Month: August 2023

డోగ్రీ భాషా వాగ్గేయకారిణి పద్మా సచ్ దేవ్

Posted on

+++++++++++ వారాల ఆనంద్

డోగ్రీ భాషా వాగ్గేయకారిణి పద్మా సచ్ దేవ్

+++++++++++ వారాల ఆనంద్

‘మీరు మీ సొంతదయిన మాతృభాష లో మాట్లాడండి’ ఇతర ఎన్ని భాషల్ని నేర్చుకున్నా సరే తల్లి భాషలోనే మాట్లాడండి మాతృస్థానమిచ్చి గౌరవించండి అన్నారు సుప్రసిధ్ధ డోగ్రీ భాషాకవి వాగ్గేయకారిణి పద్మా సచ్ దేవ్. ఆమె ఆధునిక డోగ్రీ భాషలో కవిత్వం రాసిన మొట్టమొదటి కవయిత్రి. సాహిహ్త్య అకాడెమీ పద్మశ్రీ లాంటి అనేక అవార్దుల్ని అందుకున్న ఆమె డోగ్రి హిందీ భాషల్లో 60 పుస్తకాల దాకా రాశారు.
పద్మా సచ్ దేవ్ రాసిన ‘మేరీ కవితా మేరీ గీత్’ పుస్తకానికి ముందు మాట రాసిన సుప్రసిధ్ధ హిందీ కవి రాంధారి సింగ్ దినకర్ “పద్మ కవితల్ని చదివిన తర్వాత నేను నా కాలాన్ని మూసేయాలకున్నాను… ఎందుకంటే పద్మ అసలయిన కవిత్వం రాసింది’ అన్నారు.
అంతేకాదు జమ్మూ కాశ్మీర్ ను పాలించిన మహారాజ హరి సింగ్ కుమారుడు శ్రీ కరణ్ సింగ్ పద్మా సచ్ దేవ్ ఒక కవితను ఇంగ్లీశ్లోకి అనువాదం చేశారు. ఆ సందర్భంగా ఆయన డోగ్రీ భాషా గుర్తింపు కోసం దాని ప్రగతి కోసం చేసిన కృషిని వేనోళ్ల పొగిడారు.

డోగ్రీ భాషను అధికార భాషగా గుర్తించాలని రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో చేర్చాలని ఆమె అప్పటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారితో కోట్లాది సాధించారు. 2003లో డోగ్రీ ని 8వ షెడ్యూల్ లో చేర్చిన రోజును ఆమె తన జీవితంలో అత్యంత మరపురాని సంతోషకరమయిన రోజు అన్నారు. అంతే కాదు డోగ్రీ భాష స్వతంత్రమయిన భాష అది ఒక ప్రాంతపు మాండలికం కాదు అని కూడా అన్నారు. అందుకే ఆమెను డోగ్రి భాషకు మాతృమూర్తి అంటారు. వాస్తవానికి డోగ్రీ జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ ప్రాంతంలోని 50లక్షల మందికి పైగా ప్రజలు మాట్లాడతారు. పాకిస్తాను లో డోగ్రిని పహాడీ’ అని పిలుస్తారు. డోగ్రీ మాట్లాడే వారిని డోగ్రాలనీ, డోగ్రీ మాట్లాడే ప్రాంతాన్ని దుగ్గర్ అనీ పిలుస్తారు. అలాంటి డోగ్రీ భాషలో ప్రధానంగా కవిత్వం పాటలు, కథలు ఆత్మకథ, జ్నాపకాలు రాసిన పద్మా సచ్ దేవ్ మంచి గాయని. ఆమె స్వరం చిన్నప్పటినుండే కంచు మొగినట్లు వుండి అందరినీ ఆకర్షించేది. 1940 17 ఏప్రిల్ రోజున పురామండల్ లో జన్మించిన ఆమె కుటుంబం మంచి సాహిత్య కుటుంబం. ఆమె తండ్రి జయదేవ బాబు సాంస్కృత పండితుడు ప్రొఫెసర్. దేశ విభజనలో జరిగిన అల్లర్లలో ఆయన హత్యకు గురయ్యాడు. కేవలం ఏడెనిమిదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయిన పద్మా సచ్ దేవ్ తన తల్లి నీడన ఎదిగారు. ఆమె తన మొట్టమొదటి కవితను తన 16యేళ్ళ వయసులో చదివారు. శ్రోతలో వున్న అప్పటి ముఖ్యమంత్రి ఆమె కవితని విని ఎంతగానో ప్రశంసించారు. అంతేకాదు స్థానిక పత్రిక సంపాదకుదయిన వేద్ పాల్ సింగ్ ఆ కవితను మర్నాడే ప్రచురించాడు. అట్లా ఆమె సాహిత్య సృజనాత్మక జీవితం మొదలయింది. ఆ పరిచయంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వారిద్దరి వయసులు ఆమె 16 అతను 27. ఆ పెల్లిని డోగ్రీ సనాతనతులు వ్యతిరేకించారు. కానీ కొన్ని రోజులకే ఆమె ఆహారనాళంలో క్షయ వ్యాధి సోకి మూడేళ్లపాటు సానిటోరియం లో చికిత్స పొందారు. వైవాహిక జీవితం విఫలం చెంది వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అది కూడా డోగ్రీ పెద్దలకు రుచించలేదు.

మంచి స్వరం వున్న పద్మ సచ్ దేవ్ 1961 లో జమ్మూ ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ గా చేరారు. అక్కడ ఇంచార్జ్ గా వున్న సురీందర్ పాల్ బాగా ప్రోత్సహించారు. తర్వాత ఆయన పెళ్లి ప్రస్తావన తెచ్చిన తర్వాత మూడేళ్లకు ఆమె అంగీకరించి ఇద్దరూ పెళ్లాడారు వాయికి ఒక కుమార్తె మీటా సచ్ దేవ్. ఆమె రాసిన కథల్లో వర్తమాన సమాజంలో స్త్రీల అసమానత్వం, వారికి వున్న స్థానం, వారి హక్కులు మొదలయిన స్త్రీ వాడ భావాల్ని రాశారు. ఆమె డోగ్రీ భాషలో అనేక గేయాలు, జానపద పాటలు రాశారు. తాను బాంబే వెళ్ళినతర్వాత సుప్రసిద్ద హింది సినిమా గాయని లతా మంగేష్కర్ తో పరిచయం, స్నేహం కుదిరి డోగ్రీ పాటల్ని ఆమెతో పాడించింది. అంతే కాకుండా పద్మా సచ్ దేవ్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు కూడా పాటలు రాశారు. వాటిలో ముఖ్యంగా ప్రేమ్ ప్రభాత్ లో ‘మేరా ఛోటా సా ఘర్ బార్’, ఆంకో దేఖీ సినిమాలో ‘సోనా రే తుజే కైసే మిలూ’ లాంటి పాటలు మంచి జనాధారణ పొందాయి. లతా తో పాటు ఆమె రాసిన పలు పాటల్ని మహమ్మద్ రఫీ, సులక్షణా పండిత్ లు పాడారు.. లతా మంగేష్కర్ తో తన అనుబంధాన్ని గురించి ఆమె ఒక చోట మాట్లాడుతూ అక్కా చెల్లెళ్లకంటే ఎక్కువ అన్నారు పద్మా.కవిగా ఆమె డోగ్రీ తో పాటు మొదట్లో హిందీలో కూడా విరివిగా రాశారు. అది చూసిన కొంత మంది పెద్దలు ‘నువ్వట్లా హిందీ లో మునిగి పోతే ఎట్లా? డోగ్రీ భాష సంగెతేమిటి అని ప్రశించారు. దాంతో నవడం, ఏడ్వడం సొంతంగా చేయాలి అనుకుని తన రచనల్ని డోగ్రీలోనే కొనసాగించారు.

