Month: February 2020

ముక్తకాలు సమీక్ష

Posted on

‘మనం’ దినపత్రిక లో ప్రచురితమైన సమీక్ష
***

తెలుగు కవిత్వంలో ఓ   కొత్త ప్రక్రియ “ముక్తకాలు”
–———–
     కవిత్వంలో చెయ్యి తిరిగిన కవి  వారాల ఆనంద్.ఆనంద్ కవిత్వాన్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా శ్రమి స్తాడు కవిత్వమంటే. ఆయన  తన కొత్త కవిత సంపుటిని ఆవిష్కరించారు.ఆ కవిత్వం సంప్రదాయకంగా కాకుండా ఓ  ప్రయోగంగా వెలువరించారు. తెలుగు కవిత్వంలో తెర తీశారు సరికొత్త ప్రక్రియకు.దాన్ని   “ముక్తకాలు” అని మన ముందుకు తీసుకొచ్చారు.ఏ ప్రక్రియలోనైనా కవిత్వం చలిస్తేనో జ్వలిస్తేనో నడిచి పరుగుదీస్తేనో ప్రవాహమైతేనో పాఠకుల గుండెలను హత్తుకొని తన అస్థిత్వాన్ని నిలుపుకుంటుంది కల ప్రవాహంలో. ఈ కొత్త ప్రక్రియ “ముక్తకాలు” కూడా అలాంటి   కవిత్వాన్ని మన ముందుంచింది. “ముక్తకాలు”  ఓ గొప్ప  ప్రయోగం కనిపిస్తుంది. “ముక్తకం”  అర్ధం  స్వతంత్రమైన ఒకే ఒక యూనిట్. ఉదాహరణకు  విడువడిన పూల రేకులు. ఆ రేకులు దేనికవె  సర్వ స్వతంత్రం ఈ రేకులు ఒకచోట చేర్చితే పువ్వుగా, ఆ పూలను గుదిగుచ్చితే పూదండగా ఓకే రాశీబంధంలా    కనిపిస్తుంది. దాన్ని కవి  “ముక్తకమాల” అని విప్పి చెప్పారు. దీనిలోని మరో లక్షణం కవిత్వ భావం పాఠకునికి ఆలోచనకు వదిలివేయడం.బతుకులోని  భావాలనూ, ఆలోచనలనూ అంతరంగాలనూ అంతర్లీనంగా అల్లుకున్న రేండు వరుసల్లోని   కవితా వాసనలను పాఠకుల  వదిలి వారి స్పందనలను  ఆహ్వానించడం సాహిత్యంలో ఆరోగ్యకరమైన ఒరవడి, గొప్ప ఉరవడి కూడా .  

