యాదోంకి బారాత్ -19

86= యాదొంకీ బారాత్

Posted on

++++++ వారాల ఆనంద్

86= యాదొంకీ బారాత్

++++++ వారాల ఆనంద్

ఏదయినా ఒక సంస్థకు శాశ్వత చిరునామా ఏర్పడడం, ఆ సంస్థ కార్యక్రమాలకు నీడ,వేదిక రూపొందడం గొప్ప కల సాక్షాత్కారం అవడమే. ఓ పిల్లి ఏడు ఇండ్లు తిరిగి తన సొంత గూటికి చేరినట్టు ఒక స్వచ్చంద సంస్థ స్వంత భవన నిర్మాణానికి పాదులు వేయడం ఆ సంస్థకు దాని నిర్వాహకులకు అమితమయిన ఆనందాన్నిచ్చే సందర్భం. అలాంటి సందర్భమే కరీంనగర్ ఫిలిం సొసైటీ కి వచ్చింది. కలెక్టర్ శ్రీ పార్థసారధి గారు సంపూర్ణంగా సహకరించడానికి హామీ ఇవ్వడమే కాకుండా కార్యనిర్వహణకు పూనుకోవడం తో నేనూ మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ఆ నిర్మాణ పనిలో చొరవగా ముందుకొచ్చారు. మొదట దివంగత పండితులుఆత్మీయ మిత్రుడు శ్రీ నమిలకొండ హరిప్రసాద్ నేతృత్వంలో భూమి పూజ జరుపుకుని కార్యరంగంలోకి దూకాం. మొదట ఆర్థికంగా సహకరించమని కరీంనగర్ ప్రజల్ని కళాభిమానుల్ని కోరుతూ ఒక కరపత్రం వేసాము. అందులో కఫిసో చరిత్ర చేసిన కార్యక్రమాల వివరాలతో పాటు అనేక అంశాల్ని జోడించాం. ఇక అప్పటి కార్యవర్గమంతా జీవిత సబ్యులుగా చేరాలని తీర్మానించాం. కఫిసో బై లాస్ మౌలిక నిబంధనల ప్రకారం కఫిసోకు జీవిత సభ్యులే శాశ్వత హక్కు దారులు. భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా వారు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని నిర్దేశించబడి వుంది. 80 ల్లో శ్రీ అంపశయ్య నవీన్ గారిని సలహాదారుగా ఉండమని కోరినప్పుడు మొక్కుబడి పోస్ట్ తో ఉపయోగంలేదని సలహాదరుకీ కార్యవర్గంలో ఓటు హక్కు ఉండాలని ఆయన సలహా ఇవ్వడంతో అప్పుడే ‘బై లాస్’ ను సవరించి సలహాదారు పోస్టు తో పాటు జీవితసభ్యులే కఫిసో కు మూలాధారమని భవిష్యత్తు హక్కు దారులని పేర్కొంటూ రూల్స్ పెట్టడం జరిగింది. ఆ నిబంధనని కూడా భవన నిర్మాణ సందర్భంగా విస్తృతంగా ప్రచారంచేసాం. కార్యవర్గం జీవిత సభ్యులు కావడానికి వెయ్యి నూట పదహార్లు, బయటి వారు అయిదు వేలు చెల్లిస్తే జీవిత సభ్యత్వమిచ్చి దాతలుగా హాలులో పేర్లు రాసి ఉంచుతామని చెప్పాం. ఇవన్నీ అనుకున్న తర్వాత కరపత్రం తీసుకుని నేనూ, నరేడ్ల శ్రీనివాస్, నారదాసు లక్ష్మణ రావు, కే.దామోదర రెడ్డి మాతో పాటు డాక్టర్ రాజన్న తదితరులం ఒక ఉద్యమంలాగానే రోజూ ఉదయం కలిసి తెలిసిన మిత్రుల దగ్గరికి కఫిసొ అభిమానుల దగ్గరికి వెళ్ళడం ఆరంభించాం. నిజంగా అదొక యజ్ఞం. వూర్లో ఎవరు ఎవరికీ తెలిసినా ఎవరికి స్నేహితుడయినా ఈ టీం వాళ్ళ దగరికి వెళ్లాం. మాకు లభించిన స్పందన ఊహించనిది. ఎందుకంటే అడిగిన వాళ్ళల్లో శ్రీనివాస్, నారదాసు, దామోదర్, రాజన్న అంతా ఒక్కక్కొకరు ఒక్కో రంగం లో నిబద్దత తో వున్నా వారే. గొప్ప ఫేస్ వాల్యు వున్నవాళ్ళే. తిరగడం కొంచెం కష్టమే అయినా నేను కేంద్రకంగా ఆ ఉద్యమం ఆనందంగా రెండు కప్పుల చాయ్ మూడు జేవిత సభ్యత్వాలుగా విజయవంతంగా సాగింది. అవసరమయినప్పుడు డాక్టర్ సాగర్ రావు తో పాటు పలువురు మా వెంట వచ్చారు. మిగతా కార్యవత్గం కూడా అంతే నిబద్దతతో తమవంతు కృషి చేసారు. అదంతా సమిష్టి కృషి ఫలితమే.

అట్లా కఫిసో విజ్ఞప్తి మేరకు ఆ రోజుల్లోనే అంటే పదిహేడేళ్ళ క్రితం మా నారదాసు లక్ష్మణ రావు 25 వేలు ఇవ్వగా, పదివేల రూపాయల చొప్పున ఇచ్చిన ప్రముఖుల్లో గౌరిశెట్టి మునిందర్, కేసరిమల్ కార్వా, వావిలాల భూపతి రెడ్డి, డాక్టర్ పంజాల రాజన్న, సోమారపు వెంకన్న, బి.సత్యనారాయణ, టి.సంతోష్ కుమార్, కే.అనంత రెడ్డి, ఎం.రాజేవ్ శెట్టి, కొరవి వేణుగోపాల్, కసిరెడ్డి రాంరెడ్డి తదితరులున్నారు. ఇక అయిదు వేలు ఇచ్చిన వాళ్ళు అనేక మంది. అట్లా కఫిసో ప్రయత్నం తో మేము కట్టాల్సిన CONTRIBUTION సొమ్ము సమకూరింది. మా వాళ్ళంతా హమ్మయ్య అనుకుంటున్న సమయం లో నేను మెల్లిగా చెప్పాను. ఇంతటితో సరిపోదు కట్టబోయే హాల్లో చైర్స్, సౌండ్ సిస్టం, ఎల్.సి.డి. ప్రొజెక్టర్ కావాలి. అవి లేకుండా హాలు ఉవయోగం లేదు అని. నారదాసు నామీదికి ఒక్క సారిగా నా మీదికి ఎగిరాడు. ముందు నుంచి చెప్పలేదు… మెల్లిగా ఇప్పుడు చెబుతున్నావు అన్నాడు. అన్నీ ఒకేసారి చెబితే భయపడతారని అంటూ నసిగాను. శ్రీనివాస్, దామోదర్ లు నవ్వి ఘనకార్యమే చేసావు. ఇంకా చేసేదేముంది అన్నింటికీ ఎంత కావాలో బడ్జెట్ సిద్దం చేయి మరో రౌండ్ వేద్దాం అన్నారు నవ్వుతూ. వాటికీ సొమ్ము సమకూరింది.

ఇక మరో వైపు నిర్మాణం చురుకుగా సాగుతూ వుంది. పార్థ సారధి గారయితే అనేక సార్లు నిర్మాణాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. అది మాకూ ఇంజనీర్లకు గొప్ప ఉత్సాహకంగా వుండేది. కఫిసో సభ్యులతో పాటు మహిళా డిగ్రీ కళాశాల మిత్రులు డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, డాక్టర్ పి.రాజేశం, చంద్ర ప్రభాకర్ తదితరులు కూడా పలుసార్లు వచ్చేవాళ్ళు. మీడియా నయితే సంపూర్ణంగా మా వెంటే వుంది. వాళ్లకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

నిర్మాణానికి ఫిలిం భవన్ గా పేరు పెట్టుకున్నాం. ఇక శాశ్వతంగా ఉండేలా సొసైటీ ఎంబ్లెమ్, KARIMNAGAR FILM SOCIETY AUDITORIUM అని సిమెంట్ తో రాయించాను.

