Month: June 2022

Posted on

46= యాదొంకి బారాత్

కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరిక-ప్రస్తానం

++++++++++++++++++

కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా

విశ్వం లోకి చేసే ప్రయాణమే

‘కళ’

===

అలాంటి ప్రయాణమే నాకు ఆలంబన అయింది. చదువు ముగించి చిన్నదో పెద్దదో జూనియర్ కాలేజీలో లైబ్రెరియన్ గా చేరాక అటు ఉద్యోగం తో పాటు ఇటు సాహిత్యం మరో పక్క సినిమాలూ నన్ను ఆవరించాయి అనేకంటే కమ్ముకున్నాయి అంటే సబబేమో. వేములవాడ ఫిలిం సొసైటీ ఏర్పాటు నిర్వహణ తదితర కార్యక్రమాల తర్వాత ఇంతుకుముందే చెప్పుకున్నట్టు నా కార్యస్థలం కరీంనగర్ కు మారింది. నేను పెరిగింది చదివిందీ అక్కడే. 1984-85 సంవత్సరాలు నన్ను అమితంగా ప్రభావితం చేసిన కాలం.కరిమ్నాగార్లో పాత మిత్రులు దామోదర్, నారాయణ్ రెడ్డి వెంకన్న వేణు ఇలా అనేక మంది సహచర్యం ఒక వైపు. మరోవైపు కరీంనగర్ ఫిలిం సొసైటీ దాన్ని నిర్వహిస్తున్న మిత్రులు. జీవితం బిజీ అయిపొయింది. అప్పటిదాకా ప్రధానంగా కవిత్వం,కథలు రాయడం చదవడం, ప్రధాన అభిలాష. పుస్తకాల అధ్యయనంలో అధిక కాలం గడిపిన కాలం. కానీ చాలామంది కవుల్నీ రచయితల్నీ దగ్గరగా చూడడం, వారి వారి వ్యక్తిత్వాలు నన్ను ఎందుకో చెప్పలేని కన్ఫ్యూజన్ లో  పడేశాయి. సరిగ్గా అప్పుడే అర్తవంతమయిన సినిమా నన్ను క్రమంగా రీలులా చుట్టుకోవడం ఆరంభించింది.     

 కళా సృష్టి అనేది

మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి

“ప్రతిమను రూపొందించడం లాంటిది” అనిపించింది.  అంతేకాదు ఆప్రతిమ నాలుగు గోడల నడుమ నుగురు మనుషుల మద్య కాకుండా గొప్ప కళా సృస్తి ఎక్కడ ఏ రూపంలో జరిగినా దాన్ని పదిమందికి, వంద మందికి, వేల మందికి చేర వేయాలనే తపన పెరిగింది. దాంతో అత్యంత ప్రభావ వంతమయిన అర్తవంతమయిన సినిమాను ప్రజలకు చూపించాలనే భావంతో క్రమంగా కాలమంతా ఫిలిం సొసైటీతోనే గడపడం ఆరంభించాను.

“డబ్బునీ, స్నేహాన్నీ, ప్రేమనీ

పొదుపు చేయగలవు

కాలాన్ని కాదు, దాని ముకుతాడు నీ చేతిలో లేదు” అందుకే కాలంతో పరుగెత్తడం మొదలు పెట్టాను. అటు సాహిత్యం తో పాటు ఒక రకంగా సాహిత్యం కంటే ఎక్కువగా సినిమాల్ని చదవడం ఆరంభించాను. మంచి సినిమాల గురించి ఎక్కడ ఎవరు ఏది రాసినా గుండెలకు హత్తుకుని చదవడం మొదలు పెట్టాను.అప్పుడు ప్రధానంగా ‘స్క్రీన్’, హిందూ, ఇండియన్  ఎక్స్ ప్రెస్ తర్వాత NFDC వారి సినిమా ఇన్ ఇండియా, మరో పత్రిక CINIMAA INDIA INTERNATIONAL, BLITZ, CARAVAN, లలలో ఎక్కడ సమాంతర సినిమాగా పిలవబడ్డ సినిమాల గురించి వచ్చినా చదవడం, వీలయితే filing అప్పటి వ్యాపకం.

