Month: August 2022

56= యాదొంకీ బారాత్

Posted on Updated on

****లెటర్స్ అండ్ లిటరేచర్– అక్షర ఉజ్వల, సాహితీ గౌతమి *****

 ఓటమి ఊపిరి కాదు, అలవాటు కాదు, దిన చర్యా కాదు

అది చీకటిలా ఎదురొస్తుంది, చిటికేస్తే పరుగెడుతుంది

అట్లా చిటికేస్తూ కాలం గడపడం 1990ల్లో ఆరంభమయింది.

నేను ఒకేసారి రెండు మూడు రంగాల్లో పనిచేయడం దాదాపుగా అప్పుడే మొదలయింది. జర్నలిజం, రైటింగ్ ఆన్ ఫిలిమ్స్ అండ్ ఫిలిం సొసైటీ ఉద్యమం, జూనియర్ కాలేజీలో ఉద్యోగం, స్కూలు నిర్వహణ, సాహిత్య అధ్యయనం, పలు సంస్థలు ఇట్లా అనేక రంగాలు ముడివేసుకు పోయాయి. బయట అదట్లా వుంటే వ్యక్తిగత జీవితంలో అనేక ఒత్తిడులు ఒడిదొడుకులు. సహచరి  ఇందిరకు అబార్షన్లు కొంచెం అనారోగ్యం.. అన్నీ ముప్పిరిగొన్నాయి. అయినా తాను ఎంతో ధైర్యంగా ఒంటి చేత్తో ఆన్నింటినీ దాటేసుకుంటూ నన్ను వాటి నుంచి దాటిస్తూ వచ్చింది.

ఆ ఏడు జనవరి మొదట్లోనే నేనూ, హైదరాబాద్ ఫిలిం క్లబ్ ప్రకాష్ రెడ్డి గారూ కలకత్తా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లాం. ఆ ఫెస్టివల్ లో  పనోరమా విభాగానికి శ్రీ బి.నరసింగ రావు గారి జాతీయ అవార్డును అందుకున్న ‘దాసి’ ఎంపికయింది. దాసి అప్పుడు జాతీయ స్థాయిలో అయిదు అవార్డులు అందుకుంది. “దాసి దోసిట కీర్తి రాసులు” అని దేవిప్రియ అప్పుడు దిన పత్రికలో అనుకుంటాను ప్రధాన వార్తగా రాసారు. దూరదర్షన్ కోసం తీసిన ఆ సినిమా ఒక క్లాసిక్. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని విభాగాల్లో ఉత్తమ శైలిని ఆవిష్కరించింది. దర్శకుడిగా బి.నరసింగ రావు, ప్రధాన భూమిక పోషించిన అర్చన, కెమెరా వర్క్ చేసిన ఏ.కే.బీర్ లు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఇక ఫిలిం ఫెస్టివల్ ప్రారంభ సమావేశంలో మొట్టమొదటిసారిగా సత్యజిత్ రే ను దగ్గరగా చూసే అవకాశం కల్గింది. మాట్లాడే వీలు కాలేదు. అది నాకు జీవితం లో పెద్ద వెలితి. అప్పుడు ఈనాడు కు రాస్తున్నాను కనుక కలకత్తా వెళ్ళేటప్పుడు న్యూస్ టుడే ఎండీ రమేష్ బాబు ను కలిసి ఇట్లా వెళ్తున్నాను అని చెప్పాను. అక్కడి నుంచి ఏమయినా రాయనా అన్నాను. తప్పకుండా రాయండి అన్నాడు. కానీ అక్కడి నుండి రాస్తే వాటిని ‘సితార’ కు ట్రాన్స్ఫర్ చేసారు. వాళ్ళు వాళ్ళకున్న పరిధి దృష్ట్యా వాడలేదు. అట్లా కలకత్తా ఫెస్టివల్కు సంబంధించి రాయడం విషయంలో సైలెంట్ గా వుండి  పోయాను. కాని ఆ ఫెస్టివల్ లో దేవిప్రియ, వోల్గా, అక్కినేని కుటుంబ రావు, కే.ఎన్.టీ.శాస్త్రి, ఆంద్రజ్యోతి జగన్ లాంటి అనేక మంది దగ్గరయ్యారు. తర్వాతి కాలంలో ఫిలిం సొసైటీ విషయంలో నాకు ఎంతో సహకరించారు. కరీంనగర్ వచ్చి కఫిసో సభల్లో పాల్గొని నాతో పయనించారు. షాజీ కరున్  ‘పిరవి’, రే ‘ఘన శత్రు’, మృణాల్ సేన్ ‘ఏక్ దిన అచానక్’, అపర్ణాసేన్ ‘సతి’, సయీద్ అఖ్తర్ మీర్జా ‘సలీం లంగ్దేపే మత్ రో’ లాంటి మంచి సినిమాలు చూసే అవకాశం కలిగింది.

  కలకత్తా నుంచి తిరిగి వచ్చాక ఇందిర కన్సీవ్ అయింది. అప్పటికే పలు అబార్శన్స్ తో చాలా గందరగోలంగా ఉండింది పరిస్థితి. ఆ సమయంలో గోదావరిఖని లో సహా ఉద్యోగి ఆత్మీయ మిత్రుడు రమేష్ బాబుకు బంధువు అయిన డాక్టర్ హైమవతి ఎంతగా సహకరిచిందో మాటల్లో చెప్పలేను. ఒక సారయితే రాత్రి పదిగంటల సమయం.ఇందిర తీవ్రమయిన కడుపునొప్పి తో విలవిలలాడ సాగింది. వెంటనే హైమవతి గారి ఇంటికి వెళ్లాం. ‘మేడం, సారు, పిల్లలతో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్ళారని’ ఆయా చెప్పింది. ఎట్లా ఏం చేయడం. ఏ సినిమా అని అడిగాను. బాలకృష్ణ టాకీసుకు అన్నది ఆమె. ఇందిరను అక్కడే వాల్లింట్లో కూర్చో బెట్టి నేను టాకీసుకు వెళ్లాను. సినిమా రన్ అవుతున్నది. నేను గెట్ కీపర్ కు చెప్పి వెళ్లి బాల్కనీ లో నిలబడ్డాను. చీకట్లో డాక్టర్ గారిని ఎట్లా గుర్తుపట్టడం. కానీ ఎట్లా చూసిందో తాను లేచి వచ్చి ఏమిటి ఆనంద్ ఇట్లా వచ్చారు అంది. నేను విషయం చెప్పాను. మీరు వెళ్లి పిల్లల దగ్గర కూర్చోండి. నేనూ మా ఆయన వెళ్లి ఇందిరను చూసి వస్తాం అన్నారు. నేను చేతులు ఎత్తి మొక్కాను. నొ నొ అదేమిటి అంటూ స్కూటర్ మీద ఇద్దరూ వెళ్లి వచ్చారు. ఏమీ లేదు ఆనంద్ ఇంజెక్షన్ ఇచ్చాను రాత్రికి మా ఇంట్లోనే కింది ఫ్లోర్ లో వుండండి పొద్దున్నే వెళ్ళండి అంది. థాంక్స్ చెప్పి వచ్చాను. అంతలా ఆత్మీయుల్లా చూసిన డాక్టర్ తను.. ఎంతగానో రుణపడి  వున్నాం. ఆ తర్వాత సర్క్యులేజ్ చేసారావిడ. డెలివరీకి వరంగల్ వెళ్తారు కనుక జాగ్రత్తలెన్నో చెప్పింది.

ఇక మరో వైపు ఫిలిం సొసైటీ లో ఆ ఏడు కూడా చాలా సినిమాలే వేసాము. ఎన్నో ఫారిన్ సినిమాలకు తోడు హిందీ సినిమాల విషయానికి వస్తే ‘దో ఆన్ఖే బారా హాత్’, ’పరిచయ్’, ‘కొట్నిస్ కి అమర్ కహానీ’ లాంటి సినిమాలు వేసినట్టు గుర్తు.

మరో పక్క ఈనాడు కోసం బీ.ఎస్.నారాయణ, నేరెళ్ళ వేణు మాధవ్, చిత్రకారుడు పీటీ రెడ్డి తదితరుల ఎందరి గురించో ప్రోఫైల్స్ రాసాను, ఇంటర్వ్యు లు చేసాను. అప్పుడే శ్రీమతి గునోత్తమ గారు పరిచయం అయ్యారు. వారి కూతురు విష్ణువందన అప్పుడప్పుడే నాట్యం నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇచ్చేది. అట్లా ఒక కొత్త కళాత్మక కుటుంబంతో కలిగిన పరిచయం ఇప్పటికీ కొనసాగుతున్నది.

అప్పుడే జిల్లా కలెక్టర్ గా వున్న శ్రీ ఐ.వీ.సుబ్బారావు చొరవతో జిల్లాలో అనేక కార్యక్రమాలు  జరిగాయి. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల తాను ఎంతో చొరవ చూపించే వారు. వారి శ్రీమతి కూడా. ఐ.వీ.సుబ్బారావు కరీంనగర్ లో ప్రధానంగా త్యాగరాజ లలిత కళా పరిషత్, కరీంనగర్ ఫిలిం సొసైటీ లాంటి పలు సంస్థలకు ఎంతగానో ప్రోత్సాహాన్నిచ్చారు.

1988 సంవత్సరానికి గాను కరీంనగర్ జిల్లాకు చెందిన గొప్ప కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి భారత ప్రభుత్వం ‘జ్ఞానపీఠ పురస్కారం’ ప్రకటించింది. జిల్లాకు చెందిన కవికి అంత గొప్ప గొరవం లభించడంతో జిల్లా అంతా పండుగ వాతావరణం ఏర్పడింది. అంతకు ముందు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసిన విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అదొక జ్ఞాపకంగా వున్న జిల్లాకు ఏకంగా జిల్లా వాసి డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికే అత్యన్నత పురస్కారం రావడంతో పులకించి పోయింది. జిల్లాకు చెందిన అనేక మంది సాహితీ వేత్తలు, తెలుగు అధ్యాపకులు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి డైరక్ట్ స్టూడెంట్స్ వున్నారు. దాంతో ఆ సందర్భంగా డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి ఘనంగా సన్మానం చేయాలని తలపోశారు. అందరం కలిసి కలెక్టర్ ను కలవాలని నిశ్చయించుకున్నాం. ఆ టీములో నేను, ఎన్.శ్రీనివాస్, డాక్టర్ గోపు లింగా రెడ్డి, డాక్టర్ బి.దామోదర్ రావు, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు తదితరులం వున్నాం. వెళ్లి కలిసి విషయం చెప్పాం. సుబ్బారావు గారు అత్యంత వేగంగా సకారాత్మకంగా స్పందించారు. అయితే కేవలం ఘన సత్కారం వల్ల ఎమీ జరగదు. ఆ ఒక్క రోజు ఉత్సవంతో పెద్ద ఉపయోగం లేదు. ఏదయినా శాశ్వతంగా వుండేది చేయాలి… ఆలోచించండి అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏదయినా పురస్కారం పెడితే ఎట్లా వుంటుంది అనగానే చాలా బాగుంటుంది. దాని కోసం ఒక సంస్థ కొంత శాశ్వత నిధి పోగు చేయండి నా వంతు సహకరిస్తానన్నారు. ఇంకేముంది ‘సాహితీ గౌతమి’ పేర సంస్థ ఏర్పాటయింది. అది కేవలం సంస్థలాగా కాకుండా జిల్లా లోని అన్ని (దాదాపు 30)సంస్థల సమాఖ్యగా వుండాలి అనుకున్నాం. పురస్కార నిర్వహణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. శాసన మండలి సభ్యులు గీట్లజనార్దన రెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారు. నిధులు సమకూర్చేందుకు కరీంనగర్ కు చెందిన ప్రముఖ న్యాయవాదులు లక్ష్మా రెడ్డి, ఎడవల్లి జగ్గారెడ్డి, మానసిక వైద్యులు డాక్టర్ భాగ్యా రెడ్డి, డాక్టర్ బాలస్వామి, ఇట్లా మరెందరో ముందుండి నిధుల్ని సమీకరించారు. నాకు తెల్సి ఆ రోజుల్లో సుమారు 60 వెల పైచిలుకు నిధి సమీకరించారు. నిర్దేశించుకున్న లక్ష సమకూర లేదు. కానీ అవార్డును ఇవ్వాలని ప్రకటించారు. మొదటి అవార్డు కోసం డాక్టర్ ఎన్.గోపి రాసిన “చిత్రదీపాలు” ఎంపిక అయింది. అవార్డు కార్యకమం ఘనంగా జరిగింది. అప్పుడు సాహితీ గౌతమి లో ప్రధాన భూమికల్ని డాక్టర్ గోపు లింగారెడ్డి, డాక్టర్ బి.దామోదర్ రావు లు నిర్వహించారు. నేనూ, శ్రీనివాస్ సంస్థలోనూ, సంస్థకు తోడుగానూ వున్నాం. ఇక రెండవ సంవత్సరం వచ్చేసరికి కలెక్టర్ సుబ్బారావుకు బదిలీ అయింది. ఆయన స్థానంలో శ్రీ భన్వర్ లాల్ కలెక్టర్ గా వచ్చారు. తెలుగు వాడు కాకున్నా బాగా మాట్లాడేవాడు. సాహితీ సంస్కృతుల పట్లా ఎంతో ఆసక్తి  కలిగిన వాడు. ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉండగానే సాహితీ గౌతమి రెండవ సినారె కవితా పురస్కారాన్ని దేవిప్రియ ‘నీటి పుట్ట’ కు ప్రధానం చేసారు. ఆ అవార్డు కార్యక్రమంలోనే ‘దుమారం’ పేర ఒక కరపత్రం వెలువడింది. ఈ అవార్డులు వాటి ఎంపిక తీరును విమర్శిస్తూ వచ్చిన ఆ కరపత్రం చారిత్రాత్మక మయింది. అయితే చాల చిత్రంగా ఆ తర్వాత దాన్ని ఎవరూ తామే వేశామని ప్రకటించు కోలేదు. అయినా అంతా బహిరంగ రహస్యమే. ఇవ్వాళ నేను పేర్లు చెబితే వివాదం అవుతుంది. అందుకే నేనూ చెప్పడం లేదు. అది రాసిన వాడికి ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వచ్చింది అది అసలు ఐరనీ.