భవన నిర్మాణం పూర్తి అవుతూ వుంటే ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాట్లల్లో మేమున్నాం. ముఖ్యంగా నారదాసు లక్ష్మణ రావు, దామోదర్, నేనూ పూనుకున్నానం. ఆడియో సిస్టం కొసం హైదరాబాద్ మోజం జాహీ మార్కెట్ కు వెళ్లాం. హాలో లో వేసే కుర్చీల విషయంలో కూడా అందరం శ్రద్ధ తీసుకున్నాం. ఇక ఎల్.సి.డీ. ప్రొజెక్టర్ ని అమెరికా నుంచి తెప్పించాం.

ఇదంతా ఇట్లా వుంటే ప్రారంభోత్సవం నాటికి ప్రత్యేక సావనీర్ తేవాలని నిర్ణయించాం. డాక్టర్ రావికంటి మురళి కన్వీనర్ గా కమిటీ వేసుకున్నాం. దాంట్లో అంపశయ్య నవీన్, ప్రేమేంద్ర మజుందార్, నారదాసు, రాములు, రావికంటి మురళి,కోలా రామచంద్రా రెడ్డి, టి.రాజమౌళి నేనూ తదితరులం వ్యాసాలు రాసాం. సావనీర్ లో దాతలందరి పేర్లు ఫోటోలు వేయాలనుకున్నాం. మా ఆస్థాన ఫోటోగ్రాఫర్ కృష్ణ దాతలందరి దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసాడు. వాటి తోనే అందరికీ ఐ.డీ.కార్డ్స్ కూడా ఇచ్చాం. ప్రారంభోత్సవం నాటికి నేను నా వ్యక్తిగతంగా “KAFISO- A SAGA OF FILM LOVERS” పేర డాక్యుమెంటరీ ఫిలిం తీయాలని పూనుకున్నాను. దానికోసం గోదావరిఖని మిత్రుడు లింగాధర్ కెమెరా వర్క్ చేసాడు. వరంగల్ వెళ్లి నవీన్ ఇంటర్వ్యు తో పాటి కఫిసో విశేషాలు ఫోటోలతో సహా అన్నీ అందులో పొందుపరచాను. అరగంట డాక్యుమెంటరీ లో కలెక్టర్ పార్థసారధి, ఎన్.శ్రీనివాస్, నారదాసు, రాజమౌళి, తదితరుల ఇంటర్వ్యూ లు కూడా చేసాను. ఇక ప్రారంభోత్సవ సభకు ముందే ఒక మంచి రోజున ఉదయమే తన శ్రీమతి తో కలిసి పార్థసారధి గారు పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇక అప్పటి జిల్లా మంత్రి శ్రీ ఎం.సత్యనారాణ రావు చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి ఫిలిం భవన్ ప్రారంభించాలని నిర్ణయించాం. శిలాఫలకం తో సహా అన్ని ఏర్పాట్లు చేసాం. అతిథులకు దాతలకు కార్యవర్గానికి ఇచ్చేందుకు మేమెంటో ల కోసం వరంగల్ వెళ్లాను అక్కడ దర్భశయనం నేనూ కలిసి వాటిని ఎంపిక చేసాం.

ప్రారంభోత్సవ రోజు రానే వచ్చింది. 2005, నవంబర్ 21 న వైభవంగా నిర్వహించాం. కఫిసో కున్న సొంత 35 ఎం.ఎం, 16 ఎం.ఎం. ప్రోజేక్తర్లతో పాటు ఎల్సీడీ ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మంత్రి ఎం.సత్యనారాయణ రావు గారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పార్థసారధి గారు ప్రొజెక్టర్  గదిని ప్రారంభించారు. ఆనాటి సభకు పార్థసారధి అధ్యక్తత వహించగా ముఖ్య అతిథి మంత్రి సత్యనారాయణ రావు  మాట్లాడుతూ మంచి సినిమాలతో భారతీయ సంప్రదాయాల్ని కాపాడుకోవాలన్నారు. అప్పటి నగర మేయర్ ది.శంకర్, నారదాసు లక్ష్మన రావు, ఎన్.శ్రీనివాస్, కోలా రామచంద్రా రెడ్డి, నేనూ మాట్లాడాం. సభలో సావనీర్ ను మంత్రి ఆవిష్కరించగా, నేను నిర్మించిన డాకుమెంటరీ ని పార్థసారధి విదుల చేసారు. అనంతరం కఫిసో సీనియర్ సభ్యుడు శ్రీ రేణికుంట రాములును కఫిసో ఘనంగా సత్కరించింది. మిత్రుడు టి.దామోదర స్వామి వ్యాఖ్యానంతో సాగిన కార్యక్రమంలో దాతలకు కార్యవర్గానికి జ్ఞాపికలనిచ్చి సత్కరించాం. చివరన ‘kafiso a saga of film lovers’ documentary film ప్రదర్శించాం.

అట్లా కరీంనగర్ ఫిలిం సొసైటీ  సొంత ఆడిటోరియం కల సాకారమయింది. ఆ రోజు కేవలం కరీంనగర్ లోనే కాదు మొత్తం ఉమ్మడి రాష్త్రం లో ఫిలిం క్లబ్స్ కి ఎంతో ఆనందకరమయిన  రోజుగా చరిత్రలో నిలిచి పోయింది.

మంచి కళాత్మక సినిమాల కోసం వాటి ప్రదర్శన, విశ్లేషణ కోసం ‘ఫిలిం భవన్’ తోడుగా నిలబడాలని నేను కన్న కల అట్లా వాస్తవ రూపం దాల్చింది. కేవలం ప్రదర్శనే కాకుండా నవ యువతీ యువకులకు సినిమా నిర్మాణ రంగం లో శిక్షణ ఇచ్చే పని కూడా చేపట్టాలని అనుకున్నాం. ఆ దిశలో కొన్ని సంవత్సరాలు జాతీయ స్థాయిలో షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రోత్సవాలు నిర్వహించాం, ఫిలిం మేకింగ్ లో శిక్షణ కూడా ఇచ్చాం. ఆ వివరాలతో మళ్ళీ కలుస్తాను…

ఇప్పటికి సెలవ్…

-వారాల ఆనంద్          

19 మార్చ్ 20 23                   

Posted on Updated on

49= యాదొంకీ బారాత్

++++++++++++++

కరీంనగర్ ఫిలిం సొసైటీ- మిత్రులు-ఉత్సవాలు

+++++++++++++++++++++

“నది ఒడ్డున సాయంకాలం నడక

వేడిని వదిలేసిన గాలేదో చుట్టుకుంటోంది

అలసట కాదు అజ్ఞానమేదో ఆవిరవుతున్నది”

సరిగ్గా నదిలాగే ‘జీవగడ్డ’ లో మిత్రుల్ని కలిసిన ప్రతి సాయంత్రం ఇదే జరిగేది. ఎదో కొత్త విషయం కొత్త సంఘటన దాని లోతు పాతులమీద చర్చ జరిగేది. ఎవరికి వాళ్ళు వారి ఉద్యోగాలూ పనుల్లో రోజంతా బిజీగా ఉన్నప్పటికీ ఆనాడు అందరికీ ఒక సామాజిక అవగాహన సోయి వుండేది. దాన్ని మరింత విస్తారం చేసుకోవాలనే తపనా వుండేది. కానీ ఆనాడు ఇవ్వాల్టి లాగా అవార్డుల గోల పురస్కారాల సందడి కనిపించేది కాదు బహుశ

“కిరీటాలూ బుజకీర్తులూ

కఠోర శబ్దాలు చేస్తాయి తప్ప

శ్రావ్య సంగీతాన్ని వినిపించవు” అన్న భావన ఆ రోజుల్లోనే మా అందరిలో అంతర్లీనంగా వుండేదేమో. ఎవరికీ డైలీ పేపర్లో పేరు రావాలనే తపనా వుండేది కాదు. రాస్తే కవితలో కథలో వ్యాసాలో రాయాలనే తపన వుండేది. ఒక్క గోపు లింగా రెడ్డికి మాత్రం పత్రికలలో కనబడలానే కోరిక వుండేది. అంతకు మించి పెద్ద స్వార్థం లేదాయనకు..పెద్దగా బావుకున్నదీ లేదు. అన్నింటినీ మించి ఏమన్నా అమనుకున్నా స్నేహం వదలేయలేని గొప్ప వ్యక్తిత్వం లింగా రెడ్డి ది.

