Month: March 2021

వస్తు శిల్ప వైవిధ్య వేదిక (PUBLISHED TODAY IN NAMASTHE TELANGANA)

Posted on Updated on


కళలు సమాజాన్ని బంధించే భావోద్రేక బంధనాలు. మనిషికీ మనిషికీ మధ్య, మనిషికీ సమాజానికీ మధ్య, అంతేకాదు మనిషి అంతర్‌ బహిర్లోకాల నడుమ అనుబంధాలనీ, వైవిధ్యతల్నీ కళలు ప్రతిబింబిస్తాయి. విశ్లేశిస్తాయి. ప్రభావితం చేస్తాయి. అన్ని కళలతో పాటు సాహిత్యం, అందులో ముఖ్యంగా కవిత్వం పాఠకుల భావోద్రేకాలని అమితంగా ప్రభావితంచేస్తుంది. తన గురించి తన చుట్టూ వున్నవారి గురించి మొత్తంగా సమాజం గురించి ఆలోచించేటట్లు చేస్తుంది. వారి భావోద్వేగాలను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళేలా చేస్తుంది. మనిషి అంతకుముందు జీవించిన, స్పందించిన రీతికంటే ఉన్నతంగా స్పందించే తత్వాన్ని పెంపొందించేందుకు కవిత్వాధ్యయనం తోడ్పడుతుంది. అయితే పాఠకుడు ఏమి చదువుతున్నాడు, ఏ కవిని చదువుతున్నాడు అన్నది ఇందులో ప్రధాన భూమికను పోషిస్తుంది.తెలుగులో వార్షిక కవితా సంపుటాలు వెలువడటం అనేక సంవత్సరాలుగా జరుగుతున్నదే. విజయవాడ, హైదరాబాద్‌ లాంటి పలు ప్రాంతాల నుంచి ఈ ప్రయత్నాలు అనేకం జరిగాయి, జరుగుతున్నా యి. అట్లా వెలువడిన వార్షిక సంపుటి ‘కవిత్వం- 2019’. ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో తానే స్వయంగా వెలువరిస్తున్న సంపుటాల్లో ఇది ఇటీవలిది. స్థల కాలాన్ని బట్టి ఎట్లా స్పందించారు అన్న విషయాలు తెలియడానికి వార్షిక కవితా సంపుటాలు ఎంతో ఉపకరిస్తాయి. అంటే ఒక ఏడాది కాలంలో అనేక మంది భావుకులయిన కవుల స్పందన ఎట్లా వుంది.. వారు స్వీకరించిన వస్తువుల్లో వైవిధ్యం ఎంత వుంది.. వాటి రూప నిర్మాణాలు ఎట్లా వున్నాయి అన్న విషయాల్ని అర్థం చేసుకోవడానికి వార్షిక సంపుటాలు వేదికలవుతాయి.పాఠకులు కవిత్వాన్ని మూడు భిన్న రీతుల్లో చదివే అవకాశం వుంది. ఖండికలు ఖండికలుగా అనేక మంది కవుల కవితల్ని చదవడం ఒక విధమయితే, ఒకే కవి రాసిన అనేక కవితల్ని ఒక సంపుటిగా చదవడం మరో పద్ధతి. ఇక ఒక నిర్దేశిత కాలంలో ఒక భాషలో అనేక మంది కవులు రాసిన కవితల్లోంచి ఎంపిక చేసిన కవితల సంకలనం చదవ డం ఇంకో భిన్నమైన అనుభవం. భిన్న కవులు రాసిన కవితల్ని ఖండికలుగా చదవడం SPORADIC అనుభవాల్ని కలిగిస్తుంది. ఇక ఒకే కవి రాసిన కవితల సంపుటిని చదివినప్పుడు ఆ కవి ఎంపిక చేసుకున్న వస్తువులు, వాటి రూప నిర్మాణ పద్ధతులు, ఆ కవి ప్రతిభ, వ్యక్తీకరణ పద్ధతి పాఠకుడి పైన ప్రభావం చూపిస్తాయి. అంటే ఆ కవి ఆయా కాలాల్లో స్పందించిన తీరు తాను సమాజానికి అందించాలనుకున్న భావాలూ మనకు అవగతమవుతాయి. ఒక నిర్ణీత కాల వ్యవధిలో అనేక మంది కవులు ఆ స్థల కాలాన్ని బట్టి ఎట్లా స్పందించారు అన్న విషయాలు తెలియడానికి వార్షిక కవితా సంపుటాలు ఎంతో ఉపకరిస్తాయి. అంటే ఒక ఏడాది కాలంలో అనేక మంది భావుకులయిన కవుల స్పందన ఎట్లా వుంది.. వారు స్వీకరించిన వస్తువుల్లో వైవిధ్యం ఎంత వుంది.. వాటి రూప నిర్మాణాలు ఎట్లా వున్నాయి అన్న విషయాల్ని అర్థం చేసుకోవడానికి వార్షిక సంపుటాలు వేదికలవుతాయి. ఇప్పటివరకు