Latest Event Updates

Eenadu Sunday edition

Posted on

eenadu green poems

 

భూమిని తినేసింది..!

ఎండిన ఆకులు చెట్టుమీదినుంచి రాలిపడటం సహజం. ఆ ఆకుల గలగలలు ఏదో చెప్పాలనుకున్నాయి. వాటిని గుల్జార్‌ విన్నారు. ‘పర్యావరణాన్ని రక్షించండి. భూగోళాన్ని ఆకుపచ్చగా ఉంచండి’ అని ఆ ఆకులు ఆయనకు చెప్పాయి. అవేకాదు, చెట్లూ పర్వతాలూ నదులూ జలపాతాలూ తమ కథల్ని వినిపించాయి. వాటినే ఆయన ‘గ్రీన్‌ పొయెమ్స్‌’ పేరుతో ప్రచురించారు. వాటి తెలుగు అనువాదం ఇది. లచ్చి పుట్టినప్పుడు మంత్రసాని బొడ్డుకోసి పడేసింది తన ఒడిలోనే. అటువంటప్పుడు దుర్మార్గుడి చేతిలో మోసపోయి తల్లి కాబోతున్న లచ్చిని ఊరివారి చీదరింపులకు గురికాకుండా కడుపులో పెట్టుకోవాల్సిన బాధ్యతా తనదేననుకుంటుంది ముసలి నది. రాళ్లేసి కొట్టినా, ఎక్కి కొమ్మల్ని విరగదొక్కినా కిక్కురుమనని చెట్టు, కడుపుతో ఉన్న భార్యకి పుల్లని కాయల్ని ఇచ్చిన చెట్టు- దాన్ని కొట్టేస్తుంటే ఎవరు మాత్రం చూడగలరు ఆ దృశ్యాన్ని? ‘ఎట్లా జరిగిందో ఏమో… భూమికి ప్రాణి ఎట్లా సోకిందో ఏమో… భూమిని కొంచెం కొంచెంగా తినేసింది’ అన్న మాటలు – సమస్యను హృదయాల్ని తాకేలా చెప్పిన కవి ప్రతిభకి మచ్చుతునకలు.

గుల్జార్‌ ఆకుపచ్చ కవితలు
అనువాదం: వారాల ఆనంద్‌; పేజీలు: 155; వెల: రూ. 125/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
– పద్మ

 

Advertisements

సృజన స్వరం టోరీ రేడియో లో వారాల ఆనంద్

Posted on

pl CLICK THE LINK

లోన (POEM)

Posted on

లోన

———————– వారాల ఆనంద్


లోనేదో అటూ ఇటూ కదులుతున్నది

నడక నేరుస్తున్న చిన్నారిలా

తప్పటడుగులు వేస్తూ

తిరుగుతున్నది
పడుతూ లేస్తూ

గిరికీలు కొడుతున్నది
పాదరసంలా ఆకారం దిద్దుకోని

ఆలోచనేదో రింగులు రింగులుగా

కలియదిరిగి ఎగిసివచ్చి

గొంతులో చిక్కుకుపోయింది

బయటపడదు

లోనికి దిగదు

ఊపిరాడదు ఊకుండ నీయదు

+ + + + + +

నల్లటి మబ్బులు

ఆకాశాన్ని కమ్మేసినట్టు

లోన ఆవరించిన వేదనేదో

లావాలా ఎగిసి

పైకి ఎగజిమ్మింది
అప్పటికే గొంతులో కొండనాలికకు

చిక్కుకున్నదేదో

నాలుకను తిర్ల మర్లేసి

బింగించిన పెదాల పట్టును వదులుజేసి

బయట పడింది

నల్లటి వేదన ఎర్రటి వాస్తవం

కలగలసి పొరలు పొరలుగా

రూపుదిద్దుకుంటున్నాయి
లోనంతా ఖాళీ ఖాళీ ….

(నవ్య వీక్లీ 31-10-2018)25ddeabb-0583-4dad-82f7-c2007007bca9

 ‘నిశ్శబ్ద మేఘం’ 

Posted on Updated on

 ‘నిశ్శబ్ద మేఘం’ 

-వారాల ఆనంద్   

 

నేను పిలిస్తే పలుకకుండా

చూపయినా మరల్చకుండా వెళ్ళి పోయావు

ఏం చేయను

 

మాటలే నీ చెవులకు సోకని వేళ

నా మౌనం మాత్రం కరిగిస్తుందా

 ఏమో

 

నేనేమో హృదయం నిండా మౌనాన్ని నింపి

కదిలిపోయిన

నీ పాద ముద్రలపై వుంచాను

 

గాలిలోకి ఎగిరిన పక్షులు తిరిగొచ్చి

చెట్ల పై వాలాయి

ఆకులేమో తలవంచి సలాం చేశాయి

 

ముందుకు సాగిపోయిన నీకూ

ఏ క్షణాన్నయినా కరిగిపోయెందుకు నిలబడిపోయిన

నాకూ నడుమ ఆవరించిన

‘నిశ్శబ్ద మేఘం’

కరిగిపోయినప్పుడు

 

నాలుగు కళ్ళూ కలిసి పోతాయి

మాటా మాటా పెనవేసుకొని

 

గానం వర్షి స్తుంది

నేలంతా సరిగమలు విరబూస్తాయిprabha 1

సముద్రమూ సింహాసనమూ

Posted on Updated on

సముద్రమూ సింహాసనమూ
=================
 
సముద్రం నాకేమీ చెప్పలేదు
నాకే కాదు
అది ఎవ్వరికీ ఏమీ ప్రత్యేకంగా చెప్పదు
 
తనలో తానే మథనపడుతుంది
ఎదో గొణుక్కుంటుంది
గంభీరంగా కనిపిస్తూనే
గట్టుకు తల బాదుకుంటుంది
 
లోపల సుడుల్నీ కల్లోలాల్నీ
తట్టుకోలేనంత ఘర్షణనీ
అనుభవిస్తూనే
కోటానుకోట్ల జీవరాశుల్ని సాకుతుంది
ఒక్కోసారి లోపలి కదలిక కల్లోలమై
పాపం సముద్రం అదుపు తప్పుతుంది
హుద్ హుదో, తిత్లీనో పేరేదయితే నేమిటి
అల ఉప్పెనయి
ఒడ్డును కుమ్మేస్తుంది
ఇల్లూ పిల్లా
చెట్టూ చేమా తేడా లేదు
ఉప్పెన దాడికీ, దాహానికీ
అన్నీ ఉనికిని కోల్పోతాయి
 
మునిగి ముక్కలవుతాయి
పగిలి చెక్కలవుతాయి
రెప్పల కట్టల్ని తెంచుకొని
కన్నీళ్లు ధారలుకడతాయి
సింహాసనం తీరిగ్గా లేచి
కళ్ళు నులుముకుంటూ
అధికారం డిప్పను కప్పుకొని
తాబేలుతో పోటీ పడుతూ వాలిపోతుంది
 
మునిగిందేమిటి మిగిలింది ఏమిటని
కాకిలెక్కలకు దిగుతుంది
జమాఖర్చులు చూసుకుంటూ
చేతులూపి వెళ్ళిపోతుంది
 
అవును మరి సింహాసనానికి
పుటుకయినా చావయినా
పండగే..!!
– వారాల ఆనంద్, 9440501281final poem