ఆక్రమంలో జీవగడ్డతో ప్రయాణం సాగుతూ ఉండగానే మరో వైపు ఫిలిం సొసైటీ కార్యక్రామాలు ఉధృతంగా నిర్వహించాం. ఇంకో వైపు నెహ్రు యువ కేంద్ర కూడా మా కార్యక్రామాలకు వేదికగా నిల్చింది.

అప్పుడే ప్రముఖ వైద్యుడు ప్రగతిశీల భావాల తో వున్న డాక్టర్ కే.సత్యసాగర్ రావు తో పరిచయం ఏర్పడింది. చాలా గొప్ప వైద్యుడే కాదు అంతకంటే గొప్ప మనిషి ఆయన. మెడికల్ కాలేజీలో వున్నప్పుడు ఉద్యమ చైతన్యం తో వున్నవాడాయన. కరీంనగర్ లో ప్రముఖ సర్జన్ డాక్టర్ భూమ రెడ్డి గారి ఆసుపత్రిలో పని చేసేవాడు. ప్రతి సర్జరీలో సాగర్ రావు ప్రమేయం వుండేది. ‘సాగర్ రావు సార్ పొద్దున్న 7 గంటలకు ప్రశాంత్ నగర్ లో బయలేల్లి మూల మీద పాన్ షాప్ లో ఓ జర్దా పాన్ కట్టించుకుని దవడకు పెట్టి దావఖాన్లకు పోతే చాలు ఇక కోసుడే కోసుడే వేరే ఎ ముచ్చటా పట్టదు’ అనేవాడు మా దామోదర్. అంతటి దీక్ష గల వైద్యుడు ఆయన. ఆయన పరిచయం స్నేహంగా మారింది. అప్పుడు మా అమ్మకు, తర్వాతి కాలంలో మా కూతురు రేలకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు సాగర్ అందించిన సహకారం ధైర్యం ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు ఆయన మామధ్య లేకపోవడం పెద్ద వెలితి. సాగర్ రావు బంధువు కంటి వైద్యుడు డాక్టర్ సురేష్ చందర్ రావు కూడా అప్పుడు మాతో సన్నిహితంగా వుండే వాడు.తర్వాత సిద్దిపేట వెళ్ళాడు.

ఇక ఆ కాలంలో మాకు సన్నిహితంగా వచ్చిన వైద్యులు మరో ఇద్దరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ప్రమీల. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వచ్చి ‘సుజాతా నర్సింగ్ హోమ్’ ప్రారంభించారు. అప్పటికే వారిద్దరూ నారదాసు లక్ష్మన్ రావుకు, పెండ్యాల సంతోష్ కూ, మనిహర్ విజ్జన్న ఇట్లా అందరికీ పరిచయస్తులే. వారి ఆసుపత్రి పేదల కోసం చాలా చేసింది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి,డాక్టర్ ప్రమీలలు ఇద్దరూ అందరితో స్నేహంగా వుండేవాళ్ళు. కే.ఎన్.చారి కూతురు అక్కడే పుట్టింది. చారీకి నాకూ చాలా ఇష్టమయిన పేరు “రేల” అందుకే తన కూతురు పేరు రేలా అని మొదట పెట్టాడు. తర్వాత మా కూతురుకూ రేల అనే పెట్టుకున్నాం. పెద్ద రేల చిన్న రేల. పెద్ద రేల పుట్టినప్పుడు మా పాత మిత్రుడు ప్రముఖ కవీ గుడిహాళం రఘునాధం, జర్నలిస్ట్ శ్రీ కే.శ్రీనివాస్(ప్రస్తుత ఆంధ్ర జ్యోతి సంపాదకుడు) చూడ్డానికి వచ్చారు. గుడిహాళం తో నాకు స్నేహం ఉస్మానియా నుండే. కవిగా తను బాగా ఇష్టం.

****

తేదీలు చెప్పలేను కానీ దాదాపుగా అప్పుడే జిల్లాలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. వాటితో మొత్తం జిల్లాలో పరిస్థితే మారిపోయింది. అప్పుదు నేను గోదావరిఖని కాలేజీలో పని చేస్తున్నాను. పెద్దపల్లి లో డీఎస్పీ బుచ్చిరెడ్డి ని ఒక రాత్రి కాల్చేశారు. దాంతో మొత్తం పోలీసు అధికార వ్యవస్థ షేక్ అయిపొయింది. ఇక ఏముంది దాని ప్రతిగా కరీంనగర్లో గుర్తు తెలీని వ్యక్తులు రాత్రంతా పౌర హక్కుల గురించి మాట్లాడే న్యాయవాదుల ఇండ్ల చుట్టూ తిరిగారు. తర్వాత ఏ ఆర్ద రాత్రో కరీంనగర్ మానేర్ కు అవతల వున్న అలుగునూరు లోని జాప లక్ష్మా రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆయన్ను బయటకు పిల్చిన ఆ గుర్హు తెలీని వ్యక్తులు దారుణంగా కాల్చేశారు. ఇదంతా మా అందరికీ మర్నాడు తెలిసింది. దిన పత్రికల్లో అనేక వార్తలు ,ఖండనలూ వచ్చాయి. అంతటా తీవ్ర ఉద్రిక్తత. తర్వాత ఏవో విచారణలూ అవీ అన్నారు. క్రమంగా పరిస్థితి మామూలు గా మారింది. స్పష్టా స్పష్ట మయిన ఉద్రిక్తత ఉద్వేగం కరీంనగర్ గాల్లో తిరుగాడింది.

——

ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ పక్షాన పోరండ్ల లో గ్రామీణ చలన చిత్రోత్సవం తర్వాత అప్పటి కలెక్టర్ పరమహంస గారికి మా డీ ఎన్ నరసింహా రావుగారికి సాన్నిహిత్యం పెరిగింది. ఆ ఏడు నరసింహా రావు, గోపు లింగా రెడ్డి లు మా అధ్యక్ష కార్యదర్శులు. ఇక జిల్లా పరిషద్ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి గారి తో శ్రీనివాస్ కు మంచి సాన్నిహిత్యం వుండేది. అప్పుడే ఒక ఆలోచన పుట్టింది. కే.ఎస్.శర్మ కలెక్టర్ గా వున్నప్పుడు కరీంనగర్ వావిలాల పల్లి లో హాలు నిర్మాణం కోసం స్థలం ఇచ్చారు. కానీ అప్పటికి అది ఊరుకు చాలా దూరం. కలెక్టరేట్ కు దగ్గరలో స్థలం ఇస్తే చిన్న హాలు కట్టవచ్చని అనుకున్నాం. ఆవిషయాన్ని పరమహంస గారితో చెప్పగానే మీరు పాత స్థలం సరెండర్ చేస్తే కొత్తది ఇస్తామన్నారు. అట్లా ఇచ్చిన స్థలం లో భవనం కోసం 86 మొదట్లోనే శంకుస్థాపన కూడా వేసాము. అప్పుడే భవన నిర్మాణం అయ్యేదే కానీ సుతారీ కంట్రాక్టర్ ల విషయం లో వివాద మొచ్చి ఆలస్యమయింది. ఇంతలో ఆ స్థలం ఎప్పుడో ‘ఏక్ సాల్’ పట్టా కింద తమకు ఇచ్చారని కళా రావు అనే ఒకడు అభ్యంతరం పెట్టాడు. అప్పుడు నారదాసు లక్ష్మన రావు వాడితో తీవ్ర వాదానికి ఒక రకంగా యుద్ధానికీ దిగాదు. అక్కడినుంచి ఉరికించినంత పని చేసాడు. న్యాయవాదిగా జీవితం ఆరంభిస్తున్న కాలమది ఇంకేముంది కోర్టులో చూసుకుందాం అనే దాకా వచ్చింది. కళా రావు జిల్లా యంత్రాంగం మీద కేసు వేసాడు. సివిల్ కేసు ఇంకేముంది ఫిలిం సొసైటీ భవనం తో పాటు అక్కడ నిర్మించ తలపెట్టిన అన్ని పనులూ నిలిచి పోయాయి.