పద్మా సచ్ దేవ్ రాసిన ‘మేరీ క్విత మేరీ గీత్’ కు 1969 లో సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. తర్వాత ఆమె తావి తే చన్ హాన్(RVERS OF TAAVI AND CHINAAB), నేహెరియాన్ గలియన్( DARK LANES), పోటా పోతానింబల్( FINGERTIPFUL CLOUDLESS SKY),ఉత్తర్ వాహిని, టైనితన్, అంరాయి(HINDI INTERVEWS),దివాన్ ఖానా (ఇంటర్వ్యూలు),చిట్ చితే( జ్నాపకాలు) తదితర అనేక రచనలు చేశారు.

తనకు పద్మశ్రీ, సాహిత్య అకాడెమీ అవార్డు తో పాటు ధీనుభాయి పంత్ లైఫ్ టైమ్ అవార్డు, సరస్వతి సమ్మాన్, కబీర్ సమ్మన్ తదితర అనేక అవార్డులు లభించాయి. పద్మా సచ్ దేవ్ తన 600 పేజీల జీవిత చరిత్ర లో ఉపయోగించిన నుడికారాలు ఆ ప్రాంత జీవన లయకు అద్దం పడతాయి. అంతే కాదు ఆ దుగ్గర్ ప్రాంత చరిత్ర సంస్కృతి అందులో ప్రముఖంగా చిత్రించబడింది. ‘ పంజాబీ భాషకు అమృతా ప్రీతం, హిందీ భాషకు మహాదేవి వర్మ ఎలాంటి వారో డోగ్రి భాషకు పద్మా సచ్ దేవ్ అంతరి వారు అనే చెప్పాలి.

ఆమె డోగ్రి భాషకు సంబంధించి ఒక్ గొప్ప వాగ్గేయకారిణి. అంతేకాదు ఆమె డోగ్రి జానపద సాహిత్యాన్నివెలుగులోకి తెచ్చి శాష్ట్రీయతనుసంపాదించి పెట్టారు

ఆమె 2021 ఆగస్ట్ నాలుగున తనువుచాలించారు. భవిష్యత్తు తరాల కోసం పద్మాసచ్ దేవ్ రచనల్ని ఆమె పాటల్ని ఆమె స్వరాన్ని భద్రపరచాల్సిన అవసరం ఎంతయినా వుంది.

పద్మా సచ్ దేవ్ ఆరాసినకొన్ని కవితలకు నేను చేసిన అనువాదాలు

తాత్కాలిక శిబిరం
—–
నేను
ఇంట్లోనో స్టూడియో లోనో
ఒంటరిగా వున్నప్పుడు

నా గమ్యం నా పక్కన నిలబడి
సున్నితంగానూ ఒకింత కపటంగానూ
సైగ చేస్తూ
నా ఒంటరితనపు భారాన్ని తగ్గిస్తుంది

దానికి నివాసం లేదు
అయినా నేను అత్యాశతో
దాన్ని అనుసరిస్తూ వెంట వెళ్ళాలనుకుంటాను

నా కోరిక
నా బంధాల్ని తుంచడం ఆరంభిస్తుంది

నేనొకప్పుడు
తాత్కాలిక శిబిరమనుకున్న
ఇక్కడే
ఓ పిరికి రక్షణా భావం
నన్ను వెనక్కి లాగుతుంది

===================================

జీవితం
—-
నాకు అవసరం లేనిది
నా వద్ద వున్నప్పుడు
జీవితం
ఎంత నిండుగానూ నిర్మలంగానూ వుండేది

ఓ దారేదో
అర్దాంతరంగా ముగిసినట్టు

ఒకప్పుడు
ఓ వంతేనేదో కలిపినట్టు
——————-
ఇంగ్లిష్: ఇక్బాల్ మసూద్
తెలుగు స్వేచ్చానువాదం: వారాల ఆనంద్

====================
మాతృ భాష

+++++

“ మాతృభాష”

ఓ రెల్లు తీగపై ఊగుతున్న

ఓ కొమ్మ దగ్గరికి చేరి

ఓ ‘ఈక’ ను ఇవ్వమని అడిగాను

మొన్ననే ఒకటిచ్చాను ఇచ్చింది కొత్తదే

మరి దాన్నేం చేసావు కొమ్మ అసహనంతో అంది

ప్రతి రోజూ ఓ కొత్త పెన్ను అవసరం అయ్యేందుకు

ఏ యజమాని దగ్గరో

నువ్వేమయినా ఖాతాలు రాసే గణకుడివా

నేను ఏ యజమాని దగ్గరా పని చేయను

దయగల డబ్బున్న యజమానురాలి

దగ్గర పనిచేస్తాను

ఆమె వద్ద నాలాగే అనేకమంది సేవకులున్నారు

వారంతా ఆమెకు సేవలు చేసేందుకు

ఎప్పుడూ సిద్ధంగా వుంటారు

ఆ యజమానురాలు నా మాతృభాష

‘డోగ్రీ’

త్వరగా నాకో ఈకను ఇవ్వు

బహుశా ఆమె నాకోసం ఎదురుచూస్తూ వుంటుంది

రెల్లు తీగ తన చేయిని తుంచి నాకిచ్చి

తీసుకో నేను కూడా ఆమె సేవకున్నే అంది.

*****************

“బాధ”

ఈ తల

ఓ బాధల పెట్టె

పిల్లాడి గిలక్కాయలా గిర గిరా తిరుగుతూ

మళ్ళీ మళ్ళీ టక టాకా శబ్దం చేస్తుంది

ఒకటికాదు ఎన్నో రకాల బాధలు నొప్పులు

గతం జ్ఞాపకాల బాధ

వృధాగా దాచి ఉంచిన రహస్యాల బాద

ఇవ్వలిటి బాధ

రేపటి బాధ

కానీ ఒక బాధ మాత్రం

కొత్తగా పుట్టదు

అదట్లా వుంటుంది వుంటూనే వుంటుంది

ఆ బాధ “నేను”

ఆ బాధ

నేనివ్వాళ గానం చేయలేని

దుఖం నుండి పుడుతుంది.

డోగ్రి- పద్మా సచ్ దేవ్

ఇంగ్లిష్: ఇక్బాల్ మసూద్

**********************

డోగ్రీ భాషా వాగ్గేయకారిణి పద్మా సచ్ దేవ్

+++++++++++ వారాల ఆనంద్

“యుగళగీతం”+++++ వారాల ఆనంద్

Posted on

“యుగళగీతం”
+++++ వారాల ఆనంద్

వర్షంలో ఓ చెట్టు
తడిసి ముద్దవుతుంది
దేహమంతా పరవశించి పోతుంది

ఆకాశంనుంచి రాలిన చినుకులు
ఆకుల మీంచి ముత్యాల్లా జారి
నేలమీద పడి మట్టిని పలకరిస్తాయి

అప్పటికే తడిసి పులకరించిన నేల
చెట్టువైపు మట్టి పెదాలతో
చిరునవ్వు విసుర్తుంది

కొంచెంసేపటికి వర్షం నిలిచిపోతుంది

విసురుగా వీస్తున్న చల్లగాలికి
వణుకుపుట్టిన చెట్టు ఒళ్ళు విరుచుకుని
కొమ్మలన్నింటినీ పైకెత్తి
ఆకులన్నింటినీ అందంగా చాపి
ఆకాశానికి కృతజ్ఞతలు చెబుతుంది

