CINEMA ARTICLES

విభిన్న చిత్రాల్లో విలక్షణ మహిళలు

Posted on

భారత రాజకీయాల్లోనూ, భారతీయ సినిమా రంగంలోనూ వున్నన్ని మూఢనమ్మకాలూ, సెంటిమెంట్లూ మరే ఇతర రంగాల్లో కనిపించవు. ఒక రాజకీయ పార్టీ రైతుల గురించి మాట్లాడి విజయం సాధిస్తే మొత్తం పార్టీలన్నీ అదే మాట మాట్లాడతాయి. అట్లాగే సినిమా రంగంలో ఒక ఒరవడి సినిమా ఆర్థికంగా విజయం సాధిస్తే ఇక కొంతకాలం అదే మూసలో సినిమాలు నిర్మాణం కావడం, జనానికి మొహం మొత్తి అలాంటి ఒకటి రెండు సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయిన తర్వాతే మరో మూస ఫార్ములా కోసం పాకులాడడం చూస్తూనే వున్నాం. 80 వ దశకంలో ‘మాభూమి’ విజయం తర్వాత ‘ఎర్రమల్లెలు’, ఆ తర్వాత అదే ఎర్ర సినిమాలు ఎన్ని వచ్చాయో చూసాం. అదేవిధంగా ఒక రాయలసీమ ఫాక్షన్‌ సినిమా విజయం సాధించిన తర్వాత అదే ఫార్ములాతో ఎన్ని తెలుగు సినిమాలు విడుదల అయ్యాయో చూసాం. ఇవి మచ్చుకు కొన్నే. అంతే కాదు, ఈ స్థితి కేవలం తెలుగు ప్రధాన స్రవంతి సినిమాలకే కాదు, భారతీయ అన్ని భాషా ప్రధాన స్రవంతి సినిమాల్లోనూ వుంది. హిందీ సినిమా రంగమూ అందుకు మినహాయింపు కాదు. మూడు ఫైట్లు, ఆరు పాటలూ అన్న చందంగా అనేక రొటీన్‌ రొడ్డకొట్టుడు సినిమాలు హిందీలో కూడా అనేకం. అట్లే అన్ని భారతీయ సినిమాల్లో హీరో డైరెక్టర్‌, హీరో హీరోయిన్‌ల కాంబినేషన్‌ అన్న ఫార్ములా కూడా వుంది. ఇట్లా పలు చిత్ర విచిత్రమైన విశ్వాసాలతో హిందీ సినిమా కూడా కునారిల్లుతూనే వుంది. అయితే హిందీ సినిమా విస్తృతి పెద్దది కనుక ఆ ఫార్ములా ఒరవడిలో పడి కొట్టుకుపోతున్నా అప్పుడప్పుడూ కొంత భిన్నమైన సినిమాలు హిందీలో వస్తూనే వున్నాయి. ఆర్ట్‌ సినిమాలూ, వాస్తవిక సినిమాలూ కనుమరుగైనప్పటికీ కొంత భిన్నమైన సినిమాలు హిందీలో అప్పుడప్పుడూ కనిపిస్తూనే వున్నాయి. అందుకే ఇట్లా వచ్చి కోట్లు కొల్లగొట్టి అట్లా ప్రేక్షకుల మనసుల్లోంచి మాయమయిపోయే సినిమాలకు తోడు, నాలుగు కాలాలపాటు గుర్తుండే కొన్ని మంచి సినిమాలు కూడా హిందీ సినిమా రంగంలో తయారవుతూనే వున్నాయి. విజయవంతమవుతూనే వున్నాయి. మంచి సినిమా చూశామన్న అనుభూతిని ప్రేక్షకుల్లో మిగులుస్తున్నాయి. సామాజిక మానసిక అంశాల్ని కూడా ఇలాంటి ‘అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌’ సినిమాలు తడుముతూనే వున్నాయి.
        ఇలాంటి అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ సినిమాలు రావడానికి ప్రధానంగా భిన్నమయిన కథ, వినూత్నమయిన స్క్రీన్‌ ప్లే, అవుట్‌ ఆఫ్‌ ది ట్రాక్‌ ఫిలిం మేకింగ్‌లు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇలా భారతీయ సినిమా విలక్షణతను సంతరించుకుని తన ముఖ చిత్రం మారుతూ వుండడం గమనించవచ్చు. ఆ స్థితికి ప్రధానంగా కొంతమంది విలక్షణ రచయిత్రులు స్క్రీన్‌ రైటర్లుగా రంగంలోకి రావడం ప్రధాన కారణం. గత దశాబ్దంగా పలువురు మహిళా రచయితలు పలు విజయవంతమయిన అర్థవంతమయిన సినిమాల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. ఇటీవలే వచ్చిన ‘మంటో’, మన్మర్జియా, గల్లీ బారు లాంటి సినిమాల రచయిత్రులు, దర్శకుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం.
కనికా ధిల్లాన్‌ : అమృత్‌సర్‌లో పుట్టిన కనికా మంచి రచయిత్రిగా ఎదిగారు. బాంబే డక్‌ ఈస్‌ అ ఫిష్‌, శివ అండ్‌ ద రైస్‌ ఆఫ్‌ షాడోస్‌, ద డాన్స్‌ ఆఫ్‌ ద దుర్గా లాంటి నవలలు రాశారు. అమె మొదట రెడ్‌ చిల్లీలో పని చేస్తూ ‘ఓం శాంతి ఓం’కి సహాయ దర్శకురాలిగా పని చేశారు. తర్వాత ‘రావణ్‌, సైజ్‌ జీరో, మాన్‌ మర్జియా’లకు స్క్రిప్ట్‌ రచన చేశారు. ఇటీవల ‘కేదార్‌నాథ్‌ మెంటల్‌ హై క్యా’లకు కథ, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాశారు. విజయవంతమయిన రచయిత్రిగా నిలదొక్కుకున్నారు.
జుహీ చతుర్వేది : 1975లో లక్నోలో జన్మించిన జుహీ లక్నో కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో, తర్వాత 1996లో ఢిల్లీలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ కంపెనీలో చేశారు. తర్వాత అక్కడే తన మొదటి సినిమా ‘విక్కీ డోనార్‌’ సినిమా స్క్రిప్ట్‌ రాయడం ఆరంభించారు. ‘విక్కీ డోనార్‌’కు రచయిత్రిగా, ‘మద్రాస్‌ కెఫే’కు సంభాషణలు, ‘పీకూ, అక్టోబర్‌, స్కై ఈస్‌ పింక్‌’ సినిమాలకు రచయిత్రిగా పనిచేసి అద్భుతమయిన సినిమాల్ని అందించారు. ఆమె ‘విక్కీ డోనార్‌’కు జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. 