అదట్లా వుంటే కఫిసో కు నెహ్రు యువక కేంద్ర కు వున్న అనుబందం గురించి చెప్పుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. యువజన సర్వీసుల శాఖ కింద పని చేసేది. కరీంనగర్ లో యువక కేంద్ర సమన్వయ కర్తగా (కో ఆర్డినేటర్) శ్రీ వి.రామారావు పని చేసేవారు. చాలా మంచి మనిషి. నిజాయితీ గల వాడు. దీక్షతో యువతకు ఏది చేయాలనే తపన తో ఉండేవాడు. మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వేడ్నెస్ డే క్లబ్ అని యువకులకు ఒక క్లబ్ ను ఏర్పాటు చేసి ఉపన్యాస వ్యాసరచన, వర్తమాన అంశాల మీద చర్చలు పోటీలు పెట్టేవాడు. రామారావు గారికి జిల్లాదికారిగా కలెక్టర్ లతో మంచి సాన్నిహిత్యం వుండేది . కలెక్టర్లు మా కఫిసో కు గౌరవ అధ్యక్షులుగా వుండేవాళ్ళు కనుక రామారావు కూడా కఫిసో అన్ని కార్యక్రమాలకూ గొప్ప సహకారం అందించేవాడు. జిల్లా యంత్రాంగంలో ఆయన మాకో పెద్ద అండ. ఆయన ప్రేరణ తో జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాటయ్యాయి. అందులో పూడూరు లో రాంరెడ్డిగారి లాంటి వాళ్ళ కృషి చాలా ప్రశంశనీయమయింది. అదే ఉత్సాహంతో మా దామోదర్ రెడ్డి కూడా చొరవ చూపించి స్వచ్చందంగా ౩ కిలోమీటర్ల రోడ్డు వేసారు.

అంతే కాదు బస్ స్టాండ్ కు ఎదురుగా వున్న నెహ్రు యువక కేంద్ర హాలు కఫిసో సమావేశాలకూ, సేమినార్లకూ, తర్వాత సాహిత్య సంస్థలకు వేదికగా నిలిచింది. అప్పుడే కఫిసో ‘న్యు ఇండియన్ సినిమా’ అంశం మీద నిర్వహించిన సెమినార్ లో అప్పటికే రంగుల కల తదితర సినిమాలతో సమాంతర తెలుగు సినిమాకు చిరునామా గా వున్న శ్రీ బి.నరసింగ రావు ప్రధాన అతిథిగా వచ్చారు. అప్పటికి ‘భారతీయ నవ్య సినిమా’ స్థితి స్థాయి లను భావ స్పోరకంగా చెప్పారు. It was a thought provoking session. తర్వాత కఫిసో నిర్వహించిన జాతీయ సమగ్రతా చలన చిత్రోత్సవం, సెమినార్ లో ప్రముఖ సినీ విమర్శకుడు గుడిపూడి శ్రీహరి పాల్గొన్నారు. తర్వాత సినిమాల్లో కళాదర్శకత్వం (‘ఆర్ట్ డైరెక్షన్’) అన్న అంశం మీద నిర్వహించిన సెమినార్ లో చంద్ర పాల్గొన్నారు. నేనేమీ మాట్లాడను అంటూనే సినిమా కళ అన్న అంశం మీద భిన్నమయిన కోణం లో మాట్లాడారు. నిజమే ఆయనది ప్రసంగం కాదు ఆత్మీయ సంభాషనే. తర్వాత నెహ్రు యువక కేండ్ర సహకారంతో నిర్వహించిన యూత్ ఫిలిం ఫెస్టివల్ లో దేవిప్రియ ప్రధాన ప్రసంగం చేసారు. ఇట్లా మొత్తం మీద కఫిసో సినిమాకు సంబంధించి అనేక అంశాల మీద ఫిలిం ఫెస్టివల్స్, సేమినార్స్ నిర్వహిస్తూ వచ్చింది.

అప్పుడు నా వ్యక్తిగత జీవితంలో అమ్మ అనారోగ్యం తీవ్రంగా ప్రభావితం చేసింది. అంతుపట్టని స్థితి. డాక్టర్ లక్ష్మినారాయన మందులతో ఒక రోజు మెరుగు మరో రోజు కష్టం గా సాగిందా కాలం. ఇంకో వైపు నేను రోజూ గోదావరిఖని కాలేజీకి వెళ్లి రావడం. అమ్మకు బాగా లేదు కనుక పెళ్లి చేసుకొమ్మని వొత్తిడి పెరిగింది. వీటన్నింటి నడుమా ఊపిరాడని స్థితి.

ఇంతలో కొంచెం ముందూ వెనకా మా సమూహం భిన్న పాయల వైపు మరలడం ఆరంభమయింది. నరేడ్ల శ్రీనివాస్ కు బాంకు లో ప్రమోషన్ వచ్చి గుజరాత్ కు బదిలీ అయింది. పెండ్యాల సంతోష్ కుమార్ కు రెసిడెన్సియల్ స్కూలులో పీజీ టీచర్ గా వుద్యోగం వచ్చింది. లక్ష్మన్ రావు దామోదర్ లు న్యాయవాద పట్టా పుచ్చుకుని భూ సేకరణ కేసులు, కోర్టులూ అంటూ బిజీ అయిపోయారు. తర్వాత కొంత కాలానికి మనోహర్ తన పీ హెచ్ డీ కోసం డిల్లీ జవహార్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం వెళ్లి పోయాడు.

మిగతా వచ్చే వారం….

-వారాల ఆనంద్

10 JULY 2022

Posted on

యాదొంకి బారాత్ (సంచిక -1)

