Month: April 2019

గతం జ్ఞాపకమవుతుంది

Posted on

కాల ప్రవాహంలో

మలుపులు పతాకాలై రెపరెపలాడతాయి

లోయలు దుఖాలై

లోలోపల బందీ అవుతాయి

కాలం గడిచినకొద్దీ

గతం జ్ఞాపకమవుతుంది

బహుశ ఇప్పుడు జ్ఞాపకాల్ని

మరిచిపోవాల్సిన తరుణమొచ్చింది

తుడిచివేయాలని ఎంత రుద్దినా

చేదిరిపోవడం లేదు సరిగదా

మరింత మెరుగులు దిద్దుకుని

ధగ ధగ లాడుతున్నాయి

అయినా మరిచిపోవడానికి

అవేమయినా కలలా

నడిచిన పాదాల సాక్షిగా

మరిగిన రక్తనాళాల సాక్షిగా

అవి నిజాలు కదా

నడిచి వచ్చిన రోజులూ

పరుగు పరుగున దాటిన క్షణాలూ

గెలుపోటముల్ని ధరించి

సవ్యంగానో అపసవ్యంగానో వెళ్ళిపోయాయి

నేనే

ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాను

మలుపు దారుల్లోకో లోయల్లోకో

తిరిగి ఒకసారి వెళ్ళాలనుకుంటాను

జ్ఞాపకాలుగా నాలోనే స్థిరపడ్డ

చోట్లకి వెళ్ళడం ఎట్లా

పైకి కనిపించే విస్తీర్ణమే కాదు

నేను లోపల మరింత విస్తారంగా

వినమ్రంగా వున్నా

పలికిన వాటికంటే పలకనివే అధికం

మలుపులకంటే లోయలే హెచ్చు

నేనేమో లోనికీ బయటకూ

కవిత్వం బహానాతో లోలకమై కదులుతున్నా

కాలమేమో

నువ్వొక్కడివే కాదులేవోయి

అంటూ దర్జాగా వెళ్ళిపోతోంది

-వారాల ఆనంద్

Posted on

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

           ————————– గుల్జార్

           —– అనువాదం: వారాల ఆనంద్

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు

‘రాత్రులు’

దాడి చేయడానికి సిద్ధపడ్డాయి

అది ఓ సాలెగూడు

చీకటిని కొంతమంది పెంచి పోషిస్తున్నారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మనుషులూ వాళ్ళ విశ్వాసాలూ

అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి

అగ్నికోరలు గర్జించినప్పుడు- భయమేస్తుంది  

అవి ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు

మరింత భయంతో వణుకొస్తుంది  

‘జాతి’

