Month: June 2023

Posted on

“24 ఫ్రేమ్స్”

షార్ట్ ఫిల్మ్

నిడివితక్కువ- విస్తృతి ఎక్కువ

***** వారాల ఆనంద్

సినిమా నిశ్చలమయింది కాదు. అది ఓ కదులుతున్న ప్రపంచం. విశిష్టమయిన దృశ్యమాధ్యమం. సినిమా ద్వారా మనం కథ చెప్పం చూపిస్తాం. అలా చూడడంలోనే ప్రేక్షకులకు ఆ కథ పట్ల ఆసక్తి కలగాలి వారందులో మమేకం కావాలి. ఆ సినిమాలోని ఇతివృత్తం పట్ల పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఇష్టం, కోపం, ద్వేషం ఇలా అనేక భావాలు కలగాలి అప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వాళ్ళు ఆ సినిమాని ఆదరిస్తారు అభిమానిస్తారు. సినిమాకు మూలాంశమయింది కథ. కథకుడు కథ రాసినప్పుడు పాఠకుల్ని దృష్టి లోపెట్టుకుని రాస్తాడు. అదే కథకు దృశ్యమాధ్యమంలో సినిమాగానో టీవీ ఎపిసోడ్ గానో లేదా ఇవ్వాల్టీ వెబ్ సెరీస్ గానో, షార్ట్ ఫిల్మ్ గానో రూపొందించాల్సి వచ్చినప్పుడు ఆ కథని దృశ్య రూపంలో రాసుకోవాలి. కథలో వుండే మాధుర్యం దృశ్యరూపంలోకి మార్చినప్పుడు అందులోని మూల భావం, ఆయా పాత్రల ప్రవర్తన, వ్యక్తిత్వాలు, మాట్లాడే భాష లాంటి అనేక  అంశాలను ప్రధానం చేసుకోవాలి. ఆ కథకు చెందిన కథానేపధ్యం, ఆ కథ నడిచే ప్రాంత వాతావరణం, ఆ ప్రాంతీయ పరిమళం దృశ్య మాధ్యమంలో వెల్లివిరియాలి. అప్పుడే అది గొప్ప దృశ్య సృజన అవుతుంది. లేకుంటే పేలవమయి ప్రేక్షకుల తలల మీంచి అట్లా ఎగిరిపోతుంది. 

కానీ ఇవ్వాళ సినిమా అనగానే పెద్ద స్టార్లు, పెద్ద నిర్మాతలు, కోట్ల పెట్టుబడులు, పెద్ద నిర్మాణ సంస్థలు, పాన్ ఇండియా అంటూ అనేకం మన ముందు నియబడతాయి. భీకరమయిన ఫైట్లు, ఫారిన్లో పాటలు గ్రాఫిక్స్, ఇలా మన సినిమాలకు ఒక అప్రకటిత సూత్రం నిర్దేశితమయిపోయింది.భారత దేశ వ్యాప్తంగా ఇలాంటి సినిమాలు తీసేందుకు రూపొందించేందుకు నటించేందుకు ప్రదర్శించేందుకు అనేక మంది నిర్మాతలు, సంస్థలు, గ్రూపులు గుత్తాదిపత్యం చెలాయిస్తూ స్థిరపడిపోయాయి. అదంతా దుర్భేద్యమయిన కోట. మొత్తం సినిమా రంగాన్ని అది నిర్దేశిశ్తుంది, నియంత్రిస్తుంది. వ్యాపార పరంగా కొన్ని విజయాలూ అనేక అపజయాలూ మూట గట్టుకుంటూనే ప్రధాన స్రవంతి సినిమా కొనసాగుతూనే వున్నది. ఒక నిర్మాత ఓటమిపాలై వెనుతిరిగితే వెంటనే మరో నిర్మాత వేదిక మీదికి వస్తూ వుంటాడు. అది సినిమా గ్లామర్ కున్న బలం.

ఈ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా మరో ‘భారతీయ స్వతంత్ర సినిమా’ పాదులు వేయడం చాలా కాలం నుండే మొదలు పెట్టింది. యువకులు విద్యావంతులు విద్యార్థులు సినిమారంగం పట్ల అభిమానం నిబద్దత కలిగి వున్న వారు పెద్ద సినిమాకు దూరంగా తం తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది సరిగ్గా ఆమెరికాలోని 7 మేజర్ స్టూడియోలకు సమాంతరంగా ఎదిగివచ్చిన ఇండిఫిల్మ్, లేదా ఇండిపెండెంట్ ఫిల్మ్ ను పోలి వుంది. అమెరికాలో పారమౌంట్, ఏం.జీఎం.,ఆర్కేయార్,వార్నర్ బ్రదర్స్, ఉనివర్సల్ పిక్చర్స్, ట్వింటియత్ సెంటరీ ఫాక్స్ లాంటి స్టూడియోలు 1920-50 దాకా సినిమా రంగం పై తమ నియంత్రణను కొనసాగించాయి. కానీ వాటికి అవతల నిర్మించబడి పంపిణీ చయబడుతున్న సినిమాల్ని వాళ్ళు ఇండిపెండెంట్ సినిమా అని పిలుస్తున్నారు.అది అమెరికాలో క్రమంగా నిలదొక్కుకుంది. అలాంటి ప్రయత్నాలే కొంతమంది మన దేశంలో కూడా మొదలు పెట్టారు.

ఆధునిక సాంకేతిక అభివృధ్ధి నేపధ్యంలో డిజిటల్ టెక్నాలజీ ఆవిష్కృతం కావడం, డిజిటల్ కెమెరాలూ, నాన్ లీనియర్ ఎడిటింగ్ వసతులూ రావడంతోపాటు ఆ సాంకేతికత వినియోగదారుడికి అందుబాటులో వున్న ధరకి లభించడం తో స్వతంత్ర సినిమా ఎదుగుదలకు పాదులు పడ్డాయి. అవకాశాలు పెరిగాయి. 35ఎం.ఎం. ఫార్మాట్ లో సినిమా నిర్మాణానికి ముడిసరుకు, కెమెరా పోస్ట్ప్రొడక్షన్ వ్యయం అమితంగా పెరిపోయింది. ఇక 16ఎం.ఎం. చిత్ర నిర్మాణమూ, ప్రదర్శనా అదృశ్యం అయిపోయింది. దాంతో డిజిటల్ టెక్నాలజీ నిర్వహణ పరంగానూ, ఖర్చులపరంగానూ అనుకూలంగా మారిపోయింది. ఫిల్మ్ కెమెరాల్లో 1985లో  కాంకార్డర్లు, 1990ల్లో హై డిఫినిషన్ వీడియో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా డీవీడీ ఫైర్ వైర్ టెక్నాలజీ రావడంతో చలన చిత్రనిర్మాణం విపరీతంగా పెరిగి పోయింది. ప్రపంచంలో మొట్టమొదటి హై డెఫినిషన్ డీవీడీ ‘వన్ సిక్స్ రైట్’ 2006 నవంబర్ లో విడుదల అయింది. మొట్ట మొదటి పూర్తి కంప్యూటర్ అనిమేషన్ సినిమా 2004లో విడుదలయింది. ఇట్లా డిజిటల్ టెక్నాలజీ ఇండిపెండెంట్ సినిమా ఎదుగుదలకు తోడ్పడింది. ఆ క్రమంలోనే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ లు ప్రదర్శనా రంగంలో ఈ స్వతంత్ర సినిమాకు గొప్ప అవకాశాన్నిచ్చాయి.  