+++++++++++++++++++++

సామాజిక పోరాటాలూ- ఉన్నత చదువులు- యునివర్సిటీలో చేరిక

************

నాకు తెలిసి నేను మధ్య తరగతి జీవిని. పట్టణ వాసన వున్న వాణ్ని. చాలా వాటిని ప్రేమించాను, అభిమానించాను, ఆరాధించాను, ప్రేరణ పొందాను. కానీ అందులోకి దిగలేదు కాళ్ళకు మట్టి అంటలేదు, ఒంటికి సురుకూ అంటలేదు. కానీ నేను నా విశ్వాసాల్ని, ప్రేమల్ని అభిమానాన్ని అట్లే ఉంచుకున్నాను. మారలేదు. నమ్మిన దానికి ఎప్పుడూ వ్యతిరేకమయితే కాలేదు. శత్రువుగానయితే మారలేదు. బహుశా నేను నమ్మింది మనసా వాచా అనుసరించింది ఇదే. పేర్లెందుకు గానీ కొందరు నాకు మిత్రులే ఒకప్పుడు ఏమి చెప్పారు? ఎట్లా వున్నారు? ఎంతమందిని చైతన్య పరిచారు? ఇప్పుడు ఎక్కడ వున్నారు? ఏం చేస్తున్నారు? చూస్తూ వుంటే ఆలోచిస్తే చాలా బాధగా వుంటుంది. సరే కాలం గడిచిన కొద్దీ వయసు పెరిగిన కొద్దీ మార్పు సహజమే అనుకున్నా.. వారిలో కొందరు ఇప్పటికీ గత చరిత్ర గురించే చెప్పుకోవడం..దాని వెలుగుననే చెలామనియ్యేందుకు ప్రయత్నించడం చూస్తే చాల కష్టం కలుగుతుంది.చూస్తూ వుండడం తప్ప ఏం చేయగలం… *************** నేను డిగ్రీ చదువుతున్న కాలంలోనూ తర్వాత ఖాళీగా వున్న ఏడాదిలోనూ ఉస్మానియా కాంపస్ లో చేరిన కాలంలోనూ సామాజికంగా అనేకమార్పులు జరిగాయి. 69 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 1975లో ఇందిరా గాంధీ పాలనలో దేశంలో ఎమర్జెన్సీ దాని ప్రభావాలూ చూసాం. కాలేజీల్లో, యునివర్సిటీల్లో కదలిక మొదలైంది. ఆలోచన ఆరంభమయింది. ఆందోళనా శురూ అయింది. అంతే కాదు అప్పటిదాకా కల్లా కపటం తెలీని తెలంగాణా పల్లెలు క్రమంగా చైతన్యం సంతరించుకోవడం ఆరంభించాయి. ఉత్తర తెలంగాణా అందులో ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా పల్లెలు అప్పటిదాకా వున్న పల్లెల్లా లేవు. పచ్చగా లేవు. అప్పటిదాకా ఆవి నిజాం కాలంలో దేశ్ ముఖ్ లు, జమీందార్లు తర్వాత దొరల పాలన దౌర్జన్యాలను చవిచూసాయి. తర్వాత దొరల ఆగడాలను ప్రశ్నించే వారిని హింసించే వారు. గ్రామ పెద్దలు పంచాయితీలు నిర్వహించి ఇష్టానుసారం తీర్పులు చెప్పి దడువతులు(డిపాజిట్లు) కూడా తిరిగి ఇచ్చేవారు కాదు. తీర్పులు ఎట్లున్నా అడిగే స్థితి వుండేది కాదు. వెట్టి చాకిరీ సర్వ సాధారణం. ఇట్లా అనేక అష్ట కష్టాలు పడుతున్న పల్లెల్లో క్రమంగా చలనం మొదలయింది అప్పుడే. 75 ఎమర్జెన్సీ కి ముందే ప్రారంభమయినప్పటికీ అత్యవసర చట్టం అమలు లో వున్న కాలంలో రహస్యంగా నడిచిన కార్యకలాపాలు ఎమర్జెన్సీ ఎత్తేసాక ఉద్రుతంయ్యాయి. మా కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా రెండు గ్రామాలు ప్రధాన వేదిక లయ్యాయి. అవి సిరిసిల్లా తాలూకా లోని నిమ్మపల్లి, జగిత్యాల తాలూకా లోని మద్దునూరు. ఆ గ్రామాల్లో ఏర్పడ్డ రైతుకూలీ సంఘాలు దేశం లోనే సంచలనం సృష్టించాయి. పట్టణాల్లోనూ నగరాల్లోనూ వున్న యువకులు విద్యార్థులు అనేక మంది “గ్రామాలకు తరలండి” ( GO TO VILLAGE CAMPAIGN) అన్న పిలుపు నందుకుని పలు గ్రామాలకు చేరారు. పాలేర్ల జేతాలు పెంచాలని, వ్యవసాయ కూలీ రెట్లు పెంచాలని అంతా ఐకమత్యంగా పోరాటం ఆరంభించారు. జగిత్యాల ప్రాంత ఉద్యమం 9 సెప్టెంబర్ 1978 రోజు నాటికి “జైత్రయాత్ర” స్థాయికి చేరింది. జగిత్యాల పట్టణంలో పాత బస్స్టాండ్ పక్కనే వున్న డిగ్రీ కాలేజీ మైదానంలో రైతుకూలీ సంఘం నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఊరేగింపు నిర్వహించారు. జగిత్యాల జైత్రయాత్ర పేర ప్రసిద్ది పొందిన ఆనాటి కార్యక్రమం మొత్తం నక్సలైట్ ఉద్యమానికి గొప్ప ప్రేరణగా నిలిచింది. ఇవన్నీవింటూ వాటి గురించి తెలుసుకుంటూ వుండేవాళ్ళం. జైత్త్రయాత్ర ప్రేరణ తో అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవులు ఎదిగారు. 78- 79 ప్రాంతం లోనే నేనూ మా మిత్రుడు డి.వెంకటేశ్వర్ రావు కలిసి కవిత్వం మీద అభిమానంతో జగిత్యాల వెళ్లి అలిశెట్టిని తన పూర్ణిమా స్టూడియో లో కలిసాం. కలిసింది మొదటి సారే అయినా ఎంతో ఆప్యాయంగా స్నేహంగా మాట్లాడుకున్నాం. తర్వాత మా స్నేహం చాలా ఏళ్ళపాటు సాగింది. కలిసి కవిత్వం రాసాం. తర్వాతి కాలంలో జింబో, వజ్జల, పి.ఎస్.రవీంద్ర, నేనూ, అలిశెట్టి కలిసి “లయ” కవితా సంకలనం వేసాము. ఇదిట్లా వుంటే ఎమర్జెన్సీ రోజుల్లో సిరిసిల్లా కు చెందిన కొందరు కవులు ఇందిరా గాంధీ 20 సూత్రాల పథకాన్ని కీర్తిస్తూ రాసారు. వాటితో సంకలమూ ముద్రించారు. దాని పై చాలా విమర్శలు వచ్చాయి. అది వేరే విషయం. ****** వేములవాడలో మరో మరపురాని సంఘటన అప్పటి గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ పర్యటన. వేములవాడ గొప్ప శైవ క్షేత్రం కనుక మొదటినుంచీ ప్రముఖుల రాక పోకలు ఎక్కువే. అందులో భాగంగానే 78లో ఒక రోజు అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ పర్యటన ఏర్పాటు అయింది. వేములవాడలో సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయి పోలీసు స్టేషన్ ఉండేది. సిరిసిల్లా సర్కిల్ స్థాయి, జగిత్యాల డివిజన్(డీ.ఎస్.పీ) స్థాయిలో వుండేది. గవర్నర్ పర్యటన కనుక భారీగానే బందోబస్తు ఏర్పాటు అయింది. మేమంతా ఎప్పటిలాగే ఉదయమే గుడి ముందుకు వెళ్లి తర్వాత వెంగయ్యను కలిసి హోటల్లో టీ తాగే కార్యక్రమంలో వున్నాం. గవర్నర్ ను వీలయితే చూడాలనీ అనుకున్నాం. ఇంకో వైపు గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రైతు కూలీ సంఘం నేతృత్వంలో చలపతి రావు తదితరులు వందలమంది రైతులతో సహా గుడి ముందుకు చేరుకున్నారు. గవర్నర్ దైవదర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని ‘బేటా ఇదర్ ఆవో’ అని నాయకుణ్ణి పిలిచి వినతి పత్రం తీసుకుంది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. అంతా ప్రేక్షకుల్లా చూస్తున్న మేమంతా ఇళ్ళకు బయలుదేరాం. ఇట్లా ఇండ్లకు చేరామో లేదో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏమయిందో స్పష్టంగా తెలీదు కాని గవర్న వెళ్లి పోగానే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు కనిపించిన వాళ్ళను కనిపించినట్టు దుకాణాదార్లతో సహా వీరు వారని లేకుండా కనించిన వాణ్ని కనిపించినట్టు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. స్టూడియో లో వున్న మా మిత్రుడు వెంగయ్యను కూడా అరెస్ట్ చేసారు. మేమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. రెండు నిముషాలు గుడి దగ్గర ఆగి వుంటే మా పరిస్థితీ అంతే. దెబ్బలుతిన్నవాళ్ళు తీవ్రంగా తిన్నారు. స్టేషన్ లో పెట్టిన వాళ్ళను మర్నాటికి గానీ విడిచిపెట్టలేదు. అట్లా గవర్నర్ పర్యటన బాధాకరమయిన జ్ఞాపకంగా మిగిలిపోయింది.