Month: May 2023

92=యాదొంకి బారాత్

Posted on

++++ వారాల ఆనంద్

92=యాదొంకి బారాత్

++++ వారాల ఆనంద్

‘కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు’  అంటూ వుండేది మా నానమ్మ.  ఎంత గొప్ప జీవిత సత్యం. అవును మరి ఎవరయినా ఏమయినా పనులు చేసినప్పుడే వాటిపైన వాదాలు వివాదాలు. గొడవలు దాడులు వీటన్నింటి మధ్యా లభిస్తే కొంత అనుభవం, అభినందన. వీటన్నింటినీ తట్టుకుంటూ దాటుకుంటూ పని కొనసాగించాల్సిందే. లేదూ ఏ పనీ చేయకుండా కడుపులో చల్ల కదలకుండా గడిపితే ఏ లొల్లీ లేదు. కానీ అలిశెట్టి ప్రభాకర్ అన్నట్టు ‘అలా కదలకుండా పడివుంటే ఎలా.. నీపై నానా గడ్డీ మొలిచి నీ ఉనికే నీకు తెలిసిది చావదు’.

 @@@

ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో ఉద్యోగం బయట ఫిలిమ్ సొసైటీ కార్యక్రమాలు. అంతా బిజీ బిజీ ‘గవ్వ రాబడిలేదు గడియ రికకాం లేదు’ అంటూ వుండేవాడు మా మిత్రుడు ఒకరు. నేనేమో నవ్వేసి ఊరుకునే వాణ్ని.  ఇష్టమయిన పని చేయడం, కొంత మేరకయినా ఇష్టపూర్వకంగా బతకడమే జీవితనికి సార్థకత కదా అని నేననేవాణ్ణి. ఈ వాదనలు ఎట్లా వున్నా ఫిలింభవన్ వచ్చిన తర్వాత అనేక సినిమాలు ఉత్సవాలు కార్యక్రమాలు కొనసాగుతూనే వున్నాయి. ఆ క్రమంలోనే దీపా మెహెతా నిర్మించిన ఫైర్ ,ఎర్త్ , వాటర్ సినిమాల్ని ఫెస్టివల్ గా నిర్వహించాలని నిర్ణయించాము. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆ సినిమాల్ని ఫిలింభవన్ లో ప్రదర్శించి వాటి పైన చర్చ నిర్వహించాలని మా ప్లాన్. అందుకోసం గాను 28-30 అక్టోబర్ 2007 తేదీల్లో స్క్రీనింగ్స్ ఏర్పాటు చేశాం ‘ఉత్తమ చిత్ర’ సంచికలో కూడా ప్రకటించాం. మంచి రెస్పాన్సే  వచ్చింది. 28న సాయంత్రం ఆరు గంటలకు ‘ఫైర్’ సినిమా స్క్రీనింగ్ మొదలయింది. అనేక మంది సభ్యులు, ఇతర ప్రేక్షకులు హాజరయ్యారు. సినిమా పది పదిహేను నిమిషాల ప్రొజెక్షన్ అయిందో లేదో ఒక్కసారిగా ఓ యువకుల గుంపు ఫిలిమ్ భవన్ లోకి చొచ్చుకు వచ్చింది. డౌన్ డౌన్ అంటూ బిగ్గరగా నినాదాలిస్తూ హంగామాకు దిగారు. ఊహించని సంఘటన కావడంతో మొదట నాకు విషయం అర్థం కాలేదు. బీజేవైఎం జిందాబాద్ అంటూ వుండడంతో నాకు పరిస్తితి అర్థం అయింది. వాళ్ళెవరూ మా మాటల్ని వినే స్థితిలో లేరు. కుర్చీలు ధ్వంసం చేస్తూ నానా గొడవా చేశారు. నేను స్పందిచబోతే మిత్రుడు జగదీశ్వర్ రావు సార్ మీరు మౌనంగా వుండండి అంటూ నివారించాడు. నేను ప్రేక్షకుడిలా వుండిపోవడం తో వ్యక్తిగతంగా నాపై దాడి జరగలేదు. వచ్చిన వాళ్ళ వెంట మొత్తం మీడియా కెమెరాలు వచ్చాయి. అంటే చాలా ప్లాన్ గా వచ్చారు. ఓ అరగంట విధ్వంసం తర్వాత ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా తమ పని చేసుకుని వెళ్ళిపోయారు. ఖబర్దార్ అంటూ. ఒకటి మాత్రం జరిగింది. కుర్చీలు విరిగి పోతే పోయాయి కానీ ఎల్.సి.డి.ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ లాంటివి క్షేమంగా వున్నందుకు సంతోషపడ్డాను. వాటిని మళ్ళీ కొనాలంటే కఫిసోతో అయ్యేపని కాదు. నేను మెళ్లిగా తెరుకుని వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. కేసు రిజిస్టర్ అయింది. తెల్లారి మీడియా అంతా మా వార్తలు ఫోటోలే. ఫిలింభవన్ పై దాడి విధ్వంసం అని. 

ఇంగ్లీష్ పత్రికల్లో వార్తలు చదివి ఇతర ఫిలిం సొసైటీలు, ఫెడరేషన్ తదితరుల నుంచి మీ వెంట మేమున్నాం అంటూ మెయిల్స్, కాల్స్ వచ్చాయి. ఫిల్మ్ మేకర్స్ కూడా కొందరు స్పందించారు. మా వాళ్లెమో మౌనంగా వుండిపోయారు. తీవ్రమయిన స్పందన రాలేదు. ఎవరి స్థానిక ఆబ్లిగేషన్స్ వాల్లవి. ఆ విషయాన్ని అట్లా వదిలేసి నా పనిలో నేను పడ్డాను. కఫిసో కోసం పోలీసు స్టేషన్ కు వెళ్ళడం కేసు లాంటిది నా అనుభవంలో ఇది  పెట్టడం అది రెండవ సారి. మొదటి సారి భూమి విషయంలో కళా రావు పైన వెళ్ళాను. అవన్నీ భిన్నమయిన అనుభవాలు. ఒక్కణ్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత కేసు విషయంలో అంతా కాంప్రమైస్ అన్నారు. మా కార్యవర్గం కూడా ఒప్పందానికే మొగ్గు చూపింది. నేనేమో మనం పని చేసుకోవాలి కానీ ఇలాంటి కేసులు వాటితో కాలం వృధా చేయొద్దని అంగీకరించాను. ఆ ఎపిసోడ్ అట్లా ముగిసింది.

+++++

అప్పటికి నేను సమాంతర సినిమాల పైన విరివిగా వ్యాసాలు రాయడంతో పాటు పలు తెలుగులో పుస్తకాలు కూడా వెలువరించాను. పలు అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం కొన్ని వ్యాసాల్ని ఇంగ్లీష్ లో కూడా రాయడం తో FIPRESCI (అంతర్జాతీయ ఫిలిమ్ క్రిటిక్స్ సంఘం) లో సభ్యత్వం ఇచ్చారు. దానికి ప్రధానంగా హెచ్,ఎన్,నరహరి రావు చొరవ తీసుకున్నారు. సభ్యత్వం రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న ఫిల్మ్ క్రిటిక్స్ తో పరిచయాలు వారి రచనలు చదివే అవకాశం కలిగింది. అదొక గొప్ప సినిమా చైతన్యం. అదే సంధర్భంగా 12వ కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యుడిగా పాల్గొనే అవకాశం వచ్చింది. వారం పాటు ట్రివేండ్రంలో వుండి అంతర్జాతీయంగా వచ్చిన సినిమాల్ని చూడడమే కాదు వాటిలో ఉత్తమమయిన వాటిని ఎంపిక చేసే అవకాశం అది. మా ఫిప్రెస్కీ జ్యూరీ లో బ్రిటన్ నుంచి షీలా జాన్సన్, టర్కీ నుంచి కున్యెట్ సెబోనేయన్ వున్నారు. అక్కడ వున్న వారం రోజులూ ఆ ఇద్దరూ కూడా ఎంతో స్నేహంగా వున్నారు. మొదట ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ కె.ఆర్.మోహనన్ నుంచి లెటర్ వచ్చినప్పుడు ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. అప్పటి దాకా ఫిలిమ్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం, నా పుస్తకాల ఆవిష్కరణ వాటిల్లో జరగడం సంతోషంగా వుండేది. ఫెడరేషన్ మిత్రుల సాహచర్యం ఎంతో ఆనందంగా వుండేది. ఇప్పుడు కేరళ ఫెస్టివల్ లో జ్యూరీ గా వుండడం గొప్ప ఉత్సాహమే కదా. నిర్వాహకులు మొత్తం ఫెస్టివల్ని చాలా మంచి ప్లానింగ్ తో నిర్వహించారు. జ్యూరీ స్క్రీనింగ్స్ కూడా ప్రత్యేకం. ఇక కేరళ ప్రేక్షకుల గురించి చెప్పే పనిలేదు. అక్కడ అనేక దశాబ్దాలుగా వున్న ఫిలిమ్ సొసైటీ ఉద్యమం చైతన్య వంతులయిన  ప్రేక్షకుల్ని తయారు చేసిందనే చెప్పాలి. అధిక శాతం ప్రేక్షకులకు అంతర్జాతీయ సినిమాలతో పరిచయమే కాదు గట్టి విశ్లేషణాత్మక అవగాన కూడా వుందనిపించింది వాళ్ళతో మాట్లాడినపుడల్లా. మా జ్యూరీ కి రెండు విభాగాల్లో ఎంపిక భాధ్యతల్ని ఇచ్చారు. ఒకటి అంతర్జాతీయ విభాగం, రెండవది మలయాళ విభాగం. వీటిల్లో ఉత్తమ సినిమాల్ని ఎంపిక చేసే భాధ్యత మాది. మా జ్యూరీలో చాలా ఆరోగ్యకరమయిన చర్చలు జరిగాయి. ఏకగ్రీవంగా శ్యాంప్రసాద్ దర్శకత్వం వహించిన ‘సీ వితిన్’ సినిమాను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశాం. ఇక అంతర్జాతీయ విభాగంలో 14 సినిమాల్ని చూశాం. వాటిల్లోంచి పోర్చుగీస్ కు చెందిన ‘స్లీప్ వాకింగ్ లాండ్’ సినిమాను ఎంపిక చేశాం. ఆ సినిమా ప్రధానంగా మొజాంబిక్ లో సుధీర్గంగా సాగిన సివిల్ వార్ ప్రతిఫలనాల్ని చూపించింది. విశాలమయిన కాన్వాస్  పైన రూపొందించిన సినిమా అది. సంక్లిష్టమయిన విషయాన్ని గొప్పగా తీశారు. పైగా ఆ సినిమా మీరా క్యూటో రాసిన నవల ఆధారంగా తీశారు. అన్నీ వివరంగా గుర్తు లేవు కానీ ఫెస్టివల్ లో అవార్డు సినిమాలే కాకుండా పోటీ కొచ్చిన సినిమాల్లో పలు సినిమాలు చాలా బాగున్నాయి. ఇంకా ఫెస్టివల్ లో భాగంగా నిర్వహించిన సెమినార్స్, ఓపెన్ ఫోరం లాంటివి ఉత్తేజకరంగా ఫ్రేక్షకుల నుంచి పూర్తి స్పందనతో జరిగాయి. ఒక సెమినార్లో అదూర్ గోపాలకృష్ణన్ తో మాట్లాడే అవకాశం కలిగింది. అప్పుడు ఆయన తీసిన కొత్త సినిమా గురించి నేను కొంత మాట్లాడితే ‘వై డోంట్ యు రైట్’ అన్నారాయన. కళాత్మక సినిమాకు చిరునామాగా మారిన ఆయనతో మాట్లాడ్డం చాలా ఉత్సాహాన్నిచ్చింది.