కొంకణ సేన్‌ శర్మ : ప్రముఖ బెంగాలి నటి అపర్ణా సేన్‌ కూతురు అయిన కొంకణ మొదట మంచి నటిగా గుర్తింపు పొందారు. రెండు జాతీయ అవార్డులు, నాలుగ్‌ ఫిలింఫేర్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక రచయిత్రిగా దర్శకురాలిగా కొంకణ ‘ఎ డెత్‌ ఇన్‌ ద గంజ్‌’ ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు. 
అలంకృతా శ్రీవాస్తవ : ఢిల్లీలో జన్మించిన అలంకృత ప్రకాష్‌ ఝా తీసిన ‘గంగా జల్‌’, ఖోయా ఖోయా చాంద్‌, రాజనీతి లాంటి సినిమాలకు సహాయ దర్శకురాలిగా పని చేసి, తన మొదటి సినిమా ‘టర్నింగ్‌ 30’ రూపొందించారు. తర్వాత ఆమె తీసిన ‘లిపిస్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’ ఎంత చర్చనీయాంశమైన సినిమాగా నిలబడిందో చూశాం. ‘దోలి కిట్టీ అవుర్‌ చమక్తే సితారే, మెర్‌ ఇన్‌ హెవెన్‌’ ఈ సినిమాలకు ఆమె రచయిత్రి, దర్శకురాలిగా పనిచేశారు. 
గౌరీ షిండే : పూనేలో పుట్టి పెరిగిన గౌరీ షిండే ముంబై లి సిద్దార్థ్‌ ఖక్‌ దగ్గర సహాయ దర్శకురాలిగా పని చేశారు. తన మొట్ట మొదటి సినిమాగా ‘ఇంగ్లీష్‌ వింగ్లిష్‌’ రూపొందించారు. కథా రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని తానే నిర్వహించారు. ఆ సినిమా శ్రీదేవి కెరీర్‌కు పునర్‌ ఆరంభం పలికింది. తర్వాత షారుఖ్‌ ఖాన్‌, అలియా భట్‌ నటించిన ‘డియర్‌ జిందగీ’ సినిమాకు కూడా కథా రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఆ రెండు సినిమా కథలు విలక్షణతను సంతరించుకున్నాయి. రచయిత్రిగా, దర్శకురాలిగా షిండే ఇవ్వాళ హిందీ రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందారు. 
జోయా అక్తర్‌ : జావేద్‌ అక్తర్‌, హనీ ఇరానీల కూతురయిన జోయా న్యూయార్క్‌లో చదువుకున్నారు. మీరానాయర్‌ లాంటి వాళ్ళ దగ్గర సహాయకురాలిగా పని చేసారు. ‘లక్‌ బై చాన్స్‌, జిందగీ న మిలేగి దోబారా, బామే టాకీస్‌, గల్లీ బారు’ లాంటి సినిమాలు భిన్నంగా రూపొంది జోయాకు మంచి పేరు తెచ్చాయి. ‘దిల్‌ దడఖ్‌ నే దో, లస్ట్‌ స్టోరీస్‌’ లాంటి సినిమాలు కూడా జోయా రూపొందించి, ప్రతిభ కల దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. తను దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు జోయా రచన బాధ్యతలు కూడా నిర్వహించారు. 
నందితా దాస్‌ : 1969లో పుట్టిన నందితాదాస్‌ 40కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో నటించిన నందిత దర్శకురాలిగా మొట్ట మొదట 1988లో ‘ఫిరాఖ్‌’ తో ఆరంభించారు. ‘ఫిరాఖ్‌’ గుజరాత్‌ హింసాకాండ గురించి నిజాయితీగా తీసిన సినిమాగా నిలిచింది. అనేక వాస్తవ కథల్ని 24 గంటల సమయంలో పరస్పర సమన్వయంతో నిర్మించారీ సినిమాను. గత ఏడాది నందిత ‘మంటో’ సినిమా రూపొందించారు. సుప్రసిద్ధ రచయిత బయోపిక్‌గా రూపొందిన మనతో దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకున్నారు. 
జీనత్‌ లఖాని : జీనత్‌ లఖాని దర్శకురాలిగా మొట్టమొదటి సినిమా ‘షాదీ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌’. విద్యా బాలన్‌, ఫర్హాన్‌ అక్తార్‌లు ప్రధాన భూమికల్ని పోషించారు. 2017లో జీనత్‌ లఖాని రచన బాధ్యతల్ని నిర్వహించిన సినిమా ‘హిందీ మీడియం’, ఇర్ఫాన్‌ఖాన్‌, సబా ఖమర్‌లు ప్రధాన పాత్రల్ని పోషించారు. సామాజిక కోణంలోంచి వర్తమాన విద్యా వ్యవస్థను తూర్పార పట్టిన సినిమాగా ‘హిందీ మీడియం’ నిలుస్తుంది.
అన్వితా దత్‌ గుప్తన్‌ : అన్విత ప్రధానంగా సంభాషణలు, పాటల రచయిత్రిగా పేరెన్నికగన్నారు. రచయిత్రిగా ఆమె రాసిన సినిమాలు ‘శాందార్‌’, ‘ఫైల్లౌరీ’లు రొడ్డకొట్టుడు సినిమాలకు భిన్నమయిన సినిమాలుగా నిలిచాయి.
కామ్నా చంద్ర : కామ్నా చంద్ర గతంలో పలు మంచి ప్రేమకథా చిత్రాలకు రచనలు చేసారు. ‘1942-లవ్‌ స్టొరీ’ లాంటి సినిమాలకు ఆమె రచన చేశారు. ఇటీవలి కాలంలో ఆమె రచన చేసిన సినిమా ‘ఖరీబ్‌ ఖరీబ్‌ సింగల్‌’.
ఇట్లా అనేక మంది రచయిత్రులు భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తున్నారు. కొత్తదనాన్ని అద్ది సరికొత్త సినీ భాష్యాన్ని లిఖిస్తున్నారు. వారి కృషిలో నిర్మాణమయిన సినిమాల్ని చూస్తే భారతీయ సినిమాకు సొంత గొంతుకతో పాటు సొంత స్టైల్‌ కూడా వుందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే రచయిత్రులు, దర్శకుల్లో అధిక శాతం మంది 1970 లలో జన్మించిన వాళ్ళే కావడం గమనించ దగ్గ అంశం.