ఇండిపెండెంట్ సినిమా తో పాటు షార్ట్ ఫిల్మ్ నిర్మాణానికి లభించిన ఈ ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. అనేక దేశాల్లో జాతీయ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణ కూడా షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణం పెరగడానికి ఎంతో దోహదం చేశాయి. ఇంటర్నెట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కూడా గొప్ప ఊపునిచ్చాయి. నిజానికి షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న నిడివి కల సినిమాల నిర్మాణం. ఇది  ఇటీవల ప్రారంభమయింది కాదు. అమెరికాకు చెందిన సినిమా దిగ్గజం చరిత్రలో గొప్ప సుస్థిర స్థానాన్ని పొందిన డి.డబ్ల్యూ గ్రిఫిత్ 450 షార్ట్ ఫిల్మ్స్ నిర్మించాడు. ఆ క్రమంలోనే ఆయన ‘ఫాదర్ ఆఫ్ ఫిల్మ్ గ్రామర్’ గా పేరు గాంచారు. అట్లాగే ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ డేవిడ్ లించ్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ తోనే ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. అంతెందుకు చార్లీ చాప్లిన్ తన జీవిత కాలంలో 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. ఇలా పూర్తి నిడివి సినిమాలకు సమాంతరంగా లఘు సినిమాల నిర్మాణం ఆ రోజుల్నుంచే వుంది.

ఒక కొత్త భావన, సరికొత్త ఆలోచన, ఓ స్పార్క్ ఓ చిన్న కన్సెప్ట్, ఒక లఘు చిత్రానికి సరిపోతాయి. ఆధునిక సాంకేతికత అందించిన డిజిటల్ మాధ్యమంలో షార్ట్ ఫిల్మ్ నిర్మాణం సులభ సాధ్యమయింది. ఓ కవి పెన్నుతో కవిత రాసినట్టుగా ఓ చిన్న కేమరాతో తమ సృజనని తెరపై చూపించే అవకాశం దర్శకులకు ఎంతగానో పెరిగింది.

అంతేకాదు అందరికీ అందుబాటులోకి వచ్చిన సెల్ ఫోన్ కెమెరాతో కూడా నిర్మించే లఘు చిత్రాలకు పోటీలునిర్వహించే సంస్థలున్నాయి. ఇట్లా అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ తో పాటు నవతరంలో పెల్లుబుకుతున్న సరికొత్త భావ పరంపర కూడా షార్ట్ ఫిల్మ్(లఘు చిత్రాల) నిర్మాణానికి వూతమిస్తూ లఘుచిత్ర విప్లవానికి దారితీసింది.

ప్రపంచంలోని ఒక్కో ప్రాంత జీవితమూ సంస్కృతీ చరిత్ర విలక్షణంగానూ వైవిధ్యంగానూ ఉంటాయి.వాటిని రికార్డు చేయడం మిగతా ప్రపంచాని తెలియజేయడం భావితరాల కోసం నిక్షిప్తం చేయడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణం ఎంతగానో తోడ్పడుతున్నది.

ఈ చిన్న నిడివి గల చిత్రాలు కథాత్మకంగా వున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ అనీ, విషయ ప్రధానంగా వున్నప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ అని అంటున్నాం. సాంకేతిక రంగంలో పెరిగిన విస్తృతి మొత్తంగా ఈ చిన్న సినిమాల స్థితి అనూహ్యంగా మారిపోయింది. ముఖ్యంగా యూట్యూబ్ వచ్చాక వీడియోల నిర్మాణం విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఏదయినా భావం చెప్పడానికే కాదు వ్యాపారానికి, ఆటకు పాటకు ఈ చిన్న సినిమాలు ప్రధాన మధ్యమాలయ్యాయి. ఇక ఫెస్బుక్, వాట్సప్, ఇంస్టాగ్రాం, ట్విట్టర్ లాంటి అనేక సామాజిక మాధ్యమాలు వచ్చాక ఈ షార్ట్ వీడియోలు రూపొందించడం ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పోస్ట్ చేయడం విపరీతంగా పెరిగిపోయింది. అందులో అవసరమయినవీ, అనవసరమయినవీ ఎన్నో వుంటున్నాయి. ముఖ్యంగా కాలక్షేప వీడియోలే ఎక్కువ వుండడం విచారకరం. పనికిరాని వీడియోల పోస్టులు చూస్తూ వుంటే అసలు ఈ షార్ట్ ఫిల్మ్స్ యొక్క మౌలిక లక్ష్యం ఉపయోగాలు ఎక్కడికి పోయాయి అనిపిస్తుంది. అయితే ఈ వెర్రితలలు వేసే వీడియోలకు భిన్నంగా అనేక మంది యువతీ యువకులు ఉన్నత విలువలతో ఉత్తమ సాంకేతికతో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే వున్నారు. దేశ వ్యాప్తంగా కోల్ కట్ట, ట్రివేండ్రం, ముంబాయి లాంటి చోట్ల షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్స్  కొనసాగుతూనే వున్నాయి. మన సంస్కృతి, జీవన విధానాల నేపధ్యం లో వస్తున్న లఘుచిత్రాలు కూడా వుంటున్నాయి. అయితే వాటిని చూసే అవకాశాలు పెరగాలి. అంతేకాదు వాటి నిర్మాణం విషయంలో శిక్షణ ఇచ్చే వసతులు కూడా పెరగాల్సి వుంది. తీసింది ప్రతిదీ షార్ట్ ఫిల్మ్ అనకుండా ఒక ఒరవడిని ఒక భావ పరంపరని దృశ్యమానం చేసే నేర్పును నేర్పించే అవకాశాలు ఏర్పడాలి. ముఖ్యంగా కాలేజీ యూనివర్సిటీ కాంపస్ లల్లో కాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ఏర్పాటయి షార్ట్ అండ్ డాక్యుమెంటరీ సినిమాల పట్ల అవగాహన, వాటి నిర్మాణం పట్ల, సాంకేతికత పట్ల శిక్షణ అవకాశాలు ఏర్పరచ గలిగితే మనదగ్గర కూడా గొప్ప షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణమయ్యే అవకాశం వుంది. ఆదిశలో కాలేజీలు విశ్వవిద్యాలయాలూ ప్రభుత్వాలూ ఆలోచించాలి. ముందుకు రావాలి. అప్పుడే ఆరోగ్యకరమయిన సినిమా వాతావరణం ఏర్పడుతుంది.            

