత్సవం రోజే హైదరబాద్ హుస్సేన్సాగర్ లో బుడ్డా విగ్రహం పది పోయి అనేక మంది చనిపోయారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నా రెడ్డి మెంగలూరు రాలేదు.ఆ ఉత్సవాల్లో పెద్దాయన శ్రీ వరదాచారి అందరికీ బాగా సహకరించారు. ఇంతలో నాకు ప్రమోషన్ వచ్చి అగ్రహారం డిగ్రీ కాలేజీకి బదిలీ అయింది. టైమ్ ఇవ్వలేక ఈనాడుకు రాయడం మానేశాను.

అప్పటివరకూ చేసిన జూనియర్ కాలేజీ లైబ్రెరియన్ ఉద్యోగం చాలా లిమిటెడ్. కొత్త పుస్తకాలకు బడ్జెట్ వుండేది కాదు, విద్యార్హులతో సహా ఎవరికీ అంతగా రీడింగ్ పట్ల ఆసక్తి ఉత్సాహం వుండేది కాదు. అగ్రహారం డిగ్రీ కాలేజీ ది మరింత దీన స్థితి. సొంత భవనం లేదు తరగతి గదులే లేవు. ఇక లైబ్రరీకి వసతి ఎక్కడిది. అప్పుడే ‘సుప్రభాతం’ వారపత్రిక ప్రకటన వెలువడింది. కరీంనగర్ అగ్రహారం ల మధ్య తిరుగుతూ ఖాళీగానే వున్నాం కదా అని దరఖాస్తు చేశాను. వాసుదేవరావు గారు రాయమన్నారు. ఏముంది ఉత్తర తెలంగా జిల్లాల నుంచి విరివిగా రాశాను. అప్పుడు చాలా  ఉద్రిక్త పరిస్థితులు. ఎన్నో ఎంకౌంటర్లు, మందుపాతర్లు అన్నీ రాశాను. ఉద్యోగం వుంది ఎట్లా అన్నారు. ఏమో ఎవరూ పట్టించుకోలేదు. సొంత పేరుతోటే రాశాను. నేను రాస్తూ పోయాను. వాసు గారి తర్వాత శ్రీ కాసుల ప్రతాప రెడ్డి సంపాదకుడిగా వున్నంతవరకు చేశాను. తర్వాత ఏ.బి.కే.ప్రసాద్, వాసుదేవ రావు గార్ల సారధ్యం లో వచ్చిన ‘మా భూమి’ కి కొంత కాలం రాశాను. ఇంతలో నాకు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ కాలేజీకి బదిలీ అయింది. అప్పుడు ఆ కాలేజీలో అసలు ఉద్యోగ జీవితం మొదలయింది. పైగా నేను చదువుకున్న కాలేజీ. పూర్తి సమయం నిబద్దతతో పని చేయాలి అనుకున్నాను. పెద్ద కాలేజీ చాలా పెద్ద గ్రంధాలయం. వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు. పూర్తి సమయం వృత్తి లో అంకితమయిపోయాను. కానీ ఫిల్మ్స్ ఫిల్మ్ సొసైటీ, సాహిత్యం వీటికి కాలేజీని కూడా వేదిక చేశాను. జర్నలిజం కోరిక వుండనే వుంది. కాలేజీకి నాక్ అక్రెడిటేషన్ వచ్చిన తర్వాత పోలిటికల్ సైన్స్ అధ్యాపకుడు శ్రీ ఎల్.కే.బి.ఎం.శర్మ తో అన్నాను మనం జర్నలిజంలో సర్టిఫికేట్ కోర్స్ పెడదామని. దానికి గోపు లింగా రెడ్డి కూడా సపోర్ట్ చేశాడు. కానీ అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్ తలూపలేదు పైగా ఎందుకొచ్చిన గోల అన్నాడు. కానీ నేనూ శర్మా పట్టు వదలలేదు. సార్ దానికి మనం అన్నీ విధాలా న్యాయం చేయొచ్చు. ఫీజులు కూడా వస్తాయి అన్నాం. ఎట్లాగో ప్రిన్సిపాల్ ని ఒప్పించాం. ఇంకేముంది ప్రవేశాల కోసం ఇచ్చిన ప్రకటనకు చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

  నేనే ‘సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జర్నలిజం’ కోసం సెలబస్ రోపొందించాను. పత్రికా రచన, జర్నలిజం దాని పుట్టుపూర్వోథ్తారాలు, పత్రికలు భాష,, వర్తమాన అంశాలు అని నాలుగు పేపర్లు, చివరగా ప్రాజెక్ట్ వర్క్ ఒకపేపర్ మొత్తం అయిదు పేపర్లు. నేను పత్రికా రచన పేపర్ తీసుకున్నాను. మిగతా వాటికి గోపు లింగా రెడ్డి, డాక్టర్  కే.మల్లారెడ్డి. ఎల్కే.బి ఏం శర్మ, తోట రమేశ్, సత్యప్రకాశ్, సుబ్బిరామి రెడ్డి ఇట్లా పలువురు లెక్చరర్లలని ఇన్వాల్వ్ చేశాను. ఆర్నెళ్ళకు ఒక బాచ్ చొప్పున నేను మొత్తం మీద 13 బ్యాచులు నిర్వహించాను. అంటే ఆరున్నరేళ్లు. దానికోసం ‘రచన’ కళాశాల వారి కోర్సు మెటీరియల్, ఓపెన్ యూనివర్సిటీ వారి బుక్స్ ఇందిరా గాంధీ ఓపెన్ వర్శిటీ వారి మెటీరీయల్ అన్నీ ఉపయోగించాము. మగ పిల్లలు, ఆడపిల్లలు అనేక మంది కోర్సు పట్ల అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.    

ఈ మొత్తం కోర్సు నిర్వహణలో ఆయా కాలాల్లో పని చేసిన ప్రిన్సిపాల్స్ డాక్టర్ విజయకుమార్, పి.కొండల్ రెడ్డి, డాక్టర్ కె.మురళి, డాక్టర్ మడుసూదన్ రెడ్డి, పి.నితిన్ లు ఎంతగానో సహకరించారు. ఆఫీసు అకౌంట్స్ నిర్వహణలో ఆర్.రాజమౌళి. సభల నిర్వహణలో నాగరాజు, నరేందర్ ల సహకారం మరువలేనిది. ఇంకా లైబ్రరీ ఆసిస్టంట్ నాగరాజు కూడా ఎంతగానో పనిచేశాడు.

ముఖ్యంగా ప్రిన్సిపాల్ నా ఆత్మీయ మిత్రుడు డాక్టర్ కోట మురళి అందించిన సహకారం చాలా గొప్పది.   

