Month: November 2021

యాదోంకి బారాత్ -23

Posted on

+++++++++++++

కరీంనగర్ – కాలేజీ చదువులు-అనుభవాలు- ఒడిదొడుకులు-

+++++++++++++++++++++

జీవితంలో చదువులన్నంక ఎన్నో ఒడిదొడుకులు. మరెన్నో అనుభవాలు. విజయాలూ ఓటములూ. అందులోనూ నాలుగు అయిదు దశాబ్దాల క్రితం చదువుల సంగతి చెప్పనే అక్కరలేదు. ఇప్పటి ఆధునికత లేదు, సాంకేతికత తెలీదు. అంతా రొడ్డ కొట్టుడు వ్యవహారం. నోట్స్, మంచి రాత కోసం చూచి రాతలు రాస్తే, పరీక్షల్లో చూచి రాతలనే నఖలు కొట్టుడు అనే వాళ్ళు. అదంతా 70-80 దశాకాల్లోని మాట. అప్పుడు మాది ఇంటర్ డిగ్రీ కాలం. అప్పటి సంఘటనల్ని ఇప్పుడు ఆలోచిస్తే చిత్రంగానూ, ఒకింత ఆశ్చర్యంగానూ అనిపిస్తాయి.

*********

నాకు మొదటినుంచీ బడే ప్రపంచం. ప్రైవేట్ ట్యూషన్ లు అలవాటు లేదు. మా నాన్న తన నాలుగు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తి కాలంలో ఏ ఒక్క రోజూ ట్యూషన్ చెప్పలేదు. తను చెప్పక పోగా ఆ అలవాటుని నిరసించేవారు. క్లాసులో బాగా చెబితే, పిల్లలు బాగా శ్రద్ధగా వింటే ట్యూషన్ అవసరమే లేదని ఆయన అభిప్రాయం. ఎప్పుడయినా ఎవరికయినా సబ్జెక్ట్ లో అనుమానాలుంటే ఇంటికి వచ్చిన వారికి తీర్చే వారు. అదే సూత్రం నాకూ వర్తింప జేశారు. హై స్కూలు పూర్తి అయ్యేవరకు నొ ట్యూషన్. మా దామోదర్, ప్రకాష్ లాంటి  ఇతర మిత్రులు గంజ్ స్కూల్లో కామ్పోసిట్ లెక్కలకు, సైన్సు కు ట్యూషన్ వెళ్ళారు. నేనేమో నాకు నేనుగా చదువుకోవడమే. దానివల్ల స్వతంత్రంగా చదువుకోవడమే అలవాటయ్యింది. కాని ఇంటర్ చదువుకు వచ్చే సరికి ఫిజికల్ సైన్స్ ఇబ్బంది వుండేది కాదు. జీవ శాస్త్రంలోనే కొంత ఇబ్బంది. జంతు శాస్త్రంలో ‘కప్ప’ (FROG) ప్రత్యేకంగా వుండేది. అది చెప్పేవాళ్ళు లేక సిలబస్ పూర్తి కాదేమోనని కొంత ఇబ్బందిగా వుండేది. ఆ స్థితిలో ఎస్.అర్.ఆర్.కాలేజీ అధ్యాపకుడు శ్రీ నాగ భూషణం సార్ కప్ప ట్యూషన్ చెబుతారని తెలిసి నేను వెళ్తానని నాన్నకు చెప్పాను. ఏ   మూడులో వున్నారో తెలీదు కానీ వెళ్ళమన్నారు. ముఖరంపురాలో సార్ ఇల్లు. ఉదయం ఆరింటికో ఏమో క్లాస్ అని చెప్పారు. నేను వెళ్ళడం ఆరంభించాను. చలి కాలం. విపరీతమయిన చలిలో గడియారం కాడి నుంచి వెళ్ళాలి. నాన్న అది గమనించి ఉదయమే టీ కి డబ్బులు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో బస్ స్టాండ్ రోడ్డులో వున్న ‘గ్రాండ్ హోటల్’ అంటే టీ బిస్కిట్లకు ఫేమస్. ఉదయమే చలిలో గ్రాండ్ దగ్గర ఆగి టీ తాగి ట్యూషన్ వెళ్ళడం గొప్ప అనుభవం. ఎంతో పెద్ద వాళ్ళం అయిపోయినట్టు అనిపించేది. ట్యూషన్ కంటే గ్రాండ్ హోటల్ చాయ్ ఎంతో మధురంగా వుండేది. దేనికదే చెప్పుకుంటే సార్ బాగా చెప్పేవారు. అట్లా గ్రాండ్ నా మదిలో ఇప్పటికీ ఫ్రెష్ గావుంది. దాంతో పాటు కరీంనగర్ లో ఇంకో పాపులర్ ఇరానీ హోటల్ ‘ఆల్ఫా హోటల్’’. అది క్లాక్ టవర్ నుంచి కార్ఖానగడ్డకు వెళ్ళే దారిలో వుండేది.  దానికి రెండు పక్కల రెండు టేలా లు ఉండేవి. ఓకటి పాన్ సోడాలు అమ్మే తంబు టేలా. అప్పట్లో వీధి కొట్లాలకు తంబు బాగా పాపులర్. ఇక మరో వైపు వున్న టేలా జనరల్ స్టోరు. దాన్ని ఇద్దరు అన్నదమ్ములు నడిపేవారు. ఒకరు న్యాలకొండ బాస్కర్ రావు, మరొకరు ప్రభాకర్ రావు. అక్కడ ప్రతి సాయంత్రం మా పెద్దన్నయ్య మోహన్, పెద్దబావ ఆదిరెడ్డి తదితరుల సిట్టింగ్ కు అది అడ్డాగా వుండేది. అట్లా మిత్రులుగా వుండి ఆ యిద్దరు అన్నదమ్ములకు మా ఇంటి అమ్మాయిలనే ఇచ్చి పెళ్లి చేసారు. అందులో మా మేనవదిన నాగమణి ని భాస్కర్ రావు గారికి, ఉమక్కను ప్రభాకర్ రావు గారికి ఇచ్చారు. ప్రభాకర్ రావు తర్వాత ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ అయ్యారు. చిత్రంగా ఆల్ఫా హోటల్ వుండిన మూల అయిదు దారుల క్రాసింగ్. మామూలుగా ఎక్కడయినా నాలుగు దారుల కలయికతో ‘చౌరాస్తా’ అని పిలుస్తాం. కానీ ఆల్ఫా మాత్రం అయిదు దారుల కలయిక. ఒక దారి గడియారం వైపునకు వుంటే, రెండోది స్టేట్ బాంక్ వైపు, మూడోది సివిల్ ఆసుపత్రి వైపు, నాలుగోది కార్ఖానాగడ్డ వైపు, అయిదోది అస్లాం మస్జిద్ అండ్ కాపువాడ వైపు వుంటాయి. ఇప్పుడది ఎంతో బిజీగా వుండే ప్రాంతం. ఆల్ఫా హోటల్ లేదు కాని మధ్యలో రాజీవ్ బొమ్మ పెట్టి రాజీవ్ చౌక్ అని పిలుస్తున్నారు. హోటళ్ళ విషయం వచ్చింది కనుక అప్పుడు కరీంనగర్ లో ప్రధానంగా మూడు ఉడిపి హోటల్లు ఉండేవి. ఇకటి గంజ్ స్కూలు పక్కన వుండే శివరాం హోటల్ గా పాపులర్ అయిన సత్యనారాయణ భవన్, రెండోది ఆఫీస్ రోడ్డులో వున్న ఉడిపి హోటల్, దానికి కొంచెం పక్కన వెల్కం హోటల్ ఉండేవి. వాటిల్లో ఇప్పటిలాగే ఇడ్లి,వడ, దోశ పాపులర్. వీటికి తోడు రెండో మూడో మిలిటరీ హోటల్లు వున్నట్టు గుర్తు. అందులో ఒకటి ప్యాట బాల రెడ్డి తాత వాళ్ళ ‘రాజ్ మహల్ హోటల్’. అది ఆఫీస్ రోడ్డులోనే మొదటి అంతస్తులో వుండేది. బాలరెడ్డి తాత మా నాయనమ్మ సత్యమ్మను అక్క అని పిలవడమే కాకుండా తన పెద్ద కూతురు ఉరిమిళ ను మా పెదనాన్న సత్యనారాయణకు ఇచ్చి చేసారు. ఇక తన రెండవ కూతురు సులోచనను మా మేనమామ జనార్ధన్ గారికి ఇచ్చి పెళ్లి చేసారు. అట్లా రాజ్ మహల్ హోటల్ మా దగ్గరి వాళ్ళదే. ఇక మరోటి గడియారం దగ్గర వున్న ‘విజయ లక్ష్మి’ మిలిటరీ హోటల్. తర్వాతి కొంత కాలానికి ఆల్ఫా హోటల్ ముందు ‘ఉమా హోటల్’ అని మరొకటి ఆరంభమయింది.  ఇదీ ఇప్పటికీ నాకు గుర్తున్న అప్పటి కరీంనగర్ హోటళ్ళ వివరాలు.