++++++++++++++ వారాల ఆనంద్

https://epaper.dishadaily.com/c/72762883

వర్షమా వచ్చిపో…  

Posted on

++++++++ వారాల ఆనంద్

వర్షమా వచ్చిపో…  

++++++++ వారాల ఆనంద్

ఆకాశం తెల్లమొఖమేసింది

భూమి దాహంతో బీటలు వారింది  

లోకం బిక్కు బిక్కు మంటోంది

ఏడబోయినవే మబ్బు తల్లీ

ఏడ దాక్కున్నావ్ ఏడు లోకాల వెనకాల్నా

చిన్న సందులొంచి తొంగయినా చూస్తలేవు

అలిగినవా అలిసినవా

కోపమొచ్చిందా దయతప్పిందా

రోళ్ళు పగుల్తున్నై రోకల్లు ఇరుగుతున్నై

కప్పలు కాటగల్సిపోతున్నై

కన్నీళ్లు కారీ కారీ గుండెలు ఏడారులవుతున్నై

నీకోసం ఎదురు చూసీ చూసీ చుక్కలు కనిపిస్తున్నై

అవును మరి నిన్ను అనేదేముంది

నువ్వు ప్రేమించే పచ్చదనానికి పాడె కట్టాం

నువ్వు ఇష్టపడే అడవులకు చితి పెట్టాం  

నువ్వు అభిమానించే గుట్టల్ని మందుపాతరలు పెట్టి

నేలమట్టం చేశాం

నెలనీ నింగినీ వదల్లేదు ఏం మిగిల్చామని  

వూరనకా వాడనకా పల్లెనకా పట్నమనకా

అభివృధ్ధి బహానాలో అంతా ఇనుము సిమెంటు కంకర

కన్ను తెరిచినా కాలు కదిపినా అంతా పొడి పొడి

తడిలేని మనసంతా ఎడారి ఎడారి

అయినా మబ్బు తల్లీ  

దయతోనో కరుణతోనో ఒకసారి వచ్చిపోరాదే

నాలుగు చినుకుల్ని రాల్చి

మాలో వూపిర్లు నింపి పోదువుగానీ

************ వారాల ఆనంద్

(కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత )

9440501281

వర్షమా వచ్చిపో…  

Posted on

++++++++ వారాల ఆనంద్

వర్షమా వచ్చిపో…  

++++++++ వారాల ఆనంద్

ఆకాశం తెల్లమొఖమేసింది

భూమి దాహంతో బీటలు వారింది  

లోకం బిక్కు బిక్కు మంటోంది

ఏడబోయినవే మబ్బు తల్లీ

ఏడ దాక్కున్నావ్ ఏడు లోకాల వెనకాల్నా

చిన్న సందులొంచి తొంగయినా చూస్తలేవు

అలిగినవా అలిసినవా

కోపమొచ్చిందా దయతప్పిందా

రోళ్ళు పగుల్తున్నై రోకల్లు ఇరుగుతున్నై

కప్పలు కాటగల్సిపోతున్నై

కన్నీళ్లు కారీ కారీ గుండెలు ఏడారులవుతున్నై

నీకోసం ఎదురు చూసీ చూసీ చుక్కలు కనిపిస్తున్నై

అవును మరి నిన్ను అనేదేముంది

నువ్వు ప్రేమించే పచ్చదనానికి పాడె కట్టాం

నువ్వు ఇష్టపడే అడవులకు చితి పెట్టాం  

నువ్వు అభిమానించే గుట్టల్ని మందుపాతరలు పెట్టి

నేలమట్టం చేశాం

నెలనీ నింగినీ వదల్లేదు ఏం మిగిల్చామని  

వూరనకా వాడనకా పల్లెనకా పట్నమనకా

అభివృధ్ధి బహానాలో అంతా ఇనుము సిమెంటు కంకర

కన్ను తెరిచినా కాలు కదిపినా అంతా పొడి పొడి

తడిలేని మనసంతా ఎడారి ఎడారి

అయినా మబ్బు తల్లీ  

దయతోనో కరుణతోనో ఒకసారి వచ్చిపోరాదే

నాలుగు చినుకుల్ని రాల్చి

మాలో వూపిర్లు నింపి పోదువుగానీ

************ వారాల ఆనంద్

(కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత )

9440501281

సొంత వూరు’ పై డాక్టర్ టి.రాధాకృష్ణమాచార్య

Posted on

మిత్రులారా! నా కవితా సంకలనం ‘సొంత వూరు’ పైన డాక్టర్ టి.రాధాకృష్ణమాచార్య సమీక్షా వ్యాసం రాసారు, వారికి సంపాదకులకు ధన్యవాదాలు.

