Uncategorized

POEM

Posted on

మిత్రులారా! Pl click the link and read my poem, tq
వారాల ఆనంద్ కవిత :  నా కన్నీ గుర్తే.. https://telugu.asianetnews.com/literature/varala-anand-poems-poetry-krj-sak2qg

Posted on

మిత్రులారా!36 ఏళ్లపాటు పలు కాలేజీల్లో లైబ్రెరియన్ గా పుస్తకాల మధ్య, విద్యార్థినీ విద్యార్థుల నడుమ గడిపినవాణ్ణి.  నిన్న ముల్కనూరు గ్రామంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ప్రజా గ్రంధాలయానికి  వెళ్ళాను. అక్కడి వాతావరణం నిర్వాహకుల్ని చూస్తే చాలా సంతోషం కలిగింది. ఆ లైబ్రరీకి నా పుస్తకాల తో పాటు మరో 250 పుస్తకాల్ని నా వంతుగా ఇచ్చాను. ఆ లైబ్రరీ ఎంతగాని అభివృద్ధి చెందాలని, మరింతగా సేవలు అందించాలని కోరుకుంటున్నాను – వారాల ఆనంద్        

A POEM A DAY

Posted on

A POEM A DAY’
23 Feb 2024

Posted on

పల్లె పురావస్తువు

పట్నం నయా బజార్     

+++++++++ వారాల ఆనంద్

పల్లె పొలిమేరన తుప్పుపట్టిన కరెంటు స్థంభంలా వున్నాను

ఫ్యూజు కాలిపోయి వాడిన బల్బును

మార్చి చాలా రోజులే అయింది

***

చూస్తూ ఉండగానే

పల్లె పొలిమేర పొలమారి కదిలి పోయింది

పల్లె పట్నాల నడుమ గట్టు కూలి పోయింది

గుడిసెలూ ఇండ్లకప్పులూ రాలి

కుప్పలు కుప్పలుగా పోగు పడ్డాయి 

వాకిళ్ళు పొక్కిలి పోక్కిలయి

పొర్లుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాయి

గడపలన్నీ గిడసబారి ముక్కలు ముక్కలయి

స్మశానం పక్కన కట్టెల మండీని చేరాయి

పొలాలు ప్లాట్లయి విస్తరించాయి

ఎకరాలు గజాలుగా ఎదిగాయి

పల్లె పట్నంలో కలిసిందా?  

పట్నం పొలాన్ని మింగిందా?

జవాబు తెలిసీ ప్రశ్న అడిగితే

బదులేమిచ్చేది ఎట్లా సచ్చేది

చెరిగిపోయిన పొలిమేర గట్టు మీద

తుప్పట్టి వంగిపోయిన స్తంభాన్ని నేను

నేడో రేపో నన్నూ

మూలాలతో సహా పెకిలించి

ఏ పాత సామాన్లకిందో అమ్మేస్తారు

ఏముందిక

పల్లె పురావస్తువు

పట్నం నయా బజార్       =============================

అందుకున్నాను- 21=సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్

Posted on

+++++++

SAHIR A LITERARY PORTRAIT by SURINDER DEOL

—————————- 

చిన్నప్పటినుంచీ నేనో సినిమా పిచ్చోన్ని. అంతకంటే నాకు సినిమా పాటలు అందులోనూ హిందీ పాటలంటే మహా పిచ్చి. కవిత్వమన్నాకూడా అంతేకదా అందుకే ఇటీవల సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్ (SAHIR A LITERARY PORTRAIT by SURINDER DEOL ) పుస్తకాన్ని ఆన్లైన్ లో అందుకున్నాను. సాహిర్ లుధ్యాన్వీ సాహిత్యాన్నీ జీవితాన్నీ సురేందర్ దేవల్ చాలా బాగా రాసారు. సినిమా కవిగా సాహిర్ ఎంత పాపులరో విలక్షణ మయిన కవిగా అంతే ప్రసిద్ధుడు.

ఈ ‘సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్’ లో సాహిర్ రాసిన 90 కి పైగా రచనల ఆంగ్లానువావాదాలున్నాయి. వాటిల్లో కవితలు, గజల్లు, భజనలు వాటి తో పాటు ‘PARCHAAIYAAN’ (నీడలు) లాంటి దీర్ఘ కవితలూ వున్నాయి.

