Month: October 2018

 ‘నిశ్శబ్ద మేఘం’ 

Posted on Updated on

 ‘నిశ్శబ్ద మేఘం’ 

-వారాల ఆనంద్   

 

నేను పిలిస్తే పలుకకుండా

చూపయినా మరల్చకుండా వెళ్ళి పోయావు

ఏం చేయను

 

మాటలే నీ చెవులకు సోకని వేళ

నా మౌనం మాత్రం కరిగిస్తుందా

 ఏమో

 

నేనేమో హృదయం నిండా మౌనాన్ని నింపి

కదిలిపోయిన

నీ పాద ముద్రలపై వుంచాను

 

గాలిలోకి ఎగిరిన పక్షులు తిరిగొచ్చి

చెట్ల పై వాలాయి

ఆకులేమో తలవంచి సలాం చేశాయి

 

ముందుకు సాగిపోయిన నీకూ

ఏ క్షణాన్నయినా కరిగిపోయెందుకు నిలబడిపోయిన

నాకూ నడుమ ఆవరించిన

‘నిశ్శబ్ద మేఘం’

కరిగిపోయినప్పుడు

 

నాలుగు కళ్ళూ కలిసి పోతాయి

మాటా మాటా పెనవేసుకొని

 

గానం వర్షి స్తుంది

నేలంతా సరిగమలు విరబూస్తాయిprabha 1

సముద్రమూ సింహాసనమూ

Posted on Updated on

సముద్రమూ సింహాసనమూ
=================
 
సముద్రం నాకేమీ చెప్పలేదు
నాకే కాదు
అది ఎవ్వరికీ ఏమీ ప్రత్యేకంగా చెప్పదు
 
తనలో తానే మథనపడుతుంది
ఎదో గొణుక్కుంటుంది
గంభీరంగా కనిపిస్తూనే
గట్టుకు తల బాదుకుంటుంది
 
లోపల సుడుల్నీ కల్లోలాల్నీ
తట్టుకోలేనంత ఘర్షణనీ
అనుభవిస్తూనే
కోటానుకోట్ల జీవరాశుల్ని సాకుతుంది
ఒక్కోసారి లోపలి కదలిక కల్లోలమై
పాపం సముద్రం అదుపు తప్పుతుంది
హుద్ హుదో, తిత్లీనో పేరేదయితే నేమిటి
అల ఉప్పెనయి
ఒడ్డును కుమ్మేస్తుంది
ఇల్లూ పిల్లా
చెట్టూ చేమా తేడా లేదు
ఉప్పెన దాడికీ, దాహానికీ
అన్నీ ఉనికిని కోల్పోతాయి
 
మునిగి ముక్కలవుతాయి
పగిలి చెక్కలవుతాయి
రెప్పల కట్టల్ని తెంచుకొని
కన్నీళ్లు ధారలుకడతాయి
సింహాసనం తీరిగ్గా లేచి
కళ్ళు నులుముకుంటూ
అధికారం డిప్పను కప్పుకొని
తాబేలుతో పోటీ పడుతూ వాలిపోతుంది
 
మునిగిందేమిటి మిగిలింది ఏమిటని
కాకిలెక్కలకు దిగుతుంది
జమాఖర్చులు చూసుకుంటూ
చేతులూపి వెళ్ళిపోతుంది
 
అవును మరి సింహాసనానికి
పుటుకయినా చావయినా
పండగే..!!
– వారాల ఆనంద్, 9440501281final poem