సొంత వూరు' పైన డాక్టర్ టి.రాధాకృష్ణమాచార్య

చిన్నోడి ముక్తకాలు బాల వ్యాకరణ పాఠాలు

Posted on

చిన్నోడి ముక్తకాలు బాల వ్యాకరణ పాఠాలు
***********
వారాల ఆనంద్ సాహితీ లోకంలో పరిచయం అక్కరలేని కలం. చేవున్న కవితలతో నడుస్తున్న గొప్పకవి.అంతేకాదు వార్తా ప్రపంచంలో ఓ మానవీయ వ్యక్తి. మరింక లోతుగా చూస్తే సమాంతర సినిమా శోధకుడు, బోధకుడు కూడానూ. నిన్న సొంత ఊరు సొదలను మన ఎద ఎదల్లో నింపి
ఇప్పుడు చిన్నోడి ముక్తకాలను మన ముందు పరిచారు.ఇక్కడ తాత మనమడు సేఫ్.పాఠకులకు మాత్రం నల్లేరు నడక కాదిది.ఒక బాల్యంలోకి పరకాయ ప్రవేశం చేసి తన బాల్యాన్ని నాస్టాల్జియాలోకి ఒంపుకొని బాల ముక్తకాలను మరో ఆముక్తమాల్యదగా కవిత్వాన్ని అందించారు.ఇటీవలే ఈ కలం గుల్జార్ “గ్రీన్ పోయెమ్స్” తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నది.చిన్నోడి ముక్తకాలు 108 రకాల భావోద్వేగాల రాగమాల. కవిత్వం సినిమాటిక్ గా,డ్రామాటిక్ గా ఉండాలి. కానీ పాథెటిక్ గా కాదు. సీరియస్ గా ఉండి సెన్సషనల్ గా మానసిక ఉల్లాసం వైపు నడవడం స్టాటిక్ నుండి డైనమిక్స్ చేరుకోవడమే కవిత్వం అసలు ఉద్దేశ్యం లక్షమూ కూడా. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ధారాళంగా వారాల ఆనంద్ చిన్నోడి ముక్తకాలు అందుకున్నాయి. బతుకులో ముఖ్యమైన దశ బాల్యమే కదా. ఎందుకంటే బాల్యంలేని బతుకు ఉండదు మనిషికి. తన బాల్యాన్ని కవి తన మనుమడి లో చూసుకోవడం గొప్ప నాస్టాల్జియానే. ఇక పేజీలు అలల్లా కదులుతున్నాయి నా చేతి వేళ్లను తాకుతూ. ఇది నాకు గొప్ప అనుభూతినీ ఆనందాన్నీ ఇచ్చింది. కవి అంటాడూ ఒక ముక్తకంలో ఇలా … “వాడితో ఆడుకుంటున్నా, /కాదు వాడే నన్నాడిస్తున్నాడు/ ఇరవై ఏళ్ళ క్రితం పోగొట్టుకున్నదేదో తిరిగిస్తున్నాడు/”. తన బాల్యాన్ని వారాల ఆనంద్ యాదోంకీ బారాత్ గా ఆవిష్కరించుకుంటూ తన మనుమని బాల్యంలోకి అన్వయ కవిత్వం రాస్తున్నారు. ఇద్దరూ ఆడుకోవం ప్రధానమైన అనుభూతి . ఈ ఇద్దరూ కలిసి పాఠకులను ఆడించం గొప్ప అనుభవమే మరి. బాల్యం చేయని పని లేదుగదా. మరో పోయెమ్ లో “ఈ నడుమ వాకింగ్ కు వస్తలేవేంది… /వాకింగేంది భయ్యా చిన్నోడితో /రన్నింగే అవుతుంటే”/ ప్రతి ఒక్కరికీ బాల్యంలో ఆట ఉరుకులూ, పరుగులూ, దుముకుడూ, పడి లేవడాలూ ఉత్సుకతనూ భయాన్నీ పరిచయం చేసేవే . అయితే వీటి డిగ్రీ ఒకేలా ఉండదు కూడా. దీనిలో తాతను మనమడు ఆడించడమే సజీవ కవిత్వమూ, కవిత్వవంశమూ కూడా. వ్యక్తావ్యక్త బాల్యాన్ని ఆవిష్కరించుకోవడం కవికి గొప్ప వరం. అంతేకాదు వారాల ఆనంద్ కు కొత్త జీవన సారం కూడా. మరో ముక్తకంలో “కవిత్వం చదివాను కనుక నాకు ఉనికి /కవిత్వం రాసాను కనుక నాకు ఊపిరి”/కవికి చిరునామా కవిత్వం బతుకూ కవిత్వమైనప్పుడు ఉనికీ ఊపిరీ కవిత్వమే . మన పనీ పనితనమూ మనలో ప్రవహించడమంటే ఇదే మరి. “చిన్నోడికి నాలుగు అడుగులు వేయడం వచ్చింది /మెష్ డోర్ తీస్తే చాలు /’కవిత్వం ‘/ నడక కొత్తదిగదా పరుగో పరుగు అంటుంది. చిన్నోడి చేష్టలు ఆపడం కష్టమే మరి. ఇది ప్రతి తాత అమ్మమ్మమ్మ జీవితానుభవ సారమే. ఇక్కడ కవిత్వం చెంగో బిళ్ళ మాటలో పొడుగుకుంది. ఎంత గొప్ప మాండలిక నుడికారం. అంతే అస్తిత్వ ప్రతీక కూడా.ఇంకా “మెట్లు ఎక్కుతాడట,/ గోడలు దాటుతాడట,/ గోడలు దూకకుండా చూస్కో అంటున్నాడో మిత్రుడు”/మనిషి ఎదుగుదలలో పెరుగుదలలో మంచీ చెడూ సంగమిస్తాయి . కవి హెచ్చరికగా గోడలు దూకకుండా చూస్కో అని మరో గోతులోంచి పలికించాడు కవి ఆనంద్. ఇదే కవిత్వం చెమక్కు. అలతి అలతి మాటలు, రోజూ మన వాడే భాషలో కవిత్వాన్ని అల్లడం నేర్పూ ఓర్పుకు పరీక్షే మరి. లోగడ ముక్తకాలు కవిత్వం వెలువరించిన కాలానికీ కవికీ ఇది సమస్య కాకపోవచ్చు. అయినా మన రోజూవారీ మాటలను మనం కవిత్వంలోకి ప్రతిక్షేపించడం ఒకింత సాహసం. అంతే స్వాభిమానం కూడా. మరో ముక్తకంలో “వాడికి తెలిసిందల్లా నవ్వులూ కేరింతలూ కవ్వింతలే “/ అంటాడు కవి. చిన్నతనంలో పిల్లల ఆస్తి అదేకదా. కల్మషం మాయామర్మం లేని తెల్ల కాగితం కదా బాల్యమంటే. అది సజావుగా నడిచేలా చూడడమే తాతల పని. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు.సామజిక దృక్పథంలో కవి రచనకు మచ్చుగా చెప్పొచ్చు కూడా. మరో కవితలో “సతాయింపు ఇసుమంత /ఆనందం ‘ఆకాశమంత’/ఆనంద్ కు ఉచితంగానే ఆనందం దొరికింది.ఆనందం ఔషధం. దీనితో మనసూ దేహం మరింత ఆరోగ్యాన్ని తప్పకుండా పొందుతుంది.ఇక్కడ మునుమడు తాతకు మంచి టానిక్.కవికి ఆప్టిమిస్టిక్ ఆప్టిక్.ఆనంద్ కవిత్వం నడక తీరును తన లయ కవితం నుండి నుండి మానేరు తీరం, మనిషి లోపల, అక్షరాల చెలిమె, ముక్తకాలు,సొంత ఊరు కవిత్వం చదివిన తెలుస్తుంది. అందులో చతుర చాతుర్యం, హాస్యం, సామజిక నేపథ్యం, బంధాలూ సంబంధాలూ వాలి విలువలు తెలిపే మెళుకువలున్నాయి. ఇది చూడండి. “ఇంట్లో కర్ఫ్యూ పెట్టినట్టుంది/ చిన్నోడిప్పుడే నిద్ర పోయాడు/”ఎంత సునిశిత భావుకత. ఎంత గొప్ప అభివ్యకి. మమకారం, ప్రేమా రక్తంలా ప్రవహిస్తేనే ఇలాంటి కవిత్వం కవిలో పుట్టుకొస్తుంది నిస్సందేహంగా. కవి స్వయంగా సినీ వాలి. అందువల్ల అనుకోకుండానే సినీ మాటలు, సినీమా ఆటలు సినిమాటిక్ గా వచ్చి వాళ్ళయిక్కడ. కదలడు -వదలడు, చిక్కడు దొరకడు , మోసగాళ్లకు మోసగాడు సాగర సంగమం,ఛాలెంజ్ వంటివి కొన్ని సందర్భం ఔచిత్యం తొణికిసలాడేలా కవితమయమైనవి. ఇది అనుభవం నేర్పిన విద్య. ఇక చివరగా మనుమని విన్యాసం కవి రాతలో ” క్షణంలో గులక రాయి / నోట్లో ఎరగనట్టు/ నవ్వేస్తాడు,’మోసగాళ్లకు మోసగాడు’ /
తాత కవిత్వమంతా మనుమనిపైన ఎలా అల్లుకొని గుండెను అలుముకొందో చెప్పొచ్చు. చిన్నతనం మనను ఎలా నమ్మిస్తుందో చెప్పడం కవి ఉద్దేశ్యంగా నాకు తోచింది. మనుమనిలో తన బాల్యాన్ని చూసుకుంటూ మనకు మంచి బాలల కవిత్వాన్ని అందించిన ఆనంద్ సర్వదా బహుధా ప్రశంశనీయుడు.వారి కలం సేద్యం శ్లాఘనీయం కూడా.

డా.టి.రాధాకృష్ణమాచార్యులు
9849305871.
https://epaper.dishadaily.com/c/72719329

95= యాదోంకీ బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

95= యాదోంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

‘నాలోని లోపాలూ బలాలూ నా స్వంతమే

రైలు పట్టాల్లాంటి వాటి పైననే 

నా బతుకు బండి ప్రయాణం’

అట్లా ప్రయాణం సాగుతూనే వుంది, గడిచిన ప్రయాణంలో ఎంతో మంది తోడు నడిచారు.కొందరు నిలబడిపోయారు. మరికొందరు కూలబడిపోయారు, మిగిలింది కొంత చరిత్ర,, కొంత అనుభవం, మరికొంత ప్రయాణం.

