Month: July 2019

ఆధునిక అక్షరాల యవనిక

Posted on

సినీ విమర్శకులు, రచయిత వారాల ఆనంద్‌ వినూత్న సేవలు
ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ రేడియోలో సాహితీ చర్చలు, సినీ విశ్లేషణలు
ప్రపంచ వ్యాప్తంగా శ్రవణం, ఆదరణ

ఆప్యాయతలను చెరిపేస్తుంది.. మనుషుల మధ్య అంతరాలను పెంచుతుంది.. పదిమంది ఉన్నా నిశ్శబ్దఛాయలు.. మాటా ముచ్చట్లు ఉండవు.. లేచింది మొదలు పడుకునే వరకు అదే తోడు నీడలా మారింది.. అదే జీవితం, నేస్తం, సమస్తంగా భావించే రోజులివి. అదే మన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌. ఇది స్మార్ట్‌ఫోన్‌కు ఒక పార్శ్వంగా కనిపిస్తోంది. మరో పార్శ్వంలో చూస్తే ఇది ఎంతో ఉపయుక్తం.. విజ్ఞానదాయకం.. వినోదభరితం.. వికాస సముదాయినిగా కనిపిస్తోంది. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని సామాజిక మాధ్యమాల ద్వారా వినూత్న కార్యక్రమాలతో సినీ విమర్శకులు, కవి వారాల ఆనంద్‌ ప్రత్యేక ఒరవడిని సృష్టించారు. ఇంటర్నెట్‌ ఆన్‌లైన్‌ రేడియోలో కవి పరిచయం, కవితలు, విశ్లేషణలు, అక్షరాల తెర, యవనిక పేరుతో కార్యక్రమాలు చేస్తూ ఈతరం, మలితరానికి చేరువవుతున్నారు. 
కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రపంచంలో ఇప్పుడు సృజనాత్మకతకే పెద్దపీట వేస్తున్నారు. దాన్ని చాటుకునేందుకు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ లాంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కొత్తతరం సాహిత్య రుచులు, పోకడలు ఆస్వాదించడం లేదన్న భావన పాతతరం కవుల్లో నెలకొంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాతతరం కవుల కవిత్వం పిల్లలకు చేరేలా ఆధునిక కవులు, వర్ధమాన కవులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులకు సాహిత్యాన్ని పరిచయం చేసేందుకు నెలవారీగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో మారిన తెలుగు పాఠ్యాంశాలు ఆ స్థాయిలోనే పద్యం, కథ, వ్యాసం, సాహిత్యాలు పరిచయం అవుతున్నాయి. 
అక్షరాల తెర 
సాహిత్యం, సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందిన వారి గురించి విశ్లేషణల కార్యక్రమమే అక్షరాల తెర. ఇంటర్నెట్‌ ఆన్‌లైన్‌ ‘టోరీ’ రేడియోలో ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 వరకు అక్షరాల తెర కార్యక్రమం వస్తుంది.వారాల ఆనంద్‌ ఒక గంట పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటివరకు దర్భశయనం శ్రీనివాసాచార్య, జింబో, వఝుల శివకుమార్‌, నందిని సిధారెడ్డి, కొండపల్లి విహారిణి, కొండెకూడి నిర్మల, మందారపు హైమావతీలను టోరీ రేడియో ద్వారా పరిచయం చేశారు. ఒక గంట కార్యక్రమంలో మొదటి 10-15 నిమిషాల పాటు కవి పుట్టిన ఊరు, చదువు, వృత్తి, సాహిత్య సేవలను పరిచయం చేస్తారు. 30-40 నిమిషాల్లో కవి రాసిన కవితలను వారే ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌ రేడియోలో వినిపించాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో శ్రోతల అభిప్రాయాలను ఆహ్వానిస్తారు. ఇప్పటివరకు ఎస్వీ రంగారావు, జగ్గయ్య, దర్శకులు బి.ఎన్‌.రెడ్డి, గిరీష్‌ కర్నాడ్‌, మృణాల్‌ సేన్‌, భానుమతి, సావిత్రి ఇలా పాతతరం వారి నటన ప్రతిభను పరిచయం చేశారు.  పాతతరం నటులు, నటీమణులు, దర్శకుల ప్రతిభను ఈతరం వారికి తెలియజేసేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమెరికా, లండన్‌, ఇండియా నుంచి శ్రోతలు టోరీ రేడియో కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 