అంటే కొత్త తరం కొత్తగా ఆలోచిస్తుందని, సరికొత్త ఆవిష్కరణలకు దారులు వేస్తుందని అవుటాఫ్‌దబాక్స్‌ సినిమాల్నిరూపొందిస్తుందని విదితమవుతుంది.

-వారాలఆనంద్‌,

9440501281

Advertisements

AKSHARALA THERA

Posted on Updated on

మిత్రులారా, నమస్కారం. టోరి రేడియో లో ప్రతి సోమవారం రాత్రి 8.30-9.30 వరకు ‘అక్షరాల తెర’ కార్యక్రమం నిర్వహిస్తున్నాను.

ఈ సోమవారం (18 MARCH 2019) అంశం 
‘FILMS and LITERATURE’ 
ఆ సమయానికి మిత్రులు నాతో మాట్లాడవచ్చు కాల్ చేయాల్సిన నంబర్లు:

US 703-879-6611, 
UK 020-3287-8674,
Australia 02-8006-8674, 
India 9666778674,

వీలయితే మాట్లాడుకుందాం.

‘YAVANIKA’ film club

Posted on

‘యవనిక’ ఫిలిం క్లబ్ 
ప్రతి బుధవారం

=============
ఆకట్టుకునే ‘బదాయీ హో’
==========
మధ్య తరగతి కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఎంత సంఘర్షణకు దారితీస్తుందో ఆ కుటుంబాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ‘బదాయీ హో సినిమా చూపిస్తుంది. ఇద్దరు కొడుకులున్న ఒక మధ్య వయస్సు మహిళ గర్భవతి కావడంతో ఆ కుటుంబంలోనూ చుట్టూ వున్న సమాజం ఎట్లా స్పందిస్తున్నది ‘బదాయీ హో ‘ ప్రధాన ఇతి వృత్తం. 
పెళ్లి పిల్లలూ అయింతర్వాత కూడా మహిళ లో స్త్రేత్వం సజీవంగా ఉంటుందని, ఆమెకూ కోరికలు ఉంటాయని, భార్యగా ఆమె భర్త తో గడిపే ఆలోచన హక్కూ ఆమె స్వంతమని మరిచిపోయిన ఈ సమాజం ఆమె గర్భవతి కావడాన్ని జీర్నించుకోలేదు. గుసగుసలు పోతుంది. మరీ చిత్రంగా వుండే మధ్యతరగతి మనస్తత్వాలు ఆ వయసులో గర్భవతి కావడాన్ని ఆశ్చర్యంగానూ వింతగానూ తీసు కొంటాయి. చెవులు కొరుక్కుంటాయి. ఇక ఇంట్లో అత్త, ఇద్దరు కొడుకుల ప్రతిస్పందన కూడా ప్రతికూలంగానే వుంటుంది. ఇలాంటి సున్నితమయిన అంశాన్ని పగడ్బందీ కథనంతో సున్నిత మయిన హాస్యాన్ని జోడించి దర్శకుడు ప్రతిభావంతంగా తెరమీద ఆవిష్కరించాడు. 
కథ విషయానికి వస్తే జీతేందర్ కౌశిక్, ప్రియంవదా కౌశిక్ లు మధ్యతరగతి కి చెందిన మధ్య వయసు జంట. వారికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు నకుల్ పెల్ల్లీడు కొచ్చిన ఇరవై ఏళ్ళు దాటినా వాడు, రెండోవాడు స్కూలు విద్యార్థి. వారితో పాటు జితేందర్ తల్లి కూడా డిల్లీ లోని లోని లోది కాలనీ లో నివసిస్తుంటారు. ఇంతలో ప్రియం గర్భవతి అయిందని తెలుసుకొని ఇంట్లోకి ‘నయా మహామాన్’ రానున్నాడని తల్లికి మొహమాటంతో తడబడుతూ చెబుతాడు జీతేందర్. ఇక అప్పటినుండి మొదలవుతుంది ఇంట్లో సంఘర్షణ. ఎవరికీ అది రుచించదు, ఎవరూ అంగీకరించడానికి సిద్దంగా వుండరు. ఇంట్లోనే కాకుండా చుట్టుపక్క ఇండ్లల్లో కూడా అది చర్చనీయాంశం అవుతుంది. జీతేందర్ అబార్షన్ చేపిద్దమా అని ప్రియంవదలు అడుగుతాడు, లేదు నేను బిడ్డను కంటా నంటుంది. ఆమె మిత్రులు