ఆకాలంలో ఇంకో వైపు ఉత్తర తెలంగాణా అట్టుడికి పోయిన కాలం. ప్రజా ఉద్యమాలతో పల్లెలన్నీ రగులుతున్న సమయమది.దాని పట్ల అభిమానం అధ్యయనం ఆరాధన మాత్రమే కలిగివున్న నాలాంటి వాళ్లకు పట్టణాల్లో పత్రికలు సాహిత్య సంస్థలు ఫిలిం సొసైటీలు ప్రధాన వ్యక్తీకరణ వేదికలయ్యాయి. దేశంలోని వివిధ భాషా సినిమాలతో పాటు వివిధ దేశాల సినిమాల్ని కూడా ప్రదర్శించడం తర్వాత వాటి పైన చర్చలు అది గొప్ప ఉద్యమం. కరీంనగర్ లో ఆదివారం వెంకటేశ్వర టాకీస్ క్రిక్కిరిసిపోయేది. సాయంకాల మయ్యేసరికి పక్షులన్నీ గూటికి చేరినట్టు అంతా అక్కడ చేరేవాళ్ళు. ఎన్ని చర్చలో ఎన్ని మాటలో. అందరినీ కలిపే ఇరుసు సినిమా అయితే వ్యక్తిగా నరేడ్ల శ్రీనివాస్ ది వివరించలేనంత గొప్ప పాత్ర.

1984 లో నేను కరీంనగర్ ఫిలిం సొసైటీ బరిలోకి పూర్తిగా దిగలేదు. రింగు అవతలే వుండి శ్రీనివాస్, రాములు,లింగారెడ్డి తదితరులతో కలివిడిగా వుండేవాన్ని. నేను చదివిన చదువుతున్న సినిమాల గురించి దర్శకుల గురించీ అప్పుడప్పుడూ మెల్లిగా బెరుకు బెరుకుగా మాట్లాదేవాన్ని.

ఇక ఏ సంస్థ యినా వ్యక్తుల సమూహమే. సంస్థ నిర్వహణలో వ్యక్తుల అభీష్టాలూ కోరికలూ పోటీలూ ఉండనే వుంటాయి. 84లో ఆ స్థితి కఫిసో ఎదుర్కొంది. కార్యదర్శిగా నేనంటే నేనని గోపు లింగా రెడ్డి, ఆర్, సుధాకర్ లు ముందుకు వచ్చారు. ఆ పోటీ పరిస్థితి సంస్థకు అంత మంచిది కాదని శ్రీనివాస్, నరసింహారావు సార్ ఆలోచించి కొండా వేణుమూర్తి నికార్యదర్శిగా ఉండమన్నారు. నేనేం చేయగలను బాబోయి అంటే మేమున్నామని అంతా హామీ ఇచ్చారు. కార్యదర్శిగా ఉంటామన్న లింగారెడ్డి, సుధాకర్ లు కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అమ్మయ్య అనుకున్నారంతా. అదట్లా వుంటే ఆ ఏడుకూడా కఫిసో గౌరవాధ్యక్షులుగా అప్పటి కలెక్టర్ ఆర్.చంద్రశేఖర్ వున్నారు. ఆయన సహకారం తో కఫిసో రెండు 35mm portable projectors కొనుగోలు చేసింది. దాన్ని కలెక్టర్ ఆర్.చంద్రశేఖర్ ‘కళాభారతి’ మున్సిపల్ ఆడిటోరియం లో ప్రారంభించారు. నాకు తెలిసి అప్పటికి స్వంతంగా 35mm portable projectors కలిగి వున్న ఫిలిం సొసైటీగా కఫిసో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకుంది. అప్పటికే అంపశయ్య నవీన్ గార నేతృత్వంలో కే.ఎస్. శర్మ గారి సహకారంతో 16mm projector ను కలిగి వుంది కఫిసో. ఇంకేముంది కేవలం టాకీసులో సినిమాలు వేయడమే కాకుండా పోర్టబుల్ ప్రొజెక్టర్ లతో తన కార్యక్రమాల్ని విస్తృతం చేసింది.  అప్పటి కార్యవర్గంలో విముక్తికోసం సినీ నిర్మాత శ్రీ నారదాసు లక్ష్మణ రావు, రచయిత శ్రీ తాడిగిరి పోతరాజు లు కూడా వున్నారు.         