యవనిక 
యవనిక అంటే సినిమా. ఇది ఒక రకంగా ఆన్‌లైన్‌ ఫిలిం క్లబ్‌. ఆర్ట్‌ సినిమాలు పది మందికి చూపించాలని ఆశపడుతారు. మంచి సినిమా ప్రజలందరికీ చేరువయ్యేలా చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ మయమైన ఈ సమాజంలో ఫిలిం క్లబ్‌లకు సమయం కేటాయించే ఓపిక లేదు. అందుకే ఆన్‌లైన్‌లో ఫిలింక్లబ్‌ సేవలందించాలని ‘యవనిక’ పేరుతో కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి బుధవారం వారాల ఆనంద్‌ ‘ఫేస్‌బుక్‌’లో ఒక సినిమాకు సంబంధించిన విశ్లేషణతో కూడిన ఆర్టికల్‌ పెడతారు. ఆ సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అందులో ఉంచుతారు. ఆ సినిమాపై దర్శకులు పంచుకున్న అభిప్రాయాల క్లిప్పింగులు, సినిమా సీన్లు నిక్షిప్తం చేస్తారు. 
ఇరుగు పొరుగు 
ఇతర భాషల్లో వచ్చిన కవిత్వాన్ని అనువదించి అందించటమే ‘ఇరుగు పొరుగు’ కార్యక్రమం. ఇతర భాషల్లో వస్తున్న కవిత్వం, భావ వ్యక్తీకరణలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ప్రతి శుక్రవారం ఏదో ఒక భాషకు సంబంధించిన కవిత్వాన్ని తర్జుమా చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తారు.మన దగ్గర పి.వి.నరసింహారావు, నలిమెల భాస్కర్‌, వారాల ఆనంద్‌, పెద్దింటి అశోక్‌కుమార్‌, డాక్టర్‌ గండ్ర లక్ష్మణ్‌రావు, వెలిచాల కొండల్‌రావు ఇతర భాషల సాహిత్యం అనువాదం చేశారు. 
తెలిసింది పది మందికి చేరవేయాలనే వారాల ఆనంద్‌, సినీ విమర్శకులు, కవి 
తెలియనిది తెలుసుకోవాలి, తెలిసింది పదిమందికి చేరవేయడమే నా అభిమతం. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పుస్తకాలు, సినిమా సమీక్షలు ఎక్కువగా చేస్తున్నాను. ఈతరం వారికి సాహిత్యం, మంచి సినిమా అంటే ఏమిటో తెలియజేయాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానే సంతృప్తి ఉంది. 
అనుబంధం, అనుభవం కలిసివచ్చింది 
దర్భశయనం శ్రీనివాసాచార్య, కవి, హైదరాబాద్‌ 
సినిమా ప్రపంచంతో దాదాపు మూడు దశాబ్దాల అనుబంధం, అనుభవం ఆనంద్‌కు ఉన్నాయి. సాహిత్యాన్ని ఎక్కువ మందికి పరిచయం చేయాలనే తపనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలను కళాభిరుచిని పెంపొందించేందుకు ఒక వనరుగా వాడుకుంటున్నారు. టోరీ రేడియో, ఫేస్‌బుక్‌ ద్వారా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. 
నేటి తరానికి ఆదర్శం 
డాక్టర్‌ విష్ణువందన దేవి, కవి, హైదరాబాద్‌ 
టోరీ రేడియో, ఫేస్‌బుక్‌ ద్వారా కార్యక్రమాలు చేస్తున్న ఆనంద్‌ నేటి తరానికి ఆదర్శనీయం. టోరీ రేడియో కార్యక్రమంలో కవి అంతరంగంతో పాటు ఆ రచన చేసినప్పటి నేపథ్యం తెలియజేయడం బాగుంది. యవనిక నేటి తరానికి ఎంతో అవసరం.