కొందరు ప్రియం ను అభినందిస్తారు. ఇక జీతేందర్ తల్లి కూడా తొలుత వ్యతిరేకంగానే స్పందిస్తుంది. కానే జీతేందర్ అక్కలు ప్రియంవద గర్భం విషయంలో తీవ్రమయిన స్వరం తో మాట్లాడడంతో తల్లి తన కోడలి పక్షం వహిస్తుంది. కాని వాళ్ళ పెద్దకొడుకు నకుల్ చాలా గందరగోళం లో పడిపోతాడు. వ్యతిరేకతను ఏర్పరుచుకుంటాడు. అప్పటికే నకుల్ రెనీ తో ప్రేమలో పడతాడు. ఇద్దరిమధ్యా వున్న ఆర్ధిక అంతరాలతో పాటు ఇప్పుడీ తల్లి గర్భం కూడా వారి పెళ్ళికి అడ్డుగోడ అవుతుంది. రెనీ తల్లి నకుల్ తో వ్యంగంగా మాట్లాడ్డమే కాకుండా గేలి చేస్తుంది. నకుల్ తీవ్రంగా ఎదురు మాట్లాడ్డం తో రెనీ తో బెడిసికొడుతుంది. ఇద్దరి మధ్యా బ్రేక్ అప్ అవుతుంది. ఇదంతా తల్లి వల్లే అని నుకుల్ కోపాన్ని పెంచుకుంటాడు. ఇక రెండవ వాడు గుల్లార్ తన స్కూల్లో తోటి విద్యార్థుల వెకిలి మాటలకు తీవ్రంగా స్పందిస్తాడు. ఒక విద్యార్థి గుల్లార్ పై చేయి చేసుకుంటాడు. ఇదంతా ఇంటికి వచ్చినతర్వాత అన్నతో తో చెబుతాడు గుల్లర్. మర్నాడు నకుల్ స్కూలుకు వెళ్తాడు గుల్లార్ తనను కొట్టిన వాడి చెంప పగుల గొడతాడు . నకుల్ మిత్రులు కూడా హేళన చేస్తే వారికి సరయిన బదిలిస్తాడు. క్రమంగా వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని సహజమయిన వాస్తవాన్ని గ్రహిస్తారు. నకుల్ కొడుకుగా తన బాధ్యతను తెలుసుకుంటాడు. నకుల్ రెనీ మధ్య ఎదో గొడవ జరిగిందని అర్థం చేసుకున్న ప్రియంవద వెళ్లి రెనీ తల్లికి క్షమాపణ చెప్పమంతుంది. అయిష్టంగానే అంగీకరించిన నకుల్ వెళ్లి ఆమెకు సారీ చెబుతాడు. తల్లి చెప్పగానే రెనీ నకుల్ కోసం బయల్దేరుతుంది. ఇంతలో ప్రసవ సమయం వచ్చేస్తుంది. లేటు వయసు గర్భం కనుక కొంత కష్టం కావచ్చు ననుకున్నప్పటికీ ప్రసవం సాఫీగా జరుగుతుంది. ఆడపిల్ల పుడుతుంది. అంతా సంతోష పడతారు. సంవత్సరం తర్వాత నకుల్ కు రెనీ తో నిశ్చితార్థం అవుతుంది.
‘బదాయీ హో´ సినిమా ఆద్యంతం హాస్యం తో సాగి ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. కథ కథ నాలల్లో ఎంత బలం వుందో దానికి సమానంగా ప్రధాన పాత్రధారుల నటన సినిమాకు గొప్ప శక్తిని ఇచ్చింది. ప్రియంవద గా నీనా గుప్తా ఎంతో హుందాగానూ పరిపక్వతతోనూ నటించింది. జీతేందర్ గా గజ రాజ్ రావు నటన సినిమాకు హైలైట్. హాస్యాన్ని పండించడంలో కానీ తన బాడీ లాంగ్వేజ్ ద్వారాగానీ గజ రాజ్ రావు మొత్తం సినిమాను నడిపిస్తాడు. వీరికి తోడు నకుల్ గా ఆయుష్మాన్ ఖురానా, అత్తగా సురేఖ సిక్రీ కూడా గొప్ప నటను అందించింది. 
అధిక శాతం రొడ్డ కొట్టుడు అంశాలతో సాగే హిందీ సినిమా రంగంలో ‘బదాయీ హో´ లాంటి సినిమాలు గొప్ప ఊరట. అందుకు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మను అభినందించాలి. 
‘బదాయీ హో´ చూడాల్సిన సినిమా. ఆన్ లైన్ లో అనుబాటులో వుంది.
– వారాల ఆనంద్

