Month: March 2023

కవిత్వానికి కొత్త దారి కున్వర్నారాయణ్++++వారాల ఆనంద్

Posted on

Friends, pl read my Weekly column article published in Neti Nijam
++++

కవిత్వానికి కొత్త దారి కున్వర్ నారాయణ్
++++++++ వారాల ఆనంద్
“నేను ప్రకృతిని అనుసరించను..నేనే ప్రకృతిని” నంటారు కున్వర్ నారాయణ్.
అంతేకాదు మనం రెండు ప్రపంచాల్లో బతుకుతాం..ఒకటి తాను సృష్టించిన ప్రపంచం.. మరోటి ఇతరులు సృష్టించింది..
నా ప్రపంచం మన ప్రపంచానికి భిన్నమయింది కావచ్చు కాకపోనూ వచ్చు.. అంటాడు


వర్తమాన హిందీ సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని గొప్పగా ప్రభావితం చేసారు కున్వర్ నారాయణ్.
హిందీ సాహిత్య ప్రపంచంలో తనదయిన సృజనాత్మక నైపుణ్యాన్ని సాధించాడు. ఆయన సృజనాత్మక వ్యక్తీకరణలో సరళత, పదునయిన తాదాత్మ్యత కనిపిస్తాయి. మొత్తంగా సమతావాద దృక్పధం లో ఆయన రచనలన్నీ సాగాయి.
కున్వర్ నారాయణ్ రచనల్లో ‘జీవితం..కవిత్వం తో రూపొందింది’అన్న BORGES మాటల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
కున్వర్ నారాయణ్ ఒక చోట ఇట్లా అంటాడు
‘నేను జీవితాన్నుంచి
తప్పించుకోవాలుకోవడం లేదు
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను’…
హిందీ నవ్య కవిత్యోద్యమం తో మమేకమయిన కున్వర్ నారాయణ్ తన సరళమయిన భాష వ్యక్తీకరణలతో హిందీ సాహిత్యం లో ప్రత్యేక ముద్ర వేసాడు.
కున్వర్ నారాయణ్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాహితీ రంగంలో వున్నారు.
ఆయన వివిధ సాహిత్య ప్రక్రియల్లో రాసారు. కవిత్వం, కథలు,ఎపిక్, విమర్శ, వ్యాసాలూ, అనువాదాలు చేసారు. వాటితో పాటు సినిమా,సంగీతం, కళలు, మ్యూజింగ్స్ కూడా రాసారు.
++++
19 సెప్టెంబర్ 1927న జన్మించిన కున్వర్ నారాయణ్ తన బాల్యాన్ని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య-ఫైజాబాద్ నగరాల్లో గడిపారు. ఆ కాలంలో ఆయన కుటుంబాన్ని టీబీ తీవ్రంగా కలిచివేసింది. అనేక మంది మృత్యు వాత పడ్డారు. చివరికి తనకు అత్యంత ప్రియతములయిన తల్లి, సోదరి కూడా టీబీ వ్యాధికి బలయ్యారు.
అనంతరం కున్వర్ పెద్దన్నయ్యతో కలిసి లక్నో నగరానికి చేరుకున్నాడు. అప్పుడు దేశమంతా గాంధీగారి ప్రభావం పెల్లుబుకుతున్న సమయం. లక్నో లో వాళ్ళిల్లు అనేక మంది రాజకీయ నాయకుఅకు వేదిక గా వుండేది. ఆక్రమం లోనే కున్వర్ నారాయణ్ జీవితంలో తొలి రోజుల్ని, ఆలోచనల్ని ఆచార్య నరేంద్ర దేవ్, ఆచార్య కృపలానీ తీవ్రంగా ప్రభావితంచేసారు. ఒక సంవత్సరం బాంబే లో నరేంద్ర దేవ్ తో వున్న కున్వర్ తర్వాత
ఆచార్య కృపలానీ తో ‘విజిల్’ పత్రికలో పని చేసాడు. ఆ అనుభవం తన ఆలోచననీ దృష్టి కోణాన్నీ విస్తారం చేసింది.
కున్వర్ నారాయణ్ లక్నో విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో ఎం.ఎ. పూర్తి చేసారు. అప్పుడే ‘లేఖ్ సంఘ్’ అన్న సంస్థ తో మమేకమయి పని చేసారు. తర్వాత విదేశాలకు వెళ్ళిన కున్వర్ కవిత్వం పైన పాబ్లో నెరుడా, నాజిమ్ హిక్మాట్ లాంటి అనేక విదేశీ సృజనకారుల ప్రభావం పడింది. పోలాండ్, జెకోస్లోవేకియా, చైనా, రష్యా లాంటి దేశాల పర్యటన కున్వర్ ఆలోచనా పరిధిని విస్తృతం చేసాయి. 1956 లో విదేశాలనుంచి తిరిగి రాగానే కున్వర్ నారాయణ్ తొలి కవితా సంకలనం ‘చక్రవ్యూహ్’ వెలువడింది. ఆ కాలంలోనే ఆయన ‘యుగ చేతన’ అన్న పత్రిక కు సహా సంపాదకుడిగా పని చేసారు. తర్వాతి కాలంలో ‘నయా పత్రిక్’, ‘చాయానాత్’ అన్న పత్రికలకు కూడా సహసంపాదక బాధ్యతల్ని నిర్వహించారు. ఎ పనిలో వున్నా ఎక్కడున్నా ఆయన తన రచనా వ్యాసంగాన్ని వదులుకోలేదు. తన సృజనని నిరంతరం నిలుపుకున్నారు. కవిత్వంతో పాటు అనేక కథల్నీ రాసారు కున్వర్. తర్వాత వెలువడింది ‘తీస్రా సప్తక్’. ప్రసిద్ధ కవి ఆగ్గేయ సంపాదకత్వం లో వెలువడిన ఆ సంకలనం లో వున్న ఏడుగురు కవుల్లో కున్వర్ నారాయణ్ ఒకరు.
తర్వాత కున్వర్ కవితా సంకలనం ‘పర్వేష్-హం తుమ్’
ఆ తర్వాత వచ్చిన “ ఆత్మజాయి” ఉపనిషత్తులలో వున్న నచికేతుని పాత్ర ఆధారంగా రాసిన రచన అది. అందులో జీవితము,మరణమూ, సంఘర్షణ లని మూలన్గాతీసుకుని చేసిన ఈ రచన తాత్వికంగా వుంటుంది. అందులో తమ కుటుంబ సభుల మరణాలూ వాటి ప్రభావాలూ అంతర్లీనంగా కనిపిస్తాయి.
70 వ దశకం వచ్చేసరికి కున్వర్ నారాయణ్ పై సినిమా, సంగీతం, నాటకం, చిత్రకళా ప్రభావాలు అధికమయ్యాయి. ఆ కాలంలోనే ‘నయా ప్రతీక్’, ‘చాయానాత్’ పత్రికలకు సహా సంపాదకత్వం వహించాడు. కొన్ని సాహితీ సంస్థల నిర్వహణ బాధ్యతా స్వీకరించాడు. 71 లో ఆయన వెలువరించిన ‘ఆమ్నే సామ్నే’ అన్న కథల పుస్తకం ఆనాటి సామాజిక రాజకీయాల పైన సంధించిన వ్యంగ్యాత్మక రచన గా వినుతికెక్కింది
అయితే ఆయనకు గొప్ప పేరుని అనేక అవార్డుల్నీ ఇచ్చిన పుస్తకం 1979 లోవచ్చిన “ కోయి దూస్రా నహీ’లో జీవితానుభవాల విస్తృతి కనిపిస్తుంది. 1999 కున్వర్ నారాయణ్ ‘ఆజ్ అవుర్ ఆజ్ సే పహలే’ అన్న సాహిత్య విమర్శ పుస్తకం వెలువరించారు. తర్వాత తన ఇంటర్వ్యూ ల తో కూడిన ‘మేరె సాక్షాత్కర్’ వచ్చింది. కున్వ నారాయణ్ అనేక సంవత్సరాల పాటు సినిమా, శాస్త్రీయ సంగీతాలను విశ్లేషిస్తూ విరివిగా రాసారు. పలు అనువాదాలు కూడా చేసారు.
2002లో ఆయన ‘ఇన్ దినో’ అన్న కవితా సంకలనం వెలువరించారు. తర్వాత ‘వాజస్రావాకే బహానే’ అన్న ఒతిహాసిక గ్రంధం ప్రచురించారు.

హిందీ సాహిత్య ప్రపంచంలో విలక్షణ కవిగా పేరుగడించిన కున్వర్ నారాయణ్ సృజనాత్మక ప్రభావం మొత్తం హిందీ బెల్ట్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆయనకు సాహిత్యంలో అనేక జాతీయ అంతర్జాతీయ విశిష్ట అవార్డులు లభించాయి. అందులో కెనడా హాహిత్య అకాడెమీ అవార్డు, జ్ఞానాపీఠ్ పురస్కారం, కబీర్ సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, లోహియ సమ్మాన్, సలఖ్ సమ్మాన్, వార్శా విశ్యవిద్యాలయ గోల్డ్ మెడల్, ఇటలీ ప్రెమియో ఫెరోనియా లు కొన్ని మాత్రమే.
++++++
ఇట్లా హిందీ సాహితీ ప్రపంచంలో తనదయిన గొప్ప స్థానాన్ని పొందిన కున్వర్ నారాయణ్ ఎంపిక చేసిన కవితల్ని ఆయన కుమారుడు అపూర్వ నారాయణ్ ఇంగ్లీష్ లోకి ప్రతిభావంతంగా అనువదించారు. మూల రచనని యధాతతదంగా కాకుండా, భావం చెడకుండా చాలా గొప్పగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. అనువాదంలో అనేక మంది లాగా అకాడెమిక్ ఇంగ్లీష్ భాషను కాకుండా సృజనాత్మక ఆంగ్ల భాషను ఉపయోగించి ఈస్తేటిక్ ఫీల్ ని చివరంటా కొనసాగించారు. అది అనువాదకుని ప్రతిభకు నిదర్శనం. ఈ సంకలనంలో అనువాదకుడు అపూర్వ మూల కవిత్వాన్ని “ EARLY MEDITATIONS, ROUGH ROADS OF HISTORY, JOURNEYS,THE RIVER DOES NOT GROW OLD, TREES, MITTORS AND SHADOWS,REMEMBERANCES, HUMANESQUE” విభాగాలుగా ఎంపిక చేసి కూర్చారు. చాలా గొప్ప కూర్పు.
1927లో జన్మించిన కున్వర్ నారాయణ్ తన 90 ఎల్ల వయసులో 15 నవంబర్ 2017 న పరమపదించారు.
ఆయన కవిత్వం అందరూ ముఖ్యంగా కవులూ సాహిత్యకారులూ తప్పకుండ చదవాలని నేను అభిలషిస్తున్నాను. ఈ సందర్భంగా కున్వర్ నారాయణ్ స్మృతికి నివాళులు అర్పించుకుంటూ, అనువాదాన్ని అందించిన అపూర్వ నారాయణ్ కి ధన్యవాదాలు
….. మీకోసం నేను చేసిన కున్వర్ నారాయణ్ కవిత్వ అనువాదాలు కొన్ని……

1) కొత్త మార్గం

నేను జీవితాన్నుంచి
తప్పించుకోవాలుకోవడం లేదు
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను
జీవితపు ఊహాత్మక ఇరుసుపైన
కవిత్వానికి
అనుమానాస్పదంగా వున్న
స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి

అందుకు మొదట
జీవితపు శక్తి మూలాల్ని
క్రియాశీలం చేయాలి

తర్వాత ఆ శక్తిని
బతుకు కక్షకున్న ఇరుసుకు
జత చేయాలి
అప్పుడు
గతంలో లాగా
‘యాంత్రికత’ లేని
‘మానవత్వం’ వైపు మరలిన

కొత్త మార్గం ఆరంభమవుతుంది.

ఓ వింతయిన రోజు

నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను
ఎలాంటి ప్రమాదమూ సంభవించ లేదు

అనేకమంది మనుషుల్ని కలిసాను
ఎక్కడా అవమానం ఎదురుకాలేదు

నేను రోజంతా సత్యమే మాట్లాడాను
ఎవరూ తప్పుగా స్వీకరించలేదు

నేనివాళ అందరినీ విశ్వసించాను
ఎక్కడా మోసగింప బడలేదు

అద్భుతమయిన విషయమేమిటంటే

నేను ఇంటికి చేరుకోగానే
తిరిగొచ్చింది ఇంకెవరో కాదు

నేనే అని కనుగొన్నాను

ఎనిమిదవ అంతస్తు పైన
+++++++++
నేను ఎనిమిదవ అంతస్తులోని
ఓ చిన్న ఫ్లాట్ లో
ఒంటరిగా నివసిస్తున్నాను

ఆ ఫ్లాట్ కు బయటకు తెరుచుకునే
రెండు కిటికీ లున్నాయి
అవి నన్ను తీవ్రంగా భయపెడతాయి
కిటికీలకు బందోబస్తుగా
గట్టి గ్రిల్స్ బిగించాను

బయటనుంచి ఏదో ఉపద్రవం
ముంచు కొస్తుందని కాదు
ఇంత ఎత్తులోకి చొచ్చుకొచ్చే
ధైర్యం ఎవడు మాత్రం చేస్తాడు

