Month: June 2019

Posted on

ఇటీవల కరీంనగర్ లో జరిగిన ‘క్రీడా కథ’ ఆవిష్కరణ సభలో మాట్లాడినా నాలుగు మాటలు

Posted on

కల

Mon,June 17, 2019 01:08 AM


ఓ కలేదో
నన్ను తప్పించుకు తిరుగుతున్నది!
కలగనడం నాకిష్టమే
నా హక్కు గూడా
అమ్మ ఒళ్ళో కళ్ళు తెరిచినప్పటి నుండీ
చుట్టూరా అనేక కలలు..!
కొన్ని కలల్ని నేనందుకున్నాను
మరికొన్ని కలలు నన్నందుకున్నాయి
న్యూనతకూ ఆత్మ విశ్వాసానికీ నడుమ
నిద్రకూ మెలకువకూ నడుమ
కలల ఊగిసలాట..!
నాకూ కలలకూ నడుమ
ఈ దోబూచులాట మొదటినుంచీ వున్నదే..
కొన్ని కలలు సొగసైనవి
మరికొన్ని గడుసైనవి
కళ్ళు తెరిస్తే ఏముంది
గడుసైన కలలు అదృశ్యమవుతాయి
గ్లాసేడు నీళ్ళు గట గటా
తాగితే కానీ మనసు నిమ్మళం కాదు!
సొగసైన కలలు 
ఊహల్లో నుంచీ ఆలోచనలోనుంచీ పుడతాయి
తెరిచినా మూసినా 
కళ్ల ముందు కదలాడుతాయి
కంట్లోంచి ఇంట్లోకి.. 
ఇంట్లోంచి వూర్లోకి..
వూర్లోంచి మైదానంలోకి.. అడవిలోకీ.. 
విస్తరిస్తాయి…

అవును
కలగనడం నాకిష్టమే
నా హక్కు గూడా
కానీ ఓ కలేదో
నన్ను తప్పించుకు తిరుగుతున్నది..!
గాలంతా బరువు బరువు
వూపిరాడని స్థితి
ఏమో..
బహుశా ఆ కలనుంచి
నేనే తప్పించుకు తిరుగుతున్నానేమో …

-వారాల ఆనంద్

Image Posted on