Month: December 2021

Posted on Updated on

పుస్త‌కం కారాదు పురావ‌స్తువు..!

+++++++++++++++++++

సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్‌ రాసినట్టు.. ‘పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందని ఇచ్చిపుచ్చుకునే నెపం మీదో మాటలు కలిపి, ఏర్పర్చుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో’. ఆధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని చూస్తూ కవి పడ్డ ఆవేదన అది. ‘పుస్తకం హస్త భూషణం’ అన్న స్థితి నుంచి నేడు పుస్తకం ‘పురా వస్తువు’ అయిపోయే స్థితి కనిపిస్తున్నది.
పుస్తకం చదవడం అంటే విద్యాలయాల్లో మార్కులు ర్యాంకులు సాధించడానికి పరిమితమైపోతుండగా, పౌర గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల కోసం చదవడమే మనకు కనిపిస్తున్నది. ఫలితంగా మానవీయ విలువల ప్రాధాన్యం, సామాజిక రంగంలో వేళ్లూనుకుంటున్న సంక్లిష్టతలనూ, మానసిక సంక్షోభాలనూ ఆవిష్కరించిన పుస్తకాలను చదివేవాళ్ల సంఖ్య తగ్గిపోతున్నది. ఫలితంగా వ్యక్తిగత, సామాజిక సంక్లిష్టతలు అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలకూ అవకాశం కలుగుతున్నది.
నిజానికి పుస్తకం ఒక నిధి. భాషకూ, భావానికీ, వ్యక్తీకరణకూ పుస్తకం ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞాన పరంపరను వారసత్వంగా అందిస్తున్న మాధ్యం పుస్తకం. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర చాలా గొప్పది, విశిష్టమైంది కూడా. ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాలను, ఉద్యమాలను, ఉద్వేగాలను, విలువలను ఒక్కటేమిటి మనిషి సమస్త మార్పులనూ పుస్తకం తనలో నిబిడీకృతం చేసుకొని సాక్షీభూతంగా నిలబడింది. అలాంటి పుస్తకాలు అనేక మందికి చేరడం విస్తృతంగా చదవడం అత్యంత అవసరం. పెరిగిన సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలు పుస్తకాలను పూర్వపక్షం చేస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు.
21వ శతాబ్దంలో ఆధునిక తరం ‘చదివే’ సంస్కృతి నుంచి వేరై పోతూ ‘చూసే’ సంస్కృతికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్దకాలం నుంచి ఒక్క చదివే అలవాటు మినహా మాధ్యమాలూ అలవాట్లూ పెరిగాయి. అంతా చూడటమే. టీవీ, సినిమా, కంప్యూటర్‌ చూస్తారు. స్మార్ట్‌ఫోన్‌ మాట్లాడానికంటే బొమ్మలు, వీడియోలు చూడటానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అన్నీ చూడటమే. అక్షరాలు రాయడానికీ, చదువడానికీ కూడా ఇమేజ్‌లను వాడే సంస్కృతిని చూస్తున్నాం. అయితే ఈ చూడటం అనే ప్రక్రియలో అంతా సరిగ్గానే ఉందా, చూస్తూ ఉన్నవాళ్లపై ఈ ఇమేజెస్‌, మూవింగ్‌ ఇమేజెస్‌కు సంబంధించిన ప్రభావాలెలా ఉంటున్నాయి, వాటి ప్రతిఫలనాలు సమాజంపై ఎట్లా ఉంటున్నాయనే అవగాహన కొరవడటం విచారకరం.
ఒక మంచి పుస్తకం చదువుతూ గుండెల మీద ఉంచుకొని నిద్రపోయినప్పటి ఆనందం ఆధునిక తరానికి తెలియకపోవడం ఒకింత విచారకరమే. ఈ స్థితికి సాంకేతికత, ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలూ కారణమనే వాదన వినిపిస్తూ ఉంటుంది. కానీ తాళపత్ర గ్రంథాలూ, లిఖిత ప్రతుల కాలాన్ని దాటి అచ్చు యంత్రం వచ్చినప్పుడు కూడా ఇలాగే అది అనర్థహేతువనే వాదన వినిపించింది. కానీ క్రమంగా అచ్చుయంత్రం పుస్తక ప్రచురణలో ఎంత విప్లవాత్మక మార్పులు తెచ్చిందో చూశాం. అదేవిధంగా నేటి సాంకేతికత కూడా తాత్కాలికంగా పుస్తకాన్ని మరుగునపర్చినట్టు కనిపించినా, దాన్ని సరైన దిశలో వియోగించగలిగితే భౌతికంగా సాంకేతికత పుస్తక రూపాన్ని మింగేయవచ్చు కానీ భాషనూ భావాలనూ మింగేయలేదు. చదవడం అనే ప్రక్రియకు సంబంధించి పాఠకుల అలవాటు పేజ్‌ రీడింగ్‌ నుంచి స్క్రీన్‌ రీడింగ్‌కు మారింది.
సాంకేతికత దాని పర్యవసానాలను పక్కనపెట్టి చదివే అలవాటును ఎట్లా పెంచాల్నో ఆలోచించి అమలుచేయాలి. పుస్తకాలు చదవడం వల్ల ఒనగూడే వ్యక్తిగత పరిణామమూ, పెరిగే అవగాహననూ అర్థం చేయించాలి. ఒక మంచి పుస్తకాన్ని చదివి జీర్ణించుకొని, మనసు లోపల ఇమిడించుకోవడంలో ఉన్న ఆనందాన్ని అర్థం చేయించాల్సి ఉన్నది. అది ముఖ్యంగా స్కూళ్లు, కళాశాలల్లో, గ్రంథాలయాల్లో జరగాల్సి ఉన్నది. లైబ్రరీలను, ఈ-గ్రంథాలయాలూ, డిజిటల్‌ గ్రంథాలయాలూ అంటూ ఆధునిక వసతులు కల్పిస్తూనే విద్యార్థుల్లో, యువకుల్లో చదివే అలవాటును పెంపొందించే కార్యక్రమాలు జరగాలి. వారిలో చదివే సంస్కృతిని పెంపొందించాలి. దానికి ప్రధానంగా తరగతి గదులూ గ్రంథాలయాలూ వేదికలు కావాలి. సామాజిక బాధ్యతను గుర్తెరగడానికి పాఠ్య పుస్తకాలే కాకుండా సాహిత్యం, చరిత్ర లాంటి అనేక అంశాల పుస్తకాలు చదవాలని టీచర్లు చెప్పగలిగితే విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది, పుస్తకాల మీద ప్రేమ కలుగుతుంది.
గ్రంథాలయాలు మరింత బాధ్యతను కలిగి ఉన్నాయి. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల భాండాగారంలా ఉంటే సరిపోదు. కంప్యూటరీకరించినంత మాత్రాన బాధ్యత తీరదు. నిజానికి గ్రంథాలయం ఒక సాంస్కృతిక కేంద్రం కావాలి. పాఠకులను తనవైపు ఆకర్షించే కృషి జరగాలి. పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలిపే, పుస్తక పరిచయ సభలు, ప్రముఖ రచయితలు, ఎడిటర్లు, జర్నలిస్టులు తదితరులతో ముఖాముఖీ కార్యక్రమాలు, ‘రీడ్‌ అండ్‌ రివ్యూ’ కింద పుస్తక సమీక్షా సభలు, పోటీలు ఏర్పాటుకావాలి. అంతేకాదు దృశ్య మాధ్యమాన్ని కూడా ఒక ప్రధానాంశంగా తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రేరణ కలిగించే జీవిత చరిత్రల డాక్యుమెంటరీలు, సుప్రసిద్ధ రచనల దృశ్యరూపాల ప్రదర్శనలు ఏర్పాటుచేయగలిగితే పాఠకులు ముఖ్యంగా యువతీ యువకులు లైబ్రరీల వైపు ఆకర్షితులవుతారు. రావడం మొదలైతే చదవడం తప్పకుండా అనుసరిస్తుంది.
ఇక ప్రభుత్వపరంగా కూడా ‘డిజిటల్‌ లైబ్రరీ మిషన్‌’ విజయవంతం కావాలంటే కచ్చితంగా లైబ్రరీలను బలోపేతం చేయాలి. ఆధునిక వసతులతో పౌర గ్రంథాలయాలు ఏర్పాటు చేసినప్పుడే సమాచార వ్యాప్తి విస్తరణ సాధ్యమవుతుంది. సాక్షరతా మిషన్‌ వలె ‘లైబ్రరీ మిషన్‌- రీడర్‌షిప్‌ మిషన్‌’ చేపట్టాల్సి ఉన్నది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే ఫలితాలు దివ్యంగా ఉంటాయి. బాధ్యత గల పౌరులూ ఉత్తమ విలువల సమాజం ఏర్పడుతుంది. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ‘పుస్తకానికీ జై- చదివే అలవాటుకూ జై’.
– వారాల ఆనంద్‌, 94405 01281
(PUBLISHED TODAY IN NAMASTE TELANGANA DAILY)

అందుకున్నాను- 21=సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్

Posted on

+++++++

SAHIR A LITERARY PORTRAIT by SURINDER DEOL

—————————- 

చిన్నప్పటినుంచీ నేనో సినిమా పిచ్చోన్ని. అంతకంటే నాకు సినిమా పాటలు అందులోనూ హిందీ పాటలంటే మహా పిచ్చి. కవిత్వమన్నాకూడా అంతేకదా అందుకే ఇటీవల సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్ (SAHIR A LITERARY PORTRAIT by SURINDER DEOL ) పుస్తకాన్ని ఆన్లైన్ లో అందుకున్నాను. సాహిర్ లుధ్యాన్వీ సాహిత్యాన్నీ జీవితాన్నీ సురేందర్ దేవల్ చాలా బాగా రాసారు. సినిమా కవిగా సాహిర్ ఎంత పాపులరో విలక్షణ మయిన కవిగా అంతే ప్రసిద్ధుడు.

ఈ ‘సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్’ లో సాహిర్ రాసిన 90 కి పైగా రచనల ఆంగ్లానువావాదాలున్నాయి. వాటిల్లో కవితలు, గజల్లు, భజనలు వాటి తో పాటు ‘PARCHAAIYAAN’ (నీడలు) లాంటి దీర్ఘ కవితలూ వున్నాయి.

ఇందులో రచయిత ముఖ్యంగా కవిగా సాహిర్ లోని నాలుగు ప్రధాన లక్షణాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. సాహిర్ గొప్ప ప్రకృతి ప్రేమికుడు. గొప్ప భావుకుడు. మనిషి పట్ల ప్రేమా, ఆతని వేదన దుఖం పట్ల సానుభూతి సంఘీభావం వున్నవాడు. అంతే కాదు భవిష్యత్తు పట్ల గొప్ప ఆశాభావం కలిగి వున్నవాడు. అలాంటి సాహిర్ ను ఆయన సాహిత్య జీవితాన్ని కళ్ళముందుకు తెచ్చిన పుస్తకంగా ఇది నాకు బాగా నచ్చింది.  

