Month: February 2022

Posted on

27 అందుకున్నాను- “ఒకప్పుడు..”

++++++++++=

రెండు వారాల క్రితం ‘ఒకప్పుడు’ రాజేందర్ జింబో కవిత్వం అందుకున్నాను. కవిత్వం అందుకోవడం…చదువుకోవడం ఎప్పుడయినా ఆనందమే. ఎప్పటికప్పుడు గొప్ప అనుభవమే. ఎంతో చైతన్యం కూడా. మంచి కవితలనీ కొత్త భావనల్నీ చదవడం ప్రపంచ ద్వారాల్ని తెరవడమే. సమాజాన్నీ సమాజంలోని మనుషుల్నీ స్పృశించడమే.

……

మంగారి రాజేందర్ జింబో తెలుగు సాహిత్య ప్రపంచంలో చిరపరిచితుడు. కవిగా కథకుడిగా అనేక రచనలు చేసినవాడు. న్యాయకోవిదుడిగా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అనేక గ్రంధాలు వెలువరించిన న్యాయమూర్తి. ఇట్లా పలు కోణాల్లో గత అయిదు దశాబ్దాలకు పైగా సాహితీ న్యాయరంగాల్లో ఆయన ప్రసిద్ధుడు. ఆయన ఇప్పటికి ‘హాజిర్ హై’, ‘రెండక్షరాలు’, ‘లోపలి వర్షం’, ‘చూస్తుండగానే’ కవితా సంకలనాలు, ‘రూల్ ఆఫ్ లా’, ‘జింబో కథలు’,

‘మా వేములవాడ కథలు’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ కథా సంపుటాలు వెలువరించారు. జమానత్ అండ్ అదర్ స్టోరీస్, ద రైన్ ఇన్సైడ్ లాంటి అనువాదాలు వచ్చాయి. ఇంకా తెలుగులో న్యాయపాలన లాంటి ఇతరాలు కూడా రాసారు.

‘ఏవయినా అట్లాగే ఉండాలనుకోవడం

ఎంత సహజమో

అలా లేవని

బాధ పడటమూ అంతే సహజమేమో…!”

అంటూ ఇప్పుడు రాజేందర్ జింబో తన ‘ఒకప్పుడు…’ కవితా సంకలనంతో మన ముందుకు వచ్చారు.

‘ఒకప్పుడు’ చదవగానే… సరళంగా సూటిగా వుండి ఎప్పటెప్పటి అనుభవాలో ఎక్కడెక్కడి మనుషులో మనసులో గిరగిరా తిరిగారు, ఎలాంటి ఆడంబరాలూ లేని ఇంటిమేట్ కవిత్వమనిపించింది.

****

నిజానికి ఏదయినా సూటిగా సరళంగా రాయడం కష్టం. సంక్లిష్టంగా గొట్టుగా రాయడం సులభం.

గొప్ప అనుభవాలూ అనుభూతులూ చిన్న చిన్న మాటల్లో చెప్పడానికి అవన్నీ ఆ కవిలో పూర్తిగా ఇమ్బైబ్ అయివుండాలి.

ఆ కవి వాటిలో తాను పూర్తిగా సింక్ అయి పోవాలి. లేకుంటే సాధ్యం కాదు.

అట్లని పొడి పొడైన, కళాత్మకత లేని ఏ కళారూపమూ నిలబడదు. శాశ్వతత్వాన్ని పొందదు.

ఒక సినిమా కేవలం VERBOSE అయి దృశ్యాత్మకం కానప్పుడు ఎట్లా చూడలేమో, PROSAIC అయిన కవిత్వాన్నీ అంగీకరించలేము. మంచి కవిత కావాలంటే సరళంగా ఉండడమే కాదు దానిలో కవిత్వాంశ వుండాలి. తడి తడిగా హత్తుకోవాలి. అందులో మనిషి కదలాడాలి, సమాజం ధ్వనించాలి. అంతర్లయగా తాత్వికత ప్రవహించాలి.

ఇదంతా కవి తనకి తానూ, తాను నివసిస్తున్న సమాజానికీ నిబద్దుడయినప్పుడే సాధ్యమవుతుంది. కవి కేవలం కవిత్వాన్నే చదివితే సరిపోదు. పలు కళాసాంస్కృతిక రంగాల్ని అవగాహన చేసుకున్నప్పుడు ఆయన దృష్టి విప్పారుతుంది. సృజనా విస్తారమవుతుంది. పరిమితులూ పరిధులూ దాటి చదువరుల్ని చేరుతుంది అని నేననుకుంటాను.

…..

ఇక మంగారి రాజేందర్ జింబో ‘ఒకప్పుడు’ కవిత్వాన్ని చదివినప్పుడు అందులో కవి వ్యక్తిగత అనుభవంలోంచి సామాజిక అనుభవంలోకి ప్రవహించడం చూస్తాం. ఆయన తన కవిత్వాన్ని తనలో తాను మాట్లాడుకున్నట్టే రాస్తాడు కానీ అది పాఠకుడిని పలకరిస్తుంది.. ఎక్కువగా తన ఫీలింగ్ చెబుతున్నట్టే వుంటుంది కానీ చదువరిని నేరుగా తడుతుంది. జింబో సాధారణ మయిన అనేక విషయాల్ని కవిత్వంగా చెబుతాడు. అవన్నీ తమకూ అనిపించాయనీ పాఠకుడికి అనిపిస్తుంది.. సరిగ్గా ఈ కవి అక్కడే విజయవంతమవుతాడు.