ఇక నా ట్యూషన్ విషయానికి వస్తే బాగానే జరిగింది. వార్షిక పరీక్షల్లో దాని ఫలితం కనిపించింది.         

ఇక 74లో ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో చేరేనాటికి మొదట కొంత కాలం మెడికల్ వ్యామోహం వుండేది అది మిగిసిన తర్వాత డిగ్రీ చదువు మీద కొంత ఆసక్తి పెరిగింది. ఫోకస్ మొదలయింది. బాటనీ, జువాలజీలకు ట్యూషన్ అవసరం లేదు కానీ కెమిస్ట్రి కి మాత్రం తప్పదనే భావన అందరిలో వుండేది. రసాయన శాస్త్రం లో భౌతిక రసాయన శాస్త్రం, కర్బన రాసాయన శాస్త్రం, ఇనార్గానిక్ కెమిస్ట్రీ లుండేవి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ని కృష్ణమోహన్, జివిజి, సార్లు బాగా వేగంగా చెప్పెవారు. ఫిజికల్ రామానుజం గారు చెప్పేవారు. ఆర్గానిక్ కు వచ్చేసరికి కొంత ఇబ్బందిగా ఉండడంతో ట్యూషన్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం వాళ్లకు చెప్పే ఖయ్యుం సార్  వద్దకు వెళ్లాం. సబ్జెక్ట్ మొత్తం అరటి పండు వొలిచినట్టు చెప్పారు. సబ్జెక్ట్ తో పాటు ఆయన చెప్పిన జీవన విలువలు అలవాట్లు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ‘ఒక పని చేస్తూ అలిసిపోతే, అది మానేసి ఇంకోటి చేయాలి తప్ప అలసిపోయామని కాళ్ళు చేతులు చాపి కూర్చోవద్దని ఆయన అనేవారు’ అదిప్పటికీ గుర్తుంది. ట్యూషన్ ఫలితం డిగ్రీ ఫైనల్ లో గొప్పగా చూపిందనే చెప్పాలి.

ఇట్లా నా చదువులు ట్యూషన్ లు సాగుతూ వుంటే వేములవాడలో నా మిత్రుల స్థితి భిన్నంగా వుండేది. 72- 74 నాటికి వేములవాడలో జూనియర్ కాలేజీలేదు. ఇంటర్ చదవాలనుకునే వాళ్ళంతా సిరిసిల్లా వెళ్లి చదవాల్సిందే. అందుకే మిత్రులు పి.ఎస్.రవీంద్ర, మంగారి శివప్రసాద్, కిరణ్ కుమార్ తదితరులంతా సిరిసిల్ల కాలేజీలో చేరారు. అప్పటికి దాదాపు అన్ని ఊర్లల్లో నఖలు నడుస్తూ వుండేది. కానీ సిరిసిల్లాలో అప్పుడు టం టం నర్సయ్య అనే ప్రిన్సిపాల్ ఉండేవాడు. అక్కడ మాస్ కాపీ జరిగేది. అది తెలిసి ఆంధ్రా నుంచి కూడా విద్యార్థులు సిరిసిల్లా కాలేజీలో పరీక్షలకు కూర్చునే వారు. 75 లో దేశం లో అత్యవసర పరిస్థితి. సిరిసిల్లా విషయం ఇంటర్ బోర్డుకు చేరింది. దాంతో ప్రత్యేక టీం ను స్క్వాడ్ గా వేసారు. బస్తాల కొద్దీ దొరికిన చిట్టీలు, గైడ్స్ చూసి బోర్డు ఆ ఏటి వార్షిక పరీక్షల్ని రద్దు చేసింది. తర్వాత సెంటర్ సిద్దిపేటకు మార్చారు. దాంతో విద్యార్థులందరి చదువులు అటకెక్కాయి. దాని ఫలితం మా మిత్రులందరి మీదా పడింది. సాంబశివుడు, రమేష్, రమేష్ చంద్ర లాంటి వాళ్ళు బయట పడ్డారు. శివప్రసాద్ పాలిటెక్నిక్ కు వెళ్ళాడు. వారంతా అతలా కుతల మయిపోయారు. భిన్న దారుల్ని ఎంచుకున్నారు. కొందరు కామారెడ్డి కాలేజీకి, మరికొందరు కరీంనగర్ కి, ఇంకొందరు హైదరాబాద్ కి వెళ్ళగా ఇంకొందరు బయట పడలేక చదువులు పోస్ట్ పోన్ చేసుకుని వేర్వేరు వృత్తుల్లో చేరిపోయారు. ఒక కాలేజీ వ్యవస్థలో జరిగిన తప్పు వలన  ఎంతో మంది విద్యార్థుల జీవితాలు ప్రభావితం అయ్యాయి. మరిక సామాజికవ్యవస్తలో జరిగే పొరపాట్ల వళ్ళ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. 1969 తొలి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నేపధ్యం లో వార్షిక పరీక్షలు లేకుండానే పాస్ అయిన ప్రభావం నుండి కోలుకోక ముందే మా వేములవాడ మిత్రుల చదువుల మీద సెంటర్ రద్దు ప్రభావం తీవ్రంగా పడింది.

ఆ తీరిక కాలం సాహితీ సాంస్కృతిక రంగం వైపు అందరినీ మరలించింది. అది ఒక రకంగా మంచే జరిగిందేమో… ఆ కృషి గురించి మళ్ళీ వారం…

-వారాల ఆనంద్   

Posted on

యాదోంకి బారాత్ -22

కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం

—————————————

వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావ వంతమయినది. అనేక ఆటు పాట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు దూసుకెళ్ళిన దశాబ్దమది. సరిగ్గా ఆదశాబ్డంలోనే నా చదువులు స్కూలునుంచి కాలేజీ దాకా సాగింది. అప్పటికి ఈ ఆటుపోట్లన్నింటినీ అర్థం చేసుకునే వయసూ కాదు నేపధ్యమూ లేదు. అరకొర చదువూ అందివచ్చిన పుస్తకాలూ, రేడియో వినిపించిన సంగీతమూ, అప్పటి కామెంటేటర్లు వినిపించిన క్రికెట్ కామెంటరీ లతో గడిచిన కాలం. కానీ పరోక్షంగా ఆ దశాబ్దపు ఆటు పోట్లు విద్యార్థులుగా అప్పటికప్పుడు అర్థం చేసుకోలేకున్నా క్రమంగా పొరలు తొలగి తేటతెల్ల మయ్యాయి.

1969 లో పెల్లుబికిన జై తెలంగాణా ఉద్యమ కాలంలో నేను 7 వ తరగతిలో వున్నాను. కరీంనగర్ ఖార్ఖానాగడ్డ స్కూలు లో చదువు. మర్ర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్, తదితరుల పేర్లు వినడమే. కరీంనగర్ కు సంబంధించి ఎం.సత్యనారాయణ రావు, ఆంజనేయలు, కన్నయ్య తదితరుల పేర్లు తెలిసేవి. బందులు, నిరాహార దీక్షలు చూసాను అంతే తప్ప ఉద్యమ నేపధ్యం ఉధృతి పెద్దగా తెలీదు. కానీ ఆ ఏడు వార్షిక పరీక్షలు లేకుండానే 7 క్లాస్ పాసై 8 కు వచ్చింది మాత్రం గుర్తుంది. అప్పుడే స్కూలు మారి గంజ్ స్కూలులో చేరాను.  