ఈ పుస్తకంలో సాహిర్ చిన్నప్పటి జీవితం నుంచి మొదలు 40 లలో వచ్చిన తన మొదటి కవిత్వ సంకలనం “తల్కియాన్” వరకు మొదటి భాగంలోనూ, తర్వాతి కవితా పుస్తకం“ పర్చాయియాన్” 2 వ భాగం లోనూ, ౩,4 భాగాలలో సాహిర్ రాసిన గజల్స్, భజన్స్ గురించి రాసారు. ఇక చివరి భాగంలో ముగింపు భావనలున్నాయి.   

*******************

“మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ, పల్ దో పల్ మెరీ కహానీ హై

పల్ దో పల్ మేరీ హస్తీ హై, పల్ దో పల్ మెరీ జవానీ హై                 

ముఝ్‌సె పహ్‌లే కిత్నే షాయర్ ఆయే ఔర్ ఆకర్ చలే గయే,

కుఛ్ ఆహేఁ భర్‌కర్ లౌట్ గయే, కుఛ్ నగ్‌మే గా కర్ చలే గయే

వో భీ ఎక్ పల్ కా కిస్సా థే, మైఁ భీ ఎక్ పల్ కా కిస్సా హూఁ

కల్ తుమ్ సె జుదా హో జావూఁగా, జో ఆజ్ తుమ్‌హారా హిస్సా హూఁ ”

ఎంత గొప్ప కవిత. ఒక కవి అంతరంగం ఎంత అద్భుతంగా ఆవిష్కరించాడు సాహిర్.

ఆ కవితే తర్వాత ‘కభీ కభీ’ సినిమాలో పాటగా అమితాబ్ నోట పలికించారు. ఇందులో

కవి ఇట్లా అంటున్నాడు “గతం లో ఎంతో మంది మహా కవులు వచ్చారు గొప్ప కవిత్వాన్ని అందించి వెళ్ళిపోయారు.. నేనూ అంతే ఒక క్షణపు చరిత్రను..ఇక ముందు కూడా నాకంటే గొప్ప కవులు వస్తారు..మీకంటే మంచి శ్రోతలూ వస్తారు”  ఎంత వాస్తవిక మానసిక ఆవిష్కరణ. అది సాహిర్ కే చెల్లింది.

అంతే కాదు….

“యె దునియా అగర్ మిల్ భి జాయే తొ క్యా హై ..”(ప్యాసా)

“చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనో…”( గం రాహ )

ఇట్లా ఎన్ని పాటలు… దశాబ్దాలుగా వింటూ మైమరిచి పోయాను. గున్ గునాయిస్తూ ఊగి పోయాను.

నేను పాటల పిచ్చోన్ని అని చెప్పాను కదా 70 ల్లోనే సిలోన్ రేడియో లో వచ్చే ‘బినాకా గీత్ మాలా’ అంటే ప్రాణం పెట్టేవాన్ని. ప్రతి బుధవారం రాత్రి 8 అయిందంటే చాలు రేడియో ముందుకు చేరాల్సిందే. అంటే కాదు ప్రతి రోజూ ఉదయం 7.30 కి ప్రసారమయ్యే ‘పురానీ ఫిల్మొంకా గీత్ వినాల్సిందే. అట్లా పాటలంటే ప్రాణం పెట్టె నేను క్రమంగా ఆ పాటల గాయకులే కాకుండా సంగీత దర్శకుల పేర్లు రాసిన కవుల పేర్లూ తెలుసుకోవడం మొదలు పెట్టాను. అందులో నాకు కవిగానూ సినీ గీత రచయిత గానూ మదిలో నిలిచిపోయిన వాడు సాహిర్.

అట్లా కవిత్వమూ పాటలూ రాసి మెప్పించిన సాహిర్ పుట్టి నూరేళ్ళు పూర్తయినాయి. ఆయన రచనలు, కవితలు ఈనాటి సమస్యలకు అద్దం పడుతాయి. ప్రగతి శీల ఉద్యమాలకు ఆయన కవితలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సాహిర్‌ లుధియాన్వి మార్చి 8, 1921లో ఒక జమిందారీ కుటుంబంలో పుట్టారు. ఆయన మొదటి పేరు అబ్దుల్‌ హై ఫజాల్‌ అహ్మద్‌. సాహిర్‌ అన్న పేరును తన కలం పేరుగా పెట్టుకున్నారు. జమిందారి కుటుంబంలో పుట్టినా జమిందారి దర్జాలను సౌఖ్యాలను ఆయన అనుభవించ లేదు. ఎందుకంటే ఆయన పుట్టిన కొన్నాల్లకే   తల్లి దండ్రులు విడిపోయారు. సాహిర్‌ తల్లి సర్దార్‌ బేగమ కొడుకును తీసుకొని భర్త నుంచి దూరంగ వెళ్ళిపోయింది. సాహిర్ చిన్నప్పుడే తన తల్లిని హింసించే తండ్రిని ఆయన అసహ్యించుకున్నాడు. ఇది ఆయనపై గొప్ప ప్రభావాన్నే చూపించింది. ఒక నవ యువకుడిగా ఆయన సమకాలీన రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలపై స్పందించే వాడు. 

సాహిర్ ను తల్లే కష్టపడి పెంచింది. లాహోర్ లోని దయాళ్ సింగ్ కాలేజీ లో చదివాడు సాహిర్.

”ఎన్నాళ్లని ఆదం గొంతుని నొక్కేస్తారు – మేము చూస్తాం – ఎన్నాళ్లని రగులుతున్న ఉద్వేగాలను ఆపగల్గుతారు – మేము చూస్తాం.” అంటూ సాహిర్ రాసిన కవిత పాకిస్తాన్ పాలక వర్గాలకు ఆగ్రహం కలిగించింది. ఫలితంగా సాహిర్ ఇండియా వచ్చేసాడు.

    ఇండియా వచ్చింతర్వాత సాహిర్ అభ్యదయ రచయితల సంఘం లో చురుకుగా వుండేవాడు. ఫైజ్, ప్రేమ్చంద్,అలీ సర్దార్ జాఫ్రీ లాంటి మహా మహులతో పనిచేసాడు. ఆయన పేదలు, కార్మిక వర్గం సమస్యల పట్ల స్పందిస్తూ కవిత్వం రాసారు. 

సాహిర్ లుధ్యాన్వీ రాసిన అద్భుత కవిత్వాన్ని ఆవిష్కరించిన పుస్తకంగా సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్* మిగిలిపోతుంది.

చివరగా ఈ సాహిర్ కవితను మననం చేసుకుంటూ….ముగిస్తాను

”మానా కి ఇస్‌ జమీ కో న గుల్జార్‌ కర్‌ సకె – కుచ్‌ ఖార్‌ కం తో కర్‌ గయే గుజ్రే జిధర్‌ సె హం”
(అవును ఈ ప్రపంచాన్ని నందనవనంగా మార్చ లేకపోయాం – కానీ మనం నడిచిన దారిలో కొన్ని ముళ్ల నైనా తీసివేయగలిగాం )

—వారాల ఆనంద్

Posted on Updated on

విద్యాసంస్థల్లో ఫిల్మ్ క్లబ్ లు

వారాల ఆనంద్

    మారుతున్న కాలం ప్రకారం వ్యక్తులు సంస్థలు తమ లక్ష్యాలని కాయక్రమాలనీ మార్చుకోవలసిందే. లేకుంటే అవి మరుగున పడిపోతాయి. వాటి ఉనికే ప్రశ్నార్ధక మవుతుంది. ముఖ్యంగా  సమాంతర కళాత్మక సినిమాలకు వేదికలయి దశాబ్దాలకు పైగా ఒక తరాన్ని ప్రభావితం చేసిన ఫిల్మ్ క్లబ్బుల (సొసైటీలు) పరిస్థితీ ఇవ్వాళ  స్తబ్దంగా మారి పోయింది. మన రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్ లాంటి ఒకటి రెండు చోట్ల నిలబడ్డ ఫిలిం క్లబ్బులు కరోనా నేపధ్యంలో కార్యక్రమాలు క్రమంగా మందగించి అవి వాటి ఉనికిని నిలబెట్టుకునే స్థితిలోకి నెట్టి వేయబడ్డాయి. ఈ  నేపథ్యంలో ఇవ్వాళ ఫిలిం సొసైటీ ల ఆవశ్యకత లేదని, అసలు వాటి relevance లేదనే వాదన వినిపిస్తున్నది. దాదాపుగా అన్ని సినిమాలు ఇంటర్నెట్ లో లభిస్తున్నప్పుడు ప్రత్యేక ఫిల్మ్ క్లబ్బుల అవసరం  ఏముందని కూడా వాదిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల పెల్లుబికిన ఓటీ టీ( ప్రైం, నెట్ఫ్లిక్స్,ఆహా, సోనీ మొ…) వేదికలు వచ్చాక ఇంట్లో కూర్చునే సినిమాల్ని చూసే అవకాశం వచ్చాక బయట సినిమాలకు వెళ్ళే పరిస్థితే లేకుండా పోతున్నది. మరోవైపు ఫిలిం సొసైటీ ప్రదర్శనలకు వచ్చే సభ్యుల సంఖ్య కూడా క్రమంగా తప్పిపోతున్నదన్నది కాదనలేని వాస్తవం.   

మరిప్పుడు ఫిలిం సొసైటీలు ఎం చేయాలన్న ప్రశ్న ఉదయిస్తుంది.  కేవలం సినిమా ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఫిలిం టెక్నాలజీ పై ద్రష్టి పెట్టాల్సిన అవసరం వుంది. అంతేకాదు కొత్త తరానికి కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ కాంపస్ ఫిల్మ్ క్లుబ్బులు ఏర్పాటు చేసి ఫిల్మ్ క్లబ్బులకు కొత్త రూపాన్ని ఇవ్వాల్సిన అవసరం వుంది. నా అభిప్రాయం ప్రకారం నిజానికి ఫిల్మ్ క్లబ్బుల relevance, అవసరం ఇవ్వాళే ఎక్కువగా వుంది. అందుకు మన ప్రభుత్వం కూడా చొరవ చూపించాల్సి వుంది.