ఆ క్రమంలో   

జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచడం ఎంత కష్టం,
గతం లేని భవిష్యత్తు లేదు. అందుకే ఈ జ్ఞాపకాల వూరేగింపు.

ఆ వూరేగింపు ఒక్కోసారి క్షణకాలం నిలబడిపోయి తిరిగి ఆరంభవుతున్నది.   

నిజానికి

‘గమ్యం తెలియకుండానే  ప్రయాణం మొదలవుతుంది,

ప్రయాణం సాగుతూ ఉంటే

దారులు అవే తెరుచుకుంటాయి.

….

ఆ క్రమంలో నా జీవనయానం లో ముఖ్యమయిన భాగాన్ని ఆక్రమించింది ఫిల్మ్ సొసైటీ ఉద్యమమే. ఫిలిమ్ భవన్ నిర్మాణం తర్వాత మొదటి రెండు జాతీయ స్థాయి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్స్ విజయవంతమయ్యాక ఇక పోటీ ఉత్సవాలు నిర్వహించాలనుకున్నాం. దానికి ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టాం. ఇంతలో మా కఫిసో కార్యవర్గం లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. కొంత కొత్త నీరు రావాల్సిన అవసరం వుందని నేను భావించాను. అందుకోసం ఇద్దరిని కొత్తగా కార్యవర్గం లోకి సభ్యులుగా తీసుకున్నాం. మా టి.రాజమౌళి అంటూనే వున్నారు ‘ఆనంద్ సార్ కొత్త వాళ్ళు అంటున్నారు జాగ్రత్తగా ఆలోచించండి. కఫిసో లక్ష్యాలు, మీ కమిటెడ్ పని తీరుకు సరిపోతారో లేదో చూడండి అని’. కానీ నేనెందుకో ఆయన సూచనల్ని అంతగా పట్టించుకోలేదు. కొత్త రక్తం, కళాకారులు కావాలి అన్నాను. పేర్లెందుకు కానీ ఆ ఇద్దరి కారణంగానే అనంతర కాలంలో అనేక మార్పులు జరిగి కఫిసో తన దారి మార్చుకుంది. నేను తప్పుకోవాల్సి వచ్చింది. నా కొత్త దారి నేను వేసుకుని ముందుకు సాగాను.’జీవన్ చల్నే కా నామ్ చల్తే రహే సుభహో శ్యామ్’ కదా.

అదంతా అట్లా వుంచితే మూడవ జాతీయ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంట్రీల్ని ఆహ్వానించాము.బహుమతులు అందుకున్న సినిమాలకు  ‘పాలపిట్ట’ పేర అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాము. మొదట ఇండియన్ రొల్లర్ అవార్డ్స్ అనుకున్నాం. కానీ పాలపిట్ట సరయిందని వచ్చిన సూచనల్ని ఆమోదించాము. ఫెస్టివల్ ని NSDFF, KARIMNAGAR అని పిలిచాం. ఉత్సవాన్ని 2009 ఫిబ్రవరీ 19-20 తేదీల్లో నిర్వహించాలనుకున్నాం. పోస్టర్ తయారు చేయించాము. మా మిత్రుడు ఆస్థాన చిత్రకారుడు అయిన శ్రీ అన్నవరం శ్రీనివాస్ దాన్నిరూపొందించగా కఫిసో సలహాదారు శ్రీ నారదాసు లక్ష్మణ రావు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఫిల్మ్ భవన్ లో జరిగిన ఆనాటి సభలో కోల రాంచంద్రా రెడ్డి, ప్రభాకర్, టీటీ రావు తదితరులు హాజరయ్యారు.

ఈ చిత్రోత్సవానికి మొత్తం 41 సినిమాలు ఎంట్రీలుగా వచ్చాయి. వాటిల్లో 7 తెలుగుతో పాటు అయిదు చొప్పున ఇంగ్లీష్, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలవి, కాగా మూడు మూకీలు, రెండేసి కన్నడ,తమిళం,జార్ఖండ్ భాషలవి, రాజస్థానీ, జపనీస్, అస్సామీ వి ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. వీటిల్లో దాదాపు అన్నింటికీ వాయిస్ ఓవర్ లేదా సబ్ టైటిల్స్ ఇచ్చారు. ఈ ఉత్సవంలో న్యాయ నిర్ణేతలుగా నా ఆహ్వానం మేరకు సుప్రసిద్ద రచయిత, సినీ దర్శకుడు శ్రీ అక్కినేని కుటుంబరావు, రాకేశ్ అంబటి, డాక్టర్ టి.దామోదరస్వామి వ్యవహరించారు. వారు ముగ్గురూ ఎంట్రీ సినిమాల్ని చూసి చర్చించి విజేతల్నినిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా జ్యూరీ అధ్యక్షుడిగా వున్న శ్రీ కుటుంబరావు గారు ప్రధాన భూమికను పోషించారు.జ్యూరీ మేమిస్తానన్న అవార్డులే కాకుండా మమ్మల్ని ఒప్పించి మొత్తం ఎనిమిది అవార్డుల్ని ప్రకటించారు. ముగింపు సభలో కుటుంబరావు గారు విజేతలయిన సినిమాల  గురించే కాకుండా మొత్తం సినిమా అంటే ఏమిటి మంచి సినిమాలు ఎట్లావుండాలి, డాక్యుమెంటరీ ల లక్ష్యాలేమిటి అన్న అనేక అంశాల మీదా సాధికారక ప్రసంగం చేశారు. పాల్గొన్న కఫిసో సభ్యులు పోటీకి వచ్చిన ఫిల్మ్ దర్శకులు గొప్ప ప్రేరణ పొందారు. విజేతల్లో సుమా జోసెఫ్ తీసిన ‘ ఐ వాంట్ మీ ఫాదర్ బాక్, యాదవన్ చంద్రన్ మల్లికా సారాభాయి లు సంయుక్తంగా రూపొందించిన ‘సోల్ వాయిస్ సోలో వాయిస్’, రాజా దండపాణి దర్శకత్వం వహించిన ‘లెవెల్ క్రాసింగ్’, మేఘనాథ్, బిజూ బొప్పాలు తీసిన ‘ఐరన్ ఈస్ హాట్’ లు బహుమతులు గెలుచుకోగా, మెరిట్ సర్టిఫికెట్స్ పొందిన వాటిల్లో ‘బియాన్ద్ డ హారిజన్’, జయరాజ్ తీసిన ‘నాదమృదంగం’, పోల్సాని వేణుగోపాలరావు తీసిన ‘ఇదీ నాజీవితం’. అట్లా మొత్తంగా మూడవ జాతీయ చిత్రోత్సవం వైభవంగా సాగింది. అందరమూ ఎంతగానో సంతృప్తి పొందాము.

….