ఈ ఫెస్టివల్ జరుగుతూ వుండగానే మా జ్యూరీ సభ్యులం కొంత పర్యటన కూడా చేశాం ట్రివేండ్రం లోని అనంత పద్మనాభ స్వామి గుడి, అట్లే బీచ్ లు, పురాతన భవంతులు కోటలు అన్నీ తిరిగిచూశాం. మొత్తంగా కేరళ ఫిలిమ్ ఫెస్టివల్ ఒక గొప్ప అనుభవాన్ని మిగిల్చింది. ఫిప్రెస్కీ కి ధన్యవాదాలు. మొత్తం మీద కేరళ ఫెస్టివల్ అనుభవం సినిమాల పరంగా మనుషుల పరంగా  నాకెంతో నేర్పింది.

ఇక కేరళ నుంచి తిరిగి వచ్చాక కరీంనగర్ లో రెండవ అంతర్జాతీయ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాట్లల్లో మునిగి పోయాను. అది రెండవ ఎడిషన్ కనుక మొదటి దాని కంటే మెరుగ్గా వుండాలన్నది మా ఆలోచన. నాన్ మెట్రో నగరం లో నిర్వహిస్తున్నాం కనుక ఫిల్మ్స్ సేకరణ, ఫిల్మ్ మేకర్స్ ని ఆహ్వానించడం అంతా సులభమయిందేమీ కాదు. అయినా ప్రయత్న లోపం లేకుండా ముందుకు సాగాము. ఫలితంగా గోవా, ముంబై, అస్సాం, కోల్కట్టా, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, హైదరబాద్ లాంటి నగరాలనుంచి కూడా ఫెస్టివల్ కి ఎంట్రీలు వచ్చాయి వాటితో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు యువకులు నిర్మించిన సినిమాల్ని కూడా ఫెస్టివల్ కి తీసుకున్నాం. వ్యక్తిగతంగా దర్శక నిర్మాతలు పంపిన సినిమాలతో పాటు కేరళ లోని SIGNS FESTIVAL, CHENNAI  L.V.PRASAD FILM INSTITUTE ఫిల్మ్స్ ని ప్రత్యేక పాజెజీలుగా ప్రదర్శించాము. ఎల్.వి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్ గా వున్న దర్శకుడు హరిహరన్ నాకు మిత్రుడు కావడం తో ఆ సంస్థ విద్యార్థులు తీసిన డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ని ఆయన పంపారు. ఫెస్టివల్ ని మొదటి రోజు ప్రముఖ దర్శకుడు శ్రీ బి.నరసింగ రావు, కలెక్టర్ శ్రీ ఏం.వి. సత్యనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింగ రావు మాట్లాడుతూ కరీంనగర్ లాంటి ఒక చిన్న  పట్టణంలో ఫిలిమ్ సొసైటీ చేస్తున్న కృషి అంత సులభమయింది కాదు ఆన్నారు. ఉత్తమ విలువలున్న సినిమాల్ని ప్రదర్శించడమే కాకుండా ఉత్సాహవంతులయిన యువ ఫిల్మ్ మేకర్స్ కి వేదిక కల్పించడం ఎంతో ఆహ్వానించదగింది అన్నారు. కలెక్టర్ సత్యనారాయణ కఫిసో వెబ్సైట్ ను ప్రారంభించారు. అయితే ఈ రెండవ జాతీయ ఫెస్టివల్ ని కేవలం ఫిలింభవన్కే పరిమితం చేయకుండా కొత్త తరానికి అందించాలనుకున్నాను. అందుకోసం ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాల, మహిళా కళాశాల ను ఎంపిక చేసుకున్నాను. ఇక్కడ ఫిలిమ్ భవన్ తో పాటు ఆ కాలేజీల్లో కూడా ఫిల్మ్స్ వేయాలనుకుని ప్రిన్సిపాల్స్ ని సంప్రదించాం. ఎస్.ఆర్.ఆర్.ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమార్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్, అధ్యాపకులు డాక్టర్ గండ్ర  లక్ష్మణ రావు, డాక్టర్ పల్లె రాజేశం, డాక్టర్ దామోదర స్వామి, భూపతి రమేశ్, లైబ్రెరియన్ అరుణ, ఎల్.కె.బి.శర్మ తదితరులు ఎంతగానో సహకరించారు. కాలేజీ విద్యార్థుల్లో కనిపించిన ఉత్సాహం ఆసక్తి ఎంతో ప్రోత్సాహకరంగా వుండింది. ఇక ప్రధాన వేదిక ఫిలింభవన్ లో పి.వి.రామ్మోహన్ నాయుడు, పి.ఎం.సుందర్ రావు, చిలువేరి కిశోర్, లతామోహన్ తదితరులు మాట్లాడారు, చర్చించారు. తమ సినిమాల గురించే కాకుండా ఫెస్టివల్ ఇతర సినిమాల గురించి కూడా చర్చ చేశారు. మొత్తం మీద ఆరు రోజుల పాటు సాగిన ఉత్సవం లైవ్ లీ సాగింది.

అట్లా మా రెండవ డాక్యుమెంటరీ ఫిలిమ్ ఫెస్టివల్ ని బాగా నిర్వహించామని నేనూ మా కఫిసో కార్యవర్గం సంతోష పడింది. ఆ సందర్భంగా ఫెస్టివల్ బుక్ కూడా తెచ్చాం. దానికి ముఖచిత్రం అన్నవరం శ్రీనివాస్ రూపొందించారు. ఫెస్టివల్ చిత్రాలన్నింటి సినాప్సిస్, ఫోటోలతో ఆ సంచికను అందంగానే తెచ్చాం.

IT WAS A LIVELY LOVABLE EXPERIENCE FOR ME AS AN ACTIVIST AND FILM CRITIC.

ఇట్లా ఫిలిమ్ సొసైటీ ఉత్సవాలతో పాటు ఒక విశిష్ట మయిన ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. కఫిసో ప్రారంభకుల్లో ఒకరు మా అందరితో కలివిడిగా వుండి అనేక కార్యక్రమాల్లో మమ్మల్ని నడిపించిన వాడు కీ.శే. డి.నరసింహా రావు గారి స్మారకంగా ప్రతి ఏటా ఆయన వర్దంతి రోజున ‘డి.ఎన్.మెమోరియల్ లెక్చర్’ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. దానికి మొట్ట మొదట డీ.ఎన్. కు ఆత్మీయుడు కఫిసో స్థాపకుడు నవలాకారుడు శ్రీ అంపశయ్య నవీన్ ను ఆహ్వానించాలను కున్నాం. ఆయనా ఉత్సాహంగా వచ్చాడు. సినిమా సాహిత్యాల్ని సమన్వయం చేసుకుంటూ గొప్ప ఉపన్యాసం చేశారాయన. స్మారక ఉపన్యాసంలో తాను డి.ఎన్. యాడిలో తాను కదిలిపోయి మమ్మల్నీ కదిలించాడు నవీన్. తర్వాతి ఏడాది స్మారకోపన్యాసాన్ని సుప్రసిధ్ధ జర్నలిస్ట్ సంపాదకుడు మరెవరో కాదు ఏ.బి.కె.ప్రసాద్ గారి తో స్మారకోపన్యాసం ఏర్పాటు చేశాం. అప్పుడు తాను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నారు. ఆనాటి సభకు రచయిత అధికార భాషాసంఘం సభ్యుడు శ్రీ కాలువ మల్లయ్య కూడా పాల్గొన్నారు. ఏబీకే ఆరోజు మక్న్హి మూడ్ లో వుండి సాధికారిక ప్రసంగం చేశాఋ. అట్లా ఫిల్మ్ సొసైటీ సినిమాలు ఫెస్టివాల్స్ సెమినార్స్ తో పాటు మెమోరియల్ లెక్చర్స్ కూడా ఏర్పాటు చేశాం. కానీ ఆ ఉపన్యాస పరంపరని ముందుకు కొనసాగించలేక పోయాం. అనేక కారణాలు అనేక వ్యక్తులు. అదట్లా వుండగా మా ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో కూడా అనేక కార్యక్రమాలు చేశాం. వ్యక్తిగతంగా పత్రికలకు రాయడం, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయడం కూడా అప్పుడే చేశాను…ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను….