నేల తన గొంతుకలిపి
‘యుగళ గీతం’ పాడుతుంది
********

https://telugu.asianetnews.com/literature/varala-anand-s-poety-bsb-opk-rzkta4

వాన- మౌనం

Posted on Updated on

వాన- మౌనం

++++++ వారాల ఆనంద్

ఇంటి కప్పుపైన

బాల్కనీలో

చెట్లపైనా కొమ్మలపైనా

టప టపమంటూ

వాన చినుకులు సరిగమలు పోతున్నాయి

ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి

కేరింతలు కొడుతున్నాయి

అరుచుకుంటున్నాయి అల్లరి చేసుకుంటున్నాయి

సాయంత్రం స్కూలు వదిలేసిన పిల్లల్లా

జాతరలో జనంలా

సభల్లో వక్తల్లా

ఒకటే గోల 

కానీ గదిలో నాలో  

లోనెక్కడో

తెలీని నిశ్శబ్దం

చినుకులై రాలలేని మౌనం

బయట వాన నిలిచిపోతే

శబ్దం ఆగిపోతుంది

కానీ నా లోనూ నీ లోనూ

ఈ దేశంలోనూ   

గడ్డకట్టిన నిశ్శబ్దం

కరిగేనా బద్దలయ్యేనా  

ఎప్పటికయినా

వాక్యం

Posted on

వాక్యం

++++++ వారాల ఆనంద్

సుఖ దుఃఖాల పంచాయితీలో
దుఃఖమే గెలుస్తుంది

తప్పదు మరి

అగ్గిపుల్ల సుర్రున వెలిగి ఆరిపోయినట్లు
అగర్ బత్తి సుధీర్ఘంగా కాలినట్టు
సుఖం స్వల్పాయుష్షు
దుఃఖానికి దీర్ఘాయుష్షు

అలాంటి దుఃఖం నాలోకి దిగిపోయి
ఆణువణువూ పాకిపోయి
సమస్త దేహమూ కుంగిపోయి
రందితో నిండిపోయి
అలసి సొలసి నిలబడ్డప్పుడు

లోన ఎక్కడో ఓ వాక్యం పుడుతుంది
నా పక్కన జేరి
భుజం తట్టి

ఓ కవీ
ఆ దుఃఖాన్ని నాకిచ్చేయ్
నీ భారాన్ని దించేయ్
అంటుంది

*****

వాక్యం

101=యాదోంకీ బారాత్

Posted on

101=యాదోంకీ బారాత్

+++++= వారాల ఆనంద్

“When people ask me if I went to film school, I tell them, ‘no, I went to films” అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు Quentin Tarantino. అయినప్పటికీ చలన చిత్ర నిర్మాణమన్నది కేవలం కళే కాదు సైన్స్ కూడా. సినిమా దర్శకుడు తనకున్న ఎన్నో ఆలోచనల్ని భావాల్నీ తెరపైకి మలచాలంటే ఎన్నో శాస్త్ర సాంకేతికాంశాల్ని వినియోగించాల్సి వుంటుంది. దానికోసం శిక్షణ అవగాహన ముఖ్యం. అంతేకాదు ఒక మంచి సినిమా తీయాలంటే స్క్రిప్ట్ , స్క్రిప్ట్ , స్క్రిప్ట్ అనే మూడు అంశాలు తప్పనిసరి అంటాడు అల్గ్ఫ్రెడ్ హిచ్ కాక్. అంటే సినిమా రూపొందించడానికి మిగతా అన్నీ అంశాల కంటే కూడా ముఖ్యమయింది ప్రధానమయింది స్క్రిప్ట్ అన్నమాట. ఆ స్క్రిప్ట్ రాయడానికి దర్శకుడు తప్పనిసరిగా చదవాలి.. చదవాలి..చదవాలి READ, READ AND READ అంతే చదవకపోతే దర్శకుడు కావడం సాధ్యమే కాదు.

నా మట్టుకు నేను ఫిల్మ్ సొసైటీ ప్రదర్శనల్లో అనేక సినిమాలు చూసిన తర్వాత ఫిల్మ్స్ కు  సంబధించి, ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించి నా తర్వాతి తరానికి పరిచయం,శిక్షణ కల్పించాలనుకున్నాను. నాకున్న అనేక పరిమితుల మేరకు పూర్తి స్థాయిలో సినిమా రంగంలోకి వెళ్ళే స్థితి లేదు కనుక యువకులకయినా ఆ రంగం పట్ల కనీస అవగాహన కలిగించాలనుకున్నాను. మంచి సినిమాల్ని చూడండి, ప్రపంచాన్ని అర్థం చేసుకోండీ. ఆసక్తి వుంటే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోండి అని విద్యార్థులకు యువకులకు చెప్పేవాన్ని. కాలేజీల్లో ఓ పక్క కాంపస్ ఫిల్మ్ క్లబ్స్ ఏర్పాటు చేస్తూనే ఫిల్మ్ మేకింగ్ వర్క్ శాప్స్ నిర్వహించడం మొదలు  పెట్టాను, మా కాలేజీలో ఏకంగా ఆర్నెల్ల ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నే ప్రారంభించాను. అప్పుడు ప్రిసీపాల్స్ గా వున్న మిత్రులు డాక్టర్ మధుసూధన్ రెడ్డి, డాక్టర్ మురళి ఎంతగానో సహకరించారు.

అట్లా మా కాలేజీలో మొదలు పెట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ క్లబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ప్రారంభించాను. అప్పటి శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఇక్బాల్ లాంఛనంగా ప్రారభోత్సవం చేశారు. ప్రిన్సిపాల్ మధుసూధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ తెలుగు ఫిల్మ్ క్రిటిక్ శ్రీ చల్లా శ్రీనివాస్ అతిథిగా వచ్చి పిల్లలకు సినిమా మీద సినీ విమర్శమీద ముఖ్యంగా తెలంగా సినిమా గురించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. తర్వాత అప్పుడు కరీంనగర్ డిఐజి గా వున్న అధికారికి ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆసక్తి వుందని తెలిసి తనని క్లాస్ కి పిలిచాను. ఆయన స్వతహాగా కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసి వున్నాడని తెలిసి చాలా సంతోషం కలిగింది. అనుభవాలతో కూడిన ఆయన క్లాస్ కూడా పిల్లలను బాగా ఆకట్టుకుంది. ఇక సుప్రసిద్ద రచయిత దర్శకుడు శ్రీ అక్కినేని కుటుంబ రావు, ఎడిటర్ లెనిన్ తదితరులు వచ్చి కోర్సులో క్లాసులు చెప్పారు. కుటుంబరావు గారు అందించిన ప్రోత్సాహం సహకారం ఎన్నటికీ నేనూ, మా కాలేజీలోని అప్పటి విద్యార్థులూ మర్చిపోలేము. చిత్ర నిర్మాణానికి చెందిన అనేక విషయాల్ని ఆయన సోదాహరణంగా వివరించారు. కోర్సుల్లో స్క్రిప్ట్ రచన కెమెరా పనితనం, ఎడిటింగ్ తదితర విషయాల గురించి ప్రాథమిక విషయాల్ని చెప్పాం.