రాజకీయ ప్రచార ‘బయోపిక్ ‘లు

Posted on

(Namasthe Telangana Tue,February 5, 2019)

నిజానికి గత కొన్నేండ్లుగా దేశంలో రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార సరళి మారిపోయింది. కేవలం సభలు, ప్రకటనల లాంటి సనాతన విధానాలకు భిన్నంగా పెరిగిన సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించడం మొదలైంది. ఐదేండ్ల కిందట ఎన్నికలప్పుడు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌లను విస్తృతంగా వినియోగించి యువతీయువకులను ప్రభావితం చేసిన రాజకీయపార్టీలు ఈసారి మరింత విస్తృతమైన ప్రసార వ్యవస్థ అయిన సినిమాను తమ ప్రచారానికి వినియోగిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నది.

విలువలను వివేకాన్ని, వినోదాన్ని అందించే కళాత్మక దృశ్య మాధ్యమమైన సినిమా వర్తమాన భారతంలో శుష్క రాజ కీయ ప్రచార మాధ్యమంగా తెరపైకి వస్తున్నది. దేశానికి అత్యంత ముఖ్యమైన ఎన్నికల ఏడాదిలో ఈ ప్రయత్నాలు విరివిగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌గా పిలువబడే హిందీ సినిమా రం గంలోనే కాకుండా వివిద భారతీయ భాషా సినిమాల్లో కూడా ఈ ప్రచార ధోరణి కనిపిస్తున్నది. ఎన్నికల కాలంలో సినిమా రాజకీయపార్టీల ప్రచార వేదికగా పరిణామం చెందుతున్నది. కళగా సినిమాల్లో రాజకీయ దృక్పథా లు ధోరణులూ కనిపించవచ్చు, అది ఆక్షేపణీయం కాదు. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్ లాంటి సుప్రసిద్ధ నటు లు, దర్శకులు నవ్య స్వతంత్ర భారత స్థితిని వివరిస్తూ దేశం గురించి ఆశా వహమైన కళాత్మక సినిమాలుగా అవి రూపొందాయి. ప్రజలూ వాటిని విశేషంగా ఆదరించారు. కానీ ఆ ధోరణిలో వచ్చిన సినిమాలు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార సినిమాలుగా రాలేదు. అది గమనించాల్సిన అంశం.