       ఫిల్మ్ క్లబ్ లో చేరండి ప్రపంచాన్ని చూడండి’  ఇది ఎనభయవ దశకం లో మంచి సినిమాలు ఇష్టపడే వాళ్ళు అర్థవంతమయిన సినిమాల్ని ఆసక్తిగా చెప్పు కున్న స్లోగన్. ఆకాలం లో సత్యజిత్ రాయ్, సినిమాలు గాని, కురుసోవా సినిమాలు గాని మరింకే విఖ్యాత దర్శకుల సినిమాలు చూడడానికి ఖచ్చితంగా ఫిలిమ్ క్లబ్ లే అధారంగా వుండేవి.   అంతే కాదు భాగల్పూర్ బ్లైండింగ్స్పైన  తపన్ బోస్ తీసినదయినా, రాకేశ్ శర్మ తీసిన బాంబే హమారా షెహర్ మరింకే మంచి డాకుమెంటరీ చూడాలని వున్నా ఫిల్మ్ క్లబ్బులే అవకాశం కల్పించేవి. అందుకే అవి 1970 నుండి రెండు దశాబ్దాల పాటు ఒక ప్రగతిశీల,ఉత్తమ సినిమాలకు వేదిక గా నిలిచాయి. అందుకే దేశ వ్యాప్తంగా ఏర్పాటయిన వాటితో సహా హైదరబాద్,కరీంనగర్,వరంగల్ లాంటి నగరాలతో పాటు, వేములవాడ,ఎల్లారెడ్డి పేట్. లాంటి మామూలు గ్రామాల్లో కూడా ఫిలిమ్ క్లబ్బులు ఏర్పాటయ్యాయి. దశాబ్దాలపాటు ఉత్తమ సినిమాలకు వేదికలయాయి. కలర్ టీవీలు క్రమంగా నట్టింట్లోకి చేరాయో అప్పుడే సభ్యుల సంఖ్య తగ్గడంతో ఫిలిమ్ క్లబ్బులు క్రమంగా తమ కార్యక్రమాల్ని తగ్గించుకోవడం ఆరంభ మయింది. 1970-1990 ల దాకా విస్తృత మయిన కార్యక్రమాల్ని నిర్వహించి జాతీయ అంతర్జాతీయ సినిమాల్ని, బాలల సినిమాల్ని ప్రజలకు పరిచయం చేసిన ఫిల్మ్ క్లబ్బులు అనతర కాలం లో మందగించాయి. నిజానికి ప్రధాన స్రవంతి సినిమాకి సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయ పంపిణీ వ్యవస్థగా ఫిలిమ్ క్లబ్బులను రూపొందించాలని అప్పటి కార్యకర్తలు భావించారు.

     ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు సత్యజిత్ రాయ్ అధ్యక్షుడిగా వుండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా డిల్లీ చాప్టర్ కి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అనేక అంతర్జాతీయ సినిమాలతో కూడిన ఫిలిమ్ పాకేజీలతో ఉత్సవాలు నిర్వహించింది. దేశమంతా ఒక ఆశావాహమయిన స్థితి కనిపించింది. ఫిలిమ్ క్లబ్బుల ఫలితంగానే మన దేశంలో అంతర్ జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ మొదలయింది.

     కానీ అనంతర కాలం లో ఇంట్లోకి చొరబడ్డ టెలివిజన్ పెరిగిన సాంకేతిక అభివృద్ది క్రమంగా ఫిలిమ్ క్లబ్బుల వునికిని ప్రశ్నార్థకం చేశాయి.  ఇంట్లోనే రోజంతా సినిమాలు,సినిమా ఆధారిత కార్యక్రమాలతో టీవి ప్రజల్ని ఎంగేజ్ చేయడం తో ఆదివారం ఉదయం 8గంటలకు జరిగే ప్రదర్శనలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అప్పటికే దేశం ప్రాధాన్యతను సంతరించుకుంటున్న ప్రపంచీకరణ మంచి కళాత్మక వాస్తవిక సినిమాలకు స్థానం లేకుండా పోయింది .దాంతో ఫిలిమ్ క్లబ్బుల నిర్వహణ కష్టతరమయిపోయింది. అంతే కాదు సభ్యుల సంఖ్యా కుదించుకు పోయింది. అప్పటివరకూ ఉదయం 8 గంటలకు సినిమా ప్రదర్శనకు అవకాశం ఇచ్చి టాక్స్ కూడా మినహాయించి ప్రోత్సహించిన ప్రభుత్వాలు క్రమంగా తమ ప్రోత్సాహాన్ని వెనక్కు తీసుకున్నాయి. అది కూడా క్లబ్బుల నిర్వహణ పైన ప్రభావాన్ని చూపించింది. ఇక మారుతున్న కాలంలో సాంకేతికత పెరిగి మొదట వీడియో కాస్సేట్లు వీడియో లిబ్రరీ లు, తర్వాత సీడీలు తర్వాత డీవీడీలు హార్డ్ డిస్క్  లూ తమ ప్రాభవాన్ని పెంచడం ఆరంబించాయి. ఇంటర్నెట్ అందు బాటులోకి వచ్చినంక పరి స్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ లో torrent, యు ట్యూబు, vimeo, website లాంటి ఎన్నో ప్లాట్ ఫార్మ్ లో సినిమాలకు వీడియోలకు వేదికలయ్యాయి. దునియా ముట్టీమే అన్నట్టు ప్రపంచ సినిమా మొదట డెస్క్ టాప్ లకు, ఇప్పుడు సెల్ ఫోన్ లోకి వ్యాప్తి చెందింది. అన్నీ సినిమాలు అరచేతిల్లో అందుబాటులో వుండగా ఫిల్మ్ క్లబ్బుల అవసరమేముంది. వాటిల్లో సభ్యులుగా చేరడం ఆదివారాల్లో ఉదయమే సినిమాకు రావడం ఎందుకు అనే భావం ఏర్పడింది. దాంతో ఫిలిమ్ క్లబ్బుల అవసరం ఆవశ్యకత తగ్గిపోయింది. అప్పటిదాకా సమాంతర సినిమాలకు ఏకయిక వేదికగా వున్న ఫిలిమ్ క్లబ్బుల రేలేవన్స్ తగ్గిపోయింది. దాంతో పల్లె పల్లె కూ చేరుతుందనుకున్న ఫిలిమ్ క్లబ్బుల వుద్యమం మహానగరాలకు నగరాలకూ పరిమితంయి పోయి చివరికి దాదాపు అన్నీ మూత బడే స్థితి   ఏర్పడింది.

       అయితే ఇందుకు మినహాయింపు కేరళ రాష్ట్రం అక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం తో ఫిల్మ్ క్లబ్బులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి.కానీ మన తెలంగాణాలోనూ ఆంధ్రాలోనూ పరిస్తితి పూర్తిగా భిన్నం.  కరీయింనగర్ ఫిలిమ్ సొసైటి సిలిమ్ భవన్ పేర సొంత  భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒక విలక్షణమయిన విషయం, బెంగళూరు తర్వాత కరీంనగర్లోనే ఫిలిమ్ సొసైటి కి సొంత హాలు వుండడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.

         ఎందుకంటే నెట్ లో అన్నీ దొరుకుతున్నాయి  కలెగూరగంప లాగా, అన్నీ ఒక చూటే దొరికినప్పుడు ఫిల్మ్ క్లబ్బుల అవసరం లేదనే వాదన కు బలం లేదు ఎందుకంటే అన్నీ ఒకచోట లభించినప్పుడు వాటిల్లో మంచివి ఏవి చెడువి ఏవి అనే తేడాని తెలుసుకునే  పరిజ్ఞానం కావాలి మరి అలాంటి పరిజ్ఞానాన్ని అందించే కృషి ని ఫిల్మ్ క్లబ్బులు నిర్వహిస్తాయి. అన్ని  మానవీయ విలువల్ని తుంగలో తొక్కుతూ హింస,సెక్స్, అవాస్తవికత   లాంటి అంశాలతో సమాజాన్ని తప్పు తోవ పట్టిస్తున్న వ్యాపార సినిమాల నుంచి భిన్న మయిన అర్థవంత మైన చిత్రాలగురించి ముఖ్యంగా యువతకు అవగాహన కలిగించాల్సిన అవసరం వుంది. గతం లో లాగా ఫిల్మ్ క్లబ్బు ఉత్తమ సినిమాల్ని ప్రదర్శించి వూరుకోకుండా వాటి appreciation లో  కూడా  వివరించాల్సి వుంటుంది అప్పుడే దృశ్య మాధ్యమాన్ని గురించి మంచి చెడులు తెలుస్తాయి. అందుకే ఫిల్మ్ క్లబ్బుల్ని అన్నీ జిల్లాలకూ మండలాలకూ విస్తరింప చేయడంలో  ఉత్తమ సినిమాల అభిమానులూ అభినివేశం వున్న వారూ కృషి చేయాల్సి వుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపించాల్సి వుంది.

ఇక కాలేజీలూ స్కూళ్ళల్లో కాంపస్ ఫిలిమ్ క్లబ్బుల ఏర్పాటు ప్రక్రియ గతం లోనే ప్రారంభ మయింది. ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్ పలు యూనివర్సిటీ ఉప కులపతులకు లేఖలు రాశారు. దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మనజింగ్ డైరెక్టర్ సి.పార్థసారధి గారిని కోరితే  కాలేజీ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమీషనర్లకి లేఖలు రాయగా వారు స్పందించి ఆయా కాలేజీలకు ఆదేశాలిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ మొదలు విశాఖ దాకా అనేక కాలేజీల్లో ఫిల్మ్ క్లబ్బుల ఏర్పాటు జరిగింది. నేనే ఊరూరు వెళ్లి కాలేజీల్లో ఫాలం క్లబ్బులు స్థాపించాను. అయితే వాటిని సక్రమంగా నడిపించాల్సి వుంది. విద్యార్హ్తులకు సినిమా డిజిటల్ మీడియాకు సంబంధించి చాన్యం కలిగించాల్సి వుంది.

ఆ ఒరవడి ఇప్పటి మన తెలంగాణ లో కూడా కొనసాగించాల్సిన పని వుంది..

అందుకే  ఫిల్మ్ క్లబ్బుల అవసరం , relevance ఇప్పుడే అధికంగా వుంది. మేధావులూ, ప్రభుత్వమూ ఈ దిశలు ఆలోచించాల్సిన అవసరం వుంది