    జిల్లా కలెక్టర్ గా భన్వర్ లాల్ గారు చేరిన తర్వాత జిలాలో అనేక కార్యక్రమాలు చెపట్టారు. ‘స్కౌట్స్ జంబోరే’ అత్యంత ఘనంగా నిర్వహించారు. దానికి ఆనాటి రాష్ట్రముఖ్య మంత్రి శ్రీ ఎన్.జనార్ధన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పీకర్ శ్రీపాదరావు అధ్యక్షత వహించారు. నేనూ ముఖ్యమయిన బాధ్యతనే స్వీకరించాను. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసల్నీ అందుకున్నాను. తరవాత జిల్లాలో  జిల్లాకలెక్టర్ భాన్వర్ లాల్  నేతృత్వంలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం చేపట్టారు. ‘అక్షర ఉజ్వల’  అని పేరు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారిగా ఎంతో కృషి జరిగింది. ‘అక్షర ఉజ్వల’ పేర పత్రిక తెచ్చాం. దాని సంపాదక వర్గంలో నేనూ ముఖ్య పాత్రనే పోషించాను.

మిగతా వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.  

-వారాల ఆనంద్

28 ఆగస్ట్ 2022               

“24 ఫ్రేమ్స్” భరత్’ అనే నేను ఓ దేశభక్తి చిత్రాన్ని

Posted on

భరత్’ అనే నేను ఓ దేశభక్తి చిత్రాన్ని

24 ఫ్రేమ్స్ “ (MY WEEKLY COLUMN IN ‘DISHA’ DAILY)

“భరత్’ అనే నేను ఓ దేశభక్తి చిత్రాన్ని
+++++++++వారాల ఆనంద్

హిందీ సినిమా రంగంలో ఆయన హీరోగా నటించిన అనేక సినిమాల్లో ఆయన పాత్ర పేరు ‘భరత్”. ఆయన నటించిన అనేక సినిమాలు దేశభక్తిని ప్రభోదించినవే. అందుకే మనోజ్ కుమార్ ను వెండి తెర దేశభక్తుడు అంటారు.
“హై ప్రీత్ జహాన్ కి రీత్ సదా
మై గీత్ వహాన్ కీ గాతా హూన్
భారత్ కా రహనే వాలా హూన్
భారత్ కీ బాత్ సునాతా హూన్ .. “అంటూ అనేక పాటలకు నటించి మంచి పేరు గడించాడు. ఆయన గత తరం నాయకుడు. స్వాతంత్రానంతరం జరిగన దేశ విభజనకు బలయిన లక్షలాది మందిలో తానూ ఒకడిని అని భావించే మనోజ్ కుమార్ భగత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా 1965 లో “షహీద్” సినిమా రూపొందించాడు. అది గొప్ప విజయాన్ని సాధించింది. అప్పటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కి ఆ సినిమా బాగా నచ్చింది. 1965 లో జరిగిన భారత్-పాకిస్తాన్ల యుద్ధం తర్వాత శాస్త్రి గారు మనోజ్ కుమార్ ను పిలిచి అభినందించారు. అంతే కాకుండా దేశానికి తానెంతో స్పూర్తిదాయకంగా ఇచ్చిన “జై జవాన్ జై కిసాన్” నినాదం ఆధారంగా ఒక మంచి సినిమా రూపొందించమని అడిగాడు. ప్రధాని సూచనల మేరకు స్పందించిన మనోజ్ కుమార్ “ఉప్ కార్ “ సినిమా తీసాడు. అందులో మనోజ్ కుమార్ స్వయంగా రైతు గానూ, సైనికుడిగానూ నటించాడు. ఆ ఏడు ఆ ఉప్ కార్ సినిమా పెద్ద విజయవంతమయిన సినిమాగా నిలిచింది. అంతే కాకుండా జాతీయ స్థాయిలో ద్వితీయ ఉతమ చిత్రం అవార్డుతో పాటు నాలుగు ఫిలింఫేర్ పురస్కారాల్ని అందుకుంది. ‘ఉప్కార్’ సినిమా అనగానే
“మేరె దేశ్ కి ధర్తీ సోనా ఉగ్లే ఉగ్లే దీరే మోతి….
ఏ బాఘ్ హై గౌతం నానక్ కి, కిల్తే హై అమన్ కే పూల్ యహాన్,
గాంధీ, సుభాష్, టాగోర్, తిలక్.. ఐసే హైన్ పూల్ చమన్ కే యహాన్,
రాంగ్ లాల్ హై లాల్ బహదూర్ సే..” పాట గుర్తొస్తుంది. గుల్షన్ బావరా రాసిన ఆపాట కు కల్యాన్ జీ-ఆనంద్ జీ సంగీతం సమకూర్చారు. మహేంద్ర కపూర్ చాలా గొప్పగా పాడాడు. అదిప్పటికీ జాతీయ ఉత్సవాలల్లో గౌరవంగా వినిపిస్తుంది. ఇక ముందూ వినిపిస్తూనే వుంటుంది.
అట్లా దేశ భక్తి సినిమాల హీరో గా వినుతికెక్కిన మనోజ్ కుమార్ తన కారీర్ ను 1957 ప్రారంభించాడు. ముప్పై ఏళ్లకు పైగా నటనా జీవితంలో కొనసాగిన ఆయన సినిమాల్లో దాదాపు అన్నింటా ఆయన పోషించిన పాత్రల పేరు ‘భరత్’ కావడం వేశేషం. దేశ విభజనకు బలయిన లక్షలాది మందిలో తానూ ఒకడిని అని భావించే మనోజ్ కుమార్ 1937లో అబ్బోతాబాద్ లో జన్మించాడు. అదిప్పుడు పాకిస్తాన్ లో వుంది. మనోజ్ అసలు పేరు హరికృష్ణ గోస్వామి. దేశ విభజన ఫలితంగా వారి కుటుంబం డిల్లీ వచ్చి శరణార్థి కేంద్రం లో నివసించారు. చిన్నప్పటినుండీ సినిమాలు చూడడంలో ఎంతో ఆసక్తి వున్న ఆయన ధిల్లీ హిందూ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసాడు. తనకు దగ్గరి బందువయిన లేఖ్రాజ్ భక్రి ద్వారా హిందీ సినిమాల్లోకి వచ్చాడు. లేఖ్రాజ్ అప్పటికే శమ్మీకపూర్ తో ‘తంగే వాలి ’ లాంటి సినిమాలు తీసిన బాంబే లో పేరున్న నిర్మాత. లేఖ్రాజ్ సూచనల మేరకు బాంబే చేరినప్పటికీ మనోజ్ కుమార్ కు చిత్ర పరిశ్రమ వెంటనే స్వాగతం చెప్పలేదు. ఆర్నెల్లపాటు ఒక వైపు పాత్రల కోసం తిరుగుతూనే కథలు, ఫిలిం స్క్రిప్టులు రాసుకోవడం మొదలు పెట్టాడు. హోమీ సేత్నా సినిమా ‘గంగూతేలి’ తో సినిమా ప్రవేశం జరిగింది. తర్వాత లేఖ్రాజ్ నిర్మించిన ఫాషన్, చాంద్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు. అయితే 1961 లో హెచ్.ఎస్.రవెల్ రూపొందించిన ‘కాంచ్ కి గుడియా’ తో హీరోగా తెర మీదికి వచ్చాడు. అదే సమయంలో ‘రేశ్మీ రుమాల్’ లాంటి సినిమా అవకాశాలూ వచ్చాయి. అనంతర కాలంలో మనోజ్ కుమార్ హర్యాలీ అవుర్ రాస్తా, హిమాలి కే గోద్ మే, వొహ్ కౌన్ థీ లాంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ వచ్చింది. అప్పుడే మనోజ్ ‘షహీద్’ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాడు. దాన్ని నిర్మాత కేవల్ కాశ్యప్, రాంశర్మ దర్శకత్వంలో తీసాడు. అదట్లా వుండగా 1960 తర్వాత గుమ్నాం, పత్తర్ కే సనం, పెహచాన్, సన్యాసి, బేమాన్, దస్ నంబరీ లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ సాధించాడు. స్క్రిప్ట్ రచనలో ప్రావీణ్యం వున్న మనోజ్ అనేక సినిమాలకు ఘోస్ట్ దర్శకుడిగా కూడా పనిచేసాడు.
తర్వాత 1967 మనోజ్ కుమార్ రూపొందించిన ‘ఉప్కార్’ సినిమాను ఆయన ‘16 వేల అడుగుల జాతీయ జెండా’ గా అభివర్ణించాడు. ధర్మేంద్ర తో కలిసి మొదలయిన ఆయన జీవితంలో ధర్మేంద్ర తో కలిసి అనేక సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన పూరబ్ అవుర్ పశ్చిం, షోర్, రోటీ కపడా అవుర్ మకాన్, క్రాంతి లాంటి సినిమాలు మంచి పేరు ప్రతిష్టల్ని తెచ్చి పెట్టాయి. కానీ మంగల్పాండే నుంచి మొదలు గాంధీ వరకు జీవిత చరిత్రల్ని కలిపి ‘భారత్ కే షహీద్’ పేర సీరియల్ తీసేందుకు ఆయన చేసిన ప్రయత్నం వివిధ కారణాల వలన సాధ్యం కాలేదు. అంతేకాకుండా 1999లో దేశభక్తి కథాంశం తో ‘జై హింద్’ పేర తాను తీయ దలుచుకున్న సినిమా నిర్మాణం సుదీర్ఘంగా సాగి విఫలం చెందింది. మనోజ్ కుమార్ తన అనేక సినిమాల్లో భూమిపుత్రుడు గానూ, పాశ్చాత్య విలువల వ్యతిరేకిగానూ, దేశభక్తిని బోధించే కళాకారుడిగానూ వివిధ పాత్రల్ని పోషించాడు.
ఆయన కృషికి గుర్తింపుగా ఫిలిం ఫేర్ జీవనసాఫల్య (లైఫ్ టయిం అచీవ్మెంట్)పురస్కారాన్నీ, కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అవే కాకుండా పలు సినిమాలు ఉత్తమ రచయిత లాంటి అనేక అవార్డులు అందుకున్నారు.
అట్లా మనోజ్ కుమార్ తన స్క్రీన్ పాత్రల ద్వారా దేశభక్తిని ప్రభోదించారు. భరత్ పాత్రకు ప్రతినిధి గా విజయం సాదించారు. దేశం 75 సంవత్సారాల ఉత్సవాలు జరుపున్న సందర్భంగా మనోజ్ కుమార్ కృషిని పునర్ మూల్యాంకనం చేయాల్సిన ఆవసరం వుంది.

27 ఆగస్ట్ 2022
(స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా రాసిన సిరీస్ లో మూడవది)

'24  ఫ్రేమ్స్’ అనే నేను ఓ దేశభక్తి చిత్రాన్ని

55 = యాదోంకీ బారాత్

Posted on

55 = యాదోంకీ బారాత్

+++++++ వారాల ఆనంద్

“గుడారం నిలపడుతుందో

 గాలికి ఎగిరి పోతుందో

 సృజన లోకంలో నేనో బంజారా..”
………..

నడిచే కాలం, గడించే అనుభవం అనేక విషయాల్ని మార్చేస్తుంది కదా. 1989 డిల్లీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని వచ్చాక నేను సినిమాల్ని చూసే విధానం మారింది. సినిమాని అర్థం చేసుకుని విశ్లేషించే పద్ధతీ మారింది. దాంతో కఫిసో కార్యక్రమాలలోనూ మార్పులు వచ్చాయి. దానికి తోడు కరీంనగర్ రెసిడెన్శియల్ స్కూల్ కార్యక్రమాలూ అన్నీ బిజీ బిజీగా మార్చేశాయి.

     ఆ ఏడు అధక్ష కార్యదర్శి బాధ్యతల్లో నరెడ్ల శ్రీనివాస్ నేనూ వున్నాం. కేవలం ఆ ఒక్క సంవత్సరం లో నలభైకి పైగా సినిమాల్ని ప్రదర్శించాం. జనవరి ఒకటిన ‘భక్త పోతన’ ప్రారంభ మయిన ఆ ఫిలిమ్స్ పరంపర ‘కన్యాశుల్కం’, ‘మరోచరిత్ర’, ‘మేఘ సందేశం’ లాంటి తెలుగు చిత్రాలతో పాటు గుల్జార్ ‘కోషిష్’, ‘కినారా’, గురుదత్ ‘కాగజ్ కేఫూల్’, మీరా నాయర్ ‘సలాం బాంబే’ లాంటి సినిమాలతో కొనసాగింది. అంతేకాదు ‘బల్తజార్’ మొదలయిన అనేక ఫ్రెంచ్ సినిమాలూ ప్రదర్శించాం. ఇక జూన్ నెలలో శ్రీ బి.నర్సింగ్ రావు రూపొందించిన ‘రంగుల కల’, ‘మావూరు’, ‘ది సిటీ’ సినిమాలతో ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాం. ‘మావూరు’ కరీంనగర్ లో పెద్ద ఊపు. కళాభారతి హాల్లో సిరిసిల్లా రుద్రరవి అయితే రీలు చేంజ్ సమయంలో ముందు వరసలో వున్న దర్శకుడు నరసింగ రావు గారి దగ్గరికి వెళ్లి ఎంతగానో అభినందించాడు. దాదాపు హాల్లో వున్న అందరూ మావూరు, సిటీ డాక్యుమెంటరీ సినిమాల్ని ఎంతగానో ఇష్టపడ్డారు. తర్వాతి రోజు కరీంనగర్ నెహ్రు యువకకేంద్ర హాలు లో “తెలుగు సినిమా నేటి స్థితి-భవిష్యత్తు” అన్న అంశం పైన సెమినార్ నిర్వహించాం. ఆనాటి సమావేషంలో నేనూ, శ్రీనివాస్ మాట్లాడాం. బి.నరసింగ రావు తెలుగు సినిమా అప్పటి పరిస్థితిని వివరిస్తూనే అంతర్జాతీయ స్థాయి పరిణామాల్ని విస్తృతంగా చర్చించారు. చైతన్యవంతమయిన సెమినార్ గా నిలిచిపోయింది.