ఆ సంవత్సరం ఫిలిం సొసైటీ ఎన్ని కార్యక్రామాలు చేపట్టిందో లెక్కలేదు. నాకు అన్నీ గుర్తు లేవు. కానీ కొన్నింటిని గుర్తు చేసుకుంటాను. ‘ప్రాంతీయ సినిమాలు నవ్యధోరణులు’ అన్న అంశం మీద జరిపిన సెమినార్ లో దర్శకుడు శ్రీ బి.నరసింగ రావు ప్రధాన ప్రాంగం చేసారు. ప్రాంతీయ సినిమా అంటే కేవలం ప్రాంతీయ భాషా సినిమా కాదని, ఒక ప్రాంత సామాజిక రాజకీయ ఆర్ధిక స్థితుల్ని ప్రతి ఫలించేదని అయన గొప్ప సాధికారిక ప్రసంగం చేసారు. ఇక తర్వాత ‘NEW INDIAN CINEMA” అన్న అంశం పైన జరిపిన కార్యక్రమమలో FEDERATION OF FILM SOSITIES OF INDIA ప్రాంతీయ కార్యవర్గ సభ్యుడు ఎం.ఫిలిప్ పాల్గొని ప్రధాన ప్రసంగం చేసారు. అట్లే జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా అప్పటి  యూత్ కో ఆర్డినేటర్ శ్రీ వి.రామారావు గారి సూచనల మేరకు కఫిసో ఏర్పాటు చేసిన  ‘FIMS MADE BY YOUTH FOR YOUTH’  అన్న సెమినార్లో ప్రముఖ కవి దేవిప్రియ ప్రధాన ప్రసంగం చేసారు.

ఇక సినిమాల్లో ఆర్ట్ అన్న అంశం మీదా ప్రముఖ ఆర్టిస్ట్ చంద్ర ముఖ్యతితిగా పాల్గొన్నారు. అట్లా సంవత్సరమంతా ఎదో ఒక సెమినార్ జరుగుతూనే వుంది. క్రమం తప్పని సినిమాల  ప్రదర్శన సరేసరి. సినిమాలకు వెంకటేశ్వర టాకీసు అధినేతలు జగన్ మోహన్ రావు, మురళీ మోహన్ రావులు ఎప్పుడూ సహకరించారు. అతి తక్కువ అంటే కేవలం కార్బన్,కరెంటు ఖర్చులు మాతం తీసుకుని హాలు ఇచ్చేవారు. ఇక టాకీసు నిర్వాహకుల్లో కార్మికులంతా మా వెంటే వుండేవాళ్ళు. ముఖ్యంగా మేనేజర్లు విఠల్ రెడ్డి, మురళి లయితే పూర్తి సహకారంతో వుండేవాళ్ళు. ఆపరేటర్ల నుండి స్వీపర్ల దాకా ఆదివారం ఉదయమే ఫిలిం సొసైటీ సినిమా అంటే ఉత్సాహంగా వచ్చేవాళ్ళు. అందరితో అందరమూ ఎంతో స్నేహంగా వుండేవాళ్ళం. అది వాళ్లకు మమ్మల్ని బాగా దగ్గర చేసింది. ఇక 16/35 mm portable projectors ఉపయోగించడం లో పౌర సంభందాల శాఖ కు చెందిన శ్రీనివాస్ కఫిసోకు పెద్ద బలం. చుక్క వేసి వచ్చినా ఆయన నిబద్దత ఎన్నదగినది. ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. మీరంతా ఇంత కష్టపడుతున్నారు నాదేముంది అనేవాడు.

అట్లా కఫిసోతో నా ప్రయాణం ఆరంభమయింది. 1985లో మొట్టమొదటి సారి కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యవర్గం లో సభ్యుడిగా చేరాను. ఇక అప్పటినుండి దశాబ్దాల పాటు దానిలోనే వున్నాను దాని వెంటే వున్నాను. కఫిసో ఎదుగుదల, సినిమాల పట్ల నా అవగాహనా క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

సరిగ్గా అదే సమయంలో శ్రీ బి.విజయకుమార్ సంపాదకత్వంలో “జీవగడ్డ” సాయంకాల దినపత్రిక మొదలయింది. జీవగడ్డ కరీంనగర్ పట్టణానికే కాదు, జిల్లాకు, మొత్తంగా ఉత్తర తెలంగాణాకు గొప్ప చైతన్య దీపిక.

జీవగడ్డ ఏర్పాటు ప్రస్తానం వివరాలు వచ్చేవారం..

వుంటాను మరి

-వారాల ఆనంద్    

19-06-22  

44= యాదొంకి బారాత్

Posted on

44= యాదొంకి బారాత్

గోదావరిఖని ఒక మజిలీ

+++++++++++

మనిషి నిరంతర అవిశ్రాంత

ప్రయాణికుడు

లోనికీ బయటకూ..