ప్రమాదమల్లా నా లోపలే వుంది

చుట్టూ ఈ ఒంటరితనం ఈ విసుగూ

భయ భ్రాంతులని చేసే ఆ అంశాలు
ఏదో ఒక రోజు నన్ను
ఈ కిటికీల్లోంచి బయటకు దూకే

ఒత్తిడి చేస్తాయేమో

86= యాదొంకీ బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

86= యాదొంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

ఏదయినా ఒక సంస్థకు శాశ్వత చిరునామా ఏర్పడడం, ఆ సంస్థ కార్యక్రమాలకు నీడ,వేదిక రూపొందడం గొప్ప కల సాక్షాత్కారం అవడమే. ఓ పిల్లి ఏడు ఇండ్లు తిరిగి తన సొంత గూటికి చేరినట్టు ఒక స్వచ్చంద సంస్థ స్వంత భవన నిర్మాణానికి పాదులు వేయడం ఆ సంస్థకు దాని నిర్వాహకులకు అమితమయిన ఆనందాన్నిచ్చే సందర్భం. అలాంటి సందర్భమే కరీంనగర్ ఫిలిం సొసైటీ కి వచ్చింది. కలెక్టర్ శ్రీ పార్థసారధి గారు సంపూర్ణంగా సహకరించడానికి హామీ ఇవ్వడమే కాకుండా కార్యనిర్వహణకు పూనుకోవడం తో నేనూ మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ఆ నిర్మాణ పనిలో చొరవగా ముందుకొచ్చారు. మొదట దివంగత పండితులుఆత్మీయ మిత్రుడు శ్రీ నమిలకొండ హరిప్రసాద్ నేతృత్వంలో భూమి పూజ జరుపుకుని కార్యరంగంలోకి దూకాం. మొదట ఆర్థికంగా సహకరించమని కరీంనగర్ ప్రజల్ని కళాభిమానుల్ని కోరుతూ ఒక కరపత్రం వేసాము. అందులో కఫిసో చరిత్ర చేసిన కార్యక్రమాల వివరాలతో పాటు అనేక అంశాల్ని జోడించాం. ఇక అప్పటి కార్యవర్గమంతా జీవిత సబ్యులుగా చేరాలని తీర్మానించాం. కఫిసో బై లాస్ మౌలిక నిబంధనల ప్రకారం కఫిసోకు జీవిత సభ్యులే శాశ్వత హక్కు దారులు. భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా వారు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని నిర్దేశించబడి వుంది. 80 ల్లో శ్రీ అంపశయ్య నవీన్ గారిని సలహాదారుగా ఉండమని కోరినప్పుడు మొక్కుబడి పోస్ట్ తో ఉపయోగంలేదని సలహాదరుకీ కార్యవర్గంలో ఓటు హక్కు ఉండాలని ఆయన సలహా ఇవ్వడంతో అప్పుడే ‘బై లాస్’ ను సవరించి సలహాదారు పోస్టు తో పాటు జీవితసభ్యులే కఫిసో కు మూలాధారమని భవిష్యత్తు హక్కు దారులని పేర్కొంటూ రూల్స్ పెట్టడం జరిగింది. ఆ నిబంధనని కూడా భవన నిర్మాణ సందర్భంగా విస్తృతంగా ప్రచారంచేసాం. కార్యవర్గం జీవిత సభ్యులు కావడానికి వెయ్యి నూట పదహార్లు, బయటి వారు అయిదు వేలు చెల్లిస్తే జీవిత సభ్యత్వమిచ్చి దాతలుగా హాలులో పేర్లు రాసి ఉంచుతామని చెప్పాం. ఇవన్నీ అనుకున్న తర్వాత కరపత్రం తీసుకుని నేనూ, నరేడ్ల శ్రీనివాస్, నారదాసు లక్ష్మణ రావు, కే.దామోదర రెడ్డి మాతో పాటు డాక్టర్ రాజన్న తదితరులం ఒక ఉద్యమంలాగానే రోజూ ఉదయం కలిసి తెలిసిన మిత్రుల దగ్గరికి కఫిసొ అభిమానుల దగ్గరికి వెళ్ళడం ఆరంభించాం. నిజంగా అదొక యజ్ఞం. వూర్లో ఎవరు ఎవరికీ తెలిసినా ఎవరికి స్నేహితుడయినా ఈ టీం వాళ్ళ దగరికి వెళ్లాం. మాకు లభించిన స్పందన ఊహించనిది. ఎందుకంటే అడిగిన వాళ్ళల్లో శ్రీనివాస్, నారదాసు, దామోదర్, రాజన్న అంతా ఒక్కక్కొకరు ఒక్కో రంగం లో నిబద్దత తో వున్నా వారే. గొప్ప ఫేస్ వాల్యు వున్నవాళ్ళే. తిరగడం కొంచెం కష్టమే అయినా నేను కేంద్రకంగా ఆ ఉద్యమం ఆనందంగా రెండు కప్పుల చాయ్ మూడు జేవిత సభ్యత్వాలుగా విజయవంతంగా సాగింది. అవసరమయినప్పుడు డాక్టర్ సాగర్ రావు తో పాటు పలువురు మా వెంట వచ్చారు. మిగతా కార్యవత్గం కూడా అంతే నిబద్దతతో తమవంతు కృషి చేసారు. అదంతా సమిష్టి కృషి ఫలితమే.

అట్లా కఫిసో విజ్ఞప్తి మేరకు ఆ రోజుల్లోనే అంటే పదిహేడేళ్ళ క్రితం మా నారదాసు లక్ష్మణ రావు 25 వేలు ఇవ్వగా, పదివేల రూపాయల చొప్పున ఇచ్చిన ప్రముఖుల్లో గౌరిశెట్టి మునిందర్, కేసరిమల్ కార్వా, వావిలాల భూపతి రెడ్డి, డాక్టర్ పంజాల రాజన్న, సోమారపు వెంకన్న, బి.సత్యనారాయణ, టి.సంతోష్ కుమార్, కే.అనంత రెడ్డి, ఎం.రాజేవ్ శెట్టి, కొరవి వేణుగోపాల్, కసిరెడ్డి రాంరెడ్డి తదితరులున్నారు. ఇక అయిదు వేలు ఇచ్చిన వాళ్ళు అనేక మంది. అట్లా కఫిసో ప్రయత్నం తో మేము కట్టాల్సిన CONTRIBUTION సొమ్ము సమకూరింది. మా వాళ్ళంతా హమ్మయ్య అనుకుంటున్న సమయం లో నేను మెల్లిగా చెప్పాను. ఇంతటితో సరిపోదు కట్టబోయే హాల్లో చైర్స్, సౌండ్ సిస్టం, ఎల్.సి.డి. ప్రొజెక్టర్ కావాలి. అవి లేకుండా హాలు ఉవయోగం లేదు అని. నారదాసు నామీదికి ఒక్క సారిగా నా మీదికి ఎగిరాడు. ముందు నుంచి చెప్పలేదు… మెల్లిగా ఇప్పుడు చెబుతున్నావు అన్నాడు. అన్నీ ఒకేసారి చెబితే భయపడతారని అంటూ నసిగాను. శ్రీనివాస్, దామోదర్ లు నవ్వి ఘనకార్యమే చేసావు. ఇంకా చేసేదేముంది అన్నింటికీ ఎంత కావాలో బడ్జెట్ సిద్దం చేయి మరో రౌండ్ వేద్దాం అన్నారు నవ్వుతూ. వాటికీ సొమ్ము సమకూరింది.

ఇక మరో వైపు నిర్మాణం చురుకుగా సాగుతూ వుంది. పార్థ సారధి గారయితే అనేక సార్లు నిర్మాణాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. అది మాకూ ఇంజనీర్లకు గొప్ప ఉత్సాహకంగా వుండేది. కఫిసో సభ్యులతో పాటు మహిళా డిగ్రీ కళాశాల మిత్రులు డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, డాక్టర్ పి.రాజేశం, చంద్ర ప్రభాకర్ తదితరులు కూడా పలుసార్లు వచ్చేవాళ్ళు. మీడియా నయితే సంపూర్ణంగా మా వెంటే వుంది. వాళ్లకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

నిర్మాణానికి ఫిలిం భవన్ గా పేరు పెట్టుకున్నాం. ఇక శాశ్వతంగా ఉండేలా సొసైటీ ఎంబ్లెమ్, KARIMNAGAR FILM SOCIETY AUDITORIUM అని సిమెంట్ తో రాయించాను.

భవన నిర్మాణం పూర్తి అవుతూ వుంటే ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాట్లల్లో మేమున్నాం. ముఖ్యంగా నారదాసు లక్ష్మణ రావు, దామోదర్, నేనూ పూనుకున్నానం. ఆడియో సిస్టం కొసం హైదరాబాద్ మోజం జాహీ మార్కెట్ కు వెళ్లాం. హాలో లో వేసే కుర్చీల విషయంలో కూడా అందరం శ్రద్ధ తీసుకున్నాం. ఇక ఎల్.సి.డీ. ప్రొజెక్టర్ ని అమెరికా నుంచి తెప్పించాం.

ఇదంతా ఇట్లా వుంటే ప్రారంభోత్సవం నాటికి ప్రత్యేక సావనీర్ తేవాలని నిర్ణయించాం. డాక్టర్ రావికంటి మురళి కన్వీనర్ గా కమిటీ వేసుకున్నాం. దాంట్లో అంపశయ్య నవీన్, ప్రేమేంద్ర మజుందార్, నారదాసు, రాములు, రావికంటి మురళి,కోలా రామచంద్రా రెడ్డి, టి.రాజమౌళి నేనూ తదితరులం వ్యాసాలు రాసాం. సావనీర్ లో దాతలందరి పేర్లు ఫోటోలు వేయాలనుకున్నాం. మా ఆస్థాన ఫోటోగ్రాఫర్ కృష్ణ దాతలందరి దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసాడు. వాటి తోనే అందరికీ ఐ.డీ.కార్డ్స్ కూడా ఇచ్చాం. ప్రారంభోత్సవం నాటికి నేను నా వ్యక్తిగతంగా “KAFISO- A SAGA OF FILM LOVERS” పేర డాక్యుమెంటరీ ఫిలిం తీయాలని పూనుకున్నాను. దానికోసం గోదావరిఖని మిత్రుడు లింగాధర్ కెమెరా వర్క్ చేసాడు. వరంగల్ వెళ్లి నవీన్ ఇంటర్వ్యు తో పాటి కఫిసో విశేషాలు ఫోటోలతో సహా అన్నీ అందులో పొందుపరచాను. అరగంట డాక్యుమెంటరీ లో కలెక్టర్ పార్థసారధి, ఎన్.శ్రీనివాస్, నారదాసు, రాజమౌళి, తదితరుల ఇంటర్వ్యూ లు కూడా చేసాను. ఇక ప్రారంభోత్సవ సభకు ముందే ఒక మంచి రోజున ఉదయమే తన శ్రీమతి తో కలిసి పార్థసారధి గారు పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇక అప్పటి జిల్లా మంత్రి శ్రీ ఎం.సత్యనారాణ రావు చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి ఫిలిం భవన్ ప్రారంభించాలని నిర్ణయించాం. శిలాఫలకం తో సహా అన్ని ఏర్పాట్లు చేసాం. అతిథులకు దాతలకు కార్యవర్గానికి ఇచ్చేందుకు మేమెంటో ల కోసం వరంగల్ వెళ్లాను అక్కడ దర్భశయనం నేనూ కలిసి వాటిని ఎంపిక చేసాం.

ప్రారంభోత్సవ రోజు రానే వచ్చింది. 2005, నవంబర్ 21 న వైభవంగా నిర్వహించాం. కఫిసో కున్న సొంత 35 ఎం.ఎం, 16 ఎం.ఎం. ప్రోజేక్తర్లతో పాటు ఎల్సీడీ ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మంత్రి ఎం.సత్యనారాయణ రావు గారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పార్థసారధి గారు ప్రొజెక్టర్  గదిని ప్రారంభించారు. ఆనాటి సభకు పార్థసారధి అధ్యక్తత వహించగా ముఖ్య అతిథి మంత్రి సత్యనారాయణ రావు  మాట్లాడుతూ మంచి సినిమాలతో భారతీయ సంప్రదాయాల్ని కాపాడుకోవాలన్నారు. అప్పటి నగర మేయర్ ది.శంకర్, నారదాసు లక్ష్మన రావు, ఎన్.శ్రీనివాస్, కోలా రామచంద్రా రెడ్డి, నేనూ మాట్లాడాం. సభలో సావనీర్ ను మంత్రి ఆవిష్కరించగా, నేను నిర్మించిన డాకుమెంటరీ ని పార్థసారధి విదుల చేసారు. అనంతరం కఫిసో సీనియర్ సభ్యుడు శ్రీ రేణికుంట రాములును కఫిసో ఘనంగా సత్కరించింది. మిత్రుడు టి.దామోదర స్వామి వ్యాఖ్యానంతో సాగిన కార్యక్రమంలో దాతలకు కార్యవర్గానికి జ్ఞాపికలనిచ్చి సత్కరించాం. చివరన ‘kafiso a saga of film lovers’ documentary film ప్రదర్శించాం.

అట్లా కరీంనగర్ ఫిలిం సొసైటీ  సొంత ఆడిటోరియం కల సాకారమయింది. ఆ రోజు కేవలం కరీంనగర్ లోనే కాదు మొత్తం ఉమ్మడి రాష్త్రం లో ఫిలిం క్లబ్స్ కి ఎంతో ఆనందకరమయిన  రోజుగా చరిత్రలో నిలిచి పోయింది.

మంచి కళాత్మక సినిమాల కోసం వాటి ప్రదర్శన, విశ్లేషణ కోసం ‘ఫిలిం భవన్’ తోడుగా నిలబడాలని నేను కన్న కల అట్లా వాస్తవ రూపం దాల్చింది. కేవలం ప్రదర్శనే కాకుండా నవ యువతీ యువకులకు సినిమా నిర్మాణ రంగం లో శిక్షణ ఇచ్చే పని కూడా చేపట్టాలని అనుకున్నాం. ఆ దిశలో కొన్ని సంవత్సరాలు జాతీయ స్థాయిలో షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రోత్సవాలు నిర్వహించాం, ఫిలిం మేకింగ్ లో శిక్షణ కూడా ఇచ్చాం. ఆ వివరాలతో మళ్ళీ కలుస్తాను…

ఇప్పటికి సెలవ్…

-వారాల ఆనంద్          

19 మార్చ్ 20 23                   

24 frames 

Posted on

* విసరనయి* ( తమిళ చిత్రం )*

24 frames 

* విసరనయి* ( తమిళ చిత్రం )*

     ఏ కళయినా వర్తమాన సమాజానికి అద్దం పడుతుంది. విశ్లేషిష్తుంది. ధిక్కారంతో కామెంట్ చేస్తుంది. అప్పుడే ఆ కళ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కళ భావోత్తుంగ తరంగాల నడుమ తన భాధ్యతను నెరవేర్చినట్టవుతుంది. సినిమా కూడా కళ గా తన భాధ్యతను నెరవేరుస్తూనే వుంది. అత్యధిక శాతం వ్యాపార లక్ష్యాలతో సాగే సినిమా రంగం ఉత్తమ చలనచిత్రకారుల చిత్రాల ద్వారా తన భాధ్యతను కొనసాగిస్తూనే వుంది.

ప్రధానంగా వ్యవస్థ గురించి అందులోని అవలక్షణాలు దాష్టీకాల గురించీ సినిమా అనేక సార్లు వివరిస్తూనే వుంది. సమాజం లో అధికారం, బలం, ధనం గల వాళ్ళు పేదల పట్ల బడుగు జీవుల పట్ల వ్యవహరించే తీరుని మంచి సినిమా పట్టించుకుంటూనే వుంది. ఈ మొత్తంలో ప్రధానమయిన పోలీస్ వ్యవస్థ ఎట్లా వ్యవహరిస్తుంది, కింది వర్గాల పట్ల ఏ తీరున పని చేస్తుందన్నది ఇప్పటికే భారతీయ సినిమా రంగం అనేక చిత్రాల్లో దృశ్యీకరించింది.అర్ధ సత్య మొదలు పలు సినిమాల్లో పోలీసుల దాష్టీకాని కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇటీవలి మోహన్ లాల్ ‘దృశ్యం’, కమలహాసన్ ‘పాపనసమ్’ లాంటి సినిమాల్లో పోలీసుల తీరు తెన్నుల్ని చిత్రీకరించారు. అలాంటి మరో మంచి ప్రయత్నమే  తమిళ సినిమా ‘వీసారనై’ (Interrogation)

నేట్రిమారన్ దర్హకత్వంలో నిర్మించ బడ్డ ఈ సినిమా జాతీయ అవార్డులను అందు కోవడమే కాకుండా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలల్లో పాల్గొని ఆస్కార్ పోటీల్లో విదేశీ విభాగంలో భారతీయ సినిమాగా ఎంపికయి అందరి దృష్టినీ ఆకర్షించింది.