కానీ, ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు పార్టీల ప్రచార కార్యక్రమాలకు వాహకాలుగా మారడం అభిలషనీయ పరిణామం కాదు. గత కొన్ని నెల లుగా విడుదలవుతున్న భారతీయ సినిమాల్లో దేశంలోని ప్రధాన రాజకీ య పార్టీ పెంచి పోషిస్తున్న భావజాలవ్యాప్తికి ఊతమిచ్చేలా ప్రచార బాధ్య తలను మోస్తున్నాయి. అంతేకాకుండా తద్వారా రాబోయే ఎన్నికల్లో ఓట్ల లబ్ధి పొందే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నిజానికి గత కొన్నేండ్లుగా దేశంలో రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార సరళి మారిపోయింది. కేవలం సభలు, ప్రకటనలలాంటి సనాతన విధానా లకు భిన్నంగా పెరిగిన సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించడం మొదలైం ది. ఐదేండ్ల కిందట ఎన్నికలప్పుడు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌లను విస్తృతంగా వినియోగించి యువతీయువకులను ప్రభావితం చేసిన రాజకీయపార్టీలు ఈసారి మరింత విస్తృతమైన ప్రసార వ్యవస్థ అయిన సినిమాను తమ ప్రచారానికి వినియోగిస్తున్న తీరు స్పష్టం గా కనిపిస్తున్నది. సామాజిక మాధ్యమాలు కేవలం పట్టణ, చదువుకున్న వారిపైనే ప్రభావం కలిగించగలిగింది. సినిమా అయితే గ్రామీణ నిరక్షరా స్యులను కూడా ప్రభావితం చేయగలదు. కాబట్టి పలు రాజకీయపార్టీలు ఈసారి సినిమాను వినియోగించుకుంటున్నాయి. కేవలం తమ ప్రచారాని కే పరిమితం చేయకుండా ఎదుటి పార్టీపై బురదచల్లడానికి సినిమాను ఉపయోగిస్తున్నాయి.

ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలు విడుదలయ్యా యి. ఉరి, మణికర్ణిక, ఆక్సిడెంటల్ ప్రైం మినిస్టర్, థాకరేలకు తోడు త్వరలో సల్మాన్‌ఖాన్ సినిమా అక్షయ్‌కుమార్ సినిమా కేసరి రానున్నాయి. వాటితోడు ప్రధాని మోదీ జీవితచరిత్ర ఆధారంగా ఉమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఓబ్‌రాయ్ ప్రధాన పాత్రధారిగా బయోపిక్ రానున్నది, దానికితోడు పరేష్ రావల్ కూడా తన రానున్న సినిమాలో మోదీ జీవితాన్ని చిత్రీకరిస్తున్నట్టు ప్రకటించాడు. 72 అవర్స్, మార్ టైర్ హూ నెవర్ డయిడ్, బటాలియన్ 609 లాంటి నిగూఢమైన సిని మాలు రానున్నాయి.

ఉరి సినిమా మన దేశరక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ ైస్ట్రెక్స్ ఆధా రం చేసుకొని నిర్మించబడింది. అత్యంత రహస్యంగా నిర్వహించబడిన ఆ సర్జికల్ దాడులను సినిమాలో సాంకేతికంగానూ, నటీనటుల నటన తది తరాల పరంగా చాలా మంచి నిర్మాణ విలువలతో రూపొందించారు. కానీ ఉరి రక్షణ దళాల గొప్పదనాన్ని చూపిస్తూనే పక్కదేశాన్ని ద్వేషించే ఒక భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగానే ఉన్నది. అధికారంలో ఉన్న రాజకీ యపార్టీ భావజాలాన్ని ప్రచారంలోకి తెచ్చినట్టుగానే ఉండటాన్ని యాదృచ్ఛికమని అనుకోలేం. ఇక ఆక్సిడెంటల్ ప్రైం మినిస్టర్ సినిమాలో కాంగ్రెస్ తదితర రాజకీయపార్టీల నాయకులను ఎంతో తక్కువ స్థాయి లోనూ, బలహీనంగానూ చూపించడం గమనించవచ్చు. ఇక థాకరే సిని మా గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అది సినిమాగా కంటే కేవలం థాకరే భావజాలాన్ని దృశ్యరూపంలో ఆవిష్కరించిన చిత్రం గా చెప్పుకోవచ్చు.

ఇవిలా ఉంటే ఇటీవలి కాలంలోనే అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రధారి గా రెండు సినిమాలు స్వచ్ఛ భారత్‌ను ఎంతగా ప్రచారం చేశాయో మనం గమనించవచ్చు. 2017లో విడుదలైన టాయిలెట్-ఏక్ ప్రేమ కథ సినిమా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడం దాన్ని సాధించడానికి ఒక జంట పడ్డ పాట్లు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొంది గొప్ప విజ =యాన్నే సాధించింది. దానికి ప్రధాని మోదీ ప్రసంశలు కూడా లభించాయి. అంతేకాదు అంతకుముందే 2016లో అక్షయ్‌కుమార్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం గమనించాలి. ఇంకా పాడ్ మాన్ కూడా ఒక బయోగ్రఫికల్ సినిమాగా తీసినప్పటికీ అది కూడా స్వచ్ఛభారత్ ప్రచార చిత్రంగానే విమర్శకులు భావించారు. అవేకాకుండా తెలుగులో వచ్చిన ఎన్టీఆర్, త్వరలో రానున్న రాజశేఖర్‌రెడ్డి సినిమా మొదలైనవి కూడా రాజకీయపార్టీల ప్రచార లక్ష్యంతో నిర్మించిన చిత్రాలుగానే చెప్పుకోవాలి.