కోర్సు అట్లా నడుస్తూ వుండగానే మాకొక ఆలోచన వచ్చింది. ప్రత్యేకంగా ఓ రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తే ఎట్లా వుంటుంది అని. ఇంకేముంది దానికి ‘మేక్ అప్ టు పాక్ అప్’ (MAKE UP TO PACK UP) అని పేరు పెట్టాం. ఆసక్తి వున్న పిల్లలకు దృశ్యభాష, దృశ్యచిత్రీకరణ, స్క్రిప్ట్ రచన,ఎడిటింగ్ తదితర అంశాల పైన వర్క్ షాప్ లో చెప్పాలనుకున్నాం. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలనుంచి యువతను ఆహ్వానించాలి వారికి ప్రధానంగా అవగాహన కల్పించాలనుకున్నది లక్ష్యం. నా పిలుపును అందుకుని నిజామాబాద్, హైదరబాద్, సిద్దిపేట్, గంభీరావుపేట్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మా కాలేజీ సత్యజిత్ రే ఫిల్మ్ క్లబ్ తో పాటు ‘గామా’ ఫిల్మ్ సంస్థ కూడా సహకరించింది. మొదటి రోజు శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వీరారెడ్డి అతిథిగా పాల్గొన్నారు. కరీంనగర్ కేంద్రంగా ఫిల్మ్ రంగంలో యువత ఎదగాలని ఆయన మా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మురలి ఆశించారు. వర్క్ షాప్ ను ప్రారంభించిన నా మిత్రుడు దర్శకుడు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన మొదటి సినిమాలు వైఫల్యం చెందాయని అయినా పట్టు వదలక ముందుకు సాగితేనే ‘సొంత వూరు’, ‘గంగ పుత్రులు’ లాంటి అవార్డు సినిమాల్ని తీయగలిగానని చెబుతూ ఫిల్మ్ దర్శకత్వం గురించి వివరంగా చర్చించారు. ఇక మొదటి సెస్సన్ లో ‘కుంకుమ రేఖ’ సీరియల్ దర్శకుడు శ్రీ హరిచరణ్ రావు, రెండవ సెస్సన్ లో సీనియర్ దర్శకుడు శ్రీ వీ.వీ.రాజు సినిమాల్లోని 24 ఫ్రేమ్స్ కు చెందిన అనేక అంశాల్ని వివరించారు. ఫిల్మ్ ఎడిటర్ రవీంద్ర బాబు ఫిల్మ్ ఎడిటింగ్ ఆవిర్భావం నుండి వర్తమాన స్థితి వరకు వివరించారు. కలరింగ్, గ్రాఫిక్స్ గురించి కూడా చెప్పారు. వర్క్ షాప్ రెండవ రోజు హోప్, కలవరమాయే మదిలో లాంటి సినిమాల్ని తీసిన దర్శకుడు శ్రీ సతీష్ కాసెట్టి ఫిల్మ్ కాన్సెప్ట్ నుంచి మొదలు ఫైనల్ ప్రాడక్ట్ దాకా జరిగే సాంకేతిక అంశాల గురించి స్పెల్ బౌండ్  ప్రేసెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాతి సెస్సన్ లో ప్రముఖ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ శ్రీ జగన్ మాట్లాడుతూ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాటి ప్రాముఖ్యత గురించి చెప్పగా, నింగీ నెలా నిర్మాత చావా సుధారాణి ఆత్మవిశ్వాసం తోనే గొప్ప సినిమాలు నిర్మించవచ్చని అన్నారు. ఇక ముగింపు సమావేశంలో నంది అవార్డును అందుకున్న మా మిత్రుడు ‘విముక్తి కోసం’ సినిమా నిర్మాత శ్రీ నారదాసు లక్ష్మణ రావు సినిమా అత్యంత శక్తివంతమయిన మాధ్యమం అన్నారు. అట్లా మా కాలేజీ క్లబ్ నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొని యువతే యువకులు గొప్ప దృశ్య చైతన్యంతో వెనుదిరిగారు. మా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ గొప్ప వేదికగా నిలిచినందుకు మా ప్రిన్సిపాల్, అధ్యాపకులు సిబ్బంది ఎంతో సంతోష పడ్డారు.

++++

ఆ తర్వాత నేను నిర్వహించిన ఫిల్మ్ వర్క్ శాప్  శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి లో యువ మిత్రుడు శ్రీకాకులానికి చెందిన గుడ్ల సంతోష్ కుమార్ సహకారంతో సాధ్యమయింది. 2011 ఆగస్ట్ ఆరరు, ఏడు తేదీల్లో నిర్వహించిన ఈ వర్క్ షాప్ నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. విజయ గర్వాన్ని కూడా అందించిందనే చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మారు మూల జిల్లా అయిన శ్రీకాకుళం ‘టెక్కలి’ లోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మానేజ్మెంట్ లో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆ కాలేజీలోని కాంపస్ ఫిల్మ్ క్లబ్ సహకారంతో జరిగింది. కాలేజీ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ రావు పూర్తిగా సహకరించారు. ఆర్థికంగానూ హార్దికంగానూ. కేవలం ఆదిత్య కాలేజీ నుంచే కాకుండా కాకినాడ, విజయవాడ, విశాఖ లాంటి పలుచోట్ల కు చెందిన వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్నుంచీ  సుమారు 120 మండి విద్యార్థినీ విద్యార్థులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.FEDERATION OF FILM SOCIETIES కు అప్పుడు నేను కార్యదర్శిగా వున్నాను. ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ. తన వంతు పూర్తిసహకారాన్ని అందించింది. నా విజ్ఞప్తిని ఆమోదించి పలువురు సినీప్రముఖులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. హైదరబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి శ్రీ ప్రకాష్ రెడ్డి మొత్తం కో ఆర్డినేట్ చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదిత్య కాలేజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు అధ్యక్షత వహించగా సుప్రసిద్ద దర్శకుడు శ్రీ రేలంగి నరసింహా రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేలంగి గారు తన సినిమా దర్శకత్వ అనుభవాల్ని సోదాహరణంగా వివరించారు. వర్క్ షాప్ రిసోర్స్ పర్సన్స్ గా సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎం.వీ.రఘు, ‘అంకుశం’ దర్శకుడు శ్రీ సి.ఉమామహేశ్వర్ రావు, రచయిత శ్రీ కె.ఎల్.ప్రసాద్, దర్శకుడు ప్రవీణ్ బండారు, బిహెచ్ ఎస్.ఎస్. ప్రకాష్ రెడ్డి గార్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజుల ఈ వర్క్ షాప్ లో కాలేజీ డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండవ రోజు తమ ఇంట్లో మా అందరికీ బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసి ఎంతో ఆప్యాయంగా వున్నారు. రిసోర్స్ పర్సన్స్ అంతా స్క్రిప్ట్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం తదితర అంశాల గురించి చైతన్యవంతమయిన ప్రసంగాలు చేశారు. నేనేమో నా ఫిల్మ్ ప్రేసెంటేషన్ ఇచ్చాను. మిత్రులంతా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి టెక్కలి దాకా వచ్చి రెండు రోజులాపాటు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రశ్నల్ని సంధిస్తూ మమేకమయి పోయారు.

అట్లా విద్యార్థులు యువకులకోసం నేను నిర్వహించిన వర్క్ షాప్ లు నాకో ఎంతో నేర్పించాయి. ఎందుకంటే ORGANISATION IS AN EXPERIENCE, AND EXPERIENCE IS GREAT LEARNING. I WANT TO BE A LEARNER ALWAYS ..

మిగతా వివరాలతో మళ్ళీ కలుస్తాను

-వారాల ఆనంద్

6 ఆగస్ట్ 2023                 

‘తమిళ సినిమాల్లో దళిత వాదానికి పెద్దపీట’

Posted on

24 ఫ్రేమ్స్

‘తమిళ సినిమాల్లో దళిత వాదానికి పెద్దపీట’

++++++++++++ వారాల ఆనంద్

    సీనిమాలు సామాజిక దర్పణాలు. అవి సమాజాన్నీ సామాజిక  వాస్తవాల్ని ప్రతిబింబించాలి. పొరలు పొరలుగా వున్న సామాజిక అంతరాల్ని అణచివేతని అరాచకాల్ని ప్రశ్నించాలి. కానీ వ్యాపార వూబిలో చిక్కి ఉన్నత వర్గాల చేతిలో వుండిపోయి సినిమా తన మౌలిక లక్షణాల్ని లక్ష్యాల్ని గాలికి వదిలేసిందనే చెప్పాలి. కానీ అన్నీ భాషా చిత్రాల కంటే భిన్నంగా ఇటీవల తమిళ సినిమా రంగంలో దళిత సమస్యల్ని ఉటంకిస్తూ దళితుల్ని ఉన్నతీకరిస్తూ పలు సినిమాలు వచ్చాయి. విజయవంతమయ్యాయి. అదొక మంచి పరిణామం. మిగతా భాషా సినిమాలకు మార్గదర్శనం.