కొందరి పదఘట్టనల క్రింద

నలిగిపోతున్నది

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

మరోసారి మెడలు వంచబడ్డాయి

తలలు తెగి రాలిపడ్డాయి

ప్రజలూ వాళ్ళ దేవుళ్ళు కూడా

విభజించబడ్డారు  

ఎవరయినా పేరేమిటని అడిగితే.. భయమేస్తుంది

ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తున్నది

కొందరు చాలాసార్లు  నన్ను

మంచెకు వేలాడదీసారు

మేల్కొను మేల్కొను మెలకువగా వుండు  

విభిన్న చిత్రాల్లో విలక్షణ మహిళలు

Posted on

భారత రాజకీయాల్లోనూ, భారతీయ సినిమా రంగంలోనూ వున్నన్ని మూఢనమ్మకాలూ, సెంటిమెంట్లూ మరే ఇతర రంగాల్లో కనిపించవు. ఒక రాజకీయ పార్టీ రైతుల గురించి మాట్లాడి విజయం సాధిస్తే మొత్తం పార్టీలన్నీ అదే మాట మాట్లాడతాయి. అట్లాగే సినిమా రంగంలో ఒక ఒరవడి సినిమా ఆర్థికంగా విజయం సాధిస్తే ఇక కొంతకాలం అదే మూసలో సినిమాలు నిర్మాణం కావడం, జనానికి మొహం మొత్తి అలాంటి ఒకటి రెండు సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయిన తర్వాతే మరో మూస ఫార్ములా కోసం పాకులాడడం చూస్తూనే వున్నాం. 80 వ దశకంలో ‘మాభూమి’ విజయం తర్వాత ‘ఎర్రమల్లెలు’, ఆ తర్వాత అదే ఎర్ర సినిమాలు ఎన్ని వచ్చాయో చూసాం. అదేవిధంగా ఒక రాయలసీమ ఫాక్షన్‌ సినిమా విజయం సాధించిన తర్వాత అదే ఫార్ములాతో ఎన్ని తెలుగు సినిమాలు విడుదల అయ్యాయో చూసాం. ఇవి మచ్చుకు కొన్నే. అంతే కాదు, ఈ స్థితి కేవలం తెలుగు ప్రధాన స్రవంతి సినిమాలకే కాదు, భారతీయ అన్ని భాషా ప్రధాన స్రవంతి సినిమాల్లోనూ వుంది. హిందీ సినిమా రంగమూ అందుకు మినహాయింపు కాదు. మూడు ఫైట్లు, ఆరు పాటలూ అన్న చందంగా అనేక రొటీన్‌ రొడ్డకొట్టుడు సినిమాలు హిందీలో కూడా అనేకం. అట్లే అన్ని భారతీయ సినిమాల్లో హీరో డైరెక్టర్‌, హీరో హీరోయిన్‌ల కాంబినేషన్‌ అన్న ఫార్ములా కూడా వుంది. ఇట్లా పలు చిత్ర విచిత్రమైన విశ్వాసాలతో హిందీ సినిమా కూడా కునారిల్లుతూనే వుంది. అయితే హిందీ సినిమా విస్తృతి పెద్దది కనుక ఆ ఫార్ములా ఒరవడిలో పడి కొట్టుకుపోతున్నా అప్పుడప్పుడూ కొంత భిన్నమైన సినిమాలు హిందీలో వస్తూనే వున్నాయి. ఆర్ట్‌ సినిమాలూ, వాస్తవిక సినిమాలూ కనుమరుగైనప్పటికీ కొంత భిన్నమైన సినిమాలు హిందీలో అప్పుడప్పుడూ కనిపిస్తూనే వున్నాయి. అందుకే ఇట్లా వచ్చి కోట్లు కొల్లగొట్టి అట్లా ప్రేక్షకుల మనసుల్లోంచి మాయమయిపోయే సినిమాలకు తోడు, నాలుగు కాలాలపాటు గుర్తుండే కొన్ని మంచి సినిమాలు కూడా హిందీ సినిమా రంగంలో తయారవుతూనే వున్నాయి. విజయవంతమవుతూనే వున్నాయి. మంచి సినిమా చూశామన్న అనుభూతిని ప్రేక్షకుల్లో మిగులుస్తున్నాయి. సామాజిక మానసిక అంశాల్ని కూడా ఇలాంటి ‘అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌’ సినిమాలు తడుముతూనే వున్నాయి.
        ఇలాంటి అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ సినిమాలు రావడానికి ప్రధానంగా భిన్నమయిన కథ, వినూత్నమయిన స్క్రీన్‌ ప్లే, అవుట్‌ ఆఫ్‌ ది ట్రాక్‌ ఫిలిం మేకింగ్‌లు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇలా భారతీయ సినిమా విలక్షణతను సంతరించుకుని తన ముఖ చిత్రం మారుతూ వుండడం గమనించవచ్చు. ఆ స్థితికి ప్రధానంగా కొంతమంది విలక్షణ రచయిత్రులు స్క్రీన్‌ రైటర్లుగా రంగంలోకి రావడం ప్రధాన కారణం. గత దశాబ్దంగా పలువురు మహిళా రచయితలు పలు విజయవంతమయిన అర్థవంతమయిన సినిమాల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. ఇటీవలే వచ్చిన ‘మంటో’, మన్మర్జియా, గల్లీ బారు లాంటి సినిమాల రచయిత్రులు, దర్శకుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం.
