పుస్తకం లాంటి మనిషి

Posted on

పుస్తకం లాంటి మనిషి  

++++++++++++ వారాల ఆనంద్

దశాబ్దాలపాటు కళ్ళారా చూస్తూ

వాటి మధ్యే బతికానేమో

పుస్తకాల్ని

దూరంగా అద్దాల బీరువాలో చూసినా

దగ్గరగా నా రీడింగ్ టేబుల్ పై చూసినా

ఆత్మీయుణ్ణీ అయినవాణ్ణీ చూసినట్టుంటుంది

చూసీ చూడగానే కరచాలనం చేయాలనిపిస్తుంది

మునివేళ్ళను పెదాలపై అద్దుకుని మెల్లిగా

పేజీ తర్వాత పేజీ తిప్పేయాలనిపిస్తుంది

అప్పుడు

కొన్నింటితో స్నేహం కుదుర్తుంది

కొన్నింటికి నేను స్నేహితుడినయిపోతాను

కొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే

మరికొన్ని నులిపెడతాయి

నేను కరిగి నీరయిపోతాను

కొన్ని నవ్విస్తే,

మరికొన్ని ఏడిపిస్తాయి

కొన్ని ఆలోచనల్ని రేకెత్తిస్తే

ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి

నేనేమో పిడికిలి బిగించి ఊగిపోతాను

మొత్తంగా పుస్తకాలు నాలో భాగమవుతాయి

నేను వాటిలో లీనమవుతాను

అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా

నన్ను తెరిచి తరిచి చూసే పుస్తకం కోసం

పుస్తకం లాంటి మనిషికోసం వెతుకుతూనే వున్నా..

*****************

24 ఏప్రిల్ 2024 WORLD BOOK DAY

Leave a comment