++++

“కాంక్ష ఎంత ప్రగాఢ మయిందయినా

కృషి కొరవడితే

విచారమే మిగుల్తుంది”

అందుకే నాకెంత కాంక్ష వున్నా కోర్సు నడపడానికి ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా కాలేజీలో లైబ్రెరియన్ అంటే కేవలం గ్రంధాలయాన్ని ఆధునికంగా మెరుగులు దిద్ది సెర్వీస్ ఇవ్వడమే కాదు అదనంగా కోర్సులు నిర్వహించడంతో మంచి అభిమానం అగౌరవం పొందాను. ఇక కోర్సు ప్రారంభించిన నాటినుండీ ప్రతి బ్యాచ్ కూ వ్యాలిడిక్టరీ ముగింపు సమావేశం నిర్వహించాం. అందులో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోని  జర్నలిస్టులను పిలిచి ప్రేరణాత్మక ఉపన్యాసాల్ని ఇప్పించాము. వాళ్ళతోనే ఆ సభల్లోనే విద్యార్థులకు సెర్టిఫికెట్స్ ప్రధానం చేశాం. అట్లా మా జర్నలిజం కోర్సుకు అతిథులుగా వచ్చినవాళ్ళల్లో శ్రీయుతులు అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ అస్సోసియేట్ ఎడిటర్ శ్రీ వేణుగోపాల స్వామి, చిల్ల మల్లేశం, దుర్గం రవిందర్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ నవీన్, హిందూ దయాశంకర్, పీ.ఎస్.రవీంద్ర, వేదాంత సూరి ఇట్లా అనేక మంది నాకు సలహాలిచ్చారు, సహకరించారు. అంతే కాదు ఎంతో అభిమానంతో ఆయా సభల్లో అతిథులుగా పాల్గొన్నారు. ఎంతో ప్రేరణాత్మక ఉపన్యాసాలు చేశారు. అప్పటి మా జర్నలిజం కోర్సుల్లో చదివిన విద్యార్థుల్లో పలువురు రాస్త్ర స్థాయిలో పలు వార్తా పత్రికల్లో, డిజిటల్ పత్రికల్లో, టీవీల్లో పనిచేస్తున్నారు. జర్నలిజం లో చేరని వాళ్ళు వివిధ రంగాల్లో వున్నారు. ఎప్పుడయినా ఎక్కడయినా కలిస్తే వృత్తి రీత్యా జర్నలిస్టులం కాకున్నా అప్పుడు కోర్సులో నేర్చుకున్న వాటితో మా భాష అవగాహన మెరుగు పడింది సార్, అంతేకాదు పత్రికల పట్ల సమాజం పట్లా మా అవగాహన పెరిగింది సార్ అంటారు. అది నాకెంతో సంతోషాన్నీ సంతృప్తిని కలిగిస్తుంది. రిటైర్ అయిన తర్వాత కరీంనగర్ లోనే వున్నప్పటికీ ఆ కోర్సు గురించి వివరాలు తెలీదు. నిర్వాహకులు పిలవలేదు. పిలవాలనీ లేదు. కోర్సు నడిస్తే చాలు ఏ కొందరు కొత్త జర్నలిస్టులను తయారు చేసినా చాలు అనిపిస్తుంది.

జర్నలిజం కోర్సుతో పాటు నేను ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో కొంత కాలం ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా నడిపించాను.’మేక్ అప్ టూ ప్యాక్ అప్’ పేర ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ కూడా నిర్వహించాను. ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.

-వారాల ఆనంద్

23 జూలై 2023

100=యాదోంకీ బారాత్ 
++++++ వారాల ఆనంద్

మంచి కవిత— వారాల ఆనంద్

Posted on

మంచి కవిత

++++++++ వారాల ఆనంద్

జాగ్రత్తగా చదువు

‘కవిత’

నీతో మాట్లాడుతుంది

మౌనంగా ధ్వనిస్తుంది

బిగ్గరగా అరుస్తుంది

ఉప్పెనలా చుట్టేసుకుంటుంది

పాటలా పట్టేసుకుంటుంది

సాలీడులా కమ్ముకుంటుంది

ఒడిలో కూర్చుంటుంది

చంకనెక్కి గారాలు పోతుంది

నెత్తిమీద మొట్టికాయ వేస్తుంది

రక్తనాళాల్లోకి ఇంకిపోతుంది

అటు ఇటు కాదు

నేరుగా మనసులోకి దిగి పోతుంది

నిన్ను మనిషిని చేస్తుంది

ఎక్కడా జారిపోకుండా నిలబెడుతుంది

సోయితో చదువితే

మంచి కవిత

నన్నూ నిన్నూ వెంటాడుతూనే వుంటుంది

***********19 జూలై 2023

మంచి కవిత--- వారాల ఆనంద్

99= యాదోంకీ బారాత్

Posted on Updated on

99= యాదోంకీ బారాత్

+++++ వారాల ఆనంద్

వేములవాడ

మా అమ్మను కన్న వూరు ననుకన్న పేగు

మా అమ్మనే కాదు మా నాన్న మూలాల్ని, మా వారాల వంశాన్ని కన్న వూరది. 

మిఠాయోళ్ళ జోరు ఛిలుకల పేరు, బత్తీసలదండ ఆ వూరో గొప్ప జ్ఞాపకాల ఊరేగింపు. నిజానికి మా మిఠాయి సత్తెమ్మ కుటుంబం వేములవాడ నుంచి కరీంనగర్ కు తరలి వచ్చింది.

అలాంటి

వేములవాడకు తెలంగాణా మొత్తం కదిలొచ్చి

తడి బట్టలతో ప్రదక్షిణలు చేసి పోతది.  

 ఈ ఊర్ల కొచ్చిన ముత్తయిదువల

చెంపల మీద పసుపు పచ్చని గులాబీలు వికసిస్తయి.

నొసల్ల మీద ఎర్రటి సూర్యుళ్ళు మెరుస్తరు. అందుకే ఆ వూరన్నా ఆ పేరన్నా నాకెంతో ఇష్టం.   ఆ వూరు నా పుట్టుకలోనే కాదు నా సృజనాత్మక జీవన గమనంలో గట్టి పునాదులు వేసింది. చిన్నప్పటినుండీ అక్కడి గుడి, జాతర నా అనుభవంలోనూ జ్ఞాపకాల్లోనూ సజీవంగా పెనవేసుకుపోయింది. వేములవాడ శైవ క్షేత్రమయినప్పటికి 

“ఇదేమి చిత్రమో అక్కడ రాముని లగ్గంనాడు

శివున్ని పెళ్లి జేసుకుంటరు

అడ్డ బొట్టూ నిలువు బొట్టు అంతా సమానమే”

ఇక్కడి ‘శివపార్వతుల’ శ్వాస

తెలంగాణా మొత్తానికి

ఊపిరి పోస్తది

++++

వేములవాడలో శివరాత్రి ఓ పెద్ద పండుగ. అంతకంటే పెద్ద జాతర. దానితో పాటు వేములవాడలో శ్రీ రామనవమి కూడా అంతే పెద్ద పండుగ. అంతే పెద్ద జాతర. ఆ రెండు జాతరలూ నన్నే కాదు నా తోటి వాళ్ళనూ అందరినీ ఎంతో ఆకర్షించేవి. జాతరల నిండా అందం ఆనందం వెళ్లివిరిసేది. సర్కస్ లు మొదలు ఎన్నో ఎన్నెన్నో.. అయితే శ్రీరామనవమి రోజున  ఇక్కడ భక్తులు ఒక భిన్నమయిన సాంప్రదాయాన్ని అవలంభిస్తారు. స్త్రీ పురుష బేధం లేకుండా ఆ రోజు దేవుణ్ణి పెళ్లాడి దేవుని పేర శివపార్వతులుగా జీవితాలు గడిపే ప్రత్యేకమయిన ఆచారం అది. శ్రీరామనవమి రోజున వేలాది మంది స్త్రీ పురుషులు కొత్త బట్టలు ధరించి నుదుటిపై పెద్దబొట్టు. తలపై జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, నుదుటిపై బాసింగాలు ధరించి జోలె పట్టుకుని అక్షింతలు చల్లుకుంటూ దేవునితో తమ వివాహాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు వారి త్రిశూలాల మోతల్తో ఆలయ ప్రాంగణం మాత్రమే కాదు మొత్తం వూరంతా మారు మోగిపోతుంది. ఓ పక్క ఆలయ అధికారులు నిర్వాహకులు శ్రీరామ కళ్యాణం ఘనంగా జరుపుతూ వుంటే శివపార్వతులు తాము దేవుణ్ణి పెళ్ళాడుతూ శ్రీ రాముని పెళ్ళికి తమ తాహతు మేర కట్నలు కూడా చదివిస్తారు. జంగాలుగా పరిగణించబడే వీరశైవులు ఈ శివ పార్వతుల పెళ్లి జరిపిస్తారు. మొదట జంగం వాళ్ళు ధారణ శుద్ది చేస్తారు. స్త్రీ పురుష బేధం లేకుండా చీరలు కట్టించి రాగి మంగళసూత్రం మెడలో కడతారు. చేతిలో త్రిశూలం ఇచ్చి శివుడితో పెళ్లి జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే కాదు వూరువూరంతా జరుపుతారు.  వేలాది లక్షల మందితో ఈ కార్యక్రమమంతా పెద్ద జాతరగా జరుగుతుంది.   