దశాబ్దాలుగా వెలువడ్డ తెలుగు కవిత్వాన్ని అవలోకిస్తే విషయ విస్తృతీ, రూప వైవిధ్యమూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఇతర భాషకూ తగ్గకుండా తెలుగులో గొప్ప కవిత్వం వెలువడింది అన్నమాట నూటికి నూరు పాళ్ళు నిజం. అయితే తెలుగు కవిత్వం ఇతర భాషల్లోకి పరిమిత సంఖ్యలో వెళ్ళడం వల్ల దాని పరిధి పెరగాల్సినంతగా పెరగలేదన్నది కూడా అంతే నిజం. తెలుగులో వార్షిక కవితా సంపుటాలు వెలువడటం అనేక సంవత్సరాలుగా జరుగుతున్నదే. విజయవాడ, హైదరాబాద్‌ లాంటి పలు ప్రాంతాల నుంచి ఈ ప్రయత్నాలు అనేకం జరిగాయి, జరుగుతున్నా యి. అట్లా వెలువడిన వార్షిక సంపుటి ‘కవిత్వం- 2019’. ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో తానే స్వయంగా వెలువరిస్తున్న సంపుటాల్లో ఇది ఇటీవలిది. 2019లో తెలుగు కవిత్వం ఎట్లా వచ్చింది, కవులు ఎట్లా స్పందించారు అన్న విషయం తెలుసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సామాజికంగా రాజకీయంగా అనేక మార్పులు, వొత్తిడుల నడుమ, భిన్న భాషలూ, భిన్న సంస్కృతులతో ఉన్న దేశాన్ని మౌలిక మార్పుల వైపు మళ్ళించే ప్రయత్నాలు జరుగుతున్న కాల నేపథ్యంలో తెలుగు కవులు ఏ రకంగా, ఎంత గాఢంగా ప్రతిస్పందించారనేది స్పష్టమవుతుంది. ‘వస్తువు లేకుండా కవిత్వం లేదు. అయితే వస్తువే కవిత్వం కాదు. దాన్ని అనువైన రూపంలో అమర్చి అందజేస్తేనే అది కవిత్వమవుతుంది. వస్తు రూపాలు రెండూ ప్రధానమైనవే అయినా చాలా సందర్భాల్లో వస్తువును ఎంచుకోవడంతోనే కవిత్వం ఆరంభమవుతుంది’ అన్నారు సంపాదకులు దర్భశయనం తన సంపాదకీయంలో. ఇక ‘కవిత్వం 2019’లోని కవులూ కవిత్వంలోకి వెళ్తే.. అరవై మంది కవులు భిన్నమైన అంశాల్ని తమదైన భిన్న రీతుల్లో వ్యక్తీకరించారు. కొందరు సామాజిక అంశాల్ని వస్తువుగా స్వీకరిస్తే మరికొందరు వ్యక్తివాదంతో రాశారు. ‘నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్న మనిషిని చూడాలని ఎప్పటినుంచో కోరిక నాకునడక మరిచిపోయిన ప్రపంచంలో నడిచే మనిషి ఒక అపురూప దృశ్యమే/ పరుగే ఇప్పుడు మొదటి వ్యసనమయి పోయింది..’ అన్నారు గంటేడ గౌరునాయుడు. ఇది ఇవ్వాల్టి సాంకేతిక వస్తుయుగంలో నెలకొన్న కటువైన వాస్తవం. ఎవర్ని పలకరించినా తీరికలేనితనంలో తలమునకలై వుండటం చూస్తున్నాం. అట్లని నికరంగా ఎవరేమి చేస్తున్నారో ఎవరేమి ముద్రల్ని మిగులుస్తున్నారో ఎవరికీ తెలీని స్థితి. దీన్ని గౌరునాయుడు బాగా చెప్పారు. ‘గోడలు ఎప్పటికయినా పగలాల్సిందే కదా! పగులగొట్టిన మొనగాడొచ్చాడు.గోడలు లేని దేశంలో ఇప్పుడీ గోడ వొట్టి మ్యుజియం గోడే..’ అని ప్రముఖ కవి ఎన్‌. గోపి అంటే..‘నేనొక చిరు కొమ్మకు వేళ్ళాడుతున్నా చిటికెన వేలు చిరు కొమ్మకు వేళ్ళాడుతున్నా యిదెన్ని ప్రపంచాల్ని వాగ్దానం చేయగలదు అందించగలదు..’ అన్నారు కే శివారెడ్డి.ఇక విమల తన ‘జ్ఞాన దిగంబరత్వపు దారి’లో-‘ఒక ప్రేమ గల నవ్వూ, గాఢమయిన కౌగిలింత కొంచెం భోజనం, పడుకునేందుకు గడ్డి పూల పాన్పు ఆరు బయట నక్షత్రాల ఆకాశం కింద నిశ్చింతగా మనల్ని ప్రేమించే మనిషి మీద చేయి వేసి నిదురించటం ఇంతే కదా కావలసింది, నేర్చుకోవడం కన్నా ఇప్పటికే నేర్చుకున్న తుప్పుపట్టిన సంగతులన్నింటినీ మరిచిపోవడమే చాలా కష్టం..’ అన్నారు తాత్వికంగా. ‘నేను నడిచొచ్చిన బాట నా ఆత్మకథను అచ్చు వేస్తుంది బురదలో పుట్టి బురదలో తెల్లారిన బతుకు బురద కాళ్ళ ముద్రల్నే నా జ్ఞాపకంగా లోకానికిస్తుంది పసుపూ పారాణిల ముచ్చట్లు అన్ని పాదాలనూ ముద్దాడవు మిత్రమా’ అంటూ బాపట్లలో హత్యకు గురైన బెజ్జంస్రవంతి వేదనలో ‘జ్ఞాపకాలన్నీ మధురం కావు’ అన్నారు అరుణ గోగులమండ.‘ప్రపంచానికీ పక్షులకూ రెక్కల్ని తొడిగే రాంములక పండు సూర్యున్ని ప్రసవించడానికి తూర్పు పురిటి నొప్పులు పడుతుంది’ అన్నారు జూకంటి జగన్నాధం.‘సాధనకి అసలైన అర్థం అన్వేషణ అన్వేషణ- అన్వేషణ’ అని పాపినేని శివశంకర్‌ అంటే..‘ఈ క్షణం నించి యీ చరిత్రంతా వోడిపోయిన చేతివేళ్ళ సందుల్లోంచి జారిపోయే ఇసుక వోడిపో చిత్తుగా మిగిలిపో చిత్తు ప్రతిగా’ అన్నాడు అఫ్సర్‌.కాశ్మీర్‌ స్థితిని కవిత్వం చేస్తూ.. వేముగంటి మురళి ‘చీనాబ్‌ సాక్షిగా నీకూ నాకూ మధ్య తిరిగిన చీకటి పలక మీది వెలుతురు అక్షరాలని చెరిపేస్తారుఅమాంతం విరిగిన కొండ చెరియలా స్వేచ్ఛ కూలిపోతుంది’ అన్నారు.‘పొద్దున్నే ఓ పద్యం నన్ను నిద్ర లేపింది’ అని పక్కి రవీంద్రనాథ్‌ అంటే..‘ఒక నేను వేల నేనులు ఎందుకయింది’ అని ప్రశ్నిస్తున్నాడు బి.వి.వి.ప్రసాద్‌. ‘ఇంట్లో ఎవ్వరూ లేకపోవడమేమిటి? కంట్లో ఏ దృశ్యం ప్రతిబింబించకపోవడమేమిటి..’ అంటూ తన చుట్టూ వున్న రచయితల గురించి పుస్తకాల గురించీ పాత్రల గురించీ చెబుతూ..‘ఇంట్లో ఇందరుంటే కంటికి కనిపిస్తుంటే చదువు మనుషుల గురించి’ అన్నాడు రవి నన్నపనేని. ఇంకా షాజహానా, యార్లగడ్డ రాఘవేంద్రరావు, దర్భశయనం శ్రీనివాసాచార్య, యాకూబ్‌, అన్నవరం దేవేందర్‌, భగవంతం, శ్రీకాంత్‌, ఆశారాజు, వెంకటకృష్ణ లాంటి 60 మంది కవులు తమ కవితలతో ఈ ‘కవిత్వం 2019’ నిండా మనల్ని పలకరిస్తారు. పలవరిస్తారు. తెలుగు కవిత్వంలో వస్తున్న వైవిధ్య రీతుల్ని మనకు అందిస్తారు. ‘కళను అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నిరంతర శ్రమ అత్యవసరమని నేను స్పష్టంగానే భావిస్తున్నాను’ అని తన సంపాదకీయంలో దర్భశయనం అన్నట్టుగానే కవులు తమ నిరంతర అధ్యయన అభ్యాసాలతో తెలుగు కవిత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఈ కవిత్వం 2019 మనకు హామీ ఇస్తున్నది. ఇలాంటి వార్షిక సంకలనాల్లో ఎంపిక SUBJECTIVE గా జరిగిందా OBJECTIVE గా జరిగిందా అన్న వాద వివాదాలు ఎప్పటికీ వుంటాయి. ఒకటి రెండు మంచి కవితలు మిస్‌ అవడం లేదా, ఒకటి రెండు మామూలు కవితలు చోటుచేసుకోవడం జరగవచ్చు. కానీ ఒక మంచి కవి విమర్శకుడు తానై ముందుపడి అనేక ఇబ్బందులను అధిగమించి సంకలించడం ఇవ్వాల్టి రోజున గొప్ప విషయం. అనేక ఏండ్లుగా కొనసాగించడం కూడా మామూలు విషయం కాదు. తెలుగు కవితాప్రపంచం దర్భశయనం శ్రీనివాసాచార్యను మనసారా అభినందించాలి.కవులు తమ నిరంతర అధ్యయన అభ్యాసాలతో తెలుగు కవిత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఈ కవిత్వం 2019 ఆశ్వాసాన్నిస్తున్నది.
– వారాల ఆనంద్‌ 9440501281