….

‘నువ్వంటే

ఒక నువ్వే కాదు

నువ్వంటే

నీ మనస్సు మాత్రమే కాదు….

నువ్వంటే మొత్తంగా

నువ్వు…’ అంటాడు జింబో

అవును కవంటే కేవలం కవే కాదు ఆ కవితో పాటు పాఠకుడూ కూడా ఉంటాడు.

అందుకే

‘పదాల మధ్య

పదాలతో జీవించాలి

పదాలను గుర్తించాలి…

పదం లేని నాడు

కవిత్వం వుండదు

కవీ వుండడు’ అని జింబో తన కవితలో నిర్ధారిస్తాడు.

అంతేకాదు మరో కవితలో

‘రాస్తేనే కదా

మనం కూడా బతికేది..’ అనీ అంటాడు.

అట్లా కవిత్వం కవి జీవితంలో ఎంత ముఖ్యమయిందో, మొత్తంగా మనిషి జీవితంలో ఎంత ప్రభావవంతంయిందో చెప్పకనే చెబుతాడు జింబో.

ఇంకా ఆయన ‘ఓ సాయంత్రం’ లో

‘రోజు దాన్ని వదిలేస్తుంది

రాత్రి దాన్ని డిసోన్ చేస్తుంది

కానీ

నేను ఓ సాయంత్రాన్ని

నా చేతులోకి తీసుకుంటాను’ అని గొప్ప అనుభూతితో అంటాడు.

ఇక “గాయం” లో

గాయాలు చేస్తూ

అమ్మ బాపు వెళ్ళిపోయారు… అంటూ

కాలం గాయాల్ని మాన్పుతుందేమో

జ్ఞాపకాలని కాదు కదా అంటాడు.

ఇక వర్తమాన వస్తు ప్రపంచాన్ని గురించి స్పందిస్తూ

‘మా ఇంట్లో మనుషులకన్నా

వస్తువులే ఎక్కువ అంటాడు..

ఇప్పుడు మనిషంటే ఆన్లైన్ … అంటూ మారిపోతున్న మనిషి లక్షణాన్ని గురించి ఆవేదన చెందుతాడు.

ఇక చత్రీ మీద మంచి కవిత రాసాడు జింబో

‘ఛత్రీ నాకు ఇష్టం వుండదు అంటూ..

వర్షంలో పిల్లలు గంతులేస్తే

నేను పక్షినై పోతాను

పాటనై పోతాను

పడవనై పోతాను అని కూడా అంటాడు. ఇక్కడ నాకు “ఓ కాగజ్ కి కస్జ్తీ బారిష్ కా పానీ..” గజల్ గుర్తొచ్చింది.

ఇట్లా ఇంటిమేట్ కవితలనే కాదు

“ఈ దేశంలో

ఓ కవి ఊచలు లెక్క పెడుతూ ఉంటాడు

మరో కవి ‘పద్మ’ కోసం నిరీక్షిస్తూ ఉంటాడు

ఇంకో కవి

జ్ఞానం వెంబడో, అజ్ఞానం వెంబడో పరిగెడుతూ ఉంటాడు..’ అని కూడా అంటాడు జింబో తన ‘ఒకప్పుడు’ లో.

ఇట్లా ఇంటిమేట్ వాక్యాలతో ఇంటెన్సి ఫైడ్ కవిత్వాన్ని అందించాడు జింబో. ఆయనకు మనసారా అభినందనలు.

