Month: July 2022

Posted on

పల్లె పురావస్తువు

పట్నం నయా బజార్     

+++++++++ వారాల ఆనంద్

పల్లె పొలిమేరన తుప్పుపట్టిన కరెంటు స్థంభంలా వున్నాను

ఫ్యూజు కాలిపోయి వాడిన బల్బును

మార్చి చాలా రోజులే అయింది

***

చూస్తూ ఉండగానే

పల్లె పొలిమేర పొలమారి కదిలి పోయింది

పల్లె పట్నాల నడుమ గట్టు కూలి పోయింది

గుడిసెలూ ఇండ్లకప్పులూ రాలి

కుప్పలు కుప్పలుగా పోగు పడ్డాయి 

వాకిళ్ళు పొక్కిలి పోక్కిలయి

పొర్లుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాయి

గడపలన్నీ గిడసబారి ముక్కలు ముక్కలయి

స్మశానం పక్కన కట్టెల మండీని చేరాయి

పొలాలు ప్లాట్లయి విస్తరించాయి

ఎకరాలు గజాలుగా ఎదిగాయి

పల్లె పట్నంలో కలిసిందా?  

పట్నం పొలాన్ని మింగిందా?

జవాబు తెలిసీ ప్రశ్న అడిగితే

బదులేమిచ్చేది ఎట్లా సచ్చేది

చెరిగిపోయిన పొలిమేర గట్టు మీద

తుప్పట్టి వంగిపోయిన స్తంభాన్ని నేను

నేడో రేపో నన్నూ

మూలాలతో సహా పెకిలించి

ఏ పాత సామాన్లకిందో అమ్మేస్తారు

ఏముందిక

పల్లె పురావస్తువు

పట్నం నయా బజార్       =============================

Posted on Updated on

49= యాదొంకీ బారాత్

++++++++++++++

కరీంనగర్ ఫిలిం సొసైటీ- మిత్రులు-ఉత్సవాలు

+++++++++++++++++++++

“నది ఒడ్డున సాయంకాలం నడక

వేడిని వదిలేసిన గాలేదో చుట్టుకుంటోంది

అలసట కాదు అజ్ఞానమేదో ఆవిరవుతున్నది”

సరిగ్గా నదిలాగే ‘జీవగడ్డ’ లో మిత్రుల్ని కలిసిన ప్రతి సాయంత్రం ఇదే జరిగేది. ఎదో కొత్త విషయం కొత్త సంఘటన దాని లోతు పాతులమీద చర్చ జరిగేది. ఎవరికి వాళ్ళు వారి ఉద్యోగాలూ పనుల్లో రోజంతా బిజీగా ఉన్నప్పటికీ ఆనాడు అందరికీ ఒక సామాజిక అవగాహన సోయి వుండేది. దాన్ని మరింత విస్తారం చేసుకోవాలనే తపనా వుండేది. కానీ ఆనాడు ఇవ్వాల్టి లాగా అవార్డుల గోల పురస్కారాల సందడి కనిపించేది కాదు బహుశ

“కిరీటాలూ బుజకీర్తులూ

కఠోర శబ్దాలు చేస్తాయి తప్ప

శ్రావ్య సంగీతాన్ని వినిపించవు” అన్న భావన ఆ రోజుల్లోనే మా అందరిలో అంతర్లీనంగా వుండేదేమో. ఎవరికీ డైలీ పేపర్లో పేరు రావాలనే తపనా వుండేది కాదు. రాస్తే కవితలో కథలో వ్యాసాలో రాయాలనే తపన వుండేది. ఒక్క గోపు లింగా రెడ్డికి మాత్రం పత్రికలలో కనబడలానే కోరిక వుండేది. అంతకు మించి పెద్ద స్వార్థం లేదాయనకు..పెద్దగా బావుకున్నదీ లేదు. అన్నింటినీ మించి ఏమన్నా అమనుకున్నా స్నేహం వదలేయలేని గొప్ప వ్యక్తిత్వం లింగా రెడ్డి ది.

ఆక్రమంలో జీవగడ్డతో ప్రయాణం సాగుతూ ఉండగానే మరో వైపు ఫిలిం సొసైటీ కార్యక్రామాలు ఉధృతంగా నిర్వహించాం. ఇంకో వైపు నెహ్రు యువ కేంద్ర కూడా మా కార్యక్రామాలకు వేదికగా నిల్చింది.

