A POEM A DAY

పుస్తకం లాంటి మనిషి

Posted on

పుస్తకం లాంటి మనిషి  

++++++++++++ వారాల ఆనంద్

దశాబ్దాలపాటు కళ్ళారా చూస్తూ

వాటి మధ్యే బతికానేమో

పుస్తకాల్ని

దూరంగా అద్దాల బీరువాలో చూసినా

దగ్గరగా నా రీడింగ్ టేబుల్ పై చూసినా

ఆత్మీయుణ్ణీ అయినవాణ్ణీ చూసినట్టుంటుంది

చూసీ చూడగానే కరచాలనం చేయాలనిపిస్తుంది

మునివేళ్ళను పెదాలపై అద్దుకుని మెల్లిగా

పేజీ తర్వాత పేజీ తిప్పేయాలనిపిస్తుంది

అప్పుడు

కొన్నింటితో స్నేహం కుదుర్తుంది

కొన్నింటికి నేను స్నేహితుడినయిపోతాను

కొన్ని పుస్తకాలు హృదయాన్ని కదిలిస్తే

మరికొన్ని నులిపెడతాయి

నేను కరిగి నీరయిపోతాను

కొన్ని నవ్విస్తే,

మరికొన్ని ఏడిపిస్తాయి

కొన్ని ఆలోచనల్ని రేకెత్తిస్తే

ఇంకొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి

నేనేమో పిడికిలి బిగించి ఊగిపోతాను

మొత్తంగా పుస్తకాలు నాలో భాగమవుతాయి

నేను వాటిలో లీనమవుతాను

అయినా పుటలు పుటలుగా పొరలు పొరలుగా

నన్ను తెరిచి తరిచి చూసే పుస్తకం కోసం

పుస్తకం లాంటి మనిషికోసం వెతుకుతూనే వున్నా..

*****************

24 ఏప్రిల్ 2024 WORLD BOOK DAY

“ప్రజాస్వామ్యం” ++++వారాల ఆనంద్

Posted on

“ప్రజాస్వామ్యం”

++++ వారాల ఆనంద్

ఓటు హక్కున్న మనుషులు

నడుస్తున్న కరెన్సీ అయిపోయినప్పుడు

పలుకుతున్న మాటలన్నీ

జమా ఖర్చులే

సర్వత్రా

నేను నాదీ నాకు అనేవే   

ఉఛ్వాస నిశ్వాసలై ఊరేగినప్పుడు                                                                                                                                                    

“ప్రజల చేత, ప్రజలయొక్క, ప్రజలకొరకు”