అదట్లా వుండగా స్కూలు వార్షికోత్సవం వచ్చింది ఘనంగా నిర్వహించాం. పిల్లల పాటలు నృత్యాలూ నాటకాలతో సాగింది. ఆ కార్యక్రమ రిపోర్ట్ ని రాసి తీసుకెళ్ళి కరీంనగర్ గడియారం  దగ్గర మాల్యాల మధురమ్మ భవనంలో వున్న ఈనాడు టౌన్ ఆఫీసులో ఇవ్వడానికి వెళ్లాను. అప్పుడు వి.పి.ఎస్.రాజు జిల్లా విలేఖరిగా వున్నారు. రాసింది చూసి ఎవరు రాసారు ఇది అన్నారు. నేనే అని జవాబిచ్చాను. ఎం చేస్తారు లాంటి వివరాలు అడిగారు. యధాలాపంగా అడుగుతున్నారో అని అనుకున్నారు. కాని తర్వాత కలిసి ఈనాడు జిల్లా ఎడిషన్స్ లో కల్చరల్, స్పోర్ట్స్, లీగల్ విషయాల కోసం ప్రత్యేక రిపోర్టర్లను తీసుకుంటున్నాం. మీరు కల్చరల్ రాయగలరా అన్నాడు. నాకెట్లా వీలవుతుంది. జాబ్, స్కూల్ అన్నాను. ఏముంటుంది తీరిక సమయాల్లో చేయడమే కదా. సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయి మీకు ఇంటరెస్టే కదా. జాలీగా చేయండి అని ఒప్పించాడు. ఇంటికి వెళ్ళింతర్వాత ఇందిరను అడిగాను ఏంచేద్దాం అని మీకు గౌరవంగా వుంటే రాయండి. సమయం వీలు చూసుకోండి అంది. నేను రాయడానికి నిర్ణయించుకున్నాను. ఇంకేముంది సాయంత్రాలు బిజీ. మూడురోజుల ఉత్సవ మేదో జరిగింది. నేను రాసిన రిపోర్ట్ కేవలం సింగిల్ కాలం వేసారు. నేను స్టాఫ్ రిపోర్టర్ రాజు గారిని అడిగాను. ఇదేమిటి సార్. తాను చాలా సిన్సియర్. తన పని తాను చేసుకునే రకం.ఎలాంటి ప్రలోభాలకూ లొంగని వాడు. హైదరాబాద్ డెస్క్ ఇంచార్జ్ గా సాహిత్య కారుడు డాక్టర్ రామకృష్ణ గారున్నారు. వీలయినప్పుడు ఒక సారి వెళ్లి కలవండి అని తానన్నాడు. ఎదో పని మీద హైదరాబాద్ వెళ్లాను. ఆ రోజు వీలు చేసుకుని సోమాజిగూడా లోని ఈనాడు ఆఫీసుకు వెళ్లాను. డెస్క్ కు వెళ్లి డాక్టర్ రామకృష్ణ గారిని కలిసాను. తాను కిందికి వచ్చి కాంటీన్ లో కూర్చుని అనేక సాహితీ సాంస్కృతిక అంశాల మీద మాట్లాడుకున్నాం. ఇద్దరమూ ఒకరికి ఒకరం నచ్చాం. విరివిగా రాయండి అన్నారాయన. ఒక్క సాహితీ సాంస్కృతిక అంశాలేకాదు సామాజిక సేవా అంశాలు కూడా రాయండి కళాకారుడికి హద్దులేముంటాయి అన్నాడు. ఇక అప్పుడు కళాభారతి హాలు,యువక కేంద్ర లో అట్లా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగనా రాసేవాన్ని. ఈనాడులో విస్తారంగా కవరేజ్ వచ్చేది. త్యాగరాజ లలిత కళాపరిషత్, కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడెమి, ఒకటేమిటి ఎన్నోసంస్థలు వాటి కార్యక్రమాలు ఈనాడు లో ప్రముఖంగా వచ్చేవి. సాయంత్రాలు వార్తల కోసం టౌన్ ఆఫీసుకు వెళ్లి చంద్రమౌళి అని టెలీప్రింటర్ ఆపరేటర్ ఉండేవాడు. అతనితో టైప్ చేయించే వాణ్ని. ఇక ప్రత్యేక కథనమయితే, ఫోటోస్ వుంటే ఐటెం రాసి, ఫోటోస్ జత చేసి ఉదయమే ఆర్టీసీ బస్ లో డ్రైవర్ కు ఇచ్చేవాన్ని. ఆ కవర్ ను హైదరాబాద్ జుబిలీ లేదా గౌలీగుడా బస్ స్టాండ్ లో వున్న ఈనాడు బాక్స్ వేయమని అడిగేవాన్ని. దానికోసం డ్రైవర్ కి చాయ్ కోసం కొంత డబ్బు ఇచ్చేది. అది సరిగ్గా ఈనాడు బాక్స్ లో పడితే తెల్లారి వార్తలు వచ్చేవి. అదో టెన్షన్. కానీ అందులో ఎదో తెలియని మత్తు వుండేది. ఈనాడు కోసం కేవలం కల్చరల్ సాహిత్యం మాత్రమే కాకుండా సామాజిక అంశాలూ రాసాను. వాటిల్లో ముఖ్యంగా నాకు కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. కరీంనగర్ లయన్స్ క్లబ్ వాళ్ళు LIONS CHARITABLE EYE HOSPITAL ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. డాక్టర్ భాస్కర్ మాడేకర్ అని సీనియర్ సిన్సియర్ ఫిజీషియన్ చైర్మన్ గా వుండి నిర్వహించేవారు. ఆయనే దానికి కర్త ఖర్మ క్రియ కూడా. ఒక రోజు ఆయన్ని కలిసి హాస్పిటల్ మీద రాయాలని వుంది అన్నాను. ఆయన ఆశ్చర్యపోయి మాకు కూడా కవరేజ్ ఇస్తారా అన్నాడు. అదేంటి సార్ అన్నాను. ఆదివారం సిటీ చివర రేకుర్తి లో వున్న హాస్పిటల్ కి తీసుకేళ్ళారు. అక్కడ వాళ్ళ నిబద్ధత చూసి బాగా నచ్చింది. కంటి వైద్యులు డాక్టర్ శ్రీక్రిష్ణ ఇంగ్లే, డాక్టర్ శ్రీధర్ ల సేవా గుణం ఆకట్టుకుంది. ఏముంది మంచి వార్త రాసి ఫోటోలతో పంపాను. సెంటర్ స్ప్రెడ్ లో బాగా ప్రెసెంట్ చేసారు. దానికి నేను పెట్టిన శీర్షిక ‘చీకట్లోంచి.. వెల్తురు లోకి..” డాక్టర్ భాస్కర్ మాడేకర్, డాక్టర్ శ్రీధర్ లు బాగా సంతోషపడ్డారు. అనేక సంవత్సరాల పాటు మెడికల్ గానూ ఫ్యామిలీ పరంగానూ చాలా స్నేహంగా వున్నారు. ఇక మరొక డాక్టర్ నాగభూషణం గారు, ఆయనకో గొప్ప అలవాటు వుండేది. వివిధ రూపాల్లో వున్న అందమయిన కర్ర ముక్కల్ని సేకరించడం, వాటితో పాటు కాయిన్స్, నోట్స్ ఇట్లా సేకరణ ఆయన హాబీ. ఒక రోజు ఆయన మ్యుజియం కు వెళ్లి “కర్రముక్కల్లో కమనీయ రూపాలు” అని రాసాను. ఏముంది పెద్ద హిట్. ఇక కరీంనగర్ పట్టణంలో 1969 లో ఏర్పాటయిన మ్యూజియం ఒకటి బస్ స్టాండ్ ఎదురుగా వుండేది. ఇప్పటికీ వుంది. ఎవరూ దాని వైపు చూసేవాళ్ళు కానీ సందర్శించేవాళ్ళు కానీ లేరు. దాని పైన “అజ్ఞాత వాసంలో అందాల మ్యూజియం” అని రాసాను అందరి దృష్టీ దాని వైపు మరలింది. కరీంనగర్ కు ప్రతేకమయిన వెండి తీగ పరిశ్రమ మీద రాసిన స్పెషల్ స్టోరీ స్పెషల్ గా నిలబడింది. అంతేకాదు కరీంనగర్ జిల్లా ఎల్లలుదాటిన జిల్లా వెలుగులు డాక్టర్ సి.నారాయణ రెడ్డి, బాపురెడ్డి, చిత్రకారులు  వైకుంఠం,పీ.టీ.రెడ్డి, దర్శకులు బీ.ఎస్.నారాయణ, కే.కే.రెడ్డి ఇట్లా ఎందరొ మహానుభావుల ప్రోఫయిల్ ఆర్టికల్స్  రాసాను. అప్పుడు జిల్లాలో జర్నలిస్టులుగా ఉదయం లో సాయిబాబా, ఆంద్ర ప్రభ లో దేవులపల్లి అమర్, ఆకాశవాణి కి నరహరిశర్మలు వుండేవాళ్ళు. తర్వాతి కాలంలో ఆంద్రభూమికి కే.ఎన్.చారి, ఆంధ్రజ్యోతికి ఎస్.కే.జాకీర్ తదితరులు పనిచేసారు.     

1989 సెప్టెంబర్ లో ఫైల్మ్ సొసైటీ నిర్వహణలో ‘ఇండియన్ పనోరమా’ చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేసాం. ఆంద్ర ప్రదేశ్ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పోరేషన్ సహకారం తో ఈ ఉత్సవాన్నినిర్వహించాం. అప్పుడు కలెక్టర్ శ్రీ ఐ.వి.సుబ్బారావు. వారం పాటు వెంకటేశ్వర టాకీసులో మేము నిర్వహించిన ఈ ఫెస్టివల్ లో  గౌతం ఘోశ్ ‘అంతర్జాలీ యాత్ర’. మీరా నాయర్ ‘సలాం బాంబే’, వీడు, పెస్తోంజీ, కడలి తీరత్తు, త్రిశాగ్ని,  అడలితీరత్తు తదితర సినిమాల్ని ప్రదర్శించాం. ప్రారంభోత్సవాన్ని నిర్వహించాగా కలెక్టర్ సుబ్బారావు, వామన్ రావు, మురళీమోహన్ రావు తదితరులు హాజరయ్యారు. శ్రీనివాస్ స్వాగతం చెప్పగా, నేను వందన సమర్పణ చేసాను. నాకు బాగా గుర్తు దేవులపల్లి అమర్ ఆయనకెందుకు మైకు ఇస్తున్నారు అని శ్రీనివాస్ తో అన్నాడు. నేను కొంత బాధ పడ్డప్పటికీ మౌనం వహించాను. అయితే ఈ పనోరమా ఫెస్టివల్ మొత్తం ఏ రోజుకు ఆరోజు ఈనాడులో ఆనాటి సినిమా పరిచయం రాసాను. చాలా మంది ఉదయమే ఈనాడులో అవి చదివి సినిమాకు వచ్చేవారు. ఆరకంగా ఈనాడు ఎంతగానో సాయపడింది. ఈనాడు దెబ్బకు ఉదయం జిల్లా విలేఖరి సాయి బాబా నరేడ్ల శ్రీనివాస్ ను తమ పత్రికకు, ఆంద్ర ప్రభకు గోపు లింగారెడ్డి ని CONTRIBUTORS  తీసుకున్నారు.

     ఇదంతా ఇట్లా సాగుతూ ఉండగానే కరీంనగర్ లో సాహితీ కార్యక్రమాలు జరగడం పెరిగింది. గోపు లింగా రెడ్డి ‘వికాస సాహితీ’ సంస్థ స్థాపించి శ్రీశ్రీ జయంతి లాంటి అనేక ప్రగతిశీల కార్యక్రమాలు చేసారు. ఇక లెక్చరర్లు డాక్టర్. బి.దామోదర్ రావు, డాక్టర్ గండ్ర లక్ష్మన్ రావు, డాక్టర్ డింగరి నరహరి ఆచార్య, డాక్టర్ బి.లక్ష్మయ్య, గజేందర్ రెడ్డి లాంటి వాళ్ళంతా కలిసి ‘సమతా సాహితీ’ పేర అనేక సాహితీ కార్యకరమాలు నిర్వహించారు. వారికి సాహిత్య అభిమాని గంగయ్య ఆచార్య ఎంతో సహకరించారు. ఆ తర్వాత కే.ఎస్.అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్ తదితరులు ‘సమైఖ్య సాహితి’ఏర్పాటు చేసారు. వీట మధ్య బోయినపెల్లి వెంకటరామారావు ‘జిల్లా రచయిత సంఘం’, మలయశ్రీ గారు, సబ్బని లక్ష్మినారాయన గార్లు తమ తమ సంస్థలతో పలు కార్యక్రమాలూ ప్రచురణలూ చేసారు.

అట్లా మొత్తం మీద కరీంనగర్లో ఈనాడు సాంస్కృతిక విలేఖరి ని నియమించుకోవడం..తద్వారా దినపత్రికలు విస్తృత స్థాయిలో కవరేజీ ఇచ్చి సముచితస్థానం కల్పించడం తో సాహితీ సాంస్కృతిక కార్యక్రామాల నిర్వహణ సంఖ్య చాలా పెరిగిందనే చెప్పొచ్చు.