గతంలో బాలు మహేంద్ర దర్శ కత్వంలో రూపొందిన ‘నిరీక్షణ’ లో పోలీసుల తీరును చూపించినట్టే  వీసారనై లో కూడా పోలీసు వ్యవస్థ సామాన్య మనిషిని ఎట్లా చూస్తుందో వారిపట్ల ఎట్లా  వ్యవహరిస్తుందో వాస్తవికంగానూ  హృద్యంగానూ ఆవిష్కరించారు.

తమిళనాడు నుంచి ఆంధ్రాకు వలసవచ్చిన నలుగురు కూలీల పట్ల పోలీసుల అక్రమ అరెస్టు దుర్మార్గపు థర్డ్ గ్రేడ్ విచారణ అన్నీ వాస్తవికంగా ఆవిష్కరించారు. రచయితగా మారిన కొయెంబత్తూర్  కు చెందిన ఆటో డ్రైవర్ ఏం. చంద్ర కుమార్ తాను ఎదుర్కొన్న భయంకరమయిన అనుభవంతో రాసిన ‘లాకప్’ అన్న నవల లోని ప్రధాన అంశాన్ని తీసుకుని వీసారనై నిర్మితమయింది. నాలుగురు కూలీలు గుంటూరుకు వచ్చి కూలి చేసుకు బ్రతుకుతుంటారు. అదే ప్రాంతంలో డబ్బు అధికారం వున్న ఒక పెద్ద మనిషి ఇంట్లో దొంగలు పడతారు. పై నుంచి వచ్చిన వొత్తిడి తో ఎట్లాగయినా దొంగల్ని దొరకపుచ్చుకుని నేరాంగీకారాన్ని పొందాలనే ఆలోచనతో ఈ నాలుగుర్ కూలీలు పాండి( దినేష్), మురుగన్( మురుగదాస్), అఫ్జల్(సీలాంబరసన్ ), కుమార్(ప్రదీష్) లను అరెస్టు చేస్తారు. నేరాన్ని అంగీకరించమని తీవ్రయిన హింసకు గురి చేస్తారు. అమాయకులు బడుగు వర్గానికి చెందిన వారు, నోరు లేని వారు అయిన ఆ నలుగురు హింసను తాళ లేక నేరాన్ని అంగీకరిస్తారు. ఇదిలా వుంటే మరో వైపు కెకె అనే ఒక వైట్ కాలర్ నేరస్తున్ని ఎయిర్ కన్దీషన్ గదిలో ప్రశ్నిస్తూ వుంటారు. ఈ రెంటి నడుమా వున్న వైవిధ్యాన్ని దర్శకుడు వాస్తవికంగా చూపిష్తాడు. ఈ మొత్తం కథా కథనంలో లంచగొండులయిన పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు వారి అధికార ప్రతిపక్ష పార్టీలూ వాటి ప్రమేయాలు స్వార్థ పరత్వాలూ అన్నీ చూపిస్తాడు దర్శకుడు. న్యాయం కొంత,ఉద్యోగ భాధ్యత గా కొంత అని న్యాయంగా పనిచేసిన ముత్తువేల్ అన్న పోలీస్ అధికారి కూడా ఉన్నతాధి కారుల, రాజకీయ నాయకుల స్వార్థానికి బలయి పోతాడు. ఉత్త పుణ్యానికి ఏమి తెలియని కూలీలు కూడా భూటకపు  ఎన్ కౌంటర్ లో చంపివేయ బడతారు. సినిమా మొత్తం వాస్తవ కోణంలో విలక్షణమయిన చిత్రీకరణ శైలిలో నిర్మించ బడింది. వ్యాపార లక్షణాలున్నప్పటికీ పోలీసు వ్యవస్థ అసలయిన రూపాన్ని ఆవిష్కరించారు దర్శకుడు. పోలీసు హింసను కూడా సూత్రప్రాయమయిన ప్రతీకల ద్వారా చూపించి తన ప్రతిభను ప్రదర్శించాడు దర్శకుడు వెట్ర్రి మారన్ . తమిళ నటుడు ధనుష్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంశల తో పాటు అవార్డులూ రివార్డులూ అందుకుంది. నటులుగా దినేష్ రవి,సాముద్రికరన్ గొప్ప నతని ప్రదర్శించారు. సమస్తం వ్యాపారమే అయిన ఈ కాలపు సినిమా రంగం లో వచ్చిన విలక్షణ చిత్రం విసరనయి.

·         విసరనయి* దర్శకుడు-వెట్రిమారన్*సంగీతం-జి.వి.ప్రకాష్*

24 frames 
* విసరనయి* ( తమిళ చిత్రం )*

మూల రచయిత ప్రభావం అనువాదంలో పాఠకుని పై వుంటుంది

Posted on

మిత్రులారా, తంగేడు తెలుగు సాహిత్య పత్రికలో 16-31 మార్చ్ 2023 సంచికలో అచ్చయిన నా ఇంటర్వ్యు. వీలు చేసుకుని చదవండి. ఇంటర్వ్యు చేసిన డి.విజయ్ ప్రకాష్, అసిస్టంట్ ప్రొఫెస్సర్ ఇంగ్లిష్,
శాతవాహన విశ్వవిద్యాలయం గారికి, సంపాదకులు శ్రీ కాంచనపల్లి గారికి ధన్యవాదాలు -వారాల ఆనంద్
+++++++++++++++

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి, తెలంగాణ ముద్దు బిడ్డ శ్రీ వారాల ఆనంద్ ను కలవాలనే తలంపులతో ఇంటి తలుపు తట్టిన “తంగేడు”…
ప్రముఖ ఉర్దూ కవి, రచయిత, పద్మ భూషణ్ గుల్జార్ రాసిన “గ్రీన్ పోయెమ్స్” (2014) ను “ఆకుపచ్చ కవితలు” (2019) గా తెలుగులో అనువదించినందుకు 2022 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినందుకు అభినందనలు దీనిపై మీ అభిప్రాయం…

ఆనంద్: చాలా ఆనందంగా ఉంది. అవార్డు వచ్చినందుకు ఒకంత ఆశ్చర్యంగానూ ఉంది. నా మనసుతో మమేకమై ఈ అనువాధానికి పూనుకున్నాను. అవార్డు వస్తుందని ఊహించలేదు. నేను మొదటిసారి గుల్జారు రాసిన గ్రీన్ పోయెమ్స్ చదివినప్పుడు ఆయన అనుభూతులను తెలుగు వారితో పంచుకోవాలని ప్రయత్నించాను, దాని ప్రతిఫలమే ఈ పురస్కారం.

Q: మీరు రచయితగా, కవిగా మారటానికి నేపథ్యం?

A: నా చిన్నప్పటినుండి రేడియోలో పాటలు వినడం, పుస్తకాలు చదవడం జీవితంలో ఒక భాగమయిపోయింది. కరీంనగర్ లో బాల్యంలో మిత్రులతో, ఉర్దూ భాషతో మమేకమైనప్పుడు నాలో సాహిత్య సృజన మొదలయింది. ఆ తర్వాత పై చదువుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించినప్పుడు నందిని సిద్ధారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ మొదలైన వారి పరిచయం ఈ సృజనను ఇంకా పెంచింది. ఏదో చదవాలనే తలంపు పెరుగుతూ వచ్చింది, వివిధ రచనల మీద ఆసక్తి,అవగాహన పెరిగింది.

Q: సైన్స్ విద్యార్థి నుండి సృజనాత్మక రచయితగా మార్పు చెందడానికి కారణం?
A: మొదటి కారణం సామాజిక మార్పు, రెండోది నేను చాలా అంతర్ముకుడిని, నాలో నేనే సంభాషించుకునే వాడిని. పాత సినిమా పాటలు, సాహిత్యం, గొప్ప, గొప్ప రచనలు నాలోని కళాత్మక హృదయాన్ని, భావాలని బహిర్గతం చేయడానికి ప్రేరేపించాయి. దానిలో భాగంగా మొదటి సంకలనం “మినీ పోయెట్రీ”తో (1978 -80) మధ్య ప్రారంభించాను.

Q: కవిగా మీ సాహితీ ప్రస్థానం?
A: నా సాహిత్య మిత్రులు అలిశెట్టి ప్రభాకర్, వజ్జల శివ కుమార్, పీ.ఎస్.రవీంద్ర, జింబోలతో కలిసి “లయ” పేరుతో పుస్తకాన్ని ముద్రించాము. అది నాలోని కవి యొక్క పరినితిని పెంచింది. ఇప్పటివరకు దాదాపు నాలుగు కవిత్వ సంకలనాలూ వెలువరించాను, సుమారు 400కు పైగా కవితలు రాశాను.

Q: కవిత్వం నుండి అనువాదంలోకి రావడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

A: చదవడం ప్రారంభించిన తర్వాత ఎన్నో పుస్తకాలు ఉస్మానియాలో చదవడం, వాటిని ఆకళింపు చేసుకొని ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాను. అంతేకాకుండా,తెలుసుకోవడం అన్నది నా జీవిత స్వభావం కూడా. అంతే కాకుండా నాకు తెలిసింది అందరితో పంచుకోవడం అన్నది కూడా నేను ఆచరించే జీవన విధానం, ఈ స్వభావమే నన్ను అనువాదకునిగా మార్చింది. దానిలో భాగంగా “ఇరుగు-పొరుగు” అని శీర్షికతో వివిధ భాషల సాహిత్యాన్ని తెలుగులో అనువదించడం మొదలుపెట్టాను. ఇప్పడి వరకు దాదాపు 17 భారతీయ భాషలలోని అనేక మంది కవితల్ని తెలుగులోకి అనువదించాను. అట్లా అనువదించిన కవితలు వందకు పైగా వున్నాయి. అట్లా అనువదించడం వాళ్ళ నా పరిధి చాలా విస్తరించింది. విషయాల్లోనూ వ్యక్తీకరనల్లోనూ ఎంతో ఉపయుక్తమయిందనే అనుకుంటున్నాను. గతం లో విపుల లాంటి పత్రికలు నాలోని అనువాదకున్ని ప్రోత్సహించి నిలబెట్టాయి.

Q: మీ దృష్టిలో చక్కని అనువాదం అంటే ఏమిటి? దానిలోని కీలకమైన అంశాలు తెలియచేయగలరు.

A: అనువాదం యొక్క ప్రాథమిక లక్షణాలు రచయిత భావాలను పాఠకుని మనస్సుకు చేరవేయడం. అనువాదకుడు మూల రచయిత యొక్క కవితాత్మను, ఆయా కవితల రూపాన్ని, మూల కవి అభిప్రాయాలను, జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తే పాఠకుని దృష్టిలో అది మంచి అనువాదం. మూల రచయిత చెప్పాలనుకున్న సారాంశాన్ని అనువాదకుడు పాటకునికి అందించాలి. స్వంత భావాల్ని చొప్పించ కూడదు అని నేననుకుంటారు.

Q: సాధారణంగా అనువాదం అనేది ద్వితీయ శ్రేణి రంగానికి చెందినదంటారు సాహిత్యంలో, దీనిపై మీ అభిప్రాయం.
A: నా అభిప్రాయంలో అనువాదం లేకుంటే మానవ జీవితంలో పురోగతి కానీ అభివృద్ధి కానీ లేదు. ప్రాచీన గ్రీక్, రోమన్ సాహిత్యాలతో ప్రారంభిస్తే అనేక భాషా సాహిత్యాలూ, తాత్వికరచనలు అనువాదం వల్లనే మనకు లభ్యమవుతున్నాయి. ఫ్రెంచి, రష్యా మరియు పాశ్చాత్య సాహిత్యాలు మన జీవన విధానంలో చాలా మార్పులను తీసుకొచ్చాయి. అంతెందుకు, మన ప్రస్తుత రామాయణ, మహాభారత, భాగవతాలు కూడా అనువాదాలే. ఇకపోతే ఈమధ్య అనువాదాలు యాంత్రికంగా తయారవుతున్నాయి. అందువల్ల అనువాదం ద్వితీయ శ్రేణి అనే భావం కలగవచ్చేమో కానీ మూల రచయితకి పాఠకుడికి మధ్య సమన్వయ వారదే ఈ అనువాదకుడు. ఈ హెచ్చుతగ్గులు తగ్గాలంటే విశ్వవిద్యాలయాలు, పరిశోధన అధ్యయన కేంద్రాలు కొన్ని కార్యశాలలను మరియు అనువాద అవశ్యకతలపై, వాటి సమస్యలపై చర్చ-గోస్టులను నిర్వహిస్తే అనువాదంపై ఉన్న అపోహలను తొలగించకోవచ్చు.

Q: అనువాద రచనకు గుల్జార్ యొక్క ‘గ్రీన్ పోయెమ్స్’ ని ఎంచుకోవడానికి కారణం?

A: నా చిన్నతనం నుండి గుల్జార్ రచనల యొక్క ప్రభావం నాపై అపారంగా ఉంది. ఆయన పాటలు, మాటలు నన్ను ఎంతో మార్చాయి. డిగ్రీ వరకు నా ద్వితీయ భాష హిందీ కావడంతో ఈ ‘గ్రీన్ పోయమ్స్’ ని ఎంచుకున్నాను. నేను ఎం.ఏ. లో అభ్యసించిన తత్వశాస్త్రం, గుల్జార్ లోని తాత్విక వేత్త, పర్యావరణ ఆవశ్యకత గురించి ఆయన స్పందించిన తీరు, మానవ మరియు ప్రకృతి సంబంధాల గురించి శృషించిన శైలి నన్ను ఆకట్టుకుంది.
పువ్వు రాలిపోతూ కొమ్ముతో ఏమంటుంది/ చెట్టు కూలిపోతూ భూమితో ఏం చెబుతుంది /భూమి మళ్ళీ వస్తావు నేను బతికుంటే….

Q: మూల రచనకు/ రచయితకు అనువాదకుడు విశ్వాసపాత్రకుడుగా ఉండగలుగుతాడా?