ఇందులో రచయిత ముఖ్యంగా కవిగా సాహిర్ లోని నాలుగు ప్రధాన లక్షణాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. సాహిర్ గొప్ప ప్రకృతి ప్రేమికుడు. గొప్ప భావుకుడు. మనిషి పట్ల ప్రేమా, ఆతని వేదన దుఖం పట్ల సానుభూతి సంఘీభావం వున్నవాడు. అంతే కాదు భవిష్యత్తు పట్ల గొప్ప ఆశాభావం కలిగి వున్నవాడు. అలాంటి సాహిర్ ను ఆయన సాహిత్య జీవితాన్ని కళ్ళముందుకు తెచ్చిన పుస్తకంగా ఇది నాకు బాగా నచ్చింది.  

ఈ పుస్తకంలో సాహిర్ చిన్నప్పటి జీవితం నుంచి మొదలు 40 లలో వచ్చిన తన మొదటి కవిత్వ సంకలనం “తల్కియాన్” వరకు మొదటి భాగంలోనూ, తర్వాతి కవితా పుస్తకం“ పర్చాయియాన్” 2 వ భాగం లోనూ, ౩,4 భాగాలలో సాహిర్ రాసిన గజల్స్, భజన్స్ గురించి రాసారు. ఇక చివరి భాగంలో ముగింపు భావనలున్నాయి.   

*******************

“మైఁ పల్ దో పల్ కా షాయర్ హూఁ, పల్ దో పల్ మెరీ కహానీ హై

పల్ దో పల్ మేరీ హస్తీ హై, పల్ దో పల్ మెరీ జవానీ హై                 

ముఝ్‌సె పహ్‌లే కిత్నే షాయర్ ఆయే ఔర్ ఆకర్ చలే గయే,

కుఛ్ ఆహేఁ భర్‌కర్ లౌట్ గయే, కుఛ్ నగ్‌మే గా కర్ చలే గయే

వో భీ ఎక్ పల్ కా కిస్సా థే, మైఁ భీ ఎక్ పల్ కా కిస్సా హూఁ

కల్ తుమ్ సె జుదా హో జావూఁగా, జో ఆజ్ తుమ్‌హారా హిస్సా హూఁ ”

ఎంత గొప్ప కవిత. ఒక కవి అంతరంగం ఎంత అద్భుతంగా ఆవిష్కరించాడు సాహిర్.

ఆ కవితే తర్వాత ‘కభీ కభీ’ సినిమాలో పాటగా అమితాబ్ నోట పలికించారు. ఇందులో

కవి ఇట్లా అంటున్నాడు “గతం లో ఎంతో మంది మహా కవులు వచ్చారు గొప్ప కవిత్వాన్ని అందించి వెళ్ళిపోయారు.. నేనూ అంతే ఒక క్షణపు చరిత్రను..ఇక ముందు కూడా నాకంటే గొప్ప కవులు వస్తారు..మీకంటే మంచి శ్రోతలూ వస్తారు”  ఎంత వాస్తవిక మానసిక ఆవిష్కరణ. అది సాహిర్ కే చెల్లింది.

అంతే కాదు….

“యె దునియా అగర్ మిల్ భి జాయే తొ క్యా హై ..”(ప్యాసా)

“చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనో…”( గం రాహ )

ఇట్లా ఎన్ని పాటలు… దశాబ్దాలుగా వింటూ మైమరిచి పోయాను. గున్ గునాయిస్తూ ఊగి పోయాను.