వారాల ఆనంద్   

యాదోంకి బారాత్ – 27 +నటరాజ కళానికేతన్- శాఖలు-విస్తరణ-విలక్షణత

Posted on

యాదోంకి బారాత్ – 27

+++++++++++++++++++++++++

నటరాజ కళానికేతన్- శాఖలు-విస్తరణ-విలక్షణత

**********

ఏదీ మొదలయిన చోటే వుండదు. ఎవరూ తొలి అడుగు వేసి అట్లా నిలబడిపోరు. అందులోనూ ఒక సంస్థ లేదా ఒక మనిషి కొంత చలనశీలంగా వుంటే మరింత విస్తరణ అనివార్యం. అంతే కాదు ఆ విస్తరణలో విలక్షణత కూడా పెరుగుతుంది. దాని ప్రభావాలూ ఫలితాలూ ఎక్కువగానే వుంటాయి. నటరాజ కళానికేతన్ సంస్థగా విస్తరణ చెందడమే కాకుండా అందులో భాగస్వాములయిన రచయితలు, కవుల్లో కూడా వైవిధ్యాన్ని పెంచింది. ఉన్న చోట ఉండనీయకుండా భిన్న వస్తు కళారూపాల్లో తమ సృజనను పెంపొందించుకునేలా చేసింది. వారిలో కొందరిని సాహిత్య రంగంలో వుంటూనే అర్థవంతమయిన సినిమా వైపు, రూల్ ఆఫ్ లా ‘న్యాయం’ వైపు, పత్రికా రంగంలో నిజాయితీ వైపు ఎదిగేలా చేసింది. అయితే వారంతా ఆర్ద్రతా, మనుషుల పట్ల ప్రేమా, సమాజం పట్ల బాధ్యతల తోటే రచనలు చేస్తూ వచ్చారు. చుట్టూ గ్రామాల్లో రాజకీయాలు పెల్లుబుకుతున్న నేపధ్యంలో కూడా కళానికేతన్ నుంచి ఎదిగిన రచయితలెవరూ ఏ సంస్థల్లో కానీ ఎవరో ఒక కవి గ్రూపులో కానీ చేరక పోవడం విలక్షనతే, అయినా వారెప్పుడూ ప్రగతిశీల విప్లవ భావాల పట్ల గొప్ప అభిమానం తోటే వున్నారు. వుంటారు కూడా. ++++++++++++ నటరాజ కళానికేతన్ వేములవాడలో ప్రాంభమయి కరీంనగర్లో శాఖ ను ఏర్పాటు చేసుకున్నంక జిల్లా వ్యాప్త విస్తరణ వైపు దృష్టి సారించింది. అప్పటికి ఇంకా ప్రసార మాధ్యమాలు ఇప్పటిలా విస్తరించలేదు. సాహితీ కార్యక్రమాల వార్తలు ఎప్పటికో ఒక సింగిల్ కాలం వార్తలు గా రిపోర్ట్ అయ్యే కాలమది. కానీ అప్పుడు నిర్వాహకులకు కానీ రచయితలకు కానీ, కళాకారులకు కానీ దాని మీద పెద్ద ధ్యాస వుండేది కాదు. ఇప్పటిలాగా వార్తా పత్రికల్లో వార్తల పట్ల అప్పుడు యావ లేదు. కానీ సంస్థల్ని విస్తరించుకోవాలనే ధ్యాస వుండేది. దాంట్లో భాగంగానే 15 ఆగస్ట్ 1977 రోజున ఎల్లారెడ్డి పేట గ్రామంలో కళానికేతన్ రెండవ శాఖ ప్రారంభోత్సవం జరిగింది. ఆ సభలో “ఉషస్సు” లిఖిత సాహిత్య సంచికను వెలువరించారు. సిరిసిల్లా కామారెడ్డి రహదారిలో వున్న ఎల్లారెడ్డిపేట చాలా చైతన్య వంతమయిన వూరు( ఆ తర్వాత ఆ వూర్లో ఫిలిం సొసైటీ కూడా ఏర్పాటు చేసారు.. వివరాలు మరోసారి రాస్తాను). ఆ నాటి సభలో ప్రముఖ కవులు కనపర్తి, చొప్పకట్ల చంద్రమౌళి, కసిరెడ్డి వెంకట్ రెడ్డి, కే. మురళీధర్, నలిమెల భాస్కర్, రేగులపాటి కిషన్ రావు,వేముల సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. తర్వాత 14 నవంబర్ 77 రోజున ఎల్లారెడ్డిపేట నటరాజ కళానికేతన్ “కిరణాలు” కవితా సంకలనాన్ని వెలువరించింది. అట్లా ఎల్లారెడ్డి పెట కొన్ని ఏళ్ల పాటు మంచి సాహితీ చైతన్యంతో కృషి చేసింది. రేగులపాటి కిషన్ రావు పలు నవలలు రాసారు. ఆ తర్వాత 5 డిసెంబర్ 77న నటరాజ కళానికేతన్ జిల్లెళ్ళ శాఖను డాక్టర్ రఘుపతి రావు ప్రారంభించారు. ఆ సందర్భంగా సంస్థ సభ్యుల రచనలతో “వెలుగు” కవితా సంకలనాన్ని వెలువరించారు. శ్రీ చొప్పకట్ల చంద్రమౌళి ఆవిష్కరించారు. ఆనాటి సభలో వేముగంటి నరసింహా చార్యులు, మధు మృత్యుంజయ శర్మ, పోరండ్ల మురళీధర్, టి.నరసింహాచార్య, మంచే సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. ఇట్లా నటరాజ కళానికేతన్ సాహిత్య కార్యక్రమాలతో పాటు ‘గుండెలు మార్చబడును’ లాంటి నాటికలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలనీ నిర్వహించింది. వీటన్నింటితో పాటు కళానికేతన్ వెలుగున ఒక విలక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో యువకులుగా మా కృషి పెద్దగా లేదు కాని కళానికేతన్ సలహాదారులు డాక్టర్ మంగారి రఘుపతి రావు, బీ.డీ. వొ.మల్లయ్య, ఈవో జాగా రావులు ముందుండి చొరవ తీసుకుని “వేములవాడ అన్నమయ్య”గా పేరు గాంచిన మామిడిపల్లి సాంబశివ శర్మ గారి గృహ నిర్మాణం కోసం 78-79 లోనే నిధులు సేకరింఛి నిర్మాణం పూర్తి చేసారు. ఒక కవికి ఒక సంస్థ ఇంటిని నిర్మించి ఇవ్వడం మామూలు మాట కాదు. ఆనాటికి ఈనాటికి అది ఒక గొప్ప కార్యక్రమమే.********* అప్పుడే మా అందరిలో రాయాలనే తపన పెరిగింది. ‘నవత’ ఆరంభమవుతున్న రోజులవి. నేనూ, మంగారి రాజేందర్ జింబో, పి.ఎస్.రవీంద్ర, మంగారి శివప్రసాద్, బల్మూరి యుగేందర్ రావు, రఫీక్, బాపురెడ్డి, ఎడ్ల రాజేందర్, వఝల శివ కుమార్, మధు రవీంద్ర, సాంబ శివుడు, రమేష్, ఇట్లా అనేక మంది తో కూడిన బాచ్ మాది. అప్పుడే రాత కోతలు మొదలవుతున్న సమయం. ఎవరు ఏ పేరు పెట్టుకుని రాయాలన్న చర్చ మొదలయింది. అప్పటికే ‘స్వాతి’ పేరుతో పలు కథలు రాసిన రాజు మామ ‘జింబో’ పేరుని ఫైనల్ చేసుకున్నాడు. వెంకటేశ్వర మెడికల్స్ లో కూర్చున్నప్పుడు. వజ్జల శివ కుమార్ తాను వఝల శివకుమార్ అయ్యాడు. పి.రవీందర్ అన్న తన పేరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసాడు రవి. ఏ పేరయితే బాగుంటుంది అన్న చర్చ వచ్చింది. మీ పూర్తి ఇంటి పేరేమిటి అని అడిగాను. పిన్నమశెట్టి అన్నాడు. ఇంకేముంది దాన్ని పి.ఎస్. అనీ రవీందర్ ను రవీంద్ర అని మారుద్దామన్నాను. వెంటనే అంతా ఓకే అనేసారు అట్లా నా కంటే పెద్ద వాడయిన తనకి నేను పేరు పెట్టిన వాడి నయ్యాను. ఇక కరీంనగర్ దామోదర్ తాను ‘బ్లూ స్టార్’ పేరు అనుకుని కొన్ని కవితల్ని రాసాడు. మిగతా వాళ్ళం మా ఇంటి పేరుతో కొనసాగాలనుకున్నాం. ******* ఇక రోజూ ఇళ్ళలోంచి బయలుదేరితే చాలు అంతా కలిసే వెళ్ళే వాళ్ళం. అందులో దాదాపు అందరికీ అప్పటికే కళ్ళకు అద్దాలు వచ్చాయి. దాంతో ఎవరయినా కొత్త వాళ్ళు కలిస్తే పి.ఎస్. ‘రండి మా అద్దాల ప్రపంచం లోకి మా అందాల ప్రపంచంలోకి’ అని పిలిచేవాడు. ఎప్పుడో ఒక సారి తప్ప దాదాపు చాలా హుందాగా వుండేది మా టీం. ఒక్క సారి మాత్రం ఉలిక్కిపడి తలదించు కోవాల్సి వచ్చింది. మా టీములోకి కొత్తగా సుధాకర్ రావు చేరాడు. తను ఆ వూరికి కొత్తగా వచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ మురళీధర్ రావు గారి తమ్ముడు. టెన్త్ ఫెయిల్ అయి అన్న దగ్గరికి వచ్చాడు. రఘుపతి మామయ్య వూర్లో మెడికల్ ఆఫీసర్ కనుక వాళ్ళ కుటుంబంతో స్నేహం కుదిరింది. ఫలితంగా సుధాకర్ మా బాచ్లో చేరాడు. దారిలో వెళ్తున్నాం ఒక్కసారిగా ‘ఎవరీ చక్కని చుక్క..’ అని పాడడం మొదలు పెట్టాడు. ఏయ్ అని నోరు మూసాం. అలా వెళ్తున్న అమ్మాయి సాంబుడి చెల్లెలు. బుద్దిలేదా అని అందరం సుధాకర్ మీద పడ్డాం. తప్పు తెలుసుకున్న సుధాకర్ సాంబశివుడిని తప్పయిందని ఎన్నిసార్లు బతిమిలాడాడో.. గుర్తోస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. అది కూడా రాయడం అవసరమా అని మా ఇందిర అంటే గొప్పలే కాదమ్మా తప్పులూ రాయాలి అన్నాను నేను. —— ఇట్లా కళానికేతన్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉండగానే పై చదువుల గురించి ఆలోచన మొదలయింది. అప్పటికి పాస్ అయిన వాళ్ళు కొత్త విద్యా సంవత్సరం కోసం, మిగతా వాళ్ళు సప్లిమెంటరీల కోసం చూడడం. అప్పటికే మా మూడో మేనమామ రాంచందర్ రావు కాంట్రాక్టులు, ఇన్సురెన్స్ లు లాంటి పలు వృత్తుల అనంతరం బ్రాందీ షాప్ వ్యాపారంలోకి వచ్చాడు. మొదట సిరిసిల్లాలో కమలాకర్ వైన్స్ పెట్టి వదిలేసి వేములవాడలో మొదలు పెట్టాడు. మొదట పార్టనర్ షిప్ తో మొదలయి తర్వాత తానే సొంతంగా అమర్ బ్రాందీ షాప్ ఆరంభించాడు. ఆ షాప్ మొదట జాతరా గ్రౌండ్ మెయిన్ రోడ్డులో వుండేది. రామచంద్రం మామ హోల్ సెల్ షాప్ కనీ ఇతర పనులకని కరీంనగర్ తరచుగా వెళ్ళేవాడు. తాను వూర్లోలేని నాడు రాజుమామ, శివన్నబావ లేదా నేను ఇట్లా మాలో ఎవరికో ఒకరికి షాప్ డ్యూటీ పడేది. అప్పుడిక రోజంతా షాప్ కౌంటర్లో కూర్చోవడమే పని. అంత సీరియస్ గా షాప్ డ్యూటీ చేసి ఆ వాతావరణంలో వున్నాకూడా మాకెవరికీ తాగుడు అలవాటు కాక పోవడం చిత్రమే. మా సాహిత్య సంపర్కమే దానికి కారణమనుకుంటాను. కేవలం అంతా రాజ్ ఫోటో స్టూడియో వెంగయ్యతో కలిసి నటరాజ్ హోటల్లోనో, ఉడిపి హోటల్లోనో స్పెషల్ టీ తాగడం మాత్రం తప్పనిసరి. అమర్ బ్రాందీ షాపులో కూర్చుని కూడా కవిత్వ చర్చలు చేసే వాళ్ళం. సిరిసిల్లా నుండి జూకంటి జగన్నాధం వచ్చేవాడు. జూకంటి అప్పటికి తంగళ్ళపల్లి లోనే ఉండేవాడు. సిరిసిల్ల లో కనపర్తి, వెంకటరాజం, నిజాం వెంకటేషం, వెంకట రాజంల తోటే తన తొలి సాహితీ లోకం. తర్వాత వేములవాడకు వచ్చినప్పుడల్లా జింబో తో ఎక్కువగా చర్చలు, తన దగ్గరినుంచి పుస్తకాలేమయినా తీసుకోవడం లాంటివి చేసేవాడు. నేను ఎప్పుడూ కొంత శుభ్రంగా ఉండేవాడిని దాంతో జుకంటి పౌడర్ వేసుకుని నీట్ గా వున్నావ్ అని ఆట పట్టించేవాడు. సరదా వుండేది. ++++++ తెలుగు సాహితీ ప్రపంచం లో అప్పటికే ‘మినీ కవిత్వం’ ప్రవేశించింది. గొప్పగా ప్రాచుర్యం పొందడం మొదలయింది. కానీ కుందుర్తి లాంటి సీనియర్ కవులు మినీ కవిత్వాన్ని కవిత్వం గా అంగీకరించడానికి ఇష్టపడలేదు.ఒక రకంగా తీవ్రమయిన వాద వివాదాలు సాగుతూ ఉండేవి. అప్పుడే కళానికేతన్ ఆధ్వర్యంలో మినీ కవితా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రతాప చంద్రశేఖర్, పిన్నమశెట్టి కిస్తాన్ లాంటి యువకుల రాత గీతాల్ని వాడుకోవాలని వెంగయ్య లాంటి ఫోటోగ్రాఫర్ల ను ఉపయోగించుకోవాలని అనుకున్నాం. ప్రదర్శనకు కుందుర్తి ని అతిథిగా పిలవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇంకేముంది ఏర్పాట్లు శురూ అయ్యాయి. భీమేశ్వర సభామంటపం సభకు, గెస్ట్ హౌస్ ప్రదర్శనకు సిద్దమయింది. చొప్పకట్ల అధ్యక్షతన సభ, కవి సమ్మేళనం జరిగాయి చివరన నేను లేచి కుందుర్తి గారిని అడిగాను “కవిత్వంలో భావ వ్యక్తీకరణే ప్రధానం కదా, నిడివి అప్రధానం కదా, దీర్ఘ కవిత గొప్పదని మినీ కవితను నిరాకరిస్తున్నారు ఎందుకని”(మాటలు సరిగ్గా ఇవే కాక పోవచ్చు కానీ భావం ఇదే). సభ డిస్టర్బ్ అవుతుందని కొందరన్నారు, కానీ కుందుర్తి మాత్రం చాలా ఓపిగ్గా తన అభిప్రాయాల్ని వివరించారు. తర్వాత కవితా చిత్ర ప్రదర్శన ఆయనే ప్రారంభించారు. విజయవంతమయిన ప్రదర్శన అది. కళానికేతన్ కవులతో పాటు జూకంటి జగన్నాధం, అలిశెట్టి ప్రభాకర్ తదితరులు అనేక మంది పాల్గొన్నారు. నాకు తెలిసి ఆ ప్రదర్శన తర్వాతే అలిశెట్టి ప్రభాకర్ తన ‘కవితా చిత్ర ప్రదర్శనలు’ ఏర్పాటు చేసి పెద్ద ఉద్యమంగా తీసుకెళ్ళాడు. ధిల్లీ జవహార్ లాల్ నెహ్రు విశావిద్యాలయం తో పాటు నేక కాలేజీల్లో ఊర్లల్లో అలిశెట్టి కవితా చిత్ర ప్రదర్శనలు విజయవంతమయి ఒక ఒరవడిని సృష్టించాయి.అట్లా నటరాజ కళానికేతన్ అనేక కార్యక్రమాలతో ఒక ప్రగతిశీల సాహితీ వాతావరణాన్ని కల్పించింది.తర్వాత మా బాచీ అంతా చదువులకోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాం.. వివరాలతో మళ్ళీ కలుద్దాం.ఇప్పటికి సెలవ్… -వారాల ఆనంద్