70 దశక మొదటి సంవత్సరాలల్లో గంజ్ స్కూలు చదువులు మావి. అప్పుడే దేశవ్యాప్తంగా ప్రదాన స్రవంతి రాజకీయాల్లో నెహ్రు కలలు ముగిసి, లాల్ బహదూర్ శాస్త్రి  ‘జవాన్ జై కిసాన్’ నినాదపు హోరు గడిచి ఇందిరా గాంధీ పాలన ఆరంభయింది. ఆమె తీసుకున్న  బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దులాంటి నిర్ణయాలతో దేశ ప్రజల మన్ననల్ని అందుకున్న సమయమది. పేదల పెన్నిధిగా జనం ఆమెకు నీరాజనాలు పలికారు. కానీ ఊహించని విధంగా ఆమె కుమారుడు సంజయ్ గాంధీ తెర మీదికి వచ్చి దేశ ఆర్ధిక రాజకీయ సామాజిక స్థితిగతుల పై తీవ్రమయిన ప్రభావాన్ని కలిగించారు. 1973-75ల మధ్య ఇందిరా గాంధీ ప్రభుత్వ పాలనా రీతి పట్ల దేశ రాజకీయ పార్టీలతో  సహా తన స్వీయ కాంగ్రెస్లో కూడా ఒక నిరసన వాతావరణం ఏర్పడింది. అధ్యక్ష తరహా పాలన సాగుతున్నదని విమర్శలు మొదలయ్యాయి. డిసెంబర్ 1973 నుండి మార్చ్ 74 వరకు గుజరాత్ లో జరిగిన ‘నవ నిర్మాన్’ ఉద్యమం ఇందిర పాలను వ్యతిరేకంగా ఎగిసిన తొలి నిరసనోద్యమం. అది దేశమంతా పాకే పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం గుజరాత్ అసెంబ్లీ ని రద్దు చేసింది. ఫలితంగా ముఖ్యమంత్రి చిమన్ భై పటేల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడే ఇందిరా గాంధీ తన ఎన్నికలో తీవ్రమయిన అక్రమాలకూ పాల్పడ్డారని నిర్ధారిస్తూ అలహాబాద్ హై కోర్టు ఆమె ఎన్నికను రద్దు చేసింది. రాజ్ నారాయణ్ చేతిలో ఆమె పరాభవాన్ని చవి చూసింది. అప్పటికే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ప్రజా నిరసన ప్రతి పక్ష రాజకీయ పార్టీల ఏకీకరణ లాంటి పరిణామాల్ని గమనించిన ఇందిరా గాంధీ 25 జూన్ 1975 రోజున దేశంలో అంతర్గత కల్లోలం నెలకొందని  ‘అత్యవసర పరిస్థితి’ INTERNAL EMERGENCY  ని ప్రకటించారు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ రాజ్యాగం లొని 352 అధికరణను ఉటంకిస్తూ ఆదేశాల్ని జారీ చేసారు. ఫలితంగా దేశంలో అన్ని ఎన్నికలూ, పౌరహక్కులూ రద్దయ్యాయి. ఇందిరను వ్యతిరేకించే లెక్క లేనంత మంది రాజకీయ నాయకులను జైళ్ళల్లో బంధించారు. సంజయ్ గాంధీ కనుచూపు మేరకు పాలన సాగడం మొదలయింది. బలవంతంగా నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లతో పాటు అనేక అక్రమాలు జరిగాయి. ఈ స్థితి 21 నెలలు సాగి 21 మార్చ్ 1977 రోజున ముగిసింది.

ఇదంతా మేము డిగ్రీ చదువుతున్న కాలంలోనే జరిగింది. ఆ పరిణామాలన్నింటినీ రేడియోలో వింటూ పేపర్లల్లో చదువుతూ ఉండడమే కాని ప్రత్యక్షంగా నా అనుభవం లోకి రాలేదు. అప్పుడు ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని స్థితి. కానీ తెలంగాణా పరిస్థితి వేరుగా వుండేది అప్పటికే 70 ప్రాంతంలోనే ఉత్తర తెలంగాణలో వామపక్ష తీవ్ర వాదం మొదలయింది. పల్లెల్లో ఒక చలనం. విద్యార్థుల్లోకూడా క్రమంగా ప్రగతిశీల భావనలూ ఉద్యమాలూ ఆరంభయ్యాయి. పీ.డీ.ఎస్.యు., ఆర్.ఎస్.యు. లాంటి సంస్థలు గొప్పగా పని చేయడం మొదలెట్టాయి.

ఈ నేపధ్యంలో మా ఇంటర్ డిగ్రీ చదువులు సాగాయి. విద్యార్థి ఉద్యమాల పట్ల అభిమానం, కొంత ఆరాధనా భావం వుండేది. కానీ ప్రధానంగా సాహిత్యం మమ్మల్ని కట్టి పడేసింది. కవిత్వంలో శ్రీ శ్రీ, వచనంలో చలం(దాదాపు అన్ని నవలలు,కథలు, మ్యూసింగ్స్..), రావి శాస్త్రి(అల్పజీవి), కొడవటిగంటి కుటుంబ రావు, గోపీచంద్( అసమర్థుని  జీవయాత్ర..),బుచ్చి బాబు(చివరకు మిగిలేది..) లాంటి వారి ప్రభావంలో కొట్టుకు పోతున్న కాలమది. అప్పటికి నా చుట్టూ జరుగుతున్న అన్ని ప్రగతిశీలమయిన ఉద్యమాల సోయి ఉండింది. కానీ విద్యార్థి దశలో నాకు ముఖ్యంగా కరీంనగర్ లాంటి పట్టణ జీవితమే తెలిసి వుండడం, మధ్యతరగతి ఆర్ధిక స్థితిలో కొట్టు మిట్టాడుతూ వుండడం వల్ల ఉద్యమాలతో మమేకం కాలేక పోయానేమో అనిపిస్తుంది. దానికి తోడు మాటకు సంబంధించి ఒక న్యూనతాభావం ఎప్పుడూ తొలుస్తూనే వుండేది.

***************

నా కాలేజీ రోజుల్లో మా తరాన్ని సాహిత్యం సినిమాలతో పాటు ఎంగేజ్ చేసిన మరో అంశం క్రికెట్. వాస్తవానికి మా స్కూలు కాలం లో గంజ్ స్కూలుకు ఆట స్థలమే వుండేది కాదు ఫలితంగా మా బాచికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తో పెద్దగా పరిచయం లేదు. ఎలాంటి ఫీల్డ్ గేమ్స్ లేకుండానే స్కూలు కాలం గడిచింది. కరీంనగర్ లో అప్పటికి కేవలం మల్టీ పర్పస్ స్కూల్ గ్రౌండ్, పోలీసు పరేడ్ గ్రౌండ్, ఎస్.ఆర్.ఆర్. కాలేజీ గ్రౌండ్ మాత్రమే ఉండేవి. పోలిస్ గ్రౌండ్ కేవలం పోలీసులకు ఉపయోగపడేది. కాదంటే ప్రతి స్వాతంత్ర గణ తంత్ర దినోత్సవ పరేడ్ లకు అందరినీ అనుమతించే వారు. ఆ స్థితిలో ప్రత్యేక ఆసక్తి వున్న వాళ్లకు తప్ప ఆ కాలం లో అందని ద్రాక్షలే.

కానీ మా ఇంట్లోనూ వెంకటేష్,దామోదర్ ఇండ్లల్లో అప్పటికి రేడియోలు లేదా ట్రాన్సిస్టర్లు వచ్చాయి. నేనయితే బినాకా, పురానీ ఫైల్మొంకా ఫాన్. దానికి పాదులు వేసింది మా నాన్నే. తానే నాకు ఇంకో అంశం కూడా పరిచయం చేసాడు. అది క్రికెట్ కామెంటరీ వినడం. వింటూ వుండడం వల్ల ఇంగ్లిష్ హిందీ మాట్లాడే సరళి (ఆక్సేంట్) తెలుస్తుందని ఆయన భావన. దాంతో పాటు పిల్లలు ఇతర అలవాట్లకు లోను కారని కూడా కావచ్చు. అప్పటికింకా టీవీ మన దేశానికి రాలేదు. 1982 ఏసియాడ్ గేమ్స్ తర్వాత దేశం లో టీవీ పాపులర్ అయింది.  నేను చెవులు విప్పి రేడియో కామెంటరీ వినే కాలానికి భారతీయ క్రికెట్ లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ,దిలీప్ సర్ దేశాయి, చందు బోర్డే  లాంటి వాళ్ళ కాలం ముగిసింది. అజిత్ వాడేకర్ కాలమది. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు స్పిన్ బౌలింగ్ లో భారత్ ది ప్రత్యేక స్థానం. అందుకు నలుగురు స్పిన్నర్లు బాధ్యత వహించే వారు. వారు బిషన్ సింగ్ బెది, బి.ఎస్.చంద్రశేఖర్, ఎరపెల్లి ప్రసన్న, ఎస్.వెంకట రాఘవన్. ఇక బాటింగ్ వరకు వచ్చేసరికి సునీల్ గవాస్కర్ యుగం అప్పుడే ఆరంభమయింది. వాడేకర్, గవాస్కర్, సోల్కర్, గుండప్ప విశ్వనాథ్ ల ధమాకా కాలమది. వాడేకర్ నాయకత్వం లో అప్పుడే వెస్ట్ ఇండీస్ సిరీస్ గెలిచారు మన వాళ్ళు. గమ్మత్తేమిటంటే నాకు క్రికెట్ ఆడకుండానే కనీసం ఫీల్డు చూడకుండానే లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, గల్లి, స్లిప్, పాయింట్, సిల్లీ పాయింట్ లాంటి స్థానాలు తెలిసేవి. సింగల్ రం, ఫోర్, సిక్సర్ లు తెలిసాయి. దానికి ప్రధాన కారణం అప్పటి రేడియో కామెంటేటర్లు. వారి మాటల్లో బంతి తో పాటు పరుగెత్తే అద్భుత వేగం, భాషలో స్పష్టత ఉండేవి. వాటితో పాటు ఫీల్డుకు సంబంధించి రికార్డు లకు సంబంధించి అనేక వివరాలు చిటికెలో చెప్పేవారు. అప్పటి రేడియో వ్యాఖ్యాతల్లో నరోత్తం పూరి, సురేష్ సరయ్యా, రవి చతుర్వేది, సుషీల్ దోషి, బాలు అలగాన్నాన్, ఆనంద్ రావు ఇట్లా పలువురు తమ రన్నింగ్ కామెంటరీ లతో పరుగులు పెట్టించేవారు. మొదట్లో ఇంగ్లీష్ హిందీల్లో వారి వేగాన్ని అందుకోవడం కష్టంగానే వుండేది కాని మనసు పెట్టి క్రమంగా వింటూ వుండడం తో వారి వేగాన్ని అందుకోవడం అలవాటయింది. భారతీయ క్రికెట్ ఆట గాల్లతో పాటు విదేశీ ఆట గాళ్ళ పరిచయం వారి ఆట తీరు కూడా పరిచయం అయింది.తోని బ్లేయర్ లాంటి పేర్లూ తెలిసాయి.