కనికా ధిల్లాన్‌ : అమృత్‌సర్‌లో పుట్టిన కనికా మంచి రచయిత్రిగా ఎదిగారు. బాంబే డక్‌ ఈస్‌ అ ఫిష్‌, శివ అండ్‌ ద రైస్‌ ఆఫ్‌ షాడోస్‌, ద డాన్స్‌ ఆఫ్‌ ద దుర్గా లాంటి నవలలు రాశారు. అమె మొదట రెడ్‌ చిల్లీలో పని చేస్తూ ‘ఓం శాంతి ఓం’కి సహాయ దర్శకురాలిగా పని చేశారు. తర్వాత ‘రావణ్‌, సైజ్‌ జీరో, మాన్‌ మర్జియా’లకు స్క్రిప్ట్‌ రచన చేశారు. ఇటీవల ‘కేదార్‌నాథ్‌ మెంటల్‌ హై క్యా’లకు కథ, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాశారు. విజయవంతమయిన రచయిత్రిగా నిలదొక్కుకున్నారు.
జుహీ చతుర్వేది : 1975లో లక్నోలో జన్మించిన జుహీ లక్నో కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో, తర్వాత 1996లో ఢిల్లీలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ కంపెనీలో చేశారు. తర్వాత అక్కడే తన మొదటి సినిమా ‘విక్కీ డోనార్‌’ సినిమా స్క్రిప్ట్‌ రాయడం ఆరంభించారు. ‘విక్కీ డోనార్‌’కు రచయిత్రిగా, ‘మద్రాస్‌ కెఫే’కు సంభాషణలు, ‘పీకూ, అక్టోబర్‌, స్కై ఈస్‌ పింక్‌’ సినిమాలకు రచయిత్రిగా పనిచేసి అద్భుతమయిన సినిమాల్ని అందించారు. ఆమె ‘విక్కీ డోనార్‌’కు జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. 
కొంకణ సేన్‌ శర్మ : ప్రముఖ బెంగాలి నటి అపర్ణా సేన్‌ కూతురు అయిన కొంకణ మొదట మంచి నటిగా గుర్తింపు పొందారు. రెండు జాతీయ అవార్డులు, నాలుగ్‌ ఫిలింఫేర్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక రచయిత్రిగా దర్శకురాలిగా కొంకణ ‘ఎ డెత్‌ ఇన్‌ ద గంజ్‌’ ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు. 
అలంకృతా శ్రీవాస్తవ : ఢిల్లీలో జన్మించిన అలంకృత ప్రకాష్‌ ఝా తీసిన ‘గంగా జల్‌’, ఖోయా ఖోయా చాంద్‌, రాజనీతి లాంటి సినిమాలకు సహాయ దర్శకురాలిగా పని చేసి, తన మొదటి సినిమా ‘టర్నింగ్‌ 30’ రూపొందించారు. తర్వాత ఆమె తీసిన ‘లిపిస్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’ ఎంత చర్చనీయాంశమైన సినిమాగా నిలబడిందో చూశాం. ‘దోలి కిట్టీ అవుర్‌ చమక్తే సితారే, మెర్‌ ఇన్‌ హెవెన్‌’ ఈ సినిమాలకు ఆమె రచయిత్రి, దర్శకురాలిగా పనిచేశారు. 
గౌరీ షిండే : పూనేలో పుట్టి పెరిగిన గౌరీ షిండే ముంబై లి సిద్దార్థ్‌ ఖక్‌ దగ్గర సహాయ దర్శకురాలిగా పని చేశారు. తన మొట్ట మొదటి సినిమాగా ‘ఇంగ్లీష్‌ వింగ్లిష్‌’ రూపొందించారు. కథా రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని తానే నిర్వహించారు. ఆ సినిమా శ్రీదేవి కెరీర్‌కు పునర్‌ ఆరంభం పలికింది. తర్వాత షారుఖ్‌ ఖాన్‌, అలియా భట్‌ నటించిన ‘డియర్‌ జిందగీ’ సినిమాకు కూడా కథా రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఆ రెండు సినిమా కథలు విలక్షణతను సంతరించుకున్నాయి. రచయిత్రిగా, దర్శకురాలిగా షిండే ఇవ్వాళ హిందీ రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందారు. 