మూడవ చిత్రోత్సవానికి ముందే నవంబర్ 8,9 తేదీల్లో ఫిల్మ్ సొసైటీ నిర్వహకుల కోసం రెండు రోజుల రెసిడెన్షియల్ వర్క్ షాప్ నిర్వహించాం. దానికి ముంబై కి చెందిన ఆసియన్ ఫిలిమ్ ఫౌండేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అందించిన సహకారం గొప్పది. అందులో ముఖ్యంగా సంస్థలతో పాటు వ్యక్తులుగా ముంబై కి చెందిన సుధీర్ నంద్గాంవకర్, బెంగళూరుకు చెందిన హెచ్.ఎన్.నరహరి రావు, హైదరాబాద్ కు చెందిన బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి గార్ల సహకారం చొరవ ఎంతగానో ప్రశంసనీయమయింది. ఈ వర్క్ షాప్ ముఖ్యంగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో పని చేస్తున్న ఫిలిమ్ సొసైటీ ల్లోని కార్యకర్తల్లో అవగాహన పెంపొందడానికి, భావాల పరస్పర ప్రసారానికి, చైతన్యం పెంపొందడానికి ఏర్పాటు చేశాం. మన దేశంలో

అప్పటికి ఫిల్మ్ సొసైటీ లది దశాబ్దాల చరిత్ర. సత్యజిత్ రే దీపధారుడిగా 1959 లో ఫెడరేషన్ ఏర్పాటయింది. మొదట అందులో కేవలం 7 సొసైటీలు మాత్రం వుండేవి.అనంతర కాలంలో అనేక మంది ఉత్సావంతుల కృషి ఫలితంగా 2007 నాటికి దేశవ్యాప్తంగా నాకు తెలిసి 300 కు పైగా ఫిల్మ్ సొసైటీలు ఏర్పాటయ్యాయి.ఫిల్మ్ సొసైటీల ఉద్యమాన్ని జాతీయ సాంస్కృతిక నిర్మాణంలో భాగంగా గుర్తించిన భారత ప్రభుత్వం వాటిని ఆర్థికంగానూ హార్దికంగానూ ప్రోత్సహించింది. సినిమాల విషయంలో 80ల్లో వచ్చిన రంగుల టీవీలు, తర్వాత వచ్చిన సీడీ, డీవీడీ లు పెద్ద ప్రభావాణ్ణే చూపాయి. ఫలితంగా ఫిల్మ్ సొసైటీ ఉద్యమం కూడా ఆటుపోట్లకు గురయింది. ఆ నేపధ్యంలో ఫెడరేషన్ కరీంనగర్, కోయంబత్తూర్, మైసూరు లల్లో ఆయా ప్రాంత  ఫిల్మ్ సొసైటీల కార్యకర్తలు ప్రేరణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఈ వర్క్ షాప్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా కొత్తగా సొసైటీల్ని స్థాపించడం, ఉత్తమ సినిమాల ఎంపిక, వాటి ప్రదర్శన, చర్చలు, సెమినార్స్, ఫిల్మ్ కోర్సుల నిర్వహణ, అప్రిసియేషన్ కోర్సుల ఏర్పాటు మొదలయిన అనేక అంశాల పైన ప్రేరణాత్మక ఉపన్యాసాలు ప్రేసెంటేషన్స్ నిర్వహించారు. ఈ రెండు రోజుల కార్యశాలలో కరీంనగర్, వరంగల్, సిరిసిల్లా, మంచిర్యాల తోపాటు రాష్ట్రం లోని అనేక ప్రాంతాల నుండి కార్యకర్తలు వచ్చి పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ లో ఏం.వి.రఘు, జార్జ్ కుట్టి, ఆర్.మణి తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యశాల గొప్ప ఉత్సాహ భరితంగా సాగింది. ఇందులో మా కఫిసో నుండి కోల రాంచంద్రా రెడ్డి, మాటేటి ప్రభాకర్, డాక్టర్ రావికంటి మురళి, రఘురాం తదితరులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

కఫిసో లో ప్రారంభమయిన ఆ కార్యశాలల పరంపర అనేక కాలేజీ కాంపస్ లల్లో కాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ఏర్పాటు చేసిన సందర్భంగా నేను రాష్ట్రవ్యాప్తంగా తిరిగి నిర్వహించాను. ఆ వివరాలన్నీ క్రమంగా రాస్తాను.

ఇప్పటికీ సెలవు…

-వారాల ఆనంద్

18 జూన్ 2023       

Posted on

యాదోంకీ బారాత్

– వారాల ఆనంద్

(PUBLISHED TODAY IN ‘DISHA’ DAILY, THANKS TO THE EDITOR)

”సినిమా అనేది అత్యంత ప్రజాస్వామ్య కళ. ఇది ప్రేక్షకులకు అత్యంత అనుకూలమైన భాషను ఉపయోగిస్తుంది. ప్రజాస్వామ్యం, శాంతి, స్వేచ్ఛను ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏకీకృతం చేయగలవు, నిర్వహించగలవు. కొత్త సంస్కృతులను అన్వేషించడానికి, సృజనాత్మకతను జరుపుకోవడానికి కలిసి రావడం ఎల్లప్పుడూ ముఖ్యమైనది సినిమా దానికి సరైన మాధ్యమం.”

సినిమాను ఒక కళ, అన్ని కళల సమ్మిశ్రితం అన్న భావనతో మంచి సినిమాను, కళాత్మక సినిమాను సాధారణ ప్రజానీకానికి దగ్గరగా తీసుకు రావాలనే లక్ష్యంతో మొదలయిన ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో కఫిసో తన పాత్రను విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చింది. ఆ క్రమంలో భాగంగానే ఫిల్మ్ భవన్ నిర్మాణం. ఆ భవనాన్ని సంపూర్ణంగా లక్ష్య సాధన కోసం వినియోగించాలనే అభిలాషతో కేవలం ఫిల్మ్ స్క్రీనింగ్స్ మాత్రమే కాకుండా ఫిల్మ్ఫ్ ఫెస్టివల్స్, ఫిల్మ్ సెమినార్స్, వర్క్ షాప్స్ లాంటివి నిర్వహించాలనుకున్నాం. ఆ దిశలోనే మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని నేను ప్రతిపాదించాను. కఫిసో కార్యవర్గం ఒకే అంది. ఎట్లా చేస్తారో మీ ఇష్టం అన్నారు.