మిగతా వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

-వారాల ఆనంద్

21 ఆగస్ట్ 2022

’24 ఫ్రేమ్స్’ భక్తి గీతాల ప్రవాహం – కవి ప్రదీప్

Posted on Updated on

https://epaper.dishadaily.com/c/69786836
“24 FRAMES” MY WEEKLY COLUMN IN DISHA DAILY

దేశ భక్తి గీతాల ప్రవాహం – కవి ప్రదీప్
+++++++ వారాల ఆనంద్

“ ఆజ్ హిమాలయ్ కే చోటీ సే
ఫిర్ హంనే లల్కారా హై
దూర్ హటో యే దునియా వాలో
యే హిందూస్తాన్ హమారా హై..”
( హిమాలయ శిఖరాల మీదినుంచి సవాల్ విసురుతున్నాం ప్రపంచ వాసులారా దూరం జరగండి ఈ భారత దేశం మాది..) అంటూ దేశభక్తి పాటను 194౩ లో ‘కిస్మత్’ సినిమాకు రాసాడు కవి ప్రదీప్. అట్లా ఆనాటి బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరిన సినీ గేయ రచయిత కవి ప్రదీప్. భారత దేశానికి స్వాతంత్రం రావడానికి నాలుగేళ్ల ముందే ఆ పాట దేశ ప్రజల్ని ఉర్రూతలూగించింది. మొదట ఆ పాట భావం అర్థం కాని బ్రిటిష్ అధికారులు పట్టించుకోలేదు. కానీ దాని అర్థం తెలిసొచ్చి వారంట్ జారీ చేసారు. దాంతో కవి ప్రదీప్ అజ్ఞాతవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే సినిమా ప్రదర్శించిన ప్రతి టాకీసులో ప్రతి షో లో పాటను మళ్ళీ మళ్ళీ రీలు వెనక్కి తిప్పి ప్రదర్శించాల్సి వచ్చింది. ఇక కేవలం ఆ ఒక్క పాటతో కిస్మత్ ఎంతగా విజయవంతమయిందంటే ఒక్క కలకత్తాలోనే మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఒకే టాకీసులో ప్రదర్శించ బడింది. కేవలం ఎనిమిది వేలకు పంపినీ హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యుటర్ కు కోటి రూపాయకు పైగా లాభించి కనక వర్షం కురిప్న్చిండా సినిమా. అంతలా ఆనాటి ప్రజల్నిఆ పాట, ఆసినిమా ఆకట్టుకుంది. కవి ప్రదీప్ ఆ పాట ఒక్కటే కాదు ఆ రోజుల్లోనే అనేక దేశ భక్తి గీతాలు రాసి, కొన్ని తానే స్వయంగా పాడి దేశ భక్తి గీతాల ప్రవాహం అయ్యాడు వాటికి శాశ్వత చిరునామా గా మిగిలాడు. భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకోవడమంటే దేశం మీద అణువణువునా ప్రేమనూ భక్తినీ స్మరించుకున్నట్టే.
ఇక 1940లో వచ్చిన బంధన్ సినిమాలో ప్రదీప్ రాసిన “ చల్ చల్ రే నౌ జవాన్, చలో సంఘ్ చలే హం, దూర్ తేరా గావ్ అవుర్ తఖే తేరా పావ్..” దేశ వ్యాప్తంగా ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాదు ఆ రోజులల్లో ఇందిరా గాంధీ ఏర్పాటు చేసిన ‘వానర సేన’ అన్న చిన్న పిల్లల గ్రూపులో ఈ పాట ఆత్మీయ గీతం అయిపొయింది. ఇంకా ఆ రోజుల్లోనే పంజాబ్, సింద్ రాష్ట్రాల్లో దాదాపు జాతీయ గీతంలా ఆ పాటను ఆలపించారు. అట్లా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే దేశభక్తిని ప్రభోదిస్తూ కవి ప్రదీప్ సినిమాల్లో అనేక పాటలు రాసి గొప్ప ప్రేరణగా నిలిచాడు. 1962 ఇండో చైనా యుద్ధం ముగిసన తర్వాత అమర సైనికుల బలిదానాలకు కదిలిపోయి కవి ప్రదీప్ రాసిన
“ఎ మేరె వతన్ కే లోగో.. తుం ఖూబ్ లగాలో నారా..ఏ శుభ్ దిన్ హై హం సబ్ కా..లహరా తిరంగా ప్యారా..పర్ మత్ భూలో సీమా పర్…వీరోనే హై ప్రాణ్ గవాయే.. కుచ్ యాద్ ఉన్హే భీ కర్ లో.. కుచ్ యాద్ ఉన్హే భీ కర్ లో.. జో లౌట్ కే ఘర్ నా ఆయే.. జో లౌట్ కే ఘర్ నా ఆయే.. “ పాటతో మొత్తం దేశాన్ని ఏడిపించేసాడు. సామాన్య ప్రజలనే కాకుండా 1963లో ధిల్లీ నేషనల్ స్టేడియంలో ఆ పాటను లతామంగేష్కర్ హృద్యంగా పాడగా ప్రధాని నెహ్రు కదిలిపోయి ఏడిచేసాడు. లతాని దగ్గరకు తీసుకుని నన్ను ఇవ్వాళ ఎదిపించావు తల్లీ అన్నాడు. అప్పుడు పరిచయమయిన కవి ప్రదీప్ ని అదే రోజు తీన్ మూర్తిభవన్ లో ఆ పాట వినిపించేందుకు ఆహ్వానించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రదీప్ ని రాష్ట్రీయ కవిగా జాతీయ గౌరవాన్ని ప్రధానం చేసారు. ఇంకా జాగృతి లోనే గాంధీ కి నివాళి గా ప్రదీప్ రాసిన “ దే దే ఆజాది బినా ఖదగ్ బినా ఢాల్.. సాబర్మతి కే సంత్ తూనే కర్ దియా కమాల్.. అందీ మే భి జల్తీరహీ గాంధీ తెరా మషాల్..’ , ఇంకా ‘హం లాయే హై తూఫాన్ సే కష్టి నికల్’ లాంటి పాటలు ఇప్పటికీ బాలల దినోత్సం రోజున దేశమంతా వినిపిస్తూనే వుంటాయి.
అంతలా జాతీయ దేశ భక్తి భావాల్ని సినిమా పాటల్లో వికసింప చేసిన కవి ప్రదీప్ మధ్య ప్రదేశ్ లోని మాల్వా ప్రాంతానికి చెందిన ‘బడ్ నగర్’ లో 2 ఫిబ్రవరీ 1915లో జన్మించాడు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రాంచంద్ర ద్వివేది. అందరూ రామూ అని పిలిచేవారు. రామూ తల్లి భజన పాటలు పాడేది. వాటితో రామూ ప్రేరణ పొందాడు. తండ్రి నుంచి స్వాభిమానం, మొండితనం అలవడింది. స్కూల్లో టీచర్ అయినా అమ్మమ్మ వాళ్ళింట్లో మేనమామ అయినా ఒక మాటంటే పడేవాడు కాదు. అలహాబాద్ లో ఇంటర్ పూర్తి చేసుకుని లక్నో విశ్వవిద్యాలయం లో డిగ్రీ చదివాడు. తర్వాత రామూని టీచర్ ట్రైనింగ్ చేసి అధ్యాపకుడిగా చేరమని అంతా సలహా ఇచ్చారు. కానీ పిల్లలూ చదువులూ రొటీన్ తన కిష్టం లేదని. టీచర్ కాలేదు. లక్నోలో ఉండగానే రామూ కవి ప్రదీప్ గా మారి తన కవితల తో అందరినీ ఆకట్టుకోవడం ఆరంభించాడు. అప్పుడు ప్రదీప్ రాసిన “ పానీపట్” అన్న కవిత కవి సమ్మేళనాల్లో విశేష ప్రాచుర్యం పొందింది. తర్వాత ఒక కవిసమ్మేలనం లో పాల్గొనేందుకు బాంబే వెళ్ళాడు ప్రదీప్. అక్కడ అప్పటి ప్రసిద్ధ సినీ నిర్మాత దర్శకుడు హిమంశురాయ్ ప్రదీప్ కవితల్ని విన్నాడు. ఆ కవితో పనుంది ఆఫీసుకు రమ్మన్నాడు. తన ముఖం బాగానే వుంది సినిమాలో హీరో అవకాశం ఇస్తాడేమోనుకున్నాడు ప్రదీప్. కానీ కవిగా నెలకు రెండు వందల రూపాయల జీతం మీద ఉద్యోగం ఇచ్చాడు హిమాన్షు రాయ్. ఆ కాలం లో రెండు వందలంటే చాలా పెద్ద అమౌంట్. 1939లో వచ్చిన ‘కంగన్’ సినిమాకోసం 4 పాటలు రాసాడు ప్రదీప్. తర్వాత వచ్చిన ‘బంధన్’ లో 12 పాటలు రాయడమే కాకుండా మంచి స్వరమున్న ప్రదీప్ రెండు పాటలు కూడా పాడాడు.
కవి ప్రదీప్ నాస్తిక్, జాగృతి సినిమాలకు రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మత విద్వేషాలు రగిలి దేశ విభజన వల్ల కలిగిన ప్రాణ నష్టం చూసి నాస్తిక్ సినిమాకోసం రాసి పాడిన ‘దేఖ్ తేరీ సంసార్ కి హాలత్ క్యా హో గయి భగవాన్..” అ పాట ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తుంది. ఇక జాగృతి కోసం ప్రదీప్ రాసిన “ ఆవో బచ్చో తుమ్హే దిఖాయే.. వందే మాతరం వందేమాతరం..కూడా పిల్లల్నీ పెద్దల్ని ఇప్పటికీ ఆకట్టుకుంటుంది.
ఇక వ్యక్తిగత జీవితం లో ఆయన బాంబే లో ఉండగానే తల్లి దండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. భద్ర అనే అమ్మాయిని చూపించగా నేను ఇంటర్వ్యు చేయాలన్నాడు ప్రదీప్. ఏమి అడుగుతారో అని భయపడ్డ ఆమెను కేవలం ఓకే ప్రశ్న అడిగాడు. నేను ఒక మండుతున్న జ్వాలను..నువ్వు నీళ్ళ లాగా వుంటానంటే వివాహం చేసుకున్తానన్నాడు ..ఇంకేముంది పెళ్ళయిపోయింది.వాళ్లకు ఇద్దరు అమ్మాయిలు.
దేశభక్తి గీతాలతో పాటు భక్తి గీతాలు, భజన్స్ కూడా రాసాడు. ప్రదీప్ జీవితంలో విజయాలూ సంతోషాలే లేవు దుఖాలూ వున్నాయి. ప్రదీప్ తల్లి దండ్రులు ఇద్దరినీ ఒక రోజు రాత్రి గుర్తు తెలీని దుండగులు దాడి చేసి హత్య చేసారు.ఆ దుఖం నుంచి బయట పడడానికి కవిప్రదీప్ కు చాలాసమయం పట్టింది.
ఇట్లా దేశ భక్తి గీతాల కవి శిఖరం గా నిలిచిన కవి ప్రదీప్ కు జాతీయ సంగీత నాటక అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించాయి.
భారత దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా కవి ప్రదీప్ కు నివాళులు.
+++++++

దేశ భక్తి గీతాల ప్రవాహం – కవి ప్రదీప్
+++++++ వారాల ఆనంద్

24ఫ్రేమ్స్-తెలంగాణ చలనచిత్ర,టీవీ,థియేటర్ అభివృధ్ధి సంస్థ- ముందున్న కర్తవ్యాలు

Posted on

+24 ఫ్రేమ్స్ +      

 తెలంగాణ చలనచిత్ర,టీవీ,థియేటర్ అభివృధ్ధి సంస్థ- ముందున్న కర్తవ్యాలు

-వారాల ఆనంద్

        తెలంగాణ చలనచిత్ర,టీవీ,థియేటర్ అభివృధ్ధి సంస్థకు నూతన అధ్యక్షుడిని నియమించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సినిమా ఉనికి కి సంభందించి కొత్త అడుగు వేసినట్టయింది. ఆడుగు వేసినచోటే నిలిచిపోకుండా స్థిరంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతయినా వుంది.

మొదట చైర్మన్ గా పదివీ బాధ్యతల్ని స్వీకరించిన శ్రీ అనిల్ కూర్మాచలం గారిని మనసారా అభినందిస్తున్నాను.  అర్థవంతమయిన సినిమా అభిమానిగా సినిమా గురించి అందునా తెలంగాణా సినిమా గురించి అనేక ఆలోచనలు ఉన్నవాడిని. మన సినిమా గొప్పగా ఎదగాలనీ మన వాళ్ళు గొప్ప సినిమాలు తీసి ప్రపంచ పటంలో నిలబదాలనీ కోరుకుంటున్న వాడిని. అయితే అవన్నీ తీరాలంటే తెలంగాణ చలనచిత్ర,టీవీ,థియేటర్ అభివృధ్ధి సంస్థ దాని అధ్యక్షుడి ముందు చాలా పనులున్నాయి. అవన్నీ చాలా పెద్దవేమీ కాదు. కొంచెం పట్టుదల దీక్ష వుంటే తెలంగాణా సినిమాకు సంబంధించి అనేక విజయాలు సాధించవచ్చు. ఇఫ్ఫాల పెరిగిన సాంకేతికత పాన్ ఇండియా భావనతో తెలుగు సినిమాకొన్ని వ్యాపారాత్మకంగా పెద్ద విజయాల్నే సాధించింది. అయితే హైదరాబాద్లో నిలదొక్కుకున్న తెలుగు సినిమా తో పాటు తెలంగాణా సినిమాకూడా తన ఉనికి చాటుకుంటూ నిలదొక్కుకోవాల్సిన అవసరం వుంది. దానికి సంస్తా పరంగా తెలంగాణ చలనచిత్ర,టీవీ,థియేటర్ అభివృధ్ధి సంస్థ చొరవ కృషీ ఎంతయినా అవసరం.

తెలంగాణ యువత ఇవ్వాళ దృశ్య మాధ్యమంపట్ల ఎంతో అభిలాషను అభినివేశాన్నీ చూపిస్తున్నారు.కథలకు కొదువలేదు, కత్న శక్తికీ తక్కువలేదు. కావలసింది సాంకేతిక పరిణతి. దాని కోసం తెలంగాణ చలనచిత్ర,టీవీ,థియేటర్ అభివృధ్ధి సంస్థ యువత కోసం ప్రభుత్వ పరంగా ఫిలిం ఇన్స్టిట్యుట్ పెట్టవచ్చు లేదా పలు విశ్వవిద్యాలయాల్లో ఫిలిం అండ్ డిజిటల్ మీడియా కోర్సులు పెట్టవచ్చు. ప్రోత్సహించవచ్చు.

తెలంగాణా చరిత్రను, తెలంగాణా ప్రతిభా మూర్తుల డాక్యుమెంటరీలు రూపొందించి నిక్షిప్తం చేయవచ్చు. సామాజిక మాధ్యమాల విస్తృతి నేపధ్యంలో సమాచార, చారిత్రక,విజ్ఞాన డాక్యుమెంటరీల అవసరం ఎంతయినా వుంది. అంతేకాదు తెలంగాణ నిర్మాతలకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందిస్తూనే, అవార్డులతో ప్రోత్సహిస్తూనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చలన చిత్రోత్సవాలు నిర్వహించి తెలంగాణా ప్రేక్షకులకు చలనచిత్రకారులకు జాతీయ అంతర్జాతీయ సినిమా ధోరణులను పరిచయం చేసి వారి దృష్టికోణాన్ని విస్తృతం చేయాల్సి వుంది. ఫలితంగా తెలంగాణ నుంచి రొద్ద కొట్టుడు సినిమాల కన్నా  భిన్నమయిన సినిమాలు వచ్చే అవకాశం మెరుగు పడుతుంది.