‘యవనిక’ ఆన్ లైన్ ఫిల్మ్ క్లబ్ ‘YAVANIKA’ ONLINE FILM CLUB

Posted on

‘యవనిక’ ఆన్ లైన్ ఫిల్మ్ క్లబ్ 
‘YAVANIKA’ ONLINE FILM CLUB EVERY WEDNESDAY
గొప్ప భావుకుడయిన దర్శకుడు గురుదత్ జన్మదినం 09 జూలై 1925 ఆ సందర్భంగా గురుదత్ రూపొందించిన గొప్ప సినిమా లోని కొన్ని దృశ్యాల్ని చూద్దాం. గురుదత్ నిర్మాణ సరళిని మరోసారి వీక్షిద్దాం. కరీంనగర్ ఫిల్మ్ సొసైటి ప్రదర్శనల్లో చౌద్వీన్ కా చాంద్, ప్యాసా, కాగజ్ కె ఫూల్ లాంటి అనేక సినిమాలు చూసిన అనుభవం ఇంకా తడి తడిగానే వుంది.
యవనికలో కొన్ని సీన్లు చూద్దాం. మంచి సినిమాల్ని అభిమానించే వాళ్ళంతా గురుదత్ ని ఒక సారి చుట్టేసి రావాల్సిందే…

కటువైన వాస్తవాలు (NAMASTHE TELANGANA)

Posted on Updated on

కటువైన వాస్తవాలు
(NAMASTHE TELANGANA DaiySun,July 7, 2019) 
-VARALA ANAND

డాక్యుమెంటరీ ఫిల్మ్ అన్నది ఓ జ్ఞాపకాల తోరణమే కాదు, ఓ అనుభవాల పందిరి. వాస్తవాన్ని సృజనాత్మకంగా చూపించడమే కాకుండా విశ్లేషించి వివరించడమూ డాక్యుమెంటరీ ఫిల్మ్ లక్షణం. అంతేకాదు స్థల కాలాలను రికార్డు చేసే ఒక గొప్ప మాధ్య మం. కానీ వాస్తవాలు ఒకింత కఠినంగా ఉంటాయి, వ్యాఖ్యానాలు మరింత ఆం దోళన కలిగిస్తాయి. సరిగ్గా అదే జరిగింది ఆనంద్ పట్వర్ధన్ రూపొందించిన వివే క్ నాలుగు గంటల డాక్యుమెంటరీ విషయంలో. కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో వివేక్ ప్రదర్శించడం వల్ల శాం తిభద్రతలకు భంగం వాటిల్లుతుందని సమాచార మంత్రిత్వ శాఖ ప్రదర్శనను నిలిపివేస్తే ఫెస్టివల్ నిర్వాహకులు, దర్శకుడు ఆనంద్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ ఆంక్షలను తోసిపుచ్చి ఫెస్టివల్‌లో ప్రదర్శనకు అనుమతినిచ్చింది. ఇప్పటికే వివేక్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నది. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి ఆమ్‌స్టర్‌డ్యాం లాంటి చోట అవార్డులు అందుకున్నది. ఇటీవల దేశంలో జరిగిన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పంసారేల హత్యలు, దేశం లో ఎదుగుతున్న దళిత నాయకులు, ఉద్యమాలు తదితర వర్తమాన అంశాలను చర్చకు పెట్టింది ఈ సినిమా. హింసాత్మకంగా మారుతున్న హిందుత్వవాదాన్ని ఖండించింది. అందుకే కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆంక్షలను ఎదుర్కొన్నది. దీంతో పట్వర్ధన్ ఎప్పటిలాగే కోర్టులను ఆశ్రయించక తప్పలే దు. ఇలాంటి స్థితి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంటరీ దర్శకులు ఎదుర్కొంటూనే ఉన్నారు. పాకిస్థా కు చెందిన కెమెరా వుమన్ నౌశీన్ దాదాభోయ్ స్త్రీల అస్తిత్వం కోసం హక్కుల కోసం సినిమాలు తీస్తూ పాకిస్థాన్‌కు చెందిన ఏకైక మహిళా కెమెరా పర్సన్‌గా అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్నది.