++++++++++ ఈ నేపధ్యం లో నేను హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం లో లైబ్రరీ సైన్స్ లో చేరాను. అడ్మిషన్ పూర్తి కాగానే అప్పటికే హైదరాబాద్లో మోజం జాహీ మార్కెట్ ప్రాంతంలో రూము తీసుకుని ఉంటున్న బావ మంగారి శివప్రసాద్ రూముకుచేరుకున్నాను. తను అప్పుడు మ్మసాబ్ టాంక్ పాలీటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. జింబో కూడా అప్పటికే కొంత కాలంగా అక్కడ వున్నాడు. పక్క రూములో విజయకుమార్, అశోక్ కుమార్ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్హ్తులు వుండేవారు. తర్వాత అంతా మంచి స్నేహితులమయ్యాం. ఉస్మానియా లో హాస్టల్ వసతి ఏర్పడే దాకా అక్కడే వున్నాం. జింబోకి ఉస్మానియా లా కాలేజీలో సీటు వచ్చింది. తనకు వెంటనే ‘ఈ’ హాస్టల్ లో వసతి ఏర్పాటయింది. నాకే ఆర్ట్స్ కాలేజీ కనుక ఎ హాస్టల్ లో రూముల్లేక పోయాయి. దాంతో వుండడానికి వసతి లేదు. మెస్ ఇచ్చారు. బాగా ఇబ్బందిగా వుండేది. అప్పుడు జింబో వాళ్ళ రూము 28 లోనే గెస్ట్ గా వున్నాను. నేనూ జింబో, కరీంనగర్ కే చెందిన నలిమెల వీరేశం, భోన్గిర్ కి చెందిన దామోదర్ రెడ్డిలము రూములో వుండేవాళ్ళం. లైబ్రరీ సైన్స్ క్లాసులు కూడా ఆర్ట్స్ కాలేజీలో రూముల్లేక ‘డి’ హాస్టల్ లో వున్న చివరి గదుల్లో నడిచేవి. చాలా అనామకంగా అనిపించేది. పేరుకు యునివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులం కానీ ఎక్కడో షెడ్డుల్లో మా క్లాసులు, ఘోరంగా వుండేది. కానీ ఏమి చేయగలం. డిపాట్మెంట్ లో ఆచార్యులుగా ఏ.ఏ.ఎన్.రాజు, వేణుగోపాల్, ఎం. లక్ష్మన్ రావులు క్లాసులు చెప్పే వారు. రాజు సర్ డిపార్ట్మెంట్ హెడ్, వేణుగోపాల్ సర్ కొంత సీరియస్ గా వుండే వాడు. లక్ష్మణ్ రావు సర్ సరదాగా స్టూడెంట్స్ తో స్నేహంగా వుండేవారు. సబ్జెక్ట్ అంతా కొత్త. క్లాసిఫికేషన్, కాటలాగింగ్, బిబిలియో గ్రఫీ, ఇట్లా వుండేది. మొదట్లో అంతా గందరగోళం. తర్వాత సర్దుకుంది. క్లాసులో ముప్పై మంది విద్యార్థులం. ముగ్గురు అమ్మాయిలు హన్నా సునీత, లక్ష్మిశకుంతల,మరొకరు. మిగతా అంతా అబ్బాయిలమే. ఇంతలో కాలేజీ ఎన్నికలొచ్చాయి. యునివర్సిటీ మొత్తం విద్యార్తి రాజకీయాలతో అట్టుడికి పోతూ వుండేది. కాంపస్ లోని వివిధ కాలేజీలు వివిధ విద్యార్తి సంఘాలకు ఆలవాలం గా ఉండేవి. ఇంజినీరింగ్ కాలేజీ మరియు ఆర్ట్స్ కాలేజీ లు పీ.డీ. ఎస్,యు. కు, సైన్స్ కాలేజీ ఆర్.ఎస్.యు. కు లా కాలేజీ ఏబీవీపీ లకు పెట్టని కోటలా ఉండేవి. మా కాలేజే ఎన్నికల్లో పీడీఎస్యు మరియు ఇతర లెఫ్ట్ విద్యా సంఘాలు కలిసి పానెల్ ప్రకటించాయి. అధ్యక్ష స్థానానికి పీ.డీ.ఎస్.యు కు చెందిన తులా రాజేంద్ర కుమార్, కార్యదర్శి స్థానానికి లక్ష్మీకాంత్ రావు నిలబడ్డారు. ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో మా క్లాస్ నుండి నూరుశాతం రాజేంద్ర కుమార్ పానెల్ కి మద్దతుగా వున్నాం. క్లాసులో మెజారిటీ లెఫ్ట్ భావజాల మద్దతుదారులు ఉండడం ఒక కారణ మయితే మరొకటి మా క్లాసులని ఆర్ట్స్ కాలేజీ భవనం లోకి మార్చాలనే డిమాండ్ మరొకటి. అట్లా రాజేంద్ర కుమార్ పానెల్ ఘన విజయం సాధించడంలో మేము ప్రధాన పాత్ర పోషించాం. ఎన్నికల ఫలితాల తర్వాత డిపార్ట్మెంట్ ను ఆర్ట్స్ కాలేజీకి మార్చారు. క్లాసులు నడిచిన ‘డి’ హాస్టల్ రూముల్ని మాకు ఉండేందుకు కేటాయించారు. నేను సీతారాములు ఒక రూములోకి చేరాం. ఇక క్లాసులో కరీంనగర్ జిల్లాకే చెందినా గోపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, డి,మనోహర్, వరంగల్ కు చెందిన సంపత్ కుమార్ రావు, రవీంద్రా చారి, ఉమాశంకర్ తదితరులం చాలా క్లోజ్ గా వుండేవాళ్ళం. వీళ్ళల్లో చాలా మంది అప్పటికే పీజీ కోర్సులు పూర్తి చేసి వచ్చినవారు. నర్సింగ్ రావు ఎం.ఎస్సీ, మనోహర్ ఎం.ఏ ఇంగ్లిష్,,, ఇక ఉమాశంకర్ లాంటి వాళ్ళు ఇన్ సర్విస్ లో వున్నవాళ్ళు. అయితే అందరమూ ఎంతో స్నేహంగా ప్రేమగా వుండేవాళ్ళం. ఇక మనోహర్ తో పరిచయమయిన మరో మిత్రుడు డి.దామోదర్ రావు ఇప్పుడు నమస్తే తెలంగాణా దిన పత్రిక ఎం.డీ.గా వున్నాడు. ఇక గోపాల్ రెడ్డి హిస్టరీ అధ్యాపకుడిగా చేరి కొన్నేళ్ళు నాతో పాటు ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో పని చేసాడు. సి.హెచ్.నరసింగ రావు కరీంనగర్ లో ఏర్పాటయిన పీజీ సెంటర్ లో లైబ్రేరియన్ చేరి చాలా కాలం పని చేసాడు. మనోహర్ ఇంగ్లీషు అధ్యాపకుడాయి వరంగల్ లో స్థిరపడ్డాడు. ఉమాశంకర్ వరంగల్ ప్రాంతీయ గ్రంధాలయంలో చాలా కాలం చీఫ్ గా పనిచేసాడు. సంపత్ నేను మాత్రం మొదట వివిధ జూనియర్ కాలేజీల్లో పనిచేసి తర్వాత డిగ్రీ కాలేజీలో సర్విస్ చేసాం. దురదృష్టం ఏమంటే గోపాల్ రెడ్డి, ఉమాశంకర్ లు అనారోగ్యం తోనూ, నర్సింగ్ రావు దొంగల దాడిలోనూ చనిపోయి దూరమయ్యారు. ………. ఇక డీ హాస్టల్ లో వుండే కాలంలోనే జింబో క్లాస్ మేట్ అయిన నందిగం కృష్ణారావు పరిచయం గొప్ప అనుభవం. ప్రతిభావంతుడయిన గొప్ప రచయిత నందిగం కృష్ణా రావు చాల క్లోస్ గా ఉండేవాడు. అప్పటినుంచీ వున్న స్నేహం ఇప్పటికీ అంతే ఆప్యాయంగా సాగుగుతున్నది. ఆయన వచన రచనా శైలి ఇప్పటికీ నాకు ఎంతో ఇష్టం. అంత మంచి వ్యంగ్యాత్మక వచనం రాసే వాళ్ళు మాలో చాలా అరుదు. ……… అదే సమయంలో సికిందరాబాద్ ఎస్పీ కాలేజీలో డిగ్రీలో చదువుతున్న వేములవాడ మిత్రుడు సాంబశివుడు నా కెంతో దగ్గరయ్యాడు. తాను ఆర్ట్స్ కాలేజీ వెనకాల రైల్వే స్టేషన్ అవతల బౌద్ధ నగర్ లో వుండే తమ మేనమామ ఇంట్లో వుండేవాడు. ప్రతి రెండు రోజులకొక సారి ఇద్దరమూ కాంపస్ లోనో, వాళ్ళ ఇంటిదగ్గారో కలిసేవాళ్ళం. వాళ్ళ ఇంటి దగ్గరయితే హోటల్ షోలా మా ఆడ్డా. లేకుంటే సీతాఫల్ మండి లో వున్న మరి ఇరానీ హోటల్ లో చాయ్ ఆడ్డా. ఆ హోటల్ లో మనం కోరిన పాటల్ని డబ్బులు ఇస్తే వేసేవాళ్ళు. అట్లా పాటలు వింటూ ఏవో చర్చలు చేస్తూ వుండేవాళ్ళం. అదే టైం లో సాంబశివుడు బావమరిది పూర్ణచందర్ పరిచయం కూడా. అట్లా కాంపస్ లో లైబ్రరీ సైన్స్ కాలంలో సాంబశివుడు నేను ఎంతో దగ్గరయ్యాం. ఇంకా అదే సమయంలో సాహితీ మిత్రులు నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మరీ విజయరావు, అంబటి సురేందర్ రాజు, గుడిహాళం రఘునాధం ఇట్లా అనేకమందితో పరిచయాలూ స్నేహాలూ కుదిరాయి… ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.. ఇప్పటికి సెలవ్.