      ఏ నగరం లోనయినా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ ఆ నగరానికి, ఆ రాష్ర్టానికి, విశేషమైన ప్రతిష్టని తీసుకు వస్తాయి. కేన్స్, బెర్లిన్, కార్లోవివారి చిత్రోత్సవాలు ఆ నగరాలకు దేశాలకు ఎంతటి పేరు తెచ్చాయో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత మన హైదరాబాద్ కూడా అలాం టి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు వేదికై విశ్వ వ్యాప్త గుర్తింపును సాధించాలని మంచి సినిమాల ప్రేమికులు ఆశిస్తున్నారు.  ఆక్రమంలో ఎఫ్ డీ సీ పని చేయాల్సివుంది. తెలంగాణ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా హైదరబాద్ నగరానికి రాష్ట్రానికీ అంతార్జాతీయ రంగం లో విశేష ప్రాచుర్యం లభించే అవకాశం వుంది.  వాటితో పాటు బాలల మనో వికాస రంగంలో ఎంతగానో ఉపయోగ పడే లా బాలల ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎంతో దోహద పడతాయి. విద్యాసంవత్సరం మొదలవుతున్న నేపథ్యం లో బాలల కోసం అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహిస్తే ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. ఏదో మొక్కుబడిగా నవంబర్ లో పిల్లలకోసం కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతర బాలల మనోవికాస కార్య క్రమాలు ఏర్పాటులో భాగంగా చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా నిర్వహించడం పిల్లలకు ఉత్తమ వినోదాన్ని అందించినట్టు కూడా అవుతుంది.

    అయితే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు బాలల ఉత్సవాలు రెండూ కొంత భిన్నమైనవి. బాలల చిత్రోత్సవాలు పిల్లల కోసం ప్రత్యేకించ బడినవి. ఈ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లో వున్న చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా రెండేండ్లకోసారి నిర్వహిస్తుంది. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రథమ భారత ప్రధాని నెహ్రూ ఆలోచనల మేరకు నియమించబడి న ఎస్.కె.పాటిల్ కమిటీ సూచనల ప్రకారం 1955లో ఏర్పాటయింది. బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, రెండేండ్లకోసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే దేశంలోని వివిధ నగరాల్లో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. 1995 లో మొదటి సారిగా మన హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించారు. తర్వాత 1999 లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు ఒక శాశ్వత వేదిక వుండాలని హైదరాబాద్‌ని ప్రతిపాదించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. అంతే కాదు రాష్ట్రం లో నిర్మించే బాలల చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే గొప్ప నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది.

     నిజానికి పిల్లల మనో వికాసానికి సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. చదువు మేధస్సు ఎదుగుదలకు, క్రీడలు శారీరక ఎదుగుదలకు తోడ్పడితే సాంస్కృతిక విషయాలు వారి వ్యక్తిత్వ ఎదుగుదలకి దోహదపడి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఇస్తాయి. సాంస్కృతిక విషయాల్లో దృశ్య మాధ్యమాలు పిల్లల పైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే సినిమాను పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించి వారికి అందించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇరాన్ లాంటి దేశాల పిల్లల చిత్రాల్ని ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలు మహా నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెల్లో వుండే బాలలకూ ప్రదర్శించగలిగితే గొప్పగా వుంటుంది. దానికి జిల్లాల స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసి, ఎప్పుడో రెండేండ్లకోసారి కాకుండా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాల్ని అందించగలిగితే బాలలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, రష్యాల నుంచి వచ్చిన పిల్లల సినిమాలు అద్భుతంగానూ, భావస్పోరకంగానూ వుంటాయి. అవి మొత్తం ప్రపంచాన్ని కట్టి పడే శాయి. ఇరాన్ సినిమాలకున్న నేపథ్యం మన తెలంగాణకూ ఉన్నది. కావలసిందల్లా ఇరాన్‌లో లాగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సి ఉన్నది. మన దర్శకులు కూడా రొడ్డకొట్టుడు నీతి బోధల సినిమాలు కాకుండా భిన్నంగా బాలల మనసుల్ని గెలుచుకునే సినిమాలు నిర్మించ గలిగితే తెలంగాణ గొప్ప బాలల చిత్రాలకు వేదికయ్యే అవకాశం ఉన్నది. విలక్షణమైన కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశలో అడుగులు వేస్తుందనే ఆశ ఉన్నది. మన పిల్లల కోసం కేజీ టు పీజీ విద్యతోపాటు ఉత్తమ వినోదాన్ని కూడా అందించాల్సి ఉన్నది.

  పిల్లల సినిమాల కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన చర్యలు కొన్ని వున్నాయి:

1) బాలల సినినిమాలకు టాక్స్ మినహాయింపులు 3) తెలంగాణలో నిర్మించే బాలల సినిమాల కు ఆర్థిక సహకారం తో పాటు ఏటా అవార్డులు, ప్రోత్సాహకాలు,4) పిల్లల సినిమాల కోసం రాష్ట్రం లోని థియేటర్లల్లో ప్రత్యేక సమయం కేటాయించాలి. 5) జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పల్లెటూరి పిల్లలకు కూడా ప్రపంచ స్థాయి పిల్లల సినిమాల్ని ప్రదర్శించాలి.6) వీలయితే రాష్ట్ర స్థాయిలో చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటి ఆఫ్ తెలంగాణ ను ఏర్పాటు చేసుకోవాలి.

-వారాల ఆనంద్

24 ఫ్రేమ్స్-కోట్లు కొల్ల గొట్టడమే పరమావధి

Posted on Updated on

//24 ఫ్రేమ్స్//

కోట్లు  కొల్ల గొట్టదమే పరమావధి

-వారాల ఆనంద్

            కోట్లు పెట్టు… కొల్ల గొట్టు… తగ్గేదే లే … ఇదీ ఇవ్వాల్టి సినిమా నినాదం. ఒక రకంగా తెలుగు సినిమాకు అది బజ్ వర్డ్. సినిమ సర్వకళా మిశ్రమం, 24 కళల సంగమం, కళాత్మక  సినిమా..ప్రజల సినిమా లాంటి మాటలకు నేడు అర్థం లేకుండా పోయింది. అవన్నీ అంతరించి పోయిన మాటలు. మరో రకంగా చెప్పాలంటే అర్థం లేని ‘పురావస్తు’ మాటలు. ఇప్పుడు సినిమా వ్యాపారత్మక కళ కూడా కాదు అది కేవలం ఒక  ‘పరిశ్రమ’, ఒక వ్యాపారం. పెట్టుబడి లాభాలు ప్రచారం ప్రాభవం వున్న రంగం.అంతేకాదు ఇవ్వాల్టి సినిమాకు  కేవలం మార్కెట్ ఒక్కటే భూమిక. ఈ రోజుల్లో కథేమిటి, సబ్జేక్టేమిటి, తీసే సరళి ఏమిటి అన్న విషయాల కంటే ఎంత పెట్టుబడి ఎంతమంది స్టార్లు అన్నదే ప్రధానమయిన అంశంగా మారి పోయింది. అంతే కాదు ఎన్ని వందల వేల సినిమా హాల్లల్లో విడుదల అన్నదీ లక్ష్యమే.  హిందీతో సహా దాదాపు అన్ని భారతీయ భాషాసినిమాల స్థితీ ఇదే. అయితే ఆ దిశలో మన తెలుగు సినిమా “పాన్ ఇండియా” ప్రాభవాన్ని కలిగి వుంది. అంటే అన్ని భాషలకూ ఈ విషయంలో దాదాపు మార్గదర్హకంగా వుంది.

  వర్తమాన సినిమాకు సంబంధించిన ఒక కొత్త ఒరవడిని మనం గమనించవచ్చు. తెలుగులో ఒక సినిమా నిర్మాణానికి పూనుకుంటే మొదట స్టార్లు స్టార్ డైరెక్టర్లు కావాలి. కోట్ల పెట్టుబడి కావాలి. ఆ విషయాలని షూటింగ్  మొదటి రోజుల్నించే విస్తృత ప్రచారం లోకి తేవాలి. నిర్మాణానికి రెండు మూడేళ్ళు తీసుకోవాలి. ఇక అప్పటినుండి అన్ని రోజులూ ప్రచారమే. షూటింగ్ కాలంలో ప్రతి చిన్నా పెద్దా సంఘటన ఒక ఈవెంటే. దాంతో జనాల్లో ఎంత గొప్ప సినిమా తయారవుతున్నదో అన్న భ్రమ ఏర్పడిపోతుంది. స్టార్ల అభిమానులూ వాళ్ళ సందడీ ఈ రెండు మూడేళ్ళు ఎట్లాగూ వుంటుంది. ఫస్ట్ లుక్ అవుట్ అనీ… సెకండ్ లుక్ అనీ రక రకాలుగా ప్రచార వ్యుహాలు ఉండనే వున్నాయి. దేశ విదేశాల్లో చమటలు కక్కి నిర్మాణం పూర్తి అయ్యాక విడుదల మరో గొప్ప ఈవెంట్ అవుతుంది. రిలీజ్ బహుశా  ఇప్పుడూ అప్పుడూ అంటూ ఊదరగొట్టేస్తారు.ఇంక ఏముంది ప్రజల్లో ఒక ఉత్కంట పెరిగి పోతుంది. తాము ఆఈవెంట్ లో పాల్గొనక పోతే ఎట్లా అన్న “మాస్ హిస్టీరియా’ స్థితి ఏర్పడుతుంది. వందలాది థియేటర్ల లలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతాయి. అడ్వాన్స్ బుకింగులూ అవీ ఉండనే వున్నాయి. మొదటి మూడు రోజులూ జనం క్రిక్కిరిసి పోతారు( తర్వాతి రోజులు ఆ సినిమా భవిష్యత్తును తెలుస్తంది అది వేరే సంగతి). ఇటీవలి కాలంలో మరో ఒరవడి మొదలయింది. ప్రతి కోట్లాది రూపాయల సినిమానీ అనేక భాషల్లోకి డబ్ (అనువాదం) చేసి దేశ విదేశాల్లో ఒకే సారి విడుదల చేయడం. దాన్నే “పాన్ ఇండియన్ సినిమా” అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.  అన్ని ప్రాంతాల ప్రజలు ఆ రిలీజ్ ఈవెంట్లో భాగస్వాములు అవుతారు.

     ఇటీవల ఈ రకంగా విడుదల అయిన తెలుగు సినిమాలు రెండు భిన్నమయిన అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. అల్లు అర్జున్ “పుష్ప”ది మొదటి అనుభవం. పుష్ప కొంత భిన్నంగా వుండడం మార్కెటింగ్ చాలా ప్లాన్గా  చేయడం తో విజయవంతమయిన సినిమాగా నిలిచి నిర్మాతలకు ఆర్థికంగా గొప్ప లాభాల్ని అందించిందని టాక్.

       కానీ తర్వాత విడుదల అయిన పవన్ కళ్యాణ్ సినిమా”భీమ్లా నాయాక్” టికెట్ రేట్ల వివాదాన్నీ, రాజకీయ వొత్తిడి నీ ఎదుర్కొంది. కానీ జనం ఆ సినిమా అంటే పడి  చచ్చారని పవన్ కళ్యాణ్ వెంటే వున్నారని ప్రచారమూదర గొట్టారు.. కానీ సినిమా రెండవ వారం తర్వాత స్లో అయిందని ఆశించిన స్థాయిలో ఆర్థికంగా నిలబడలేదని కథనాలు వేలువడ్డాయి. లోగుట్టు పెరుమాల్లకు ఎరుక. ఇక బాహుబలి తర్వాత ఎంతో ప్రాచార ఆడంబరం తో వెలువడ్డ సినిమా “ రాధే శ్యాం” . సినిమాకు ఖర్చు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ప్రచారం చేసిన ఆ సినిమా కుప్పకూలిపోవడం తెలుగు సినిమా రంగానికి విషాదమే. బాహుబలి తో దేశ వ్యాప్త పేరు ప్రచారం పొందిన ప్రభాస్ కు కూడా ఇది ఊహించని దెబ్బే అనిపిస్తున్నది. ఇక ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో తేలాల్సింది ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా భవిష్యత్తు. దాని ఫలితం తెలుగు సినిమా రంగ బవిష్యత్తు నిర్దేశిష్టుంది. చూద్దాం. మార్కెటింగ్ తో తెలుగు సినిమా రంగం ఎ మేరకు నిలబడుతుందా చూడాలి.

++++++++

నంది అవార్డులు లేవు ఫిలిం ఫెస్టివల్స్ లేవు

——

ఇంతగా పెట్టుబడీ ప్రచారమూ అన్న ఉప్పెనలో కొట్టుకు పోతున్న తెలుగు సినిమా రంగం గుర్తింపుని గౌరవాన్ని గురించిన సోయిని కోల్పోయిందనే చెప్పుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలూ సినిమా రంగం పైన దృష్టి పెట్టలేదనే చెప్పాలి.  రెండు రాష్త్రాలు థియేటర్ల లో టికెట్ రెట్లు తగ్గించడమా పెంచడమా.. అయిదవ శో కు అనుమతి ఇవ్వడమా లేదా.. బెనిఫిట్ శో ల సంగతేమిటి అన్న విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టాయి. ఆంద్ర ప్రభుత్వం రెట్లు తగ్గిస్తే తెలంగాణా ప్రభుత్వం సినిమా వాళ్ళకు అనుకూలంగా చర్యలు తీసుకుంది.

           కానీ రెండు రాష్ట్రాల్లో కూడా సినిమాలకు ఏటా ఇచ్చే అవార్డులు, నిర్వహించే ఫిలిం ఫెస్టివల్స్ గురించిన ఊసేలేకుండా పోయింది. ప్రభుత్వాలు ఫిలిం డెవెలప్మెంట్ గురించి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నది నిజం. సినిమా వాళ్ళకు ఆ వాటి పట్టింపే లేదు. 