కుల వివక్ష, ఆత్మగౌరవం వాటికోసం అణచివేతకు గురయిన వర్గం చేసే పోరాట ఇతివృత్తం తో ఇటీవల వచ్చిన తమిళ సినిమా  ‘మామన్నన్’ . ఆ సినిమాకు దర్శకుడు మారి సెల్వరాజ్. ఇప్పటికే ‘పరియేరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’ లాంటి క్లాసిక్స్ సినిమాలతో తన ముద్రని తమిళ సినిమా రంగంలో  నెలకొల్పిన దర్శకుడు ఆయన. ఆయన ఈ సినిమాలో ప్రతిభావంతంగా ఆవిష్కరించిన ‘శ్లేష, ‘ప్రతీకాత్మకత’ చాలా గొప్పగా వుంటుంది. పందుల్ని పెంచే కులానికి చెందిన నిమ్న కులానికి చెందిన నల్గురు చిన్న కురాళ్ళు బావిలో ఈత కొడుతూ వుంటారు. అది చూసి ఉన్నత కులానికి చెందిన పెద్దలు బావిఒడ్డు పైనుండి రాళ్ళతో కొట్టి దాడి చేస్తారు. నాలుగురిలోంచి ఒక పిల్లవాడు దెబ్బలు తగులుతూ వుండగానే తప్పించుకుని పైకి వస్తాడు. అతను ఆవూరి మామన్నన్ కొడుకు. కానీ మిగతా ముగ్గురూ రాళ్ళ దెబ్బలకు బావిలోనే చనిపోతారు. మామన్నాన్ ఆ వూరిలో అధికార పార్టీ కార్యకర్త. అతను వెళ్ళి ఎమ్మెలేను కలిసి న్యాయం చేయాలంటాడు. కానీ పార్టీ అనీ అదీ ఇదీ అని చెప్పి వూరు వాళ్లందరినీ మభ్యపెడతాడు. బావి గోడ కూలి పీల్లలు చచ్చిపోయారని నమ్మ బలుకుతాడు. అదంతా చూసిన ఆతప్పించుకున్న ఆదివీరన్ ఖిన్నుడవుతాడు. ఇంట్లోంచి పారిపోయి యుధ్ధవిద్యను నేర్పించే ఓ గురువు దగ్గర శిష్యుడిగా చేరిపోతాడు. తన తండ్రి తో మాట్లాడనే మాట్లాడడు. ఇద్దరి నడుమా గాప్ పెరుగుతుంది. బావిలో జరిగిన సీక్వెన్స్ దర్శకుడి టాప్ ఆంగిల్ షూట్ కి మంచి ఉదాహరణ, తర్వాత కాలం గడిచి ఆ నియోజక వర్గం కిందికులాల వారికి రిజర్వ్ చేయడంతో మామన్నన్ శాసన సభ్యుడు అవుతాడు.  ఆదివీరన్ పెరిగి పెద్దవాడై కాలేజీ చదువులతో పాటు యుద్ద విద్యలో నిష్ణాతుడు అవుతాడు. యువకులకు శిక్షణ నిస్తూ వుంటాడు. ఆదివీరన్ క్లాస్ మెట్ లీలా ఆ వూర్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చే ఇస్టిట్యూట్ పెడుతుంది. కానీ ఆ వూరిలో అధికార పార్టీ జిల్లా కార్యదర్శి  ఉన్నత కులాని చెందిన రత్నవేలు అన్న పెద్ద విద్యాసంస్థల్ని నడుపుతూ వుంటాడు. లీల ఉచిత శిక్షణా సంస్థ పైన దాడి చేస్తాడు. దానికి ప్రతిగా ఆదివీరన్ తన వాళ్ళతో కలిసి ఆతని విద్యాసంస్థల పైన దాడి చేస్తాడు. అదంతా తెలిసి రత్నవేల్ దాడి చేసిన వాళ్ళల్లో  ఏం ఎల్ ఏ కొడుకు వున్నాడని తెలిసి ఏం ఎల్ ఏ రత్నవెల్ ను ఆతని కొడుకు ఆదివీరన్ ను పిలిపిస్తాడు. ఎం.ఎల్.ఏ అయినా రత్నవేల్ మామాణ్ణన్ ను నిలబెట్టి మాట్లాడతూ వుండడం చూసి నాన్నా కొర్చో అంటాడు. కానీ మామన్నన్ కూర్చోడు. తమ ముందు కొర్చోలేడు ఇవ్వాళ కాదు ఎన్నో ఏళ్లుగా అంతే అని గేలి చేస్తారు. దాంతో ఉన్నత కులానికి చెందిన వాళ్ళు తమని ఎట్లా నీచంగా చూస్తారో గమనించి ఆదివీరన్ ఎదురు తిరుగుతాడు. అట్లా ‘కుర్చీ’ ఈ సినిమాలో మరో గొప్ప సింబల్ అవుతుంది. కులం కారణంగా నిలబెట్టి మాట్లాడ్డం అన్నది భరించలేక పోతాడు. మరోవైపూ రత్నవేల్ కుక్కల్ని పెంచుతూ వుంటాడు. పరుగు పందెలకు తీసుకెళ్తూ వుంటాడు. తాను బాగా ఇష్టపడ్డ కుక్క ఒక పోటీలో ఓడిపోతే దాన్ని క్రూరంగా  కొట్టి హింసించి చంపేస్తాడు.  ఇంకో వైపు ఆదివీరన్ హాబీ గా పందుల్ని ప్రేమగా పెంచుతూ వుంటాడు. ఇదొక ఇమేజరీ. ఉన్నత కులానికి చెందిన వాడు కుక్కల్ని పెంచితే కింది తరగతి వాడు పందుల్ని పెంచుతాడు. ఆ తర్వాత ఇద్దరి మద్యా వైరం పెరిగినప్పుడు తన కుక్కల్ని పంపి ఆదివీరన్ పెంచుతున్న పందుల్ని చంపిస్తాడు రత్నవేల్. రత్నవేల్ తాను తన తండ్రి ద్వారా వచ్చిన అధికారం, తన ఆగ్ర కులం ద్వారా వచ్చిన ఆధిపత్యాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూ వుంటాడు. వైరం తారస్థాయికి చేరుతుంది. అప్పటిదాకా మౌనంగా వున్న మామన్నన్ కొడుకు స్పూర్తితో మారిపోతాడు. రత్నవవేలుకు ఎదురు తిరుగుతాడు. హింసాత్మకంగా మారిని స్థితిలో ముఖ్యమంత్రి రత్నవెలును పిలిచి హెచ్చరిస్తాడు. కానీ తన కులా ఆధిపత్యాన్ని ప్రదర్శించి నాకు మీ ఒక్క పార్టీనే కాదు మరెన్నో వున్నాయని పార్టీ మారతాడు.ఎన్నికల్లో మామన్నన్ కు వ్యతిరేకంగా తన మనిషిని  నిలబెట్టి కుల సంఘాల్ని కట్టుకుని డబ్బును వెజల్లి గెలిచి మామన్నన్ ను ఓడించి ఆతన్ని ఆతని కొడుకుని అంతం చేయాలనుకుంటాడు. కానీ యువత ఎదురు తిరిగి ఎన్నికల్లో మామన్నన్ గెలుస్తాడు. అనేక మలుపుల నడుమ సినిమా ఆసక్తిగా సాగుతుంది. చివరికి గెలిచిన మామన్నన్ ను స్పీకర్ ను చేస్తారు. అసెంబ్లీ లో ఉన్నత కుర్చీని అధిరోహిస్తాడు. రత్నవేలు లాంటి ఉన్నత కులానికి చెందియన వాడి ముందు కూర్చోవడానికి వీల్లేని మామన్నన్ స్పెకర్ సీట్లో కూర్చోవడం మరో సింబాలిక్ ప్రదర్శన. సినిమాలో మామన్నన్ పాత్రలో  వడివేలు చాలా గొప్పగా నటించాడు. ఇక రత్నవేలు పాత్రధారి ఫహద్ ఫాసిల్ కూడా అద్భుతంగా చేశాడు. ఇట్లా మొత్తం మీద  కులసమస్య, ఆత్మగౌరవ సమస్యల్ని తీసుకుని రూపొందించిన  ఈ సినిమా తమిళ సినిమా రంగంలో మైలు రాయిగానే చెప్పొచ్చు. దర్శకుడి ప్రతిభ  ప్రస్ఫుటంగానూ, కమిట్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలో సెన్సార్ తదితర కారణాల వల్ల ఎక్కడా దళిత అన్న మాట లేకున్నా బుద్దుడు, అంబేడ్కర్ ల విగ్రహాల్నీ బొమ్మల్నీ చూపిస్తూ తన ఇమేజరీలతో ఆ విషయాన్ని దర్శకుడు స్పష్టంగా ఎప్పటికప్పుడు చెబుతూనే వుంటాడు.