కరీంనగర్‌లో జాతీయ ఫిల్మ్ పెస్టివల్

ప్రేక్షకులు ఏదో ఒక మంచి సినిమాను చూసి వెళ్లిపోవడం కాకుండా ఎంపిక చేసిన కొన్ని ఉత్తమ సినిమాల్ని ఏకబిగిన కొన్ని రోజులపాటు చూడడంతో పాటు ఆయా సినిమాల దర్శకులు ఇతర బాధ్యులతో కలవడం వారితో ఇంటరాక్షన్‌లతో ఎన్నో అంశాలు చర్చల్లోకి వస్తాయి. దాని వల్ల సినిమా, దాని సబ్జెక్ట్ విషయాలతో పాటు ఆసక్తి వున్నంతమేర టెక్నికల్ అంశాలు కూడా ఫెస్టివల్స్‌లో చర్చకు వస్తాయి. నేను వ్యక్తిగతంగా 1986 హైదరాబాద్ ఫిల్మోత్సవ్ నుంచి హైదరాబాద్, కలకత్తా, ముంబై, డిల్లీ లాంటి చోట్ల జరిగిన అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొన్న అనుభవంతో పాటు ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ. సమావేశాల్లో చర్చల్లో భాగం పంచుకున్న అనుభవం కూడా కరీంనగర్‌లో జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనే ఆలోచనకు మూల కారణమయింది. ఫిలింభవన్ లో ఆధునిక ప్రొజెక్షన్ వసతులు కల్పించుకున్నాం. కాబట్టి ఫెస్టివల్ నిర్వహణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు లేవు. కానీ మెట్రో నగరాలకున్న వసతులు అనుకూలతలు కరీనంగర్ లాంటి చిన్న పట్టణాలకు ఉండవు. పైగా ట్రావెలింగ్ సమస్య. దాంతో పాటు పెద్ద దర్శకులు సాంకేతిక నిపుణులు మా కరీంనగర్‌కు రావడం అంత సులభం కాదు. అంతే కాకుండా మెట్రోలకున్న మీడియా ఫోకస్ కూడా మాకు తక్కువే.

పోటీ రహిత ఉత్సవం

అయినా నా మాట మీద మా కార్యక్రమ నిర్వహణ మీద నమ్మకంతో పలువురు వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. వీటన్నింటి నడుమ ఫిల్మ్ ఫెస్టివల్ కావాల్సింది సినిమాల ఎంపిక. ఫీచర్ ఫిల్మ్స్‌తో ఫెస్టివల్ అంటే మన శక్తికి మించినది అవుతుంది కనుక డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనుకున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించేది మొట్టమొదటిసారి కనుక పోటీ రహిత ఉత్సవంగా నిర్వాహించాలన్నది ఆలోచన. అది విజయవంతమయితే తర్వాతి కాలంలో కాంపిటీటివ్ ఫెస్టివల్స్ చేయొచ్చు అనుకున్నాం. ఆ క్రమంలో ఏర్పాట్లకు సిధ్ధమయ్యాము. మొదట కావలసింది ఫిల్మ్స్ ఇన్ డిజిటల్ ఫార్మాట్స్. దానికోసం బెంగళూరు సుచిత్ర కు చెందిన నరహరి రావు, హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి బి.హెచ్.ఎస్.ఎస్. ప్రకాష్ రెడ్డి లు ఎంతో సహకరించారు. సూచనలు చేశారు. కొన్ని సినిమాల్ని అందించారు. ముంబైకి చెందిన సుధీర్ నంద్‌గావంకర్ (SUHDIR NANDGAONKAR), నువ్వు ముంబై వస్తే MAMI ఫెస్టివల్ వాళ్ళని పరిచయం చేసి సహకరిస్తానన్నారు. అట్లే కలకత్తా ప్రేమేంద్ర మజుందార్ కూడా.

అంత సమయం లేదు అనుకుని ఫెస్టివల్‌కి అవసరమయిన సినిమాల్ని సేకరించే పనిలో పడ్డాను. నిర్వహణ కోసం కఫీసో నుంచి వివిధ కమిటీల్ని వేశాం. ఫెస్టివల్ ఛైర్మన్ గా కలెక్టర్ ఏం.వి. సత్యనారాయణ, ఫెస్టివల్ డైరెక్టర్‌గా నేను, అసోసియేట్‌గా కోల రాంచంద్రారెడ్డి, హాస్పిటాలిటీ కన్వీనర్‌గా ఎం.ప్రభాకర్, పబ్లిసిటీ కన్వీనర్‌గా పొన్నం రవిచంద్ర, స్క్రీనింగ్ కన్వీనర్‌గా రఘురాం, సెమినార్ కన్వీనర్‌గా టి.దామోదరస్వామి, ఫైనాన్స్ కన్వీనర్‌గా రావికంటి మురళి, సలహాదారులుగా నారదాసు లక్ష్మణరావు, ఎన్.శ్రీనివాస్‌లను వేసుకున్నాం. పని మొదలయింది. అన్నీ అట్టహాసంగా వుండాలి కదా. ఫెస్టివల్ కోసం పోస్టర్‌ని ప్రముఖ చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్ చేత వేయించాము. ఆయన గొప్ప చిత్రకారుడే కాకుండా మంచి మిత్రుడు కూడా. పోస్టర్‌తో పాటు ఫెస్టివల్ బుక్ కోసం కరీంనగర్ పట్టణానికి ముఖద్వారం అయిన ‘జూబ్లీ కమాన్’ పెయింటింగ్ వేసి ఇచ్చారు.

ఈ జూబిలీ కమాన్‌ను నిజాం రాజు సింహాసనం అధిష్టించి 25 ఏళ్ళు అంటే సిల్వర్ జూబిలీ అయిన సందర్భంగా కరీంనగర్ జాగీర్దార్ నిర్మించాడని చెబుతారు. నిజాం కిరీటం కూడా కమాన్ మీద కనిపిస్తుంది. ఇక మా కరీంనగర్‌లో వున్న మరో చారిత్రక నిర్మాణం ‘క్లాక్ టవర్’. మా కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని అంతకుముందు వరకు వున్న ఎలగందల్ నుంచి ఇప్పటి కరీంనగర్‌కు 1905లో మార్చిన తర్వాత ఇంగ్లీషు వాళ్ళ పాలనలో ఆ క్లాక్ టవర్ నిర్మించారు. ఇక ఇప్పుడున్న అన్నపూర్ణ కాంప్లెక్స్ స్థానంలో పాత కలెక్టరేట్, ఇంకా కలెక్టర్ కాంప్ ఆఫీసు, జైలు, చర్చ్ తదితరాలు నిర్మించారు. ఇప్పటికీ కమాన్, క్లాక్ టవర్ కరీంనగర్ నగర సింబల్స్‌గా నిలిచి వున్నాయి. ఇక ఫెస్టివల్ కోసం రూపొందించిన పోస్టర్‌ని కలెక్టర్ ఎం.వి.సత్యనారాయణ చేత రిలీజ్ చేయించాము. అన్నవరం శ్రీనివాస్ అనంతర కాలంలో నా పలు కవితా సంకలనాలకు భావస్ఫోరక మయిన ముఖచిత్రాల్ని వేశారు.