అంతేకాదు

బతుకు బాటలో కొంత సవ్యమూ

మరికొంత అపసవ్యమూ

రెంటినీ సమన్వయము చేయడమే విజ్ఞత..

******

అలాంటి చిన్న విజ్ఞత ఎదో మేల్కొని నేను బదిలీని అంగీకరించి గోదావరిఖని బయలు దేరాను. మనకు కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఇష్టం కలుగుతుంది.. అట్లే అయిష్టం కూడా. గోదావరిఖని విషయంలో అదే జరిగింది.

ఎవరమయినా డైరీ రాయడం జ్ఞాపకాలు రాయడం వేర్వేరు అనుకుంటాను. ఎందుకంటే డైరీ ఏ రోజుకారోజు తేదీల వారిగా సమయాల వారిగా రాస్తూ పోతాం. అందులో సంఘటనలుంటాయి. కాలెండర్లాగా రాస్తూ పోతాం. కానీ బహుశా జ్ఞాపకాలు అట్లా కాదు. ఆయా కాలాల నాటి అనుభవాలు జ్ఞాపకాలయి ముప్పిరిగొంటాయి.అంతేకాదు వాటి ప్రభావాలూ అప్పుడప్పుడూ స్పురణ కొస్తాయి. సంబరపరుస్తాయి. బాధపెడతాయి. ఆ క్రమంలో జ్ఞాపకాలు రాసేటప్పుడు తేదీల వారీగా క్రమంగా రాయలేక పోవచ్చు. తన్నుకొస్తున్న జ్ఞాపకాలు నేనేంటే నేనని తోసుకొస్తాయి. అందుకే కొంచెం ముందూ వెనకా కావచ్చు. క్షమించాలి మరి.

కరీంనగర్ నగరమే అయినా నియమిత ప్రాంతంలో వున్న జనం, పుట్టి పెరిగిన ప్రాంతం కావడం తో మనది మన సొంతం అనిపించేది. కానీ గోదావరిఖనికి వెళ్ళే సరికి అది చాలా చిత్రమయిన వూరు. విసిరేసినట్టున్న కాలనీలతో బోసి బోసిగా అనిపించింది. కానీ మార్కెట్, బాజార్ మాత్రం ఎప్పుడూ రద్దీనే. డ్యూటీ వేళకి కార్మికులు వెళ్తున్నప్పుడు రోడ్లన్నీ యమ రద్దీగా ఉండేవి మిగతా సమయాల్లో మామూలే. ఇక బస్ స్టాండ్ కు కూత వేటు దూరంలో మా కాలేజీ దాని పక్కనే డిగ్రీ కాలేజీ. జాయిన్ ఐనప్పుడు తెలిసిన వాళ్ళు తక్కువే. క్రమంగా స్నేహాలు కుదిరాయి. మాకు ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీలో బాటనీ ఫాకల్టీ గా వున్న వెంకటేశం గారు అక్కడ వున్నారు. జంతు శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ ఆర్.కనకయ్య గారి దగ్గరినుండి లైబ్రరీ చార్జ్ ఫార్మల్ గా తీసుకున్నాను. నా మొత్తం కారీర్ లో ఈ చార్జ్ తీసుకోవడం ఇవ్వడం పెద్ద గగనం అయిపొయింది. ఒక్కో బుక్ చూసి టిక్ చేసి తీసుకోవాలంటే నాతో అయ్యేది కాదు. విద్యార్థుల్ని పుస్తకాలు చదవడం పట్ల సాహిత్యం చదవడం పట్ల ఇన్ స్పైర్ చేయడం ఇష్టమయిన పని. బుక్స్ ఇవ్వడం తీసుకోవడం ఒకే. కానీ ఈ చార్జ్ గొడవలే బాగా ఇబ్బందిపెట్టేవి. కొన్ని చోట్ల మిత్రులే సర్దుబాటు చేస్తే మరికొన్ని సార్లు డబ్బులు కట్టాను. ALL IN THE GAME. ఇక గోదావరిఖని కాలేజీలో అంతా స్నేహంగానే వున్నారు. అందులో ఇద్దరు మాత్రం నా పై గొప్ప ప్రభాన్ని చూపారు. ఒకరు ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్, మరొకరు సివిక్స్ అధ్యాపకుడు రమేష్ బాబు. మధు గొప్ప జిమ్నాస్ట్. వద్దేపల్లికి చెందిన వాడు. చాలా సరదా అయిన మనిషి. నన్నుఎంతగా ప్రభావితం చేసాడు అంటే నేను జిమ్నాస్ట్ పేర ఒక కథ రాసాను. అది వీక్లీ లో వచ్చింది. మంచికథ అన్నారు. ఇక రమేష్ బాబు కరీంనగర్ లో తమ దగ్గరిబంధువు డాక్టర్ హైమవతి గారిని పరిచయం చేసాడు. తర్వాతి కాలంలో డాక్టర్ గారు మా ఇద్దరు పిల్లల విషయం లో ఎంత అండగా నిలబడ్డారో తర్వాత రాస్తాను. మేము ముగ్గురమూ న్యూ అశోక టాకీసు వెనకాల గదుల్లో ఒక దాంట్లో కలిసివున్నాం. మా పక్కన డిగ్రీ అధ్యాపకుడు జగన్నాధ చారి గారు ఉండేవారు. మొదట్లో కొంత సక్రమంగానే కాలేజీకి వెళ్ళినా ఆదిలాబాద్ జిల్లా బోద్ కు చెందిన నారాయణ రావు గారు ప్రిన్సిపాల్ గా వచ్చిన తర్వాత ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. నాకు అప్పుడే పెళ్లి అయింది. కొత్త పెళ్లి కొడుకువి ఎందుకొచ్చావు పనిలేదా అని సరదాగా అంటూ పొమ్మనేవాడు.