   నిజానికి  అవార్డు ఒక గుర్తింపు. సాహితీ సాంస్కృతిక సామాజిక రంగాల్లో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ చేసిన విశ్టిష్ట మయిన కృషికి గుర్తింపుగా ఇచ్చే ప్రశంస. అది హార్దికంగానూ లేదా ఆర్థిక ప్రోత్సాహకంగానూ వుండొచ్చు. లేదా బిరుదులాంటిది కూడా కావొచ్చు.  ప్రపంచ వాప్తంగా పలు సంస్థలూ, వ్యక్తులూ, ప్రభుత్వాలూ అనేక అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అవార్డులు స్వీకర్తల కృషికి గుర్తింపునూ, మునుముందు మరింత కృషి చేసేందుకు దోహదం చేస్తాయి. ఆస్కార్ అవార్డులు అందుకు ఉదాహరణ. ఇక ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించడం వలన ప్రపంచ వ్యాప్త సినిమాను వీక్షించే అవకాశం కలుగుతుంది. మనమెట్లా అభివృద్ది చెందాలో తెలుస్తుంది. నేర్చుకునే అవకాశం కలుగుతుంది.ఈ విషయం లో  కేంద్రం పై ఎన్ని వివాదాలున్నా ఏటా క్రమం తప్పకుండా మంచి సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించడం చేస్తున్నది.  ఆ సోయి తెలుగు ప్రభుత్వాలకు లేకపోవడం ఆశ్చర్యం.  2014 దాకా క్రమం తప్పకుండా ఇస్తూ వచ్చిన “నంది” అవార్డులు మూలన పడ్డాయి.

         ఇక అంతర్జాతీయ బాల చలన చిత్రోత్సవాల్ని2003 నుంచీ  హైదరాబాద్ లో శాశ్వత కేంద్రం గా నిర్వహించేవారు.  అందుకు అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న జైపాల్ రెడ్డి కృషిని గుర్తు చేసుకోవాలి. కానీ 2017 తర్వాత దాని ఊసే లేకుండా పోయింది.

       పురస్కారాలూ, ఫిలిం ఫెస్టివల్స్ ఫిషయం లో ‘పాన్ ఇండియన్ సినిమా’ అని చెప్పుంటున్న తెలుగు సినిమా రంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్యలు  తీసుకోవాల్సి వుంది. చూద్దాం.

-వారాల ఆనంద్  

24 ఫ్రేమ్స్- ప్రేక్షకులు ఎట్లా రూపొందుతారు

Posted on

మంచి ప్రేక్షకులు ఎట్లా రూపొండుతారు

++++++++++++++++++ వారాల ఆనంద్

‘24 ఫ్రేమ్స్’ My WEEKLY COLUMN PUBLISHED TODAY IN “DISHA DAILY”

      స్నేహాలు పదహారేళ్ళ లోపే చేయాలి. ఆ స్నేహితులే ఎప్పటికీ హితులై, సన్నిహితులై, స్వార్థ రహితులై వుంటారు. సదా ప్రేమ, అభిమానం కలిగి వుంటారు.  

టీనేజి దాటింతర్వాత ఏర్పడే స్నేహాల్లో అత్యధిక శాతం స్వార్థంతో అవసరార్థం ఏర్పడతాయి. ఇవ్వడం పుచ్చుకోవడం నాకేమిటి నీకేమిటి అంటాయి.

అంటే ఒక రకంగా బాల్యంలో చేసే స్నేహాలే మంచిగానూ స్వచ్చంగానూ ఉంటాయన్నమాట. ఆ కాలంలోనే మనలో కలిగే సాన్నిహిత్యాలూ అంత గొప్పగా వుంటాయి. చిన్నప్పుడే మనం, మన మనసులు తెల్ల కాగితంలాగా, చాక్ పీసు అంటని పలకలా వుంటాయి. వాటి మీద ఏ ముద్ర వేస్తే ఆ ఛాయలే జీవితాంతం వుంటాయి. సరిగ్గా స్నేహాల్లానే మానవీయ విలువలు, కళలూ కూడా. చిన్నప్పుడే సాహిత్యమూ సంగీతమూ, చిత్ర లేఖనం లాంటి వాటిని పిల్లలకు సరయిన రీతిలో సరిగ్గా అందిస్తే భవిష్యత్తులో వాళ్ళు మంచి మనుషులుగా ఎదుగుతారు.

     సందేహం లేదు అత్యంత ప్రభావవంతమయిన సినిమా విషయమూ అంతే. మంచి సినిమా అంటే ఏమిటి, ఏది మంచి సినిమా, ఎందుకు మంచి సినిమా అన్నవేవీ పిల్లలకు యువకులకు చెప్పకుండా వీళ్ళంతా పాడయిపోతున్నారు. మంచి సినిమాల్ని చూడడం లేదు. చెడ్డ సినిమాల ప్రభావం వల్లనే మొత్తం సమాజంలో ఆత్మీయతలు అభిమానాలు కరిగిపోతున్నాయి, అంతా కాలక్షేపం వ్యాపారం అయిపొయింది అని పెద్దలంతా ఇవ్వాళ మాట్లాడుతూ వుంటారు. నిజానికి పిల్లలు మంచి ప్రేక్షకులుగానూ, మంచి యువకులుగానూ  ఎదగక పోవడానికి కారణాలు ఏమిటని పెద్దలు ఆలోచిస్తున్నారా? చెడిపోతున్నారు అనడం, వాదించడం, వేదనపడడం తప్ప. మంచి ఏదో, చెడు ఎదో చెప్పకుండానే మంచి ప్రేక్షకులు ఎట్లా తయారవుతారు? దానికి బాధ్యత ఖచ్చితంగా పెద్దలదీ ఈ సమాజానిదే.

                                                   …

     పిల్లలకు విద్యతో పాటు వినోదమూ అవసరం. విద్యతో పాటు ఆటవిడుపూ కావాలి. గతంలో లాగా మరివ్వాళ “ గోటీలాట లేదు, బొంగరాలు లేవు, ఎగిరే గాలిపటాలు లేవు, చార్ పత్తా లేదు, చిర్రగొనె లేదు, పచ్చీసు లేదు, పున్జీతం లేదు. చివరికి కబడ్డీ, ఖో ఖో.చెస్ లు కూడా ఎక్కడో స్టేడియంలోనొ అకాడేమీల్లోనో కనిపిస్తాయి. మరి అలాంటప్పుడు  పిల్లలకు ఆటవిడుపు ఏది ఎక్కడుంది. ఇవ్వాళ వాళ్లకు వినోదమంటే కేవలం చేతిలో వున్న స్మార్ట్ ఫోన్ మాత్రమే. వాటిల్లో చూసే వీడియోలు, ఆడే గేమ్స్, లేదా మల్టీ ప్లేక్స్ లో సినిమాలు అంతే. ఫలితంగా వాళ్ళల్లో సామూహిక వినోదం కనుమరుగయి పోతోంది.

స్మార్ట్ ఫోన్స్ వాళ్ళని ఒంటిగాళ్ళను చేస్తున్నాయి. మల్టీ ప్లెక్ష్ లు, సినిమా హాళ్ళూ, అక్కడి కాంటీన్లూ వాళ్ళని ఎలైట్ లను చేస్తున్నాయి. ఇక మంచి చెడుల విచక్షణకు అవకాశం ఎక్కడ.

ఇండ్లల్లో పిల్లలు పెద్దలు కనీసం తల్లి దండ్రులు కలిసి కూర్చుని ముచ్చట్లు పెట్టె స్థితి ఉందా.. అంతా ఎవరికీ వారు తమ తమ సెల్ ఫోన్లల్లో బిజీ. చుట్టాలూ పక్కాలూ స్నేహితులూ రావడం పోవడం అరుదు. కరోనా తో మరింత మారిపోయింది. దాంతో పిల్లలు పెద్దలు అంతా ఒంటరితనంలోనే . ఇక వారాంతాల్లో పిక్నిక్ లకూ చారిత్రిక ప్రదేశాలను దర్శించడంకంటే రెస్టారెంట్లకు వెళ్ళడం పట్లనే ఎక్కువ మక్కువయింది.

ఈ నేపధ్యంలో మంచి మనుషులు, మంచి ప్రేక్షకులు, శ్రోతలు ఎట్లా రూపొందుతారు.

మరో విషయం 90 ల తర్వాత ఒక వైపు ప్రపంచీకరణ, ఇంకోవైపు టెక్నాలజీ చదువులు విద్యార్థుల్ని ఒక చిత్రమయిన పోటీ ప్రపంచంలోకి నేట్టేసాయి. తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే విజ్ఞాన్, వికాస్, నారాయణ, చైతన్య, రామయ్య ఐ ఐ టి లాంటి సంస్థలు వచ్చి విద్యనూ వ్యాపారమే కాదు పోటీ కేంద్రాలుగా EDUCATION GYMS గా మార్చేశాయి. కేవలం లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ లు చదవడమే జీవితానికి పరమావధిని చేసేసాయి. తెలుగు స్కోరింగ్ కాదని సంస్కృతాన్ని తెచ్చారు. అక్కడితో ఆగలేదు ఇంగ్లీష్, సంస్కృతాలు ఏడాది చివర ఒక నెల బట్టీ పట్టి చదివి 100 శాతం మార్కులు సాధించే సౌలభ్యాన్ని కనిపెట్టారు. దాంతో విద్యార్థులకు భాషా సాహిత్యాలతో సంభందమే లేకుండా పోయింది. సైన్స్, టెక్నాలజీ చదువవద్దని నేను అనడం లేదు.. పోటీలో నిలబడాల్సిందే కానీ గత ఇరవై ఏళ్ళల్లో మూలాల్ని విడిచి ఎదిగిన తరం ఎంతగా యాంత్రిక జీవులై పోయారో చూస్తూనే వున్నాం. ‘”యంత్రాలలో తడిని ఆర్ద్రతను ఆశించడం అత్యాశే” కదా. ఈ స్థితికి కేవలం పిల్లల్ని బాధ్యులను చేయడం అన్యాయం.

ఇప్పటికయినా పిల్లలు మంచి పాఠకులు,శ్రోతలు, ప్రేక్షకులు..మొత్తంగా మంచి మనుషులుగా ఎదగడానికి పెద్దలూ, సమాజం, పాలకులు ఆలోచించాల్సి వుంది. ప్రణాళికతో కృషి  చేయాల్సి వుంది. మంచి పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు తయారవడానికి స్కూలు స్థాయి నుంచే వారి ప్రధాన స్రవంతి విద్యకు భంగం కలగాకుండానే అనేక పనులు చేయొచ్చు.  

నేనిక్కడ మంచి ప్రేక్షకులు తయారవడానికి తయారుచేయడానికి నావి కొన్ని ఆలోచనలు అనుభవాలు పంచుకుంటాను (మిగతా వాటి గురించి మరోసారి).

డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం వసతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని స్కూళ్ళు కాలేజీల్లో విజువల్ సంస్కృతి పెరిగిపోయింది. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ (LOOK CULTURE REPLACED THE BOOK CULTURE) వచ్చింది.  అంటే చదవడం స్థానం చూడడమే ఇవ్వాల్టి విద్యా లక్షణం. దాంతో టీవీ, ఇంటర్నెట్, వీడియో ప్రొజెక్షన్ తో పాటు అనేక వసతులు స్కూళ్ళల్లో కాలేజీల్లో అందుబాటులోకి వచ్చాయి. ఆ స్థితిని అవకాశంగా తీసుకుని విద్యాసంస్థల్లో ఫిలిం క్లబ్స్ పెట్టాలి. వీలయితే అందరు స్టూడెంట్స్ నీ అందులో చేర్చాలి లేదా ఆసక్తి అభినివేశం వున్నవాళ్ళనయినా చేర్చాలి. నెలకు కనీసం ఒకటి లేదా రెండు మంచి సినిమాల్నీ, షార్ట్ ఫిలిమ్స్ నీ ప్రదర్శించాలి. ఎన్నో మంచి సినిమాలు ఆన్లైన్ లో అందుబాటులో వున్నాయి. సినిమా ప్రదర్శన తర్వాత “వీక్షించండి-సమీక్షించండి” (VIEW AND REVIEW) అని ఓ వ్యాస రచన లేదా ఉపన్యాస పోటీ  పెట్టామనుకోండి సినిమా మంచి చెడుల సమీక్ష, భావవ్యక్తీకరణ శక్తి పెరుగుతాయి. టీచర్లు లెక్చరర్లు అవసరమయిన చోట విద్యార్థుల్ని సరి చేసి వీలయినంత మేర తమ అభిప్రాయాల్ని చెప్పి వాళ్ళను మరింత మెరుగు పరచవచ్చు. అర్థ వంతమయిన సినిమాలు చూడడంతో విద్యార్థులకు నిరర్ధక మయిన సినిమాలేవో తెలిసి పోతాయి. అంతే కాదు ఫిలిం APPREIATION పేర సినిమాలకు సంబంధించి అనేక విషయాలనూ వాళ్లకు అందించవచ్చు. స్కూళ్ళల్లో ప్రదర్శిచడానికి అనేక పిల్లల సినిమాలు చార్లీ చాప్లిన్ సినిమాలతో సహా అందుబాటులో వున్నాయి. CHILDREN FILM SOCIETY OF INDIA రూపొందించిన సినిమాలూ వున్నాయి.