A: అనువాదకుని పరిధి, బాధ్యత, రచయిత యొక్క భావాలను పాటకునికి చేరవేయడమే. రచయిత మూలభావాలను అనుసృజనగా మార్చి పాటకునికి చేరవేసే మహోన్నత బాధ్యత అనువాదకుల భుజస్కందాలపై ఉంది.

Q: మీరు ఆనందం కోసం పుస్తకాలు చదువుతారా లేక అనువాదం కోసం చదువుతారా? ఈ రెండిట్లో ఏమైనా బేధాలు ఉన్నాయా?

A: కవిత్వాన్ని చదవడం నా నీవితం లో ఒక అంతర్భాగమయి పోయింది. కవిత్వాన్ని ఎందుకు చదువుతారు అంటే చదవకుండా ఉండలేను కాబట్టి చదువుతాను. అధ్యయనం ఆనందం కూడా ఇస్తుంది. ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా అనువాదం కోసం చదవను.చదివే క్రమంలో నాకు బాగా నచ్చి నేను కదిలిపోయిన కవితల్ని అనువదిస్తాను. ఇష్టంగా చదివి అనుసృజన చేస్తే థాదాత్మీక ఆనందంతోపాటు సృజనాత్మక జ్ఞానాన్ని అందరికీ పంచడం జరుగుతుంది. దానిలో స్వల్ప భేదాలున్నప్పటికీ సాహిత్య తృష్ణ వాటిని మార్చి వేస్తుంది. భాషామార్పుతో అనేక ప్రయోగాలకు నాంది పలకడంతో పాఠకుడు సంతృప్తి చెందుతారు. నా వరకు అనువాదంతో కూడా అపరిమితమైన ఆనందం వస్తుంది.

Q: పాఠకులు, గుల్జార్ యొక్క సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడం సులభమేనా?

A: పాఠకుడు రచయిత మనసుతో మమేకం కావాలి. గుల్జార్ రచనలు అలతి అలతి మాటల్లో సాధారణంగా ఉండి ఉదాత్తమైన ఆలోచనలు కలిగిస్తాయి. ఆయన రచనలలోకి తొంగి చూస్తే వాటి యొక్క స్పర్శ మనల్ని తట్టి లేపుతుంది. ఠాగూర్ రాసిన “భాగ్ బన్” ను ఆయన అనువదించిన తీరు అద్భుతం. తనలోని భావుకతను అర్థం చేసుకుంటే మనకు దృశ్య కావ్యాలు ఆవిష్కృతమవుతాయి. ఆయన రాసిన “కలెక్టెడ్ పోయెమ్స్”, “నెగ్లెక్టెడ్ పోయెమ్స్”, “సస్పెక్టెడ్ పోయెమ్స్” మనల్ని వేరొక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

Q: స్వేచ్చానువాదాల వల్ల పాఠకులపై మూల రచయిత ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
A: సంకేతము మరియు వాటి తరంగాలు సమానమైతేనే మూల రచయిత ప్రభావం పాటకుడిపై బలంగా ఉంటుంది. ఇందులో స్వేచ్చానువాదాల పాత్ర కూడా తక్కువేమీ కాదు. అనువాదకుని ప్రతిభ, అతని యొక్క భాషా దర్శనం, పదాలు, పదజాలం మరియు పదబంధాలు పాఠకుని మనస్సులోకి చేరితేనే, పాటకుడు అనువాదకుని ద్వారా మూల రచయిత (కవి) యొక్క ప్రయాణంలో భాగమవుతాడు.
ఉ. దా:
కాలం నన్ను లాలిస్తుంది మురిపిస్తుంది/
పోతూ పోతూ కదిలిస్తుంది
కలల్ని నాటుకుంటూ నడిచిపోతుంది
నేనే నీళ్లు పోసి సాకాలి.

Q: కవితలనే మీరు అనువదిస్తారా? లేక నవలలు కూడానా?
A: కవిత్వం ఒక భావవేశంతో పుడుతుంది. దాని లక్ష్యం సమాజ మార్పు. అదే నవల యొక్క స్వభావము, పరిధి చాలా విస్తృతంగా ఉండటం వల్ల నా ప్రాధాన్యం కవిత్వానికి ఇచ్చాను. కొన్ని కథలు కూడా అనువదించాను. ప్రస్తుతానికి నవలలు అనువదించే ఆలోచన ఉన్నా, సమయానుకూలంగా ప్రయత్నించాలి. కవిత్వంలో ఉన్న గొంతుకు ప్రభావం ఎక్కువ. అది నూతన పోకడలకు నాంది పలుకుతుంది. సమాజ పరిణామ క్రమంలో కవిత్వం పాత్ర ఎక్కువని నా అభిప్రాయం.

Q: మీ దృష్టిలో అనువాదం అంటే అర్ధాన్ని అనువదించడమా? లేక భావాన్ని సమాచారం చేయటమా?
A: సాంకేతికంగా లేక ప్రయోగాత్మకంగా చూస్తే అర్ధాన్ని అనువదించి పాటకునికి చేరవేయడమే అనువాదం. కానీ సాహిత్య విలువల పరంగా చూస్తే కవితలు, పదాలు-పదజాలం కాదు, రచయిత యొక్క భావాల ప్రతిబింబాలు. ఆ భావాలు సమాజంలోని మార్పులకు సోఫానం కావడమే ముఖ్యం. అలాంటి అనువాద సాహిత్యాన్ని చదివాక కలిగే అనుభూతి చాలా ప్రత్యేకమైయినది.

“దుఃఖము చీకటి రెండూ ఒకటే/
దుఃఖంలో చీకటికమ్ముకు వస్తుంది/
చీకటిలో దుఃఖం రెట్టింపు అవుతుంది.

Q: మిమ్మల్ని మీరు ఎలా గుర్తిస్తారు? ఒక అభ్యాసకుడా, (వ్యాఖ్యాత) లేక అనువాదకుడిగాన?

A: కవిత్వంతో నా ప్రయాణం, నన్ను, నా లక్ష్యాలకు సమాంతరంగా తీసుకు పోతోంది. కొన్నిసార్లు అభ్యాసకునిగా, రచయిత భావాలకు వ్యాఖ్యాతగా మరియు అనువాదకునిగా కాలంతో పరిగెడుతూఉన్నాను. మొత్తానికి ఒక శ్రామికుడిగా, రైతుగా, సాహిత్య వ్యవసాయం చేస్తున్నానని గుర్తించవచ్చు. నా రచనలు ‘మనిషి లోపల’, ‘అక్షరాల చెలిమే’, “ముక్తకాలు” మరియు “సిగ్నేచర్ ఆఫ్ లవ్” నా గురించి పరిచయం చేస్థాయి.

Q : మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

A: ప్రస్తుతం జావిద్ అక్తర్ పోయెట్రీని మరియు మలయాళ కవి కే.సచ్చిదానందం కవిత్వాన్ని అనువదిస్తున్నాను. మిగతా భారతీయ భాషా కవుల కవిత్వాన్ని అనువదించే పని రోజూ కొనసాగుతూనే వుంది.

Q: మీ అనువాదాలకు ప్రేరణ లేక తోడ్పాటు ఎవరైనా ఉన్నారా?

A: నా అనువాదాలకు లేదా కవిత్వ రచనలకు తోడ్పాటు నా జీవిత సహచరి ‘ ఇందిర’. 2014లో నేను రాసిన “మనిషి లోపల” పుస్తకం తనకు అంకితం ఇచ్చాను. ఇట్లా రాసాను.. ‘కలిసి బతుకుదామని వచ్చి, నాకు జీవితాన్నే ఇచ్చిన ఇందిరకు’ అని

తను లేనిది నేను లేను. తనే నా అంతరంగం.

పొద్దస్తమానం అద్దంలోకి చూస్తూనే ఉంటాం/
అందం కోసమో… అలంకరణ కోసమో../
మన లోపలికి చూసుకోవడానికి తీరికే లేదు.

Q: భవిష్యత్ అనువాదకులకు మీ సందేశం

A: అనువాదకులకు భాష పై పట్టు, రచయిత మనసులోని భావము, అతని ఆలోచనల ప్రభావంపై స్పష్టత ఉండాలి. అప్పుడే అనువాదకుని బాధ్యత పూర్తవుతుంది. ఉదాహరణకి వేదన, బాధ, దుఃఖం లలో మూడు ఒకే రకమైన పదాలు కానీ వాటి భావాలు, అర్థం, పరిస్థితి, ప్రభావాలు వేరు, అనువాధకుడు వాటిని సమన్వయంగా సద్వినియోగం చేసుకోవాలి.

Q: “ఆకుపచ్చ కవిత్వం” పై మీ అభిప్రాయం…?
A: గుల్జార్ “గ్రీన్ పోయెమ్స్” ఒక కవిత సంకలనం, అది మనిషికి మరియు పర్యావరణానికి మధ్య ఉన్న అనుబంధాల గురించి, మనిషి వల్ల ప్రకృతిలో జరిగే మార్పులపై రాయబడ్డ మనోహరమైన కావ్యాల సమాహారం. మానవజాతి పర్యావరణంతో విడిపోతూ ఒంటరిగా చేస్తున్న ప్రయాణానికి అడ్డుకట్ట వేస్తూ ప్రకృతి ప్రాముఖ్యత గూర్చి మానవ మేధస్సులో నాటే సువిశాల మర్రి విత్తనమే ఈ గ్రీన్ పోయెమ్స్. ఇందులోని ప్రతి కవితా తంగేడు చెట్టులా మనిషి జీవన వికాసములో భాగమయ్యే తంత్రులుగా అభివర్ణించవచ్చు.

Q : వారాల ఆనంద్ పేరు సినిమాలతో, డాక్యుమెంటరీలతో, ఫిలిం క్లబ్లతో మమేకమైనదని కొందరంటారు. దీనిపై మీ వ్యాఖ్య:

A: భాషలో ప్రకృతి మరియు వికృతి లాగా, నాణేనికి బొమ్మ మరియు బొరుసు లాగ, మనిషికి జన్మ మరియు పునర్జన్మ ఉంటుందని భావిస్తాను. నాలోని బహిర్ముఖుడు -ఒక ఛాయాగ్రహకుడు, ఒక సినీ విశ్లేషకుడు, ఫిలిం క్లబ్ లతో మమేకమైన స్వాప్నికుడు అది ఒక పార్శ్వం …అదే నా జన్మ… మరియు అంతర్ముఖుడు రచయతగా, కవిగా, అనువాదకుడుగా సాహిత్య సాగు చేస్తున్నాడు. ఇది మరో పార్శ్వం, అది… నా పునర్జన్మ….కవిత్వం సినిమా నాకు రెండు కళ్ళు

సృష్టిలో రహస్యం ఏమిటి?/ పుట్టుక, చావు … /బతుకులో సారమేమిటి…. ఓటమీ… గెలుపూ….

ఇంటర్వ్యు – డి.విజయ్ ప్రకాష్, అసిస్టంట్ ప్రొఫెస్సర్ ఇంగ్లిష్,
శాతవాహన విశ్వవిద్యాలయం, Mobile:9885778585,

కన్నడ సాహిత్యానికి నవ్య రూపాన్నిచ్చిన “యు.ఆర్.అనంత మూర్తి”

Posted on

++++++++++++++++++ వారాల ఆనంద్

Friends, pl read my weekly column in ‘NETI NIJAM’ published today

Tq. Editor Baisa Devadas garu

కన్నడ సాహిత్యానికి నవ్య రూపాన్నిచ్చిన “యు.ఆర్.అనంత మూర్తి”

++++++++++++++++++ వారాల ఆనంద్

‘ఏకాంతంలో వేటినయితే నమ్ముతామో వాటిని గురించి బహిరంగంగాచెప్పే సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మనం మనతోనే అబద్దాలు చెబుతూ పోయేంతగానే కాక ఆ అబద్దాన్ని నమ్ముతూ పోయేంత గా కూడా పథ భ్రష్టుల మైపోతే ఇక మనల్ని ఎవరూ రక్షించలేరు’

“కళాకారుడు ఒక గోరిల్లాయే కాక ఒక ధర్మయోధుడు కూడా” అన్నాడు యు.ఆర్.అనంతమూర్తి

“ ఏ కళ అయినా తనభాషను తానే ఎంచుకుంటుంది.. తాను భారతీయుడిని కనుక నా రచనలు భారతీయ భాషలోనే సాగాయి.” కాలము స్మృతి ఈ రెండూ ఆయన సృజనాత్మక జీవితం లో ప్రధాన భూమికను పోషించాయి

అనంతమూర్తి పశ్చిమకర్ణాటకకు చెందిన మధ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయన 1932 డిసెంబర్ 21 నా కర్ణాటకలోని షిమోగా జిల్లా లోని తీర్తహల్లి తాలూకాలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామంలోని సాంప్రదాయ సంస్కృత పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. అక్కడ ప్రాథమిక విద్య అనంతరం, తిర్థహళ్ళి, మైసూరులో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. మైసూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్లభాషలో ఎం.ఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఉన్నత విద్యకై ఇంగ్లాండుకు వెళ్ళాడు. కామన్ వెల్త్ విద్యార్థి వేతనానికి అర్హుడై, 1966లో ఇంగ్లీషు, సాహిత్యంలో పీ.హెచ్.డి. పొందారు[3]

మధ్వ బ్రాహ్మణ కుటుంబాల్లో ఆచారాలు కాలక్రమంలో ఎట్లా సంకుచితంగానూ, అమానుషంగానూ మారిపోయాయో ఆయన తన సాహిత్యమంతటా ఎత్తిచూపుతూ విమర్శిస్తూ వచ్చాడు. కాని ఒక చింతనావైఖరిగా ఆయనలో మాధ్వం బలంగా మిగిలి ఉండటమే కాక ఆయన్ను చివరిదాకా నడిపించిందనే చెప్పాలి..మరో గొప్ప కన్నడ రచయిత, మహాకవి కువెంపు కూడా ఆ తాలూకా వాడే. పర్వత ప్రాంతమయిన మాలేనాడు లో జన్మించిన ప్రతిభా సంపంనులయిన ఆ ఇద్దరు రచయితలూ వేర్వేరు కాలాల్లో ఈశాతాబ్దపు గొప్ప కన్నడ సాహిత్యానికి నవ్య రూపాన్నిచ్చారు. కువెంపు ‘నవోదయ ఉద్యమ సతాపకుల్లో ఒకరు కాగా ‘నవ్య ఆధునిక వాదాన్ని’ అనంత మూర్తి ముందుకు నడిపించారు. అనంతమూర్తి కువెంపు, శివరామకారంత్ లాంటి మహా రచయితలు రూపొందించిన కన్నడ సాహిత్యానికి వారసుడిగా నిల బడ్డాడు. అనంతమూర్తి తండ్రి ఉడిపి రాజగోపాలచార్య, తల్లి సత్యమ్మ (సత్యభామ) ఉడుపి రాజగోపాలాచార్య అనంతమూర్తి (1932-2014) ఇరవయ్యవ శతాబ్ది ఉత్తరార్థంలో భారతీయ సాహిత్య ప్రపంచంలో అగ్రశ్రేణి సాహితీకారుడిగా గుర్తింపు పొందాడు. ఆయన 1965 లో రాసిన సంస్కార నవలని 1970 లో పఠాభి తెరకెక్కించడం, ఆ సినిమాకు అవార్డులతో పాటు సంచలనాలు కూడా సొంతం చేసుకోవడంతో అనంతమూర్తికీ, నవ్య కన్నడ సాహిత్యానికీ దేశంలోనే కాక ప్రపంచంలో కూడా ప్రశస్తి రావడం మొదలయ్యింది.