ఇట్లా ‘మామన్నన్’ సినిమానే కాదు ఇటీవలి కాలంలో తమిళ సినిమా దళిత సమస్య, కుల సమస్యల్ని తీసుకుని మంచి సినిమాల్ని విజయవంతమయిన సినిమాల్ని అందించింది. ఆ విషయంలో తమిళ రంగాన్ని మనసారా అభినందించాలి . ఇప్పటికే పా రంజిత్ రూపొందించిన ‘మద్రాస్’. కబాలి. కాలా మొదలయిన సినిమాలు కుల సమస్యను తీసుకుని గొప్ప ఒరవడికి పాదులు వేశాయి.

ఇంకా చెప్పాలంటే తమిళ సినిమా రంగంలో 1930ల్లో పురాణాల మీద ఆధారపడి బ్రాహ్మణీయ సినిమాలు వచ్చాయి. అప్పుడు వచ్చిన అనేక సినిమాల్లో ప్రధాన పాత్రధారి ఇంటిపేరులోనే ఆతని కులం ధ్వనించెట్టు వుండేది. ఉత్తమపుత్తిరాన్, సేవాసదనం సభాపతి లాంటివి కొన్ని. అప్పుడే దేవదాసీ సమస్యతో కూడా సినిమాలు వచ్చాయి.

ఆ తర్వాత 1950ల్లో పెళ్లుబికిన ద్రవిడ ఉద్యమం నేపధ్యంలో బ్రాహ్మణ వ్యతిరేక సినిమాలు వచ్చాయి. ఆ కాలంలో కొంత వాస్తవాద ధోరణి వచ్చి కులాన్ని హేతుబద్ద దృష్టి తో చూడడం మొదలు పెట్టారు. దానికి కొంత మానవీయ కోణం కూడా కలిపారు. అప్పుడే కులాన్ని గురించి తమిళ సినిమాలు స్పష్టంగా మాట్లాడ్డం మొదలు పెట్టాయి. ఇక 1956 లో వచ్చిన మధురై వీరన్ లో ఎమ్జీఆర్ వేసిన అంటరానివాడి పాత్ర విజయవంతమయి ఆయన రాజకీయంగా కూడా లబ్ది పొందాడు. తర్వాత కరుణానిధి రాసిన ‘పరాశక్తి’ లాంటి సినిమాలు ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఆ తర్వాత ‘భారతి కన్నమ్మ’ లాంటి సినిమాలు కులాన్ని గట్టిగానే ప్రశ్నించాయి. కానీ అవి ఆర్థికంగా విజయవంతం కాకపోవడంతో ఆ ఒరవడి కొంత కాలం తగ్గింది.

పా రంజిత్ లాంటి వాళ్ళు సినిమా రంగం లోకి వచ్చినతర్వాత పరిస్తితి మారింది. మద్రాస్, పరియెరుం పెరుమాళ్, అసురన్ లాంటివి కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా వచ్చాయి. ఇక కాలా కబాలి మరింత ముందుకు పోయాయనే చెప్పాలి. అయినప్పటికీ తమిళ నవ్య దర్శకులు దళిత వాదాన్నీ కుల సమస్యనీ తమ సినిమాల్లో ప్రధాన ఇతివృత్తంగా చేసుకుంటున్నప్పటికీ అనేక వొత్తిడుల పనిచేస్తున్నారనే చెప్పాలి. ఉన్నత కులాల వారి ఆధిపత్యంలో వున్న సినిమా రంగం తమ ఆధిపత్యాన్ని కొనసాగిచే ప్రయత్నం చేస్తూనే వుంది. కానీ పా రంజిత్ లాంటి వాళ్ళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయపతాక ఎగురుయవేస్తూ వుండడంతో ఆర్థిక మూలలపైన నిలబడ్డ సినిమా రంగం అలాంటి సినిమాల్ని తప్పనిసరై ఆమోదించాల్సి వస్తున్నది. రజనీ కాంత్ లాంటి పెద్ద హీరోలు, వడివేలు లాంటి పెద్ద నటులు ఈ సినిమాల పట్ల ఆసక్తి చూపడం కూడా ఒక రకంగా వాటికి బలమనే చెప్పాలి. మొత్తం మీద తమిళ సినిమా రంగం కుల సమస్యను దళిత వాదాన్నీ బలంగా చాటే దిశలో ముందుకు సాగుతూ వుంది.

కానీ మన తెలుగు సినిమా అలాంటి స్థితికి చాలా దూరంగా వుంది. సమాజంలో వేళ్లూనికుని వున్న కుల సమస్య నే కాదు మరే ప్రధాన ఇతివృత్తాలుగా చేసుకునే పరిస్తితి లేదు. కుమురంభీమ్ లాంటి పోరాట యోధుల పాత్రల్ని తీసుకుని ఫిక్షన్ అని దాబాయిస్తూ వున్న తెలుగు సినిమా తమిళ సినిమా నుంచి ప్రేరణ పొందాలని ఆశిద్దాం.    