ఈ మొత్తం ఆచారంలో వారి వారి ఆర్థిక స్థితిని బట్టి తమ జీవితాల్లో మామూలుగానే పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేస్తూ శివపార్వతులుగా వుంటారు. ఆర్థికంగా లేని వాళ్ళు శివపార్వతులుగా భిక్షాటన చేస్తూ గడుపుతారు. ఇదంతా నా బాల్యం నుండి చూస్తూ వస్తున్నాను. అదంతా చాలా చిత్రంగానూ ఆసక్తిగానూ అనిపించేది.విశ్వాసాల మాట అటుంచితే అదొక సాంప్రదాయం. సంస్కృతిలో భాగం. అంతా గొప్పగా అనిపించేది.  డాక్యుమెంటరీల రచన దర్శకత్వం వైపు నా దృష్టి మరలిన తర్వాత ఈ శివపార్వతుల మీద ఫిల్మ్ చేయాలనిపించింది. ఆ ఆచారాన్ని సంస్కృతిని చిత్రబద్దం చేయాలనే ఆలోచన ఉత్సాహం క్రమంగా పెరిగింది. వేములవాడలో జర్నలిస్టుగా పనిచేసిన మిత్రుడు పీ.ఎస్.రవీంద్ర తో ఆలోచించాను బాగుంటుంది గో ఎహెడ్ అన్నాడు. ఇంకేముంది శ్రీరామనవమికి ముందే ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టాను. సిరిసిల్లా జర్నలిస్టు మిత్రుడు టీ.వీ.నారాయణ తోడు ఉండనే వున్నాడు. నటుడు కెమెరామెన్ శ్రీ పోల్సాని వేణుగోపాల రావుని సంప్రదించాను. కెమెరా ఎడిటింగ్ కి తాను రెడీ అన్నాడు. ఠాకూర్ రాజేందర్ సింగ్ మాతో కలిశాడు. వేములవాడ జర్నలిస్టు మిత్రుల్నీ కలుపుకున్నాను. జాతర కదా అధికారుల సహకారం కూడా కావాలి. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆలయ ప్రాంగణంలోని వసతి గృహంలో వుండడానికి ఏర్పాట్లు కూడా చేశాం. అప్పటి ఆలయ ఛైర్మన్ శ్రీ ఆది శ్రీనివాస్ చేతులమీద క్లాప్ కొట్టించి షూట్ ప్రారంభించాం. ఇంకేముంది అనుకున్నట్టుగానే కెమెరా మైకు రిఫ్లెక్టర్లు పట్టుకుని జాతరలో పడ్డాం. ఎన్ని విజువల్సో. శివపార్వతుల పెళ్లి తంతు ఒక వైపు మరో వైపు జతరలో చిలుకలు, బత్తీసలు, పుస్తెలు, మట్టెలు ఒకటేమిటి ఎన్నో లైవ్ గా షూట్ చేశాం. పలువురు శివపార్వతులతో ఇంటర్వ్యూలు. మొత్తంగా రోజంతా విరామం లేకుండా షూట్ తో సరిపోయింది. మాతో పాటు మా అన్వేష్ కూడా వున్నాడు. రవీంద్ర మాత్రం అలిసిపోయి తమ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ఆ రాత్రి అక్కడే గెస్ట్ హౌస్ లో వుండి ఉదయాన్నే మళ్ళీ షూట్ కి రెడీ. పోచమ్మ బోనాలూ అవీ అన్నీ గొప్ప ఉత్సాహంతో ఫిల్మ్ చేశాం. వరంగల్ వెళ్ళి పోల్సాని ఇంట్లో డబ్బింగ్ ఎడిటింగ్ చేశాం.BRIDES OF LORD SHIVA అని పేరు పెట్టాను. ఫిల్మ్ బాగా వచ్చింది. ఫిల్మ్ ని వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపించాను. ఆన్లైన్ ఫెస్టివల్స్ తో సహా. స్లొవేనియా లో జరిగిన DAYS OF EHTNOGRAPHIC FILM ఉత్సవానికి ఎంపికయి అక్కడ ప్రదర్శించబడింది. యౌట్యూబ్ లో కూడా మంచి స్పందననే అందుకుంది. ఇంకా అనేక దేశాల ఫెస్టివల్స్ లో పాల్గొంది. తెలంగాణ కు చెందిన ఒక ఆచారాన్ని సంస్కృతిని చిత్రబద్దం చేసిన ఆనందం తృప్తి మిగిలింది.

….

అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎదుగుతున్న కాలం. రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ ఉధృతి చైతన్య ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగానే కరీంనగర్ కు చెందిన ఓ ఉపాధ్యాయ మిత్రుడు శ్రీ టి.తిరుపతి రావు ఒక వినూత్న విలక్షణమయిన కార్యక్రమాన్ని చేపట్టాడు. అప్పుడప్పుడే ప్రజాల్లోకి చొచ్చుకు వస్తున్న మొబైల్ ఫోన్ దాని లో వున్న SHORT MESSEGE SEVICE ఎస్.ఎం.ఎస్. సౌకర్యాన్ని తెలంగాణా ఉద్యమ చైతన్య ప్రచారానికి వినియోగించుకోవడం మొదలు పెట్టాడు. తెలంగాణా కు సంబధించి రోజూ వేలాది మెస్సెజ్ లు పంపిస్తూ తన వంతు కృషిని కొనసాగిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే సిస్కో అంతర్జాతీయ సంస్థ ఒక షార్ట్ ఫిల్మ్ పోటీని ప్రకటించింది. పోటీకి ఇచ్చిన అంశం ఏమిటి అంటే ఎవరయినా దేనికయినా ఒక ఎలెక్ట్రానిక్ గాడ్జెట్ అంటే సెల్.టీవీ,నెట్ లేదా మారేదయినా సాంకేతిక పరికరాన్ని ప్రజోపయోగం కోసం, లేదా సామాజిక ప్రయోజనం కోసం వినియోగిస్తూ వుంటే వాళ్లమీద ఆ పరికరం మీద ఆధారం చేసుకుని ఫిల్మ్ చేయాలి. ఆ ఫిల్మ్          