-వారాల ఆనంద్

https://sanchika.com/yaadon-ki-baaraat-1/

యాదోంకి బారాత్ -19 =  కరీంనగర్- ఎస్.ఆర్.ఆర్.కాలేజీ-డిగ్రీ చదువులు 

Posted on

 

 కరీంనగర్- ఎస్.ఆర్.ఆర్.కాలేజీ-డిగ్రీ చదువులు

++++++++++++

1974 లో ఎస్.ఆర్.ఆర్.కాలేజీ లో డిగ్రీ లో చేరింతర్వాత చదువులో ఓ స్తబ్దత సృజనలో కొత్త దారులు ఏర్పడ్డాయి. చదువు విషయం లో ఓకే లక్ష్యం ఒక ధ్యేయం లేని కాలమది. ఆ కాలంలో డిగ్రీలో చేరిన తర్వాత రెండేళ్ళకి ‘పార్ట్ వన్’ అని  First language ఇంగ్లీషు, Second  language  తెలుగో హిందీనో ఏదయితే అది రెండో భాష లకు పరీక్షలు ఉండేవి, తర్వాత  మూడేళ్ళకి ‘పార్ట్ టూ’ అని అసలు డిగ్రీ ఫైనల్ పరీక్షలు. పార్ట్ 2 లో అన్ని సబ్జేక్టులకూ ఒక్కో దానికి మూడేసి పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహించేవారు. అది ఏమి ప్రయోగమో కానీ డిగ్రీ చదువంటే మూడేళ్ళూ ఆడుతూ పాడుతూ సాగడమే.. పరీక్షల భయం లేదు.. పాస్ ఫెయిల్ లేదు. అంతా బలాదూర్. క్లాసులు ఉండేవి కాని ఒక చాప్టర్ తర్వాత మరొకటి అట్లా ముగుస్తూ ఉండేవి. Assessment or Assignments అనేవే లేవు . కనీసం వెనక్కి చూడకుండా చదువులు కాలం కూడా సాగి పోయేవి. నా లాంటి వాడికి మెడికల్ కల ముగిసిన తర్వాత మరింత ఉదాసీనత అనుముకునేది. నా మట్టుకు నాకయితే తెలుగు మీడియం లో బీఎస్సీ కావడం తో ‘ ఆకసేరుకాలు ’, ‘ సకశేరుకాలు ’, కర్బన రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం లాంటి మాటలతో ఏమీ తోచేది కాదు. మీది తెలుగు మీడియం తప్పదు తెలుగులోనే రాయాల్సి వుంటుంది అనేవాళ్ళు సార్లు. మూడేళ్ళ తర్వాత పరీక్షల నాటికి చూద్దాం అన్నట్టు సాగేది చదువు. జువాలజీ లాబ్ లో ‘స్కొలియోడాన్’, కెమిస్ట్రీ లాబ్ లో అమ్మోనియా కంపు చిత్రంగా వుండేది. అయినా ఎప్పుడూ క్లాసులు ఎగ్గొట్టడం కానీ నిర్లక్ష్యంగా కానీ లేక పోవడంతో అన్ని అకాడెమిక్ పరీక్షల్లో ఎక్సెలెంట్ ఫలితాలు కాకున్నా ఫెయిల్ అన్నది లేదు.. కొంత మెరుగయిన ఫలితాలే వచ్చాయి. అట్లా జరగడానికి ప్రధాన కారణం నా చేతి రాత మాట లాగే బాగా లేకపోవడం. మరో కారణం వృక్ష, జంతు శాస్త్రాల్లో బొమ్మలు సరిగ్గా వేయలేక పోవడం. చిన్నప్పుడు నాన్న నా చేతి రాత పై చాల దృష్టి పెట్టారు. చూచి రాతలు రాయించారు. తెలుగుకు రెండు లైన్ల కాపీలూ, ఇంగ్లీషుకు నాలుగు లైన్ల కాపీలు తెచ్చి రాయించే వారు. రాయక పోతే చేతి మట్టలు పగులగొట్టారు. సున్నా చుట్టడడం, సరళ రేఖ గీయడం చేయరా రాత మెరుగవుతుందని చెప్పీ చెప్పీ విసుగొచ్చి వదిలేసాడు. దాని ఫలితమే వంకర రాత. ఆలోచనలు, సబ్జెక్ట్ లు సరిగ్గానే వున్నా ఆకట్టుకునే చేతి రాత లేకపోవడం పెద్ద ఆటంకమే అయింది, మా మిత్రుడు దామోదర్ రాతా అంతంత మాత్రంగానే ఉండేది. ‘ఆ ఏముంది భయి చాలా మంది డాక్టర్ల రాతే బాగుండదు.. వాళ్ళు పెళ్ళానికి ఉత్తరం రాస్తే మెడికల్ షాప్ కెళ్ళి చదివించు కోవాలని’ జోకులు వేసేవాడు. మా వెంకటెష్ గాడి రాత చాలా అందంగా వుండేది. స్కూలు కాలం నుంచి నోట్స్ రికార్డ్స్ కూడా బాగా రాసేవాడు. కాని ఏమి లాభం వార్షిక పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చేవి. స్కూల్లో తెలుగు సార్ అనేవాడు.. “చేతి రాత దేముందిరా తల రాత బాగుండాలి అని”.

   ఇక బొమ్మల విషయానికి వస్తే రికార్డ్స్ లో వెంకటేష్ డ్రాయింగ్స్ బాగా వేసేవాడు. మనమే అంతంత మాత్రం. ఒక్కోసారి రెండు వైపులా పుస్తకాలు పెట్టి అడ్డంగా అమర్చి వెంకట్ గాడి రికార్డ్ షీట్స్ కాపీ కొట్టిన సందర్భం కూడా వుంది. ఏమిటో హై స్కూల్ సైన్సు నుండి డిగ్రీ సైన్సు దాకా అట్లా గడిచింది. గుండ్రటి అక్షరాలూ అందమయిన డ్రాయింగ్స్ లేకుండానే Graduation  ఘనంగా ముగిసింది.

++++        

స్కూలు కాలం నుంచి సిలబస్ చదువులే కాకుండా కథలకు చందమామ, బాలమిత్ర లు, కొంచెం పెద్దయ్యాక డిటేక్టివ్ నవలలకు క్లాక్ టవర్ దగ్గరలో వున్న శ్రీ కృష్ణ బుక్ స్టాల్ మీద ఆధార పడేవాళ్ళం. రొజువారీ కిరాయకు (రెంట్)కు ఇచ్చేవారు. ఇక దిన పత్రికలు స్కూలు దాటే వరకు అంతగా పరిచయం లేదు. ఎందుకంటే కరీంనగర్ కు దిన పత్రికలు రోజూ ఏ పగటీలికో వచ్చేవి. విజయవాడనుంచి రైలులో వరంగల్ కు చేరి బస్సులో మా వూరుకు   వచ్చేసరికి మధ్యాహ్నం దాటేది. ఇక 1972లో మా పదవ తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటించిన రోజు బస్ స్టాండు లో ఉదయం నుంచి వేచి వున్న రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నవ్వువస్తుంది. ఓ పక్క ఫలితం ఏమవుతుందో నన్న భయం మరో పక్క పేపర్ ఆలస్యం గొప్ప ఉత్కంఠ. ఆ రోజుల్లో కరీంనగర్ లో ఇద్దరు పేపర్ ఏజెంట్లు వుండే వాళ్ళు. ఒకరు MOIZ గా ప్రసిద్దుడయిన మొయినొద్దిన్ కాగా రెండవ వారు అనంతస్వామి. మోయిజ్ కు బస్ స్టాండ్ లో బుక్ స్టాల్ వుండడంతో పాటు దాదాపు అన్ని తెలుగు దిన వార పత్రికలకు, మాస పత్రికలకు ఆయనే ఏజెంట్ కావడంతో పత్రికలు చదవాలనుకునే వాళ్లకు ఆయనే దిక్కు. అంతే కాకుండా ఆయన ఆజన్మాంతం ‘సియాసత్’ ఉర్దూ పత్రికకు విలేఖరిగా వున్నాడు. ఇక అనంత స్వామి హిందూ ఆంగ్ల పత్రికకు ఏజెంట్ కం రిపోర్టర్ గా పనిచేసారు. కరీంనగర్ బస్ స్టాండ్ ఇప్పుడు ప్రతిమ మల్టిప్లెక్ష్ వున్న జాగాలో వుండేది. ఒక క్లాసికల్ స్థాయిలో రౌండ్ గా అందంగా ఆకర్షనీయంగా కనిపించేది. అందులో ఒక స్టాల్ మోయిజ్ ది. దాని ముందు మా టెంత్ ఇంటర్ పరీక్షా ఫలితాల కోసం చూసిన ఎదురుచూపులు ఇంకా నా మదిలో ఫ్రెష్ గానే  వున్నాయి. ముఖ్యంగా మొయిజ్ కోపంగా కేర్ లెస్ గా మాట్లాడేవాడు. ఆయనది పత్రికల వ్యాపారంలో మొనోపలీ కనుక పత్రికల్ని ముట్టనిచ్చే వాడు కాదు. జావో జావో అంటూ ఉండేవాడు. కొనడానికి తప్ప చూడ్డానికి ఆ బుక్ స్టాల్ కి వెళ్ళే వాళ్ళం కాదు.(తర్వాత ఆయనతో నాకు మంచి స్నేహం కుదిరిందనుకోండి.. అది మరో సారి). అట్లా దిన పత్రికలతో మా అనుబంధం సాగేది. డిగ్రీలో చేరింతర్వాత మార్కెట్ లో వున్న జిల్లా గ్రంధాలయానికి వెళ్ళడం మొదలయ్యింది. అక్కడే పత్రికలు చూడడంతో పాటు కార్వాన్, బ్లిట్జ్, Illustrated weekly లాంటి పత్రికల పరిచయం ఏర్పడింది. ఇక కాలేజీ లైబ్రరీ లో అంత సీన్ వుండేది కాదు. విద్యార్థులు అధికంగా వుండడం తో వసతి అంతంత మాత్రమె. సో అప్పుడు మాకు జిల్లా గ్రంధాలయమే దిక్కు. కొంచెం రద్దీగా వున్నా అక్కడే దాదాపు అన్ని పత్రికల పరిచయం అయింది. ఆ పరిచయమే నన్ను రచయితను చేసిందేమోననిపిస్తుంది.