 **************** 

‘తమిళ సినిమాల్లో దళిత వాదానికి పెద్దపీట’

ఈశాన్యంలో నిప్పు++++++ వారాల ఆనంద్

Posted on Updated on

ఈశాన్యంలో నిప్పు
++++++ వారాల ఆనంద్
కొలనులోని నీటి ఉపరితలంలా
ఆకాశం నిర్మలంగా వుంది
నేల శ్వాసిస్తూనే వుంది
వూపిరింకా కొనసాగుతూనే వుంది

అంతా ప్రశాంతంగా వుంది
మెరుపులు ఆయుధాల్లా మెరుస్తున్నాయి
ఉరుములు పిడుగుల్లా కురుస్తున్నాయి
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది

ఈశాన్యంలో ఏడుగురు అక్కా చెల్లెళ్ళతో
చెమ్మా చెక్కా ఆడుతున్నారు
ఒకరిద్దరి గుడ్డలు వూడిపోయాయి
గుండెలు జారిపోయాయి

అస్సాంలో భూపేన్ దహజారికా
‘దిల్ హూం హూం కారే’ అంటున్నాడు
త్రిపురలో ఎస్దీబర్మన్ ‘వక్త్ నే కియా క్యా సీతం’ అని పాడుతున్నాడు
మిజోరాంలో పూలు వాడిపోయాయి
మేఘాలయాలో మబ్బులు తేలిపోయాయి
నాగాలు పండగల్ని మర్చిపోయారు
అరుణాచలంలో సూర్యుడు ఉదయించనేలేదు
మణిపూర్ మసక బారింది

ఈశాన్యంలోలోతట్టు ప్రాంతాలు
జనశూన్యమవుతున్నా
చక్రవర్తుల ఫిడేలు కచేరీ సాగుతూనే వుంది

ఈశాన్యంలో నిప్పు వాస్తు దోషంరా
శవాల కుప్పలతో బరువు పెరిగితే
ఇంటికి కీడురా

‘అనేకం’ చెప్పేవాడికి
ఎవడయినా చెప్పండిరా


https://epaper.andhrajyothy.com/Home/FullPage?eid=34&edate=03/08/2023&pgid=494536

భారత్ భవన్’ రూపకర్త ప్రసిద్ద కవి అశోక్ వాజ్ పేయి

Posted on

‘భారత్ భవన్’ రూపకర్త ప్రసిద్ద కవి అశోక్ వాజ్ పేయి

++++++ వారాల ఆనంద్

‘ మానవ జీవితంలో అత్యంత ప్రధానమయింది ప్రేమ. సాటి మనిషి పట్ల మనం నివసించే లోకం పట్ల ప్రేమ వుండాలి. ఇతరులు ఎవరూ లేకుండా కేవలం ఒకరమే మనలేం’ అంటాడు సుప్రసిద్ద హిందీ కవి శ్రీ అశోక్ వాజ్ పేయీ. అంతేకాదు జీవితం ముగిసిన తర్వాత కూడా జీవించాలంటే సాహిత్యం కళలే ప్రధాన వనరులు అని కూడా ఆయన పలు ముఖా ముఖుల్లో చెప్పాడు. సాహిత్య కారులకు సాహిత్య హద్దులు కూడా తెలిసి వుండాలని కూడా ఆయన అంటారు. ముక్తిభోధ్, షంషేర్ ల కవిత్వాన్ని అమితంగా ఇష్టపడే అశో వాజ్ పేయీ కవిత్వంలో స్పష్టత వుండాలంటారు. కవిగా వుండడం నిలబడ్డం చాలా కష్టం అంటారాయాన.తనకు ప్రాథమిక స్థాయిలోనే మాక్సిం గోర్కీ ‘అమ్మ’, ‘ రామ్ చరిత మానస్’ లు గొప్ప ప్రభావాన్ని చూపించాయని అన్నారు. అంతేకాదు వర్తమాన కాలంలో రోహిత్ వేముల సంఘటనలు చూసి విని తీవ్రంగా కాలత చెందానని అన్నారు అశోక్ వాజ్పేయీ. రోహిత్ వేముల ఆత్మహత్య నేపధ్యంలో ఆయన తనకు హైదరబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిలీట్ ను తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు తనకు ఇచ్చిన సాహిత్య అకాడెమీ అవార్డును కూడా వాపస్ చేసేశాడాయన.

అంతే కాదు కవిత్వం రాయడ మంటే సత్యాగ్రహం చేయడం లాంటిదే అంటారు. అది  నాగరిక సామాజిక విశ్లేషణే అంటాడు అశోక్ వాజ్పేయి.

అశోక్ వాజ్పేయీ కవీ కాదు వ్యాసకర్త, విమర్శకుడు, అనువాదకుడు కూడా. భారత జాతీయ స్థాయిలో సాంస్కృతిక రంగంలో ఎంతో చైతన్యవంతమయిన కృషి చేశాడాయన. ఐ.ఏ.ఎస్. అధికారిగానూ సాంస్కృతిక కార్యకర్తగానూ ఎనలేని సేవ చేశాడాయన. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక మయిన సంస్థల రూపకల్పనలో ప్రధాన భాగస్వామ్యం ఆయనది. దాదాపు 40 కవిత్వ విమర్శ పుస్తకాలు రాసిన ఆయన హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఎనిమిది పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించాడు.

ప్రధానంగా హిందీలో రచనలు చేసిన అశోక్ వాజ్ పేయి కవిత్వం స్పానిష్, జర్మన్, పోలిష్, రష్యన్, హంగేరియన్, నార్వే, అరబిక్ లాంటి అనేక విదేశీ భాషల్లోకి అనువదించబడింది. ఆయన రాసిన కవితాసంకలనం ‘ కహీఁ నహీఁ వ హహీఁ ‘ కి 1994 లోనే సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. తర్వాత 1997లో ఆగ్గేయ రాష్ట్రీయ సమ్మాన్ అందుకున్నారు. ఇంకా కబీర్ సమ్మాన్, దయవతి మోడి కవి శేఖర్ సమ్మాన్ కూడా అందుకున్నారు.   

ఆయన సెంట్రల్ ఇండియా లోని దుర్గ్ లో 1941 లో జన్మించారు. ఆయన ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీనుంచి ఇంగ్లీష్ లో ఏం.ఏ. పూర్తి చేశాడు. అనంతరం ఐ.ఏ.ఎస్.కు ఎంపికయి మధ్యప్రదేశ్ కాదర్ లో చేరిపోయాడు. అక్కడే అర్జున్ సింగ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా పని చేశాడు. ఆ సమయంలోని మధ్యప్రదేశ్ లోని 11 సాంస్కృతిక సంస్థల ఏర్పాటు చేసి వాటి నిర్వహణ విషయంలో పటిష్టమయిన చర్యలు తీసుకుని వాటికి కార్యవర్గాల్నీ ఏర్పాటు చేసారు. తర్వాత భూపాల్ లో అత్యంత ప్రతిష్టాత్మక మయిన ‘భారత్ భవన్’ ను ఏర్పాటు కేసారు. దాన్ని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఆ తర్వాత కేంద్ర సంస్కృతిక శాఖ కార్యదర్శిగానూ, మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హింది విశ్వవిదాలయానికి వైస్ చాన్సెల్లర్ గానూ, ఇందిరా గాంధీ ఏషనల్ సెంటర్ ఫోర్ ఆర్ట్స్ ట్రస్టీ గానూ, ఇండియన్ కౌన్సిల్ ఫోర్ కల్చరల్ రిలేషన్స్ సభ్యుడిగానూ పనిచేశారు.  లలితకళా అకాడెమీ ప్రోటెం చైర్మన్గానూ, ఛైర్మన్ కూడా పని చేశారు.

ఆయన రచనల్లో ప్రధానమయినవి: కహీన్ కోయి దర్వాజా, దుఖ్ చిట్టీరస హై, కుచ్ రఫీ కుచ్ తీగారే, ఉమ్మీద్ కా దూస్రా నామ్, సమయ్ కె పాస్ సమయ్, అభి కూచ్ అవుర్, కహీన్ నాహీన్ వహీ, వివక్ష, అన్యత్ర, కభీ ఖబర్, బహురి ఆకెల, అబ్ యహాన్ నాహీ ముఖ్యమయినవి.