-వారాల ఆనంద్

Posted on

చిరకాల నేస్తం… చిరంజీవి
-వారాల ఆనంద్

ఇవ్వాల్టి డిజిటల్ యుగంలోకూడా ‘రేడియో ఒక విశ్వాసం. ‘ఒక సాంస్కృతిక వారసత్వం’. ‘ఒక భాషా సాధికారికత’. ఎప్పుయినా ఎక్కడయినా విద్యుత్తు వసతి వున్నా లేకున్నా, ఇంటర్నెట్ కనెక్టివిటీ వున్నా లేకున్నా వినగలిగే ప్రసార సాధనం రేడియో.
అందుకే యునెస్కో 2022 సంవత్సర ప్రపంచ రేడియో దినోత్సవానికి “RADIO AND TRUST” అన్న నినాదాన్ని ప్రకటించింది. ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పెరిగిన డిజిటల్ మాధ్యమాల యుగంలో విశ్వసనీయ సమాచారం అన్న మాట సంక్షోభంలో పడింది. నెట్లో వచ్చే ఏ వార్త నిజమో ఏది కాదో తెలుసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పటికీ విశ్వసనీయ మయిన సాధనంగా రేడియోనే నిలబడుతున్నది.
ఈ నేపధ్యంలో మన తెలుగువారికీ దశాబ్దాలుగా రేడియో గొప్ప ప్రసార సాధనంగా మిగిలింది. హైదరాబాద్లో 1933లో మొదట రేడియో ప్రసారాలు మొదలయ్యాయి నిజాం 1935 లో దాన్ని స్వాధీనంచేసుకుని దక్కన్ రేడియో పేర ఉర్దూలో ప్రసారాలు మొదలుపెట్టారు. 1950లో కేంద్రం దాన్ని స్వాధీనం చేసుకుంది. 1938లో మద్రాసులో, 1948లో విజయవాలోనూ రేడియోప్రారంభమయింది. తెలుగులో అనేక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్ , భాయి యో ఔర్ బెహనో మై అమీన్ సయాని బోల్ రహా హూ, ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సురమౌళి, రేడియో సిలోన్ నుంచి మీనాక్షీ పొన్నుదురై ఇంకా రేడియో అక్కయ్య, అన్నయ్య, చిన్నక్క, రాంబాబు…. ఇట్లా ఎన్నో మాటలు గొంతులు ఈ తరానికి పరిచయం లేకపోవచ్చు కానీ ఒకనాడు ఇంటింటా ఊరూరా మారుమోగిపోయాయి. అంతేకాదు నవలా స్రవంతి లో ‘చివరకు మిగిలేది’, ‘కాలాతీత వ్యక్తులు’ వింటున్నప్పుడు కలిగిన ఆనందం ఆ తరానికి ఇంకా ఫ్రెష్ గానే వున్నాయి. ఈరోజుల్లో కూడా అర్థవంతమయిన ఆరోగ్యవంతమయిన భాషా వినియోగానికీ, భావాల ప్రసారానికి రేడియోప్రాతినిధ్యం వహిస్తున్నది. అంతేకాదు వినియోగంలో రేడియో చాలా సౌకర్యవంతమయింది. ట్రాన్సిస్టర్ వచ్చింతర్వాత మన తోపాటు రేడియో కదిలే సమాచార సాధనంగా మారింది. ఇక ఒక పక్క రేడియో మొగుతూ వుండగానే మన పని చేసుకుంటూ వుండొచ్చు. టీవీలు కంప్యుటర్ ల ముందు లాగా స్థిరంగా వుండిపోవాల్సిన అవసరం లేదు.
1981 ఆగస్ట్ లో మొదలయిన ఎం.టి.వి ప్రారంభ కార్యక్రమంలో ‘వీడియో కిల్డ్ రేడియో స్టార్’ అని పాట పాడారు. కాని నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా రేడియో ఇంకా సజీవంగానే వుంది. తన సేవల్ని కొనసాగిస్తూనే వుంది. పాలకుల నిర్లక్ష్యమూ, వ్యాపార దృక్పధాలతో రేడియో కొంత వెనుక బడ్డట్టుగానూ, టీవి ఇంటర్నెట్ల ఆధిపత్యం కొన సాగుతున్నట్టు కనిపించినప్పటికీ, మన దేశంలో నేటికీ కేవలం ఆకాశవాణి 23భాషల్లో, 179 మాండలికాల్లో తన ప్రసారాల్ని కొనసాగిస్తూవుంది. అంతేకాదు భౌగోళికంగా దేశంలో 92శాతం ప్రాంతాలకూ, 99 శాతం ప్రజలకు తమ ప్రసారాల్ని వినిపిస్తున్నది. రేడియో ప్రాధాన్యతని దాని ప్రసార విస్తృతిని గమనించే భారత ప్రధాని నరేంద్ర మోడి ‘ మన్ కీ బాత్’ పేరున ప్రజలతో తన భావాల్ని పంచుకునేందుకు రేడియోను వాహకంగా ఉపయోగించుకుంటున్నాడు. అంటే దానర్థం నేటికీ రేడియో సజీవమయిందనే కాదా. అంతే కాదు దేశంలో వివిధ చోట్ల జరిగిన ప్రమాదాలు, ఊహించని ఉపద్రవాలూ వచ్చినప్పుడు రేడియో అందించే సేవలు అనితర సాధ్యమయినవి. 2004 నాటి సునామీ, 2013లో వచ్చిన ఉత్థరాఖండ్ జలప్రళయ సంధర్భంలోనూ రేడియో అందించిన ఆపత్కాల సేవలూ, సమాచారం అద్భుతమయినవి. ఇప్పటికీ బుందేల్ఖండ్, ఘర్ వాలీ, అవధ్, సంథాలి లాంటి భాషల్లో 180కి పైగా కమ్యునిటీ రేడియోలు వున్నాయంటే రేడియో రీచ్ ని అర్థం చేసుకోవచ్చు.
ఇంతటి ప్రభావ వంతమయిన రేడియో ప్రసారాల్ని మొదట మోర్స్ 1844 కనిపెట్టిన టెలిగ్రాఫ్ సుసాధ్యం చేసింది. టెలిగ్రాఫ్, టెలిఫోన్ విస్తృతంగా ప్రాచుర్యంలోకి రాకముందే వాక్క్యుమ్ ట్యూబ్ ద్వారా ధ్వని తరంగాల్ని పంపించే ప్రక్రియ రావడంతో రేడియో ప్రసారాలు సాధ్యమయ్యాయి. అమెరికాలో 1910-12 ప్రాంతంలోనే రేడియో వాడకం గురించి మార్గదర్శకాలు రూపొందాయి. 1922 నాటికి ఇంగ్లండ్ లో రేడియో ప్రసారాలు స్థిరీకరించబడి బీబీసి ఏర్పడింది. ఇక మన దేశంలోతొలిసారిగా రేడియో క్లబ్ ఆఫ్ బాంబే 1926లో రేడియో ప్రసారాలు ప్రారంభించింది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపనీ బొంబే, కలకత్తా నగరాల్లో రేడియో కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకొని 1927లో రేడియో కేంద్రాన్నిఅప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా ప్రారంభించింది. తర్వాత 1930లో ఆ సంస్థ ఇండియన్ స్టేట్ బ్రోడ్ కాస్టింగ్ సంస్థ గా మారింది. తర్వాత 1936లో ఆల్ ఇండియా రేడియో గానూ, 1956 నుండి అది ‘ఆకాశ వాణి’ గా మారింది. ప్రభుత్వసేవా కార్యక్రమంగావున్న ఆకాశవాణి ప్రసారాలు 1967నుంచి వాణిజ్య ప్రకటణలకు అవకాశం ఇచ్చింది. అట్లా అనేక మార్పులకు చేర్పులకులోనై దేశవ్యాప్తంగా విస్తరించిన ఆకాశవాణి ని 1997 లో దూరదర్శన్ తో కలిపేసి సమాచార ప్రసారాల శాఖ నుంచి విడగొట్టారు. కొత్తగా ‘ప్రసారభారతి’ చట్టాన్ని తెచ్చి నూతన వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వతంత్ర ప్రతి పత్తిగల సంస్థగా రూపొందించాలనే లక్ష్యం వున్నప్పటికీ ప్రసారభారతిని కేంద్రప్రభుత్వ అప్రకటిత నియంత్రణలోనే వుంచారు. బోర్డ్ పేర అధికార పార్టీలు తమ వాళ్ళని నియమింప జేస్తూ ప్రసారభారతి ని తమ కనుసన్నల్లోనే వుంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ప్రసారభారతి అస్వతంత్రతను ఎదుర్కోవడంతో పాటు ఇతర మాధ్యమాలయిన టీవి ఇంటర్నెట్ తో కూడా తీవ్రమయిన పోటీని ఎదుర్కొంటున్నది. కానీ రేడియో మాత్రమే ఎలాంటి కేబుల్ చార్జీలూ, నెట్ ఛార్జీలు లేకుండా వినియోగ దారులకు అందుతున్న మాధ్యమం. విలువలనూ స్థాయినీ కలిగిన విశ్వసనీయమయిన ప్రసార మాధ్యమంగా జనం మదిలో కొనసాగుతున్నది.
-వారాల ఆనంద్
9440501281 