          దాదాపుగా 128 ముక్తకాలున్న ఈ  పుస్తకంలోకి  తొంగి చూస్తే రెండు భాషల్లో కనిపిస్తాయి .తెలుగు మూల భాష కవి,రచయిత వారాల ఆనంద్ రాసినవైతే ఆంగ్లానువాదం చేశారు బొడ్ల అనురాధ .ఈ రెండు భాషల్లోనూ కవిత్వం జాలువారిన ముక్తకాలు చదువరుల మనసును హత్తుకొనేలా ఉన్నాయి .కవి ఆనంద్ నీలా నింగీ చుట్టూరా ఉన్న సకల చరాచర వస్తువులను కవిత్వీకరించారు.’గాలి కదలికకో ఆకు సవ్వడికో  ఏకాగ్రత చేడితే /నేరం మనసుదే గాలినో ఆకునో నిందించకు’ మనసు చంచలత స్వభావాన్ని ప్రకృతి సహజమైన గాలీ,ఆకుల  ప్రతీకలుగా చూపి సుందర   కవిత్వాన్నిఅందించారు. దీని ఆంగ్లానువాదం కూడా అందంగా,మూలానికి సమాంతరంగా ఉంది భావంలో,కవిత్వలోతూ,గాఢత లోనూ…’when a gentle wind or crackling leaf disturbs your focus /never blame the wind or a leaf ,your mind is at fault.’  వేదన,రోదనల కారణాలేందులు, నా కళ్ళు చెప్పడం లేదా అంటాడు కవి ఆనంద్. ప్రేమ లెక్కపద్దు కాదు ,ఇవ్వడమే తెలిసిన రహదారి ఒక్కటే ప్రేమ దారి అంటూ ప్రేమను కవితామయం  చెయ్యడం అక్షర ప్రేమ ఉన్న కాలాలకే తెలుస్తుంది.కలయిక నిరీక్షణ రెండూ మహత్తర స్థితులే . కానీ ఒకటి ‘మజా’ మరొకటి ‘సజా’  ఎంత మంచి భావుకత ఉందో ఈ ముక్తకాల్లో. ‘అన్నీ సమకూరిన రోజున కళ్ళు మూసుకొని/ఏమీ లేని దినాన్ని గుర్తుచేసుకోవడమే మనిషితనం’ ఈ ముక్తకంలో కవిలోని  కవిత్వ పటుత్వం విచ్చుకొంది. మనిషినీ , మనిషిలోని మనిషితనాన్నీ చక్కగా నిర్వచించడం ఒక్క కవికే తెలుసు. ఎందుకంటే బతుకు మూలాల్లోకి వెనుదిరిగి చూసుకోవడం మంచీ చెడునూ మాట్లాడుకోవడం దాన్ని కవితగా రాయడంలో కవి విశేష కృషి సర్వదా ఎన్నదగినది కూడా. ఎంతగా పిండిచేసిన కూడా వాదాలూ వివాదాలూ చివరకు ఏ  అర్ధం లేకుండా జారిపోతాయి అంటదు కవి తన అనుభవాన్ని రంగరించిన ఈ ముక్తకంలో. వాస్తవానికి దగ్గరగా ఉన్న మరో ముక్తకం ‘రోజూ ఎంతోమందిని కలుస్తాం విడిపోతాం /కొందరు వెలుగులు తెస్తారు,ఇంకొందరు మోసుకెళ్తారు’ వెలుగు సంచరిస్తుంది ఒకరిలోకి రావడమో,మరి పోవడమోజరుగుతుంది ,అయితే ఇది కలిసి విడిపోయే మనుషుల్లాంటి పోలిక కవి లోని అనుభవం,అస్తిత్వ జీవనాన్ని మన మందుంచుతుంది .బలాబలాలూ,గెలుపోటములూ అన్నీ పుట్టుకనుంచే కానీ జీవన రహస్యాన్ని తెలుసుకోవడంలో అంత దాగున్నది అన్న కవితాత్మ ఇంకా బాగున్నది కదా ! మరో ముక్తకంలో ఓ అపరిచితనితో కరచాలనమే సజీవం అంటదు ఆనంద్,ఔను కరచాలనంలో కనిపించని ప్రేమ,స్నేహం,ఓకే మనిషితనం ఉన్నాయి ,అదీ అపరిచితునితో.ఎంత గాఢమైన కవిత్వం ఇది.అనుభవించి చదివితేనే తెలిసేది.మట్టి సంబంధం మొక్కతో పెంచుకొంటే పెరుగుతుందంటాడు కవి,బంధాలూ, అనుబంధల్లా కాకుండా..ఇక బాధ, దుఃఖం ,ఆర్తీ ,కోపం యాతన , తపన,మనసూ,తమసూ,మానూ,రాయీ,కష్టం ,ఇష్టం,కాలంలో జీవిస్తాయంటారు కవి తన వివిధ ముక్తకాల్లో.బతుకూ  ,నడకా, ప్రవాహం మన గుప్పిట్లోనే కవితలుగా ఉన్నాయి అంటే ఎలా కాదనగం మనిషిగా ఎవరమైనా! మరో ముక్తకంలో ‘నా కవిత్వంలో బాధ దుఃఖము పరుచుకొని ఉంటాయంటున్నారు /బాధ కవిత్వం రెండూ పర్యాయ పదాలే. ఇది ఎందరికి తెలుసు, కవిత్వాన్ని ఔపోసన పట్టిన బాధాతప్తులకు తప్ప. ఈ కోవకే చెందిన కవి ఆనంద్. అందుకే ఆలా వ్యక్తీకరించగలిగారు.అలాగే ఈ సంపుటిలో చిరునవ్వు , ద్వేషం, మోసం ,అసూయ ,కన్నీళ్లు , గాయాలూ ,కళ్ళు, మంచీ చెడూ ,చావు పుట్టుక ,సృష్టి రహస్యం ,ప్రకృతి ధర్మం వంటి అంశాలను తనదైన శైలిలో భావుకతతో కైవితలల్లారు కవి ఆనంద్. ఈ  ముక్తకాల్లో   సారాన్ని పండించిన తీరు  ఈ  ముక్తకంలో వాన  పైన గమనించండి .’ఇంత కలం ఎక్కడ దాక్కుంది వాన కురుస్తూ  కురుస్తూ/నేలతల్లినే కాదు నన్నూ పునీతుణ్ణి చేస్తుంది ‘ దీని అనువాదం Where has the rain hidden so far? Oh, it’s raining ! దాక్కున్నవానలో తడిసి పునీతమవడం   మనిషిలో కాదు నేలకూ గొప్ప అనుభూతి. కాలంలోకురిసే వాన మంచి భావుకతలో ఎంత గొప్ప కవిత్వాన్ని కురిపించారో మరి ఆనంద్ .

        ముక్తకాలు ప్రయోగ కవిత ఎన్నో అంశాలను తాకింది . మొత్తం మొత్తంగా బతుకునే ఆవిష్కరించింది.

     కవి ఆనంద్ ,కవితాముక్తకాలు మరియు ఆంగ్లానువాదకులు బొడ్ల అనురాధ బహుధా అభినందనీయం. ఇంకెంతో కవిత్వాన్ని   ఒంపుకొనే ప్రయత్నంలో మరెన్నో మంచి కవితల సృష్టి కొనసాగాలని ఆశిశ్తున్నాను.

                                                        – డాక్టర్ .టి.రాధాకృష్ణమాచార్యులు

                                                                 9848305871