-వారాల ఆనంద్

21 మే 2023

92=యాదొంకి బారాత్

++++ వారాల ఆనంద్

శతవంతాల మాస్టర్ ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’

Posted on

శతవంతాల మాస్టర్ ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’

(14 మే నుంచి ఆయన శతవంతాల సంవత్సరం )

-వారాల ఆనంద్

      భారతీయ నవ్య సినిమా ప్రపంచానికి ఆధునికతను, ప్రగతి శీల భావనలను, సామాజిక  వ్యాఖానాన్ని జోడించి ఆవిష్కరించిమ సినీ వైతాళికుడు మృణాల్ సేన్. తన సినీ జీవిత మొదటి రోజుల్లో ఆయన సామాజిక వాస్తవవాద దృక్పథం తోనూ, అనంతర కాలంలో  అంతర్ముఖీనుడై తనదై న ఆధునిక సినిమా భాష్యం తో సినిమాలు తీసి లెజెండరీ ఫిలిం మేకర్ గా నిలిచాడు. తన సినిమాల్లో  సెల్ల్యులాయిడ్ పైన తన తాత్వికతను ఆవిష్కరించిన వాడు సేన్. కలకత్తా నగరం భాతీయ సినిమా రంగానికి అందించిన ముగ్గురు  ఫిలిం మేకేర్స్ గురించి ఆలోచనరాగానే ట్రయాలజీ లాగా రిత్విక్ ఘటక్, సత్యజిత్ రే మృణాల్ సేన్ స్పురణకు వస్తారు. అయితే ముగ్గురూ తమ తమ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమాలు తీసి తమదయిన కిరస్మరణీయమయిన ‘సంతకాన్ని’ ఇండెలిబుల్ సిగ్నేచర్ ని లిఖించి పోయారు.

మే 14 మృణాల్ సేన్ నూరవ జయంతి. ఆయన ఇప్పుడు మానమధ్య లేకున్నా తన సృజనాత్మక జీవితంతో మన మధ్యే వున్న ‘నూరేళ్ళ యువకుడు’ ఆయన.

మృణాల్ సెన్ Sir Charles Chaplin, Sergei Eisenstein, Vittorio De Sica and Jean Luc Godard.లాంటి దర్శకుల సినిమాల తో ప్రభావితుడయిన వాడు. అంతే కాదు  Akira Kurosawa సినిమాల్ని కూడా అమితంగా అభిమానించేవాడు.

 ‘ కొత్త భావనలు, కొత్త ఆలోచనలు కలిగించడానికి,  వాటిని అభివృద్ది పరిచి వాటి ద్వారా కళాత్మక ఆనందం పంచడానికి సినిమా కృషి చేయాలి. అంతే తప్ప కేవలం సాంకేతిక మాయాజాలంతో మాజిక్కులు సృష్టించడం సినిమా పని కాదు’ అని విశ్వసించిన వాడు ఆయన. తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం లో మృణాల్ సెన్  ౩౦కి పైగా సినిమాలు రూపొందించాడు. తన తొలి నాళ్ళల్లో ఆయన తీసిన ఇంటర్వ్యూ, కలకత్తా 71, పదాతిక్ సినిమాల ట్రైయాలజీ తో ఆయన ప్రగతిశీల రాజకీయ భావాలు కలిగిన  దర్శకుడిగా నిలబడ్డాడు. వామపక్ష భావాల్ని  అభిమానించిన మృణాల్ సెన్ కి కలకత్తా యే చిరునామా. అక్కడి వీధుల్ని, మనుషుల్నీ, వారి తత్వాల్నీ పరిశీలించడమే కాదు వారిలో మమేకమయి దృశ్యాల్ని చిత్రబద్దం చేశారు. మృలాల్ దా  అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మృణాల్ సెన్ సహచరి గీత సెన్ గొప్ప నటి.  

    మృణాల్ సెన్  1923  మే 14 న తూర్పు బెంగాల్ (ప్ర స్తుతం బంగ్లాదేశ్) లోని ఫరీద్పూర్ లో జన్మించాడు. తన ఇంటర్ విద్య పూర్తి చేసుకొని కలకత్తా చేరుకున్నాడు. మృణాల్ సేన్ తన యవ్వన దశలోనే స్పానిష్ సివిల్ వార్, ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాల తో అమితంగా  ప్రభావితుడయ్యాడు.  సేన్ ఎస్ ఎఫ్ ఐ సంస్థలో కార్యకర్తగా పనిచేసాడు. తన కార్యరంగాన్ని పూర్తిగా ఇండియన్ పీపుల్స్ థియేటర్ తో పెన వేసుకున్నాడు. అక్కడే పరిచయమయిన గీతా ను ప్రేమించి పెళ్లి  చేసుకున్నాడు.

    డిగ్రీ చదువు పూర్తి అయిం తర్వాత సేన్ ఆర్ధిక స్థితి దయనీయంగా ఉండేది. రోజూ తన సమయాన్ని అధిక శాతం ఇంపీరియల్ లైబ్రరీలో గడుపుతూ సినిమా కు సంబంధించన అనేక పుస్తకాలు చదవడం తో పాటు చార్లీ చాప్లిన్ పైన ఒక పుస్తకం కూడా రాసాడు. 1947 రే, చిదాదాండ్ దాస్ గుప్తా, నిమాయ్ ఘోష్ ల తో కలిసి కలకత్తా ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసి దాని వెలుగున అనేక గొప్ప సినిమాల్ని చూశాడు. ప్రపంచాసినిమా తో పరిచయం అవగాహన ఫిల్మ్ సొసైటీ తోనే కలిగింది. పారడైస్ కేఫ్లో ఘటక్ రే తదితరులతో పాటు సినిమా చర్చల్లో పాల్గొనే వాడు. 1952 దేశంలో మొట్టమొదటి సారి జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రషోమాన్, ఓపెన్ సిటీ, బైసికిల్ తీఫ్ లాంటి సినిమాలు చూసి తన దృక్పధానికి పదును పెట్టుకున్నాడు మృణాల్  సేన్. 1956 తన మొదటి సినిమా ‘రాత్ భూరు’ రూపొందించాడు. తన మొదటి ప్రయత్నాన్ని విఫల ప్రయత్నం గానే మృణాల్  సేన్ భావించినప్పటికి తర్వాత సేన్ ‘నీల్ ఆకాశార్ నీచే’ రూపోనించాడు.  చైనా యువకుడికి బెంగాల్ యువతికి నడుమ జరిగిన ప్రేమ అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా నిర్మించాడు. ప్రధాని  నెహ్రూ ఆ  సినిమాను గొప్ప సినిమా గా అభినందించాడు. తర్వాతి కాలం లో చైనా యుద్ధ సమయంలో ఆ  సినిమాను నిషేదించారు.   

‘బైసే శ్రావణ్’ మృణాల్ సేన్ తీసిన మూడవ సినిమా. వెనిస్, లండన్ తదితర ఫెస్టివల్స్ లో ప్రశంసల్ని అందుకుంది ఆ సినిమా.

 ఆ తర్వాతి కాలంలో ఫ్రెంచ్ మాస్టర్స్ ప్రభావం తో మృణాల్ సేన్ సినిమా నిర్మాణ సరళి లో  పెద్ద మార్పు వచ్చింది. వివరణాత్మక ధోరణి నుండి వైదొలిగి తనదయిన క్లాసిక్ ధోరణికి మారిపోయాడు. తర్వాత ఉన్నత వర్గాల పైన పేరడీ గా సేన్ 1965 లో ‘ ఆకాష్ కుసుం’ సినిమా నిర్మించాడు. తర్వాత ఒడియా భాషలో సేన్ ‘ మథిర మనిష’ సినిమా తీసాడు.

       1969 లో మృణాల్ సేన్ ‘ భువన శోం’ రూపొందించాడు. అది మృణాల్ సిగ్నేచర్ ఫిలిం గా మిగిలిపోయింది. ఉత్పల్ దత్ , సుహాసిని మూలే లు ప్రధాన పాత్రల్ని ధరించిన ఈ సినిమా ప్రముఖ రచయిత బలాయి చంద్ ముఖోపాధ్యాయ్  రాసిన చిన్న కథ ఆధారంగా నిర్మించబడింది. గ్రామీణ నగరాల నడుమ ఉండే అంతరాల్ని, మోనో టానీ , ఒంటరితనం తదితర అనేక అంశాల్ని ఆవిష్కరించిన హిందీ సినిమా అది. భారతీయ నవ్య సినిమా చరిత్రలో భువన శోం ది  గొప్ప స్థానం.  అందులో సెన్ ప్రధానంగా వ్యంగ్యాన్ని ప్రధానంగా వాడుకుని సమాజం లోని డొల్ల తనాన్ని చూపించాడు. ఈ సినిమా సెన్ సేనిమాల్లోకెల్ల ఆర్థికంగా గొప్ప విజయ వంతమయిన సినిమా. అంతే కాదు ఈ సినిమాకు మరో ప్రత్యేకతకూడా వుంది ‘సాత్ హిందూస్థానీ’తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాముందే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. కేవలం 300 రూపాయల పారితోషకమ్ తో ఈ సినిమాకు అమితాబ్ డబ్బింగ్ చెప్పాడు. ఇదిప్పుడు ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.

ఆ తర్వాత మృనాల్ సేన్ తన రాజకీయ విశ్వాసాల బహిరంగ ప్రకరణలు గా చెప్పుకొనే కలకత్తా ట్రిలోజీ సినిమాలు వచ్చాయి. అప్పటి కలకత్తా నగరంలో పెల్లుబికిన రాజకీయ అంతర్మధన స్థితులు, ఉడికిపోతున్న సామాజిక స్థితిగతుల్ని ఈ మూడు సినిమాలు గొప్పగా ప్రతిభావంతంగా చూపించాయి. మొదట 197౦ లో ‘ ఇంటర్వ్యు’ వచ్చింది. 72 లో ‘ కలకత్తా 71 ‘ ,  73 లో ‘ పదాతిక్ ‘ లు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కమ్యునిస్టు పార్టీలో వచ్చిన విభజన, ఎగిసిన నక్సలైట్ ఉద్యమం నేపధ్యంలో రూపొందాయి. అత్యంత విశ్లేషనాత్మకంగా నిర్మాణమయిన ఈ సినిమాలు ఆనాటి పరిస్థితులను ఆవిష్కరించాయి.

తర్వాత సేన్  74   లో ‘కోరస్’ సినిమా తీసాడు అది జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా గా అవార్డును గెలుచుకొంది.

1976 లో మృణాల్ సేన్ తీసిన ‘ మృగయా’ 1930 ల నాటి స్థితిగతుల పైన తీసిన సినిమా. అడవిలో మనుషుల్ని చంపుతూ వున్నా మృగాల్ని చంపితే ఓ యువకునికి బహుమతిచ్చిన వారే మనుషుల్ని పీక్కు తింటున్న మానవ మృగాన్ని చంపితే ఉరి శిక్ష వేస్తారెండదుకని ప్రశ్నిస్తాడు సేన్. కె. రాజేశ్వర్ రావు నిర్మించిన ఈ సినిమాకు ఒడియా రచయిత భగవతీ చరణ్ పాణిగ్రాహి రచించిన నవల మూలం. ఈ సినిమా చొసిన తర్వాత నేను అత్యంత ఆశ్చర్యానికి గురయ్యాను. ఇది  సరిగ్గా ప్రసిద్ధ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారి ‘యజ్ఞం’ కథను గుర్తుకు తెస్తుంది. మిథున్ చక్రవర్తి మొట్ట మొదటిసారిగా నటించిన  ఈ సిన్మాకు ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది.