ఇది ఇట్లా వుంటే గోదావరిఖనిలో మరో వైపు నాకు లభించిన గొప్ప మిత్రుడు సుప్రసిద్ధ రచయిత శ్రీ తుమ్మేటి రఘోత్తం రెడ్డి. సింగరేణిలో సర్దార్ గా చేసేవారు. తాను నేను రెగ్యులర్ కలిసేవాళ్ళం. తనకు ఖాళీ వున్నప్పుడు కాలేజీకో రూముకో వచ్చేవాడు. తనకి ఓ రాజ్దూత్ బండి వుండేది దాని పై తిరిగే వాళ్ళం. అప్పుడే మార్కెట్ లో వున్న బండారి కిష్టయ్య పాన్ షాప్ గొప్ప కేంద్రంగా వుండేది. అన్ని పత్రికలూ రావడం తో పాటు అక్కడికి అందరూ వచ్చేవాళ్ళు. ఎంతమందిని కలిసానని. పిట్టల రాజేందర్, పిట్టల రవీందర్, టి.జగన్మోహన్ రావు ఇట్లా ఎందరో. జగన్ మోహనరావు గోదావరిఖని ఫిలిం సొసైటీ ని నడిపించేవారు. నేనూ రాఘోత్తంమ్ రెడ్డి గారు కూడా అందులో చేరి దాన్ని మరింత ప్రభావవంతం చేయడానికి కొంత కృషి చేసాం. ముఖ్యంగా రఘోత్తం బాగా చొరవ తీసుకున్నాడు. చాలా సినిమాలు టాకీసులోనూ కొన్ని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లోనూ ప్రదర్శించాం. ఆపుడే మద్రాస్ లో జరిగిన Federation of film societies of India (SR) regional general body meeting కి నేనూ జగన్మోహన్ రావులము హాజరయ్యాం. కరీంనగర్ నుంచి డి.నరసింహా రావు, ఆర్ సుధాకర్ లు వచ్చారు. చాలా గొప్ప మీటింగ్. అప్పటినుండి 30 సంవత్సరాల పాటు Federation of film societies of India తో వున్నాను. హైదరాబాద్ నుండి మొదట ఫిలిప్ బాధ్యుడిగా వుంటే తర్వాతి కాలం లో బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డి గారు అన్నీ తానే అయి నడిపించారు నడిపిస్తున్నారు. మంచి సినిమాల గురించి ఆ సమావేశం నాకో గొప్ప కనువిప్పు.

అప్పటి మద్రాస్ ఇప్పటి చెన్నయి లో ఆ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆత్మీయ మిత్రుడు కొడం పవన్ కుమార్ నాకు ఆతిథ్య మిచ్చాడు. తాను అప్పుడక్కడ AMIE కోసం వున్నాడు. పవన్ కూడా నాకు అత్యంత దగ్గరి వాడు. తాను కరీంనగర్ లో ఇంటర్ చదువుతున్నప్పుడు, నేను సిరిసిల్లా లో పనిచేసినప్పుడూ కూడా అన్ని విధాలుగా నాతో వున్నాడు. ఇక నాకు మద్రాస్ అంతా తిప్పి చూపించాడు. మిగాతా మిత్రులు తిరిగి వచ్చేసినా నేను అక్కడే రెండు రోజులుండి అనేక మందిని కలిసి వచ్చాను వస్తున్నప్పుడు నాతోపాటు వచ్చిన కొడం పవన్ తో కలిసి తిరుపతి దర్శనంచేసుకున్నాం. విజయవాడలో హాల్ట్ అయి పురాణం గారిని, మోహనప్రసాద్ గారిని కలిసి మరీ వచ్చాం.