నిజానికి డాక్యుమెంటరీ చిత్రాలు సాహిత్య, సాంస్కృతిక, టూరిజం, చారిత్రక రంగాలతో పాటు సామాజిక సమస్యల విశ్లేషణల, చిత్రీకరణ వ్యాఖ్యానాల పరంగా సాగుతాయి. ఇప్పటివరకు అనేక చారిత్రక ఘట్టాలను, అపురూప కళాత్మక అంశాలను దృశ్యీకరించడంతో పాటు అనేకానేక ప్రజా సమస్యలపైనా డాక్యుమెంటరీ చిత్రాలు ప్రజలను చైతన్యవంతం చేశాయి. ప్రపంచవ్యాప్త పోరాటాల్లో ప్రధాన భూమికను పోషించాయి.

పోపో ఫాన్ గే చైనాలో బై సెక్సువల్ సమస్యలగురించి డాక్యుమెంటరీలు తీస్తూ అనేక సమస్య లను ఎదుర్కొంటున్నాడు. ఇరాన్‌కు చెందిన మహ్మద్ హదా ది సెన్సార్ షిప్‌కు వ్యతిరేకంగా, మెక్సికోకు చెందిన పెడ్రోగా ర్షియా ఆ దేశంలోని డ్రగ్ మాఫియా గురించి, పాలస్తీనాకు చెందిన మ్యాడ్ ఆలయాన్ సరిహద్దు సమస్యల గురించి డాక్యుమెంటరీలు తీస్తూ అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్నా రు. ఇట్లా అనేక దేశాల్లో వ్యాఖ్యాన సహిత వాస్తవ వాదాలు అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. జీవితాన్ని దర్శించడానికి, విశ్లేషించడానికి సినిమా ఒక విధానం. అంతేకాదు మానవ సృజనకు మాస్ మీడియాగా అధికశాతం ప్రజలకు చేరుతున్న ఒక కళారూపం. సినిమా దృశ్య ప్రవాహంగానూ, రసాత్మకంగానూ ఉన్నప్పుడు చిరకాలం చరిత్రలో మిగిలిపోతుంది. ఆ సినిమా కథాత్మకంగానూ, కథేతరంగానూ రెండు రకాలుగా ఉంటుంది. ఫిక్షన్, నాన్‌ఫిక్షన్‌గా పిలువబడుతున్నది. నాన్ ఫిక్షన్ సినిమా ప్రధానంగా డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ప్రసిద్ధి పొందింది. వీటినే ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్‌గా కూడా పిలుస్తున్నారు. ఈ డాక్యు మెంటరీ ఫిల్మ్ ప్రక్రియను అటు ప్రభుత్వాలు ఇటు స్వచ్ఛంద సంస్థలు చరిత్రను నిక్షిప్తం చేయడానికి, ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. వాటిని సినిమా హాళ్ళల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, టీవీల్లో, ఇంటర్నెట్లోనూ వాడుతున్నారు. నిజానికి డాక్యుమెంటరీ చిత్రాలు సాహిత్య, సాంస్కృతిక, టూరిజం, చారిత్రక రంగాలతో పాటు సామాజిక సమస్యల విశ్లేషణల, చిత్రీకరణ వ్యాఖ్యానాల పరంగా సాగుతాయి. ఇప్పటివరకు అనేక చారిత్రక ఘట్టాలను, అపురూప కళాత్మక అంశాలను దృశ్యీకరించడంతో పాటు అనేకానేక ప్రజా సమస్యలపైనా డాక్యుమెంటరీ చిత్రాలు ప్రజలను చైతన్యవంతం చేశాయి. ప్రపంచవ్యాప్త పోరాటాల్లో ప్రధాన భూమికను పోషించాయి.

