ముక్తకాలు

చిన్నోడి ముక్తకాలు బాల వ్యాకరణ పాఠాలు

Posted on

చిన్నోడి ముక్తకాలు బాల వ్యాకరణ పాఠాలు
***********
వారాల ఆనంద్ సాహితీ లోకంలో పరిచయం అక్కరలేని కలం. చేవున్న కవితలతో నడుస్తున్న గొప్పకవి.అంతేకాదు వార్తా ప్రపంచంలో ఓ మానవీయ వ్యక్తి. మరింక లోతుగా చూస్తే సమాంతర సినిమా శోధకుడు, బోధకుడు కూడానూ. నిన్న సొంత ఊరు సొదలను మన ఎద ఎదల్లో నింపి
ఇప్పుడు చిన్నోడి ముక్తకాలను మన ముందు పరిచారు.ఇక్కడ తాత మనమడు సేఫ్.పాఠకులకు మాత్రం నల్లేరు నడక కాదిది.ఒక బాల్యంలోకి పరకాయ ప్రవేశం చేసి తన బాల్యాన్ని నాస్టాల్జియాలోకి ఒంపుకొని బాల ముక్తకాలను మరో ఆముక్తమాల్యదగా కవిత్వాన్ని అందించారు.ఇటీవలే ఈ కలం గుల్జార్ “గ్రీన్ పోయెమ్స్” తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నది.చిన్నోడి ముక్తకాలు 108 రకాల భావోద్వేగాల రాగమాల. కవిత్వం సినిమాటిక్ గా,డ్రామాటిక్ గా ఉండాలి. కానీ పాథెటిక్ గా కాదు. సీరియస్ గా ఉండి సెన్సషనల్ గా మానసిక ఉల్లాసం వైపు నడవడం స్టాటిక్ నుండి డైనమిక్స్ చేరుకోవడమే కవిత్వం అసలు ఉద్దేశ్యం లక్షమూ కూడా. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ధారాళంగా వారాల ఆనంద్ చిన్నోడి ముక్తకాలు అందుకున్నాయి. బతుకులో ముఖ్యమైన దశ బాల్యమే కదా. ఎందుకంటే బాల్యంలేని బతుకు ఉండదు మనిషికి. తన బాల్యాన్ని కవి తన మనుమడి లో చూసుకోవడం గొప్ప నాస్టాల్జియానే. ఇక పేజీలు అలల్లా కదులుతున్నాయి నా చేతి వేళ్లను తాకుతూ. ఇది నాకు గొప్ప అనుభూతినీ ఆనందాన్నీ ఇచ్చింది. కవి అంటాడూ ఒక ముక్తకంలో ఇలా … “వాడితో ఆడుకుంటున్నా, /కాదు వాడే నన్నాడిస్తున్నాడు/ ఇరవై ఏళ్ళ క్రితం పోగొట్టుకున్నదేదో తిరిగిస్తున్నాడు/”. తన బాల్యాన్ని వారాల ఆనంద్ యాదోంకీ బారాత్ గా ఆవిష్కరించుకుంటూ తన మనుమని బాల్యంలోకి అన్వయ కవిత్వం రాస్తున్నారు. ఇద్దరూ ఆడుకోవం ప్రధానమైన అనుభూతి . ఈ ఇద్దరూ కలిసి పాఠకులను ఆడించం గొప్ప అనుభవమే మరి. బాల్యం చేయని పని లేదుగదా. మరో పోయెమ్ లో “ఈ నడుమ వాకింగ్ కు వస్తలేవేంది… /వాకింగేంది భయ్యా చిన్నోడితో /రన్నింగే అవుతుంటే”/ ప్రతి ఒక్కరికీ బాల్యంలో ఆట ఉరుకులూ, పరుగులూ, దుముకుడూ, పడి లేవడాలూ ఉత్సుకతనూ భయాన్నీ పరిచయం చేసేవే . అయితే వీటి డిగ్రీ ఒకేలా ఉండదు కూడా. దీనిలో తాతను మనమడు ఆడించడమే సజీవ కవిత్వమూ, కవిత్వవంశమూ కూడా. వ్యక్తావ్యక్త బాల్యాన్ని ఆవిష్కరించుకోవడం కవికి గొప్ప వరం. అంతేకాదు వారాల ఆనంద్ కు కొత్త జీవన సారం కూడా. మరో ముక్తకంలో “కవిత్వం చదివాను కనుక నాకు ఉనికి /కవిత్వం రాసాను కనుక నాకు ఊపిరి”/కవికి చిరునామా కవిత్వం బతుకూ కవిత్వమైనప్పుడు ఉనికీ ఊపిరీ కవిత్వమే . మన పనీ పనితనమూ మనలో ప్రవహించడమంటే ఇదే మరి. “చిన్నోడికి నాలుగు అడుగులు వేయడం వచ్చింది /మెష్ డోర్ తీస్తే చాలు /’కవిత్వం ‘/ నడక కొత్తదిగదా పరుగో పరుగు అంటుంది. చిన్నోడి చేష్టలు ఆపడం కష్టమే మరి. ఇది ప్రతి తాత అమ్మమ్మమ్మ జీవితానుభవ సారమే. ఇక్కడ కవిత్వం చెంగో బిళ్ళ మాటలో పొడుగుకుంది. ఎంత గొప్ప మాండలిక నుడికారం. అంతే అస్తిత్వ ప్రతీక కూడా.