ఈ సినిమా తో నాకో గొప్ప సరదా అనుభవం కూడా వుంది. 1982-83 ప్రాంతం లో వేములవాడలో ఫిలిమ్ సొసైటీనడిపిస్తున్న కాలంలో మృగయా బుక్ చేశాం, అప్పుడు సికిందరాబాద్ నుండి బస్ లో ప్రింట్ రావాలి. ఆదివారం ఉదయం షో వేయాలి. టాకీసు ఫిలిమ్ ఆపరేటర్కి శనివారం ప్రింట్ వస్తుందని చెప్పాం. రాత్రి 9 గంటలకు వచ్చే సూపర్ ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూసి ప్రింట్ ను టాకీసుకు పంపించేసి ఇంటికి వెళ్ళాం. మర్నాడు ఉదయమే ఆపరేటర్ ఫోన్ మీరు చెప్పిన సినిమారాలేదు. వేరేదేదో మేరీ గాయ్  వచ్చింది అన్నాడు. మాకు ఒకటే  కంగారూ. ఆఘ మేఘాల మీద నేనూ రవీంద్ర వెళ్ళాం. బాక్స్ మీద ఇంగ్లీషులో MRIGAYA అని వుంది. ఆపరేటర్ కు వచ్చిన ఇంగ్లీష్ తో పుట్టిన కంగారూ అది. సరదా సంఘటన. కలకత్తా ఫెస్టివల్ లో ఒకాసారి మృణాల్ సేన్ ను కలిసి నమస్కారం పెట్టుకున్నాను. మరోసారి హైదరబాద్ ఫెస్టివల్ లో ‘నవ్యచిత్ర వైతాళికులు’ పుస్తకం ఇస్తే తెలుగులో వుంది కదా అని నన్ను అభినందించారు. అవీ సేన్ ను కలిసిన సందర్భాలు.    

 ఇక తెలుగులో మృణాల్ సేన్ ‘ ఒక ఊరి కథ’ తీసాడు. మున్షి ప్రేమ చంద్ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు తిక్కవరపు పట్టాభి రాం రెడ్డి నిర్మాత.

తర్వాత సేన్ ‘ఏక దిన్ ప్రతిదిన్’ , ‘ అకాలేర్ సంధానే’, ‘చల చిత్ర’, ‘ఖరీజ్’, ‘ఖండహార్’ తదితర సినిమాల్ని తీసాడు. ఇక ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారం తో ఆయన తీసిన ‘జెనెసిస్’ రాజస్థాన్  ఎడారుల్లో నిర్మితమయి వినూత్న సినిమా గా పేరొందింది. ఇక బెర్లిన్ గోడ పగులగొట్టడం, తూర్పు యూరప్ దేశాల్లో కమ్యునిజం విఫలం చెందడం తదితర నేపధ్యాలతో సేన్ తీసిన సినిమా ‘మహా పృథ్వీ’. కలకత్తాలోని ఒక మధ్యతరగతి కుటుంబ నేపధ్యంలోంచి అంతర్జాతీయ రాజకీయాల్ని సేన్ చర్చిస్తాడు. తర్వాత తన 76   ఏళ్ల వయసులో సేన్ ‘ అంతరీన్’ సినిమా తీసాడు.

తన మొత్తం సినిమా  కారీర్ లో 27 ఫీచర్ ఫిలిమ్స్, 13 ఎపిసోడ్స్ టివి సీరియల్ తీసిన మృణాల్ సేన్ ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు సంబంధించి భారతీయ ప్రగతి శీల సంతకం. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో ఆయన సినిమాలు ప్రదర్శించబడి అవార్డులు అందుకున్నాయి. దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఫిలిం సొసైటీ ఉద్యమంలో కూడా ఆయన కృషి గొప్పది.

    ఈ సంవత్సరం మృణాల్ సేన్ శతజయంతి సంవత్సరంగా ప్రపంచంలోని మంచి సినిమా అభిమానులంతా నిర్వహించుకుంటున్నారు.

భారతీయ సినిమాకు సంబంధించి ఆయన ఓ లివింగ్ లెజెండ్ అయిన

మృణాల్ దా ని ఆయన సినిమాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.  

-వారాల ఆనంద్

శతవంతాల మాస్టర్ ఫిలిం మేకర్ ‘మృణాల్ సేన్’

ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు

Posted on Updated on

మిత్రులారా! ‘ ఆకుపచ్చ కవితలు’ పైన ‘దిశ’ దినపత్రికలో సమీక్ష వచ్చింది. సంపాదకులకు, సమీక్షకులు  శ్రీ అరవింద్ రెడ్డి గారికి ధన్యవాదాలు –ఆనంద్             

+++++++++

ప్రకృతి పలవరింతలు.. ఆకుపచ్చ కవితలు

బలమైన కవిత పుట్టాలంటే కవికి తీవ్రస్థాయిలో కోపం రావాలి. లేదంటే పట్టలేని సంతోషం కలగాలి. ఏ భావోద్వేగమైనా సరే.. ఉచ్ఛస్థాయిలో ఉండాలి. అప్పుడే ఓ మంచి కవిత పుడుతుంది. మనసును ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తోంది. తెలుగునాట ప్రభావం చూపిన కవిత్వమంతా అటువంటిదే. మనం ఈ నేల మీద పుట్టాము కాబట్టి.. మన మాతృభాష తెలుగు కాబట్టి.. మనకు తెలుగులో రాసిన కవిత్వం మాత్రమే చదువుకొనే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో గొప్ప కవిత్వం పుడుతుంది. బహు భాషాపండితులు ఆ కవిత్వాన్ని చదివి ఆస్వాదించగలుగుతారు. కానీ సామాన్యులకు సాధ్యం కాదు. అందుకోసం పుట్టుకొచ్చిన ప్రక్రియే అనువాదం.. ప్రపంచ సాహిత్యంలో, లేదంటే మనదేశంలోని ఇతర భాషల్లో ఆలోచింపజేసే సాహిత్యాన్ని ఎందరో అనువాదకులు తెలుగుకు పరిచయం చేశారు.

కానీ దురదృష్టవశాత్తు అనువాద సాహిత్యం చాలా సార్లు కృతకంగా ఉంటుంది. మూలం చెడకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా అనువాదకులు కాస్త కఠినమైన భాషలో రాస్తుంటారు. కథా రచన, నవలా రచన అనువదించినప్పుడే ఆ భాష సామాన్యులకు ఓ పట్టాన అంతు చిక్కదు. అటువంటిది కవిత్వమైతే ఇంకా కష్టం. తెలుగులో గొప్ప అనువాద రచనలు లేవని కాదు.. మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసం కూడా అనువాద ప్రక్రియలో వచ్చిందే. అప్పటి కవులు స్వేచ్ఛను కూడా తీసుకొని.. తమదైన శైలిలో మూలం చెడకుండా భారతాన్ని రాశారు.

అయితే ప్రపంచ సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనలను తెలుగులో ఎందరో కవులు మనకందించారు. ఆ చిట్టా ఇప్పుడు అనవసరం కానీ..

గుల్జార్ రాసిన గ్రీన్ పోయెమ్స్ ను ఆకుపచ్చ కవితలు పేరిట వారాల ఆనంద్ తెలుగులో అనువదించారు. ఈ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆకుపచ్చ కవితలు పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకంలో ఉన్న కవితలు చదువుతుంటే మనకు అచ్చం తెలుగు కవిత్వం చదువుతున్న ఫీల్ కలుగుతుంది. ఎక్కడా అనువాదం అనే భావం కలగదు. హిందీ కవితను కూడా పక్కనే చేర్చారు కాబట్టి.. హిందీ తెలిసిన వారు మూల కవితను పోల్చి చూసుకొనే అవకాశం ఉంది.

మొదటి కవిత నది..

తనలో తాను గుసగుసలాడుతూ

నది ప్రవహిస్తున్నది

చిన్న చిన్న కోరికలు తన హృదయంలో

కదలాడుతున్నాయి

జీవితాంతం ఇసుక తీరాలపై జారుతూ కదిలిన నది

వంతెన మీద నుంచి ప్రవహించాలనుకుంటోంది.

ఇది మొదటి కవిత.. రచయితకు ప్రకృతి మీద ఎంత ప్రేముందో ఈ కవితతో మనకు అర్థమవుతుంది. ఓ నది పడే ఆవేదనను అద్భుతంగా అక్షరీకరించింది ఈ కవిత. ఇందులోని పంక్తులు చదువుతుంటే అచ్చం ఓ తెలుగు కవితను చదువుతున్నట్టే ఉంటుంది తప్ప.. అనువాదమనిపించదు.

గుల్జార్ ప్రకృతి కవి.. నది మీద, మబ్బుల మీద, శిశిరంలో రాలే ఆకుల మీదే ఆయన దృష్టంతా ఉంది. ఆ ఆకుపచ్చ కవితలన్నీ నిజంగానే నదికి మనసుంటే.. మబ్బులకు గొంతు ఉంటే అవి ఇలాగే పలవరిస్తాయేమో అనిపిస్తుంది. శిశిరంలో రాలే ఆకులు .. కొమ్మలకు ఏం చెబుతాయన్నది అచ్చంగా మానవ సంబంధాలను తలపిస్తాయి. చెట్టు మీద కొమ్మ మీద రాలే ఆకు మీద కవికి ఉన్న దృష్టికి నిజంగా అబ్బుర పడతాం..

వీధి మలుపులో వృక్షం అన్న కవిత నిజంగా గుండెలను బరువెక్కిస్తుంది. చెట్టుకు మనిషికి విడదీయలేని సంబంధం ఉంటుంది. తనకు ఎంతో అనుబంధం ఉన్న ఓ భారీ వృక్షాన్ని మున్సిపల్ అధికారులు తన కండ్ల ముందే కూలదోస్తుంటే.. ఏ మనిషికైనా హృదయం బరువెక్కకుండా ఉంటుందా? ఇక కవి అయితే ఆ బాధను అక్షరీకరించకుండా ఉంటాడా.. అలా పుట్టిందే ఈ కవిత..