Posted on

‘పుస్తకానికీ జై
+++++++++++++++++
పుస్తకం ఒక జ్ఞాననిధి, అనుభవాల గది, అనుభూతుల సారధి. భాషకూ, భావానికీ, వ్యక్తీకరణకూ అది ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞాన పరంపరను వారసత్వంగా అందిస్తున్న మాధ్యం పుస్తకం. అంతటి విలువగల పుస్తకాన్నీ దాని అవసరాన్నీ, చదివే సంస్కృతినీ పెంపోదించేందుకుగాను పుస్తక ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర చాలా గొప్పది, విశిష్ట మయింది కూడా. ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాల్నీ ఉద్యమాల్నీ, ఉద్వేగాల్నీ విలువల్నీ ఒకటేమిటి మనిషి సమస్త మార్పుల్నీ పుస్తకం తనలో నిబిడీ కృతం చేసుకొని సాక్షీ బూతంగా నిలబడింది. అలాంటి పుస్తకాలు అనేక మందికి చేరడం విస్తృతంగా చదవడం అత్యంత అవసరం.ఆ అవసరాన్ని హైదరబాద్ బుక్ ఫేర్ పూర్తిచేస్తున్నది. లక్షలాది మంది పుస్తక ప్రదర్శనకు రావడమే కాకుండా పుస్తకాల అమ్మకాల పరిస్తితి చూస్తుంటే పుస్త్కాల భవిష్యత్తుమీద చదివే అలవాటు మీద గొప్ప ఆశలు ముప్పిరిగొంటున్నాయి. ఎంతో ఆఃశావాహమయిన స్థితి కనిపిస్తున్నది. పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిదన్నట్టు ఇండ్లల్లోకి పుస్తకాలు చేరితే చదవడం తప్పకుండా అలవాటవుతుంది. పుస్తక వెక్రేతలు చెబుతున్నదాని ప్రకారం వూహించని విధంగా లక్షలాది రూపాయల పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. సందర్శకుల సంఖ్య మరింతగా పెరుగుతున్నది. అంటే జనంలో చదివే వాళ్ళు వున్నారు కానీ వారికి వాటిని అందించడంలోనే వైఫల్యాలున్నాయన్నది ఇప్పుడు రుజువవుతున్నది. దానికి తోడు పెరిగిన జీవన విలువలు జనాభా కూడా అందుకు మరో కారణం.
భారతీయ గ్రంధాలయ శాస్త్ర పితామహుడు ఆచార్య రంగనాధన్ చెప్పినట్టు ‘పుస్తకాలు ఉపయోగపడాలి ‘ ప్రతి పుస్తకం తన చదువరిని చేరాలి , ప్రతి చదువరీ తన పుస్తకాన్ని చేరాలి’ అట్లా పుస్తకాల పరిధి విస్తృతమయి అందరినీ చేరగలిగినప్పుడు అవి సార్థకమవుతాయి. వాటి లక్ష్యమూ నెరవేరుతుంది. ఆ పనిని ముఖ్యంగా పౌర గ్రంధాలయాలూ, విద్యాసంస్థల్లో వుండే గ్రంధాలయాలూ నెరవేర్చాలి. కానీ పెరిగిన సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు పుస్తకాల్ని పూర్వపక్షం చేస్తున్నాయి. చదువరుల సంఖ్య తగ్గిపోతూ వున్నది. అదంత మంచి పరిణామం కాదు.
21 వ శతాబ్దంలో ఆధునిక తరం ‘చదివే’ సంస్కృతి నుంచి వెరై పోతూ ‘చూసే’ సంస్కృతికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలం నుంచి ఒక్క చదివే అలవాటు మినహా అన్నీ మాధ్యమాలూ అలవాట్లూ పెరిగాయి. అంతా చూడడమే. టీవి చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు ,స్మార్ట్ ఫోన్ మాట్లాడానికంటే బొమ్మలు వీడియోలు చూడ్డానికే ఎక్కువగా ఉప యోగిస్తున్నారు. ఇలా ఒకటేమిటి అన్నే చూడ్డమే. చిన్న పిల్లల్నుంచీ మొదలు అందరూ ఇలా చూసేందుకు అలవాటు పడిపోతున్నారు. అక్షరాలు రాయడానికీ, చదవడానికీ కూడా ఇమేజ్ లనే వాడే సంస్కృతిని మనం చూస్తున్నాం. ఒక మంచి పుస్తకం చదువుతూ చదువుతూ గుండెల మీద వుంచుకొని నిద్రపోయినప్పటి ఆనందం ఇవ్వల్టీ తరానికి తెలియకపోవడం ఒకింత విచారకరమే.
సుప్రసిద్ద ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు– ‘పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారీ పడిందనో, పుస్తకం ఇచ్చి పుచ్చుకునే నెపం మీదో
మాటలు కలిపి, ఏర్పరుచుకునే ప్రేమ భందాలు ఇక కనిపించ వేమో’. ఆధునిక కాలం లో పుస్తక ప్రాధాన్యత తగ్గి పోవడాన్ని చూస్తూ కవి పడ్డ భాధ అది. పుస్తకం హస్తభూషణం అన్న స్థితినుంచి నేడు పుస్తకం పురావస్తువు అయిపోయే స్థితి కనిపిస్తున్నది. ఇవ్వాళ పుస్తకం చదవడం అంటే విద్యాలయాల్లో మార్కులు ర్యాంకులు సాధించాడానికి పరిమితమయి పోతుండగా, పౌర గ్రంధాలయాల్లో పోటీ పరీక్షలకోసం చదవడమే మనకు
కనిపిస్తున్నది. ఫలితంగా మానవీయ విలువల ప్రాధాన్యత, సామాజిక రంగంలో వేళ్లూనుకొంటున్న సంక్లిష్టతల్నీ, మానసిక సంక్షోభాల్నీ ఆవిష్కరించిన
పుస్తకాల్ని చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది. ఫలితంగా వ్యతిగత సామాజిక సంక్లిష్టతలు అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అనార్థాలకూ అవకాశం కలుగుతున్నది.
ఈ స్థితికి సాంకేతికత, ఇంటర్నెట్,సామాజిక మాధ్యమాలూ కారణమనే వాదన వినిపిస్తూ వుంటుంది. కానీ తాళపత్ర గ్రంధాలూ, లిఖిత ప్రతులకాలాన్ని దాటి అచ్చు యంత్రం వచ్చినప్పుడు కూడా ఇలాగే అది అనర్థ హేతువనే వాదన వినిపించింది. కానీ క్రమంగా అచ్చు యంత్రం పుస్తక ప్రచురణలో ఎంత విప్లవాత్మక మార్పులు తెచ్చిందో చూశాం. అదేవిధంగా ఇవాల్టి సాంకేతికత కూడా తాత్కాలికంగా పుస్తకాన్ని మరుగున పరిచినట్టు కనిపించినా దాన్ని సరయిన దిశలో వియోగించ గలిగితే భౌతికంగా సాంకేతికత పుస్తక రూపాన్ని మింగేయవచ్చు కానీ భాషనూ భావాల్నీ మింగేయలేదు. చదవడం అనే ప్రక్రియకు సంభందించి పాఠకుల అలవాటు పేజ్ రీడింగ్ నుంచి స్క్రీన్ రీడింగ్ కు మారింది. ఈ స్క్రీన్ రీడింగ్ ఇవాల్టి సమాజం లో సర్వ వ్యాపితం అయిపోయింది. రుగ్మత లయినా సరే కొన్నిటిని నివారించలేనప్పుడు ఓర్చుకోవాల్సిందే, కానీ ఆ స్థితి ని ఎట్లా సరయిన దిశలో మార్చుకోవాలో ఆలోచించాల్సి వుంది.
సాంకేతికత దాని పర్యవసానాల్ని క్షణం పక్కన పెట్టి చదివే అలవాటును ఎట్లా పెంచాల్నో ఆలోచించి అమలు చేయాల్సి వుంది. పుస్తకాలు చదవడం వల్ల ఒనగూడే వ్యక్తిగత పరిణామమూ, పెరిగే అవగాహననూ అర్థం చేయించాల్సి వుంది. ఒక మంచి పుస్తకాన్ని చదివి జీర్ణించుకొని, మనసులోపల ఇమిదించుకోవడం లో వున్న ఆనందాన్ని అర్థం
చేయించాల్సి వుంది. అది మిఖ్యంగా స్కూళ్ళు, కాలేజీల్లో, గ్రంధాలయాల్లో జరగాల్సి వుంది. లైబ్రరీలను ఈ-గ్రంధాలయాలూ, డిజిటల్ గ్రంధాలయాలూ అంటూ ఆధునిక
వసతులుకల్పిస్తూనే విద్యార్థుల్లో, యువకుల్లో చదివే అలవాటును పెంపొందించే కార్యక్రమాలు జరగాలి. వారిలో చదివే సంస్కృతిని పెంపొందించాలి. దానికి ప్రధానంగా తరగతి గదులూ గ్రంధాలయాలూ వేదికలు కావాలి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికే కాకుండా ఆలోచనల్లో విశాలత్వం పెంచుకోవడానికీ, సామాజిక భాధ్యతని గుర్తెరుగడానికి పాఠ్య పుస్తకాలే కాకుండా సాహిత్యం,చరిత్ర లాంటి అనేక అంశాల పుస్తకాలు చదవాలని టీచర్లు చెప్పగలిగితే విద్యార్థు ల్లో అవగాహన పేరుగుతుంది పుస్తకాల మీద ప్రేమ కలుగుతుంది.
గ్రంధాలయాలు మరింత భాధ్యతను కలిగి వున్నాయి. గ్రంధాలయమంటే కేవలం పుస్తకాల భాండాగారంలా వుంటే సరిపోదు. కంప్యూటరీకరించి నంత మాత్రాన భాధ్యత తీరదు. ఆచార్య రంగనాతనే చెప్పినట్టు గ్రంధాలయం విస్తారమవుతున్న సజేవ సంస్థ. అందుకే దాని సేవలు ఎప్పటికప్పుడు విస్తరిస్తూ వుండాలి. నిజానికి గ్రంధాలయం ఒక సాంస్కృతిక కేంద్రం కావాలి. పాఠకుల్ని తన వైపు ఆకర్షించే కృషి జరగాలి. పుస్తకాల ప్రాముఖ్యతను తెలిపే ;పుస్తక పరిచయ సభలూ’, ప్రముఖ రచయితలూ,ఎడిటర్లూ,జర్నలిస్టులూ తదితరులతో ముఖాముఖీ కార్యక్రమాలూ,
‘రీడ్ అండ్ రివ్యూ’ క్రింద పుస్తక సమీక్షా సభలూ,పోటీలూ ఏర్పాటుకావాలి. అంతే కాదు దృశ్య మాధ్యమాన్ని కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రేరణ కలిగించే జీవిత చరిత్రల డాకుమెంటరీలు, సుప్రసిద్ద రచనల దృశ్య రూపాల ప్రదర్శనలు