ఇక ఆట విషయానికి వస్తే కరీంనగర్ లో ప్రసాద్, పిన్నింటి అశోక్ లాంటి వాళ్ళు ఆడేవాళ్ళు. వేములవాడ మిత్రుల విషయానికి వస్తే మంగారి శివ ప్రసాద్, ఉపాధ్యాయుల సాంబశివుడు లాంటి దగ్గరి మిత్రులు సెలవుల్లో కొంచెం సీరియస్ గానే స్కూలు గ్రౌండ్ లో ఆడేవాళ్ళు. నేను, జింబో, పి.ఎస్.రవీంద్ర మొదలయిన వాళ్ళం సాహితీ సాంస్కృతిక అంశాల పట్ల ఆసక్తిగా వుండేవాళ్ళం.

++++++

అట్లా మా చిన్నప్పుడే అంటే స్కూలు కాలేజీ కాలం లోనే రేడియో మా జీవితాల్లో ప్రధాన భూమికను పోషించింది. మరీ చిన్నప్పుడు బాలానందం బాలవినోదం కొంత ఆసక్తిని కలిగించింది. తర్వాతి కాలంలో సంగీతం హిందీ పాటలు, క్రికెట్ లతో పాటు రేడియో నాటికలూ వినేవాళ్ళం. ఇంకా ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ‘సంక్షిప్త శబ్దచిత్రం’ లో ఎన్ని సినిమాల్ని విన్నామో. ఇక తర్వాతి కాలంలో నేను బాగా ప్రభావితం అయిన కార్యక్రమం ‘నవలా స్రవంతి’. అందులోనే చివరకు మిగిలేది, ఏకవీర, కాలాతీత వ్యక్తులు లాంటి నవలల్ని విన్నాను. గొప్ప గొంతుకలు అంతే గొప్ప వాయిస్ కల్చర్ తో ఆ నవలల్ని చదివిన తీరు అద్భుతం. అట్లా చదువుల కాలంలో నను ప్రభావితం చేసిన రేడియో అంటే ఇప్పటికీ నాకు వల్లమాలిన అభిమానం. 

++++++    

మిగతా ప్రభావాల వివరాలతో మళ్ళీ వారం కలుద్దాం…

-వారాల ఆనంద్                              

బాలల్ని పట్టించుకోండి….. సార్

Posted on

బాలల్ని పట్టించుకోండి….. సార్

————————

  ఇవ్వాళ బాలల దినోత్సవం. అందరమూ పిల్లల గురించి మాట్లాడతాం. అటు ప్రభుత్వమూ ఇటు సంస్థలూ సభలు పెడతాయి. జెండాలు కడతాం. పిల్లలకు మిఠాయీలు పంచుతాయి. అంతా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. భావి భారత పౌరులు అంటాం. భవిష్యత్తు నిర్మాతలు అంటాం. మర్నాటికి మరిచిపోతాం. నిజాలు మాట్లాడుకుంటే పిల్లలంటే మనకు అసలు పట్టింపు లేదు, ప్రేమ అసలే లేదు.ఇట్లా అంటే కొంచం కష్టం అనిపించొచ్చు. కానీ అది నిజం. మనం కేవలం 14 నవంబర్ రోజున మాత్రమే పిల్లల గురించి మాట్లాడతాం. కానీ వాళ్ళ కోసం ఆలోచించం. ఏమీ చేయం. ప్రభుత్వాలూ పార్టీలూ ఏమీ చేయవు. ఎందుకంటే బాలలు వోటర్లు కాదు. వాళ్లకు వోటు హక్కు లేదు. 

అంతేకాదు బాల కోసం ప్రత్యేకంగా ఏమీ రాయం. కథలు లేదా కవితలు రాయడానికో వాళ్ళని ప్రోత్సహించం. పిల్లల్ని మార్కుల వెంట పరుగేత్తిస్తాం. మెరిట్ అంటూ హింస పెడతాం. ఇప్పుడు ఇంకా ఆన్ లైన్ క్లాసులు, డిజిటల్ తరగతుల పేర కనీస సంబందాల్నుంచీ దూరం చేస్తున్నాం. అన్ని భారతీయ భాషల్లోనూ చూస్తే కేవలం బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో తప్ప మిగతా ఇతర భాషల్లో బాలసాహిత్యం తక్కువ. కొన్ని భాషల్లో నయితే శూన్యం. పిల్లల కోసం రాసేవాళ్ళు తక్కువ. రాసిన వాళ్లకు గుర్తింపు తక్కువ. పిల్లల పుస్తకాలకు మార్కెట్ తక్కువ. పిల్లల్ని చేరే సాహిత్యం తక్కువ. అంతేకాదు పిల్లల కోసం సృజనాత్మక కార్యక్రమాలు మరీ తక్కువ. దేశంలో పాలకులు అధికారులు చివరికి తల్లిదండ్రుల్లో కూడా (ఏ కొంత మందో తప్ప) పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ కానీ వాళ్ళకోసం ప్రత్యేకించి చేసేది తక్కువే.

    ఇక మన దేశంలో బాల సాహిత్యం కంటే ‘బాలల సినిమాల’ ది మరీ దారుణమయిన పరిస్థితి.  దాదాపు అన్ని భాషల నిర్మాతల్లోనూ పిల్లల సినిమాలు తీస్తే మార్కెట్ లేదు ఏమొస్తుంది అనే భావనే. మలయాళం, బెంగాలీ లాంటి కొన్ని భాషల్లో వేళ్ళ మీద లెక్కించే కొన్ని మంచి సినిమాలు మాత్రం తీసారు. ఇక ముంబై లోని బాలల చిత్ర సమితి ( CHILDREN FILM SOCIETY OF INDIA) నిర్మించిన వందలాది పిల్లల సినిమాలు ప్రదర్శనకు నోచుకోకుండా ముంబై లో పడి వున్నాయి. మేము కరీంనగర్ ఫిలిం సొసైటీ లో ఆక్టివ్ గా వున్న కాలంలో అనేక ఏళ్ళ పాటు బాలల చిత్ర సమితి నుండి సినిమాలు తెచ్చి ఊరూరా బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించాం.

    ఈ చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రథమ భారత ప్రధాని నెహ్రూ ఆలోచనల మేరకు నియమించబడిన ఎస్.కె.పాటిల్ కమిటీ సూచనల ప్రకారం 1955లో ఏర్పాటయింది.

బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, రెండేండ్లకోసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే దేశంలోని వివిధ నగరాల్లో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. 1995 లో మొదటి సారి గా మన హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించారు. తర్వాత 1999 లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు ఒక శాశ్వత వేదిక వుండాలని హైదరాబాద్‌ని ప్రతిపాదించారు.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. అంతే కాదు రాష్ట్రం లో నిర్మించే బాలల చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే గొప్ప నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది.

చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీకి భూమి ఇస్తామని అందులో శాశ్వత కార్యాలయం, ప్రత్యేక థియేటర్లు నిర్మించుకోవాలని సూచించింది. అయితే ఇదంతా ప్రకటనల ఆర్భాటమే తప్ప అవేవీ అప్పుడు సాకారంకాలేదు. ఇప్పటికీ కాలేదు. భూమి ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఆధీనం చేయలేదు. తెలంగాణా ప్రభుత్వం వచ్చింతర్వాత కూడా అదేమీ జరగ లేదు. ఇంతలో కేసులు వగైరాలతో అది మూల బడింది. ఇప్పుడా భూమి వుందో అన్యాక్రాంతం అయిందో ఎవరికీ పట్టింపు లేదు. ఇప్పటికీ శాశ్వత వేదికకు ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్లో  టూరింగ్ ఫెస్టివల్ గానే మిగిలిపోయింది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ అధికారులు రెండేం డ్లకోసారి హైదారాబాద్ వచ్చి ఏదో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహించాము అనిపించి అది అయిపోగానే పెట్టె బేడా సర్దుకుని వెళ్ళిపోతారు. పాలకులు అం తర్జాతీయ వేదిక పైన ఉపన్యాసాలు దంచి చేతులు కడుక్కుని వెళ్లిపోతారు. మళ్ళీ రెండేళ్ల దాకా బాలలు, వారి సినిమాల గురించిన ఊసే వుండదు. రెండేండ్లకోసారి హడావు డి చేయడమే మిగులుతుంది.