సూర్యుడితో ఓ చెట్టు చెప్పుకొనే వేదనే సూర్యుడి వేళ్లు కవిత. మనుషులు ఎంత కఠినంగా ఉంటారో.. చెట్ల మీద తమ పేర్లను ఎలా చెక్కుతారో ఓ చెట్టు పడే ఆవేదన ఈ కవిత..

‘మూసేస్తున్న బావి’  ఈ కవిత పల్లెల్లో జరుగుతోన్న విధ్వంసానికి అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా పల్లె టూర్లలో చేదుడు బావులు, ఊట బావులు ప్రజల దాహార్తి తీర్చాయి. అవసరాలు కూడా. కానీ నేటి వాటి ఉనికి లేదు. బావుల జాడ కనిపించడం లేదు. కొన్నివిధ్వంసమయ్యాయి. మరెన్నో కనిపించకుండా పోయాయి. ఆ మూత పడ్డ బావులపై కవి వేదన ఎంతో అర్థవంతంగా ఉంది. ఆలోచనాత్మకండా కూడా..

మొత్తంగా అన్ని కవితలు కదిలించేవే. చెట్టు, పుట్ట, నది, మబ్బు, వర్షం, ఆకాశం ఇలా పుస్తకమంతా ప్రకృతి పలవరింతే.. ప్రకృతి మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తుంటే.. మనిషి మాత్రం దాన్ని మరిచిపోయి పగబట్టినట్టు ప్రకృతిని చెరబడుతున్నాడు. చెట్లను ధ్వంసం చేస్తున్నాడు. నదులను చెరబడుతున్నాడు. వాటి ఉనికి ధ్వంసం చేస్తున్నాడు. రచయిత ఇదే ఆవేదనను వ్యక్తం చేశాడు. రచయిత భావాలను  అనువాదకులు వారాల ఆనంద్ అద్భుతంగా అక్షరీకరించారు. 155 పేజీలున్న ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే.

ప్రతులకు సంప్రదించండి

9440501281

– అరవింద్ రెడ్డి మర్యాద, 8179389805

పునాదులు గట్టివి

Posted on

+++++ -వారాల ఆనంద్‌

పునాదులు గట్టివి

+++++ -వారాల ఆనంద్‌
‘స్వేచ్ఛ’ నా పేరు
నా పేరంటే నాకు చచ్చేంత ఇష్టం
నేనూ నా పేరూ వేరు కాదు
నేనూ సేచ్ఛావేరు కాదు
ఒకరిని పిలిస్తే మరొకరం పలుకుతాం
ఒక్కో సారి ఇద్దరమూ పలుకుతాం

నా ఊపిరి నిశ్చలం కాదు
నా ఉఛ్వాస నిశ్వాస చలనశీలం
ఒకటి వెంట మరొకటి

‘స్వాతంత్య్రం’ నా నివాసం
బ్యాంకు లాకర్‌ కాదది
రక్తమాంసాలతో నిర్మించుకున్న ఇల్లు

ఎవరి నమ్మకం వారిది
ఎవరి ప్రేమలు వాళ్ళవి
ఎవరి భోజనం వారిది

చాచా చాచీ అక్కా బావా
దాదా దాదీ బేటా బేటీ
అత్తా మామా
అంతా బాగుంటాం

అప్పుడప్పుడూ ఇంటి కప్పుకు
కన్నాలు పడుతాయి
ఎప్పటికప్పుడు ఆ కన్నాల్ని మూసేస్తాం
పెంకుల్ని సర్దిస్తాం

పందికొక్కులు దూరినప్పుడే
కంగారు పడుతాం
అయినా ధోకా లేదు
మా ఇంటి పునాదులు గట్టివి
వెయ్యేళ్ళయినా స్నేహామృతం
కురుస్తూనే ఉంటుంది.

#9440501281

92= యాదోంకీ బారాత్

Posted on

+++++ వారాల ఆనంద్

92= యాదోంకీ బారాత్

+++++ వారాల ఆనంద్

Cinema is the most democratic art.  It uses the most appropriate language for audiences. Film festivals can consolidate and maintain democracy, peace and freedom. Coming together to explore new cultures and celebrate creativity will always be important and film is the perfect medium for that.

సినిమాను ఒక కళ, అన్ని కళల సమ్మిశ్శిత్రం అన్న భావనతో మంచి సినిమాను, కళాత్మక సినిమాను సాధారణ ప్రజానీకానికి దగ్గరగా తీసుకు రావాలనే లక్ష్యం తో మొదలయిన ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో కఫిసో తన పాత్రను విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చింది. ఆ క్రమంలో  భాగంగానే ఫిల్మ్ భవన్ నిర్మాణం. ఆ భవనాన్ని సంపూర్ణంగా లక్ష్య సాధన కోసం వినియోగించాలనే అభిలాషతో కేవలం ఫిల్మ్ స్క్ర్రెనింగ్స్ మాత్రమే కాకుండా ఫిల్మ్ఫ్ ఫెస్టివల్స్, ఫిల్మ్ సెమినర్స్, వర్క్ షాప్స్ లాంటివి నిర్వహించాలనుకున్నాం. ఆ దిశలోనే మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని నేను ప్రతిపాదించాను. కఫిసో కార్యవర్గం ఒకే అంది. ఎట్లా చేస్తారో మీ ఇష్టం అన్నారు. ప్రేక్షకులు ఏదో ఒక మంచి సినిమాను చూసి వెళ్లిపోవడం కాకుండా ఎంపిక చేసిన కొన్ని ఉత్తమ సినిమాల్ని ఏకబిగిన కొన్ని రోజులపాటు చూడడంతో పాటు ఆయా సినిమాల దర్శకులు ఇతర బాధ్యులతో కలవడం వారితో ఇంటరాక్షన్ లతో ఎన్నో అంశాలు చర్చల్లోకి వస్తాయి. దాని వల్ల సినిమా, దాని సబ్జెక్ట్ విషయాలతో పాటు ఆసక్తి వున్నంతమేర టెక్నికల్ అంశాలు కూడా ఫెస్టివల్స్ లో చర్చకు వస్తాయి. నేను వ్యక్తిగతంగా 1986 హైదరబాద్ ఫిల్మోత్సవ్ నుంచి హైదరబాద్, కలకత్తా, ముంబై, డిల్లీ లాంటి చోట్ల జరిగిన అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొన్న అనుభవంతో పాటు ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ. సమావేశాల్లో  చర్చల్లో భాగం పంచుకున్న అనుభవం కూడా కరీంనగర్ లో జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనే ఆలోచనకు మూల కారణమయింది. ఫిలింభవన్ లో ఆధునిక ప్రొజెక్షన్ వసతులు కల్పించుకున్నాం. కాబట్టి ఫెస్టివల్ నిర్వహణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు లేవు. కానీ మెట్రో నగరాలకున్న వసతులు అనుకూలతలు కరిమ్ఙ్గర్ లాంటి చిన్న పట్టణాలకు ఉండవు. పైగా ట్రావెల్లింగ్ సమస్య. దాంతో పాటు పెద్ద దర్శకులు సాంకేతిక నిపుణులు మా కరీంనగర్ కు రావడం అంత సులభం కాదు. అంటే ఆకుండా మెట్రోలకున్న మీడియా ఫోకస్ కూడా మాకు తక్కువే. అయినా నా మాట మీద మా కార్యక్రమ నిర్వహణ మీద నమ్మకం తో పలువురు వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. వీటన్నింటి నడుమ ఫిల్మ్ ఫెస్టివల్  కావాల్సింది సినిమాల ఎంపిక. ఫీచర్ ఫిల్మ్స్ తో ఫెస్టివల్ అంటే మన శక్తికి మించినది అవుతుంది కనుక డాక్యుమెంటర్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనుకున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించేది మొట్టమొదటిసారి కనుక పోటీ రహిత ఉత్సవంగా నిర్వాహించాలన్నది ఆలోచన. అది విజయవంతమయితే తర్వాతి కాలంలో కాంపిటీటివ్ ఫెస్టివల్స్ చేయొచ్చు అనుకున్నాం. ఆ క్రమంలో ఏర్పాట్లకు సిధ్ధమయ్యాము. మొదట కావలసింది ఫిల్మ్స్ ఇన్ డిజిటల్ ఫార్మాట్స్. దానికోసం బెంగళూరు సుచిత్ర కు చెందిన శ్రీ నరహరి రావు, హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి శ్రీ బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి లు ఎంతో సహకరించారు. సూచనలు చేశారు. కొన్ని సినిమాల్ని అందించారు. ముంబై SUHDIR NANDGAONKAR నువ్వు ముంబై వస్తే MAMI  ఫెస్టివల్ వాళ్ళని పరిచయం చేసి సహకరిస్తానన్నారు. అట్లే కలకత్తా ప్రేమేంద్ర మజుందార్ కూడా. అంత సమయం లేదు అనుకుని ఫెస్టివల్ కి అవసరమయిన సినిమాల్ని సేకరించే పనిలో పడ్డాను. నిర్వహణ కోసం కాఫీసో నుంచి వివిధ కమిటీల్ని వేశాం. ఫెస్టివల్ ఛైర్మన్ గా కలెక్టర్ ఏం.వి. సత్యనారాయణ గారు, ఫెస్టివల్ డైరెక్టర్ గా నేను, అసోసియేట్గా కోల రాంచంద్రా రెడ్డి, హాస్పిటాలిటీ కన్వీనర్ గా ఏం.ప్రభాకర్, పబ్లిసిటీ కన్వీనర్ గా పొన్నం రవిచంద్ర, స్క్రీనింగ్ కన్వీనర్ గా రఘురాం, సెమినార్ కన్వీనర్ గా టి.దామోదరస్వామి, ఫైనాన్స్ కన్వీనర్ గా రావికంటి మురలి, సలహాదారులుగా నారదాసు లక్ష్మణ రావు, ఎన్.శ్రీనివాస్ లను వేసుకున్నాం.  పని మొదలయింది. అన్నీ అట్టహాసంగా వుండాలి కదా. ఫెస్టివల్ కోసం పోస్టర్ ని ప్రముఖ చిత్రకారుడు శ్రీ అన్నవరం శ్రీనివాస్ చేత వేయించాము. ఆయన గొప్ప చిత్రకారుడే కాకుండా మంచి మిత్రుడు కూడా. పోస్టర్ తో పాటు ఫెస్టివల్ బుక్ కోసం కరీంనగర్ పట్టణానికి ముఖద్వారం అయిన ‘జూబ్లీ కమాన్’ పెయింటింగ్ వేసి ఇచ్చారు. ఈ జూబిలీ కమాన్ ను నిజాం రాజు సింహాసనం అధిష్టించి 25 ఏళ్ళు అంటే సిల్వర్ జూబిలీ అయిన సంధర్భంగా కరీంనగర్  జాగీర్దార్ నిర్మించాడని చెబుతారు. నిజాం కిరీటం కూడా కామాన్ మీద కనిపిస్తుంది. ఇక మా కరీంనగర్ లో వున్న మరో చారిత్రక నిర్మాణం ‘క్లాక్ టవర్’. మా కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని అంతకుముందు వరకు వున్న ఎలగందల్ నుంచి ఇప్పటి కరీంనగర్ కు 1905 లో మార్చిన  తర్వాత ఇంగ్లీషు వాళ్ళ పాలనలో ఆ క్లాక్ టవర్ నిర్మించారు. ఇక  ఇప్పుడున్న అన్నపూర్ణ కాంప్లెక్స్ స్థానంలో పాత కాలేక్టరేట్, ఇంకా కలెక్టర్ కాంప్ ఆఫీసు, జైలు, చర్చ్ తదితరాలు  నిర్మించారు. ఇప్పటికీ కమాన్, క్లాక్ టవర్ కరీంనగర్ నగర సింబల్స్ గా నిలిచి వున్నాయి. ఇక ఫెస్టివల్ కోసం రూపొందించిన  పోస్టర్ ని కలెక్టర్ ఏం.వి.సత్యనారాయణ గారి చేత రిలీజ్ చేయించాము. శ్రీ అన్నవరం శ్రీనివాస్ అనంతర కాలంలో నావి పలు కవితా సంకలనాలకు భావస్ఫోరక మయిన ముఖచిత్రాల్ని వేశారు.