అయిదు రోజుల్లో 50 లఘుచిత్రాలు

ఇక ఫెస్టివల్ విషయానికి వస్తే అయిదురోజుల ఉత్సవాన్ని ప్లాన్ చేశాం. అప్పటికి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న కఫీసోకి ఈ ఫెస్టివల్ సొంత హాలులో జరగటం ప్రతిష్టాత్మకమయింది. ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 50 షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రాల్ని ప్రదర్శించాము. ఇందులో ప్రధానంగా ఆనంద్ పట్వర్ధన్ తీసిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’, గుజరాత్ మత కల్లోలాల గురించి రాకేశ్ శర్మా తీసిన ‘ఫైనల్ సొల్యూషన్’, ‘రీమిక్స్ ఆఫ్ హుస్సైన్’, బి.నరసింగ రావు తీసిన ‘మావూరు’, ‘ఆకృతి’ లాంటివి ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఫెస్టివల్‌ను మొదటి రోజు దర్శకులు ఎడిటర్ బి.లెనిన్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సభలో అతిథిగా దర్శకులు, ఆత్మీయులు అక్కినేని కుటుంబరావు పాల్గొన్నారు. కఫిసో ఫోటో ప్రదర్శనని అప్పటి మేయర్ డి.శంకర్ ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా ఒక రోజు ‘ఎ ఫోకస్ ఆన్ కరీంనగర్’ అన్న విభాగాన్ని స్థానీయ దృక్పధంతో రూపొందించాము. దాన్లో పోల్సాని వేణుగోపాల రావు రూపొందించిన ‘మనసున మనసై’, రమేశ్ తీసిన ‘నా తల్లి తెలంగాణ’, కే.ఎన్.టి.శాస్త్రి సిరిసిల్లా చేనేత కార్మికుల ఆత్మహత్యల పైన రూపొందించిన ‘డెత్ లూమ్స్’, పోలీసులు నక్సల్స్ నడుమ జరుగుతున్న హింస, దాని పర్యవసానాల పైన రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ కిల్లింగ్స్’ లాంటి అనేక ఫిల్మ్స్ ప్రదర్శించాము. ఫెస్టివల్‌లో మరో రోజు నిర్వహించిన సెమినార్లో ‘ఇండియన్ డాక్యుమెంటరీ సినిమా – ఎమర్జింగ్ ట్రెండ్స్’ అన్న అంశం పైన ఆసక్తికరమయిన చర్చ జరిగింది. అందులో హెచ్.ఎన్.నరహరిరావు, కె,ఎన్.టి.శాస్త్రి, సినిమాటోగ్రాఫర్ దర్శకుడు ఎం.వి.రఘు, దర్శకుడు గోపాలకృష్ణ, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలూ, ప్రదర్శించిన సినిమాలు అన్నీ కఫిసో సభ్యుల్ని విశేషంగా ప్రభావితం చేశాయి.

ఫోటో ప్రదర్శనలో కేసీఆర్

ఇక ఫెస్టివల్ ముగింపు రోజు అప్పటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు కే.చంద్రశేఖర్ రావుని అతిథిగా పిలిచాము. మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు చొరవతో అధి సాధ్యమయింది. అప్పుడు ఎంపీ కేసీఆర్ కరీంనగర్‌లో భవన నిర్మాణంలో వున్నారు. ముగింపు రోజు నేనూ లక్ష్మణ్ రావు ఆయన దగ్గరికి వెళ్ళాం. నిర్మాణం పనిని తానే దగ్గర వుండి పర్యవేక్షిస్తున్నారాయన. మాతో పాటు ఫిలిమ్ భవన్‌కు వచ్చారు. మొదట హాలు పైన ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చూశారు. ఆప్పుడు ఆయనపై వున్న క్రేజ్‌తో అనేక మంది తోసుకుని వస్తే తానే ‘ఏమయ్యా ఫోటోల్ని చూడనీయండి.. నేనెక్కడికీ పోను..’అంటూ నిలువరించారు. తర్వాత జరిగిన సభలో కళలు, సినిమాలు, తెలంగాణ అన్న అంశాల్నీ జోడించి అద్భుతమయిన ప్రసంగం చేశారు చంద్రశేఖర్ రావు. ఆయన ప్రసంగం తర్వాత అధ్యక్ష్య స్థానంలో వున్న నేను ‘ఈ ప్రసంగం విన్న తర్వాత మిమ్మల్ని కేవలం రాజకీయ నాయకుడు అని ఎవరంటారు సర్’ అన్నాను. ఆయన నవ్వేసి ఊరుకున్నారు. మిత్రుడు నారదాసు లక్ష్మణ రావు, శ్రీనివాస్, నరహరి రావు తదితరులు ప్రసంగించారు. ఎంపీ కేసీఆర్ తన ఒక నెల జీతం కఫీసోకు ఇస్తామన్నారు, జీవితకాల సభ్యుడిగా వుంటానన్నారు. తర్వాత అవేమీ జరగలేదు. అది వేరే విషయం అనుకోండి. అట్లా కఫిసో మొదటి జాతీయ స్థాయి ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది.

ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్

తర్వాత పర్యావరణంలో ప్రధానమైన నీరు అంశాన్ని తీసుకుని ఆగస్టులో ఫిలిమ్ భవన్‌లో ఒక ప్రత్యేక ఫిలిమ్ ఫెస్టివల్ ఏర్పాటుచేశాం. అప్పటికే బెంగళూరు తదితర కేంద్రాల్లో నిర్వహిస్తూ వచ్చిన “వాయిస్ ఫ్రమ్ వాటర్స్”, ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆన్ వాటర్’ ఉత్సవాన్ని కరీంనగర్‌కు తెచ్చాము. బెంగళూరుకు చెందిన నా మిత్రుడు జార్జ్ కుట్టి, హైదరాబాద్‌కు చెందిన సరస్వతి కవుల తదితరుల సహకారంతో ఈ ఫెస్టివల్ ఏర్పాటయింది. కుట్టి అప్పటికే ‘Deep Focus’ సినిమా పత్రికకు సంపాదకుడిగా వున్నాడు. అది సినిమా గురించి చాలా సీరియస్ అంశాల్ని గురించి వ్యాసాలు, వ్యాఖ్యల్ని ప్రచురించేది. చాలా గొప్ప పేరున్న పత్రిక అది. దానితో పాటు జార్జ్ కుట్టీ కూడా పేరున్నవాడు. ఆ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాట్లు ఘనంగానే చేశాం. పోస్టర్ విడుదల, ఉత్సవ నిర్వహణలు కఫీసో మిత్రుల్నే కాకుండా పలువురు పర్యావరణ వేత్తలు, అసంఖ్యాక ప్రేక్షకుల నడుమ ఆ ఉత్సవం పది రోజుల పాటు విజయవంతంగా జరిగింది.

అప్పుడే ఆ ఉత్సవాల తర్వాత కఫిసో పక్షాన ఫిలింభవన్ లో ‘ఎర్త్’.‘వాటర్’ ,‘ఫైర్’ మూడు సినిమాలతో దీపా మెహతా ఫిలిమ్ ఫెస్టివల్‌ని ఏర్పాటు చేశాము. ఆ సినిమాలకు మంచి స్పందన వచ్చింది. అయితే ఆ సినిమాల పైన కోపంతో కొన్ని సంస్థలకు చెందిన కొందరు ఫిల్మ్ భవన్‌పై దాడి చేశారు. ఫర్నీచర్ పగుల కొట్టి నానా హంగామా చేశారు… అదంతా నేను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాను కనుక అదొక చిత్రమయిన భిన్నమయిన అనుభవం. ఆ రోజు నాకు జగదీశ్వర్ రావు లాంటి ఒకరిద్దరు మిత్రులు అండగా వుండి నాపై భౌతిక దాడి జరగకుండా చూశారు.

ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.

-వారాల ఆనంద్

94405 01281

https://epaper.dishadaily.com/c/72644492

Posted on

‘చిన్నోడి ముక్తకాలు’ వారాల ఆనంద్ కవిత్వాన్ని శ్రీమతి సుమతి చురుకంటి గానం చేశారు. లింక్ క్లిక్ చేసి వినండి,చిన్నోడిని చూడండి -వారాల ఆనంద్