డాక్యుమెంటరీ అన్న మాట ను తొలిసారిగా జాన్ గ్రియర్సన్ వాడారు. ఆయన తీసిన రాబర్ట్ ఫ్లాహెర్తి మోనా సినిమాకు ఆ పేరు పెట్టాడు. డాక్యుమెంటరీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 1894-1922 మధ్య మెల్లగా రూపుదిద్దుకున్నాయి. నిజానికి కథా చిత్ర నిర్మాణం ముందస్తుగా రాసుకున్న కథ, కథనాలతో సులువుగా మైదానంలో కారు నడుపడం లాంటిది. కానీ డాక్యుమెంటరీ సినిమా నిర్మాణం జాతరలాగా రద్దీ ఉన్న మహానగర దారిమీద కారు నడుపడం లాంటిది. డాక్యుమెంటరీ చిత్రాల చరిత్రను పరిశీలిస్తే 1922 లో ఫ్లాహెర్తి తీసిన మోనా, నానూక్ ఆఫ్ ది నార్త్ చిత్రాలు ఒక ఒరవడిని సృష్టించాయి. ఆ తర్వాత డాక్యుమెంటరీ సినిమాల్లో ప్రచార సరళి పెరిగి నాజీ కాలం నుంచి వాటిని పాలకులు తమ ప్రచారానికి ఉపయోగించారు. మరోవైపు సోవియెట్ కీనో ప్రవ్దా పేరు మీద సినిమాటిక్ వాస్తవాన్ని ఒక ఉద్యమంగా ఉపయోగించుకున్నది. ఇక మన దేశంలో 1898లో హీరాలాల్ సేన్ తీసిన ఫ్లవర్ ఆఫ్ పార్సియాను మొదటి డాక్యుమెంటరీ సినిమాగా చెబుతారు. తర్వాత హరిశ్చంద్ర భాత్వాడేకర్ పలు డాక్యుమెంటరీలు తీశాడు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నెహ్రూ ప్రసంగా న్ని (Tryst With Destiny)- స్వతంత్ర ఫిల్మ్ మేకర్ Amb -les J Patel రెండు కెమెరాలు ధ్వని పరికరాలతో చిత్రీకరించాడు. అప్పటికి ఇంకా మన దేశంలో పూర్తిస్థాయి నిర్మాణ యూనిట్ లేదు. కానీ ఏడు దశాబ్దాల తర్వాత మన దేశంలో పూర్తిస్థాయి డాక్యుమెంటరీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నా యి. వ్యక్తులుగా, సంస్థలుగానూ డాక్యుమెంటరీల నిర్మాణం కొనసాగుతున్నది. 1948 ఏప్రిల్ లో కేంద్రం ఫిల్మ్స్ డివిజన్‌ను ఏర్పాటుచేసింది. ముఖ్యంగా వార్తా చిత్రాల నిర్మాణం పంపిణీ బాధ్యతలతో అది ఏర్పడిం ది. 1949-50లలో పలు భాషల్లో 90కి పైగా చిత్రాలను తీసింది. 