కేవలం ఆరు నిమిషాల నిడివిలో ఆ షార్ట్ ఫిల్మ్ అయి వుండాలి.అది తెలియగానే నాకు తిరుపతి రావు గారు గుర్తొచ్చారు. ఆయన, ఆయన సెల్ ఫోన్, తెలంగాణ ఉద్యమం  వీటన్నింటినీ జోడించి ఫిల్మ్ చేద్దామనిపించింది. వెంటనే సంప్రదించాను. ఆయన సరేనన్నారు. నేను పోల్సాని వేణు గారిని సంప్రదించాను. నేను ఆలోచన స్క్రిప్ట్ తో రెడీ. యూనిట్  మిత్రులంతా రెడీ. షూటింగ్ మా ఇంట్లోనే. ఒక రోజంతా షూట్ చేశాం. మా ఇందిర, రేలా, అన్వేష్ లో కూడా ఉత్సాహంగా టీలు టిఫిన్స్ ఇచ్చి సహకరించారు. షూటింగ్ తర్వాత వరంగల్ లో ఎడిట్ కామెంటరీ అదీ పూర్తి చేసి సిస్కో వాళ్ళకు అప్లోడ్ చేశాను. అందులో జ్యూరీ సెలెక్షన్ ఒక విభాగం అయితే పోల్ మరొక విభాగం. తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ఆ ఫిల్మ్ కి చాలా సపోర్ట్ వచ్చింది. పోల్ లో విజేతగా నిలబడింది. అంతర్జాతీయ స్థాయిలో సిస్కో వారి అవార్డు తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అట్లా “LONG BATTLE WITH SHORT MESEGES” పెద్ద విజయాన్నే సాధించింది. ఆ ఫిల్మ్ తెలంగాణ ఉద్యమంతో కలిసి నడిచింది.  కానీ ఉద్యమం ఉద్యమ నాయకులు పాటను, సాహిత్యాన్నీ ఓన్ చేసుకున్నట్టు ఫిల్మ్ ఓన్  చేసుకోలేకపోయింది.అసలు టీవీని ప్రచారాన్ని తప్ప తెలంగాణ ఉద్యమం విజువల్ మీడియా మొత్తాన్ని దాని శక్తిని పరిగణ లోకి తీసుకోలేదు. అవగాహన లేమే ప్రధాన కారణం.

+++

ఇట్లా నా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ కొనసాగింది. అది కేవలం హాబీ గానే కాదు నేను బాధ్యతగా చేశాను. ముఖ్యంగా “తెలంగాణ సాహితీ మూర్తులు” సెరీస్ ప్రారంభించి ఇద్దరు సాహితీ మూర్తుల మీద నా శక్తి మేరకు ఫిల్మ్స్ చేశాను. ఆ సెరీస్ ను కొనసాగించెందుకు నా కున్న ఆర్థిక శక్తి సరిపోలేదు. సహకరించే వాళ్లు కూడా పెద్దగా లేకుండా పోయారు. ఎప్పటికయినా ఆ సెరీస్ లో చాలా మంది తెలంగాణ కవులు రచయితల మీద ఫిల్మ్స్ చేసి వుంచాలని ఆశ పడ్డాను. కానీ అది అత్యాశే అయింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. సాహిత్య అకాడెమీ లాంటి సంస్థలూ వచ్చాయి. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేశాను. కానీ ఎవరూ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వైపు దృష్టి పెట్టలేదు. అంతా లక్షలు పెట్టి పెద్ద పెద్ద పుస్తకాల్ని రంగుల్లో వేశారు. తెలంగాణ సినిమా ఉనికికి ఎదుగుదలకు ఎంతో కృషి వైతాళికులు అన్నవాళ్లు కూడా సాహిత్యకారుల డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వైపు దృష్టి పెట్టలేదు. ఎంతో మంది సాహితీ వేత్తలు వెళ్లి పోతూనే వున్నారు. కానీ సంస్థలు చేయాల్సిన పనులు వ్యక్తుల వల్ల పూర్తిగా సాధ్యం కావు. అది నా దృష్టిలో పెద్ద వైఫల్యమే. రాజ్యసభ టీవీ, దూరదర్శన్ లాంటి జాతీయ సంస్థలు సాహిత్యానికి సంబందించిడాక్యుమెంటరీలు, కితాబ్, విరాసత్, ముఖాముఖీ లాంటి అనేక కార్యక్రమాల్ని రూపొందించాయి. తెలంగాణ ఆదిశలో నిర్లిప్తంగా వుండి పోయింది. దశ-దిశ లేకుండా పోయాయి.  

తర్వాత నా డాక్యుమెంటరీ నిర్మాణ కార్యక్రమాల్లో ‘మిత్తుల అయ్యవార్లు’, శ్రీభాష్యం డాక్యుమెంట్రీ అసంపూర్ణంగా మిగిలిపోయాయి…

తర్వాత ఫిల్మ్ ఫెస్టివల్స్ లో జ్యూరీ గా వుండడం లాంటివి చేశాను.. రాతలు కొనసాగిస్తూనే వచ్చాను. మిగతా వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