అనంతమూర్తి 6 నవలలూ, 42 కథలూ, ఒక నాటకం, 5 కవితాసంపుటాలు, ఒక నాటకం, 5 వ్యాస సంపుటాలు వెలువరించారు.

మైసూరు విశ్వవిద్యాలయం లో ఉన్నత విద్యనూ అభ్యసించిన తర్వాత 1956 లో అక్కడే ఇంగ్లీషు విభాగంలో ఉపాధ్యాయుడిగా పని ప్రారంభించాడు. తర్వాత బ్రిటన్ లోని బర్మింఘం విశ్వవిద్యాలయం లో పీ.హెచ్.డీ చేసారు. తర్వాత మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెస్సర్ గానూ, శివాజీ, అయోవా విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గానూ వున్నారు. తర్వాత కొట్టాయం లోని మహాత్మా గాంధి విశ్వద్యాలయానికి వైస్ చాన్సెలర్ గానూ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కు అధ్యక్షుడి గానూ అనంత మూర్తి పని చేసారు. తర్వాత కేంద్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షుడి గానూ పనిచేసారు.ఇట్లా ఆయన నిర్వహించిన పదవులన్నింటి కంటే ఆయన గొప్ప స్నేహ శీలి. ఆయన స్నేహితుల్లో ఆశిష్ నంది, మను చక్రవర్తి, గిరీష్ కాసరవెల్లి, శివ విశ్వనాథన్ లాటి ఎందఱో వున్నారు. కే.వి.సుబ్బన్న తో కలిసి “హేగ్గోడు” గ్రామంలో ఏర్పాటు చేసిన “నినాసం” గొప్ప కృషి. అర్థవంతమయిన సినిమాకు, నాట కానికి అదొక గొప్ప గ్రామీణ వేదిక. ఆయన రచనలు అనేక భారతీయ భాషల్లోకె కాకుండా ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్,జర్మన్, బల్గేరియన్, తదితర అనేక ప్రపంచాభాశాల్లోకి అనువాదం అయ్యాయి.

అనంతమూర్తి ఆధునికులతో సంప్రదాయం గురించీ, సంప్రదాయవాదుల్తో ఆధునికత గురించీ మాట్లాడతాడు. ఇరువర్గాలవారూ తమ తమ దృక్పథాల్లో ఎంత సంకుచితంగా ఉన్నారో ఎత్తిచూపుతాడు. తమ self లో కూరుకుపోయినవాళ్ళకి other అంటూ ఒకటుందనీ, ఆ ఇతరాన్ని తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన, దానికింత చోటు ఇవ్వవలసిన అవసరముందనీ వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.

శాస్త్రీయ, సామాజిక విశ్లేషణకి రూపకలంకారాన్ని వాడుకోవడం అనంతమూర్తిలో మరో గొప్ప విశేషమని అందరూ అంగీకరించిందే. సోదాహరణంగా సత్యాన్ని వివరించడం కొత్తకాదు. ప్లేటో ఈ పనిచేసాడు. ప్రాచీన భారతీయ దార్శనికులు ఘటపటాదుల్తో ఇదే చేసారు. అయితే నువ్వెంచుకునే రూపకాలంకారం ఎంత స్థానికంగా, ఎంత సమకాలికంగా ఉంటే అదివ్వగల స్ఫూర్తి అంత తీవ్రంగా ఉంటుంది. మానవ చైతన్యంలోని అవస్థలని వివరించడానికి రామకృష్ణ పరమహంస బెంగాల్లోని మిద్దె ఇంటిని ఉదాహరణగా వాడుకున్నప్పుడూ, కంటి ముందు కనిపించే దృశ్యం అనిత్యమని చెప్పడానికి రమణమహర్షి సినిమాతెరను ఉదాహరణగా చెప్పినప్పుడూ ఆ రూపకాలంకారాలు శక్తివంతంగా కనిపించింది అవి వారి వారి స్థానికతనుంచీ, సమకాలిక వాస్తవికతనుంచీ రావడమేకారణం. ఆ పద్ధతిలోనే అనంతమూర్తి భారతీయ సభ్యతలోని రెండుముఖాల్ని వివరించడంకోసం ఇంటిముంగిలి-పెరడు (front yard-backyard) అనే రూపకాన్ని ఎంతో ప్రజ్ఞతో వాడుకున్నారు. ఆ ఒక్క ఉదాహరణద్వారా ఆయన భారతీయ సభ్యతకీ,సంస్కారనికీ, భాషాప్రయోగానికీ,సాహిత్యానికీ, ఎన్నింటినో వివరించే ప్రయత్నం చేసారు.

ఆయన రచనల్లో విశిష్టమయినది సంస్కార నవల. అది సినిమాగా రూపొంది గొప్ప పేరును పొందింది అంతే వివాదాన్నీ కష్టాన్నీ ఎదుర్కొంది. కథ విషయానికి వస్తే

నారాయణప్ప అనే బ్రాహ్మణుడు తాను నిర్వహించే బ్రాహ్మణ విధులన్నింటినీ మానేసి మద్యమాంసాలకు అలవాటు పడతాడు. భగవధారాధన విడిచి పెట్టి వేశ్యతో సహజీవనం చేస్తాడు. అలా జీవిస్తూ అతను మరణిస్తాడు. అటువంటప్పుడు బ్రాహ్మణ ఆచారాల ప్రకారం అతనికి దహన సంస్కారాలు చెయ్యవచ్చునా? చెయ్యకూడదా? అన్నది ఆ అగ్రహారంలో పెద్ద్ద సమస్యయి కూచున్నది. గ్రామంలోని బ్రాహ్మణులంతా కలిసి తమ నాయకుడు, గౌరవనీయుడు, పండితుడూ అయిన ప్రాణేశాచార్యను సలహా ఆడుగుతారు. ప్రాణేశాచార్య సంధిగ్ధంలో పడతాడు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం మీద ఇంకో వ్యక్తికి ఎంతవరకూ హక్కున్నది? గ్రంధాలు, పుస్తకాలు తిరిగేసినా అతని కేమీ పరిష్కారం కనిపించలేదు. ప్రాణేశాచార్య వైవాహిక జీవితం సుఖమయం కాదు. వివాహమైనప్పట్నుంచి అతని భార్య రోగిష్టిగానే వున్నది. నారాయణప్ప భౌతిక దేహం ఇంకా అలా వుండగానే అతను, ఆ వెలయాలితో తటస్థపడి, ఆమెను అనుభవించాడు. తానేం చేశాడో ప్రాణేశాచార్య తెలుసుకున్నాడు. పాప పంకిలమైన బాట మీద జీవిస్తూ ధర్మశాస్త్రాలు వల్లిస్తూ నీతులు చెప్పడం సంస్కారం కాదనుకున్నాడు. నారాయణప్పకు అంత్యక్రియలు జరపడానికి నిర్ణయించుకుంటాడు. స్థూలంగా అది కథ. ఆ నవలను ఆధారం చేసుకుని సినిమా రూపొందింది. ఈ సినిమా తీసిన తిక్కవరపు పఠాభిరామిరెడ్డిది నెల్లూరు. ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలోను, రవీంద్రనాథ్ టాగూర్ వద్ద శాంతి నికేతన్ లోను చదివాడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఇంగ్లీషు లిటరేచర్ చదివాడు. న్యూయార్క్ లోని మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ లో సినిమాల గురించి చదివాడు.

పెళ్లినాటి ప్రమాణాలు,శ్రీకృష్ణార్జున యుద్ధము మొదలైన చిత్రాలను నిర్మించిన జయంతి సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు. వాస్తవిక చిత్రాలను, ప్రయోజనాత్మకమైన చిత్రాలను రూపొందించాలన్న తపన ఉండడంతో ఆ దిశలో ఆలోచన మొదలు పెట్టాడు. నిర్మించాలన్న ఉద్దేశం ఇతడికి ఉండేది. అపుడు కన్నడలో విశేష సంచలనానికి గురయిన ‘సంస్కార’ నవల గురించి విని దానిపైన సినిమా తీయాలని అనుకున్నాడు.

కన్నడ నేపధ్య వున్నకథ కాబట్టి, కన్నడ ప్రాంతంలో విశేష ప్రచారంలో ఉన్న నవల కాబట్టి సినిమాను కూడా కన్నడ భాషలో నిర్మించాలని పఠాభి భావించాడు. “మెడ్రాస్ ప్లేయర్స్” అనే నాటక సంస్థలోని అమెచ్యూర్ కళాకారులతో ఈ సినిమాను నిర్మించాలని నిర్ధారణకు వచ్చాడు. ఆ సంస్థ సభ్యుడైన గిరీష్ కర్నాడ్ ను హీరో గా తీసుకోవడమే కాక ఆయనతోనే సంభాషణలు, స్క్రీన్ ప్లే వ్రాయించాడు. కథా నాయికగా తిక్కవరపు పఠాభి రామిరెడ్డి భార్య “స్నేహలతా రెడ్డి” నటించారు. సింగీతం శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా నిర్మాణానికి లొకేషన్ కు అనువైన స్థలంగా శృంగేరీ పీఠానికి సమీపంలో ఉన్న వైకుంఠపురం అనే గ్రామాన్ని ఎన్నుకున్నారు. అయితే ఆ గ్రామంలో షూటింగు జరుపుకోవడానికి శృంగేరీ పీఠాధిపతి శంకరాచార్య అనుమతి కావాలి. అది అంత సులభంగా లభ్యం కాలేదు. మొత్తానికి పీఠాధిపతి అనుమతితో ఆ గ్రామంలో, గ్రామ పరిసరాలలో షూట్ చేసి 20 రోజులలో చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ చిత్రానికి టామ్‌కోవన్ అనే ఆస్ట్రేలియన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో సెట్లు లేవు. ఏ నటునికి మేకప్ వేయలేదు. ఏ పాత్రకైనా గడ్డం పెరగవలసి వస్తే ఆ నటుడికి గడ్డం పెరిగే వరకూ నిరీక్షించారే కాని ఎవరికీ ఎక్కడా గడ్డం అతికించలేదు. ఈ చిత్రంలో పాటలు లేవు. కాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఉంది. ఈ సినిమాకు రాజీ తారానాథ్ సంగీతం చేకూర్చాడు. కేవలం మూడు వాయిద్యాలను మాత్రమే నేపథ్య సంగీతంలో వాడారు. ఈ సినిమాని కేవలం లక్ష 20 వేల రూపాయల బడ్జెట్ తో రూపొందించారు.

సంస్కార సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఒక కులానికి సంబంధించిన కథ అని అభ్యంతరం చెప్పారు. విడుదలకు అనుమతులు నిరాకరించారు. బొంబాయిలోని సెన్సార్ బోర్డుకు ఈ సినిమాను పంపారు. అక్కడ కూడా ఈ సినిమా ప్రదర్శనకు అనువుగా లేదని తీర్పు ఇచ్చారు. అప్పుడు పార్లమెంటు సభ్యుడుగా వున్న నటుడు కొంగర జగ్గయ్య అప్పటి సమాచారశాఖా మంత్రి దగ్గరకు నిర్మాత పఠాభిరామిరెడ్డిని తీసుకుని పోయి పరిచయం చేశాడు. ఐ కే గుజ్రాల్ కు ఈ సినిమాను చూసి బాగా నచ్చింది. అదే సమయంలో బెంగళూరులో ఈ సినిమాపై నిషేధం ఎత్తివేయాలని విద్యార్థులు సమ్మెకు దిగారు. మేధావులు, కవులు ప్రభుత్వానికి విన్నపం చేశారు. ఈ సినిమా గురించి పార్లమెంటులో ఒకరోజు చర్చ జరిగిన తరువాత ఒక్క కట్ కూడా లేకుండా ప్రదర్శనకు అనుమతి లభించింది. అయితే ఎ సర్టిఫికెట్ లభించింది. చిత్ర నిర్మాణం పూర్తయ్యాక సంవత్సరానికి ఇది సెన్సార్ ఇబ్బందులను అధిగమించి విడుదల అయ్యింది[2]. ఈ సినిమా ఆర్థికంగా విజయవంతమయ్యింది. సంస్కార సినిమాకు జాతీయ ఉత్తమ సినిమా అవార్డు తో పాటు రాస్ర స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. అదొక చారిత్రాత్మక సినిమాగా మిగిలింది.

సుదీర్ఘ వచనం’ సమగ్ర జీవితాన్ని చూపిస్తుంది. సమస్య సమగ్రతను చూపుతుంది. ఒక చారిత్రక సందర్భాన్ని సమూలంగా చర్చిస్తుంది. అనుభూతినో, ఆలోచననో, దర్శనాన్నో, వికాసాన్నో అది ప్రతిపాదిస్తుంది. సుదీర్ఘ వచనం కలిగిన ‘నవల’ ఆ పని చేస్తుంది. ఒక రచయిత తాను రచయితనని నిరూపించుకోవడానికి నవల రాయాలని పాశ్చాత్యులు భావిస్తారు. పాశ్చాత్యులకు నవల ప్రియ పఠన వచనం. నేటికీ అమెరికా, యూరప్‌లలో నవలకు ఉన్న గిరాకీ హ్రస్వ వచనం కలిగిన కథకు లేదు. అంతర్జాతీయ అవార్డులు, నోబెల్‌ బహుమతి నవలను పరిగణించినట్టుగా ఇతర వచనాలను పరిగణించవు. ఆ విధంగా పోల్చి చూసినప్పుడు తెలుగు నవల ప్రయాణం ఎత్తు పల్లాలను చూస్తూ ముందుకు సాగుతోంది. పాశ్చాత్యులకు యుద్ధం ఒక ప్రధాన నవలా వస్తువు. లైంగిక వ్యామోహాలు కూడా. కాని తెలుగు నవల ఆదర్శాన్ని తన ఆత్మగా స్వీకరించింది. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి ఉద్దండులు ఒజ్జలుగా మారి తెలుగు నవలా బాటలు వేశారు. ఆ తర్వాత గుడిపాటి చలం, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, ఒద్దిరాజు సోదరులు, సురవరం, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య తదితరులు ఆ బాట లను విశాలం చేస్తూ అశ్వ రథాలను, ఏనుగు అంబారీలను నడిపించారు. ఆపై స్త్రీలు ఆ రచనా కళను హస్తగతం చేసుకున్నారు. రంగనాయకమ్మ పురోగామి నవలకు ఆధార కేంద్రం నిర్మించారు. వాసిరెడ్డి సీతాదేవి నవల ‘మరీచిక’ నిషేధం పొందే స్థాయిలో నవల శక్తిమంతం అయ్యింది.