లాభాల పేరిట దోచుకుంటారా

Posted on

+++++++++++++++++++++++++ వారాల ఆనంద్

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సినిమా హాల్లలో టికెట్ రెట్ల వివాదం నడుస్తున్నది. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మిస్తున్న తమకు కేవలం టాకీసుల్లో సాధారణ ప్రేక్షకులు చెల్లించే టికెట్ డబ్బులే ఆదాయం అన్నట్టు సినిమా రంగమంతా వాపోతున్నది. టాకీసుల్లో తెగే టికెట్లే తమ ప్రధాన ఆదాయ వనరు కాబట్టి ప్రభుత్వాలు తఆదుకోవాలని కోరుతున్నాయి. కానీ ఇటీవల ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లను క్రమబద్దీకరించి నియంత్రించే పనికి పూనుకుంది. సామాన్య ప్రేక్షకుడికి సినిమా వినోదం అందుబాటులోకి తేవాలన్నది తమ లక్ష్యంగా ప్రకటించింది. చిత్రంగా తెలంగాణ రాష్ట్రం సినిమా వాళ్ళకు అనుకూలంగా రేట్లను సవరించి వారి నుంచి ప్రేమాప్యాయతల్ని పొందింది. ఆంద్రరాష్ట్రం లాగా టికెట్ రేట్లను తగ్గిస్తే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న తమకు తీవ్ర నష్టాలు వస్తాయని నిర్మాతలు వాదిస్తున్నారు. పెట్టుబడికి తగ్గ లాభాల్ని ఆశించడంలో తప్పేముంది, ఈ నష్టాల్ని తట్టుకోవడం కష్టం అంటున్నారు నిర్మాతలు వాస్తవానికి సామాన్యుడి వినోదాన్ని శుద్ధ వ్యాపారం చేసిన సినిమా రంగం కేవలం లాభ నష్టాల్ని మాత్రమె లెక్కలోకి తీసుకుంటుంది అనుకున్నా టికెట్ రేట్ల పై వారి వాదన సరైనదికాదు. నిజానికి ఇవ్వాళ హాలీవుడ్ తో సహా ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు వచ్చే ఆదాయం కేవలం టాకీసుల్లో టికెట్ల అమ్మకం వల్లనే వస్తున్నదన్నది వాస్తవం కాదు.