అన్న భావన సలసల కాగే స్వార్థపు జడిలో  

ఆవిరై అదృశ్యమైపోక

నాకోసమో నీకోసమో మిగులుతుందా

ఎన్నికల మైదానంలో

కూటమి, ఫిరాయింపు, బంధుప్రీతి  

మూడురంగుల జెండాగా తలెత్తుకు   

రెప రెప లాడుతూ వుంటే

కొంగ్రొత్త ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది

ప్రజలే ప్రేక్షకులై బిక్కమొహమేసుకుని

ప్రేక్షకుల్లా అచేతనంగా నిలబడిపోతారు 

*********************                                                                                                                                                                                                                                                                                          

పెద్ద సమయం పట్టదు++++++ వారాల ఆనంద్

Posted on

FRIENDS,READ MY POEM PUBLISHED IN NAVATELANGANA TODAY,Tq

పెద్ద సమయం పట్టదు

+++++++++++++++ వారాల ఆనంద్

అంతా కనిపిస్తూనే వుంటారు

అందరూ వినిపిస్తూనే వుంటారు

కానీ

కలిసివుండటానికీ కలిసిపోవడానికీ అందరినడుమా అడ్డంగా   

కళ్ళముందే మొలుస్తున్న గోడలు

ఎవరికి వారు నిర్మించుకుంటున్న దడీలు

భ్రమాలోకపు గడీలు

తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు

చుట్టూరా ఖాళీలు కొలతలకందని దూరాలు

ఎవరి లెక్క వారిది ఎవరి కుహరం వాళ్ళది

నేనే

ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ కాళ్ళరిగేలా కలియదిరిగాను

ప్రవాహంలా పరుగులుపెట్టాను

ప్రయాణ కాలంలో అనేక దశలు దిశలు

అలసట వొచ్చినప్పుడల్లా

‘అల్లమురబ్బా’ నోట్లో వేసుకుని

పైత్యాన్ని వదిలించుకున్నాను

ఇవ్వాళ

ఖాళీల్ని పూరించడానికి మౌనాన్ని శబ్దమయం చేయడానికి  

కొత్త పదాల్ని పదబంధాల్నీ నేర్చుకుంటున్నాను

బంధాలకు కొత్త రూపునూ

అనుబంధాలకు నవ్యదారుల్నీ రూపొందిస్తున్నాను

మబ్బుల అంతరాయాల్ని తొలగిస్తూ

అస్తమయం కానీ జీవితాన్ని అవలోకిస్తూ 

మనుషుల సమూహంలోకి

మమతల జాతరలోకి

నడక సాగిస్తున్నాను  

అస్తమయం తర్వాత

సూర్యోదయానికి పెద్ద సమయం పట్టదు

కొంచెం ఓపికుండాలి

ఒకింత విశ్వాసముండాలి

ఎంతయినా అందరమూ మనుషులమే కదా!

****************** 9440501281

15 APRIL 2024

బతుకు సమీకరణం కాదు-వారాల ఆనంద్

Posted on

Friends,pl read my poem published today 15 April 2024  in Andhra Prabha daily, Tq

బతుకు సమీకరణం కాదు

++++++++++++ వారాల ఆనంద్

జీవితం నడుస్తున్నాదా

పరుగెడుతున్నదా చతికిలబడ్డదా

ఓ క్షణం వెనక్కి చూస్తూ

వేగం పుంజుకుంటున్నదా

వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా!

నిటారుగా నిలబడిందా

వంగుతూ లేస్తూ

అంబాడుతూ లేస్తూ

అవతలితీరంకేసి చూస్తున్నాదా

ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు

నా బతుకు నాకూ

నీ బతుకు నీకూ తెలియాలి

లేదూ కెమెరా కన్నేసుకు చూసే

నీ ముందరి వాడికి తెలియాలి

అయినా బతుకు

ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే

దానంత విసుగయిందీ అసహజమయిందేదీ లేదు

నిజానికి  

ఫ్లై ఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో 

మెలికలు తిరిగే మలుపుల్తో  

యాదేచ్చగా అర్థవంతంగా సాగేదే జీవితం

************ 9440501281        

Posted on

ఏమి జంతువది
+++++++++++++++

ఏమి జంతువది
దాని ఆకలిఎంతకూతీరదు
అసలే తృప్తిచెందదు

దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది

ఎంత ఆహారం కావాల్నో దానికకే తెలవదు

ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు

ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది

ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారిపొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది

దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది

ఏమి జంతువది
ఎంతకూ తృప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు

ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ

దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ

అందరూ దాని కోసం ప్రార్థించండి

ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
++++
అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్
తెలుగు – వారాల ఆనంద్


‘జ్ఞానం’ కవిత

Posted on

మిత్రులారా! ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ లో అచ్చయిన కవిత చదవండి- ఆనంద్

‘జ్ఞానం’
+++++ వారాల ఆనంద్

ఈ మనిషినెక్కడో చూసాను
చిరపరిచితమయిన ముఖమే
బస్టాండ్లో, మెట్రోలో, ఫుట్ పాత్ పైనా చూసాను
పాతబజార్ గల్లీల్లో లైబ్రరీ పుస్తకాల నడుమా చూసాను

చాలా దగ్గరగానూ దూరంగానూ
దట్టమయిన అడవిలో, విశాల మైదానంలో చూసాను

సురసుర మండే ఎండలో చిటపట కురిసే వానలో
గజ గజ వణికే చలిలో
తడుస్తూనో ముడుచుకునో ఉసూరుమంటూనో వుంటే చూసాను

కానీ మబ్బులు కమ్మిన చంద్రుడిలా
పొగమంచు కమ్ముకున్న రహదారిలా
రూపం స్పష్టంగా కనిపించడం లేదు
ఆ ముఖం అందమయిందా కురూపా

చూసిన మనిషే తెలిసిన ముఖమే
ఎటూ పాలుపోక ఊరంతా తిరిగీ తిరిగీ
ఉసూరుమంటూ ఇల్లు చేరాను
ఎవరతను?
మెదట్లో పురుగు తొలుస్తూనే వుంది

అకస్మాత్తుగా నిలువుటద్దంలోకి చూసాను
అరె నేను చూసిన ముఖమీదే
చిరపరిచితమయిన మనిషితనే

నన్ను నేను తెలుసుకున్నా
నాలాంటివాళ్లూ అర్థమయ్యారు

పొరలు పొరలుగా తెరలుగా
‘జ్ఞానం’ వికసించింది

******************** 24-03-2024

CHUKKALA MUGGU ‘POEM’

Posted on

Friends, pl click the link below to read my poem published today in sanchika online magazine, thanks to the editor- anand Anand Varala
https://sanchika.com/chukkala-muggula-va-poem/