నవల ఏం చేసిందంటే భాషను పాఠకులకు పరిచితం చేసింది. అక్షరాస్యత పట్ల ఆసక్తి పెంచింది. జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పింది. సంస్కరణ అభిలాషను పాదుకొల్పింది. చారిత్రక ఘటనలను రీప్లే చేసింది. తాత్త్విక దృష్టిని అలవర్చింది. సామాన్యుడికి అతడి బలహీనతలు బలాలు తెలియచేసింది. గోపిచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, వడ్డెర చండీదాస్‌ ‘అనుక్షణికం’, రావిశాస్త్రి ‘అల్పజీవి’, కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’, భాస్కరభట్ల కృష్ణారావు ‘వెల్లువలో పూచికపుల్లలు’, నవీన్‌ ‘అంపశయ్య’, శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’… ఇవన్నీ నవీన వస్తు శిల్పాలతో పాఠకులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అట్లే అనంత మూర్తి రచనలూ గొప్ప ప్రభాన్ని చూపించాయి. కాలాతీతంగా చూపిస్తూనే వుంటాయి. ఆ మహా రచయిత పైఅన గిరీష్ కారవెల్లి రూపొందించిన డాక్యుమెంటరీ సినిమా విలక్షణ మయింది. కేవలం అనంతమూర్తి జీవిత చరిత్ర కాకుండా ఆయన భావాల ఆవిష్కరణ గాసాగుతుంది. ‘యు.ఆర్. అనంతమూర్తి.. నాట్ ఏ బియోగ్రఫీ.. అ హైపోతిసిస్’ అన్న ఈ డాక్యుమెంటరీ చూసింతర్వాత మన తెలుగులోని గొప్ప కవుల రచయితల, సృజనకారులపైన అలాంటి ఒక్క ఫిలిం రాకపోవడం పట్ల అత్యంత బాధ కలుగుతుంది.

– వారాల ఆనంద్

15 మార్చ్ 2023

బహుముఖీన సృజన శీలి – దీప్తి నావల్+++++++++ వారాల ఆనంద్

Posted on

Friends, Pl read my weekly column published today in ‘NETI NIJAM’ , thanks to the editor Baisa Devadas garu -Varala Anand

బహుముఖీన సృజన శీలి – దీప్తి నావల్
+++++++++ వారాల ఆనంద్

దీప్తి నావల్ అనగానే మనకు మన దేశంలో 1980లలో ఎగిసి విరిసిన నవ్య సినిమా ఉద్యమం గుర్తొస్తుంది. ఆ సినిమాల్లో నటించిన నటీ నటులు గుర్తొస్తారు. నసీరుద్దీన్ షా, ఓం పూరి, ఫరూఖ్ షేఖ్, నటీమణులు స్మితాపాటిల్, షబానా ఆజ్మీ, అపర్ణా సేన్ లాంటి వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళందరితో పాటు దీప్తి నావల్ గుర్తొస్తుంది. వివిధ భాషల్లో వంద సినిమాలకు పైగా నటించిన దీప్తి మంచి నటే కాదు మంచి కవి, రచయిత, ఫోటోగ్రాఫర్, పేయింటర్ కూడా. మొత్తంగా మంచి కళాకారిణి. ఆమె సినిమాలనగానే “చస్మే బద్దూర్” లో దీప్తి పోషించిన మిస్ చంకో వెంటనే స్పురణలోకి వస్తుంది, “కథ” లోని సంధ్య సబ్నిస్, “దామూల్” లోని మహాత్మాయి జ్ఞాపకం వస్తారు. అంతే కాదు ఇంకా అనేకానేక పాత్రలు గుర్తొస్తాయి. అయితే ఆమె తన కారీర్ లో తాను ఎంపిక చేసుకున్న పాత్రలు మాత్రమే చేసింది. లేకుంటే ఆమె చేసిన సినిమాల సంఖ్య వందకంటే ఇంకా చాలా ఎక్కువగా వుండేది. అట్లా ఆమె నటిగా తనదయిన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. సమాంతర సినిమాలతో పాటు మధ్యేవాద సినిమాల్ని కూడా దీప్తి చేసారు.

అయితే ఆమె కేవలం నటే కాదు మంచి కవి, కథా రచయిత్రి కూడా. దీప్తి నావల్ కవిత్వం ఇప్పటికి రెండు సంకలనాలు వెలువడ్డాయి. మొదటిది “ లమ్ హా.. లమ్ హా” , రెండవది “బ్లాక్ విండ్ అండ్ ఆదర్ పోయెమ్స్” . ఈ రెండు సంకలనాలూ సాహిత్య ప్రపంచంలో మంచి పేరు గడించాయి. “బ్లాక్ విండ్ అండ్ ఆదర్ పోయెమ్స్” పుస్తకానికి ప్రసిద్ద కవి గుల్జార్ ముందు మాట రాసారు. అందులో ఆయన ఇట్లా అంటారు… “ దీప్తి నావల్ ఆలోచనలు హృదయం లోనూ, ఆమె హృదయం ఆలోచనల్లోనూ వుంటాయి. ఆమె ప్రతి విషయాన్నీ రెండేసి సార్లు అనుభవం లోకి తీసుకుంటుంది. మొదటిసారి ఆ సందర్భంలోకి వెళ్లి సంపూర్ణంగా అనుభూతిస్తుంది, రెండవసారి ఆమె దాన్ని వడపోసి సారాంశాన్ని కవితగా మార్చి పునర్జీవింపజేస్తుంది” దీప్తి నావల్ కు కవిగా గొప్ప కవి ఇచ్చిన ప్రశంసగా దాన్ని తెసుకోవచ్చు. ఇక దీప్తి మంచి కథా రచయిత్రి కూడా. ఆమె రాసిన కథలతో “మాడ్ టిబెటన్-స్టోరీస్ ఫ్రం దెన్ అండ్ నౌ “ అన్న కథా సంకలనం వెలువడింది. అమే కథలన్నీ వాస్తవ జీవితానుభవాలనుండే రాసింది. చాలా కథలు తాను తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఇతివృత్తాలుగా తీసుకుని రాసింది. మరి కొన్నింటిని తన మిత్రులు దగ్గరి వాళ్ళు చెప్పిన వారి వారి అనుభవాల ఆధారంగా రాసింది. అయితే అవన్నీ కేవలం కథ చెప్పడం లాగా కాకుండా సృజనాత్మకతను జోడించి స్క్రీన్ ప్లే లాగా వుంటాయి. అవి చదువుతూ వుంటే దాదాపుగా సినిమా చూస్తున్న అనుభవమే కలుగుతుంది. కేవలం ’మార్నింగ్ ఆఫ్టర్’ కథ మాత్రం కల్పిత కథ. ముఖ్యంగా ఆమె రాసిన ‘తుల్లీ” కథ చాలా గొప్ప వాస్తవిక కథ. బాంబే లోని రెడ్ లైట్ ప్రాంతంలో ఒక యువతీ కథ అది. మొదట ఒక సినిమా స్క్రిప్ట్ ను విజయ్ టెండూల్కర్ దీప్తి కిచ్చాడు. దాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. దానికి ముందు రెడ్ లైట్ ప్రాంతంలో కొంత రిసర్చ్ చేయాలని తల పోసి కొందరు మిత్రులతో కలిసి ఆ ప్రాంతంలో రాత్రుళ్ళు తిరిగింది దీప్తి. అక్కడ చూసిన సంఘటనలు, అక్కడి యువతుల అనుభవాలు చూసి చలించిపోయిన దీప్తి తుళ్ళి కథ రాసారు. అత్యంత సహజంగా, అక్కడి వాళ్ళ భాష, జీవితమూ అన్నీ ఈ కథ లో ఆవిష్కరించ బడ్డాయి. సినిమా నిర్మాణం అటుంచి కథ గొప్ప పేరును సంపాదించుకుంది. ఇక మరో ముఖ్యమయిన కథ దీప్తి రాసిన ఇద్దరు మగవాళ్ళ కథ.

ఆ కథను ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన అనుభవంగా దీప్తికి చెప్పాడు. ఓక యువకుడు సినిమాల మీద వ్యామోహంతో మొట్ట మొదటిసారిగా బాంబే బయలు దేరతాడు. రైల్లో ప్రయాణిస్తూ వుండగా అతన్ని మరొక సహప్రయాణికుడు చాలా సేపు పరిశీలించి మాట కలుపుతాడు. ఎక్కడి వెళ్తున్నాడో ఏమి చేయాలనుకున్తున్నాడో లాంటి వివరాలన్నీ అడుగుతాడు .ఆ యువకుడి విషయం తెలుసుకుని తనతో రమ్మని వసతి కల్పిస్తానని తీసుకెళతాడు. ఇంటికీ వెళ్ళిన తర్వాత ఆతని భార్య ఈ యువకున్న వ్యామోహానికి గురిచేస్తుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. ఇదంతా జరుగుతుండగా ఇంటతను బయట మంచంలో పడుకునే ఉంటాడు. అంటే అతను నపుంసకుడు. యువకున్ని తన భార్యకోసం తీసుకుచ్చాడు. అతనికి తన భార్య అంటే చాల ఇష్టం. ఆమెను వదులుకోలేడు. అట్లని కోరికల్నుంచి ఆమెను దూరం చేయలేదు. అందుకోసమే ఇదంతా చేస్తాడు. కథను నడిపించిన తీరు చాలా గొప్పగా వుంటుంది. జరిగిన కథే అయినా తన సృజనాత్మకతతో కథను నడిపించిన తీరు.. ఆ ఇద్దరు పురుషుల మనస్తత్వాలూ, పురుష కోణం లోంచి బాగా రాసారు దీప్తి. ఇట్లా కథలన్నీ పూర్తి స్థాయిలో ఉత్తమ కథకుడు రాసినట్టే వున్నాయి.

ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే దీప్తి ఓక రోజు టాటా సుమో తీసుకుని బయలు దేరి లడఖ్ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడి అందమయిన దృశ్యాల్ని అక్కడి మనుషుల్నీ తన కెమెరా లో బంధించింది. ఫలితంగా “ఇన్ సర్చ్ ఆఫ్ అనదర్ స్కై” అన్న ఫోటోగ్రఫీ ప్రదర్శన ఏర్పాటయింది. ఆ ఫోటోలు మామూలుగా కాఫి టేబుల్ బుక్ లోని ఫోటోల్లాగా కాకుండా మనసుకు హత్తుకునే వెంటాడే ఫోటోలుగా వుంది మంచి పేరు తెచ్చుకున్నాయి.

దీప్తి నావల్ కి ‘కళ’ ఏ రూపంలో వున్నా ఆసక్తే. అందుకే 1996లో ఒక సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ చేసింది. అవన్నీ కళాకారుల్లో ఎంతో ఆసక్తిని కలిగించాయి. మంచి ప్రశంసల్ని అందుకున్నాయి. అందుకే ఏ ఒక్క కళా రూపానికో పరిమితం కాలేను అంటారామె. అందుకే దీప్తి సృజన రంగంలో భిన్నమయిన దారుల్లో పయనిస్తున్నారు. ఇంత భాహుముఖీన మయిన సృజనను ప్రదర్శిస్తున్న దీప్తి నావల్ ‘ తనకు నటనతో సహా అన్ని కళారంగాలు ప్రేరనాత్మకంగానే వుంటాయి అంటారు. నటన గొప్పదే కానీ దానిలో ఆయా సినిమాల రచయితల, దర్శకుల ఆలోచనలు అనుభవాలూ కలిసి వుంటాయి.. అయినప్పటికీ మంచి నటులకు వాటిల్లో కూడా ఎంతో కొంత స్వీయ జీవితానుభవాలు కల్సి పోతాయి అంటారామె. కానీ రచనలలోనే స్వంత హృదయం ఉంటుంది అన్నది ఆమె అభిప్రాయం.

దీప్తి నావల్ ౩ ఫిబ్రవరి 1952లో పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. అమృత్ సర్ లోని సేక్రేడ్ హార్ట్ సెకండరీ స్కూలు లో స్కూల్ ఫైనల్ పూర్తి చేసారు. తర్వాత ఆమె అమెరికా వెళ్ళారు. న్యు యార్క్ లోని హంటర్ కాలేజ్ ఆఫ్ సిటీ యునివర్సిటీ లో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసారు. డిగ్రీలో పేయింటింగ్ ప్రధాన అంశంగా నూ ఇంగ్లీష్, సైకాలజీ లు ద్వితీయ అంశాలుగా తీసుకున్నారు. దీప్తి తండ్రి గారు ఉదయ్ నావల్ ప్రొఫెస్సర్ గా పని చేసారు. తల్లి హిమాద్రి గంగాహర్ ఉపాధ్యాయురాలిగానూ, పెయింటర్ గానూ కృషి చేసారు. ఆమెకు ఒక సోదరుడు రోహిత్ నావల్, సోదరి స్మితి నావల్ వున్నారు.
ఆమె సృజనాత్మక జీవితం మొదట నాటక రంగం లో మొదలయింది. ఒక రోజు ఆడిషన్ కోసం ఆమె దూరదర్శన్ స్టూడియోకు వెళ్ళారు. అక్కడ ప్రముఖ నటుడు టీవీ హోస్ట్ ఫరూఖ్ షేఖ్ ను కలిసింది. ఇద్దరూ కలిసి ఫరూఖ్ అన్న కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది. తర్వాత ఫరూఖ్ షేఖ్ ఇచ్చిన సమాచారం తో దీప్తికి వినోద్ పాండే రూపొందించిన “ఏక్ బార్ ఫిర్’ లో ముఖ్యాభినేతగా నటించే అవకాశం వచ్చింది. అట్లా ఆమె హిందీ లో నటించిన మొదటి అమెరికన్ ఇండియన్ నటి గా నిలిచారు.