ఇట్లా మొత్తం మీద సినిమా గొప్ప ప్రసార మాధ్యమం స్థాయి నుంచి ప్రచార మాధ్యమం స్థాయికి దిగజారడం విచారకరం. అయినా ప్రజలు విజ్ఞులు కాబట్టి ప్రచార చిత్రాలు ఏ మేరకు విజయవంతమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.

జయాపజయాలు (ARTICLE NAMASTHE TELANGANA)

Posted on

జయాపజయాలు
( నమస్తే తెలంగాణ ఎడిట్ పేజ్)

ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో బయోపిక్ (జీవిత చిత్రాలు) సినిమాల గాలి వీస్తున్నది. హిందీ తెలుగు సినీ రంగాలతో పాటు అనేక భారతీయ భాషల్లో ఈ బయోపిక్‌ల ధోరణి కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు నిర్మాణమవుతున్న బయోపిక్ సినిమాలు కేవలం సిని మా కోసమే జరుగడం లేదు. వ్యక్తి జీవిత వాస్తవాలతో పాటు ఆయా కాలపు సామాజిక చరిత్ర ను వక్రీకరణకు లోనుచేసి నిర్మాతలు దర్శకులు అపప్రధను మూటగట్టుకుంటున్నారు. అంతేకాకుండా తాము సినిమాలుగా రూపొందించిన వారి జీవితాల కూ మురికి కూడా అంటిస్తుండటం విషాదం. ప్రపంచ సినిమా చరిత్రలో కూడా బయోపిక్ సినిమాలది ప్రధాన పాత్రే. అక్కడా వాస్తవాలు వక్రీకరనలు చోటుచేసుకున్నాయి. అనేక బయోపిక్ సినిమా లు విజయాలు అపజయాలు అందుకున్నాయి. కానీ ఒక స్పష్టమైన రాజకీయ ఉద్దేశంతో ఆ వ్యక్తి జీవితంలోని ప్రతిభను విజయాలను కాకుండా ఒక నెగెటివ్ అంశాన్ని ఆధారం చేసుకొని చిత్రించాలనుకున్నప్పు డు ఫలితాలు మరింత అధ్వాన్నంగా ఉంటాయి. ఇటీవలి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ జీవితం ఆధారంగా నిర్మించబడింది. ఆయనకు మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా సినిమా తీశామని నిర్మాతలు చెప్పుకున్నారు. కానీ సినిమా మొత్తంలో మన్మోహన్ జీవితానికి సంజయ్ బారు పుస్తకానికి అనేక అంశాల్లో పొంతన లేదు. రచయిత గా సంజయ్ బారూకు దర్శకుడిగా విజయ్ గుట్టేకి ఉన్న భావ స్వేచ్ఛను కాదనలేం. వారు మన్మోహన్‌ను ఆవిష్కరించాలుచుకున్న కోణం వారిష్టం. కానీ యూపీఏ మొదటి విడుత పాలన కాలం నాటి అంశం సినిమాగా తీస్తున్నప్పుడు ప్రధాన పాత్రధారి మన్మోహన్ మాట నడక నడవడిక ఇప్పటి మన్మోహన్ సిం గ్‌లా చూపించడంలో దర్శకనిర్మాతల లక్ష్యం స్పష్టం. ఆయన అకస్మాత్తు ప్రధానే కాదు బలహీనమైన ప్రధా ని అని చెప్పకనే చెప్పడం కనిపిస్తుంది.
ఇటీవల తెలుగులో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ ఆర్థిక జయాపజయాల సంగతి పక్కనపెడితే బయోపి క్ సినిమాగా అది విఫల ప్రయత్నంగా చెప్పాలి. మొత్తం సినిమా బాలకృష్ణ సినిమాగా కనిపించింది తప్ప ఎన్టీఆర్ జీవిత సినిమాగా లేకపోవడం ఇందు లో ప్రధానమైన లోపం. మంచి బయోపిక్ సినిమాకు పాత్రకు పోలికలున్న నటుడితో పాటు మంచి వాచకం నటనా సామర్థ్యం ఉన్న నటుడు కూడా కావాలి. ఏది లోపించినా అది వైఫల్యంగానే మిగులుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ఏ ఎన్నార్‌లతో పాటు తెలుగు సిని మారంగంలో ప్రధానమైన మరో హీరో కాంతారావు కు సినిమాలో స్థానం లేకపోవడంలాంటి ఇతర లోటుపాట్లు కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ను అసంపూర్ణ అసమగ్ర సినిమాగా మిగిల్చాయి. ఇక్కడొక అంతర్జాతీ య సినిమా గురించి చెప్పుకోవాలి. 