ఇక కాలేజీ విద్యార్థులకు అయితే జాతీయ అంతర్జాతీయ సినిమాలు అనేకం ఆన్ లైన్ లో వున్నాయి. వాళ్లకు సినిమాలు చూపించడమే కాకుండా ఫిలిం మేకింగ్ కు సంబంధించి శిక్షణ కూడా ఇవ్వొచ్చు. ఈ రోజులల్లో సెల్ ఫోన్ వున్న ప్రతి వాడూ వీడియోలు తీస్తున్నాడు. అలాంటి యువతీ యువకులకు వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ బాగా ఎట్లా తీయాలి,కాన్సెప్ట్ నుంచి ఫైనల్ ఫిలిం దాకా INTRODUCTORY CLASSES  OR LECTURES  నిర్వహించ వచ్చు. అట్లా స్కూలు కాలేజీ స్థాయి నుండే మంచి సినిమాల్ని చూడడం వాటి గురించిన అవగాహన కలగడం ఉత్తమ ప్రేక్షకులుగా తయారయే దిశలో మొదటి అడుగు పడినట్టే. ‘తొలి అడుగు బలంగా పడితే ఇక ముందుకు పరుగు తీయడం సులభమే’. అందుకే విద్యాసంస్థల్లో ఫిలిం క్లబ్స్ చాలా అవసరం. పదేళ్ళ క్రితం నేనా ప్రయత్నం చేసాను. ఉమ్మడి రాష్త్రం లో  ఆదిలాబాద్ నుండి ఒంగోల్ దాకా అనేక కాలేజీల్లో కాంపస్ ఫిలిం క్లబ్స్ మొదలు పెట్టించాను. అధ్యాపకులు చొరవ తీసుకున్నన్ని రోజులూ అవన్నీ బాగా నడిచాయి. ఇప్పటి స్థితి తెలీదు. ఆ ప్రయత్నం కొనసాగాలి. దానికి రాష్ట్రస్తాయిలో విద్యాశాఖాదికారులు నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వగలిగితే కరికులం లో భాగంగా కాంపస్ ఫిలిం క్లబ్స్ ని నిర్వహించవచ్చు. స్కూలు కాలేజీ స్థాయిలో బీజం పడితే భావిష్యత్హులో మంచి ప్రేక్షకుల సంఖ్యా గొప్పగా పెరిగే అవకాశం వుంది.      

మరిన్ని ఆలోచనలు మళ్ళీ వారం…

  • వారాల ఆనంద్ 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

హీరోయిజం.. డ్యూటీ దిగాల్సిందే

Posted on

——————-

హీరోయిజం.. డ్యూటీ దిగాల్సిందే

24 ఫ్రేమ్స్

——————-

హీరోయిజం.. డ్యూటీ దిగాల్సిందే 

++++++++ వారాల ఆనంద్

***************************************

ఇజ్జతే శౌరతే

చాహతే ఉల్ఫతే

కోయీ భీ చీజ్

దునియామే రహతే నహీ

ఆజ్ మై హూన్ జహాన్

కల్ కోయీ అవుర్ థా…

ఏభీ ఏక్  దౌర్ హై

వొ భీ ఏక్ దౌర్ థా …

ఇది 1972 లో వచ్చిన సూపర్ హిట్ హిందీ సినిమా ‘దాగ్’ లోని ఒక డైలాగ్.

అక్తర్ ఉల్ ఇమాన్ రాసిన ఈ మాటలు ఎంత గొప్ప మాటలు. ఈ మాటలు మన తెలుగు సినిమావాళ్ళకు తెలుసో లేదో తెలీదు. తెలిసినా గుర్తుందో లేదో.. ఎందుకంటే ఎంతటివయినా ‘గౌరవాలూ మర్యాదలూ ఘనతలూ గొప్పలూ విజయాలూ ఈ లోకంలో శాశ్వతం కాదు. ఇవాళ నేనున్న స్థానంలో నిన్న మరొకరున్నారు. ఇదొక యుగం..అయితే..అదొక యుగం. యుగాలు మారినప్పుడల్లా కాలంతో పాటు ప్రజలూ మారతారు. వాళ్ళ ఇష్టాలూ మారతాయి. వారి అభీష్టాల మేరకు మనమూ మారాలి లేదా ఘోర వైఫల్యాలు తప్పవు.  స్థూలంగా ఇదీ వాస్తవం. ఇదే వాస్తవం. అయినా మన తెలుగు సినిమా వాళ్ళు ఇప్పటికీ ఇంకా ‘రామారావు-ఆన్ డ్యూటీ’ అంటే ఎట్లా. ఎవరు భరిస్తారు. డబ్బులు ఇచ్చి మరీ ఎందుకు భరిస్తారు. ఆచార్యలూ..రామారావులు డ్యూటీ నుంచి దిగి పోవల్సిన కాలం వచ్చేసింది. అది గమనించకుండా సినిమాలు తీస్తే రెండో ఆటకల్లా దుకాణాలు మూసేయాల్సి వస్తుంది. మన తెలుగు సినిమా వాళ్ళు తాము తీస్తున్న సినిమాల్లో వున్న లోటు పాట్లనీ, సమస్యల్ని, ఆకట్టుకోలేని తనాన్ని గమనించడం లేదు. సినిమా హాల్లకు ప్రేక్షకులు రావడం లేదని వాపోవడం తప్ప ఎందుకు రావడంలేదో ఆలోచంచడం లేదు. పైగా నేరం ఓ.టీ.టీ.ల పైనో మరో దాని పైనో వేస్తున్నారు. రోగం ఒక చోట వుంటే మందొక చోట పెట్టె ప్రయత్నం అన్నమాట. ఒకటి రెండు దశాబ్దాల క్రితం వున్నట్టు ఇప్పటికీ హీరోయిజం పైనో, హీరో హైప్ పనో సినిమాలు తీస్తే చూడడానికి ఇవ్వాల్టి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. దీన్ని సినిమా నిర్మాతలు,దర్శకులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేకుంటే స్టార్ హీరో లతో పాటు అందరూ డ్యూటీలు దిగి పోవాల్సే వస్తుంది. స్వచ్చంద పదవీ విరమణలూ తప్పవు.

     ఇప్పటి సినిమా నిర్మాతలూ దర్శకులూ ఒకవిషయం ఆలోచించాలి. అలనాటి ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ లాంటి సినిమాలు టీవీల్లో వస్తే ప్రజలు ఎందుకు ఎన్నిసార్లయినా చూస్తున్నారు?, అవి వారికి ఎందుకు బోర్ కొట్టడం లేదు?

ఎందుకంటే వాటిల్లో కథ వుంది, ఆసక్తికరమయిన కథనం వుంది. మూడు గంటల పాటు కట్టి పడేసే ఒక బిగువు వుంది. అది కదా వ్యాపార సినిమాల కయినా ఉండాల్సిన లక్షణం. మరివ్వాళ ఇప్పటికీ హీరోలు గాల్లో ఎగురుతారు..అర్థం పర్థం లేని మాటలు పాటలు ఒకటేమిటి అంతా గోలగోల.. ప్రేక్షకులు తమ గోలను తప్పించుకోవడానికి మీ సినిమాలకు వస్తే హింసకు గురి చేసి ఎందుకు వచ్చాం రా బాబు అనేట్టుగా సినిమాలుంటే ఎట్లా.    

“నిజానికి సినిమాల్లో మనం కథ చెప్పం చూపిస్తాం”.

అంటే సినిమా నిర్మాణానికి మంచి కథ కావాలి. సినిమాలో మొదట చెప్పడానికి ఒక మంచి కథను ఎన్నుకుంటాం. దాన్ని దృశ్య రూపంలోకి మార్చి ఆద్యంతం ఆసక్తికరమయిన కథనంతో సినిమాను నడిపిస్తాం. అప్పుడు కదా సీట్లో ప్రేక్షకుడు కుదురుగా కూర్చునేది. కథనానిది సినిమాలో ప్రధాన భూమిక. కథనం అంటే కథను నడిపించే మాధ్యమం. అది ఎంత పకడ్బందీగా వుంటే సినిమా అంత బిగువుగానూ ఆసక్తిగానూ వుంటుంది. ఇక మన భారతీయ సినిమాల్లో పాటలు సంగీతం అంతర్భాగం. అవి లేకుండా భారతీయ వ్యాపార సినిమాను ఊహించలేము. అయితే సినిమాల్లో పాటలు కథలో అంతర్భాగం అయివుండాలి. అంతే కాదు సినిమా కథను ముందుకు నడిపించేలా కొనసాగించేలా వుండాలి. ఇక నేపధ్య సంగీతం ఆయా దృశ్యాల మూడ్ ను ప్రక్షకుల్లో ప్రోది చేసేందుకు సహకరించాలి. మాటలూ అంతే.సినిమా ప్రధానంగా దృశ్య మాధ్యమం అయినప్పటికీ మాటలు ఆయా పాత్రల మౌలిక లక్షణాన్ని

 Characterization ని ఆవిష్కరించాలి. ఇక చివరగా ఎడిటింగ్. కథకు అన్వయంగా ఎంత జాగ్రత్తగా చేస్తే సినిమా అంత బాగా వస్తుంది. కానీ ఇవేవీ మన వాళ్ళు ఆలోచిస్తున్నట్టు లేదు. అంతా రోడ్ద కొట్టుడు యవ్వారం.

       కొంచెసేపు నిజాలు మాట్లాడుకుందాం. అసలివాల తెలుగులో వస్తున్న చాలా సినిమాల్ని చూస్తే వాటిల్లో చెప్పడానికి ఏదయినా కథ ఉందా అనిపిస్తుంది. అసలు కథ పట్ల మన వాళ్లకు ఏదయినా, ఎలాంటిదయినా సరే అవగాహన అనేది ఉందా అనిపిస్తుంది. హీరో కాల్ షీట్స్ దొరికితే చాలు కథ లాంటి దాన్ని వండేయొచ్చు అనుకుంటారు. కేవలం హీరో మార్కెట్ పైన సినిమా ఆడుతుంది అనుకుంటారు. అక్కడే ఇవ్వాళ మన తెలుగు సినిమా ఆగిపోయింది. మూవింగ్ ఇమేజెస్ కాస్తా స్టిల్ అయిపోయాయి. సరిగ్గా ఫైల్యూర్ అక్కడే మొదలవుతున్నది. వెతికితే జాగ్రత్తగా చూస్తే మన తెలుగు సాహిత్యంలోనూ, మొత్తంగా భారతీయ సాహిత్యం లోనూ ఎన్నికథలు లేవు. వామ్మో సాహిత్యంలోని కథలా అనుకుంటే ఎట్లా. రావిశాస్త్రి,కోకు,కాళీపట్నం,భరద్వాజ,చలం,అంపశయ్య నవీన్, అల్లం రాజయ్య,తుమ్మేటి లాంటి ఎంతో మంది రాసిన ఎన్ని కథలున్నాయి. ఆయా కథల్లోని కొన్ని సంఘటనల్ని తీసుకున్నా మంచి కథనంతో పూర్తి నిడివి కథలు అవుతాయి. మన జన జీవితం లో ఎన్నెన్ని కథలు కనిపిస్తాయి.. వాటిని ఎప్పుడయినా చూస్తామా.. లేదే. ఇప్పుడు బియోపిక్ ల కాలం నడుస్తోంది. ఎంత మంది మహానుభావుల జీవితాలు తెలుసు మనకు. గంగుభాయ్, ఝుండ్, రాకేట్రీ, మహానటి లాంటి ఎన్ని సినిమాలు బయోపిక్స్ గా విజయవంతం కాలేదు. తెలుగు సినిమావాళ్ళల్లో నాకు తెలిసి కథల పట్ల అంతగా అవగాహన వున్న వాళ్ళు తక్కువ. అట్లాగే కథా రచయితల పట్ల గౌరవం తక్కువ. వాళ్లకు ఇచ్చే పారితోషకాలు గౌరవాలు తక్కువే. మరిక మంచి కథలు ఎట్లా వస్తాయి. ఇక పాటలు డాన్సుల విశయానికి వస్తే అవి తేరా మీదికి ఎందుకు వస్తాయో చాళా సార్లు ప్రేక్షకుడికి అంతు బట్టదు. హీరో హీరోయిన్ల ప్రదర్శనే ప్రధానం. దాంతో చాలా సందర్భాల్లో ప్రేక్షకులు బయటకు వెళ్ళక తప్పని స్థితి. అంతేకాదు కోట్లాది రూపాయలు పెట్టి తీసాం, పాన్ ఇండియన్ సినిమా అను ఊదర గోడితే మాత్రం ఫలితం ఏమి వుంటుంది. అలాంటి స్థితిలో సినిమాలు ఆర్థికంగా విజయవంతం కావాలంటే ఎట్లా అవుతాయి. ప్రేక్షకులు వందల రూపాయలు ఖర్చు పెట్టి సమయం వృధా చేసుకుని టాకీసులకు ఎందుకు వస్తారు.హాయిగా ఇంట్లో కూర్చుని ఓ.టీ.టీ.లలో సినిమాలు చూడక.

 ఓ.టీ.టీ. లలో వచ్చిన కొన్ని సిరీస్ గురించి నేనిక్కడ ప్రస్తావించదల్చుకున్నాను.

 పంచాయత్‌ 2 (అమెజాన్‌ ప్రైమ్‌): అత్యంత వాస్తవికంగా మన వూర్లో లేదా పక్క వూర్లో జరిగి నట్టు గా వున్న కథ తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన సిరీస్‌ ‘పంచాయత్‌’. ఇంజినీరింగ్‌ చదివి అనుకోని పరిస్థితుల్లో ఓ పల్లెలో పంచాయతీ ఆఫీసులో సెక్రటరీగా చేరిన అభిషేక్‌ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది వినోదాత్మకంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.  పాత్రలన్నీ మన చుట్టూ వున్నవే అనిపిస్తుది.

అనంతం: ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించినీ సిరీస్ వాస్తవిక కథనం తో ఎంతో ఆకట్టుకుంది. కథలే ఈ సిరేస్స్ కు బలం.

సాస్ బహు అచార్ ప్రైవేట్ లిమిటెడ్. : ఇది మహిళా సాధికారత పైన రూపొందిన సిరీస్. ఆ మాట ఎక్కడా చెప్పకుండానే ఆద్యంతం బిగువుగా హాస్యాన్ని మేళవించి తీసారు. మధ్య తరగతి జీవులు ఇది మన కథే అనేంతగా సాగున్తుంది.

గుల్లక్: మధ్యతరగతి జీవితాల్ని చాలా బాగా ఆవిష్కరించిన సిరీస్ ఇది. సహజమయిన పాత్రలతో మంచి చిత్రీకరణ తో సాగుతుంది.

వీటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకంటే వీటిల్లో పాత్రలు మనలాగే మాట్లాడతాయి, మనలాగే ప్రవర్తిస్థాయి,మనమే అనేంతగా మనల్ని ఆకట్టుకుంటాయి.

ఇలాంటివి చూసయినా మన తెలుగు సినిమాలు నేలమీదికి దిగితే బాగుపడతాయి.

అపజయాలకు దోషాల్ని వేరే వాళ్ళ మీదకు తోసేయకుండా తం దోషాల్ని తామే గుర్తించి సరి చేసుకుంటే తెలుగు సినిమా బతికి బట్ట కడుతుంది.  

అట్లని ఓ.టీ.టీ లో వచ్చేవన్నీ మంచివే అని కాదు దాని గురించి మరో సారి వివరంగా చర్చిద్దాం.