సాధారణంగా నటుల జీవితాలు వేరు… నటించిన సినిమాలు వేరుగా ఉంటాయి. కానీ దీప్తి సినిమాల్లోని పాత్రలు ఆమె నిజజీవితానికి అద్దం పడుతాయి. తండ్రి ఆమెను మంచి చిత్రకారిణిని చేయాలనుకున్నాడు. కానీ ఆమె సినిమాను ప్రేమించింది. నటి కావాలనుకుంది. ఆమె సినిమాల్లోకి వచ్చేనాటికి మహామహా నటీమణులున్నారు. అయినా గ్లామర్‌తో కాకుండా పాత్రల్లోని గాఢత, సాధారణంగా కనిపించే ఆ అసాధారణ నటన ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసింది. అందుకు కారణం… తాను పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడం.. తాను కాకుండా పాత్ర మాత్రమే అక్కడ ఉండటం ఆమె బలం.
న్యూయార్క్ లో ఫైన్‌ ఆర్ట్స్ కోర్సు చేసింది దీప్తి. కానీ ఇక్కడ భారతీయ సినిమా పూర్తిగా కమర్షియల్‌ వైపు నడుస్తున్నది. చదువుకున్నదానికి, ఇక్కడి సినిమా స్థితికి పొంతన కుదరలేదు. అయినా ఆమె నట జీవితం 978లో శ్యామ్‌బెనగల్‌ ‘జునూన్‌’ సినిమాతో బాలీవుడ్‌లో మొదలయింది. ఛష్మేబద్దూర్‌, కమలా, మై జిందా హూ, ఆంఖే, మిర్చీమసాలా, సాత్‌సాత్‌, అంగూర్‌… సినిమాలన్నింటిలో ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేసింది. నిజానికి సమాంతర, ఆర్ట్‌ సినిమాలు చేయడం అంత సులభం కాదు.వాటిల్లో మమేకం అయి నటించాలి. పాత్రలకు జీవం పోయాలి. ఒక్కో పాత్ర కోసం ఎదురు చూసింది.ఎంపిక చేసుకుంది.
1981వచ్చిన ‘ఛష్మేబద్దూర్‌’ మొదలు.. 80 తొలినాళ్లలో సక్సెస్‌ఫుల్‌ ఆన్‌స్క్రీన్‌ జంట ఫరూక్‌షేక్‌, దీప్తి. ఈ ద్వయం తరువాత ‘సాత్‌సాత్‌’, ‘కిసీసే న కెహ్నా’, ‘కథ’, ‘రంగ్‌బిరంగీ’ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. మూడు దశాబ్దాల తరువాత 2011లో ‘టెల్‌ మీ ఓ ఖుదా’లో కలిసి నటించారు. ఇద్దరూ తెర పంచుకున్న చివరి సినిమా ‘లిజన్‌ అమాయా’. ఫరూక్‌షేక్‌ మరణించిన 2013లో విడుదలైంది.1990 తరువాత ఆమె కెరీర్‌ కొంత నెమ్మదించింది. 2000లో ‘బవందర్‌’, ‘ఫిరాక్‌’ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఉత్తమ నటిగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. హృషికేష్‌ ముఖర్జీ సినిమాలను ప్రేమించే ఆమె’చష్మేబద్దూర్‌’, ‘కథ’ వంటి జీవిత కథలను చిత్రీకరించిన సాయి పరాంజపే తనకు అత్యంత ఇష్టమయిన దర్శకురాలు. దీప్తి దర్శకుడు ప్రకాశ్‌ఝాను పెండ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాలు కలిసి వుంది మనస్పర్తల కారణంగా విడిపోయారు. కానీ మంచి స్నేహితులుగా వున్నారు. వాళ్లిద్దరూ ఒక అమ్మాయి దిశ ని దత్తత తీసుకున్నారు. పంచ్‌గానీలోని బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకున్న దిశ… శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. తండ్రి సినిమా ‘రాజనీతి’కి కాస్టూమ్‌ డిజైనర్‌గా పని చేసింది.

దీప్తి మంచి నటి మాత్రమే కాదు… ఫిల్మ్‌మేకర్‌ కూడా. మనీషా కొయిరాలా హీరోయిన్‌గా ఆమె తీసిన ‘దో పైసే కి ధూప్‌, చార్‌ ఆనేకి బారిష్‌’ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. 2009లో కాన్స్ లో ప్రదర్శితమైంది. దీప్తి కేవలం హిందీ లోనే కాకుండా అనేక భారతీయ భాషా చిత్రాల్లో నటించింది. పంజాబీలో “మర్హీ డా దీవా’, కన్నడంలో గిరీష్ కాసరవెల్లి రూపొందించిన ‘మనే’, మరాఠీ లో ‘అనాహాట్’ లో నటించారు. టీవీ లలో కూడా నటించారామె.

‘రచన తనకెంతో ఇష్టమైన, తన జీవితంలో అత్యంత ప్రధానమైన ప్రక్రియ. రాయకుండా ఉండలేను’ అని చెబుతుంది. ఆమె రాసిన వాటిలో ఇప్పటికి పబ్లిష్‌ అయినవి చాలా తక్కువ. కేవలం తన పనేదో తాను చేసుకుంటూ పోదామె… తన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్నెప్పుడూ పరిశీలిస్తూ ఉంటుంది. చిత్రకారిణిగా కాన్వాస్‌పై ఆయిల్‌ పెయింటింగ్‌ను ఇష్టపడతారు. ల్యాండ్‌స్కేప్స్‌ చిత్రించడానికే సుముఖత చూపుతుంది. ఎన్నో సెల్ఫ్‌ పోట్రెయిట్స్‌ కూడా గీసింది. ల్యాండ్‌స్కేప్స్‌ కంటే సెల్ఫ్‌ పోట్రెయిట్స్‌ లోతుగా, సునిశితంగా ఉంటాయి. చాలా సంవత్సరాలు ఒంటరిగా జీవించిన ఆమె..’నాకు నేనే బెస్ట్‌ కంపనీ’.. అంటుంది. రచనలు చేయడం తన హృదయానికి అత్యంత దగ్గరయిన కళ అన్నారామె.

ఇక ఇటీవలే తన చిన్ననాటి స్మృతుల్నీ, అనుభవాలనీ అక్షబద్దం చేస్తూ “ అ కంట్రీ కాల్డ్ చైల్ హుడ్” అన్న జ్ఞాపకాల తోరణాన్ని రాసారు. విడుదలయిన అతి కొద్ది రోజుల్లోనే విశేష ప్రాచుర్యం పొందింది.

తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని ధ్వనుల్నీ, అక్కడి సువాసనల్నీ అన్నింటినీ కలబోసి రాసిన పుస్తకమిది అంటారామె. అదికూడా కేవలం తాను గడిపిన కాలం అనుభవాలని ఉటంకించడం కాకుండా ఒక నవల చదివినంత ఆసక్తిగా ఉండేలా ప్రయత్నం చేసారామే. ఇది కేవలం దీప్తి తన 19 ఏళ్ళ వయసు వచ్చేవరకు గడిపిన చూసిన జీవితమే. మొదటి నాలుగు చాప్టర్లను 20 ఏళ్ళ క్రితమే రాసారు. తర్వాత ఇటీవలి 5 ఏళ్లుగా చేసిన రాసిన కృషి ఫలితంగా ఈ పుస్తకం వెలువడింది. ఇందులో ఎన్నో విషయాల్ని ఎలాంటి మొహమాటం లేకుండా రాసారామే. తాను తన మిత్రురాళ్ళు ఆనాడు హీరో రాజేష్ ఖన్నా అంటే ఎంత పిచ్చిగా వుండే వాళ్ళో రాసింది. ‘ఆరాధన’ సినిమాలో రాజేష్ ఖన్నా తల ఊపుతూ చేసిన మానరిజం తననుఎంతగా ఆకట్టుకుందో రాసింది. ఆ సినిమాను 13 సార్లు చూసానంది. అంతే కాదు సఫర్, కటీపతంగ్ లాంటి సినిమాలంటే ఎంతగా పడిచచ్చామో రాసింది. ఇంకా తనను ‘మేరా నాం జోకర్’ ఎంతగా ఆకట్టుకుందో కూడా రాసింది దీప్తి. మొత్తంగా తన బాల్యాన్ని పునసృష్టించింది ఈ పుస్తకం లో.

“నిజానికి జీవన ప్రయాణం లో బాల్యాన్ని అందరం రిటర్న్ టికెట్ బుక్ చేసుకోకుండానే.. వదిలేసి వస్తాం,,తర్వాత కేవలం జ్ఞాపకాల్లోనే ఆ ప్రాంతాన్ని తిరిగి దర్శిస్తాం.’ ఆ పనిని దీప్తి అత్యంత ప్రేమతో ఆసక్తి తో సృజనాత్మకంగా చేసింది.

ఇట్లా బహుముఖీనమయిన రంగాల్లో సృజనాత్మక కృషి చేసిన దీప్తి నావల్ రాసిన కవితల్లోంచి కొన్నింటికి నేను చేసిన అనువాదాలు మీకిప్పుడు అందిస్తాను…

నేనూ-స్మిత
———————
మన కలల్ని వెంటాడుతూ
మనదెప్పుడూ ఒకటే పరుగు
ప్రతిసారీ విమానాశ్రయాల్లో సామాన్లు తెసుకుంటూనే,
వీ ఐ పీ లాంజల్లోనో లోని వెళ్ళే కౌంటర్ల దగ్గరో కలుసుకునే వాళ్ళం

జనసమూహం మధ్య
మాట్లాడుతూనో మౌనంగానో
ఏదయినా చెప్పు కుందా మనుకుంటూ
భయం తో మనకు మనమే భయంతో
చుట్టూ జనం చేతులు ఊపుతూ కేరింతలు కొడుతూ
మనం పిచ్చితనం మధ్య అద్భుతాలుగా

ఓ క్షణం చూపుకోసం,
ఓ క్షణం స్పర్శ కోసం
ఓ క్షణం జీవించడానికి చూస్తూ చూస్తూ
కదిలి వెళ్ళిపోయేవాళ్ళం

మనం చివరిసారి కలిసి కూర్చున్నప్పుడు
నేనడిగినట్టు గుర్తు

“మనం మన బతుకుల్ని ఇంతకంటే
భిన్నంగా జీవించ వచ్చు అనుకుంటాను”
కొన్ని క్షణాల మౌనం తర్వాత
నావైపు చూడకుండానే
కళ్ళు కదపకుండానే

“అలాంటి వీలు లేదు” అన్నావు

ఇవ్వాళ నువ్వు వెళ్ళిపోయావు
కానీ
‘వీల్లేదు’ అన్న నీ మాట తప్పని
రుజువు చేసేందుకు

నేనిప్పటికీ పరుగులు పెడుతూనే వున్నాను
ప్రయత్నిస్తూనే వున్నాను

******* అనుసృజన- వారాల ఆనంద్

+++++++++++++++++++

మానసిక దుర్గంధం

—-

నీ లోపలేదో కుళ్ళి పోయింది
నీ దేహంలో రక్తమాంసాల్లో.. మానసిక దుర్గంధం
అది నీ కళ్ళల్లో శ్వాసిస్తున్నది
అది నీ మాసంలో ఇంకి క్షీనింపజేస్తుంది

ఆలస్యమయి పోతున్నది
నువ్వు దాంతో చచ్చిపోతావు
రాత్రి వెనుక రాత్రి అది నీతోనే నిద్రిస్తుంది

ఇష్టం లేని వయసు మళ్ళిన స్త్రీలాగా
ఎక్కడో వీధి చివర చీకట్లో గడుపుతుంది
అయినా అది నిన్ను అనుసరిస్తూ
నిన్ను చెత్తలో పడేయడానికి ఎదురు చూస్తుంది

నీకు తప్పించుకునే దారి లేదు
అది నీలో నీ రక్త మాంసాల్లో శ్వాసిస్తుంది
నువ్వు మానసిక దుర్గంధం తో చచ్చిపోవాల్సిందే

+++++++++++++++++++++++++++

కళ ఎంత ప్రాంతీయ మయితే అంత అసలుదవుతుంది– నీలమణి ఫూకన్

Posted on

++++ వారాల ఆనంద్  

“సాహితీ స్రవంతి”

కళ ఎంత ప్రాంతీయ మయితే అంత అసలుదవుతుంది– నీలమణి ఫూకన్

++++ వారాల ఆనంద్  

వ్యక్తీకరణ ఎంత అంతర్ముఖీనమయితే అంతగా స్వచ్ఛమవుతుంది (ముక్తకం)

ఇది సరిగ్గా ఈశాన్య భారత రాష్ట్రాల సాహిత్యానికీ, సినిమాకూ, సంగీతానికీ అన్ని కాళాత్మక రూపాలకూ వర్తిస్తుంది. అక్కడింకా ఇప్పటికీ సహజ సిద్దమయిన నదీ నదాలూ పర్వతాలతో పాటు మనుషుల అనుభవాలూ, వ్యక్తీకరణాలూ మిగిలి వున్నాయి. అందుకే అక్కడి సాహిత్యం గొప్ప భావ స్పోరకంగా వుంటున్నది. సంగీతమూ సినిమాకూడా అంతే గొప్పగా కొనసాగుతున్నది.  అట్లా ప్రకృతి సిద్దమయిన చెట్లూ,  అడవులూ, ఆకుపచ్చదనమూ పర్వతాలూ  కలుషితం కాని వాతావరణంతో తుల తూగే ఈశాన్య భారతంలో ప్రధాన రాష్ట్రం అస్సాం. అక్కడినుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమామొదలు అన్ని కళలూ అత్యంత ప్రాంతీయమై, భావస్పోరకమై ఎలాంటి అనుకరణలు లేకుండా చాలా వరకు ఆసలయిన కళారూపాలుగా వుంటున్నాయి. 

    ఈశాన్య భారతం అత్యంత ప్రాచీనమయిన సంస్కృతికి పతిరూపం . 200కు పై చిలుకు జాతుల సమాహారమయి దాదాపు ప్రతి జాతీ తమదయిన విశిష్ట భాషా సంస్కృతుల్ని కలిగి వుంది. అందులోనూ ఉమ్మడి అస్సామ్ రాష్ట్రంగా వున్నప్పటినుండీ అస్సాం భాషా సాహిత్య, సినిమా రంగాల్లో జాతీయ అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షించింది. భూపేన్ హజారికా, బబెంద్రనాథ్ సైకియా లాంటి అనేక మంది సంగీతకారులూ, నీలమణి ఫూకన్, హేమ బారువా, అమూల్య బారువా, మహేశ్వర్ నియోగి లాంటి అనేక మంది కవులు వెలుగొందారు. రచయితలూ తమ తమ సృజనాత్మక రంగాలతో పాటు అస్సామీ సినిమా రంగంలో కూడా విశేషంగా కృషి చేసి అస్సామీ సినిమాను నిలబెట్టారు.     

అట్లా అస్సాం నుండి ఎదిగి వచ్చి అఖిల భారత స్థాయిలో తనదయిన ముద్రను వేసిన కవి నీలమణి ఫూకన్.