అప్పుడే ప్రముఖ వైద్యుడు ప్రగతిశీల భావాల తో వున్న డాక్టర్ కే.సత్యసాగర్ రావు తో పరిచయం ఏర్పడింది. చాలా గొప్ప వైద్యుడే కాదు అంతకంటే గొప్ప మనిషి ఆయన. మెడికల్ కాలేజీలో వున్నప్పుడు ఉద్యమ చైతన్యం తో వున్నవాడాయన. కరీంనగర్ లో ప్రముఖ సర్జన్ డాక్టర్ భూమ రెడ్డి గారి ఆసుపత్రిలో పని చేసేవాడు. ప్రతి సర్జరీలో సాగర్ రావు ప్రమేయం వుండేది. ‘సాగర్ రావు సార్ పొద్దున్న 7 గంటలకు ప్రశాంత్ నగర్ లో బయలేల్లి మూల మీద పాన్ షాప్ లో ఓ జర్దా పాన్ కట్టించుకుని దవడకు పెట్టి దావఖాన్లకు పోతే చాలు ఇక కోసుడే కోసుడే వేరే ఎ ముచ్చటా పట్టదు’ అనేవాడు మా దామోదర్. అంతటి దీక్ష గల వైద్యుడు ఆయన. ఆయన పరిచయం స్నేహంగా మారింది. అప్పుడు మా అమ్మకు, తర్వాతి కాలంలో మా కూతురు రేలకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు సాగర్ అందించిన సహకారం ధైర్యం ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు ఆయన మామధ్య లేకపోవడం పెద్ద వెలితి. సాగర్ రావు బంధువు కంటి వైద్యుడు డాక్టర్ సురేష్ చందర్ రావు కూడా అప్పుడు మాతో సన్నిహితంగా వుండే వాడు.తర్వాత సిద్దిపేట వెళ్ళాడు.

ఇక ఆ కాలంలో మాకు సన్నిహితంగా వచ్చిన వైద్యులు మరో ఇద్దరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ప్రమీల. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వచ్చి ‘సుజాతా నర్సింగ్ హోమ్’ ప్రారంభించారు. అప్పటికే వారిద్దరూ నారదాసు లక్ష్మన్ రావుకు, పెండ్యాల సంతోష్ కూ, మనిహర్ విజ్జన్న ఇట్లా అందరికీ పరిచయస్తులే. వారి ఆసుపత్రి పేదల కోసం చాలా చేసింది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి,డాక్టర్ ప్రమీలలు ఇద్దరూ అందరితో స్నేహంగా వుండేవాళ్ళు. కే.ఎన్.చారి కూతురు అక్కడే పుట్టింది. చారీకి నాకూ చాలా ఇష్టమయిన పేరు “రేల” అందుకే తన కూతురు పేరు రేలా అని మొదట పెట్టాడు. తర్వాత మా కూతురుకూ రేల అనే పెట్టుకున్నాం. పెద్ద రేల చిన్న రేల. పెద్ద రేల పుట్టినప్పుడు మా పాత మిత్రుడు ప్రముఖ కవీ గుడిహాళం రఘునాధం, జర్నలిస్ట్ శ్రీ కే.శ్రీనివాస్(ప్రస్తుత ఆంధ్ర జ్యోతి సంపాదకుడు) చూడ్డానికి వచ్చారు. గుడిహాళం తో నాకు స్నేహం ఉస్మానియా నుండే. కవిగా తను బాగా ఇష్టం.

****

తేదీలు చెప్పలేను కానీ దాదాపుగా అప్పుడే జిల్లాలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. వాటితో మొత్తం జిల్లాలో పరిస్థితే మారిపోయింది. అప్పుదు నేను గోదావరిఖని కాలేజీలో పని చేస్తున్నాను. పెద్దపల్లి లో డీఎస్పీ బుచ్చిరెడ్డి ని ఒక రాత్రి కాల్చేశారు. దాంతో మొత్తం పోలీసు అధికార వ్యవస్థ షేక్ అయిపొయింది. ఇక ఏముంది దాని ప్రతిగా కరీంనగర్లో గుర్తు తెలీని వ్యక్తులు రాత్రంతా పౌర హక్కుల గురించి మాట్లాడే న్యాయవాదుల ఇండ్ల చుట్టూ తిరిగారు. తర్వాత ఏ ఆర్ద రాత్రో కరీంనగర్ మానేర్ కు అవతల వున్న అలుగునూరు లోని జాప లక్ష్మా రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆయన్ను బయటకు పిల్చిన ఆ గుర్హు తెలీని వ్యక్తులు దారుణంగా కాల్చేశారు. ఇదంతా మా అందరికీ మర్నాడు తెలిసింది. దిన పత్రికల్లో అనేక వార్తలు ,ఖండనలూ వచ్చాయి. అంతటా తీవ్ర ఉద్రిక్తత. తర్వాత ఏవో విచారణలూ అవీ అన్నారు. క్రమంగా పరిస్థితి మామూలు గా మారింది. స్పష్టా స్పష్ట మయిన ఉద్రిక్తత ఉద్వేగం కరీంనగర్ గాల్లో తిరుగాడింది.