-వారాల ఆనంద్

9440501281

98= యాదోంకీ బారాత్ +++ వారాల ఆనంద్

Posted on

98= యాదోంకీ బారాత్

+++++ వారాల ఆనంద్

‘నిరంతరం చదువుతూనే వున్నా

మంచి కవిత్వం నాలో ఇంకిపోయింది‘

అట్లే నిరంతరం అర్థవంతమయినసినిమాలు చూస్తూ ప్రదర్శిస్తూ వాటి పైన రాస్తూ  వుండిపోవడంతో ఆ సినిమాల ప్రభావం నాలో ఇమిడిపోయింది. మొదట పూర్తి నిడివి ఫీచర్ ఫిల్మ్స్ చూడ్డంతో పాటు వివిధ ఫిల్మ్ సొసైటీల్లో ప్రదర్శించడం ప్రధాన కార్యక్రమంగా సాగింది. తర్వాత పోరండ్ల, చొప్పదండి, మల్లాపూర్, కొండపూర్ ఇట్లా అనేక గ్రామాల్లోకి వెళ్ళి ‘పతేర్ పాంచాలి’, ‘బైసికిల్ తీవ్స్’, ‘రషోమాన్’, ‘చార్లీ చాప్లిన్’ సినిమాలు ఇట్లా అనేక సినిమాల్ని చూపించాను. గ్రామీణుల స్పందన, స్కూల్స్ లో పిల్లల ప్రతిస్పందన చాలా ఉత్తేజంగా వుండింది. తర్వాత కొన్నేళ్లకు ఫిల్మ్ భవన్ నిర్మాణం జరిగిన తర్వాత నాలుగు జాతీయ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్స్ , ఫిల్మ్ తెలంగాణా ఉత్సవ నిర్వహణ చాలా ఉత్సాహంగా సాగింది. ఈ క్రమంలో మా ఫిలిం సొసైటీలో నరెడ్ల శ్రీనివాస్, రేణికుంట రాములు, నారదాసు లక్ష్మణ రావు, కె.దామోదర్ రెడ్డి, కోల రాంచంద్రా రెడ్డి లాంటి అనేక మంది మిత్రులు నాతో వున్నారు. చర్చించుకున్నాం, విమర్శించుకున్నాం. మమ్మల్ని మేమే శబ్బాష్ అనుకున్నాం. అవన్నీ అప్పుడు మా అందరిలోనూ పెళ్లుబుకుతున్న ప్రగతిశీల భావాలు దృక్పధాలు స్నేహాలు మమ్మల్ని అట్లా ఒకటిగా కలిపి వుంచాయి. ఎందుకంటే కరీంనగర్ కేంద్రంగా మేమీ పనులు చేస్తున్నప్పుడు గ్రామాలు అట్టుడుకుతున్నాయి. దాడులు ఎంకౌంటర్లు ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో. మేమేమో సాంస్కృతిక రంగంలో ఏ కొంచెమయినా మంచి చేయాలన్నది మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఫిల్మ్ సొసైటీ నేపధ్యంలోనే మిత్రుడు నారదాసు, సురేందర్ లాంటి మరికొందరు మిత్రుల సహకారంతో ‘విముక్తి కోసం’ సినిమా తీశాడు. రాష్ట్ర నంది అవార్డు అందుకున్నాడు. మరో వైపు బి.నరసింగ రావు ఫీచర్ ఫిల్మ్స్ తో పాటు డాక్యుమెంటరీ లు ‘మావూరు’, ‘సిటి’, కె.ఎన్.టి.శాస్త్రి తీసిన డాక్యుమెంటరీలు, ఇంకా గౌతమ్ ఘోష్ లాంటి వాళ్ళు తీసిన గొప్ప డాక్యుమెంటరీలు చూస్తూ చూస్తూ నేనూ డాక్యుమెంటరీ నిర్మాణం వైపు ఆకర్షితుణ్ణి అయ్యాను. అప్పటికే సుప్రసిధ్హ ఫిల్మ్ మగజైన్స్ ‘ సైట్ అండ్ సౌండ్’, ‘సినిమా ఇండియా ఇంటెర్నేషనల్’, ‘సినిమా ఇన్ ఇండియా’, ‘డీప్ ఫోకస్’ లాంటి పత్రికల్ని చదువుతూ వున్నాను. స్క్రీన్ లాంటి పత్రికను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేవాన్ని. అట్లా సినిమా సాహిత్యం పైనా ఆసక్తి అవగాహన పెరుగుతూ వచ్చింది. పల్లకి, ఆంధ్ర భూమి తదితర పత్రికల్లో సినిమాల మీద రాయడం అప్పటికే మొదలయింది. వీటన్నింటి నేపధ్యంలో ఫిల్మ్ మేకింగ్ ఆసక్తి వున్నప్పటికీ అప్పటి ఆర్థిక స్థితి, కుటుంబం లాంటి అనేక పరిమితుల వల్ల ఫెచర్ ఫిల్మ్స్ నిర్మాణం వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. డాక్యుమెంట్రీ లు మన పరిధిలో వుంటాయి అనిపించి మొదట కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ భాస్కర్ మాఢేకర్ కోసం ‘లయన్స్ చారిటేబుల్ కంటి ఆసుపత్రి’ మీద ఒక చిన్న ఫిల్మ్ చేశాను. ఆర్టిస్ట్ రాజు కెమెరా వర్క్ చేసి సహకరించాడు. తర్వాత సాహిత్యంతో వున్న అనుబంధం నాకు రచయితల పైన ఫిల్మ్స్ చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికి తెలంగాణ ఉద్యమం ఆరంభయింది. రచయితల వేదిక ను నందిని సిధ్ధారెడ్డి నేతృత్వంలో ప్రారంభించాం. ఆ నేపధ్యంలో తెలంగాణా సాహితీ మూర్తులు పేర ఒక “డాక్యుమెంటరీ ఫిల్మ్ సెరీస్ ఆన్ తెలంగాణా రైటర్స్” తీయాలని తలపోశాను దానికి సాహితీ మిత్రులు దర్భశయనం శ్రీనివాసాచార్య, నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాధం, జర్నలిస్టు మిత్రుడు టీవీ నారాయణ సకరించడానికి ముందుకు వచ్చారు. మొదటి ప్రయత్నంగా కరీంనగర్ ముద్దసాని రాంరెడ్డి గారి పైనా ఫిల్మ్ చేశాను. దాన్ని తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా సభల్లో శ్రీ అల్లం రాజయ్య చేతులమీద ఆవిష్కరించాం.

    తర్వాత ఆదిలాబాద్ సామల సదాశివ పైన ఫిల్మ్ చేయాలని ఆలోచన వచ్చింది. సదాశివ ఓ జ్ఞాపకాల గని ముచ్చట్ల పందిరి, ఓ నడుస్తున్న సాహిత్య చరిత్ర, మరపు రాణి ఓ హిందుస్తానీ గానకచేరి. అయన్ని తడిమేతే చాలు శర పరంపరగా అలవోకగా మాట్లాడుతూ వినే వాళ్ళని ముచ్చట్లతో ముగ్దుల్ని చేసే విశాల ప్రపంచం ఆయనది. ఎలాంటి రెఫెరెన్సులు లేకుండా ఎక్కడెక్కడివో ఎప్పటెప్పటివో అనేక విషయాలు జాలు వారే ప్రవాహం అయన.