ఆ క్రమంలో ఫిల్మ్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఎస్.ఎన్. ఎస్.శాస్త్రి తీసిన ఐ ఆమ్ 20, ఫాలి బిలిమోరియా తీసిన ది హౌజ్ దట్ ఆనంద బిల్ట్ , సుఖదేవ్ తీసిన ఇండియా 1967, ఎం.ఎఫ్ హుసేన్ తీసిన త్రూ ది ఐస్ ఆఫ్ పేయింటర్ లాంటివి విలక్షణమైన విగా మిగిలిపోయాయి. తర్వాతికాలంలో డిజిటల్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతీయ డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం గొప్పగా పుంజుకున్నది. టీవీలతో పాటు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ ట్రస్ట్ లాంటి సంస్థలు డాక్యుమెంటరీల నిర్మాణానికి ప్రధాన వేదికలుగా నిలిచాయి. ఇక డాక్యు మెంటరీ సినిమాల నిర్మాణ శిక్షణకు సంబంధించి సమాచార కార్యదర్శి అన్వర్ జమాల్ కిద్వాయి కృషి ఎనలేనిది. ఆనంద్ పట్వర్ధన్ అనేక దశాబ్దాలుగా అత్యంత ప్రభావ వంతమైన డాక్యుమెంటరీలతో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేశాడు. ప్రజా సమస్యలూ, పౌరహక్కులపై ఆయన కృషి అనితరసాధ్యమైంది. ఆనంద్ తీసిన Waves of Revolution, Prisoners of Conscience, బాంబే హమారా షహర్, వార్ అండ్ పీస్, ఫాదర్ సన్ అండ్ హోలీ వాటర్, జై భీమ్ లాంటివి ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఆయన సినిమాలకు సెన్సార్ అభ్యంతరాలు, కోర్టులు జోక్యం చేసుకోవడం లాంటివి సర్వసాధారణమైనాయి. రాకేశ్ శర్మ తీసిన ఫైనల్ సొల్యూషన్ లాంటివి, అమర్ కన్వ ర్ తీసిన ఎ సీజన్ ఔట్‌సైడ్, నైట్ ఆఫ్ ప్రొఫెసి లాంటి డాక్యుమెంటరీలు విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. సబా దేవన్ తీసిన బర్ఫ్ స్నో, వందన కొహలి తీసిన అబిస్ లాంటివి వివాదాస్పదమైనాయి. అంతేకాదు సమాజంలోని భిన్నకోణాలను ఆవిష్కరించి గొప్పగా నిలిచాయి.

‘పనే కదా ‘Poem

Posted on

‘పనే కదా ‘

==============

తూర్పున దీపాన్ని వెలిగించి

ఈ రోజుని తెరిచాను

కొత్త అనుభవానికి దారి తీసింది

కళ్ళు ఇవ్వాళే కొత్తగా తెరిచానా

ఈ రోజేమయినా సరికొత్తగా విచ్చుకుందా

లేదే

నిన్నటికి ఇవ్వాళ కొనసాగింపు

రేపటికి దారితీసే

పెద్దర్వాజా కదా

గడిచిన నిన్న

మంచినో చెడ్డనో తీపినో చేదునో

దుఃఖాన్నోసంతోషాన్నో

లేదూ

కిచిడీలా అన్నింటినీ కలగలిపి

మిగిల్చి పోయింది కదా

అన్నింటినీ కన్నీళ్లలో రంగరించి

మిక్సీలో వేసి రుబ్బినట్టు గిరగిరా తిప్పి

నిద్ర పొరల్లో కప్పేసాం కదా

నిద్రేమో

కనుపాపలకీ రెప్పలకీ నడుమ

దొంగాట ఆడుతూ

మనసును ‘మెలకువ’ పాల్జేస్తూనే వుంది

కష్టంగానో ఇష్టంగానో

గతం లోకి జారిపోయిన ‘నిన్న’

నన్నింకా వదల్లేదు

మరుపు పొరల్లోకి ఇంకనే లేదు

జ్ఞాపకపు తెరలాగా కదుల్తూనే వుంది

అయినా

గొప్ప ఆశతో తూర్పున దీపం వెలిగించి

కొత్త రోజుని తెరిచాను

కొత్త

పనిలో పడ్డాను

పని కదా

నన్ను బతికించేది, కన్నీళ్లను తుడిచేది

చరిత్రను  నిర్మించేది

పనే కదా

ఎవరినయినా నిలబెట్టేది

నాలుగు కాలాలు నడిపించేది   

———– వారాల ఆనంద్

               9440501281

టోరి రేడియో: ‘కవిత్వం 2018’ వార్షిక సంకలనం

Posted on

టోరి రేడియో: ‘కవిత్వం 2018’ వార్షిక సంకలనం, సంపాదకులు: దర్భశయనం శ్రీనివాసాచార్య. సమర్పణ వారాల ఆనంద్