ఏర్పాటు చేయగలిగితే పాఠకులు ముఖ్యంగా యువతీ యువకులు లైబ్రరీల వైపు ఆకర్షి తులవుతారు. రావడం మొదలయితే చదవడం తప్పకుండా అనుసరిస్తుంది.
ఇక ప్రభుత్వ పరంగా కూడా ‘డిజిటల్ లైబ్రరీ మిషన్’ విజయవంతం కావాలంటే ఖచ్చితంగా లైబ్రరీల్ని బలోపేతం చేయడం జారగాలి. అన్నీ ఆధునిక వసతులతో పౌర గ్రంధాలయాలు
ఏర్పాటు చేసినప్పుడే సమాచార వ్యాప్తి విస్తరణ సాధ్యమవుతుంది. సాక్షరతా మిషన్ లాగా లైబ్రరీ మిషన్- రీడర్ షిప్ మిషన్ చేపట్టాల్సి వుంది. కేవలం సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా చదివే అలవాటును పెంచగలిగితే ఫలితాలు దివ్యంగా వుంటాయి. భాద్యత గల పౌరులూ ఉత్తమ విలువల సమాజం ఏర్పడుతుంది.
ఆక్రమంలో బుక్ ఫేర్ లు తమ బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయం. ఈ ప్రదర్శనలు కనీసం అన్నీ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రం పుస్తకాల తెలంగాణగానూ, చదువరుల తెలంగాణ గానూ మారి పోతుంది.
కొత్త పాదాలు పర్వతం వైపు కదలనప్పుడు/ పర్వతమే నడక నేర్చుకొని లేత హృదయాల వైపు వెళ్ళాలి/ పుస్తకాలు షెల్ఫులు దాటి వీధుల్లోకి రావాలి/ మేళాలుగా బారులు తీరాలి/ జాతరల్లో చిలుకా బత్తీసల్లా మెరవాలి
కొత్త తరం చూపు మరల్చి పేజీల్లోకి తొంగి చూస్తారు /అక్షరాల్ని ఆలింగనం చేసుకుని /వృక్షాలై ఎదిగి/
భవిష్యత్తుకు నీడ నిస్తారు

-వారాల ఆనంద్
9440501281

వారాల ఆనంద్ = చిన్న కవితలు

Posted on

వారాల ఆనంద్
చిన్న కవితలు
++++++++++++

1)
కళా సృష్టి అనేది
మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి

ప్రతిమను రూపొందించడం లాంటిది

2)
అహంకారం ఒకసారి ఎక్కడం మొదలయితే
శరీరమూ మెదడూ సరిపోదు

మనసూ మునిగి పోతుంది

౩)
గొప్పలు చెప్పుకోవడం మొదలయ్యాక
మెప్పులు మాత్రమే రుచిస్తాయి

నిజాలు చేదవుతాయి

4)
కిరీటాలూ బుజకీర్తులూ
కఠోర శబ్దాలు చేస్తాయి తప్ప

శ్రావ్య సంగీతాన్ని వినిపించవు

5)
అర్హతను ముంచి లభించిన ప్రతిదీ
అల్పత్వాన్నే ప్రోది చేస్తుంది

హుందా తనాన్నివ్వదు

6)
అవసరమయినప్పుడు ఆసరా తీసుకుని
తీరం చేరి తక్కువ చూసే

కృతఘ్నత ఎప్పటికీ ‘దారి’ చూపదు

7)
అసూయా పరుడు తనను తాను పొగుడుకుంటాడు
క్రమంగా తననే పోగొట్టుకుంటాడు

ఎండిన ఆకు గల గలమని గాలిలో కలిసిపోతుంది

8)
చీకటింకా తెమలలేదు, మబ్బులు ఒళ్ళు విరుచుకోలేదు
పక్షులు నిశ్శబ్దంగా తమ రెక్కల మీద

తూర్పు వెలుగులు మోసుకొస్తున్నాయి

9)
చీకటి ఎప్పటికయినా ముగుస్తుంది
వెలుగు ఎన్నటికయినా మెరుస్తుంది

మనమే సుఖ దుఖాల నడుమ వూగిసలాడతాం

10)
ఉదయపు ఆకాశంలో పక్షులు బారులు బారులుగా
తొలి కిరణాలకు దారి చూపుతున్నాయి

పక్కకు తొలగుతున్న మబ్బులకు, కింద నడుస్తున్న నాకూ తెలీదు

11)
ఒంటరితనంలో ఉద్వేగం, మాటలు లేవు
సాటి మనుషులూ లేరు

ఎలాంటి భావం లేకుండా ‘కాలం’ గడుస్తూనే వుంది

12)
తెలియకుండానే మనసు పొరల్లో కొన్ని మరుగున పడతాయి
కానిగిరి పాఠాలూ, కన్న కలలూ, తొలి ప్రేమలూ

కాల గమనంలో అట్లా కలిసిపోతాయి, మనమిట్లా మిగిలిపోతాం

Posted on Updated on

అందుకున్నాను-20

ఇప్పుడొక పాట కావాలి- బిల్ల మహేందర్ కవిత్వం

++++++++++++++

‘వస్తూవున్నప్పుడు

పిడికెడు మట్టిని తెండి

మొలకెత్తడం నేర్చుకుందాం….’ అంటూ బిల్ల మహేందర్ పంపిన “ఇప్పుడొక పాట కావాలి” కవితా సంకలనం అందుకున్నాను.

‘దుఖం ఇవ్వాల్టిది కాదు

యేండ్లతరబడి మోస్తూనే వున్నాను

వెనుక పేజీ తిరగేసిన

కన్నీళ్ళతో తడిసి బరువెక్కుతుంటాయి…’ అన్నాడు మహేందర్..అవును ‘ఇప్పుడొక పాట కావాలి’ చదివింతర్వాత గుండె బరువెక్కింది. మంచి కవిత్వం చదివిన అనుభవంతో పాటు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆస్వాదించిన అనుభూతి కూడా మిగిలింది

…….

‘ఇది ఆకాంక్షల్ని రక్తగతం చేసుకుని, అక్షరాల్ని జీవితంగా మలుచుకుని కాలం నిర్దేశించిన దారిలో విచ్చుకుంటూ సాగిపోతున్న బిళ్ళ మహేందర్ నాలుగేళ్ళుగా సాగిన ప్రయాణాన్ని, రాసిన కవిత్వాన్ని ఒక చోట ప్రకటించిన సంపుటి ఈ ‘ఇప్పుడొక పాట కావాలి’ అని అన్నారు  డాక్టర్ నందిని సిద్దారెడ్డి తన ముందు మాటలో.