నిజానికి పిల్లల మనో వికాసానికి సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. చదువు మేధస్సు ఎదుగుదలకు, క్రీడలు శారీరక ఎదుగుదలకు తోడ్పడితే సాంస్కృతిక విషయాలు వారి వ్యక్తిత్వ ఎదుగుదలకి దోహదపడి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఇస్తాయి. సాంస్కృతిక విషయాల్లో దృశ్య మాధ్యమాలు పిల్లల పైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే సినిమాను పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించి వారికి అందించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇరాన్ లాంటి దేశాల పిల్లల చిత్రాల్ని ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలు మహా నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెల్లో వుండే బాలలకూ ప్రదర్శించగలిగితే గొప్పగా వుంటుంది. దానికి జిల్లాల స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసి, ఎప్పుడో రెండేండ్లకోసారి కాకుండా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాల్ని అందించగలిగితే బాలలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, రష్యాల నుంచి వచ్చిన పిల్లల సినిమాలు అద్భుతంగానూ, భావస్పోరకంగానూ వుంటాయి. అవి మొత్తం ప్రపంచాన్ని కట్టి పడే శాయి. ఇరాన్ సినిమాలకున్న నేపథ్యం మన తెలంగాణకూ ఉన్నది. కావలసిందల్లా ఇరాన్‌లో లాగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సి ఉన్నది. మన దర్శకులు కూడా రొడ్డకొట్టుడు నీతి బోధల సినిమాలు కాకుండా భిన్నంగా బాలల మనసుల్ని గెలుచుకునే సినిమాలు నిర్మించ గలిగితే తెలంగాణ గొప్ప బాలల చిత్రాలకు వేదికయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్ర చలన చిత్రాభివ్రుద్ది సంస్థకు చైర్మన్ ను నియమించి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం అర్థవంతమయిన సినిమాల గురించి ముఖ్యంగా బాలల కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సి వుంది.

పిల్లలకోసం ఎ కొంత చేసినా ఎంతో చేసిన వాళ్ళవుతారు.

——————– వారాల ఆనంద్

యాదొంకీ బారాత్ – 21=కరీంనగర్- సినిమాలూ- ప్రభావాలూ

Posted on

యాదొంకీ బారాత్ – 21

—————-

కరీంనగర్- సినిమాలూ- ప్రభావాలూ

+++++++++++++++

బాల్యం చాలా మధురమయింది. టీనేజ్ బాగా చిత్రమయింది. ఆ రెండు కాలాల్లో పడిన ప్రభావాలూ, కురిసిన అనుభూతులూ, కలిగిన అనుభవాలూ, ఆనందాలూ, అవమానాలూ చిరకాలం గుర్తుండిపోతాయి. Conscious లో వెంటాడుతూనో, Sub-conscious లో గింగిరాలు కొడుతూనో ఎన్నేళ్ళయినా తోడుంటాయి. అవి వదలవు, మనం వదిలించు కోలేము. వదిలించుకున్నామని ఎవరయినా అంటే అది తమని తాము మభ్యపెట్టుకోవమూ, మరో రకంగా చెప్పాలంటే తమని తాము మోసం చేసుకోవడమే. ఆనందాలూ అవమానాలూ సదా ఉండేవే. వాటిని అట్లా ఉంచి నా పైనా నామిత్రుల పైనా స్కూలు, ఇంటర్, డిగ్రీ కాలేజీ రోజుల్లో అత్యంత ప్రభావం చూపింది మాత్రం సినిమా రంగమే. అప్పుడున్న ఏకైక వినోదమూ, విజ్ఞానమూ సినిమానే. ‘రహదారీ మురికి కాలువా’ అదే. బహుశ చిన్నప్పటినుండీ అంటే మేము మిఠాయి దుఖానంలో నివాసం వున్న కాలం నుండీ హిందీ సినిమా పాటలూ, సినిమాలూ నాపై విపరీతమయిన ప్రభావాన్నే చూపించాయి. అట్లా మొదలయిన ఇష్టం నా జీవిత కాలంలో అర్థవంతమయిన సినిమా పట్ల అభిమానం పెరగడా నికి కారణమయిందనుకుంటాను. వాటిపట్ల ఆరాధన పెరిగేలా చేసిందేమో కూడా. అంతే కాదు సమాంతర సినిమాను అర్థం చేసుకోవడానికీ, విశ్లేషించి నాలుగు మాటలు రాయడానికీ మూలం బహుశా చిన్ననాటి ప్రభావమే.

—————-

కరీంనగర్ లో నాకు తెలిసేనాటికి మూడు సినిమా హాళ్ళు ఉండేవి. అవి భారత్, తిరందాజ్, రోజ్. వాటిల్లో ఒక్క భారత్ లో మాత్రమే రెండు ప్రొజెక్టర్లు మిగతా వాటిల్లో సింగిల్ ప్రొజెక్టర్ మాత్రమే ఉండేది. అంటే భారత్ లో ప్రతి షోలో ఒకే ఇంటర్వెల్ వుంటే మిగతా రోజ్, తీరందాజ్ లల్లో రెండు రీలు చేంజ్ లు ఒక ఇంటర్వెల్. రీలు మధ్య ‘రీలు’ మార్పు అని స్లైడ్ వేసే వాళ్ళు. అన్నింటిలోనూ నేల, బెంచి, కుర్చీ మూడు క్లాసులు ఉండేవి. కుర్చీ తరగతి వెనకాల స్త్రీల కోసం ప్రత్యెక విభాగం, రెంటికీ నడుమ పరదా కట్టేవాళ్ళు. రీలు చేంజ్, ఇంటర్వెల్ కాగానే పరదా వేసేయడం సినిమా మొదలవగానే పరదా లాగేయడం. అదంతా మహిళ లకు ప్రైవసీ కోసమే. బహుశా ఆ కాలంలో ఈ ఏర్పాటు దాదాపు అన్ని ఊర్లల్లో అన్ని టాకీసుల్లో వుండేది.****** ఇవ్వాల్టి రోజుల్లో పెరిగిన సాంకేతికత ఫలితంగా సౌండ్ సిస్టంలో స్టీరియో ఫోనిక్, డాల్బీ తదితర ఆదునిక రీతులు వచ్చాయి, సినిమా హాళ్ళల్లో మోత పెరిగి పోయి చెవులు బద్దలయ్యే స్థితి వచ్చింది. ఇక సినిమా హాళ్ళ విషయంలో సింగిల్ స్క్రీన్ లు, మల్టీ ప్లెక్ష్లు లు అంటూ కొత్త రూపాలు వచ్చాయి. వాటిల్లో సాఫిస్టికేషన్ పేర సరికొత్త వాతావరణం రూపుదిద్దుకుంది. హాళ్ళు నిశబ్దాల్ని సంతరించుకుని స్క్రీన్ అండ్ సౌండ్ సిస్టంల మోత ఎక్కువ అయింది. కానీ సినిమా ప్రారంభ దినాల్లో కానీ, మేము సినిమాలకు వెళ్తున్న మొదటి రోజుల్లో కానీ సేనిమా హాళ్ళు ఇప్పుడున్నట్టుగా నిశ్శబ్దంగా ఉండేవి కావు. సైలెంట్ సినిమా అంటే మూకీ సినిమాల కాలంలో సినిమాల్లో మాట పాట వుండేది కాదు కానీ హాలులో పరదాకు ముందు ఒక గుంత(PIT) లాంటిది వుండి అందులో గాయకులూ, హార్మోనియం,తబలా వాయిద్య కారులు కూర్చుండి తెరమీది దృశ్యానికి అనుగుణంగా పడుతూ వాయిస్తూ వుండేవాళ్ళు. వచ్చేవాళ్ళు పోయే వాళ్ళతో హాలు గోల గోలగా వుండేది. అంతే కాదు ప్రేక్షకుల్లోంచి పాటలకోసం ఫర్మాయిష్ (కోరికలు) కూడా వచ్చేవి వాటికి అనుగుణంగా పాటలు నడిచేవి. అట్లా ఆ కాలంలో సినిమా మూకీనే హాలు మాత్రం గోల గోల. ఇక మేము సినిమాలు చూసే కాలానికి స్క్రేన్ మీద సినిమా నడుస్తూ ఉండగానే హాలు లో గరం గరం పల్లీ, బటానీ అంటూ అమ్మేవాళ్ళూ, సోడా అంతో అరిచేవాళ్ళూ, బీడీ సిగరెట్ అంటూ అమ్మే వాళ్ళతో హాలు మోగిపోతూ వుండేది. ఇక ప్రేక్షకులు కాల్చే సిగరెట్ బీడీల పొగతో హాలంతా కంపు కొడుతూ వుండేది. ఎప్పుడయినా పొరపాటున ఫిలిం బర్న్ అయ్యో కరెంటు పోయో ప్రదర్శన క్షణం ఆగిపోతే వినాలి గోల. ఆపరేటర్ని పేరుతో సహా పిలుస్తూ ‘వారీ పన్నావురా…’ అంటూ నానా తిట్లతో అరిచేవారు. అట్లా వుండేది ఆనాటి సినిమా హాలు మాహోల్. నేల టికెట్ వాళ్ళ స్థితి చెప్ప నలవి కాదు. ఆ పరిస్థితుల్లో కూడా అద్భుతమయిన సినిమాల్ని చూసాం.