++++++

ఎస్.ఆర్.ఆర్. లో చదువుతూ ఉండగానే అంటే 1974లోనే హైదరాబాద్ నుండి ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభమయింది. దాంతో కరీంనగర్ లో దినపత్రికల దృశ్యమే మారిపోయింది. ఉదయాన్నే వచ్చేది. బిన్నమయిన శీర్షికలతో బాగా ఆకట్టుకుంది. ఇక నా జీవితంలో మొట్టమొదటిసారి రచనకు పారితోషికం అందుకుంది ఈనాడు నుంచే. అప్పుడు ఈనాడు లో ‘గొప్ప అత్యల్ప విషయాలు’ అనే శీర్షిక నిర్వహించేవారు. అది చూసి నేను నాకు కార్వాన్ లాంటి పత్రికల పరిచయంతో కొన్ని అత్యల్పంగా కనిపించే గొప్ప విషయాల లిస్టు రాసి పంపాను. రెండు వారాల్లో ప్రచురించారు. ఈనాడు లో ‘వారాల ఆనంద్’ అన్న పేరు చూసుకోవడం మజా నే కాదు అదో పెద్ద థ్రిల్. అంతే కాదు వెంటనే అమౌంట్ సరిగ్గా గుర్హ్టు లేదు కాని పదో ఇరవయ్యో మనీ ఆర్డర్ పంపారు. ఆనాడు నా సంతోషానికి అవధుల్లేవు. అట్లా పత్రికలు-నా రచనలు ఆరంభమయ్యాయి.

+++++++++

దాదాపుగా అదే సమయంలో నా సృజనాత్మక రచనలు కూడా మొదలయ్యాయి. మనెను మొట్టమొదట రాసింది ఓ చిన్న కాలం కథ. అది కథ నొ గల్పికనో తెలీదు. కాని నేను రాసిన దాన్ని కరీంనగర్ నుంచి అప్పుడు వెలువడిన ‘చిత్రిక’ వార పత్రికలో వేసారు. కథ పేరు ‘ఆమె’ అని జ్ఞాపకం. ఒక యువకుడు కరీంనగర్ లోని మంకమ్మ తోట నుంచి నడుస్తూ బయలుదేరతాడు. ముందు ఒక అందమయిన అమ్మాయి వెళ్తూ వుంటుంది. ఆ అమ్మాయిని చూసిన ఆనందంలో ఆ అబ్బాయి మనసులో ‘పగలే వెన్నెలా జగమే ఊయల’ పాట గన్ గునాయిస్తూ ఉంటాడు… అట్లా నడక సాగీ సాగీ కరీంనగర్ బస్ స్టాండ్ దాటుతుంది. ఆ అమ్మాయి వెనక్కి ఒక్క సారి వెనక్కి చూసి ఆ పక్క సందులోకి మరలుతుంది. అప్పుడు తోస్తుంది ఆ అబ్బాయికి ఆ సందు వేశ్యా గృహాలు ఉండేది. అబ్బాయి హతాశుడవుతాడు మనస్సు చివుక్కు మంటుంది. ఇట్లా సాగుతుందా కథ. దాన్ని చిత్రిక సంపాదకుడు శ్రీ పురాణం రామచంద్ర బాగా ప్రెజెంట్ చేసారు. అంతే కాదు నన్ను పిలిచి బాగా ప్రోత్సహించారు. కథలు రాస్తూ వుండు. మంచి కథన లక్షణం వుంది నీ రాతలో అన్నాడు. పొంగిపోయాను. అప్పుడప్పుడూ శాస్త్రీ రోడ్డులో వున్న చిత్రిక ఆఫీసుకు వెళ్ళడం ఆరంభించాను. పత్రిక కూర్పు ప్రింటింగ్ తదితరాలతో అప్పుడే నాకు పరిచయం కలిగింది. తర్వాత ఏవో కొన్ని కథలు రాసాను తప్ప ఎందుకో కథల మీదే దృష్టి పెట్టి కృషిచేస్తే ఎట్లా ఉండేదో అని ఇవ్వాళ అనిపిస్తుంది. అట్లా నాలో మొట్టమొదటి సారి కథకుణ్ణి గుర్తించిన పురాణం రామచంద్ర ఒక చేత కవిత్వాన్నీ మరో చేత జర్నలిజాన్నీ పట్టుకుని సమాజాన్ని భిన్న కోణాల్లోంచి పరికించి రచనలు చేసిన వాడు. ఆయన 1974 లోనే ’27 వసంతాలు’ కవితా సంపుటిని వెలువరించారు. “ఎదలోని చీకటిని/ చిదిమి వేయాలి/ మానవతా దీపాలు/ మదిని నిలవాలి అంటూ వెలుగుని చైతన్యాన్ని నింపిన వాడాయన. పాత్రికేయుల్లో పురాణం గా ప్రసిద్దులయిన ఆయన 1945 మే 28 న వేములవాడలో ఆర్థికంగా మంచి స్థితి వంతమయిన కుటుంబంలో జన్మించారు. పై చదువులకోసం హైదరాబాద్ వెళ్ళిన పురాణం కు కాలేజీ పత్రిక ‘సంధ్య’ కు సంపాదకత్వం వహించే అవకాశం రావడం తో జర్నలిజం వైపు ఆయన దృష్టి మరలింది. తర్వాత ‘ఆంద్ర జనత’ లో జర్నలిస్టు గా తన కారీర్ ఆరంభించారు. వేటూరి సుందర రామ మూర్తి సంపాదకుడిగా వున్న కాలం లోనే పురాణం గారికి పత్రిక అన్ని విభాగాల్ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. 1968లో పురాణం రామ చంద్ర ‘ప్రతిధ్వని’ పక్ష పత్రికను ప్రారంభించారు. తర్వాత కరీంనగర్ ఈనాడుకు జిల్లా విలేఖరిగా కూడా పనిచేసారు. 1974 తర్వాత ఆయన ‘చిత్రిక’ వార పత్రికను ఆరంభించి జిల్లా కేంద్రంలో విలక్షణ జర్నలిస్టుగా పేరు గాంచారు.ఉన్నత ఆశయాలతో ఉత్తమ రచనా శైలితో జర్నలిస్టుల్లో మాడల్ గా నిలిచారు.        

అట్లా నా రచనా యాత్ర చిత్రికతో మొదలయ్యింది. పురాణం రామచంద్ర ఇవ్వాళ లేక పోయినా ఆయన కృషి స్మరణీయమయింది. ఆయనకు నా హృదయ పూర్వక నివాళి.

మళ్ళీ వారం కలుద్దాం….

-వారాల ఆనంద్ 

30 OCT 2021