ఇంకా “మెట్లు ఎక్కుతాడట,/ గోడలు దాటుతాడట,/ గోడలు దూకకుండా చూస్కో అంటున్నాడో మిత్రుడు”/మనిషి ఎదుగుదలలో పెరుగుదలలో మంచీ చెడూ సంగమిస్తాయి . కవి హెచ్చరికగా గోడలు దూకకుండా చూస్కో అని మరో గోతులోంచి పలికించాడు కవి ఆనంద్. ఇదే కవిత్వం చెమక్కు. అలతి అలతి మాటలు, రోజూ మన వాడే భాషలో కవిత్వాన్ని అల్లడం నేర్పూ ఓర్పుకు పరీక్షే మరి. లోగడ ముక్తకాలు కవిత్వం వెలువరించిన కాలానికీ కవికీ ఇది సమస్య కాకపోవచ్చు. అయినా మన రోజూవారీ మాటలను మనం కవిత్వంలోకి ప్రతిక్షేపించడం ఒకింత సాహసం. అంతే స్వాభిమానం కూడా. మరో ముక్తకంలో “వాడికి తెలిసిందల్లా నవ్వులూ కేరింతలూ కవ్వింతలే “/ అంటాడు కవి. చిన్నతనంలో పిల్లల ఆస్తి అదేకదా. కల్మషం మాయామర్మం లేని తెల్ల కాగితం కదా బాల్యమంటే. అది సజావుగా నడిచేలా చూడడమే తాతల పని. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు.సామజిక దృక్పథంలో కవి రచనకు మచ్చుగా చెప్పొచ్చు కూడా. మరో కవితలో “సతాయింపు ఇసుమంత /ఆనందం ‘ఆకాశమంత’/ఆనంద్ కు ఉచితంగానే ఆనందం దొరికింది.ఆనందం ఔషధం. దీనితో మనసూ దేహం మరింత ఆరోగ్యాన్ని తప్పకుండా పొందుతుంది.ఇక్కడ మునుమడు తాతకు మంచి టానిక్.కవికి ఆప్టిమిస్టిక్ ఆప్టిక్.ఆనంద్ కవిత్వం నడక తీరును తన లయ కవితం నుండి నుండి మానేరు తీరం, మనిషి లోపల, అక్షరాల చెలిమె, ముక్తకాలు,సొంత ఊరు కవిత్వం చదివిన తెలుస్తుంది. అందులో చతుర చాతుర్యం, హాస్యం, సామజిక నేపథ్యం, బంధాలూ సంబంధాలూ వాలి విలువలు తెలిపే మెళుకువలున్నాయి. ఇది చూడండి. “ఇంట్లో కర్ఫ్యూ పెట్టినట్టుంది/ చిన్నోడిప్పుడే నిద్ర పోయాడు/”ఎంత సునిశిత భావుకత. ఎంత గొప్ప అభివ్యకి. మమకారం, ప్రేమా రక్తంలా ప్రవహిస్తేనే ఇలాంటి కవిత్వం కవిలో పుట్టుకొస్తుంది నిస్సందేహంగా. కవి స్వయంగా సినీ వాలి. అందువల్ల అనుకోకుండానే సినీ మాటలు, సినీమా ఆటలు సినిమాటిక్ గా వచ్చి వాళ్ళయిక్కడ. కదలడు -వదలడు, చిక్కడు దొరకడు , మోసగాళ్లకు మోసగాడు సాగర సంగమం,ఛాలెంజ్ వంటివి కొన్ని సందర్భం ఔచిత్యం తొణికిసలాడేలా కవితమయమైనవి. ఇది అనుభవం నేర్పిన విద్య. ఇక చివరగా మనుమని విన్యాసం కవి రాతలో ” క్షణంలో గులక రాయి / నోట్లో ఎరగనట్టు/ నవ్వేస్తాడు,’మోసగాళ్లకు మోసగాడు’ /
తాత కవిత్వమంతా మనుమనిపైన ఎలా అల్లుకొని గుండెను అలుముకొందో చెప్పొచ్చు. చిన్నతనం మనను ఎలా నమ్మిస్తుందో చెప్పడం కవి ఉద్దేశ్యంగా నాకు తోచింది. మనుమనిలో తన బాల్యాన్ని చూసుకుంటూ మనకు మంచి బాలల కవిత్వాన్ని అందించిన ఆనంద్ సర్వదా బహుధా ప్రశంశనీయుడు.వారి కలం సేద్యం శ్లాఘనీయం కూడా.