జోయా అక్తర్‌ : జావేద్‌ అక్తర్‌, హనీ ఇరానీల కూతురయిన జోయా న్యూయార్క్‌లో చదువుకున్నారు. మీరానాయర్‌ లాంటి వాళ్ళ దగ్గర సహాయకురాలిగా పని చేసారు. ‘లక్‌ బై చాన్స్‌, జిందగీ న మిలేగి దోబారా, బామే టాకీస్‌, గల్లీ బారు’ లాంటి సినిమాలు భిన్నంగా రూపొంది జోయాకు మంచి పేరు తెచ్చాయి. ‘దిల్‌ దడఖ్‌ నే దో, లస్ట్‌ స్టోరీస్‌’ లాంటి సినిమాలు కూడా జోయా రూపొందించి, ప్రతిభ కల దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. తను దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు జోయా రచన బాధ్యతలు కూడా నిర్వహించారు. 
నందితా దాస్‌ : 1969లో పుట్టిన నందితాదాస్‌ 40కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో నటించిన నందిత దర్శకురాలిగా మొట్ట మొదట 1988లో ‘ఫిరాఖ్‌’ తో ఆరంభించారు. ‘ఫిరాఖ్‌’ గుజరాత్‌ హింసాకాండ గురించి నిజాయితీగా తీసిన సినిమాగా నిలిచింది. అనేక వాస్తవ కథల్ని 24 గంటల సమయంలో పరస్పర సమన్వయంతో నిర్మించారీ సినిమాను. గత ఏడాది నందిత ‘మంటో’ సినిమా రూపొందించారు. సుప్రసిద్ధ రచయిత బయోపిక్‌గా రూపొందిన మనతో దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకున్నారు. 
జీనత్‌ లఖాని : జీనత్‌ లఖాని దర్శకురాలిగా మొట్టమొదటి సినిమా ‘షాదీ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌’. విద్యా బాలన్‌, ఫర్హాన్‌ అక్తార్‌లు ప్రధాన భూమికల్ని పోషించారు. 2017లో జీనత్‌ లఖాని రచన బాధ్యతల్ని నిర్వహించిన సినిమా ‘హిందీ మీడియం’, ఇర్ఫాన్‌ఖాన్‌, సబా ఖమర్‌లు ప్రధాన పాత్రల్ని పోషించారు. సామాజిక కోణంలోంచి వర్తమాన విద్యా వ్యవస్థను తూర్పార పట్టిన సినిమాగా ‘హిందీ మీడియం’ నిలుస్తుంది.
అన్వితా దత్‌ గుప్తన్‌ : అన్విత ప్రధానంగా సంభాషణలు, పాటల రచయిత్రిగా పేరెన్నికగన్నారు. రచయిత్రిగా ఆమె రాసిన సినిమాలు ‘శాందార్‌’, ‘ఫైల్లౌరీ’లు రొడ్డకొట్టుడు సినిమాలకు భిన్నమయిన సినిమాలుగా నిలిచాయి.
కామ్నా చంద్ర : కామ్నా చంద్ర గతంలో పలు మంచి ప్రేమకథా చిత్రాలకు రచనలు చేసారు. ‘1942-లవ్‌ స్టొరీ’ లాంటి సినిమాలకు ఆమె రచన చేశారు. ఇటీవలి కాలంలో ఆమె రచన చేసిన సినిమా ‘ఖరీబ్‌ ఖరీబ్‌ సింగల్‌’.
ఇట్లా అనేక మంది రచయిత్రులు భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తున్నారు. కొత్తదనాన్ని అద్ది సరికొత్త సినీ భాష్యాన్ని లిఖిస్తున్నారు. వారి కృషిలో నిర్మాణమయిన సినిమాల్ని చూస్తే భారతీయ సినిమాకు సొంత గొంతుకతో పాటు సొంత స్టైల్‌ కూడా వుందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే రచయిత్రులు, దర్శకుల్లో అధిక శాతం మంది 1970 లలో జన్మించిన వాళ్ళే కావడం గమనించ దగ్గ అంశం.

అంటే కొత్త తరం కొత్తగా ఆలోచిస్తుందని, సరికొత్త ఆవిష్కరణలకు దారులు వేస్తుందని అవుటాఫ్‌దబాక్స్‌ సినిమాల్నిరూపొందిస్తుందని విదితమవుతుంది.

-వారాలఆనంద్‌,

9440501281

Posted on

VARALA ANAND’s “MANERU THEERAM POETRY”

Posted on

వారాల ఆనంద్ కవిత్వం “మానేరు తీరం”

Posted on

అక్షరాల తెర లో జింబో కవిత్వం పై వారాల ఆనంద్

Image Posted on