‘ఏదయినా ఎప్పుడయినా ఎక్కడయినా’( “ఎనీ థింగ్ ఎనీ టైం ఎనీ వేర్” ) అన్నది ఇవ్వాల ప్రధానంగా వినిపిస్తున్న నినాదం. అట్లా విస్తరిస్తున్నదే వీడియో ఆన్ డిమాండ్. తద్వారా రూపొందినవే ఒటీటీ ప్లాట్ ఫార్మ్స్. కొన్ని అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఒటీటీ మార్కెట్ లో మన దేశం చాలా వేగంగా విస్తరిస్తున్నది. 2022 ముగిసేనాటికి భారత్ మొదటి 10 స్థానాల్లో ఒకటిగా ఎదిగే అవకాశంవుంది. మరో అంచనా ప్రకారం 2017-2022 ల మధ్య ప్రపంచ వీడియో మార్కెట్ రంగంలో మన దేశం 22.6 శాతం వృద్ధితో అగ్రగామిగా వుంది. అంతేకాదు 2022 ముగిసేనాటికి మన మార్కెట్ 54వేల మిలియన్ రూపాయాల మేర వృద్ది సాధించే అవకాశం వుంది. ఇక ఊహించని కోవిడ్ ప్రభావం మొత్తం సినిమా టాకీసుల ప్రదర్శనా రంగాన్ని కుదేలు చేసినప్పటికీ ఈ వీడియో ఆన్ డిమాండ్ తీసుకున్న కొత్త ఓటీటీ రూపం సరికొత్త దారుల్ని సృష్టించిందనే చెప్పాలి. దాంతో తెలుగు రాష్ట్రాలతో సహా అనేక ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ రంగం మీదికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్త ప్రైం వీడియో, నెట్ ఫ్లిక్ష్ తో సహా అనేక ప్రాంతీయ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే కోవిడ్ మూడవ దశ కొనసాగుతున్న తరుణంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ భవిష్యత్తు ప్రధానంగా అయిదు అంశాల మీద ఆధార పడివుంటుంది. ఒకటి ఇంటర్నెట్ నిరంతరాయంగా అందుబాటులో వుండడం, రెండవది మొబైల్ ఫోన్లు ప్రధాన వినియోగ వస్తువై వుండడం, మూడవది ప్రజలు సనాతన సినిమా టాకీసులకు దూరమవ్వడం, నాలుగవది కంటెంట్ నిర్మాతలకంటే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ని జనం విశ్వసించడం, ఇక చివరిది వినియోగాదారులయిన ప్రజలకు అవసరమయిన సినిమాల్ని వీడియోలని, కార్యక్రమాలని రూపొందించడం. ఇట్లా మారుతున్న సాంకేతిక పరిస్థితుల నేపధ్యంలో టికెట్ల వివాదం అర్థరహిత మయింది.

సినిమా వాళ్ళు ఇంతకుముందు రాష్త్రం లోని ఊర్లను,నగరాల్ని ఏ,బీ,సి సెంటర్లుగా విభజించి సినిమాల్ని పంపిణీ చేసి విడుదల చేసేవారు. సినిమాలు మొదట ఏ సెంటర్లు తర్వాత మిగతా సెంటర్లకు వచ్చేవి. తర్వాత కొన్నేళ్ళకు ఆ విధానం పోయి ఒకే సారి అనేక టాకీసుల్లో విడుదల చేసి మొదటి వారం లోనే పెట్టుబడి గిట్టుబాటయ్యే విధానం వచ్చింది. ఆ క్రమంలో టాకీసుల లీజులు వాటి గుత్తాదిపత్యం లాంటివి వచ్చాయి. అదట్లా వుండగా 80 ల తర్వాత టీవీ మాధ్యమం పెరిగి టీవీ చానళ్ళకు అమ్మడం ద్వారా సినిమాలకు వచ్చే ఆదాయం పెరిగి ఒక సమయంలో అదే గణనీయమయిందిగా మారింది. ఎందుకంటే కేవలం మన దేశంలోనే వెయ్యికి పైగా టీవీ చానళ్ళున్నాయి. వివిధ భాషల్లోకి డబ్ చేసి అమ్మేయడం ఇవాళ సర్వ సాధారణం. ఇంకా ఆడియో మార్కెట్ ఉండనే వుంది. వీటికి తోడు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా తక్కువేమీ లేవు. ఇన్ని రకాల వ్యాపార అవకాశాలు వుండగా కేవలం టికెట్ రెట్ల మీద ఇంత రాద్దాంత మెందుకో అర్థంకాదు. సాధారణ సగటు ప్రేక్షకుడికి టికెట్ రెట్లు అందుబాటులో వుంటే వివాదమెందుకు.