డా.టి.రాధాకృష్ణమాచార్యులు
9849305871.
https://epaper.dishadaily.com/c/72719329

Posted on

‘చిన్నోడి ముక్తకాలు’ వారాల ఆనంద్ కవిత్వాన్ని శ్రీమతి సుమతి చురుకంటి గానం చేశారు. లింక్ క్లిక్ చేసి వినండి,చిన్నోడిని చూడండి -వారాల ఆనంద్

వారాల ఆనంద్

Posted on

‘కవిత్వం’

వారాల ఆనంద్

‘కవిత్వం’

+++++

మైదానం లో బాల్యం

@@@

1)

వేసవి సెలవులిచ్చారు

మైదానాల్లో

పువ్వులు విచ్చుకున్నాయి

********************

2)

మైదానంలోకి

అతిథులొచ్చారు

బాల్యం వాసనల ఘుమ ఘుమ

*********************

3)

మైదానాల్లో

పిల్లల వర్కౌట్లు

హోమ్ వర్క్ కి సెలవులొచ్చాయి

**********

4)

మైదానాల్లో

గువ్వలు ఆడుకుంటున్నాయి

స్కూళ్ళ గెట్లకు తాళాలు పడ్డాయి

****************

5)

కేరింతల జోరు

మైదానాల గాలినిండా హోరు

పాపం ‘ సైలెన్స్’ గొంతు మూగబోయింది

*********************

6)

బండి చక్రం లా

మైదానం గిర గిరా గిర గిరా

రన్నింగ్ ట్రాక్ మీద పిల్లలా మజాకా

************

7)

వేసవి కాలం

సూర్యుడికంటే ముందే లేస్తున్నారు

వెళ్ళాల్సింది స్కూలుకు కాదు కదా

**********

😎

స్వరాలూ సరిగమలూ

రాగాలూ అనురాగాలూ

‘బాలసదన్’ నిండా కచేరీలే

**********

9)

తన్నుడు తంతే

బంతి ఆకాశంలోకి ఎగిరింది

పశ్చిమాన సూర్యుడు అస్తమిస్తున్నాడు

**********

10)

వేసవి వేళ

ఆటలున్నాయి పాటలున్నాయి

‘కథల చెట్టు’ అమ్మమ్మే లేదు

**************************

9440501281

Group of happy Gypsy Indian children – desert village, Thar Desert, Rajasthan, India