ఆయన అభిప్రాయ పడ్డట్టుగానే గొప్ప అనుభవం, మంచి అనుభూతి, ఆర్ద్రత లతో పాటు మంచి వ్యక్తీకరణ కూడా కలిగిన కవి మహేందర్. ఈ సంపుటి నిండా సాంద్రమయిన కవిత్వం తో పాటు వస్తు వైవిధ్యమూ మనకు కనిపిస్తుంది.

“అప్పుడప్పుడు

తను నువ్వు నేను కలిసి

మొలిచిన మాటల్ని కుప్పలుగా పోసి

దారి పొడువునా మాటల పందిరిని నిండుగా పరచాలి” అన్నాడు మహేందర్ తన ‘నాలుగు’ కవితలో… అట్లా ఆయన కుప్పపోసిన మాటల వెంట నడుస్తూ నడుస్తూ ఈ సంపుటి చదువుతున్నంత సేపూ మంచి కవిత్వాన్ని అస్వాదిస్తాం.

+++++++

‘ఉత్తిగనే రాస్తూ కూర్చుండలేను  

నడువాల్సిన తొవ్వెంబడి నడవక పోతే

కాళ్ళు గుంజుతుంటయి

ఎత్తాల్సినకాడ పిడికిలి ఎత్తకపోతే

చేతులు బరువేక్కుతాయి’ అన్న మహేందర్ వరంగల్ జిల్లా వేలేరు గ్రామంలో పుట్టాడు. మలిదశ తెలంగాణా ఉద్యమ ఉధృతిలో ముందుకు సాగిన తను ఇప్పటికి ఆరు పుస్తకాలు వెలువరించారు. దివ్యాంగ అనాధ విద్యార్హ్తుల విద్యాభివృద్ధికి తోడ్పడే అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ కేవలం రాయడమే కాకుండా చైతన్యవంతమయిన కర్యశీలత తో కృషి చేస్తున్నాడు.

“బిళ్ళ మహేందర్ కవిత్వం చదువుతుంటే ప్రతి కవితలోనూ ప్రతి పంక్తిలోనూ ప్రతి పదం లోనూ నాకు కనబడినదీ వినబడినదీ హోరేత్తినదీ సార్ద్ర సంభాషణే. ఈకవిత్వమంతటినీ మాధ్యమంగా పెట్టుకుని మహేందర్ సమకాలీన సమాజంతో, నిత్య సన్నివేశాలతో నిరంతర సంభాషణ జరిపాడు” అని ఎన్.వేణుగోపాల్ అన్నాడు.

నిజమే మహేందర్ అట్లా సంభాషిస్తూనే ‘నేను మాట్లాడుతున్నాను’ అన్నాడు ఓ కవితలో అందులో

‘మౌనంగా ఉండడమంటే మాట్లాడలేకపోవడం కాదు

మనస్సు పొరల్ని బందించి జీవచ్చవంలా బతకడం

మనిషి తనాన్ని పూర్తిగా కోల్పోవడం’ అని అన్నాడు మహేందర్ . అనడమే కాదు వ్యక్తిగా మనిషితనాన్ని పూర్తిగా నిలుపుకుంటూ సాటి మనిషి పట్ల బాధ్యత తో నిలబడుతున్నాడు.

‘చివరికి

చీకట్లో కలసిపోయిన మీ అడుగుల్ని నిలబెట్టేందుకు

నేను ప్రతీ రాత్రి అడవిలో సింధూరమై మొలకేత్తుతాను’ అనీ అంటున్నాడు మహేందర్.

….

‘అది ఒక యుద్ధ క్షేత్రం

ఓ ఆత్మ గౌరవ పతాకం’ అని ధర్నాచౌక్ గురించి కవిత్వం చెప్పిన మహేందర్

“రాజ్యమేలేటోడు

వస్తూనే ఉంటడు పోతూనే వుంటడు                

చివరిదాకా నిలిచేవాడే వీరుడు’ అని కూడా స్పష్టంగా అంటాడు.

అంతేకాదు

నిజంగా ఒట్టేసి చెబుతున్న

ఒక్క సారి మీ సాయంకాలాన్ని కాసేపు నాకివ్వండి

ఇక ప్రతి సాయంకాలం

మీకు అందమయినదిగా సంతకం చేసిస్తాను’ అని కూడా హామీ అస్తున్నాడు.

….

 ఒక్కోసారి  మహేందర్ కవిత్వం నిండా ఒక విషాద జీర ధ్వనిస్తూ వుంది.

“ఇప్పుడు కాళ్ళు రెక్కలు తెగి

చక్రాల మీదికి నెట్టి వేయబడిన నా జీవితానికి

మిగిలిన ఒకే ఒక తోడు ఈ కిటికీనే

ఎన్ని చేకట్లు కాటేసినా ఎన్ని వెలుగులు విరబూసినా

ఎ మాత్రం కదలలేని నా మొండి దేహానికి

ప్రత్యక్ష సాక్షి ఈ కిటికీనే

అప్పుడప్పుడూ

రెక్కలు కట్టుకుని ఊరేగుదామనుకున్న ప్రతిసారీ

ఎగరలేని నా నిస్సహాయతను చూసి

జాలిపడే ఆప్త మిత్రుడు ఈ కిటికీనే”  కానీ ఆ విషాద స్పందన దగ్గర మహేందర్ నిలబడి పోడు.

ఆయన కవిత్వంలో ఆ విషాద ధ్వని కి ప్రతిధ్వనిగా గొప్ప ఆత్మ విశ్వాసం కూడుకున్న ఆశావాదం కూడా వినిపిస్తుంది. తనకి జాలి అవసరం లేదని..

‘రాళ్లో ముళ్లో పూలదారినో

బతుకు తొవ్వ సాగిపోవాలంటే

అడుగుల్ని ముందుకు కదిలించాల్సిందే

చివరివరకూ నడుస్తూపోవాల్సిందే’ అంటూ ముందుకు సాగుతాడు.

అట్లా గొప్ప ఆశావాద దృక్పధం తో కవిత్వం రాయడమే కాదు జీవితమూ అంతే ఆశావాహకంగా గడుపుతున్న మహేందర్ ను మనస్పూర్తిగా అభినదిస్తున్నాను.

కవిగానూ మనసున్న ఆత్మవిశ్వాసం వున్న మనిషి గా మరింత విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను

-వారాల ఆనంద్  


యాదొంకీ బారాత్ – 26= నటరాజ కళానికేతన్- సభలు సమావేశాలూ

Posted on

యాదొంకీ బారాత్ – 26

+++++++++

నటరాజ కళానికేతన్- సభలు సమావేశాలూ

**********

1975-76 ప్రాంతం. డిగ్రీ చదువుతున్న రోజులు. అప్పుడప్పుడే టీనేజీ దాటుతున్న కాలం. ఒక వైపు అకాడెమిక్ చదువులు వాటి వొత్తిడి. మరోవైపు సాహిత్యం పత్రికలు సభలు సమావేశాలూ జీవితాన్ని కమ్ముకుంటున్న సమయం. ఇటు కరీంనగర్ లోనూ అటు వేములవాడలోనూ సాహిత్య నాటక సభలు నా ఒక్కడి  కాలాన్నే కాదు నా సహచరుల అందరి జీవితాల్నీ బాగా ప్రభావితం చేసాయి. మరో వైపు సిరిసిల్లా జగిత్యాల పోరాటాల ఆరంభం విస్తరణ కూడా అదే సమయం.

కరీంనగర్ మున్సిపల్ ‘కళాభారతి’ ఆడిటోరియంలో త్యాగరాయ లలిత కళాపరిషత్ ఆధ్వర్యం లో నాటకాలు, ‘కళాభారతి’ వెనకాల పౌర హక్కుల సంఘం ఆధ్వర్యం లో శ్రీశ్రీ సభలు, మరో  వైపు నెహ్రు యువక కేంద్ర కొఆర్దినేటర్ శ్రీ వి.రామారావు ఆధ్వర్యంలో యువజన సంఘాల కార్యక్రమాలతో కరీంనగర్ అంతా యమ ఆక్టివ్ గా వుండేది.

సరిగ్గా అదే సమయంలో వేములవాడలో నటరాజ కళానికేతన్ స్థాపన.

+++++++++++

ఇక నా విషయానికి వస్తే నాకు అప్పటికి సభలు సమావేశాలు అంటే గొప్ప ప్రేరణ. మంచి వక్తలు మాట్లాడితే ఎంతో ఉత్సాహం. కానీ సభా వేదిక అంటే భయం. సభా కంపం. మైకు చూస్తే మాట పలికేది కాదు. కానీ వేములవాడ నటరాజ కళానికేతన్ ఏర్పాటులోనూ నడకలోనూ నేనూ భాగస్వామినే. చర్చల్లో ప్రణాలికల్లో ముఖ్యపాత్రదారినే. కాని నిర్వహణ వచ్చే సరికి కొంత అవుట్ సైడర్ గానే వున్నాను. జింబో ఇంట్లో, మంచే సత్యనారాయణ ఇంట్లోనో, చొప్పకట్ల చంద్ర మౌళి సార్ దగ్గరో లేదా నగుబోతు చంద్రమౌళి గారి వెంకటేశ్వర మెడికల్స్ లోనొ కూర్చుని జరిగిన మాటల్లో చర్చల్లో నేనూ వున్నాను. కళానికేతన్ అనుభవాలూ, వివరాలూ జింబో, వఝల శివ కుమార్, పి.ఎస్.రవీంద్ర లలో ఎవరయనా రాస్తే పూర్తి సాధికారికంగా రాయగలరేమో. ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే అది ఈ ప్రాంత సాహిత్య చరిత్ర. ఒక తరం కవులు సాహిత్యకారులు ఉదయించడానికి ప్రేరణగా నిలిచిన సంస్థ అది. దాని గమనాగమనాల్ని  నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఎంతయినా వుంది. నా మట్టుకు నేను నా యాది లో వున్న విషయాల్ని రాస్తూ వున్నాను.

     సాహితీ సాంస్కృతిక సంస్థగా మే 23 1976 రోజున ఆవిర్భవించిన కళానికేతన్ మొదటి సమావేశం ‘భీమేశ్వర సభామంటపం’ లో జరిగింది. కోరుట్లకు చెందిన శ్రీ అందే వెంకటరాజం  అతిథిగా హాజరవ్వగా నిజామాబాద్ తదితర అనేక ప్రాంతాల నుండి కవులు హాజరయి కవి సమ్మేళనాన్ని గొప్పగా విజయవంతం చేసారు.

సరిగ్గా అదే రోజు తన జర్నలిస్టు జీవితం మొదలయిందని మిత్రుడు కవి పి.ఎస్.రవీంద్ర సంతోషంగా గుర్తు చేస్తాడు. ఆనాటి సభా వివరాల్ని రాసివ్వమని సలంద్ర వొత్తిడి చేసి తనతో రాయించాడు. ఆ వార్తను అచ్చు వేయడమే కాకుండా కరీంనగర్ జిల్లా విలేఖరిగా నియమించాడు. అప్పటిదాకా కవిగా నిలదొక్కుకుంటున్న రవీంద్ర జర్నలిస్టుగా మొదలయి అనంతర కాలం లో పూర్తి స్థాయి జిల్లా ప్రతినిధిగా, బ్యూరో చీఫ్ గా అనేక పత్రికలకు  పనిచేసాడు.( ఆ వివరాలు మళ్ళీ రాస్తాను).