అంతటి పెద్దాయన నాకంతకు ముందు వ్యక్తిగతంగా పరిచయం లేదు.అయన రచనలు చదవడం అయన గురించి వినడమే తప్పితే కలిసింది లేదు.
మొట్ట మొదసారి గా కరీంనగర్ లో తెలంగాణా రచయితల వేదిక సభలు వైశ్య భవన్ లో జరిగినప్పుడు వేదిక పైన ఆయన్ని చూడ్డం మొదటిసారి సభా కార్యక్రమం తర్వాత కరీంనగర్ ప్రశాంత్ లాడ్జ్ లో బస చేసిన సదాశివ ను కలవ డానికి నేను నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, గండ్ర లక్ష్మణ రావు తదితర మిత్రులం వెళ్ళాము.అదే మొదటి సారి ఆయన్ని దగ్గరగా చూడడం. ఎప్పటిలాగే మౌన ప్రేక్షకుడిగా ఆయన్ని వింటూ కూర్చున్నాను. ఎన్ని మాటలో ముచ్చట్లో…అప్పుడు అయన అన్నారు ‘ ఇప్పుడే రామిరెడ్డిని ఆయన ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన, గీడ మూలక్కుచున్నావన్న వేదన వద్దని చెప్పిన,  అక్కడ వైశ్యభవన్ లో నిలువెత్తుగా నిన్ను ఆవిష్కరించారు నీ కీర్తి శాశ్వతం అయింది పో అని చెప్పి వచ్చిన..’అన్నాడు. నా వైపు తిరిగి మంచి పని చేసినావు. అవును నువ్వు జింబో కు ఏమవుతావు అని అడిగాడు. అయన నాకు మేనమామ అని చెప్పిన. అయితే నారాయణ రావు ఏమవుతడు  అన్నాడు. పెదనాన్న మా పెద్దమ్మ భర్త అని చెప్పిన.
దానికి సదాశివ, నారాయణ రావు తాను కలిసి పని చేసినప్పటి సంగతులు చెప్పాడు.
రెండు గంటలు ఆయనతో కూర్చున్నంక భాస్కర్ తో మెల్లిగా అన్న మన రెండవ సాహితీ మూర్తి సదాశివ గారని. అయన ఎంతో సంతోష పడ్డాడు. మరింకేంది చెబుదామన్నాడు.
నా ప్రతిపాదన సదాశివ ముందుంచాను.ఆదిలాబాద్ వస్తామని చెప్పాను.
‘నా దగ్గర ఏముందయ్యా’ అన్నాడు
‘ఉన్నదేదో ఉన్నట్టు చూపిస్తానని చెప్పాను ‘
మీరు కాదని అనవద్దు అని భాస్కర్ ఒత్తిడి చేసాడు
‘మరయితే రాండ్రి’ అన్నాడు సదాశివ.
రెండు రోజుల తర్వాత నేనూ, నలిమెల భాస్కర్ ఆదిలాబాద్ బయలు దేరాం.
రోజంతా అయన ముచట్లు. అయన ఇంటి పరిసరాలు అన్ని చూస్తు నేను …
చివరిగా అయన అడిగాడు ‘ నా మిద చిత్రం తీస్తే నికేమోస్తుంది ‘
‘ ఏమి రాదన్నాను ప్రతిది ఏదో వస్తుందని చేయం కదా’ అన్నాను.
నవ్వి ఊరుకున్నాడు. మీ ఇష్టం అన్నాడు సదాశివ.‘నేనేమి చేయాలో చెప్పు’ అన్నాడు. యౌనిట్ తో కలిసి వస్తామని చెప్పి బయలు దేరాం.గురూజీ ఆశ్రమాన్ని చూశాం.
ఎంత వద్దన్నా పెద్దాయన బస్సు స్టాండ్ వరకు వచ్చి మమ్మల్ని సాగనంపాడు.
అల మొదలయింది ‘యాది సదాశివ్’ డాకుమెంటరీ.
********************************************
తర్వాత కొన్ని రోజులకు ప్లాన్ చేసుకుని టి.వి, నారాయణ, కొడం సంతోష్ తదితర యూనిట్  తో కలిసి ఆదిలాబాద్ బయలుదేరా. ‘90 ల నుంచీ నాకు అన్నివిధాల సహకరిస్తూ వున్న మిత్రులు సరస్వతి పాపన్న సాదాశివ ఫిల్మ్ కు కూడా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు.ఇక పెద్దమ్మ వాళ్ళ వూరు కిష్టాపూర్ వెళ్ళిన ప్రతిసారీ చిన్నప్పటి నుంచి అద్భుత మైన దృశ్యం గా
మదిలో మిగిలి పోయిన రాయపట్నం వంతెన గోదావరి నది దాని ఆనుకునే వున్న అడవి అన్నింటిని షూట్ చేస్తూ నా యూనిట్ ఆదిలాబాద్ ప్రయాణం సాగింది. టాటా సుమో పైన కూర్చుని మరీ షూట్ చేశాం అదో థ్రిల్.
ఇక అక్కడ సదాశివ ఇంట్లో కెమెరా,  రిఫ్లెక్టర్లు మొత్తం షూటింగ్ వాతావరణం ఏర్పాటు చేశాం.  అదంతా సదాశివలో ఉత్సాహాన్ని నింపాయి.ఇంట్లో అందరిని షూట్ కి రెడీ చేసారు.
సదాశివ గురించి మాట్లాడడానికి వసంత రావు దేశ్పాండే తో సహా అంత సిద్దం అయ్యారు. ఇల్లు, వాతావరణం, ఇంటర్వ్యూలు ముగించుకుని లక్షెట్టిపెట్ లో మా పెద్దనాన్న నారాయణ్ రావు గారి ఇంటర్వ్యూ తర్వాత షూటింగ్ హైదరాబాద్ కి మారింది.
యౌనిట్ తో పాటు ప్రముఖ కవి, ఆత్మీయ మిత్రుడు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య , మా అబ్బాయి అన్వేష్ కూడా జతకూడాడు. ఇక్కడ దర్భశయనం కవిగా మిత్రుడిగా అందించిన సహకారం ప్రోత్సాహం మరువలేనిది. ముద్దసాని రామ్ రెడ్డి ఫిల్మ్ కు, సదాశివ ఫిల్మ్ కు కూడా ఆయన నా వెంట హైదరబాద్ దాకా వచ్చి అలసటనూ, ఇబ్బందునీ భరించి నా వెంట వున్నారు. సదాశివ గురించి అయన అభిమానుల మాటల్ని, అయన తిరుగాడిన సుల్తాన్ బజార్ , ఆయన వుంటూ వచ్చిన ఆదర్శ లాడ్జ్ లాంటి అనేక ప్రదేశాల్ని షూట్ చేయాలని బయలు దేరాం. సదాశివను అమితంగా అభిమానించే రచయిత శ్రీ వాడ్రేవు చినవీర భద్రుడు ఫిల్మ్ కోసం సమయం ఇచ్చారు. ఆయన కెమెరా ముందు మాట్లాడుతూ ‘ఉర్దూ సాహిత్యం గజల్లు, దోహాలు లాంటి వాటి గురించి సదాశివ చెప్పిన అంశాల్ని గొప్పగా నెమరు వేసుకున్నాడు. ఇక ఐ.ఏ.ఎస్. అధికారి, రచయిత శ్రీ ఫణి కుమార్ అప్పుడు హైదరాబాద్ లో  ప్రకృతి చికిత్సాలయంలో వుంటే అక్కడికి వెళ్లి పలకరించాము.కొత్తగా రాస్తున్న వారి గురించి సదాశివ పట్టించుకునే విధానాన్ని ఆయన వివరించారు. అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఎలాంటి రెఫెరెన్సు లు లేకుండా సదాశివ చెప్పే వివరాల్ని ప్రశంసించారు. యాది కాలం రాయించుకున్నప్పటి  సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.ఆంధ్ర జ్యోతి లో మిత్రుడు శ్రీ అల్లం నారాయణ ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఆచార్య జయధీర్ తిరుమల్ రావు తెలంగాణాకి లభించిన గొప్ప సాహిత్య భండాగారం సదాశివ అని ఆయనతో తనకున్న సాన్నిత్యాన్ని నెమరు వేసుకున్నారు. తర్వాత చిత్రీకరణ వరంగల్ కు మారింది. ఆచార్య లక్ష్మణ మూర్తి మాట్లాడుతూ ‘అలతి అలతి మాటల్లో సదాశివ చెప్పే అంశాలు ఎంత గొప్పవో’ వివరించారు. ఆచార్య జయశంకర్ మాట్లాడుతూ ‘అతి సామాన్య జీవితం గడిపిన సదాశివ ప్రతిభ అసామాన్యమయినది అన్నారు’. ఇంకా అప్పటి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య కోకాటే తదితరులు కూడా సదాశివ గురించి మాట్లాడారు. అలా సాగిన సదాశివ జీవన చిత్రం లో అయన తిరుగాడిన ఇంటి వాతావరం తో పాటు వరంగల్ బ్రాడ్ వే, కరీంనగర్ ప్రశాంత్ లాడ్జ్ ల వాతావరణం కూడా డాకుమెంటరీ లో చూపించాము.
    ‘యాది సదాశివ’ నిర్మాణ క్రమంలో ఆయనతో గడిపిన సమయాలు చాలా గొప్పవి .   నిజంగా నా జీవితంలో అవి మరచిపోలేని అనుభవాలు. అయన వెలువరించిన అభిప్రాయాలు సువర్ణ అక్షరాలు.’కర్ణాటక సంగీతం లో బహుదారి అని ఒక రాగం వుంది నాది అదే దారి ‘ అంటారు సదాశివ అన్ని దారులూ వచ్చి కలుస్తాయి అందుకే అది బహుదారి.  నన్ను అందరూ కలుస్తారు ఆచార్య లక్ష్మన మూర్తి, ఆచార్య సంపత్కుమార, మహాజాబిన్, యాకూబ్, శివారెడ్డి, దేవిప్రియ ఇలా ఒకరేమిటి అందరు వస్తారు అందుకే నాది బహుదారి అన్నారు సదాశివ.
      నా జీవితంలో నెగెటివ్ గా ఎప్పుడూ ఆలోచించ లేదు ఎవరు చెప్పిందాంట్లో నైనా మంచి ఉందేమోనని ఆలోచించాను. కవిత్వం కండ్లబడ్డప్పుడు ఆనందించకుండా ఉండలేదు. ఎవరే పని చేసిన ఏదో ఒక ప్రతిభ ఉంటేనే చేస్తాడు. దాన్ని నిరాకరిస్తే ఎట్లా? వీలయితే ప్రోత్సహించాలే లేదా ఆనందించాలే కాని నిరాకరించొద్దు.ఇది అయన జీవన విధానం. అలా కలగలసి పోయిన అయన జీవితం సాహిత్యం రెంటిని తడుముతూ చేసిన చిన్న ప్రయత్నం ‘యది సదాశివ’.
     అయన మాటలు, నడక, నివాసం అన్నింటిని దృశ్య మానం చేసే అవకాశం నాకు దొరికింది. నిజంగా తన చుట్టూ వున్న అత్యంత సాదారణ జీవితంలోంచి తెలంగాణా సాంస్కృతిక ముద్ర ఇది, తెలంగాణా అస్తిత్వం ఇది అని చెప్పిన మహానుభావుడు సదాశివ.
     అయన తెలంగాణా కు లభించిన గొప్ప కానుక. అలాంటి కానుకను భావి తరాలకోసం సజీవంగా దృశ్య రూపంలో నిలిపే అవకాశం నాకు కలగడం నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది. అట్లా తెలంగాణ సాహితీ మూర్తులు సెరీస్ లో రెండవ ప్రయత్నం ముగిసింది. ఆ ఫిల్మ్ ని ఆ తర్వాత ఆదిలాబాద్ లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక సభల్లో ఆవిష్కరించి ప్రదర్శించాం.