అయితే గోదావరిఖని ఫిలిం సొసైటీ లో నేను తక్కువ సమయమే వున్నాను. కరీంనగర్ కు పోవడం రావడం ఆదివారాలు అక్కడ ఉండక పోవడం వలన రఘోత్తం ఎక్కువ శ్రమతీసుకున్నారు. తను అప్పుడు తిలక్ నగర్ లో ఉండేవాడు. వారి ఇంటికి కూడా వెళ్ళే వాడిని. భోజనాలూ అవీ కూడా చేసేవాళ్ళం. తాను నాకు గొప్ప ఇన్స్పిరేషన్. తర్వాతి కాలంలో కూడా నా అనారోగ్య కష్ఠకాలం లో రఘు నా వెంటే వుండి అండగా నిలిచాడు. ఆయన ఋణం తీర్చుకోలేనిది.

రచయితగా ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఎందరో రచయితల గురించీ వివరించేవాడు. ఆయనతో మాట్లాడడం గొప్ప ఎడుకేషన్.

…..

ఇక గోదావరిఖనిలో నేను కలిసిన మరో బంధువర్గ కుటుంబం రంగమ్మ అత్త వారిది. కరీంనగర్ లో మా మిఠాయి దుకాణం పక్కనే వున్న ఇల్లు వాళ్ళది. నాయనమ్మ సత్యమ్మ ద్వారా దూరపు చుట్టాలు. వారి అబ్బాయి కిషన్ బావ మొదట గోదావరిఖని లో పెద్ద బట్టల షాప్ పెట్టారు. తర్వాత టీచర్ గా పనిచేసాడు. పలుసార్లు వారింటికి షాప్కి వెళ్ళే వాణ్ని.

అట్లా గోదావరిఖని లో కాలం ఆడుతూ పాడుతూ గడిచింది. చివరిలో పీడీ మధు వాళ్ళది వరంగల్ వడ్డేపల్లి గనుక వరంగల్ ఆర్ జేడీ ఆఫీసులో కొంత పలుకుబడి వుండేది. తాను వరంగల్ కు నేను చొప్పదండి కాలేజీకి బదిలీ రిక్వెస్ట్ పెట్టాం. నేను దరఖాస్తు పంపి మర్చిపోయాను. మధు తానే దగ్గర వుండి నా ఆర్డర్ పంపించి నాకు కబురుచేసాడు. ఇక ఏముంది అక్కడి నుంచి చొప్పదండి చేరుకున్నాను కరీంనగర్ కు దగ్గరే.

అట్లా ముగిసిన గోదావరిఖని ప్రస్తానం లో రెండు వార్తలు ఓ కుదుపు కుదిపాయి. ఒకటి పెద్దపల్లి బస్ స్టాండ్ లో ఆగినప్పుడు సిరిసిల్లాకు చెందిన ఒక పాత విద్యార్తి కలిసి నాకు ఆప్తుడు అయిన విద్యార్తి నారాయణ ను కామారెడ్డి లో ఎన్కౌంటర్ చేసారని చెప్పి వెళ్ళిపోయాడు. హతాశున్నయ్యను. ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అది కూడా ఓ కథ రాసాను. ఇక మరో సంఘటన అప్పటి పెద్దపల్లి డీ.ఎస్.పీ. బుచ్చిరెడ్డి ని నక్సల్స్ కాల్చివేయడం. ఆ సంఘటన నన్నే కాదు మొత్తం జిల్లానే కుదిపేసింది.

తర్వాతి జ్ఞాపకాలు అనుభవాలు ప్రేరణలతో వచ్చే వారం… కలుస్తాను

మీ

-వారాల ఆనంద్

Pics: Late Sri.D.Narasimha rao,Late Sri R.sudhakar, Sri T. Jagan Mohan Rao and myself at Merina Beach Photos by Pavan

44= యాదొంకి బారాత్

8Shankar Suraram, Chandramouli Neela and 6 others