+++++++++

మా కరీంనగర్ లో ‘రోజ్’ టాకీసు నాకు గుర్తు తెలీక ముందు తడకలు, పైన రేకుల టాకీస్ గా ఉండేదట. ‘పాతాళభైరవి’ సినిమా అందులోనే రిలీజ్ అయ్యి చాలా విజయవంతంగా ప్రదర్శించ బడిందని, ఆ సినిమాకు వచ్చిన డబ్భు తోటే ధియేటర్ శాశ్వత నిర్మాణం జరిగిందని మా ఇంట్లో చెప్పే వాళ్ళు. రోజ్ ఎలివేషన్ హైదరాబాద్ లో వున్న సినిమా హాళ్ళ తరహాగా వుండేది. కుర్చీ టికెట్ మొదటి అంతస్తులో వుంటే, రెండు బాల్కనీలు కూడా ఉండేవి. ఆ సినిమా హాలు పాత బజారు ముస్లిం మైనారిటీలు అధికంగా వున్న ప్రాంతంలో వుండేది. అందులో నేను చూసిన రెండు సినిమాలు నాకు బాగా గుర్తున్నాయి. ఒకటి ‘ఏకవీర’. ఇంట్లో చెప్పకుండా వెళ్ళిన మొదటి సినిమా అది. ఆ రోజు మిత్రులందరమూ కలిసి స్క్రీన్ కు ముందు వేదిక మీద కూర్చుని చూసాం. ఏకవీర లో మాటల గాంభీర్యం కంటే ‘ప్రతీ రాత్రి వసంత రాత్రి..’ లాంటి పాటలు విపరీతంగా నచ్చాయి. సినారే రాసిన మాటలని జాగ్రత్తగా విన్నాఎందుకో మనసుకు పట్టలేదు. ఇక బాగా గుర్తున్న రెండవ సినిమా మృణాల్ సేన్ రూపొందించిన ‘ఒక వూరి కథ’. తెలుగు ప్రధాన స్రవంతి సినిమాలకు భిన్నంగా వున్న ‘ఒక వూరి కథ’ నాకు బాగా నచ్చింది. ఎంత సహజంగా ఉందీ అని అప్పుడే అనిపించింది. ముఖ్యంగా వాసుదేవ రావు, నారాయణ రావుల పాత్రలు ఇప్పటికీ లోపలెక్కడో మెదుల్తూనే ఉంటాయి. ఆ రోజు అదే షోకి అంపశయ్య నవీన్ కూడా వచ్చారు. సినిమా ముగిసిన తర్వాత కనబడి ‘ఓ ఆనంద్, ఎట్లా వుంది సినిమా’ అని అడిగారు. ఇంకా రోజ్ టాకీసు ప్రాంతంలోనే మా నాన్న చిన్న చెల్లెలు సువర్ణత్త వాళ్ళు ఉండేవాళ్ళు. దాదాపు అదే ప్రాంతంలో మా చిన్ననాటి స్కూల్ మితృలు చింతకింది వేణుగోపాల్, సుధాకర్, రాజయ్యల ఇండ్లు ఉండేవి. వేణు గోపాల్ వాళ్ళది చవక ధరల దుకాణం. వాడికి స్కూలు లో ఉండగానే పెళ్ళయ్యింది. అప్పుడది మాకో వింతే కాకుండా సెలెబ్రేషన్ కూడా. సుధాకర్ వాళ్ళది అటుకుల బిజినెస్ అనుకుంటాను. ఇక ‘భారత్’ టాకీసు అనగానే మా పెదనాన్న కొడుకు వారాల ప్రకాశ్ గుర్తొస్తాడు. తను అందులో ఫిలిం ఆపరేటర్ గా పని చేసేవాడు. ప్రకాశాన్న మేనమామ వీరాస్వామి మామకు కూడా భారత్ టాకీసుతో అనుబంధం ఉండేది. నా జీవితంలో మొట్ట మొదటిసారి సినిమా హాల్లో ప్రొజెక్టర్ ను, ప్రొజెక్షన్ గదిని చూడ్డం ప్రకాశన్న వల్లనే సాధ్యమయింది. తానే మా చిన్నప్పుడే లోపలి తీసుకెళ్ళి ఫిలిం రీలు చుట్టడం, తెగిన రీలును అతికించడం అన్నీ వివరంగా చూపించాడు. అంతేకాదు ప్రొజెక్షన్ గది లోనుంచి స్క్రీన్ పైన బొమ్మల్ని చూడడం గొప్ప థ్రిల్. అట్లా భారత్ నాకు వ్యక్తిగత అనుబంధముంది. భారత్ లో అనేక సినిమాలు చూసిన జ్ఞాపకముంది. కానీ “యాదొంకీ బారాత్” ఇప్పటికీ గుర్తు. ‘చురాలియా హై తుమ్ నే జో దిల్కో..’ అంటూ విజయ్ అరోరాను చూస్తూ జీనత్ అమన్ పాడిన పాట ఇప్పటికీ నా లోన ఫ్రెష్. ఇంకా తారిక్ గిటార్ వాయిస్తూ పాడిన పాటలూ గుర్తున్నాయి. ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. సలీం జావేద్ లు రచన చేసారు. భారతీయ సినిమాల్లో అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు, తల్లీ పిల్లలూ చిన్నప్పుడే విడిపోయి తర్వాత కలవడం లాంటి ఎన్నో సినిమాలకు ‘యాదొంకి బారాత్’ ప్రేరణ. ఆ సినిమాను ఆ రోజుల్లోనే మూడు సార్లు చూసాను. నెలకో సినిమా మాత్రమే అనుమతి వున్న ఆ రోజుల్లో నాకు అదో పెద్ద రికార్డు. అదే సినిమాను తెలుగులో ‘అన్నదమ్ముల అనుబంధం’ పేర చెత్తగా రీమేక్ చేసారు. తర్వాతి సంవత్సరాల్లో ఇదే భారత్ టాకీసులో మా కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో సత్యజిత్ రే ‘కా పురుష్ ఓ మహా పురుష్’ లాంటి సినిమాల్నీ వెసాము( వివరాలు మళ్ళీ రాస్తాను).

భారత్ టాకీస్ దగ్గరలోనే దామోదర్, వెంకటేష్ ల ఇండ్లు ఉండేవి. భారత్లో మాకో చెప్పుకోవాల్సిన అనుభవం వుంది. అప్పటికి మేమంతా 41 పైసల ( అంతకు ముందు 35పైసలుండేది) నేల టికెట్ కి వెళ్ళే వాళ్ళం. బెంచికి 75 పైసలు,కుర్చీకి 1.25 పైసలు వుడేది.ఆరోజు నేలలో కూర్చుని ఎదో సినిమా చూస్తున్నాం. ఇంటర్వెల్ లో దామోదర్ ఇంటికి వెల్లిపోదాం అని గొడవ చేసాడు. మొదట ఎందుకో అర్థం కాలేదు. తర్వాత చెప్పాడు. నేల మీద తన పక్కన కూర్చున్నది రోజూ తమ ఇంటికి అడుక్కునేందుకు వచ్చే బిచ్చగాడని. ఇక అప్పటినుంచీ నేల టికెట్ కు వెళ్ళడం బంద్. అదట్లా జరిగింది. కరీంనగర్ లోని మరో హాలు తీరందాజ్. అది గుర్తుకు రాగానే మేము గంజ్ స్కూల్లో చదివే కాలం లో ఆ టాకీస్ అధినేత కూతురు ప్రభ(అనుకుంటాను) మా బాచులోనే సి సెక్షన్ లో వుండేది. ఆ టాకీసులో నేను చూసిన మొదటి సినిమా గుర్తున్నంత వరకు ‘సావన్ బాదోన్’ రేఖ, నవీన్ నిశ్చల్ లు జంట. రేఖకు అది మొదటి హిందీ హిట్ సినిమా. తర్వాత ‘పత్తర్ కే సనం’ లాంటి సినిమాలు చూసాను. తర్వాతి కాలంలో ఫిలిం సోసైటే పక్షాన పిల్లల సినిమాలు చాలా ప్రదర్శించాం.ఆ తర్వాతి కాలంలో రోజ్ మూతబడడం, తీరందాజ్ రినోవేషన్, భారత్ కూడా అంతే, 73-74 లలోనే బస్ స్టాండ్ పక్కన ‘నటరాజ్’, కార్ఖానా గడ్డ లో ‘బాలకృష్ణ’ టాకీసులు వచ్చాయి.