2007 లో టాడ్ హైన్స్ అనే దర్శకుడు సుప్రసిద్ధ సంగీతకారుడు బాబ్ డిలాన్ బయోపిక్ తీశాడు. ఐయాం నాట్ దేర్ అన్న ఆ సినిమాలో బాబ్ డిలాన్ వివిధ రూపాలను పోషించేందుకు కేట్ బ్లాంచెట్క్రిసియన్ బాలేహీత్ లేద్జర్ లాంటి పలువురు నటులను తీసుకున్నాడు. దాంతో మొత్తం సినిమా కు సంపూర్ణత్వం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు ను అందుకున్నది. అంటే బయోపిక్‌లో పాత్రలు ఆయా కాలాల వయసులను ప్రతిబింబించాలి. ఇది ఒక విజయవంతమైన అం శంగా ఐ యాం నాట్ దేర్ నిరూపించింది. విజయవంతమైన ప్రయత్నాలే కాకుండా చేదైన ఫలితాలను ఇచ్చి న బయోపిక్‌లు ప్రపంచ సినిమా ల్లో కూడా ఉన్నాయి. ఎంతో ఆర్భాటంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభ సినిమాగా ప్రదర్శించిన గ్రేస్ ఆఫ్ మొనాకోలో నికోల్ కిడ్మాన్ లాంటి పెద్ద నటుడు నటించినప్పటికీ దాన్ని విమర్శకులు చీల్చిచెండాడా రు. ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందిన వికీలీక్స్ జూలియన్ అస్సాంజేపై తీసిన ఫిఫ్త్ ఎస్టేట్ కూడా పెద్ద డిజాస్టర్.
నిజానికి కథాత్మక సినిమా నిర్మాణంతో పోలిస్తే జీవితచరిత్రల ఆధారంగా నిర్మించే సినిమాలను రూపొందించడం సులభమైనదేమీ కాదు. సాధారణం గా ఇలాంటి సినిమాల్లో కథను చెబుతాం,సినిమా లో చూపిస్తాం కాబట్టి రూపొందించదలచుకున్న వ్యక్తి జీవితంలోని సారాంశాన్ని లేదా ముఖ్యమైన ఒక అంశాన్ని తీసుకొని సినిమాను అల్లుకుంటూ పోయినప్పుడే ఆ సినిమా ఆసక్తికరంగా రూపొంది ప్రేక్షకు లను ఆకట్టుకుంటుంది. అందుకే సినిమాకు అత్యంత ప్రధానమైంది స్క్రీన్ ప్లే. దానిపైన ప్రధాన కృషి పెట్టినప్పుడే సినిమా గోప్పగా రూపొందుతుంది. బయోపిక్‌లో అతి నాటకీయత కృత్రిమంగా రూపొందే అం శాలు చరిత్రను వక్రీకరించే అంశాలు జొప్పిస్తే సిని మా అసలుకే మోసం వస్తుంది. విజయవంతమైన బయోపిక్‌ల గురించి చెప్పుకున్నప్పుడు అటెన్‌బరో రూపొందించిన గాంధీ సిని మా మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ని ఆర్జించింది. ఆర్థిక విజయంతో పాటు అనేక ఆస్కా ర్ అవార్డులనూ గాంధీ సినిమా సొంతం చేసుకున్న ది. అందులో గాంధీగా వేసిన బెన్ కింగ్ స్లే తన అజరామరమైన నటనతో సినిమాకు జీవం పోశారు. ఆ సినిమా ఒక తరాన్ని ప్రభావితం చేసింది. ఇక ఇటీవ లికాలంలో స్పిల్బర్గ్ రూపొందించిన అబ్ర హం లింకన్ విజయవంతమైన సినిమాగా రూపొందింది. ఇక బ్రిటన్ 6 వ కింగ్ జార్జ్ జీవిత చిత్రం కిం గ్స్ స్పీచ్. ఆర్థికంగానూ ఆస్కార్ అవార్డులు అందుకోవడంలోనూ విజయం సాధించింది. అట్లే పయాని స్ట్ సినిమా కూడా బయోపిక్‌లలో విజయవంతమై నది. మనదేశంలో క్రీడాకారుల జీవితాలపైన రూపొందిన దంగల్ భాగ్ మిల్కాే మేరీ కొం ఎం.ఎస్. ధోని లాంటి సినిమాలు విజయాన్నిఅందుకున్నాయి.బయోపిక్ సినిమాలు ఇవాళ ఆర్డర్ ఆఫ్ ద డేగా నిలుస్తున్నాయి. కానీ గొప్పవాళ్ల జీవిత చరిత్రలు రూపొందిస్తున్న దర్శకనిర్మాతలు వాస్తవాలను వక్రీకరించకుండాఅవాస్తవాలను జోడించకుండా నిజాయితీగా తీయగలుగాలి. అప్పుడు వాళ్లు కూడా చరి త్రలో మిగిలిపోతారు. లేదా గొప్పవ్యక్తుల జీవితాలను వక్రీకరించిన వాళ్లుగా మకిలీ అంటుతుంది.

-వారాల ఆనంద్