“భారత్ భవన్” 

1982 లో ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రారంభించబడ్డ భారత్ భవన్ బహుకళల  సాంస్కృతిక కేంద్రం. భారత్ భవన్ ముఖ్యంగా లిఖిత,దృశ్య, ప్రదర్శన సమన్వయ్మ్ కోసం వాటి ప్రదర్శన అభివృధ్ధి కోసం  ఏర్పాటయింది. వర్తమాన సామాజిక నేపధ్యంలో ఆయా కళా రంగాల్లో సరికొత్త వ్యక్తీకరణ, భావం, ఆవిశక్రనాలకు వేదికను కల్పిస్తుంది. భారత్ భవన్ లో వర్తమాన కళా రంగాల్లో లలిత కళలు, సాహిత్యం డాన్స్, డ్రామా,సినిమాలకు ఆధునిక వసతులతో కూడిన వేదికగా రూపొందించారు. ఇందులో ప్రధానంగా వివిధ విభాగాలుగా సేవల్ని అందిస్తున్నది.

రూపంకర్: వర్తమాన జానపద, ట్రైబల్ కళలకోసం ఏర్పాటయిన ప్రదర్శన శాల. ఇందులో ముఖ్యంగా ప్రింట్ మేకింగ్, సిరామిక్స్ కోసం రెండు వర్క్ శాప్స్ వున్నాయి. 6000 ట్రైబల్ వస్తువులు, 2500 నగర కళాకృతులూ వున్నాయి.

‘రంగమండల్’-  ఇందులో అంతరంగ్ పేర ఇండోర్ థియేటర్ వుంది. దాంతో పాటు బహిరంగ్ పేర ఓపెన్ థియేటర్ వున్నాయి. వాటి తో పాటు నాటక రంగానికి చెందిన పుస్తకాలతో కూడిన గ్రంధాలయం కూడా నెలకొల్పారు.

వాగర్త్: ఇదిభారతీయ కవిత్వ వేదిక. ఆధునిక ప్రచేన కవిత్వ సంకలనాల సేకరణ ప్రదర్శన  వగర్తలో చేస్తారు. ఇందులో 13000 కు పైగా పుస్తకాలున్నాయి.

ఆన్హద్: ఇది శాష్ట్రీయ జానపద, త్రిబల్ సంగీతాల కేంద్రం.

నిర్మలా సృజన్ పీఠ్: ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రముఖ కవుల పీఠాలు.

ఆశ్రమ్: ఇందులో జాతీయ స్థాయిలో పేరొందిన రచయితలు కవులకు నివాసాలు ఏర్పాటు చేశారు.

చావి: ఇది ఇటీవలే ఏర్పాటు చేసిన క్లాసికల్ సినిమా వేదిక.

ఇంకా అశో వాజ్ పేయి ఆలోచనల మేరకు రూపొందిన ఈ భారత్ భవన్ ‘పూర్వాగ్రహ్’ పేర హిందీలో త్రీమాసిక పత్రికను వెలువరిస్తుంది.ఇంకా అంతరంగే, బహిరంగే పేర ఆఉడిటోరియమ్స్ కూడా వున్నాయి. అనేక ఏళ్లుగా జాతీయ అంతర్జాతీయ సాహిత్య ఉత్సవాల్ని భారత్ భవన్ నిర్వహిస్తోంది. 

ఇట్లా అన్ని కళలకూ వేడియకా వున్న భారథ్భావన్ రూపకర్త స్ర్వే అశోక్ వాజ్ పేయి.

ఆయన కవితల్లోంచి నేను చేసిన కూని అనువాదాలు—

“పదం”

++++

ఈ ప్రపంచం

ఓ క్షణకాలం సాంధ్రీకృతమయి

రెండు బియ్యపు గింజలుగా మారి

ఓ అజ్ఞాత భగవంతుని ఆరాధనలో

నైవేధ్యం అవనీ

ఈ ప్రపంచం

స్వల్ప కాలం కోసం

కాల్చిన రొట్టెలా మారి

ఆకలితో అలమటిస్తున్న

గుర్తు లేని ఓ అమ్మాయి కడుపు నింపనీ

కొన్నాళ్లు

ఈ ప్రపంచం

మిగతా అన్నీ మరిచిపోయి

ఓ ప్రాచీన పడమ్లా మారిపోనీ

ఓ యువకవి

తన మొదటి కవితలో

ఆ పదాన్ని లిఖించనీ

 “మరణం”

+++

అప్రయత్నంగానో అదృశ్యంగానో

ఓ పక్షిలాగా

మరణ సందేశం రానే వస్తుంది

మనకు అసలే తెలీకుండా

మన పూర్వీకులు మన ఇళ్ల చుట్టూ

కనిపించని పక్షుల్లాగా

కొట్టు మిట్టాడుతూనే వుంటారు

తర్వాత ఏదో ఒక రోజు

ఉదయపు సూర్యరశ్మి లాగా

శరీరాన్ని వెచ్చబరుస్తూ అది రానే వస్తుంది

చిన్న పిల్లాడిని

ఉదయపు నడకకు

చేతి వేలు పట్టుకు తీసుకెళ్లినట్టు

తనతో తీసుకెళ్లిపోతుంది

+++

“వసంత గీతం”

గడ్డి వస్త్రాల్ని కట్టుకుని

స్వర్గం మొత్తం తన కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా

అతను ఈ దారంటే వెళ్ళాడు

తన ఖాళీ చేతుల్లో పూలు ధరించి

మొత్తం భూమి తన మనస్సులో

ప్రతిఫలిస్తుండగా

అతను ఈ దారెంటనే తిరిగి వచ్చాడు

++

ఒంటరిగా కాదు

++++++++

లేదు

ప్రేమలో కేవలం ఆత్మనే కాలిపోదు  

ఆ ఆజ్యంలో శరీరం కూడా మండిపోతుంది

అంతిమ సంస్కారాల్లో

కేవలం దేహమే తగలబడిపోదు

ఆత్మకూడా కాలి బూడిదవుతుంది

కేవలం ఓ శరీరాన్నో ఆత్మనొ

దహించే జ్వాల

ప్రేమలోనూ మరణం లోనూ లేదు

భారత్ భవన్’ రూపకర్త ప్రసిద్ద కవి అశోక్ వాజ్ పేయి

Posted on

తెల్లారింది

++++++++++++ వారాల ఆనంద్

అప్పటికింకా

కిటికీ తలుపులు తెరవలేదు

గది దర్వాజా మూసేవుంది

వెంటిలేటర్ లోంచి తొంగిచూసి

లోపలికి దూసుకొచ్చిన ఉదయపు కిరణాలు

అందమయిన పక్షుల్లా

నా రాత బల్లపై వాలాయి

బల్లమీదున్న

జయంత్ మహాపాత్ర, గుల్జార్

జావేద్ అక్తర్, సచ్చిదానందన్, రూపికౌర్

వీవీ సార్, అట్లా అందరి ముఖాలూ

అందంగా ఆప్యాయంగా వెలిగిపోయాయి

నేను కళ్ళునులుపుకుంటూ లేచి

చేతికందిన ఒకర్ని దగ్గరకు తీసుకుని

ఒక్కో పేజీలోకి చూపునీ

ఆ కవిత్వంలోకి మనసునీ వొంపుకుంటున్నాను

అప్పుడే మేల్కొన్న నా సహచరి ఇందిర

నిద్రమబ్బుతో..

“ఏం.. అప్పుడే తెల్లారిందా ?” అంది

తెల్లారింది 

కాలానికో, నాకో, కవిత్వానికో   

అర్థం కాలేదు

అవుననీ కాదనీ చెప్పలేక

తల అడ్డదిడ్డంగా వూపాను****************** 

Friends, pl read my poem published today in ‘SANCHIKA’ web magazine, Tq Sri Kasthuri Murali Krishna, Sri Soma Sankar
https://sanchika.com/tellaarindi-va-poem/