వాటన్నింటి గురించీ మరో ఎపిసోడ్లో రాస్తాను కానీ సినిమాకు సంబంధించి నా మట్టుకు నాకు రికార్డ్ అనిపించిన ‘షోలే’ గురించి చెప్పి ముగిస్తాను. అది నేను మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి వెళ్ళిన సమయం. హైదరాబాద్లో మా అమ్మ చెల్లెలు వినోద చిన్నమ్మ వాల్లున్దేవాళ్ళు. బాబాయి శ్రీ ప్రభాకర్ రావు పుత్లీబౌలీ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. ఆయన అన్న గారు శ్రీ జనార్ధన్ రావు ఐ.ఏ.ఎస్.ఆఫీసర్ గా చేసారు. పరీక్ష రాసి వాళ్ళింటికి వెళ్లాను. జనార్ధన్ రావు గారి కుమారుడు రామారావు ఆయన మిత్రులు అదే రోజు రిలీజ్ అయిన ‘షోలే’ సినిమాకు పోలీసు అధికారంతో టికెట్స్ తెప్పించాడు. వారితో నేనూ వెళ్లాను. పెద్ద హైప్ తో ఎన్నో రోజుల అడ్వాన్స్ బుకింగ్ లతో విడుదల అయిన షోలే’ ను రామకృష్ణ 70ఎం.ఎం.లో మొదటి రోజు ఫస్ట్ షో చూడడం ఆనాటికి అది గొప్పే, 70 ఎం.ఎం. స్టీరియో ఫోనిక్ సౌండ్ తో షోలే గొప్ప అనుభవమే. రామా రావు ఆ తర్వాత అగ్రికల్చర్ బిఎస్సీ చదివాడు. ‘షో’లే లో ధర్మేంద్ర అమితాబ్ లకంటే అమ్జద్ ఖాన్ ఆయనకంటే సంజీవ్ కుమార్ బాగా నచ్చాడు నాకు అప్పుడే. అట్లా అన్నీ హిందీ వే కాదు కొన్ని తెలుగు సినిమాలూ నన్ను ప్రభావితం చేసినవి వున్నాయి

వాటి వివరాలతో మళ్ళీ వారం కలుద్దాం….. –

వారాల ఆనంద్

యాదోంకి బారాత్ -20 = ఎస్.ఆర్.ఆర్.కాలేజ్= డిగ్రీ చదువులు= సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు

Posted on Updated on

ఎస్.ఆర్.ఆర్.కాలేజ్= డిగ్రీ చదువులు= సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు ———–

1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటినుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s English medium SCHOOL వుండేది. దాని ప్రహరీ గోడను ఆనుకుని వున్న చిన్న దారి గుండా కాలేజీకి వెళ్ళేవాళ్ళం. కాలేజీ వెనుక నుండి మైదానం దాటి లోనికి మా దారి. మంకమ్మతోట అంటే వెనకటి కాలంలో ఎప్పుడో అక్కడ ఓ తోట ఉండేదని మంకమ్మ పేర ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అనేవాళ్ళు. కరీంనగర్ నుండి వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి లకు వెళ్ళే ప్రధాన రహదారి మంకమ్మ తోట గుండా వెళ్తుంది. ఇక ఆ రోడ్డు మీదే SVTC ( ఎస్.వీ.టీ.సి.) అని ఓ ట్యుటోరియల్ కాలేజీ బాగా పాపులర్. దాన్ని స్థాపించి నడిపింఛిన వారు శ్రీ సముద్రాల నాగభూషణం. కరీంనగర్ కు ట్యుటోరియల్ కాలేజీ అన్న భావనను పరిచయం చేసింది ఆయనే. అప్పుడు పదవ తరగతి కి ఎస్.వి.టి.సి. నోట్స్ అంటే చాలా పాపులర్. ఆర్ ఎస్ ఎస్ భావ జాలంతో వున్నా ఆయన చాలా డెమోక్రటిక్ గా ప్రవర్తించేవారు. అందుకే ఆయనంటే కరీంనగర్ లో గొప్ప గౌరవ భావం వుండేది. ఆయన కూతురు బొడ్ల అనురాధ ఇంగ్లీషులో ప్రావీణ్యత సాధించారు. తాను నా కవిత్వాన్ని ‘SIGNATURE OF LOVE” పేర ఇంగ్లీష్ లోకి అనువదించారు. తర్వాత నా ముక్తకాలు కూడా “MUKTHAKAALU” ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసారామే. ఇక మంకమ్మ తోట అనగానే మా ఇంటర్ మిత్రులు, తర్వాత డిగ్రీ లో చేరిన వాళ్ళు అనేక మంది గుర్తొస్తారు. సుబ్బారావు సార్ కొడుకు మధు, బట్టీల రంగయ్య కొడుకు రాజేందర్, విజేత శంకర్ తమ్ముడు తిరుపతి గౌడ్ , అర్ధంతరంగా మమ్మల్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన మాధవ్,ఇట్లా అనేక మంది ఆత్మీయ మిత్రులు మదిలో మెదులుతారు. అంతేకాదు మంకమ్మతోట అనగానే సంతోష్ కుమార్ (తర్వాత ఎం ఎల్ సి అయ్యాడు), శంకర్, లక్ష్మినారాయణ ఇంకా ఎందరో.. మంకమ్మతోటలో నేను కొద్ది రోజులు టైపింగ్ నేర్చుకోవడానికి కు వెళ్ళిన విద్యార్థి ఇన్స్టిట్యుట్ ఇప్పటికీ వుంది, అంతేకాదు మా ఇంట్లో అందరికీ వైద్యం చేసిన ఆర్.ఎం.పి.డాక్టర్ తిరుపతి గారు యాది కొస్తారు. ఆయనకో చిత్రమయిన అలవాటు ఉండేది పేషంట్లను ఎవరయినా సరే ఎక్కువ సేపు వెయిటింగ్లో ఉంచేవాడు. చాలా రోజులు అర్థం కాలేదు. బోర్ కొట్టేది కోపం కూడా వచ్చేది. అయితే వచ్చిన పేషంట్లు మొదట ప్రశాంతం కావడానికో లేక ఎక్కువ మంది వున్నారనే భావన కలగడానికో అని అర్థం అయ్యాక నవ్వుకున్నాను. ఇక మంకమ్మ తోటలో మరో రెండు ప్రధాన కుటుంబాలున్నాయి. ఒకటి కల్పనా దేవేందర్ వాళ్ళది వాళ్లకు బస్ స్టాండ్ రోడ్డులో మొదట సైకిల్ టాక్షి తర్వాత కల్పనా హోటల్ వుండేది. ఇక మరో కుటుంబం పొన్నం వాళ్ళది. నిజానికి వాళ్ళ ఇల్లు కూడా క్లాక్ టవర్ దగ్గర మా మిఠాయి దుకాణం ప్రాంతం లోనే వుండేది. తర్వాత వ్యవసాయం వుండి ఇటు వైపు వచ్చారు. గతం లో వారాల వాళ్ళకూ అవద్ గాని కుంట దగ్గర వ్యవసాయ స్థలాలు ఉండేవని అన్నీ పోయాయని నాన్న చెబుతుంటారు.