ఆ తర్వాత నేను శివపార్వతులు,ఎస్.ఎం.ఎస్. ఫిల్మ్ రూపొందించాను. ఆ వివరాలతో వచ్చే వారం….

***************

9 July 2023  

   -వారాల ఆనంద్

97= యాదోంకీ బరాత్

Posted on Updated on

+++++ వారాల ఆనంద్

97= యాదోంకీ బరాత్

+++++++++++++ వారాల ఆనంద్

కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా

విశ్వం లోకి చేసే ప్రయాణమే ‘కళ’.

సినిమా సర్వకళా సమ్మిశ్రితం. అది 24 ఫ్రేముల్లో అనేక కళల ఆవిష్కరణ. అలాంటి సినిమా నిశ్చలమయింది కాదు. అది ఓ కదులుతున్న ప్రపంచం. విశిష్టమయిన దృశ్యమాధ్యమం. సినిమా ద్వారా మనం కథ చెప్పం చూపిస్తాం. అలా చూడడంలోనే ప్రేక్షకులకు ఆ కథ పట్ల ఆసక్తి కలగాలి. వారందులో మమేకం కావాలి. ఆ సినిమాలోని ఇతివృత్తం పట్ల పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఇష్టం, కోపం, ద్వేషం ఇలా అనేక భావాలు కలగాలి. అప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వాళ్ళు ఆ సినిమాని ఆదరిస్తారు అభిమానిస్తారు. సినిమాకు మూలాంశమయింది కథ. కథకుడు కథ రాసినప్పుడు పాఠకుల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తాడు. అదే కథకు దృశ్యమాధ్యమంలో సినిమాగానో టీవీ ఎపిసోడ్ గానో లేదా ఇవ్వాల్టీ వెబ్ సెరీస్ గానో, షార్ట్ ఫిల్మ్ గానో రూపొందించాల్సి వచ్చినప్పుడు ఆ కథని దృశ్య రూపంలో రాసుకోవాలి. కథలో వుండే మాధుర్యం దృశ్యరూపంలోకి మార్చినప్పుడు అందులోని మూల భావం, ఆయా పాత్రల ప్రవర్తన, వ్యక్తిత్వాలు, మాట్లాడే భాష లాంటి అనేక  అంశాలను ప్రధానం చేసుకోవాలి. ఆ కథకు చెందిన కథానేపధ్యం, ఆ కథ నడిచే ప్రాంత వాతావరణం, ఆ ప్రాంతీయ పరిమళం దృశ్య మాధ్యమంలో వెల్లివిరియాలి. అప్పుడే అది గొప్ప దృశ్య సృజన అవుతుంది. లేకుంటే పేలవమయి ప్రేక్షకుల తలల మీంచి అట్లా ఎగిరిపోతుంది. అలాంటి సినిమాల్లోంచి, అర్థవంతమయిన, కళాత్మక మయిన సినిమాని ప్రజల దగ్గరికి తీసుకురావడానికె ఫిల్మ్ సొసైటీ కార్యక్రమాలు నిర్వహించాం.వాటిల్లో భాగంగా గొప్ప సినిమాల ప్రదర్శన తో పాటు అప్రిసియేషన్ కోర్సుల్నీ నిర్వహించాం. వాటికి కొనసాగింపుగానే షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణను మా ప్రధాన కార్యక్రమాల్లో చేర్చుకున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించాం. మంచి ప్రతి స్పందన లభించింది. అంతటితో ఆగకుండా సినిమా నిర్మాణ పరంగా కూడా కఫిసో వేదికగా వుండాలనుకున్నాను. అంతే ఏముంది మా ఈసీ అందుకు ఉత్సాహంగానే చేద్దాం అంది. వెంటనే ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఫిల్మ్ మేకింగ్ వర్క్ అంటే రెసోర్స్ పర్సన్స్ కావాలి. నేర్చుకునే వాళ్ళు రావాలి. పెద్ద పనే అన్నారంతా. కఫిసోకున్న పేరు నాకున్న కాంటాక్ట్స్ తో సాధ్యమేనాన్నాను. ఫోర్త్ నేషనల్ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ సంధర్భంగా మొట్టమొదటి ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్  నిర్వహించాలనుకున్నాం. అటు పోటీ ఫెస్టివల్ కనుక ఎంట్రీల ఆహ్వానం, దానితో పాటు ఫిల్మ్ మేకింగ్ వర్క్ నిర్వహణ రెండూ ఏక కాలంలో జరగాలి. ఈ సారి మూడు రకాల అవార్డ్స్ ప్రకటించాం. కఫిసో ఇచ్చే పాలపిట్ట అవార్డ్స్, నవతరంగం అవార్డు, ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ.  అవార్డుల కోసం ఎంట్రీలను ఆహ్వానించాం. అప్పటికే నవతంరంగం  వెంకట సిధ్ధారెడ్డి నాకు ఆన్లైన్ లో మిత్రుడు అయ్యాడు. విదేశాల్లో వుండి సినిమాకు సంబంధించిన కోర్సు చేసి మంచి అనుభవం సంపాదించివచ్చాడు. హైదరబాద్ లో ఫిల్మ్ స్కూల్ లో ఫాకల్టీ గా వున్నాడు. తన సాయం అడిగాను. ఉత్సాహంగా మీరెట్లా అంటే అట్లా అన్నాడు. తాను కూడా ఒక అవార్డుని ఇస్తానాన్నాడు.నేను నా చిరకాల మిత్రుడు తెలుగులో గొప్ప ఫోటోగ్రాఫర్ ‘కళ్ళు’ లాంటి సినిమాల దర్శకుడు ఏం.వి.రఘు ని సంప్రదించాను. తనతో పాటు సీనియర్ నటుడు ప్రగతిశీల కళాకారుడు శ్రీ కాకరాల గారిని ఆహ్వానించాను. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ హైదరబాద్ లో కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇండిపెండెంట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా వున్న శ్రీ ప్రవీణ్ బండారుని ఆహ్వానించాను. ఆ ముగ్గురినే ఫిల్మ్ ఫెస్టివల్ కి జ్యూరీ వుండాలని కోరాను. ఆ ముగ్గురూ ఎంతో గొప్ప మనసుతో కరీంనగర్ రావడానికకీ మూడురోజుల పాటు వుండి న్యాయ నిర్ణయం చేయడం తో పాటు ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ లో శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఫెస్టివల్ కి, ఫిల్మ్ మేకింగ్ వర్క్ కి నవతరంగం.కాం., ఫిల్మ్ తెలంగాణ.కాం లు చాలా సపోర్ట్ చేశాయి. విస్తృత ప్రచారానికి దోహదపడ్డాయి. నేనూ ఫెస్టివల్ డైరెక్టర్ గా ఈమైల్స్ ద్వారా, ప్రెస్ మీడియా ద్వారా ఎంట్రీస్ ఆహ్వానించాను.మొత్తంగా దేశవ్యాప్త ఫిల్మ్ మేకర్స్ నుండి 61 ఎంట్రీలు వచ్చాయి. కరీంనగర్ లాంటి పట్టణంలో జరిగే ఫెస్టివల్ ఆ మాత్రం ఎంట్రీస్ రావడం పెద్ద విషయమే ననుకున్నాం. 2010 మార్చ్ 18 నా ఫిల్మ్ భవన్ లో ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. అప్పటి శాతవాహాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఇక్బాల్ అలీ జ్యోతి వెలిగించి ఉత్సవాన్ని ఆరంభించారు. ప్రారంభోత్సవం లో పోటీలో పాల్గొంటున్న పలువురు ఫిల్మ్ మేకర్స్ తో పాటు కఫిసో కార్యవర్గం అంతా పాల్గొన్నారు. ప్రారంభ సమావేశంలో ఆచార్య ఇక్బాల్ అలీ మంచి సినిమాల  ప్రభావాన్ని అవసరాన్ని గురించి మాట్లాడారు. జ్యూరీ సభ్యులు ఏం.వి.రఘు, కాకరాల, ప్రవీణ్, రిసోర్స్ పర్సన్ వెంకట సిద్దా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజుల ఫెస్టివల్ 18న సాయంత్రం మొదలయింది.