ప్రారంభ సమావేశ సమయంలో మైసూరులో వున్న చొప్పకట్ల వేములవాడ చేరాక కళా నికేతన్ కు సలహాదారుగా తన ముద్రను వేయడం ఆరంభించారు. డాక్టర్ రఘుపతి రావు (మామయ్య),చొప్పకట్ల, నగుబోతు చంద్రమౌళి ల ప్రోత్సాహం కళా నికేతన్ కు గొప్ప బలాలయ్యాయి. శ్రీ మధు మృత్యుంజయశర్మ, కే.రాజ శర్మ ల సహకారం కూడా మరువలేనిది. అప్పటికే చొప్పకట్ల రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు.

అందుకే కళానికేతన్ వార్శిక కార్యక్రమానికి శ్రీ గజ్జెల మల్లారెడ్డి అతిథిగా విచ్చేసారు. అందులో సంస్థ వెలువరించిన మొదటి వార్షిక “నవత” ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. శ్రీ దాశరధి రంగాచార్య మరో అతిథిగా పాల్గొన్నారు. ఇక మరుసటి రోజు జరిగిన కవి సమ్మేళనానికి గజ్జెల మల్లారెడ్డి అధ్యక్షత వహించగా శ్రీ ఎల్లోరా ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమాల ప్రభావాల గురించి ఆలోచిస్తే అప్పటికే స్వాతి పేరుతో కథలు రాస్తున్న మంగారి రాజేందర్ జింబో, కవులుగా వఝల శివకుమార్, పి.ఎస్. రవీంద్ర లు విరివిగా రాయడం ఆరంభించారు. ఇక మధు రవింద్ర, రమేష్ చంద్ర, రాచకొండ మోహన్, పి.కిషన్, ప్రతాప చంద్ర శేఖర్. కొడం పవన్ కుమార్, లీల, శోభారాణి, ఏ.విజయలు కళానికేతన్ ప్రేరణతో కవులుగా మొదలయ్యారు. ఇక డాక్టర్ రఘుపఠీ రావు, డాక్టర్ సిహెచ్ హన్మంత రావు తదితరులు కూడా తమ కలాల్ని తెరిచి రాయడం మొదలు పెట్టారు. నాటక రంగం లో వున్నా మంచే సత్యనారాయణ కూడా తన స్వీయ కవితలు లేదా రవీంద్ర ప్రభావ కవితలతో రాయడం ఆరంభించారు. ఇట్లా కళానికేతన్ అనేక మంది చేత రాయించింది. ముందుకు తోసింది. నిలబెట్టింది.

++++++

 అప్పుడప్పు డప్పుడే వెలువడుతున్న ప్రముఖ పత్రిక “ప్రజాతంత్ర”. మమ్మల్ని గొప్పగా ప్రభావితం చేసింది. నేనేమో ‘గొడుగు దాని పుట్టు పూరోత్తరాలు’ లాంటి వ్యాసాలు అందులో  అప్పటికే రాసాను. జింబో కథలు అందులో వచ్చాయి. ప్రజాతంత్ర మీది అభిమానంతో హైదరాబాద్ నాంపెళ్లి లో వున్న ఆ పత్రిక ఆఫీసుకు ఇద్దరం వెళ్లాం. సంపాదకులు శ్రీ దేవిప్రియ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. ఏవో కొన్ని సాహిత్య విషయాలు మాట్లాడింతర్వాత  తనని వేములవాడ సభకు రమ్మని ఆహ్వానించాం. సంతోషంగా వొప్పుకున్న దేవిప్రియ తప్పకుండా వస్తానన్నారు. కాని ఒక సూచన చేసారు. సభలో తాను గొప్పగా మాట్లాడ లేనని తన మిత్రుడు కవి కే.శివారెడ్డి ని కూడా తీసుకు వస్తానన్నాడు. శివారెడ్డి బాగా మాట్లాడ తాడని సభ బాగా జరుగుతుందని అన్నాడు. మేము కొంత మౌనంగా వుండడం గమనించి చార్జీల విషయం ఇబ్బంది పడొద్దు మీరు ఖర్చులు ఒకరికే భరించండి మేము వచ్చేస్తాం అన్నాడు. మేము సరేనన్నాము. 7 ఆగస్ట్ 77 రోజున జరిగే సభకు వారిని వెంట వుండి  తీసుకువచ్చే బాధ్యత రవీంద్రకు అప్పగించాం. గౌలిగుడా బస్ స్టాండ్ లో ఆ ఇద్దరినీ కలుసుకుని వెంట రావడం ఆయన పని. ఉదయాన్నే మొదట దేవిప్రియ రాగా కే.శివారెడ్డికి వీడ్కోలు చెప్పి పంపించేందుకు సిద్దారెడ్డి కూడా వచ్చాడని రవీంద్ర చెప్పాడు. సిద్దారెడ్డి ఆప్పుడు ఒక ఆసక్తికర ప్రశ్న వేశాడని రవీంద్ర చెప్పాడు. మీరు మొదట గజ్జెల మల్లారెడ్డి, ఏటుకూరి ప్రసాద్ తదితరులని పిలిచారు ఇప్పుడు కే.శివారెడ్డి దేవిప్రియల్ని పిలుస్తున్నారు మీరు ఎ వైపు అని అడిగాడంట(గుర్తుందా సిద్దారెడ్డి).

   తర్వాత జరిగిన వార్షిక సభల్లో జ్వాలాముఖి ప్రధాన అతిథిగా హాజరయి నవత సంచికను ఆవిష్కరించారు. సభలో ఆయన చేసిన ఉద్వేగ పూర్వక ప్రసంగం ఇప్పటికీ గుర్తుంది. ఆ సభలో ఆయన నవత సంచికను మొత్తంగా సమీక్షించారు.

“రాత్రి చనిపోయింది”

వర్షం భోరున ఏడుస్తుంది

అప్పుడే వెళ్ళిపోయాడు చంద్రుడు

నాకేమిటని,

గాలి  వీస్తుంది

నేనూ వున్నానని,

సూర్యుడు తొంగి చూస్తున్నాడు

మేఘాల తెర అడ్డంగా వస్తుంది

నేనూ అప్పుడే లేచి చూసాను

చని పోయింది ఎవరా అని ?

ఆలోచిస్తే తేలింది

చనిపోయింది రాత్రే అని !

…. పి.ఎస్.రవీంద్ర రాసిన ఆ కవితని జ్వాలాముఖి ఆ రోజు సభలో ఆకాశానికి ఎత్తేశాడు. అందరికీ గొప్ప ఉత్సాహం కలిగిన సందర్భమది. ఆ నాటి సభ మొత్తం ఆడియో రికార్డ్ చేసారు. కానీ తర్వాత జావాలాముఖి ప్రసంగం లోని రవీంద్ర ప్రశంసాంశం ఎగిరి పోయింది. ఆ మొత్తం ప్రసంగం గొప్ప సాహిత్య విలువలతో కూడినది. చారిత్రకంగా అమూల్య మయింది కూడా అని నేననుకుంటారు.

++++++

నటరాజ కళానికేతన్ వెలువరించిన సైక్లోస్తయిల్డ్ పత్రికలు గొప్ప సాహిత్య ప్రయత్నాలు. వాటి తరవాత కళానికేతన్ ‘నవత’ రెండు వార్శికసంచికలు వెలువరించింది. ఒకటవ ప్రత్యేక సంచికలో కథా కవిత్వం అన్ని సాహిత్య ప్రక్రియలకూ స్థానం కల్పించారు. చొప్పకట్ల సంపాదకులుగా ఆ సంచిక రూపొందగా కరీంనగర్ లో దాని ప్రింటింగ్ బాధ్యతల్ని నేను స్వీకరించాను. గుర్తునంత వరకు శారదాప్రెస్ లో అది అచ్చయింది. దాంట్లో మామిడిపల్లి సాంబశివ శర్మ(భారతీయవిలాపం), గజ్జెల మల్లారెడ్డి (వద్దు వద్దు గాంధీజీ), జువ్వాడి  శోభారాణి(నాకు రాయాలని వుంది), వఝల శివ కుమార్ (చైతన్య శిఖరం), వీపీ చందన్ రావు( శవం పెడుతున్న కూడు), పీ ఎస్ రవీంద్ర(నా ఇజం లోని నిజం), కందాలై రాఘవాచార్య( పుకార్లు) రాసిన కవితలు, జింబో(నిశ్శబ్ద ఘోష). సి హెచ్ మధు( మలుపు), వారాల ఆనంద్ ( రాసికి రాని రాశి ఫలం) కథలు, అంపశయ్య నవీన్ రాసిన ‘నవల ప్రాముఖ్యం’వ్యాసం, వద్దిరాజు రాంమోహన్ రాసిన ‘జగత్తంతా శరత్తు నింపిన శరత్ చంద్రుడు’ తదితర రచనలున్నాయి. వెంకటేశ్వర మెడికల్స్ లో కూర్చున్నప్పుడు సంపాదకుడిగా చొప్పకట్ల నా కథను విశేషంగా ప్రశంసించాడు. కాని తన అనుమతి లేకుండా కరీంనగర్ లో రాంమోహన్ వ్యాసాన్ని చేర్చడం పట్ల నాపైన తీవ్ర నిరసన వ్యక్తం చేసాడు. సంపాదకుడిగా చొప్పకట్ల నిబద్దత అది. ఇక ‘నవత’ రెండవ అచ్చు సంచిక కవితల ప్రత్యేక సంచికగా వెలువడింది. అందులో జింబో, వజ్జల శివకుమార్, మధు రవీంద్ర, రమేష్ చంద్ర, రాచకొండ మోహన్, డాక్టర్ రఘుపతిరావు, డాక్టర్ హన్మంత రావు, డాక్టర్ దయాదేవి, రేగులపాటి కిషన్ రావు, నలిమెల భాస్కర్, పి.ఎస్.రవీంద్ర, అలిశెట్టి ప్రభాకర్, చీటీ జగన్రావు, పి.కిషన్, లీల, బల్మూరి యుగందర్ రావు, పోరండ్ల మురళీధర్, ఎ.విజయ, ఎర్రోజు సత్యం తదితరుల కవితలున్నాయి.

అట్లా నటరాజ కళానికేతన్ ఆనాడే సాహితీ రంగంలో విశేష కృషి చేయడమే కాకుండా తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రతిభావంతులయిన కవుల్ని అందించింది. అందులో పలువురు సాహిత్యంలో నిలబడ్డారు.

నటరాజ కళాకేతన్ శాఖలు వాటి ప్రభావాలూ వచ్చే వారం రాస్తాను…. 

సెలవ్..  

-వారాల ఆనంద్