*******

ఇక నా రచనా యాత్ర లో మొదటి కథ రాయడం అది చిత్రిక వార పత్రికలో అచ్చుకావడం ఒక ఎత్తయితే కవిత రాసి మొట్ట మొదటిసారి వేదికమీద చదివి అభినందనలు అందుకోవడం ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ కాలేజీ లోనే జరిగింది. అది ఎంతో ఆనందకరమయిన సందర్భం. డిగ్రీ రెండో సంవత్సరం లో ఉన్నప్పటి మాట అంటే 1976 లో కాలేజీ ప్రిన్సిపాల్ గా శ్రీ కే.వై.ఎల్.నరసింహా రావు వచ్చారు. అప్పటిదాకా వున్న వెల్చాల కొండల రావు బదిలీ మీద హైదరాబాద్ కు వెళ్ళారు. కే.వై.ఎల్ గారు సౌమ్యుడు. చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించెంత గంభీరంగానూ ప్రేమగానూ వుండేవారు. ఆయన వచ్చిన తర్వాత కాలేజీలో సాహితీ వాతావరణం ఏర్పడింది. మా కాలేజీకి గతంలో ప్రిన్సిపాల్ గా పనిచేసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మీద గౌరవంతో కాలేజీ మీటింగ్ హాల్ కు ‘విశ్వనాథ సభామందిరం’ అన్న పేరు పెట్టారు. అందులో ఒక రోజు ఓ సాహితీ కార్యక్రమం, కవిసమ్మేలనం ఏర్పాటు చేసారు. ముఖ్యవక్తగా అప్పుడు కరీంనగర్ లోని బిషప్ సాల్మన్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనుచేస్తున్న సుధామ గారిని పిలిచారు. సభా మందిరం క్రిక్కిరిసి పోయింది. సుధామ అ రోజు తెలుగు కవిత్వం లో ఆధునికత విషయాన్ని ఎంచుకుని శ్రీ శ్రీ కవిత్వం నుంచి మొదలు ఆధునిక తెలుగు వచన కవిత్వం గురించి అద్భుత ప్రసంగం చేసారు. ఆయన గొంతు చాలా బాగుండడంతో శ్రోతలు స్పెల్ బౌండ్ అయ్యారు. తర్వాత ప్రిసిపాల్ కే.వై.ఎల్. నరసింహ రావు మాట్లాడుతూ సుధామ గారు బాగా మాట్లాడారు కాని శ్రోతలు సాహిత్యానికి ఒక వైపే విన్నారని మరో కోణం కూడా వుందని తెలియజేయడానికే నంటూ విశ్వనాథ, రాయప్రోలు లాంటి వారి సాహిత్యాన్ని కృషిని సోదాహరణంగా ప్రసంగించారు. ఆ రెండు ప్రసంగాలూ హాలు లోని వాళ్ళందరినీ మంత్ర ముగ్దుల్ని చేసాయి. అనంతరం జరిగిన కవి సమ్మెళనంలో నా మొదటి కవితా పఠనం. చదివిన కవిత గుర్తు లేదు కాని చదివింతర్వాత కే.వై.ఎల్. గారి చేతుల మీద అందుకున్న సత్కారం ఎప్పటికీ మర్చిపోలేను. సుధామ మరికొంత కాలం బిషప్ సల్మాన్ కాలేజీ లో పని చేసారు. ఆ కాలేజీకి వెళ్లి తనని కొన్ని సార్లు కలిసాము. తరవాత సుధామ ‘ఆకాశవాణి’ లో చేరిపోయారు.

……………………….

మరోవైపు కరీంనగర్ లో నెహ్రు యువక కేంద్రం బాగా ఆక్టివ్ అయింది. యూత్ కో ఆర్డినేటర్ గా వచ్చిన వి.రామారావు గారు వినూత్న కార్యక్రమాలతో జిల్లాలో యువకులను సమీకరించి చైతన్య వంతం చేయడం ఆరంభించారు. అందులో భాగంగా బస్ స్టాండ్ కు ఎదురుగా వున్న యువక కేంద్ర లో ‘WEDNESDAY CLUB’ ప్రారంభించారు. ఆ క్లబ్ లో యువకులని సభ్యులుగా చేర్పించారు.ఆ క్లబ్ ప్రతి బుధవారం సాయంత్రం సమావేశంయ్యేది. అందులో ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసమూ, ఉపన్యాస కళ, వర్తమాన సామాజిక విషయాల మీద చర్చలు జరిగేవి. అందులో ప్రధానంగా వాసుదేవ రెడ్డి, మహేష్, వెంకటేష్, నేను ప్రధాన పాత్రల్ని పోషించాం. బుధవారం క్లబ్ తో పాటు వివిధ గ్రామాల్లో యూత్ కాంపులు పెట్టేవారు. ఆ టీం లో వాసుదేవ రెడ్డి మహేష్ తదితరులు ‘శారదా నికేతన్ “సంస్థ పెట్టి ‘కరీంనగర్ కళాభారతి హాలు లో ఎన్నో నాటకాలు వేసారు. యువకకేంద్రలో అకౌంటెంట్ గా వున్న టి.వి.విద్యాసాగర్ రావు, టైపిస్ట్ గా వున్న చీటీ జగన్ రావు ఎంతో సహకరించేవాళ్ళు. శ్రీ విద్యాసాగర్ రావు తర్వాతి కాలంలో కో ఆర్డినేటర్ అయ్యాడు, చీటీ జగన్ రావు గంగాధర మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

. ++++++++++++++

సరిగ్గా ఆ కాలం లోనే మా మిత్రులందరి జీవితాల్లోకి సంగీతం ఆర్కెస్ట్రా లు వచ్చి చేరాయి. చిన్నప్పటినుండీ బినాకా గీత్మాలా, పురాని ఫైల్మొంకా గీత్ తదితర కార్యక్రమాలతో హిందీ పాటల ఊయలలో వూగుతున్న నాకు ఇంటర్ కు వచ్చేసరికి కరీంనగర్ లో కరీంనగర్ కల్చరల్ వింగ్ పేర ఓ ఆర్కెస్ట్ర తగిలింది. ఆనేక వాయిద్యాలతో సాగే ఆ ప్రదర్శనలు లైవ్ కావడంతో విపరీతంగా ఆకట్టుకొనడం ఆరంభించాయి. ఈ టీం లో హన్మాండ్లు, నరేంద్రచారి తదితరులు తెలిసిన మిత్రులు వుండేవాళ్ళు. వినాయక చవితి ఉత్సవాలు, స్కూలు కాలేజీ కార్యక్రమాలల్లో వారి కార్యక్రమాలు గంటలు గంటలు సాగేవి. ఇక ఇంటర్ లో మా క్లాస్మేట్ రవీందర్ తన సుశీల గొంతుతో పాటలు పాడేవాడు. ‘శారదా నిను చేరదా..” లాంటి పాటలతో ఆయన పాపులర్. డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి మా వెంకటేష్ తమ్ముడు మాకంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన ప్రసాద్ పాటలు పాడడం మొదలు పెట్టాడు. ఇక ఏముంది మా చుట్టూ ఒక పాటల టీం తయారయ్యింది. ఆ టీం లో పాటలు రాని పాడని మిత్రులమూ వుండేది. అలాంటి వారిలో నేను, వెంకటేష్ అతో పాటు రాదాకృష్ణ కూడా వున్నాడు. వెంకటేష్ వాళ్ళు మంకమ్మ తోటకు వెంకటేశ్వర గుడి పక్క ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ ఇంటికి పక్కనే వున్న కల్వర్ట్ పైన ప్రతి సాయంత్రం కూర్చుని కాలక్షేపం చేసేవాళ్ళం. ప్రసాద్ తో పాటు సుధాకర స్వామి, మోహన స్వామి, ఇట్లా పలువురు గాయకులూ తయారయ్యేవారు. ఆంధ్ర నుంచి వచ్చి బాంక్ లో చేరిన ఇంకో మిత్రుడు కూడా లేడి గొంతు తో పాడేవాడు. ప్రసాద్ ‘ ఏ దివిలో విరిసిన పారిజాతమో ..‘, ‘ఎదో ఎదో అన్నది ఈ మసక వెలుతురు’ అన్న పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. సుధాకర స్వామి తన గొంతు తో పాటు లేడీ గొంతుతో కూడా పాడేవాడు. ‘ఎన్నెన్నో జన్మల బంధం…’ అనే పాటతో వాడు పాపులర్. ఇక మోహన స్వామి ఘంటసాల పాటలకు ఫేమస్. మోహన స్వామి పాడటంతో పాటు తబలా, హార్మోనియం తో సహా పలు వాయిద్యాలు వాయించేవాడు. మరో మిత్రుడు చెన్నారెడ్డి ముకేష్ గొంతు తో హిందీ పాటలు పాడేవాడు. ఈ టీం బయటే కాకుండా కాలేజీలో కూడా పాటలు పాడటం ప్రోగ్రామ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు. వీళ్ళతో మంకమ్మతోటలో మా ఇంటికి దగ్గరలోనే వుండే చారి తన గొప్ప వాయిస్ తో ఘంటసాల పాటలు బాగా పాడేవాడు. ఘంటసాల భగవద్గీత ను ఆలపించే వాడు. ఆయన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు వేణుగోపాలా చారికి బంధువు కూడా. వాళ్ళే కాకుండా సుధాకర స్వామి అన్న మనోహర స్వామి, గోపాల్ లాంటి వాళ్ళు కూడా పాడేవాళ్ళు. ఈ గాయకుల నడుమ పోటీ, ఈర్శాసూయలూ బాగానే వుండేది. అయినా టీమ్ గా అనేక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ పాటలు ప్రోగ్రాములూ రెండు మూడేళ్ళు సాగాయి. తర్వాత క్రమంగా ప్రసాద్ పోస్ట్ ఆఫీసులోనూ, మోహనస్వామి టీచర్ గానూ మిగతా అందరూ వేర్వేరు ఉద్యోగాల్లో వృత్తుల్లో స్థిర పడిపోయారు. కరీంనగర్ మొత్తం మీద ఆర్కెస్ట్రా వాతావరణం కనుమరుగయిపోయింది. అలా ఆనతి కాలంలో సాహిత్యం తో పాటు పాటలూ మమ్మల్ని పెనవేసుకున్నాయి.మిగతా వచ్చే వారం…..

-వారాల ఆనంద్