 ఇక ఫెస్టివల్ విషయానికి వస్తే అయిదురోజుల ఉత్సవాన్ని ప్లాన్ చేశాం. అప్పటికి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న కాఫీసో కి ఈ ఫెస్టివల్ సొంత హాలు లో ప్రతిష్టాత్మక మయింది. ఫిల్మ్ ఫెస్టివల్లో దాపు 50 షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రాల్ని ప్రదర్శించాము. ఇందులో ప్రధానంగా ఆనంద్ పట్వర్ధన్ తీసిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’, గుజరాత్ మత కల్లోలాల గురించి రాకేశ్ శర్మా తీసిన ‘ఫైనల్ సోల్యూషన్’, ‘రీమిక్స్ ఆఫ్ హుస్సైన్’, బి.నరసింగ రావు తీసిన ‘మావూరు’, ‘ఆకృతి’ లాంటివి ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఫీస్టివల్ ను  మొదటి రోజు దర్శకులు ఎడిటర్ శ్రీ బి.లెనిన్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సభలో అతిథిగా దర్శకులు, ఆత్మీయులు శ్రీ అక్కినేని కుటుంబరావు పాల్గొన్నారు. కఫిసో ఫోటో ప్రదర్శనని అప్పటి మేయర్ శ్రీ డి.శంకర్ ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా ఒక రోజు ‘ఎ ఫోకస్ ఆన్ కరీంనగర్’ అన్న విభాగాన్ని స్థానీయ దృక్పధం తో రూపొందించాము. దాన్లో శ్రీ  పోల్సాని వేణుగోపాల రావు రూపొందించిన ‘మనసున మనసై’, శ్రీ రమేశ్ తీసిన ‘నా తల్లి తెలంగాణ’, శ్రీ కే.ఎన్.టి.శాస్త్రి సిరిసిల్లా చేనేత కార్మికుల ఆత్మహత్యల పైన రూపొందించిన ‘డెత్ లూమ్స్’, పోలీసులు నక్సల్స్ నడుమ జరుగుతున్న హింస దాని పర్యవసానాల పైన రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ కిల్లింగ్స్’ లాంటి అనేక ఫిల్మ్స్ ప్రదర్శించాము. ఫెస్టివల్ లో మరో రోజు నిర్వహించిన సెమినార్లో Indian Documentary Cinema- Emerging Trends’ అన్న అంశం పైన ఆసక్తికరమయిన చర్చ జరిగింది. అందులో శ్రీయుతులు హెచ్.ఎన్.నరహరిరావు, కె,ఎన్.టి.శాస్త్రి, సినిమాటోగ్రాఫర్ దర్శకుడు ఎం .వి. రఘు, దర్శకుడు గోపాలకృష్ణ, ప్రకాష్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలూ, ప్రదర్శించిన సినిమాలు అన్నీ కఫిసో సభ్యుల్ని విశేషంగా ప్రభావితం చేశాయి. ఇక ఫెస్టివల్ ముగింపు రోజు అప్పటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు శ్రీ కే.చంద్రశేఖర్ రావు గారిని అతిథిగా పిలిచాము. మిత్రుడు శ్రీ నారదాసు లక్ష్మణ రావు చొరవతో అధి సాధ్యమయింది. అప్పుడు ఎంపీ చంద్రశేఖర్ రావు గారు కరీంనగర్ లో భావన నిర్మాణంలో వున్నారు. ముగింపు రోజు నేనూ లక్ష్మణ్ రావు ఆయన దగ్గరికి వెళ్ళాం. నిర్మాణం పనిని తానే దగ్గర వుండి పర్యవేక్షిస్తున్నారాయన. మాతో పాటు ఫిలిమ్ భవన్ కు వచ్చారు. మొదట హాలు పైన ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చూశారు. ఆప్పుడు ఆయనపై వున్న క్రేజ్ తో అనేక మంది తోసుకుని వస్తే తానే ‘ఏమయ్యా ఫోటోల్ని చూడనీయండి.. నేనెక్కడికీ పోను..’అంటూ నిలువరించారు. తర్వాత జరిగిన సభలో కళలు, సినిమాలు, తెలంగాణ అన్న అంశాల్నీ జోడించి అద్భుతమయిన ప్రసంగం చేశారు శ్రీ చంద్రశేఖర్ రావు. ఆయన ప్రసంగం తర్వాత అధ్యక్ష్య స్థానంలో వున్న ‘ఈ ప్రసంగం విన్నతర్వాత మిమ్మల్ని కేవలం రాజకీయ నాయకుడు అని ఎవరంటారు సర్’ అన్నాను. ఆయన నవ్వేసి ఊరుకున్నారు. మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు, శ్రీనివాస్, నరహరి రావు తదితరులు ప్రసంగించారు. ఎంపీ గారు తన ఒక నెల జీతం కాఫీసోకు ఇస్తామన్నారు, జీవిత సభ్యుడిగా వుంటానన్నారు. తర్వాత అవేమీ జరగలేదు అది వేరే విషయం అనుకోండి.

అట్లా కఫిసో మొదటి జాతీయ స్థాయి  ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది.

 తర్వాత పర్యావరణంలో ప్రధాన మయిన నీరు అంశాన్ని తీసుకుని ఆగస్టులో ఫిలిమ్ భవన్ లో ఒక ప్రత్యేక ఫిలిమ్ ఫెస్టివల్ ఏర్పాటుచేసాము. అప్పటికే బెంగళూరు తదితర కేంద్రాల్లో నిర్వహిస్తూ వచ్చిన “ VOICES FROM WATERS”  INTERNATIONAL FILM FESTIVAL ON WATER’  ఉత్సవాన్ని కరీంనగర్ కు తెచ్చాము. బెంగళూరుకు చెందిన నా మిత్రుడు జార్జ్ కుట్టి, హైదరబాద్ కు చెందిన సరస్వతి కవుల తదితరుల సహకారం తో ఈ ఫెస్టివల్ ఏర్పాటయింది. కుట్టి అప్పటికే ‘DEEP FOCUS’ సినిమా పత్రికకు సంపాదకుడిగా వున్నాడు. అది సినిమా గురించి చాలా సీరియస్ అంశాల్ని గురించి వ్యాసాలు, వ్యాఖ్యల్ని ప్రచుర్ఞ్చెది. చాలా గొప్ప పేరున్న పత్రియకది దానితో పాటు జార్జ్ కుట్టీ కూడా పేరున్నవాడు. ఆ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాట్లు ఘనంగానే చేశాం. పోస్టర్ విడుదల, ఉత్సవ నిర్వహణ లు కాఫీసో మిత్రుల్నే కాకుండా పలువురు పర్యావరణ వేత్తలు,అసంఖ్యాక ప్రేక్షకుల నడుమ ఆ ఉత్సవం పది రోజుల పాటు విజయవంతంగా జరిగింది.  

అప్పుడే ఆ ఉత్సవాల తర్వాత కఫిసో పక్షాన ఫిలింభవన్ లో ‘ఎర్త్’.‘వాటర్’ ,‘ఫైర్’మూడు సినిమాల తో దీపా మెహేతా ఫిలిమ్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేశాము.  ఆ సినిమాలకు మంచి  స్పందన వచ్చింది. అయితే ఆ సినిమాల పైన కోపంతో కొన్ని సంస్థలకు చెందిన కొందరు ఫిల్మ్ భవన్ పై దాడి చేశారు. ఫర్నీచర్ పగుల కొట్టి నానా హంగామా చేశారు…అదంతా నేను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాను కనుక అదొక చిత్రమయిన భిన్నమయిన అనుభవం . ఆ రోజు నాకు శ్రీ జగదీశ్వర్ రావు లాంటి  ఒకరిద్దరు మిత్రులు అండగా వుండి నాపై భౌతిక దాడి జరగకుండా చూశారు.

ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.