-వారాల ఆనంద్

https://epaper.dishadaily.com/c/69595270

.

.

“24 ఫ్రేమ్స్” -పాన్ ఇండియన్ సినిమా  

Posted on

“24 ఫ్రేమ్స్”  

++++++++

పాన్ ఇండియన్ సినిమా , వంద కోట్ల సినిమా, వందల కోట్ల కలెక్షన్స్ ఇలాంటి మాటలు ప్రచారాలతో ఇటీవల మన తెలుగు సినిమా రంగం ఆర్భాటంగా ఊదరగొడుతూ సాగుతున్నది. మరో పక్క రెండు విజయాలూ నాలుగు ఫ్లాప్ లతో విలసిల్లుతున్నది. ‘ఆచార్య’,‘లెజెండ్’ లాంటి వైఫల్యాలతో కునారిల్లుతున్న టాలీవుడ్ రంగం బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ‘పృథ్వీ రాజ్’, అజయ్ దేవగన్-రణ్వే 34’ లాంటి సినిమాల అట్టర్ ఫ్లాప్ లను చూసి కొంత మానసిక ఉపశమనాన్ని పొందుతున్నది. మొత్తం మీద ప్రేక్షకుల పల్స్ అందుకునే క్రమంలో అన్ని భారతీయ ప్రధాన స్రవంతి సినిమా రంగాలు పెద్ద కన్ఫ్యూజన్ లో పడ్డట్టు కనిపిస్తున్నది. కేవలం హంగూ ఆర్భాటం, పెద్ద స్టార్స్, ఊదరగొట్టే ప్రచారం మాత్రమే సినిమాను ఆర్థికంగా నిలబెట్టలేవు అన్న నిజం మరోసారి స్పష్టమవుతున్నది. ఒక సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడానికి మంచి కథ, కొంతయినా మంచి కథనం ఎంతయినా అవసరం అన్నది మన తెలుగు సినిమా ప్రపంచం తెలుసుకోవాల్సే వుంది.

ఈ నేపధ్యం లో ఇటీవల చూసిన రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం. అవి మరీ గొప్ప సినిమాలు కావు కానీ ఆయా దర్శకులు నిర్మాతలు ఎంచుకున్న సబ్జెక్టులు గొప్పవి. వర్తమాన సామాజిక పరిస్థితుల నేపధ్యంలో వారిని అభినందిచాలి. అవి ఒకటి ‘అంటే సుందరానికి’, రెండవది ‘విరాటపర్వం’. ఆయా సినిమాల రూపకర్తల గత ప్రయత్నాల గురించి నాకంతగా తెలీదు కానీ ఈ సినిమాల్లో వారు ఎంచుకున్న కథాంశాలు మాత్రం అవసరమయినవి.

“అంటే సుందరానికి” సినిమా విషయానికి వస్తే ఇప్పుడు దేశ వ్యాప్తంగా మతానికి సంబంధించి ఒక విద్వేష పూరిత వాతావరణం నెలకొని వున్నది. దేశం ఒక ఐక్య వాతావరణం నుండి భావ, విశ్వాస, సామాజిక విభజన వైపు మరలుతున్నది. ఆ స్థితిలో మూర్ఖపు అంధ విశ్వాసాలతో వున్న రెండు భిన్న మతాలకు చెందిన రెండు కుటుంబాల నడుమ వియ్యం అందుకోవడానికి సంభందించిన కథను ఎంపిక చేసుకోవడమే ఈ సినిమాకున్న వైవిధ్యం.రూపకర్తల ధైర్యం. ఇద్దరు  యువతీ యువకుల నడుమ ప్రేమ, మతవిశ్వాసాల పరంగా కుటుంబాల్లో వచ్చే అభ్యంతరాలను ఊహించి ఆ జంట అబద్దం చెబుతారు. మొత్తంగా సినిమాలో  హాస్యాన్ని ప్రధాన కాన్వాస్ గా చేసుకుని నడిపించిన తీరు చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఫ్లాష్ బాక్ పారల్లల్ నరేషన్ టెక్నిక్ లను వాడుతూ దర్శకుడు సినిమాను ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా నడిపాడు. సినిమా మొత్తంగా గ్రిప్పింగా లేదు.కానీ నాని అన్నిమార్కులూ కొట్టేశాడు.

ఇక ‘విరాట పర్వం’: ఇవ్వాళ సినిమా రంగంలో పూర్తి వ్యాపార ధోరణి నెలకొని వుంది. ఆ స్థితిలో ఉత్తర తెలంగాణా జిల్లాలో పెల్లుబికిన నక్సలైట్ ఉద్యమాన్ని తన సినిమాకు భూమికగా తీసుకోవడంలోనే నిర్మాతా దర్శకుల చొరవ ధైర్యం కనిపిస్తాయి. వాస్తవంగా జరిగిన ఒక విషయాన్ని అనేక సినిమాటిక్ లిబర్టీ లు తీసుకుని నిర్మించినప్పటికీ మంచి సినిమా ప్రయత్నమేనని అనిపించింది. దళ నాయకుడి రచనలపైన ఆరాధనని, అతని పైన ప్రేమను గ్లోరిఫయి చేసి రొమాంటిక్ సినిమాగా  ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసారు. సమ్మయ్య సంఘటన లాంటి అనేక అంశాలు తీసుకుని వాస్తవీకరించారు. మొత్తం మీద విరాట పర్వం ఇవ్వాల్టి వాతారవరణం లో చాలా గొప్ప ప్రయత్నం.

అయితే ఈ రెండు సినిమాలూ కమర్షియల్ సినిమా హాల్లల్లో పెద్దగా ఆడలేదు అంటున్నారు. కానీ ఓ టీ టీ లో సక్సెస్ ఫుల్ గా వున్నాయి.

+++++

ఇట్లా తెలుగులో అర్థవంతమయిన సినిమాల నిర్మాణం విరివిగా జరగక పోవడానికీ, ఒకవేళ ఎవరయినా తీసినా అవి ఆర్ధిక విజయాలు రాక పోవడానికి కారణాలు వెతకాల్సిన అవసరం వుంది. ప్రధానంగా సిన్మాలు చాలా పాడయిపోయాయని, గతంలో చాలా గొప్ప సినిమాలు వచ్చాయి ఇప్పుడంతా వ్యాపారమే అన్న వాదన ప్రధానంగా వినిపిస్తుంది. దానికి పూర్తిగా సినిమా వాళ్ళదే బాధ్యత అనే వాదన వుంది. ఇది కొంత నిజమే అయినప్పటికీ అది మాత్రమే పూర్తి సత్యం కాదు. నేరం మొత్తం సినిమా వాళ్ళ మీదే మోపడమూ సమంజసం కాదు. ఎందుకంటే సినిమాలనేవి ఏ ఆకాశంలోనుంచో రావు. అవీ మన సమాజంలో అంతర్భాగమే, మారిన సామాజిక ప్రాదాన్యతలూ, విలువలూ సినిమాల్ని కూడా ప్రభావితం చేస్తాయి. సినిమా ప్రధానంగా జనబాహుల్య మాధ్యమం. అంటే ప్రేక్షకులు పోషించే వినోద పరిశ్రమ.

     ఒకసారి మన ప్రేక్షకుల్లో వచ్చిన మార్పుల్ని చూద్దాం. నాలుగయిదు దశాబ్దాల క్రితం సినిమాలకు ప్రేక్షకులు ప్రధానంగా మహిళలు, పురుషులు. అంటే పెద్దవాళ్ళు. అందుకే సినిమా మొదలయిన మొదటి 50-60 సంవత్సరాల పాటు సినిమాల్లో హీరోలూ హీరోయిన్లూ పెద్ద వాల్లుగానే వుండేవాళ్ళు అంటే they were men and women, అంతేకాదు అప్పటి తెరమీది హీరోలు డాక్టర్, టీచర్, లాయర్,ఇంజనీర్ ఇట్లా ఎదో ఒక ఉద్యోగం చేసే వాళ్ళు. కుటుంబాలూ ప్రేమలూ అనుబంధాలూ ప్రధాన అంశాలుగా ఉండేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రేక్షకులలో 80-90 శాతం నవయువకులే. ముఖ్యంగా 25 లోపువారే. దాంతో హీరోలు కూడా అదే వయసు వాళ్ళు కావాల్సి వచ్చింది. అట్లయితేనే యువ ప్రేక్షకులు హీరోలతో తమని తాము ఐడెంటిఫై కాగలిగారు అలాంటి యూత్ ఫుల్ సినిమాలే విజయవంతమయ్యాయి. దాంతో ముఖ్యంగా 90 తర్వాత పోరలు హీరోలు అయ్యారు. అంతేకాదు ఆ యువ హీరోలకు ఉద్యోగం సద్యోగం ఏమీ వుండదు. గాలికి తిరుగుతారు. అమ్మాయిల వెంట పడడం.లేదా క్రిమినల్ కార్యక్రమాలు చేయడం ఆ సినిమాల్లో ప్రధాన అంశాలు అయ్యాయి. అలాంటివే ప్రేక్షకులకూ నచ్చడం ఆర్ధిక విజయాలు సాధించడం జరగింది. ఇక మరో విషయం ఏమిటి అంటే.. ప్రేక్షకుల ఆర్ధిక స్థితి. దశాబ్దాలక్రితం మా చిన్నప్పుడు సింగిల్ స్క్రీన్ సినిమా హాల్లల్లో నెల టికెట్ 35 పైసలుండేది.అలాంటి స్థితిలో కూడా నెలకు ఒక సినిమాకు వెళ్ళడం గగనంగా వుండేది.అది అప్పటి ఆర్ధిక స్థితి. కానీ ఇవ్వాళ మల్టీ ప్లెక్ష్ లు వచ్చాయి. ఒక సినిమాకు 300 –500 రూపాయల వరకు ఖర్చుపెట్టే యువ ప్రెక్శకులున్నారు. టికెట్టే కాకుండా ఇంటర్వెల్ లో స్నాక్స్ అవీ ఇవీ కలిపితే ఇంకా ఎక్కువే ఖర్చు చేసే స్థితి వుంది. అంతలా ఖర్చు చేసే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అంతే రిచ్ సినిమాలతో పాటు యువకుల సెన్సెస్ (ఇంద్రియాలను)ని ప్రేరేపించి ఉద్రేక పరిచే సినిమాలు కావాలి… అవే వస్తున్నాయి. అంటే కోట్లు పెట్టి కోట్లు సంపాదించే పనికి సినిమా వాళ్ళు అలవాటు పడ్డారు.

దానికి తోడు గతంలో సినిమా రీళ్ళను బాక్సుల్లో పెట్టి బస్సుల్లో ఊర్లకు తరలించి హల్లల్లో స్క్రీన్ చేయాల్సి వచ్చేది. ఎంతోశ్రమ. అందుకే ఫిలిం ప్రింటులు తక్కువ. ఏ గ్రేడ్ సెంటర్లు బి గ్రేడ్ సి గ్రేడ్ సెంటర్లు అని విభజించేవాళ్ళు. సినిమాల విడుదల అట్లే జరిడేది. కానీ ఇవాళ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన అంతా డిజిటల్ అయిపోయి ఏక కాలంలో వెయ్యి పదిహేను వందల హాల్లల్లో ఒకేసారి సినిమా విడుదలయ్యే స్థితి వచ్చింది దాంతో వారం లో సినిమా హిట్టా ఫట్టా అన్నది తెలిపోతున్నది. ఈ నేపధ్యంలో సినిమాలు తీసేవాళ్ళకు, ప్రదర్శించేవాల్లకు, చూసే వాళ్లకు ఎవరికీ తీరిక లేదు. అంతా వేగం ఒక రకంగా అంతా గాంబ్లింగ్. ఆ నేపధ్యం లో మంచి అర్థవంతమయిన సినిమాలను ఊహించడం ఆశించడం అత్యాశేమో.. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు.. మార్పు సహజం.. మంచి సినిమాలకోసం మంచి ప్రేక్షకులను తయారు చేద్దాం..

-వారాల ఆనంద్                               

 16 జూలై 2022  

ఎదనిండా ‘తడి’ ++వారాల ఆనంద్

Posted on Updated on

ఎదనిండా ‘తడి’
++++++++++++++++ వారాల ఆనంద్

తెలంగాణా మాటంటే ఎంత పావురం
వింటే చెవులల్ల అమృతం బోసినట్టుంటది

పలకరిస్తే ప్రేమ ఒలక బోసినట్టుంటది
పిలిస్తే మత్తడి దుమికినట్టుంటది

ఎంత ఆత్మగల్లదీ భాష

అవ్వ అంటే తొవ్వ జూపిస్తది
అయ్య అంటే వేలుబట్టుకు నడిపిస్తది

వాకిట్లోంచి ఎవరయినా కేకేస్తే
కిటికీ రెక్కలు బార్లా దెరిచి
చల్ల గాలి లోనికొచ్చి ప్రేమతో
పెయ్యంతా తడిమినట్టయితది

పాణంగా ముచ్చట బెడితే
పండగ జేసినట్టుంటది

కష్టాల్ని దల్సుకుంట ఎక్కిళ్ళు పడితే
కడుపులోంచి దుఖం తన్నుకొస్తది

ఏమి భాషిది
మనసుకు అద్దం పడుతది
మనుషుల నడుమ వంతెన కడుతది

దీంట్ల దొరగాడి రాజసముంది
కూలోడి చెమట చుక్కల మెరుపుంది

ఏ బస్సులోనో రైలులోనో గాలి మోటర్లోనో
ఏ ముఖం తెలీని వాడి నోటయినా
తెలంగాణా మాట వింటే చాలు
మావాడనిపిస్తది మావూరోడనిపిస్తది

కానీ ఉద్యమంలో ఆధిపత్యాన్ని వూడ్చేసిన
మా చీపుర్లు
ఇవ్వాళ మూలకు కూలబడ్డాయి
మీన మేషాలు లెక్కబెడుతున్నాయి
నీళ్ళలాంటి మాటల్ని రసాయన ద్రవాల్లో మరగబెడుతున్నాయి
పాత రాగంతో కొత్త గానం అందుకుంటున్నాయి

అయినా
నాకెందుకో ఈ భాషంటే
ఎద నిండా తడి
అది రాసే వాళ్ళంటే
ఎంతో చెప్పలెంత ‘ఇది’
*************