——

ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ పక్షాన పోరండ్ల లో గ్రామీణ చలన చిత్రోత్సవం తర్వాత అప్పటి కలెక్టర్ పరమహంస గారికి మా డీ ఎన్ నరసింహా రావుగారికి సాన్నిహిత్యం పెరిగింది. ఆ ఏడు నరసింహా రావు, గోపు లింగా రెడ్డి లు మా అధ్యక్ష కార్యదర్శులు. ఇక జిల్లా పరిషద్ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి గారి తో శ్రీనివాస్ కు మంచి సాన్నిహిత్యం వుండేది. అప్పుడే ఒక ఆలోచన పుట్టింది. కే.ఎస్.శర్మ కలెక్టర్ గా వున్నప్పుడు కరీంనగర్ వావిలాల పల్లి లో హాలు నిర్మాణం కోసం స్థలం ఇచ్చారు. కానీ అప్పటికి అది ఊరుకు చాలా దూరం. కలెక్టరేట్ కు దగ్గరలో స్థలం ఇస్తే చిన్న హాలు కట్టవచ్చని అనుకున్నాం. ఆవిషయాన్ని పరమహంస గారితో చెప్పగానే మీరు పాత స్థలం సరెండర్ చేస్తే కొత్తది ఇస్తామన్నారు. అట్లా ఇచ్చిన స్థలం లో భవనం కోసం 86 మొదట్లోనే శంకుస్థాపన కూడా వేసాము. అప్పుడే భవన నిర్మాణం అయ్యేదే కానీ సుతారీ కంట్రాక్టర్ ల విషయం లో వివాద మొచ్చి ఆలస్యమయింది. ఇంతలో ఆ స్థలం ఎప్పుడో ‘ఏక్ సాల్’ పట్టా కింద తమకు ఇచ్చారని కళా రావు అనే ఒకడు అభ్యంతరం పెట్టాడు. అప్పుడు నారదాసు లక్ష్మన రావు వాడితో తీవ్ర వాదానికి ఒక రకంగా యుద్ధానికీ దిగాదు. అక్కడినుంచి ఉరికించినంత పని చేసాడు. న్యాయవాదిగా జీవితం ఆరంభిస్తున్న కాలమది ఇంకేముంది కోర్టులో చూసుకుందాం అనే దాకా వచ్చింది. కళా రావు జిల్లా యంత్రాంగం మీద కేసు వేసాడు. సివిల్ కేసు ఇంకేముంది ఫిలిం సొసైటీ భవనం తో పాటు అక్కడ నిర్మించ తలపెట్టిన అన్ని పనులూ నిలిచి పోయాయి.

అదట్లా వుంటే కఫిసో కు నెహ్రు యువక కేంద్ర కు వున్న అనుబందం గురించి చెప్పుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. యువజన సర్వీసుల శాఖ కింద పని చేసేది. కరీంనగర్ లో యువక కేంద్ర సమన్వయ కర్తగా (కో ఆర్డినేటర్) శ్రీ వి.రామారావు పని చేసేవారు. చాలా మంచి మనిషి. నిజాయితీ గల వాడు. దీక్షతో యువతకు ఏది చేయాలనే తపన తో ఉండేవాడు. మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వేడ్నెస్ డే క్లబ్ అని యువకులకు ఒక క్లబ్ ను ఏర్పాటు చేసి ఉపన్యాస వ్యాసరచన, వర్తమాన అంశాల మీద చర్చలు పోటీలు పెట్టేవాడు. రామారావు గారికి జిల్లాదికారిగా కలెక్టర్ లతో మంచి సాన్నిహిత్యం వుండేది . కలెక్టర్లు మా కఫిసో కు గౌరవ అధ్యక్షులుగా వుండేవాళ్ళు కనుక రామారావు కూడా కఫిసో అన్ని కార్యక్రమాలకూ గొప్ప సహకారం అందించేవాడు. జిల్లా యంత్రాంగంలో ఆయన మాకో పెద్ద అండ. ఆయన ప్రేరణ తో జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాటయ్యాయి. అందులో పూడూరు లో రాంరెడ్డిగారి లాంటి వాళ్ళ కృషి చాలా ప్రశంశనీయమయింది. అదే ఉత్సాహంతో మా దామోదర్ రెడ్డి కూడా చొరవ చూపించి స్వచ్చందంగా ౩ కిలోమీటర్ల రోడ్డు వేసారు.