ఈ వివాదాంకి సంబంధించి రెండు అంశాలు గమనించాల్సి వుంది. ఒకటి గత వందేళ్ళ కాలంలో మారిన సినిమా థియేటర్లు వాటి పరిణామం. రెండవది పెరిగిన సినిమా నిర్మాణ వ్యయం. దశాబ్దాల వెనక్కు వెళ్లి సినిమా థియేటర్ల పరిస్థితి గమనిస్తే వాటిల్లో ప్రేక్షకులకు హాల్లో ఫస్ట్, సెకండ్,థర్డ్ క్లాస్ అంటూ మూడు తరగతులు ఉండేవి. వాటిల్లో ఫాస్ట్ క్లాసుగా కుర్చీలు రెండో మూడో వరుసలుండి, రెండవ క్లాసుగా బెంచీలు మరిన్ని వుండగా నేల టికెట్లకు చాలా ఎక్కువ స్థానం వుండేది. అప్పుడు సినిమాలకు నేల టికెట్ ప్రేక్షకులే ప్రధాన వనరు. అందులో గోల గోలగా వుండేది. గోలీ సోడా, జింజర్ సోడా కలర్ సోడా అంటూ అమ్మేవాళ్ళు, పాన్ బీడీ, పల్లీ బటానీలు అమ్మేవాల్లతో హాలు హాలంత చైతన్యవంతంగా వుండేది. ఈలలు చప్పట్లు చెప్పనే అవసరం లేదు. కానీ ఇవ్వాళ ఏమి జరిగింది. హాలు లో 90 శాతం ఫస్ట్ క్లాస్ తో నింపేశారు. బెంచీ నేల టికెట్లకు కేటాయించే స్థలం అతి స్వల్పం. ఇక హాల్లల్లో అమ్మే తినుబండారాలు, డ్రింకులు బయటికంటే అనేక రెట్లు ఎక్కువ చేసి అమ్ముతున్నారు. వాటి మీద అడ్డూ ఆపూ లేదు. పాత టాకీసుల తీరు మారి మల్టీ ప్లెక్ష్ ల పేర సినిమాల్ని కేవలం వినోద వేదిక నుంచి వ్యాపార వేదికగా మార్చేసారు. సాధారణ కింది తరగతి ప్రేక్షకుడికి దాన్ని చాలా దూరం చేసారు. వీటికి తోడు వాణిజ్య ప్రకటనలు కూడా ఉండనే వున్నాయి.

ఇక సినిమాల నిర్మాణ వ్యయం గురించి అందరూ ఆలోచించాల్సి వుంది. దాని మీద ఎవరి నియంత్రణా లేదు. డిజిటల్ అనుభవం అంటే దృశ్య నాణ్యత ల కోసం ఎంతయినా ఆధునిక సాంకేతికతను ఉపయోగించ వచ్చు. దానికోసం వెచ్చించే సొమ్ము ఆమోదయోగ్యమయిందే, కాదనం. కానీ కేవలం స్టార్లకు వెచ్చించే కోట్లాది రూపాయల డబ్బే సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి ప్రధాన కారణ మన్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని ఎట్లా నియంత్రించాలో ఎవరూ ఆలోచించరు.

మచి కథా కథనం వున్న సినిమాలు స్టార్లు లేకున్నా ప్రేక్షకాదరణ పొందుతాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి అయినా స్టార్ సినిమాల ధోరణి మారలేదు ఇక మారదు. తాము తమ నిర్మాణ వ్యయాన్ని నియంత్రించ లేని తెలుగు సినిమారంగం సాదారణ ప్రేక్షకుడి జేబులకు చిల్లులు కొట్టె టికెట్ రేట్లను నియంతిస్తే గగ్గోలు పెట్టడం న్యాయం కాదు. తెలుగు సినిమా రంగం మొదట తమ ఇంటిని, ఇంటి బడ్జెట్ ని నియంత్రించుకుంటే మంచిది.

దాంతో పాటు ఆధునిక ఆదాయ వనరుల పై ద్రుష్టి పెట్టాలి తప్ప టాకీసుల్లో టికెట్ రెట్ల పై గగ్గోలు పెట్టడం సాధారణ ప్రేక్షకుడిని దోచుకోవడమే అవుతుంది.

-వారాల ఆనంద్

9440501281

May be an image of 1 person and text

‘నరెడ్ల శ్రీనివాస్’

Posted on

            “నివాళి”    