ఇక 19 నా ఉదయం ఫిల్మ్ భవన్ లో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ ప్రారంభమయింది. వర్క్ షాప్ ని అప్పటి జిల్లా విద్యాధికారి శ్రీ రామేశ్వర రాజు లాంఛనంగా ప్రారంభించారు. ఆయన ఎంతో ఆసక్తితో అభిమానంతో వర్క్ షాప్ అవసరాన్ని గురించి మాట్లాడారు. ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా యువతీ యువకులు కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలనుండి కూడా పాల్గొన్నారు. అదెంతో ప్రోత్సాహకరంగా అనిపించింది. అంతే కాకుండా స్థానిక మా ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో పీజీ డిప్లొమా కోర్స్ చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులు, మహిళా కాలేజీ నుండి కూడా పలువురు పాల్గొన్నారు. కఫిసో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ లో యువతీ యువకుల ఉత్సాహం చూస్తే తెలంగాణలో సినిమా భవిష్యత్తు ఉన్నతంగా ఉండబోతుందన్న ఆశ కలిగింది.

వర్క్ షాప్ లో శ్రీ వెంకట సిధ్ధారెడ్డి ఆధునిక డిజిటల్ టెక్నాలజీ సినిమా నిర్మాణం పై దాని ప్రభావం, సినిమా ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ తదితర అనేక విషయాల్ని సవివరంగా చెప్పారు. ఇక సుప్రసిధ్ధ సినిమాటోగ్రఫర్ ఏం.వి.రఘు విజువల్ లాంగ్వేజ్, కెమెరా వర్క్, తదితర అంశాల్ని ప్రాక్టికల్ గా కెమెరా లైటింగ్ ఉపయోగించి పార్టీసిపంట్స్ కి బోధించారు. తర్వాత సీనియర్ నటులు శ్రీ కాకరాల తన క్లాస్ లో నటన, నటనలో మెలకువలతో పాటు సినిమా లక్ష్యాలు వాటి సామాజిక రాజకీయ కోణాల్ని సినిమా ప్రభావాల గురించి గొప్ప ప్రేరణాత్మక ఉపన్యాసాలు చేశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ శ్రీ బండారు ప్రవీణ్ తన క్లాస్ లో షార్ట్ ఫిల్మ్ అంటే ఏమిటి డాక్యుమెంటరీ ఫిల్మ్ నిరాణం వాటి అవసరాన్ని గురించి సోదాహరంగా చెప్పారు. పార్టీసిపంట్స్ అందరూ రిసోర్స్ పర్సన్స్ తో మొహమాటాలు లేకుండా మాట్లాడి ప్రశించి తమ అనుమానాల్ని నివృత్తి చేసుకున్నారు. మొత్తం మూడు రోజుల ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ వియజయవంతంగా ప్రేరణాత్మకంగా జరిగింది. కఫిసో సలహాదారులతో సహా మొత్తం కార్యవర్గం సంతోష పడ్డారు. ఇక ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చిన 61 ఫిల్మ్స్ ని జ్యూరీ సభ్యులు వీక్షించి కూలంకషంగా చర్చింది విజేతల్ని ప్రకటించారు. గార్గి సేన్ తీసిన ‘ఎ స్కూల్ ఆఫ్ మై ఓన్’ చిత్రాన్ని PAALAPITTA AWAARD FOR BEST Documentary కి ఎంపిక చేశారు. అవార్డు కింద పదివేల రూపాయల నగదు మెమెన్టో సర్టిఫికేట్ అందజేశాం. అట్లే సెకండ్ డాక్యుమెంటరి కింద కె.పి.శశి తీసిన గాంవ్ చోడబ్ నాహీ చిత్రానికి 5వేల నగదు, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా  సంగీత పద్మనాభన్ తీసిన ;చారులతాయుదే బాక్టీ’ చిత్రానికి పది వేలు, వి.మాధవ్ తీసిన ‘దుర్గ’ చిత్రానికి ద్వితీయ బహుమతి 5 వేలు, నవతరంగం అవార్డు కోసం ఇంద్రాసిస్ ఆచార్య తీసిన ‘లివింగ్ బెయాండ్ ద లైన్’, ఎఫ్.ఎఫ్.సి.అవార్డుకింద మనిష్ సైని తీసిన షార్ట్ ఫిల్మ్ ‘గుల్లాక్’, డాక్యుమెంటరి కి గాను వంశీకృష్ణ తీసిన ‘ఫ్లౌటర్’ ఎంపికయింది. ఇంకా జ్యూరీ ప్రతెక బహుమతుల కింద బాణీ ప్రకాశ్ దాస్ ‘దిస్తాన్త్ రబ్లింగ్స్’, వి.రామనాథన్ ‘నాన్నుమ్ ఒరు పెన్’, శైలేంద్ర కృష్ణ బాగ్డే తీసిన ‘తార’ సినిమాల్ని ఎంపిక చేశారు. మొత్తం ఎంపిక ప్రక్రియలోనూ ముగింపు ఉత్సవంలోనీ జ్యూరీ సభ్యులు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. ఉత్సవం నాలుగవ రోజు సాయంత్రం అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కాఫీసో సలహాదారులు ఎన్.శ్రీనివాస్, నారదాసు లక్ష్మణ్ రావు తో సహా అంతా పాల్గొన్నారు.

అట్లా నేను ఫెస్టివల్ డైరెక్టర్ గా కఫిసో పక్షాన నాలుగు జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించిన అనుభవం ఆనందం నాకు మిగిలింది. వాటితో పాటు మొదటి సారిగా ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ నిర్వహణ అనంతర కాలంలో మా ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ పీజీ కాలేజీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నిర్వహించే అవకాశం కలిగింది.

ఆ వివరాలు వచ్చే వారాల్లో రాస్తాను…

-వారాల ఆనంద్     

97= యాదోంకీ బరాత్

+++++++++++++ వారాల ఆనంద్