“మానవుడు ఎదుర్కొన్న అన్ని సంక్షోభ కాలాల్లో కవిత్వం బతికే వుంది వుంటుంది కూడా”

అంటాడు సుప్రసిద్ధ ఆస్సామీ కవి నీలమణి ఫూకన్. భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ‘జ్ఞానపీఠ్’, సాహిత్య అకాడెమి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు, విశిష్ట సత్కారాలూ అందుకున్న ఆయన “నాకు వచ్చిన అవార్డులూ, రివార్డులూ చూసి నేనేదో సాధించానని అనుకోను.. ప్రపంచ వ్యాప్తంగా వెలువడ్డ లక్షలాది కవితల్లోకి నేనూ కొన్నింటి చేర్చాను” అంతే అంటాడు. అట్లా అత్యంత వినమ్రంగా ప్రకటించుకున్నా ఆయన ఇటీవలే జనవరి 19 న గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మృతి చెందారు. 1933 సంవత్సరంలో సెప్టెంబర్ 10 నా జన్మించిన ఆయన ప్రకృతి ప్రేమికుడు. జోర్హాట్ పట్టణానికి చేరువలో వున్న దేర్గావ్ లో జన్మించాడు. సహజ సిద్ధమయిన అందమయిన వాతావరణాన్ని సంతరించుకున్న ఆ ప్రాంతమది. అంతే కాదు తేయాకు తోటలతోనూ చుట్టూరా పర్వత సానువులతోనూ నిండి వున్న అక్కడి వాతావరణం నీలమణి ఫూకన్ పైన చిన్ననాడే గొప్ప ప్రభావాన్ని చూపింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన పైన చిన్నప్పటినుండీ తన తల్లిప్రభావం తో పాటు అప్పటికే సాహిత్య జర్నలిస్టు రంగాల్లో ప్రసిద్దుదయినా తన చిన్నాన్న ప్రభావం అమితంగా వుంది. చుట్టూ వున్నా వాతావరణంతో పాటు భాషా సంస్కృతుల ప్రభావం వల్ల నీలమణి కి జానపద సాహిత్యం పాటలు, గిరిజన జనజీవితం పైన అభిమానం మక్కువ పెరిగాయి. అవన్నీ తన సృజనాత్మక జీవితమం లో ప్రతిబించాయనే చెప్పాలి. కవిగానే కాకుండా గిరిజన జానపద కళల విమర్శకుడిగా కూడా ఆయన ఎదగడానికి చిన్ననాటి ఆ ప్రభావాలు ఎంతగానో దోహదపడ్డాయి. అందుకే ఒక చోట ఆయనంటాడు “నేను కనుక ఈ అస్సాం లోని సుతిమెత్తని ఆకుపచ్చ వాతావరణం లో పుట్టి ఉండకపోయి వుంటే..ఈ గ్రామీణుల భాష సంస్కృతి, ఆటా పాటలతో మమేకం అయివుండక పోయివుంటే.. ప్రాచీన, వర్తమాన కవుల రచనల సాంగత్యమే నాకు దొరకక పోయివుంటే నేనసలు కవినే అయివుండేవాన్ని కాదు. నేను యాభై ఏళ్లకు పైగా పట్టణాల్లో నివసించినప్పటికీ ఇప్పటికీ నాకు పల్లె స్మృతులు, కలలు,సుఖమూ దుఖమూ,, ఇంకా పల్లెల వాసన, రుచీ, రంగూ ఇంకా నన్ను చుట్టుకునే వుంది. ఎప్పటికప్పుడు నన్ను కదిలిస్తూనే వుంది”

1950 లలోనే కవిత్వం రాయడం ఆరంభించిన నీలమణి ఫూకన్ అప్పరికే అస్సాం సాహిత్య ప్రపంచంలో తమదయిన ప్రభావాన్ని రచిస్తున్న గొప్ప కవులు హేమ బారువా, అమూల్య బారువా, మహేశ్వర్ నేయోగ్ లాంటి కవుల ప్రభావంలో తన రచనలు ఆరంభించాడు. వాళ్ళు అప్పటికే ఆరంభించిన ఆధునిక కవితా ఒరవడిలో తాను తన రచనలు చేయడం ఆరంభించాడు. నీలమణి తో పాటు ఆ కాలంలో రచనలు చేసిన కవులు నవకాంత బారువా, అజిత్ బారువా లు కూడా అదే రీతిలో కవిత్వ రచనలు చేసారు. నీలమణి ఫూకన్ కు రుషి లాంటి కవి అన్న పేరు కూడా వుంది. ఎందుకంటే ఆయన తాను ఎన్నుకున్న విస్థారమయిన కాన్వాస్, ఎంచుకున్న భాష రాసిన తీరు ఆయన్ని అట్లా పిలవడానికి దోహద పడింది. ఆయనతనకవిత్వం లో చెట్లు, పర్వతాలూ,మైదానాలూ, నీళ్ళూ నిప్పూ, గ్రహాలూ, నక్షత్రాలూ, అడవులూ ఎడారులూ అన్నీ ఆయన్ని ఒక రుషి లాంటి కవి అనిపించాయి. ఆయన కవిత్వం లో అధికంగా సాధారణ విషయాల్ని చేబుతున్నట్టు అనిపించినప్పటికీ అయన అనేక అంశాల్ని మనిసి కేంద్రీక్రుతంగా నే చెప్పారు. “మరణానికి అర్థాన్ని, జీవితంలోని ఖాళీలని” గురించీ రాసాడు. అట్లా విస్త్రుత అధ్యయనం విస్తారమయిన రచనల ద్వారా నీలమణి ఫూకన్ అస్సాం సాహిత్యం లో సుస్థిర మయిన స్థానాన్ని పొందడం తో పాటు భవిష్యత్తరాలకు మార్గానిర్దేశంచేసే రచనలు చేసాడు. ఆయన సృజనలో  ఫ్రెంచ్ ప్రతీకవాద ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఆరు కవితా సంపుటాలు వెలువరించిన నీలమణి ఫూకన్ జపనీస్, చైనీస్ కవితానువాదాలు రెండు, కొన్ని స్పానిష్ కవి గార్సియా లోర్కా కవితానువాదాలూ చేసాడు. ఆయనకు దృశ్య కళ లలో విపరీత ఆసక్తి వుండేది. ముఖ్యంగా పెయింటింగ్స్ లో నీలమణి కి ఆసక్తే కాకుండా గొప్ప పెయింటింగ్స్ పైన ఆయన చాలా రాసాడు.

నీలమణి ఫూకన్ మొట్ట మొదటి కవితా సంకలనం “సూర్య హెనో నామి ఆహే నడి ఏడి”( నది ఒడ్డున సూర్యోదయం) 1963 లో వెలువడింది. అయితే నీలమణి తన అనంతర ప్రచురణల్లో మొదటి ప్రచురణ నుండి కొన్ని కవితల్ని మినహాయించాడు. అంటే ఆయన ఎప్పరికప్పుడు తన రచనల్ని పునర్ మూల్యాన్ఖనం చేసుకునేవాడన్నమాట. తనరెండవ కవితా సంకలనం “ నిర్జనతర్ శబ్ద” ( నిశబ్ద ధ్వని) 1965 లో వెలువడింది. తర్వాత 1968 నీలమణి తన మూడవ సంకలనం “ఆరు కిను శబ్ద( నిశబ్దం అంటే ఏమిటి) వెలువరించారు. తన తొలి రచనలే అయినప్పటికీ అవన్నీ అస్సామీ ఆధునిక కవితా ధోరణులకు అద్దం పట్టాయనే చెప్పాలి. అయితే నీలమణి కవిత్వం లో ముఖ్యమయిన మలుపు తిరిగిన కవిత్వం 972 లో ఆయన వెలువరించిన “ఫులి తోక సూర్యముఖి ఫుల్తోర్ పాలే ( వికసించే పొద్దు తిరుగుడు పువ్వు కోసం). ఇందులో ఆయన సిరీస్ గా రాసిన కవితలు అస్సామీ ఆధునిక కవిత్వం మీదా తీవ్ర ప్రభావాన్ని కలిగించాయి. విషయ పరంగా సాహసోపేత మయిన అంశాల్ని తీసుకోవడంతో పాటు కవితా నిర్మాణ విషయం లో కూడా ఆయన అనేక ప్రయోగాల్ని చేసాడు. అయన ఈ కవితల్లో మరణానికి సంభందించి, ఒంటరితనానికి సంబదించి ప్రతీకలని మళ్ళీ మళ్ళీ వాడడంతో పాటు,కవి తన ఒంటరితనాన్ని, సంక్లిష్టమయిన తన ఉనికిని కూడా విరివిగా రాసాడు. అట్లా రాసిన కవితల్ని చదివినప్పుడు పాఠకుడు తమ మనస్సుల్లోకి అంతరంగాల్లోకి వెళ్లి పోయే స్థితి కూడా కలుగుతుంది. ఈ అకవితల్లో నీలమణి ప్రతీకాత్మక వాదాన్ని స్ఫుటంగా వాడాడు. అనేక ప్రతీకలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదివించి ఆలోచనల్లో పడేస్తాయి. అంతేకాదు ఫూకన్ తన కవితల్లో జానపద ప్రతీకలని వాడతాడు. దాంతో ఒక స్థానీయత కనిపిస్తుంది. ఆయా సందర్భాల్లో ఆయా మాటలకు కొత్త అర్థాల్ని సంతరింప చేయడం నీలమణి ఫూకన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అనేక దశాబ్దాల పాటు సాగిన ఆయన కవితా రచన ఆయనలోని విక్షనతని చాటుతుంది. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ లోతయిన, విస్తారమయిన సున్నితత్వాన్ని ఆవిష్కరిస్తుంది.

నీలమణి ఫూకన్ 1961 లో గౌహతి విశ్వవిద్యాలయం నుండి చరిత్ర లో ఎం.ఏ. చేసాడు. 1964 నుండి గౌహతి లోని ఆర్య విద్యాపీఠ్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసాడు. ఆయనకు 1981 తన కవిత సంకలనానికి సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. 1997లో అస్సాం వాలీ లిటరరీ అవార్డు అందుకున్నారు, 1990 ఆయనకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించింది. 2021లో ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది.                

‘కవిత్వం మనిషి లో  సున్నితత్వాన్ని పెంచుతుంది, మానవీయతను సంతరింప చేస్తుంది, సోయిని పెంచుతుంది,సృజనాత్మకతను పెంచి మంచేదో చెడేదో వాటి మధ్య ఉన్న రేఖా మాత్ర తేడాను తెలుసుకునేలా చేస్తుంది, స్పందించే గుణాన్ని విస్తరింపచేసి ప్రకృతిలోకి చూసేలా చేస్తుంది,అందుకే మనుషులు అంతా కవులూ, ప్రేమికులూ, లేదా తిరుగుబాటుదారులయినా  కావాలి. అంటాడు నీలమణి ఫూకన్.

.

*************     

ఎవరయితే చదవరో వారికోసమే

‘కవిత్వం’

…..

ఓ కవి అన్నాడు

‘ఎవరయితే చదవరో వారి కోసమే కవిత్వం’

హృదయాల్లోని గాయాల కోసం

ముళ్ళుదిగి ముడుచుకు పోయిన చేతి వేళ్ళ 

వేదన కోసం సంతోషం కోసం

బతుకుతున్న వారి కోసం చనిపోయిన వారి కోసం

రాత్రీ పగలూ రోడ్లమీద కేకలు వేస్తూ దొర్లే వారికోసం

ఎడారి సూర్యుడి కోసం

చావు అర్థం తెలుసుకోవడం కోసం

బతుకులోని అర్థాలు తెలియడం కోసం

కోమలమయిన పెదాల నడుమ

కనిపించే ఎరుపు వర్ణం కోసం

ముళ్ళ కంచెపై రెక్కలు విచ్చుకున్న పసుపు రంగు

సీతాకోక చిలుక కోసం

కీటకాల కోసం, నత్తల కోసం, నాచు కోసం

మిట్ట మధ్యాహ్నం నిప్పూ నీడల ఉద్వేగంలో

ఆకాశం నుంచి ఒంటరిగా దిగి వచ్చే పక్షి కోసం

రోగాలూ ఆకలితో అలమటిస్తున్న

అయిదు కోట్ల మంది పిల్లల తల్లుల కోసం

ఎరుపుగా మారిపోతానన్న భయంతోవున్న చంద్రుడి కోసం

ప్రతి స్థబ్ద క్షణం కోసం

ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతున్న ప్రపంచం కోసం

మట్టిలో పుట్టి మట్టిలో కలిసి పోయే

ఆ మనిషి కోసం

ఆ పాత సూక్తి

+++

ఆస్సామీ మూలం: నీలమణి ఫూకన్

ఇంగ్లిష్: ప్రదీప్ ఆచార్య

తెలుగు వారాల ఆనంద్

(ARTICLE PUBLISHED IN NETI NIJAM 2 FEB 2023)

కళ ఎంత ప్రాంతీయ మయితే అంత అసలుదవుతుంది-- నీలమణి ఫూకన్

++++ వారాల ఆనంద్

‘పులిజూదం’ -వారాల ఆనంద్

Posted on

పులిజూదం
+++++ వారాల ఆనంద్

పచ్చదనానికీ పిచ్చుక గూళ్లకే కాదు
వూపిరికీ నీడకూ నెలవయిన
ఆకుపచ్చని చెట్లు అదృశ్యమయిపోయాయి

గుక్కెడు నీళ్ళకూ పిడికెడు తిండికీ మూలమయిన
తల్లి లాంటి భూములు
ఎండి ఎడార్లయి బీడువడ్డాయి

ఆకాశంలో చిట్ట చివరి మేఘం
కదిలి వెళ్ళిపోయింది
రెక్కలు జాపి పెద్ద కళ్ళేసుకున్న
‘డేగ’ పైన షికారు కొడుతోంది

గుట్టలన్నీ అట్టముక్కలయి
పేకమేడల్లా కూలిపోయాయి

‘పున్జీతం’ ఆటలో పులి దెబ్బకు
మేకలు అల్లల్లాడి పోయాయి
కొన్ని సమాధుల్నీ మరికొన్ని వలసల్నీ
నమ్ముకున్నాయి
రెక్కలుడిగినవి తట్టనో బుట్టనో తల కెత్తుకున్నాయి

ఏముందిక
అభివృధ్హి కొలతల్లో
ఎకరాలు గజాలయి పోయాయి

‘నాలుగు పాదాల’పై నిలబడ్డ
బల్ల చుట్టూ కూర్చున్న ఆ నలుగురు
మహానగర రూపానికి పునాదులు తీస్తున్నారు
అరచేతిలో ‘వైకుంఠధామాన్ని’ చూపిస్తున్నారు


https://telugu.asianetnews.com/literature/telugu-poem-puli-jjudam-written-by-varala-anand-rqu54f