నేను పాటల పిచ్చోన్ని అని చెప్పాను కదా 70 ల్లోనే సిలోన్ రేడియో లో వచ్చే ‘బినాకా గీత్ మాలా’ అంటే ప్రాణం పెట్టేవాన్ని. ప్రతి బుధవారం రాత్రి 8 అయిందంటే చాలు రేడియో ముందుకు చేరాల్సిందే. అంటే కాదు ప్రతి రోజూ ఉదయం 7.30 కి ప్రసారమయ్యే ‘పురానీ ఫిల్మొంకా గీత్ వినాల్సిందే. అట్లా పాటలంటే ప్రాణం పెట్టె నేను క్రమంగా ఆ పాటల గాయకులే కాకుండా సంగీత దర్శకుల పేర్లు రాసిన కవుల పేర్లూ తెలుసుకోవడం మొదలు పెట్టాను. అందులో నాకు కవిగానూ సినీ గీత రచయిత గానూ మదిలో నిలిచిపోయిన వాడు సాహిర్.

అట్లా కవిత్వమూ పాటలూ రాసి మెప్పించిన సాహిర్ పుట్టి నూరేళ్ళు పూర్తయినాయి. ఆయన రచనలు, కవితలు ఈనాటి సమస్యలకు అద్దం పడుతాయి. ప్రగతి శీల ఉద్యమాలకు ఆయన కవితలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సాహిర్‌ లుధియాన్వి మార్చి 8, 1921లో ఒక జమిందారీ కుటుంబంలో పుట్టారు. ఆయన మొదటి పేరు అబ్దుల్‌ హై ఫజాల్‌ అహ్మద్‌. సాహిర్‌ అన్న పేరును తన కలం పేరుగా పెట్టుకున్నారు. జమిందారి కుటుంబంలో పుట్టినా జమిందారి దర్జాలను సౌఖ్యాలను ఆయన అనుభవించ లేదు. ఎందుకంటే ఆయన పుట్టిన కొన్నాల్లకే   తల్లి దండ్రులు విడిపోయారు. సాహిర్‌ తల్లి సర్దార్‌ బేగమ కొడుకును తీసుకొని భర్త నుంచి దూరంగ వెళ్ళిపోయింది. సాహిర్ చిన్నప్పుడే తన తల్లిని హింసించే తండ్రిని ఆయన అసహ్యించుకున్నాడు. ఇది ఆయనపై గొప్ప ప్రభావాన్నే చూపించింది. ఒక నవ యువకుడిగా ఆయన సమకాలీన రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలపై స్పందించే వాడు. 

సాహిర్ ను తల్లే కష్టపడి పెంచింది. లాహోర్ లోని దయాళ్ సింగ్ కాలేజీ లో చదివాడు సాహిర్.

”ఎన్నాళ్లని ఆదం గొంతుని నొక్కేస్తారు – మేము చూస్తాం – ఎన్నాళ్లని రగులుతున్న ఉద్వేగాలను ఆపగల్గుతారు – మేము చూస్తాం.” అంటూ సాహిర్ రాసిన కవిత పాకిస్తాన్ పాలక వర్గాలకు ఆగ్రహం కలిగించింది. ఫలితంగా సాహిర్ ఇండియా వచ్చేసాడు.

    ఇండియా వచ్చింతర్వాత సాహిర్ అభ్యదయ రచయితల సంఘం లో చురుకుగా వుండేవాడు. ఫైజ్, ప్రేమ్చంద్,అలీ సర్దార్ జాఫ్రీ లాంటి మహా మహులతో పనిచేసాడు. ఆయన పేదలు, కార్మిక వర్గం సమస్యల పట్ల స్పందిస్తూ కవిత్వం రాసారు. 

సాహిర్ లుధ్యాన్వీ రాసిన అద్భుత కవిత్వాన్ని ఆవిష్కరించిన పుస్తకంగా సాహిర్ ఎ లిటరరీ పోర్ట్రేయిట్* మిగిలిపోతుంది.

చివరగా ఈ సాహిర్ కవితను మననం చేసుకుంటూ….ముగిస్తాను

”మానా కి ఇస్‌ జమీ కో న గుల్జార్‌ కర్‌ సకె – కుచ్‌ ఖార్‌ కం తో కర్‌ గయే గుజ్రే జిధర్‌ సె హం”
(అవును ఈ ప్రపంచాన్ని నందనవనంగా మార్చ లేకపోయాం – కానీ మనం నడిచిన దారిలో కొన్ని ముళ్ల నైనా తీసివేయగలిగాం )

—వారాల ఆనంద్

Posted on

Image Posted on