కొత్త దారులు కావాలి

Posted on

DSC_7821

కొత్త దారులు కావాలి

                                                                        అన్ని రంగాల మాదిరిగానే తెలంగాణా సినిమా కూడా ఇవ్వాళ క్రాస్ రోడ్స్ లో వుంది.మౌలికంగా తెలంగాణా సినిమా కు ప్రస్తుతం ఊపిరి పోసి  దాని ఎదిగుదలకు దోహదం చేయాల్సిన స్థితి నెల కొని వుంది. ఇప్పటికీ దశాబ్దాల క్రితం నిర్మిత మయిన తెలంగాణ నేపథ్యం కలిగిన కొన్ని సినిమాలు తప్ప ఇటీవలి కాలంలో పూర్తి తెలంగాణ సాంస్కృతిక జీవన నేపథ్యం కలిగిన సినిమాలు వచ్చిన సందర్భం అతి స్వల్పం. దానికి సరయిన కారణాల్ని కనుగొని చికిత్స చేయాల్సి వుంది. ఎలాంటి భేషజాలు లేని పరిశీలన అధ్యయనం జరిగితే తెలంగాణ సినిమాకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం వుంది.

         నిజానికి సాంస్కృతిక రంగం, కళలు  ప్రజల మనోభావాల్ని అభిప్రాయాల్ని అనుభూతుల్ని విశేషంగా ప్రభావితం చేస్తాయి. బయటకు కనిపించినా లేకున్నా వాటి నీడలు మనిషి జీవన గతిలో స్పష్టంగానో అంతర్లీనంగానో వుండనే వుంటాయి. సాంస్కృత రంగంలో కవిత్వ మయినా, సంగీతమయినా, పెయింటింగ్ అయినా లేదా మారేదయినా అది ఆధునిక కళారూపమయిన సినిమా అయినా మానవ జీవితంతో విడదీయరాని  అనుభంధాన్ని కలిగివుంటాయి.  కానీ ఏ కళారూప మయినా ఎప్పటి కప్పుడు కొత్త ఆలోచనల్ని కొత్త రూపాల్ని, కొత్త దారుల్నీ ఎంచుకోక పోతే అవి క్రమంగా అంతరించి పోయే అవకాశం వుంది . ఆ స్థితిని గమనించి ముందుకు సాగినప్పుడే అవి ప్రజా జీవితంలో సజీవంగా మన గలుతాయి.  తమ ప్రభావాన్ని నిలుపుకొగలుగుతాయి. ఈ నేపథ్యంలో సినిమాకి సంభందించి హాలివుడ్ ,బాలివుడ్,టాలీవుడ్ తదితరాలుగా పిలువ బడుతున్న సినిమా ఇండస్ట్రీ లని చూస్తే అవి ప్రజల నిజమయిన జీవితాల నుంచి ఎంత దూరంగా వున్నాయో అన్న అనేక విషయాలు కనిపిస్తాయి.

        ఆధునిక సమాజంలో సాంకేతికంగా త్వర త్వరగా వస్తున్న ప్రభావాల్ని అందిపుచ్చుకుంటున్న కళా రూపంగా సినిమాని చెప్పుకోవచ్చు. కళ, విలువలకు  స్థానం అంతరించి, కేవలం సాంకేతి అంశాలు మాత్రమే  సినిమా నిర్మాణంలో కనిపిస్తున్నాయి. ఇవ్వాళ అందుబాటులో వున్న తెలుగు సినిమాల స్థితి పరిశీలిస్తే వంద కోట్లు పెట్టుబడి పెట్టి వందల కోట్లు ఎలా వసూలు చేసికోవాలోఅన్న ఒక చట్రంలోకి అది చేరిపోయినట్టు తెలుస్తుంది.  ఇందులో ఆడియన్స్ మేనేజ్ మెంట్, థియేటర్ బ్లాకింగ్, మీడియా కవరేజ్ లాంటి అంశాలే ప్రధానం  అయిపోయాయి.  అంతేకాదు వినోదం పన్ను మినహాయింపు, పైరసీ అరికట్టడం లాంటి కోరికల్తో ప్రభుత్వాల్ని ప్రభావితం చేసి లాభాలు గడించే ప్రయత్నాలూ తెలుగు సినిమా చేస్తున్నది.  ఈ మొత్తం స్థితిలో తెలంగాణ సినిమా రూపొందడం, మనగలగడం అత్యంత క కాష్ట సాధ్యమైన విషయం. తెలంగాణ సినిమా కూడా ప్రస్తుత తెలుగు లేదా హింది వ్యాపార సినిమా లాగా రూపొందాలని భావిస్తే అది అనవసర ప్రయత్నమే.  ఇప్పటికే నిలదొక్కుకుని వేళ్లూనుకుని వున్న ఇండస్ట్రీ లో వూపిరి తీసుకోవడం అసాధ్యమే కాదు అనవసరం కూడా.  మళ్ళీ అలాంటి సినిమాలు తీయడానికి ప్రత్యేకంగా తెలంగాణ సినిమా అవసరమే లేదు.