అంతే కాదు బస్ స్టాండ్ కు ఎదురుగా వున్న నెహ్రు యువక కేంద్ర హాలు కఫిసో సమావేశాలకూ, సేమినార్లకూ, తర్వాత సాహిత్య సంస్థలకు వేదికగా నిలిచింది. అప్పుడే కఫిసో ‘న్యు ఇండియన్ సినిమా’ అంశం మీద నిర్వహించిన సెమినార్ లో అప్పటికే రంగుల కల తదితర సినిమాలతో సమాంతర తెలుగు సినిమాకు చిరునామా గా వున్న శ్రీ బి.నరసింగ రావు ప్రధాన అతిథిగా వచ్చారు. అప్పటికి ‘భారతీయ నవ్య సినిమా’ స్థితి స్థాయి లను భావ స్పోరకంగా చెప్పారు. It was a thought provoking session. తర్వాత కఫిసో నిర్వహించిన జాతీయ సమగ్రతా చలన చిత్రోత్సవం, సెమినార్ లో ప్రముఖ సినీ విమర్శకుడు గుడిపూడి శ్రీహరి పాల్గొన్నారు. తర్వాత సినిమాల్లో కళాదర్శకత్వం (‘ఆర్ట్ డైరెక్షన్’) అన్న అంశం మీద నిర్వహించిన సెమినార్ లో చంద్ర పాల్గొన్నారు. నేనేమీ మాట్లాడను అంటూనే సినిమా కళ అన్న అంశం మీద భిన్నమయిన కోణం లో మాట్లాడారు. నిజమే ఆయనది ప్రసంగం కాదు ఆత్మీయ సంభాషనే. తర్వాత నెహ్రు యువక కేండ్ర సహకారంతో నిర్వహించిన యూత్ ఫిలిం ఫెస్టివల్ లో దేవిప్రియ ప్రధాన ప్రసంగం చేసారు. ఇట్లా మొత్తం మీద కఫిసో సినిమాకు సంబంధించి అనేక అంశాల మీద ఫిలిం ఫెస్టివల్స్, సేమినార్స్ నిర్వహిస్తూ వచ్చింది.

అప్పుడు నా వ్యక్తిగత జీవితంలో అమ్మ అనారోగ్యం తీవ్రంగా ప్రభావితం చేసింది. అంతుపట్టని స్థితి. డాక్టర్ లక్ష్మినారాయన మందులతో ఒక రోజు మెరుగు మరో రోజు కష్టం గా సాగిందా కాలం. ఇంకో వైపు నేను రోజూ గోదావరిఖని కాలేజీకి వెళ్లి రావడం. అమ్మకు బాగా లేదు కనుక పెళ్లి చేసుకొమ్మని వొత్తిడి పెరిగింది. వీటన్నింటి నడుమా ఊపిరాడని స్థితి.

ఇంతలో కొంచెం ముందూ వెనకా మా సమూహం భిన్న పాయల వైపు మరలడం ఆరంభమయింది. నరేడ్ల శ్రీనివాస్ కు బాంకు లో ప్రమోషన్ వచ్చి గుజరాత్ కు బదిలీ అయింది. పెండ్యాల సంతోష్ కుమార్ కు రెసిడెన్సియల్ స్కూలులో పీజీ టీచర్ గా వుద్యోగం వచ్చింది. లక్ష్మన్ రావు దామోదర్ లు న్యాయవాద పట్టా పుచ్చుకుని భూ సేకరణ కేసులు, కోర్టులూ అంటూ బిజీ అయిపోయారు. తర్వాత కొంత కాలానికి మనోహర్ తన పీ హెచ్ డీ కోసం డిల్లీ జవహార్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం వెళ్లి పోయాడు.

మిగతా వచ్చే వారం….

-వారాల ఆనంద్

10 JULY 2022