ఎదనిండా ‘తడి’ ++వారాల ఆనంద్

Posted on Updated on

ఎదనిండా ‘తడి’
++++++++++++++++ వారాల ఆనంద్

తెలంగాణా మాటంటే ఎంత పావురం
వింటే చెవులల్ల అమృతం బోసినట్టుంటది

పలకరిస్తే ప్రేమ ఒలక బోసినట్టుంటది
పిలిస్తే మత్తడి దుమికినట్టుంటది

ఎంత ఆత్మగల్లదీ భాష

అవ్వ అంటే తొవ్వ జూపిస్తది
అయ్య అంటే వేలుబట్టుకు నడిపిస్తది

వాకిట్లోంచి ఎవరయినా కేకేస్తే
కిటికీ రెక్కలు బార్లా దెరిచి
చల్ల గాలి లోనికొచ్చి ప్రేమతో
పెయ్యంతా తడిమినట్టయితది

పాణంగా ముచ్చట బెడితే
పండగ జేసినట్టుంటది

కష్టాల్ని దల్సుకుంట ఎక్కిళ్ళు పడితే
కడుపులోంచి దుఖం తన్నుకొస్తది

ఏమి భాషిది
మనసుకు అద్దం పడుతది
మనుషుల నడుమ వంతెన కడుతది

దీంట్ల దొరగాడి రాజసముంది
కూలోడి చెమట చుక్కల మెరుపుంది

ఏ బస్సులోనో రైలులోనో గాలి మోటర్లోనో
ఏ ముఖం తెలీని వాడి నోటయినా
తెలంగాణా మాట వింటే చాలు
మావాడనిపిస్తది మావూరోడనిపిస్తది

కానీ ఉద్యమంలో ఆధిపత్యాన్ని వూడ్చేసిన
మా చీపుర్లు
ఇవ్వాళ మూలకు కూలబడ్డాయి
మీన మేషాలు లెక్కబెడుతున్నాయి
నీళ్ళలాంటి మాటల్ని రసాయన ద్రవాల్లో మరగబెడుతున్నాయి
పాత రాగంతో కొత్త గానం అందుకుంటున్నాయి

అయినా
నాకెందుకో ఈ భాషంటే
ఎద నిండా తడి
అది రాసే వాళ్ళంటే
ఎంతో చెప్పలెంత ‘ఇది’
*************

వారాల ఆనంద్ = చిన్న కవితలు

Posted on

వారాల ఆనంద్
చిన్న కవితలు
++++++++++++

1)
కళా సృష్టి అనేది
మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి

ప్రతిమను రూపొందించడం లాంటిది

2)
అహంకారం ఒకసారి ఎక్కడం మొదలయితే
శరీరమూ మెదడూ సరిపోదు

మనసూ మునిగి పోతుంది

౩)
గొప్పలు చెప్పుకోవడం మొదలయ్యాక
మెప్పులు మాత్రమే రుచిస్తాయి

నిజాలు చేదవుతాయి

4)
కిరీటాలూ బుజకీర్తులూ
కఠోర శబ్దాలు చేస్తాయి తప్ప

శ్రావ్య సంగీతాన్ని వినిపించవు

5)
అర్హతను ముంచి లభించిన ప్రతిదీ
అల్పత్వాన్నే ప్రోది చేస్తుంది

హుందా తనాన్నివ్వదు

6)
అవసరమయినప్పుడు ఆసరా తీసుకుని
తీరం చేరి తక్కువ చూసే

కృతఘ్నత ఎప్పటికీ ‘దారి’ చూపదు

7)
అసూయా పరుడు తనను తాను పొగుడుకుంటాడు
క్రమంగా తననే పోగొట్టుకుంటాడు

ఎండిన ఆకు గల గలమని గాలిలో కలిసిపోతుంది

8)
చీకటింకా తెమలలేదు, మబ్బులు ఒళ్ళు విరుచుకోలేదు
పక్షులు నిశ్శబ్దంగా తమ రెక్కల మీద