            అంటే తెలంగాణ సినిమా కొత్త దారుల్ని వెతుక్కోవాలి. తెలంగాణ సమాజం లోని ఆరాటాలూ పోరాటాలు అద్భుతమయిన కథా  సంవిధానం తో అందివచ్చిన సాంకేతికతో తనదయిన స్వంత గొంతు గల సినిమాల్ని రూపొందించగలిగితేనే దానికి  ఉనికి, భవిష్యత్తు వుంటుంది. సరయిన మానవీయ విలువలు కలిగిన విషయాల్ని కథాంశాలుగా స్వీకరించి కళాత్మక వాస్తవిక వాద  సినిమాల్ని రూపొందించ గలిగితే తెలంగాణ సినిమా అనేక విజయాల్ని సాధించగలదు. ఒకటి రెండు కోట్ల పెట్టుబడి తో వంద శాతం వసూళ్లని సాధించిన ఉదంతాలు మనకు ఇటీవలి కాలం లో దేశ వ్యాప్తంగా హిందీ లోనూ వివిధ ప్రాంతీయ భాషల్లోనూ మనకు  కనిపిస్తాయి. అహమద్ నగర్ జిల్లాకు చెందిన యువ రైతు యువకుడు బవూరావు కర్హడే ఇటీవలే తీసిన ‘ఖ్వాడా’  ఇందుకు ఒక మంచి  వుదాహరణ. అంతే జాదు ఈమధ్యే రూపొంది జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన చైతన్య తంహానే నిర్మించిన ‘కోర్ట్’ ఆస్కార్ కు నామినేట్ అయింది. ఇంకా చెప్పాలంటే అవినాష్ అరుణ్ ‘ఖిల్లా ‘, నీరజ్ ఘయవన్ తీసిన ‘మాసాన్’. మణికందన్  కాకముత్తయ్‘, కాను బెల్ తీసిన‘తిథ్లీ’ ఈలా అనేక సినిమాలు సరికొత్త అంశాలతో ఎలాంటి స్టార్ హంగామాలూ లేకుండా నిర్మించబడి విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. జెవితం లోని విభిన్న కోణాలకు చెందిన సరికొత్త అంశాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని నిజాయితీగా సినిమా తీయగలిగితే విజయాలు వరిస్తాయని ఈ సినిమాలు నిరూపిస్తున్నాయి. ఈ చిత్రాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టె అవసరమూ లేదు. పెట్టిన పెట్టుబడికి ధోఖానూ లేదు.

         సరిగ్గా ఇలాంటి సరి కొత్త దారుల ప్రయాణమే తెలంగాణ  సినిమా అనుసరించాల్సి వుంది. విలువల్లేని, ఎలాంటి మానవీయ సువాసనలు లేని ప్లాస్టిక్ పువ్వుల్లాంటి వ్యాపార సినిమాల కోసం తమ శక్తిని దార పోసే బదులు తెలంగాణ చలన చిత్రకారులు విభిన్నంగా ఆలోచించడం ప్రారంభించాల్సి వుంది. అందుకు ఇప్పుడొస్తున్న అంతర్జాతీయ సినిమా పోకడలని అధ్యయనం చేయాలి.

            నిజానికి తెలంగాణ ఒక కథల గని. మానవీయ విలువలకు నెలవు. మనుషుల్ని ప్రేమించడం, కనబడిన వాళ్ళని అన్నా  అని పిలవడం నుంచి అనేక అంశాల్లో విశిష్టతని  చాటు కున్న నేల . అలాంటి తెలంగాణ సమాజం లో సినిమాలకు సబ్జెక్టు లకు కోడువ లేదు. తరచి చూడడమే తెలంగాణ చలన చిత్రకారులు చేయాల్సిన పని.  ఎప్పుడూ గత సినిమాల గురించి మాట్లాడటమే కాకుండా కొత్త దారుల్ని వేసుకుంటూ పోవాల్సిన అవసరం వుంది. కొత్త తరానికి సరి కొత్త చైతన్యాన్ని అందించాల్సి వుంది.

            ఈ విషయం లో తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన అంశాలున్నాయి. కొత్త పరిశ్రమలకు పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న రీతి లోనే తెలంగాణ సినిమాకు ప్రోత్సాహకాలను, సింగిల్ విండో ఆర్థిక ప్రోత్సాహకాల్ని ఇవ్వగలిగితే కొత్త వాళ్ళకు సరికొత్త దారులు వెదికే అవకాశం  కలిగించినట్టు  అవుతుంది.  గతంలో నెహ్రూ ఆద్వర్యంలో ఏర్పాటయిన ఎన్ ఎఫ్ డీసీ లాగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందించ గలిగితే తెలంగాణ సినిమా ఎదిగే అవకాశం వుంది. ఇప్పటికే ఫిలిమ్ సిటీ లాంటి వసతుల పైన చర్యలు చేపట్టిన రాష్ట్ర  ప్రభుత్వం  తెలంగాణ సినిమా పైన కొంత ప్రత్యేక  దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి.

 

 

One thought on “కొత్త దారులు కావాలి

    KVR MAHENDRA said:
    April 5, 2016 at 10:11 am

    yes sir……. we need your advises regulerly….

    Like

Leave a comment