-వారాల ఆనంద్                               

వారాల ఆనంద్

Posted on

‘కవిత్వం’

వారాల ఆనంద్

‘కవిత్వం’

+++++

మైదానం లో బాల్యం

@@@

1)

వేసవి సెలవులిచ్చారు

మైదానాల్లో

పువ్వులు విచ్చుకున్నాయి

********************

2)

మైదానంలోకి

అతిథులొచ్చారు

బాల్యం వాసనల ఘుమ ఘుమ

*********************

3)

మైదానాల్లో

పిల్లల వర్కౌట్లు

హోమ్ వర్క్ కి సెలవులొచ్చాయి

**********

4)

మైదానాల్లో

గువ్వలు ఆడుకుంటున్నాయి

స్కూళ్ళ గెట్లకు తాళాలు పడ్డాయి

****************

5)

కేరింతల జోరు

మైదానాల గాలినిండా హోరు

పాపం ‘ సైలెన్స్’ గొంతు మూగబోయింది

*********************

6)

బండి చక్రం లా

మైదానం గిర గిరా గిర గిరా

రన్నింగ్ ట్రాక్ మీద పిల్లలా మజాకా

************

7)

వేసవి కాలం

సూర్యుడికంటే ముందే లేస్తున్నారు

వెళ్ళాల్సింది స్కూలుకు కాదు కదా

**********

😎

స్వరాలూ సరిగమలూ

రాగాలూ అనురాగాలూ

‘బాలసదన్’ నిండా కచేరీలే

**********

9)

తన్నుడు తంతే

బంతి ఆకాశంలోకి ఎగిరింది

పశ్చిమాన సూర్యుడు అస్తమిస్తున్నాడు

**********

10)

వేసవి వేళ

ఆటలున్నాయి పాటలున్నాయి

‘కథల చెట్టు’ అమ్మమ్మే లేదు

**************************

9440501281

Group of happy Gypsy Indian children – desert village, Thar Desert, Rajasthan, India

నది ++++ వారాల ఆనంద్

Posted on

నది
++++ వారాల ఆనంద్

నది
ఎప్పుడూ మౌనంగా వుండదు
గలగల మంటూ వుంటుంది

పగలు సూర్యుడూ
రాత్రి చుక్కలూ చంద్రుడూ
నది తో ముచ్చట్లు పెడుతూ వుంటాయి

నది
ఎప్పుడూ నిలకడగా వుండదు
నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది

పల్లం జారుడు బండలా
తోసుకెళ్తూ వుంటుంది
చల్లగాలి నది వీపుమీద చరుస్తూ
ముందుకు తోస్తుంది

నిద్ర ఎరుగని నది
తీరాలను ఒరుసుకుంటూ
రాళ్ళనీ రప్పల్నీ వంకల్నీ దొంకల్నీ
దాటుకుంటూ
అలసటనెప్పుడో మర్చిపోయింది

తీరికే లేని నది
తనలో తాను కలవరిస్తూ పలవరిస్తూ
ప్రేమించిన సముద్రుణ్ణి చేరేందుకు
పరుగులు తీస్తూవుంది

కాలం తో పోటీగా నది
కదం తొక్కుతూనే వుంది
******** 9440501281
8 MAY 2023 

See less

91=యాదొంకి బారాత్

Posted on

+++ వారాల ఆనంద్

‘ జిందగీ ఎక్ సఫర్ హయ్ సుహానా

యహా కల్ క్యా హో కిస్నే జానా…

హస్తే గాతే జహా సె గుజర్

దునియా కే తు పరవా న కర్..”

రాజేష్ ఖన్నా ను విపరీతంగా అభిమానిస్తున్న కాలం అది. ఆనాటి విజయవంతమయిన  ‘అందాజ్’ లోని ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ మదిలో అట్లా మోగుతూనే వుంది. ‘ఆనంద్’ సినిమాతో రాజేష్ ఖన్నా అంటే ఒక పిచ్చి లాంటి ఫీలింగ్ వుండేది. తర్వాత తర్వాత అది కాస్తా పాటల వైపు బినాకా గీత్ మాలా వైపునకూ మరిలింది. హిందీ సినిమాలూ పాటలూ నా బాల్యాన్నీ, కొంత యవ్వనాన్నీ చుట్టేసుకున్నాయి. ఆక్రమించుకున్నాయి.  క్రమంగా వయసూ  అవగాహన పెరగడంతో పాటు అర్థవంతమయిన సిన్మాల పరిచయం, వాటి వీక్షనాలతో దృష్టి మారి ఫిలిం సొసైటీ ఉద్యమంలోకి, అర్థవంతమయిన సినిమాల వైపు వచ్చేసాను.

2005లో మా కరీంనగర్ ఫిలిం సొసైటీ కి సొంత ‘ఫిలింభవన్’ ఏర్పడిన తర్వాత దాన్ని పూర్తిగా వినియోగంలోకి తేవాలన్నది తపన. కానీ మాకు అన్నివిధాల అండగా వున్న కలెక్టర్ పార్థసారథి గారు బదిలీ అయి వెళ్ళిపోయాక ఒకటి రెండు వారాలు ఎదో తెలియని స్తబ్దత. కొత్త కలెక్టర్ గా శ్రీ ఎం.వి.సత్యనారాయణ వచ్చారు. పార్థసారథి గారు ఉన్నప్పుడే ఒక రోజు సీనియర్ ఐఏఎస్ అధికారి సాంస్కృతిక రంగానికి  హైదరాబాద్ లో అండగా వున్న శ్రీ కే.వి.రామణా చారి కరీంనగర్ కు తన అధికార పర్యటనలో భాగంగా వచ్చారు. కలెక్టరేట్ లో ఆ రోజు సాయంత్రం సమావేశం తర్వాత కలవమని పార్థసారథి గారి నుంచి సమాచారం వచ్చింది.   నేను వెళ్లి కలిసాను. రమణా చారి గారు కూడా ఆదరంగా మాట్లాడారు. మా ఫిలింభవన్ చూడటానికి రండి సర్ అని అడిగాను. ఇవ్వాళ కాదు కాని రేపు ఉదయం వస్తాం. మీ సభ్యులందరిని పిలువు అన్నారు పార్థసారథి గారు. ఇంకేముంది మా ఫిలిం సొసైటీ సభ్యులతో పాటు సాహితీ సంఘాల వారిని, లోక్ సత్తా, వినియోగదారుల మండలి తదితర సంస్థలన్నింటికీ వర్తమానం పంపాము. ఉదయమే కళాభిమానులయిన ఇద్దరు అధికారులు వచ్చారు చిన్న సన్మానం తో పాటు మా సంస్థ వివరాలు చెప్పాను. ఎన్.శ్రీనివాస్ తో పాటు పలువురు మాట్లాడారు. రమణా చారి గారు కూడా అర్థవంతమయిన సినిమా కోసం కృషి చేస్తున్న సంస్థకు సొంత హాలు ఏర్పాటు కావడం తన కెంతో ఆనందంగా వుందని అంటూ పిల్లల కోసం క్రమం తప్పకుండా సృజనాత్మక, ప్రేరణాత్మక కృషి చేయమని సూచించారు. ఆ నాటి చిన్న సభ మా అందరిలో గొప్ప ఉత్సాహాన్ని తెచ్చింది.

ఇక కొత్త కలెక్టర్ గా జాయిన్ అయిన శ్రీ ఎం.వి.సత్యనారాయణ గారిని కలిసే కార్యక్రమం ఒక రోజు పెట్టుకున్నాం. అప్పటికి కరీంనగర్ ఫిలిం సొసైటీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న  ఉద్యమకారుల్లో అధికమంది శ్రీనివాస్ ప్రేరణ తో వినియోగదారుల మండలి, లోక్ సత్తా సంస్థల్లో  పనిచేస్తూ వచ్చారు. కరీంనగర్ లో సాహిత్యానికి ‘సాహితీ గౌతమి’, మంచి సినిమాలకు ఫిలిం సొసైటీ, సామాజిక అంశాలకు పోరాటాలకు వినియోగదారుల మండలి, లోక్ సత్తా సంస్థలు పర్యాపదాలుగా మారిపోయాయి. ప్రగతిశీలమయిన భావాలతో నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తారని ఈ సంస్థలకు ప్రజల్లో విశేష ఆదరణ ఏర్పడింది.

నా మట్టుకు నేనయితే  కరీంనగర్ ఫిలిం సొసైటీ కే పూర్తి సమయాన్ని వెచ్చించాను. ఫిలిం ఫెస్టివల్స్, ఫిలింమేకింగ్ కోర్సులు, శిక్షణలు, పిల్లల సినిమాలు ఇవే నా ప్రధాన కార్యక్రమాలయ్యాయి. మరోవైపు సాహిత్యం కవిత్వంతో వున్న అనుబంధం వల్ల ‘సాహితీగౌతమి’ లో మొదటి నుంచీ అదే అనుబంధాన్ని కలిగి వున్నాను. అధ్యక్ష కార్యదర్శులు లాంటి ప్రధాన బాధ్యతల్ని ఎప్పుడూ తీసుకోలేదు కానీ ప్రతి సందర్భంలో సంస్థ తోనే వున్నాను. ఇక లోక్ సత్తా సంస్థ పైన నాకంత సదభిప్రాయం లేదు. జే.పి. కార్యక్రమాల పైన నాకు మొదటి నుండీ అనేక అనేక అనుమానాలు. తెలంగాణాకు వ్యతిరేకమని ఒక రకమయిన కోపం కూడా వుండేది. కానీ కరీంనగర్ లో అంతా మన వాళ్ళే వున్నారని మౌనంగా వుండేవాన్ని. ఇక వినియోగదారుల మండలి విషయం లో నేను 90 లలో ‘ఈనాడు’కు రాస్తున్న కాలంలో ఒక వింత అనుభవం ఎదురయింది. అప్పటి జిల్లా న్యాయమూర్తి గారే జిల్లా వినియోగ దారుల కోర్టుకు కూడా జడ్జ్ గా వుండేవారు. ప్రత్యేక వినియోగదారుల కోర్టులు ఇంకా అప్పటికి రాలేదు. నేను ఆయన్ని కలిసి ఈనాడు కు వారం వారం ప్రజల ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటందుకు అంగీకరింప చేసాను. ఆయన కూడా ఉత్సాహపడ్డారు. కొన్ని వారాలు ప్ర.జ శీర్షిక బాగా నడిచింది. ఇంతలో వినియోగదారుల మండలి వాళ్ళు జడ్జి గారు ఇట్లా సమాధానాలు ఇవ్వడం సరికాదని ఆయనకే ఫిర్యాదు చేసారు. దాంతో ఆయన నన్ను పిలిచి ఇక ముందు జవాబులు ఇవ్వలేనని న్నారు. నాకర్థం కాలేదు ఆ శీర్షిక ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికే కదా మరి ఈ స్వచ్చంద సంస్థ ఇట్లా ఫిర్యాదు చేయడం ఏమిటని బాధ పడ్డాను. ఒక రకంగా కోపం కూడా వచ్చింది. కానీ అందరూ రోజూ కలిసే వాళ్ళే మిత్రులే. మౌనంగా ఊరుకున్నాను. అప్పటినుండి ఆ సంస్థ పట్ల నాకున్న సదభిప్రాయం పోయింది. కానీ మిత్రులుగా అందరం ఒకటిగానే వున్నాం. విశాలమయిన లక్ష్యాల కోసం కొన్ని ప్రవర్తనల్ని, కొన్ని సమయాల్ని కొన్ని వ్యతిరేక సందర్భాలనీ వదిలేయాలనుకున్నాను. ఆ క్రమంలోనే కలెక్టర్ సత్యనారాయణ గారిని ఫిలిం సొసైటీ, వినియోగదారుల మండలి, లోక్ సత్తా సంస్థల ప్రతినిధులం ఒకరోజు ఉదయాన్నే వెళ్లి  ఆయన్ని కలిసాం. అప్పటికే తనకున్న ఫీడ్ బాక్ తో పాటు మా అందరినీ చూసి ఆయనలో ఉత్సాహం పెల్లుబికింది. మంచికి నేనున్నాను అన్నారు. సంతోషంగా తిరిగి వచ్చాం.