తూర్పు వెలుగులు మోసుకొస్తున్నాయి

9)
చీకటి ఎప్పటికయినా ముగుస్తుంది
వెలుగు ఎన్నటికయినా మెరుస్తుంది

మనమే సుఖ దుఖాల నడుమ వూగిసలాడతాం

10)
ఉదయపు ఆకాశంలో పక్షులు బారులు బారులుగా
తొలి కిరణాలకు దారి చూపుతున్నాయి

పక్కకు తొలగుతున్న మబ్బులకు, కింద నడుస్తున్న నాకూ తెలీదు

11)
ఒంటరితనంలో ఉద్వేగం, మాటలు లేవు
సాటి మనుషులూ లేరు

ఎలాంటి భావం లేకుండా ‘కాలం’ గడుస్తూనే వుంది

12)
తెలియకుండానే మనసు పొరల్లో కొన్ని మరుగున పడతాయి
కానిగిరి పాఠాలూ, కన్న కలలూ, తొలి ప్రేమలూ

కాల గమనంలో అట్లా కలిసిపోతాయి, మనమిట్లా మిగిలిపోతాం

“మానేరు తీరం” ఒక జ్ఞాపకం

Posted on

1981 లో నేను మిత్రులు జింబో,వఝల శివకుమార్, అలిశెట్టి ప్రభాకర్, పి.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ’ కవితా సంకలనం వెలువడింది. తర్వాత 1998లో అంటే ఇప్పటికి దాదాపు 23 ఏళ్ళ క్రితం నా మొదటి పుస్తకం ‘మానేరు తీరం’ వెలువడింది. ఆ పుస్తక పరిచయ సభలో శ్రీయుతులు దర్భశయనం శ్రీనివాసాచార్య, నలిమెల భాస్కర్ లు మాట్లాడారు. సమైఖ్య సాహితీ సాహితీ సంస్థ పక్షాన శ్రీ కే.ఎస్.అనంతాచార్య, మదిశెట్టి గోపాల్ లు సభ నిర్వహించారు. పాత ఫైళ్ళు తిరగేస్తున్నప్పుడు అప్పుడు ‘మానేరు తీరం’కు  వచ్చిన స్పందన కనిపినిచింది. ఒక సారి మళ్ళీ మిత్రులందరితో పంచుకుందామని షేర్ చేస్తున్నాను.. చూడండి… వీడియో కూడా జత చేసాను…pl watch.. వారాల ఆనంద్

ఓ అయిదు చిన్న కవితలు

Posted on

ఓ అయిదు చిన్న కవితలు

– వారాల ఆనంద్

1)

చీకటింకా తెమలలేదు, మబ్బులు ఒళ్ళు విరుచుకోలేదు

పక్షులు నిశ్శబ్దంగా తమ రెక్కల మీద

తూర్పు వెలుగులు మోసుకొస్తున్నాయి

——————–

2)

చీకటి ఎప్పటికయినా ముగుస్తుంది

వెలుగు ఎన్నటికయినా మెరుస్తుంది

మనమే సుఖ దుఖాల నడుమ వూగిసలాడతాం

—————————

౩)

ఉదయపు ఆకాశంలో పక్షులు బారులు బారులుగా

తొలి కిరణాలకు దారి చూపుతున్నాయి

పక్కకు తొలగుతున్న మబ్బులకు, కింద నడుస్తున్న నాకూ తెలీదు

——————————–

4)

ఒంటరితనంలో ఉద్వేగం, మాటలు లేవు

సాటి మనుషులూ లేరు

ఎలాంటి భావం లేకుండా ‘కాలం’ గడుస్తూనే వుంది

———————

5)

తెలియకుండానే మనసు పొరల్లో కొన్ని మరుగున పడతాయి

కానిగిరి పాఠాలూ, కన్న కలలూ, తొలి ప్రేమలూ

కాల గమనంలో అట్లా కలిసిపోతాయి, మనమిట్లా మిగిలిపోతాం

====================================    

ఓ అయిదు చిన్న కవితలు O Aidu Chinna Kavitalu (sanchika.com)