సామాజిక ఉద్యమ స్వరం మూగ బోయి ఏడాది

============================

ఈ లోకం చాలా అందమయినది చిత్రమయింది,

ఒకింత క్రూరమయినది కూడా,

ఎవరో వస్తారు, మట్టి కాళ్ల తో  నడుస్తారు,

‘మట్టి’ కళ్ళ లోంచి రాలే కన్నీటిని తుడుస్తారు,

చేయి చేయి కలిపి భుజం తట్టి ఆసరాగా నిలుస్తారు,

రెండు నవ్వుల్నీ, నాలుగు మాటల్నీ మిగిల్చి మౌన మునిలా వెళ్ళిపోతారు

గూట్లోంచి పక్షి చెప్పా పెట్టకుండా ఎగిరిపోయినట్టు అట్లా ఎగిరిపోతారు.సరిగ్గా అట్లాగే  గతేడాది ఇదే రోజు  ఉత్తర తెలంగాణా జిల్లాల్లో నాలుగు దశాబ్దాలుగా వినిపించిన సామాజికోద్యమ స్వరం మూగ వోయింది. ఆ గొంతుని కరోనా రక్కసి నిర్దాక్షిణ్యంగా తన నోట కరుసుకొని ఎత్తుకేల్లిపోయింది.  కరీంనగర్ కేంద్రంగాసాహిత్య సాంస్కృతిక సామాజిక ఉద్యమాలతో మమేకం అయిన నరేడ్ల శ్రీనివాస్ ఒక ఉద్యమ కేంద్రం. జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య ‘సాహితీ గౌతమి’ఏర్పాటులోనూ సి.నారాయణ రెడ్డి పేర రాష్ట్ర స్థాయి అవార్డు ఏర్పాటులో ఆయనది ప్రధాన భూమిక. అల్లం రాజ్య, అల్లం నారాయణ, సాహు, తాడిగిరి పోత రాజు, బి.ఎస్.రాములు, అంపశయ్య నవీన్, లయ కవులు అలిశెట్టి, వారాల ఆనంద్, జింబో, వజ్జల శివ కుమా, పి.ఎస్.రవీంద్రలతో అత్యంత సన్నిహితంగా వున్నా వాడు. తోలి ర్జుల్లో తానూ ఉద్వేగ పూర్వక కవితల్ని రాసినవాడే శ్రీనివాస్. తర్వాత చట్ట పరిధిలో ప్రజలకు ఉపయోగకర కార్యక్రమాలుగా పలు కార్యక్రమాలు చేపట్టాడు.  దశాబ్దాలుగా అవినీతిపరుల గుండెల్లో గుబులు పుట్టించి పౌరహక్కుల చట్టం, వినియిగాదారుల చట్టం సమాచార హక్కుల చట్టం ఇట్లా ఒకటేమిటి గడ్డి పోచలా ఏ చట్టం ఆసరా దొరికినా దాన్ని ఆయుధం చేసుకుని ఈ వ్యవస్థ పై అక్రమార్కుల పై  ప్రశ్నల్ని సందించి నిలదీసి ఉద్యమాల్ని నిర్మించిన శ్రీ నరెడ్ల శ్రీనివాస్ పెద్ద శూన్యాన్నీ మిగిల్చి వెళ్ళిపోయాడు. 

వ్యక్తిగతంగా భయమంటే ఎరుగని గుణంతో, గొప్ప నాయకత్వ లక్షణంతో శ్రీ నరెడ్ల శ్రీనివాస్  కరీంనగర్ కేంద్రంగా అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. నిరంతరం ప్రజా సమస్యల పట్ల దీక్షతో కృషి చేసాడు. 68 క్రితం హుజురాబాద్ లో పేద కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్ తన విద్యార్థి జీవితంలోనే ప్రగతిశీల భావాలతో ప్రేరితుడయి శ్రీ శ్రీ కవిత్వాన్ని అభిమానించాడు. విద్యార్థిగా వునప్పుడే నల్లా ఆదిరెడ్డి లాంటి విప్లవ యోధుల సహచర్యం  ఆయనకు సమాజం గురించి ఆలోచించడం నేర్పింది. 1972–73  ప్రాంతంలోనే మిత్రులతో కలిసి హుజురాబాద్ లో సాహితీ సంస్థను ఆరంభించిన వాడు నరేడ్ల శ్రీనివాస్. దాని ద్వారానే  శ్రీ శ్రీ ని హుజురాబాద్ కు రప్పించి ఊరేగించి సభల్ని నిర్వహించిన వాళ్ళల్లో ముఖ్యుడు నరెడ్ల శ్రీనివాస్. తర్వాత కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా లో పీజీ చదివిన తర్వాత సివిల్స్ పరీక్షల వైపు దృష్టి పెట్టినా యూనియన్ బాంక్ లో చేరిపోయాడు. సాహిత్యమే ఊపిరిగా ఎదిగాడు. శ్రీ శ్రీ అన్నా, వరవరరావన్నా, అలిశెట్టి ప్రభాకర్ అన్నా ఎంతో ఇష్టపడే ఆయన ప్రగతిశీల ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచాడు.  అంపశయ్య నవీన్ ఆధ్వర్యం లో ఏర్పడిన కరీంనగర్ ఫిలిం సొసైటీ బాధ్యతల్ని 1980 లో చేపట్టి  డానికి ఒక ఉద్యమ స్వరూపం తెచ్చాడు. మొట్ట మొదటి సారిగా 16mmప్రొజెక్టర్, తర్వాత పోర్టబుల్ 35mm ప్రొజెక్టర్ లను సమకూర్చుకుని సమాంతర అర్థవంతమయిన సినిమాల వేదికగా ఆ సంస్థను తీర్చిదిద్దాడు. 198౩లోనే ఫిలిం అప్రిసియేషన్ కోర్సులు నిర్వహించి సత్యజిత్ రే సమకాలికుడు అయిన నిమాయి ఘోష్,రమణన్,శ్రీనివాసన్ లను పిలిచి  జిల్లా వ్యాప్తంగా మంచి సినిమాకు ఒక వాతావరణాన్ని కల్పించడం లో తన వంతు బాధ్యతను పోషించాడు. ఇక కరీంనగర్ లో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా వెలువరించిన ‘అక్షర ఉజ్వల’ పత్రికకు సంపాదక మండలి సభ్యుడిగా శ్రీనిన్వాస్ పనిచేసాడు. ఇంకా కొంత కాలం ఉదయం పత్రికకు సామాజిక అంశాలపై అనేక వ్యాసాలూ రాసాడు. 