నేనయితే ఫిలిం సొసైటీ విషయాలతో పాటు కలెక్టర్ గారికి మా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ విషయాలూ, మా లైబ్రరీ భావన నిర్మాణానికి జరుగుతున్న జాప్యాన్ని గురించీ మరోసారి కలిసి వివరించాను. నేను మీ కాలేజీకి వస్తాను అన్నారాయన. అంతకంటేనా అన్నాను. కాలేజీలో అప్పటికే ప్రిన్సిపాల్ శ్రీ రాంచందర్ రావు పదవీ విరమణ చేసారు. సీనియర్ ఫాకల్టీ మెంబర్ శ్రీ పి.కొండల్ రెడ్డి ప్రిన్సిపాల్ గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. నేను ఆయనకు చెప్పాను మర్నాడు ఉదయం కలెక్టర్ వస్తారని. ఆయన ఎంతో సంతోష పడ్డారు. ఇంజనీరింగ్ అధికారులు వెంటరాగా కలెక్టర్ సత్యనారాయణ గారు కాలేజీకి వచ్చారు. మొదట కాలేజీ ప్రస్తుత లైబ్రరీని చూద్దామన్నారు. లోనికి వచ్చి లైబ్రరీ అంతా కలియ దిరిగారు. అందులో వున్న బుక్స్, రిఫరెన్స్ వసతులు చూసి చాలా సంతోషపడ్డారు. మరింతగా డెవలప్ చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్, స్టాఫ్ క్లబ్ కార్యదర్శ్ కె.శంకరాచారి, ఎన్.సి.సి. కాప్టెన్ మధుసూదన్ రెడ్డి, ఎస్.గంగాధర్, ఎం.నారాయణ తదితర అధ్యాపక మిత్రులంతా కలెక్టర్ వెంట వుండి కాలేజీ విశేషాలు వివరించారు. నిర్మాణంలో వున్న కొత్త లైబ్రరీ భవనం చూద్దాం అన్నారు. అందరమూ కాలేజీ ప్రధాన భవనానికి బయట పక్కన నిర్మాణమవుతున్న భవనం లోనికి వెళ్లాం. అక్కడా ఆయన మొక్కుబడిగా కాకుండా అన్ని గదులూ పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులకు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. మర్నాటి నుండీ నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. చాలా సంతోష పడ్డాం.  

ఫిలింభవన్ లో ప్రతి సంవత్సరం లాగే కొత్త సంవత్సర సంబరాల్ని 31 డిసెంబర్ 2006 రోజున ఏర్పాటు చేసాం. గౌరవాధ్యక్షులు కలెక్టర్ కూడా వచ్చేసారు. ఆ సదర్భంగా కఫిసో త్వరలో జాతీయ స్థాయిలో షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలను కుంటున్నా మని నేను చెప్పాను. తన వంతు పూర్తి సహకారం అందిస్తానని కలెక్టర్ కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ హామీ ఇచ్చారు.

‘IN INDIA THE DACUMENTARY IS LIKE AN OASISI OF REALITY IN THE FEATURE FILM DESERT OF ARTIFICIALITY’ అన్న రిత్విక్ ఘటక్ మాటలని స్పూర్తిగా తీసుకుని మొట్టమొదటి ‘జాతీయ స్థాయి శాతవాహన షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్’ నిర్వహణ ఏర్పాట్లల్లో మునిగి పోయాను.

ఇంతలో మా కాలేజీ గ్రంథాలయ భవనం నిర్మాణం పూర్తి అయింది. ప్రిన్సిపాల్ కొండల రెడ్డి గారు మంత్రి శ్రీ ఎం.సత్యనారాయణ గారిని ప్రారంభోత్సవాన్ని గురించి సంప్రదించారు. అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి పురందేశ్వరి గారి ప్రోగ్రాం జిల్లాలో వుంది ఆమెతో ప్రారంభంప చేద్దాం. అన్నారు. రాజు తలుచుకున్నంక దెబ్బలకు కరువా అన్నట్టు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. నేను కొత్త భవనంలో వున్న గదులకు పేర్లు పెట్టె పనిలో పడ్డాను. రీడింగ్ రూముకు ‘విశ్వనాథ పఠన మందిరమని’, రెఫెరెన్స్ గదికి పీవీ పేరును, బుక్ స్టాక్ హాల్ కు ‘ఎలగందుల నారాయ’ పేరును రాయించాను. ఇక మొత్తం లైబ్రరీ భవనానికి “శాతవాహన గ్రంధాలయం” అని ఆర్టిస్ట్ తో రాయించాను. గతంలో కాలేజీ ప్రధాన భవనం మొదటి అంతస్తులో హాలుకు ‘కాళోజీ’ పేరును రాయిన్చినట్టుగానే నేనే చొరవతీసుకుని లైబ్రరీ కి కూడా రాయించాను. ప్రిన్సిపాల్స్ కు చెబితే కమిటీలు  తీర్మానాలు అవీ అని రాద్దాంతం చేస్తారని నేనే రాయించేసాను . ప్రిన్సిపాల్స్ నా వెనకాల ఏమనుకున్నారో ఏమో కానీ వాళ్ళ ఇగో లు అవీ పక్కన బెట్టి బాగుంది ఆనంద్ అని మాత్రం అన్నారు. నాలో నేనే నవ్వుకున్నాను. అది కరెక్ట్ కాదు కదా అని తోటి అధ్యాపకులు కొందరు అన్నారు. సరే ఆ పేర్లు కరెక్ట్ కాదు వద్దంటే మలిపించేస్తాను కదా.. అన్నాను. అట్లా కాలేజీ లైబ్రరీకి పేరు నిలబడిపోయింది. ఇంతలో ప్రారంభోత్సవ సమయం రానే వచ్చింది. ఏర్పాట్ల విషయంలో మా లైబ్రరీ సిబ్బంది తో పాటు నాతో స్నేహంగానూ, ఎంతో అభిమానంగానూ వుండే కాలేజీ Electrician శ్రీ నాగరాజు,  Clerk శ్రీ నరేందర్ ఎంతగానో సాయపడ్డారు.

ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి పురందేశ్వరి గారితో పాటు అప్పటి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ సురేష్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తదితరులు అనేక మంది వచ్చారు. రీడింగ్ రూములో  శాతవాహన పుస్తక ప్రదర్శన పేర కరీంనగర్ జిల్లా రచయితల కవుల రచనల్ని, వారి ఫోటోలతో పాటు ప్రదర్శనకు పెట్టాను. ప్రారంభోత్సవ సమయానికి మిత్రుడు కామర్స్ అధ్యాపకుడు శ్రీ బి.రాజమౌళి రిబ్బన్ కట్ చేసే కత్తెర తదితర సామగ్రి తో వున్న ప్లేట్ పట్టుకుని ద్వారం వద్ద నిలబడ్డారు. నేనేమో జనంలో ఎక్కడో వుండి పోయాను. ఇక పుస్తక ప్రదర్శన సమయానికి లోనికి వెళ్లేందుకు యత్నిస్తే శ్రీధర్ బాబు ఏమిటది అంటూ నన్ను నిలువరించారు. అప్పుడు ఏమండీ ఈ హాలు నాదండి నేనిక్కడి భాద్యుడిని అన్నాను. నేను లోనికి వెళ్లి పుస్తకాల గురించి జిల్లా రచయితల గురించి చెప్పాలని నా ప్రయత్నం ఫలించలేదు. కార్యక్రమం ముగించేసి అతిథులు వెళ్లి పోయారు. మేమంతా హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్నాం.

ఇదిట్లా వుండగా కఫిసో నిర్వహించ తలపెట్టిన మొట్ట మొదటి షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ ఏర్పాట్లల్లో మునిగి పోయాను. బెంగళూరు శ్రీ హెచ్.ఎన్.ఎన్.నరహరి రావు, ముంబై శ్రీ  సుదీర్ నందగావుకర్, కొలకత్తా శ్రీ  ప్రేమేంద్ర మజుందార్, హైదరాబాద్ శ్రీ బి.హెచ్.ఎస్.ఎస్.  ప్రకాష్ రెడ్డి, మధురై శ్రీ ఆర్.ఎస్. రాజన్,చెన్నయి శ్రీ కోదండరామన్ లతో సహా పలు ప్రాంతాల ఫిలిం సొసైటీ మిత్రుల్నీ ఫిలిం మేకర్స్ ని సంప్రదించే పనిలో పడ్డాను. కరీంనగర్ లాంటి మారు మూల ప్రాంతంలో ఫెస్టివల్ అనేసరికి కొందరిలో ఉత్సాహం, మరికొందరిలో నిరాసక్తత రెండూ ఎదురయ్యాయి కానీ మొత్తం మీద మంచే స్పందనే వచ్చింది… ఆ వివరాలతో పాటు మేమునిర్వహించిన INTERNATIONAL FILM FESTIVAL ON WATER విశేషాలతో మళ్ళీ వారం కలుస్తాను…

-వారాల ఆనంద్   

7 May 2023