   అప్పుడే కరీంనగర్ కేంద్రంగా విజయకుమార్ సంపాదకత్వంలో వెలువడ్డ ‘జీవగడ్డ’ దిన పత్రికలో అల్లం నారాయణ, కే.ఎన్.చారి, ఘంటా చక్రపాణి లు పని చేసినప్పుడు రోజువారీ కాలమ్స్ లో భాగంగా నరెడ్ల శ్రీనివాస్ వారం వారం ‘పెన్నుపోటు’ పేర కాలం నిర్వహించాడు. మొదటి నుంచీ బాలగోపాల్ హర గోపాల్ లతో సన్నిహితంగా వున్నా శ్రీనివాస్ ఆ తర్వాత బ్యాంకులో వచ్చిన పదోన్నతిలో భాగంగా గుజారాత్ వెళ్ళిన నరెడ్ల శ్రీనివాస్ అక్కడ అప్పుడు ఉధృతంగా వున్న వినియోగ దారుల ఉద్యమ ప్రేరణతో కరీంనగర్లో మొట్టమొదట కరీంనగర్ వినియోగ దారుల మండలి స్థాపించి వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఫోరం కోర్టుల్లో వేలాది కేసులు వేస్తూ మోసపోయిన వినియోగాదారులకు కోట్లాది రూపాయల నష్ట పరిహారాలు ఇప్పించాడు. సినిమా కళలు వీటన్నింటి కంటే ఆపన్నుల కన్నీళ్లు తుడవడమే తన కర్తవ్యంగా భావించి పూర్తి స్థాయిలో వియోగ దారుల ఉద్యమ కార్యకర్తగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో స్టేట్ కమీషన్ నేషనల్ కమీషన్ దాకా కేసులు వేస్తూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో అనేక వోత్తిడులు బెదిరింపు లను లెఖ్ఖ చేయలేదాయన. వినియోగ దారుల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుదిగానూ, కార్యదర్శిగానూ పని చేసాడు. తను తన ఉద్యోగ జీవితంలో సంపూర్ణంగా నిజాయితీగా నిబద్దతతో ఉంటూ నిలబడ్డాడు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సమాచార హక్కు చట్టం ను మరొక ఆయుధంగా చేసుకుని సామాన్యులకు అండగా నిలిచాడు నరెడ్ల శ్రీనివాస్.  సమాచార హక్కు ఉద్యమ కారులు అరుణా రాయ్, అన్నా హజారే ల ప్రభావంతో చట్టం కింద వెయ్యికి పైగా దరఖాస్తులు వేసి భూ కబ్జాలు మొదలు గ్రానైట్ రాళ్ళ కుంభకోణాల దాకా వెలికి తీసి ప్రభుత్వానికి వందలాది కోట్ల రూపాయల లబ్దిని చేకూర్చాడు.

సమాచార హక్కు చట్టం కింద ఆయన వెలికి తీసిన అనేక అంశాలు జిల్లలో బడా వ్యాపారుల రాజకీయ నాయకుల మూలాల్ని కదిలించాయి. తర్వాత జయప్రకాష నారాయణ్ స్థాపించిన లోక్ సత్తా ఉద్యమ సంస్థ ద్వారా కూడా అనేక కార్యక్రామాలు చేసాడు నరెడ్ల శ్రీనివాస్. 

అంతే కాదు అలిశెట్టి ప్రభాకర్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి ఆర్ధిక సాయం అందించడంలో, కరీంనగర్ ఫిలిం భవన్ నిర్మాణంలో నిధులు సమకూర్చడం లో నాతో పాటుగా,  మాజీ శాసన మండలి సభ్యుడు శ్రీనారదాసు లక్ష్మణ్ రావు, నరెడ్ల శ్రీనివాస్ తదితరులు ముఖ్య భూమిక పోషించారు.

ఇట్లా దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా కరీంనగర్ కేంద్రంగా ఉంటూ అనేక సాహితీ సామాజిక ఉద్యమాల్లో భాగం పంచుకుంటూ వివాద రహిత నిబద్దత గల జీవితం గడిపిన నరేడ్ల శ్రీనివాస్ వెళ్ళిపోయి మిగిల్చిన ఖాళీ పూడ్చడం ఇప్పట్లో సాధ్యం కాక పోవచ్చు.

ఆయనకు సమస్త సమాజం  పక్షాన నివాళి

-వారాల ఆనంద్

9440501281